వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/ద్వితీయాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీవేంకటాద్రిపతిసం, సేవాహేవాకనిపుణ శేషాహిఫణా
ళీవినమనకరకరిసే, నావిభ్రమ యీశ్వరేంద్రునరసింహనృపా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుండు ధాత్రి కిట్లనియె.

2


గీ.

అట్లు దన్ను మహీకాంతుఁ డడుగఁ దపసి, పలికె నరపాల మున్ను గీష్పతి నడిగిరి
బ్రహ్మసుతుఁ డైనరైభ్యుండు రాజవర్యుఁ, డైనవసువును నీవు న న్నడిగినట్ల.

3


సీ.

అది విను చాక్షుషం బైనమన్వంతరంబున బ్రహ్మవంశవర్ధనుఁడు వసువు
నృపరత్న మొకనాఁడు నీరజాసనుఁ గొల్వ నేగుచోఁ దెరువున నెదురుపడ్డ
సకలవిద్యాధరస్వామి చైత్రరథుండు విబుధవర్గంబు సేవింప నలువ
గొలు వయి యున్నాఁడు గొబ్బునఁ బొ మ్మని చెప్ప హుటాహుటిఁ జేర నరిగి
నిలిచె మూపును మూపును దొలఁగఁ ద్రోవ, రానిసందడి గని పద్మరాగరత్న
ఖచితహాటకమయకుంభరుచిపరంప, రానిరాఘాట మగుహజారంబుకడకు.

4


క.

ఆసమయంబున రైభ్యమహాసంయమి యేగుదేర నర్ఘ్యాదివిధుల్
చేసి వసునృపతి యెటు వి, చ్చేసెదవు మునీంద్ర నాకుఁ జెప్పు మటన్నన్.

5


క.

అనిమిషగురుండు చతురా, నను సేవింపంగ వచ్చినాఁ డని విని యేఁ
బనివడి చనుదెంచితి నా, తని నొకసందేహ మడుగఁ దలఁచి నృపాలా.

6


క.

అని రైభ్యుఁడు వసునరపా, లునకుం జెప్పంగ నంతలో నంబురహా
సనుఁ డనిపినఁ దమతమకే, తనములుఁ గరితురగరథపదాతులు మెఱయన్.

7


సీ.

నడిచె నింద్రుండు కిన్నరకాహళులు మ్రోయ గమనించె శిఖి డిండిమములు మ్రోయఁ
జనియె దండధరుండు జయదుందుభులు మ్రోయ వెళ్ళె దైత్యుఁడు గిడిగిళ్లు మ్రోయఁ
బోయె నంబుధిరాజు బూరగొమ్ములు మ్రోయ జరగె నాయువు మురజములు మ్రోయ
నరిగె యక్షుండు కిన్నెరవీణియలు మ్రోయఁ గదలె రుద్రుండు శంఖములు మ్రోయ

నిట్లు దివికి మధాంధసు లెల్ల నేగఁ, గొంతతడవుకు బ్రహ్మ వీడ్కొలుప శిష్య
సముదయముఁ దాను గక్ష్యాంతరములు గడచి, వచ్చె సురదేశికుఁడు బహిర్ద్వారమునకు.

8


క.

ఆవేళ రైభ్యవసువసు, ధావరు లాంగిరసుచే యథాసముచితపూ
జావిధులు వడసి నందితు, లై వెంటం జనిరి దివికి నఘగిరిపవికిన్.

9


మ.

చనిన న్వారును దాను జీవుఁడు నిజాస్థానీనివాసాంతరం
బున లీలాపరికల్పితైందవశిలాభూమిన్ సుఖాసీనుఁడై
మునికంఠీరవ భూమిభృత్తిలక మమ్ముంగూర్చి మీ రేగుదెం
చినకార్యంబులు చెప్పుఁడా తెలిపి నిశ్చింతాత్ములం జేసెదన్.

10


వ.

అనవుడు.

11


క.

అమరేంద్రమంత్రితో రై, భ్యమహాముని పలికె ముదితుఁడై మోక్షము క
ర్మమునం గలదో సుజ్ఞానమునం గలదో వచింపు నావుడు గురుఁడున్.

12


క.

నలినీపత్రము సలిలం, బులఁ బొరయనిరీతి నుత్తముఁడు సత్కర్మం
బులు గానీ దుష్కర్మం, బులు గానీ హరికి నిచ్చి పొరయఁడు వానిన్.

13


గీ.

ఏతదర్థంబు గాఁగ మునీంద్ర తొల్లి, విష్టరకనామకీకటవిభునితోడ
నత్రిగోత్రసముద్భవుఁ డైనసంయ, మనుఁడు చేసినతర్కంబు వినుము నీవు.

14


మ.

ఘనుఁ డాసంయమనుండు తీర్థములు ద్రొక్కం బోవుచో ధర్మకా
ననమధ్యంబున వీచికాపవనసన్నాహంబు దేహంబు ముం
ప నిజస్వాంతము పల్లవింపఁ గనియెన్ భాగీరథిన్ నర్మరో
పనిరాసార్ధపదద్వయీవినతికృత్పాధోజభూసారథిన్.

15


మ.

కని తత్తీరవనాంతరంబునఁ గురంగశ్రేణివెంటన్ గృతాం
తునిరీతిన్ బఱతెంచువిషటురకు ధానుష్కుం గుణారోపితా
స్త్రుని రక్తాక్షుని జుంజురుందలకిరాతున్ ముందరం జూచి చే
త నివారించుచుఁ బల్కెఁ బెద్దరొద నత్యంతానుకంపాత్ముఁడై.

16


క.

ఓయి నిషాదకులేశ్వర, యేయకు మేయకుము జీవహింసకు నేలా
రోయవు చెల్లంబో నీ, కేయపకారంబు చేసె నీలే ళ్ళనినన్.

17


శా.

అవ్వాక్యంబు నిరాకరించి దిశ లల్లాడం గఠోరంబుగా
నవ్వెన్ నవ్వి నిషాదభర్త మృగసంతానంబుఁ జంపంగ నే
నెవ్వాఁడం బరమాత్మగాక పిసవెఱ్ఱీ విప్ర యీచీఁకటుల్
 ద్రవ్వింపం బనిలేదు సుమ్ము మముబోట్లన్ వీరివారిం బలెన్.

18

గీ.

శిశువు మంట నెద్దుఁ జేయుచుఁ జెఱుచుచు, నాడునట్లపోలె నఖిలభూత
సృష్టిఁ దాన చేయుఁ జెఱుచు నప్పరమాత్మ, యిది నిజంబు సంశయింపవలదు.

19


గీ.

విశ్వ మాత్మప్రణీతమై వికృతిఁ బొందు, నందులోన నహంభావ మనుచితంబు
గా నెఱింగి వివేకులు మాని రనిన, విని మహాశ్చర్యమున సంయమనుఁడు పలికె.

20


క.

లుబ్ధక దూర్వాచర్వణ, లబ్ది నిజస్వాంతసమ్మిళత్పరమానం
దాబ్ధినిమజ్జన్మృగవధ, లుబ్ధుండవు నీకు నీపలుకులుం దగునే.

21


సీ.

అనిన లుబ్ధకుఁడు వీపున నున్న లోహపువల దెచ్చి ముందర వైచి దీని
లో వహ్ని దరికొల్పు నావుడు ధరణీనిలింపోత్తముండు మండింప లేక
దేశస్థ మయ్యు హుతాశి గన్నులవెంట వేర్వేర కీలలు వేయుఁ జూప
జాలంబు కాదంబగోళంబువలె నొప్పె నప్పుడు బోయ సంయమనుఁ జూచి
యోయి సంయమి వీనిలో నొక్కకీలఁ, గైకొనుము నీవు గ్రక్కునఁ గడమకీల
లార్పవలె నన్న నాతఁడు నట్ల చేయ, నీరు మిన్నంటుజ్వాలల నాఱఁ జల్లె.

22


గీ.

ఇవ్విధంబున వలలోనియింగలంబు, చల్లగా నార్చి కీకటస్వామి పలికె
ఋషికులోత్తమ యిఁక నాకు నిమ్ము నీవు, కైకొనినకీలఁ గఱకుట్లు కాల్పవలయు.

23


వ.

అనిన విని మునిశ్రేష్ఠుం డాయసానాయంబు డాయం బోయి తదంతరాళంబున
నిజగృహీతజ్వాలంబ యేల మొదలికి దహనలేశంబునుం గానక హీనకళాస్యంబు
తోడ నపహాస్యంబునకు నాస్పదంబై రిచ్చవడి వెచ్చ నూర్చినం గనుంగొని విష్టర
కుండు మహాత్మా హుతాశనుండు మూలనాశనంబునం బొందిన బహుముఖశిఖా
నికాయంబు మాయం బైనచందంబునఁ బరమాత్ముండు ప్రకృతిస్థితుం డైన భూతం
బులు సంక్షయీభూతంబులగు నతండు వికృతుం డైన వెండియుఁ బ్రభూతంబు
లగు నిది సకలప్రపంచస్థితి శరీరగ్రహణధర్మంబున నెవ్వనికి నెద్ది విహితం బక్క
ర్మంబు చేసి పరమాత్మునికి సమర్పించెనేని వాడు ఫలంబులం బొరయం డని
చెప్పె నప్పుడు.

24


క.

పరతత్త్వవిదుం డగువి, ష్టరకునిమస్తకముపై దిశాభాగములం
బరిమళము సోడు ముట్టఁగ, సురభూరుహపుష్పవృష్టి జోరునఁ గుఱిసెన్.

25


మానిని.

మాతరుణీపతి మన్ననఁ బంప విమానము లంబరమార్గ సమా
యాతము లయ్యె దదంతరసీమల నన్నిట యోగబలాతిశయ
ద్యోతకమూర్తులతో విహరించుచుఁ దోఁచెఁ గృపారసధూర్ధరుఁ డ
ద్వైతవివేకనిధానము చెంచు శతక్రతుముఖ్యులు దన్నుఁ గనన్.

26

చ.

తదవసరంబునం బరమతత్త్వము విష్ణు ననేకమూర్తిగా
హృదయములో నెఱుంగుకొనుమీ కను మీ వనినట్లు యోగసం
పదమహిమన్ విమానములపై శబరాగ్రణి పెక్కురూపులై
చదలఁ జరింప వానిఁ గని సమ్మదనీరధి నోలలాడుచున్.

27


క.

విష్టరక నిన్నుఁ బోలఁ ద్రి, విష్టపమున లేరు తత్త్వవిదు లని లబ్ధా
భీష్టత సంయమనమహా, ముష్టింపచపతి నివాసమునకుం జనియెన్.

28


సీ.

కావున నేతత్ప్రకారసుజ్ఞానంబు గలిగి స్వజాతీయకర్మతత్ప
రుం డైనవాఁడు ముక్తుం డని గీష్పతి బోధింపఁ దెలిసి రైభ్యుండు వసువు
నాత్మగేహములకు నరిగిరి నీవు నద్వైతమార్గంబున వాసుదేవు
సేవింపు మశ్వశిరోవసుధాధీశ కలుగు మోక్షం బని కపిలమౌని
చెప్ప నాతఁడు గడు సంతసిల్లి భూవ, ధూలలామకుఁ దనపుత్రు స్థూలశిరుని
భర్తఁగాఁ జేసి చనియెఁ దపస్విజనశ, రణ్యమునకును నైమిశారణ్యమునకు.

29


క.

చని తత్కాననమధ్యం, బున భూపాలుండు యజ్ఞమూర్తిస్తుతి య
జ్ఞనరున్ గురు నారాధిం, చెనని వరాహంబు చెప్పెఁ జెప్పిన మఱియున్.

30


గీ.

పృథివి యి ట్లను యజ్ఞమూర్తిస్తుతిప్ర, కార మానతి యిమ్మ భూదారవర్య
వినఁగవలె నన్న దేవుండు ఘనఘనాఘ, నార్భటీవిస్ఫుటోక్తి నిట్లని వచించె.

31


సీ.

బ్రహ్మరుద్రమహేంద్రపావకపవమానవిధువిభాకరముఖ్యవిబుధయాజ్య
శశిసూర్యనేత్ర భాస్వరదంష్ట్ర వత్సరాంకాయనకుక్షి దర్భాంగరోమ
యిధ్మసక్థి జగత్రయీదిశాభ్యంతరవ్యాప్తశరీర విశ్వప్రసూతి
సకలదేవాసురజయనిమిత్తానుయుగాంగీకృతైకనరావతార
యజ్ఞమూర్తి కుభృత్సన్నిభాంగ యీశ, యిజ్య పరమాణుతుల్య యోగీంద్రపూజ్య
హరి జనార్దన మూర్ధసహస్ర పరమ, వేదవేదాంగవేదాంతవేద్య నిత్య.

32


క.

ఈసకలము చతురాస్యుఁడ, వై సృజియింపుదువు చక్రివై కాతువు లీ
లాసంపన్నత రుద్రుఁడ, వై సమయింపుదువు నీవ యజ్ఞనరేంద్రా.

33


వ.

సంసారచక్రచంక్రమణక్రమణసంక్షయకాంక్షు లైనమహానుభావులకు సేవ్యుండవు
నీవ దేవా నీమానసంబున మానసంబును నీనేత్రంబుల నేత్రంబులు నీశరీరంబున
శరీరంబును సమర్పించినవాఁడ నన్యథా శరణంబు లేనివాఁడ నన్నుం గృతార్థునిం
జేయు మని యజ్ఞమూర్తిస్తోత్రంబునఁ బ్రార్థించినఁ బ్రసన్నుండై యజ్ఞనరుండు స
హస్రకరసహస్రదుస్సహమహామహోనివహంబై తనపురోభాగంబున వెలుంగ నందు
నశ్వశిరోనరేశ్వరుండు లయంబునం బొందె నని చెప్పిన వరాహస్వామికి భూమి
యి ట్లనియె.

34

క.

రైభ్యుఁడు వసుభూపతియు సు, ధాధ్యవహారగురుతోడ నద్వైతజ్ఞా
నాభ్యాసము చేసి తదీ, యాభ్యున్నతి నేమి యైరి హరికిరివర్యా.

35


చ.

అనవుడు దేవుఁ డిట్లనియె నట్లు బృహస్పతిచేత బోధమున్
విని వసుభూవిభుండు దనవీటికి నేగి జగజ్జనానురం
జనకరుఁడై వసుంధర భుజాభుజగంబునఁ దాల్చి శాత్రవా
వనిపులఁ గూల్చి విష్ణుని వివర్జితభేదమునం భజించుచున్.

36


ఉ.

చేసె ననేకయాగములు జీవనసౌఖ్యము నెమ్మనంబునన్
రోసె వివస్వదాహ్వయతనూజునిపై నిజరాజ్యభారమున్
వేసె వివేకనిష్ఠురలవిత్రముచే నఘపాశబంధముల్
గోసెఁ బురీనివాసమునకుం బెడఁబాసె బుధుల్ నుతింపఁగన్.

37


వ.

ఇట్లు సంగపరిత్యాగంబు గావించి తపోవనంబునకుం జని కాశ్మీరవల్లభుండు పుండ
రీకాక్షపారస్తవంబు జపించుచు నియతాత్ముండై.

38


క.

పుష్కరతీర్థతటంబున, దుష్కరతప మాచరించి తుది ముందట నా
విష్కారంబునఁ బొందిన, పుష్కరపత్రాక్షుదేహమున లయ మయ్యెన్.

39


గీ.

నావుడు మహావరాహంబునకు ధరిత్రి, దేవ నీభక్తురాలికిఁ దెలియఁ జెప్పు
పరమనుతిఁ బుండరీకాక్షపారమును వ, సుక్షమాపాలనాథుని మోక్షగతియు.

40


వ.

అనిన నద్దేవుండు సవిస్తరభాషావిశేషంబున.

41


గీ.

అఖిలవేదాంతవేద్య మహం భజామి, సంభవక్షయరహిత మహం భజామి
సాసిచక్రాబ్దశార్ఙ్గ మహం భజామి, కుంభసాగరశయన మహం భజామి.

42


పృథ్వి.

నమామి మధుసూదనం నవపయోదనీలత్విషం
నమామి పరమేశ్వరం నఖరభిన్నరాత్రించరం
నమామి పురుషోత్తమం నలినగేహినీనాయకం
నమామి కరుణాస్పదం నగధురీణతాదక్షిణం.

43


వ.

అని వసుమహీశ్వరుండు సంస్తుతించె నిది పుండరీకాక్షపారస్తవంబు వెండియు
నతండు పుండరీకాక్షు నుద్దేశించి మహాత్మా చరాచరప్రపంచంబున నెద్దియు భవ
ద్వ్యతిరిక్తంబు లేదు సర్వంబును భవన్మయంబకా నెఱిఁగినవాఁడ నని పలుకునవ
సరంబున వానిశరీరంబువలన.

44


సీ.

గిరికొన్నపల్లజుంజురువెండ్రుకలవాఁడు మిసమిస మనుమిట్టనొసలివాఁడు
కోరచూపులయెఱ్ఱ చేరుగ్రుడ్డులవాఁడు బైసిమాలినమ్రానిపణతవాఁడు

కొడవంటివంకలగొగ్గిపండులవాఁడు దుమ్ముపట్టినబొక్కిఱొమ్మువాఁడు
గాటంబుగా నిర్లు గవియుదేహమువాఁడు కడు నక్కళించినకడుపువాఁడు
వైపు దప్పినచేతులవాఁడు మొద్దు, వ్రేళ్ళవంకరకొంకరకాళ్ళవాఁడు
కుఱుచవాఁడు వికారపుగూనివీఁపు, వాఁడు కాలినకొఱడుభావమున వెడలె.

45


గీ.

వెడలి సాంజలియై వసూర్వీకళత్ర నన్ను, బనిగొమ్ము నావుడు నిన్నుఁ బనిగొ
నంగ నేటికి నాకు నీనామ మేమి, యేకతానకు వచ్చితిరా కిరాత.

46


గీ.

అనినఁ గాశ్మీరపతికి ని ట్లనియె వాఁడు, తొంటిభవముననుండి నీవెంటవెంట
నంటువాయని నీబ్రహ్మహత్యఁ గాని, యేఁ గిరాతుండఁ గాఁ జుమీ నృపవరేణ్య.

47


సీ.

అది యెట్టి దనిన నీ వవధరింపుము గతకలియుగంబునఁ బౌండ్రకులమునందు
జనియించి యామ్యదిశావధూచరణమణీనూపురము జనస్థానపురము
పరధరిత్రీనాథు లరిగాపులై భజింపఁగ నేలి దోఃప్రతాపమున వ్రాలి
కరులు వాజులు శతాంగములు పదాతులు వెంటరా నొకనాఁడు వేఁట వెడలి
కాననము చొచ్చి శార్దూలఖడ్గసూక, రప్రముఖజంతుసంతతి వ్రచ్చి నచ్చు
నారసంబున మృగవేషధారి యైనః యతికులస్వామిఁ గూలనేసితివి నీవు.

48


గీ.

వేయుటయుఁ గొంతదూరంబు పోయి మృగము, ప్రస్రవణశైలకందరాభ్యంతరమునఁ
బరమతాపసవేషియై పడియెఁ బడిన, నది నిజాలకు సొరంగ మనుచు డాసి.

49


క.

కృతకహరిశాతనఖర, ప్రతిభటశాతాంబక ప్రపాతాంగవిని
ర్గతరక్తసిక్తమునికుల, పతి నీక్షించితివి గుండె బగ్గునఁ బగులన్.

50


మ.

మునిచూడామణి నట్లు చూచి భయసంపూర్ణాంతరంగుండవై
కనుగెందమ్ముల జాఱి మేన వఱదల్ గట్టంగ బాష్పాంబువుల్
వనికావాటికి వేఁట రారె హరిణవ్రాతంబులం జంపరే
కనిరే పాతకి నైన నేను బలె దుష్కర్మంబు ధాత్రీపతుల్.

51


సీ.

అక్కటా పరమసంయమిఁ జంపి క్రమ్మఱఁ బురికి నే నేమని పోవువాఁడ
నాసరిమేదినీనాథులలోన నే నేచందమునఁ దల యెత్తువాఁడ
నేతరంబున లేనియియ్యపకీర్తిపంకంబు నే నేమిటఁ గడుగువాఁడ
దరిదాపు లేని దుస్తరపాతకాంబునిధానంబు నే నెట్టు దాటువాఁడ
ననుచుఁ బెక్కువిధంబుల నడలి బడలి, వేదనానలశిఖలచే వెచ్చి నొచ్చి
కారణము లేక తగిలినకల్మషంబు, బయలుపడనీక మనసునఁ బదిలపఱచి.

52


క.

మాటికి నిఁక సంసారం, బేటికి ననుబుద్ధి పుట్టఁ బృథ్వీశ్వర న
ట్టేటికి నెదు రీఁదినగతి, వీటికి వచ్చితిని మరలి విన్నఁదనముతోన్.

53

శా.

ఆవేళ న్నినుఁ జూచి బాంధవచమూపామాత్యవర్గంబు చిం
తావైకల్యముతోడ భూపతికి మౌనం బేల వాటిల్లె నే
లా వాడె న్వదనంబు నేత్రముల నేలా తొట్టె బాష్పంబు లే
లా వైవర్ణ్యము దోఁచె దేహమున నేలా పుట్టె నిట్టూరుపుల్.

54


క.

అని సంశయింప బాంధవ, జనముల సేనాధిపతుల సచివులఁ జేస
న్ననె పొం డని శుద్ధాంతం, బునకుం జని బ్రహ్మహత్య మొగమున వ్రేలన్.

55


సీ.

ఉబుసుపోకకు నైన నొల్లవు చెవిఁజేర్ప వైణికవల్లకీవాదనములు
క్రేఁగంట నైన వీక్షింపవు శుద్ధాంతకామినీమణులశృంగారకళలు
పెనుబండువున వైనఁ బెట్ట నూల్కొనవు కట్టాణిముత్యంబులహారలతలు
కల నైన నునుమేన నలఁదవు పన్నీటఁ గలపిన కాశ్మీరకర్దమములు
మఱచి యైన విహారరమ్యస్థలంబు, చేర నరుగవు సుకృతలక్ష్మీవియోగ
వేదనాదూయమానమనోదురంత, చింతఁ జీకాకు పడి మహీకాంత నీవు.

56


వ.

ఇవ్విధంబున శరీరసౌఖ్యంబువలన వైముఖ్యంబును సకలసామ్రాజ్యోపకరణంబుల
వలన నిరాకరణంబును మృగయావినోదంబులవలన భేదంబును వహించి సహించి
నిలువరాని బ్రహ్మహత్యాపాతకంబు నివర్తింప విచారించి శ్రీహరిప్రీతిగా సువ్రతం
బులు సలుప నుద్యోగించునవసరంబున.

57


ఉ.

పిట్టలవాతు లెండ నలిబృందముపాట లవారి నిండ ని
ట్టట్టు చనంగ రాక ఫణు లాఁకట నుండఁ గభస్తిమచ్ఛిలా
పట్టికలన్ హుతాశనుఁడు బగ్గన మండ ధరిత్రిమీఁదఁ జూ
పట్టి రసాలసాలములు పండ నిదాఘము వచ్చె నుగ్రమై.

58


క.

ఆసమయంబున శైలగు, హాసీమల మండు వనహుతాశనము నృపా
లా సతతము నీహృదయములో సంతాపాగ్నివోలె లోలార్చులచేన్.

59


చ.

సమత సమస్తచిత్తముల సంతతమున్ విహరించుఁ గాన దై
వము మదనుండె తథ్య మని వంచన యించుక లేక యెండచేఁ
గమలపుటీకటాహములఁ గ్రాఁగెడు తేనియనూనెఁ దప్తమా
షము దొడికెన్ మదభ్రమరజాలము గేలిసరోవరంబులన్.

60


క.

పెనుగాలి చఱచి కొట్టిన, వినువీథికి నెగసి ధూళి విలసిల్లె మహీ
వనజేక్షణ తీవ్రతాప, మునకు వెఱచి పెట్టుకొన్న ముసుఁగునుబోలెన్.

61


గీ.

నీరనిధిరాజు కరుణించి నిష్ఠురాత, పంబుచే నొచ్చె నని భూతలంబు శీత
లంబు సేయంగఁ బలపినలహరు లనఁగఁ, నెండమావులు గనుపట్టె నెల్లకడల.

62

క.

ఎండకు నోర్వఁగఁ జాలక, కొండలు మొఱవెట్టె ననఁగఁ గోల్పులులు గుహా
మండలములనుండి మహా, తుండంబులు దెఱచి భాంకృతులు గావించెన్.

63


సీ.

జిలిబిలిమంచు కించిన్మాత్రమును లేక పంచబంగాళమై పాఱిపోవ
చల్లదనం బెల్లఁ బల్లవాధరలనిబ్బరపుబ్బుపాలిండ్లపంచ నొదుగ
నుదకంబు తెకతెక నుడుక మీఁదికి రాక మడుగులమానంబు లడుగు చేర
దశదిశాంతరములఁ దఱచుగా విస్ఫులింగములు గ్రక్కుచు వడగాలి సుడియ
నధ్వనీనులగుండియ లవియ వాఁడి, చూపె మల్లీలతావల్లరీపరాగ
ధూసరంబులు దప్తముక్తాసరములు, మాసరంబులు నైదాఘవాసరములు.

64


వ.

అట్టివాసరంబులు గలశుక్రమాసంబున శుక్లపక్షంబున నేకాదశీదినంబున హరిప్రీతి
గా నీవు నిర్జలోపవాసంబు చేసి నిజరాజధాని యైనజనస్థానపురంబున విష్ణుదేవా
లయంబున మహోత్సవంబు గావించి శ్రీమహాభాగవతాదిపురాణశ్రవణంబున నా
రాత్రి జాగరణంబు సల్పి మఱునాఁడు పూర్వపర్వతశిఖరభూమిసామిసముదిత
మిహిరకిరణకిసలయవ్రాతంబునకు బాలచూతం బైనప్రభాతంబునం గృతస్నానుండ
వై సాలంకారగవిసహస్రంబు మహీసుపర్వులకు దానం బిచ్చి పారణకుం బోవ సమ
కట్టి మణికుట్టిమస్థలంబున నడుగుపెట్టుసమయంబున నెట్టఁబడి నుదరశూలంబు
పుట్టి జగజెట్టివైద్యులచేత భేద్యంబు గాక మిగుల నుద్రేకించినఁ బ్రాణంబు కంఠ
కోణంబులఁ బెట్టుకొని కూర్మిరాణి యైన నారాయణిం గటాక్షించి హీనస్వరంబున.

65


క.

ఓనారాయణి నిన్నుం, బ్రాణముగాఁ జూచునాకు వఱ్ఱు దలఁచి పా
పానకు నొడిగట్టుకొనెం, గా నేఁడు విధాత యేది గతి యిఁక నీకున్.

66


మ.

అని ప్రాణానిలముల్ తొఱంగుతఱి భార్యానామధేయచ్ఛలం
బున నారాయణవర్ణముల్ తడవి తత్పుణ్యప్రభావోదయం
బున వైకుంఠపురప్రవేశమునకుం బోవంగ రోషించి ని
న్ను నిరోధింపఁగ బ్రహ్మహత్య నగు నేను న్వెంట నేతెంచితిన్.

67


వ.

అప్పుడు నిప్పులు రాలుకటాక్షంబున నన్ను వీక్షించి విష్ణుభక్తుని వెంబడించి యిది
యెక్కడిపిశాచంబు వచ్చె నని సంభ్రమంబున.

68


క.

పదములఁ బడి మొఱ వెట్టఁగ, నదయతఁ బెడకేలు గట్టి హరివీరభటుల్
చదియఁగ మోదిరి పెదపెద, గుదియలు గొని యెముక లెల్ల గుల్లలు గాఁగన్.

69


గీ.

మోదుటయు సూక్ష్మరూపినై మేదినీశ, తావకము లైనరోమరంధ్రముల నుంటిఁ
గాని వైకుంఠవిభునికింకరులచేత, నంత నొచ్చియు విడువ లే నైతి నిన్ను.

70

ఉ.

ఆగతి మత్ప్రవిష్టసకలాంగరుహంబులతోడ ముక్తిల
క్షీగృహ మైనవిష్ణుపురికిం జని భోగపరంపరైకదీ
గుణయుక్తి నందు నొకకల్పము నీవు వసింప నేనుఁ దే
జోగరిమంబున న్విడువఁ జూ నిను సోఁకిననాఁటనుండియున్.

71


సీ.

అంతట దివసాంత మగుటయు బ్రహ్మ నిద్రాసమన్వితుఁడై రాత్రి గడపి
మఱునాఁడు సృష్టినిర్మాణంబు సేయుచో మేదినీశ్వర నిన్ను నాదిసృష్టిఁ
గృతయుగంబున వినిర్మించెఁ గాశ్మీరాధిపతి సుమనోనరపాలువలన
నిర్మింప నేనును నీతనూరుహములతోన పుట్టితి శశిలోనికందు
పగిది నావిధంబునను శ్రీపతిపదాబ్జ, పూజ వెలిగాఁగ నీజన్మమున ననేక
యజ్ఞదానాదిపుణ్యకృత్యములు నియమ, పరతఁ జేసితి చేసినఁ బాయ నైతి.

72


మత్తకోకిల.

అక్షయప్రతిబంధరూపమ నైననన్ను వసుంధరా
ధ్యక్ష యిప్పుడు విష్ణుభక్తుఁడ వై పఠించినపుండరీ
కాక్షపారము తావకాంగరుహంబులం బెడఁబాపుటన్
మోక్షసంపద చేరెడు మనమున్ సుకర్మముఁ గోరెడున్.

23


వ.

అని చెప్పిన వసునృపాలవర్యుం డాశ్చర్యంబునం బొంది ముందటం గిరాతరూపం
బున నున్న పురాతనబ్రహ్మహత్యాపాతకంబు నవలోకించి నాకు నీకతంబునఁ బూ
ర్వజన్మసంస్మరణంబు గలిగె నీవును మత్ప్రసాదంబున ధర్మవ్యాధుండవు గమ్మని
వరం బిచ్చి ప్రత్యక్షం బైనపరతత్వంబునుం దానును దివ్యవిమానం బెక్కి చనియె
నప్పుండరీకాక్షపాఠస్తవంబు పఠించిన నాకర్ణించినం బుష్కరతీర్థయాత్రాఫలంబు
సిద్ధించు నని చెప్పిన విశ్వంభరావధూటి దేవా వసునరేశ్వరుండు ముక్తుం డగుట
యెఱింగి రైభ్యుం డేమి చేసె నానతి మ్మనిన వరాహదేవుం డి ట్లనియె.

24


క.

ధరణీ కాశ్మీరాధీ, శ్వరుఁడు వసువు ముక్తికాంత వరియించుట భూ
సురకోటి చెప్పె రైభ్యుఁడు, హరిపూజాపరుఁడు తీర్థయాత్రోన్ముఖుఁడై.

25


సీ.

చేదోయి నొసలఁ జెర్చె ననంతశాయికి రంగధామునకు సాష్టాంగ మెఱఁగె
ప్రణమిల్లెఁ గాంచివరదరాజునకు నమస్కృతి చేసె వేంకటాద్రీశునకును
మ్రొక్కె నహోబలేంద్రునకు సింహాచలనాయకునకు వందనము ఘటించె
నతి సల్పె శ్రీకూర్మపతికి దండంబు సమర్పించెఁ బురుషోత్తమాధిపునకు
సరవి నీ వైష్ణవస్థానపరిసరములఁ, గలనదీసరసీవాపికాతటాక
ముల మునుంగుచుఁ దత్తీరపుణ్యగహన, కుసుమసౌరభ్యసంపద కొల్లగొనుచు.

26


క.

భాగీరథికిం బోయి ప్రయాగమునకు నేగి పిదప నారైభ్యమహా
యోగి చనియెఁ బితరులఋణ, మీగికొనఁగ దురితహరిణమృగయకు గయకున్.

27

సీ.

చని ఫల్గునీనదీసలిలపూరమునఁ గృతస్నానుఁడై గధాధరునిఁ గొల్చి
పితృపర్వతము చేరి పేరెలుంగునఁ గులగోత్రనామములు వాక్రుచ్చి సత్తు
సత్తుగాఁ జల్లె హస్తములు మీఁదికి నెత్తి పితృగణంబులను బేర్పేరఁ బిలిచి
క్షేత్రోపవాసంబు చేసి తద్దివసంబు గడపి సూర్యోదయకాలమునకు
నిత్యనైమిత్తికము లైననియమవిధులు, దీర్చి పిండప్రదానవిధిని సదర్భ
మాషగోధూమయవచూర్ణమధుతిలాది, సముచితద్రవ్యములు చాల సంతరించి.

78


క.

తా వచ్చె వెంటఁ గొల్చి గ, యావాసులు రా యతాత్ముఁడై పితరులకుం
గైవల్యపదము చేరఁగ, నావట మన నొప్పునక్షయవటంబునకున్.

79


శా.

ఈచందంబున వచ్చి, తద్వటమహీజేంద్రంబుక్రింద న్విశి
ష్టాచారోచితకృత్యముల్ జరపి కంజాప్తుండు మధ్యాహ్నలీ
లాచాతుర్యము చూపఁ జూపఁదగుకాలానం బితృవ్రాతమున్
జేచాపంగ మహామునీశ్వరుఁడు చేసెన్ బిండదానక్రియల్.

80


క.

హరహరివిధిగుహవైశ్వా, నరత్రయాదిత్యశశిగణపతిక్రౌంచా
మరవరకుంభజకశ్యపచరణంబులమీఁదఁ బిండషండము నిలిపెన్.

81


వ.

మఱియు జిహ్వాలోలరామగయాదివిశేషంబులం బైతృకక్రియాకలాపంబులు నిర్వ
ర్తించి కృతకృత్యుండై కొండొక కాలంబు ఘోరతపం బాచరింప నొక్కనాఁడు
త్రసరేణుపరిమాణంబును మధ్యందినమార్తాండమండలప్రభావిభాసమానంబును నైన
విమానం బెక్కి పరమాణుసమానదేహుండు దివ్యపురుషుండు ముందఱఁ బ్రత్య
క్షంబై.

82


గీ.

బ్రహ్మవిజ్ఞానసూనసౌరభ్య రైభ్య, యిట్టి ఘోరతపోనిష్ఠ నేమి కార
ణంబునకు నున్నవాఁడవు నాకుఁ జెప్పు, మనుచు నాశ్చర్యకరముగా నంతలోన.

83


మ.

అతిసూక్షాకృతి మాని కైకొనె మహీయత్వంబు సప్తాబ్ధివే
ష్టితవిశ్వంభర నిండె నంబరము దాఁటెన్ సర్వదిక్కుంభికుం
భతటప్రాంతము లాక్రమించె నిఖిలబ్రహ్మాండము ల్మీఱె నా
త్మతనూదీప్తులు క్రొమ్మెఱుంగుల హసింపం దద్విమానంబుతోన్.

84


క.

అతనికి వినయాన్వితమతి, యతిపతి నతి చేసి పలికె నప్పటినీసూ
క్ష్మత యిప్పటినీసంపూ, ర్ణత చూడఁగ విస్మయంబు నామదిఁ బొడమెన్.

85


గీ.

ఏమహాపురుషుండవో యెఱుఁగరాదు, మామకస్వాంతవిచికిత్స మాన్పు మనిన
వనరుహాసనవంశవర్ధన కృతార్థ, వత్స నినుఁ జూచువేడుక వచ్చినాఁడ.

86


క.

జనలోకనివాసుఁడ రు, ద్రునిగాదిలితమ్ముఁడన్ సరోరుహసంజా
తునిమానసపుత్రుఁడ నే, సనత్కుమారుండ ననిన సంయమి పల్కెన్.

87

చ.

యతిజనసేవ్యమాన మహిమాంబునిధాన సనత్కుమార సం
తతనియమప్రచార కృప నన్నుఁ గృతార్ధుఁడవంచు నాన తి
చ్చితి రెటుగాఁ గృతార్థుఁడ రచించితినో జపముల్ తపంబులుం
గ్రతువులు గాక మీరు బలెఁ గాంచితినో పరతత్త్వబోధమున్.

88


సీ.

 నావుడు బ్రహ్మమానసకుమారుండు సనత్కుమారుండు సన్మార్గనిరత
వినుము గయాక్షేత్రమున నెవ్వరికి నొక్కనాఁడు పిండప్రదానంబు సేయ
నబ్బదు నిచ్చలు నట్టియాగయ నీకు నబ్బెఁ బిండప్రదానాగ్నిహోత్ర
జపతపంబులఁ బితృసంతృప్తి గావింప సాక్షాద్గదాపాణి శౌరిఁ గొలువ
విమలవీచీఘటాఘుమఘుమనినాద, బధిరితాఖిలదిక్చక్రఫల్గునీన
దీపవిత్రోదకంబులఁ దీర్థమాడ, నింతకంటెఁ గృతార్థత్వ మెద్ది చెపుమ.

89


ఉ.

అద్భుత మింక నొక్కయితిహాసము చెప్పెద మున్ను దోఃప్రతా
పోద్భటుఁడై విశాలపురినుండి విశాలనరేశ్వరుండు పు
త్రోద్భవకౌతుకానుభవ మొక్కటి లేమికి వేఁగి వాక్యసం
పద్భుజగేంద్రసన్నిభుల బ్రాహ్మణులం బిలిపించి వారితోన్.

90


ఉ.

ఓసరసీరుహాసనకులోద్భవులార సుతాభిలాష నేఁ
జేసితి యాగము ల్విపినసీమల ఘోరతపంబు చేసితిన్
జేసితిఁ గన్యకాకనకసింధురధేనురథాశ్వదానముల్
చేసిన నామనోరథము చెందదు కారణ మేమి చెప్పుఁడా.

91


మ.

అనినన్ సంపద లెన్ని గల్గిన నరేశా యింద్రసంకాశనం
దనుఁ డొక్కండును లేమి నీనగరు చిన్నంబోయె వేయేల వే
చని భక్తిం బితృకోటి నెల్ల గయలోనం దృప్తి పొందింపు నం
దనుఁ డంభోనిధివేష్టితాఖిలధరాధౌరేయుఁడై పుట్టెడున్.

92


క.

అని చెప్పి సజ్జనానం, దను నందనుఁ గను మటంచుఁ దనమకుటతటం
బున నక్షత లిడి దీవిం, చి నివాసములకు విప్రసింహులు చనినన్.

93


క.

క్షణమాత్రము నిలువక వా, రణరథహయభటులు వెంట రా భేరి ధణం
ధణ మనఁగ నమోఘబ్రా, హ్మణశిష యనుచును విశాలుఁ డరిగెన్ గయకున్.

94


చ.

అరిగి కనత్తరంగశిశిరానిలవల్గనఫల్గునీతటాం
తరమున సైన్యము ల్విడియఁ దా గయలోఁ బితృతర్పణైకత
త్పరమతి పిండదానము యథావిధిఁ జేయుచునుండి చూచె ము
వ్వుర సితరక్తకృష్ణతనువుల్ గలవారల నంబరంబునన్.

95

గీ.

ఇట్లు చూచి విశాలనరేశ్వరుండు, మీకు నామంబు లెవ్వి యేమిటికి మీరు
వచ్చితిరి నాకుఁ జెప్పంగ వలయు ననినఁ, జెప్పె నిట్లని వారిలో సితతనుండు.

96


క.

నను సితుఁ డందురు ధాత్రీ, జనులు శరత్కాలచంద్రసన్నిభవర్ణం
బున సత్కర్మంబున వ, ర్తనమున నే నిన్నుఁ గన్నతండ్రిం దండ్రీ.

97


శా.

కూపెట్టంగ మహీసుపర్వులమెడల్ గోసెం బరస్త్రీరతిం
బ్రాపించెన్ సుకృతంబుత్రోవకుఁ బెడంబాసెం ధనాదానసం
ధాపారుష్యముతోడ సాధుజనులన్ బాధించె రక్తాంగకుం
డీపాపాత్ముఁడు నీపితామహుఁడు సుమ్మీ వంశవిస్తారకా.

98


గీ.

వెఱపు లేక నఱకి నఱకి దోర్దండకృ, పాణిమీఁద శత్రుశోణితంబు
చాయ నిలిపి తాఁ దదీయకాళిమ దాల్చె, ననఁగఁ గృష్ణవర్ణుఁ డయ్యెఁ బుత్ర.

99


వ.

అధీశ్వరనామధేయుం డితండు భవత్ప్రపితామహుం డని క్రమఁబునఁ దమ
మువ్వరసంబంధరూపవర్తనంబులు దెలియం బలికి సితుండు వెండియుం దనపితృ
పితామహుల నుద్దేశించి వీర లిద్దఱు దారు చేసినదుష్కరంబునఁ బెద్దకాలంబు
వీచీనామఘోరనరకంబునం గూలిరి నాచేసినసుకర్మఫలంబున నేను దుర్లభం బైన
శక్రాసనంబున నుండితి మహాత్మా సకలమంత్రసంవేది వైననీవు గయాక్షేత్రంబున
నిప్పుడు పిండప్రదానసముచితోదకతర్పణసమయంబునం బితృపితామహప్రపితా
మహులు తృప్తు లగుదురు గాక యని పలికినపలుకుమహత్వంబున నరకవిముక్తు
లైనవీరును శక్రాసనస్ధుండ నైనయేనునుం బితృలోకంబునకుఁ బోవ నుద్యోగించి
నిన్నుం జూడ నిక్కడం గూడితిమి యిది మదీయవృత్తాంతంబు.

100


చ.

కలసిరి ముక్తికల్మషవికారవివర్ణులు ఘోరనారక
స్టులు నగువీరు సైతమును సువ్రత నీవు మదన్వయంబునం
గలిగితి గాన సత్సుతులఁ గాంచినవారలభాగ్యముల్ గయా
స్థలకృతపిండదానఫలసంపదయున్ వినుతింప శక్యమే.

101


గీ.

అని ప్రశంసించి వారుఁ దానును సితుండు, వోయె ధన్యాతులార విచ్చేయుఁ డనుచుఁ
బలుకునందనుతియ్యనిపలుకు చెవులు, సోక నతిలోక మగుపితృలోకమునకు.

102


క.

కావునఁ బితరులగూర్చి య, థావిధి జపహోమపిండదానతపంబు
ల్గావించితి గయ ననిశము, నీవు గృతార్ధుఁడవు గావె నిర్మలచరితా.

103


క.

సారంబు నీతపస్సం, భారము నిజ మని సనత్కుమారుఁ డదృశ్యా
కారుం డగుటయు రైభ్యుఁడు, చేరి గదాధరుని వినుతి చేయం దొడఁగెన్.

104

సీ.

ఘోరపాతకనీరసారణ్యపటలంబు గాల్సంగ నేవేల్పు గారుచిచ్చు
యామినీచరపిశాచాచలవ్రాతంబుఁ బొడిసేయ నేవేల్పు పిడుగుతునుక
భవజరామరణకార్పాసకదంబంబుఁ దూలింప నేవేల్పు రోలుగాలి
భయరోగదుఃఖవిపద్విహంగశ్రేణిఁ, దవుల నేవేల్పు సాళువముకూన
తనపదాంభోరుహములు తత్పరతఁ గొలువఁ, గడఁగువారికి నేవేల్పు కల్పవృక్ష
మట్టివేల్పు గదాధరు నాశ్రయింతు ననిన సాక్షాత్కరించి నారాయణుండు.

105


మ.

జనలోకస్తుత నిన్ను మెచ్చితి నభీష్టం బిచ్చెద న్వేఁడు నా
విని సంతోషముతోడ రైభ్యుఁడు శిరోవిన్యస్తహస్తాబ్జుఁ డై
సనకాదు ల్వసియించులోకము కృపాసంపన్నత న్నాకు ని
మ్మని ప్రార్ధించిన నిచ్చి మాధవుఁ డదృశ్యం బైన నారైభ్యుఁడున్.

106


గీ.

శౌరివరమున నొకనిమేషంబులోన, తత్త్వవిజ్ఞానఘంటాపథంబువెంట
నరిగెఁ గైవల్యకోకిలోద్యానమునకు, సనకముఖ్యమహామునిస్థానమునకు.

107


క.

అని చెప్పిన విని ధాత్రీ, వనిత వసుక్షోణిపాలువలనం బ్రభవిం
చి నిషాదాకారము దా, ల్చినపురుషుం డేమి చేసె లీలాదఁంష్ట్రీ.

108


సీ.

అనవుడు దేవుఁ డిట్లని చెప్పె నా చెంచు మిథిలాపురీబహిర్మేదినీస్థ
లంబున నుండి కుటుంబసంరక్షణార్థంబు గానకుఁ బోయి ప్రతిదినంబు
నొకమృగంబు వధించి హుతవహతిథులకు సగము సమర్పించి సగము విక్ర
యించి సంసారప్రపంచంబు నడుపుచుఁ బర్వపర్వంబునఁ బైతృకంబు
తనకులాచారధర్మంబు దప్పనీక, సలుప నీభంగిఁ బెక్కువర్షములు చనియె
నంత వానికి నర్జునకాఖ్యు డైన, సుతుఁడు జనియించె నియతుండు సుగుణయుతుఁడు.

109


గీ.

వ్యాధభర్తకు మఱికొన్ని వర్షములకుఁ, బుట్టె నర్జునకీనామపుత్రి మెఱుఁగుఁ
దీఁగెకైవడి రతిరాజుతియ్యవింటి, చేగపోలిక వెన్నెలసోగపగిది.

110


క.

ఈచందంబున జననం, బై చాంద్రమసకళభంగి ననుదినవృద్ధి
శ్రీచాతురి గలచెంచుల, రాచూలికి యౌవనంబు రాఁగడఁగుటయున్.

111


సీ.

నాభికావాలమండలమున మొలచినతాపింఛవల్లీమతల్లి యనఁగఁ
దనుమనోభవపుష్పధనురంతరంబునఁ గట్టినబంగారుకట్టు లనఁగ
సౌందర్యకేళికాసారంబులోపల మొనసిననెత్తమ్మిమొగడ లనఁగ
నిటలస్తనంధయనీహరకరునిపైఁ గవిసినగాఢాంధకార మనఁగ
నాఁడునాఁటికి నారు గానంగఁబడియె, వళులు దోఁచెఁ గుచంబులు వచ్చెఁ గురులు
వ్రాలె నంతట నాభిల్లవంశవల్ల, భాత్మసంభవ సంపూర్ణయౌవనమున.

112

గీ.

 హరిణకరిహరిచమరంబు లక్ష్మికుంభ, మధ్యవాలాకృతులు దెచ్చి మనుపుకొఱకు
భిల్లపతియింట గిరువులు పెట్టె ననఁగ, దృక్కుచవలగ్నచికురచారిమల నొప్పు.

113


గీ.

పట్టెఁడేసికుచంబులపై ధరించి, కందుకక్రీడ గావించు ఘర్మవారి
గరఁగిడిగ జాఱ నవగైరికద్రవంబు, గిరులఁ బ్రవహించుధాతునిర్ఝరము లనఁగ.

114


గీ.

చన్నుగుబ్బలపోరాటఁ జక్కపెట్టఁ, బోయి మధ్యస్థభావంబు పొందలేని
కతన లజ్జించె ననఁగ మొగాలు నల్లఁ, బారుగురువిందపూసలపేరు వైచు.

115


క.

క్రిక్కిఱిసినబింకపుఁజను, జక్కవకవఱెక్క లనఁగ సకియలు దనకున్
మక్కువ నీ నొక్కొకమరి, పెక్కులు మెడఁ దాల్చు మంచిపించెపుదండల్.

116


గీ.

గ్రహణభయమున రవిసుధాకరులు హీను, లై చికురబంధరాహుగ్రహంబుకడకు
శరణు వేఁడంగ వచ్చినచాడ్పు దోఁపఁ, బెట్టు సిందూరమునఁ జుక్కబొట్టు నొసల.

117


వ.

ఇవ్విధంబున నారూఢయౌవనవిజృంభంబున దృక్కరంభం బైననిజతనూజ నర్జున
కిం జూచి దూరీకృతవిరోధుండు ధర్మవ్యాధుండు దీనికిం దగినవరుం డెవ్వండు
గలుగునో యని చింతించుచు మతంగమునికుమారుండు ప్రసన్నుం డనువాఁడు
సకలవిద్యాప్రసన్నుం డని విని వానికి వివాహంబు సేయునీహ నక్షీణపుణ్యలక్షణ
గేహ నవ్వరారోహఁ గొంచు దుష్కృతంబులకుం గొంచుచెంచులు వెంట రా నిరా
యాసంబునం జని లవంగసారంగపూగ పున్నాగవకుళకురువకప్రియాళురసాలప్ర
ముఖసాలవికాసమాననూనవాసనాసనాధగంధపవమాననిరస్తసమస్తపాంథశ్రమం
బగునాశ్రమంబు దఱిసి ముందట సరోవరతీరంబున బహుశిష్యగణంబులతోడ
నాహ్నికక్రియాకలాపంబులు దీర్చి వేదాంతశాస్త్రవ్యాఖ్యానగోష్ఠి నున్నమతం
గునిఁ గనుంగొని యి ట్లనియె.

118


మ.

అనఘస్వాంత మతంగసంయమివరేణ్యా నాతనూజాత న
ర్జునకీకన్యకఁ దెచ్చినాఁడ రమణీచూడామణిన్ మీప్రస
న్నునకుం జేయుదమా వివాహ మిఁక నెందుం జూచినం గల్గ రా
యన దక్క న్మునిరాజనందనులు కన్యాదానయోగ్యుల్ వరుల్.

119


చ.

అనవుడు నట్లకాక తగు నాటవికాన్వయసార్వభౌమ నీ
తనయ మదీయపుత్రునకు ధర్మకళత్రముగా నటంచు నా
తనిఁ దనపర్ణశాలకు మతంగమహామునిపుంగవుండు తో
డ్కొని చని చూపెఁ బెండ్లికొడుకు న్మితభాషణు వంశభూషణున్.

120


వ.

తత్సమయంబున.

121


క.

సతి చూచెను యతిసుతునిన్, యతిసుతుఁడు న్సతిఁ జూచె నంగజుఁడు సతీ
యతిసుతుల నేసెఁ గొసరక, లతాంతశరజాలముల హళాహళి గాఁగన్.

122

సీ.

ఇట్లు పరస్పరవీక్షానురాగార్ణవమునఁ దేలెడువధూవరులఁ జూచి
తగు వీరలకు నంచుఁ దమలోన నుభయపక్షములబాంధవు లెల్ల సంతసిల్ల
భిల్లనాథుఁడు తనబిడ్డ నర్జునకీవిలాసిని నొకశుభలగ్నమునను
నవరూపసంపన్నునకుఁ బ్రసన్నునకు వివాహంబు చేసి తద్వైభవంబు
సంపతిల్లినపిమ్మట దంపతులకుఁ, గట్టనిచ్చి మతంగుండు గౌరవమునఁ
దన్ను ననుపంగ నరుగుచోఁ దనయతోడ, బుద్ధి చెప్పఁగ నేకాంతమునకుఁ బిలిచి.

123


సీ.

అత్తమామలు చెప్పినట్ల చేయుదుగాని యెదిరి మారుత్తర మీకు మమ్మ
వలయువేళలఁ బెద్దవారు పంపక యెంతపనికిఁ బోనిండ్లకుఁ జనకు మమ్మ
సకలబంధులకుఁ బూసలలోనిదారంబువలె సరాగంబున మెలఁగు మమ్మ
తోడికోడండ్రు వంతులకుఁ బట్టినచోట ముదరక తాలిమి నుండు మమ్మ
మానసంబున ధర్మ మేమఱకు మమ్మ, నుతికి నెక్కిననీసరిసతులలోన
వాసి గను మమ్మ కులశీలవర్తనములు, కొంచెపఱపక మము విచారించు మమ్మ.

124


క.

కసరకుమీ కోపించిన, విసువకుమీ సేవ చేయువేళల నీగుల్
గొసరకుమీ నీపాలికి, బిసరుహముఖి యేడుగడయుఁ బెనిమిటి సుమ్మీ.

125


వ.

అని బోధించి బాప్పాంబుధారాసిక్తకుచకుంభ యైనకూఁతుం గనుంగొని గద్గదభా
షణంబుల బుజ్జగింప నెట్టకేలకుం బోయి ర మ్మని పలికిన.

126


క.

దిగులుపడుబిడ్డ నచ్చో, డిగవిడిచి చనం గలంగుడెందముతో నే
పగిది జనువాఁడ దైవమ, పగవారికి నైన నాడుఁబడుచుల నీకే.

127


మ.

అని చింతించుచు బంధువర్గసహితుండై చొచ్చె సౌధాగ్రకే
తనఝంపాపవమానకంపితవియద్గంగాస్రవంతీచిరం
తనపానీయ మనంగ నొప్పుమిథిలాస్థానీయమున్ సంతసిం
ప నెఱింగించె వివాహవైభవము ధర్మవ్యానుఁ డిల్లాలికిన్.

128


గీ.

అంత నక్కడఁ దండ్రివాక్యములు దలఁచి, మగనిపట్టున నత్తమామల యెడాట
మున సదాసన్నయై చేయఁఁ బనులు చెంచు, రాకొమారి శతాసిధారావ్రతమున.

129


సీ.

కమలషండములు మేల్కానకమున్నె మేల్కని శుచిభూతయై దినదినంబు
నుటజనివాసాంగణోర్విపై గోమయజలములఁ గలయంపి గలయఁజల్లు.
నభ్యంతరస్థులు లలికి ముగ్గులు పెట్టు నగ్నిహోత్రములకు ననువుపఱచు
దేవపూజావితర్దికల నర్చనకు గంధాక్షతప్రసవమాల్యములు నిలుపు
ప్రొద్దుపాటున బహుభక్ష్యభోజ్యలేహ్య, చోష్యపానీయములు పాకశుద్ధి గాఁగ
వాయితముచేయు గృహభర్త లతిథియుక్తు, లై భుజింపంగ భుజియించునత్త మొదల.

130

క.

బిందియలఁ దెచ్చి జలముల, బృందావనమునకుఁ బోయుఁ బెంచినహరిణీ
బృందమునకు. ధేనువులకుఁ, దుండంబులు నిండ మేపు దూర్వాంకురముల్.

131


క.

ఈనియతిఁ గొంతకాలము, పో నొకదివసమునఁ గొంచెపుందప్పునకుం
గా నత్త ముగ్ధ నర్జున, కీనారిం జూచి పండ్లుగీటుచుఁ బలికెన్.

132


ఉ.

ఓసి దురాత్మురాల మృగయూధముల న్మొఱవెట్టఁగా మెడల్
కోసి వధించుపాతకునికూఁతుర బుద్ధులు చెప్పిచెప్పి నే
వేసరితిన్ మహాముని వివేకవిహీనుఁడు గాక యెట్టుగాఁ
జేసె నినుం బ్రసన్నునకు శిష్టవిధిజ్ఞత లేనిరక్కెసన్.

133


క.

పని లేదు నానివాసం, బున నుండఁగ నిఁకఁ బొకాలి పొమ్మని నునుఁజె
క్కున నెత్తు రుట్టిపడ వీ, డనిరోషావేశమున జటాలునఁ గొట్టెన్.

134


గీ.

ఇట్లు గొట్టినకొట్టున నెఱ్ఱవారి, పుష్పకోమలిధవళకపోలతలముఁ
గరుణ పుట్టించె రాహువు గఱచి విడువఁ, దొరుఁగు నెత్తురుతోడి చందురునిపగిది.

135


చ.

మఱియు బహుప్రకారముల మర్మము లెత్తుచు నత్త దిట్ట ని
వ్వెఱఁగున నాశ్రమస్థలము వెల్వడి సత్వరయానలీలఁ గ్రి
క్కిఱిసినచన్నుదోయి చలియింపఁగ వచ్చె దృగంబుపూరముల్
వఱదలు గట్ట నేడ్చుచు విలాసవతీమణి పుట్టినింటికిన్.

136


వ.

అప్పుడు భయసంభ్రమాశ్చర్యంబులు మానసంబున ముప్పిరిగొన ధర్మవ్యాధుఁడు
భార్యాసహితుండై బహిర్గేహదేహళిపర్యంతంబు చని వచ్చి తనపదంబులమీఁదం
బడి యేడ్చుకూఁతు నెత్తి గ్రుచ్చి కౌఁగిటం జేర్చి కరంబునం గన్నీరు దుడుచుచు
నూరార్చి లోనికిం దోడ్కొని పోయి నాతల్లి వల్లభావాసంబు విడిచి పురపురం
బొక్కుచు నొక్కతెవు నేమి కారణంబున నరుగుదెంచితి విట్లు దురవస్థం బొందు
టకు నుల్లంబు దల్లడిల్లెడుం జెప్పు మనిన నర్జునకి తండ్రి నాలోకించి.

137


క.

పిలిచెనఁట నన్ను నే వినఁ, బిలుచుట నీపాదమాన పిలిచిన నేలా
పలుక వనుచు నిప్పులు గనుఁ, గొలుకుల రాలంగ నత్త కోపముతోడన్.

138


ఉ.

ఓసి దురాత్మురాల మృగయూధములన్ మొఱవెట్టఁగా మెడల్ గోసి వధించుపాతకునికూఁతుర బుద్దులు చెప్పిచెప్పి నే
వేసరితిన్ మహాముని వివేకవిహీనుఁడు గాక యెట్టుగాఁ
జేసే నినుం బ్రసన్నునకు శిష్టవిధిజ్ఞత లేనిరక్కెసన్.

139


క.

అని కర్ణకఠోరము లా, డి నలుగురుం జూడఁ గట్టిఁడితనంబునఁ గొ
ట్టి నివాసంబున నుండక, చను మన వచ్చితి నటన్న సక్రోధుండై.

140

శా.

ఎట్టెట్టూ మునిభార్య నన్ను వినదే యీమాట ని న్నాడఁగా
నట్టే కాక యెఱింగి వత్తము తదీయాహింసకత్వస్థితుల్
పట్టీ రమ్మని వెంటఁబెట్టుకొని భిల్లస్వామి దట్టంబుగా
నిట్టూర్పు ల్నిగుడంగ వచ్చి కనియెన్ వియ్యంపువాచంయమున్.

141


పృథ్వీ.

మతంగుఁడును జాతసంభ్రమముతోడ నర్ఘ్యాదిస
త్కృతు ల్సరవిఁ జేసి నాయెడకుఁ గీకటగ్రామణీ
వతంస చను దేరఁగా వలసె నేల నీకున్ సమీ
హితంబు వినిపింపు నా ఋషిమొగంబు వీక్షించుచున్.

142


క.

మనమున మఱియేయీహిత, మును లేదు భవన్నివాసమున నిర్జీవా
శనము భుజియింప వచ్చితి, నని ధర్మవ్యాధుఁ డాడ యతిసమ్మతుఁడై.

143


గీ.

కడురయంబున మాధ్యాహ్నికక్రియాక, లాపములు దీర్చి భుక్తిశాలావితర్ది
సీమమున నుండి వ్రీహిగోధూమయవల, నాయితం బయ్యె నాహార మని పిలిచిన.

144


సీ.

ఆవ్రీహిగోధూమయవ లెటువంటివి చూడంగ వలె నాకుఁ జూపుఁ డనిన
చేటలఁ ద్రవ్వి తెచ్చినఁ జూచి భిల్లవంశాగ్రణి హరిహరి యనుచు లేచి
పోవంగ వెనువెంటఁ బోయి యోయి మహాత్ముఁడా భుజింపకపోవుటకు నిమిత్త
మేమి నావుడు నమ్మహామునితో నసంఖ్యము లైనజీవుల ననుదినంబు
గనికరము లేక ప్రాణాలు గొని భుజించు, ఘాతుకునియింటఁ గుడువంగఁ గాదు గానఁ
దొలఁగిపోవుచు నున్నాఁడఁ గలిగెనేని, ప్రియమున భుజింతుఁ బెట్టు నిర్జీవభుక్తి.

145


సీ.

వనజీవి నొక్కటి ననువాసరము చంపి దాన నే నతిథులఁ దనిపి కొంత
శేషింపఁ బరిజనశ్రేణికి సంతృప్తి గావింతు నడుపుదు జీవనంబు
కటకటా యేఁట నొక్కటి సహస్రంబులై ఫలియించుజీవులఁ బ్రతిదినంబు
సంఖ్య మాలినవానిఁ జంపి పొట్టలు నిండ నాలుబిడ్డలు నీవు నారగింతు
పాతకుఁడ కాన నెంగిలిచేతఁ గాకి, నేయఁజాలవు తలఁప మదీయవర్త
నంబునకును భవద్వర్తనంబునకు, హస్తిమశకాంతరము సంశయంబు లేదు.

146


వ.

అది యట్లుండె నింక నొక్కవేదరహస్యంబు వినుము తొల్లి చతుర్ముఖుండు దైవ
భౌతపైత్రమానుషబ్రహ్మంబు లనుపంచమహాయజ్ఞంబుల బ్రాహ్మణహితార్థంబు నిర్మించె
నాయజ్ఞంబుల నితరవర్ణంబులవారు దారు చేయక బ్రాహ్మణులవలనం జేయింపవలయు
నిట్టిపంచమహాయజ్ఞంబులకొఱకు నోషధిపశులతలు సంపాదితంబు లయ్యెం గాని
కేవలంబు భక్షింపఁ గాదు దీని నెఱిఁగి వ్రీహిగోధూమపక్షిమృగాదిస్థావరజంగ
మాన్నంబులు యజ్ఞనిమిత్తంబు గావింతు మనిమిత్తంబు గావించినఁ బవిత్రంబులు గావు

బహుప్రకారంబుల వివేకించి చూచితి. నేఁడువంటిపెనుబండుగున నీయింట దేవ
పూజావిధానంబు గగనప్రసూనంబు వైశ్వదేవబలిహరణంబు లన్న సున్న దీనజన
పరిత్రాణపరాయణత్వంబు శశవిషాణంబు పైతృకాదిప్రముఖవిశిష్టాచారంబు లెల్ల
నిట్ల గావున భవదీయాన్నం బభోజ్యం బని దూరంబలికి వెండియు నధికక్రోధుం డైన
ధర్మవ్యాధుండు మతంగునిం గటాక్షించి.

147


క.

ఇలువడి గలనా కూఁతురు, కొలఁది యెఱిఁగి జీవఘాతికూఁతుర యనుచుం
బలుకఁగ నోయి మునీ నీ, కులకామిని యేవిశిష్టుకూఁతురు చెపుమా.

148


గీ.

హింసకుండ నైనయిట్టినాకూఁతురు, హింసకుఁడవు గానియిట్టినీకుఁ
గోడ లయ్యెఁ జేసికొనుము ప్రాయశ్చిత్త మనుచు, నుల్లసంబు లాడి నవ్వి.

149


మ.

కకుబంతాంతరధాత్రిపై నిది మొద ల్గా సార్వకాలంబు న
త్తకుఁ గోడండ్రకు నొంట కుండెడును ముగ్ధ న్నాతనూజాత నూ
రక భర్జింపక యేలుకొండు మునివర్యా నేఁడు మాయింటఁ బై
తృక మంచు నిఖిలాపురంబునకుఁ బోయె న్వర్జితక్రోధుఁడై.

150


ఉ.

పోయి పితృక్రియల్ నడపి పుత్రుని జీవనచక్రభారధౌ
రేయునిఁ జేసి కీకటవరేణ్యుఁడు దా నరిగెన్ విరక్తుఁడై
పాయక ముక్తికాంతకుచపాళికపజ్జలఁ బత్రభంగముల్
వ్రాయఁగ లోహదండవనవాటికి సన్మునిరత్నపేటికిన్.

151


వ.

ఇవ్విధంబున లోహదఁడమహాగహనం బవగాహించి బహుసహస్రహాయనంబులు
తపఁబు సలిపి విష్ణునామం బనుపుణ్యస్తవంబున వెన్నునిం బ్రసన్నునింజేసి తదీయ
దివ్యదేహంబున లయం బయ్యె నని చెప్పిన మహాత్మా ధర్మవ్యానుండు పఠించినవిష్ణు
నామస్తవంబు వినవలయు నానతి మ్మనిన మహీమహిళకు వరాహదేవుం డి ట్లనియె.

152


సీ.

విష్ణుదేవునకు శ్రీవిపులవక్షునకు విశ్వప్రభునకు షట్పదప్రభునకు
దామోదరునకు భూధరునకు దైత్యసంహారకారికి నృకంఠీరవునకు
చక్రహస్తునకుఁ ద్రివిక్రమునకు మధుకైటభారికి భక్తకామగవికి
శుభవక్త్రునకుఁ బురుష్టుతునకుఁ బురుషోత్తమునకు నిశ్రేయసాఖ్యునకు హరికి
గగనపవనాత్మరవిసుధాకరధరాగ్ని, సలిలమూర్తికి గురునకు జలధివాసు
నకు జనార్దనునకు నరునకు సనాత, నునకు నచ్యుతునకు వరాహునకుఁ బ్రణతి.

153


మ.

అని ఫాలస్థలకీలితాంజలిపుటుండై విష్ణునామస్తవం
బునఁ దన్నుం గొనియాడఁగా నిజకరంబుల్ శంఖచక్రాదిసా

ధనదీప్తిచ్ఛటన్ వెలుంగ విహగాధ్యక్షాంసపీఠాగ్ర మె
క్కి నిషాధాగ్రణిముందట న్నిలిచి లక్ష్మీభర్త లేనవ్వుతోన్.

154


క.

కనుఁగొని కరుణారసవా, హిని మనమున వెల్లివిరియ నిచ్చెద వరముల్
గొనుము వలసినవి నీవ, ర్తనమునకు న్మెచ్చినాఁడ ధర్మవ్యాధా.

155


సీ.

అనిన శ్రీహరికి నిట్లని విన్నవించెఁ బుళిందుండు నాకు నా నందనులకు
దయచేయు మాత్మవిద్యాయుక్తసకలకళావత్కవిత్వంబు దేవదేవ
వసుమతిపై నధవా నన్నుఁ బుట్టింప నూహ గల్గిన ధర్మయుగమునంద
పుట్టింపు మద్వంశమున జనించినవారి విజ్ఞానపరులఁ గావింపు మంత
మీఁద నీ మేన లయముగా నాదరింపు, మనుచుఁ బ్రార్థింప నోయి మహాకవీంద్ర
వరము లన్నియు నిచ్చితి వచ్చి నన్నుఁ, గూడు మిప్పుడు నావుడుఁ గూడె నతఁడు.

156


వ.

కావున ధర్మవ్యాధుండు పఠించినయీవిష్ణునామస్తవంబు వైష్ణవంబు లైనవాసరం
బుల నుపవసించి మురారి నారాధించి తాత్పర్యంబునం జదివిన వినిన మానవులకు
వైకుంఠంబున సప్తతిమన్వన్తరంబులు వసింపం గలుగు నని చెప్పిన విని విశ్వమూర్తి
యైననారాయణుం డాదికృతయుగంబున నేమి చేసె నానతి మ్మనిన విశ్వంభరకు
దంభకుంభినీదారం బిట్లనియె.

157


సీ.

స్వచ్ఛందకర్మానుసంధాత నారాయణుండు పూర్వమున నొకండ నిలిచి
నిమిషంబు నుబుసుపోవమికి వేసరి ద్వితీయాన్వేషణము చేయ నతనివలన
బుధ్యాత్మికయుఁ బరిస్ఫురదహస్కరరూపిణియు నైనచింత జన్మించె నదియ
తలఁప నకారంబు తదకారమున రెండు చింతలు పుట్టెఁ జర్చింపఁగా ను
కారము మకార మనునవి కంబుకంఠి క్రమముతో పట్టి మూడువర్ణములుఁ గూడి
యేకవర్ణత్వమునఁ బొంది లోకజనన, రక్షణక్షయకర మైనప్రణవ మయ్యె.

158


వ.

ఆప్రణవంబున భూర్లోకంబును భూర్లోకంబున భువర్లోకంబును భువర్లోకంబున
సువర్లోకంబును సువర్లోకంబున మహర్లోకంబును మహర్లోకంబున జనలోకం
బును జనలోకంబునఁ దపోలోకంబును దపోలోకంబున సత్యలోకంబును
సంభవించె నిట్లు సంభవించి సూత్రంబున మణిగణంబులుం బోలె నున్న
శూన్యలోకంబులు విలోకించి ప్రణవస్వరూపియుం ద్రిమూర్తిస్వరూపియు నైన
నారాయణుండు వరేణ్యమూర్తి నొక్కటి నుత్పాదింప నూహించి తనమనంబు సం
క్షోభింపం జేసిన నమ్మనంబున స్వమాత్రకం బగునకారంబు నిలిచె నకారంబును సం
క్షోభింపం జేసిన నందు బ్రహ్మాండంబు పుట్టె నది రెండువ్రక్క లైన నడుమ భూలో
కంబు గానంబడియె భాస్కరసన్నిభుండునం గమలకోశవ్యవస్థితుండును బ్రమాణ

చక్రస్థుండును నగునన్నారాయణుండు ప్రాజాపత్యతేజంబునం గడమలోకం
బులు నిర్మించె నయ్య కారం బన్యస్వరంబుల హల్లుల సృజియించె నవ్వర్ణంబులు సాధ
నంబులు గాన మూర్తసృష్టి మొదల వేదాంగంబులు శాస్త్రాంగంబులుం గలిగించె
వెండియు నారాయణుండు.

159


గీ.

సంస్మరింపంగ సవ్యాపసవ్యలోచ, నాంచలంబులఁ బుట్టె నీహారవహ్ని
సన్నిభము లైనదివ్యతేజములు రెండు, వానిఁ గొని చేసి రాజదివాకరులను.

160


గీ.

నాసికారంధ్రములఁ బవనంబు వదన, సరసిజంబునఁ బావకధరణిదేవ
తల భుజంబులఁ దొడలఁ బాదముల క్షత్రవైశ్యశూద్రుల నిర్మించె వరుసతోడ.

161


క.

వనజముఖీ తదనంతర, మున యక్షోరక్షనివహముల సంజననం
బునఁ బొందించెఁ బయోజా, సనాండభాండాంతరాళజలపూరమునన్.

162


వ.

మఱి చతుర్విధభూతంబులచేత భూర్లోకంబును వియచ్చరులచేత భువర్లోకంబును
వైమానికులచేత సువర్లోకంబును స్వాంగభూతులుం గల్పోపవాసు లైనసనకాదుల
చేత జనలోకంబును వైరాజులచేతఁ దపోలోకంబును బునర్మారకు లైనగీర్వాణుల
చేత సత్యలోకంబును నిండించె నిండించి మహానుభావుం డతండు జాగ్రదవస్థం
బొంది వినోదింప భూర్భువస్సువర్లోకంబులు జాగ్రదవస్థంబొందె నంతటం గల్పాంత
నిశాసమయంబున సుప్తుం డైన నతనిదేహంబున లయం బై త్రైలోక్యంబును సుప్తిం
బొందె మఱునాఁడు మేల్కొని నిద్రాజ్ఞానమోహితుం డైనతనకు వేదమాతయు
వేదంబులు దేవతలుం బొడగానరామి జగత్స్వామి చింతించి నిజశరీరం బగు
నీరంబున నడంగుట యెఱిఁగి క్రమ్మఱ నిర్మించుకొఱకు జలావగాహంబు గాపింప
నూహించి.

163


ఉ.

వాలుగుమీనురూపమున వాలి గుబాలునినాద మష్టది
క్పాలిక లాక్రమింప నుదకంబులపై నుఱకంగ బిందువు
ల్దూలె నభస్థలంబునకు లోపల నున్నధరావధూటి యి
ల్లాలు విభుండు వచ్చినశుభార్థము లాజలు చల్లెనో యనన్.

164


క.

ఈలీల మొదలివేలుపు, వాలుగు రభసమున నుఱికి వసుమతిఁ గరుణా
లోలమతి నుద్ధరించి ప, యోలీనత మాన్పఁ గని మహోలోకస్థుల్.

165


ఉ.

ఆస్థ లలాటసంఘటితహస్తసరోరుహులై జలాంతవి
శ్వస్థితికారిదేహ రవిచంద్రమరుద్గగనాత్మరూప వ
క్షస్స్థలవీధికాఖచితకౌస్తుభరత్నవినూత్నరోచిరూ
ర్మిస్థగితాష్టదిక్తట తిమింగిలగాత్రధరా ధురంధరా.

166

శా.

స్వామీ నన్ను ననుగ్రహింపుము జగజ్జాలంబు లెల్లన్ భవ
త్సామర్థ్యంబునఁ బుట్టు నుండు నడఁగున్ సంత్రాసదం బైననీ
యీమీనాకృతి మాను మాదిమతనూపేతుండవై శాంతిల
క్ష్మీమాధుర్యము చూపు మంచు వినుతుల్ సేయంగ మోదంబుతోన్.

167


ఉ.

ఆపరమస్తుతుల్ వినుచు నంబునిమగ్నము లైనవేదశా
స్త్రోపనిషత్ప్రపంచముల నున్నతశక్తి ననుగ్రహించి ల
క్ష్మీపతి లోకభీకరతిమింగిలరూపము మాని తాల్చె నా
నాపురుషార్థదాయక మనంగ వెలింగెడుపూర్వరూపమున్.

168


గీ.

కావున మహాత్ముఁ డతఁడు సాకారుఁ డగుచు, నిలుచు నెందాఁక నందాఁక నిలుచు నీస
మస్తజగములు కూటస్థుఁ డైన నడఁగు, వికృతిగతుఁ డైన మగుడ నావిర్భవించు.

169


సీ.

మేదిని నీరీతి నాదిదేవుండు కల్పించి కల్పనము చాలింప జగము
వృద్ధిఁ బొందుచునుండ నింద్రాదివిబుధులు హరిఁ గూర్చి బహుకాల మధ్వరములు
మొదలుగాఁ గలధర్మములు సప్తసాగరవేలాపరీతపృథ్వీతలమునఁ
గావించుచో ననేకసహస్రవక్త్రనేత్రోదరబాహుఁడై రొదసీక
టాహమధ్యంబు నిండిన దేహయష్టి, మెఱయ సాక్షాత్కరించి లక్ష్మీమనోహ
రుండు దేవతలార కోరుండు మీకు, నే వరంబులు వలసిన నిత్తు ననిన.

170


గీ.

దేవ నినుఁ గాని మమ్ము ధాత్రీతలంబు, వారు పూజింప నొల్లరు వారిచేతఁ
బూజగొన మాకు వర మిమ్ము తేజ మిదియ, నాఁగ నిచ్చితి నంచు నంతర్ధి నొందె.

171


గీ.

అంత సంతోషమున మహేంద్రాదివిబుధ, వర్గములు పోయె నాత్మనివాసములకు
శార్ఙ్గపాణియు సత్వరజస్తమోగు, ణములఁ ద్రివిధంబు లైనభావములఁ దాల్చి.

172


వ.

సాత్వికం బైనభావంబున నిజావయభూతపురుహూతప్రముఖలేఖుల నారాధించె
రాజసం బైనభావంబున మకారస్వరూపియు నాత్మీయరజోమూర్తియు నగుశూల
పాణి భక్తిం బూజించెఁ దామసం బైనభావంబున రాక్షసులం బ్రవేశించె నిత్తెఱం
గున జగత్కర్త మూడువిధంబులం బొందిన నది మొదలుగా లోకంబును మూడు
విధంబులం బొందె వెండియుఁ ద్రిమూర్త్యాత్మకం బైనదేవుండు కృతయుగంబున
నారాయణుండును ద్రేతాయుగంబున రుద్రాకారుండును ద్వాపరయుగంబున
యజ్ఞమూర్తియుఁ గలియుగంబున బహురూపధరుండును నయ్యె నట్టివిష్ణునిమహ
త్త్వంబును విష్ణుభక్తులచరిత్రంబును విచిత్రంబుగా వచియింతు నాకర్ణింపుము.

173


క.

కృతయుగమున వేలాపరి, వృతనిఖిలక్షోణివలయభృతిలీలాధి
క్కృతసుప్రతీకుఁ డగుసుప్రతీకుఁ డను రాజు గలఁడు రాకేందుముఖీ.

174

క.

ఋభువిభునిభుఁ డాభూవ, ల్లభుఁడు నిజాంగనలు తనువలగ్నలు విద్యు
త్ప్రభయుం గాంతిమతియు నను, శుభలక్షణవతులు సతులు సుతులం గనమిన్.

175


క.

పట్టె ననేకవ్రతములు, పెట్టె మహీదేవులకు నభీష్టాన్నంబుల్
కట్టె నుపవాసములచే, మెట్టెం బుణ్యస్థలములు మెలఁతలుఁ దానున్.

176


క.

ఈభంగి నడువఁ దనకుఁ దనూభవ సంప్రాప్తి లేమి నొచ్చి తపశ్చ
ర్యాభిరతిన్ సచివులపై భూభారము నిలిపి కదలిపోవుచు నెదురన్.

177


ఉ.

నాటినభక్తిపాటవమునం గనియెం బితృకూటమున్ గుహా
కోటరకుంజపుంజగతకుంజరఝాటము శాబరీకృతా
ఖేటము నిష్ఠురాఘశరఖేటము దివ్యమణిప్రభానిరా
ఘాటము నిర్ఝరీలహరికంకణకోరకితార్కఘోటమున్.

178


క.

కని తద్గిరిగహనాంతరమున దూర్వాసుని సమస్తమునిలోకవతం
సునిఁ గూర్చి సుప్రతీకా, వనిపాలుఁడు దపము సల్ప వాత్సల్యమునన్.

179


సీ.

అనుభావశక్తి బ్రహ్మాదుల నొకపూరిపుడకకుఁ గైకోనిపోతరీఁడు
ఘనకోపవాణిజ్యమునఁ దసోవి త్తజాలముఁ గూడఁబెట్టెడులాబగాఁడు
తనరథంబునకు మాధవసత్యభామల గుఱ్ఱాలఁ జేసిన కోడిగీఁడు
యతిసతీకులరత్న మనసూయకడుపున మునుమునఁ బుట్టినముద్దులాఁడు
సకలకళ్యాణకరుఁడు సాక్షాధనంగ, హరుఁడు నిర్మలతత్త్వవిద్యావిచార
ణావిలాసుఁడు దూర్వాసుఁ డావసుంధ, రాధిపతికి వరంబు లీ నరుగుదెంచె.

180


వ.

తదనంతరంబున.

181


ఉ.

లేఖులు రెండువంకల బళీబళిశద్దపరంపరల్ మహా
మౌఖరి నుచ్చరింప మదమత్తనిశాటవిపాటనైకవి
ద్యాఖరదంతకుంతభయదాభ్రమువల్లభు నెక్కి రేవతా
శేఖరుఁ డింద్రుఁడున్ వనవిశేషము చూచుచు వచ్చి ముందటన్.

182


క.

అనవద్యుని దుర్వాసో, మునిఁ గని యేనుంగు డిగక మ్రొక్కక పార్శ్వం
బున నిలిచె నగుచు నూరక, తనుఁ జెఱుపఁగ నెత్తుకొన్న దర్పముకతనన్.

183


క.

ఆమఘవంతునిరాజ్య, శ్రీమదగర్వంబు చూచి ఘృతధారలఁ బై
పై మండునగ్ని వోలె మ, హామునిహర్యక్షుఁ డాగ్రహవ్యగ్రుండై.

184


క.

నిటలంబునఁ గుటిలభ్రూ, కుటి నటియింపంగ మొగ మిగుర్పఁగ మేనం
జొటజొటఁ జెమటలు గాఱఁగఁ, గటమర లదరంగ నౌడు గఱచుచుఁ బలికెన్.

185

సీ.

అనుకంప లేక బ్రాహ్మణుని నమ్మించి గొంతుకఁ గోసిపోయినదోసకారి
గౌతమఋషికులాంగన నహల్యాదేవిఁ జీఁకటితప్పు చేసినదురాత్మ
పరసతిబిడ్డని హరకోపహుతవహార్చులలోనఁ ద్రోచిన క్రూరకర్మ
సగరక్షమాపాలసప్తకంతువిముక్తహరి ముచ్చిలించినపరమధూర్త
యోరి గోత్రవిఘాతి న న్నొకతపస్వి, మాత్రుఁగాఁ జూచి యిపుడు నమస్కరింప
వైతి గావున దేవరాజ్యాధిపత్య, మునకుఁ బెడఁబాసి భువిఁ గూలు మని శపించి.

186


శా.

అంతన్ శాన్తి వహించి సస్మితముఖుండై సుప్రతీకక్షమా
కాంతుం జూచి పులోమజిద్విజయయదీక్షాదక్షుఁ డక్షుద్రుఁ డ
త్యంతక్రూరుఁడు దుర్జయాఖ్యుఁడు నరేంద్రా నీకు విద్యుత్ప్రభా
కాంతాగర్భమునందు నందనుఁడు లోకఖ్యాతిగాఁ బుట్టెడున్.

187


వ.

అని వరం బిచ్చి దీవించిన మునికి మ్రొక్కి సుప్రతీకుండు చనియె నని వరాహ
దేవుండు చెప్పిన ధరావరారోహ తరువాతివృత్తాంతం బానతి మ్మని విన్నవించిన.

188


మ.

తటినీనాధగభీర పార్వికసుధాధామప్రభాధామ వా
క్పటిమాంభోరుహగర్భ విభ్రమవతీపాంచాల ధాటీరజః
వటలాంధీకృతరోదసీకుహర శుంభత్కీర్తిసంపన్న ది
క్తటవేదండఘటావిభక్తచతురాఘాటావనీమండలా.

189


క.

ప్రాజ్యభుజభుజగసన్నిహి, తజ్యశరానలహుతాహితక్షితిపతిర
క్తాజ్య నరసింగనృపసా, మ్రాజ్యరమాధరణ సుకవిరాజోద్ధరణా.

190


తోటకవృత్తము.

కుకురుప్రమదాకురుకుంభకుచా, శకనీలకచాకరచాలితహా
టకచామరకేళినటచ్చికుర, ప్రకటాచలచుంబితఫాలతలా.

191

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వర ప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబున ద్వితీయాశ్వాసము.