రామాయణ విశేషములు-5

5

ముఖ్య సంఘటనల కాలచర్చ

శ్రీమద్రామాయణములో ముఖ్యసంఘటనలు ఎప్పుడెప్పుడు సంభవించెనో తెలుసుకొందము. మొట్టమొదట శ్రీరామచంద్ర సోదరుల జననకాలమును గురించి రామాయణ మేమి తెలుపుచున్నదో కనుగొందము. దశరథమహారాజు వృద్ధుడగుచు వచ్చెను. ముగ్గురు భార్యల పెండ్లాడియుండెను. వారు పట్టపురాణులు. పైగా 350 మంది స్త్రీలను వివాహమాడియుండెను. అయితే వారు స్వజాతిస్త్రీలుగా ఉండి నట్లు కానరాదు.


'అర్ధసప్తశతా స్తాస్తుప్రమదా స్తామ్రలోచనాః'. అయో. 84-13


ఇంతమంది భార్యలున్నను అతనికి సంతానము లేకపోయెను. సంతానార్థియై పుత్రకామేష్టి యొనరించెను. అటుతర్వాతనే అతని పట్టపు రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయీలకు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టిరి. వారి జనన కాలమును గురించి రామాయణ మందిట్లు తెలిపినారు:


తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిధౌ
నక్షత్రే౽దితి దైవత్యే స్వోచ్చసంస్థేషు పంచసు
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతా విందునా సహ
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోకనమస్కృతం
కౌసల్యా జనయ ద్రామం సర్వలక్షణ సంయుతం.
                                               బాల. 18-8, 9, 10.

పుత్రకామేష్టియైన 12 నెలల యనంతరము చైత్రమాసమునందు

(శుద్ధ) నవమీ తిథియందు పునర్వసూ నక్షత్రమందు సూర్యాంగారక శని బృహస్పతి శుక్రు లైదుగురును తమతమ యుచ్ఛస్థానములగు మేష మకర తులా కర్కటమీనములందుండగా అందు బృహస్పతి చంద్రునితో చేరియుండగా కర్కటలగ్నమందు ఇక్ష్వాకువంశ వర్ధనుడగు రాముని కౌసల్యాదేవి కనెను అని వ్యాఖ్యాతలు వ్యాఖ్యానించినారు.

ఈ యంశమును గురించి శ్రీ పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారు ఇట్లు వ్రాసినారు:


"క్రీ. పూ. 1761 ఫిబ్రవరి 9 వ తేదీనాడు రాముడు పుట్టినటుల రామాయణ జాతకముచే నిశ్చయించితినని ఇలియట్ అనువాడు వ్రాసెను. రామాయణమందలి పై ‘తతశ్చ ద్వాదశే మాసే' ఇత్యాది శ్లోకములు — పై పద్దతి ప్రకారము ఎప్పుడును నేటి సిద్ధాంతముచే చైత్ర శు 9 నాడు ఐదు గ్రహము లుచ్చస్థితియం దుండవు. అట్లయిదు గ్రహము లుచ్చస్థితి యందుండిన యెడల నవమినాడు పునర్వసూ నక్షత్రము రాదు. ఫాల్గుణ బ 30 నాటికి సూర్యుడు రేవతీ నక్షత్రాంత్య కలయందుండి చైత్ర శు1 నాడు మేషరాశి (అశ్వినీ నక్షత్రము) లో ప్రవేశించినయెడల అమావాస్యనాడు రేవతీ నక్షత్రమగును. శుద్ధ 9 నాడు ఆశ్లేషా నక్షత్రము కాని పునర్వసూనక్షత్రము రాదు. ................................................ చైత్ర శు 9 ప్రాంతమున బుధు డెప్పుడును కుంభ మీన మేష వృషభరాసుల మధ్య మందే సూర్యునికి వెనుకటి రాశిలోనో ముందటి రాశిలోనో యుండును . కాని స్వోచ్చస్థానమగు కాన్యారాశిలో నుండడు"[1]

రామాయణమందు వాల్మీకి పలుతావుల జ్యోతిశ్శాస్త్ర విషయముల నుదాహరించినాడు. మరి యచ్చట ఇంత విపులముగా వర్ణించినను ఏల తప్పిపోయెను? ఇది ప్రక్షిప్తమేనా? ఆధునిక జ్యోతిష్కులు నిర్ణయింతురు గాక !

ఏది యెట్లున్నను పై శ్లోకాధారమును బట్టియే భరతఖండ మందంతటను హిందువులు చైత్ర శు 9 నాడు శ్రీరామజయంతిని ఆచరించుచున్నారు.

ఇది రాముని జన్మతిథిని గురించిన సంగతి ఇక తక్కిన ముగ్గురి జన్మకాలములను గురించి కనుగొందము.


పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్న ధీః
సార్పే జాతౌతు సౌమిత్రీ కుళిరే౽భ్యుదితే రవౌ. (బాల. 18-14)


భరతుడు పుష్యమీ నక్షత్రమందు మీనలగ్నమందు పుట్టెను. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేషానక్షత్రమందు కర్కటకలగ్నమందు మధ్యాహ్నకాలములో పుట్టిరి.


అతీత్యైకాదశాహంతు నామకర్మ తథాకరోత్. (బాల. 18-20)


క్షత్రియులకు 13 వ దివసమునాడు నామకరణము చేయవలసినదని శాస్త్రములు చెప్పుచుండగా రామాయణములో 11 వ దివసమునాడు నామకరణము చేసిరని పై శ్లోకము తెలుపుచున్నది ఈ విరోధమును సమన్వయించుటకై వ్యాఖ్యాత యిట్లభిప్రాయ మిచ్చినారు. “రాముడు పుట్టిన మరునాడు లక్ష్మణుడు పుట్టెను. కావున లక్ష్మణుడు పుట్టిన తర్వాత 11 దినాలకు నామకరణమయ్యెనని అర్థము చేసుకొనవలెను. " దీనినిబట్టి రాముడు జన్మించిననాడే ఇంచుక తర్వాత భరతుడు పుట్టెననియు, మరునాడు లక్ష్మణశత్రుఘ్నులు జన్మించిరనియు గ్రహించుకొనవలెను. అయితే లక్ష్మణ శత్రుఘ్నులు కవలపిల్లలగుదురా కాదా? ఒకే దినమున, ఒకే నక్షత్రములో, ఒకే లగ్నములో జన్మించిన వారు ఆమడలుకాక మరేమగుదురు ? మహాభారతమందలి నకుల సహదేవులవలె ఈ లక్ష్మణ శత్రుఘ్నులు కవలలుగా ప్రసిద్దులు కాలేదు. ఉభయుల ప్రకృతులందును గుణములందును చాల భేదము కానవచ్చు చున్నది. లక్ష్మణుడు ఉగ్రుడు. ధర్మాగ్రహుడు. మహావీరుడు. శత్రుఘ్నుడు సాత్వికుడు. చెప్పినంత చేయువాడు. అప్రసిద్ధుడు.

రాముడు పునర్వసూ నక్షత్రమందే జన్మించెననుటకు రామాయ ణములోనే మరొక నిదర్శనము కలదు.


ఉత్తరాఫల్గునీహృద్య శ్వస్తు హస్తేన యోక్ష్యతే
అభిప్రాయామ సుగ్రీవ సర్వానీక సమావృతాః. (యుద్ధ. 4-6)


రాముడు లంకపై దండయాత్ర చేయుటకై కిష్కింధనుండి బయలుదేరుచు సుగ్రీవునితో నిట్లనుచున్నాడు. “సుగ్రీవా! ఈ దినము ఉత్తరఫల్గునీనక్షత్రము. నా జన్మ నక్షత్రము పునర్వసు. అందుచేత ఈ ఉత్తర నాకు సాధనతార యగును. ఇది విజయముకూర్చే మంచి నక్షత్రము. రేపు హస్తా నక్షత్రము. అది నాకు నైధనతార కావున ఈనాడే ప్రయాణము ప్రారంభింతము.”


రామ పట్టాభిషేకము


శ్రీరామ నవరాత్రులు అను పేరుతో చైత్రశుద్ధ ప్రతిపత్తునుండి శుద్ధ నవమి వరకు హిందువులు ఉత్సవాలు చేయుచుందురు. శ్రీరాముడు శు 9 నాడు పుట్టితే అంతకు పూర్వపు 8 దినాలలో ఉత్సవా లెందుకు చేయుదురు? కారణము తెలియరాదు.

శ్రీరామునికి మొదట దశరథుడు యౌవరాజ్యపట్టాభిషేకమును

తలపెట్టినది చైత్రమందే.


చైత్ర శ్శ్రీమా నయం మాసః పుణ్యః పుష్పితకాననః
యౌవరాజ్యయ రామస్య పర్వమేవోపకల్ప్యతామ్. (అయో. 3-4)


అయితే ఇది చైత్రమాసమం దేదినమందో తెలియరాదు కాని శు 5 కి పూర్వమే అని చెప్పగలము ఏలననగా రామాయణాంతములో ఇట్లున్నది:


పూర్ణే చతుర్దశే వర్షే పంచమ్యాం లక్ష్మణాగ్రజః
భరద్వాజాశ్రమం ప్రాప్య వవందే నియతం మునిమ్.
                                                      (యుద్ధ. 127-1)


దీనిపై గోవిందరాజిట్లు వ్యాఖ్యానించెను: “రాముడు చైత్రశుద్ధ పంచమినాడు ఆయోధ్యనుండి నిర్వాసితుడయ్యెను .......... మరల 14 ఏండ్లు ముగియునప్పుడు చైత్ర శు 3 లంకనుండి వెళ్లెను. చతుర్థి నాడు కిష్కింధలో నుండి పంచమినాడు భరద్వాజాశ్రమము చేరెను.” దీనివలన చైత్ర ప్రతిపత్తునుండి శుక్లపంచమిలోగా పుష్యనక్షత్రమందు కర్కటక లగ్నమందు (ఆయో 15-3) రాముని యౌవరాజ్య పట్టాభి షేకము నిర్ణయింపబడియుండె నని మాత్రము తెలియవచ్చుచున్నది. అయినను ఈ పట్టాభిషేకము భగ్నమైనందున ఇది లెక్కకు వచ్చునది కాదు.

రావణ వధానంతరము చైత్ర శు 5 నాడు భరద్వాజాశ్రమమునుండి బయలుదేరి చైత్రశుద్ధ షష్ఠినాడు అయోధ్య చేరెను. చైత్రశుద్ధ సప్తమి నాడు అతని పట్టాభిషేకము జరిగెను. “సప్తమ్యాం పుష్యనక్షత్రే శ్రీరామచంద్ర పట్టాభిషేకః" అని మహేశ్వరతీర్థులు వ్యాఖ్యానించినారు. రాముడు అయోధ్యను చేరినతర్వాత భరతుని కోరికపై సుగ్రీవుడు వానర ప్రముఖులచే తెల్లవారువరకు సముద్రజలముల తెప్పించెను. ఆ జలములచే రాముని పట్టాభిషేకము జరిపింపబడెను (యుద్ధ. 131-50). ఈ కారణము చేత రాముని పట్టాభిషేకము చైత్రశుద్ధ 7 నాడు జరిగినదనుట స్పష్టము. విషయమిట్లుండ వారి పట్టాభిషేకము శుద్ధ 9 నాడు జరిగినదని చాలమంది విశ్వసించుట కాధారమేమియు కానరాదు. శ్రీరామ నవరాత్రులను గురించి యింతకుమించిన విశేషములు రామాయణమందు కానరావు.

శ్రీరాముని వివాహముకూడ చైత్ర శుద్ధ 9 నాడు జరిగెనని యందురు. కాని దాని ఆధారము వాల్మీకి రామాయణమందు లేదు. ఉత్తరఫల్గునీ నక్షత్రమందు వివాహము జరిగెనని మాత్రము తెలియవచ్చు చున్నది. (బాల. 71-24 మరియు బాల. 72-12, 13.)

దశరథునకు శాంత అను ఔరసపుత్రి యుండెననియు ఆమెను ఆంగరాజగు రోమపాదునకు దత్తతగా ఇచ్చెననియు తెలిపినారు. (బాల. 9-18, 11–17.) శాంత దశరథుని కే భార్యయందు పుట్టెనో తెలుపలేదు. ఆ కాలములో కన్యకలను గూడా దత్తతగా ఇచ్చుచుండిరని చెప్పవలసి వచ్చును. దశరథునికి శాంత ఔరసపుత్రియని స్పష్టము గాలేదు. “సఖ్యం సంబంధకం చైవ" (బాల. 11-17) అనుదానికి వ్యాఖ్యాతలు స్నేహ సంబంధమో దూర బాంధవ్యమో అను సామాన్యార్థము చెప్పక శాంత దశరథుని పుత్రియని వ్యాఖ్యానించినారు. "శాంతా తవసులా" (బాల. 17-19) అని దశరథుడే స్వయముగా అంగరాజుతో అనెను. కావున శాంత దశరథుని పుత్రికయని చెప్పుటకు వీలులేదు.

రామాదుల జననానంతరము వారు పసివారుగా నుండగానే వారికి విశ్వామిత్రుడు స్వయంగురువుగా ఏర్పడెను. దశరథుడు రాముని విశ్వా మిత్రుని కప్పజెప్పునప్పుడు ----


ఊన షోడశవర్షో మే రామో రాజీవలోచనః. బాల. 20-2.


'నా రాముడు 16 ఏండ్లలోపలివాడు' అని అన్నాడు. అంటే అతడు

15 ఏండ్లవాడని స్పష్టమగుచున్నది. కాని ముందు అరణ్యకాండలో,


'బాలో ద్వాదశవర్షో౽య మకృతాస్త్రశ్చ రాఘవః'


అని మారీచుడు చెప్పినందున ఇచ్చట రామునికి శస్త్రాభ్యాస ప్రారంభకాలమునాడు 12 ఏండ్ల వయస్సుండెనని సమాధానపడవలెను. రాముడు 12 ఏండ్ల వయసులోనో 15 ఏండ్ల వయసులోనో విశ్వామిత్రుని సిద్ధాశ్రమమునకుపోయి అచ్చట వేదములను శాస్త్రములను ధనుర్వేద మును, శస్త్రవిద్యను అభ్యసించెను. అభ్యాసము పూర్తికాగానే జనక రాజుయొక్క మిథిలకుపోయి వివాహమాడెను. వివాహకాలమం దతనికి 25 ఏండ్ల వయస్సని సీత చెప్పెను. అందుచేత రాముడు తన 12 వ లేక 15 వ సంవత్సరమునుండి 25 వ సంవత్సర వయఃకాలమువరకు విశ్వామిత్రునివద్ద విద్యాభ్యాసము చేసెనని చెప్పవలెను. ప్రాచీన కాలమందు బ్రాహ్మణులు రాజపుత్రులు కనిష్ఠము 12 ఏండ్లైయిన గురుకులవాసముచేసి బ్రహ్మచర్యాశ్రమ మందుండి విద్యాభ్యాసము చేయుచుండిరి. కాన రాముడును లక్ష్మణునితోసహ అటులే చేసెనని గ్రహింపవచ్చును. అయితే తక్కిన యిద్దరు సోదరు లేయాశ్రమమందు విద్య నభ్యసించిరో ఆ ముచ్చట చెప్పలేదు. బహుశా వారు నగరమందే యుండి వసిష్ఠునివద్ద నభ్యసించి యుందురు.


సీతారాముల వివాహకాలము


రామాది సోదరులకు చిన్నతనమందే వివాహముమయ్యెనా, లేక పెద్దవారైన తర్వాతనా? సీతకు బాల్య వివాహ మయ్యెనా? రజస్వలా నంతర వివాహ మయ్యెనా? అను సమస్య లాధునికులకు కొంత ముచ్చట కలిగించును. రామాయణములో సీతారామాదులకు బాల్యమందే వివాహ మైనట్లు ఎక్కువ నిదర్శనము లియ్య ప్రయత్నించినారు. అవి ప్రక్షిప్త ములనియు తర్వాతి వారిచే చేర్చబడినవనియు సంశయము కలుగు చున్నది. ఎట్లనగా జనకుని వద్దకు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను

తీసికొని వెళ్ళినప్పుడు వారిని గురించి జనకు డిట్లనెను:


అశ్వినా వివ రూపేణ సముపస్థితయౌవనౌ. (బాల. 50-19)


“రామలక్ష్మణులు అశ్వినులవలె యౌవనము పొందిన వారై యున్నారు.” యోవనారంభ దశలో నున్నారన్న ఏమి అర్థము? జనకుని నగరానికి వెళ్ళిన కొన్ని దినాలలోపలనే రామసోదరులకు వివాహ మయ్యెను. వెనువెంటనే వారు తమతమ భార్యలతో అయోధ్యానగరానికి వెళ్ళిరి. ఆ భార్యలు-


రేమిరే ముదితా స్సర్వా భర్తృభి స్సహితా రహః. (బాల. 77-34)
“రహస్యమందు తమతమ భర్తలతో ఆనందముతో రమించిరి"
రాముడై తే-
రామస్తు సీతయాసార్థం విజహార బహూన్ ఋతూన్.
                                                           (బాల. 77-25)


సీతతో పెక్కు ఋతువులందు క్రీడించెను. ఈ విధముగా వర్ణిం చుటచేత రామాదులు 20 ఏండ్లు దాటిన వయస్సు వారుగా నైనను నుండియుందురని తలపవలసియుండును. సీతాదులును వ్యక్తురాండ్రై యువతులుగా నుండిరని అర్థమగుచున్నది

సీతతో రమించుచు ఆనందించుచున్న రాముడు ఇంకను ఎట్టివాడో వాల్మీకి స్పష్టపరచినాడు.


అరోగస్తరుతో వాగ్మీ వపుష్మాన్ దేశకాలవిత్. (అయో. 1-18)


“అతడు రోగరహితుడు, ఆరోగ్యవంతుడు, మంచి వాక్చాతుర్య మెరిగిన అనుభవశాలి. కాయపుష్టి కలిగిన అజానుబాహుడు. యౌవన వంతుడు. దేశకాలములను బాగుగా ఎరిగినవాడు.” రాముని యౌవరాజ్య పట్టాభిషేక సన్నాహములు వివాహమైన కొలది కాలములోపలనే జరిగెను. వివాహమైన వెంటనే భరతుడు తన మేనమామ యింటికి వెళ్లెను. అతడు మరల రాముడు వనవాసము వెళ్ళిన తర్వాతనే అయోధ్యకు వచ్చెను. కావున భరతుడు బహుశః ఒక సంవత్సరముకన్న ఎక్కువ కాలము తన మేనమామగారి ఇంటిలో నుండెను.

ఈ విధముగా తమ వివాహకాలమందు సీతారాములు ఇతర సోదర దంపతులు యువతీయువకులుగా నుండినారని పైన తెలిపినప్పటికి ఈ క్రింద నుదాహరించుచున్న ఆధారములనుబట్టి వారికి బాల్యమందే పెండ్లి మయ్యెనని వాదింపవలసి యుండును. ఎట్లనగా-


దశసప్తచ వర్షాణి తవ జాతస్య రాఘవః. (అయో. 20-45)


అరణ్యమునకు పోవునప్పుడు కౌసల్య రామునితో "రామా, నీవు పుట్టి 17 ఏండ్లయ్యెనుకదా" అని యన్నది. సీతను రావణు డెత్తుకొని పోవుటకై బ్రాహ్మణ వేషముతో వచ్చి నీ చరిత్ర యేమి అని సీతను విచారింపగా ఆమె యిట్లన్నది:


ఉషిత్వా ద్వాదశ సమా ఇక్ష్వాకూణాం నివేశనే
భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామసమృద్ధిని
తత స్త్రయోదశే వర్షే రాజా మంత్రయతః ప్రభుః
అభిషేచయితుం రామం సమేతో రాజమంత్రిభిః
మమ భర్తా మహాతేజా వయసా పంచవింశకః
అష్టాదశహి వర్షాణి మమ జన్మని గణ్యతే.
                                            (అరణ్య. 47-4, 5,10).


అనగా ——“నేను పెండ్లి అయినతర్వాత 12 ఏండ్లు నా భర్త యింటిలో నుంటిని. అరణ్యానికి వచ్చే కాలములో రామునికి 25 ఏండ్లు, నాకు 18 ఏండ్లు" అని సీత అన్నది. దీనినిబట్టి సీతకు పెండ్లికాలములో 6 ఏండ్ల వయస్సనియు, రామునికి 13 ఏండ్ల వయస్సనియు తేలుతుంది మరి రాముడు అరణ్యానికి పోయిననాడు 25 ఏండ్లవాడని సీత చెప్పు చున్నది. అయితే కన్నతల్లి కౌసల్య రామునికి అరణ్యానికి వెళ్ళేకాల ములో 17 ఏండ్ల వయస్సే అని చెప్పియుండెను కదా ! రాముని వయస్సువిషయములో తల్లి కెక్కువ తెలియునా? భార్య కెక్కుడుగా తెలియునా? తల్లిమాటయే ప్రధానమగును. అరణ్యానికి పోవుటకు 12 ఏండ్లకుముందు రాముని వివాహమైనందున ఈ లెక్కప్రకారము రామునికి వివాహకాలములో 5 ఏండ్ల వయస్సే యుండెను! అటైనచో "ఊన షోడశవర్షుడు" నా రాముడు అన్న తండ్రి దశరథునివాక్కు అబద్ధ మగును. రామునికే వివాహకాలమందు 5 ఏండ్లుండిన సీత కెన్ని ఏండ్లు? అత్తకోడండ్ర లెక్కల భేదమును వ్యాఖ్యాతలు సమన్వయింపవలసి వచ్చెను. వా రిట్లన్నారు. కౌసల్య అనిన 17 ఏండ్లు సరిగానే ఉన్నవి. సీత తెలిపిన 25 ఏండ్లు కూడ సరియైన లెక్కయే. ఎట్లనగా రాముడు పుట్టిననాటినుండి వయస్సులు లెక్కించవలసిన పనిలేదు. అతని ఉపనయనము క్షత్రియధర్మము ప్రకారము ఎనిమిదవయేట జరిగినందున ఆనాటినుండియే లెక్కించుకొని 17 అని సరిపెట్టుకుంటే చిక్కువదలి పోవును అని వ్యాఖ్యాతలన్నారు. అయితే సీత ఆ విధముగా ఎందుకు లెక్క పెట్టకపోయెనో తెలుపకపోయిరి! సమన్వయము ఎటుపట్టితే అటు చేయవచ్చును!! బుద్ధిచాకచక్యము కొలది సమన్వయము చేయవచ్చును. కాని ఒక విషయమును మాత్రము వ్యాఖ్యాతలు సరిపెట్టుటకు మఱచి పోయినారు. ఆదేమనగా, రామాదుల వివాహకాలములో కైకేయి తండ్రి తన మనుమడగు భరతుని చూడగోరినవాడై పిలుచుకొని వచ్చుటకు భరతుని మేనమామ నంపి యుండెను. అతడు అయోధ్యకు వచ్చి అచ్చట వారిని కానక మిథిలకు వెళ్ళి అచ్చటనే పెండ్లి సందడిలో ఉండి పోయెను. పెండ్లి అయిన తర్వాత అయోధ్య చేరిన వెంటనే భరత శత్రుఘ్నులను కైకేయి తండ్రియొక్క దేశానికి పంపిరి.. వారు మరల దశరథుడు చనిపోయిన తర్వాతనే తిరిగివచ్చిరి. సీతావాక్యము ప్రకారము భరతుడు 12 ఏండ్లు ఏకధాటిగా కేకయరాజ భవన మందుండినాడనవలెను. లేదా సీతాదేవి రావణునితో చెప్పిన మాటలు ప్రక్షిప్తములనియు తర్వాతివారి కల్పన యనియు చెప్పవలెను.

సీత రామునింట 12 ఏండ్లుండిన ముచ్చటను బలపరచుటకై ఆమె హనుమంతునితో ఇట్లన్నది. -


సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే. (సుంద. 33-17)


రావణుడు మాయారాముని శిరస్సు సీతకు పంపినప్పుడు ఆమె రాము నుద్దేశించి యిట్లు విలపించెను:


కిం మాం నప్రేక్షసే రాజన్ కిం మాం న ప్రతిభాష సే
బాలాం బాలేన సంప్రాప్తాం భార్యాం మాం సహచారిణీమ్.
                                                           (యుద్ధ. 32-20)


బాలికనైన నన్ను బాలుడవైన నీవు వివాహమైయుంటివికదా అని శోక సందర్భములో పలికెను.

రావణ వధానంతరము సీతను అగ్నిప్రవేశము చేయుమని ఆజ్ఞాపించినప్పుడు సీత రామునితో ఇట్లన్నది:


నప్రమాణీకృతః పాణి ర్బాల్యే బాలేన పీడితః.
                                               (యుద్ధ. 119-16)


బాలుడవగు నీవు బాలికను వివాహమాడి యుంటివి, అప్పటి మాటలు ప్రమాణములు కావేమో కదా అని యన్నది. ఈ యంశములు సీతారాముల బాల్యవివాహమును స్పష్టవాక్యములతో సమర్థించుచున్నవి. అయితే ఈ క్రింది ప్రమాణములు పై వాక్యములను ఖండించుచున్నవి.

ఎట్లనగా :— అనసూయాదేవితో సీత యిట్లనుచున్నది :


“పతిసంయోగసులభం వయో దృష్ట్వాతు మే పితా
చింతా మభ్యగమ ద్దీనో విత్తనాశా దివాధనః
తస్య బుద్ధి రియం జాతా చింతమానస్య సంతతం
స్వయంవరం తనూజాయాః కరిష్యామీతి ధీమతః
సుదీర్ఘస్యాథ కాలస్య రాఘవోయం మహాద్యుతిః
విశ్వామిత్రేణ సహితో యజ్ఞం ద్రష్టుం సమాగతః"
                                          (అయో. 118-34, 38, 44.)


“పతితో సంయోగమగుటకు తగిన వయస్సు నాకు నిండినది చూచి నా తండ్రియగు జనకునికి చింత ముదిరెను. నాకు స్వయంవరము చాటించవలెనని సంకల్పించెను. ఎందరో రాజులు వచ్చి శివధనుస్సును కదిలింపలేక వ్యర్థులై పోవుచుండిరి తుదకు ఈ రాముడు బహుకాలానికి వచ్చెను” అని సీత పలికిన మాటలను బట్టి ఆమె వ్యక్తురాలై పతి సంయోగసులభయై యుండెననియు పెద్దది కావుననే ఆమెయే స్వయముగా వరుని వరించు ఏర్పాటు చేయదలచి యుండిరనియు ఆమె పతిసంయోగసులభయైన తర్వాతకూడ సుదీర్ఘ (ఉత్తదీర్ఘ కాదు) కాలానికి గాని రాముడు రాలేదనియు సందేహానికి తావులేకుండా ఆమె పెండ్లినాటికి 16 ఏండ్లు దాటిన వయస్సుకలదిగా ఉండియుండునని ద్యోతకమగు చున్నది.

ఎట్లైతేనేమి సీతారాముల వివాహవయశ్చర్చ రామాయణములో పరస్పర విరుద్ధప్రమాణాలతో కూడినదై నేటి సనాతనులకుగాని సంస్కారులకు గాని ఆధారహేతువు కానిదైయున్నది.


రాముని ప్రవాసకాలము


రాముడు అయోధ్యనుండి చైత్రశుద్ధ 5 నాడు నిర్వాసితుడయ్యెను. అటు తర్వాత వనవాసకాలమును గురించి గోవిందరాజు ఈ విధముగా వ్యాఖ్యానించినాడు: "రాముడు చైత్రశుద్ధ 5 అయోధ్యను వదిలెను. అదే రాత్రి తమసాతీరమందు నిద్రించెను. షష్ఠినాడు శృంగిబేరపురమందును, సప్తమినాడు వృక్షమూలమునను శయనము. అష్టమినాడు భరద్వా జాశ్రమములో, నవమినాడు యమునాతీరమందు, దశమినాడు చిత్ర కూటము చేరెను. అదేరాత్రి అయోధ్యలో దశరథుడు చనిపోయెను. ఏకాదశినాడు దశరథశవాన్ని నూనెదోనెలో నుంచిరి. ద్వాదశినాడు భరతుని పిలుచుటకై దూతలు వెళ్ళి పౌర్ణమినాడు భరతుని కాంచిరి. చైత్ర బహుళ ప్రతిపత్తునాడు భరతుని ప్రయాణము చైత్ర బ 9 నాడు అయోధ్యను చేరెను. ఆనాడే దశరథుని సంస్కారము. ఆ నాటినుండి 13 వ దినమందు అనగా వైశాఖ శుద్ధ 5 నాడు భరతుడు శ్రాద్ధకర్మలను చేసెను. శుద్ధ 6 నాడు దహనదేశ శోధనము. సప్తమినాడు బాటలు బాగు చేయించును. నాలుగుదినాల తర్వాత 11 నాడు భరతుడు రామునివద్దకు ప్రయాణమగును. ద్వాదశినాడు భరద్వాజాశ్రమ మందు; త్రయోదశి నాడు రామ దర్శనము. మూడు దినాలు చిత్రకూటమందేయుండి వైశాఖ బహుళ విదియనాడు పాదుకలతో తిరిగిపోవును. చతుర్థినాడు అయోధ్య చేరును. ఈ విధముగా ఒకటిన్నర నెల గడచినతర్వాత రాముడు చిత్ర కూటమును వదలి అత్ర్యాశ్రమమును చేరును. వివిధ ఋష్యాశ్రమము లందు నివసించుచు 10 సంవత్సరాల కాలమును గడిపెను. మొత్తముపై 10 సంవత్సరాలపై ఒకటిన్నరమాసము గడిచినది. అప్పటినుండి 13 ఏండ్లు పూర్తియగువరకు పంచవటీతీర్థమందు నివసించెను. 14 వ సువత్సరారంభమందు చైత్రమాసములో రావణుడు సీతను అపహ రించెను. వైశాఖమందు రాముడు సుగ్రీవుని కలియును. ఆషాఢమందు వారి వధ. ఆశ్వయుజమందు సైన్యముల సమకూర్పు. ఫాల్గునమందు రాముని ప్రాయోపవేశము. ఫాల్గున శు 14 నాడు లంకాదహనము, ఫాల్గున అమావాస్యనాడు రావణ వధ. చైత్ర శు 1 నాడు రావణ సంస్కారము. విదియనాడు విభీషణాభిషేకము. తృతీయనాడు లంక నుండి ప్రయాణము. చతుర్థి కిష్కింధలో, పంచమి భరద్వాజా శ్రమములో. చైత్ర శు 7 పుష్యనక్షత్రములో శ్రీరాముని పట్టాభి షేకము."

ఈ వ్యాఖ్య చాలావరకు సరిగానేయున్నది కాని తుదిలో మాత్రము కొన్నితిథులు సరిగా లేవు. పై విషయాలనే కొద్దిగా వివరించిన స్పష్టము కాగలదు.

రాముడు అయోధ్యనుండి తమసానదిని చేరును. మరునాడు ఉత్తరకోసల చేరును. (అయో. 49-2) కోసలకావల వేదశ్రుతీనదిని దాటును. (49-9) అచ్చటినుండి అగస్త్యునిచే అధిష్ఠింపబడిన దక్షిణ దిక్కున కభిముఖు డయ్యెను. (49-10) వేదవతి ఆర్యావర్తానికి రాముని కాలములో హద్దుగా కనబడుచున్నది. రామాయణమందలి భౌగోళిక విజ్ఞానమును గురించి ప్రత్యేకముగా ముందు వ్రాయుదును. అందిట్టి విషయాలను చర్చింతును. తర్వాత గోమతిని దాటెను. (శ్లో.11) పిమ్మట స్యందికను దాటెను. (12) అచ్చటినుండి శృంగిబేరపురమును చేరి యచ్చట గంగను దాటెను. (25) గుహునితో కలిసెను. (33) గంగనుదాటి వత్సదేశములోనికి వెళ్ళెను. (52-101) తర్వాత ప్రయాగను చేరెను. ఆదియే భరద్వాజాశ్రమము. (అయో 54-5) ప్రయాగకు 10 కోసుల దూరమందు చిత్రకూట మున్నది. (54-28) యమునను దాటెను. (55-13) వాల్మీకిని సందర్శించుకొనిరి. (56-16) భరతుడు వచ్చువరకు రాముడు చిత్రకూటమందే యుండెను. (సర్గ 96) తర్వాత పాదుకా ప్రదానము. (స 112) రాముడు అత్రిని సందర్శిం చెను. (స. 117) అచ్చటినుండి దండకారణ్యము ప్రవేశించెను.(స.119) అచ్చట వివిధాశ్రమాలలో 10 ఏండ్ల కాలము గడిపెను. (ఆర. 11-24 నుండి 28) అచ్చటినుండి పంచవటికి వెళ్ళెను. (ఆర. 13 స.) అందు 13 వ ఏడు పూర్తి యగువరకుండెను. 14 వ ఏట చైత్రాది యందు సీతాపహరణము. తర్వాత సుగ్రీవ సఖ్యము. వాలి వధ. కిష్కింధలో ఆశ్వయు జారంభమువర కుందురు. ఆశ్వయుజ శు. 10 నాడు వానరులు సీతాన్వేషణానికి దిక్కు దిక్కులందు బయలుదేరుదురు. (కి. 37-12) కార్తిక శు 10 వరకు ఒక మాసములోపల సీత జాడను కని పెట్టవలెనని సుగ్రీవాజ్ఞ. (కి. 40-69) హనుమదాదులు గడవు దాటిరి. పుష్య మాసములో కూడ వెదకుచునే యుండిరి. అప్పుడు వసంతర్తువు ప్రారంభ మయ్యెను. (కి. 53-17 నుండి 22) గోవిందరాజాది వ్యాఖ్యాతలు (22 నకు) వ్యాఖ్యానించుచు పుష్య మాఘమాసములు గతించిపోయెను అని వ్రాసినారు. అటైన హనుమంతుడు లంకకు ఫాల్గుణములో వెళ్ళె ననవలెను. కాని హనుమంతుడు అశోక వనములో నుండగా రావణుడు సీతతో నిట్లనెను: "నేను నీకు పెట్టిన సంవత్సరపు గడువులో ఇక రెండు నెలలు మిగిలినవి" (సుం. 22-8) వ్యాఖ్యాతల లెక్క ప్రకారము శ్రీరాముడు రావణుని ఫాల్గుణ అమావాస్యనాడు చంపెను. సీత చైత్రా దిలో అపహరింపబడి యుండెను. కావున హనుమంతుడు లంకకు పోయినది మాఘమాసాదిలో వ్యాఖ్యాన కర్తలు హనుమంతుడు ఫాల్గు ణాదిలో లంకకు వెళ్ళెనని వ్రాయుట మూలవిరుద్ధ మగును.

రాముని దండయాత్ర ఫాల్గున పౌర్ణమినాడు ప్రారంభమగును. (యు. 4-6) ఈ తిథులనుండి వ్యాఖ్యాత లిచ్చిన తిథులు మూలమునకు విరుద్ధముగా నున్నవి. ఎట్లనగా - వ్యాఖ్యాతలు ఫాల్గుణ కృష్ణ ప్రతిపత్తు నాడు యుద్ధము ప్రారంభమైన దన్నారు. అది సరికాదు. ఫాల్గున పౌర్ణమినాడు రాముడు కిష్కింధనుండి దండయాత్ర చేయును. (యు.4-6) (అత్ర ఉత్తర ఫల్గునీత్యనేన సదివసః ఫాల్గుణ పౌర్ణిమా సీత్యవగమ్యతే-- గోవిందరాజు) సైన్యము దివారాత్రము లొకేదినము ప్రయాణముచేసి సముద్రమును చేరెను, (యు. 4-20) ఫాల్గుణ కృష్ణ ప్రతిపత్తునాడు రాముడు సుముద్రతీరమును చేరెను. అచ్చట 3 దినాలు ప్రాయోపవేశము చేసెను. (యు. 2!−10) చతుర్థినాడు సేతుబంధము. అది 5 దినాలు జరిగెను. (యు 22-66 నుండి 71 వరకు) అష్టమినాడు సేతువు ముగి సెను. కావున ఫాల్గుణ బహుళ 9 నాడు యుద్ధ మారంభమైనది. అమా వాస్యనాడు రావణవధ జరిగెను. కావున 6 దినాలే యుద్ధము జరిగెను. ఫాల్గుణ కృష్ణ 14 నాడు రావణుని స్వయం యుద్ధోద్యమము అమావాస్య నాడును యుద్ధము చేయును. (యు. 93-65) ఆనాడే చచ్చును 14 ఏండ్లు గడువు రేపు పూర్తియగుననగా చైత్ర శు 5 నాడు రాముడు అయోధ్య కొక్క దిన ప్రయాణదూరములోనున్న భరద్వాజాశ్రమమును చేరును. యు. 127-1 చైత్ర శు 6 నాడు అయోధ్యా ప్రవేశము శు 7 నాడు పట్టాభిషేకము.

ఇవి రామాయణములోని ముఖ్యమగు తిథులు. అయితే ఇందు కొన్ని దురవగాహముగా కనబడుచున్నవి. లంకనుండి అయోధ్యకు రెండుదినాలలో విమానమందు ప్రయాణము చేసినది ఆధునికులు విశ్వసింపరు. ఆ కాలములో విమానము లుండెనా? క్రీ. శ. 12 వ శతాబ్దములో భోజుడను రాజు విమాన యంత్రములను చేసి నడిపించినట్లు “సమరాంగణము అను గ్రంథములో (బరోడాలో ముద్రితము) వ్రాసినాడు. కాని రామాయణ కాలములోకూడ ఒక పుష్పకవిమానము పేరు తప్పితే వేరే విమానాల చర్చయే కానరాదు.

కిష్కింధకు లంకకు ఒకేదిన ప్రమాణమని రామాయణములో తెలిపినారు. మన మిప్పుడనుకొను బళ్లారిలోని హంపియే కిష్కింధ యైనచో, ఇప్పటి సింహళమే లంకయైనచో ఒక దినములో ప్రయాణము అసంభవము అటైన లంక యెక్కడ యుండెను? అను ప్రశ్న బయలు దేరును. ఈ లెక్కనుబట్టి మనము సరిగా నిర్ణయించజాలము. ఈ చర్చ ముందు భౌగోళిక ప్రకరణములో చేయుదును.

ఈ కాలనిర్ణయచర్చను ప్రత్యేకముగా చేయవలసివచ్చెను. ఎందుకనగా హిందువు లాచరించుకొను పండుగలలో కొన్ని రామునికి సంబంధించినవై యున్నవి. ఎవరికి తోచినట్లు వారు కొన్ని పండుగలను రామాయణానికి ముడిపెట్టుచున్నారు. చైత్ర శు 9 నాడు రాముని జననము, వివాహము, పట్టాభిషేకము మూడును జరిగిన వందురు. విజయ దశమి రావణుని చంపిన దినమని కొందరందురు. దీపావళి నాడు రావణుడు చచ్చెనని మరికొంద రందురు. హోలీనాడే రావణుడు చచ్చెనని ఇంకా కొందరు వాదింతురు. సీతారాముల వివాహము బాల్యమందయ్యెనని కొందరును యౌవనమందే జరిగెనని కొందరును వాదులాడుదురు. ఈ అపోహలను నివారించుటకై పై చర్చ చేయవలసి వచ్చినది.


సారాంశ మేమనగా-


(1) చైత్ర శు 5 నాడు శ్రీరాముని యౌవరాజ్యపట్టాభిషేక నిర్ణయము.

(2) చైత్ర శు 7 నాడు శ్రీరాముని పట్టాభిషేకము (రావణవధా నంతరము)

(3) శ్రీరాముడు చైత్ర శు 9 నాడు జన్మించెను.

(4) సీతారాములు బాల్యమందును యౌవనమందును వివాహితు లైనట్లు రెండు విధాల ప్రమాణము లుండుటచే ఉభయ ప్రమాణములును ప్రక్షిప్త వర్గములో చేరును.

(5) సీతాన్వేషణమునకు వానరసైన్యమును ఆశ్వయుజ శు 10 నాడు అనగా దసరాదినమునాడు సుగ్రీవు డంపెను.

(6) ఫాల్గుణ అమావాస్యనాడు రావణుడు వధింపబడెను.

  1. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, సంపుటము 12, సంచిక 2-3.