వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/దశమాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

దశమాశ్వాసము

క.

శ్రీసదన దానమానధు, రా సదృశానేకసుకవిరక్షణ కవిర
క్షాసదృశ కీర్తియువతీ, ప్రాసాదితభువన యీశ్వరప్రభునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుండు వసుంధర కిట్లనియె నట్లు కుంభసంభవుండు
విశ్వంభరుమాయావిజృంభణంబు చెప్పిన విని భద్రాశ్వుండు లోపాముద్రామనో
హర పురందరాదిబృందంబునకు నైన దుర్లభుం డగునిందిరావల్లభుం డింత సులభుం
డగుటకు మీరు చేసినసువ్రతధర్మమర్మంబు లెఱింగింప నవధరింపు మనినఁ జనిన
రాజులలోన నీవు గదా గదాధరకథాసుధారసధారాధురీణాయమానమానసుండవు
నీవంటిసుజనునకు విష్ణుధర్మంబులు దెలుపుట సుక్షేత్రంబున విత్తులు నిలుపుట
గావున మద్విరచితహరిసమారాధనవిధానంబు వచించెద సావధానంబుగ వినుము.

2


స్రగ్ధర.

వర్షంబుల్ నూఱు వేదిజ్వలనభుగభుగధ్వానగర్జాజ్యధారా
వర్షంబుల్ మీఱ నే నధ్వరములు హరిసేవాసమాసక్తిఁ జేయన్
హర్షోత్కర్షంబుతోడన్ హరిహయముఖనాకౌకసుల్ తాపసుల్ బ్ర
హ్మర్షుల్ విచ్చేసి కోలాహలములు మఖవాటాంతరాళంబు నిండన్.

3


క.

ఓహో యనువారును బహు, ధాహవిరామోదములకుఁ దల లూఁచుచు దా
రాహా యనియెడువారలు, నై హేమమయాసనముల నధివసియింపన్.

4


సీ.

చండాంశుమండలసాహస్రదుర్నిరీక్షం బైననందిటెక్కెంబు మెఱయ
మిన్ను ముట్టినప్రాఁతమినుకునకీబులహుంకృతి దిగ్భిత్తు లురిలి పడఁగ
బాహాముహుర్ముహుర్భ్రమితత్రిశూలంబుమెఱుఁగు చూపఱ మిఱుమిట్లు గొలుప
దర్పితత్రైపురదైతేయకోలాహలా యని వీరకాహళము మొరయ
సరయ ధావత్ప్రమథచమూసంచయముల, రవలి కుప్పొంగు తొడుకుసామ్రాణిఁ జిఱుదు
వాళి నెక్కుచు రుద్రుండు వచ్చి తనకు, మ్రొక్కుదివిజులఁ గూర్చుండ ముదల వెట్టి.

5

నర్కుటము.

రహీ గలరుద్రకన్యకలరాగములన్ వినుచున్
సహసితలీల భృంగిరిటనాట్యములం గనుచున్
ద్రుహిణకపాలపాలికలు గ్రుచ్చినగద్దియపై
మహిమ సుపర్వకోటినడుమం గొలువై నిలువన్.

6


క.

త్రసరేణుసమానవిమా, నసమారూఢుఁ డయి వచ్చి నగధన్వికి మ్రొ
క్కి సనత్కుమారుఁ డజుమా, నసపుత్త్రుఁడు నిలిచె నపుడు నామదిలోనన్.

7


శా.

మాహాత్మ్యంబులు తేజముల్ విభవసంపత్తుల్ విమర్శింపఁగా
నోహో భేదము లేదు నిండుసభలో నొక్కింతమాత్రంబు హే
మాహేమీలు ఘటాఘటీ లతిరథుల్ మాంధాళు లీసాము లే
లా హీనాధికభావముల్ తడవ రా దంచున్ వితాకుండనై.

8


క.

రుద్రుండు భక్తలోకమ, రుద్రుం డీయర్థమునకుఁ బ్రోఁ గేర్పఱుపన్
భద్రం బగు నా కనుచున్, దద్రాజకళాశిరోవతంసముతోడన్.

9


మత్తకోకిల.

ఉగ్ర శంకర భక్తవత్సల సోమ యీమఖసీమలో
నగ్రపూజ లొనర్తు నెవ్వని కానతి మ్మని పల్క సా
నుగ్రహంబున నాసుమేరుధనుర్ధరుండు సమస్తదే
వాగ్రగణ్యులు వింజ మా కిడినట్లు నిల్వ ననున్ ననున్.

10


సీ.

ఈచరాచర మెల్ల నేదేవదేవునివలన మాటికిఁ బుట్టు నిలుచు నడఁగు
తెలిసి యేదేవు నుద్దేశించి పెద్దలు గావింతురు మహామఖంబు లెపుడు
నేదేవుపాదనఖేందుచంద్రిక సుమ స్తబకంబు శ్రుతివధూకబరికలకు
నద్వంద్వుఁ డయ్యు లీలార్థంబు గాఁగ నేదేవుండు దాల్చె మూర్తిత్రయంబు
సత్వరజములతోఁ గూడి స్రష్టయై ర, జస్తమంబులఁ గూడి మత్సంజ్ఞుఁడై వి
శుద్ధసత్త్వసమృద్ధి విష్ణుఁ డయి నుతులు, గాంచు నేదేవుఁ డతనిఁ బూజించు మునుపు.

11


వ.

కుంభసంభవా మఱియు నొక్కరహస్యంబు వినుము సకలయజ్ఞఫలప్రదానపరా
యణు నారాయణుం గృతయుగంబువారు శుద్ధసూక్ష్మస్వరూపుం డని భావింతురు
త్రేతాయుగంబువారు యజ్ఞమూర్తి యని యజింపుదురు ద్వాపరంబువారు పాంచ
రాత్రమతంబున భజియింపుదురు కలియుగంబువారు మత్కృతశాస్త్రమార్గంబులం
గొలుతురు పరంజ్యోతి యగు జనార్దనునకు నాకు నాకుశేశయాసనునకు భేదం
బాపాదించునసత్యవాదులు పాపలతలకుం బాదు లగుచు నరకంబునకుం బోదురు
వైదికంబు గానిభేదవాదంబు కలియుగంబునం బ్రబలం బగు నత్తెఱం గెఱింగిం చెద
మున్ను భూలోకవాసులు వేదోక్తయజ్ఞాదికృత్యంబుల వాసుదేవు నుపాసించిన

ఫలంబున భువర్లోకంబునకుం జనుదురు తల్లోకంబునం గేశవు భజించి స్వర్లోకంబు
నకుం జని క్రమక్రమంబున ముక్తు లగుదురు.

12


గీ.

ఇవ్విధంబున నిశ్శంక నేసరేఁగి, యెల్లవారలు మోక్షంబు కొల్లగొనఁగఁ
జూడఁ జాలక యింద్రాదిసురలు గూడి, కదలి వైకుంఠపతిసమ్ముఖమున కరిగి.

13


క.

ధరఁ జాగిలి మ్రొక్కిన నా, హరి కరుణాపూరితేక్షణాంతంబుల ని
ర్జరవరులం గని యిచ్చటి, కరుదెంచితి రేటి కన బృహస్పతి పలికెన్.

14


సీ.

అనిశంబు వీఁడు వాఁ డనక యెక్కఁగ వేల్పుటేనుఁగునకు వీఁపు గూనువోయె
వరుసలు పెట్టి దువాళింప సుడివడి వెలిమావు మోపదు వెనుకకాలు
విడువనివేలంబు నుడిగంబులు గొనంగ నిచ్చలు నిద్ర లే దచ్చరలకు
దుండగంబునఁ బూల గుండాడ వికలితవృత్తిఁ గల్పక వాటి వీఁటిబోయె
స్వామి గుఱియించి పెక్కుయజ్ఞములు సలిపి, భూమిప్రజ లెల్ల నింద్రు లై పోతరమున
గొడ్డిగము లిట్లు చేయంగ నడ్డ పెట్ట, రాక బహునాయకం బయ్యె నాకపురము.

15


సీ.

శ్రీవైష్ణవులపాదరేణువు తనువుపై నొకయింత పడినధన్యుండు వీఁడు
పరమభాగవతులు పురుషసూక్తము చెప్ప నొకమాటు వినినపుణ్యుండు వీఁడు
తులసీవనీవాసనలు పయిగాలి రా నొకనాఁడు చనినసభ్యుండు వీఁడు
హరి తిరుమాళిగ గరుడధ్వజాంచలం బొకకొంత గన్నపుణ్యుండు వీఁడు
వీరిఁ దడవుట యె ట్లని క్రూరవృత్తి, యమునిదూతల నీబంట్లు సమయమోఁది
భూజనుల నెల్లఁ గైవల్యమునకు ననుప, నిర్జనం బయ్యె సంయమనీపురంబు.

16


క.

దేవా క్రమక్రమంబునఁ, బావనులై సృష్టిఁ గలుగుప్రజ లీకరణిం
గైవల్యంబున కేగెడు, హావళిచే మాకు నడవ వధికారంబుల్.

17


శా.

ఏలా వేయును విన్నవింపఁగఁ ద్రిలోకేశా మహేంద్రాదిది
క్పాలైశ్వర్యము వెచ్చపెట్టుకొను మింకన్ సృష్టి నష్టం బగున్
వాలాయంబుగ నంచు గీష్పతి సుపర్వశ్రేణివిజ్ఞాపనల్
పోలం జెప్పిన నాలకించి ధవళాంభోరాశిపర్యంకుఁడున్.

18


సీ.

నను సంస్మరింప వచ్చినఁ జూచి నాతోడఁ దివిజులమనవులు దెలియఁ జెప్పి
త్రిపురసంహర యుగత్రితయంబునన కాని నాలవయుగమున నాదు భక్తి
తఱుచు లేకుండంగఁ దగినమోహంబు పుట్టించెద నీవుఁ గల్పించు తదను
కూలశాస్త్రంబులు గొన్ని స్వల్పప్రయాసంబున నధికఫలంబు గలుగు
నంచు బ్రమయించునట్లుగా ననిన నేను, బాశుపతనయసిద్ధాంతబౌద్ధజైన
ముఖ్యమతములు చెప్పితి మునివతంస, నాఁడు మొదలుగ భూమిజనంబు లెల్ల.

19

క.

ఈశ్వరకథితము లనియు న, నశ్వరవేదానువర్తనము లనియు వృథా
విశ్వాసవిమోహితులై, శశ్వత్కర్మములు మిగుల జరపరు సుమ్మీ.

20


వ.

ఏఁ గల్పించిన మతంబులలోపలం బాశుపతంబు వేదసమ్మతంబు గావున సకలలోక
సమ్మతంబు వేదం బన మత్స్వరూపంబు తద్వేదబాహ్యులు న న్నెఱుంగ లేరు
నాకు విష్ణునకు బ్రహ్మకు భేదంబు లేదు మేము మువ్వురమును గుణత్రయంబును వేద
త్రయంబును వహ్నిత్రయంబును లోకత్రయంబును శక్తిత్రయంబును సంధ్యాత్రయం
బును వర్ణత్రయంబును మొదలుగాఁ ద్రిధాబంధం బగు సచరాచరంబురూపున
వర్తింపుదుము గౌణముఖ్యపక్షంబుల మమ్ము నొక్కటిగా నెఱిఁగి సోహంభావం
బున భజించుసుజనుండు విష్ణుభక్తుండు ముక్తుండు ననం బరఁగు నని యేతద్రహ
స్యం బాన తిచ్చిన రుద్రునకుఁ బ్రాచీనబహిర్ముఖబహిర్ముఖులును సనత్కుమారాది
యోగీంద్రులును మఱియునుం దక్కినసభాసదులును నేనునుం బ్రణమిల్లి మధు
మథనమథితమధురజలధిసముల్లోలహల్లీసకనిభార్భటి నిర్భరఫణితిసందర్భంబునం
బ్రశంసించునవసరంబున.

21


వనమయూరము.

ఓంకృతిమహావనమయూర మగునాయే
ణాంకధరుమేనఁ జతురాననుఁడు నుద్య
త్పంకజహితాయుతసబాంధవరుచుల్ న
ల్వంక వెదచల్లుకమలావిభుఁడుఁ దోఁపన్.

22


శా.

ఆమాహాత్మ్యముఁ జూచి యాజకఋషుల్ సాశ్చర్యులై ఋగ్యజు
స్సామంబుల్ పఠియింపుచున్ జయజయోచ్చైర్నాదముల్ రోదసీ
సీమం బంతయు నిండఁగాఁ బొగడి యోశ్రీమన్మహాదేవ నీ
వీమూర్తిత్రితయంబు దాల్చినవిధం బేలా గెఱింగింపుమా.

23


గీ.

అనిన వారలఁ జూచి యీయజ్ఞవేళ, మీరు నా కిచ్చినహవిస్సు మేము మువ్వు
రమును బంచి పరిగ్రహింతుము మునీంద్రు, లార మాయైక్య మిదిమొద ల్గా నెఱుఁగుఁడు.

24


గీ.

అనిన వారు కృతార్థుల మైతి మనుచు, మ్రొక్కి దేవర చేసిన మోహశాస్త్ర
ములనిమిత్తంబునుఁ బ్రవర్తకులను లెస్స, తెలియ నానతి యిమ్మనఁ బలికె శివుఁడు.

25


సీ.

మున్ను భారతవర్షమున దండకావనవాటి గౌతమఋషివర్యుఁ డబ్జ
సంభవుఁ గూర్చి నిష్ణాపరత్వంబున బహుకాల ముగ్రతపంబు సలిపి
ప్రత్యక్ష మైనతద్బ్రహచే విత్తినసస్యంబు లన్నియు జాములోన
పరిపాకమును బొంద వరముఁ గైకొని వచ్చి శతశృంగగిరిఁ బర్ణశాలఁ గట్టు
కొని సమర్పించుఁ గోటులకొలఁది మీఱ, వచ్చునతిథుల కెల్ల నవ్వారి గాఁగ
షడ్రసాన్నంబు వరలబ్ధసస్యవృద్ధి, కలిమి నంతట నొకకొంతకాలమునకు.

26

క.

రోషముతో నిజమహీమో, న్మేషము చూపంగ వలసి మీనంబునకున్
బూషాత్మజుండు వచ్చిన, దోషంబునఁజేసి కఱవు దోడనె రాఁగన్.

27


లయవిభాతి.

విసరెఁ బెనుగాడుపులు మసలె జలదాగమము
                      పసిమి చెడె సస్యములు కసవు దిన లేమిం
బసరములు వట్టె నదు లిసుకలునుఁ జిప్పలును
                      మిసమిస మనన్ విగతరసగరిమ నింకెన్
వసుమతి పడన్ దివిసెఁ గుసుమఫలపత్రముల
                      పస దఱిగె భూరుహము లుసు రుడిగెఁ బ్రాణి
ప్రసరములు నొండొకటి మెసఁగఁ దొడఁగెన్ గఱవు
                      గసిమసఁగె విశ్వమున వెస లయవిభాతిన్.

28


సీ.

మిగుల భీకరవృత్తి మిన్నుముట్టినధూమకేతువె బిరుదుటెక్కెంబు గాఁగ
నోరంత ప్రొద్దును హోరని విసరుచుఁ గెరలుకరువలి నకీబు గాఁగ
చెట్టుచేమలు గారుచిచ్చునఁ గమరిన నున్ననిగిరులె యేనుఁగులు గాఁగ
నిప్పులు గ్రక్కుచు నెప్పుడుఁ గాయునిబ్బరపుటెండలె ప్రతాపంబు గాఁగ
అనశనప్రాప్తిమృతమనుష్యప్రతాన, మాంసభక్షణదృప్తగోమాయుకాక
ఘూకబహుజంతువులు బంట్లగుంపు గాఁగ, రాజసంబున దుర్భిక్షరాజు మెఱసె.

29


క.

భూకాంత నీరువట్టుకుఁ, గాక వదన మిలుకరింపఁ గాన్పించినపం
కాకన వెలిపుచ్చలు, లోకములోఁ గాచె నిట్లు లోఁబడె జనముల్.

30


ఉ.

అప్పుడు దేవదారువిపినాంతరసీమ వసించుసంయముల్
వి ప్పగుభూమి నన్నము ఫలింపక చెట్టులు నెండిపోయె వా
తప్పినఁ బోవుఁ బ్రాణములు తప్పదు రం డని మున్ను గౌతముం
జెప్పఁగ విన్నవా రగుటఁ జేరిరి తచ్ఛతశృంగశైలమున్.

31


క.

ఈగతి వచ్చినమునులకు, నాగౌతముఁ డెదురు నడచి సాష్టాంగముగాఁ
జాగిలి మ్రొక్కుచు నేఁడు గ, దా గణనకు నెక్కె మత్ప్రయాసం బనుచున్.

32


సీ.

సంతసించుచు నిజాశ్రమమున విడియించుకొని వారి కెల్లను దినదినము న
హల్యప్రాణేశుఁ డహల్యశాల్యన్నంబు వలసినవారికి వలసినంత
మృతసూపఫలదధిక్షీరయుక్తంబుగాఁ దలఁచినప్పుడె పెట్టెఁ దారు నిత్య
మును భుజాభోజనంబులు చేసి చట్టులకరణి నందఱు ముచ్చె మురియ బలిసి
నెమ్మది సుఖింప వెడలెఁ బండ్రెండువత్స, రములు కఱవునుం దీఱె వర్షములు గురిసెఁ
జల్లఁబడె సకలసస్యములుఁ బండెఁ, బుడమి ధాన్యంబు పోకకుఁ బుట్టెఁడమ్మె.

33

క.

అప్పుడు తపసులు తమలో, డెప్పరమా తీఱె నేమిటికి నిఁక నిచటం
గుప్పలు పడి నిలువఁగ రం, డెప్పటిఠావులకె పోద మిందఱ మనుచున్.

34


క.

గుంపులు గూడుకొని విచా, రింపఁగ శాండిల్యుఁ డది యెఱిఁగి గౌతముచే
నంపించుకొనక పోవఁ ద, లంపుట భావ్యంబె పెద్దలారా మీకున్.

35


క.

విపరీతపుఁగఱవున నే, యుపద్రవము నొంద కుండ నోమినమునికిం
గపటింతురె సపితాయ, స్తుపోషక యటన్నమాట చూడఁగ వలదా.

36


మ.

అన బాభ్రవ్యుఁడు నిట్ల తప్ప దన నాహా కూటిమాత్రంబునన్
మన మే మమ్ముడుపోతిమో యితనికిం బాపంబు గా దంచు దు
ర్జనవృత్తిం జనువారలై మునులు నిస్త్రాణంపుగోవున్ సృజిం
చి నియోగించిరి గౌతమాప్తకలమక్షేత్రంబు భక్షింపఁగన్.

37


తరళ.

అరిగి తత్కపటంపుధేనువు నల్లనల్లన మళ్ళలోఁ
దిరుగుచున్ వడి గాలి గొట్టినఁ ద్రెళ్ళుచున్ మఱి లేచుచున్
దరళయై వరి యెల్లఁ జెల్లఁగఁ దత్క్షణంబున మేయఁగాఁ
బరమశాంతుఁడు గౌతముండును బాఱు తెంచి మనంబునన్.

38


శా.

ధేనుగ్రాసము మాన్ప దోస మని సందేహించినన్ సస్య మెం
తే నష్టం బగు నైన నేమి మఱియున్ విత్తంగ యామంబులో
నౌ నన్నన్ మును లెల్ల మిక్కిలియు నేఁ డాఁకొందు రీధేనువుం
దానో మానము దప్ప మేసినది యింతం దోలెదన్ మెల్పునన్.

39


క.

అని నిశ్చయించి హస్తం, బున జలములు పూని తల్లి పొమ్మని ప్రోక్షిం
చిన మాయగోవు పడుచుం, గనుగ్రుడ్లు దిరుగవేసి కాలము చేసెన్.

40


సీ.

అపుడు బ్రాహ్మణు లెల్ల నన్యాయ మన్యాయ మనుచుఁ బేరెలుఁగున నార్చువారు
గోహత్య సిద్ధించె నోహో యితనియింటఁ గుడువఁ గా రాదని గొణుగువారు
నీమహాపాతకి నేల చూచితిరి సూర్యవిలోకనము చేయుఁ డనెడివారు
పిడికెఁడుపూరికై బెడిదంపుసాహసం బెట్టు చేసితి వని తిట్టువారు
నై దిసంతులు గొట్టుచు నమ్మునీంద్రు, గువ్వకరిగొని కడువెత కుడువఁ బఱచి
బట్ట గట్టితనంబున నట్టె గట్టి, గదల వారికిఁ బ్రణమిల్లి గౌతముండు.

41


మ.

అకటా ధేనువుమీఁదఁ జే యిడితినో సామర్షవాక్యంబులన్
బెకలం దోలితినో బుభుక్షకుఁ దగన్ మేయంగ నీ నైతినో
ప్రకటం బైనమదీయపూర్వకృతపాపం బెట్టిదో కాక మి
న్నక గోహత్యకుఁ బాత్ర మైతి ననుచున్ బాష్పాంబువుల్ గాఱఁగన్.

42

క.

దైవికమున నొకనేరమి, గావించిన నిట్లు విడువఁ గాఁ దగ వౌనే
సేవకుని నన్ను మునులా, రా వలదా యింత కనికరం బైన మదిన్.

43


శా.

ప్రాయశ్చిత్తము పంపుఁ డిందు కనినన్ బాభ్రవ్యశాండిల్యు ల
య్యో యీసాధున కెట్టుగాఁ దగిలె నత్యుగ్రంపుగోహత్య కా
నీ యింకం బదివేలు నేమిటికి మౌనీ దీనిపై జాహ్నవీ
తోయంబుల్ ప్రవహింపఁ జేయు బ్రదుకున్ దోసంబు దీఱుం దుదిన్.

44


సీ.

మాకుఁ జూడంగ సొమ్మసిలి పడ్డది గాని తెగటారఁ జచ్చుట తెలియరాదు
కావున నీపాతకం బసివోవు జాహ్నవిఁ దెచ్చుటకుఁ బ్రయత్నంబు నీవు
చేయు మేమును నింకఁ బోయి వచ్చెదము కోపించకు మం చూఱడించి మునులు
దేవదారుద్రువనీవాటి కరిగిరి గౌతముండును శీతకరకిరీటు
ఘోరతపమున మెప్పించి కొంచు వత్తు, గంగ నా కిది యెంత దుష్కర మటంచు
మగువయును దాను శతశృంగనగము డిగ్గి, కదలి చనుదెంచెఁ జనుదెంచి యెదుటఁ గనియె.

45


క.

అక్షుద్రపాతకానిల, భక్షణపన్నగము బహులబలభిన్నగమున్
విక్షీణోన్నతిధవళిమ, ఋక్షగణాసన్నగమును హిమవన్నగమున్.

46


క.

కని మనమునఁ గోరిక ని, క్క నితాంతానందవార్ధి గరుసెక్కఁXఁ జ
క్కనిసతి నాశిఖరికి మ్రొ, క్క నియోగించుచును మ్రొక్కి కౌతూహలియై.

47


సీ.

ధారుణీగవికి రత్నమహౌషధంబులు చేఁపు పుట్టించినక్రేఁపుఁగుఱ్ఱ
కఱకంఠునకుఁ గాళ్ళు గడిగి గౌరీకన్య ధారవోసినమహాదానపరుఁడు
మౌనికోటికి నెల్ల మన్నింపఁ దగినమేనామానినికిఁ బ్రాణనాయకుండు
తనకూఁతుసవతి మందాకినీనదికి నాధారమై నిలిచినతగవులాఁడు
సురధరిత్రీధరమునకు జోడుకోడె, వనధిసఖ మైనమైనాకమునకుఁ దండ్రి
కాంత కన్నులపండువు గాఁగఁ జూడు, మంచు నమ్మంచుగొండ వర్ణించి మఱియు.

48


క.

ఈమిహికాచలవరుఁడు గు, హాముఖసంచారిమారుతారావములన్
దా మించు నెపుడు ప్రాణా, యామంబును జేయుచున్నహఠయోగివలెన్.

49


గీ.

ఇందు విహరించువిద్యాధరేందుముఖుల, చరణ లాక్షాంకములతోడి చదుము లమరు
హరునికృపఁ గలసినయోగివరులు ముక్తి, సతులుఁ గ్రీడించుపల్లవశయ్య లనఁగ.

50


మ.

తనదండం దప మాచరించి పురభిత్సారూప్యముం బొందుభ
క్తనికాయంబున కియ్య దాఁచినసుధాధామార్ధజాలంబులా
గున నీశైలవిభుండు దాల్చు నెపుడుం గ్రొమ్మంచుపై నిండఁ బ
ట్టినఁ జూపట్టెడుశాక్వరేంద్రఖురకోటీవక్త్రచిహ్నంబులన్.

51

వ.

అనుచు ననేకవిధంబుల నిజమనోరథసాఫల్యసదానుకూల్యకు నహల్యకు నాహిమ
వన్నగంబుమహిమ చెప్పుచు వచ్చి తన్నగప్రదేశంబున నొక్కచోట సౌధాంధ
సధేనుయూధపృథూదస్స్వైరనిస్రుతదుగ్ధసమిద్ధసిద్ధరసధారాధునీతీరపారిజాతవ
నాంతరచింతామణిస్థలంబున నేకపాదస్థుండై నిష్ణాపరత్వంబున నిలిచి హుతాశన
లోచనంబును లేలిహానహారంబును నీహారకరకిరీటంబునుం గలనన్ను హృదయం
బున నిలిపి శీతవాతాతపంబులకు జడియక నిలింపులు చలించ నతిఘోరతపంబు
సేయునవసరంబున.

52


చ.

కరినివహంబు రాచుకొనఁగాఁ జలియింపదు బొడ్డుబంటిగాఁ
బెరిఁగినపుట్టలో వెడలుభీకరభోగికులంబు ప్రాఁకఁగా
గురగుర గాదు గడ్డమున గూఁడులు పెట్టినపక్షికోటి పెన్
మొరప మెఱుంగ దెట్లు మునిముఖ్యునియీతను వంచుఁ దాపసుల్.

53


సీ.

బంధత్రయంబునఁ బవనంబు మధ్యమనాళిమార్గమునకు నూలుకొలిపి
గంటు లాఱుఁ బగుల్పఁ గడుహెచ్చువహ్నిచే మీఁదికుండలికన్య మేలుకొలిపి
పరమచిదాకాశభాగేందుమండలస్రవదమృతరసంబు జాలుకొలిపి
నిరవధికానందభరిత మైనతలంపు ఫాలలోచనుమీఁదఁ గీలుకొలిపి
తమ్ము నేలినమనసు లయమ్ము నొందు, టయును నతిభక్తియుక్తి నింద్రియగణంబు
సహజకృత్యంబు లుడుగ నిశ్చలసమాధి, విడువఁ డాహా యితఁ డనుచు వెఱఁగుపడిరి.

54


క.

ఈరీతి నిఖిలవి్స్మయ, కారణ. మగునుగ్రతపము గావించె నహ
ల్యారమణుఁడు నూఱేఁడు ల, పారకరుణ నంత నేను బ్రత్యక్షంబై.

55

నమశ్శివాయపంచాక్షరిసీసము.

యమనియమాయామశమనివేశనమనోమౌనివశ్యాయ నమశ్శివాయ
యానాయమాననానాయననవనవామ్నాయమయాయ సమశ్శివాయ
వనయోనియామినీవామేశశశ్యంశుమన్నయనాయ నమశ్శివాయ
వ్యోమానుయాయిమాయామానవాశనమాననాశాయ నమశ్శివాయ
యని వినయమున ముని యనయమును విశ్వ, మనువనమ్మున నెమ్మినై నున్ననన్ను
నెమ్మనమ్మున నమ్మిన నెమ్మి నేను, నోమునీశాన యిమ్మన వేమి యనిన.

56


ఉ.

నాకినికాయవందిత పినాకి నిరంతభవజ్జటాటవీ
కేకిని మజ్జనోద్యమనకృజ్జనపాలఫలాశనక్రియా
డాకిని వారిబిందునిబిడత్సదనీకిని నాకు నిమ్ము మం
దాకిని నంచు నమ్ముని పునఃప్రణతుల్ ఘటియించి నిల్చినన్.

57

గీ.

ఏను నొక్కజటాఖండ మిచ్చి వత్స, యిందు నిందుకళామృతం బిందుకొన్న
తద్వియన్నది యున్నది తడయ కిపుడ, పొమ్ము నీ వన్న నమ్మునిపుంగవుండు.

58


మ.

నను భావించుచు నప్పటప్పటికి నానందాశ్రువుల్ గాఱఁగాఁ
దనలోఁ జొక్కుచు నేగి దంభగవిమీఁదన్ దజ్జటాఖండ మొ
య్యనఁ బిండన్ విమలాంబువు ల్వెడలె సంధ్యారాగసంలిప్తనూ
తనశీతాంశుకళావినిర్గతసుధాధారానుకారాకృతిన్.

59


క.

ఆనీరు సోఁకి మాయా, ధేనువు తా నిద్ర వోయి తెలిసినపగిదిన్
మేను విదిలించుకొంచును, మౌనులు వెఱఁగంది చూడ మగువ యగుతఱిన్.

60


క.

ఉదకముచేతనె కపటపు, మొదవు మడిసె మొదలు నుదకములచేన తుదిన్
బ్రదికె నుదకంబు ధరలో, నది గాన విషామృతాహ్వయంబులు దాల్చెన్.

61


వ.

అని జగజ్జనంబులు పలుక నజ్జటాఖండనిర్గతవారిపూరంబులు క్రమక్రమంబున మహా
వాహిని యై నిజావగాహంబు సలుపుదేహిసందోహంబులపాపపంకంబు లిట్ల
కడుగుదు నన్నట్లు శతశృంగనగసంగతశిలాపంకంబులు గరంచుచు స్వసమీపవా
సులమోహపాశంబు లిట్ల పెఱికి పేటాడుదు ననుపగిది నిరుదరులపొదలం బొద
లినవల్లికలం బెల్లగించుచుఁ దనవారి గ్రోలినవారిజఠరగోళంబులం గలసకలరో
గంబు లిట్ల సుడిపఱతు ననుచందంబునం గందరాంతరంబులు చొచ్చి సింహశరభ
శార్దూలాదిమృగంబుల సుడివఱచుచుఁ దన్ను దర్శించుధర్మపరులకర్మంబు లిట్ల
నిర్మూలంబు గావింతు ననుభావంబున సమున్నతద్రుమంబులు వ్రేళ్ళతోన కూలం
ద్రోచుచు మీరు గదా నిజరమణపారావారబంధనకారణంబు లనువైరంబు దలంచి
భేదించువిధంబున ధరణీధరంబులు దెగం బాఱుచుఁ దన్ను విసయంబునం గొని
యాడువైమానికులకోలాహలంబు లాలకించువడువున నిట్టలు పొడుచుచు నేనదు
లుం దనకు సరి రావని నవ్వునురువున నురువులు చూపుచు నానావర్తంబుల వడిం
బడి పరిభ్రమించునుత్తుంగకుడుంగంబులు శరనిధిం దిరుగుమందరంబునందంబు
వహింప నొక్కొక్కపట్టునం దొట్టిన పెట్టువలు విలయసలిలమధ్యంబునం దేలు
సముద్దండఘట్టితమధుకైటభనిశాటమస్తకమస్తిష్కపరంపర ననుకరింప నతిరయం
బున ననేక దేశంబులు గడచి జడవిభ్రమాలాపయుం గలితకంకణహంసకారావయు
మనోహరపులకాంకురయు వికీర్ణవేణియు విలులితమకరికయు సమున్నతోత్కలి
కయు నై సరిద్రమణసంగమోత్సవంబు గైకొనియె నప్పుడు.

62


మ.

అరరే బాపురె చాగురే బళిరె మే లాహా మఝా యంచు నం
బరమార్గంబునఁ జేరువ న్నిలిచి సప్తర్షుల్ విమానాంతరాం

తండోలాయితఘంటికాఘణఘణధ్వానార్భటీబంధబం
ధురవాగ్గుంభవిడంబితాంబరధునీదుర్వారగర్వోర్ములై.

63


మ.

కలకాలంబును నన్నదాన మొసఁగం గాంక్షించి యామంబులో
పల నే సస్యము విత్తి పండనితపఃప్రాధాన్య మేధాన్య మి
ట్టలవోకం జదలేటినీరు మృతమాయాధేనుపై దేనివా
రల దేజీవన మంచుఁ దన్ను ఫణితిప్రౌఢిం బ్రశంసింపఁగన్.

64


సీ.

విని గౌతముండును వీరు మాయాధేను వనినకారణ మేటి దనుచు యోగ
దృష్టి విచారించి దేవదారువనాంతరాగతమునులధౌర్త్యంబు నిశ్చ
యించి చాకుండ రక్షించిన మఱవ కుండంగ బొమ్మలఁ బెట్టుభంగిఁ దమ్ముఁ
గఱవుకాలంబునఁ గాచిన న న్నెట్లుగా నిట్టిగోహత్యగానిఁ జేసి
రనుచుఁ గటమర లదరంగ నౌడు గఱచి, బొమలు ముడివడ లోచనాంతములు జేగు
రింపఁ గోపంబు చెమట వర్షింప హస్త, మున వియద్గంగ సలిలంబు పుడిసిలించి.

65


మ.

కలకాలంబుఁ గృతఘ్నులై కపటులై కైవల్యదూరాత్ములై
మలినీభూతమనస్కులై సుకృతకర్మభ్రష్టులై కష్టులై
తల లింగంబులు మేన బూడిదలు గంతల్ బొంతలుం దాల్చి శా
స్త్రుల వేదజ్ఞుల సర్వదైవతములన్ దూషించుపాషండులై.

66


క.

పోవుదురు గాక దారువ, నీవాచంయము లటంచు నిష్ఠురతరవా
చావైఖరిని శపింపం, గా వైమానికులు మునులు గౌతముతోడన్.

67


క.

భట్టారకత న్మునులకు, నట్టే కావలెఁ గృతఘ్నులై యీకరణిన్
వట్టిపెనురట్టు నీకున్, గట్టినకట్టిఁడుల కైనఁ గారుణ్యమునన్.

68


వ.

అస్మదీయప్రార్థనం బంగీకరించి భీషణభవదమోఘరోషభాషణఫలంబు కలియుగం
బున ననుభవించునట్లుగా వారల ననుగ్రహింపుము నీవు దెచ్చినది గావున నిమ్మహా
నది గౌతమీనామంబును వరదానంబున వచ్చి గోవుమీఁదఁ బ్రవహించుటం జేసి
గోదావరీనామంబును బూని రంగతరంగకోలాహలమిషంబున నీకీర్తి ఘోషించుచు
భువనపావనియై వర్తించుచు నుండు మహానుభావా మేము పోయి వచ్చెద మని
గౌతముని వీడ్కొని కైలాసంబునకు వచ్చి నాకు నుమాసమేతునకు మ్రొక్కి
దేవా మావంశంబువార లైనదేవదారువనతాపసులు గౌతమునిశాపంబుకతంబునం
గలియుగంబునఁ బాషండులు కాఁ గలరు వారలకు నాధారంబుగా నొక్కశా
స్త్రంబు గల్పింప నవధరింపు మన లక్షగ్రంథపరిమితంబును వేదసమ్మతంబు నగు
విశ్వాససంహిత గల్పించితి నేతదాధారంబునం గొందఱు దాంభికులు ధనలోభం

బున లోకవంచకులై తారు వేరువేర మతంబులు గల్పింపుదు రవి వివేదబహిష్కృతం
బులు మద్విరచితవిశ్వాససంహితానుసరణప్రసక్తులు భక్తియుక్తులు నగువారు ముక్తి
యుక్తు లగుదురు గాని యితరమతావలంబనంబున మేమే రుద్రస్వరూపుల మను
కొనుబైలాలికులకు ముక్తి లేదు. తద్బైలాలికప్రకారంబు వినుండు.

69


సీ.

తొల్లి బృందారకద్రోహిసంహరణార్ధ మే మహాభైరవాకృతి వహించి
బెట్టుగా రణములో నట్టహాసము చేయ దొరిఁగె నుచ్ఛిష్టబిందువులు నాము
ఖమునఁ దద్బిందుసంఘమున సురాసవప్రియులు రుద్రులు పుట్టికి శతకోటి
సంఖ్యాకు లేతదర్చకులు బైలాళికసంజ్ఞతో గౌతమశాపదగ్ధ
మునులు కలికాలమునఁ బుట్టి మోహపాశబద్ధు లయ్యెద రందుఁ బాభ్రవ్యశాండి
లాదు లల్పాగసులు గాన వేదమార్గ, పాశుపతిదీక్షచే ముక్తి వడయఁగలరు.

70


క.

అని చెప్పిన సపర్షులు, చనిరి నిజావాసములకు సంతోషమునన్
వినిపించితిఁ గుంభజముఖ, మునులకు ఘనమోహశాస్త్రములగతి దెలియన్.

71


మ.

ధరణీనాయక యిట్లు మౌనిపరిషద్వంద్యుండు రుద్రుండు సా
దరవాక్యంబుల నాన తిచ్చుటయు నేఁ దద్దివ్యదివ్యాంఘ్రివా
రిరుహద్వందవినమ్రమస్తకుఁడనై మృత్యుంజయా మీరు ము
గ్గురు నేయేపనివేళఁ గర్త లది నాకుం జెప్పు మన్నన్ గృపన్.

72


క.

పరతత్వం బగువిష్ణుఁడు, హరి యనఁగా హరుఁ డనంగ నజుఁ డనఁగఁ జరా
చర్చ మేలు ననెడు వేదాం, తరహస్యం బెఱుఁగ లేరు నరు లజ్ఞానుల్.

73


సీ.

నిత్యుఁ డావిష్ణుఁ డాదిత్యుఁడై పదిప్రకారంబుల దేవకార్యంబు దీర్చు
యోగమహైశ్వర్యయుక్తి నాతడు ప్రతిద్వాపరంబున మానవత వహించి
లోకోపకారార్థమై కొల్చి నాచేత వరములు వడయు నవ్వనజనాభుఁ
గృతయుగంబున నేను నుతియింతుఁ జతురాస్యుఁ డెప్పుడు నను భజియించుచుండు
స్రష్ట నుతియింతు శిశువనై సృష్టి వేళ, నతఁడు మొద లైనసుర లెల్లఁ గృతయుగమున
లింగతనుఁ డైననన్నుఁ గొల్చి పడయుదురు, పరమశివయోగసౌఖ్యసంపత్సమృద్ధి.

74


క.

వనజాసనాండకోటుల్, తనురుహరంధ్రంబులం గలసహస్రశిర
స్కునిఁగా నారాయణదేవుని భావింతురు ముముక్షువులు చిత్తమునన్.

75


గీ.

వేదమార్గరహస్యైకవేత్త లైన, భూనిలింపోత్తములు యజింపుదురు బ్రహ్మ
యజ్ఞమున బ్రహ్మ నెప్పుడు నట్టి బ్రహ్మ, నాఁగ వేదంబు సుమ్ము వింధ్యప్రమథన.

76


గీ.

వినుము శివుఁ డనఁగా విష్ణుఁ డనఁగ శంక, రుం డనఁగ నాదినారాయణుం డనంగఁ
బూరుషోత్తముఁ డన విశ్వపూర్ణమహిమఁ, బ్రస్తుతింపంగఁబడుఁ బరబ్రహ్మ మెపుడు.

77

సీ.

మఖములఁ జేయుహోమపశుహింసలు రౌద్రకృత్యంబు లందు నే నెపుడు నుందుఁ
గ్రమముతో నెఱుఁగుము కర్మవేదవ్రతంబులు ఋగ్యజుస్సామములు ననంగ
మేము మువ్వురము సుమీ సందియము లేదు యోగంబులో విష్ణుఁ డుండు వేద
ములలో సరోజగర్భుఁడు నిల్చుఁ గర్మంబులో నే వసింతు మాలోన నిట్లు
వేరు లేకుంట తెలియక కారులాడు, పక్షపాతులు నరకకూపానఁ గూలు
దురు విభేదంబు లేని పెంద్రోవ నడుచు, మంచివారికి మోక్షసంపదలు గలుగు.

78


శా.

కుంభీసంభవ యింక నొక్కకథ నీకుం జెప్పెదన్ మున్ను న
న్నంభోజసనుఁ డీచరాచరము చేయం బంప నేతత్క్రియా
రంభప్రౌఢిమ చూప నోపక పరబ్రహ్మంబు భావించుచున్
గంభీరాంబుధిలో మునింగి తప మేకగ్రాహినై సల్పఁగన్.

79


క.

ఆలో నేకాదశనరు, లాలోలప్రళయదహనహళహళిహేలా
భీలాత్మదేహకిరణ, జ్వాలలచేఁ దజ్జలంబు సలసలఁ గాఁగన్.

80


క.

దొడిదొడి వెడలుడు మీ రె, క్కడ పోయెద రెవ్వ రేమికార్యం బని నే
నడిగిన నూరక దురుదుర, నడిచిరి నామాట విని విననిచందమునన్.

81


ఉ.

అంతట వచ్చె నొక్కఁడు మహాకృతి దాల్చినపూరుషుండు క
ర్ణాంతవిశాలనేత్రము లహర్ముఖనిర్మలనీరజాళితోఁ
బంతము లాడ నల్గడలఁ బర్వెడుదేహరుచుల్ తటిల్లతా
క్రాంతకనాఘనచ్ఛవిపరంపరసొంపు నధఃకరింపఁగన్.

82


క.

వచ్చినఁ గని నీ వెచటికి, విచ్చేసెద వెవ్వ రిపుడు వెడలినపురుషుల్
నిచ్చలపుఁగరుణ నామది, ముచ్చట దీఱంగఁ జెప్పు ముదమున నన్నన్.

83


క.

కొండికనగవుల వజ్రపుఁ, గుండలములరుచులు పెనలుగొన నాతో మా
ర్తాండులు వారలు తత్ప్రవ, రుం డగువిష్ణుండ న న్నెఱుంగవె రుద్రా.

84


మహాస్రగ్ధర.

స్థూలాస్థూలప్రభావైశ్రుతిమకుటమణిస్తోమమై జీవపృథ్వీ
కీలాలేంద్వజమిత్రాగ్నిపవనసఖమై కేవలాత్మైక్యపాధా
రాలై పైతామహాండప్రసవసముదయస్రగ్ధకైదుగ్ధవైరా
దాలంబక్షోణిభృన్మోహనరుచి యయి రుద్రా భవన్మూర్తి మించున్.

85


క.

నీసత్వ మెఱుంగవు గా, కీసకలములోనఁ జూడ నేవేల్పులు నీ
తో సరి యని బహువిధముల, నాసర్వేశ్వరుఁడు నన్ను నభినుతియింపన్.

86


క.

ఏను గృతాంజలియై పది, యేనుఁ బదియుఁ దత్వములకు నెక్కు డగుచు వే
యేనులకైదువుచే న, య్యేనుఁగు రక్షించినతని ని ట్లంటి మునీ.

87

గీ.

కోటిజిహ్వలు మోములు కోటి గలుగు, కోటినలువలు దా రొకకోటి యగుచు
గోటికల్పాలు పొడగ నీగుణములోనఁ, గోటి కొకపాలు దెగదు వైకుంఠనిలయ.

88


గీ.

శాంతులై నిన్నె నమ్మి నిశ్చలసమాధి, గలుగువారికిఁ దనుదాన కానవచ్చు
నాత్మ నీమూర్తి శుద్ధస్వయంప్రకాశ, తత్వ మగునీకు లేదు పృథగ్వ్యవస్థ.

89

ఏకాక్షరకందము.

నానాననునిననూనున, నేను నినుననున్ను నెన్న నీనీననిను
న్నా నౌననోన్నినానౌ, నేనేనను నన్ను నాన నేనను నన్నన్.

90


మ.

దయతోఁ జూచి రమాధినాయకుఁడు రుద్రా యెన్నఁగా భేద మిం
తయు లే దెప్పుడు నీకు నాకు నిది తథ్యం బేమి గాంక్షించి వి
స్మయదం బైనతపంబు చేసెద వనన్ సర్వేశ నన్నున్ జగ
త్రయనిర్మాణము చేయ నంపె నజుఁ డేతత్ప్రౌఢి నా కిమ్మనన్.

91


వ.

నీవు సర్వజ్ఞుండవు సుపర్వసార్వభౌముండవు నీకు నీభూతనిర్మాణం బెంతటిపని
యేతదర్థంబునకు నింత చింతింప వలవదు బలవదున్మదరక్షోవిక్షోభితదివిజరక్షణా
ర్థంబు మూర్తిమంతుండనై మర్త్యంబున నెప్పు డెప్పు డవతరించెద నప్పు డప్పుడు
ని న్నారాధించి నీచేత వరంబులు వడసెద నది నిమిత్తంబున నీవు సర్వదేవ
పూజ్యుండ వని వరం బిచ్చినం గైకొని శ్రీవత్సలాంఛన నామీఁద వాత్సల్యంబు
గలిగెనేని వత్సరశతంబు నాకు వాహనంబ వగు మనిన నద్దేవదేవుండు సానుకంపం
బునం గంపమానశంపాపరంపరంబును జృంభమాణగంభీరగర్జితంబును భాసమాన
పీతచ్ఛాయంబును లక్ష్యమాణసురాధ్యక్షచాపంబును వర్ధమానజలౌఘంబు నగు
మేఘంబై నన్ను వహించి తజ్జలంబు వెడలి సముద్రంబున శయనించునలవాటున
నీరు గ్రోల వ్రాలుచు లక్ష్మీకుచంబులపై నొరగునలవాటునం గులగిరిశిఖరంబుల నొర
గుచుఁ దనకు మహిళ యగుమహీలలనకు నెలమి పుట్టించునలవాటునం దొలకరి
చినుకుల నెలమి పుట్టించుచు నీలకంఠుఁడ నగునాకు నెక్కుడు ప్రియంబు సలుపు
నప్పుడు.

92


మ.

ఘనగర్జల్ సకిలింత లాశ్రితబలాకల్ తెల్లజల్లుల్ సకం
పనశంపాలతికల్ పసిండిసగతుల్ మాహేంద్రచాపంబు మో
హనరత్నంబులవాగెత్రాడు వడగం డ్లాస్యస్రవత్ఫేన మై
తనరం దజ్జలదంబు కైరఁ డెగయున్ ధారావిహారంబులన్.

93


సీ.

ఈరీతి నన్ను నూఱేండ్లు వహించి మేఘత్వంబు మాని సాకారుఁడై స
రోరుహనాభుండు రుద్ర ము న్నరుదెంచిన పదునొక్కండ్రుదినకరులకును

బ్రముఖుఁడై విష్ణునామముఁ గలమామకాంశజుఁడు పండ్రెండవచండభానుఁ
డవనిపై నుదయించు నతని నీవు భజింపు మేనును నిను భజియింతు ననుచుఁ
బలికి నారాయణుండు తజ్జలములోన, లీనుఁడై యుండె నాతండు లేనిచోటు
లేదు తద్దేవుసరి వేల్పు లేదు వేఱు, లేదు నాకును నతనికి లేశ మైన.

94


ఉ.

వేదపురాణసార మిది వింధ్యజిదాదిమునీంద్రులార సం
వాదము మాని యజ్ఞమున వారిజనాభుని కగ్రపూజ లిం
డీదివిజాలికిన్ మునుల కీసనకాదికయోగికోటికిన్
గా దన రాదు సమ్మతము గావున నాపలు కెల్లవారికిన్.

95


క.

అని పలికిన రుద్రుని శంభుని శాశ్వతు నజుని విశ్వమూర్తి లలాటా
క్షుని శూలపాణిఁ బొగడుచు, మునులు నుతులు చేసి వినయముకుళితకరు లై.

96


శా.

దేవా దేవరదివ్యవాక్యములచేఁ దీఱెన్ మహాసంశయం
బీవాత్సల్యము మాపయి న్నిలిపి సర్వేలాప్రమాణంబుఁ బా
రావారాద్రినదీవనస్థితులు నీబ్రహ్మాండవిస్తారముం
బ్రావీణ్యంబున నానతి మ్మనిన నారాజార్ధకోటీరుఁడున్.

97


వ.

నారాయణస్మరణదూరీభవత్తములార తాపసోత్తములార బ్రహ్మవిష్ణువాయుపురా
ణంబుల నతివిస్తృతం బగునీభూగోళప్రపంచంబు గొంచెంబున వినిపించెద మున్ను
సకలవేదవేద్యుండు నాద్యంతరహితుండు నప్రమేయుండు నగు నారాయణుండు
యోగనిద్రాసుఖం బవధరింప నద్దేవునాభీసరోవరంబున విమలం బగు నొక్క
కమలంబు మొలచె నందు నల్పేతరప్రపంచకల్పనాశిల్పి యగువిరించి సంభవించి
మొదల సనకసనందనసనత్కుమారాదిపరమయోగివరులు నిర్మించి వెనుక స్వాయం
భువుం డనుమనువును మరీచ్యాదిదక్షాంతంబుగా నవబ్రహ్మలను సృజియించె స్వా
యంభువమనువు ప్రియవ్రతోత్తానపాదు లనుతనయుల నిద్దఱిం గనియె తత్త్రియ
వ్రతుం డగ్నిధ్రు మేధాతిథి జ్యోతిష్మంతు ద్యుతిమంతు వపుష్మంతు హవ్యు సవనుం
గని వారిలో నగ్నిధ్రు జంబూద్వీపంబున మేధాతిథి శాకద్వీపంబున జ్యోతిష్మంతుఁ
గుశద్వీపంబున ద్యుతిమంతుఁ గ్రౌంచద్వీపంబున వపుష్మంతు శాల్మలిద్వీపం
బున హవ్యు గోమేధద్వీపంబున సవనుఁ బుష్కరద్వీపంబునఁ బట్టంబు గట్టె నా
సవనునకుం గుముదధాతకు లనుకుమారులు మహావీరు లిద్దఱు జనియించి నిజనామం
బుల ధాతకీషండకౌముదపండంబు లనుదేశంబులు రెండు గోమేధద్వీపంబునఁ
గల్పించుకొనిరి శాల్మలాధిపతి యగువపుష్మంతునకుఁ గుశలవిద్యుతిజీమూతు లను
సుతులు మువ్వురు గలిగి తద్ద్వీపంబునం దమతమనామంబులఁ గౌశలంబును

వైద్యుతంబును జైమూతంబు ననుదేశంబులు గల్పించిరి క్రౌంచద్వీపనాయకుం డగు
ద్యుతిమంతునకుం గుశలమనోనుగోష్ణవాచివరాంధకారకేతుమునిదుందుభు లనునం
దను లేడుగురు గలిగి తత్క్రౌంచంబునం దమతమనామంబుల దేశంబులు గల్పిం
చిరి కుశద్వీపవల్లభుం డగుజ్యోతిష్మంతున కుద్భిదుండును వేణుమంతుండును
ద్విరథుండును లంబనుండును ధృతియును బ్రభాకారుండును గపిలుండును నన
నేడుగురుకొడుకులు గలిగి తమతమనామంబులం గుశద్వీపంబున వర్షంబులు గల్పిం
చిరి శాకద్వీపనాథుం డగు మేధాతిథికి నాభి నయన శిశిర శివ క్షేమక ధ్రువు లను
తనూజు లాఱుగురు గలిగి తత్కుశద్వీపంబునఁ దమతమనామంబుల నాఱువర్షం
బులు గల్పించిరి యిట్లు స్వాయంభువమన్వంతరంబునఁ బ్రతికల్పంబున భువనంబు
సుప్రతిష్ఠితం బగు నగ్నిధ్రసంభవుం డగునాభికి నందనుఁ డగుఋషభువలన భర
తుండు జనియించి జనకానుశాసనంబున హిమగిరిదక్షిణభాగంబున భారతవర్షంబు
సకలలోకోత్కర్షంబుగా నేలె నతనికి.

98


సీ.

పుట్టిన సుమతికిఁ బట్టియౌ తైజసువలనఁ ద్రసుం డనువాఁడు గలిగె
తత్సూనుఁ డైనయింద్రద్యుమ్నతనయుండు పరమేష్టి ప్రతిహర్తఁ బడసె నాత
నిసుతుండు నివితుకు న్నేత జనించె వానికి నభ్యపాత జనించెఁ దత్త
నయుఁ డైనప్రస్తోతనందనుండు విభుండు పృథుఁ గాంచె గయుఁ డుదయించె నతని
కతనికి నయుం డతనికి విరతనృపాలుఁ, డతఁడు గనియె మహావీర్యుఁ డతనివలనఁ
బొడమె ధీమంతుఁ డాతనిపుత్రకుఁడు మ, హానుభావుండు తత్సూనుఁ డైనత్వష్ట.

99


క.

కనియె విరాజుని నాతఁడు, గనియె రజోనాము నతఁడు గనియె మహాయో
ధనసవనసమయరిపుపశు, హననపరాయతచిత్తుఁ డగునరజిత్తున్.

100


తరళ.

అతని కుద్భవ మైరి నూఱువురాత్మజుల్ విబుధావన
వ్రతులు వారలపుత్రపౌత్రపరంపరల్ చతురబ్ధివే
ష్టితవసుంధర యెల్ల నిండిన సృష్టిలోఁ గలజంతుసం
తతులు వర్ధిల్లె నంతనుండియు నాడునాఁటికి నీక్రియన్.

101


క.

వలసెఁ బ్రసంగవశంబునఁ దెలుపంగా నేకసప్తతిమహాయుగముల్
నిలిచినస్వాయంభువమను, తిలకమువృత్తాంత మెల్ల దీనిధులారా.

102


ఉ.

నేరెడుదీవి నెల్లెడల నిల్చినతీర్థములున్ వనంబులున్
వారిధులు న్నదు ల్గిరులు వర్షములున్ మొద లైనవానివి
సారము శీతభానురవిసంచరణంబులు భూతమానముల్
మీరు నితాంతకౌతుకసమీహితబుద్ధి వినుండు చెప్పెదన్.

103

క.

యోజనలక్షపరిమితం, బాజంబూద్వీపచక్ర మందుఁ గడలఁ బై
డౌజసమణినేమికరణి, రాజిల్లును లవణజలధిరాజం బెపుడున్.

104


క.

ఆదీవికిఁ బ్రాగుత్తర, మేదిని హిమహేమకూటమేరుశిఖరముల్
పాదుకొని పూర్వచరమమ, హోదధులం దఱిసి మెఱయు నుర్వీధరముల్.

105


క.

ఆగిరులలోన మేరువు, ప్రాగుత్తరదక్షిణాపరదిశలఁ దెలుపున్
జేగురు హళఁదియు నలుపును, నై గుఱుతుగఁ దెలుపు బ్రాహ్మణాదికజాతుల్.

106


సీ.

వరుసతో హరినీలవైడూర్యశుక్లహిరణ్మయశ్వేతబర్హద్విరేఫ
శాతకుంభప్రభాన్వీతంబు లహియక్షసిద్ధచారణదివ్యసేవితములు
సాహస్రనవకయోజనవిస్తృతాంతరవిష్కంభములు పృథివీధరములు
క్రేవల నిలువ నిలావృతాహ్వయవర్ష మాలవాలాకృతి నావరింప
నడుమఁ జతురస్రవృత్తమై నాటు గలిగి, ధగధగాయితకనకరత్నప్రతాన
కిరణముల నాలుకలు గ్రోయు కీలములుగ, సురనగంబు విధూమాగ్నికరణి మెఱయు.

107


చ.

యతివరులార నీలనిషధాద్రులు తక్కినవర్షభూధర
ప్రతతులలోన మిక్కిలియుఁ బ్రస్తుతి గన్నవి లక్షయోజనా
యతములు వీనిగూర్చి కిరుదైనవి చావున హేమకూటప
ర్వతమును మంచుగొండయును ద్వాదశవింశతియోజనంబులన్.

108


సీ.

వర్షపర్వతమధ్యవర్తినానావిధజనపదస్థలులు వర్షంబు లయ్యె
నవి తొమ్మిది పరస్పరాగమ్యములు సరిద్ఘోరకాననజంతుపూరితములు
వీనిలో నాలుగు విలువంక లోడవంకలు నాల్గు చతురస్రకం బిలావృ
తంబు మేరువునకు దక్షిణోత్తరముల నుండు నెన్మిది చుట్టిరా నుండు నొకటి
యాయిలావృతవర్షంబు హత్తి యెడమ, వంకఁ గుడివంక నీలపర్వతము నిషధ
పర్వతము నుండు నీరెండుపర్వతముల, నడుమఁ గనుపట్టు మాల్యవన్మహిధరంబు.

109


చ.

అలఘుసువర్ణకూట మగునగ్గిరికిన్ ద్విసహస్రయోజనం
బుల పొడవున్ వెడల్పు మఱి ముప్పదినాలుగువేలయోజనం
బులనిడు పవ్విధంబునిడుపుం బొడవుం గలగంధమాదనా
చలము తదద్రిపశ్చిమదిశన్ నిలుచున్ వినుఁ డింకఁ జెప్పెదన్.

110


సీ.

కలిగె నవ్యక్తంబువలన నారాయణాత్మక మైనసలిలంబు తజ్జలమున
నడుమ నెన్బదివేలునాల్గుయోజనములయౌన్నత్యమును బదియాఱువేలు
యోజనంబులపాఁతు నొగి నంతవలమును వలమున కినుమడింతలవెడల్పు

గలిగి కర్ణికవలె నున్నకనకగిరికిఁ, గేసరాకృతి భద్రాశ్వకేతుమాల
భారతోత్తరకురువర్షపర్వతములు, నిలుచుఁ గెళవుల లోకవర్ణితము లగుచు.

111


చ.

మునివరులార తత్కుధరమూర్ధమునం బదునాల్గువేలయో
జనములఁ జూడ నొప్పు సమచౌకపునెత్తము నిండి రత్నకాం
చనమయతోరణావరణసౌధవిలాసముచేతఁ జాలవ
ర్ణనమున కెక్కు నొక్కనగరంబు మనోవతి నాఁగఁ దత్పురిన్.

112


సీ.

సకలజీవులయందు సమబుద్దు లగువారు సత్యసంధత్వంబు జరపువారు
వెన్నీక రణములో విగతాసు లగువారు వివిధాధ్వరములు గావించువారు
పితృమాతృవచనంబు లతకరింపనివారు దానపరాయణు లైనవారు
బ్రహ్మవిజ్ఞానతత్పరత గల్గినవారు నిజకులాచారంబు నెఱపువారు
నాదిగాఁ గలపుణ్యులు నమరయక్ష, గరుడగంధర్వకిన్నరఖచరదైత్య
సిద్ధసాధ్యులు తనపాదసేవ చేయ మహిమఁ గొలువుండు నెపుడు తామరసభవుఁడు.

113


వ.

ఇవ్విధంబున బ్రహ్మచర్యానిర్వికల్పులు ననల్పవిజ్ఞానాకల్పులు స్త్రీశూద్రసం
కల్పులు నై పరమయోగిపుంగవులు పూజానమస్కారాదికంబులం గొలువ నున్న
నలువకు రాజధాని యైనమనోవతీనగరంబు దనకు మణికిరీటంబుగా మెఱయు
మేరునగరాజంబునకు రెడ్డికంబునుం బోలె నొడ్డునం బదివేలయోజనంబులు పొడ
వున ముప్పదివేలయోజనంబులు నై చుట్టి వచ్చి వియచ్చరగవికఠోరఖురకర్షణ
విశేషితపరాగపద్మరాగద్యుతిద్విగుణశోణమకరందకందళితమందారహరిచందనప్ర
వాళం బగుచక్రవాళంబున సూర్యాదిగ్రహంబులు సంచరించు నన్నగంబుతూరు
పునెత్తంబున మత్తనక్తంచరదురవగాహంబును మణిమయగేహంబును రంభాదినటీ
నాట్యశాలామృదంగదింధిమధ్వనిసంపూర్ణంబును విమానశతసంకీర్ణంబును ధగధగా
యతధ్వజపటప్రసూతబహుసహస్రైరావతియు నగునమరావతిపురం బంద మందు
నందు నడుమ వజ్రవైడూర్యమయవేదికాసీను లైనసర్వదేవయోనులు సేవింప
సుధర్మాస్థానంబున నాఖండలుండు నిండుగొలు వుండు రెండవదిక్కునం దాదృశ
గుణవిరాజితం బైనతేజోవతీపురంబున సర్వదేవనమస్కృతుండై శిఖాశతసహస్ర
దుర్నిరీక్షదేహుండు హవ్యవాహుండు వెలుంగుచుండు మూఁడవదిక్కున సకలసౌ
భాగ్యకోకిలంబులకు నామని సంయమని శ్రమనుం డధివసించు నాలవదిక్కున నఖిల
నగరవిజిష్ణుగుణ కృష్ణగుణ కర్బురుం డేలు నేనవదిక్కున సాధ్యసిద్ధపతి వరుణుండు
పరిపాలించు నాఱవదిక్కున విరచిత సర్వనగరగర్వకుట్టణంబు గంధవతీపట్టణంబు
నం బ్రభంజనుండు విజృంభించు నేడవదిక్కున నిరవధికనిధిసమూహోదయనక్షత్ర

విభుండు యక్షవిభుం డధ్యక్షించు నెనిమిదవదిక్కున మూర్తాపవర్గంబు స్వర్గం
బీశానుఁడు శాసించు యిది మేరుకర్ణికామూలప్రకారంబు.

114


క.

హరిదష్టపర్వముల నం, బరచుంబిశిఖరము లైనమర్యాదాభూ
ధరరాజము లెనిమిది గల, వరయం దదాధారమునఁ గదా మహి నిలుచున్.

115


గీ.

మందరము తూరుపున గంధమాదనంబు, దక్షిణంబున విపులభూధరము పశ్చి
మమునను సుపార్శ్వగిరి యుత్తరమున నుండు, శాతకుంభాద్రి కిట్టివిష్కంభగిరులు.

116


క.

శృంగములు నాల్గుతరువులు, భృంగశుకములువలె దైత్యబృందారకు లు
త్తుంగకుసుమఫలవాంఛా, సంగతిఁ దముఁ గొలువ మెఱయు సర్వర్తువులన్.

117


మ.

తరిగొండన్ గలశప్రమాణకుసుమోద్యద్గంధముల్ భూనభోం
తరసీమంబున వేయియోజనములన్ దాటంగ భద్రాశ్వవ
ర్షరమాకేతనమై కదంబధరణీజం బొప్పు నాచెట్టుచ
క్కి రమించున్ హరి సర్వకాలము హయగ్రీవావతారంబునన్.

118


సీ.

గంధమాదనమునఁ గల దల్లొనేరేడు దంతులయంత లందలిఫలములు
పక్వంబులై రాలి పగులఁ దద్రసమున జంబూతరంగిణి సంభవించె
నాయేటిసలిలంబు లమృతపూరముకంటెఁ జవి యని క్రోలు నిర్జరగణంబు
లచట జాఁబూనదం బనుపైఁడిఁ జేసినతొడవులు ధరియింపుదురు దివిజులు
భారతాహ్వయవర్షశృంగార మగుచుఁ, బ్రబలి సర్వర్తుఫలపుష్పభరిత మైన
దానిమహిమంబు వర్ణింపఁ దరమె పేరు, కలిగె నీదీవి కాచెట్టుకతనఁ గాదె.

119


చ.

విపులధరాధరాగ్రమున వేలుపుమూఁకలరచ్చరావి ది
వ్యపరిమళంబుతోఁ గడవలంతలు పండుల విఱ్ఱవీఁగు నా
కిపతి పయోధి ద్రచ్చునెడఁ గేతువుపై మణిమాల చేర్పఁ బే
రు పడియెఁ గేతుమాల మన రూ పగువర్షము దానిపేరిటన్.

120


సీ.

వినుఁడు సుపార్శ్వపృథ్వీధరంబున మధుస్రావివిశాలపత్రములతోడ
శతయోజనాయతశాఖాశిఖాలంబమానప్రసూనదామములతోడ
నమృతసంపూర్ణవిద్రుమకుంభపరిమాణపరిపక్వఫలపరంపరలతోడ
గంధర్వసురబాలికాడోలికాకేలికారణఘనశిఫాగ్రములతోడఁ
జాలఁ గనుపట్టు నొకవటక్ష్మారుహంబు, నలువ మానససుతులు సనత్కుమారు
లనుజు లేడ్వురు కురుసంజ్ఞు లందు నిలువఁ, గలిగె నుత్తరకురుదేశములకుఁ బేరు.

121


వ.

ఇది విష్కంభవర్తనం బింక మందరగంధమాదనవిపులసుపార్శ్వపర్వతప్రాంతంబు
లం గలవనంబుల వనంబులలోనిసరోవరంబులు సరోవరంబుల దరులం గలగిరుల

నెఱింగించెద మందరపరిసరంబున సర్వర్తువర్తమానఫలపుష్పపల్లవాస్వాదమోదిత
శుకచంచరీకపికపత్రరథం బగు చిత్రరథం బనువనంబు మెఱయుఁ దదుద్యానమ
ధ్యంబున మరందరసమదాంధపుష్పంధయబంధుసౌగంధికగంధజనితగంధర్వవినో
దం బగునరుణోదం బను కాసారంబుతీరంబున సితాంతఃకుముదకరవీరమహానీలకుబ్జ
సిబిబిందుకుముదవేణుమత్సుమేఘనిషధవేదపర్వతంబు లనం బదునొకండుకొండ
లుండు గంధమాదనసవిధంబున రక్షోయక్షసిద్ధవిద్యాధరాదికాహ్లాదనం బగుగంధ
మాదనం బనువనంబు గనుపట్టుఁ దదారామసీమంబున నిజాధీనాయతదివ్యమౌని
మానసం బగుమానసం బనుకొలనికెలంకునఁ ద్రిశిఖర శిబిర కపింగ పిశంగ రుచక
సానుమ త్త్రాతభ విశాఖ శ్వేతోదర సుమూల వసుధాధర రత్నధార రైకశృంగ
మహామూల గజశైల విశాఖ పంచశైల కైలాస హిమవంతంబు లనం బందొమ్మిది
నగంబు లంద మొందు విపులాచలసమీపంబున నిరంతరవిహరమాణచరమకకుభ్రా
జం బగువైభ్రాజం బనువనంబు విలసిల్లు తాత్కాంతారాంతరంబునం బరిహృత
మజ్జనజగజ్జనమనస్తోదం బగుసితోదం బనుసరోవరంబుదరిఁ గపిల పింజర భద్ర
సురస మహాబల కుముద మధుమ దంజన మకుట కృష్ణ పాండుర సహస్రశిఖర
పారియాత్ర శృంగవజ్జారుధు లనఁ బదియేనుసానుమంతంబులు గానంబడు సుపా
ర్శ్వపార్శ్వంబున సంతతవసంతకంతుభవనం బగుసవితృవనంబు శోభిల్లుఁ దదాక్రీ
డాక్రోడనంబున డిండీరమండలప్లవరిరంసహంససంవత్సరిహసిత సముద్రం బగుమహా
భద్రం బనుకమలాకరంబుసకాశంబునం బెక్కుశైలంబులు నిలుచు నీనగంబుల
యెడనెడలం గలకొలంకులుం గోనలు వనంబులు బయళ్ళును సవిశేషంబుగా
నెఱింగించెద వినుండు.

122


గీ.

కుముదశైలసితాంతాచలముల నడుమ, నూఱుయోజనములును మున్నూఱుయోజ
నములు వెడలుపు నిడుపునై విమల మగుచు, శ్రీసరోనామసరసి ప్రసిద్ధి మెఱయు.

123


శా.

ఆకాసరములోన పద్మవనమధ్యంబందు నక్తందివ
వ్యాకోచం బయి కోటిపత్రసహితంబై బాలభానుప్రభం
బై కానంబడు నొక్కతామర సుగంధాలోలరోలంబ మం
దేకాలంబు వసించు లక్ష్మి సురయోగీంద్రుల్ తనుం గొల్వఁగన్.

124


సీ.

తచ్ఛ్రీసరస్తీధరణి నిన్నూఱుయోజనములనిడుపు యోజనశతంబు
వెడలుపు గలుగుమారెడుతోఁట విలసిల్లు శ్రీవనం బనఁగఁ బ్రసిద్ధ మగుచు
నందలితరులు క్రోశార్ధోన్నతములు శాఖాసహస్రచ్ఛన్నఖస్థలములు
వానిపువ్వులు ఫలావళులు భేరిప్రమాణము లమృతోపమానములు తొడిమ

లూడి తొటతొటఁ దఱుచుగా నుర్వి రాలి, పడఁగఁ బ్రవహించురసనదీప్రకరముల వి
హారముల సల్పు సురసిద్ధయౌవతంబుఁ, దాను ననవరతంబుఁ బద్మావధూటి.

125


గీ.

ఇంక మణిశైలమునకు వైకంకమునకు, నడుమ బిల్వవనం బంత నిడుపు వెడలు
పునను గనుపట్టుఁ బంకజవనము దాని, చెట్టులకు నెల్ల నరగూకవెట్టుపొడవు.

126


శా.

వ్యామగ్రాహ్యము లుజ్జ్వలత్కనకతుల్యచ్ఛాయముల్ సౌరభ
వ్యామోహీకృతచంచరీకము లపూర్వంబుల్ ప్రసూనంబు లా
భూమీజంబుల నెల్లకాలముల నొప్పుం దద్వనీవాటికం
బ్రేమం గశ్యపుఁ డుండు దైత్యసుమనోబృందంబు సేవింపఁగన్.

127


సీ.

ఉండు మహానీలకుండలగిరులమధ్యమున సుఖానది తత్తటమున
ముప్పదియోజనంబుల వెడలుపును నేఁబదియోజనంబులపరపుఁ గలిగి
తాళీవనము మించుఁ దఱచు నున్నతమునై పెరిఁగి యందలినల్లబేటిపండ్లు
కస్తూరికాలిప్తఖచరాంగనాఘనస్తనకుంభసంఖ్యంబు సలుపు నెపుడు
సిద్ధచారణగంధర్వసేవ్య మైన, యావనంబునఁ దిరుగు నైరావణంబు
స్వాదుఫలరసగంధంబు స్వప్రధాప్ర, భూతదానంబుగంధంబు ప్రోది చేయ.

128


క.

శతయోజనవిపులము దశ, శతయోజనదీర్ఘ మగుచుఁ జె ట్టొకఁ డైరా
వతదేవశైలమధ్య, క్షితిఁ గనుఁగొన నొప్పుఁ జిలుపచిలుప జలముతోన్.

129


చ.

భృతబహుపాదపం బయినరేగడినేల మహాపతంగప
ర్వతశిఖరాద్రిమధ్యమున రంజిలుచుండు నుదుంబరద్రుసం
తతి శతయోజనాయతము తత్ఫలముల్ కమఠోపమానముల్
సతతము వానితేనియలు జాలుకొనున్ బహునిమ్నగాకృతిన్.

130


క.

పండినతద్వనిఁ దేజ, శ్చండాంశుఁడు కర్దమప్రజాపతి ఫణభృ
త్కుండలపూజాపరుఁడై, యుండు మహామహిమ దేవయోనులు గొలువన్.

131


వ.

మఱియునుం బతంగతామ్రాభశైలంబులనడుమ శతయోజనవిస్తృతంబునుఁ దద్ద్వి
గుణాయామంబును సముద్దండపుండరీకమండలమండితంబును ననేకదేవగంధర్వా
ద్యుషితంబు నగుమహాసరోవరంబు గలదు తదంతరాళంబున రత్నమయంబు ననేక
ధాతువిచిత్రంబు నగుమహామహీధరంబు నూఱుయోజనంబులనిడుపున ముప్పది
యోజనంబుల వెడల్పున నుండు నక్కొండమీఁద వివిధమణితోరణప్రాకారగో
పురం బగుపురంబుబున నపరిమితవిద్యాధరసహస్రంబులు గొలువఁ బులోముం డధివ
సించు విశాఖశ్వేతపర్వతంబులనడుమ నున్నసరోవరంబుతూర్పుతీరంబున శాతకుంభ
కుంభప్రమాణపరిపక్వఫలరసానిశపింగపిశంగీకృతశుకశారికాకిశోరకాననం బైనసహ
కార కాననంబున సుగంధిగంధవహమదాంధపుష్పంధయగానంబులతోడ నిజగాం

ధర్వంబు సలుప గంధర్వులు విహరింతురు సమూలవసుధారధరాధరమధ్యంబున
ముప్పదియోజనంబులు వెడలుపు నేఁబదియోజనంబులనిడుపునుం గలబిల్వవనంబు
మెఱయు నందు నున్నమద్రుమవిద్రుమమద్యుతిఫలద్రుమంబుల జొత్తిల్లినమృత్తిక
పదతలంబులం గ్రొత్తలత్తుకతెఱంగున హత్తుకొన సంచరించుగుహ్యకమత్తకాశినుల
మొత్తంబులు మగలచిత్తంబులు మదనరసాయత్తంబులు చేయు వసుధారరత్న
ధారవసుధాధరంబులనడుమ ముప్పదియోజనంబులవెడల్పు నూఱుయోజనంబుల
నిడుపునుం గలిగి సతతవికసితకుసుమసౌరభంబు శతయోజనంబుల సోడుముట్ట
సిద్ధాద్యుషితజలాశయంబులు గనుపట్ట నుండుకింశుకవనంబునం బ్రతిమాసంబును
వాసరేశ్వరుం డవతరింప నిలింపకింపురుషాదులు సేవింపుదురు పంచకూటకైలాస
శైలంబులనడుమ సహస్రయోజనాయామంబును శతయోజనవిస్తారంబును హంస
పాండురంబు నైనభూమండలంబు గలదు కపిలశిఖశిఖరమధ్యంబున నూఱుయోజ
నంబుల వెడలుపు నిడుపునుం గలహేమశిలాతలంబున నడుమ వింశతియోజన
విస్తీర్ణంబును శతయోజనాయతంబు నగువహ్నిస్థానంబున సకలలోకక్షయకారి
యగుసంవర్తకజ్వలనుండు నిరంతరంబు నింధనంబు లేకయు వెలుంగుచుండు
వెండియు.

132


క.

ఘనమాతులుంగవన మం, జనకుముదాద్రులకునడిమిచక్కిన్ దశయో
జనమితము జంత్వగమ్యము, ననిశము సురగురున కిరవు నై విలసిల్లున్.

133


సీ.

సురసపింజరనగాంతరమున బహుశతయోజనాయతము నీరేజకుముద
సందోహమకరందనందదిందిందిరశ్రేణియు నగుసరోద్రోణినడుమఁ
గలదు యోజనపంచకప్రమాణం బైనవటవృక్ష మొకటి తద్వటముక్రింద
చంద్రవర్ణుఁడు సహస్రముఖుండు నీలవాసుండు నై వాసుదేవుండు నిలుచు
కుముద సాహస్రశిఖరమధ్యమున నేఁబ, దియును ముప్పదియోజనా లయిననిడుపు
వెడలుపును నైనయొకదివ్యవృక్షవాట, మమరు నింద్రుని కాశ్రయం బగుచు నెపుడు.

134


క.

వెలయుఁ బెనుబైలు నిషధా, చలకూటమునందు నడుదెసన్ సురభిశ్రీ
ఫలనిభకాకోలములన్, నలపుష్కరసోమదత్తనాగాస్పదమై.

135


గీ.

నాగశైలకపింజరాంతరములందు, మీఱుఁ జదరపునేల యిన్నూఱుయోజ
నములనిడుపున శతయోజనములవిరివి, ఫలితఖర్జూరగోస్తనీలలిత మగుచు.

136


మ.

అఱచేయిం బలె మేఘపుష్కరమహాహార్యాంతరాళంబునం
దఱవైయోజనముల్ వెడల్పును శతాయామంబునుం గల్గి య
త్తఱి వీరుత్తరుశూన్య మైనబయ లందం బొందు న న్నేలకుం
దఱచై నల్గడలం గొలంకులునుఁ గాన ల్మించుఁ జిత్రంబుగన్.

137

వ.

మౌనిపుంగవులారా యింక నానాగిరిప్రదేశంబులం బ్రకాశించుదేవతావకాశం
బులు వర్ణించెద నాకర్ణింపుఁడు సంతతవిహరమాణఖచరకాంతాపరివృతం బగు
సితాంతం బనుపర్వతంబున మహేంద్రవిహారధామం బైనపారిజాతారామాభి
రామం బగునక్కొండదండనుండుకుంజరం బనుశైలంబుమీఁద దానవపురంబు లెని
మిది గానంబడు వజ్రాంకం బనుపర్వతంబునఁ గామరూపు లైననీలకు లనురక్క
సులపురంబులు పెక్కులు గలవు మహానీలం బనుశైలంబున హయముఖనగరంబులు
పదేనుఁ గిన్నరనగరంబులు పదేనునుం గల వప్పురంబులు సౌవర్ణంబులు సబిలప్రవేశం
బులునై విలసిల్లు నందులకు దేవదత్తచంద్రాదులు రాజులు చంద్రోదయం బను
పర్వతంబున ననేకగణభూతకోటీసహస్రపరివారుం డగుమహాదేవుండు పరమయోగి
పుంగవులు సేవింప ననవరతంబును విహరించుచుండు వసుధారం బనువసుధాధరం
బున వసువులపురంబు లెనిమిది గొనియాడం దగు రత్నధారం బనుకుధరంబున
సప్తర్షిపురంబు లేడు చూడ నొప్పు నేకశృంగపర్వతంబునం జతుర్ముఖబ్రహ్మ వసి
యించు గజపర్వతంబున మహాభూతపరివృత యైనయాదిశక్తి యనురక్తి విహరించు
చుండు నాదిత్యవసురుద్రులకుం బొత్తులయిర వైనవసుధారం బనుగిరివరంబున
మహాప్రాకారతోరణంబు లైనదివ్యపురంబు లెనుబది గల వందు సభ్యవర్తననామ
ధేయులు నాయోధనసగర్వులు నైనగంధర్వు లధివసింతురు వారలకు రాజు రాజ
రాజు సునగంబున రాక్షసులకుఁ బంచకూటంబున దానవులకు శతశృంగంబున యక్షు
లకుఁ దామ్రాభంబున దక్షునకుఁ బురంబులు నూఱేసి గలవు విశాలంబున గుహ్య
కులును శ్వేతోదయంబున గరుడపుత్రుం డగుసునాభుండును హరికూటంబున హరి
యును గుముదంబునఁ గిన్నరులును నంజనంబున మహోరగులు నుందురు కృష్ణంబున
గంధర్వవిద్యాధరులపట్టణంబులు పదేడు గలవు సహస్రశిఖరంబున నుగ్రకర్ము లైన
దైత్యులు వసియింపుదురు హేమమాలియందు దివ్యపురసహస్రం బజస్రంబును
వెలుంగు నివి మొదలైనవి శేషంబు లన్నియును మేరువుమీఁదివకా నెఱుంగుఁడు
మఱియును.

138


గీ.

దేవఋషిచరితయుతమౌ దేవకూట, మనెడు పొలిమేరగుబ్బలియందు నూఱు
యోజనంబులు గరుడునియునికిపట్టు, రత్నరుచి నొప్పు దానిపార్శ్వంబునందు.

139


క.

బలవంతు లైనయాజ్ఞే, యు లనెడుగంధర్వవీరు లుండెడు పురముల్
గల వేడు నిడుపు వెడలుపు, నలువది ముప్పదియుయోజనము లందులకున్.

140


క.

ఉండుం ద్రింశద్యోజన, మండలమై సింహికాకుమారులపుర మ
క్కొండదఱిఁ గాలకేయులు, నుండుదురు సుధామ మనెడునొకపురమందున్.

141

క.

అప్పర్వతంబుయామ్యక, కుప్పునఁ బురి కామరూపకోటులయిరవౌ
ముప్పది నఱువదిరెండును, నప్పురికిని యోజనంబు లగలముఁ జూపున్.

142


గీ.

అన్నగంబునడుమ హాటకమయ మైన, శిఖరమందు మఱ్ఱిచెట్టు గలదు
దానిమూలమున సదా నిల్చు శ్రీమహా, దేవుఁ డభినుతప్రభావుఁ డెలమి.

143


రగడ.

వినుఁ డిఁకఁ గైలాసంబునఁ గలిగిన వివిధవిశేషంబులు వివరించెద
నొనరఁగ నగ్గిరిచదుమున నొకసభ యోజనశతవిస్తృతమై వెలుఁగును
అందుఁ గుబేరున కధివాసంబై యలరు విమానము పుష్పక మనునది
అందముగ మహాపద్మాదికనిధు లగ్గిరివరమున ననిశము నుండును
పాకశాసనప్రముఖు లగుదిశాపాలకులందఱు నందు వసింతురు
శ్రీకరముగ నగ్గిరి మందాకిని సెలయేఱై యనిశముఁ బ్రవహించును
కనకయు నందయు మొదలగునదు లగట్టుకుఁ జుట్టునుఁ గల వె న్నేనియు
కనుపట్టును దచ్ఛైలముతూర్పున గంధర్వులనగరంబులు నలువది
యోజనశతవిస్తారము గలయాయూళ్ళు సుబాహుఁడు హరికేశుండును
భ్రాజిష్ణుం డగుచిత్రసేనుఁడును బ్రముఖు లైనదొర లేలుచు నుందురు
పడమట యక్షులపట్టణములు నలువదియును నేఁబదియును యోజనముల
వెడలుపు నిడుపును గలవెన్నే నవ్పీళ్ళకు మణికర్ణాదు లేలికలు
దక్షిణమునఁ గిన్నరపురశతకము తళుకొత్తు విచిత్రక నవ్వీళ్ళకు
ప్రక్షీణారులు సుగ్రీవద్రుమభగదత్తాదులు నూర్గురురాజులు
హరునితోడి విరహంబునఁ బార్వతి యప్పర్వతమునఁ దప మొనరించెను
పురహరుఁడు కిరాతాకృతిఁ గైకొనెఁ బూర్వంబున నాభూధరమందును
జంబూద్వీపముఁ గలయఁ గనుంగొని శంకరుఁ డచ్చట గిరిజాయతుఁడై
యంబుజముఖు లచ్చరలకు నిరవై యలరు నుమావన మగ్గిరి నొక్కటి
యావనవాటికలోఁ బరమేశ్వరుఁ డర్ధనారిరూపముఁ గైకొనియెను
దేవసేనపతి గుహశరవణమును దేజరిల్లుచున్నది యచ్చోటనె
క్రౌంచపుష్కరచిత్రాంతరమునఁ దత్కార్తికేయునిఁ బట్టము గట్టుట
కాంచు సిద్ధమునిగణసంచారము కాలాపగ్రామం బాతూర్పున.

144


క.

తుహినగిరిమీఁద మెఱయును, మహిమ భృగూద్దాలపులహమార్కండేయ
ద్రుహిణతనూజులు మొదలగు, మహర్షిపుపుంగవులయాశ్రమసహస్రంబుల్.

145


సీ.

మఱియు మేరువుపడమట నున్ననిషధాద్రిమధ్యకూటము హరిమనికిపట్టు
తద్గిరియుత్తరతటమున విలసిల్లు ముప్పదియోజనములవిరివిని

రాక్షసేంద్రులనగరంబు లంబాఖ్యమౌ శైలంబుదక్షిణస్థలిఁ బ్రవేశ
పురమును బశ్చిమంబున దేవసిద్ధాదిపురములు మెఱయు నాధరణిధరము
శిరసుపై దివ్య మగుసోమశిల వెలుంగు, నందుఁ బ్రతిపర్వమున సోముఁ డవతరించు
బ్రహ్మ యాకొండ యుత్తరపార్శ్వమందు, నుండు నొకచోట సాకృతి నుండు వహ్ని.

146


మ.

కనకక్షోణిధరంబునుత్తరమునం గాంతి న్వెలుంగున్ ద్రిశృం
గనగం బగ్గిరితూర్పుశృంగమున వేడ్క న్నిల్చు నారాయణుం
డనఘుం డబ్జభవుండు మధ్యశిఖరంబం దుండు విశ్వాంతరా
త్మ నవీనేందుకళాధరుండు మెలఁగుం బాశ్చాత్యకూటంబునన్.

147


క.

ఇంగిలికము మణిశిలయున్, రంగుగ వైడూర్యరత్నరాజియుఁ దనలో
నం గలత్రిశృంగనగమున, సంగడి శోభిల్లు యక్షసాధ్యపురంబుల్.

148


క.

ఈసరవి సిద్ధలోకా, వాసము లగుకేసరాద్రివర్గంబులచే
భాసిల్లుమెఱుపుగర్ణిక, గా సరసిజలీలఁ బృథ్వి గడు నొప్పారున్.

149


వ.

ఈభూగోళప్రకారంబు సకలపురాణసాధారణం బిటమీఁద నదుల నామధేయం
బులు జన్మంబులు నెఱింగించెద వినుండు మొదల సోమాఖ్యం బగునాకాశసము
ద్రంబువలన నాకాశగామిని యగునది యుదయించె నది యింద్రగజక్రీడాస్థానంబై
చతురశీతిసహస్రయోజనోన్నతం బైన మేరువునకుఁ బ్రదక్షిణంబు చేయుచు నమ్మే
రునగోన్నతశిలలవలన జాఱి నాలుగుపాయలై యఱువదివేలయోజనంబులు నిరా
లంబనంబునఁ బ్రవహించుచు సితాలకానందాచక్షుర్భద్రాభిధానంబులు నాలుగు
ధరియించి యనేకసహస్రముఖప్రవాహంబుల భూధరంబులు వ్రక్కలించుచు
ముప్పదివేలయోజన౦బులనిడుపునం గేతుమాలవర్షంబున గంగ యనుపేరం బ్రవ
హించుచుండు నింక గంధమాదనపార్శ్వంబున నేకత్రింశత్సహస్రయోజనప్రమా
ణంబునం బ్రవహించువరగండిక వర్ణించెద వినుండు.

150


ఉ.

ఆవరగండికాతటములం దిరువంకలఁ గేతుమాలదే
శావళి యొప్పు నందుఁ గలయంగన లుత్పలమేచకాకృతుల్
పూవిలుకానిఁ బోలుదురు పూరుషు లందఱు కృష్ణవర్ణు ల
ప్పావనభూమిలో నిలుచుఁ బాయక బ్రహ్మసుతుండు నెమ్మదిన్.

151


క.

ఇది చిత్ర మచటిపనసల, మదిరినషడ్రసఫలాళిమధురససేవన్
ముదిమియుఁ దెవులును నెఱుఁగక, పదివేల్సంవత్సరములు బ్రతుకుదురు ప్రజల్.

152


సీ.

మాల్యవద్గిరిపార్శ్వమహిఁ బూర్వగండికానది ప్రవహించు ముప్పదియునొక్క
వేలయోజనములవిరివి నన్నదితటస్థలముల భద్రాశ్వజనపదములఁ

గాలాబ్దరుచిభద్రసాలవనం బొప్పుఁ దద్దేశజను లెల్ల ధవళరుచులు
దశసహస్రాయులై తనరారుచుందురు భామిను లందఱు పద్మగంధు
లందుఁ గులపర్వతేంద్రంబు లైదు వాని, చుట్లఁ గలిగినకొండలు కోట్లసంఖ్య
లచటిజనపదసీమలయందుఁ గలుగు, నదులు చెప్పెద సావధానమున వినుఁడు.

153


సీ.

శీతాంబువాహిని శీత మహావక్ర చక్ర పద్మావతి చంద్ర మత్త
శతభద్ర హంస హంసావతి వనమాల పంచవర్ణ సువర్ణ బ్రహ్మభాగ
కావేరి సురస శాఖావతి హరితోయ యింద్రనంది హిరణ్య కృష్ణతోయ
యరుణావతి సువప్ర యంగారవాహిని క్షీరోద మణివప్ర శివ సుదంతి
స్కంధవతి సోమవతి ధనుష్మతి వసుమతి, నాశవతి మణితల మహానది పదాద
విమల పుణ్యోద వామోద విష్ణుపదియు, మొదలుగాఁ గొన్నిపెద పెదనదులు గలవు.

154


క.

ఈనదులన్నియు నాగం, గానది సరి పూర్వజనకలుషము లెల్లన్
మానుపునఁట సంస్మరణ, స్నానతటస్థానదర్శనస్పర్శములన్.

155


క.

మఱియుం గోటులసంఖ్యలు, చిఱుతనదులు గలవు వానిశీతలజల మ
క్కఱఁ గ్రోలి సహస్రాయువు, కఱకంఠునిమీఁది భక్తిఁ గాంతురు మనుజుల్.

156


వ.

ఇట్లు కేతుమాలభద్రాశ్వవర్షవిశేషంబులుం గొన్ని చెప్పితి నింక నిషదాచలేంద్రం
బునకుం బడమట విశాఖకంబళ కృష్ణ జయంత హరి శోక వర్ధమానంబు లనుకులా
చలంబు లేడు గలవు వానికిం బ్రత్యంతపర్వతంబు లసంఖ్యంబు లప్పర్వతమధ్యంబు
నం గలజనపదంబు లప్పర్వతనామంబులన చెప్పంబడు నివి యుత్తరగ్రామసురా
శ్రవణకంకటకసమూలకూటక్రౌంచకృష్ణాంగమణిపంచకూటసువర్ణతటకుంకుభశ్వే
తాంగకృష్ణపాదవందకసానుమత్కరతాళమహెోత్కటశూకనదీపల్లవప్రముఖం
బులు తత్పర్వతంబులం బుట్టినమహానదులు ప్లక్ష మహాజల కదంబ మానసిశ్యామ
సుమేఘ బహుల వివర్ణ శంఖ మరాళ దర్భవతి భద్రానది శూకనది పల్లవ హిమ
ప్రాభంజన కదంబ కుశావతి విశాల కుంభక మహామాయ మానుషి యివి యొ
క్కొక్కదేశంబున కొక్కొక్క నది యేర్పడినవి మఱియును.

157


ఉ.

ఆతతశీల రమ్యక సమాహ్వయ మైనవనంబు సొంపగున్
శ్వేతమునుత్తరంబునను నీలగిరీంద్రముదక్షిణంబునం
బ్రీతి దలిర్పఁ దద్విపినవృక్షఫలద్రవ మానుమానవుల్
ప్రోతురు దేహముల్ దివిజరూపములం బదివేలవర్షముల్.

158


సీ.

దేవాద్రియుత్తరదిగ్భాగమునను ద్రిశృంగశైలంబు దక్షిణమునందు
రమణీయ మైనహిరణ్యకవర్షంబునడుమ హిరణ్యకీనదితటమున

నలరు జంబీరము లభ్రలిహములు తత్ఫలములు షడ్రసబంధురములు
ప్రాణు లారస మాని పండ్రెండువేలు నేనూఱేండ్లు బ్రతుకుచుండుదురు కామ
రూపవంతులు సమరవిరోధియూధ, మథననిర్నిద్రపృథువిక్రమప్రసిద్ధ
భుజబలాఢ్యులు నగుయక్షపుంగవులు ని, రంతర మచట నుందురు సంతసమున.

159


క.

క్రొత్తె త్రిశృంగశిఖరము, నుత్తరశృంగమ్మునకును నుత్తరపుదిశన్
హత్తుకొని కడలిదాఁకను, నుత్తరకురుభూము లమరుచుండును మహిమన్.

160


ఉ.

పాలునుఁ దేనెయుం గురియుఁ బాదపముల్ మఱికొన్నివృక్షముల్
చేలములున్ హిరణ్యమణిచిత్రవిభూషలు నీనుచుండు న
న్నేల సువర్ణవాలుకల నిర్మలరత్నములం జెలంగు వి
ద్యాలలితుల్ త్రయోదశసహస్రసమాయువు లందు మానవుల్.

161


వ.

ఇట్టియుత్తరకురుదేశంబులయందు స్వర్గచ్యుతు లైన పురుషులు వసియింపుదురు తదు
త్తరకురుప్రాంతంబున నతిరమణీయంబులు సమంబులునై కనుపట్టుచంద్రకాంత
సూర్యకాంతపర్వతంబులనడుమ ననేకవృక్షసమాకుల యైనచంద్రనది ప్రవహించు
నట్టికురువర్షంబునుత్తరపార్శ్వంబున నైదువేలయోజనంబులు సముద్రంబు నతిక్ర
మించి సహస్రయోజనపరిమండలవిస్తారంబున దేవలోకపర్యంతంబు చంద్రద్వీపం
బమరు నందునడుమ నూఱుయోజనంబులవిరివియునుం బొడవునుం గలయొక్క
పర్వతంబునం జంద్రావర్త యనునది వొడమెఁ దద్వీపంబు చంద్రున కధిష్టానం
బందలిప్రజ లందఱుం జంద్రదైవత్యులుం బ్రస్తబ్ధకర్ణులు దశసహస్రాయువులు నట్టి
చంద్రద్వీపంబునకుం బశ్చిమంబున నాలుగువేలయోజనంబులు సముద్రంబు నతిక్ర
మించి దశసహస్రయోజనపరిమండలం బైనభద్రాంతరనామధేయద్వీపంబు గలదు
తద్వీపంబున ననేకరత్నశోభితం బైనభద్రాసనంబున వాయుదేవుండు సాకారుం డై
కొలువుండు నచ్చటిపురుషు లందఱుం గాంచనవర్థులుం బంచసహస్రవర్షజీవులు
నింక నవభేదం బగుభారతవర్షంబు వర్ణించెద నింద్రకశేరుతామ్రపర్ణగభస్తినాగ
ద్వీపసమ్యాగాంధర్వవారుణభారతంబు లనం బరఁగినయీఖండంబు లొక్కొ
క్కటి వేయేసియోజనంబులు.

162


క.

కల వాభారతవర్షస్థలమున నొకయేడు ఋక్షసహ్యమహేంద్రం
బులు వింధ్యపారియాత్రం, బులు మలయము శుక్తిమంతమును గులశిఖరుల్.

163


సీ.

మందరశైలంబు మైనాకకుధరంబు పాండురాచలము శ్రీపర్వతంబు
గోమంతము చకోరకూటంబు సురసంబు వైద్యుతాహార్యంబు వాతభవము
రైవతకంబు శారదము జయంతంబు కృష్ణమహేంద్రంబు ఋశ్యకంబు

కోలాహలము చిత్రకూటము శైకృతస్థలము తుంగప్రస్థధరణిధరము
ననఁగ నివియుఁ బ్రసిద్ధంబు లైనగిరులు, మఱియు నుపపర్వతంబులు దఱచు గలవు
వీనియవకాశములయందె వెలయు నార్య, జనపద మ్లేచ్ఛజనపద సంచయములు.

164


వ.

ఈజనపదంబులం బ్రవహించి కులపర్వతంబులవలనం బుట్టిన ప్రధాననదులు చె
ప్పెద గంగ సింధు సరస్వతి శతద్రు చంద్రభాగ సరయు యమున యిరావతి చక్షు
ర్లౌహిత్య వితస్థ విపాశ దేవిక ఋభు గోమతి భూతపాప బాహుద దృషద్వతి
కౌశికి నిశ్చిర గండకి యివి హిమవంతంబునం బుట్టినవి వేదస్నాతి వేదవతి తృణ
ఘ్ని సింధువర్ణ నంద సదార రోమహి పరచర్మణ్వతి లయ విదశ దేవత్రయ యవంతి
యివి పారియాత్రంబునం బ్రభవించినవి శోణ జ్యోతిరథ సురకర్తృష మందాకిని
దాశార్ణ చిత్రకూట పిప్పల కరతోయ విశాఖిక చిత్రోత్పల విశాల వజ్రవాలుక వా
లుకావాహిని నక్రవతి ఋజ్వికిరి త్రిదివ యివి ఋక్ష్యపర్వతంబున జనియించినవి
మణిజాల శుభ పయోష్ణి శీఘ్రోద వేణువార వైతరణి వీచివారి కుముద్వతి క్రోధ
దుర్గ యంతశ్శిల యివి వింధ్యపాదంబున నవతరించినవి గోదావరి కృష్ణవేణి భీమ
రథి మలప్రహారి తుంగభద్ర కావేరి హేమ లక్ష్మణ కపిల యివి సహ్యంబునం
బ్రాదుర్భవించినవి తామ్రపర్ణి యుత్పలావతి యివి మొదలైనవి మలయపర్వతం
బున సంభవించినవి త్రిసామ ఋషికల్య త్రిదివ లాంగలిని వంశవర మహేంద్ర
తనయ ఋషిత ద్యుతిమతి మందమందగామిని నీలపిశాచిని యివి శుక్తిమంతంబునం
గలిగినవి మఱి యున్నవి యన్నియును క్షుద్రనదులుగా నెఱుంగుఁడు.

165


క.

ఈజంబూద్వీపమునకు, యోజనములు లక్ష యొప్పు నుదధియు నంతే
యోజన్ శాకద్వీపం, బీజంబూద్వీపమునకు నినుమడి విరివిన్.

166


సీ.

ఇట్టిశాకద్వీప మిరువంక లవణాబ్దిఁ దిరిగి వచ్చినది యీదీవిలోని
ప్రజలు దుర్భిక్షజరారుజ లెఱుఁగరు కులపర్వతము లేడు నిలుచు నచట
రెండేసిపేళ్ళ నాకొండలు విలసిల్లు నుదయసౌవర్ణాఖ్య లొక్కగిరికి
జలధరంబును నింద్రశైలంబు నొక్కటి రైవతకంబు నారదము నొకటి
శ్యామదుందుభు లొక్కటి సోమరజత, కంబు లొక్కటి కేసరి యాంబికేయ
మనఁగ నొక్కటి క్షేమమహాద్రుమంబు, లనఁగ నొక్కటి యిట్లు వర్షాహ్వయములు.

167


క.

నారద మనుపర్వతమున నారదపర్వతులు పుట్టినా రింద్రగిరిన్
నీరు గొని వచ్చి యింద్రుఁడు, సారెకు వర్షించుచుండు జగములయందున్.

168


గీ.

అందును గుమారికా చారి నంద వేణి, ధేనువు గభస్తి యిక్షుమతియు ననఁగ
నదులు గల వేడు వీనికి నామకములు, కలవు రెండవయవియుఁ గొండలకు వలెనె.

169

క.

ఇనుమడి శాకద్వీపం, బునకుఁ గుశద్వీప మదియుఁ బుండ్రేక్షురసాం
బునిధిపరీతం బందును, గనుపట్టును నామయుగము కలసప్తగిరుల్.

170


సీ.

కుముదపర్వతము విద్రుమమును నొక్కటి హిమశైలమును వలాకమును నొకటి
ద్యుతిమద్గిరీంద్రంబు ద్రోణంబు నొకటి చిత్రశిలయుఁ బుష్పవంతంబు నొకటి
కకుదంబును గశేయకంబును నొక్కటి హరియును మహిషంబు ననఁగ నొకటి
మందరంబును గకుద్మంతంబు నొక్కటి యందులో మహిషాద్రి యగ్ని యిరువు
ధూతపాపయోని తోయధి శివ పవి, త్రాఖ్య కృష్ణ చంద్ర హ్లాదిని మఱి
శౌక్లి విద్యుతాఖ్య చండ విభావరి, మహతి ధృతి ద్వినామమహితనదులు.

171


క.

ఇందుఁ గలపర్వతంబులు యందమున ద్వినామయుతము లగువర్షంబుల్
క్రందుకొని యుండు మహిమఁ బు, రందరలోకమునకంటె రమ్యము లగుచున్.

172


క.

విద్వత్తిలకములార కు, శద్వీపద్విగుణమై ప్రశస్తిం గనుఁ గ్రౌం
చద్వీప మిక్షురసవా, ర్ధి ద్విగుణసురాంబునిధిపరీతం బగుచున్.

173


సీ.

క్రౌంచవిద్యుల్లతాఖ్యలది యొక్కటి దేవవృత్సురాపాహ్వల వెలయు నొకటి
వార్షికవామనాహ్వయముల దొక్కటి యంధకారచ్ఛాదనాభిధేయ
విదిత మొక్కటి దేవవిందకాంచనశృంగము లనుపేళ్ళ దొకటి పుండరీక
తోయాశనానామధేయాల దొకటి విందంబు గోవిందంబు నాఁగ నొకటి
క్రౌంచమునఁ గలకులభూధరంబు లనఁగ, సన్నుతికి నెక్కె నీయేడుజమిలిపేళ్ళ
వర్ష ముల నిట్లు నామకద్వయముచేతఁ, బొదలు నీదీవిలో నేడునదులు గలవు.

174


క.

గౌరీకుముద్వతీసం, ధ్యారాత్రిమనోజగలును ఖ్యాతియు మిగులన్
బేరు కలపుండరీకయు, నా రంజిలుచుండు సప్తనదు లాదీవిన్.

175


క.

మహి నీనదులకు సుమనో, వహయును నాతామ్రవతియు వలశిరయు సుఖా
వహయును క్షిప్రోదయు గో, బహుళయు మజతాపగయును బర్యాయంబుల్.

176


క.

క్రౌంచద్వీపమునినుమడి, యెంచఁగ శాల్మలము దానిఘృతవారిధి వే
ష్టించి కనుపట్టు నచ్చటఁ, కొంచెంబులు గాక యేడుకులగిరు లమరున్.

177


వ.

పీతశాతకుంభ సర్వగుణ సౌవర్ణ రోహిత సుమనస కుశల జంబూనదంబు లనునామ
ధేయంబులు పర్వతంబులకుం గల వందలివర్షంబులకు నదులకు నివియె నామంబులు
క్రౌంచద్వీపద్విగుణంబును దధిసముద్రపరివృతంబు నైనగోమేధం బను నాఱవదీవి
యందుఁ దామ్రరసంబునుం గుముదంబు ననుప్రధానకులపర్వతంబులు రెండు ధా
తకిషండకుముదషండంబు లను దేశంబులు రెండు గోమేధద్వీపంబునకు నినుమడి
యును దుగ్ధవారిధివేష్టితంబును నగుపుష్కరద్వీపంబునకు వర్షంబులు రెండు క్షీర

నీరసముద్రంబులనడుమ శ్వేతద్వీపంబు దీపించుఁ బాలసముద్రంబునకు రెట్టియైన
తియ్యనినీటిసముద్రంబునకు నవ్వల లోకాలోకపర్యంతంబు దానికి నవ్వలం గటా
హంబు నదియ పంచాశత్కోటివిస్తీర్ణం బైనభూచక్రంబునకుం గడసీమ భువర్లో
కాదిసత్యలోకపర్యంతం బైనయూర్ధ్వలోకంబు లాఱునుం గూడి పంచాశత్కోటి
పరిమాణంబు లిట్లు బ్రహ్మాండగోళంబు శతకోటివిస్తారం బిట్టిబ్రహ్మాండంబు లసంఖ్యం
బులు ప్రతికల్పంబున నేకోదకమగ్నంబు లైనబ్రహ్మాండంబుల నారాయణుండు
వరాహరూపంబున రసాతలంబువలన నుద్ధరించి మున్నటియట్ల నిలుపుచుండు మహా
త్మలార యిట్లు భూగోళప్రకారంబు చెప్పితి మీకు భద్రం బౌ నని రుద్రుం డాన
తిచ్చి వియచ్చరు లచ్చెరుపడ సపరివారంబుగా నదృశ్యుం డయ్యె నని కుంభసంభ
వుండు భద్రాశ్వునకుం జెప్పె నని వరాహదేవుండు చెప్పిన విని రసాసారసానన
తరువాతివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.

178


మ.

 ప్రకటీభూతచమూసమూహరభసాక్రాంతప్రతీపక్ష్మ ప
క్ష్మకవాటద్వయవత్పురార్యళికదృక్ప్రాకారసంలీనపా
వకలజ్జావహదోఃప్రతాపగరిమవ్యాప్తాఖిలాశాంతరా
ళ కరాళాహిశయానశౌరిసుఖతల్పస్వాంతనీరేరుహా.

179


క.

ఆరట్టతురంగమధా, టీరేణుపరంపరాఝడితిశోషితవీ
రారివధూజనకరిమక, రీరచనాసంగతాంగశృంగారాబ్ధీ.

180


పృథ్వి.

త్సరుస్థకనకచ్ఛవిస్థగనజాతరూపాంబుజ
స్ఫురత్కరకృపాణికాదళితశూరపృధ్వీతలే
శ్వరౌఘకృతభేదనశ్రమభవభ్ర ప్రస్ఖల
త్ఖరాంశునికటావలంబననిధానదండధ్వజా.

181

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునందు దశమాశ్వాసము.