వదరుబోతు/హాస్యకళ
హాస్యకళ
సందు గొందులలో వినఁబడు నపవాద ములను సరకుసేయక మరల వీధులలో నెప్పటియట్లే. మీసాలు దువ్వుచుండుట నేఁటి మహాపురుషుల లక్షణము. మొగమెదురుగ నీయం దీలోపమున్న దని వచించునంతటి దుర్ముఖులును, నేఁడరుదు. ఎదుటఁ బొగడుట, మఱుఁగున నేదో యున్న దానినో లేనిదానినో యూఁతఁ జేసికొని తెగడుట. యిప్పటి సదాచారము. పుట్టిన తరువాత గిట్టు లోపలఁ గొందఱభినందించినను మఱికొందఱిచేనైన నపవాదపడక తప్పదు. మా 'వదరుఁబోతు' ఇప్పుడే పుట్టియున్నను ఇంతలోనే దానికి నపవాద మొకటి రాక తప్పినదిగాదు అదియు సందు గొం- దులలో వినఁబడునదే యైనను, మేము మహా పురుషులముగాము గావున దానిని సరుకుచేయుట యొక యవలక్షణము గాదనుకొనెదము.
అపవాదము రెండు దెఱఁగులు, మిథ్యాప వాడము సత్యాపవాదమునని. అందు (1) ఉన్న దానిని లేదనుట (2) లేనిదాని నున్నదనుట యని మొదటిది ద్వివిధము. (1) ఉన్న దాని నున్నదనుట (2) లేనిదానిని లేదనుటయని రెండవదియు రెండు దెఱఁగులు. ఉదారహృదయులగు మాచదువరులు ద్వివిధమిథ్యాప వాదములనుగాని మొదటి సత్యాప వాడమునుగాని మాపై మోపలేదు. లేనిదానినే లేదన్నారు. అదియుఁబూర్తిగ లేనిదిగాదు. లేని దానివలెఁ గానవచ్చునది. 'వదరుఁబోతు సర్వ విధములఁ జక్కఁగ నున్నదిగాని యొకటిమాత్రము · తక్కున' అదేమనఁగా 'హాస్యము'!
ఒకకథ యీసందర్భమున స్మరణకు వచ్చు చున్నది. త్రేతాయుగమున రామచంద్రుఁడు లం కను జయించి మరల విమానమున సీతాదేవితోడ సయోధ్యఁ జేరవచ్చుచుండెను. అతని యాగమన మును తొలుతనే హనుమంతుని మూలమున విని, యంతకుమున్ను తాము పలుమాఱు వినియున్న సీతాసౌందర్యమును బరీక్షించుటకై తార, రుమ మొదలగు వానర నాయికలు కుతూహలమున మాల్యవంతపు శిఖరముపై వేచియుండిరి. వానర సేనతోడ సీతారాములును వచ్చిరి. కుశలప్రశ్నాది సమయమున సీత నాపాదమస్తకము సూక్ష్మదృ- ష్టితోఁ బరీక్షించి తార, తుదకు 'అయ్యోపాపము' అని వగచెను. తక్కిన చెలికత్తియలు కారణ మడుగఁగా "చూచితిరా! దేహము బంగారువన్నె; కన్నులు విశాలములు; ఎత్తయిన నాసిక; రోమ రహితములైన యంగములు! ఆ సౌందర్యవతిఁ బడయుటకు భర్త యెంతో పుణ్యము చేసియుండ వలయును. నిజమే, కాని సీతకు మనవలె కుఱు- చగనో గొప్పగనో తోఁకయొకటి యున్న నెంత బాగుగా నుండియుండును! అన్ని లక్షణములును ఒకచో నుండవుగదా! యని పలికెనఁట!
ప్రకృతము "మేము సంపాదించుకొన్న యవ వాదము నిట్టిదే. వదరుఁబోతు ప్రకాశమునకు వచ్చుటకేది యుద్దేశమో దానికిని హాస్యమునకును, సౌందర్యమునకును తోఁకకునుగలయంత దూరము లేకున్నను, గొంతమైన దూరముగలదు. చర్చింపఁ దగ్గినవానిని చర్చించుట, ఖండింపఁదగిన వానిని ఖండించుట, పొగడఁదగువానిని బొగడుట, తన్మూ- లమున విషయములఁ గూర్చి మాయొక్కయు సా- మాన్యులకు చదువరులయొక్కయు భావనాపథ మును విశాలముగా నొనర్చుట, ఇత్యాదులు మా యుద్దేశములు. ఇవి మా ప్రయత్నములని వచిం- చెదముగాని ఫలములని వచింపము. మాపత్రిక నందుకొని నెమ్మదిగా నిదానముగా చదువుకొని 'ఫరవాలేదు' అని యభినందించుట మాకుఁజాలు- ను; కాని రాకమునుపే యెదురుచూచుచుండి వచ్చిన తోడనే గడ గడమని కార్యకారణ భావ ములను గమనింపక యొక్క గ్రుక్కగాఁ జదువు కొని పక్కుమని పదిమాఱులు నవ్వి, తరువాత నదేకాగితమునే మేజాపైని మైలఁ దుడుచుట కుప యోగించువారి కొఱకు మా ప్రయత్నముగాదు. అనఁగా హాస్యరసమునే సంపూర్ణముగ వదలుట మాయుద్దేశముగాదు. ఒకరిని నవ్వింపఁ బయ- త్నించుట మనుష్యజాతి సహజములగు లక్షణ ములలో నొకటి. కావున దానిని మేమును వదలలేము. మఱియుఁ గొంత దుర్గ్రహమైన విషయచర్చలోఁ బ్రవేశించిన మెదడు నడుమ నడుమ నేమైన సంజుకొనకున్న కార్యము సాఁగదు. మాకు హాస్యరసమువలని ప్రయోజనమంతే; కాని, నవ్వుటయే జీవితమున కాధారమనియు, ఆరోగ్య కరమనియు, నెన్నిమాఱులు సవ్విన నన్ని దినము- లో గంటలో యూయువువృద్ధియగుననియు నపూర్వ సిద్ధాంతములఁజేయు హాస్యరస దేవతలను దృష్తి పఱచు సామర్థ్యము మాకులేదు. మేమును మాచదువరులవలె మనుష్యులలో మనుష్యులము గానేయుండగోరెదముగాని వారిపాలిటి బ్రహ్మలము గావలయునని సంకల్పింపలేదు. కారణమేమనఁగా బ్రహ్మపదవి నధిష్ఠించితిమేని తరువాత మాకింత పత్రిఁబెట్టు వారును లేకపోవుదురేమో అనుభయము.
మనవారికి హాస్యరసముపై నేల యింత యభినివేశము? కారణమున్నది. చదివిన చదు వంతయు బ్రతుకునకై వినియోగించి పరులకు దాసులయిన వారి బ్రతుకే హాస్యము! కాక, పగ లంతయు దమ కిష్టములేని పనియందో చేతఁగాని చేఁతయందో కడపుచుందురుగావున మేధస్సంతయు నీరసమై యుండును. కావున నూతన విషయములఁ జర్చించుటకుఁగాని చర్చించువారి హృదయములతో నేకీభవించుటకుఁగాని యోపికయుండదు. అట్లగుట విరామ కాలములందు వారికిఁ గావలసినది నవ్వుట నవ్వించులు, కాని వ్యాసంగముగాదు. మఱియు విద్యకు జ్ఞానముఫలముగాక, పరీక్షలోఁ దేరుట- యును, దానికి జీవితములను గుణకారము చేయుట యును ఫలములుగా నేర్పడుటచే నేడు స్వతంత్ర వ్యాసంగపు వాడుకయే తప్పినది. అందుచే మన మాలోచించునదంతయు భూతభవిష్యత్తుల సం- బంధములేని వర్తమానకాలము. ఇతరులపని చేసి చేసి విసిగి, చేయవలసిన మనపనియేదియుఁ దోఁపక, వేసరియుండు సద్యఃక్షణము సంతోషముగాఁ గడ చినఁజాలును. కాని, నందునిరాజ్య మిదివఱకై నదో యిక ముందు గానున్నదో యనుజోలి పనిలేదు. కావున నిన్నటి పశ్చాత్తాపములును రేపటి భయ ములును మనకంటవు. మనకుఁగావలసినది 'నేటి నవ్వు. ఇది రేపటికీడై పరిణమించినను సరే!
నవ్వువారెందఱున్నారో నవ్వించుమార్గములు నన్ని గలవు. కాని యవి యొండొంటికి మిత్రములు గావు. ఒకరి నవ్వుతో వేఱొకరి నవ్వు సమరసింపదు. వారినవ్వు వీరికిఁగోపము. ఇంకొకరికి రోత. వేఱొ కరికేమియుఁ గాని వెట్టిషని. మరొకరికి విప్పరాని బ్రహ్మముడి. దృష్టాంతమునకు దూరముపోఁబని లేదు.. మా 'వదరుఁబోతు' నామధేయమే చా లును. దీనినిజూచి కొందఱు పకపక నవ్విరి. కొంద ఱధరోష్ఠముల ముడియైన విప్పక గంభీర ముగాఁ దిలకించిరి. మఱికొందఱు 'ఇదేటి పాడు 'పేరు' అని యసహ్యపడిరి. ఈ మూవురి భావము లర్థముగాక బాలురు గొంద ఱెగాదిగఁ జూచిరి; ఇందఱను నవ్వించుట కేమిమార్గము! ఒకటున్నది. అదేమనఁగా నిందఱినినవ్వింపఁ బ్రయత్నించుటయే.
కాబట్టియే మావదరుఁబోతు ఇన్ని చిక్కు - లకు లోఁబడిన హాస్యమును గూర్చి యౌదాసీన్యము వహించినది. పూర్తిగా మౌనము వహింపలేదని మాచదువరులలోఁ గొందలైన నెఱుఁగుదురు. ఇంతమాత్రమునఁ బొట్టనిండని హాస్యభోజనులగు మాచదువరు లెవరైన నున్న వారికి మామనవి యొకటి. తానుబెట్టకున్నను పెట్టుచోటు చూపుట మానవ ధర్మముగదా! హిమవంతమునకు నావల నెందో యొక పర్వతమున్నదని పురాణములు నుడువుచున్నవి. దానిపేరు హాస్యపర్వతమఁట! అది యిచ్చోటనే కలదని నికరముగాఁ జెప్పు నంతటి పౌరాణిక భూగోళఙ్ఞానము మాకు లేదు. మాచిరంజీవి వ్యాసుని విచారించి కొంత కష్టపడి యైనను చదువరులు దానిని గనిపెట్టుదురేని యది వీరు వారనక యండఱను నిజముగా కడుపులు పుండు పుండగునట్లు తుడవఱకు నవ్వించునఁట!
_____________