వరాహపురాణము (నంది మల్లయ, ఘంట సింగయ)/ద్వాదశాశ్వాసము

శ్రీ

వరాహపురాణము

ద్వాదశాశ్వాసము

క.

శ్రీకారసదృశకర్ణ, స్వీకృతకవితాప్రవాహసితఫేనగుళు
చ్ఛాకారమౌక్తికస్వ, చ్ఛాకల్పా యీశ్వరక్షమాధిపునరసా.

1


వ.

అవధరింపు మవ్వరాహదేవుఁడు పృథివి కి ట్లనియె నట్లు రుద్రమహీమోద్ద్యోతకం
బైనశక్తిత్రయచరిత్రంబు చెప్పితి నింక సకలపాతకనివారణకారణప్రభావం బైన
రుద్రవ్రతావిర్భావంబు చెప్పెద మున్ను మూఁడవసృష్టిసమయంబున నలువ తన
వలన జనించినపింగళాక్షుండును నీలలోహితుండును నైనరుద్రునిం జూచి ముద్ర
సావేశంబున నిజస్కంధదేశంబున నిలిపి కపాలిరుద్రనగ్నకేదారసువ్రతాది
కంబు లైనభవిష్యన్నామంబులు గలుగు నానాధర్వణమంత్రంబులచేత నైదవ
ముఖంబునఁ బ్రహసించి జగద్రక్షణంబు గావింపు మనిన నీలలోహితుండు తన్ను
ననుచితం బైనకపాలినామంబునం బిలిచినకతంబున.

2


క.

కలుషించి విరించిభుజ, మ్ములు ద్రొక్కి తదూర్ధ్వశిరము పుడికెఁ గరరుహాం
చలమునఁ దరుశాఖలపై, నిలిచి ఫలము చిదుమురీతి నిర్ఘృణవృత్తిన్.

3


క.

నిష్ఠురహరవామకరాం, గుష్ఠనఖవిలూనమస్తకుం డైనసుర
జ్యేష్ఠుని నప్పుడు చూచి గ, రిష్ఠాద్భుతభయములన్ మరీచిప్రభృతుల్.

4


క.

తనువున గళమున మస్తక, మున భీకరభిన్నవర్ణములు గలయందుం
గని యెఱుఁగనివిపరీతపుఁ, దనయునిజన్మంబు తండ్రితలపై వచ్చెన్.

5


మ.

అని భాషింపఁగ స్రష్ట శిష్టచతురాస్యం బైనదేహంబుతో
ననిలక్రూరనిపాతభగ్నశిఖరంబై నాల్గుగంబాలతో
డనె కన్పెట్టెడుపైఁడిమేడవలె నుండం దత్పయోజాతగ
ర్భునిమూర్ధంబును సంతతరక్షరదసృక్పూరాతిఘోరాకృతిన్.

6

చ.

హరునఱచేతిలో మొలచినట్లు దృఢంబుగ నంటి నిల్చె ని
ర్భరగతి నాహరుండు తనపాణి విదల్చి నులిం గదల్చెఁ ద
చ్ఛిరసిజముల్ కుదించి తివిచెన్ జరణంబునఁ జుట్టి పట్టి ని
ష్ఠురగతి మేదినీస్థలిఁ బటుక్కు పటుక్కునఁ గొట్టె నప్పుడున్.

7


గీ.

ఊడి పడ కున్నఁ జూచి పయోజభవుని, తోడ నోపరమాత్మ యిందులకు నింక
నేమి చేయుదు నీపాప మేకతమునఁ, దొలఁగుఁ జెప్పు మటన్న రుద్రునకు నజుఁడు.

8


మ.

క్షితిఁ బండ్రెండుసమల్ చరింపు హిమరోచిర్భూష కాపాలిక
వ్రత మాచారయుతంబుగా నది జగత్ప్రఖ్యాతమై సాఁగు దు
ష్కృతము న్నీకుఁ దొలంగు నన్న హరుఁ డేగెన్ వే మహేంద్రాద్రికిన్
భృతచింతామణికల్పకాద్యములచే హేమాద్రికిన్ మాద్రికిన్.

9


క.

అచ్చోట బరణిమూకుడు, పుచ్చినగతి నజునిశిరముపునుక నడిమికిన్
బుచ్చె వలచేతినఖమున, వ్రచ్చి యెడమచేత సగమువ్రక్క నిలువఁగాన్.

10


క.

ఆమీఁదిప్రక్క తునుకలు, గా మొత్తి జటాంతరములఁ గట్టి తదంత
స్సీమ మణితోడ విద్యు, ద్దామశిరోజముల జన్నిదంబులు చేసెన్.

11


సీ.

ఇట్లు కాపాలికాకృతి ధరియించి సప్తద్వీపవృతధరాస్థలములోనఁ
గలుగుతీర్థము లెల్లఁ గలయంగఁ దిరుగ సంకల్పించి మొదల సాగరజలమున
స్నానంబు చేసి గంగానదిఁ గ్రుంకి సరస్వతీయమునాశరావతీక
వేరకన్యాకృష్ణవేణీవితస్థాదినానానదుల మజ్జనంబు సలిపి
రుద్రకాననకేదారభద్రవటము, లాదిగాఁ గల సకలపుణ్యస్థలములు
ద్రొక్కి చూచి గయకుఁ బోయి రుద్రపాద, ముల యథావిధి పితృపిండములు ఘటించి.

12


ఉ.

అచ్చటు వాసి వేగమున నాఱవయేట ధరిత్రిఁ గ్రుమ్మరన్
బచ్చనిపింటివానిరిపుపచ్చడమున్ రశనాకపాలమున్
గచ్చడముం దొలంగె నది గైకొన కెప్పటియట్ల తీర్థముల్
నిచ్చలుఁ జొచ్చి చొచ్చి పలునీళ్ళ మునుంగఁగ నెన్మిదేండ్లకున్.

13


క.

అంటలు గట్టుచు నొకటియు, గెంటక తల బోడి గాఁగఁ గేశము లూడన్
మింటికి నెగసెడిరవిపై, నొంటక చనుసైంహికేయు నుగ్రతఁ గూడెన్.

14


క.

అంతటఁ ద్రిలోచనుఁడు హిమ, వంతంబునఁ దిరుగుచో నవమసమఁ జలి మే
నెంతయును బగిలి మదవ, ద్దంతావళబిందుబభ్రుతాయుత మయ్యెన్.

15


క.

వెండియుఁ జతురంతమహీ, మండలమధ్యస్థతీర్థమజ్జనరతిరు
ద్రుండు చరియించె మఱి పం, డ్రెండవసంవత్సరంబు నిండెడువేళన్.

16

సీ.

డుంఠిబృంహితరవాటోపంబె కాని సంవర్తధారాధరధ్వనులు లేవు
కదళికావనవాటిఁ గదలు గాడ్పులె కాని ప్రళయప్రభంజనారభటి లేదు
గోపురసౌవర్ణకుంభకాంతులె కాని తీవ్రతక్షయాదిత్యదీప్తి లేదు
విశ్వేశమజ్జనవిమలవాఃపూరంబె కాని కల్పైకోదకంబు లేదు
క్రోశపంచకపరిమితక్షోణికలిత, మైనయేపట్టణంబున నట్టికాశి
కరిగి గంగానదీస్నాన మాచరింప, హరునిచే నుండి మహి జాఱె నజునిపునుక.

17


క.

కమలజుశిర మీకైవడిఁ, దెమలి మహిం బడినవేళఁ ద్రినయనహస్తం
బమరె నపేతమరాళా, క్రమణం బగువికచరక్తకమలముభంగిన్.

18


క.

ఈనిఖిలంబునఁ గలిగిన, ప్రాణులపాతకము సంస్మరణమాత్రమునన్
మానుపు మలహరుదురితము, మానిపె నీవారణాసిమహిమం బసదే.

19


చ.

అని సవిధస్థితుల్ పొగడి రప్పుడు బ్రహ్మ సమస్తదేవతల్
దను గొలువంగ వచ్చి హిమధామశిఖామణిఁ జూచి ఫాలలో
చన భవదీయహ స్తమున జాఱె గపాలము లోకముల్ నుతిం
ప నిచటఁ దాల్చు నీస్థలి కపాలవిమోచనతీర్థనామమున్.

20


వ.

మఱియు వినుము మొదలు నీవు కపాలపాణివై సకౌపీనంబుగా వసుంధరం బరిభ్ర
మించుట మహావ్రతం బనం బరఁగు నావెనుక నగ్నత వహించి తిరుగుట నగ్న
కాపాలికం బనం బరఁగు నందుపిదప బభ్రుత వహించుట బభ్రుకపాలికం బనం
బరఁగు నిప్పుడు గంగానదీస్నానంబున దేహశుద్ధి వహించుట శుద్ధశైవం
బనం బరఁగు బ్రహ్మహత్యకు మునుపు నీలత్వసహితుండ వగుట కైదారవ్రతం జనం
బరఁగు సకలపాపక్షయకరంబు లైనయేతన్మహావ్రతంబులకుఁ దగినశాస్త్రంబులు
మత్పురోగము లయినవేల్పుగములకు భావికాలంబున నుపదేశించి సకలలోకాచరణ
యోగ్యంబులు చేయు మని పలికి బహువిధంబులం బ్రస్తుతించి విరించి నిజలోకం
బునకుం జనియె రుద్రుండును మహేంద్రాదిబృందారకులు జయజయాలాపకోలా
హలంబులతో సుభయపార్శ్వంబుల సేవింప భావింప గోచరంబు గాని మహిమం
బున రజతాచలంబునకు విజయం చేసి చరాచరంబు లేలుచుండె మేదినీవేదరహ
స్యం బైనయీరుద్రమాహాత్మ్యంబు చెప్పితి నింక నేమి వినవలతు వడుగు మనిన.

21


మ.

అవనీకామిని ఫాలభాగమున హస్తాంభోజముల్ చేర్చి ది
వ్యవరాహాధిపుఁ జూచి దేవ మును దుర్వాసోమునిస్వామిచే
వివిధశ్రీశ్రమహత్త్వముల్ విని హిమోర్వీభృద్వరాభ్యర్ణపు
ణ్యవని న్నిల్చిననాఁటిసత్యతపుఁ డే మయ్యెం గృపం జెప్పవే.

22

సీ.

నావుడు నాకుహనావరాహుండు కాశ్యపికి ని ట్లనియె నాసత్యతపుఁడు
భృగువంశజుం డైనపృథ్వీసురుండు యౌవనవేళఁ బ్రాప్తదుర్వ్యసనుఁ డగుచు
జారుఁడై నిజకులాచారం బుడిగి పాపపరత వర్తించుచు నరుణిమౌని
కారుణ్యసంపదఁ గలిగినవిజ్ఞాన మెఱిఁగి దుర్వాసోమునీంద్రువలన
హరిచరిత్రంబు విని తుషారాద్రియుత్త, రమునకును బోయి పుష్పభద్రాతరంగి
ణీతటమునఁ జిత్రశిలాతలమున, భద్రనామకవటపాదపంబునీడ.

23


క.

కడునియతిఁ దపము చేయుచు, నడవికి నొకదినమునందు నరిగి సమిత్తుల్
కొడవంటఁ గోయునురవడిఁ, దడఁబడి తనవామహస్తతర్జని దెగినన్.

24


గీ.

కైకొనక సమిధలు తొంటికరణిఁ గోయు, చుండె ఖండితతర్జనిగుండ నెత్తు
రెముక మొదలుగ లేదయ్యె నించు కైన, భూతియె వెడలె నౌర తపోవిభూతి.

25


క.

నేలఁ బడియున్నతునుకయు, వేలం దనదానె తొంటిక్రియ నంటె నతం
డాలోన హోమసమిధలు, చాలం గోసికొని పర్ణశాలకు వచ్చెన్.

26


చ.

ఇర వగునట్టిభద్రవటవృక్షముకొమ్మలమీఁద నున్నకి
న్నరమిథునంబు నెమ్మనమునన్ గడువిస్మయ మందుచున్ మునీ
శ్వరుమహిమంబు గన్గొని దివంబున కేగి సమస్తదేవతా
పరివృతుఁ డైనయింద్రునిసభాభవనంబున నుండ నత్తఱిన్.

27


క.

బలభేది కొలువువారలఁ, గలయం బరికించి మీరు గనినవినినక్రొ
త్తలు చెప్పుఁ డనిన వినతాం, జలియై కిన్నరయుగంబు సవినయఫణితిన్.

28


గీ.

సత్యతపునివ్రేలు సమిధలతోఁ గూడఁ, దెగినవిధము భస్మ మెగయువిధము
ధరణిఁ బడ్డతునుక తనుదానె కీల్కొన్న, విధముఁ దెలియ విన్నవించుటయును.

29


ఉ.

ఇంద్రుఁడు విస్మయంబున నుపేంద్రునితో నిది చూడ నామదిన్
సాంద్రకుతూహలంబు కొనసాగుచు నున్నది పోయివత్తమ
న్నం త్రిజగద్విభుండును ఘనాఘనగర్జితఘుర్ఘురంబుతోఁ
జంద్రకళావినిర్మలవిశంకటదంష్ట్రలతో వరాహమై.

30


సీ.

తనదేహవిస్తారమున ముజ్జగము నైన నాక్రమింపదె యీమహైకలంబు
తనలావు కలిమి గోత్రమహీధరము లైన లీల నెత్తదె యీకరాళఘోణి
తనభయంకరమూర్తిఁ బెనురక్కసుల నైన వెఱపించుకొనదె యీవికటదంష్ట్రి
తనపాదహతి ఫణీంద్రఫణభాగము లైన నలియఁ ద్రొక్కదె యీమదాంధపోత్రి
యసదృశం బగుతనగతి నొసలఁ గన్ను, గలుగునంతటిబలువేఁటకానిసార
మేయముల కైనఁ బట్టీక మీటు మిగిలి, చనదె యీఘోరభూదార మనఁగ నపుడు.

31

మహాస్రగ్ధర.

తఱియున్ వేశంతముల్ ముస్తలు నమలుచుఁ బోత్రంబునం ధాత్రి గ్రొచ్చున్
మెఱుఁ గారుంగోఱఁ జిమ్మున్ మిడుఁగఱు లెగయన్ మేదినీభృద్ధృషత్తుల్
కుఱుమట్టం బైనతోఁక గొని విసరు వెసం గూలఁగా సాలపఙ్క్తుల్
పఱచున్ దాటించు దౌడల్ పయికొను సెలయున్ బల్మఱుం గల్లు పెట్టున్.

32


క.

ఈరీతిఁ గపటధరణీ, దారము చనుదెంచి సత్యతపునాశ్రమమున్
జేరి పొద సొచ్చెఁ దన్ముని, కారుణ్యముతోడఁ దన్నుఁ గనుఁగొనుచుండన్.

33


శా.

ఆవేళన్ సురవల్లభుండు మృగయుండై వెంబడిన్ రోయుచున్
దా వింటం దెగగొన్నకోల గరికర్ణన్యస్తపింఛంబు సం
భావింపం గుఱుబోడజుంజురు చలింప న్వచ్చి తన్మౌనితో
దేవా యిచ్చటి కేటువడ్డకిటి యేతెంచె న్నిరీక్షించితే.

34


క.

బడలితి నెంతయు నేనుం, బడుచులు నేఁ డెల్ల వెళ్ళఁ బడుదుము దానిం
బొడగంటివేని నీకుం, గడుపుణ్యము చూపు మనినఁ గరుణాపరతన్.

35


గీ.

పందియును వచ్చె నిచటికిఁ బ్రాణభీతిఁ, బొంది శరఘాతవేదనఁ బొంది తూలి
యెఱుకు నాఁకలిగొన్నవాఁ డేమి సేతు, ననుచు డోలాయమానుఁడై మనసులోన.

36


క.

ఒకవెరవు దోఁచుటయు లు, బ్ధక విను కనునేత్రములకుఁ బలంకంగా నా
లుక లేదు మఱి పలుకుజి, హ్వకుఁ జూడఁగ లేవు కన్ను లన హరిశక్రుల్.

37


తరళ.

అతనిసత్యము సర్వజీవదయాపరత్వము మెచ్చి దం
ష్ట్ర్రితయు భీషణభిల్లభావము డించి చక్రము వజ్రముం
బతగవాహము దంతియానము పద్మనిర్మలనేత్రముల్
శతదళేక్షణముల్ వెలుంగ నిజాలరూపులు చూపుచున్.

38


మ.

మునికంఠీరవ మెచ్చినారము వరంబుల్ వేఁడు మన్నం జనా
ర్దన సంక్రందన మీర లిద్దఱును బ్రత్యక్షత్వమున్ బొంది వ
చ్చినకంటె న్వర మింక నొండు గలదే చింతింప నట్లైన నే
జను లేతత్కథ సర్వకాలములు సంశ్లాఘింతు రవ్వారికిన్.

39


క.

నెలనాళ్ళలోనఁ జేసిన, కలుషము దొలఁగంగ వరము గరుణింపుఁడు నా
కిలలో జీవన్ముక్తియుఁ, గలుగఁగఁ జేయుఁ డన నట్ల కాకని వారున్.

40


స్రగ్ధర.

అంతర్ధిం బొంది రాసత్యతపుఁ డచట బ్రహ్మత్వసంయుక్తితో న
త్యంతశ్రీవిష్ణురక్తిం దపము సలుపుచోఁ దద్గురుస్వామి దాసో
హంతోద్దీప్తప్రభావుం డరుణిమునివరుం డబ్ధివేలాపరీతా
నంతన్ దీర్థంబు లాడ న్వలసి తిరుగుచు న్వచ్చి శీతాద్రిచెంతన్.

41

సీ.

దీనిపండులతేనెసోనలు గూడియో మాధవశయ్యాబ్ధి మధుర మయ్యె
నీరంధ్ర మగుదీనినీడనె పెరిఁగియో మలయజద్రుమవాటి పలుకఁ బాఱె
దళ మైనదీనియూడలు దూఱిపో నోపకో యినుఁ డపరాబ్ధిఁ గ్రుంకు నెపుడు
నుఱుతలు మొగడలు గఱవంగ దీనిపా లొరిఁగియో తెలు పయ్యె హరునిశైల
మనఁగ నాలుగుదిక్కులు ననలు గొనలుఁ, బాఱి విస్మయకర్మలఁ బ్రబలినట్టి
విపులశాఖలు గలిగినవిహరదబ్జ, భవరథమరాళవరటము భద్రవటము.

42


వ.

కదిసి విశంకటకోటరకటీరంబుల దాఁగురుమ్రుచ్చు లాడుకిన్నరకన్యకలమోహ
నంబు లగుతమకంబులు నేర్చుకొనెడుచిలుకలయెలుంగులు ప్రతిధ్వనులజాడ మొ
రయ నాడకాడకు నీడలం గుంపుగూడి పాడుగంధర్వబాలికలఁ ద్రాసులం దూఁచు
బంగారుప్రతిమలవిధంబున నూడలం బెనచినయుయ్యాలల నొయ్యెయ్యన తూఁగు
యక్షయువతుల నిజమధురాధరంబులం దత్ఫలంబులం గల్గునారుణ్యంబులతార
తమ్యంబుల నొండొరుల నడుగుఖచరకుమారికులం జూచి విస్మయపడుచు శేషవా
సుకిముఖ్యమహానాగంబుల ముళ్ళు వేసి చుట్టినం గాని దీని మొదలివలము కొలపెట్ట
రాదు త్రివిక్రమదేవుండు చక్క నిక్కి చూచినం గాని దీనికొనగొమ్మలు గానరావు
మహాతాండవంబు సలుపుకుండళికుండలుండు సాఁచిన సముద్దండబాహామండలం
బు గాని తక్కినవి దీనివిస్తృతశాఖానికాయంబులకు సరిగావు దీని ప్రతిబింబంబు
చూచి సుమీ లోకులు చందురునందు మఱ్ఱి గల దందురు దీనివిశాలపలాశంబులు
చూచె నే నాదినారాయణుండు నిరంతరంబు బాలకత్వంబు వహించి పవ్వడింప
వేడుక పడు దీనిదఁడ నధివసియించి శిష్యులకు నుపనిషద్రహస్యంబులు వక్కా
ణించుచు సంయములు దక్షిణామూర్తి ననుకరించుచున్నవారు పాతాళంబునకు
దిగినదీనిమూలంబులు దిగ్గజాలానలీల వహించుచున్నవి హిమవన్నగంబు దీనిక్రింద
నెండకన్ను నీడకన్ను నెఱుంగక నెమ్మది నున్నముక్తికన్యక విహరించుచంద్ర
కాంతపుటరుంగుతెఱంగున నున్నది గదా యని బహుభంగులం బ్రశంసించుచు
నెదుటఁ జిత్రశిలాతలంబున బ్రహ్మవర్చసం బొలుకులువాఱ నతినియతిం దపంబు
సలుపుచున్న సత్యతపునిఁ గని తాను మున్ను దేవికాతటంబున మాశకటంభకయ
యనుమంత్రం బుపదేశించిన శబరుండు తపోమహత్త్వంబునఁ గల్మషంబులఁ దొఱంగి
జీవన్ముక్తుం డగుట యెఱింగి సంతసించుచు నతనిచేత నభ్యుద్ధానప్రణామార్ఘ్యపా
ద్యగోదానాదిపూజలు వడసి కుశాసనాసీనుండై.

43


సీ.

తనశిష్యువదనంబు తప్పక వీక్షించి మామీఁదిభక్తిసంపత్తి యెపుడు
వదలక నాస్తితత్వం గురోః పర మను తెలివి నీవు దపంబు సలుప యాదృ

శీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశీ యనువాక్యంబు సిద్ధ మయ్యె
నిట్టినీదృఢభక్తి యెఱుఁగక నాటికి నేటిదో యొకపాటిమాట చెప్పి
నార మింతియ కుండమంటపవిధాన, సాంగపద్ధతి దీక్ష చేయంగ లేదు
తత్ప్రకారంబు విను సావధానబుద్ధి, నెవ్వరికి నైన నుపదేశ మియ్యరాదు.

44


క.

ఒకయేఁడు జాతిశౌచా, దికములు శోధించి భక్తి దృఢ మౌట యెఱిం
గి కరుణ భూసురనృపవైశ్య, కులుల కుపదేశ మిచ్చు టర్హం బగుటన్.


సీ.

శిష్యుండు వత్సరసేవచే సంతుష్టుఁ డైనదేశికునిపాదాబ్జములకు
మ్రొక్కి నా కైహికాముష్మికసౌఖ్యప్రదాయిమంత్రముఁ గృపచేయవలయు
నని పల్క దేశికుండును నర్పడము చూచి కార్తికశుక్లపక్షమున ద్వాద
శీదినంబునను బ్రసిద్ధలగ్నంబున హరిమందిరంబులో నలికి మ్రుగ్గు
మొదలుగాఁ గలశృంగారములు రచించి, యష్టదళ మైన నవనాభ మైన షోడ
శార మైన లిఖించి తదంతరమున, విష్ణుదేవుని శాస్త్రోక్తవిధి యజించి.

46


చ.

కనుఁగవ ధౌతవస్త్రములు గట్టినశిష్యులఁ బుష్పహస్తులం
దననికటంబున న్నిలిపి ద్రవ్యము లంటినకీడుమేలునున్
గని మఱి మంత్ర మీవలయుఁ గావున నీవును నట్ల చేయు మం
చు నరుణిమౌని సూనృతవచోనిధి సత్యతపోమునీశ్వరున్.

47


క.

పలికిన నాతఁడు విహితాంజలియై గురునాథ యిమ్ము శాస్త్రోక్తవిధం
బుల నుపదేశము నాకన, ఫలకుసుమసమేతమంటపమున నరుణియున్.

48


వ.

సత్యతపోమునికి శాస్త్రోక్తప్రకారంబున శ్రీమదష్టాక్షరీమంత్రం బుపదేశించి మహా
నుభావా తొల్లియు నీవు కృతార్థుండవు విశేషించియు నిప్పుడు దీక్షామంటప
మధ్యంబున ధౌతవస్త్రపరిష్ఛన్నలోచనుండవై శుభద్రవ్యసంస్పర్శనంబు గావిం
చితివి గావునఁ దపస్సిద్ధుండవై బ్రహ్మభూయంబు నిదె పొందెదవు మన కిద్దఱకు
విష్ణుసాయుజ్యంబుఁ బొంద నిదియ మంచిసమయం బని తాను నతండును నిశ్చల
ధ్యాననిమీలితాక్షులై సాక్షాత్కరించిననారాయణుం గలసిరి యేతదుపాఖ్యానంబు
వినిన వినిపించినశుద్ధాత్ములకు గయాశ్రాద్ధఫలంబు సిద్ధించు వసుంధరా యింక
మానవులకు నిహలోకంబున రోగదారిద్య్రాదిదోషంబులు దొలఁగి సంతతారో
గ్యసంపత్తి పుత్రపౌత్రాభివృద్ధి దొరకువిధంబు చెప్పెద వినుము కార్తికశుక్ల
పక్షద్వాదశిం గాని సంక్రమణసోమసూర్యగ్రహణాదిపుణ్యకాలంబులం గాని శృం
గారితమంటపాభ్యాంతరంబున నెనిమిదిఱేకులపద్మంబు వ్రాసి యెనిమిదివిదళం
బుల నెనిమిదికలశంబుల నడుమ నొక్కకలశంబును యథావిధానంబున నిలిపి
నడిమికలశంబుమీఁద లక్ష్మీసమేతవామభాగు నారాయణుని నిలిపి షోడశోపచా

రంబులు సలిపి యింద్రయమవరుణకుబేరదిగ్దళంబుల భద్రప్రద్యుమ్నానిరుద్ధవాసు
దేవుల నర్చించి యీశానాగ్నినిఋతివాయుదిగ్దళంబుల శంఖచక్రగదాపద్మంబుల
యథాక్రమంబున నర్చించి మఱియు నీశానభాగంబున ముసలంబును దక్షిణభా
గంబున గరుడునిం బూజించి శరశరాసనకృపాణశ్రీవత్సకౌస్తుభంబులు దేవునిపురో
భాగంబునం బూజించి వైష్ణవకలశంబున ముక్తికాముని నైంద్రకలశంబున సంతత
శ్రీకాముని నాగ్నేయకలశంబునఁ బ్రతాపకాముని యామ్యకలశంబున మృత్యుం
జయకాముని నైఋతికలశంబున దుష్టప్రధ్వంసకాముని వారుణకలశంబున శాంతి
కాముని వాయుకలశంబునఁ గల్మషనాశకాముని గౌబేరకలశంబున సంపత్తికాముని
నైశానకలశంబున సుజ్ఞానకామునిఁ దత్తన్మంత్రంబులతో నభిషేకంబు సలిపిన వారి
వారికోరికలు సిద్ధించు నింక నవకలశంబుల నభిషిక్తు డైనధన్యుం డిహలోకంబున
విష్ణుసదృశుండై సకలసామ్రాజ్యసౌఖ్యంబు లనుభవించు నివ్విధంబున మదుక్త
ప్రకారంబున శోషణదాహనప్లావనంబులఁ దత్త్వశోధనంబున నోన్నమోభగవతే
విష్ణవేస్వాహా యనుమంత్రంబునం జేసినహోమంబున విష్ణుసూక్తంబు చెప్పుచు
శంఖోదకంబునం జేయునభిషేకంబున గురునిచేత దీక్షితుం డైనసమయం బెఱింగి
గురువుల హ స్త్యశ్వరథగ్రామభూషణాదికంబుల యథాశక్తి సంభావించి దక్షిణా
యుక్తంబుగా బ్రాహ్మణులకు భోజనంబు పెట్టి సాత్వికుండై సకలదేవబ్రాహ్మణవేద
నిందలం దొలఁగి వర్తించుపుణ్యులమాహాత్మ్యంబు చెప్ప నశక్యంబు వైష్ణవదీక్ష
గైకొని యెవ్వరేని యేతద్వతాచరణప్రకారంబు విందురు వారికి సంక్రమణగ్ర
హణవిష్ణువాసరాదిపుణ్యకాలంబుల దేవహ్రదకురుక్షేత్రపుష్కరవారాణాస్యాది
పుణ్యతీర్థంబుల వేదపారాయణంబు చేసినఫలంబు సిద్ధించు దేవతలును భారతవర్షం
బున జనించి వైష్ణవదీక్ష వడసి వారాహంబు విని కార్తికమాసంబునఁ జేయు
వారాహయాగంబు చూడ నెన్నఁడు గలుగునో యని కోరుచుందురు విశ్వంభరా
యేతత్ప్రకారం బెఱింగి మదుక్తసర్వాభీష్టప్రదలక్ష్మీనారాయణమండలంబు చూచిన
మానవుండు రెండవవిష్ణుం డగు నింక నేమి వినవలతు వడుగు మనిన.

49


శా.

స్వామీ మున్ను సరోరుహాసనతనూసంభూతగాయత్రి వే
త్రామర్త్యారి వధించి నంద యనునాఖ్యం జెంది తద్బ్రహ్మచే
భీమాజిస్థలి భావివేళ మహిషు న్వేధించి సర్వామర
స్తోమత్రాసము మాన్పఁ బంపువడి మంచుంగొండపై నున్నతిన్.

50


క.

నిలిచె నటంటివి యిప్పుడు, జలజాక్షునిశక్తి మహిషుఁ జంపెను సమర
స్థలి నంటివి యీమర్మము, తెలుపుము నా కన వరాహదేవుఁడు ధరతోన్.

51

క.

తన్వీ విను సింధుద్వీ, పాన్వయజుఁడు మహిషదానవాగ్రణి దోర్డ
ర్పాన్వీతుఁడు స్వాయంభువ, మన్వంతరవేళ విష్ణుమాయాహతుఁడై.

52


క.

ధర వైవస్వతమన్వం, తరమున వెండియును బట్టి నందాశక్తిన్
దురమున వింధ్యక్షోణీ, ధరసీమ నెదిర్చి చచ్చెఁ దచ్ఛూలమునన్.

53


గీ.

జ్ఞానశక్తి యనఁగ సావిత్రి యనఁగ వై, ష్ణవి యనంగ వివిధనామకముల
నున్నమాయలీల లెన్నంగ రా దర్ణ, వములయిసుక యెన్నవచ్చుఁ గాని.

54


సీ.

వసుధా నవగ్రహవ్రతములు విను మింక సంయుక్తహస్తనక్షత్ర మైన
భానువారంబునఁ బ్రారంభ మొనరించి క్రమమున భానువారంబు లేడు
నక్తంబు నియతితో నడపి యేడవవారమున యథాశక్తి జాంబూనదమున
రవిఁ జేసి రక్తవస్త్రద్వయంబును జుట్టి నేత మజ్జన మార్చి నిష్ఠఁ బూజ
చేసి గొడుగును బావాలుఁ జేలమును వి, భూషణంబులు మొదలుగా భూసురునకు
నిచ్చి బ్రాహ్మణభోజనం బిడినసువ్ర, తునకు నారోగ్యసంపదల్ దొరకు నెపుడు.

55


వ.

చిత్తానక్షత్రసహితం బైనసోమవారంబు మొదలుకొని యెనిమిదిసోమవారంబులు
పాయసంబున నక్తంబు సలిపి యెనిమిదవసోమవారంబున నోపినపాటి వెండి నిందు
మండలంబు చేసి ధవళవస్త్రయుగంబునం బొదిగి కాంస్యభాజనంబున నిలిపి పాదు
కాతపత్రదక్షిణాసహితంబుగా విప్రపుంగవునకు నొసంగి బ్రాహ్మణభోజనంబు పెట్టిన
సువ్రతులు కాంతిమంతు లగుదురు స్వాతినక్షత్రసహితం బైనభౌమవారంబు మొ
దలుకొని తొమ్మిదిభౌమవారంబులు నక్తంబులు సలిపి కడపటివారంబున యథాశక్తి
సువర్ణంబున నంగారకప్రతిమం జేసి రక్తవస్త్రద్వయంబునం బొదిగి తామ్రభాజ
నంబున నిలిపి దక్షిణాలంకారపాదుకాఛత్రసహితంబుగా భూసురున కిచ్చి బ్రా
హ్మణభోజనంబు పెట్టినధన్యులకు సకలశుభంబులు గలుగు నిట్ల నక్షత్రానుక్రమం
బునం దక్కినగ్రహంబుల వారంబు లేకోత్తరవృద్ధిగా నక్తంబులు సలిపి తత్తద్గ్ర
హోచితవర్ణలోహవస్త్రాదికంబుల నుద్యాపనంబు చేయుననవద్యులకు నవగ్రహాను
కూల్యంబు నాయురారోగ్యైశ్వర్యాభివృద్ధులుం గలుగు నీనవగ్రహకల్పంబు వినిన
వారికి నిష్టఫలంబులు గలుగునని చెప్పిన విని ధరిత్రి కపటపోత్రి నాలోకించి.

56


గీ.

దేవ మున్ను నీవు దెలిపినద్వాదశీ, వ్రతము పూని చేయ వర్షసాధ్య
మది నిరంతరాయమై సాగు టరిది త, త్ఫలము సులభవృత్తిఁ గలుగువ్రతము.

57


ఉ.

ఆనతి యి మ్మటన్న వసుధా వినిపించెద నీకు నే నుపా
ఖ్యానము ము న్నిలావృతసమాహ్వయవర్షవిభుండు శ్వేతుఁ డం
భోనిధిమేఖలావలయముద్రితసర్వవసుంధరానృపా
స్థాననమస్కృతస్వభుజశాసనుఁడై జగ మెల్ల నేలుచున్.

58

సీ.

తనపురోహితు వశిష్ఠునిఁ జూచి మునికులోత్తమ సహస్రాశ్వమేధములు చేయ
వలె విప్రులకు నన్నజలదాన మొసఁగుట యెందులోనిది యింక హేమకాంస్య
రత్నభూషాంబరగ్రామగజశ్వాదు లొసఁగుదు విరహితాన్నోదకముగ
నని లిఖితాత్మశాసనహేమపట్టికాసహితఫాలము లైనజవనహరుల
వరుస విడిపించె నవియు దుర్వాసలీల, వారణతురంగరథభటవాహినీప
రంపరలు వెంట రాఁ జొరరానిచోటు, లెల్లఁ జొచ్చి చరించె మహీస్థలమున.

59


చ.

హరిదవధిక్షమారమణు లాతురగాళినుదుళ్ళపట్టముల్
తరువులరాయసంబులవిధంబునఁ గన్గొని శ్వేతమానవే
శ్వరునకుఁ దెచ్చి యిచ్చినసువస్తుపరంపర లెక్కఁ గూడు పె
న్వెరసులరీతిఁ దత్సవనవీతిఖురాంకము లుండు నుర్వరన్.

60


సీ.

ఆజ్యవేదన కోర్వ కనలుండు జలధిలో బాడబాకృతి దాల్చి నేఁడు నుండు
మందాగ్నిదోషంబు మానుటకై సదా వ్యాయామ మొనరింతు రర్కవిధులు
కరిముఖుం డెప్పుడు కడుపుబ్బు డిగ్గనికతన లంబోదరాఖ్యాకుఁ డయ్యె
నఱగమి పుట్టి యింద్రాది దేవతలకు నెన్నఁడు వంటకం బింపు గాదు
శ్వేతభూతలభర్త వశిష్ఠముని పు, రోధగాఁ జేసినతురంగమేధమఖస
హస్రములఁ గల్గుకమ్మనిహవ్యతతులు, మీటు మిగులంగ మెసఁగిననాఁటనుండి.

61


ఉ.

శ్వేతుఁడు నశ్వమేధములు వే యొనరించి సమస్తభూతధా
త్రీతల మెల్ల నేలి తనతేజముఁ గీర్తియు నుష్ణభానుజై
వాతృకు లట్టు సంతతము వర్తిలఁ జేసినపిమ్మటన్ బలా
రాతియుఁ బోలె నాకనగరస్థితి గైకొని పుణ్యసంపదన్.

62


క.

తుంబురునారదమునిగీ, తంబులు రంభోర్వశీఘృతాచీకృతనా
ట్యంబులు సిద్ధతపస్విక, దంబస్తోత్రములు సమ్మదం బొనరింపన్.

63


గీ.

వివిధమహిమ లనుభవించుచు నుండియు, మండుజఠరవహ్ని మాన్పరాని
దప్పితోడఁ గూడి నొప్పింపఁ గన్నులు, మేను దిమ్మదిరిగి మిడికిపడుచు.

64


ఉ.

ఆలలనావతంసముల నమ్మునులం గని జాఠరానల
క్ష్వేళభరంబు నేత్రములఁ జీఁకటి గొల్పఁగ నాట లేల యీ
యాలకు లేటికిం జెవుల నంతకు పల్కులు పోవ నిన్నియుం
జాలును దుఃఖితే మనసి సర్వ మసహ్య మటం టెఱుంగరే.

65


సీ.

అని పల్కి శ్వేతభూపాగ్రగణ్యుఁడు శ్వేతధరణీధరంబున కరిగి తనదు
బొంది ము న్నాకొండపొంత ఖండించినచోటిశల్యము లతిక్షుద్భరమున

నమలె క్షుధాతురాణాం నరుచి ర్నయోగ్య మటన్న పలుకు తథ్యంబు గాఁగ
నపుడు వశిష్ఠసంయమి వచ్చి ధర్మాత్మ కటకటా స్వాస్థిభక్షణము నీకు
నుచితమే యన్న నేమి చేయుదు మునీంద్ర, యిన్నినీ ళ్ళైన వంటకం బించు కైనఁ
దొల్లి దానంబు చేయనిదుష్కృతమున, నిర్భరక్షుత్పిపాసలు నిలువ వనిన.

66


క.

ఇత్తఱి నేమనఁ గలదు నృ, పోత్తమ ము న్నన్నదాన మొనరింపవు నా
దత్త ముపతిష్ఠ తని వి, ద్వత్తిలకము లాడుకొనెడువాక్యము వినవే.

67


వ.

రత్నహేమాదిదానంబు చేసినవార లవియ కలవా రగుదురు సకలప్రాణిసంతర్పణం
బగునన్నదానంబు చేసినవారలకు నన్నిదానంబులం జేసినఫలంబులు గలవు తాదృశ
ప్రభాసంపన్నం బగునన్నదానంబు నీవు చేయ నెఱుంగ వైతి వనిన భట్టారకా నాకు
నాఁడు పట్టినధనగర్వం బట్టిది యిట్టిదురవస్థ యెట్టు దొలఁగు మున్ను పెట్టని
జలాన్నంబులఫలంబు లిప్పుడు నాకుం గలుగునుపాయంబు చేయ నవధరింపు
మనిన భూవరా నీవలెనే తొలి సునీతుం డనుమహారాజు నర్వమేధాధ్వరంబులు
సలుపుచు నన్నదానవిరహితంబుగా విప్రులకు సకలదానంబు లొసంగి శరీరావ
సానంబున నాకలోకభోగంబు లనుభవింపుచుండియు నాఁకట నన్నంబున కేఁకట
పడి సకలలోకంబులం బరిభ్రమింపుచు నిజకళేబరంబు దహించినమాయాపురిపరి
సరంబున భృగుమహామునిం గని విషయంబునఁ దనవృత్తాంతంబు విన్నవించిన
నమ్మహానుభావుండు సునీతు నవలోకించి నీకు నేతద్దౌస్థిత్యనివారణకారణం బగు
నొక్కమహావ్రతంబు చెప్పెద వినుము కార్తీకమాసంబునం గాని మార్గశిరమాసం
బునం గాని శుక్లపక్షదశమి నేకభుక్తిసంకల్పంబు లొనరించి యేకాదశినాఁ డుపవ
సించి నాఁటిరాత్రి శృంగారితమంటపాంతరఁబున ధరణీవ్రతంబుచందంబున నా
లుగువంకల నాలుగుకలశంబులు నిలిపి తన్యధ్యంబున బ్రహ్మవిష్ణుమహేశలోకపా
లాదిదేవతలను సర్వౌషధీరసాన్వితభూచక్రంబును వహించినకాంచనవిరచితబ్ర
హ్మాండభాండంబును నిలిపి తదుపరిస్థలంబున నారాయణు భావించి కార్తికోక్తమం
త్రంబులం గాని మార్గశీర్షోక్తమంత్రంబులం గాని పాదాదికేశాంతంబును గేశాదిపా
దాంతంబును గాఁ బూజించి జాగరణంబు గావించి ద్వాదశినాఁడు సూర్యోదయా
వసరంబున వేదవేదాంగపారంగతు లైనవిప్రపుంగవులు నలువురకు నాల్గుకలశం
బులు దానంబు చేసి నడిమి బ్రహ్మాండకలశంబు కుటుంబియు శాంతుండును నేత
త్కథావిధిజ్ఞుండు నగు నాచార్యునకు సాంగంబుగా సమర్పించినధన్యు లనేక
యుగంబులు విష్ణులోకంబున సుఖం బుండి ముక్తికాములు ముక్తు లగుదురు భుక్తి
కాములు భూమిం జనియించి సకలసామ్రాజ్యసుఖంబు లనుభవించి పిదప ముక్తు
లగుదురు.

68

క.

కావున నేతద్దానము, నీవునుఁ గావింపు మనసు నిగుడుదు వన భూ
షావితతులు గరఁగించిన, సౌవర్ణముచేత నంబుజభవాండంబున్.

69


క.

చేయించి భృగున కిచ్చెను మాయాపురిలోన శ్వేతమహివర నీవుం
జేయు మనఁ జేసి తా ని, శ్రేయససౌఖ్యములు గనియె శ్రీహరికరుణన్.

70


క.

ధరణీహరిణీనేత్రా, ధరణీవ్రతసదృశ మైనదానం బిది శ్రీ
హరిభక్తులకుం గాని యి, తరులకు సిద్ధింప దెవ్విధంబున నైనన్.

71


సీ.

ధుతసర్వపాపసందోహ మీవారాహ మాదినారాయణుం డానతిచ్చెఁ
గమలసంభవున కాకమలసంభవుఁడును దనపుత్రునకుఁ బులస్త్యునకుఁ జెప్పె
నాపులస్త్యమునీశ్వరాగ్రణివలన భార్గవరాముఁ డెఱిఁగె నారాముఁ డాత్మ
శిష్యుఁ డుగ్రునకు వచించె నయ్యుగ్రుండు మనువున కిచ్చెఁ గ్రమమునఁ బూర్వ
కల్పకథ యిది యిప్పటికల్పవేళ, వింటి సర్వజ్ఞుచే నేను విశదముగ మ
హీసతీ నీకుఁ దెల్పితి నింక మీఁదఁ, గపిలముఖ్యమునీంద్రులు దపము చేసి.

72


క.

నీచేఁ దా రాద్యంతము, నేచుకొనంగలరు వరుస నిఖిలపురాణ
ప్రాచుర్యకరణలీలా, వాచాలుఁడు వ్యాసుఁ డెఱుఁగు వారలవలనన్.

73


గీ.

అతని ప్రియశిష్యుఁ డగురోమహర్షణుండు, సత్రయాగాంతరంబున శౌనకాదు
లకు సమస్తంబుఁ జెప్పఁగలఁడు పరాశరసుతుఁ డష్టాదశపురాణరచనకర్త.

74


వ.

దురితశరనివారణవజ్రతనుత్రాణంబును రసవదద్భుతవివిధకథాసుధాధురీణంబును
నారాయణభక్తిశరీరప్రాణంబును బోధరత్నోత్తేజనశాణంబును జనితసకలకల్యా
ణంబును నైనయీవారాహపురాణంబు కార్తికమాసాదిపుణ్యకాలంబులందు నియ
మంబుతోడ భక్తియుక్తంబుగా వినినవారికి వాజపేయాశ్వమేధాదియాగంబులును
గంగాదికపుణ్యతీర్థస్నానంబును హిరణ్యగర్భతులాపురుషాదిమహాదానంబులును
జేసినఫలంబును నాయురారోగ్యైశ్వర్యంబులును విష్ణుసాయుజ్యంబును గలుగు
నీపురాణంబు శబ్దార్ధరసభావబంధురంబుగా వినిపించువక్త మాతృపితృవంశ్యుల
నిరువదియొక్కతరంబువారి నుద్దరించి పరాశరాత్మజునిచందంబున సకలలోకమా
న్యత వహించి యిహంబున దైన్యవిరహితజీవనుండై సకలవిద్యాసంపత్తి నెదురు
లేక మెలంగి పునరావృత్తిరహితశాశ్వతబ్రహ్మలోకసౌఖ్యంబు లనుభవించు నట్టి
వాచకులవలన వినినట్టివారలు వాచకునకు గజతురగగ్రామచిత్రాంబరఛత్రచామ
రాందోళికాదు లొసంగవలయు నశక్తులు విత్తశాఠ్యంబు చేయక పూజింపవలయు
నిట్లు చేయక లోభంబునం గాని గర్వంబునం గాని వాచకు ననాదరణంబు చేసిన
దురాత్మకు లేడుజన్మంబులదాఁక మూకలు వెఱ్ఱులు నై పుట్టుదురు వాచకునిఁ బూ

జించుధన్యులగృహంబునందు లక్ష్మీనారాయణుండు సుప్రతిష్ఠుండై యుండు
నని వరాహదేవుండు ధరావరారోహ కానతిచ్చె.

75


మ.

నరకంఠీరవ చండబాహుబలశుండానాళికాశీకర
స్ఫురణాష్టద్విపసార్వభౌమతుహినాంభోభస్త్రికాధారవ
ద్దరదీశానసదానుభూతభువనద్వ్యాప్తా ప్రతాపోష్మసం
భర ధాత్రీసురకారితాధ్వరహవిర్మాద్యద్దివౌకస్తుతా.

76


క.

రామానుతతనుమారా, తామరసాతతకరాకతతసారమతా
శ్రీమహిమహమహిమ శ్రీ, రామసమసరాగసాగరాసమసమరా.

77


జాతివృత్తహరిణి.

తరుణహరిణీనేత్రాచేతోజ దానధురంధరా
నిరుపమకళావైయాత్యాస్థాన నీతియుగంధరా
నిరతవిసరద్దానస్రోతస్వినీతనుజార్పణా
దరణచతురంతోదన్వత్కూకుదోద్బలసింధురా.

78

గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వరప్రసాదలబ్ధసారసారస్వతాభినంది
నంది సింగయామాత్యపుత్ర మల్లమనీషిమల్ల మలయమారుతాఖి
ధాన ఘంట నాగయప్రధానతనయ సింగయకవిపుంగవ
ప్రణీతం బైనశ్రీవరాహపురాణం బనుమహాప్రబం
ధంబున సర్వంబును ద్వాదశాశ్వాసము.
————
సంపూర్ణము