దీ పా వ ళి

22

ప్రపంచమున నెందఱు కూరులుండ లేదు. ఎందఱులోకకంటకులుదయమంది జనులకు మితిలేని బాధ లొనరింపలేదు? దురాచార పరాయణులగు రాక్షసరాజు లెందఱు జగమును హింసింపలేదు ? పతివ్రతల మానభంగము గావించి యేకర్మమెఱుఁ గని శిశువులు సయితము లక్షలకొలంది మారిమసగి నట్లు హతా హతముఁజేసి భరతమాత కనులకు నీరు దెచ్చిన నీచాతి నీచులు మన ప్రాచీన చరిత్రలో. నెందఱు గానరారు? కాని యిదేమీ కర్మమో నరకాసురునిపై మాత్రము మనవారికిఁ జెప్పరాని చలము గలదు! వానిపై నన్నచో మనవారు కాలు ద్రవ్వి జగడమునకు వెళ్ళుదురు.

రావణుఁడులేఁడా! హిరణ్యాక్ష హిరణ్యకశిపు లుండరా? సుందోప సుందులు సజ్జనులా? కంసుఁడు లోకమిత్రుఁడా? వీరిలో నొకరి జోలికయిన మన వారు పోరే! వీరికి తేరకుఁ జిక్కిసవాఁడెల్ల గ్రహము చాలని నరకాసురుఁడే! ఆబాలవృద్ధముగ సందఱకు నరకునిపై దండయాత్రయన్న పండుగ! ఎనిమిది దినములుగ నీ యుద్ధమునకై సన్నాహమే! ప్రతి మనుజుఁడును బాణసంచా సిద్ధముగ నుంచుకొనును; చతుర్దశి రాకకై యత్యుత్కంఠతో నెదుఱు చూ- చును; మునుముందుగఁ దానే నరకాసురుని జంపి ఖ్యాతివడయ నెంచును.

మొన్న రాత్రి మూడుగంటల వేళ బీదలు ధనికులు బాలురు వృద్ధులు, నందరు తమ తమ యిండ్లలో దీపములు వెలిగించుకొని కాచియుండిరి. అభ్యంగనములాడి కృత కౌతుక మంగళులై నరకుఁ డే నిమిష మేమూలనుండి వచ్చునోయని యస్త్రపా ణులై యెల్లవారు నెదురుచూచు చుండిరి. నరకాసు రుఁడిపుడు రాకుండినచో బాగుండునని తలఁచితిని. కాని బ్రహ్మవ్రాలు తప్పించుకొన నెవనితరము . నరకుఁడు విధిలేక రానేవచ్చెను. అబ్బా! ఏమి చెప్ప నాయుద్ధరంగ మహిమ! క్షణమున నూర్లకొలది - వేలకొలఁది - లక్షల కొలఁది-కోట్లకొలది, బాణము లొక్క పెట్టున నాకసమున నాట్యమాడ సాగెను ఆ కోలాహలము వర్ణనాతీతము! 'నేను ముందు 'నేను ముందను ధ్వనులు; పట్టు, విడువు, కాల్చుమను వీర ఘోషలు; హా, హూ, యను నాశ్చర్యారావములు; అయ్యో, తగిలెను. పొమ్ము, అను నార్తరవము లును లోకము నిండెను. బాణాగ్నులు జగమెల్ల నిండుకొనియె, అందరును బాణముల విడుచువారే! అందరు నభిమంత్రించు వారే! అందరు సస్త్రవిద్యాపటిమ చూపువారే. ఆబాణము లసామాన్యములు, చక్ర బాణము, ఆకాశ బాణము, నక్షత్రబాణము, చంద్ర బాణము, తారామండలము, పూలబాణము, మొగ్గలబాణము, లవంగబాణము, శొంఠిబాణము, పాముబాణము, తేలుబాణము, జల్లెడ బాణము, పొరక బాణము -ఎన్నియని వాకొననగును? అన్ని- యు మహాస్త్రములు; అన్నియును భయంకరములు; అన్నియు నగ్నిముఖములు; పూర్వకాలపు బ్రహ్మా స్త్రాదులపైన నుపసంహరింపవచ్చుఁగాని, ప్రయో గించినమీఁద నివి యుపసంహరించుట కానిపని. తమ కడ్డునిల్చినచో నుపసంహర్తనే యివి చుట్టు ముట్టుకొని యాహుతి గొనఁగలవు. ఇన్నిటికిఁ జిక్కి నరకాసురుఁ డింకను జీవముతో నుండునా? కాలి భస్మమగునుగాక

నరకాసురుఁడును సమర్థుడే! అస్త్రవిద్యా పారంగతుఁడే. శ్రీకృష్ణునంతవానిగూడ నెదిర్చిన ధీరుఁడే. సర్వ బాణములకును బ్రతి క్రియ లెఱిగిన వాఁడే. కానియిప్పటి మనబాణవిద్య వాని యా- చార్యుఁడెఱింగినది కాదు. కాన నీ బాణాగ్ని కతఁడు ప్రతిక్రియ చేయఁజాలఁడయ్యె. అతని యవ స్థ నాకే కర్మమగు చుండెను.వారుణాస్త్రము నించుక యభిమంత్రించి విడిచి యున్నంత నీ బౌణములన్నియుఁ దమ తమ యజమాను లెంత మంత్రించినను వినక పెంటికుక్కలవలెఁ దోకల ముడుచుకొని ‘ధుప్పు ధుప్పు మని యందే పొగ రాచుచుఁ బడియుండును. కాని, నరకాసురున నూతన రహస్యము దెలిసినది కాదు, పాపము.

ఇందొక్క విశేషము. నరకాసురుఁడు నామమాత్రా వశిష్టుఁ డయినఁగూడ మావీరులు యుద్ధమును జాలించినవారు కారు.'తమ తమ కడనున్న బాణములు ముగియుదాక వారు శస్త్ర సన్యాసము గైకొన లేదు. వీరిలోనొకఁడైనఁ గర్ణుని వలె నర్థరథుఁడు గలఁడా!. ఆహా . ఇట్టివీరులు లభించి యుండినచో దుర్యోధనునకు రాజ్యము పోపుచుండెనా?

మగవారిమాట యటుండ, నాఁడు స్త్రీలు గూడ నరకాసురుని పైఁ బగ దీర్చుకొనిరి. తమ సత్య భాను నాఁడద్భుత పౌరుషము నెఱపి నరకునితో యుద్ధముచేసెనని వారు చాల గర్వించుచుండిరి. ఒక యింట నొకనాగరికతరుణుఁడు సర్వాలంకార భూషితుఁడై సవిలాసముగ నిలిచి బాణప్రయోగము గావించు చుండెను. అతనియర్థాంగి యంత్రలో వచ్చి “మాసత్యభామ నాఁడు యుద్ధము చేసెనఁట! నేనును నేఁడు కొన్ని బాణముల విడుతును. తెండు” అని పతినడిగెను. “సరి సత్యభామ వంటిదానవా పొమ్ము' అని యతఁడు నిరాదరముసూప నా మానిని రోషమున "ఎట్టికృష్ణున కట్టి సత్యభామ యనుచు జలాత్కారముగ రెండు బాణముల లాగి కొని ప్రయోగము చేసియేపోయెను. ఈ సత్యా కృష్ణ సంవాదమువిని దూరమునఁ బక పక నెవరో నవ్విరి. బాణాగ్నిచే దగ్ధుఁడగుచున్న నరకా సురుఁడే యను కొంటిని.

ఈ దిక్కుమాలిన నరకాసురుని యవస్థను గూర్చియే చింతించుచు నాఁడు రాత్రి శయ్య చేరి తిని. జాగ్రదవస్థ తప్పియు దప్పక మున్న నాకనుల కొక స్వప్నము గోచరించెను. నేనొక యుద్ధ భూమిలో నుంటిని. రణము శాంతించి యుండి నందున వీరు లందఱు దమ నివాసముల కరిగి యుండిరి. రంగమంతయు భస్మరాసులచే ఘోర ముగఁ గన్పట్టు చుండెను. అందొకచో నొక భస్మరాశిలో సర్వాంగముల బొబ్బ లెగసియుండ బాధపడుచు దాహమని నోరు తెఱచుచున్న వాని నొక్కని గంటిని. చేరువఁజని నీరిచ్చి “అన్నా ఎవఁడవీవు?'? అంటిని. అతఁడిట్లనియె. "హిందూ దేశవాసుల బాణ విద్యా విహా రమునకుం జిక్కిన పాపి నరకాసురుఁడ నేను. అన్నా! ఏమి నాగోహచారము! నాపైననే వీరి కింత చలమేల? నీవేమీ తలంతువో కాని, మీ వారి యజ్ఞత. నా కేమియు సరిపడలేదు. ఎన్నఁడో చచ్చి స్వర్గాననున్న నన్నేలఁ బట్టి తెచ్చి యిట్లు కాల్పవలయు. వీరికి వేరుపని పాటలు లేవా? ధనమును మితిలేక వెచ్చించి బాణములలోని తమ ధనుర్విద్య నంతయు నాపయింబెట్టి తగులఁ బెట్టినచో వీరికేమి ఫలము? నాకై పాడుచేసిన ద్రవ్యమున సగబాలు తో నూరూర నుంచి గ్రంథాలయము లగునే? ఇట్టి ధనమంతయు బ్రోగుచేసినచో నొక గొప్ప కళాశాల యేర్పడదా? దేశము బాగుపడదా? ఏమి మౌర్ఖ్యమిది! ఆ ఋణము లైనతమంత జేసికొను శక్తి వీరికిలేదే! ఏ జపానుతల్లియో, ఏచీనా సోదరుఁడో తయారుచేసి వీరికి భిక్ష మివ్వవలసి యుండుటకైన వీరు సిగ్గుపడరుగదా! వీరికిబుద్ధి వచ్చుదాఁక నేనిట్లు ప్రతివర్షము ననుభవింప వలెననుట నాకు శాపము. నాయరణ్యరోదనము వినువారెవ్వరు. నాజన్మ భూమి యెన్నడు బాగుపడగలదో అన్నా పోయి వచ్చెద! వచ్చునేట జూచెదగాక. ” అంతలో నాకసమునుండి విమానమురాగా నందు గూర్చుండి యతఁడంతర్థాన మందెను. నేనును మేల్కొంటిని.