వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/ఏకాదశాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

ఏకాదశాశ్వాసము

క.

శ్రీరామానఘగుణ ల, క్ష్మీరామారమణభక్త కీర్తిజితహిమా
నీరామాహిపమందా, రారామా యీశ్వరక్షమాధిపునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుం డచల కి ట్లనియె నట్లగస్త్యుండు తనకు రుద్రుం
డానతిచ్చినకథలు చెప్పి భద్రాశ్వనరేశ్వరు నాశీర్వదించి నిజాశ్రమఁబునకుం
జనియె నింక నేమి వినవలతు వనినఁ బుడమి వినయావనతయై.

2


క.

కొందఱు శంభుని బ్రహ్మం, బందురు మఱికొంద ఱిందిరాధిపుఁ బరమా
త్మందురు కొందఱు చతురా, స్యుం దత్త్వం బందు రాజసూకరనాథా.

3


క.

ఎప్పుడు నీసందేహము, ముప్పిరిగొను నాదుచిత్తమున నిది దెలియం
జెప్పు మనఁ గపటకిటివరుఁ, డప్పుడమికి నాన తిచ్చె నతివిశదముగాన్.

4


శా.

శ్రీనారాయణుఁ డాద్యుఁ డిందఱికి నీరేజాతగర్భుండు త
త్సూనుం డాతని కుద్భవించె నిటలాక్షుం డమ్మహాదేవుఁ డ
జ్ఞానధ్వంసి తదీయవర్తనము లాశ్చర్యావహంబుల్ ధరి
త్రీ నీకు వినిపింతుఁ గొన్ని విను నిర్నిద్రానురాగంబునన్.

5


క.

తొల్లి యొకనాఁడు మురభి, ద్భల్లుఁడు కైలాసశిఖరిపై గిరిజయుఁ దా
నెల్లజగంబులు గొలువఁగ, ముల్లోకముపారుపత్యము విచారింపన్.

6


క.

తలఁచుట యెఱింగి చతురుఁడు, శిలాదసుతుఁ డాయితంబు చేయించె సము
జ్జ్వలరత్నతోరణాదిక, ముల వెలుపటికొలువుమేడఁ బురహరుఁ డంతన్.

7


సీ.

భువనమోహన మైనపువుదండచల్లనిగాడ్పులు జడలతోఁ గడలుకొనఁగ
ధాతుమించినమంచితమ్మంట్లరాగంబు శ్రవణభాగంబుల సందడింప
ప్రమదాస్పదం బైనపట్టురెంటెము కటీరస్థలిఁ గరము విభ్రమము చూప
తనువుపైఁ జిట్లుగంధముసౌరభంబులు సరిలేనిరతివిలాసములు నెఱప

కొండరాయనిముద్దులకూఁతుకరము, నిజకరంబునఁ గీలించి నిగమనేత్ర
హస్తహుంకృతి ముందట నంబరస్థ, లంబు దాఁకంగ నాహజారంబు చొచ్చి.

8


శా.

ఓహో భైరవ నీల రుద్ర నిలు సాహో వీరభద్రేశ కుం
భాహూ రాకు నికుంభ యందు వడి సమ్మర్దంబు వారించుచున్
బాహూత్తంభితవేత్రవల్లి గదలన్ దండప్రభుం డుద్ధత
వ్యాహారంబులచే బరాబరులు చేయన్ రత్నవేదిస్థలిన్.

9


సీ.

విజయాకరాంబుజవ్యజనానిలంబులఁ దూలుకుంతలములు దువ్వి దువ్వి
ప్రమథులవికృతవేషములు చూడు మటంచుఁ జెవి చేరి మెల్లనె చెప్పి చెప్పి
పగిడిబింగన్నకొడగములు వీక్షించి హాసంబుతోఁ జేయి వేసి వేసి
తనచేత నుండక వెనకయ్య గినిసిన నెత్తుకొ మ్మని చేతి కిచ్చి యిచ్చి
చిత్త మిగురింప వేడ్కలు బిత్తరింప, నవయవంబులఁ బులకంబు లంకురింప
శైలకన్యయుఁ దానును సరసగతుల, మేల మాడుచు నొకగద్దెమీఁద నుండి.

10


వ.

గండకపుండరీకశుండాలగండభేరుండముఖులును రుక్షచక్షుశ్శ్రవోహర్యక్షతరక్షు
సదృక్షముఖములును శరభకరభసైరిభసన్నిభముఖులును గాకఘూకకోకసూకర
భీకరముఖులును గుక్షిముఖులును వక్షోముఖులును హస్తముఖులును మస్తముఖులును
బశ్చాన్ముఖులునుం దిరశ్చీనముఖులును మొద లైనప్రమథులును జేగురింపుజడలును
నిరులు కవియు మెడలును జలి వెలుంగుతునుకలుఁ బ్రామినుకులదొరపునుకలు బేసి
చూపులు ముమ్మొనలచే ప్రాపులు మలకలపేరులు వలపులనీరులుం గలసారూప్యధారు
లు నగస్త్య పులస్య శాండిల్య మాండవ్య రైభ్య బాభ్రవ్య ప్రముఖనిఖిలసంయములు
గరుడగంధర్వసిద్ధవిద్యాధరాదిదేవయోనులు సముచితప్రకారంబున సేవింప వారల
నాదరింపుచుఁ బేరోలగం బుండునవసరంబునఁ బురుహూతప్రభృతిదేవతావితాన
సమేతుండై విధాత యేతెంచిన యథావిధానంబున బహూకరించి కరుణారస
విభూషితంబు లగుభాషితంబులం బితామహా యీమహేంద్రాదిబృందారకు లంద
ఱుం గందినముఖారవిందంబులం గుందినదెండంబుల నున్నవారు తారు దైతేయ
వీరులచేతఁ బరాభూతులు గారు గదా వీర లిచ్చటికి వచ్చిన నిమిత్తంబు చెప్పు
మనిన వనజభవుండు వినయంబున.

11


శా.

దేవా రక్కసుఁ డొక్కరుం డతిబలోద్రేకంబునం దాడి రా
ధావద్దంతి విహస్తబస్తము పతద్వాహారి మోహన్నరం
బావల్లన్మకరంబు భీతమృగ మార్తాశ్వంబు భగ్నోక్షముం
గా వైకల్యముఁ బొందు నింద్రముఖదిక్పాలాలయగ్రామముల్.

12

క.

ఈకరణి సార్వకాలము, రాకాసి మదంబు కవిసి రాకం బోకం
జీకాకు పఱుప వేసరి, నాకౌకసు లెల్ల వచ్చి నా కెఱిఁగింపన్.

13


సీ.

ఎల్లభక్తులకును గొల్లగా వేఁడినవరము లీఁ గలవ్యయవాదికాఁడు
సచరాచరప్రపంచమును బాలించురాచాఱికమ్ముకాణాచికాఁడు
మిక్కిలి కనుమంట మింటఁ బాఱుపురాలు భస్మంబు చేసినపంతగాఁడు
కోలాహలాభీలహాలాహలజ్వాల మెడబంటి మెసఁగిన మేఁతకాఁడు
శంభుఁ డుండంగ మనల కీశంక యేల, రెండు పోద మటంచు నాఖండలాది
సురలఁ దోడ్కొని యేను దేవరకుఁ దెలియ, విన్నవించుటకై పనివింటి నిపుడు.

14


ఉ.

నిత్యము నిర్వికల్ప మతినిర్మల మీభవదీయ మైనదాం
పత్యము కన్నులారఁ గనుభాగ్యము మా కొనఁగూడెఁ గాన సం
స్తుత్యము నేఁటివాసరము సోమకళాధర నీకు గౌరికిం
గృత్యము లోకరక్షణము క్రీడలు రాక్షసశిక్ష లెప్పుడున్.

15


సీ.

జ్ఞానంబు నీవు మోక్షంబు దాక్షాయణి ఫలము నీవు తపంబు భద్రకాళి
మంత్రంబు నీవు సామర్థ్యంబ చండికప్రాణంబు నీవు దేహంబు దుర్గ
ప్రామినుకులు నీవు ప్రణవంబు పార్వతి చవియు నీ వమృతంబు సకలజనని
భక్తియు నీవు విరక్తియు శాంభవి యర్థంబ నీవు వాక్యంబు గౌరి
శక్తిలో నీవు నీలోన శక్తి యెపుడుఁ, బాయకుందురు భాస్కరప్రభలు వోలె
నీరహస్యంబు మదిలోన నెఱుఁగలేక, మొత్తులాడుదు రూరక మత్తిగాండ్రు.

16


క.

అని యిట్లు పెక్కుభంగుల, వినుతించి విరించి తన్ను వీక్షించిన నా
కనకాచలకోదండుఁడు, వనజోదరుఁ దలఁప వచ్చె వారలు ముగురున్.

17


శా.

ఏకీభావముతోడ నొక్క రొకరిన్ వీక్షింప నాచూపులన్
రాకాచంద్రనిభాస్య కోకకుచ నానారత్నభూషాంగి ది
వ్యాకారంబున నొక్కకన్య జననం బయ్యెన్ దనుచ్ఛాయ లా
శాకాశావనిమండలిన్ దిమిరసంధ్యాచంద్రికల్ చల్లఁగన్.

18


సీ.

ఆమూఁడువర్ణాలలేమ కోమలహాసభాసమానకపోలభాగ యగుచు
హరిహరబ్రహ్మాదిసురల విలోకించి కలకంఠకలకుహూకారచారు
భాషణంబుల నీప్రపంచంబు సర్వంబు గన్న మహామాయ నన్ను మీర
లెఱుఁగ రే మీకోరి కేమైనఁ దీర్చెదఁ జెప్పుఁ డటన్న నాచెలువఁ జూచి
నలువయును వెన్నుఁడును జలి వెలుఁగుఁదాల్పు, నోమహాశక్తి వినుము నీ నామకంబు
త్రికళ యిటమీఁద నీచేయుప్రకటవిక్ర, మముల మఱియును బెక్కునామములు గలవు.

19

వ.

ఇంక నొక్కకారణంబు గలదు భవదీయదేహవర్ణత్రయంబు విభజించి మూర్తిత్ర
యంబుఁ గల్పింపు మనిన నద్దేవతామతల్లి పింఛతాపింఛరింఛోళినీలచ్ఛాయం బగు
చు నొక్కకాయంబును సంధ్యారాగసౌగంధికబంధూకబంధురుచిప్రవాహం బగు
నొక్కదేహంబును హారకర్పూరతారనీహారగౌరం బగునొక్కశరీరంబును వహించె
నందులో ధవళవర్ణయు వీణాపుస్తకపాణియు బ్రహసృష్ట్యభిధానయుం బ్రపంచ
నిర్మాణకర్మఠయు నగుబ్రహ్మశక్తి చరాచరవ్యాపకత్వంబు గోరి తపంబు చేయవలసి
ధాతచేత ననుజాతయై శ్వేతపర్వతంబునకుం జనియె రక్తవర్ణయు శంఖచక్రపాణి
యు లోకపాలనియు విష్ణుమాయాభిధానయు నగువిష్ణుశక్తి ముకుందునిచేత ననిపిం
చుకొని మందరకందరంబునకుం దపంబు సలుప నరిగె నీలవర్ణయు శూలపాణియు
దంష్ట్రాకరాళినామధేయయు జగత్సంహారకారిణియు నగురుద్రశక్తి నీలకంఠు
నకుం జెప్పి నీలశైలంబునకుం దపంబు చేయ నరిగె నప్పుడు హరివిరించిప్రముఖ
నిఖిలగీర్వాణులు దుర్వారపూర్వగీర్వాణగర్వసముద్రంబు లింక నింకు నని సంత
సించుచు నుమామహేశ్వరుల వీడుకొని తమతమనివాసంబులకుం జని రంతటం
గొంతకాలంబున.

20


క.

గీరీశుఁడు తనసర్గం, బేరీతిఁ బ్రయాసపడ్డ
నీడేరక ని
ష్కారణమ హానిఁ బొందఁగ, సారెకుఁ గావించి మిగుల సదమద మగుచున్.

21


గీ.

నీటివ్రాలకరణి నేటికిఁ దోడ్తోన, సృష్టి నష్ట మయ్యెఁ గష్ట మనుచు
జ్ఞానదృష్టిఁ జూచి నైజశక్తి తపంబు, సలుప శ్వేతగిరికిఁ జనుట దెలిసి.

22


ఉ.

ఆగిరి కేగి చూచెఁ బరమామృత మాకృతి దాల్చి నిల్చెనో
నాఁగ వెలుంగుచున్ గరమునం జపమాలిక పూని లీల నే
నీగతిఁ బద్మజాండము లనేకము లెప్పుడుఁ ద్రిప్ప నేర్తు నన్
బాగునఁ ద్రిప్పుచున్న తనప్రాణపదం బగుసృష్టిదేవతన్.

23


సీ.

కాంచి కల్యాణి యేకాంక్షఁ గావించెదు నిష్ఠురతప మతినిష్ఠ నీవు
మెచ్చి వరంబు లీ వచ్చితి నడుగుము నా బ్రహ్మసృష్టి యన్నలువతోడ
నొకవంక నడఁగి యే నుండఁగ నోప సర్వగతత్వ మి మ్మన్న స్రష్ట దద్వ
రం బిచ్చి తనశరీరంబున నాదేవి జలముఁ బాలును బోలెఁ గలపికొనియె
నది మొదలు సృష్టి వర్ధిల్లె ననలుఁ గొనలుఁ, బాతి బ్రహ్మకు మిక్కిలి నూఱ టయ్యె
శక్తి గలిగినకతన నశక్తు లైన, వారిచేఁతలు కొనసాగి వచ్చు నెట్లు.

24


క.

వనజభవుఁ డపుచు సంతస, మునఁ దనశక్తిం దలంచి పొగడఁ దొడంగెం
గనకగిరిశృంగరంగ, త్ఖనదీఘనదీర్ఘలహరికాఘుమఘుమికిన్.

25

రగడ.

శ్రీవాగీశ్వరి సృష్టివ్యాపిని | భావితనిగమప్రకరాలాపిని
తారతారకాధవధవళాంశుక | సారసమృదుకరసంభృతసితశుక
శరణాగతజనసర్వసిద్ధికరి | పరమజ్యోతివిభావరి శాంకరి
వనజభవాండవ్రజమణిహారిణి | సనకాదికహృత్సౌధవిహారిణి
సర్వభూతమయి సర్వాక్షరమయి | సర్వతత్త్వమయి సర్వసిద్ధిమయి
జగదంబ సరస్వతి విద్యేశ్వరి | సగుణా నిర్గుణాశ్రయ పరమేశ్వరి
యేకాక్షరయు ననేకాక్షరయును | నాకాశామృతమృతాక్షరయును
జ్ఞాననిధియుఁ బరశక్తియు ననునభి|ధానము లెప్పుడుఁ దాల్చుచుఁ గడునభి
రామరూప యగుబ్రాహ్మీని నీ వని | కామజనని రక్తచ్ఛవిపావని
అపర యనెడునారాయణి నీ వని | విపులతనుద్యుతివిజితోత్పల యని
శబలునికలాశక్తియు నీ వని | ప్రబలపరాపరరౌద్రివి నీ వని
సృష్టియు నీ వని స్థితియు నీ వని | తుష్టియు నీ వని తుదియు నీ వని
ప్రణవము నీ వని బ్రహ్మము నీ వని | యణురేణుతృణాద్యంబులు నీ వని
యెఱిఁగినవారికి నిహపరసుఖములు | తఱుగవు తొలఁగును దవ్వుల నఘములు
వేల్పులకొఱకై వివిధాకారము | దాల్పఁగ నీ కిది దగినవిహారము
క్రొన్నెలతాలుపుఁ గొలిచిన భక్తులు | ని న్నెఱింగి సంధింతురు ముక్తులు
స్వస్తికారిణి చాఁగులు నీకును | బ్రస్తుతసద్గుణప్రణతులు నీకును
మంత్రాకారనమస్కృతి నీకును | తంత్రఫలప్రదదండము నీకును
చిదమృతసారమ జేజే నీకును | మొదలిదైవతమ మ్రొక్కెద నీకును.

26


క.

ధాత్రీ ధాత్రీరిత మగు, నీత్రికళాస్తవము చదివి ఋతుమతుల మృగీ
నేత్రలఁ గూడినఁ గలుగుఁ బ, విత్రులకుం బుత్రపౌత్రవిభవసమృద్ధుల్.

27


మ.

విను మింకన్ మును మంథశైలమునకున్ విచ్చేసి తద్రమ్యసీ
మ నిరూఢామరభూజవాటమునఁ గౌమారవ్రతాసక్తి నుం
డిననారాయణి రాజసప్రకృతితో నిష్ఠం దపం బాచరిం
చె ననేకాబ్దము లంత నయ్యబల రోషించెన్ బ్రయాసంబునన్.

28


వ.

ఇట్లు రోషమందరక్షుభితం బైనతద్దేవిదివ్యచిత్తం బనుదుగ్ధసాగరంబునకు నచ్చర లై
స్వయంప్రభ విద్యుత్ప్రభ చంద్రప్రభ సూర్యప్రభ చంద్రకాంతి సూర్యకాంతి
చారుకేశి సుకేశి మంజుకేశి యూర్వశి గంభీర విభావరి చారుముఖి చారుకన్య
ధన్య శూలిని శీలమండన దేవగీతి యపరాజిత జయ విజయ జయంతి గిరిసుత ఘృ
తాచి విశాలాక్షి పీనపయోధర మొద లైనకుమారికలు పాశాంకుశంబులు కరంబుల

మెఱయఁ గోట్లకొలఁదు లుద్భవించి తేఁటిమొత్తమ్ములతమ్ము లగుకురులు కలువల
వలపించుకలికిచూపులు పులుకడిగినముత్యంబులతోడి పవడంబులడంబు లడంచు
దరహసితలసితాధరంబులు ధరమ్ములగౌరవమ్ము వమ్ము చేయువలిగుబ్బలు బలుజోడు
మరునికోదండంబు దండంబు లిడునడుములును ములుబంతులపరుసునం బరుస
నగుకరికరంబులకు నౌన్నత్యప్రసిద్ధి సిద్ధించిన నిజజఘనభాగములు గములు గూడి
వచ్చినం గదలి కదలికలకలహము సరకుఁగొననిమనోహరోరుస్తంభంబులు భం
బులు చూపురుచులు చులుకం జేయుపాదనఖంబులుం దనర మత్తిల్లి విరహుల
మొత్తములం దుత్తుమురుగా మొత్తుచిత్తజునికత్తి హత్తిననెత్తురులతోడం బొత్తెత్తు
చేయు మెత్తనిచరణంబులక్రొత్తలత్తుకల మందమందగమనంబునందంబు నందంద
పొగడువందిబృందంబుచందంబునం గ్రందుకొన మొరయునందియల దట్టంబు
గాఁ బొడుపుగట్టుమిట్టలపట్టులం బట్టినబాలాతపధట్టంబుచుట్టంబు లై చూపట్ట
నెరివట్టి గట్టిపిఱుందులం గట్టినకెంబట్టుపుట్టంబుల శంబరారి యనుదొంబరి
విడంబంబునం దూర నంబరంబునం బన్నినవలయంబు లనం బొలుచునవలగ్నం
బుల విలగ్నంబు లగునొడ్డియాణంబుల శృంగారతరంగరంగంబు లగుయౌవనవన
సముత్తుంగకుడుంగంబులతెఱంగున రంగుమీఱు మెఱుంగుఁజనుంగవలం గిసలయ
భృంగసంగతప్రసవభంగి నంగీకరించునీలమాణిక్యమిళితమౌక్తికహారంబుల నిచ్చ
లంపువలపుల మచ్చుచల్లి విచ్చలవిడి నిచ్చలు నిచ్చరాచరంబు మోసపుచ్చుపచ్చ
విలుతుని మెచ్చులవల్లెత్రాళ్ళ నచ్చట నచ్చటం గ్రుచ్చినపలువన్నెకుచ్చులయ
చ్చున హెచ్చుకరమణికేయూరకంకణాంగుళీయకంబుల వెక్కసపుటక్కజంపుఁ
దెలుపునం జుక్కలఱేని నెక్కసక్కెమాడి తళుక్కుతళుక్కు మనుచు నొక్కటఁ
బిక్కటిలువజ్రకుండలరుచులపెక్కువతో మక్కువ సలుపుమిక్కిలిచక్కనిచె
క్కులకాంతిలహరికలోనిమకరికలవిప్పు గలనాచుకుప్పలనడిమి పగడంపుఁదీఁగెలచొ
ప్పుం దప్పునట్టికప్పులఁ దెప్పు లగుకొప్పుల నొప్పుచందిరంపుఁబాపటలప్రభాపటలం
బు లినుమడించుదేహంబుల విలసిల్లుచు నలుగడల సేవించి నిలిచినం జూచి రజో
గుణప్రధానయు నపరాభిధానయు నగుతన్నారాయణి యీకుమారికాసహస్రంబు
లకు నాకునుం దగిననగరంబు గల్పింతు నని సంకల్పించినఁ దత్ప్రభావంబున.

29


సీ.

పరిఘావలోకనప్రాప్తాపరాంబుధిభ్రమపతిష్ణుబ్రధ్నరథహయంబు
నిక్షిప్తమణిమిళన్నక్షత్రమండలధ్యాసితవప్రమధ్యస్థలంబు
సౌధవీథీమహోత్సేధవీక్షోద్గ్రీవమైరవశిఖరగామరపురంధ్రి
త్రైవిక్రమాంఘ్రినిర్దళదజాండస్రుతావరణాంబువిభ్రమధ్వజపటంబు

ప్రమదవనజాతమందారపారిజాత, మధురమధురసగంధాంధమధుపగీత
గుణితవిద్యాధరీపాణిమణివిపంచి, వాదనము నగునొకపుటభేదనంబు.

30


క.

పొడమెం గవ్వపుగుబ్బలి, నడునెత్తముమీఁదఁ గుందనపుఁగొండఁ జెలం
గెడువేల్పువీటిచెలువము, తడకట్టఁగఁ జాలు నొప్పిదంబులతోడన్.

31


క.

ఆరాజధాని నీప, క్ష్మారుహవృతకల్పవృక్షమధ్యస్థితచిం
తారత్నసౌధవీథిక, నారూఢమృగేంద్రపీఠ యై మహిమమునన్.

32


సీ.

శ్రుతు లాకృతులు దాల్చి నుతులు గావింపంగ నానానిలింపులు నతులు చేయ
మును లాగమరహస్యములఁ బూజనలు సల్ప నప్సరస్త్రీలు నాట్యంబు చూప
కిన్నరాంగనలు సంగీతంబు వినిపింప సనకాదియోగులు జయలు వెట్ట
విద్యాధరలు రుద్రవీణలు వాయింప గరుడోరగము లూడిగముల మెలఁగ
నిజకుమారీకరాంబుజవ్యజనచలిత, వక్రచికురాళి శృంగారవార్ధిసుళ్ళఁ
బోల విష్ణునిశక్తి పేరోలగమున, నుండ నారదమునిపుంగవుండు వచ్చి.

33


మ.

తనదేహచ్ఛవిలోనఁ గన్యకలుఁ దత్కన్యాతనూదీప్తిఁ దా
నునుఁ గానంబడి వారికిం దనకు నెందున్ భేద మొక్కింత లే
దని సూచించినరీతిఁ గన్నులకు విందై నిల్చునవ్వైష్ణవిం
గని భక్తిం బ్రణమిల్లి తద్రచితసత్కారంబులం బొందుచున్.

34


శా.

ఆలాపంబులుఁ బెక్కునేమముల ఠాయంబుల్ ప్రయోగంబులున్
దాళంబుల్ మొరయంగ రాగముల నానాతానమానంబులన్
డాలున్ రక్తియు రేఖయున్ సరళియున్ రాణింపఁ దద్వైష్ణవీ
లీలాచిహ్నితగీతముల్ మహతిఁ బల్కించెన్ విచిత్రంబుగన్.

35


మ.

అపు డానందజమందహాసములు గండాభోగముల్ నిండ న
య్యపరాశక్తి మునీంద్ర వచ్చితివి కార్యం బేమి గాంక్షించి నా
విపులానాగనివాసనాకముల సంవీక్షించి వైధాత్రరౌ
ద్రపురంబుల్ గని దేవి ని న్నిచట సందర్శింప నేతెంచితిన్.

36


చ.

హరు నెఱగంట మ్రందినలతాంతశరున్ భవదీయ మైనబి
త్తరికడకంటిచూపులు సదా సృజియించు ననేకమూర్తిగా
హరిహరి రూపుఁ బ్రాయము ననన్యవధూసులభంబు లైన నీ
కరణి విరక్తి చిత్తమునఁ గైకొని నిల్చుట చోద్య మెంతయున్.

37


సీ.

అని ప్రశంసించి సాష్టాంగంబుగా మ్రొక్కి తద్దేవి వీడ్కొని ధాతృసూనుఁ
డభ్రమార్గంబున నరుగుచు మదిలోనఁ గలహంబునకు సందు గలిగె నింత

కాలంబునకు నంచు గంతులు వైచుచు సంభ్రమంబునఁ బోయి జలధినడుమ
భర్మనిర్మిత మైనపట్టణంబున రమ్యహర్మ్యసీమమున సింహాసనాధి
రూఢుఁడై యున్నమహిషాసురునిసమీప, మునకుఁ జని తత్కృతాతిథ్యములకు మెచ్చి
రదనములు పిన్నవెన్నెల వెదలుచల్ల, నానిశాచరమండలాధ్యక్షుతోడ.

38


క.

దానవనాయక నీకుం, గానుకగా మేలువార్త గలిగినఁ జెప్పం
గా నరుదెంచితి నది విను, మా నిన్న వినోదమునకు మందరగిరికిన్.

39


చ.

అరిగి తదగ్రభాగమున నబ్జభవాండముతోడ రాయును
ప్పరిగలఁ జూడ నొప్పునొకపట్టణమున్ గని చొచ్చి తత్పురిన్
సురమణిమంటపంబున మనోహరమూర్తి ననేకకన్యకా
పరివృతఁ జొక్కపుంగొమరుప్రాయపుఁజక్కనిలేమఁ జూచితిన్.

40


క.

ఆచెలువరూపసంపదఁ, జూచిన మిముబోఁటు లెల్లఁ జొక్కుట చిత్రం
బాచిన్మయు లగుతపసులు, చూచినఁ బరవశతఁ బొంది చొక్కుదు రనినన్.

41


గీ.

దేవగంధర్వదానవాదికులు భక్తిఁ, గన్నుసన్నలఁ దన కూడిగములు చేయ
నెపుడుఁ బేరోలగం బుండు నేమి చెప్ప, నాకురంగాక్షిమహిమంబు లసురనాథ.

42


గీ.

సిద్ధయువతిమస్తసిందూర మంటుత, త్కన్యకాలలామకాలిగోరిఁ
బోల నోపఁ డుదయపూర్ణేందుఁ డింక నా, బాలనెమ్మొగంబుఁ బోలు పెట్టు.

43


క.

కుందనపుఁగాహళంబులు, పొం దెఱుఁగక యెన్నిబిరుదములు పలికినఁ ద
మ్మందదుకు లనుచు నాలిక, నిందీవరనయనజంఘ లీరస మాడున్.

44


గీ.

కర్కశంబులు నలుపులు కంపమాన, ములు సదా ధూళిధూసరములు కరాళ
ములు కరికరంబు లాపువ్వుఁబోఁడిమోహ, నోరువులఁ బోలు ననుట వక్రోక్తి గాదె.

45


గీ.

ఆమృగాక్షిఘనకటీమండలంబుతో, సరికిఁ బెనఁగ వచ్చుసైకతముల
గౌరవంబు గుట్టు గానంగ వచ్చుఁ బో, తెలియ నేరుపాటు గలిగెనేని.

46


క.

అతనుఁడు చుట్టినశైశవ, లతఁ దివిచినచోటితరులలాగున లావ
ణ్యతరంగిత మైనవళి, త్రితయము దీపించుఁ దత్సతీమణినడుమన్.

47


గీ.

వదనచంద్రికాప్రవాహంబు దిగజాఱి సందు లేనిఘనకుచములనడుమ
నరుగ రాక తొట్టె నన మించు నాచకో, రాయతాక్షితారహారతతులు.

48


క.

పలుచనినాతో సరి యే, దళ మగులేమావిచిగురు దా నని నగు నా
లలనాధరము పరిప్రతి, ఫలితలలితదంతరుచినెపంబున నెపుడున్.

49


క.

ఏచినతననిడువాలువి, లోచనములచెలువమునకు లొంగి జలజముల్
కైచెఱ యిచ్చె ననం గే, లీచాలితనలిన మాకలికి ధరియించున్.

50

క.

ఇన్నియుఁ జెప్పఁగ నేటికి, మిన్నక జఘనావలంబిమేచకవేణీ
పన్నగఫణమణు లన నా, కన్నియ కురులం గదంబకళికలు చెరువున్.

51


గీ.

లలితలావణ్యతారుణ్యలక్షణములు, నపరలక్ష్మి యటంచు నయ్యబలమీఁద
నలిననాభుండు కనువేసినాఁడు గాన, కోలుముందుగ నీవ చేకొనఁగ వలయు.

52


శా.

ఆకాంతామణి కంకణావళులు మ్రోయ న్నీదువక్షంబు పై
నాకాంక్షన్ నఖరక్షతాంకములు చేయన్ నూతనాలిప్తలా
క్షాకమ్రాంఘ్రిహతిన్ శిరంబునకు రక్తచ్ఛాయ పుట్టింపఁగాఁ
జేకొమ్మా విషమాస్త్రకేళికలహశ్రేయోభవానందముల్.

53


సీ.

మెప్పించినాఁడవు మితి మేర లేనితపోమహత్త్వమున నంభోజభవుని
నొప్పించినాఁడవు నుగ్గునూచములుగా బలభేదిముఖ్యదిక్పాలబలము
తెప్పించినాఁడవు త్రిభువనంబుల నపూర్వము లైనవివిధసువస్తు లెల్ల
కప్పించినాఁడవు గాఢతరప్రతాపానలచ్ఛటలఁ జరాచరంబు
నిట్టిభాగ్యంబునకుఁ దలకట్టు గాఁగ, రాక్షసేంద్ర శుభస్య శీఘ్రం బనఁగఁ
గట్టు దేవేరిపట్ట మాకమలవదన, కంచు నెగపోసి నారదుఁ డరుగుటయును.

54


క.

బలభేదిభిదురధారకుఁ, దలఁకనితనమానసంబు దర్పకబాణం
బుల నీతలాత లైనం, దలకొనుతాపమున మహిషదానవుఁ డాత్మన్.

55


సీ.

ఆసక్తి నాలేమయౌవనవనములో నెన్నఁడు విహరింతు నేసరేఁగి
లీల నాకోమలిపాలిండ్లకస్తూరిరొంపిలో నెన్నండు బ్రుంగు డౌదు
ఠేవ నాజవరాలిలావణ్యసరసిలో మునుఁగుడు నెన్నండు ముసపు దీఱ
నీహ నామోహినిబాహుపాశంబులఁ దడయక యెన్నండు దగులువడుడు
నంచుఁ జింతించు నుస్సు రటంచుఁ బొరలు, మరులుకొని రణభోజనమౌనివచన
రచనమారణమంత్రాక్షురస్రభూత, ఘోరవిరహభూతమహావికారమునను.

56


వ.

ఇవ్విధంబున నంతకంతకు వలవంత బలవంతం బైన సైరింపలేక సైరిభాసురుం డొక్క
నాఁడు విఘన ప్రఘన విభావసు విద్యున్మాలి సుమాలి శంకుకర్ణ కృతపర్వతాభి
ఛానులం దనప్రధానుల రావించి వారి నాలోకించి నాఁడు నారదుఁ డెఱింగించిన
మందరపర్వతస్థితకన్యకావతంసంబు నామనంబునం బాయనికతంబునఁ బునఃపున
రుద్భూతవిరహసంజ్వరభరంబున మిగుల నొగిలితి నింక నిశ్శంకంబున వేలుపుల
పొంక మింకింపక తత్పంకరుహముఖిం బరిగ్రహింపరాదు దీనికి నుచితం బగునుపా
యంబుఁ దలంప వలయు ననిన వారిలోనం బతిహితసమేతనీతిచాతురీధురీణుండు
ప్రఘనుండు సభాసదులం గలయం గనుంగొని పేరెలుంగున మీ రెఱుంగుదురో
యెఱుంగరో కాని తదంగన సామాన్యకన్యకామాత్రంబు గాదు జగత్త్రయధాత్రి

యగువిష్ణుశక్తి గాని హానికి మూలంబు సుమీ యీనెలఁతకు నఱ్ఱు దలంచుట విశే
షించియు గురుభృత్యసామంతకాంత లగమ్యలు విష్ణుండు సర్వలోకగురుండు
తత్పత్నీహరణప్రయత్నంబు కొఱ గాదు వాదులు ప్రోదులు చేయుమునిముచ్చు
బోధలు వినం బనిలే దని చెప్పు నప్పుడు విఘనుండు మహిషాసురు విలోకించి దేవా
ప్రఘనుండు నిజంబ విన్నవించె నైన నమ్మానపతి మొదల సామవాక్యంబులం బ్రా
ర్థించి యిష్టవస్తువు లొసంగి భేదం బాపాదించినం గైవసంబు గా దేని పిదప బలా
త్కారంబునఁ దోతెంత మనిన విని తక్కినమంత్రుల లందఱు నిది వివరం బగు ననిన
విఘనుం బ్రశంసించి శస్త్రశాస్త్రవిశారదుండును శౌచశౌర్యసమన్వితుండును
మాయాకోవిదుండు నగువిద్యుత్ప్రభుం డనువాని నద్దేవికడకు దౌత్యంబునకుం
బనిచి తారును మేరుశైలంబునకు దాడివెడలం దలంచి పడవాలు విరూపాక్షు
నీక్షించి పౌఁజు లాయితంబు చేయు మనిన వాఁడును హజారంబువాకిట నిలిచి
సంవర్తఘస్రఘనాఘనఘటాఘోషభీషణంబు గా జైత్రయాత్రానకంబు చఱపింప
నప్పురంబునలువంకల.

57


హరిణి.

అభినవభరభ్రశ్యచ్ఛేషోత్తమాంగశతాంగముల్
రభసవిరసత్సైన్యోదన్వత్తరంగతురంగముల్
శుభితకులభూభృత్తుంగత్వాంగశోభమదేభముల్
ప్రభృతకనకోదంచచ్చాపక్షురప్రభటప్రభుల్.

58


క.

వెడల నగరంబువెలుపటఁ, బడవా లేర్పణచి పెక్కుపౌఁజులు చేసెన్
గడ లేక వెల్లివిరిసెన్, గడ లేకతమున నటంచు ఖచరులు బెదరన్.

59


ఉ.

అప్పుడు కామరూపి మహిషాసురుఁ డేనుఁగు నెక్కి సన్నడో
ల్చప్పుడుచేఁ గకుప్పులు చలాచలిఁ బొందఁగ దాడివెట్టి వా
తప్పక నాకపట్టణ ముదగ్రత డగ్గఱఁ జూచి వేలుపుల్
ముప్పదిమూడుకోటు లోకమూఁ కయి వెల్వడి మోహరించుచున్.

60


క.

దివిజేంద్రప్రభృతులదం, త్యవిమహిషనృమకరహరిణహయవృషములపైఁ
బవిశక్తిదండఖడ్గగు, ణవీజనగదాత్రిశూలనర్తనకరులై.

61


స్రగ్ధర.

యుద్ధక్రుద్ధాక్షినిర్యద్ధుతవహములతో నుద్ధురాహంక్రియాసం
బద్ధక్ష్వేళాసమిద్ధార్భటిపటిమముతో బాహుదర్పంబుతో స
న్నద్ధస్వస్వధ్వజిన్యంతరముల నిలువన్ దైత్యు లుద్రిక్తులై సం
విద్ధౌరంధర్యవృత్తిన్ వెసం గవిసిరి గర్వించి రీవేల్పు లంచున్.

62


క.

వ్యూహద్వయంబు నీగతి, సాహసమున నెదుర హేమశైలరజస్సం
దోహంబు నిండి కాండక, టాహము చెంద్రంబుబఱ్ఱడాలు వహించెన్.

63

సీ.

దంభోళిసంరంభకుంభినీధరభేది యవిగర్హితవిజృంభణార్హబర్హి
దావపావకమహాప్రావిణ్యశమనంబు బర్బరవార్వాహకర్బురంబు
దుర్ధరవాహినీవర్ధిష్ణువార్ధిపం బారావఘోరసమీరణంబు
ప్రోద్యదుద్దామవిద్యుద్విభాసిశ్రీద మూర్జితగర్జితానార్జవోగ్ర
మైనదైవతసైన్యఘనాఘనంబు, గురియు శరవర్ష మొక్కింత సరకుగొనక
మోరత్రోపుఁదనంబున మోఱకించి, తాఁకె నెనుపోతురాకాసి నాకవిభుని.

64


వ.

మఱియు నంజనుండు నీలకుక్షి మేఘువర్ణుండు వలాహకుండు లలాటాక్షుండు ప్రభీ
ముండు తారాక్షుండు స్వర్భానుండు ననుదనుజు లెనమండ్రు వసువుల నసువులు
తోన పట్టెద మని చుట్టుముట్టిరి స్తబ్ధకర్ణుండు శంకుకర్ణుండు రక్తాక్షుండు భీమా
క్షుండు విద్యున్మాలి విద్యుజ్జిహ్వుండు కృతాంతుండు వజ్రకాయుండు మహాకా
యుం డతికాయుండు దీర్ఘకాయుండు భీమదంష్ట్రుండు ననుమనుజాశనులు పన్నిద్ద
ఱాదిత్యుల మృత్యువశులం జేసెద మని రేసి వేయేసినిశితాశుగంబు లేసిరి కాలుండు
కృతాంతుండు రక్తాక్షుండు క్షోభణుండు మిత్రహుండు యజ్ఞహుండు బ్రహ్మ
హుండు గోఘ్నుండు స్త్రీమ్నుండు సంవర్తకుం డనిలుం డను పెనురక్కసులు
పదునొక్కండ్రు రుద్రుల నుక్కడంతు మని యెక్కిరి తక్కినదైత్యు లొక్కొక్క
వేల్పు నొక్కరుండు చిక్కించుకొనిరి యిక్కరణి నెక్క టెక్కటిం బోరుసురా
సురసైన్యసమూహమ్మున ముమ్మరమ్ముగా సకలకకుమ్ముఖమ్ములం గ్రమ్ముపెనుదుమ్ములో
నెడనెడం బొడముమిడుంగుఱులు ఘోరాంధకారవిద్యోతమానఖద్యోతకీటంబు
లం బోల ఖడ్గాఖడ్గి నఱుకులాడువారును సందష్టాధరోష్ఠులై ముష్టాముష్టి గ్రుద్దు
లాడి మూర్ఛ పెల్లున రక్తప్రవాహంబున గుభుల్లునం ద్రెళ్ళునప్పుడు దాశరథిబధ్య
మానమహాశరధిమధ్యపాతితగిరిపరంపర ననుకరించువారును విలయసమయఝం
ఝాఝంపాసంపాతకంపనసమావేల్లితశాఖంబులై వేళ్ళతోన పెల్లగిల్లుసముత్తాల
సాలంబులపోలిక బాహాబాహిం బెనంగి మ్రొగ్గుచు నేల వ్రాలువారును శరాశరీ
సమరజనితోరువివరనికరపతితశరీరులై సోలి భైరవస్వర్ణకారుండు కల ననుకమ
టంబునికటంబునఁ బెట్టినకమ్మచ్చులయచ్చునం గనుపట్టువారును నైరి తదవస
రంబున సుర ససురవిసరశరనికాయజర్జరీతకాయులై విఱిగి పంతంబుల సంతఁ బెట్టి
బిరుదులు వదలి కడిమి విడిచి వాసి పెడఁబాసి మానంబు మాని గుట్టు గట్టిపెట్టి
ప్రాణరక్షణపరాయణత్వంబునం గకపికలై పఱచి మొఱవెట్టుచు బ్రహ్మకడకుం
జని తమదురవస్థ విన్నవించి రటమున్న మహిషాసురుండు పంపినదూత విద్యుత్ప్ర
భుం డనువాఁడు మందరగిరి కరిగి తదీయశిఖరోపరిగతమహానగరమధ్యవిభాసమాన

సభామంటపంబున మనోహరాకారకుమారికాసహస్రపరివృతయై పేరోలగం బున్న
వైష్ణవిం గని ప్రణమిల్లి సవినయంబుగా ని ట్లనియె.

65


క.

జననీ యే విద్యుత్ప్రభుఁ, డనువాఁడను మహిషదానవాధీశ్వరుపం
పున నీసమ్ముఖమునకుం, బనివింటిని నాదువిన్నపము వినవలయున్.

66


సీ.

ఆదిసర్గంబున నబ్జభూసుతుఁడు సంవత్సరుం డనుఋషివరుఁడు గనియెఁ
బార్శ్వాఖ్యు నాతండు పడసె గంభీరిమసింధుఁ బ్రతాపాబ్జబంధు సత్య
సంధు సింధుద్వీపచక్రవర్తి నతండు మాహిష్మతీపురి మహిమ నేలు
చుండఁ దన్మేదినీమండలాధిపరూపవిభ్రమంబులు విని విప్రజిత్తి
తనయ మాహిష్మతీకన్య మనసిజాత, కరగృహీతధనుఃప్రోతసరయపాత
శాతశరజర్జరీభూతచేత యగుచు, నాతురతఁ బొందఁ గూర్మివయస్య లపుడు.

67


క.

పాటలఁ బుష్పితపాటల, వాటులు గందంపురొంపివాటుల సరసీ
కోటులఁ జల్లనిచోటులఁ, యాటలఁ దను వడక విరహ మాటోపింపన్.

68

ద్వ్యక్షరకందము.

కాకలికాకలకలకల, కోకిలకులలీల కలులకులుకుల కలుకే
కైకోకు కేలికొలఁకుల, కోకాలీకేలి కులికి కొంకకు కలికీ.

69


మ.

ననవిల్కానిప్రతాప మెల్ల నుడుప న్మాహిష్మతీ నీదునా
థుని రాజన్యకుమారశేఖరుని సింధుద్వీపుఁ దో డ్తెత్తు మం
చు నిరాలస్యతఁ బోవుచో నతఁడు వాస్తోష్పత్యహంకారభం
జనదక్షున్ సుతుఁ గోరి కానలఁ దపస్యావృత్తిమై నుండఁగన్.

70


క.

కని మనసు చివుకు రన వ, చ్చినపని గాదయ్యె నింకఁ జెలితో మన మే
మనువార మనుచుఁ గ్రమ్మఱి, చని మాహిష్మతికి నతనిచందం బెల్లన్.

71


గీ.

తెలియఁ జెప్పి వినుము చెలియ తపస్వులఁ, జేరి విరహవార్త చెప్పఁ జనదు
దాన నేమి దప్పె దైవికంబున నీకుఁ, జేరుఁ జేరువనె మనోరథంబు.

72


చ.

అని బహుభంగులం దనవయస్యలు చెప్పినఁ త్రిప్పరానివే
దనఁ బడి విప్రజిత్తివరదానవకన్యక వారుఁ దాను గా
ననములఁ ద్రిమ్మరం దొడఁగె నాటినకామశరావలంబునన్
దినదినముం దనూలతిక నిగ్గునుఁ జెల్వము నింక నింకఁగన్.

73


క.

ఈరీతి సదారణ్యవిహారిణియై వచ్చి మందరాద్రిద్రోణిన్
గోరకితకుసుమితఫలిత, భూరుహముల నొప్పునొక్కపుణ్యాశ్రమమున్.

74


మ.

అవలోకించి వయస్యలార కడురమ్యం బైనయీతోఁటలో
న వినోదింతము గొన్నినా ళ్ళిచటఁ బెంట ల్వెట్టు నీపాపిగాం

డ్రవృధాసందడి గాసిఁ బొంద మన కేలా పాఱిపోవంగఁ జే
య వలెం బేటనపెట్టి యంచు నెనుపెంటై భీకరప్రక్రియన్.

75


సీ.

హోమగుండములపై కుఱికి కొంకరకోఱకొమ్ములఁ గోరాడుఁ గొంతతడవు
దేవపూజావితర్దికలకై లంఘించి గొరిజల నురుమాడుఁ గొంతతడవు
పసిడాలు గలవరిపచ్చలపైఁ బడి గొదగొని భక్షించుఁ గొంతతడవు
కమలాకరములపైఁ గవిసి నీరు గలంచి క్రోలుచు బుసకొట్టుఁ గొంతతడవు.
గోండ్రుగోం డ్రని గర్జించుఁ గొంతతడవు, గోరచూపులు వీక్షించుఁ గొంతతడవు
గునుకుపరువునఁ దిరుగాడుఁ గొంతతడవు, కొయ్యతనమునఁ గోపించుఁ గొంతతడవు.

76


క.

అయ్యెడఁ దాపసకన్యలు, దయ్యము గా కెనుము గాదు తథ్యం బనుచున్
బయ్యెదలు జాఱఁ బాఱఁగఁ, జయ్యన మునిపుంగవుండు శంబరుఁ డాత్మన్.

77


క.

మాయామహిషీతను దై, తేయాధిపకన్య యగుట దెలిసి పటుక్రో
ధాయత్తత శపియించెను, హాయనశత మిట్లు మహిషివై పొమ్మనుచున్.

78


ఉ.

ఈకరణిం దపస్వి శపియింప భయంపడి దైత్యకన్య ల
య్యా కడుఁగల్ల చేసె నిది యైన సహింపవలెన్ మది న్మహి
ష్యాకృతి దాల్పవచ్చునె శతాబ్దము లంచుఁ గదుష్ణబాష్పధా
రాకులనేత్రలై నిజపదాంబుజయుగ్మముమీఁద వ్రాలినన్.

79


గీ.

వినుఁడు పడుచులార వృధవోదు నామాట తనయు నొకనిఁ గన్నదాఁక నేత
దాకృతిఁ జరియించు నంతట నిజమూర్తిఁ, జెందు ననుచు నవధి చెప్పుటయును.

80


సీ.

శంబరాశ్రమవనస్థలము వెల్వడి కొన్నిదినములు మాహిష్మతీకుమారి
నర్మదాతీరకాననముల విహరించుచుండ నచ్చోట నత్యుగ్రతపము
సలుపు సింధుద్వీపజననాథుఁ డొకనాఁడు విద్యున్మతీనామవిబుధవైరి
కన్యక వస్త్రంబు గట్టక జలదంబుఁ బాసినక్రొమ్మించుపగిది మెఱసి
యెదుట జలకేళి గావింపఁ దదఖిలాంగ, ములు నిరీక్షించి గిలిగింత వోవుమనసు
నిలుపలేనికతంబున నిర్గమించెఁ, జరమధాతువు శైలనిర్ఝరము వోలె.

81


చ.

అదియుఁ దపోమయాంగభవ మైనకతంబున దివ్యసౌరభా
స్పదమును జంద్రమండలవిభాసియు నై పవనాతపంబులన్
జెదరక నిల్చె నంత మహిషీతనుధారిణి యైనవిప్రజి
త్తిదనుజకన్య తన్నికటదేశమునం జరియించుఁ గావునన్.

82


క.

పసివడి మాటికి మాటికి, వసుధాస్థలి మూరుకొనుచు వదనాంచల మా
కసమున కెత్తుచుఁ జవిగొని, యిసు మంతయుఁ జిక్కకుండ నింతయుఁ గ్రోలెన్.

83

గీ.

క్రోలి గర్భంబు వహియించి కొడుకుఁ గాంచి, యెనుపమేను దొఱంగె మాహిష్మతీకు
మారి యీరీతిఁ బుట్టినమహిషదైత్య, వల్లభుఁడు బ్రహ్మవంశవివర్ధనుండు.

84


చ.

హరిహయముఖ్యదిక్పతుల నందఱ వెంపరలాడి వారలం
బురములు వెళ్ళఁ ద్రోలి కలమూలధనంబులు కొల్లవెట్టి ని
ర్భరభుజవిక్రమస్ఫురణ రాజ్యము చేయుచు నెప్పుడున్ భవ
చ్చరణసరోజసేవనలు సల్పఁ దలంచుచు నుండుఁ గావునన్.

85


క.

మానిని యద్దానవపతి, ప్రాణేశ్వరి వగుచుఁ గాపురము చేసితివే
నానాభువనంబుల నీ, కానయు సుకరంబు చెల్లు నని పలుకుటయున్.

86


క.

పకపక నగె నవ్వైష్ణవి, వికచాననగహ్వరమున వివిధాజాండ
ప్రకరంబులు విచ్చిన శు, క్తికలో ముక్తాఫలములక్రియఁ గానఁబడన్.

87


గీ.

అట్టిమహిమఁ జూచి యాశ్చర్యభయసంభ్ర, మముల మూర్ఛఁ బొంది మహిషదూత
తెప్పిఱి వినఁ బల్కె దేవిచిత్త మెఱింగి, విజయ యనెడు పేరివేత్రహస్త.

88


క.

ఏమును నీజగదంబయుఁ గౌమారవ్రతల మిం దొకరిఁ బురుషులకున్
గామింప రాదు దానవుఁ, డా మదమున మమ్ము నడుగ నర్హుం డనినన్.

89


క.

ఈమాటకు నెదురుత్తర, మే మైనను నియ్యవలయు నే నని తలఁపం
గా మహిషదూతఁ జూచి జ, యామానిని రోషకంపితాధర యగుచున్.

90


క.

ఓరి దురాత్మక కౌమా, రారామలతోడ నీవరచుపల్లరుపుల్
సైరించితి మిఁక నూరక, నో రెత్తితి వేని మిగుల నొత్తువు సుమ్మీ.

91


మ.

అని భర్జించినఁ బుల్లసిల్లి విముఖుండై పోయె విద్యుత్ప్రభా
ఖ్యనిశాటాధముఁ డంత నారదుఁడు గయ్యం బింతటం గల్గెఁ బోఁ
గనుఁగో నా కనుచున్ సుమాళమునఁ జంకల్ వేసికొంచున్ వడిన్
వినువీథిం జనుదెంచి మ్రొక్కి నిలిచెన్ విశ్వేశ్వరీసన్నిధిన్.

92


చ.

నిలిచినఁ జూచి వైష్ణవమునీ వదనంబు చెమర్ప నిట్లు రాఁ
గలిగినకార్య మే మనుచు గండతలంబున లేఁతనవ్వుని
గ్గులు మెలవంగఁ బల్క సురకోటులు సంగరమండలంబులో
పల మహిషాఖ్యుచే విఱిగి పాఱి విరించికిఁ జెప్ప నాతఁడున్.

93


శా.

ఓసర్వేశ్వరి దృప్తుఁడై మహిషదైత్యుం డష్టదిక్పాలసే
నాసందోహముఁ దోలి నిన్నుఁ జెనకన్ సన్నద్ధుఁడై వచ్చె మా
కా సామర్థ్యము లేదు వాని గెలువంగా నీవె దిక్కంచు నా
చే సర్వంబును విన్నవించి పనిచెం జేకొమ్ము తత్ప్రార్థనల్.

94

వ.

అని చెప్పి నారదుండు సఫలమనోరథుండై గోళ్ళు నాకుచు నాకసంబున నదృ
శ్యుండై చనియె నిచ్చట మహిషాసురుండు నిజదూతకధితావమానభాషణశ్రవణ
జనితరోషదూషితస్వాంతుండై బలవంతంబున వైష్ణవిం బరిగ్రహింతు నని మందర
కందరాంతరప్రతిధ్వనదమందదుందుభిధణంధణధ్వానంబును సముద్ధురధ్వజినీ
ముఖధావద్ధయఖురస్ఫురద్ధరోద్ధూతధూళీసమూహవలాహకవలాకాయమానబిరుదకే
తనంబును రంగదుత్తుంగమతంగజఘటాభారభంగురభుజంగపుంగవఫణోత్సంగవిలో
కనవ్యాకులభోగిభీరుహాహాకారపూరితరసాతలంబునుం గా నుద్దవిడి నేతెంచుకోలా
హలం బాలకించి కించిదంకురితభ్రూభంగభీషణపాలభాగ యగునమ్మహాభాగచిత్తం
బెఱిఁగి రింగులు వాఱఁ గట్టినపట్టుపుట్టంబులు మాని మానితమణిమయార్థోరుకం
బులు ధరియించి యొడ్డాణంబులు బిగియించి మంచిక్రొమ్మించుమించువలిపకంచె
లలు మాని వజ్రకవచంబులు దొడిగి పులుకడిగినముత్తియంపుంబాపటలతోడిపిల్ల
కొప్పులు మాని జడచొళ్ళెంబులు వైచి కళాచికాచమరవాలతాలవృంతాదికంబులు
మాని వివిధాయుధంబులు పూని శాలీనకోకిలాలాపంబులు మాని దానవాసహ్య
సింహనాదంబులు సేయుచు శరన్నదులు వర్షానదు లైనకరణి మందానిలంబులు
ఝంఝానిలంబు లైనచందంబున మెఱుంగులు పిడుగు లైనతెఱంగున శృంగారమనో
హారిశరీర లైనకుమారికలు దారుణాకారలై నిజాంగరోమకూపంబులం దమవంటి
వారి ననేకకోటికుమారికలం బుట్టించుచు నిలింపరిపుసైన్యపరంపరలమీఁదం గవిసి
బారి సమరునప్పుడు వియచ్చరు లచ్చెరుపడి యీకుమారికలు కలికికన్నులచెలువం
బునన కాదు జవంబున హరిణంబుల గెలిచిరి గాని యన గొంటరిదైత్యుల నంటం
దఱుముచు నీకన్నియ లన్నువనడుములసన్నదనంబునన కాదు పరాక్రమంబు
లను హరికిశోరంబుల గెలిచిరి గాని యనఁ బ్రఖరనఖరంబుల రక్కసుల వ్రక్కలిం
చుచు నియ్యిందుముఖులు మందగమనంబునందంబునన కాదు సత్వంబునను మత్త
గజంబుల గెలిచిరి గాని యన దానవులం బట్టి చట్టలు చీరుచు నీలేమలు రోమరేఖ
లన కాదు క్రౌర్యంబునను గాలసర్పంబుల గెలిచిరి గాని యన దేవారిజీవానిలం
బులు గ్రోలుచు నెదురు లేక రణవిహారంబు సలిపెద రని ప్రశంసించి మఱియును.

95


సీ.

ఉయ్యాల లూఁగుచో డయ్యులతాంగు లీపగిది వాహనములఁ బఱపు టెట్లు
చిలుకల ముద్దాడ నలయుబింబోష్ఠు లీరీతి శంఖములు పూరించు టెట్లు
సరసయానముల వేసరుఘనశ్రోణు లీఠేవ దైత్యుల వెన్నడించు టెట్లు
నునునవ్వు నవ్వ నోపనిమృదుస్వన లిటువలె నట్టహాసము ల్సలుపు టెట్లు
నెమ్మొగంబులతావికిఁ గ్రమ్ముతేఁటి, మూఁక లీలాబ్జములఁ జోప లేక బడలు
బాలపల్లవహస్త లీభంగి పాఁడి, పట్టెసముల విమతసేనఁ గొట్టు టెట్లు.

96

చ.

అని వినుతింపఁ గన్యక లనన్యసమానభుజాపరాక్రమం
బున మహిషాసురాధిపచమూభటుల న్నఱకంగ నిల్చి న
నర్తనములు సల్పు మొండెములు వ్రాలినపుల్గుల నద్భుతంబుగాఁ
గన నికృతంబు లైనతలకాయలు క్రమ్మఱ వచ్చెనో యనన్.

97


క.

అఱిముఱిఁ గుమారికలు గొం, దఱు దానవభటులతలలు నరములతోడం
బెఱికిరి కరిణులు వెఱికెడు, తఱచుమృణాలములతోడితమ్ములఁ బోలెన్.

98


గీ.

కన్యకాకఠోరకరవాలధారలు, కంఠమూలములకుఁ గత్తరింప
రణధరిత్రిఁ ద్రెళ్ళి రాకాసితల లావ, రించె దీర్ఘనిద్ర ముంచుకొనఁగ.

99


చ.

తునిమిన వైరిమస్తములతో రుధిరార్ద్రములై విహాయసం
బున కెగయం గుమారికలమొత్తము వైచినశాతచక్రముల్
గనుఁగొన నొప్పెఁ బ్రస్ఫుటకళంకసమంచితమధ్యపూర్ణిమా
దినవిరమోదయత్తుహినదీధితిబింబవిడంబనాకృతిన్.

100


మ.

సమయజ్యోతిషికుండు వీరదనుజస్వర్యోషిదుద్వాహసం
భ్రమలగ్నంబు ఘటింపఁ బెట్టు గడియారం బి ట్లనన్ రక్తపూ
రమునం దేలెఁ గుమారికాకరధనుర్జ్యావల్లినిర్ముక్తశా
తముఖార్ధేందుశరక్షతంబు లగుతద్రక్షఃకపాలావళుల్.

101


క.

ఈరీతి నెదురు లేక కు, మారిక లుగ్రాహవమున మారిమసఁగుచో
బీరంబు విడిచి పాఱె సు, రారాతిబలంబు లెల్ల హాహా యనుచున్.

102


సీ.

అది కనుంగొని మహిషాసురుఁ డేమికారణమున మనపౌఁజు రణములోన
భగ్న మయ్యె నటంచుఁ బలుకఁ గుంజరదేహుఁ డైనయజ్ఞహరాఖ్యదానవుఁడు
దేవ యిప్పుడు కుమారీవిసరంబుచే విఱిగె నీపౌఁ జంచు విన్నవింప
నద్దిరా మదియించి రాడంగు లందఱిఁ జదియఁ గొట్టెద నంచు గద ధరించి
దేవగంధర్వకిన్నరసేవితాంఘ్రికమలయై మందరోపత్యకాస్థలమున
నిలిచి నిజకన్యకాకోటి గెలుపు చూచు, చున్నవైష్ణవిమీఁదికి నుఱికె నపుడు.

103


క.

ప్రఘనక్షోభణదుర్ముఖ, విఘనస్త్రీఘ్నాదిదైత్యవీరులు సంవ
ర్తగమనఘనాఘనఘోరా, పఘను లయోఘనధనుఃకృపాణీధరులై.

104


వ.

మిక్కిలి మొక్కలంబున దిక్కులు వగుల నార్చుచు నొక్కుమడిం గవిసినం గినిసి
తద్దేవి నిర్నిద్రరౌద్రరసోద్రేకంబునం బునఃపునర్నర్తితభృకుటిభీషణాభిరామయై
శరశరాసనడమరుముద్గరశతఘ్నీశూలకరవాలబిందివాలముసలముసుండిదండపుండరీ
కశక్తిపాశాంకుశధ్వజఘంటికాచక్రగదాకుంతభీకరంబు లయినవింశతికరంబులు ధరిం
చి విరించిప్రముఖనిఖిలదేవతావితానజయజయాలాపంబు లాదరించి సంచారించి

పంచారించిన పంచాననంబు నెక్కి ముక్కంటిం దలంప నతండుం గ్రక్కున నంది
టెక్కెంబుతోడుత ముందట నిలిచిన సవినయంబుగా బహూకరించి దేవా
సకలభూతసంహారకారి వైననీపంపున నిలింపారిపరంపరల వెంపరలాడెదం జూడ
నవధరింపు మంచు ధనుర్గుణంబు సారించి వెక్కసంబుగ నాకసంబున నాడు
రాకాసితూఁపుఁదూనీఁగలకుం దగ వాలుపవాన గురిపై నప్పు డసురవిసరకిరీటం
బులవలన రాలుహీరశకలంబులు వడగండ్లవడువున మెఱసె నీరీతి నమరారాతి
నికాయంబును నమ్మహామాయయు నేయుసాయకంబులు నిండి తోయజభవాం
డంబు సూదులక్రోవిపగిదిం గనుపట్టె శరపంజరంబునడుమ నడంగి పొడగానరాని
భానుబింబంబునకుం బతంగనామంబు సార్థం బయ్యె దేవీమతల్లికాభల్లముఖోల్లు
నంబు లైనదైతేయకేతనంబులు వారలకీర్తులు వోలె నేలం గూలి మాలిన్యంబు
వహించె నారాయణికరచక్రధారావిదారితైకోరువులై విల్లూఁతగా నిలిచిననిశా
చరవీరులు సురాంగనాపరిష్వంగసుఖంబు గోరి యేకపాదస్థులై తపంబు సలుపు
చందంబు వహించిరి మహాశక్తి శక్తిభిన్నహృదయులై నిజవాహనంబుల నిలువరింప
లేక తల్ల కెడవుగాఁ ద్రెళ్ళుయాతుధానపుంగవులు రణరంగంబునం బిల్లమెఱములు
వ్రేయు తెఱంగులు దాల్చిరి వైష్ణవి విడిచివాటు వైచినకుంతంబుతోడన రక్తసిక్త
వసుంధరం బొరలునక్తంచరులు రణభైరవవ్యాధుండు నిప్పుకలపయిం దిప్పుకఱ
కుట్లకరణిం గైకొనిరి మాధవీముసలఘాతపతద్రదనవదనులై దనుజులు దంపునప్పుడు
చెదరిపడుప్రాలతోడిమహోలూఖలంబులం బోలిరి చండికాసముద్దండపాశంబు
నం దగులువడి గింజుకొనుమనుజాశనులు పన్నినవలలం బడి తన్నుకొనుమన్ను
బోతులరీతి నుండిరి లోకమాతచేతిలవణిపెట్లచేతం జెల్లాచెద రగుపసిఁడిచిప్పల
జోళ్ళతోన గులగుల లైనశరీరంబులతోడ సోలుకీలాలపులు సంబెట నడిచిన వెడలు
మిడుంగుఱులతోడియినుపకట్లచుట్టంబు లైరి పంకజగేహిని బాహుపాశాంకుశంబు
న౦ గ్రుచ్చి యెత్తిన వేలు వేలుపుంబగ రర గిట్టి గాలంబులతోడిదొంగలభంగి నంగీక
రించిరి యివ్విధంబున నపరాభూతవిక్రమంబున నపరాశక్తి విజృంభించినం గని సం
రంభంబునం గుంభిరూపధరుం డగుయజ్ఞహరుం డనుమహాసురుండు తొండంబునఁ
జుట్టిపట్టి కొండలు రువ్వుచు నసహ్యవదనగహ్వరబృంహితంబుల గహ్వరివిహాయ
సంబులు చలియింప సముత్తాలకర్ణతాలవాతూలంబుల నూర్ధ్వలోకంబు లుఱ్ఱూఁత
లూఁగ వీఁగనిచలంబున నెదురు నడచిన.

105


మ.

ఇరువై పంబ శరంబు లేసెఁ గపటేభేంద్రంబు నాబాణముల్
కరకాండంబునఁ బుచ్చి వైచికొనఁగా గంట్లన్ సమస్తాస్రముల్

దొరుఁగం దెల్లనిమేనితోడ నొరగెన్ ఘూర్నిల్లుచున్ లోకభీ
కరజంఝానిలభజ్యమానసగవాక్షవ్రాతసౌధాకృతిన్.

106


మ.

మహిషుం డప్పుడు జన్యభూమిఁ దనకుం బ్రా పైనబల్వీరు యా
జ్ఞహరుం జంపినఁ జూచి మండిపడి దోస్తంభంబునం ద్రిప్పి దు
స్సహభంగిన్ గద వైవ దేవి నిశితాస్త్రం బేసినన్ దానిచే
మహిఁ గూలెన్ శకలంబులై గద గరుత్మల్లూనసర్పం బనన్.

107


మ.

అవలీలం బరిమార్తు నంచు వరలబ్ధాభీలచక్రంబు దా
నవుఁ డెత్తె న్వడి నేలఁ గూలె నదియున్ సర్వేశ్వరీహుంక్రియా
రవనైష్ఠుర్యమహానుభావమునఁ దద్రక్షఃకులస్త్రీజన
శ్రవణస్థాపితహేమరత్నమయపత్రభ్రంశసంసూచియై.

108


సీ.

ఈరీతిఁ బెనఁగుచో నింద్రారి వైష్ణవికఱకుటంపర చూచి వెఱచి పఱచు
పఱచి వెండియు సిగ్గు పాటించి భీకరసైరిభాకృతి దాల్చి చేర వచ్చు
వచ్చి పంచాననవాహనాహేతినిర్భగ్నుఁడై పెక్కురూపములు చూపు
పెక్కురూపములు చూపి ముహూర్తమాత్రంబు పోరాడి మాయమైపోవు మఱియు
దవులఁ బొడకట్టుఁ దన్నంటఁ దఱము నపర, చేతఁ జిక్కియుఁ జిక్కక చెంగిపోవుఁ
గాని మదిలోన గెలుపాస మానఁ డయ్యె, నెవ్వనికి మాన్పఁగా వచ్చు నెనుపమరులు.

109


ఉ.

ఈగతి వేయివత్సరము లెక్కటిఁ బోరి త్రిలోకమాత చే
తోగతరోషఖేదములతో హరి డిగ్గి త్రిశూలపాణియై
వ్రేఁగుఁజనుంగవ న్నడుము వీఁగ సతాండవకుండలప్రభా
భోగనిభాసికోమలకపోలయుగంబు చెమర్పఁగా వడిన్.

110


శా.

కంటిం గంటి నటంచు నార్చి శతశృంగక్ష్మాధరాగ్రంబునన్
వెంటాడించి కరాళకీలపటలక్ష్వేళాశ్రయార్చిశ్ఛటా
లుంటాకప్రతిఘాభరారుణదృగాలోకంబు సంధిల్లఁ గా
లంటం ద్రొక్కి లులాయదానవునివక్షోగ్రంబు శూలంబునన్.

111

కందగర్భమణిగణనికరము

డమరుకసరభసఢమఢమసమ వి, శ్రమము లయి మొరయ సమణివలయముల్
గమకపుఁజనుఁగవ గదలఁగ సమర, శ్రమ ఫలము గలుగ సరగునఁ బొడిచెన్.

112


చ.

పొడిచియుఁ గోప మాఱక నభోగతదివ్యులు పుష్పవర్షముల్
బడి గొలుపన్ భుజాకలితశాతకృపాణకఠోరధారచే

మెడ దునుమంగ జాఱె గిరిమీఁదఁ దదస్రము వానిమోహపుం
బడఁతులగుబ్బలం దొరుఁగుబాష్పపరంపరతోడఁ గూడఁగన్.

113


చ.

అతనికళేబరంబున మహాపురుషుం డొకరుండు నిర్గమిం
చి తరణిబింబడంబరవిజిత్వరదివ్యశరీరకాంతిసం
తతులు దిగంతరాళములు దారుకొనంగ విమాన మెక్కి దై
వతపురి కేగె దేవికరవాలమునన్ మృతుఁ డయ్యెఁ గావునన్.

114


చ.

అపుడు చతుర్ముఖాదికమఖాశను లందఱు నద్భుతప్రమో
దపులకితాంగులై వరుస దండము పెట్టి నుతింపఁ జొచ్చి ర
య్యపరపరాక్రమక్రమము లాగమశాస్త్రపురాణమూలభూ
త్యుపనిషదర్థగర్భితసముజ్జ్వలవైఖరి మిన్ను ముట్టఁగన్.

115


దండకము.

శ్రీమ న్మహాదేవి విద్యా యవిద్యా మహాభాగ గంభీర జంభారిముఖ్యామ
రద్రోహివాహారిదైతేయబాహాంతరస్థాసితస్థూలశూలావహేలాచలత్కింకిణీకంకణ
క్రేంక్రియారావవాచాలితాశాంతరాళా కరాళా మరాళాధిరూఢా విరూపాక్షి
యిజ్యా జగజ్జాలపూజ్యా మహోంకారచాపజ్య సర్వేశ్వరీ శుద్ధసత్వా శివా బుద్ధి
శుద్ధిప్రదా వీతశోకా ధ్రువా సువ్రతస్థా కృతస్థైర్యసిద్ధాంత దుర్ధాంతపాపావళి
ధ్వాంతవిధ్వంసనాహస్కరస్వీయదివ్యాభిధేయా మహామాయ బోధస్వరూపా
సుధాస్రావిణీ భీమసందర్శనా వేదశాస్త్రాదివిద్యామహోద్యానపద్యామయూరీ
రయోరీకృతోగ్రాహవారంభశుంభద్దశద్వంద్వదోస్తంభనారాయణీ శాంకరీ కింకరీ
భూతభూతేశ్వరా విశ్వమాతా పరిశోభితాంతర్జలా కాళరాత్రీ త్రినేత్రీ సురద్వేషి
తాటంకినీగర్భనిర్భేదిఘంటాపణాత్కారవిశ్వప్రపంచాంతసంభూతహేతూకృతో
ఛ్వాసనిశ్వాసలీలాచమత్కార నైజార్భకీభూతనీరేజగర్భాదిపీతామృతస్తన్య చైతన్య
మూర్తీ నినుం గొల్చుధన్యుల్ గదా లోకసన్మాన్యు లాకల్పకీర్తుల్ విధూతార్తు
లంభోజనాభుండు మన్నించుభక్తుల్ సముక్తుల్ మహాశక్తి యీతావకస్తోత్ర
మెవ్వారికిన్ బాఠమౌ వారికిన్ ఘోరకారాలగచ్ఛృంఖలాబంధముల్ వీడు
మోమోడు భూపాలుఁ డాలంలో వైరిసంఘంబు లోడున్ విషాంభోనలక్రూరచో
రాదిసంత్రాసముల్ లేవు దైన్యామయాపద్దశల్ రావు నీవైభవంబుల్ ప్రశంసింప
మాబోంట్ల శక్యంబె యీలీల మాపాల నెల్లప్పుడున్ గల్గి రక్షింపు మంచున్ బున
ర్వందనంబుల్ ఘటింపం బ్రసన్నాస్యయై.

116


క.

మెచ్చితి మీకోరినవర, మిచ్చెద నడుగుఁ డన దివిజు లీస్తోత్రంబుల్
నిచ్చలుఁ బఠించువారికి, నిచ్చఁ గలుగుకామితంబు లిమ్మని పలుకన్.

117

క.

అంగీకరించి వైష్ణవి, గంగాధరముఖ్యసురనికాయంబుల నం
పెం గడువేడుకఁ దా శత, శృంగనగోత్తుంగశృంగసీమన నిలిచెన్.

118


గీ.

వార్ధిరశన రెండవది యైనయీశక్తి, సంభవంబు వినిన సజ్జనులకు
నబ్బు నిక్క మపునరావృత్తిశాశ్వత, బ్రహ్మలోకసౌఖ్యపదవిభూతి.

119


చ.

విను మిఁక నీలశైలవనవీథికిఁ బోయినరౌద్రి విశ్వపా
లన మొనరింతు నే ననుతలంపునఁ బంచహుతాశిమధ్యసీ
మ నిలిచి యోగనిశ్చలసమాధిఁ దపం బొనరించె హల్లకం
బునడుమ నున్నసీధురసమోదిమదాళినిభంగి నత్తఱిన్.

120


సీ.

అబ్ధిమధ్యమున రక్తాక్షకం బనుపట్టణము రాజధానిగా నమితకోటి
దానవసేనలు తన్నుఁ గొల్వఁగ నున్నవనరుహాసనలబ్ధవరుఁడు రురుఁడు
నా నొక్కదైత్యుండు నముచిపాకపులోమబలుల మించిన భుజాబలముకలిమి
గర్వించి సర్వసుపర్వసామ్రాజ్యంబు గైకొందు నని దండు గదలఁ దలఁచి
ఘుమఘుమారంభసంరంభఘూర్ణమాన, కలిలసలిలంబుతో వార్షికడల వెడల
కాద్రవేయులకన్నులు గాతుకలఁగ, భీకరజయానకము చఱపించుటయును.

121


వ.

మహాహవసన్నాహసముత్సాహంబున వాహినీసమూహంబు లంభోధిగర్భంబు నిర్భ
రగతి వెడలునప్పుడు వెండిచిప్పలజోళ్ళతోడిపదాతులు తిమింగిలంబులభంగి
నింగికిం జౌకలించిరి యింతకాలంబునకుం దమపగ సాధింప దిక్కు గలిగె నని
రక్కసులఁ గూడి వజ్రపాణిమీఁద వచ్చు ఱెక్కలతోడికొండలరీతి సచామర
శుండాలంబులు గగనమండలి కెగసె నురుగులతోడితరంగంబులకరణి సఫేనముఖ
తురంగధట్టంబులు మిన్నుముట్టె దినముఖోదయదినకరస్యందనంబు నాందోళిత
ధ్వజపటధాళధళ్యమిషంబునం బరిహసించునరదంబు నంబరంబునకు లంఘించె
నివ్విధంబునం గటాక్షితప్రతిపక్షలక్ష్యంబు లైనమహారథలక్షలును శతకోటి
జిత్వరంబు లైనకరిఘటాకోటులును గంభీరహేషావధీరితశంఖంబు లైనహయశం
ఖంబులును వీరలక్ష్మీనివాసపద్మంబు లైనసుభటపద్మంబులుం గలదండనాయకు లనే
కులు గొల్వ నసురవరుం డగురురుండు సముద్రంబు వెడలి నిర్నిద్రపరాక్రమంబున
దాడి వెట్టినం గని దేవతలు గోపించి యెదిరించి కవిసి రప్పు డిరువాగు రణలక్ష్మి
డోల ననుకరించె నింద్రాదినిర్జరు లసురశరజర్జరితాంగులై వెఱచి పఱచువారు
ముందట నీలగిరిశృంగంబునఁ బంచాగ్నిమధ్యంబున న్నిలిచి యెలమావిచిగురుజొం
పంబులోనికోయిలవిధంబున విద్రుమకుడుంగంబునడిమితమాలవల్లికపగిది సంధ్యా
రాగాంతరాళంబునం గనుపట్టుమేఘరేఖసరణి నరుణకమలవనాభ్యంతరంబు
నున్ననీలోత్పలినితెఱంగున రురుదానవవధోచితక్రోధరసపరివృతం బైనతమో

ణంబుభంగి నప్రయాసంబునం దపంబు సలుపుచున్న కాళరాత్ర్యభిధానయు
సంహారకారిణియు నగురుద్రశక్తిం గని దగదొట్టినయెలుంగులతోడ నోజగన్మాత
ధాతవరంబునం క్రొవ్వి రురుం డనుదానవుండు మమ్ము సమరంబునం బరాజితులం
జేసి వాఁడె వెన్నాడి వచ్చుచున్నాఁడు వానిబారిం బడకుఁడ రక్షింపు మని మొఱ
పెట్టిన నద్దేవి పెద్దయెలుంగున వెఱవకుండు వెఱవకుం డని పలుకుచు నట్టహాసంబు
చేసినం దదాననగహ్వరంబున.

122


క.

ఉఱిమెడుకాదంబినిలోఁ, గఱకుఁబిడుగుగములు వెడలుగతిఁ గైదువు ల
న్మెఱుఁగులతో నుదయించిరి, జొఱజొఱ మిడుగుఱులు రాలుచూపులశక్తుల్.

123


ఉ.

వార లసంఖ్యకోటు లనివారితవిక్రమలీల వాలి పా
ధోరుహగర్భసర్గము వధూమయ మయ్యె ననంగ నిండి దే
వారిచమూసమూహముల నాజి బడల్పడఁ గొట్టి నెత్తురుల్
వారలు వట్టి రప్పుడు బలక్షయ మైన రురుండు దెంపునన్.

124


క.

హరిహయముఖసురసేనా, పరివృత మగురుద్రశక్తిపరివారముపై
సరభసరౌరవమాయా, కరసమ్మోహనమహాశుగం బేయుటయున్.

125


సీ.

సవ్యాపసవ్యముల్ శరము లేయుట మాని నెఱఁకులు విఱుగంగ నిలుగువారు
చటులతరాట్టహాసములు చేయుట మాని బెట్టుగా గుఱుకలు పెట్టువారు
శత్రులఁ దలయూఁచి జంకించుటలు మాని కూర్కుపాటులఁ దూఁగి కూలువారు
సింహనాదంబులు చెలఁగి చేయుట మాని ముంచుతంద్రల నావలించువారు
నై మహేంద్రాదిసురలు దైత్యాధినాథ, మాయ జోకొట్టె నన నిద్రవోయి కలవ
రింతు రిదె వచ్చె రురుఁ డని కొంతతడవు, కొంతదడ వాదమఱచి నిద్రింతు రపుడు.

126


మ.

కఠినక్ష్వేళలతోడ రౌద్రి జయశంఖం బొత్తినన్ జన్యభూ
లుఠదింద్రాదికదేవతాపరివృఢుల్ మోహవ్యపేతాత్మతన్
హఠసంప్రాప్తవివేకులై జయజయవ్యాహారముల్ సల్పఁగా
శఠు నద్దానవుఁ జంపె శాంభవి భుజస్తంభత్రిశూలంబునన్.

127


క.

ఆవేళ రౌద్రిశూలము, త్రావినదైతేయశోణితము ఘన మైనం
దా వాంతి చేసెనో యనఁ, గా విగళద్రక్తయుతముఖంబుల నొప్పెన్.

128


గీ.

రురునిచర్మంబు ముండంబు సరభసముగ, రెండుగాఁ జేసి రౌద్రి చాముండి యనెడు
నామధేయంబు వహియించె నాఁడు మొదలు, సకలమంత్రాగమౌఘప్రశస్తముగను.

129


సీ.

అప్పుడు దైత్యరణాయాసఖిన్నలై శాంభవిఁ బరివారశక్తు లెల్ల
నాఁకలి దీ మా కాహార మిడు మన్న మానసంబున వగ గాన లక్ష

తననాథు రుద్రునిఁ దలఁపవచ్చినఁ జూచి దేవ యీపరివారదేవతలకు
భుక్తికిఁ ద్రోవ చూపు మటన్న వారిలోఁ గొందఱితోడ నాయిందుధరుఁడు
నూత్నగృహములఁ దోఁటల నూతులం ద, టాకములఁ జేలఁ జెట్లఁ బంటల వసించి
ప్రజలు వానికిఁ బెట్టెకుబలులవలనఁ, దృప్తిఁ బొందుఁడు మీ రని తెలిపి మఱియు.

130


సీ.

పరవధూటులమైలపరిధానములు గట్టుచూలాండ్ర గొందఱు సోఁకుఁ డనియు
యంత్రమంత్రౌషధాద్యముల రక్షిత గానిబాలెంతఁ గొందఱు పట్టుఁ డనియు
నెప్పుడుఁ గలహించి యేడ్చుచుండెడుశఠస్త్రీలఁ గొందఱు ప్రవేశింపుఁ డనియు
నెడరైనచోటున నేమఱుపాటుగా శిశువులఁ గొందఱు చెందుఁ డనియు
కోరి నిలువుండు ఫుకెటింటఁ గొంద ఱనియు, నందఱికి నన్నిగతుల నాహారవిధులు
పంచిపెట్టి రణక్షోణిఁ బడినరురునిఁ, గాంచి తనశక్తిమహిమ నుతించఁ దొడఁగె.

131

మాత్రాసమకతాళము

జయజయ చాముండి వికరాళి మహాకాళి శివే సిధ్యే వేద్యే భీ
మాక్షి మహామాయి క్షుభితే కాళి కరాళి శవయానస్థే ప్రేతాసనభేదివిభీషణే భూత
భయంకరి సకలక్షేమంకరి సర్వహితే బాలే నృత్తగీతవాద్యవిలోలే కాలాపహారిణి
క్షాంతే కాంతే సర్వదేవతారాధ్యే భోధ్యే కాళరాత్రిమహితాభ్యుదయే భూతాప
హారిణి జయే పాశాంకుశహస్తే జ్వాలాముఖిఘనశృంగే తీక్ష్ణదంష్ట్రికే ఫాలలోచనే
త్రిశిఖముఖదళితరురుదనుజతనుజననసమయసముదితఖచరకరగళితసురవిటపికుసుమ
విసరపరిమిళితరుధిరమధురమధురసరసనసమదనటనపరిజనే పటుమహిమజనే.

132


క.

అని వినుతించిన శాంభవి విని మెచ్చి త్రినేత్ర వరము వేఁడుము నా నే
జనుఁ డీభవదీయస్తుతి, వినుఁ జదువును వాని కిమ్ము వివిధేప్సితముల్.

133


గీ.

ఇదియ నే వేఁడువర మని యిందుశేఖ, రుఁడు తిరోహితుఁ డయ్యె నారుద్రశక్తి
బ్రహ్మశక్రముఖామరప్రతతి పనిపి, జగము లేలుచునుండె నచ్చటనె తాను.

134


వ.

తమోగుణప్రధానయుం బరాపరాభిధానయు సంహారకారణియు నగురుద్రశక్తికి
నవకోటిభేదంబులు గలవు రజోగుణప్రధానయు లోకస్థితికారిణియు నగువిష్ణుశక్తి
కిం బదునెనిమిదికోట్లు భేదంబులు గలవు సత్త్వగుణప్రధానయుఁ బరాభిధానయు
సృష్టికారిణియు నగుబ్రహ్మశక్తికి లెక్కింపరానిభేదంబులు గలవు. వీరికి నిందఱికిని
నిన్నిరూపంబులం బతియై రుద్రుండు రమింపుచుండు వీరి నారాధించుమాంత్రికులు
రుద్రునికి నమ్మినభక్తులు బ్రాహ్మియు వైష్ణవియు రౌద్రియు ననం బరఁగినయీత్రి
కల నవసిద్ధాన్తగామినియై త్రిశక్తినామంబులును సర్వవేదాంతగామినియై జ్ఞానక్రియా
శక్తినామంబులును వహించు లోకోపకారంబుగాఁ బరమపురుషుండు మూఁడుమూ
ర్తులు దాల్చినయట్ల యేకస్వరూప యగునిమ్మహాశక్తియం మూర్తిత్రయంబు వహించె
నింతియె కాని భేదంబు లేదు మహారహస్యంబుగ నీదేవీమాహాత్మ్యం బష్టమిం గాని

135

నవమిం గాని చతుర్దశిఁ గాని కృతోపవాసుండై పఠియించి నృపాలుండు సంవత్సరం
బులోపల లబ్ధరాజ్యుం డగు నేతదుపాఖ్యానంబు వినినవారికి సకలకామితంబులు
ఫలియించు నది వ్రాసినపుస్తకంబు పూజించువారిగృహంబున ధనకనకవస్తువా
హనసమృద్ధియుం బుత్రపౌత్రాభివృద్ధియుం గలుగు నగ్నిచోరాదిబాధలు లే వని
వారాహదేవుండు చెప్పిన విని ధరిత్రీహరిణనేత్ర తరువాతివృత్తాంతం బానతిమ్మని
విన్నవించిన.

135


మ.

భవదీయోరుభుజావినిర్మితమహాభారవ్యపాయోచితో
ద్భవనిశ్వాసవితర్కదాయకగృహోద్యద్వాత గోత్రాదిమ
స్తవినిక్షిప్తసమస్తదిఙ్ముఖజయస్తంభౌఘ తుళ్వాన్వవా
యవతంసా పరిషద్రిరంసకవిసంఖ్యావత్ప్రియంభావుకా.

136


క.

ధరణినుతదేవకీపుర, వరనిలయశ్రీగిరీశవరసంపన్నే
శ్వరవిభుతనయా సాళువ, నరసింహనృపాలదండనాయకతిలకా.

137


శిఖరిణి.

వరాసేవాహేవాకిజనధరణీవాసవగవీ
కరాలోకాలోకాగ్రవిధుమణి రాకాశశియశో
భరా చాపాటోపార్జితబహుయశోపాయనపరం
పరా రంభాపుంభావసుఖరిపుసంభారవినుతా.

138

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాభి
ధాన ఘంట నాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహా
ప్రబంధంబులం దేకాదశాశ్వాసము.