వదరుబోతు/అనుకరణ విద్య

అనుకరణ విద్య

8

సృష్టి ధర్మముల గుఱించి విపులముగ : నాలోచించితిమేని ప్రాణికోటికిఁ బరానుకరణము స్వభావమనుట స్పష్టముగ గోచరింపకమానదు. ఏవిద్యకైన గురుఁ డవసరమేమోకాని, యగ్ని కుష్ణమును నీటికిశీతమునుబలె నీకళ మనకుఁ బ్రకృతి సిద్ధము. ఇహలోకయాత్రకై సృష్టికర్త మన కొసంగిన పాథేయమిది. తల్లి గర్భము వెలువడి ధరాగర్భము సొచ్చునందాఁక మనమభ్యసించు విద్యలును, నేర్చు నడవడికలును సంపాదించు సాంగత్యములును, ప్ర క టిం చు భావములును, చూపుగుణములును, అన్నియుఁ గొంచెముగనో గొప్పగనో తన్మూలముగనే మన కలవడుచున్న యవి. మనమేవిధముగ నేమినేర్చుకొన్న నేమి యది ప్రకారాంతరముగఁ బరాను కరణమే.ఇతరుల యాశయముల నెఱింగి, వాని ననుకరించుటచేఁ గా కున్న మనము పుట్టినవారు. పుట్టినట్లేయుండి ప్ర- పంచమునంతయు ఋష్యశృంగ మయముగా నొన రించి యుందుమేమో?

మనుజుని జీవిత పరిణామమునకిది యిట్లా ధారభూతమగుటంజేసి యేతద్విషయమున మన మెంత జాగరూకతతో మెలంగినను నెక్కువయన రాదు. ఛాయాపటమును దీయుటకై సిద్ధముగ సమర్పఁబడిన దర్పణ ఫలకమువంటిది మానవ హృదయము. సమయమునకై వేచియుండి బింబ మునకు యుక్తదూరమునఁ దగుపద్ధతిని దర్పణము నుంచమేని ప్రతిబింబము పాడయి యనుపయోగ కరమగుననుట మనమెఱుఁగనిది కాదు. ఇతరుల. స్వభావాదుల ననుకరించుపట్ల మనమును విచ్చల విడిగఁ బ్రవర్తించినచో, జేకూరు ఫలసిద్ధియు నట్టిద. తగని యాదర్శములఁ గైకొనుట యట్లుండ సదాదర్శముల ననుకరింపమి కూడ మన జీవిత మును జుక్కానిలేని యోడం జేయును. కావుననే చిన్ననాటినుండి సత్సాంగత్య మలవడుట యదృష్ట ఫలమని పరిగణింపఁబడుచున్నది.

అతివిస్తృతమగు నీప్రపంచమున లెక్కకు మిక్కిలి యగు గుణములును స్వభావములును నిరంతరము మనచుట్టును గోచరములగుచుఁడును. వానిలో మన స్థితికిని, అర్హతకును, దేశకాల పరిణామములకును దగినవాని నేర్పఱచికొని గ్ర- హించి యుక్తరీతి నుపయోగించుకొనవలసిన భా- రము మనదియ.వంటచెఱుకులకై పోవుచు త్రోవలో దుకాణమున నున్నవాని నంతయు బేరమాడుచు నిలుచున్న వాని నున్మత్తుఁ డనక తీరదుగదా.

సంఘమున నిపుడు కానవచ్చు. ననర్థము లెన్నియో యించుమించుగ ననుకరణ విషయమున మనము చూపుచున్న యశ్రద్ధ వలసనే కలుగు చున్న వనుటతప్పుకాదు. ఈవిషయమున ననాగరకు లగు పల్లెటూరివారి జాగరూకత- తెలియని జాగ రూకత యన్నను మానెఁగాని - యెంతయు శ్లాఘా పాత్రము. చిరకాలముగ వారికలవడిన యభ్యాస- ములపై వారికెంత దృఢప్రీతియో, నూతనవిషయ ములపై వారికంటే యనాదరము. తృప్తికరముగఁ దమకది యుఫయోగకారి యని పలువిధములుగ వారు నమ్మగలిగిననే తప్ప యెంద ఱెన్ని యుప న్యాసము లిచ్చినను దటాలున నితరుల ననుకరించి నూతనమార్గముల నవలంబించి చిరాభ్యస్తముల విడినాడరు.

కాని, ప్రకృతిదత్త యయిన యీయను కరణశక్తిని శక్తివంచనలేకుండ సంపూర్ణోపయోగ మునకుం దెచ్చినవారు మన నవనాగరకులే.

తాతస్య కూపో య మితి. బువాణో
   క్షారం జలం కాపురుషాః పిబంతి

అని యితరులఁ దూలనాడుచు క్షణమున కొక వేషము వేయుచు, దినమున కొక వ్యాపా రము సేయుచు, నూసరవెల్లులవలె మార్పు చెందు చుండుట వీరి లక్షణము. ఈ యన్నల యనుకరణ విద్యకు విధినిషేధములును కాల దేశములును మంచి చెడుగులును లేవు. నేఁడొకఁడు పొరఁబాటుననైనఁ తలపాగా నోరగఁజుట్టినచో "రేపటి కప్పుడే నూర్గుక తలమీఁద నోరపాగా లుండును; నేఁ డొకఁడు బుసుపోక యన్య దేశీయులఁ బలె దుస్తులధరించెనేని యెల్లుండి వేయిమంది “నల్లదొరలు”గా నుందురు; చక్కఁజేసికొన నవకాశములేని సోమరియొకఁడు నేఁడు జుట్టుఁగత్తరించెనేని మఱుదినమున ననేకు లకు శిఖభారమే; నేఁ డాని బెసంటమ్మనిచ్చేసి బహి రంగముగా దివ్యజ్ఞానతత్త్వమును గూర్చి పలువిధ ములుగ సుపన్యసింపనిండు; రెండుమూడు దినము- లలో నేయక్షరజ్ఞుని మేజా పైనఁ జూచినను, ఏ విద్యార్థి యంగరఖా జేబులోఁ గన్ననుగూడ నొక చిన్ని “భగవద్గీత” పుస్తకమే! ఇంతటితోఁ బోయె వనుకొనరాదు. తరువాత నొక “మహమ్మదు”. సాక్షాత్కరించి మోక్షమార్గమునకెల్ల నెత్తినున్న శిఖయే మిత్తియని బోధించెననుకొనుడు- నామాట నమ్మకున్న నాయత్నము చాలదు కాని - నెల రెణ్ణెలలలోనే పురుషప్రపంచమున నూటఁ దొలి- బదిమంది నున్నని తలలుగలిగి గడ్డములు నిమురు కొనుచుందురని నాదృఢవిశ్వాసము.

మన స్త్రీలు గూడ నీజాడ్యమునకు లోను గాకపోలేదు. వారియలంకార పద్ధతులు గుఱించి క్షణమాలోచించినచో నామాటలోని సత్యము మనమున స్ఫురింపక మానదు. వివరణమునకు నేఁడు నాకవకాశముచాలదు గాన మరల నెన్నఁ- డైన జూతముగాక.

మఱి యొక్కటి! పరుల ననుసరించుట మన స్వభావమే కాని కంటఁబడినవాని నెల్ల యనుసరిం చుట సామాన్యముగ మనలక్షణము కాదు. బిచ్చగాఁ డేమిచేసిన నదిచూచివచ్చి యనుసరించు పిచ్చివాఁడుండఁడు. మండలాధిపతి దేవాలయము నకు వెళ్ళువాఁడైనచో నికనా దేవతకు గురుబలము సంపూర్ణముగఁ గల్గినట్లే. న్యాయాధికారి సంధ్య వార్చునని యెఱింగినచో న్యాయవాదు లెల్లఁ బ్రాతస్నానము లాచరింపక యిలు వెలువడరు. బడిపంతులు కుస్తీచేయువాఁ డైనయెడఁ బాలురు జెట్టీలుకాఁగోరుదురు. ప్రపంచధర్మ మిట్టిదనియే, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరోజనః అని శ్రీకృష్ణమూర్తి యానతిచ్చె. కాన సంఘమునఁగల లోపములకును సత్స్వభావములకును దాదాపుగా శ్రేష్ఠులే నిధాన మనవచ్చును.

చెప్పవచ్చిన దేమన సంఘము బాగు పడవలెనన్న,

"గ్రుడ్డియగునెద్దు జొన్నంబడ్డ పగిది”

కాక, రసస్వభావముల ననుసరించుపట్ల మనము యుక్తాయుక్తముల నరయుటయు గొప్ప వా రనిపించుకొనుచుఁడు వారు తమ యవలంబించు వేష మత స్వభావాదులలోఁ గడు జాగరూకత వహించుటయును నత్యవశ్యకములనుట!

'

_________'