వదరుబోతు/స్వాభావికశక్తి

స్వాభావిక శక్తి

16

సర్వజ్ఞుఁడగు నీశ్వరుఁ డేపనియును వ్యర్థముగాఁ జేయఁడు. ప్రపంచమునందలి ప్రతిపదార్థము నేదేనొక్క ప్రయోజనంబుపొంటె నాతనిచే సృజింపఁబడినది. ప్రతిమనుజుఁడు నేదేనొక్క కార్యమున కయి యాతనిచే నుద్దేశింపఁబడినాఁడు. ఏమార్గముననుసరింప సర్వేశ్వరుని యుద్దేశమో, ఆమార్గమునకు భిన్నముగాఁ బ్రవర్తించువాఁడు ప్రపంచయాత్రను జయప్రదముగాఁ గొనసాగింప లేఁడు. అసమర్ధత, అవమానము, ఆశాభంగము, ఇత్యాదు లాతఁ డేర్పఱచిన మార్గముగాక వేరు త్రోవ ద్రొక్కుటవలననే గలుగుచున్నయవి.

తన యభివృద్ధికిని తన వారి 'మేలునకును గూడ కారణములగు సుగుణములు ప్రతివాని యందు నొకటి రెండైన నుండును. అట్టివానిని స్వభావముచేతనే యెఱుఁగనగు. ప్రకృతి మాతనే నమ్ముకొని యామె యాజ్ఞలకు విధేయుఁడగువాని కామె సత్పథముఁ జూపకపోదు. ఆపథముఁ బట్టి పోవువాఁ డెన్నఁడు నాశాభంగ మొందడు. ఏలన ఆమె తన యోగ్యతకు మించినవరములు నియ్యదు. ఇచ్చినవాని నెన్నఁడును దప్పదు.

కాని, మనుజుని దురదృష్టమేమో? తన కున్నశక్తిని గణింపక తనకేదియశక్యమో యద్దా నినే చేయుటకు సర్వప్రయత్నములును చేయును. బాల్యనది తానెందు కుశలుఁడో, దానిని విడిచి తన కేది యందరాని పండో దానికై వృధాకష్టిం చును . అందువలనఁ దనకు స్వభావజన్యమగు . యోగ్యత నిష్ప్రయోజనమగుటయేకాక తాను చేయఁదొరకొనిన కార్యము చెడుటచే నవమాన మునకు మనశ్చింతకును లోనగును. స్వభావముచే గణితశాస్త్రమున నభిరుచిగలనాఁడు దేశ చరిత్ర కై యేల పాటుపడవలయు? చరిత్రలయందు నేర్పరి యగువాడు గణితమునకై యేల తలబ్రద్దలు కొట్టి కొనవలయు? తనకున్నదానిని విడిచి లేనిదాని కఱ్ఱులు సాచుటలో నేమి గౌరవమున్నది? స్త్రీ తాను దానయైయుఁడక పురుషుఁడుగఁ గావలెనని, మగవారినలె నుడుపుల ధరించి, మెలంగు టెంత హాస్యాస్పదము!

కుశలుఁడు మిగుల కుశాగ్ర బుద్ధి, ధారణా శక్తియు నాతని కపరిమితము. పనియందలి పట్టు దలయు నట్లే. ఏకార్యమునైనను మిక్కిలినేర్పుతో జేయుచో ధనసాటిలేదని యనిపించుకొనియె. పాపమాతనికి రాని కళ కవిత్వమొక్కటే! రాదని దాని సతఁడు విడిచిన బాగుగ నుండెను. కాని యతఁడు ప్రతి నిమిషము నొక పద్య మల్లుటకు మొదలిడుచుండువాడు. ముగిసినను ముగియకు న్నను, యతి ప్రాసము లున్నను వలసఁబోయినను, కందము గీతమయినను, గీతము దండకమయినను, లెక్కగొనక పద్యము లల్లుచునేయుండుట వాని యలవాటు. వృక్ష శాస్త్రజ్ఞుఁడు దోహదక్రియచే నకాలమున ఫలింపఁజేసిన మాకందఫలమున కెట్టి మాధుర్యముండునో, స్వభావసిద్ధముగాక బల త్కార జనితమగు నాతని కవితకుఁగూడ నట్టి మాధుర్యమే యుండును ప్రకృతిమాత యుత్త రువు సతిక్రమించినందులకు కుశలునకుఁ దగిన శిక్ష గలుగకపోలేదు కవిత్వ మతని కలవడ లేదు. సరిగదా-మఱి యా పిచ్చిచే, నితర కార్యముల కతఁడు గొఱగాని వాఁడయ్యె. ఇతర విషయము లలో సమర్థఁడితఁడని నమ్మినవారిచే నింతయేనా యనిపించుకొనుటే కుశలుని కవితకు ఫలము.

ప్రకృతి యువ దేశముచొప్పున మనము నడ నడచినచో నెంత లెంత కార్యములఁ జేయలేము? అప్పు డెందరో శివాజీలు,ఎందఱు తిక్కనలు, ఎందఱు శంకరాచార్యులు దయించు చుండిరో? ఏకార్యమునకని ప్రకృతి మనల సృజించినదోయా పెనిఁ జేయుచోఁ బ్రారంభముననే మనము సగము జయము సమకూరిన ట్లెంచుకొనవచ్చును. శివాజీ స్వభావమువలననే యోధుఁడుగావున రణరంగమున బట్టి యద్భుత కార్యములఁ జేయఁగలిగెను.కవి తిక్కనయు, శంకరాచార్యులును నట్లే; తమ కే పనియందు నేర్పుండెనో, యాపనినే బూనుకోని కృతార్ధులై , లోకపూజ్యులైరి. వారు ప్రకృతి మాతకు విధేయులగుట నసమాన లోకవిఖ్యాతిని గడించిరి. శివాజీ భారతమును దెనుఁగించుటకును,. కవి తిక్కన యద్వైతము నుపన్యసించుటకును శంకరాచార్యుడు మహమ్మదీయులనుండి మహ రాష్ట్రమును సాధించుటకుఁ జూచుకొనియుండినచో వారి పేరైనను మనము స్మరించియుండము! కావున స్వభావమునకుఁ దగని కార్యములఁ జేయ నారంభించినచో నవమానము నిశ్చయమనుట!

సుగుణ దుర్గుణములకు లిఁగ వ్యవస్థయుం డదు. పైఁజెప్పిన దుర్గుణము స్త్రీలయందును గాన వచ్చుచున్నయది. ఇందిరయు గమలయు నిరు వురు నేరాండ్రు. ఇందిర మిగుల రూపవతి; ఆమె సౌందర్యమున కెట్టివాఁడును దాసుఁడు గావలసి నదే; కాని కంఠస్వర సారస్యవిషయమున నామె కోకిల పిన్నమ్మ! ఆమె సంగీతము వినువారికి కర్ణ కఠోరముగా నుండును. ఇంక కమలగాన మత్య ద్భుతము. అది ఱాలఁగూడఁ గరగింపఁజాలినది. కాని యామె రూపమున రెండవ కుబ్జయే! ఆమె యాకృతి వికారస్వరూపమునకు నెల్ల! ఇందిర నోరు. దెరువకుండినచో నామె సౌందర్యముఁ బట్టి లోకు లామెను బూజింతురు. కమల మఱుఁగుననున్నచో నామె గానమాకర్ణించి జనులామెను ప్రశంసింతురు. అయిన నేమి: ఇందిర పాడక విడువదు. అందఱ యెదుట నామె యేదేని పాడుచునే యుండును. వినువారికి విసుగెత్తినను, ఇది త్యాగయ్య కృతి యనియు, ఇది వెంకటేశ్వరుని కీర్తన మనియును వర్ణించుచుఁ బాడుచుండును. కమలకున్న యవ కాశ మంతయు నామె యలంకారమునకే చాలదు. నిమిష నిమిషమున - కామె క్రొత్త క్రొత్త వేషము చేయుచుండును. నిలువుటద్దము నెదుట నిలుచుండి యామె గడియగడియకు వస్త్రా భరణములను మార్చుచుండును. కాని యామె నెవ్వరును రూపవతి యన్న పుణ్యముఁగట్టుకొన్నవారు లేరు. అవభ్యాసము వలన నామె సంగీతము పసయుఁ దగ్గిపోయెను.ఇందిర గానమును మెచ్చుకొన్నవారును లేరు. నిరంతరమును సంగీత పరిశ్రమకుఁ జిక్కి యామె తలయందలి పేలను గూడ సరకుఁగొనదు.

మనకు స్వభావసిద్ధమైన యభిరుచిని వదలినచో సహజశక్తిని బోగోట్టుకొని యసమర్థులమగుటేకాక, యితరవిషయముల నశ్రద్ధఁ జూపుటంజేసి తగిన గౌరవమును సయితము గోలుపోయి ప్రపంచమున నయోగ్యుల మనిపించుకొందుము.

If men would be content to graft upon nature, and assist her operations, what mighty effects might we expect?

--ADDISION.