వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/ప్రథమాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

ప్రథమాశ్వాసము

శా.

శ్రీలీలాస్పద మైనకొమ్మున ధరిత్రీకాంతఁ గారుణ్యల
క్ష్మీలోలాత్మత నెత్తి లీల జలదాశ్లేషైకశృంగోన్నమ
త్కైలాసంబును బోలె నున్నజగదేకస్వామి వారాహదే
హాలంకారుఁడు ప్రోచు నీశ్వరనృసింహక్ష్మావధూవల్లభున్.

1


శా.

తా నానందముతోడఁ గుంకుమవసంతం బాడె నో సాఁగసం
ధ్యానాట్యావసరభ్రమీగళితమస్తన్యస్తనాకస్రవం
తీనీరేరుహరేణువుల్ తనువుపై నిండంగ దీపించుగౌ
రీనాథుం డొసఁగున్ గృప న్నరసధాత్రీభర్త కైశ్వర్యముల్.

2


ఉ.

కూలము డిగ్గి స్నానమునకున్ సురవాహిని సొచ్చి నిల్వఁగా
నాలుగునీరజంబు లొకనాళమునం బ్రభవించె నెట్టిచో
ద్యా లని ముగ్ధనాకవనితల్ తనమోములు చూడ నవ్వుభా
షాలలనేశ్వరుండు నరసక్షితిజానికి నాయు వీవుతన్.

3


చ.

స్మరసమరంబునం బరవశత్వము నొంది మహేంద్రనీలభా
స్వర మగుదానవాంతకునివక్షముపై నొరగంటఁ జక్కఁగా
నొరసినహేమరేఖవలె నున్నరమారమణీలలామ యీ
శ్వరునరసింహభూపతినివాసమునన్ వసియించుఁ గావుతన్.

4


సీ.

కొలనికెందమ్మిపూవులు వినోదార్థంబు పయ్యెదకొంగులోపల వహించి
మందిరాంతరచంద్రమణిశిలాకుట్టిమావనిమీఁదఁ దా వచ్చి వచ్చి మెలఁగి
తనసయావకపాదతలములఁ ద్రొక్కినచోటులు దప్పక చూచి నిలిచి
యోహో సరోజంబు లొడివిడి పడియె నేరుకొనంగవలె నని సకులఁ బిలుచు
ముద్దరాలు తుషారాద్రిముద్దుఁబట్టి, శ్రీసదాశివదేహభద్రాసనస్థ
సమరవిజయంబు లొసఁగు నీశ్వరనృపాలు, నారసింహవసుంధరానాయకునకు.

5

శా.

లావణ్యాంబులు నాభికూపమున వెళ్ళం దోడి ముద్బీజవ
ద్భావక్షేత్రమనందు వంచుఘటయంత్రంబో యనంగా జప
వ్యావృత్తస్ఫటికాక్షదామకము హస్తాబ్జంబునం దాల్చువా
ణీవామేక్షణ నారసింహునికి సంధించున్ వచోవైఖరుల్.

6


చ.

పెనిమిటితోడ శీతమహిభృత్పతికన్యక జూద మాడి గె
ల్చిన హిమరశ్మిరేఖఁ దనచేతికి నిచ్చిన బాల్యచాపలం
బునఁ గబళింపఁగా విఱిగిపోయినకొమ్మును వచ్చినట్లు మిం
చినకరివక్త్రుఁ డీశ్వరునృసింహునకున్ వరదుండు గావుతన్.

7


వ.

అని యాశీర్వదించి వచనరచనాచాతుర్యంబున నల్పాక్షరంబుల నధికార్థంబు గుది
యించి పద్యపూరణంబులకు నాదికారణంబు లైనసంస్కృతాంధ్రభాషలం గలజల్లులు
విసర్జించి రసపోషణప్రధానశబ్దంబు లుపార్జించి భక్తజనమనోరథనిర్వాహకమహా
వరాహదేవచరణస్మరణాయత్తచిత్తులమై.

8


సీ.

అతిపవిత్రం బైనయమునాతరంగిణిసైకతం బెవ్వనిజన్మభూమి
ప్రామినుకులు సూత్ర పఱచి లోకహితంబుగా నిర్వహించె నెవ్వానిబుద్ధి
కలుషంబు విదళింపఁ గలధర్మశాస్త్రప్రపంచంబు లెవ్వానిపలుకుబళ్ళు
కొదవడ్డకౌరవక్షోణిపాలవతంసవంశంబు నిలిచె నెవ్వానివలన
నట్టి సాత్యవతేయముహామునీంద్రుఁ, డనుసుధాబ్దికిఁ గల్పకం బనఁగ వెలయు
శ్రీవరాహపురాణంబు చెప్పఁ గడఁగి, తిమి తెనుఁగునఁ గవికులోత్తములు పొగడ.

9


వ.

ఈకృతిప్రారంభంబు కర్ణాకరికావశంబున విని సంతతసత్యభాషాహరిశ్చంద్రుండు
ను తుళువకులదుగ్ధాబ్ధిచంద్రుండును నిరాఘాటధాటీచటులఘోట్టాణారట్టకంఖాణ
పుంఖానుపుంఖరింఖాఘరట్టఘట్టితక్షమాధూళిరించోళిసంఛాదితాదిత్యుండును నుబ్బ
రాదిత్యుండును చతురకూపారపరీతధరణిపాలసభాభవనకవినివహస్తూయమానదాన
విద్యాపరాయణుండును చాళుక్యనారాయణుండును, విశ్వవిశ్వంభరాభరణభుజా
స్తంభసంభావితకుంభికుంభీనసకుహనావరాహుండును బర్బరబాహుండును సము
ద్భటప్రతిభటభయంకరవిక్రమక్రమాధరీకృతేశ్వరకుమారుండును నీశ్వరకుమారుం
డును నగునరసవసుధాధీశ్వరుం డొక్కనాఁడు.

10


సీ.

అష్టభాషాకవితాబ్జసంభవు లైనసుకవిపుంగవులు సంస్తుతులు సేయ
సంకీర్ణరాగరంజకు లైనగాణలగములు గీతప్రబంధములు పాడ
కలకంకణక్వాణకరసరోరుహ లైనరమణులు వింజామరములు వీవ
వరబలాధికు లైనశరణాగతారాతిసామంతు లుభయపార్శ్వములఁ గొలువ

కూర్మితనయుఁడు నరసయ్య గుణనిధాన, మంతికంబున సేవింప నలఁదికొన్న
సురభికాశ్మీరగంధంబు సోడుముట్ట, నుండెఁ బేరోలగము నయనోత్సవముగను.

11


సీ.

అపుడు సభావేదికాగ్రస్థితుల మైనమమ్ము వాగీశ్వరీమంత్రరాజ
సిద్ధిపారగులఁ గౌశికభరద్వాజగోత్రుల మహాదేవాంఘ్రిజలజభక్తి
పరతంత్రమతుల నాపస్తంబసూత్రుల గురుదక్షిణామూర్త్యఘోరశివుల
శిష్యుల నతిశాంతచిత్తులఁ దనకు నాశ్రితుల భాషాద్వయకృతినిరూఢ
శేముషీభూషణుల నందిసింగనార్య, తనయు మల్లయకవికులోత్తముని ఘంట
నాగధీమణికూర్మినందనుని మలయ, మారుతాంకితు సింగయమంత్రిఁ జూచి.

12


క.

మీ రిరువుకు నెప్పుడును శ, రీరప్రాణములక్రియఁ జరింతురు మిగులం
గూరిమిఁ గృతిఁ బ్రతిపద్యముఁ, జారుఫణితిఁ జెప్పఁగలరు చాటువు గాఁగన్.

13


క.

కావున మీరు దలంచిన శ్రీవారాహంబు మంచికృతి మాపేరం
గావింపుఁ డనుచు సుముఖుం, డై విడ్యముఁ గప్పురమ్ము నర్పించుటయున్.

14


ఉ.

దేవరవంటిపుణ్యునిఁ గృతిప్రభుఁ గా నిలుపంగఁ గల్గుటం
బావనమై ప్రసిద్ధి గను మాకవితావిభవంబు దిక్కులన్
శ్రీవరుపాదపంకజముఁ జెందినజాహ్నవి ముజ్జగంబులం
బావనతం బ్రసిద్ధి గనుబాగున శ్రీనరసింహభూవరా.

15


ఉ.

తప్పును నొప్పు లేనికృతి దారకులంబుగ వింటిఁ గొంత త
ప్పొప్పులు రెండు గల్గుకృతి యొప్పనిజాతిలతాంగి తప్పులే
కొప్పులె గల్గుసత్కృతి గుణోన్నతివంశవిలా రేఖలం
జెప్పఁగ సాటి లేనిసరసీరుహలోచన గాదె చూడఁగన్.

16


వ.

అని నాయకప్రశంసయు మధ్యమాధమోత్తమకవిత్వంబులతారతమ్యంబులు నభి
వర్ణించి యుత్తమమార్గంబున నేతత్ప్రబంధంబు రచయింప నుద్యుక్తులమై.

17


సీ.

నిరవద్యరఘురామనృపకథారామకేలీమత్తకేకి వాల్మీకిఁ దలఁచి
ధర్మనిర్మితకర్మతన్వంతరాదినారాయణు బాదరాయణు భజించి
వాసంతికామంజరీసమంజసకవిత్వనివాసుఁ గవి కాళిదాసుఁ గొలిచి
గంభీరపదహృద్యగద్యప్రబంధవిభ్రమరమాపారీణు బాణుఁ దడవి
నన్నపాచార్యునకు వందనంబు, చేసి, తిక్కయజ్వకు మ్రొక్కి కీర్తితము లైన
శంభుదాసునివాగ్విలాసములు నెమ్మ, నంబులోపల నిలిపి శ్రీనాథుఁ

18


క.

నెలకొన్నభక్తి సద్గురు, కులచూడారత్న మగునఘోరశివాచా
ర్యులదివ్యపాదపదంబులకు నమస్కృతి ఘటించి పూతాత్ములమై.

19

వ.

తదనంతరంబ కృతిపతికిం బతి యైనసాళువనరసింగరాజరాజమౌళిపావనాన్వ
యంబు మొదల వర్ణింతుము చింతారత్నకామగవికల్పవృక్షలక్ష్మీపక్ష్ములాక్షులతోడం
బుట్టి మిన్నుముట్టినపాలమున్నీటిపట్టి సాయంతనసమయసంఫుల్లమల్లీమతల్లికాగుళు
చ్ఛస్వచ్ఛకాంతినిస్తంద్రుండు చంద్రుండు వంశకర్తగా సకలకలికలుషాపహర్త
వంకిదేవమహీధర్తకీర్తికార్తికచంద్రికాప్రభావంబులు వినిర్మించి దశదిశాంచలం
బులు ముంచెఁ దత్తనూజుండు చతుష్షష్టివిద్యావినూతనభోజుండు గుండ్రాజు దుం
డగపురాచతండంబులఁ జెండాడి మండలగ్రావంబుకెలంకుల గెలుపుఁగంబంబులు
నిలిపెఁ దత్సూనుండు గాండివధన్వసమానుండు సాళువరాజు ఘోరాహవహట్టంబు
నం బారసికతురగధట్టంబులం గనుపుగొట్టి ధరావరారోహబాహుపీఠంబునం
గుదురుపఱచెఁ దత్పుత్త్రుండు నిరాతంకప్రతాపకమలమిత్రుండు గౌతరాజు రాజు
సంబున గుణలతావితానంబులు సేతుశీతాచలమధ్యపృథ్వీమండలంబున మెండు
గొలిపెఁ దత్సుతుండు వీరలక్ష్మీసమన్వితుండు గుండరాజు వీరోధిరథినీవిఖండన
ప్రచండదోర్దండమండలాగ్రుండును సముద్దండసాహసక్రియాసమగ్రుండును నై
నిరవధికప్రభావదుందుమారులం దిమ్మనాథనరసింగపార్థివులం గాంచె వారిలోన.

20


సీ.

తుహినాంశువంశపాధోరాశిమాణిక్య మష్టదిగ్రాజభయంకరుండు
కర్ణాటరాజ్యరక్షణదక్షబాహాసి వరవసంతత్యాగవైభవుండు
శివరాత్రిసమయసంశీలతాగుణశాలి ధరణీసుపర్వనిస్తారకుండు
విరచితాతులతులాపురుషదానవిభూతి సమదరాయకటారిసాళువంబు
గుండవిభునారసింహభూమండలేశ్వ, రుండు గణుతింప రాజమాత్రుండు గాఁడు
కిన్నరస్త్రీసమూహజేగీయమాన, వర్తనంబులు గలచక్రవర్తిగాని.

21


మహాస్రగ్ధర.

నరసింగస్వామి రంగన్నగనిభగజగంధర్వపాదాతసైన్య
స్ఫురణాసంపత్తి విద్విట్పురములు బలిమిం బూని కాల్పంగ ధూమో
త్కరముల్ కాదంబినీమార్గము నిబిడముగాఁ గప్పి మందాకినీపు
ష్కరముల్ భానూద్భవాపుష్కరములకరణిం గానిపింపంగఁ జేయున్.

22


శా.

పోలున్ భార్గవరాముతోడ ననుచున్ భూషింప వేలాపరీ
తేలామండల మాధరాధరముగా నేకాతపత్రంబుగా
నేలున్ సాళువనారసింహుఁడు భుజంగేంద్రాద్రిపై నున్నల
క్ష్మీలావణ్యసరోమరాళము చిరశ్రీవృద్ధి గావింపఁగన్.

23


వ.

అట్టినరసింగరాజరత్నంబుచేత మన్నన వడసి సైన్యనాయకపట్టభద్రత్వంబున
నిర్నిద్రవిజయలక్ష్మీమహత్త్వంబున మదవదభియాతిభయదసత్వంబున దీర్ఘాయు

రైశ్వర్యధుర్యుం డైనయీశ్వరనాయకునకుఁ బ్రియతనూభవుఁడు నరసవసుధాధ్య
క్షుండు నిర్వంచితానుగ్రహంబునం బరిగ్రహించి యిమ్మహాప్రబంధంబునకు శృంగార
విభూషణంబుగాఁ దదీయవంశావతారంబు రచియింతు మరి యెట్టిదనిన.

24


ఉ.

మిన్నుల మోచి భాగ్యముల మీఱినకోటల రమ్యహర్మ్యసం
పన్నత సస్యవాటగరిమంబులఁ దోఁటల వాహవారణా
భ్యున్నతిఁ గేలిదీర్షికల నుగ్రభటావలి వన్నె కెక్కె వా
రాన్నిధికాంచిపైఁ దుళువరాజ్యము సంతతవీరభోజ్యమై.

25


క.

ఆతుళువరాజ్యమున వి, ఖ్యాతి వహించిరి దిగంతకరికటతటసం
భూతమదక్షాళనవి, విద్యాతత్పరకీర్తిఁ బెండ్లి యాడినరాజుల్.

26


ఉ.

వారల కర్రగణ్యుఁడు నివారితవైరివరూధినీధవ
శ్రీరమణీవిలాసుఁడు విచిత్రకళాకుశలుండు తిమ్మధా
త్రీరమణుండు సంపద వరించె మరాటవరాటలాటగాం
ధారయుగంధరాధిపసదఃప్రకటీకృతబాహువీర్యుఁడై.

27


చ.

అతనికులాంగనాతిలక మైనపవిత్రచరిత్ర దేవకీ
సతి కృతపుణ్యులం గనియె శాంతివతంసుల సజ్జనావన
వ్రతపరిపాలనాగుణపరాయణచిత్తుల దుర్మదోద్ధతా
హితవనదావపావకుల నీశ్వరతిమ్మధరాతలేంద్రులన్.

28


క.

అం దగ్రజుండు కవిజన, మందారము పతిహితైకమతి మానవతీ
కందర్పుఁడు తేజోమ, ధ్యందినమార్తాండుఁ డీశ్వరాధిపుఁ డుర్విన్.

29


సీ.

ఉదయాద్రి భేదించె హుత్తరి నిర్జించె గండికోటపురంబుఁ గదలఁ ద్రవ్వె
పెనుగొండ సాధించె బెంగుళూరు హరించెఁ గోవెల నెల్లూరు గుంటుపఱిచె
కుందాణి విదళించె గొడుగుచింత జయించె బాగూరు పంచముపాడుచేసె
నరుగొండ వెకలించె నామూరు మర్దించె సీరంగపట్నంబు బారిసమరె
రాయచౌహత్తమల్లధరావరాహ, మోహనమురారిబర్బరబాహుసాళ్వ
నారసింహప్రతాపసన్నహనుఁ డగుచు, విశ్వహితకారి తిమ్మయయీశ్వరుండు.

30


మ.

నరసింగక్షితిపాలుపంపునుడు గౌనాఁ జేసి దండెత్తి యీ
శ్వరభూభర్త బెడందకోటయవనాశ్వవ్రాతమున్ భీమసం
గరరంగంబునఁ గొల్లవట్టుకొని వీఁకం గందుకూరీపురాం
తరసీమంబునఁ జక్కఁగా నఱకె దుర్దాంతారిసంతానమున్.

31

సీ.

కనుఁగొన్నమొదలు తక్కినమాట లాలింప బుద్ధిపుట్టనిపుట్టుభోగి విడిచి
వా లిచ్చి నడవడి వర్ణింపఁదగినలావరిదిగ్గజమువంటివాని విడిచి
తనలోఁతుపాఁతుసైతము గానరాఁ గూర్మి గలసినమొగిమోటకాని వదలి
నిలుకడ గలకూటములఁ బాయఁజాలక మరిగినకొండంతదొర దొఱంగి
వలచి వచ్చిన నిల్లాలిబలె భరించి, పసలఁ జిక్కించి విలసనప్రౌఢనిజభు
జాపరీరంభసుఖములచవులు చూపె, విశ్వధాత్రికిఁ దిమ్మయయీశ్వరుండు.

32


క.

సరి వచ్చు నీతిభూతివి, తరణంబులఁ దిమ్మధరణిధవనందనుఁ డీ
శ్వరుఁడు యుగంధరశితికం, ధరకంధరములకు నని జనంబు నుతింపన్.

33


క.

ఆబాంధవనిధి గౌరాం, బాబుక్కాంబల వరించెఁ బరమవివేక
ప్రాబల్యంబున భూల, క్ష్మీబాలలఁ బెండ్లి యైనశ్రీహరిపోలెన్.

34


క.

అదితికి నింద్రోపేంద్రులు విదితప్రాభవులు సంభవించినపగిదిన్
సదమలపతివ్రతాసం, పద వెలసినతత్సరోజపత్రాక్షులలోన్.

35


క.

బుక్కాంబకు జన్మించిరి చక్కనిరూపములఁ బంచసాయకు లనఁ బెం
పెక్కినభుజాబలంబున, దిక్కరు లన నారసింహతిమ్మకుమారుల్.

36


గీ.

ఇట్లు తుళువాన్వయాగ్రణి యీశ్వరుండు, పూర్వజన్మతపఃఫలంబునఁ గులంబు
ధన్యత వహింపఁ గన్నపుత్రకులలోనఁ, బ్రభుత గైకొని నరసింహపార్థివుండు.

37


క.

భువనంబులు మెచ్చఁగ శైశవయౌవనసంధి సప్తసంతానములున్
సవరించె వాని కెవ్వరు, సవతు సుధాంధసులు దక్క సర్వంసహపైన్.

38


సీ.

చర్చించి చూచిన, సర్వజ్ఞతాపటుప్రౌఢిమ మరువంబు పరిమళంబు
పరికించి చూచిన నిరుపమత్యాగలక్ష్మీవిలాసము దేవతావరంబు
భావించి చూచిన బహుమానసమ్యగ్దయావిశేషోక్తి శిలాక్షరంబు
తర్కించి చూచిన ధర్మసంపాదనక్రీడావివేకంబు తోడునీడ
దుర్మదారాతిహరణచాతుర్యధైర్య, వీర్యగాంభీర్యగుణములు వెన్నతోడఁ
బెట్టినవి సాటి చెప్పుట యెట్టు నృపుల, నీశ్వరప్రభునరసపృథ్వీశ్వరునకు.

39


స్రగ్ధర.

ఉద్ఘాటించున్ సమిత్సంయుతరిపునృపతివ్యూహకల్పాంతకాలో
ద్యర్ఘర్మాంశుప్రభాళీధళధళనిభముల్ తాంతకాంతారభూ
ద్యద్ఘోరాగ్నిచ్ఛటాశ్రీధగధగసరముల్ దర్పసంపత్కళాభా
స్వద్ఘోటీఘోటధాటీశ్వరనరసనరేశప్రతాపాతపంబుల్.

40


సీ.

వివిధచిహ్నంబులు వేర్వేర పూనంగ విష్ణుశంకరులు భావింప వచ్చె
సూచికాముఖమునఁ జూడంగ హరినీలహీరోపలంబుల నెఱుఁగ వచ్చె

జిహ్వాగ్రమునఁ బరీక్షింపంగ లవణాబ్ధికలశార్ణవంబులు దెలియ వచ్చె
నలపున భేదంబు గలుగంగ మృగనాభిహిమవాలుకల నిర్ణయింప వచ్చెఁ
గాని లేకున్న నేకప్రకారమై స, మస్తమును సంతతభ్రాంతి నావహించు
ననఁగ నీశ్వరనారసింహక్షమాధి, పతియశశ్చంద్రికాకదంబములు నిగిడె.

41


చ.

పుడమి హిరణ్యశూన్యదశఁ బొందఁగఁ జేయక విక్రమంబుఁ జూ
పెడుసమయాన మార్మొగము పెట్టక పట్టక దేవతార్థ మె
య్యెడ దయమాలి పుణ్యజనహింసకుఁ బోవక సంచరించినం
గడిమి నృసింహమూర్తి సరిగాఁ దగు నీశ్వరనారసింహుతోన్.

42

షష్ఠ్యంతములు

క.

ఏతాదృశవిశదగుణా, న్వీతునకు నిరంతరాయవితరణజితజీ
మూతునకు వార్ధివేష్టితభూతలరక్షావతీర్ణపురుహూతునకున్.

43


క.

దంభసరఃకరటికి దో, స్తంభనిశాతాసినటికి సకలధరిత్రీ
సంభారభరణధిక్కృత, కుంభీనసకుంభికూర్మకుహనాకిటికిన్.

44


క.

పౌరుషనాభాగునకు ది, నారంభణభాస్కరప్రభాభోగునకున్
ఘోరాజివిజయభేరీ, ధీరధ్వనిదళితినిఖిలదిగ్భాగునకున్.

45


క.

వాణీకరవీణాని, క్వాణరతికి వినయమతికి వరలక్ష్మీక
ళ్యాణనరసింహవిజయపు, రాణకథారమణతానురాగస్థితికిన్.

46


క.

పరిచితబోధునకు నిరం, తరకాంతఘృణాసనాథునకు సాళ్వశ్రీ
నరసింగవిభుచమూపే, శ్వరనృపతికుమారనరసజననాథునకున్.

47


వ.

అభ్యుదయపరంపంరాభివృద్ధిగా మారచియింపం బూనినవరాహపురాణంబునకుం
కథాప్రారంభం బెట్టిదనిన.

48


సీ.

సకలపుణ్యారణ్యసస్యవాటములు దట్టము లైనపులకాంకురములు గాఁగ
సరసీనదీనవసలిలపూరము శరీరమునఁ గ్రమ్మినకమ్మఁజెమట గాఁగ
జాతసంభ్రమజంతుసంతానకోలాహలములు గద్గదభాషణములు గాఁగ
కికుబంతకరిదంతకాండకాంతిప్రసారంబు వివర్ణభావంబు గాఁగ
జలధికాంచీవరారోహసాత్వికోద, యములఁ బొదలంగ నిజదంష్ట్రికాగ్రబాహఁ
గౌఁగిలించె నిశాచరగంధకరటి, పాకళంబు మహాకుహనైకళంబు.

49


క.

ఈచందంబున జలనిధి, వీచులఁ దనుఁ మునుఁగ నీక వెడలించిన ధా
త్రీచపలేక్షణ వినయ, శ్రీచతురతఁ బలికె హరికిరిప్రభుతోడన్.

50

గీ.

ఏమహాత్ముండవో నిర్ణయింప రాదు, నీవ ప్రతికల్పమున నన్ను నిర్వహింతు
సకలలోకైకనాథ నీజన్మవిధము, నాదిసృష్టియుఁ దెలియంగ నానతిమ్ము.

51


సీ.

పాఠీనమూర్తివై పగవాని వ్రచ్చి వేదములు దెచ్చితి రసాతలము చొచ్చి
కచ్ఛపరూపివై కలశాబ్ధి వసియించి గిరి వహించితి దురంధరత మించి
కిటివేషివై నన్నుఁ గృపఁ జూచి కాచితి కఠినదంష్ట్రావిటంకమున మోచి
నరమృగాకృతివై జనశ్లాఘ వ్రాలి ప్రహ్లాదు నేలితి పలలాశిఁ ద్రోలి
వామనుఁడవై బలీంద్రుగర్వంబు చెఱిచి, భార్గవుఁడవై సమస్తభూపతుల నులిచి
రాఘవుఁడవై దశాస్యువక్త్రములు డులిచి, నిలిచినాఁడవు నీమాయఁ దెలియవశమె.

52


వ.

దేవా యీవారిధి మునింగి కలంగి మిగుల నాపన్న నైనన న్నుద్ధరించితి దురవ
గాహంబు లైనభవదీయగుణసమూహంబులు చతుర్ముఖప్రముఖనిఖిలబృందారకు
లకు వితర్కింప నలవిగా దనిన నే నెంతటిదాన మానరానికృత్యంబులు దుష్టనిగ్రహ
శిష్టపరిగ్రహంబులు నీకు నిటమీఁద నీవు సృష్టి గల్పించువిధంబును మదీయసృష్టి
కారణప్రమాణంబులు నాద్యవసానంబులును యుగచతుష్టయసంఖ్యానామధేయం
బులును యుగనిశేషంబులం బుట్టునవస్థాభేదంబులును మదవదరాతినరాధిపతుల
నిర్జించి దోషంబుల విసర్జించి రాజసూయహయమేధాదిమహాధ్వరవిధానంబుల
సుకృతంబు లార్జించి ఖచరచకోరలోచనాకుచలికుచపరిరంభసంభావనావిరాజు
లైనరాజులచందంబును నిన్నుఁ బ్రసన్నునిం జేయు తెఱంగు నెఱింగింపు మని
విన్నవించిన.

53


క.

ఆవాక్యంబులు విని కపట్రావనిదారంబు దంష్ట్టికాంకూరవిభా
ధావళ్యంబులు దిక్కులపై వెన్నెల వెదలు చల్లఁ బకపక నగినన్.

54


ఉ.

కానఁగ వచ్చె నవ్విభునిగర్భకటాహములోన దేవతా
దానవయక్షకింపురుషతారకశీతకరార్కవహ్నిరు
ద్రానిలసిద్ధసాధ్యవిపినాద్రిసముద్రసరస్తరంగిణీ
మౌనిభుజంగవిశ్వవసుమానవముఖ్యజగత్ప్రపంచముల్.

55


క.

అవి చూచి మానసంబునఁ, గవిసినభయవిస్మయముల గాత్రంబునఁ గం
పవికారము దలకొనఁగా, నవనివరారోహ నిలువ నంతటిలోనన్.

56


సీ.

శ్రీవత్సకౌస్తుభశ్రీవైజయంతులు గనుపట్టువిపులవక్షంబుతోడ
శార్ఙ్గకౌమోదకీశంఖచక్రంబులు గలభుజార్గళచతుష్కంబుతోడ
శ్రుతిపాఠపరతంత్రమతికి బ్రహ్మకు నివాసం బైననాభిపద్మంబుతోడ
బాలార్కబింబప్రభాడంబరంబు విడంబించుపీతాంబరంబుతోడ

శరధిలోపల ఫణమణికిరణపటలి, కాతరంగితశేషశయ్యాతలమునఁ
బవ్వడించినమూర్తి యేర్పడఁగఁ దాల్చె, సూకరాకృతి వీడ్కొని లోకభర్త.

57


క.

ఆలక్ష్మీపతిఁ గని శై, వాలస్థలినడుమ నున్న వనరుహకళికం
బోలఁగఁ దలపై నంజలి, గీలుకొలిపి సవినయమతి క్షితి నుతి సేసెన్.

58


ఉ.

నీరజనేత్ర వందనము నీకు రమారమణీపతీ నమ
స్కారము నీకు భక్తజనకల్పక దండము నీకు రక్షణో
దార జొహారు నీకు మహిమాంబునిధీ నతి నీకు నీకు జే
జే రజనీచరాన్వయవిజిత్వరసత్వరబాహువిక్రమా.

59


మ.

మును నీచూపినసూకరాకృతివిధంబున్ గర్భగోళస్థలో
కనికాయంబునుఁ జూచి యే నతిభయాక్రాంతాత్మ నైతిన్ జనా
ర్దన కాంతన్ శరణాగతన్ నిరపరాధ న్నన్ను మన్నించి తె
ల్పు నిరాఘాటకృపాసుధారసమయాంభోరాశిపూరంబునన్.

60


వ.

అని వినయపూర్వకంబుగా బహుప్రకారంబులం బ్రశంసించి మదీయపదంబులు
కేశవుండును జంఘలు నారాయణుండును నితంబంబు మాధవుండును గుహ్యంబు
గోవిందుండును నాభి విష్ణుండును జఠరంబు మధుసూదనుండును వక్షంబు త్రివిక్ర
ముండును హృదయంబు వామనుండును గంఠంబు శ్రీధరుండును వదనంబు హృషీ
కేశుండును నేత్రంబులు పద్మనాభుండును మస్తకంబు దామోదరుండును రక్షింతురు
గా కని వాసుదేవు మాసనామంబుల నంగన్యాసంబు చేసి వసుమతీసతి పునఃప్రణా
మంబు గావించి నిలిచినఁ బ్రసన్నుం డై వెండియు నప్పుండరీకాక్షుండు దాక్షిణ్య
లక్ష్మికి నాకరం బైనసూకరాకారంబు వహించి రత్నాకరకాంచిం గాంచి యి
ట్లనియె.

61


గీ.

అవనికామిని నీవు న న్నడిగినట్టి, ప్రశ్న మత్యుత్తమంబు దుర్లభము నిఖిల
వేదశాస్త్రార్థసారంబు వినుము సావ, ధానమతివై వచింతు విస్తరము గాఁగ.

62


క.

క్రమమున సర్గప్రతిస, ర్గములును మన్వంతరప్రకారంబులు వం
శములును వంశానుచరి, త్రములును లక్షణము లివి పురాణంబునకున్.

63


వ.

అం దనాదిసర్గం బెట్టిదనిని మొదలు నాకాశంబునుం బోలె నాతతంబై నిలుతు నట్టి
నావలన నణురూపంబున నొక్కబుద్ధి జనియించె నది సత్వరజస్తమోగుణంబులఁ
ద్రివిధంబై వేర్వేర తత్వరూపంబులు వహించె నందు సృష్టికిం బ్రధానం బైనమహ
త్తత్త్వంబు గల్పించితి నాతత్త్వంబున క్షేత్రజ్ఞుండు గలిగె నతనిబుద్ధిని మానసంబు
పుట్టె మానసంబున శ్రవణాదిహేతువు లగునర్థంబులు సంభవించె నర్థంబులవలన

నింద్రియంబు లవతరించె నివి సకలంబును బిండాకారం బయ్యె నప్పిండంబు
మాయ మాయ నాచేతం బ్రతిష్ఠితాత్మయై శూన్యంబై తోఁచె శూన్యంబున శబ్దంబును
శబ్దంబున గగనంబును గగనంబున సమీరంబును సమీరంబునఁ దేజంబును దేజం
బున సలిలంబును సలిలంబున భూతధాత్రియు నిర్మించితి.

64


గీ.

నెలఁత భూమ్యాదు లైనయిన్నియునుగూడఁ, గా నొకసబుద్బుదం బైనకలల మయ్యె
నక్కలలమండమై పొల్చె నది ప్రవృద్ధిఁ, బొంద జనియించె నీ చందమున జగంబు.

65


గీ.

ఆది మద్రూప మగులం బాత్మ నైన, యే రచించితి సలిలంబు నార మనఁగ
సంజ్ఞ వహియించె నందులో సంతతంబు, నుండుకతమున నారాయణుండ నైతి.

66


క.

సారెకుఁ గల్పంబుల న, న్నారంబులఁ బవ్వడింప నాబొడ్డున నీ
రేరుహము పుటై నజుఁ డవ, తారంబునఁ బొందె నందుఁ దత్కమలభవున్.

67


క.

కనుఁగొని కల్పింపుము జగ, మనుచు నదృశ్యుండ నైన నటు చేయఁగ నె
య్యనువును బొడగానమి నా, తనికిం గోపఁబు పుట్టెఁ దత్కోపంబున్.

68


ఉ.

బాలకుఁడై విరించితొడపై వసియించి దృగంబుపూరముల్
జాలుకొనంగ నేడ్చుటయు సాంత్వనభాషల నేడ్పు మాన్ప న
బ్బాలుఁడు పేరు పెట్టు మని పల్కిన రుద్రసమాఖ్య యిచ్చి భా
షాలలనామనోహరుఁడు సర్వము నీవు సృజింపు నావుడున్.

69


క.

తా లోకవినిర్మితికిం, జాలక రుద్రుండు కాండసలిలమునఁ దప
శ్శీలుండై నిలిచిన నా, వేళ సరోజాసనుఁడు వివేకము కలిమిన్.

70


క.

తనదక్షిణవామాంఘ్రుల, పెనువ్రేళ్ళను దక్షు నతనిప్రియసతి నిర్మిం
చిన వారికి స్వాయంభువ, మనువు కలిగె మనువుచే సమస్తము పుట్టెన్.

71


గీ.

అనుచు నద్దేవుఁ డానతిచ్చినవిధంబు, తెలియఁగా విని భూతధాత్రీవధూటి
సకలలోకైకనాథ విస్తరము గాఁగఁ, బ్రథమకల్పంబు నాకుఁ జెప్పంగవలయు.

72


మ.

అని ధాత్రీసతి పల్క నిట్లను వరాహస్వామి నారాయణుం
డను నీబ్రహ్మ సమస్తభూతములఁ గల్పాదిన్ వినిర్మించె నం
గన తన్నిర్మితి నీకు నేర్పడఁగ వక్కాణింతు నాలింపు పో
యినకల్పావధిరేయి నిద్రితుఁడనై యే మేలుకో నత్తఱిన్.

73


క.

నిరవధికుఁడు షడ్గుణసం, భరితుఁడు నారాయణుండుఁ బరపూర్వజుఁడున్
బరమాత్ముఁడు నిఖిలచరా, చరజనకుఁడు నైనబ్రహ్మ సత్వాధికుఁడై.

74


గీ.

కల్పనాబుద్ధి శూన్యలోకంబు లెల్లఁ, గని జగత్సృష్టిసంహారకర్త నింది
రాసతీభర్తఁ గూర్చి నారాయణాత్మ, కంబు హృద్యంబు పద్య మొక్కటి పఠించె.

75

శ్లో.

ఆపో నార ఇతి ప్రోక్తా ఆపో వై నరమానవః
అయనం తస్య తాః ప్రోక్తా స్తేన నారాయణః సృతః

76


వ.

అని పఠించి.

77


క.

ప్రమదంబున గతకల్పాం, తమునాఁడును బోలె సృష్టి దాఁ దలఁపఁగ వ
క్కమలజునివలన నొకస, ర్గము పుట్టె నబుద్ధిపూర్వకము దామసమై.

78


వ.

అట్లు పుట్టినసృష్టి పంచవర్ష యగు నవిద్య. యిదియ ప్రపంచప్రకారంబును నజ్ఞాన
మయంబును నగుముఖసర్గం బనం బరంగె. మఱియు నుత్తమసర్గం బొకటి చింతింపఁ
దిర్యక్స్రోతోమయం బగుసర్గంబు జనియించె. నది యుత్పథగ్రాహు లైనపశ్వాదు
లగుట నసాధకం బని వెండియు నొక్కసర్గంబు విచారింప నూర్ధ్వస్రోతోమయం
బగుసర్గం బవతరించె. నది నూర్ధ్వచారులు సాత్వికస్వభావులు నైనదేవత లగుట
నసాధకం బని యవాక్స్రోతోమయం బగుసర్గంబు నిర్మించె. నందు సాధకులు
నత్యంతప్రకాశులు రజోధికులుఁ దమోతిరిక్తులు దుఃఖసంసక్తులుఁ బునఃపునఃప్రవ
రకులు నైనమనుష్యు లుద్భవించిరి. ప్రథమం బగుమహత్సర్గంబును ద్వితీయం బగు
తన్మాత్రసర్గంబును దృతీయం బగువైకారికంబును నగునింద్రియసర్గంబును బుద్ధి
పూర్వకంబు లగుప్రాకృతసర్గంబులు. స్థావరాత్మకం బగు ముఖ్యసర్గంబును పశుప్ర
ధానం బగతిర్యక్స్రోతోసర్గంబును దేవభూయిష్ఠం బగునూర్ధస్రోతోసర్గంబును
మనుష్యప్రచారం బగునవాక్స్రోతోసర్గంబును సత్వతమోమయం బగుననుగ్రాహ
సర్గంబును వైకృత్సర్గంబులు. ప్రాకృతసర్గంబులు మూడును వైకృతసర్గంబు
లైదును బ్రాకృతంబును వైకృతంబును నగుకుమారసర్గంబునుం గూడఁ దొమ్మిది
సర్గంబు. లివి జగంబులకు మూలహేతువు. లింక నేమేమి వినవలయు నడుగు
మనిన.

79


గీ.

జగతి యి ట్లను నవ్యక్తజన్ముఁ డైన, జలజభవుచే జనించిన సర్గనవక
మెవ్విధంబున వర్ధిల్లె నెఱుఁగఁ జెప్పు, త్రిభువనాసనసన్నాహ శ్రీవరాహ.

80


క.

అనవుడు విని ధాత్రికి ని, ట్లని చెప్పి వరాహదేవుఁ డాది న్వనజా
సనుఁడు సృజియించె రుద్రుని, వెనుకన్ సనకాదిమౌనివితతి సృజించెన్.

81


వ.

 ఆతరువాత మరీచ్యత్రుల నంగిరఃపులహులం గ్రతుపులస్త్యులం బ్రచేతోభృగువుల
నారదవశిష్ఠుల సృజియించి వీరిలోన నారదుండు తక్కఁ దక్కిన తొమ్మండ్రం
బ్రవృత్తిధర్మంబునకు నియోగించి సనకాదుల నివృత్తిధర్మంబునకు నియోగించె.

82


గీ.

విధిపదాంగుష్ఠమున సంభవించె నెవ్వఁ, డట్టిదక్షునికూర్మికన్యలకుఁ బుట్టె
సురనిశాచరగరుడకింపురుషకిన్నరాధికం బైనసకలచరాచరంబు.

83

సీ.

వెనుకకు నాగ్రహించినవేళ నర్తితభ్రూలతాభయదాత్మఫాలభూమి
నవతరించినరుద్రు నర్ధనారీనరాకారుని వీక్షించి కమలభవుఁడు
నీవిగ్రహము రెండుగా విభజింపు మటంచు నంతర్థానమైన నతఁడు
నారీవిభాగంబు నరవిభాగంబును నేర్పున వేర్వేర నేర్పణించి
వానిలోపల నరభాగ మానుపూర్విఁ, బదునొకండువిధంబులఁ బంచివైచె
నదెకద పదునొకొండవ దనఁగఁ బరఁగు, రుద్రసర్గంబు ధాత్రీసరోజనేత్ర.

84


క.

ఈపగిది సృష్టి గణ్యం, బై పొదలిన యుగచతుష్టయస్థితి వినుమా
రూపింతుఁ గృతత్రేతా, ద్వాపరకలినామకములు దాలుచు యుగముల్.

85


క.

ఆయుగములు జనవినుత, న్యాయపరాయణులు మనుజనాథులు సురదై
తేయులు చేసినధర్మ, ప్రాయచరిత్రములు తత్పరత విను మనుచున్.

86


సీ.

ఆనతి యిచ్చె మాయావరాహస్వామి ప్రథమకల్పంబునఁ బ్రభవ మైన
మనువు స్వాయంభువుం డనువాఁడు గనియె నందనులఁ బ్రియవ్రతోత్తానపాద
నామధేయుల వారిలో మదారాతిసంహరణవ్రతుండు ప్రియవ్రతుండు
హయమేధరాజసూయంబులు మొదలైనక్రతువులు సాంగంబు గాఁగఁ జేసి
వసుమతీచక్ర మేకోష్టవారణముగ, నేలి భరతాదిసుతులకు నేడుదీవు
లును విభాగించి యిచ్చి తాఁ జనియెఁ బిదప, బదరికారణ్యమునకుఁ దపంబు సలుప.

87


క.

ఈవిధమునఁ జని భస్మజ, టావల్కలధారియై దృఢవ్రతనియతిన్
భావములోఁ బరతత్వము, భావింపుచు మోహపాశబంధచ్యుతుఁ డై.

88


శా.

అచ్చోటం దప మాచరింపఁగఁ దదీక్షాయత్తచిత్తంబునన్
విచ్చేసెన్ సురమౌని నారదుఁడు పాణి న్వీణతంత్రు ల్నభ
స్వచ్చారంబున మూర్ఛనాస్వరవిశేషంబుల్ వెద ల్చల్లఁగా
నిచ్చన్ మెచ్చుచు దేహచంద్రికలు రాకేందుచ్ఛవి న్మీఱఁగాన్.

89


ఉ.

అప్పుడు దా నెదుర్కొని కృతాంజలియై నృపుఁ డర్ఘ్యపాద్యముల్
దప్పక యిచ్చి మౌని కుశలం బడుగన్ వినిపించి యిట్లనుం
జెప్పుము నిర్వికార సరసీరుహగర్భకుమార యేమియుం
గప్పక నాకు నీకృతయుగంబున నీకనుఁగొన్నచిత్రముల్.

90


మ.

అనినన్ సంయమి చెప్పఁగాఁ దొడఁగె వాక్యప్రౌఢి నిన్నంబగల్
చనియెన్ గంటి నిరస్తుభక్తజనతాసంతాపమున్ విశ్వమో
హనకృత్కిన్నరకామినీమధురగానాలాపమున్ శార్ఙ్గసా
ధనకారుణ్యగుణానురూపమును శ్వేతద్వీపమున్ భూవరా.

91

వ.

అందు నందూయమితగంధసింధురంబుచందంబున మందాందోళితపుష్కరం బై
పుష్కరస్థలంబు తెఱంగున సంసక్తరాజహంసం బై రాజహంసమండలవిధంబున
నుద్దండపుండరీకంబై పుండరీకాదిగజవ్రజంబులాగున ధృతాఖిలచక్రంబై చక్రవర్తి
సభాభవనంబున కైవడి సదాధిష్ఠితకవియై కవిమందిరాంగణంబుభంగి సమాసన్న
పుణ్యజనం బై పుణ్యజనేశ్వరుభాండాగారంబుపోలికఁ బరిస్థాపితశంఖంబై శంఖసం
ఖ్యానంబుఠేవ నత్యధికంబై పరస్పరఘట్టనంబులం దరంగంబులునాఁగఁ దరంగంబుల
మరాళంబు లుయ్యెలలూఁగ మకరందనిష్యందంబుల నరవిందంబులు విఱ్ఱవీఁగ
నరవిందంబుల నిందిందిరంబులు మూఁగ మంధరగంధవాహవిహారంబుల శీకరంబులు
రేఁగ శీకరంబు లంటఁ దీరావనిరుహంబులు దొప్పదోఁగ జలపక్షిపక్షవిక్షేపంబుల
బద్మినీపత్రంబులు దెఱపిగాఁగఁ బద్మినీపత్రంబులక్రిందఁ గందర్పకేలికిం జక్రవాకమి
థునంబులు డాఁగ మనోహరంబై సిరి దొలంకుకొలంకుకెలంకున.

92


సీ.

తనకొప్పు శైవాలమును బోల్పఁ దననిడువాలుఁగన్నులు గండుమీలఁ బోల్పఁ
ధనమోము నీరజంబును బోల్పఁ దనముద్దువాతెఱ బంధుజీవకముఁ బోల్పఁ
దనకంధరము శంఖమును బోల్పఁ దనబాహులతికలు నవమృణాలములఁ బోల్పఁ
దనచన్నుఁగవ చక్రదంపతులను బోల్పఁ దనకటీరము సైకతమును బోల్ప
విని మనంబున నమ్మక వీనివాని, వాసి దెలియంగవలె నని వచ్చె ననఁగ
నెంతయును సౌకుమార్యంబు వింతగొలుప, నొంటి విహరించు నొకమచ్చెకంటిఁగంటి.

93


క.

కని యెవ్వతెవు జగన్మో, హిని నీ నామంబు చెప్పు మిచ్చోటికి వ
చ్చినకార్య మేమి యనవుడు, విని తప్పక చూచి తరుణి వికవిక నవ్వెన్.

94


ఉ.

ఆనలినాక్షి నవ్వుటయు నంతట నామహిమంబు దూలెనో
కాని వసుంధరాధిప వకావకలై చెడిపోయె బ్రహ్మవి
జ్ఞానము వేదశాస్త్రపతనప్రతిభావిభవంబు గానవి
ద్యానిపుణత్వముం దపము ధర్మవిధిజ్ఞతయు న్వివేకమున్.

95


గీ.

ఇవ్విధంబున నావిద్య లెల్ల మోటు, పడినఁ జె ట్టెక్కి చేతులు విడిచినట్లు
శోకచింతానిమగ్నుండనై కురంగ, నయన కృపఁ జూచి రక్షించు నన్నటంచు.

96


సీ.

శరణంబు వేఁడ నాచంద్రాస్యతనువునఁ బొడమె గ్రక్కున దివ్యపురుషుఁ డొకఁడు
తద్దేహమున నవతార మయ్యె నొకండు వానిశరీరంబులోన నొకఁడు
రక్తారవిందపత్రవిశాలనేత్రుండు శతకోటిమార్తాండసముఁడు పుట్టె
నివ్విధంబున జనియించినమువ్వురు మాయమై పోవ నబ్జాయతాక్షి
వాలుఁగన్నులఁ దళుకులు జాలువాఱఁ, జిగురువాతెఱ ముసిముసి నగవుదేఱ
గుబ్బచన్నులఁ బయ్యెదకొంగు జాఱఁ, దాను నిలిచిన డాయంగ నేను బోయి.

97

సీ.

పడఁతి నావేదసంపద యేల పస దప్పె నింతి నాశాస్త్రంబు లేల తూలె
నలినాక్షి నాపురాణము లేల నశియించె నెలనాగ నాగాన మేల చెడియె
వనిత నామంత్రవాసన యేల నుడివోయె లోలాక్షి నాయోగ మేల పొలిసె
నాతి నాతత్వవిజ్ఞాన మేల తొలఁగె బాల నావైదుష్య మేల సమసెఁ
దెలియ వినిపింపు మనిన నాదేవి సరస, కిసలయాస్వాదమత్తకోకిలకలాప
కలకుహూకారగర్వంబు గెలువఁ జాలు, కలికిపలుకులఁ దేనియ లొలుకఁ బలికె.

98


వ.

ఓయి నారద బ్రహ్మవిద్యావిశారద నన్ను సకలశ్రుతికన్యకాజనజననపాత్రి పైన
సావిత్రింగా నెఱుంగుము మదీయప్రభావంబుఁ జూపవలసి నీవిద్య లపహరించితి
నింతియకాని యేనిమి త్తంబును లేదు నాదు శరీరంబునం బ్రాదుర్భవించిన శృంగార
కళాధురంధరుం డైన పురుషుండు ఋగ్వేదం బని పేర్కొనం దగిన నారాయణుం
డతండు సముచ్చారణమాత్రంబున నింధనంబుల గంధవహసఖుండునుఁబోలె దురి
తంబుల దహించు నన్నారాయణువలన జనియించినమనోహరాకారుం డైనపురు
షుండు యజుర్వేదం బని పేర్కొనం దగిన బ్రహ్మ యతండు తూలంబుల వాతూ
లఁబునుంబోలె దుష్కృతంబులం దూలించు నాబ్రహ్మవలన సంభవించినదివ్య
తేజోమయుం డైనపురుషుండు సామవేదం బని పేర్కొనం దగినరుద్రుం డతండు
తిమిరంబుల మిహిరుండునుంబోలెఁ గలుషంబుల విరియించు వీరు మువ్వురు నగ్నిత్ర
యంబును వేదత్రయంబును సవనత్రయంబును వర్ణత్రయంబును వారు నీకుఁ దేట
పడం బలికితి నని వేదాదివిద్యలు నాకుం గ్రమ్మఱ నిచ్చి మఱియును.

99


క.

ఈసరసిలోన స్నానము, చేసిన గతజన్మములవిశేషములు నిరా
యాసముగఁ గానవచ్చు మ, హాసంయమితిలక స్నాన మాడుము దీనన్.

100


క.

అని తా నంతర్ధానం, బునఁ బొందె సుధాంశుబింబముఖి కాసారం
బున స్నాన మాడి యేనుం, జనుదెంచితి నిన్నుఁ జూడ జనపాలమణీ.

101


చ.

అనవుడు నాప్రియవ్రతనరాధిపుఁ డి ట్లనియెన్ మహాతపో
ధనునకు నీకుఁ దత్సరసిఁ దానము సేయఁగ నాత్మఁ గాన వ
చ్చినతొలిజన్మజాలములచేష్టితము ల్వినిపింపు నాకు నో
మునికులసార్వభౌమ మనముం జెవులుం బరితృప్తిఁ బొందఁగన్.

102


క.

నావుడు నారదుఁ డిట్లను, సావిత్రీభాషణానుశాసనమున నే
నా వేదసరసిఁ గ్రుంకిన, భూవల్లభ వేయిజన్మములు దోఁచె మదిన్.

103


సీ.

విను దానిలో నొక్కజననప్రకారంబు మును చన్నకృతయుగంబున నవంతి
నా నొప్పుపుటభేదనంబున, సారస్వతాఖ్యుండ నైనబ్రాహ్మణుఁడ నేను

సకలవేదంబులు శాస్త్రంబులును బురాణంబులుఁ బిన్నప్రాయంబునందుఁ
గరతలామలకంబుగా నభ్యసించి విఖ్యాతులు సుతులఁ బెక్కండ్రఁ బడసి
నాఁడునాఁటికి నిడుపులు పైఁడి గాఁగ, విత్త మార్జించి సంసారవృత్తివలన
రోసి జీవనభరణప్రయాస మెల్ల, నాత్మజులమీఁదఁ బెట్టి మోక్షాభిరతిని.

104


వ.

తపంబు సలుప నూహించి కర్మకాండంబునం బుండరీకాక్షు నారాధించి యథో
చితక్రియావిశేషంబునం బితృగణంబులఁ దృప్తిఁ బొందించి వివిధాధ్వరవిధానం
బులఁ బురందరప్రముఖనిఖిలదైత్యాహితులం బ్రీతులం గావించి పవిత్రాన్నదానం
బులం దక్కినజనంబుల వశీకరించి యిప్పుడు నీకుం జెప్పిన సారస్వతం బనుసరో
వరంబునకుం జని.

105


ఉ.

తత్సరసీసమీపవసుధాస్థలి నే వసియించి యిందిరా
వత్సుని భక్తవత్సలుని వారిజనాభునిగూర్చి ధైర్యభూ
భృత్సమబ్రహ్మపారము జపించెడుచోఁ బదివేలవేలసం
వత్సరముల్ పలాశఫలవాతజలాభ్యవహారలీలలన్.

106


స్రగ్ధర.

సాక్షాత్కారంబు నొందెన్ సకలసురగణస్వామి విష్ణుండు లక్ష్మీ
వక్షోజస్వర్ణకుంభద్వయమృగమదసంవాసితాంగంబుతోడం
బక్షప్రక్షేపవాతభ్రమితనిఖిలదిక్పక్షివాహంబుతోడన్
రక్షఃకంజేక్షణావిభ్రమలయరయనిర్వక్రచక్రంబుతోడన్.

107


గీ.

ఇట్లు ప్రత్యక్ష మైనలక్ష్మీశ్వరునకు, హరికి దండప్రణామంబు లాచరించి
మస్తకంబున ముకుళితహసతథయుగళి, చేర్చి యి ట్లని సంస్తుతించితి మహీశ.

108


క.

పారావారశయాన ద, యారసపరిపూర్ణలోచనాంచల శ్రీమ
న్నారాయణ భువనావన, పారాయణ పరమపురుష పరపారగతా.

109


క.

అత్యంతవీర్య నిర్గుణ, సత్యవిశుద్ధప్రభావ శాశ్వతనిఖిలా
దిత్యవిరోధిశిరోధి, క్షత్యారంభోపలంభచక్రాసికరా.

110


గీ.

సూర్యశీతాంశునయన త్రిశుక్రసంస్థ, ధరణిధారణదక్ష త్రితత్వలక్ష్య
వాగ్వధూనాథజనక త్రివహ్నిభేద, విదళితాఖిలకలుష త్రివేదగమ్య.

111


క.

నిరవధిసంసారార్ణవ, తరళీభూతాంఘ్రియుగ కృతత్రేతాద్వా
పరకలియుగములఁ దాల్తువు, నిరతము సితరక్తపీతనీలాకృతులన్.

112


గీ.

సరవిఁ బుట్టించితివి ముఖాబ్జమున భూసు, రాన్వయంబును బాహుల నవనిపాల
వంశముఁ దొడల వైశ్యాన్వవాయమును బదముల శూద్రకులంబును గమలనేత్ర.

113

వ.

కావున నీమహానుభావంబులు వారిజాసనాదులకు వాఙ్మానసగోచరంబులు గావు
మావంటివారికి గోచరించుట యెట్లు భవన్నామస్మరణైకశరణ్యుండ నైననన్ను
ధన్యుంగా ననుగ్రహింపు మని విన్నవించినఁ బ్రసన్నుండై సకలప్రపంచసంచరిష్ణుం
డు విష్ణుండు ఘనాఘనస్తనితగంభీరస్వరంబున వరంబు వేఁడు మనిన.

114


క.

పూజ్యం బైనభవత్సా, యుజ్యము కృప సేయు నాకు నుద్భటరథినీ
రజ్యత్పరమారణమం, త్రజ్యాటంకారశార్ఙ్గధనురుగ్రకరా.

115


గీ.

అనిన విని దేవుఁ డిట్లన నవధరించె, నలినభవునిదినావసానంబుదాఁక
నిలుము తరువాత నాతనివలన మహిమ, నెగడ జన్మింపఁగలవు జన్మించి పిదప.

116


క.

నారము పానీయమునకుఁ బే, రానారంబు నీవు పితృగణములకుం
వారక యిచ్చుకతంబున నారదనామంబు నీకు నలువ ఘటించున్.

117


సీ.

ఆజన్మమున భూసురాన్వయతిలక సాయుజ్య మిచ్చెద నంచు నురగశాయి
చనినఁ దపఃక్రియాసంసక్తిఁ గొంతకాలంబు వర్తించి దేహంబు విడిచి
కలిసితి బ్రహ్మనిగ్రహమున నంత నానలువ దినావసానమున లేచి
మానసపుత్రులలో నన్నుఁ బుట్టించె నాదిన ప్రారంభ మాది సకల
భూతసృష్టికి నిది నాపురాతనోద్భ, వప్రకారంబు నాకు రేవత్వసిద్ధి
గలిగె హరిఁ గొల్వ నీవును గొలువుమీ నృ, పాల శ్రీహరి దురితశుండాలహరిని.

118


చ.

అని పరమేష్ఠిసూనుఁడు ప్రియవ్రతరాజవరేణ్యుతోడఁ జె
ప్పినకథ కోలభర్త వినిపించిన భూరమణీలలామ యి
ట్లనియెఁ బురాతనుండు పరమాత్ముఁడు సర్వగుఁ డబ్జనాభుఁ డే
యనువున భావనీయుఁ డగు నత్తెఱఁ గెల్ల నెఱుంగఁ జెప్పుమా.

119


వ.

అనవుడు నవ్వరాహదేవుండు ధరావరారోహ నాలోకించి.

120


గీ.

మీనకమఠకోలమానవమృగకుబ్జ, జామదగ్న్యరామకామపాల
కృష్ణకల్కు లనుచు నెన్ను నీ పదిరాజ, సావతారములు రమాధిపతికి.

121


క.

పాపాబ్దిఁ గడచువారికిఁ, దేపలు వైకుంఠరమణదివ్యాకృతివీ
క్షాపేక్ష నడచువారికిఁ, దాపలు ధరణీ దశావతారములె సుమీ.

122


క.

తమదృష్టికిఁ బరమము నా, ద్యము భవ్యము నవ్యయంబు నైనతదాకా
రము గాన రామి నెప్పుడు, నమరులు సేవింతు రర్చనాదుల మూర్తుల్.

123


వ.

మఱియు రజస్తమోగుణప్రధానంబులు సమస్తలోకస్థితిపాలనాధీనంబులు వసుమతీ
వారివహ్నివాయువలాహకవర్త్మవాసరాధిపవనజవైరిక్షేత్రజ్ఞాభిధానంబులు నైన

మూర్తుల నమ్మహానుభావుండు విశ్వప్రపంచంబు నిండి విహరించు నది నీవు నన్నడి
గినప్రశ్నంబునకు నుత్తరంబు.

124


క.

నావుడు విని ముదితాత్మక, యై వసుమతి వెనుక నాప్రియవ్రతుఁడు సుధాం
ధోవాచంయమవచనము, దా విని యెవ్విధిఁ జరించె దంభకిరీంద్రా.

125


ఉ.

ఆనతి యిమ్మటన్న వసుధా వసుధామనిభప్రభాధికుం
డైనప్రియవ్రతుండు ముని నంతట వీడ్కొని పోయి దేవపూ
జానియమావసక్తయతిసంతతిసంతతవాద్యమానఘం
టానిబిడీకృతతాత్మనికటం బగు వేదసరస్తటంబునన్.

126


శా.

నిష్ణాతత్పరుఁ డై చతుర్దహనకుండీమధ్యవేదిం బదాం
గుష్ఠాగ్రంబున నిల్చి నిశ్చలత నర్కుం జూచుచున్ దైవత
శ్రేష్ఠున్ విష్ణుని బ్రహ్మపారనుతి మెచ్చించె న్సముద్యత్తపో
నిష్ణాతృప్రవరుం డితం డనఁగఁ బొందెన్ ముక్తిలీలావతిన్.

127


గీ.

ఇది ప్రియవ్రతవృత్తాంత మింక నొక్క, పూర్వరాజన్యకథ విను పుణ్యగుణవి
ధేయుఁ డశ్వశిరోనామధేయుఁ డైనరాజు గలఁడు వదాన్యత్వరాజరాజు.

128


మ.

ధవళాంభోరుహనేత్ర వాఁడు హయమేధంబున్ ఘటింపం దలం
చి విసంఖ్యధ్వజినీపరంపర నుదీచీప్రాచ్యవాచీప్రతీ
చ్యవధిక్షోణికి యజ్ఞముక్తహరిఁ గాయం బంపి కావించె జా
హ్నవికిన్ శాత్రవకంఠరక్తనదికిన్ సాపత్న్యసంవాదమున్.

129


శా.

ఈరీతిం గకుబంతముల్ గెలిచి తా నేకాగ్రబుద్ధిన్ వచః
శ్రీరేఖాచతురాస్యు లైనమును లార్త్విజ్యంబు గావింప నా
నారాజన్యులు భృత్యులై మెలఁగ భండారంబులం గల్గుబం
గారంబున్ వెదచల్లె విప్రులకు వేడ్కన్ వాజిమేధంబునన్.

130


వ.

ఇబ్భంగి సాంగంబుగాఁ దురంగమేధాధ్వరంబు చేసి నిజభుజప్రతాపతపనచ్ఛవిచ్ఛ
టాసిందూరితదిక్కరిశిరుం డశ్వశిరుండు శుద్ధాంతకాంతాసహస్రంబులతోడ నవ
భృతస్నానం బాచరించి కృతార్థుండై రెండవమహేంద్రుండునుం బోలె భూసు
రాశీర్వాదంబులు సౌవిదల్లసాహోనినాదంబులు వందిజనపఠ్యమానబిరుదగాథార
వంబులు ధవళచామరధరకురంగేక్షణాకరకంకణక్వణనంబులు మాగధమధురగా
నంబులు భేరీమృదంగదుందుభిధ్వానంబులుఁ గ్రందుకొన సభామండపంబునకు
వచ్చి నవరత్నసింహాసనంబున నాసీనుం డయ్యె నయ్యవసరంబున.

131

క.

యోగిప్రవరులు కపిలుఁడు, జైగీషవ్యుండు సభకుఁ జనుదెంచుటయున్
జాగిలి నర నాయకుఁ డ, భ్యాగతపూజనము సేసి పలికెం బ్రీతిన్.

132


గీ.

యోగివరులార సందేహ మొకటి మిమ్ము, నడుగ వచ్చెద ననఁగ మీయంత నేగు
దెంచినా రాడఁబోయినతీర్థ మెదురుఁ, గాఁగ వచ్చినకరణి భాగ్యంబుకతన.

133


క.

మాయావివర్జితుఁడు నా, రాయణుఁడు పురాణపురుషుఁ డనవద్యుఁడు దా
నేయేవిధములఁ గొలువ వి, ధేయుం డగు నానతిండు తెలియఁగ ననుడున్.

134


క.

నానాభువనంబుల మే, మే నారాయణుల మనుచు మెలఁగుదు మీపా
టేని వివేకదశం గన, వో నారాయణుఁ డనఁగ నొక్కఁడు కలఁడే.

135


క.

మఱచియు నిట్లాడకు పుడ, మిఱేఁడ ప్రత్యక్ష మైతి మిప్పుడ మ మ్మి
ద్దఱ నారాయణులంగా, నెఱుఁగుము విచికిత్సఁ బొంద నేటికి నీకున్.

136


వ.

అనిన వార లాడినతుఠారంబులు కర్ణకఠోరంబు లగుటయు నశ్వశిరుం డవనత
శిరుండై కొండొకవడి విచారించి సవినయంబుగా ని ట్లనియె.

137


క.

మీ రెఱిఁగినంత యెఱుఁగుదు, నే రాజీవాక్షుమహిమ ఋషులార వినం
గా రా దిది వో శ్రీమ, న్నారాయణు నుడుగ వచ్చునా యెవ్వరికిన్.

138


మ.

హరితోఁ గౌస్తుభవక్షుతో గరుడవాహారూఢుతో శంఖశా
ర్ఙ్గరథాంగాదివిభాసమానకరుతో రాజీవపత్రాక్షుతో
దొరయంగా నరుఁ డెట్టివాఁడును సమర్థుండే మహేంద్రాదిని
ర్జరు లాదేవునిపాదసేవకులు గారా మీరె చర్చింపుఁడీ.

139


క.

అనవుడు విని సెలవులు వా, ర నగుచుఁ దమతపముషోతరంబున నైనం
గనుఁగొనుమీ నారాయణు, నని పలికి సభాజనంబు లాశ్చర్యపడన్.

140


శా.

ఈషన్మాత్రములోపలం గపిలయోగీంద్రుండు నీలాంబుదో
శేషంబు న్నిరసింపఁజాలుతనుకాంతిశ్రీలు దిగ్భూములన్
భూషింపంగ నిజాలకుం బరమవిష్ణుం డైన వేవేగ జై
గీషవ్యుండు వహించె నవ్విభునిఁ బక్షిస్వామియై మూపునన్.

141


క.

అప్పుడు భయవిస్మయములు, ముప్పిరిగొన నశ్వశిరుఁడు ముందట పైపై
నుప్పరము లెగయ గరుడుని, కొప్పరమున నున్నకపటగోవిందునకున్.

142


గీ.

మ్రొక్కి యిది గాదు విష్ణునిమూర్తి నాభి, నుండవలెఁ బుండరీకంబు పుండరీక
భవనమున నుండవలె బ్రహ్మ బ్రహ్మతొడల, నుండవలె రుద్రుఁ డట్లు గాకున్న మిథ్య.

143


మ.

వెడమాయల్ విడువుండు మీ రనవుడున్ విద్యాప్రభావంబునం
బొడచూపెం గపిలుండు పంకరుహనాభుండై మరందంబు చి

ల్కెడునత్తామర నుంచి బ్రహ్మ నలజైగీషవ్యుఁడు న్వానిపెం
దొడ నిల్చెం బసిబిడ్డచందమున రుద్రుం డర్కకోటిప్రభన్.

144


గీ.

అది కనుంగొని యిదియు మాయాబలంబు, విశ్వరూపధరుండు శ్రీవిష్ణుఁ డనుచు
ధారుణీభర్త పలికిన నోరిమాట, నోరనే యుండఁ దత్సభాగారమునను.

145


సీ.

కనుపట్టె నొకచోట గండభేరుండంబు లొకవంక శరభంబు లుద్భవించె
నావిర్భవించె సింహము లొక్కదిక్కున నొకచాయ బెబ్బులు లుప్పతిల్లెఁ
దలచూపె నొకచక్కి దంతావళంబులు జనియించె నొకమూల సైంధవములు
పొడకట్టె నొకపక్క భూమిదారంబులు మహిషంబు లొకగొంది మంద గూడె.
నొక్కపట్టునఁ బుట్టె మయూరకీర, కోకిలమరాళకుక్కుటఘూకకాక
మశకమత్కుణమక్షికామధుపశలభ, దందశూకాదిజంతుకదంబకంబు.

146


క.

అంతట నశ్వశిరోభూకాంతుఁడు సంయములమహిమగా మనమున సి
ద్ధాంతీకరించి నిటల, ప్రాంతపరిన్యస్తహస్తపంకేరుహుఁ డై.

147


ఉ.

ఓపరమాత్ములార కరుణోదధులార నితాంతయోగవి
ద్యాపరతంత్రులార తెలియ న్వశమే భవదీయ మైనయీ
నైపుణి చాలుఁ జాలు ననినన్ నిజమూర్తులు దాల్చి తాపసుల్
జాపరమేశ్వరా యనిన జంతువు లన్నియుఁ బోయె మాయమై.

148


వ.

ఇట్లు మహాశ్చర్యం బైనయోగవిద్యాచాతుర్యంబునం బెక్కుపోకలం బోయి నిల్చిన
మహామునులం గాంచి కలగాంచి మేలుకాంచినచందంబున డెందంబు చలింప
నిలింపవల్లభనిభుం డమ్మహీవిభుండు దండప్రణామంబు లాచరించి మీరు నాకుం
జూషినబహురూపంబులు మొఱంగు తెఱంగు మఱుంగు పెట్టక యెఱింగింపుం డనిన
జగజ్జనసంసేవ్యు లైనకపిలజైగీషవ్యులు మందస్మితంబు వదనారవిందంబులం గంద
ళింప నరనాయక నీవు నారాయణుం డెవ్విధంబునం గొలువ విధేయుం డగునని
మమ్ము నడిగితివి. నారాయణుండు సమస్తంబునుం దన్నకా భావించి కొలిచినం
గాని విధేయుండు గాఁడు సమస్తంబు నతం డగుట నీకుం దెలుపవలసి నారా
యణగుణవిలాసములు చూపితిమి యిది మాయగా విచారింపవలవదు నారాయ
ణుండు సమస్తపరిపూర్ణుం డని భావంబున దృఢీకరించి నానావిధోపచారంబుల
వైదికాచారంబుల ననుదినస్నానదానజపహోమాదిపుణ్యకర్మసమర్పణంబుల బ్రా
హ్మణసంతర్పణంబుల నారాధింపుము విధేయుం డయ్యెడు మా చెప్పినపరమజ్ఞాన
సద్భావంబు వదలకు వెండియు నడుగవలసినసందేహంబు లడుగుము.

149

క.

అనవుడుఁ గపిలుం గనుఁగొని, జనపాలకుఁ డడిగె మోక్షసంపద కర్మం
బునఁ గలదో విజ్ఞానం, బునఁ గలదో యెఱుఁగఁ జెప్పు మునికులతిలకా.

150


వ.

అని కపిలమునీశ్వరు నశ్వశిరుం డడిగె నని వరాహదేవుండు చెప్పిన మహీమత్త
కాశిని మీఁదటివృత్తాంతం బానతిమ్మని విన్నవించిన.

151


మ.

మణిమంజీరవిలంబమాన బలవన్మత్తాహితవ్యూహభీ
షణసంగ్రామ రాధనంజయవిభాసంపన్న నీరేరుహే
క్షణపూజాపరతంత్ర సాళ్వనరసింగక్షమాధ్యక్ష ద
క్షిణదోర్దండ నిరంతరాయకరుణాశ్లేష ప్రియంభావుకా.

152


క.

భూసురసహకారవనీ, వాసంతవిలాస విబుధవత్సల సకలా
శాసందర్శితగుణహ, ల్లీసక మదవైరిమండలీఫణిగరుడా.

153


ఉత్సాహ.

మండువాబెడందకోట మాహురాదిమేదినీ
మండలేశ్వరస్తుతాసమానమానుషోదయా
భండనాజితప్రచండపటహనిస్వనార్భటీ
హిండితాష్టదిక్కుడుంగ యీశ్వరాత్మసంభవా.

154

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంటనాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబునఁ బ్రథమాశ్వాసము

.