వదరుబోతు/సారస్వత స్వప్నము (2)
సా ర స్వ త స్వ ప్న ము
21
నేఁడు నాయప్పు తీర్పవలసియున్నది. క్షణ మాత్రమట్లు ముకుళిత నేత్రుఁడనై మరలఁ గనులఁ దెరచునంతలో దేవిమాహాత్మ్య విశేష మేమో కాని ఆమె యలంకారములన్నియు మార్పు సెంది యుండి నాక పరిమి తాశ్చర్య మొడఁగూర్చెనంటిని. సత్యము.
ఉ॥ శ్రీయన గౌరినాఁబరగు చెల్వకుఁ జిత్తము పల్ల వింప భ| ద్రాయతమూర్తియై హరిహరంబగు రూపముదాల్చి విష్ణురూ| పాయ నమశ్శివాయ యని పల్కెడీ భక్తజనంబు వైదికా! ధ్యాయి త కిచ్చమెచ్చు పరతత్త్వము గొల్తు నభీష్ట సిద్ధి కై
అను పద్యరాజము వాగ్దేవి నెన్నుదుటఁ గమ్మని కస్తూరి తిలకముగఁ గాననయ్యెను. పార మెఱుంగని యానంద రసాతి రేక మునఁ గనుల బాష్పకణములు రాలఁ గొంతతడ వట్లే స్తబ్దుఁడనై నిలిచి యనిమేషభావమున నావ్యక్తిం దిలకించితిని. ఆంధ్ర మహాభారతమునందలి యాదిపర్వము సూ- ర్యవంకగను, సభాపర్వము, సీమంతమణిగను, అరణ్య పర్వము చంద్రవంక గను దేవి శిరోభాగమున ధగ ధగ మెరయుచుండినవి. ఉద్యోగపర్వము కలికి తురాయిగ నాంధ్ర పంచమ వేద శేష మిపుడు మణి కిరీటమై మెఱుఁగు లీనుచుండెను. హరివంశ కావ్య ములు రెండును రవల తాటంకములై మిస మిస .. లాడుచుండినవి. భాగవతము స్వచ్ఛమై తళతళ లాడు నాసామణీగ మాఱియుండెను. భాస్క రునికృతి కంఠాభరణ మయ్యెను. చవులదేఱు మంచి ముత్తియముల హారమై మన మనుచరిత్రము నిగనిగలాడుచుండెను. దాని జతనున్న సానలఁ దీఱిన జాతిరత్నముల హారము మన వసుచరిత్రమే. ఆముక్తమాల్యద రత్న కేయూరమై రాఘవపాండ నీయ హరిశ్చందనలో పాఖ్యానములు మణికంక ణములై దేవిని సేవించినవి. జైమిని భారతము పచ్చల పతకమైనది. సొగసు కంచుకమై శృంగార నైషధమును, బంగరువ్రాతగల పట్టుపుట్టమై శ్రీ కళా పూర్ణోదయమును బ్రకాశించినవి. పారిజాతాప హరణము బంగరు ముద్దుటుంగరమై యొప్పుచుం డెను. నిరంకుశోపాఖ్యాన, రామాభ్యుదయ, పాండురంగ మాహాత్మ్య, కాళహస్తి మాహాత్మ్య, కవికర్ణరసాయన ప్రముఖ కృతులు పెక్కులు వింత వింత రకముల యాభరణముల రూపమును దాల్చి యుండినవి. తేనియ తేఁటలగు కూచిమంచి తిమ్మ- యమాటలు నూపురత్వమునుధరించి ఘలుఘల్లని మెఱయు చుండెను. చేమకూరివాని యమృతంపు పల్కులు పాదకటకములై పొలుపారియుండెను. ఇఁక ప్రాచీనకపు లర్పించినవియు, ఆధునిక కవు లలంకరించినవియు సగు నూర్లకొలది సొమ్ములు దేవి పాద పంకజముల సలరారుచుండెను. కానీ నెల్లఁ బేర్కొనజూచుట కానిపని. దేవికంఠము నలంకరించియున్న పారిజాత ప్రసూనముల హారమును, రోజాపూవుల పేరును మనోహరములై యుండి నాకనులనాక్షరంపఁజాలియుండె.
అయ్యా రే! నేఁటికిఁ గదా పండెను భాగ్య మని యుప్పొంగి కేల్దోయి మోడ్చి యుచ్చైస్వ రంబున,
ఉ|| అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా| డంబర చారుమూర్తి, ప్రకట స్ఫుటభూషణ రత్నదీపికా| చుంబిత దిగ్విభాగ శృతిసూక్తి వివిక్తనిజప్రభావ, భా|వాంబర వీధి విశ్రుత విహార, ననుం గృపఁ జూడు భారతీ!
అనుచు సాష్టాంగముగ మ్రొక్కులిడి కరవు దీఱ మాతను స్తుతించితిని. కవి రాజుల యాసనములవంక దృష్టి మర లించునంతలో నపుడు నాకన్నులఁ దనుపుచుండిన మహనీయులు మునుపటి వారుగారని యెఱింగితిని. కాని వీరును స్ఫురద్రూపులు తరుణమూర్తులు. అపూర్వ ప్రభాభాసమానులును. వీరెవరొకో యనుకొనుచుండునంతలో నొక మహాశయుఁడు. లేచి " దేవీ! ఆనతి యయ్యెనేని నా మిత్రున కీ మహాకవుల పరిచయ మిచ్చెద” ననుడు, దరహసిత వదనయై యాదేవి యంగీకార సూచకముగ సల్లన శిర మాడించె. అతఁడును ననుజేరవచ్చి రమ్మని నను వెంటఁగొనిపోవుచు నొక్కొక్కరుఁడుగ నా కవుల నభివర్ణింపసాగెను.
మున్ను వల్మీకభవుఁ డలంకరించియున్న పీఠ మున నిపుడు వాగనుశాసనుఁడు ప్రకాశించు చుండె. కాళిదాస కవిరా జధిష్టించి యుండిన గద్దియ యిపుడు కవిబ్రహ్మతో సలరారుచుండెను. ఆ మహాపురుషుని చేరువనున్న వారు సర్వజ్ఞుఁడును, సాహిత్య రసపోషణ చక్రవర్తియు. పక్కన శ్రీ రామనామ స్మరణ సేయుచున్న మహానుభావుఁడు బమ్మెరపోతన యఁట. అతని దాపున వెలుఁగు చున్న వాఁడు బాస్కరుఁడు. తరువాత ననన్య సాధారణ తేజోవిరాజితుఁడగు నొక మహాశయుని జూచి యితఁ డెవఁడోయని తలపోయుచుండు నంత- “ఇంతలు కన్నులుండియు”, నితని గురుతింప వైతివే ! ఇతఁడు మా దేవికి తాత, యని నామిత్రు కందిచ్చె. అల్లసాని పెద్దనయని యెఱింగి 'యాహా!' యని నేత్రపర్వముగ క్షణ మతనిఁ గనుంగొని భక్తితో నమ్రుఁడనైతి. అతని దక్షిణభాగమునఁ జుక్కలలో శుుక్రునివలె నొక వ్యక్తి మెఱయు చుండెను. ఆంధ్ర కర్ణాట రాజ్యలక్షీ తపః ఫల మగు సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌముఁడు కృష్ణ దేవరాయఁ డతఁడని వినఁ గల్గుటకు నాహృద- య మెంతవెల్లివిరసెనో వ్రాయుశక్తి నాకిపుడు లేదు. అతని నాశ్రయించి యున్న వారు నంది తిమ్మన, సూరకవి, రామకృష్ణుఁడు, ధూర్జటియు, ఆంధ్రకవితాపితామహుని వామభాగము నాశ్ర యించిన ధీరుఁడు సంగీత సాహిత్య కళానిధియగు మన రామరాజభూషణుఁడు. "ఇతనిని సాసూ యముగఁ దిలకించుచున్న వాఁ డయ్యల రాజ కవి. అతని కావలఁ గూర్చుండి పెద్దనపై రూక్షేక్షణ ప్రయోగము సేయుచున్న యొకనిఁ జూచి యెవఁ డీతఁ డనుకొనునంతలో “నితడు యతిని విటు నిగ, విటుని యతిగఁ జేయఁజాలినవాఁడ'ని నా మిత్రుఁడు పలికెను. సంకుసాల నృసింహుఁడాయని లోలోన నవ్వుకొంటిని. అతని ప్రక్కననున్న వాఁడు కందుకూరి రుద్రుడు. ఆవల నెడముగా నున్న గభీరమూర్తి కవిసార్వభౌముఁడట! వానిచే - రువనున్న వారు పిల్లలమఱ్ఱి పినవీరనయు, రంగనాథ కవియు. తరువాత నించుక దూరముగ కూచి మంచి పండితుఁడును, చేమకూరకవియు నాసీను లైరి. ఆవలనున్న యతఁడు క్షేత్రయయని నా మిత్రు డానతిచ్చెను, "ఇతఁడు కవియని మా వారనుకొనరే! ఏకృతి రచించెనో?" యని నేనడు. గునంతలో నామిత్రుఁడు " తెలివియొకరిసొమ్మా?" 'యని నవ్వెను. చేరువ నాసీనుఁడుగనున్న యొక మహాశయుఁడు, "ఎందరో మహానుభావులు" అనియె. ఇతఁడు త్యాగరాజు కాఁబోలు ననుకొని సంత సించితిని.
ఇంకను నెందఱనో కవులను నామిత్రుఁడు నా కెఱింగించెగాని వారి వివరములు వ్రాయ నలవికాదు.
అల్లంతదూరమున నిలుచుండి యొక మహా శయుఁడు చేతి పళ్ళెరమునందలి రమ్యములగు జాతి సుమముల దేవిపాదముల నర్పించుచుండె. ఇతఁ డెవ్వఁడని యడుగ నతఁ డర్పించిన పుష్పములఁ జూడుమని నాసఖుఁడు పలికెను. దేవి దక్షిణ పాదము పైఁబడిన సుమమున చిత్రనళీయమనియు వామపాదముపై బడిన సుమమున విషాద సారంగ ధర మనియు నామము లుండుటఁజూచి "వహవ్వా ! మన యాంధ్రనాటక పితామహుఁడు సుమీ!?” యని పొంగితిని. అతని చేతి పళ్లెరములో నింకను రమారమి ముప్పది సుమము లుండెనని నమ్మెద. మనోహరములగు. భావగీతము లను మల్లికాప్రసూ నము లెందుండియోవచ్చి యపుడపుడు దేవిపాద ములపై బడుచుండెడివి. మన దేశమునందలి కవులు వ్రాసి పంపుచున్న భావ గీతిక లవియని తెలిసికొంటిని.
పట్టుపుట్టముల మేలిముసుఁగులు మూసిన బంగరు పళ్ళెరములఁ బట్టి బారులుతీరి పలువు రల్లంతదూరమున నిలిచి యుండిరి.“అమూల్య ములగు పలురకముల ఱాల సొమ్ముల దేవికై కొని వచ్చితిమి, కాని యామె మావైపున కేనిచూడదే మాకర్మమేమి?" అని వారిలో నొకఁడు విషణ్ణ వదనమున గొణుకొను చుండెను. వీరు కాక గోనెసంచులలోఁ గానుకలు మోసికొని గుంపులు గుంపులుగ శాలలోఁ బ్రవేశింపఁగోరి వేత్రధారుల చేతి బెత్తముల వ్రేటులు సైతము గమనింపక యహ మహమికతో వచ్చుచున్న జనస్తోమమును ద్వార పాలు రర్ధచంద్ర ప్రయోగమున బహూకరించు చుండిరి. “మీ జర్మనీ గిల్టుసొమ్ములు,మాజపాను గాజు పెంకులు, మాదేవి మోయలేదు,వలదు, వలదు, పొండు, పొండు,” అని చేయాడించుచు సభాస్తారులు కొందరు గద్దించుచుండుట చూచి నాకేమో పాపమనిపించినది. ఈ బాధల పడ నిచ్చలేనివారు కొందఱు బహిశ్శాలలోనుండియే గంపలలోని పూవులను మొగ్గలను దోసిళ్ళతో. లోనికీఁ జల్లుచుండిరి. వానిలో చాలవరకు నిర్గం ధములు. ఇవి నవలల తోఁటలోనివఁట! వానిలో నేయొకటో రెండో తక్క తక్కినవన్నియు నందే ప్రోవులుప్రోవులుగఁ బడి వాడువారుచుండినవి.
ఈవిచిత్ర దృశ్యమును చూచుచుండునంత నా హృదయాంతరాళమున నొక యూహ వోడ మెను. కవులయొక్కయుఁ గావ్యములయొక్కయుఁ దారతమ్య విషయమున మనవారి కనేక సంశయ ములు గలవు కదా! వాగనుశాసనుఁ డలంకరించు నాఁటిదాఁక భారతీదేవికి భూషణములే లేవా! సోమ శంభుదాసు లర్పించిన కానుకలలో నెద్ది వాగ్దేవికిఁ బ్రియతరము? మణి కేయూర మర్పిం చిన కాలదుఁ డాంధ్రభోజుఁడా, అల్లసానివాఁడా? మనవారు తగవులాఁడి తలలు పగుల గొట్టు చున్న యిట్టి సమస్యల కుత్తరములఁ బడయుట కింతకన్న మంచియదనేది?
అంతలో నాసభలో గొప్పగడబిడ బయలు దేరెను. సభ్యులెల్ల దిగ్గున లేచి నిలచి జయ జయ ధ్వానములు సలుపసాగిరి.మహర్షులు వేద ఘోషలతోడ గంధర్వుల గానధోరణి వీతెంచెను. వేత్రధారుల పరాకులు చెవులు సెలవోవుచుండ నా సభాంతరాళమునఁ జతురాననుండు ప్రత్యక్ష . మయ్యె!
అదటుననుండు కారణమున నులికిపడు నంతలో నాగదిలో బల్లపైని మునుపటి సరస్వతీ చిత్రపట మొకటితప్ప యితర దృశ్యమంతయు మాయమయ్యెను. - పూజకై వలయు పరికరము లతో నామిత్రులు కొందరు గదిలోని కరుదెంచి యుండిరి. క్షణమాత్రము భ్రాంతుఁడనై యుంటిని.
ఆహా! నా భావస్వప్న మింత యకాలమున సంతరింపకుండిన యెడల నాంధ్ర లోకమునకు నెన్నో సారస్వత రహస్యముల నెఱిఁగింపఁగలిగి యుందును కదా?