వరాహపురాణము
నవమాశ్వాసము
క. |
శ్రీవనితావరభావన, పావనితాంతఃకరణ కృపానిత్యవినా
భావనితాంతబలాఢ్య ప, రావనితాపకర యీశ్వరాధిపునరసా.
| 1
|
వ. |
అవధరింపు మవ్వరాహదేవుండు వసుధ కి ట్లనియె నట్లు సత్యతపోముని దూర్వా
సువలన విచిత్రం బైనధరణీవ్రతచరిత్రంబు విని ధన్యుండ నైతినని తదనుమతంబున
హిమగిరిపరిసరంబునకుం జని పుష్పభద్రాభిధానధునీకనకసౌగంధికగంధబంధుర
మంథరగంధవాహసమాగమంబుల భద్రనామధేయవటవినిద్రచ్ఛాయావిభ్రమంబులఁ
జిత్రాహ్వయశిలాస్థలవిశ్రమంబుల జననజ్ఞా నిదాఘపరిశ్రమంబు నడంచునొక్క
పుణ్యాశ్రమంబునఁ బరబ్రహ్మ విద్యానుసంధానపరుండై నిలిచె నతనిచరితంబు
లత్యద్భుతభరితంబు లవి మీఁదట నెఱింగించెద.
| 2
|
క. |
అనిన విని ధరణి వినయం, బునఁ గల్పసహస్రములకు మునుపట నేఁ జే
సీనయీసువ్రతము దలం, పునఁ బడియె భవత్ప్రసాదమున జగదీశా.
| 3
|
గీ. |
నాఁడు దనకుఁ బద్మనాభవ్రతము చెప్పి, తీర్థయాత్ర పోయి తిరిగి వచ్చి
నపు డగస్త్యు నేమి యడిగె భద్రాశ్వుఁ డ, మ్మౌని యేమి పలికె నానతిమ్ము.
| 4
|
మ. |
అనినం గైతవపోత్రి ధాత్రి కను వింధ్యారాతి యేతెంచినం
దనయిల్లాండ్రునుఁ దాను నేమమున నానాపూజనల్ చేసి నూ
తనరత్నాసనమధ్యసీమమున నధ్యాసీనుఁ గావించి మె
ల్లన భద్రాశ్వనృపాలపుంగవుఁడు ఫాలన్యస్తహస్తాబ్జుఁడై.
| 5
|
క. |
స్వామి యేసత్కర్మము, చే మోక్షప్రాభవంబు సిద్దించును మూ
ర్తామూర్తప్రతిపత్తుల, నేమిట శోకంబు లుడుగు నెఱిఁగింపు మనన్.
| 6
|
గీ. |
ధరణినాథ మోక్షధర్మాఖ్య మైన యీ, ప్రశ్న మడుగఁ జెప్ప బ్రహ్మ కైన
నలవి గాదు చేరువై యుండు దవ్వగుఁ, గాన వచ్చి యుండుఁ గానరాదు.
| 7
|
మ. |
అశుభధ్వంసక మిందుకుం దగునుపాఖ్యానంబు నేఁ జెప్పెదన్
విశదీభూతము గాఁగ రేయిఁ బగ లుర్వీముఖ్యభూతావళుల్
దిశ లద్రుల్ జలధుల్ దినేశవిధులున్ లేకుండుకాలంబునన్
బశుపాలుం డనురాజు దాఁ బశువులన్ బ్రఖ్యాతిఁ బాలింపుచున్.
| 8
|
క. |
వేడుక నొకనాఁ డంబుధి, చూడం జని కుపితహరికిశోరచపేటా
మ్రేడితకరిఘీంకార, వ్రీడితసంవర్తఘనము వేలావనమున్.
| 9
|
సీ. |
విస్మయం బంది ప్రవేశించుచోఁ గొన్నిపాముల నెనిమిదిపాదపముల
నొకమహానదిఁ దిర్యగూర్ధ్వప్రచారుల నేగురుపురుషుల నినసహస్ర
దేదీప్యమానంబు ద్రిప్రకారము త్రివర్ణాధారయుక్తంబు నధికతరవి
శాలంబు నైనవక్షముతోడిచపలాక్షి నొకతెను జూచుచు నొంటిఁ దిరుగు
చుండ నివి యిన్నియును భీతి నొక్కటై వి, నాశమునఁ బొందె నంత నానరవరుండు
దొంగలకుఁ జిక్కి తింక నేభంగి నాకు, విడుద లౌ నని చింతించువేళ నెదుట.
| 10
|
క. |
ఎక్కడ వోయెద వింకం, జిక్కితి గా కనుచుఁ గృష్ణసితరక్తతనుం
డొక్కఁ డెదిరె వానివలన, నొక్కఁడు మహదాహ్వయమున నుదయమునొందెన్.
| 11
|
క. |
వారిద్దఱు నారమణిని, రా రమ్మని సన్న చేసి రయమున ముగురుం
జేరి పశుపాలు నొక్కనిఁ, గ్రూరతఁ బైకొనిరి మఱియుఁ గొందఱు పురుషుల్.
| 12
|
చ. |
వడి నరికట్టుకొన్న జనవల్లభుఁ డంబుదపఙ్క్తు చేతిలోఁ
బడినహిమాంశుమండలముభంగిఁ దిరోహితుఁ డయ్యెఁ జోరు ల
ప్పుడు బెడిదంపుఁ గైదువులు పూని పరస్పరలీను లైనచోఁ
బొడమె నృపాలుగేహము నభోమణికోటివిభాసమాన మై.
| 13
|
మ. |
మఱియుం గోటులసంఖ్యలై ధవళసద్మంబుల్ విచిత్రంబుగా
నెఱి చూపె న్మరుదంబువహ్నివియదన్వీతంబు లాయిండ్లలో
మెఱుఁగుంబోఁడి వసించె నోర్తు బహుకుంభీబింబితార్కాకృతిన్
నఱకెం దద్గృహమస్తకంబులు మహీనాథుండు శీఘ్రంబునన్.
| 14
|
క. |
ఆపశుపాలనృపాలుభు, జాపాటవమును సమీకజయము మజ బళీ
బా పని త్రివర్ణపురుషుం, డాపోవక పొగడె సవినయాలాపములన్.
| 15
|
క. |
వెఱపింపఁ బోయి వెఱచిన, తెఱఁగున నే మేమ చిక్కితిమి నీచే నిం
దఱమును బరమేశ్వర యి, త్తఱి నీదేహమున నుండెదము పుత్రులమై.
| 16
|
వ. |
అనినఁ బశుపాలనృపాలుండు కృపాళుండై కర్ణామృతంబు లైనవచనంబులఁ దత్త్రి
వర్ణపురుషు నాదరించి వత్సా భవత్సాహాయ్యంబునం గదా నిర్లేపుండ నగుట
|
|
|
తెగుటకుం బొడముటకు నిలుచుటకు నీవ కర్తవై వర్తింపు మని నియోగించి నిజాత్మ
జత్వంబును బ్రసాదించి వారిలో వారిలోనితామరపాకుచందంబున నేమిటం
బొరయక తిరుగుచుండె నంతటఁ ద్రివర్ణపురుషుండు మహత్తను పేరిటివానిఁ దన
వంటిపట్టి నొకనిం బుట్టించె నతనివలన బోధస్వరూపిణి యైనకన్యక జన్మించె
నాలలనవలన విజ్ఞాననిగమం బైనమనంబు జనించె నమ్మనంబువలన నతిసౌమ్యు
లేవురు పురుషులు సంభవించిరి వారివలన నక్షాభిధాను లుద్భవించిరి వీర లిద్దఱు
మున్ను పశుపాలు నాక్రమించినచోరులు తారు నిరాకారు లైన బహుద్వారంబు
నేకస్తంభాధారంబును జతుష్పదోదారంబును నదీసహస్రవిహారంబు ననేకజల
కూపాలంకారంబు నగుపురంబుం బ్రవేశించి యొకస్వరూపం బగుటయుఁ దత్క్షణంబ
పశుపాలుండు మూర్తిమంతుండై పురంబు ప్రవేశించి సూక్తవాక్యంబు లైనవేదం
బులు సంస్మరించి తదుక్తవ్రతాదికృత్యంబు లాచరించి కర్మకాండంబు నడపి జడి
సినకతంబున.
| 17
|
క. |
అలయికతో నిద్రకుఁ బడి, తలలు భుజాస్తంభములుఁ బదంబులు వేదం
బులు నాలుగేసి కలమె, చ్చులబంగారంబువంటిసుతునిం గనియెన్.
| 18
|
క. |
అది మొద లాపశుపాలుఁడు| మదవత్కరివరశిరస్సమారూఢుండై
యుదధివనతృణాదికములఁ, జెదరక విహరించెఁ బశువశీకరలీలన్.
| 19
|
ఉ. |
భద్రాశ్వక్షితిపాల చెప్పితి భవత్ప్రశ్నానురూపంబుగా
రుద్రాంభోరుహగర్భముఖ్యులకు వాక్రువ్వంగ రా కద్బుతో
న్నిద్రం బైనమహేతిహాస మిదియే నీయందు నాయందు స
ర్వద్రవ్యంబులయందు నొక్కసరియై వర్తించు నూహించినన్.
| 20
|
సీ. |
విను మింక సంభూతవివరంబు పశుపాలువలనఁ బుట్టినచతుర్వక్త్రుఁ డఖిల
వేదశాస్త్రగురుండు వెడలెఁ దత్తనువున స్వరనామధేయుండు సప్తమూర్తి
పూరుషార్థములు తత్ప్రోక్తంబు లందులో మొదటిది నాల్గుకొమ్ములవృషభము
రెండవ దర్థ మాదండది కామ మీమూడును లయ మైన మోక్ష మనఁగఁ
బరఁగె నాసప్తతనునిప్రభావ మెఱుఁగఁ, దలఁపు గలవారు వర్తింపవలయు వరుస
బ్రహ్మచారిత్వమున ధర్మపరత భృత్య, భరణమున సోహమస్మి యన్ భావమునను.
| 21
|
వ. |
మఱియు నాచతుర్ముఖుండు నిజాపత్యంబు లైననిత్యానిత్యస్వరూపంబుల సప్తస్వ
రంబులం జూచి పితృపుత్రపుత్రుండు పితామహనామధేయుం డగు నని వేదంబులు
చెప్పు నిప్పుడు మాతండ్రిమాహాత్మ్యగుణంబులలోన నొక్కటియు మత్తనూజుల
వలనం గానరాదు నాదురంతచింత వాయునుపాయంబు లే దని తమతండ్రిం
|
|
|
దలంప నాక్షణంబ కర్మసాక్షి లక్షదుర్నిరీక్షం బైనకౌక్షేయకంబు సాక్షాత్కరిం
చినం గైకొని రూక్షకటాక్షేక్షణుం డై సమక్షస్థితస్వరంబుశిరంబు ఖండించిన
నది నారికేళఫలాకారంబునుం బ్రధానబృహదశధావృతంబునై విజృంభించినం గని
కృపాణంబునం దిలప్రమాణంబుగా నఱకిన దశాంశోనం బయ్యు నహంకరించె
నదియునుం దునిమినం బదియవపాలు నిల్చి యేన భూతాది నని పలుక నలుక నేఁ
బది రెండవభాగంబు చిక్కం జక్కడంచె నదియు స్వావకాశఃస్వావకాశ యని
మ్రోయ రోయక వ్రేయుటయుం బదియవభాగంబు శేషించి కంపయామి యని
ఘోషింప రోషంబున నదియును విదళించిన సౌమ్యంబు సూక్ష్మంబు నైనతేజంబు
గానంబడియె నదియు మథియింపం దదనంతరంబ.
| 22
|
గీ. |
భూరుహంబు పొరలు పొరలుగఁ జెక్కినఁ, గాన వచ్చు చేవకరణిఁ గానఁ
బడియె నప్పుడు పశుపాలుండు ద్రసరేణు, మూర్తితోడ సుతుఁడు మోదమంద.
| 23
|
క. |
ధరణీనాయక యేత, త్స్వరము శరీరప్రవృత్తి తచ్ఛిరము నివృ
త్తి రహస్య మీకథ చరా, చరసృష్టికి మొదలు బోధసంపద నొసఁగున్.
| 24
|
మహాస్రగ్ధర. |
అనినం భద్రాశ్వుఁ డాసంయమిపతికి మహాత్మా పరిజ్ఞాన మేదే
వునిఁ గొల్వం గల్గు నీజీవుల కనుడుఁ జతుర్వ్యూహుఁ బక్షీంద్రవాహున్
వనజాక్షుం గొల్వ భయార్ణవతరణి పరిజ్ఞానసౌఖ్యంబు లబ్బున్
జననాథోత్తంస యీప్రశ్నమునకు నితిహాసం బెఱిఁగింతు నీకున్.
| 25
|
సీ. |
భవదూరపథమునఁ బరమభాగవతులమూఁకలు నడపించు మొత్తగాఁడు
ప్రోడయై నూఱుతంత్రులవీణ వాయించు సరిలేనిజగజెట్టిజంత్రగాఁడు
పూసిగొండితనానఁ బోయి యెవ్వరి కైన గొడవలు గావించుకొండెగాఁడు
గానప్రభావాఢ్యు లైనతుంబురుపర్వతులతోడికూరిమిచెలిమికాఁడు
ప్రబలసంసార మనులేమి బడలి తన్ను, వేఁడువారల కెల్లను విష్ణుభక్తి
సారదీనారదుఁడు తనుచ్ఛవిగుళుచ్ఛ, ధుతశరన్నారదుఁడు నారదుండు మున్ను.
| 26
|
క. |
మానససరోవరమునకుఁ, దానం బాడంగఁ బోయి దరహాసవికా
సాననయానవిలాసధు, రానతసారసల నప్సరసలం గనియెన్.
| 27
|
శా. |
ఆరామామణు లందఱున్ మహతికాయల్ మంజుశింజానతం
త్రీరావంబులచే నిజస్తనములన్ దీపింప లీలాగతిన్
జేరన్ వచ్చి మునీంద్ర మాకు నెపుడు జేతోభవుం గన్నయొ
య్యారిన్ శౌరి వరించువేడుకలు మల్లాడున్ మనోవీథులన్.
| 28
|
గీ. |
అబ్బునే మాకు నీకోరి కనినఁ బడుచు, లార ప్రాయంపుమదమున మీరు నాకు
మ్రొక్క నైతిరి యీదోస మొక్కజాడ, వెఱచిపాఱెడు మురహరస్మరణమునను.
| 29
|
క. |
ఇప్పుడు మీకుం జెప్పెద, నప్పురుషోత్తముఁడు వరదుఁడై మిము నొకరిం
దప్పక వివాహ మగుటకుఁ, జొప్పడినమహావ్రతంబు సులభము గాఁగన్.
| 30
|
వ. |
సకలసుమనోవికాసమయంబును మదనవిదళితమానినీసమయంబు నైనవసంతసమయం
బున విరహిజనవిపక్షం బైన శుక్లపక్షంబున ద్వాదశీదివసంబున నుపవసించి మరంద
బిందునిష్యందశీతలం బైనపుష్పమంటపతలంబునఁ బరిస్తృతవిచిత్రవస్త్రాకల్పం బైన
తల్పంబున వెండిం జేసినపుండరీకాక్షు లక్ష్మీయుతంబుగా నిలిపి షోడశోపచారంబు
లు సలిపి మనోభవాయ నమో యని శిరంబును ననంతాయ నమో యని కటీరంబును
గామాయ నమో యని బాహుమూలంబులుం గుసుమస్త్రాయ నమో యని యుద
రంబును మన్మథాయ నమో యని పాదంబులు హరయే నమో యని సర్వావయ
వంబులుం బూజించి పిదప నిక్షుదండంబులు నాలు గద్దేవునినలుదిక్కులం బెట్టి
ప్రదక్షిణపూర్వకంబుగా మ్రొక్కి హృద్యంబు లైననృత్తగీతవాద్యంబుల జాగర
ణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబున నధీతవేదవేదాంగుండును సం
పూర్ణసకలాంగుండును విష్ణుభక్తిభాసురుండును నైనభూసురునకుం దత్ప్రతిమ
దానం బిచ్చి భోజనడక్షిణాదికంబుల బ్రాహ్మణులం దృప్తులం జేసినం గేశవుండు
మీకు నధినాయకుం డగు నిది యిట్లుండె మీరు నాకు నుద్దండంబున దండంబు
వెట్టనికతంబునఁ గొండొకకాలంబున నేతత్సరోవరతీరంబునం దపంబు సలుపు
నతివిశిష్టు నష్టావక్రమహామునిం బరిహసించి తచ్చాపంబున గోపాలబాలికలై భూ
లోకంబున మదనగోపాలునికిం గళత్రంబులు గాఁగల రని హరిభక్తివిశారదుండు
నారదుం డానతిచ్చి చనియె నయ్యచ్చర లట్ల కావించి కృతార్థలయి రిది యనంత
ద్వాదశీవ్రతంబు.
| 31
|
సీ. |
భద్రాశ్వభూప శుభవ్రతం బే నీకుఁ జెప్పెద విను మార్గశీర్షశుక్ల
పక్షంబునం బ్రతిపత్తిథి మొదలు దశమిదాఁక నేకభుక్తమును జరపి
నాఁటిమధ్యాహ్నంబునం గేశవుని భక్తిఁ బూజించి తా నొక్కప్రొద్దు చేసి
ధరణివ్రతంబుచందమున సంకల్పోపవాసంబు లొనరించి ద్వాదశిదిన
మునను గేశవనామమునను సువర్ణ, సహితతిలపాత్రదానంబు సలుపవలయుఁ
గృష్ణపక్షంబుదినముల నిట్లు నడపి, దాన మీఁ దగుఁ గృష్ణాభిధానమునను.
| 32
|
మ. |
అవనీనాయక యిట్టు లాశ్వయుజమాసాంతంబుగా నేకభు
క్తవిధుల్ సల్పుచుఁ జైత్రమాసము మొదల్గా నాల్గుమాసాలు స
|
|
|
క్తువుపాత్రంబును శ్రావణాదికములందున్ శాకపాత్రంబు వి
ప్రవరశ్రేణికి నిచ్చి కార్తికమునం బ్రాగ్వద్విధానంబునన్.
| 33
|
వ. |
శుక్లపక్షంబునం బాడ్యమి మొదలుగా నేకభుక్తంబు సలిపి దశమినాఁడు నేమం
బున మాసనామంబున హరిం బూజించి యేకాదశీదినంబున నుపవసించి సర్వబీజ
సమన్వితంబును బాతాళకులపర్వతాంకితంబునుంగా యథాశక్తి సువర్ణంబునం జేసిన
మహిప్రతిమ సితవస్త్రయుగళంబునం బొదిగి హరిపురోభాగంబున నిలిపి పంచ
రత్నంబుల నర్చించి జాగరణంబు చేసి మఱునాఁడు సూర్యోదయావసరంబున
నేకవింశతిమహీసురులకు నొక్కొక్కధేనువును నొక్కొక్కపచ్చడంబును నొ
క్కొక్కగ్రామంబునుం గుండలాంగుళీయకగ్రైవేయకసహితంబుగా నుత్తముం
డొసంగవలయు మధ్యముండు గ్రామవిరహితంబుగాఁ దక్కినవన్నియు నీవలయు
నంతకంటెను దరిద్రుండు యథాశక్తి భూవస్త్రభూషణచ్ఛత్రపాదుకాదులు సమర్పిం
పవలయు దామోదర ప్రీతో భవ తని భూప్రతిమాదానం బిచ్చి షడ్రసాహారంబుల
బ్రాహ్మణసంతర్పణంబు గావింపవలయు నేతద్వ్రతమాహాత్యంబు వర్ణింప శక్యంబు
గాదు మేదినీశ్వరా యిమ్మహావ్రతంబునకుఁ దగినయితిహాసంబు చెప్పెద.
| 34
|
క. |
నందనులు లేక మున్ను ఫ, లందనుఁ డనురాజు విధివలన నీవ్రత మా
నందంబున విని చేయఁ బు, రందరవంద్యుండు శౌరి ప్రత్యక్షంబై.
| 35
|
మ. |
వినతుం డైననృపాలపుంగవుఁ గృపాన్వీతేక్షణాబ్జంబులన్
గని నీకు న్వర మిత్తు వేఁడు మనఁ బ్రఖ్యాతుం జతుర్వేదవే
ది నసంఖ్యాతవసున్ జిదాత్మకు సుతున్ దేహావసానంబునం
దనకున్ మోక్షము వేఁడఁగా నొసఁగి యంతర్థానముం బొందినన్.
| 36
|
క. |
ఉత్సాహంబున నాభూ, భృత్సామజుఁ డోలలాడి ప్రియసతివలనన్
వత్సరములోనఁ గనియెను, వత్సప్రియనామధేయు వరసుతు నొకనిన్.
| 37
|
ఉ. |
ఆతనయుం గ్రమోపగతయౌవనుఁ బట్టము గట్టి విశ్వధా
త్రీతల మెల్ల నేలు మని దీవన లిచ్చి ఫలందునుండు ల
క్షీతరుణీమనోహరు భజింపఁ దలంచి విరక్తుఁడై పురా
రాతియనుంగుమామశిఖరంబున కేగి తపంబు చేయుచున్.
| 38
|
లయగ్రాహి. |
అక్షరపురుష్టుతయథోక్షజనిరాకృతిరణక్షుభితకేశిముఖరాక్షసపయోజా
తేక్షణ జగత్రితయరక్షక జనార్దన సులక్షణ ఖలప్రకరశిక్షక సమస్తా
ఘక్షయకరస్మరణ కుక్షిగతలోక విజితాక్ష నిజభక్తసురవృక్ష మునిదేతా
ధ్యక్షమత భాస్కరవళక్షకరబింబశతలక్షసమభాభరిత పక్షివరవాహా.
| 39
|
క. |
స్పష్ట్యర్థము మీనకమఠ, ఘృష్ట్యాదిశరీరములు ధరించితి వింతే
దృష్ట్యాలక్ష్యమె కరుణా, వృష్ట్యంబుద నీదురూపు వివరింపంగన్.
| 40
|
క్షురికాబంధము
క. |
శ్రీహరి హరిహయనుత మహి
మాహిత హిమధామభానుమండలనయనా
నాహృదయములో నిలువు స
మాహితకృప నెప్పుడున్ మహాహిపశయనా.
| 41
|
చ. |
అనుచు ననేకభంగుల మహామమహీజముక్రింద నుండి సు
స్వనశుకశారికల్ ఫలరసంబులు గ్రోలక ధారణాబలం
బునఁ దనవెంబడిం జదువ ముమ్మరమై పులకాంకురావలుల్
తనువున మీఱ బాష్పసలిలంబులు గాఱ నుతింపుచుండఁగన్.
| 42
|
సీ. |
బ్రహ్మ మధ్యస్థుఁడై పరికింపఁ గుండలీశ్వరుఁ క్రిందు పఱచినశాబ్దికుండు
బలిహరణపువేళఁ బ్రాపించువిబుధుల నరయుసంపన్నగృహస్థవరుఁడు
ధరకుఁ దా నొకరుండ దానపాత్ర మనంగ మఖము లీడేరించుమంత్రమయుఁడు
వేదవేదాంగాదివిద్యలలోనన పుట్టి పెరిఁగినట్టి గట్టియోగ్యుఁ
డతులసాత్వికవర్తనుం డాత్మపాద, తీర్థములు చల్లుకొనెడికృతార్థతతికి
జాహ్నవీస్నానపఫలము లీఁ జాలు పరమ, పావనుం డొకమఱుగుజ్జుబ్రాహ్మణుండు.
| 43
|
ఉ. |
వచ్చుటయున్ ఫలందనుఁడు వారిజనాభుఁడె మాయదారియై
యిచ్చటి కేగుదెంచె నని యిచ్చఁ దలంచి నమస్కరింప వై
యచ్చరకామినీకరనఖాంకురలూనవిలోలపల్లవా
త్యుచ్చతరామ్రభూరుహము దోఁచె రయంబున జానుదఘ్నమై.
| 44
|
గీ. |
అది గనుంగొని భూపాలుఁ డద్భుతమున, వేయు నేటికి నితఁడె నారాయణుండు
నిక్కువం బని చాఁగిలి మ్రొక్కి దేవ, చూపు నీరూపు నా కింక దాఁప కనిన.
| 45
|
సీ. |
గడితంపునీర్కావిమడుగుదోవతి కటీరస్ఫురత్పీతాంబరంబు
కురుమట్ట మగునూఁతకోల ధగద్ధగత్కౌమోదకీగదోత్తమము గాఁగ
జలము నిండినకమండలము ఘనస్వనాడంబరకంబురాజంబు గాఁగ
గుత్తంపువట్రువగొడుగు పరాక్రమక్రమనిదర్శనసుదర్శనము గాఁగ
స్వస్తిఫణితుల దీవింపఁ జాఁపుకరము, సకలకామితవరదహస్తంబు గాఁగ
సరసిజాక్షుండు కరుణ సాక్షాత్కరించి, రాజ వేడుము వలయు వరంబు లనిన.
| 46
|
క. |
జలధిసుతాధిప నీకృప, గలిగిన సజ్జనుల కిజ్జగంబులు దలఁపం
దిలమాత్రము గాన వరం, బులు దక్కిన వడుగ నొల్ల మోక్షము దక్కన్.
| 47
|
ఉ. |
నావుడు నట్ల కాక జననాయక యేఁ జనుదేర నిమ్మహా
మ్రావనిజంబు కుబ్జతరమై కనుపట్టుట నింతనుండి యి
ప్పావనతీర్థరాజము ప్రభావము చూపుచుఁ గుబ్జకామ్రముం
ధావధమున్ వహించుఁ బ్రథితంబుగ విశ్వవసుంధరాస్థలిన్.
| 48
|
గీ. |
ఇచట జంతులలోపల నెద్ది యైనఁ, బెద్దనిద్రకు మ్రాఁగన్ను వెట్టెనేని
దాని కబ్బు విమానశతంబు గొలువ, బ్రహ్మయోగీంద్రలోకసామ్రాజ్యపదము.
| 49
|
క. |
అని పలికి శౌరి శంఖం, బున దేహము దిగ్గ విడిచి పోవుటయు ఫలం
దనునకు నప్పుడె మోక్షం, బొనఁగూడె మహామునీంద్రు లోహో యనఁగన్.
| 50
|
క. |
ప్రఖ్యాతకుబ్జకామ్రో, పాఖ్యాన మినోదయమునఁ బఠియింప వినన్
ముఖ్యంబు లైనయిహపర, సౌఖ్యంబులు గలుగు నెట్టిజనులకు నైనన్.
| 51
|
వ. |
కావున మహానుభావుం డగునద్దేవు నీవును భజియింపు మనశ్వరభద్రంబులు గలుగు
భద్రాశ్వనరేశ్వరా యింక ధన్యవ్రతంబు వినుము మార్గశీర్షాదిమాసచతుష్టయంబున
నుభయపక్షంబులం బాడ్యమినాఁటిరాత్రి రాత్రించరారాతి నారాధించి వైశ్వా
నరాయ నమో యని పాదంబులు నగ్నయే నమో యని యుదరంబును హవిర్భుజే
నమో యని వక్షంబును ద్రవిణదాయ నమో యని భుజంబులు సంవర్తాయ నమో
యని శిరంబును జ్వలనాయ నమో యని సర్వావయవంబులుం బూజించి తద్దేవు
నగ్రభాగంబున నిర్మించినకుండంబున నేతన్నామంబులన హోమంబు చేసి ఘృత
యుక్తం బైనయవభక్తంబున నక్తంబులు సలుపవలయుఁ జైత్రాదిమాసచతుష్షయం
బున నట్ల పూజాహోమాదులు సలిపి సఘృతపాయసంబున నక్తంబు సలుపవలయు
శ్రావణాదిమాసచతుష్టయంబున సక్తున నక్తంబు సలుపవలయు వ్రతసమాప్తిసమ
యంబున యథాశక్తి హాటకంబునం జేసినకృపీటయోనిప్రతిమ వస్త్రద్వయం
బునం బొదిగి రక్తపుష్పానులేపనంబులం బూజించి సలక్షణమనోహరాంగుం
డగువిప్రపుంగవు రక్తవస్త్రయుగపుష్పానులేపనాదుల శృంగారించి ధన్యోస
యనుమంత్రంబున దానం బిచ్చినధన్యునకు దుష్కర్మంబు లడంగి పుష్కల
ధనధాన్యాదిసమృద్ధులు సిద్ధించు నేతద్వ్రతాచరణంబున మున్ను నారదునకు
శూద్రత్వంబు మానె నీకథ వినిన చదివినవారలు ధన్యు లగుదురు మహీకాంత
యింకఁ గాంతివ్రతంబు వినుము.
| 52
|
సీ. |
కార్తికశుక్లపక్షద్వితీయారాత్రి బలకేశవుల మంటపమున నిలిపి
బలదేవుపేరిటఁ బాదపద్మంబులు శౌరినామంబున జానువులుఁ బ్ర
లంబఘ్ననామధేయంబునఁ గటియుఁ గేశినిషూదనాహ్వయంబున నురంబు
కంఠభాగంబు సంకర్షణాఖ్య మహాభుజస్తంభములు శార్ఙ్గిసంజ్ఞ శిరము
|
|
|
కేశవాహ్వ శరీరప్రదేశ మెల్ల, వాసుదేవాభిధానాన వరుసతోడ
నంగములఁ బూజ చేసి తదగ్రసీమ, రజతనిర్మితవైష్ణవప్రతిమ నిలిపి.
| 53
|
మ. |
ప్రసవాద్యంబులచే నమో స్త్వమృతరూపా యంచుఁ బూజించి వే
దసమర్థుం డగువిప్రపుంగవునకుం దానంబుగా నిచ్చి గం
ధసమేతంబుగ నర్ఘ్య మిచ్చి యవభక్తంబున్ ఘృతవ్యక్తమున్
వసుధానిర్జరు లారగింప వ్రతియై నక్తంబు చేయం దగున్.
| 54
|
సీ. |
కడమమాసము లిట్ల కావించి ఫాల్గునాదికమాసములు నెన్మిదింట నర్చ
నార్ఘ్యపాద్యాదికృత్యములు నిర్వర్తించి నక్తంబు పాయసాన్నమున జరపి
యవలహోమము కార్తికాదికంబుల రాజనములహోమము ఫాల్గునప్రభృతుల
సతిలాన్నహోమ మాషాఢముఖ్యంబుల సల్పుచు నొక్కవత్సరము నిండ
వెండిసోముని నిర్మించి వెల్లవస్త్ర, యుగళమునఁ జుట్టి చంద్రఖండోపమాను
లేపనాదుల ధాత్రీనిలింపవిభుని, భూషితునిఁ జేసి నియమితభాషణముల.
| 55
|
వ. |
కాంతిమానస్మిన్ లోకేస్మి న్ననుమంత్రంబున దానం బొసంగుసువ్రతుండు కాంతి
మంతుం డగు దక్షశాపంబున రాజయక్ష్మపరిక్షీణగాత్రుం డగునత్రిపుత్రుండు ము
న్నీమహావ్రతంబు సలిపి కదా గదాధరునికరుణావిశేషంబున నమృతకళ వడసి
సోమత్వంబునం బొంది శర్వరీసమయంబుల వెలుంగుచు సర్వౌషధిసార్వభౌమత
వహించె నిట్టిసోమునికళ విదియనాఁ డాస్వాదించునాశ్వినేయులు ముఖ్యపక్షం
బున విష్ణువిఖ్యాతి వహింపుదురు వార యేల యీలోకంబున విష్ణువిరహితం బైన
దైవతంబు లేదు మేదినీశ్వరా యింక మగవారలకు మగువలకు సకలసౌభాగ్యం
బులు నొసంగుపరమసౌభాగ్యవ్రతంబు వినుము.
| 56
|
క. |
వెడఁగుఁదనంబున నీళ్ళ, న్నడు మడఁచిన రెండు గానినలువున బలిభి
న్మృడు లెందు వేఱు గారని, విడువనివేలంబు చాటు వేదాంతంబుల్.
| 57
|
సీ. |
కలశపారావారకన్యకామణి నాఁగఁ గమ్మదమ్మి వసించుగట్టుపట్టి
వడఁకుగుబ్బలిరాచవారికుమారి నా సింగంబు నెక్కెడుసింధుతనయ
ఱెక్కలబొల్లని నెక్కువే ల్పన శేషశయ్యపైఁ బవళించుచంద్రధరుఁడు
బుడుతవెన్నెలపూవు ముడుచుదేవుఁ డనంగ వాతాశనాహితవాహుఁ డిట్లు
గా వనెడివారివేదముల్ గారువేద, ములు మతంబు లసమ్మతంబులు పురాణ
ములును గాథాపురాణముల్ దలఁపఁ గృతులు, వికృతులని గేలిగొందురు విమలమతులు.
| 58
|
సీ. |
అటు గాన నీరహస్య మెఱింగి ఫాల్గునప్రభృతిమాసోభయపక్షములఁ ద
దియనాఁ డుపవసించి నియమంబుతో నుమాహరుల నైనను రమాహరుల నైన
|
|
|
నావహించి పదద్వయంబు గంభీరాఖ్యం గటితటి సుభగాహ్వఁ గడుపు దేవ
దేవాహ్వయంబునఁ ద్రిణయనసంజ్ఞ నాననము వాచస్పతినామధేయ
మున శిరము రుద్రనామకమున సమస్త, తనువుఁ బూజించి తత్పురస్థలమునందుఁ
దేనెయును గోఘృతంబును దిలలు మేళ, వించి సౌభాగ్యపతయే యటంచు వేల్చి.
| 59
|
క. |
క్షారము రసమునుఁ జమురునుఁ, గోరంతయు నాసపడక గోధూమమయా
హారములఁ జేయవలయుం, బారణ ధరణితలంబె పళ్ళెము గాఁగన్.
| 60
|
గీ. |
యావకోదన మాషాఢ మాది యైన, నెలలు నాల్గింటఁ గార్తికాదులను మూటఁ
జామయిగిరికఁ బారణఁ జలిపి మాఘ, శుక్లపక్షతృతీయ వచ్చుటయు నాఁడు.
| 61
|
శా. |
క్ష్మానాథోత్తమ పార్వతీగిరిశులం గానీ రమావిష్ణులం
గానీ యోపినపాటిబంగరువునం గావించి నేమంబునం
దానం బీఁ దగు దేనె నేయి గుడుముం దైలంబు సాముద్రమున్
ధేనుక్షీరము నున్నపాత్రములతో దేవద్వయప్రీతిగన్.
| 62
|
క. |
ఈసువ్రతంబు నియతిం, జేసిన మగవారి కైనఁ జెలువల కైనన్
శ్రీసౌభాగ్యంబు లనా, యాసంబున సంభవించు నంటవు భవముల్.
| 63
|
వ. |
వాంఛితసఫలతాలతావితానోపఘ్నంబును సకలకలుషోపన్నంబు నైనవిఘ్నవ్రతం
బు వినిపించెద ఫాల్గునంబు మొద లైననాల్గుమాసంబులం జవితిచవితిని నియతుం
డై శూరవీరగజాననలంబోదరైకదంష్ట్రాధానంబులం జతుర్యంతంబుగా వినా
యకునిం బూజించి తిలాన్నంబున హోమంబు సలిపి నక్తంబు గావించి మఱు
నాఁడు పారణయుం జేయవలయు నైదవమాసంబున యథాశక్తి భర్మనిర్మితవినా
యకప్రతిమం బాయసతిలపూరితపంచపాత్రంబులతోడం గూడ దానం బొసంగవల
యు నిమ్మహావ్రతంబు నడిపినపుణ్యులకు నిరంతరంబును నిరంతరాయంబున మనో
రథంబులు సిద్ధించు.
| 64
|
సీ. |
మున్ను దేవేంద్రుండు మ్రుచ్చిలించినయజ్ఞతురగంబు సగరభూవరుఁడు గనియె
నాకసంబునఁ బాఱురాకాసులపురాలు ఫాలలోచనుఁ డవలీల గెలిచె
పతగేంద్రుఁ డమరపాలితసుధాకలశంబు సాధించి తల్లిదాస్యంబు మాన్పె
నేను నభ్రంకషం బైనవారిధి నిమిషంబులో నాపోశనంబు గొంటి
మఱియు నాదిమరాజులు మత్తవెరి, రాజి ఘోరాజిపీమఁ బరాజితంబు
చేసి నిష్కంటకంబుగా నాసముద్ర, భూమి యేలిరి యీనోము నోమి కాదె.
| 65
|
క. |
క్షితినాయక విను శాంతి, వ్రత మిఁకఁ గార్తికము మొదలు వర్షావధిగాఁ
బ్రతిశుక్లపక్షపంచమి, నతినియమముతోడ రాత్రి హరి నహిళయనున్.
| 66
|
సీ. |
భక్తి నారాధించి పదము లనంతాయ యంచు వాసుకి నే యటంచుఁ బిఱుఁదు
తక్షకాయ యటంచుఁ గుక్షిభాగంబు వక్షస్స్థలి కర్కోటకాయ యంచు
పద్మాయ యని గ్రీవ బాహుశాఖలు మహాపద్మాయ యని శంఖపాలకాయ
యని మోము గుళికాయ యని మస్తకంబును బూజించి వ్రతకర్త పులుసు చొరక
యుండ నక్తంబు చేసి పండ్రెండునెలలు, నిండ నోపినపాటిపసిండిచేత
నురగములఁ జేసి విప్రుల కొసఁగ మాను, సర్వభయము లఘంబులు శాంతిఁ బొందు.
| 67
|
వ. |
భద్రాశ్వమానవేశ్వరా యింకఁ గుమారవ్రతం బెఱింగించెద మాఘమాసంబు మొ
దలుకొని ప్రతిశుక్లపక్షంబునం బంచమినాఁ డేకభుక్తంబు చేసి షష్ఠినాఁడు నిష్టా
పరత్వంబున నారాయుణుం బ్రతిష్ఠించి షడ్వక్త్రకృత్తికాసుతసేనానికార్తికగుహ
కుమారస్కందనామఁబులఁ బూజించి హోమంబు గావించి ఫలాహారంబునం దద్దివ
సంబు గడపి సప్తమినాఁడు శుద్ధోదనంబున భూసురసహితంబుగాఁ బారణ
చేయుచు నొక్కసంవత్సరంబు నిండిన యథాశక్తి కార్తస్వరనిర్మితకార్తికేయ
మూర్తిని సర్వేకామాస్సమృద్ధ్యంతా మనుమంత్రంబున సయుగ్మకంబుగా దానం
బొసంగి యిష్టాన్నంబుల విప్రుల సంతృప్తులం జేసినవారికిం గోరికలు ఫలించు.
| 68
|
క. |
మున్ను నలచక్రవర్తి వి, పన్నత ఋతుపర్ణునింటఁ బ్రచ్ఛన్నుండై
యిన్నోము నోమి సుమ్మీ, తన్ను జగము పొగడ మగుడ ధారుణి యేలెన్.
| 69
|
శా. |
ఆరోగ్యవ్రత మింకఁ జెప్పెద నృపాలా మాఘమాసంబునం
బ్రారంభించి ధృఢవ్రతుల్ నెలనెల బక్షద్వయిన్ షష్ఠి నా
హారాస్వాదన మాచరించి మఱునాఁ డత్యంతశుద్ధాత్ములై
మారామారమణస్వరూపు రవి నామ్నాయత్రయీవందితున్.
| 70
|
గీ. |
నవ్యవేదిపైని రవిసనాతనప్ర, భాకరాదిత్యభాస్కరభానుసూర్య
నామములు చెప్పి పూజించి నాఁటి కుపవ, సించి మఱునాఁడు పారణ చేయవలయు.
| 71
|
క. |
ఈవిధమున నొకవర్షము, గావించినవారి కెల్లఁ గలుగు ధనారో
గ్యావాప్తు లిహంబునఁ బున, రావృత్తులు లేనిమోక్ష మబ్బుం బిదపన్.
| 72
|
మ. |
అనవద్మ్యాత్మక యిందుకుఁ దగునుపాఖ్యానంబు వర్ణింతు ము
న్ననరణ్యుం డనురాజు రోషశిఖిదగ్ధారివ్రజారణ్యుఁడై
వనజాప్తేందుకులక్షితీశ్వరులు సేవల్ చేయఁగా దీవు లే
డునుఁ బాలింపుచు నశ్వమేధమఖకోటుల్ సల్పె నత్యున్నతిన్.
| 73
|
ఉ. |
క్ష్మానుతుఁ డొక్కనాఁ డతఁడు మానసనామసరోవరంబునం
దానము చేయఁగా నరిగి తారకమధ్యగతేందులీల నా
|
|
|
నానలినవ్రజాంతరమునన్ వికసించినతెల్లదమ్మిలో
భానుసమాను నుంగుటముపాటిప్రమాణమువాని నొక్కనిన్.
| 74
|
మత్తకోకిల. |
కాంచి యెంతయుఁ గౌతుకంబునఁ గర్ణికామణిపీఠిపైఁ
గాంచనంబు హసించుకొంచెపుఁగాయమున్ భుజయుగ్మమున్
మించుమానిసితోడి యీసితనీరజంబు ధరించి నే
సంచరించెదఁ గొంచు రమ్మని సారథి న్నియమించినన్.
| 75
|
గీ. |
వాఁడు నరదంబు డిగ్గి దేవరకుఁ బసిఁడి, గుబ్బ వెట్టిన దెలిపట్టుగొడుగులీల
మెఱయ నాళంబుతోడనె పెఱికి తెత్తు, జలరుహం బంచు నావేల్పుకొలను చొచ్చి.
| 76
|
చ. |
కలశపయోధికన్యకయొ గాదు పుమాకృతి దాల్చెఁ గావునన్
నలువయొ కాఁడు వక్త్రములు నాలుగువంకల లేవు గావునన్
జలజహితుఁడొ కాఁడు రథసప్తహయంబులు లేవు గావునం
దలఁపఁగ నిట్టిసూక్ష్మతనుధారణ మీవెలిదమ్మిజాడయో.
| 77
|
మానిని. |
అంచు మనంబున నద్భుత మందుచు నాసరసీరుహ మంటినఁ గో
పించి ఘనాఘనభీకరగర్జల పెంపు నడంచెడు పెన్రవళిన్
గొంచెపుమానిసి కొంచ కదల్చిన గొబ్బున సారథి గూలఁగ వీ
క్షించి నృపాలుఁడు చేష్టలు దక్కి మషీసమదేహరుచి న్నిలువన్.
| 78
|
గీ. |
మురిసి మురిసి రాలె మునివ్రేళ్ళు నడుముక్కు, చదుకఁబడియెఁ జీము జాలుకొనియెఁ
దనువుమీఁద ముసరె దొనకొన నీఁగలు, వేగిరం బై పెద్దరోగమునను.
| 79
|
క. |
కుష్ఠం బీగతిఁ బట్ట గ, రిష్ఠమనోవ్యధల నాధరిత్రీరమణ
శ్రేష్ఠుఁ డచ్చట నిలిచి వ, సిష్ఠుఁడు చనుదేర మ్రొక్కి చేతులు మోడ్చెన్.
| 80
|
సీ. |
అమ్మునిపుంగవుం డాశ్చర్యపడి ముహీపాలక యిట్టిపాపఁపురోగ
మదరిపా టెట్లు ని న్నావరించె నటన్న నారాజు నైజకృత్యంబు చెప్ప
కటకటా యేల పోకడమాలి బ్రహోద్భవం బనుపేరిదివ్యాంబుజమున
కెగ్గు దలంచితి వెట్టకేలకుఁ గాని పొడగానరాదు వేల్పులకు నైన
శారదాధీశుప్రాగవస్థాశరీర, మధివసించినయీధవళాంబురుహము
నేను బనివడి దర్శింప నేగుదెంతుఁ, గాని నిచ్చలు వెదికియు గానలేను.
| 81
|
వ. |
కైవల్యసామ్రాజ్యధవళాతపత్రం బైనయీబ్రహ్మోద్భవశతపత్రంబు మానససరోవర
మధ్యంబున నాఱునెలలకు నొకమాఱు గానవచ్చు నని పెద్దలు చెప్పుదురు విన్న
వారలే కాని కన్నవారలు లేరు భాగ్యవశంబునం జక్షుగ్గోచరం బయ్యెనేని నాక్ష
ణంబ జలంబునఁ గ్రుంకినవారు మోక్షలక్ష్మికి నధ్యక్షు లగుదురు సర్వదేవతాశ్రయం
|
|
|
బైనయిమ్మహాకుశేశయంబు పరమపురుషవరశయం బగుటకు నసంశయంబు భూ
వల్లభా దీని నపహరింపం దలంచినయపరాధంబున నీదృగ్విధవ్యాధిబాధితుండవైతి
వింతియకాని యేతదరవిందసందర్శనంబునం గృతార్థుండ వైతివి రోగంబు వేగంబ
పాయునుపాయంబు విను మని మునిపుంగవుం డారోగ్యవ్రతం బుపదేశించినం
జేసి రాజవరేణ్యుం డనరణ్యుండు భాస్కరుని కారుణ్యంబున నగణ్యలావణ్య
గేహం బగుదేహంబు వడసె నింకఁ బుత్రవ్రతంబు వినుము.
| 82
|
క. |
నృప శ్రావణకృష్ణాష్టమి, నుపవాసం బుండి వారిజోదరుఁ బూజిం
చి పిదపఁ దిలహోమము చే, సి పారణ హవిష్యమునన చేయఁగవలయున్.
| 83
|
గీ. |
మాసములు పద్నొకం డీక్రమమున నడిపి, మీఁద నాషాఢకృష్ణాష్టమిదినమున
వ్రతి యథాశక్తిఁ గాంచనరచిత మైన, కృష్ణమూర్తిద్వయము దాన మిచ్చెనేని.
| 84
|
క. |
ఇద్ధరణిఁ బుత్రపౌత్రస, మృద్ధులు భువనప్రసిద్ధు లిహపరసుఖముల్
సిద్ధించు నిందుకుం దగ, బద్ధస్పృహతోడ విను ముపాఖ్యానంబున్.
| 85
|
శా. |
సహ్యాపత్యము సూరసేనుఁ డనువిశ్వక్ష్మావధూభర్త మున్
వాహ్యాళీగతి సర్వదిఙ్ముఖములన్ సాధించియున్ సంగర
ద్రుహ్యద్వైరులఁ గీటడంచియును బుత్త్రు ల్లేనియీసౌఖ్య మ
గ్రాహ్యం బంచుఁ దపంబు చేయ నరిగెం బ్రాలేయపుంగొండకున్.
| 86
|
క. |
అరిగి తదగ్రస్థలమునఁ, బెరిఁగినగహనంబులోన భీకరమృగముల్
మరిగి చరింప భవాంబుధి, తరి గిరిశు నుమాసమేతుఁ దలఁపుచు నుండన్.
| 87
|
సీ. |
మిన్నులపైఁ బాఱు వెల్లి ముత్యపుజల్లి చలువలబచ్చు చెంగలువకచ్చు
పుఱియలచౌకీలు పొలు పైనతడపాలు పన్నగవిసరము బన్నసరము
ఒలుకులబూది క్రొవ్వలపులజవ్వాది వేలిమిమెకము పిసాళిశుకము
చాఱలరెంటెంబు సన్నంపుగింటెంబు భానుపండులచాలు పసిఁడినూలు
జమునిశిరమును మణినూపురమును మెఱయ, మురువుగలిగినతొడుకువావురము నెక్కి
కరుణ నయనాంబుజంబులఁ గడలుకొనఁగ, నెదుటఁ గనుపట్టె నర్ధనారీశ్వరుండు.
| 88
|
క. |
అప్పుడు మది నానందము, ముప్పిరిగొన నమక చమక ముఖమంత్రంబుల్
చెప్పుచు మ్రొక్కుడు భూవరు, నప్పర మేశ్వరుఁడు వరము లడుగు మటన్నన్.
| 89
|
మ. |
సుతుల వేఁడిన నాసుధాకరకళాచూడుండు కృష్ణాష్టమీ
వ్రత మాద్యంతము నాన తిచ్చి చనియెన్ రాజన్యుఁడున్ భక్తిసం
గతిఁ జేసెన్ దనకూర్మిరాణివలనన్ గాంచెన్ జతుర్లోకస
న్నుతవిశ్రాణనచాతురీదివిజధేనున్ వీరసేనున్ సుతున్.
| 90
|
సీ. |
అవనీశ వినుము శౌర్యవ్రతం బిఁక నాశ్వయుజశుద్ధసప్తమి నొక్కప్రొద్దు
చేసి సంకల్పంబు చెప్పి తిలాన్న మష్టమి నారగించి నవమిఁ జరాచ
రస్వరూపిణి మహాప్రభ మహామాయ మహాభాగ దుర్గాంబ నావహించి
వ్రతి షోడశోపచారంబులు సలిపి బ్రాహ్మణభోజనంబు సేమమునఁ బెట్టి
తాను బిష్టాశనముఁ గొని తప్ప కిట్ల, యేఁడు గడపి యథాశక్తి హేమవస్త్ర
ములఁ గుమారీజనంబులఁ బూజ చేసి, పడయు విద్యాపరాక్రమప్రాభవములు.
| 91
|
వ. |
మఱియు నతిసుకరంబులుం జతుర్విధపురుషార్థకరంబులు నైనసువ్రతంబులం
జెప్పెదఁ గార్తికమాసంబు మొదలుకొని సంవత్సరంబుదాఁకఁ బ్రతిశుక్లపక్షదశమి
దిగ్రూపుం బురాణపురుషుఁ బురుషోత్తము నారాధించి రాత్రిసమయంబున సర్వా
హవే ష్వవధ్యత్వం మమ జన్మని జన్మని యనుమంత్రంబున సర్వదిఙ్ముఖంబుల శుద్దబలి
చల్లి పీతవస్త్రకుసుమంబుల విప్రవర్గంబు నలంకరించి దధ్యన్నంబు మున్నుగా
నిష్టాన్నంబుల నక్తంబులు సలిపి సంవత్సరంబు నిండిన నోపినపాటిపసిండి నిర్మించిన
దిక్ప్రతిమల దానం బొసంగిన నమేయసంపత్సమృద్ధియు దిగ్విజయంబునుం గలుగు
నిది సార్వభౌమవ్రతంబు రాజర్షభా మార్గశీర్షమాసంబు మొదలుకొని వర్షపర్యంతంబు
ప్రతిశుక్లపక్షంబున నేకాదశితిథిం గుబేరస్వరూపు శౌరి నారాధించి రాత్రి నక్తంబు
చేసి వ్రతాంతంబునం గుబేరప్రతిమాదానంబు చేసిన సంపత్పరంపరావాప్తి యగు
నిది ధనదవ్రతంబు తన్మాసంబున మొదలుకొని సంవత్సరంబుదాఁక నుభయపక్షం
బుల నేకాదశి నుపవసించి పంచశరగురుం బూజించి ద్వాదశినాఁడు పారణ సలిపి
కడపట విష్ణుప్రతిమ దానం బొసంగిన సకలపాపనిర్ముక్తుం డగు నిది వైష్ణవవ్రతంబు
ఫాల్గునమాసంబు మొదలుకొని సంవత్సరపర్యంతంబు ప్రతిశుక్లపక్షంబునం ద్రయో
దశినాఁడు ధర్మస్వరూపు మాధవు నారాధించి రాత్రి నక్తంబు సలిపి కడపట
ధర్మప్రతిమాదానం బొసంగ సకలధర్మంబులు సిద్ధించు నిది ధర్మవ్రతంబు మాఘ
మాసంబు మొదలుకొని సంవత్సరంబుదాఁకఁ బ్రతిశుక్లపక్షంబునఁ జతుర్దశినాఁ
డుపవసించి రుద్రస్వరూపు సముద్రశాయి నారాధించి మఱునాడు పారణ చేసి .
కడపట రుద్రప్రతిమ దానం బొసంగిన ననశ్వరం బగునైశ్వర్యంబు సంభవించు
నిది రుద్రవ్రతంబు తన్మాసంబు మొదలుకొని సంవత్సరంబుదాఁక పున్నమపున్నమ
వెన్నెలఱేనిరూపుం గైకొన్న వెన్నుని నర్ఘ్యాదులం బూజించి నక్తంబు చేసి
యేఁడు నిండినవెనుకం గనకనిర్మితసోమప్రతిమాదానంబు చేసినం గాంతిమంతు
లగుదు రిది సోమవ్రతంబు నరేశ్వరా ప్రతిమాసంబున నమావాస్యనాడు పితృదేవ
తల నారాధించినం బైతృకవ్రతంబు.
| 92
|
క. |
ఈనోములలో నొక్కటి, యే నియతిం జేయువారి కెన లే దనినన్
మానవనాయక యిఁకఁ బది, యేనుం జేసిన ఫలంబు లేమని చెప్పన్.
| 93
|
మ. |
అని వాతాపిహరుండు చెప్ప విని భద్రాశ్వుండు ముద్రాద్భుతం
బును సంతోషముఁ జేయుపూర్వచరితంబుల్ సృష్టిలో మీరు చూ
చినవైనన్ మఱి విన్న వైన జలరాశిప్రాశనా చెప్పు మ
న్నన నన్నన్ మునిరాజశేఖరుఁడు నానావైఖరీమౌఖరిన్.
| 94
|
క. |
అద్భుతము లనిన సకలజ, గద్భరితుఁడు శౌరికథల కా కిలఁ గలవే
చిద్భాసురుండు బ్రహ్మస, ముద్భూతుఁడు నారదుండు ము న్నొకవేళన్.
| 95
|
శా. |
శ్వేతద్వీపము చూడఁ బోయి యెదుటన్ శ్రీవత్సవత్సాఢ్యులన్
శాతాస్యంబుజశంఖచక్రకరులన్ దాపింఛరింఛోళిజీ
మూతచ్ఛాయశరీరులన్ వికసితాంభోజాతులన్ బల్వురన్
జేతోజాతగురూపమాకృతులఁ జూచెన్ జూచి సాశ్చర్యుఁడై.
| 96
|
క. |
వీరలలో నారాయణు, నేరీతి నెఱుంగువాఁడ నే నని సలిపెన్
శౌరి గుఱియించి తప మతి, ధీరతమై బహుసహస్రదివ్యాబ్దంబుల్.
| 97
|
శా. |
అంత న్వారిధికన్యకావిభుఁడు ప్రత్యక్షత్వముం బొంది నీ
వెంతేఘోరతపంబు చేసితి మునీ యేరోరికల్ గోరి పొం
దింతుం జెప్పుము తత్సమిహిత మనన్ దేవా భవన్మాయ స
ర్వాంతర్వ్యాపిని నాకుఁ జూపు కృపతో నన్నం బ్రసన్నాస్యుఁడై.
| 98
|
గీ. |
మునికులాగ్రణి యీనీట మునుఁగు మన్న, మునిఁగి లేచినమాత్రలో మోహనాంగి
కాశిభూపాలకునికూర్మికన్య చారు, మతి యనెడుపేరఁ బుట్టెఁ గ్రమక్రమమున.
| 99
|
క. |
కొప్పును రోమావళియుం, గ ప్పెక్కెను మోవిఁ బాదకమలంబులఁ గెం
పుప్పతిలెఁ బిఱుఁదుఁ గుచములు, నప్పడఁతికి మిగులఁ బొదలె యౌవన మైనన్.
| 100
|
సీ. |
వదరుమాటలు గాక వచ్చునే సరిచేయఁ గిన్నరకాయ లీచన్నుఁగవకు
పూదెమాటలు గాక పొసఁగునే సరిచేయ బంగార మీనిర్మలాంగమునకు
పూఁతమాటలు గాక పోలునే సరిచేయఁ గర్పూర మీతనూగంధమునకు
జల్లిమాటలు గాక చెల్లునే సరిచేయ సవరంబు లీకేశజాలమునకు
ననుచుఁ దనవిలాసంబును జనులు వొగడఁ, జక్కఁదన మెల్ల నొకరాశి కెక్కె ననఁగ
రతీమనోహరభాగ్యదేవతయ వోలె, బాలికామణి కన్నులపండు వయ్యె.
| 101
|
క. |
ఆసతిఁ గాశినృపాలకుఁ, డౌసీనరపతికి సిబికి నర్పించుటయున్
వాసంతసమయకుసుమిత, వాసంతీమంటపముల వారు రమింపన్.
| 102
|
గీ. |
వరుస నగ్నజిత్తి వప్రజిత్తి విచిత్తి, చారువక్త్రచిత్రసంజ్ఞు లయిన
కొడుకు లేవు రధికగుణులు బలాఢ్యులు, శస్త్రశాస్త్రవిదులు జనన మైరి.
| 103
|
వ. |
వారు వైరిదుర్వారులై పెరుఁగుచు హరునకుం బంచముఖంబులరీతి మరునకుం బంచ
శిలీముఖంబులభాతిఁ బురందరునకుఁ బంచతరువులకరణి శరీరంబులకుం బంచప్రా
ణంబులసరణిఁ బెక్కుచందంబులం దనకు నానందంబు చేయ నమేయవైభవం
బెక్క నొక్కనాఁడు దిక్కులు గ్రక్కదల జయపటహంబు చఱపించి సముద్దండ
వైరిమండలిమీఁద దండు వెడలి భండనంబు సలుపుట విని కాశిరాజు గజరాజులు
గొలువ నల్లునకుం దోడు చని సంగరంబున జామాతృదౌహిత్రవర్గంబులతో వీరస్వ
ర్గంబు చేకొనుటయుం జారుమతి శోకభీరుమతియై తలంపున.
| 104
|
క. |
సతికిఁ బతి దప్పినప్పుడు, సుతు లరయం గర్త లట్టిసుతులుఁ బొలిసినం
బిత కర్త యిపుడు నాకుం, బతిసుతపితృహీన కగ్నిపా లగు టొప్పున్.
| 105
|
క. |
అని నిశ్చయించి సాద పే, ర్చి నిజేశున్ సుతులఁ దండ్రిఁ జేర్చి హుతాశం
బొనగూర్చి తాను దఱియన్, వనితారూపంబు మాని నారదుఁ డగుచున్.
| 106
|
క. |
కలగంటినొ బ్రమసితినో, జలజేక్షణుమాయయో నిజంబో యని త
జ్జలమధ్యంబున మిక్కిలి, వెలవెల నగుమౌనిఁ జూచి వికవిక నగియెన్.
| 107
|
శా. |
ఆనారాయణువక్త్రగహ్వరములో నంభోజగర్భుండు నా
నానాకౌకసులు న్నిశాటవరసేనానాథులున్ మర్త్యులున్
భానుండున్ హిమధాముఁడుం దపసులుం బాతాళభూముఖ్యలో
కానీకంబులు నాదిగాఁ గలుగుదృశ్యం బెల్లఁ గాన్పించినన్.
| 108
|
శా. |
ఆసర్వేశ్వరు విశ్వరూపమున కత్యాశ్చర్యుఁడై హర్షబా
ష్పాసారంబుల మేనిపైఁ బులకసస్యం బుచ్చి నర్తింపుచున్
గాసారప్రభవాసనాత్మజుఁడు రంగత్తుంగగంగాతరం
గాసంకోచమహార్భటీసహచరవ్యాహారతారధ్వనిన్.
| 109
|
దండకము. |
శ్రీమజ్జగన్నాథ లక్ష్మీమనోనాథ ఖేలన్నిజామేయమాయాసమాక్రాంతదిక
క్ర చక్రాసికౌమోదకీశార్ఙ్గదోస్తంభ జంభారిముఖ్యామరస్తుత్య నిత్యం బనిత్యం బని
త్యంబు నిత్యంబు నౌ నీమహామాయకృత్యంబునన్ దేవ నీదివ్యదేహంబులోఁ బెక్కు
బ్రహ్మాండముల్ వాహినీశప్రవాహంబులో బుద్బుదశ్రేణిచందంబునన్ హెచ్చు
విచ్చుం బ్రపంచంబు నీగర్భగోళంబునం గంటి ముక్కంటివై బ్రహ్మవై నీవ వర్తింతు
గాయత్రి నీమూర్తిపాదంబులన్ శారదాభర్త కుక్షిన్ హుతాశిన్ భుజాగ్రంబులన్
|
|
|
రుద్రు నున్నిద్రనేత్రంబులన్ మిత్రునిం బంకజామిత్రునిం జూచుచున్నాఁడఁ
గన్నాఁడొకో యెవ్వఁడే నిట్టినీమూర్తి లోకత్రయవ్యాప్త రక్షస్తమిస్రావళీఘస్ర
సాహస్ర జన్మాగతబ్రహ్మవిద్యాపరీపాకజానందమే నీ వనన్ విందు ముం దబ్ధిమ
ధ్యంబునన్ నీవు మీనంబవై కావవైతే చతుర్వేదసంఘంబు తాఁబేలవై తేలవైతే
మహాశైలమున్ మోచియున్ లీలఁ గోలమ్మవై చిమ్మవైతే వడిన్ మీఁదికిం గల్పవా
రాశిమజ్జన్మహీమండలంబున్ నృసింహుండవై చెండవైతే సముద్దండదైతేయునిం
బొట్టివై మెట్టవైతే బలిన్ రేణుకాదేవికిం బట్టివై పుట్టవైతే మహాపట్టభద్రేశులన్
గొట్టివైవన్ రఘుక్ష్మాపవంశంబులో దిట్టవై కట్టవైతే దరుల్ ముట్టఁ బెన్నీటి రామాభి
ధేయుండవై యుండవైతే సదా రేవతీతుంగవక్షోజపీఠంబుపై బోడపై చూడవైతే
పురాధ్యక్షరక్షోవధూశీలభంగంబులన్ మావవై కావవైతే జగం బుద్ధత మ్లేచ్ఛులం
జంపి దేవా భవత్ప్రాభవం బాభవాంభోజగర్భాదు లంతంబుగా నెన్నలే రన్న
నే నెంతవాఁడం బ్రశంసింప నాభక్తి గైకొమ్ము ముక్తిం గృపాయుక్తిమై నిమ్మటం
చున్ బ్రణామంబు గావించినన్ బద్మనాభుండు నే మెచ్చితి న్మౌనినాథా వరం
బిచ్చెదన్ వేఁడు మన్నన్.
| 110
|
సీ. |
ఇందిరాధిప నాకు నింక నొక్కవిచిత్రరూపవిలాసంబు చూపు మనిన
తాపసోత్తమ నన్నుఁ దప్పక యించుకవడిఁ జూడు మన మౌనివరుఁడు నట్ల
చూడంగ నద్దేవచూడావతంసంబువిశ్రుతాననమున వెడలె నీరు
తజ్జలంబులు భూతధాత్రి యంతయుఁ గ్రోల నేకోదకం బయ్యె నింతలోనె
దహన ముదయించి క్రోలెఁ దద్బహుళజలము, ననిలము జనించి తద్వహ్ని నాఱవిసరె
పవనము నడించి పెనుబట్ట బయలు దోఁచెఁ, దన్నభంబున నొక్కశబ్దంబు వొడమె.
| 111
|
క. |
పరతత్త్వరాజుముందట, మొరయునకీబులవిధాన మ్రోయుచు నుండెన్
ధరణి సలిలానలానిల, భరవిరహితశుద్ధశూన్యభావమె నిలువన్.
| 112
|
గీ. |
కటకటా సృష్టి చీఁకట్లు గవిసె నింది, రాధవుఁడు సైతమును గానరాకపోయె
ననుచు బ్రహ్మాండభాండమధ్యమున బ్రమసి, తిరిగి నారదముని మొగ తిరిగె నపుడు.
| 113
|
క. |
వినవచ్చె శబ్దము రవం, బున విసరె మరుత్తు గాడుపున వెలిఁగె హుతా
శన మనలంబునఁ బ్రవహిం, చె నీరు సలిలమున నొక్కచెలువ జనించెన్.
| 114
|
వ. |
కుంభినీధరకుచకుంభయుగళయు రత్నాకరమేఖలయు దూర్వాశ్యామలయు నగు
నత్తామరకంటి తొంటియట్ల దిశామండలంబు నిండె మఱియు మెరయుశబ్దంబు
వలన సితకృష్ణవర్ణ లిద్దఱుముద్దియలు వెడలిరి వెండియు మెండుకొనుశబ్దంబువలన
శరదబ్దరుచిస్ఫూర్తియు సప్తమూర్తియు నగుపురుషుండు సంభవించె నప్పటి
|
|
|
విప్పగుశబ్దంబువలన రెండుమేనులు నాఱుమోములుం బండ్రెండుచరణంబులుం గల
నరుం డొక్కరుం డవతరించె నతనివలన సంపన్నం బైనదాంపత్యం బహోరాత్రం
బనం బరంగె నిప్పగిది నెప్పటియట్ల ఱెప్ప పెట్టినయంతలోనన కానవచ్చునచ్చ
రాచరంబునకు నచ్చెరు వంది వందిచందంబున నరవిందభవనందనుండు గోవిందు
నందంద పరమానందంబున వినుతించి పరమపురుష నిమిషంబునన యిజ్జగం బెక్కడ
నడంగె నెక్కడం బొడమె నానతి మ్మని విన్నవించినఁ బ్రసన్నుండై వెన్నుం
డన్నారదు విలోకించి తత్వంబులు పరమయోగులచిత్తంబుల నడంగుభంగి మదీయ
సంధాసమాధిసమయంబున జగంబులు నాయందు డిందు నది మర్త్యామర్త్యప్రళ
యంబు బ్రహ్మ రాత్రి నిద్రించువేళ నాకు జపసమయం బది యోగిక్లేశసంక్షయం
బగుమధ్యమలయం బనం బరఁగు బ్రహ్మకు వత్సరంబులు నూఱు నిండిన మహాప్రళ
యం బది ముక్తికాలంబు బ్రహ్మకు నొక్కయేఁడు నా కొక్కనాఁడు మునీంద్రా
మున్ను నన్ను సప్తజనంబులనుండి యారాధించినాఁడవు గావున సంధ్యారూపం
బున నతిరహస్యం బగు నామాయ నీకుం జూపితి నింతియకాని నాకు నొక్కసం
ధ్యయు నుపాస్యంబు లేదు సకలదైవతంబులు నాయందుఁ బొడము నడంగు నేన
శైవవైష్ణవకాపాలికాదిమతంబులవారిచేతం బూజ గొందు నీవు నావిరూపంబున
బహుసహస్రవర్షంబు లనుభవించిన సంసారంబునుం జరాచరసృష్టిసంహారంబును
నేకక్షణంబున నే చూపితి నమేయమదీయమాయావృతులై బ్రహ్మపుత్రాసుత్రా
మాదిదేవత లవిరతద్వంద్వపరాయణత్వంబునం గామక్రోధబాధితు లగుదు రిట్టి
నామాయావిహారం బెఱిఁగిన పురుషుండు పరుషతరసంసారం బనుకడలి వెడలి కడ
లేనికైవల్యం బనుభవించు ననిన మునివర్యుండు సాశ్చర్యుండై.
| 115
|
సీ. |
నారాయణా నిన్ను నాల్గుజాతులవారు నేరీతి భజియింతు రెఱుఁగ నాన
తిమ్మన్నను గృపాసమేతుఁడై దేవుండు ద్విజులకుఁ బురుషసూక్తజపనియతి
భజియింపఁ దగుఁ దజ్జపం బలబ్ధం బైనఁ బాంచరాత్రమతప్రపంచమున భ
జింపంగఁ దగుఁ జెవిఁ జేర్పఁగాఁ గాదు శూద్రజనంబునకుఁ బాంచరాత్రమతము
నూట వేయింట నొకఁడు పుణ్యుండు గలిగె, నేని వానికి సిద్ధించు నీమతంబు
వానిహృదయంబులో నుందు వనధికన్య, చన్నుఁగవ నుండుకంటెను సమ్మదమున.
| 116
|
క. |
కావున నీమతమునఁ గా, నీ వేదప్రోక్తయజ్ఞనిర్మితిఁ గానీ
సేవించి నన్నుఁ గందురు, దైవతములు గాన లేరు తక్కినజాడన్.
| 117
|
గీ. |
అనుచు వచియించి దుర్లభం బైనపాంచరాత్రశాస్త్రంబునకుఁ బ్రవర్తకుఁడు గాఁగ
నారదు ననుగ్రహించి లక్ష్మీరమణుఁ డ, దృశ్యుఁ డయ్యె మునీంద్రుండు దివికి నరిగె.
| 118
|
మ. |
అని కుంభోద్భవుఁ డంబుజోదరునిమాయావిభ్రమాయామమున్
ఘననిధ్వానగభీరవైఖరుల వక్కాణింప నాద్యంతమున్
విని భద్రాశ్వనృపాలుఁ డద్భుతరసోన్నిద్రాంతరంగాంబుజా
తనిరాఘాటకుతూహలప్రకటనోద్దామాంగరోమాంచుఁడై.
| 119
|
క. |
లోపాముద్రానాయక, శ్రీపతి నారదమునీంద్రశేఖరునెదుటం
జూపినరూపము లెట్టివి, యో పోలఁగఁ జెప్పు మన్న నూకొని మునియున్.
| 120
|
గీ. |
ధవళకృష్ణవర్ణతనువులు గలిగిన, సతులు సత్య మన నసత్య మనఁగఁ
దగినవారు సప్తతనువులపురుషుండు, సాగరము సుమ్ము జనవరేణ్య.
| 121
|
గీ. |
రెండునిజదేహములును బండ్రెండుచరణ, ములును షడ్వక్త్రములు గలపురుషుఁ డాతఁ
డయనములు రెండునెలలు రెండార్లు ఋతువు, లాఱు గలిగినవత్సరం బనఁగఁ బరఁగు.
| 122
|
వ. |
ఇది నీ వడిగినప్రశ్నంబునకు నుత్తరంబు దురంతం బైనసంసారపారావారంబు
నారాయణుం గొల్చి కాని దాటరాదు కావున నీవు నద్దేవుని సేవింపు మనిన భద్రా
శ్వుండు మునీశ్వరా విశ్వంభరునిమహిమ నీవలన వినినకతంబునఁ గృతార్థుండ
నైతి నింక యుగచతుష్టయధర్మంబులు వర్ణాచారంబులు సంక్షేపంబునం దెలుపు
మనినఁ గుంభసంభవుం డిట్లనియె నాదియుగంబున నాదితేయదైతేయులు వేద
చోదితమఖప్రతిపాదకులై మేదిని యేలుదురు త్రేతాయుగంబున మర్త్యులు నమ
ర్త్యులు నిట్లె వర్తిల్లుదురు కృతత్రేతలు సాత్వికసమేతలు రాజసవ్యాపారం బగు
ద్వాపరంబున ధర్మపుత్రుం డనుమహారాజు తేజోవిజృంభణంబునఁ గుంభిని యేలం
గలవాఁడు తమోబహుళం బగుకలియుగంబున భూసురులు దోసంబున కోసరిం
పక వేదమార్గపరిత్యాగంబును నగమ్యాగమనానురాగంబును గన్యావిక్రయవ్యవ
హారంబును నసత్యవ్యాపారంబును మొదలైనదురాచారంబుల మెలంగుదు రాకా
రణంబున దరిద్రులై శూద్రాదులు సేవింపుదురు బాహుజులు ధనలాభలోభంబున
బ్రాహ్మణాదిహింసకు రోయక పాయక దురితంబులు చేయుదురు కోమట్లు తాకట్లు
దక్కం దిరిగియు ధారణ దరపియు బేరసారంబులయెడఁ దఱగ మొఱఁగు చేసియు
నదనంబుగా ధనంబు గూడఁబెట్టి యీఁగకుం గాటీక పామునకుం బలి పెట్టక రట్టు
నకుం దిట్టునకు నొడిగట్టుకొని కట్టిఁడులై పొట్టలు పోసికొందురు శూద్రులు పట్ట
భద్రులై ధనగర్వంబున సర్వవర్ణంబులు ధిక్కరింపుదురు మఱియును.
| 123
|
సీ. |
కామతత్పరవృత్తిఁ గాఁ గానిపని పూని వర్తింతు రెప్పుడు వావి దప్పి
క్రోధించి సూక్ష్మాపరాధంబునకు నైనఁ గావింతు రెప్పుడు జీవహింస
లోభులై బహువిత్తలాభంబు లాసించి హరియింతు రెప్పుడు పరధనంబు
|
|
|
మోహపాశంబున ముడివడ్డకతమునఁ దిరుగుదు రెప్పుడు దెలివిమాలి
మదముచే ధిక్కరింతురు మాన్యజనుల, మచ్చరమె కాని తలఁపరు మంచితనము
దోసముల కెల్లఁ దామె నివాస మగుచు, హెచ్చుదురు ధాత్రిఁ గలివేళ నెల్లజనులు.
| 124
|
క. |
ఆలము విప్రులు చేయఁగ, హాలికులై రాజు లడఁగ నంత్యజులు బెహా
రాలాడం గష్టపుఁగలి, కాలంబున వర్తనములు గత్తరఁ గలయున్.
| 125
|
చ. |
పుడమి సమస్తవర్ణములపొల్తులు నీలువు దప్పి లంజెలై
పడిచి గడింతు రర్థములు బ్రాహ్మణభూవరవైశ్యజాతిచే
నుడిగము గొంచు గర్వమున నుందురు శూద్రులు సత్యశౌచముల్
పొడవఁడగుం గలిం బరసిపోవు మహత్త్వము దేవకోటికిన్.
| 126
|
ఉ. |
ఈగతిఁ జెప్పితిన్ వసుమతీశ చతుర్యుగవర్తనం బగ
న్యూగమనంబునందుఁ బరిహారము చెప్పెద నింక బ్రాహ్మణ
స్త్రీ గమియింప రాజునకుఁ జెల్లదు కోమటి రాకుమారిసం
యోగము చేయరాదు కడు నొప్పుదు శూద్రుఁడు వైశ్యఁ బొందఁగన్.
| 127
|
గీ. |
బ్రాహ్మణుఁడు నాల్గుజాతుల రాజు మూఁడు, జాతుల వణిగ్వరుఁడు రెండుజాతులను జ
తుర్థుఁ డొకజాతిఁ బెండ్లాడి తొయ్యలుల ర, మింపఁ దగు నట్లు గాక రమింపరాదు.
| 128
|
సీ. |
నాల్గుజాతులకు నీనలువునఁ గాని తక్కినహీనజాతికామినులఁ బెండ్లి
యాడి కూడంగ భావ్యము గాదు విప్రున కజ్ఞానమున నగమ్యాగమనము
ప్రాపించెనేని సప్రణవగాయత్రిఁ బ్రాణాయామశతము చేయంగ వలయు
సంకరాన్వయవధూసంగతి పెక్కేండ్లు నడచెనేనియును దన్మంత్రమునన
వలయు మున్నూఱుమాఱులు వరుస వాయు, ధారణము చేయ నీవాయుధారణమున
బ్రహ్మహత్యాదిపాతకప్రకర మైనఁ, దప్పు నుపపాతకంబులు చెప్ప నేల.
| 129
|
క. |
పరతత్త్వ మెఱిఁగి హరిసం, స్మరణం బేమఱక వేదజపతత్పరుఁడై
చరియించుబ్రాహ్మణుం డతి, విరుద్ధములు చేసియునుఁ బవిత్రుఁడె సుమ్మీ.
| 130
|
క. |
అని మన్వాదులు విస్తర, మునఁ జెప్పినధర్మమర్మములు గొంచెమునన్
వినిపించిన భద్రాశ్వుఁడు, మునిపుంగవుఁ జూచి వినయమున ని ట్లనియెన్.
| 131
|
గీ. |
దర్పితేల్వలవాతాపిదమన మీరు, పెక్కుగాలాలు గడపినపెద్ద లగుటఁ
క్రొత్త లేమైన మీవంకఁ గొన్ని గలుగ, వలయు నవి నాకుఁ జెప్పుడు తెలియ ననిన.
| 132
|
క. |
నీ వనినయట్ల తప్పదు, భూవల్లభ నాశరీరము దలంపఁ జిరం
జీవి బహుకౌతుకంబులు, గావించిన నందులో నొకటి వినిపింతున్.
| 133
|
ఉ. |
ము న్నొక నాఁడు నే భువనముల్ చరియించుచుఁ బైఁడికొండమ్రో
ల న్నికటస్థలంబున నిలావృతవర్షము హర్షహేతువై
యున్నఁ దదంతరంబునకు నొయ్యన పోయి సరోవరంబుఁ గం
టి న్నలినీమరందతటినీపరిరంభవిడంబితాంబుధిన్.
| 134
|
శా. |
తత్తీరస్థమహాకుటీరమున నత్యంతోపవాసక్రియా
యత్తుం గీకసచర్మశేషతను సంవ్యానీభవద్వల్కలున్
జిత్తేజోమయు నొక్కమౌనిఁ గని భాషింపంగ నూహించుచోఁ
జిత్తానందము సందడింప ననుఁ బిల్చెన్ శాంతవాక్యంబులన్.
| 135
|
క. |
పిలిచినఁ జని కూర్చుండక, నిలిచిన నను మౌని గనుఁగొని ఘనధ్వనులన్
బిలిచినహుంకృతిచేత న, దలిచిన ధర వ్రక్క లయ్యెఁ దద్రంధ్రమునన్.
| 136
|
క. |
ప్రియములపుట్ట లనంగ వి, నయమణులకుఁ బెట్టె లనఁగ ననవిల్తుఁడు ది
గ్జయవేళ విరహిజనములు, భయపడఁ బట్టించుకొనెడిపడగ లనంగన్.
| 137
|
క. |
చనుదెంచిరి యేగురు చం, దనగంధులు భోగయోగ్యతనులు సమీరా
శనకన్యలు కామునిమో, హనాస్త్రదేవతలలీల నాలేమలలోన్.
| 138
|
సీ. |
భాసమానరవిప్రభాసమానం బైన పెద్దరత్నపుగద్దె పెట్టె నొకతె
ధవళమరీచికాంతపుగళంతియ వంచి వాసితోదకములు పోసె నొకతె
కంకణంబులు మ్రోయఁ గరపల్లవంబుల నడుగునెత్తమ్ములు గడిగె నొకతె
బంగారుచెఱఁగులచెంగావిపావడ నొయ్యనొయ్యన తడియొత్తె నొకతెఁ
దోర్లతామూలదీప్తులు ద్రుళ్ళగింప, జిలుగుఁబయ్యెదలోన గుబ్బలు నటింప
బహుళనిజదేహలేపనపరిమళములు, సోడు ముట్టంగ నొక్కతె సురటి విసరె.
| 139
|
శా. |
ఓహో విస్మయ మంచు నే మనసులో నూహింప నమ్మౌని భూ
యోహుంకారము చేసినన్ సరసిలో నుబ్బెన్ మహావిస్తృత
గ్రాహం బొక్కటి యోజనాయతసువర్ణద్రోణికావాహియై
సాహంకారత మంధరాద్రిధరమాయాకూర్మముం బోలుచున్.
| 140
|
క. |
ఆపసిఁడిదోనెలో నవ, రూపవతులు సతులు పల్వురు సుమేరునగేం
ద్రోపరిసానుస్థలఖే, లాపర లగునచ్చరలవిలాసము గెలువన్.
| 141
|
శా. |
దృగ్నిష్కంపతఁ జూచునన్నుఁ గని తద్దివ్యర్షి యేతజ్జలో
న్మగ్నద్రోణిక యెక్కి వేగిరమె తానం బాడి ర మ్మన్న నే
లగ్నాశ్చర్యముతోడ నెక్క మునిఁగెన్ లావూఁది నేఁ ద్రొక్క మున్
భుగ్నంబై చనువింధ్యశైలముగతిన్ మూర్ఛిల్లి నే నంతటన్.
| 142
|
క. |
తెప్పిఱి కన్నులఱెప్పలు, విప్పిన నొకపురము దోఁచె వీథులతోఁ బే
రుప్పరిగలతోఁ గనకపుఁ, జప్పరమాడుగులతోడ సరసులతోడన్.
| 143
|
వ. |
అప్పు డప్పురంబు గప్పురంబుచొప్పునం జల్లనిపలుకులం బొగడం దగి గరుడపచ్చ
విధంబున రతికి నెక్కి చేమంతిపూబంతికైవడిం బెక్కుదళంబుల విలసిల్లి తార
కాచక్రంబుపగిదిఁ బగలు వొడముట లేక వియద్గంగతెఱంగున మంచివారితోడం
గూడి వీణియగతిం బెక్కుసారెలం జూడ వేడుక పుట్టించి మందారంబుచందంబునఁ
జక్కనికొమ్మలకు నిమ్మై తొలుకరికాలంబులీల సకలదిక్కుల మించులు చూపుచు
నడుసముద్రంబువడువునం గడలు గాన రాక రాకనెలచెలువునం దమోనిరాసం
బును సకలకళావిలాసంబునుం గృష్ణసారసముల్లాసంబును నమర నమరపురంబు
కరణి విజృంభమాణరంభారామంబును సుధర్మాభిరామంబును సురభివిహారసీమం
బును ననంగ ననంగచాపంబురూపంబున సదాళిగుణఘోషంబును మధురిమోన్మేషం
బును సుపర్వవిశేషంబునుం దనర నరహరిసరణి హిరణ్యభవనస్తంభోద్భవప్రకాశం
బును వైమల్యప్రదేశంబునుం జిత్రావకాశంబు నగుచు నాకవైకుంఠాదినగరంబుల
నగుచు నంద మొంది మఱియును.
| 144
|
చ. |
పనివడి నిచ్చలుం బరమభాగవతేంద్రులు తాన మాడి పో
వునపుడు శౌరిమీఁదిదరువుల్ సరసంబుగఁ బాడ సీధుపా
ననిభృతచంచరీకభరనమ్రములై తలవంచి యాలకిం
చినగతి మించు నప్పురముసీమకొలంకులలోనితామరల్.
| 145
|
గీ. |
విస్మయంబునఁ బాతాళవివరనిలయ, హాటకేశ్వరుఁ డప్పురికోటపొడవు
చూడ నాతనితలచుట్టు వీడి పడియె, నది సుమీ శేషపన్నగ మనఁగఁ బరఁగె.
| 146
|
గీ. |
ఖంగు రనఁగ నాదికమఠంబు నడువీఁపు, దాఁకఁ ద్రవ్వి త్రవ్వ రాక మాని
రనుచుఁ బౌరజనము లాడుదు రింక న, ప్పురముపరిఘలోఁతు పొగడ నేల.
| 147
|
ఉ. |
కమ్మనితేనియల్ దఱచు కాలువలై ప్రవహింప మీఁద జుం
ఝుమ్మని మ్రోయుతుమ్మెదలజొంపము మళ్ళకు నీళ్ళు గట్టుచోఁ
బమ్మినవేడ్కఁ బాడువనపాలకబాలకదంబకంబుచం
దమ్మున నొప్పు నప్పురము నాలుగువంకలఁ బువ్వుదోఁటలన్.
| 148
|
శా. |
భావిద్వాపరవేళఁ దాఁ గపటగోపాలావతారంబునం
గావింపం గలధేనుపాలన మసంఖ్యాతాకృతుల్ దాల్చి ర
క్షోవిధ్వంసకుఁ డభ్యసించుకరణిం జూపట్టి తద్రాజధా
నీవన్యస్థలి బాలకుల్ సురభులన్ మేపంగ వీక్షించితిన్.
| 149
|
మ. |
అలినీఝంకృతిమంత్రపూర్వకముగా నాశాంతధాత్రీసుప
ర్వులకుం బల్లవపాణులం దొరుఁగు పువ్వుందేనె యన్నీటిధా
రలు వోయు న్నవమంజరీపరిమళద్రవ్యంబు లవ్వీటఁ గ
ల్పలతల్ పౌరవధూవిలాసగరిమప్రాప్తివ్రతాయత్తతన్.
| 150
|
క. |
పురి విచ్చి మయూరము ల, ప్పురిసౌధశిరోగృహాగ్రముల నటియించున్
బరిసరశయితవధూటీ, సురతశ్రమ మడఁగ విసరుసురటు లనంగన్.
| 151
|
క. |
తమమాటలతో సరియగు, నమృతరసము ముంచి యిత్తు రమరఁగ మణికుం
భములఁ బ్రపాపాలిక లని, శముఁ దత్పురరాజవీథిఁ జలిపందిళ్ళన్.
| 152
|
వ. |
ఈవిధంబున నత్యద్భుతమహిమాకరం బగునప్పురంబుం గలయం దిరుగుచు ముం
దట బృందారకగంధర్వసిద్ధవిద్యాధరప్రముఖదివ్యకన్యకానికాయకేళీకోలాహల
సంకులంబు లైనకెలంకులం గలకొలంకులలోన నొక్కసరోవరతీరంబున నే మున్ను
చూచిన కుటియును జటియునుం గనంబడ విస్మయంబున డాయం బోయి సవిన
యంబుగాఁ బ్రణమిల్లి మహానుభావా భానుసోమరుద్రాజమరుద్రాజాదిలోకంబులు
చూచితిం గాని యేలోకంబుల నిట్టిక్రొత్తలు లేవు నీ విలావృతవర్షంబుననుండి
యిచ్చటి కెట్లు విచ్చేసితి వనిన నమ్మునీశ్వరుండు లేనగవు సెలవి మొలవం జలువ
చూపులం జూచి యీచరాచరంబు జలరూపంబున నావరించి వరుణాభిధేయం
బున మెలంగునారాయణుండ నీవు నన్ను సప్తజన్మంబులనుండియు నారాధించిన
ధన్యుఁడవు గావున దేవతలకు నగోచరం బైనయీమదీయభవనంబు చూపితి నిఁక
నేతద్దర్శనఫలంబున నీకు నేకాలంబునం జేటు లేదు పొ మ్మని పలుకునవసరంబున
నిద్రాముద్రితలోచనుండనై ధరాభాగంబునం బడి యించుకవడికి మేల్కాంచి
కాంచనగిరిశిఖరంబున సప్తద్వీపకులశైలవసుంధరాసమేతం బగునప్పురంబున మౌని
పుంగవుం జూచితి నాఁటనుండియు నచ్చిత్రకృత్యంబు మచ్చిత్తంబున నచ్చొత్తిన
విధంబున నుండు మహీమండలాఖండలా యేతద్రహస్యంబు నీకుం జెప్పితి నని
కుంభసంభవుండు భద్రాశ్వునకుఁ జెప్పె నని వరాహదేవుండు చెప్పిన విని ధరా
మధురాధర తరువాతివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.
| 153
|
ఉ. |
యుఝ్ఝడితిప్రయుక్తరిపుయూధశిరోధివిరోధిఖడ్గపీ
తోఝ్ఝితరక్తపూరమిళనోల్బణనిద్రుమకాంతిభృత్సర
స్వఝ్ఝరవఝ్ఝళంఝళరవస్ఫురదంగదభూష రూపసం
పఝ్ఝషకేతుసన్నిభ సభాభవనాబ్జవనీరవిప్రభా.
| 154
|
ప్రతిలోమానులోమకందము, నిరోష్ఠ్యము.
|
సారసనయనా ఘనజఘ
నారచితరతారకలిక హరసారరసా
సారరసారహకలికర
తారతచిరనాఘజనఘనాయనసరసా.
| 155
|
కందద్వయగర్భభాస్కరవిలసితవృత్తము
|
పండితకవిజనరక్షణ, శౌండా భాస్కరవిలసిత సరసనవశ్రీ
ఖండసురభిరమణీకుచ, గండాగ్రశ్రమజలకణఘనతరహారా
చండరణఖురళిసామజ, శుండాస్తంభగణదళన సులభవిహారో
ద్దండభుజమలయజద్రుమ, కాండాధారభయదభుజగదసికఠోరా.
| 156
|
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునందు నవమాశ్వాసము.