వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/చతుర్థాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

చతుర్థాశ్వాసము

క.

శ్రీమహిమహిళావిహరణ, ధామదృగంభోజబాహుదర్వీకర ర
క్షోమథనకథారసధా, రామధురిమలోల యీశ్వరప్రభునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుండు ధరణి కి ట్లనియె నట్లు శయ్యాగృహంబు సొచ్చి
దుర్జయకుమారవతంసంబు హంసతూలికాతల్పంబున మేను గదియించి కిన్నరవరా
రామంబునఁ దనచూచినవరారోహలహావభావంబులు భావభిత్తిం జిత్రించిన
విధంబున నుండ నొండొండ కోర్కులు నిండ ననుంగునెచ్చెలిం గనుంగొని.

2


సీ.

మదనధనుర్మేఘమార్గణధారాళవర్షంబు వారింప వసము గాదు
చింతానిలజ్వలత్సంతాపజిహ్వాలదహనంబు చల్లార్పఁ దరము గాదు
వ్రీడాగుణాసమన్వితధైర్యజంఘాలదంతావళము నిల్పఁ దరము గాదు
హృదయాలవాలబాలేచ్ఛాజటాలవల్లుల వెనుకకు దివ్వ నలవి గాదు
విరహలహరీఘటాసముద్వేలరా, జలనిధానంబు ధరియింపఁ గొలఁది గాదు
ధీతరణ్యస్తమయజమోహాతిభీష, ణాంధకారంబు విరియింప హవణు గాదు.

3


చ.

వెడవెడఁ బయ్యెదల్ సడలి వ్రేఁకపుగుబ్బచనుంగవల్ బయ
ల్పడ వెడవింటివేల్పునకు లక్తకరక్తిమ తొంగలింపఁగా
నడుగులు గొంత యెత్తి కుసుమాంజలి యిచ్చినరీతి నాకు నె
న్నడు దలఁబ్రాలు పోయుదురొ నర్మసఖా తదరాళకుంతలల్.

4


క.

నరునకుఁ బ్రదక్షిణంబులు, దిరిగెడుసమయమునఁ బ్రహరి దిరిగెడుయామ
ద్విరదములఁ బోలునామం, ధరయానల మఱవ వచ్చునా చెలికాఁడా.

5


ఉ.

క్రొన్ననవింటివేలుపునకున్ మహిఁ జాగిలి మ్రొక్కి లేచి కిం
చిన్నత లైనవేళ విలసిల్లిరి నీరజపత్రనేత్ర లా
కొన్ననవింటి వేల్పు రతిఁ గూడి తటస్థుని నన్ను నేయఁ గై
కొన్నశరాసనంబు లనఁ గూర్తిసఖా నయనాభిరామలై.

6

సీ.

నామీఁదఁ బెదరక నాఁటినతమకూర్మి తేటతెల్లంబుగాఁ దెలిపి చననొ
తారు హరింప నాధైర్యసంపదలోన శేషంబు గలిగినఁ జేఁదుకొననొ
దర్పకుఁ బక్షపాతంబు సేయక తమ్ము నేఁచినట్లనె నన్ను నేపుమననొ
తమమానధనము సర్వము గోలుపోయి నాచేష్టలవెంట నొచ్చెంబు గననొ
మరలి వచ్చిరి గాక తామరసముఖులు, సఖుఁడ లేదేనిఁ దల్లులశాసనంబు
దాల్చి పిలువంగ వచ్చినతరుణివెంట, దూర మరిగియు రా నేమి కారణంబు.

7


శా.

మేలం బాడుచు వచ్చు నెచ్చెలియపై మిథ్యాలసత్వంబు నూ
ల్కో లోలోపల వేడుకల్ నిగుడ సిగ్గుల్ దేరునొయ్యారపుం
గ్రాలుంగన్నులఁ గ్రొమ్మెఱుంగులు దొలంకన్ మందయానంబుతో
నాలీలానిలయంబు చేరుదురొకో నాళీకపత్రేక్షణల్.

8


ఉ.

చూపులు చూపులం గలయఁ జూచి మనోగతలజ్జ నేర్పునం
బాపుచుఁ గప్పురం బిడునెపంబునఁ బాణితలంబు వట్టి స
ల్లాపసుధారసంబు చెవులం జలికించి రతిప్రసంగవాం
ఛాపరతంత్రవృత్తి మృదుశయ్యకుఁ దార్తునొకో లతాంగులన్.

9


సీ.

చిలుకురాగరసంబుచిత్తడిచే ముమ్మరమ్ముగాఁ బులకాంకురములు మొలవఁ
గ్రమ్మెడునూరుపుఁగమ్మదెమ్మెరలచే నల్లనల్లన తనువల్లి వడఁక
చెదరినకమ్మనిచెమటపూఁదేనెచేఁ గుంతలరోలంబకులము చొక్క
నిగిడేడుముసిముసినగవువెన్నెలలచే గాటంపుసిగ్గుచీఁకటులు దొలఁగ
బిగువుఁగౌఁగిటఁ గదియించి చిగురుటాకు, మోవి చవిచూచి కుచకుంభముల మనోభ
వాంకములు వ్రాసి రతిరహస్యములు దెలిపి, కమలగంధుల నెన్నఁడు గారవింతు.

10


చ.

ఒక సతి మత్సమర్పితసముజ్జ్వలహారముపైఁ బరాకుగా
నొకచపలాక్షిమోవిచవి నొల్లన చొక్కుననుం దదీయనా
యకమునఁ గాంచి వంచనవిహార మెఱింగి సరోష యైన బా
లికచరణంబులత్తుక చెలీ ధరియింతునొకో శిరంబునన్.

11


వ.

అని యిట్లు హేతిప్రహేతికన్యకావిలాసనప్రసక్తమనోరథుండై సుమనోరథకఠోర
నారాచధారాచలితాంతఃకరణుండు దుర్జయకుమారుండు బహుప్రకారంబులం
బలుకువిరహవికారాలాపంబులు విని సారస్యరహస్యవిద్యారక్షకుం డైనవిద్యారక్ష
కుండు సమయసముచితవాక్యంబుల నుపలాలింప నెట్టకేలకు సజ్జనవల్లభుండు మజ్జన
భోజనాదికృత్యంబులు దీర్చి వెండియుఁ దదంగనాకథాపరాధీనదీనమానసంబునం
బ్రొద్దు గడపునవసరంబున.

12

ఉ.

యామవతీవిలాసినికి నైదువత్రాడు సమస్తనిర్జర
స్తోమముకూడు లక్ష్మిసయిదోడు నభోమణిజోడు పాంథకాం
తామృగహింసకు న్వెడలుదర్పకలుబ్ధకుదివ్వెగూడు నె
త్తామరసూడు రాగరసధాముఁడు సోముఁడు దోఁచెఁ దూర్పునన్.

13


సీ.

అంత నక్కడఁ గిన్నరాధిపోద్యానంబు వెలువడి దూతికవెంట నరిగి
పాటలగంధులు పాటలపుటభేదనంబులోపలఁ దమనగరు సొచ్చి
సుప్రతీకనృపాలసూనుపైఁ దగిలినహృదయంబు తలిదండ్రు లెఱుఁగకుండ
సఖులు బంధులుఁ జెప్ప నొకభంగి జలకంబు లాడి నిరాసక్తి నారగించి
ప్రాణసఖు లైనకదళికారత్నవతులు, గొలువ నిస్తంద్రచంద్రికాగళితసలిల
శీతలైందవమణిసౌధశిఖరసీమ, రచితవిహరణవేదికాగ్రమున నిలిచి.

14


క.

తారు గనుఁగొన్నరాచకు, మారునిసౌందర్యరేఖ మరులు గొలుపఁగా
మారశరపీడితాత్మక, లై రాయిడిఁ బడుచు నాలతాంగులు మదిలోన్.

15


క.

ఏటికి నలకావల్లభు, తోఁటకుఁ బోయితిమి మన్మథుని నోమెడుచో
నేటికి వచ్చె మనోరథ, పాటచ్చరుఁ డైనధరణిపతి మాకడకున్.

16


క.

రేరాజుకాంతి గ్రోలుచ, కోరికలన్ మేఘపటలి గుతిలపఱచిన
ట్లారాజుఁ జూడఁగా మము, నైరావతి వచ్చి కటకటా నొగిలించెన్.

17


సీ.

ఏచిన తలపోఁత దాఁచెద మంటిమా నిట్టూర్పుగాడ్పులు రట్టు సేయు
కడలేనిప్రేమంబు గప్పెద మంటిమా పులకాంకురంబులు పులుగు చెప్పు
బెడిదంపువెగడుపా టడఁచెద మంటిమా వైవర్ణ్యభావంబు వ్రయ్యఁ బుచ్చు
మొనపుచాంచల్యంబు మొఱఁగెద మంటిమా ప్రాణేశగుణనుతి బయలుపఱచుఁ
గాన మకరందగరళదిగ్ధప్రసూన, శరపరంపర విరహుల సంహరించు
మంచు బోధించుశుకభాష లాలకించు, క్రించువెడవింటిజోదు జయించరాదు.

18


క.

అని చింతించి వయస్యలఁ, గనుఁగొని యి ట్లనిరి తాపగౌరవమునఁ దా
ల్మి నిలుపలేక మనోజర, జనికరపికమందపవనజనితాగ్రహలై.

19


ఉ.

గ్రక్కున ఫాలనేత్రుఁడు పురత్రయరాత్రిచరేశ్వరాంగముల్
పెక్కు దహింప నొక్కటియు లేక వినాశముఁ బొందె నద్భుతం
బిక్కుసుమాస్త్రు నొక్కని దహించినఁ గ్రమ్మఱఁ బుట్టి తోఁచెఁ దాఁ
బెక్కువిధంబులన్ విరహిభీకరుఁడై సఖులార కంటిరే.

20


సీ.

మానక గుప్పించుమదనకోదండంబు నిష్ఠురతను దన్ను నేలఁగలయ
నెప్పుడు జంకించుహృజ్జాతశింజిని గౌరవంబునఁ దన్ను గాలిఁబోవ

నూరక విరఁబడుమారనారాచంబు దుండగంబునఁ దన్ను ధూళిఁ గలయ
పనిలేనిపని మిట్టిపడుమనోజపతాక ప్రల్లదంబునఁ దన్ను వెల్లిఁ బోవ
వీనికొలఁదియె విరహిణీమానజలని, ధానకుంభోద్భవుఁడు సోదరీనివాస
నాశనకరుండు కుముదినీనాథుఁ డభ్ర, వీథి మండుచు నున్నాఁడు విసపువిత్తు.

21


క.

సంత్రాసదవ్యధాపర, తంత్రుల విరహుల వధింపఁ దలఁచుమనోభూ
మాంత్రికునిచేతిమారణ, యంత్రపటము గాక వీఁడు హరిణాంకుండే.

22


సీ.

వీనిచంద్రికలు ద్రావినచకోరికలకు మ్రింగుట భారమే యింగలంబు
వీనిజనస్థాన మైనవార్ధికి లోనుపఱచుట భారమే బాడబాగ్ని
వీని నౌఁదలఁ దాల్చువిషమలోచనునకు నాగుట భారమే హాలహలము
వీనిత్రొక్కుడు గారవించుప్రాగ్గిరికి సహింపఁజాలుట భారమే దవాగ్ని
మానవతులార చూడుఁ డామత్తచంచ, రీకమౌర్వీనినాదగర్జితకరాళ
భావసంభవనీరంధ్రబాణవృష్టి, గడలుకొనఁ గానఁబడుచలిపిడుగు వీఁడు.

23


చ.

గురుసతిఁ గూడుకట్టునకుఁ గొంకనిమోడు వియోగినీసము
త్కరములకీడు చూచుటకు దర్పకురేఁపెడుకుట్టుచేఁడు తె
మ్మెరలకుఁ దోడు చిత్రగతి మిన్నులఁ బాఱెడుమాయలాఁడు పె
న్నిరు లనుపోడు కాలుకొని యేర్చువెలుంగులవీడు వీఁడువో.

24


క.

కాయజునివాఁడికత్తులు, మేయ నతిక్రూరవృత్తి మించినకుతికం
బాయక కూఁతలు వెట్టెడు, కోయిల నొకపెద్దలడుగు కొట్టఁగ వలదా.

25


క.

మనుజాళిఁ బుణ్యజను వ, త్సనాభి నమృతంబు జముని ధర్మునిగాఁ బే
ర్కొనువిధమ దుష్టమందప, వనుని జగత్ప్రాణుఁ డనుచు వాక్రుచ్చుటయున్.

26


గీ.

వేగ విరహులపై దాడి వెడలు మనుచు, వాహనముఁ జంద్రునకుఁ బంపి వచ్చె వెనుక
గాడ్పు గాకున్న నెట్లు గాఁ గలిగెఁ దనకు, మందగమనంబు సారంగ మిందునకును.

27


మ.

ఫణికన్యాముఖఫేల చందనగిరిప్రత్యగ్రసంభూతభీ
షణదావానలకీల పాంథరమణీసంఘాతచేతోవిదా
రణపంచాశుగశస్త్రి శైత్యవిషధారాభస్త్రి సంతాపకా
రణ మీమందసమీరణంబు సఖులారా మమ్ము మన్నించునే.

28


మ.

అని సంపూర్ణవిధుండు వెన్నెలలు గాయ న్మనథుం డేయ హె
చ్చినతాపంబున వెచ్చి పల్కినసుకేశి న్మిత్రకేశిం గనుం
గొని బోటుల్ శిశిరోపచారములు పెక్కు ల్సేయ నూహించి మె
త్తనిపూఁబాన్పున వారిఁ జేరిచి నితాంతవ్యాకులస్వాంతలై.

29

సీ.

నీవాలుగంబుల నీవాలు నొంచ నీ కీవాలుకృపతోడ నేలు మదిన
నీచందములు మాని నీచందములు చెంద నీ చందమామ కన్నియలమీఁద
పికమా కృశాంగు లోపిక మాలి పొరల గోపికమార్గముల నీకుఁ బ్రేలఁ దగునె
మలయానిలంబ కోమలయానలీల రామలయాతనలఁ బెట్ట వలదు నీకు
చిలుక నీముక్కు పూఁదూపుచిలుకనంగ, చిలుకకుము చంద్రముఖులపైఁ బలుకువిసము
భ్రమర నీమృదునాదవిభ్రమరయమున, భ్రమరసము పుట్టఁ జేయకు బాలికలకు.

30


వ.

అని సపరివారంబుగా శంబరవిరోధిఁ బ్రార్థించి యత్నంబున రత్నవతీకదళికలు
గదిసి కుముదహితమండలంబు కబళించుసమయంబున రాహువుమీఁదం జెదరిపడిన
సుధాబిందుసందోహంబుచందంబునఁ దిలకింపఁ గొప్పులం గప్పురంపుశిరంబులు
చెరివి గగనగంగాకనకకమలముకుళంబులం బొదివినపెన్నురువుమురువునం బరిఢ
వింప నిబ్బరపుగుబ్బచన్నులం జందనపంకం బలంది మకరకేతనశాతహేతులు
జమురు చమురుతెఱంగునం గనుపట్ట హస్తపల్లవంబుల మకరందంబు పూసి యిసుక
తిప్పలం గప్పినపుప్పొడిచొప్పునఁ బ్రకాశింప జఘనంబునఁ జెంగావిజిలుగువలి
పంబులు గట్టి మార్దవంబునం దొరయలేక శరణుచొచ్చినకరణి దీపింపఁ జరణతలం
బులఁ గిసలయంబులు హత్తి సౌందర్యసరోవరంబునం బొలయుజక్కవకవఠేవ
దళుకొత్త నుశీరతాలవృంతంబుల విసరి మఱియు బహుప్రకారంబుల నుపచారంబులు
సలుప నిలువరానితాపం బాటోపంబు చూపిన.

31


చ.

అలమినవారివాహ మనిలాహతి విప్పఁగ నాడకాడకు
న్వెలువడి వచ్చునంబుజవనీరమణప్రభలో యనంగఁ బై
నలఁదినచందనంబు నలువై పగులంగఁ దదంతరంబులం
దళతళ మంచు మించు వనితాతిలకంబులదేహదీధితుల్.

32


క.

పన్నీరు చంద్రకాంతపు, గిన్నెలఁ గొని పోయఁగా నిగిరి పొగ లెగయుం
గన్నెలతనువుల సుమలత, ల న్నెగయుమదాలినీకులంబులభంగిన్.

33


క.

అలజడి పడుచెలులం గని, పలవించుచుఁ గౌఁగిలించుపగిది ముఖములం
జిలచిల రసములు చిప్పిల, నలినాక్షులబాహువుల మృణాళము లుడుకున్.

34


మ.

ఘనతాపంబు హరింప నోప మనుచుం గానీ క్రియాద్వేష మే
చినఁ గానీ హృదయేశుఁ జన్నులపయిం జిత్రింపఁ గానీ తమున్
వనజాక్షు ల్నిరసింపఁ గాఁ జనుట హైన్యం బంచు మున్మున్న వె
ళ్ళినరీతిం బడుఁ బ్రేలి మౌక్తికమణుల్ మెట్టించి దూరంబునన్.

35


క.

ఈరీతి శిశిరవిధుల ని, వారింపఁగరాని విరహవహ్నిశిఖలచే
నారాటంబునఁ బొరలం, గా రమణులఁ జూచి కదళికారత్నవతుల్.

36

సీ.

వ్యజనానిలంబుచే వదలునే తాపంబు రమణునిశ్వాసానిలమునఁ గాక
పల్లవంబులచేతఁ బాయునే తాపంబు వల్లభుకరపల్లవములఁ గాక
హిమవారిచే శమియించునె తాపంబు వరుశరీరశ్వేదవారిఁ గాక
పూఁదేనియలచేతఁ బోవునే తాపంబు బ్రియునునుఁబలుకుఁదేనియలఁ గాక
యీచకోరాక్షులకు వీరి నింక నేయు, పాయమున విభుఁ గూర్తుము పోయి వేగ
తెలియఁ జెప్పంగ వలయు హేతిప్రహేతి, దైత్యకులనాథులకు నని తలఁచువేళ.

37


క.

విరహిణు లగుపద్మినులకుఁ, బరితాప మొనర్చుకుముదబాంధవుమీఁదన్
గర మలిగి వచ్చుకైవడి, నరుణప్రభతోడ నీరజాప్తుఁడు తోఁచెన్.

38


వ.

అంత నిజస్వాంతంబునకుఁ గొంత ధైర్యంబు నూలుకొలిపి యే నన్నివిధంబుల వీరి
మనోరథంబు సఫలంబు గావించెద నీవు బెగడక సముచితప్రకారంబులఁ బ్రొద్దు
గడుపు మని రత్నవతి నతిప్రయత్నంబునం గన్యకారత్నంబులకడ నియమించి
కదలి కదళిక సమీపంబునం దపంబు సలుపు హేతిప్రహేతులకడకుం జని వారల
కుం జాగిలి మ్రొక్కి కృతాంజలియై.

39


సీ.

చెలులు గొల్వఁగ సుకేశియు మిత్రకేశియు ధననాథుతోఁట కేగినవిధంబు
పుష్పితచంపకభూమీరుహచ్చాయ ననవింటివేల్పు నోమినవిధంబు
వనవిహారేచ్ఛ వచ్చినవాని నొక్కచక్కనిరాకుమారుఁ జూచినవిధంబు
మరలి గేహము సొచ్చి విరహసంతాపవేదనలచే మిగుల నొచ్చినవిధంబు
విన్నవించిన విని దైత్యవిభులు గొంత, తడవు చింతించి కలన సుత్రాము విఱుగ
దోలి మందరగిరి నున్న దుర్జయక్ష, మారమణుఁ గాఁగ నా రాకుమారు నెఱిఁగి.

40


క.

ఆదివిజయంబు గైకొనె, నాదివిజబలంబు భగ్నమైపోవ నతం
డీదొరకు మత్తనూజల, నీ దొరకుట భాగ్య మనుచుఁ గృతనిశ్చయులై.

41


చ.

కదళిక యిచ్చటం దడవుగా నిలువం బనిలేదు పొమ్ము వే
కదలి కలాపకుంతలలకంతుశరవ్యధ మాన మెల్ల గ్ర
క్కదలి కలంగకుండఁ దమకాంతునిఁ దెచ్చెద మన్న మాఱులే
కదలికఁ బెట్టుదున్ శుకపికాదుల నింక నటంచు వేడుకన్.

42


క.

హేతిప్రహేతులకు నా, నాతి నమస్కృతులు చేసి నగరమునకుఁ దా
నేతెంచి తెలియఁ జెప్పె ల, తాతన్వులతోడఁ గూర్మితండ్రులపలుకుల్.

43


క.

చెప్పిన నప్పలుకులు విని, తెప్పిఱి సమ్మోదవారిధిం జంద్రముఖుల్
తెప్పలఁ దేలిరి నెచ్చెలు, లప్పుడు పల్లవితహృదయలై తమలోనన్.

44


గీ.

ఇన్నివిధముల నీరాచకన్నియలకుఁ గీడు చేసినమన్మథకేతు వప్ర
యోజనం బయ్యె నెక్కెడుతేజి వ్యర్థ, మయ్యెఁ జాపంబు నిష్ఫలం బయ్యె ననుచు.

45

శా.

అంగంబుల్ హిమవారిచేఁ గడిగి రమ్యం బైనకూటంబులో
బంగారంపుఁజెఱంగుదుప్పటములం బాటీరజంబాలచ
ర్చం గల్పప్రసవంబులన్ మణివిభూషారాజి నందంబుగా
శృంగారించిరి సంభ్రమంబున సుకేశిన్ మిత్రకేశిన్ సఖుల్.

46


వ.

అంత నక్కడ హేతిప్రహేతులు తపోవనంబు వెడలి నిజతనూజామనోరథప్రా
పణపరాయణు లై చనువారు ముందట మీర లిద్దఱు నుద్దేశించి పోవుభూవల్లభుం
డు వచ్చి యిచ్చట నున్నవాఁ డని యెఱింగించినభంగి వెలుంగించుకోకిలకులం
బులచేత నభిరామం బైనకుబేరారామంబు దఱిసి తదభ్యంతరంబునఁ బూచినసం
పంగినీడ నిన్నం దనకనుంగొన్నకన్నియలు నేఁడు క్రమ్మఱ వత్తు రనుచిత్తంబున
విద్యారక్షకప్రముఖసఖసమేతంబుగా నేతెంచి నిలిచినదుర్జయనృపాలహర్యక్షుని
నిరీక్షించి.

47


సీ.

ఆత్మజృంభణసమయం బయ్యె నని మూర్తిమంతుఁడై యున్నవసంతుఁ డొక్కొ
దివ్యౌషదార్థ మేతెంచిన నాకవైద్యులకవలోపల నొక్కఁ డొక్కొ
తమవనంబున వినోదంబులఁ దగిలి క్రుమ్మరురాజరాజుకుమారుఁ డొక్కొ
మాముద్దుఁగూఁతులు నోమినచోన సాక్షాత్కరించినపుష్పచాపుఁ డొక్కొ
కాక మందరకుధరోపకంఠవాహి, నీనివేశంబు వెలువడి నిన్నబలెనె
హితపరీవారములతోడ నిచటఁ గేలి, సలుపుదుర్జయనరపాలచంద్రుఁ డొక్కొ.

48


క.

అని తమచిత్తంబుల భా, వన సేయుచు నికటమునకు వచ్చినవారిన్
మునివేషధారులం గనుఁ, గొని దుర్జయధరణిపాలకుఁడు మ్రొక్కుటయున్.

49


గీ.

అతని దీవించి చంపకక్షితిరుహంబు, నీడ నాసీనులై ధరణీతలేంద్ర
యేమహాత్మునితనయుండ వెద్ది నీకు, నామ మిచటికి రాఁ బని యేమి గలిగె.

50


చ.

అనవుడు నవ్వి యేను వసుధాధిపశేఖరుఁ డైనసుప్రతీ
కునితనయుండ దుర్జయుఁడ ఘోరపరాక్రమసంపద న్మదిం
చిననృపసార్వభౌముల శచీపతిముఖ్యదిగీశవర్గమున్
మునుకొని గెల్చి పోవుచు వినోదము సల్పఁగ నిందు వచ్చితిన్.

51


సీ.

ఇది నాతెఱంగు మీ రెవ్వరు మునులార వినిపింపుఁ డనిన ని ట్లనిరి దుర్జ
యక్షితినాథ స్వాయంభువమనువుసూనులము హేతిప్రహేతులము మేము
లోకభీకరులమై నాకంబునకు దాడి వెడలి యింద్రాదుల విఱుగఁదోల
నాసుపర్వులు కలశాబ్ధికిఁ బోయి లక్ష్మీనాథునికి నమస్కృతులు చేసి
దేవ హేతిప్రహేతిదైతేయవరుల, చేత నొచ్చినమమ్ము రక్షింపు కరుణ
నాజి మును కాలనేమిసహస్రభుజుల, సంహరించినగతి వారి సంహరించి.

52

క.

అని విన్నవించుసురలం గనుఁగొని మధుకైఠభారి కలన దనుజులం
దునుమఁగ నిదె వచ్చెదఁ బొం డనుడు నమస్కృతులు చేసి హరిహయముఖ్యుల్.

53


క.

సంతోషంబున మేరు, ప్రాంతంబున కరిగి హరిఁ గృపావంతు రమా
కాంతు నిజస్వాంతంబులఁ జింతింపఁగ నంత మద్విజిత్వరబుద్ధిన్.

54


మ.

హరి వచ్చె న్విబుధావనద్విగుణరంహస్ఫీతచేతోనురూ
పరయావాప్తికి నాల్గుఱెక్కలు ధరింపంబోలు నాఁ గాంచనాం
బరకోణంబులు రెండువంకల నటింప న్మించునాగారి నె
క్కి రణత్కంబురథాంగనందకగదాఖేలద్భుజస్తంభుఁడై.

55


గీ.

ఇట్లు చనుదెంచి మాసైన్య మెల్లఁ గూల్చెఁ, బెక్కురూపంబు లై విష్ణుఁ డొక్కరుండ
వట్టిమ్రాఁకుల నొకదవజ్వాల దగిలి, వివిధముఖముల నీఱు గావించునట్లు.

56


క.

అప్పుడు దైవికమునఁ జే, తప్పితి మిరువురము దేవతలు తలఁపులలో
నుప్పొంగుసమ్మదాంబుధిఁ, దెప్పలఁ దేలంగ హరి యదృశ్యుం డయ్యెన్.

57


చ.

అదిమొద లబ్జనాభుని మహామహిమాఢ్యుని వేదవేద్యునిన్
బదిలముగా భజించిన నపాయము లేదని నిశ్చయించి త
త్పదసరసీరుహద్వితయభక్తివిలాసము నెమ్మనంబులం
బొదలఁగ నున్నవారము తపోనియమంబున నిన్నగంబునన్.

58


క.

కిన్నరపతికేళీవనికి న్నరవర నిన్న వచ్చి కీర్తింపుచు జో
క న్నియతి మరునిఁ గొలిచిన, కన్నియ లిరువురును మాకు గాదిలితనయల్.

59


సీ.

ఆకన్నియలకు నాయకుఁడవుగా నీవు తగుదువు మాకు నత్యంతమిత్రుఁ
డగుసుప్రతీకమహారాజుసుతుఁడవు గాన శక్రాదిదిక్పాలవరులఁ
గలన గెల్చినపరాక్రమవంతుఁడవు గాన జనులకు భోగమోక్షంబు లొసఁగ
నోపినవారణాసీపురంబునకు భర్తవు గాన రోహిణీధవజయంత
కంతునలకూబరాదులకంటె మిగులఁ, జక్కనికుమారుఁడవు గాన జలనిధాన
వలయితాఖిలవసుమతీవర్ణితాభిరామకీర్తివి గాన దుర్జయనరేంద్ర.

60


వ.

ఇప్పుడు మదీయపుత్రమిత్రకళత్రాదు లిచ్చటికి ననతిదూరంబునఁ బాటలం బను
పురంబున నున్నవా రచ్చటికి వచ్చి పరిణయంబు గావలయు నన్న నన్నరనాయకుం
డు నిరాయాసంబునం దనమనోరథంబు సఫలం బగుటకుఁ బరమసంతోషభరిత
హృదయుం డై వారలవవచనంబులు సబహుమానంబుగా నంగీకరించి ముందటఁ
బురంబునకుం జనుఁడు మీపిఱుందన యేనుం గదలి వత్తు నని వీడ్కొలిపి గంధ
పరంపరాసంపన్నంబు లైనపున్నాగంబులతోడ సదాగతివలమానంబు లైనపత్రం

బులతోడ ధూసరితాంబరంబు లైనపరాగంబులతోడ వశీకృతరాజహంసు లయిన
సరసులతోడ నిరంతరచంచలాచంచలంబు లైనకదళికానికాయంబులతోడ సుమనో
రథవిజయకరంబు లైనశిలీముఖంబులతోడ మందమందసంచారంబు లైనచామరం
బులతోడ సకలస్థలసముద్దండంబు లైనపుండరీకంబులతోడ వివాహమహోత్సవం
బు వీక్షింప యక్షేశ్వరోద్యానంబు వెనువెంట నేతెంచువిధంబున వివిధసైన్యం
బులు గొలువ భద్రేభంబు నెక్కి పెక్కుతెఱంగుల మంగళాలంకారంబుల నొప్పు
నప్పాటలనగరంబునకుం బోయి శుభముహూర్తంబున.

61


క.

హేతికుమారి సుకేశిఁ బ్ర, హేతిసుతు న్మిత్రకేశి నిర్వుర సకలో
ర్వీతలపతి కళ్యాణం, బై తత్కన్యకలఁ గొంచు నా నాహ్లాదమునన్.

62


క.

బలభేదివిఫాలా యని, జలజభవాండంబు పగుల జయకాహళముల్
నలుఁగడల మొరయ సేనా, కలకలములు బెరయ నరిగెఁ గాశీపురికిన్.

63


గీ.

అరిగి సోదరు సుద్యుమ్ను నఖిలరాజ్యభారకునిఁ జేసి విద్యుత్ప్రభాతనూభ
వుండు నిశ్చింతుఁడై పుష్పకాండకేళిఁ దగిలి హేతిప్రహేతినందనలతోడ.

64


సీ.

ఒకవేళ విహరించు నుత్పలాంబుజరేణుసంఛన్నకాసారసైకతముల
నొకవేళ విహరించు నుత్ఫుల్లమంజరీమంజులమాధవీమంటపముల
నొకవేళ విహరించు నుత్తుంగశశికాంతహర్యశిరోగృహాభ్యంతరముల
నొకవేళ విహరించు నుజ్జ్వలమాణిక్యఖచితకేళీశైలకందరముల
జలకణంబులుఁ జెమటలుఁ జెలిమి చేయ, నళిరవంబులుఁ బలుకులు ననగి పెనఁగ
వెన్నెలలుఁ జిన్నినగవులు వియ్యమందఁ, జల్లగాడ్పులు నూర్పులు సరసమాడ.

65


క.

ఈసరణి ధరణిపతియు వి, లాసవతీమణులు బహుకళానిపుణతలన్
వేసట లేక లతాంతశ, రాసససుఖవారి నోల లాడుచు నుండన్.

66


క.

కలహించుటయే రాత్రియుఁ, గలయుటయే పగలు నయ్యెఁ గాని తలంపన్
గల నైన లేవు మఱి వా, రల హృదయాంభోజములకు రాత్రిం బగలున్.

67


గీ.

అంత రాజహంసయాన సుకేశికిఁ, బుట్టె సుతుఁడు సుప్రభుం డనంగఁ
గీరవాణి మిత్రకేశికిఁ బుట్టెఁ ద, నూభవుఁడు సుదర్శనుం డనంగ.

68


శా.

ఆపుత్రు ల్దనమానసంబునకు నాహ్లాదంబు గావింప ధా
త్రీపాలాగ్రణి దుర్జయుండు సకలద్వీపంబులున్ శిష్టర
క్షాపాండిత్యముతోడ నేలుచు దిశ ల్గంపింప నాఖేటక
వ్యాపారస్పృహ నొక్కనాఁడు చతురంగానీకినీయుక్తుఁ డై.

69


వ.

వెడల నుద్యోగించునవసరంబున మందురాగారంబుననుండి ఘనాఘనస్తనితగంభీర
హేషాఘోషంబునఁ గరాళింప నుపలాలనవాక్యంబులు మస్తరింపుచు నుభయపా

ర్శ్వంబుల వాగెలు పట్టి సాహిణులు వెంట రా నిరాయాసభక్ష్యమాణవిపక్షప్రతా
పంబురూపంబున ముఖలీనహేమఖలీనంబు మెఱయ నెఱయ నాతోడ రయంబు
నం దొరయ సమర్థంబు గాదని పవమానంబు నవమానంబు చేయుచు నుమియునుమ్మి
భంగి ఫేనభంగంబు దొరుగ నిరుగడల వైచినధవళచామరంబులం దనకు నీడు గారు
మీరు తొలంగుం డని సాభినయంబుగా నిరసించులీల వాలంబు సళింప నిలింపతు
రంగమంబు నిజకులోత్తమంబు గావునఁ దత్తురంగంబు నంబుధిమథనసమయంబునఁ
గుంటుపఱచినకంటకుం డని బలిం గిట్టిమట్టి రసాతలంబు భేదించువిధంబున మహీ
భాగంబు త్రవ్వునగ్రిమచరణంబు బిత్తరింప భరింపరానిఖురాఘాతంబుల మదీయ
ఫణంబులు నొప్పింపకు మని పదంబునం బెనంగి భుజంగపుంగవుండు దీనవచనం
బులఁ బ్రార్థించుతెఱంగున నంగదంబు మ్రోయఁ బాయక వినోదించు వీరలక్ష్మికి
మందిరం బగునరవిందంబుచందంబునఁ దలాటంబు లలాటోపరిప్రదేశంబునఁ బ్ర
కాశింప జనంబులు కనుంగొని తీవ్రధారావిహారంబున లోహసంఘటనంబున మనో
హరచ్ఛాయావిశేషంబున మేఖలాభిరమ్యంబున సౌమ్యం బగుంగాక యేమి పరుల
చేతఁ బట్టుపడుటయు నిరంతరంబు నొరపై మెఱయకుండుటయు గొలిమిడిచెం
తలం దిరుగుటయు విక్రమంబుఁ జూపెడునెడ వడంకుటయుఁ గలఖడ్గంబు ఘో
రాజులకు నిట్టిహయరత్నంబుకరణి విజయకారణంబు కాదని బహుముఖంబులం
బ్రశంసింప సమ్ముఖంబునకు వచ్చి నిలిచినఁ గుందశరదిందుపురందరమదావళధవళ
వర్ణంబును సూక్ష్మకర్ణంబును నిర్వక్రపరాక్రమకేసరికిశోరధూర్తంబును శుభావర్తం
బును విజితవైనతేయసత్త్వమహత్త్వంబును దేవత్వంబును బౌరుషాతిమానకాయం
బును సముజ్జ్వలచ్ఛాయంబును సౌగంధికసగంధగంధంబును దృఢసంధిబంధంబును
మత్తమయూరసమానయానంబును సంభృతాభిమానంబును దుందుభిగంభీరస్వరం
బును నిష్ఠురఖురంబును వనాయుజోత్పన్నంబును సర్వలక్షణసంపన్నంబును నైన
జవనాశ్వంబు నెక్కి దిక్కులు పిక్కటిల్లుచుండ సురవిమతహృద్దమితపురభిడ్డమరు
సహచరభయదఢక్కానకహుడకాపటహధ్వానంబులు చెలంగ సుభటపదఘట్ట
నంబుల శేషఫణంబులు నలంగ వారణాసీనగరంబు నిర్గమించి మహాగహనంబునకు
నడచె నప్పుడు.

70


క.

వెలువడియె వీటినలుది, క్కులఁ గుక్కలు ప్రోగు లురులు కొమ్ములు బడ్డం
గులు పందిపోటు లమ్ములు, వలలు తెరలు దీమములు సివంగులబోనుల్.

71


సీ.

కదలిరి కొందఱు ఘనతరస్కంధభారంబులఁ దగుతమాలంబు లనఁగ
నడచిరి కొందఱు నర్తితభయదహేతులతో హలాహలానలము లనఁగ

జరగిరి కొందఱు సంభృతకఠినశృంగములతో నంజనాగంబు లనఁగ
వెడలిరి కొందఱు వికరాళశరపరంపరలతో విలయాంబుధరము లనఁగ
చల్లడంబులు నొడదోళ్ళుఁ జలిదికూళ్ళ, చిక్కములు మడ్మబిళ్ళలచెప్పుజోళ్ళు
సెలసువిండ్లును మొదలుగాఁ గలవి దాల్చి, నల్లచాయలమేనులభిల్లవరులు.

72


చ.

చలమరి సూడుబంటు గరసాన మిటారి కటారికాఁడు బె
బ్బులి సురగాలి చోర బలుబూతము కాలరి కారుచిచ్చు కు
క్కలగరికట్టు వాపెటులుగం డను పేరులకుక్క లందలం
బుల నరుదెంచె సింగములపోలిక భూతలభర్తవెంబడిన్.

73


క.

ఈపగిది నృపతి మృగయా, వ్యాపారంబునకు వలయువారిం గొని సే
నాపరివృతుఁ డై విపినస, మీపమునకుఁ బోవ మ్రొక్కి మృగయవరేణ్యుల్.

74


సీ.

ఎలయించి వేల్పుఱేఁ డెక్కు నేనుఁగు నైన నోవంబులోపలఁ ద్రోవఁగలము
పొంచి వెన్నుం డెక్కు పులుఁగురాయని నైన నిడుపుజిగురుగడఁ బొడువఁగలము
ఎలవెట్టి జము డెక్కు నెనుబోతు నైనను విడిచివాటును బడ వేయఁగలము
తెమలించి గాలి యెక్కు మెకంబు నైనను బలుగాలువల దీర్చి పట్టఁగలము
కాళి యెక్కు గరాళిసింగంబు నైన, మరపుకోఁ గల మొకయింతమందు పెట్టి
మాట లిఁక వేయు నేటికి మమ్ముఁ జూడు, మనుచుఁ బంతంబులాడి కారడవిఁ జొచ్చి.

75


క.

అటవీస్థలమున భైరవు, కటి నుండెడురుండమాలికలచందముగా
నటదవిరళనానావిధ, పటఖండం బైనపోఁగువాఱిరి కలయన్.

76


క.

వరుణుఁడు దుర్జయధరణీ, వరునాజ్ఞకు వెఱచి మృగనివారణమునకున్
బురికొలిపి శరధు లెత్తిన, తెరలనఁ దెరలెత్తి రఖిలదిగ్భాగములన్.

77


క.

వ్రీలనివల లొడ్డిరి హే, రాళముగా లోకపాలరమణులు మృగయా
లీలఁ గనుఁగొనఁగఁ జేసిన, జాలకజాలములు గలదిశాభిత్తు లనన్.

78


క.

ధారుణి నోదము లహిపా, గారంబులు మ్రోవఁ ద్రవ్వి కప్పిరి బహుమా
యారచనాపరతంత్ర, క్రూరజనులకపటహృదయగోళము లనఁగన్.

79


వ.

మఱియు వలయుఠావుల వేఁటకుఁ దగినపరికరంబులు నిలిపి ఘోరభేరీభాంకారం
బులు నిస్సాణధణధణంకారంబులు ఝల్లవీఝంకారంబులు కాహళక్రేంకారంబులు
ధనుర్జ్యాటంకారంబులు కంఠహుంకారంబులు గొండొఁడ మెండుకొని బ్రహ్మాండ
భాండంబులు వగుల్ప ననల్పసంరంభంబునఁ జోఁపువెట్టిన బెట్టులికి తలఁకి తెంకి
పట్లు విడిచి కదుపులు కదుపులై పఱచి పుణ్యావసానంబున నరకకూపంబునం

గూలుపాపపంకమలినాత్ములచందంబున నోదంబులం గూలుకోలంబులుం బరమ
జ్ఞానవైకల్యంబున మోహబంధంబునఁ దగులుపురుషులతెఱంగున వలలం దగులుశా
ర్దూలంబులు మదనాతురత్వంబునఁ బరస్త్రీలకటాకుంబులఁ జిక్కుపడుజారుల
విధంబున నురులం జిక్కువడుకృష్ణసారంబులు మాత్సర్యంబున బెట్టిదంపుజగజెట్టి
పటుభుజార్దళంబున వేసినం ద్రెళ్ళుమల్లులకైవడిఁ జేటకొమ్ముకొట్టినఁ జుట్టుకోని
త్రెళ్ళుదుప్పులును నిష్ఠురత్వంబున మర్మోద్ఘాటనంబు లైనమాటలు హృదయంబు
నాటి నొచ్చువారిలాగున మారమ్ములు గాడి నొచ్చు మన్నుబోతులును నై వన్యసత్వం
బులు పెక్కుదిక్కులం బెక్కుసాధనంబులకు లో నైన నవ్వేఁటకాండ్రు వేగరాఁ
గోలల నూఁది యి ట్టట్టు గదలక ప్రాణంబులతోడన పట్టి కట్టియు వలలకుం జొ
రక కెలంకుల కుఱికినం గఱకుటమ్ముల నెఱకలు దూల నేసియు రేఁగి ప్రోఁగువెలికిఁ
గుప్పించి దాటు నెడఁ దప్పకుండ బిండివాలంబులఁ బదంబులు ఖండించియు మరలి
గద్దరితనంబున గద్దించిన నుద్దవడిం గదిసి పందిపోట్లం బొడిచియు దిగులు గుడిచి
నలువంకలకు జడియ నడిదంబుల డగ్గఱి నఱికియు నెప్పట్టునం బట్టువడక పరు
వెత్తినఁ దత్తరంబున వెంటాడించి విడిచివాట్ల వ్రేసియు ముట్టిపాటునం గలను
వెట్టినఁ బట్టెడలు విడిచి గట్టువాసారమేయంబుల నుసికొలిపియుఁ బొదులువిచ్చి
పొదలు సొచ్చి లాసినం గాసిలి చుట్టుముట్టి చొరకొట్టి సబళంబులం గ్రుమ్మియు
బహుభేదంబు లైనమృగయావినోదంబులు చూపినఁ బ్రమోదించి మేదినీనాయకుం
డు మృగవధకుతూహలాయత్తచిత్తంబున వేఁటలాడుసమయంబున.

80


గీ.

-ధరణిపాలునికరవాలధారఁ ద్రెవ్వి, నెత్తురులఁ దోఁగి మత్తకంఠీరవంబు
పడియె నతనిభుజప్రతాపంబుచేత, నావృతం బైనరిపురాజియశము వోలె.

81


క.

లాఘవమున విభుఁ డేయున, మోఘాస్త్రము వడఁకె మణిసముజ్జ్వలపుంఖం
బై ఘోరభల్లుకముపై, మేఘములోఁ జంచలించుమెఱపును బోలెన్.

82


గీ.

జనవిభుఁడు నాట సవ్యాపసవ్యగతులఁ, దిరుగుచో గర్లతూపులు బరులు రెంటఁ
గట్టి కనుపట్టె ఱెక్కలు గలమహామ, హీధరంబువిధంబున నేకలంబు.

83


క.

భూలోకభర్త గడగొని, పాలస్థలి వ్రేయఁ జేసె భాంకరణం బా
భీలముగా దర్పితశా, ర్దూలము కోణాగ్రనిహతదుందుభి వోలెన్.

84


గీ.

ఇట్లు తనబాహువిక్రమ మెల్లవారు, చూడ విద్యుత్ప్రభాతనూజుఁడు బహుప్ర
కారముల వేఁట లాడుచు వీరు లైన, మానధనులకు రాజకుమారులకును.

85


చ.

సెలవులు పెట్టఁ గ్రోల్పులికిఁ జేయిడి ముప్పిడి గుప్పుశౌర్యవం
తులఁ గని కర్ణముల్ బిగియ నొక్కి వరాహము నెక్కువీర్యవం

తులఁ గని లేటివెంటఁ బడి దుత్తెడుమేరన పట్టువేగవం
తులఁ గని మెచ్చి లేనగవుతోడ నభీష్టము లెల్ల నిచ్చుచున్.

86


క.

కొంతవడి నిలిచి వారల, పంతంబులు వినుచుఁ జల్లపడువేళకు న
క్కాంతారమునం గలమృగ, సంతతి వధియించి వేఁట చాలించుటయున్.

87


సీ.

కలిగెఁ బో నెమ్మది వలసినవంకలఁ దిరిగి మేయఁగ హోమధేనువులకు
కలిగెఁ బో కరిగంటి గానియెన్నులతోడ నారంగఁ బండ నీవారములకు
కలిగెఁ బో పొదలుచుఁ గలయఁ దీఁగెలువాఱి ముదురనూరఁగఁ గందమూలములకు
కలిగెఁ బో కలఁగక కమలసౌగంధికసంపద చూపఁ గాసారములకు
ననుచుఁ బలికిరి జను లప్పు డవ్విభుండు, పక్కణంబుల శబరాధిపతులచే ను
పాయనంబులు గొనుచు నపారపల్ల, వప్రసూనఫలద్రుమావళులు గనుచు.

88


క.

సందళితకుసుమసౌరభ, తుందిలమందానిలము లెదుర్కొనఁ దురగ
స్వందనకరిభటసేనా, సందోహముఁ దాను దిరిగి చనుసమయమునన్.

89


సీ.

కదలుపాదపములు కల్లోలములు గాఁగ విరులమంజరులు పెన్నురువు గాఁగ
హోమధూమంబులు జీమూతములు గాఁగ ధవళాక్షతములు ముత్యములు గాఁగ
దేవపూజావితర్దికలు దీవులు గాఁగఁ గ్రతుహవ్యవాహ మౌర్వంబు గాఁగఁ
బర్ణశాలలు గూఢపర్వతంబులు గాఁగఁ జదువులు సహజఘోషములు గాఁగ
తూలఁబట్టిననీర్కావిదోవతులు ప్ర, వాళలతికలు గాఁగఁ గైవల్యలక్ష్మి
పుట్టినిల్లై సుధాంభోధి వోలె నిత్య, మహిమముల మించుపుణ్యాశ్రమంబుఁ గనియె.

90


క.

అందు ననుదినము సంయమి, నందను లేతెంచి వేఁడినం దరువులమీఁ
దం దిరుగుచు నుండి సమి, త్సందోహము లంది యిచ్చు శాఖామృగముల్.

91


క.

శీతలమహీరుహచ్ఛా, యాతలకల్పితవితర్దికాసీనవటు
వ్రాతము గుణియింపఁగ శుక, పోతంబులు పనసకవలు పోయినఁ జెప్పున్.

92


క.

చెంగట నుద్గాతలఁ గూ, డం గించిన్మాత్రమును దడంబడక సము
త్తుంగస్వరములఁ బికములు, సాంగముగాఁ జేయు దేవతాహ్వానంబుల్.

93


క.

చూపులఁ గని తల్లులసవి, చాపలమునఁ జేరి హరిణశాబము లఱ్ఱుల్
చాపఁగ దూర్వాంకురములు, మేపుదురు శరీరములు నిమిరి మునివనితల్.

94


గీ.

అడుగులకు మడ్గు లొత్తెడు నవని యనఁగఁ, బదనఖజ్యోత్స్న ముందటఁ బర్వమౌని
మందయానలు పోయుదుర్ బిందియల జ, లంబు గొని వచ్చి బృందావనంబులకును.

95


గీ.

వాహినులఁ గ్రుంకి తపసులు వచ్చువేళఁ, బిడిచి దోవతు లార విప్పినఁ దమంత
మింట నేతెంచు ముక్తికామిని వరింపఁ, బోవుచోఁ బట్టునుల్లభంబులవిధమున.

96

గీ.

కానను బులికిఁ బుట్టినకూన పూరి, మేయు నో టనుసామెత మిథ్య గాఁగఁ
బులులుసైతము పొల మాని పూరి మేయు, నున్న దుష్టమృగంబుల నెన్న నేల.

97


సీ.

దళము లాహారపాత్రంబులు రచియింపఁ బదను దప్పెడు నని ముదుర వెఱచు
తావి పోయెడు నని దేవతాపూజావసరముదాఁక విరులు విరియ వెఱచు
నతిథిభిక్షకు నల్ప మౌ నని పిందె లారఁగఁ బండ కొకటియు రాల వెఱచు
తపము సల్పెడువారు తపనదీధితులఁ గందెద రని నీడలు దిరుగ వెఱచు
నాఱవైచిన వ్రేలుచు నహరహంబు, నుపరిభాగాంతరంబుల నున్న నార
చీర లేపాటి బెడఁకినఁ జిరుగు ననుచు, విటపము కదల వెఱచు నుర్వీరుహముల.

98


మ.

ఫలముల్ గోరక హోమముల్ సలుపుచుం బ్రత్యక్షవైశ్వానరుల్
వలె గాన్వింతురు తాపసుల్ నిరుపమస్వాహాస్వధాకారర
క్తులు నానానియమాధ్వరాజ్యమహిమోత్తుంగుల్ జగత్ప్రాణమి
త్రులు తేజోభరితుల్ సదాశివతనుల్ తుష్టామరాధీశ్వరుల్.

99


వ.

ఇట్లు సకలజనవర్ణనీయానుభావభవనం బైనపుణ్యవనంబు చొచ్చి యిచ్చ నచ్చెరు
వంది వందిబృందస్తుతపురందరాదినిర్జరదుర్జయుండు దుర్జయుండు పురోభాగంబున
దివాకరకరదురవగాహశీతలచ్ఛాయామహీరుహంబుక్రింద హృదయాలవాలంబున
మొలచి కలయంబర్వినకారుణ్యలతావితానంబులతెఱంగున గెంజడలు రంజిల్ల నిబిడం
బుగా నావరించినసాత్వికగుణంబురీతి శరీరంబున భసితంబు గనుపట్ట నిరంతరపుర
శ్చరణచాతుర్యంబున మెప్పించి పుచ్చుకొన్నమంత్రసిద్ధవధూకంతహారంబుఠేవ నక్ష
మాలిక హస్తాంబుజంబున మెఱయఁ దపోధనాధిక్యంబునం గోటికిం బడగ యెత్తిన
విధంబున బద్ధకౌపీనం బగుదండంబు సకాశంబునం బ్రకాశింపఁ బరబ్రహ్మమయుం
డైనతన్ను సేవింప సకలపుణ్యతీర్థంబులు సంగ్రహించి సూక్ష్మరూపంబు వహించి
వచ్చినకమలభవాండంబుచందంబునం గమండలువు దండనుండ శిష్యగణంబునకుఁ
బరతత్త్వబోధంబు చేయువాని మహామునిప్రముఖు గౌరముఖుం గని సాష్టాంగ
దండప్రణామంబు లాచరించి నిలిచిన నమ్మునీశ్వరుండు యథోచితప్రకారంబున
నర్ఘ్యపాద్యంబు లిచ్చి కుశలం బడిగి భూపాల మాపాల నేఁడు నీవు సైన్యసమే
తుండవై వసియించి మజ్జనభోజనంబులవలన మృగయాపరిశ్రమంబు దీర్చుకొని
చను మని పలికినం గోపించి సుప్రతీకనందనుండు డెందంబున.

100


క.

తా నెటువలెఁ బెట్టెడునో వానావిధభోజనములు నాకు నసంఖ్యం
బైనమహాసేనకు ని, క్కాననమున మౌని గన్నుగానఁడు సుమ్మీ.

101

గీ.

సైన్యములు డస్సె నపరాహ్నసమయ మయ్యె, నిందు నొకపూఁట నిలిచిన నేమి దప్పెఁ
జూత మీతాపసునివట్టియేతు లంచు, నృపతి విందారగింపంగ నియ్యకొనిన.

102


చ.

బలము లపారముల్ ధరణిభర్తయుఁ బర్యటనంబువంక నాఁ
కలిఁ గొనినాఁడు వేగిరమె కావలె భోజన మెట్లు గూడు నీ
కళవళ మింక నేల హరి కామితసంపద లిచ్చు భక్తవ
త్సలుఁడు గలండు నాకు నని సంయమిరాజు తదర్చనార్థమై.

103


ఉ.

గంగకు మందగంధవహకల్పితనర్తనతారతారతా
రాంగకు గర్భపూర్ణమకరందహిరణ్మయసారసారసా
రంగకు బాలసైకతనిరంతరఖేలనచక్రచక్రచ
క్రాంగకుఁ బోయి శ్రీహరి దయానిధిఁ గీర్తన చేసె నచ్చటన్.

104


క.

అని చెప్పిన విని యేవిధ, మునఁ గీర్తన చేసి గౌరముఖమౌని జనా
ర్దను నానతి యిమ్మన ని, ట్లని పలికె వరాహదేవుఁ డవనీసతికిన్.

105


మ.

జలరూపాయ చరాచరాత్మకజగత్సంస్థాయ లక్ష్మీమహీ
లలనేశాయ కరాళకాళీయఫణాలాస్యాయ దేవోత్తమా
య లయోత్పత్తివివర్జితాయ సుజనాయత్తాంతరంగాయ కే
వలకారుణ్యకటాక్షవీక్షణపరీవాహాయ తుభ్యం నమః.

106


వ.

వెండియు నోంకారంబు నీవ భూర్భువస్వరాదిలోకంబులు నీవ విశ్వప్రపంచంబు
నీవ నీవలన ఋగ్యజుస్సామాధర్వణంబులు స్మృతులు శాస్త్రంబులు వృక్షంబు లో
పధిపశుపక్షిమృగకీటకప్రముఖంబులు జన్మించె నిట్టినీమహత్త్వంబు దెలియ నశ
క్యంబు దేవా యిప్పుడు మదీయాశ్రమంబునకు దుర్జయుం డనునృపాలుం డపార
చతురంగంబులతోడ నభ్యాగతుండై చనుదెంచె నారాజునకు నాతిథ్యంబు సేయు
సామర్థ్యంబు లేదు తృణగుల్మప్రముఖంబు లైనవానిలోన నెట్టిది ముట్టిన నది చతు
ర్విధాన్నంబులుగా మానసమున నే నెద్ది గావలె నని తలంచిన నదియు నయ్యెడు
నట్లుగా ననుగ్రహింపు మని సంస్తుతిపూర్వకంబుగాఁ దనమనోరథం బెఱిఁగించిన.

107


క.

శతకోటిదహనవిధురవి, శతకోటిప్రభల గెలువఁ జాలినపరమ
ద్యుతి పరిఢవింప లక్ష్మీ, పతి కరుణారసపయోధి ప్రత్యక్షంబై.

108


మ.

అనవద్యవ్రతశీల నీకు నిది యిష్టావాప్తి గావించుఁ బ్రా
ర్థనమాత్రంబున నింద మంచు నొకరత్నం బిచ్చి నీరేజలో
చనుఁ డంతర్హితుఁ డయ్యె గౌరముఖుఁడున్ సంతోషనిర్మగ్నుఁడై
చనుదెంచెం దనపర్ణశాలకు హవిస్సౌరభ్యధారాళకున్.

109

గీ.

ఇట్లు చనుదెంచి మణికి ననేకవిధము, లైనపూజలు గావించి ప్రార్ధనంబు
మున్నుగా హస్తములు మోడ్చి మునికులావ, తంస మంతర్గతంబునఁ దలఁచుటయును.

110


సీ.

గోమేధికంబులకుట్టిమంబులతోఁ గిరీటిపచ్చలవితర్దికలతోడ
పద్మరాగములకంబములతోఁ బుష్యరాగములసౌపానమార్గములతోడ
నీడాడునీలాలగోడలతో మౌక్తికంబులసోరణగండ్లతోడ
వజ్రాంకురంబులవలభులతోఁ బ్రవాళంబులకప్పుపలకలతోడ
సితకరోపలసాలభంజికలతో వి, డూరమణికేతువులతోడ నీరజాప్త
బింబచుంబిసువర్ణకుంభంబు లైన, నిలువుమేడలు గలిగి సంఖ్యలకు మిగిలి.

111


మ.

హరివాణంబులు గిన్నియల్ పడిగముల్ హస్తావళుల్ పీఠముల్
గరిటెల్ గిండ్లును దట్ట లొడ్డికలు గంగాళాలు పింగాండ్లు ఘ
ర్ఘరికల్ బిందెలు కొప్పెరల్ మొదలుగా గాంగేయమాణిక్యభా
స్వరముల్ కోటులు గ్రక్కునం బొడమెఁ దత్సౌధాంతరాళంబునన్.

112


క.

నేలలసుత్తడువులతోఁ, గీలితశృంఖలము లైనకీలకములతో
నాలానంబులతో గజ, శాలలు ప్రభవించె నతివిశాలలు పెక్కుల్.

113


గీ.

కట్టుగొయ్యలతో నడుగాళ్ళతోడ, రక్షణార్ధమయూరమరాళమేష
బలిముఖప్రముఖములతోఁ బంచవర్ణ, రజ్జువులతోడ బహుమందురలు జనించె.

114


మ.

కలహంసంబులతో రథాంగములతోఁ గల్హారనీరేరుహో
త్పలధారాళమరందపానమున మత్తాగొన్నరోలంబప
ఙ్క్తులసౌభాగ్యముతో ననేకములు ప్రాదుర్భావముం బొండెఁ జం
'చలకల్లోలఘటాకణప్లుతమరుత్సంచారకాసారముల్.

115


మ.

నలువంక న్మలయానిలాంచలముచే నర్తించుపూధూళితోఁ
గొలఁదుల్ మీఱ ఫలావళుల్ మెసఁగుచున్ గ్రొమ్మావులం బల్కుచి
ల్కలతోఁ గోకిలకామినీకలకుహూకల్లోలకోలాహలం
బులతోఁ బుట్టె ననంతముల్ సుఖకరంబుల్ కేలికాంతారముల్.

116


క.

ఇవి మొదలుగా నృపోచిత, వివిధైశ్వర్యములతోడ విలసిల్ల శచీ
ధవనగరముకగణి ముని, ప్రవరునిపుణ్యాశ్రమంబు పట్టణ మయ్యెన్.

117


క.

ఆకృతకపురిం గనక, ప్రాకారము దిరిగి వచ్చె ఫణిరాజఫణా
నీకమణిరుచులు మిన్నులు, ప్రాఁక నగాధంబు లైనపరిఖలతోడన్.

118

గీ.

అపుడు గౌరముఖుండు నరాధినాథుఁ, బిలిచి నీ సైన్యములు నీవు వలసినెడల
విడియుఁ డీమందిరంబుల వేగ మీకుఁ, బరిజనంబుల రప్పింతుఁ బనులు సేయ.

119


వ.

అనిన విని కుతూహలంబున మిహిరమండలనిరోధిగృహస్థాపితవళక్షకరోపలచ్ఛవిక్షా
ళితనక్షత్రపథశ్యామికంబును విశాలైకవింశతిభూమికంబును వాతాయనవిరతాయ
మాననానావిధధూపవాసనాసనాథంబును నైనసౌధంబు ప్రవేశించి దుర్జయుండు
నిజానుజుం డైనసుద్యుమ్ను విలోకించి యథోచితస్థానంబుల సైన్యంబుల విడియింప
నియమింప నయ్యువరాజుశాసనంబున యుగ్యంబులపగ్గంబు లూడ్చి కేతనాత
పత్రంబులు తొలంగించి ధనురాదివివిధసాధనసహితంబులు గా నరదంబులు పది
లంబులు సేయు సారథులమిధఃకథనంబులు రంచెలు డించి కదళికాకుధకంఠరజ్జు
ఘంటిక వ్రచ్చి తోత్రాంకుశహస్తులై సాహిణంబులకుఁ దెచ్చి గంధసింధురంబుల
నాలానంబుల బంధించుమావుతు లయితరేతరాలాపంబులు పొట్టపట్టెడలు విడిచి
పల్లంబుల వలయు నెలవులం గట్టి మెత్తలార్చి కళ్ళెంబులతోన తురంగంబుల మందు
రాగారంబులకుఁ దివియువాహకులపరస్పరభాషణంబులు రమ్యభవనంబులు
సొచ్చి మండలాగ్రభిండివాలముసలముద్గరపరశుపట్టిసప్రముఖనిఖిలాయుధంబులు
ఖేటకంబులు హాటకభిత్తిభాగంబులం జేర్చుపదాతిజనంబులయన్యోన్యవచనంబులు
గలయం బెరసి జంఝా వనఘూర్ణమానార్ణవంబుకలకలంబులం గలకలం బ్రహ
సించె నాసమయంబున.

120


క.

గౌరముఖుఁడు మందస్మిత, గౌరముఖుం డగుచు మానికము గామితముల్
చేరు వఱుప నా నృపతికిఁ, జేరువ నిడి వాసుదేవుఁ జింతించుటయున్.

121


సీ.

భృంగారకములు సం పెంగనూనియలు గంధామలకములు దివ్యాంబరములు
తాళవృంతములు నద్దము లడపంబులు తొడవులు జిలుఁగుపావడలు విరులు
పన్నీరు కస్తూరి పచ్చకప్పురము గంధము చాదు జవ్వాది తట్టుపునుఁగు
రవలపావలు చామరంబులు రత్నకంబళ్ళు నీరాజనభోజనములు
మొదలుగాఁ గలవస్తుసముత్కరములు, కరముల ధరించి వెడలిరి సరసిజాక్షు
లాధవళరత్నగర్భంబునందుఁ బూర్ణ, చంద్రబింబంబువలన నచ్చరలు వోలె.

122


గీ.

రసము లన్నియు శృంగారరసము కాఁగఁ, జేసి మాణిక్యమునను రాజీవనయన
లివ్విధంబునఁ బుట్టి మహీమహేంద్రు, సమ్ముఖంబున నిలిచి తచ్ఛాసనమున.

123


సీ.

ఒకవిలాసిని నకనక నైనకౌను గంపింపంగ నంటె సంపెంగనూనె
యొక మి చెమట పయోధరంబులకెలంకులఁ దోఁపఁ గుంకుమ నలుఁగు పెట్టె

నొకబాల కడయంబు లొయ్యనొయ్యన పలుకంగ గంధామలకంబు పెట్టె
నొకతన్వి దోర్మూలయుగళంబురుచులు మిన్నులు వ్రాఁకఁ బన్నీట జలకమార్చె
నొకచకోరాక్షి నిజకరద్యుతులు మీఁదఁ, గప్పి చంద్రికవన్నియ గాఁగ దుప్ప
టమునఁ దడియొత్తె నొకహంసగమన సురటి, విసరుచు నఖాగ్రమున నాఱవిప్పె నెఱులు.

124


క.

ఒకరమణి యిడియె వస్త్రము, లొకభామిని భూషణంబు లొసఁగెను గంధం
బొకయింతి యిచ్చె నంతట, ముకురం బొకచంద్రవదన ముందటఁ బెట్టెన్.

125


గీ.

అవనిపాల నీకు నన్యతేజంబులు, బడిసివేఁత లనినపగిదిఁ బడిసి
పాఱఁ జల్లి రబ్జపత్రేక్షణలు పళ్లె, రములలోనిపద్మరాగమణులు.

126


క.

వనితాజనంబు లివ్విధ, మునఁ దనకు బహూపచారములు సలుపంగా
మనుజేంద్రశేఖరుఁడు గై, కొనుచున్ మణిపీఠిమీఁదఁ గూర్చున్నతఱిన్.

127


సీ.

సరసిజద్వయముపై మొరయుతుమ్మెదపిండువలెఁ గాళ్ళగజ్జెలు గులకరింప
కంతునిబాణంబుగరిచందమునఁ బింజె లిడుచుఁ గట్టినచీర గుడుసుపడఁగ
హిమము గప్పినరథాంగములచందమునఁ గంచెలలోని మెఱుఁగుఁజన్నులు చలింప
చదలఁబ్రాఁకినయెఱసంజభావమునఁ గ్రొమ్ముడిమీఁదఁ జెంగావిముసుఁగు నినుప
నంగముల గీత మర్థంబు హస్తముల దృ, గంచలంబుల నాకూత మంఘ్రిపల్ల
వములఁదాళంబు దెలియ మార్గమున దెలిసి, ముద్దియలు కొంద ఱాడిరి మోహనముగ.

128


క.

హరిణీనయనలు గొందఱు, మొరయించిరి కాలమానమునకున్ వీణా
మురజపణవఢక్కాఝ, ల్లరికాఝర్ఝరులు ద్రుతవిలంబితగతులన్.

129


క.

నాళీకముఖులు గొందఱు, సాళగసంకీర్ణశుద్ధసరణి మెఱయఁ గా
నాళతులు సేసి పాడిరి, తాళగతులు మంద్రమధ్యతారశ్రుతులన్.

130


వ.

తత్సమయంబున.

131


చ.

అతివినయంబునన్ సరసిజాక్షులు గొందఱు పళ్ళెరంబు పె
ట్టితి మని పిల్వఁగా బడిబడిం జనుదెంచినవారివెంట న
ద్భుతకరనృత్తగీతరసపూరపరిప్లుతమానసంబుతో
హితపరివారముల్ గొలువ నేగి మహీపతి భుక్తిశాలలోన్.

132


సీ.

కట్టినచీనాంశుకంబులపింజెలు మొరయుమట్టెలమీఁద విరియఁబడఁగ
నాణిముత్తియములహారగుచ్ఛంబులు చన్నుగుబ్బలమీఁదఁ జౌకళింప
తులకించువజ్రకుండలములు మెఱుఁగుఁజెక్కులమీఁద నిండువెన్నెలలు గాయ
హరివాణములమీఁదఁ గరకంకణములదీప్తులు పదార్థంబులతోన తొరుగ
నిందువదనలు వడ్డింప ఋషిమణిప్ర, భూతపరిపక్వబహుభక్ష్యభోజ్యలేహ
చోష్యపానీయములచవిఁ జొక్కి చొక్కి, సారెసారెకుఁ బొగడుచు నారగించె.

133

క.

క్షితిపతికి నిట్లు చేసిన, గతి నతిసౌఖ్యాన్వితములుగాఁ బరిజనసం
తతికి వినిర్మించె యతి సు, కృతి మజ్జనభోజనాదికృత్యము లెల్లన్.

134


క.

వెండియు నమ్మణిలోపల, నుండి జనించినయథావిధోచితసేవా
పాండిత్యంబులు గలిగిన కొండికప్రాయంబునరులు కోటులసంఖ్యుల్.

135


సీ.

కలిపి తెచ్చినజీవనలు జమ్ము పిప్పలదళములు భద్రశుండాలములకు
కవణంబు పసిడాలు గఱకి భోజనము సెనగలు గుడములు గంధర్వములకు
నింబప్రవాళభారంబులు కోమలకంటకాంకురములు గరభములకు
చక్కుగా నఱకినజాడుచొప్పలు నులువలపిష్టములు బలివర్ధములకు
పచ్చినంజుళ్ళు గమ్మనిపాలు గూడు, సారమేయంబులకుఁ గడుపారఁ బెట్టి
యెవ్వరికి నేమి వలె నవి యెల్ల నిడుచుఁ, నిఖిలజీవులఁ దృప్తిఁ బొందించిరంత.

136


చ.

మునికులచక్రవర్తికిఁ బ్రమోదముగా మణి చేయుచిత్రముల్
గనుఁగొని దానికిన్ సమముగామి యెఱింగినభంగి సిగ్గునం
దనమణిఁ బాఱవైచె నిది దప్పదు నాఁ బడియెన్ సరోజినీ
వనవిభవావలంబము దివాకరబింబము పశ్చిమాంబుధిన్.

137


క.

అకరువులమచ్చులగుది క, ర్ణికాసువర్ణంబు ముధుపనికషము గలత
మ్మికవిలసంచి దివసవై, శ్యకులాగ్రణి వాయి గట్టె సంధ్యావేళన్.

138


చ.

ఎడపనికూర్మితోడ రమియించి వృథా కలహించి పాసి పో
యెడుతఱిఁ గామినీకరగృహీతపటాంచలుఁ డైనభర్తకై
వడి మునుమాపుదాఁక మధువారి యథేష్టము గాఁగ నాని వె
ల్వడుచుఁ బెనంగెఁ దేఁటి ముకుళత్కమలగ్రసితాగ్రపక్షమై.

139


సీ.

దివసరాజునుఁ బ్రతీచి యిచ్చునివాళిదీపాంకురంబులదీప్తి వోలెఁ
గమలాప్తుహరులరింఖాముఖంబులఁ దూలుచరమాద్రిధాతురజంబు వోలె
నంబరలక్ష్మి నూరార్చి రమ్మనుచు భాస్కరుఁడు పంపినమయూఖములు వోలె
నర్కునిఁ దాఁకి పోరాడినమందేహదనుజులదేహరక్తంబు వోలెఁ
గలయఁ. బర్విన సాంధ్యరాగములు పారి, భద్రభద్రంబులై కానఁబడియె బంధు
జీవజీవంబులై వేడ్క సేయ హృదయ, హారిబింబానుబింబంబులై రహించె.

140


సీ.

అభ్రతాపింఛవన్యాఘోణి రోదసికాపాలికమషీవిలేపనంబు
దివసాబ్జముకుళనోద్ధితభృంగతతి వారుణీపరిప్రాప్తసూర్యాపకీర్తి
చక్రదాంపత్యవిషము రజన్యభిసారికాతమమేచకకంచుకంబు
కాలగోపాలకకంబళంబు రమాకుమారనాసీరధాటీఁరజంబు

నిఖిలదిక్కందరాముఖనిర్గతప్ర, మత్తకరిఘటానటనభ్రమత్ప్రదోష
నీలకంఠకలాపంబు నిండఁ బర్వెఁ, గౌశికప్రియతమ మైనగాఢతమము.

141


చ.

కడు నధికప్రతాపనిధి కాలవశంబున నస్తమింప న
ల్గడ దల లెత్తుహీనులప్రకారమునన్ రవి గ్రుంకఁ దారకల్
పొడిచె నిశావిలాసిని విభుం గవియం గయిసేయుచో నెఱుల్
గడిగి విదల్ప వారికణిక ల్గగనస్థలి నిండెనో యనన్.

142


క.

దీపించె గగనమున రజ, నీపికవాణీశిరోజనికురుంబముపైఁ
బాపటచందమున ఛా, యాపదము సమస్తచక్షురభిరామంబై.

143


గీ.

దేవతాసింధువిహరదైరావణంబు, తొండమునఁ జల్లువాలుకాధూళిపగిది
నుదయధవళిమ దోఁచిన నొదిగెఁ దమము, బోధము జనింప మోహము పోవునట్లు.

144


సీ.

ఉపసుధర్మాస్థాని నున్న వేలుపుఁగత్తళానికిఁ బట్టుతలాట మనఁగ
యామిని శయనించునాకాశనీలతల్పముమీఁదఁ జెంగావిబటు వనంగ
సాము చేయుచు దివస్పతికుమారుఁడు భుజార్గళి నెత్తు కెంపుసంగడి యనంగ
కైసేసికొనుచుఁ బ్రాక్తరుణి సొమ్ములకునై పట్టినబచ్చెనబరణి యనఁగఁ
బాలితోత్పలినీకదంబంబు చకిత, చక్రవాకకుటుంబంబు సమధికాంధ
కారపర్వతశంబంబు కాంతివిజిత, పక్వబింబంబు చంద్రబింబంబు వొడిచె.

145


క.

మదిరార సమదరాగము, వదలఁ బ్రసన్నత వహించువవరుహనయనా
వదనమువలె విధుమఁడల, ముదయారుణ్యంబు తొలఁగ నొప్పె విశదమై.

146


గీ.

తోఁచె హరిణాంకబింబంబు నాచుతోడి, దొరువుగతి నంబరము నుడికరణి నుండె
నైపమొక్కలవలెఁ జుక్క లమరెఁ జిలుప, చిలుప నీరువిధాన వెన్నెలలు మొనపె.

147


క.

మినుకళ్ళము తారలు చి, క్కినగింజలు పూర్ణతుహినకిరణుఁడు తూర్పె
త్తినకొలుచురాశిగా లాం, ఛనము మషీరచితముద్రచందము దాల్చెన్.

148


చ.

అమృతరసంబుచేత సమయం బను సంయమి పూర్ణచంద్రబిం
బ మనువిని ర్శలస్ఫటికపాత్రములోనఁ గళంకబాణలిం
గము నభిషేకముల్ సలుపఁగాఁ బ్రవహించె ననంగ నిండఁ బ
ర్వె మహినభోన్తరాళమున వెన్నెల వెన్నెల నెల్లఁ గప్పుచున్.

149


క.

సరసీమధ్యస్థలముల, విరిసిననీలోత్పలములు విలసిల్లె నిశా
కరకరములు దఱుమఁ దమః, పరంపరలు వెఱచి నీళ్ళఁ బడియె ననంగన్.

150


చ.

కమిచి పరస్పరంబు ధవకాంతలు పాండురనాగవల్లిప
త్రముల ముఖంబుల గొనువిధంబున వెన్నెల లప్పళించి ము

క్కుమొనల నించుచు మదచకోరయుగంబులు మించె రాత్రిక
న్య మగనిఁ జూచువేడ్క నయనంబులు పెక్కులు దాల్చెనో యనన్.

151


గీ.

పగలు వాసనసకలదంపతులు విషమ, సాయకునికిఁ దలంకుచు రేయి గూడఁ
బగలు వాసినఁ జక్రదంపతులు వాసె, నట్లు వచ్చునె యెందు రాజాజ్ఞ మీఱ.

152


ఉ.

ఖండిత లైనతామరసగంధులనిర్భరమానదుర్గముల్
చండపరాక్రమంబున హళాహళి సేయఁ దలంచి వారిపా
లిండులమీఁద జల్లికవి నేయుఁ ద్రిలోకభయంకరుం డనం
గుండు రథాంగచిత్త మను కొల్మిశిలీముఖపఙ్క్తిఁ గాఁచుచున్.

153


సీ.

అభ్యుదయంబున నఖిలలోకములు సంభావింప నేర్చినమంచితనము
కవిసిననిండుచీఁకటి పికాపికలుగాఁ బాఱంగఁ దోలినబంటుతనము
నానాకళానైపుణమునఁ గుముద్వతీసతి వలపించినచక్కఁదనము
కాంతచకోరసంఘములకుఁ జతుకావసంతంబు చల్లినజాణతనము
నాత్మఁ దలపోసి తనపట్టి నమృతకరుని, గన్నులారంగ వీక్షింప ఘనతరంగ
బాహువులు చాచి కౌఁగిలింపంగ వచ్చె, ననఁగ మిన్నంటఁ బొంగె రత్నాకరంబు.

154


వ.

అప్పుడు నెఱయ విప్పినకప్పురంపులప్పలచొప్పున నలినభవాండభాండంబు నిండి
మెండుకొన్నమిన్నేటిపెన్నురువుమురువున దిగవకాశంబులం బ్రకాశించుచు నగ
జాతమగనిమొగంబున నిగుడునగవుబిగువున దట్టపువీచీదట్టంబులం జుట్టుగట్టు గిట్టి
తొట్టుపాలపెన్నీటియిట్టలంబున భూనభశ్చక్రంబు లాక్రమించి దోయిళ్ళ ముంచి
క్రోలవచ్చు నిచ్చలంపువెన్నెల గాయ గాయనంబులు కర్ణరసాయనంబులుగా నాయ
కులముందటం జలిపి రహి నిలిపి శృంగారచేష్టల నభీష్టంబులు దెలిపి వారలఁ గూటంబు
లకు నూలుకొలిపి కూటంబులకుం డాయు నాయకుల ధగధగాయమానంబు లైన
హరివాణంబుల మిలమిల మనుధవళకలమాన్నంబులు గిన్నియల నించి వెన్నపడిదం
బులు జున్నులు ఖండశర్కరలు దధిఖండంబులు గోక్షీరంబులు నిక్షురసంబులుఁ జలి
వెలుంగునకు నర్పించి సరససల్లాపంబులు వల్లభులం గూడి వెన్నెలపులుగంబు లాడు
వ్రీడావతులును బింబంబులకుఁ బ్రతిబింబంబు లైనపెదవులతుదల సీత్కారంబులు
చెలంగ భుజశిఖరంబు లాస్ఫాలింప హస్తంబుల మణికంకణంబులు గులకరింప నం
దంద ముందటికిం జిమ్మునడుగుదమ్ముల మంజీరంబులు మొరయ నిటలంబులఁ గుటి
కాలకంబులు నటియింప యమునాతరంగిణివేణికలం గ్రేణి సేయువేణులు పిఱుం
దుల నాందోళింప ముక్తాఫలగుచ్ఛంబులు మొలకచన్నులఁ జౌకళింప యువజనం
బులకుం గన్నులపండువులుగా గుంపులుగుంపులై పింపిళ్ళు గూయుబాలికలును

సహోదరి యైనమహోదధికన్యకచందంబునం గెందమ్మి నధివసించెనో యన శోణ
మణిభాజనంబుల నున్నవారుణి గ్రోలియు రెంటివలనం గలమాధుర్యతారతమ్యం
బులు విచారించుపగిది నుపదంశంబులుగా ద్రాక్షాఫలంబులు గఱచి గంధోత్తమ
చవి చూచియు నభ్యంతరప్రతిఫలితవిలోచనంబులై సంఫుల్లహల్లకసహితంబు లైన
కొలంకులతెఱంగున మెఱయుపాత్రంబులలోని మైరేయం బాస్వాదించియు
వెన్నెలలం గరంగుకురంగాంకపాషాణచషకంబుల వెలితి గానిమధురాసవం బాని
యు మదంబు పెక్కువం జొక్కి మక్కువం బ్రియులమీఁద వాలువాలుగంట్లునై
నిఖిలంబునకు సుఖంబు నెలవుకొలుపురాత్రి ధాత్రీవిభుండు హితజనంబుల నిలిపి
శయ్యానివాసంబు చొచ్చునవసరంబున.

155


సీ.

శాతమన్యవశిలాస్తంభకోణంబుల రత్నప్రదీపాంకురములు నిలిపి
పటికంపుఱాజాలవల్లికలోనఁ గప్పురపువీడ్యంబులు పొందుపఱచి
పచ్చలపింగాణిఁ బన్నీరు గులికినచందనపంకంబు సవదరించి
పదియాఱువన్నియబంగారుభృంగారుకంబున హంసోదకంబు నించి
కారుక్రొమ్మెఱుఁగులవంటి కాంత లాయి, తంబు చేసిరి నవలతాంతములమెత్త
గలయ విప్పిరి వలిపెచెంగావిచేల, హంసతూలికాడోలావిహారశయ్య.

156


క.

పవడించె నందుపై మా, నవపతి మణికటకఝణఝణత్కారంబుల్
చెవికి నొకపాటి వినఁబడఁ, బ్రవాళహస్తలు నిజాంఘ్రిపదము లొత్తన్.

157


వ.

అప్పుడు.

158


సీ.

కరిమయూరమరాళికలకు నొయ్యార మీనా మిచ్చి నడపుసన్నంపునడపు
కమలకోరకచక్రకనకకుంభముల సౌష్ఠవము దోరణకట్టుచన్నుకట్టు
విషమాస్త్రశరమీనవిద్యుల్లతలసోయగములకు ములుచూపుకలికిచూపు
మధుకరశైవాలమఘవ నీలంబుల నిగ్గుఁ బైకొని కప్పు నెఱులకప్పు
నొప్పు మీఱంగ నరుదెంచె నొకవధూటి, నిరుపమానవిలాసమాణిక్యపేటి
ముఖరచరణతులాకోటి ముఖసుగంధ, సంపదభివృద్ధికరఘనసారవీటి.

159


క.

అరుదెంచినఁ బనినెపములఁ, బరిచారిక లెల్లఁ దొలఁగఁ బార్థివుఁడు మనో
హరపర్యంకమునకు నా, తరుణిఁ గరము పట్టి తిగిచి తమకము మొనపన్.

160


చ.

దరహసితాస్యుఁడై తనులతన్ వెడవాల్చి నగించి వేడుకల్
గెరలఁగఁ జేసి పల్కి పలికించి కపోలతలంబు లంటి క
ప్పుర మిడి కౌఁగిలించి కుచముల్ నఖరంబుల నొక్కి పాటలా
ధరసుధఁ గ్రోలి నీవిక వదల్చి మనోభవకేళి సల్పుచున్.

161

సీ.

ముత్తియంబులపేరు చిత్తజన్మునితూఁగుటుయ్యాలపగిది నుఱ్ఱూఁత లూఁగ
రతినైపుణము చూచి నుతియించువిధమున మణిమయకాంచికింకిణులు మొరయ
గళవల్లకీవాదగతులకు నటియించుకరణి బింకపుఁజన్నుఁగవ నటింప
చెమటతొల్కరివానచే నంకురించుకందళములభంగి లేనగవు మొనప
మానికంబునఁ బుట్టినమదచకోర, నేత్ర పుంభావమునఁ దననేర్పు చూప
సౌఖ్యజలరాశిఁ దేలుచుఁ జతురసీతి, బంధముల వీడుదోడాడెఁ బార్థివుండు.

162


క.

సైనికులు నిట్లు మణిభవ, మానవతులఁ గూడిమాడి మదనక్రీడల్
నానావిధములఁ జూపుచు, నానందముతోడ నుండు నాసమయమునన్.

163


క.

జక్కవలకు రవి యిఁకఁ బ్రా, గ్దిక్కుధరం బెక్కు ననుచుఁ దెలియఁ ద్రివాచన్
నిక్కము చేసిన తెఱఁగునఁ, గొక్కొక్కోరుతుల గోడి కూయఁ దొడంగెన్.

164


వార్ధకము దాల్పఁగా యామవతికి దృష్టి, పాటవము దప్పె ననఁగ నుత్పలకదంబ
ములసొబగు దప్పి పలితంబు మొనపె ననఁగ, మఘవదిగ్భాగమునఁ బాండిమంబు మొనసె.

165


సీ.

పాంథమానసములుఁ బ్రాలేయకరకాంతశిలలు నుపద్రవంబులఁ దొలంగె
విశ్వంభరారుహవిటపాగ్రములు రథాంగద్వంద్వములు వియోగంబు విడిచె
విహరమాణచకోరవిహగసంఘము సమస్తపదార్థములు విభక్తంబు లయ్యె
పాకశాసనదిశాభాగంబు గాయకకంఠంబు లలితరాగమునఁ బొదలె
మదనకేలీవిరామరామాజనంబు, భానుమత్కిరణములు నంబరపరిగ్ర
హంబు గావించె గృహదీపికాంకురములు, కౌశికంబులు దుర్దశాగతి వహించె.

166


చ.

వసువు చకోరయాచకులవాంఛలు దీఱఁగ నిచ్చి చెల్లినన్
విసువుచు దాఁగె నస్తపృథివీధరసీమ ననంగఁ దాల్మి పెం
పు సడలి రాత్రి పుష్పిణిఁ గుముద్వతిఁ గూడి విశుద్ధిమజ్జనం
బు సలుపఁ బశ్చిమాంబుధికిఁ బోయె ననంగ విధుండు గ్రుంకినన్.

167


క.

హరిహయదిగ్గిరిపై ము, మ్మరముగ నిగిరిచినగుజ్జుమామిడిమోకం
బురుడింప లోచనోత్సవ, కరకరములతోడఁ బ్రొద్దు కరకరఁ బొడిచెన్.

168


క.

ఇలఁ గలకొలఁకులవిరిద, మ్ములమీఁదఁ బ్రభాతకాలమున గంధవహం
బులు వీవఁ దూలుపుప్పొడి, వలె బాలాతపము లన్నివంకలఁ బర్వెన్.

169


క.

కొలఁకుల జలరక్తాక్షత, ముల నర్ఘ్యాంజలులు రవికి మును లీ నలినీ
లలనయు నిచ్చినగతి జల, జల మధుకేసరము లంబుజంబులఁ దొరిగెన్.

170


క.

తల లెత్తి సూర్యకాంత, స్థలములపై గంధవాహసహచరకీలం
బులు జలజవనీహితునకు, నిలావిలాసిని నివాళి యిచ్చె ననంగన్.

171

వ.

అంతకుమున్న దుర్జయమహీకాంతుండు సమయోచితరాగంబుల నిజవిజయాంకి
తంబు లయినగీతంబులు మంగళగాయకులు పాడ వదనసౌభాగ్యంబు మ్రుచ్చిలింప
వచ్చినయిందుబింబం బనంగ బింబాధర ధరియించిన మెఱుంగుటద్దంబు గనుం
గొనుచు మేల్కాంచె నని వరాహదేవుండు చెప్పిన విని యిలావిలాసిని తరువాతి
వృత్తాంతం బానతిమ్మని విన్నవించిన.

172


శా.

పుంగ్రామణ్యవతంస వైష్ణవకథాపూతాత్మ సంత్రాసకృ
త్సంగ్రామాంగణపాండవార్జున భుజస్తంభానికుంభీనసా
లంగ్రస్తాఖిలమత్తశాత్రవనృపాలప్రాణవాతూల సా
యంగావస్థరవిచ్ఛవిస్తనవి లేపాబ్చేత్రణాలింగితా.

173


క.

తుళ్వకులజలధికల్పక, సాళ్వశ్రీనారసింహజనపాలస్ప
ర్థాళ్విభకంఠీరవ మణి, గాళ్వతులాకోటిరుచివికస్వరచరణా.

174


భుజంగప్రయాతము.

సఖీభూతదోశ్చాపసంవర్తవేళా
శిఖావత్సమిద్ధప్రసిద్ధప్రతాపా
మఖోద్ధారణస్ఫూర్తిమారారిశోటీ
రఖేలద్ద్యగంగాతరంగాభకీర్తీ.

175

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంట నాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ జతుర్థాశ్వాసము.