రామాయణ విశేషములు-4

పక్షిప్తములు

1

రామాయణమును అనేకశతాబ్దములలో క్రమక్రమముగా అభి మానులు పెంచుచు వచ్చినారనుటలో ఏ మాత్రమును సందేహములేదు. పెంచినవారు తమ హస్తక్షేపములను గుర్తించకుండా బాగుగా ప్రయ త్నము చేసినవారు కారు. పరస్పరవిరుద్ధములగు నంశములను వ్రాయుట, బౌద్ధ, క్రీస్తు శకానంతర విషయములను తమతమ కాలపు మత సాంఘిక స్థితులను గురించి వ్రాయుట, చరిత్రగా నుండదగిన దానిని అద్భుతములతోను మానవాతీతములతోను వర్ణించి పెంచుట, ఇట్టి వన్నియు ప్రక్షిప్తములని భావింతును

శబ్దములు అర్థముల నాశ్రయించి కొన్ని విడ్డూరపు కల్పనలు చేసిరి. వాలి అన తోక కలవాడని యర్థమగును కావున అతడొక కోతి తోక పైననే పుట్టెనని వ్రాసిరి. సుగ్రీవుడన మంచి గ్రీవము కలవాడు కావున అతడు వాలిని తోకపైకన్న కోతిమెడమీదనే పుట్టెనని వర్ణించిరి. ఇట్టివి పురాణములం దంతటను సర్వసాధారణముగా కనిపించు విశిష్టతలు! ఇవన్నియు ప్రక్షిప్తములే యగును.

2

బాలకాండలోని రావణ వధోపాయ సర్గము (15), పాయసోత్పత్తి సర్గము (16). ఋక్ష వానరోత్పత్తి సర్గము (17), స్పష్టముగా తర్వాతి కల్పనలే! రావణవధార్థము పుట్టిన వానరులలో వాలికూడ చేరినవాడు. “వానరేంద్రం మహేంద్రాభ మింద్రో వాలినమాత్మజం." ఇంద్రుడు తనతో సమానుడగు వానరేంద్రుని వాలిని పుట్టించెనని కలదు (బాల. 17–10) అట్టి కారణకన్ముని శ్రీరాముడేల చంపెను?

శ్రీరాముడు "శ్రైష్ఠ్యం శాస్త్రసమూహేషు ప్రాప్తోవ్యా మిశ్రి కేషుచ." శాస్త్రములందు వ్యామిశ్రకావ్యములందు ప్రవీణు డని వర్ణించి నారు (అయో. 1-27). రాముని కాలమందు ప్రాకృత భాషలు వ్యామిశ్రి కము లుండెనా? ప్రాకృతోత్పత్తి పాణిన్యనంతరమై యుండును. కావున ఈ శ్లోకము ప్రక్షిప్తమగును.

"ప్రాకృత వ్యాకరణసంప్రదాయములు రెండు. మొదటిది హిందూదేశ ప్రాగ్భాగమునకును రెండవది పడమటిభాగమునకును సంబంధించినవి. శాకల్య భరత కోహలాదుల ననుసరించి వరరుచి వ్రాసిన ప్రాకృత ప్రకాశము తూర్పు సంప్రదాయమునకు చేరినది. పడమటి సంప్రదాయమునకు జేరిన సూత్రాత్మకమైన ప్రాకృత వ్యాకరణము మరి యొకటి. దానిని వాల్మీకి రచించెనని తన్మతానుసారులైన త్రివిక్రమ హేమచంద్ర సింహరాజ లక్ష్మీధర ప్రభృతులు చెప్పుచున్నారు. ఈ విషయము వివాదగ్రస్తమైయున్నది" అని శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు వ్రాసిరి.[1]

3

బాలకాండలోని మొదటి సర్గలో రామాయణ సంగ్రహము తెలుప బడినది. అందు లేనివి విపులమగు రామాయణములో నుండుట అన్నిటగాకున్నను కొన్నిట ప్రక్షిప్తములనియు తర్వాత పెంచినవనియు సందేహము కలుగుట కవకాశము కలదు.

1 నుండి 19 శ్లోకాలు రాముని యుత్తమత్వ వర్ణన కలవి. 20 లో రాముని పట్టాభిషేకాలోచన కలదు. ఇందు తాటకావధ లేదు. శ్లో. 28 లో "పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేనచ" అనుటచే రాముడు వనవాసమునకు వెళ్లునపుడు తండ్రి కూడ పౌరులతో పాటు చాలాదూరము వెంటవెళ్లెనని కలదు కాని అయోధ్యకాండలో ఇది లేదు.

శ్లో॥ 52 లో బంగారుజింక ముచ్చట లేదు. రామలక్ష్మణుల నొకేమారు మోసగించి దూరముగా మారీచుడు తీసుకొనిపోయెనట!

బాలకాండ మూడవ సర్గలో 9 వ శ్లోకమునుండి సర్గ తుదివరకు రామాయణ సంగ్రహము చెప్పినారు. అందు మరికొన్ని విశేషాలు కలవు. పుష్పకమును రాముడు చూచెను అని కలదు (శ్లో. 36). అది రావణ భవనమని స్పురించును. సర్గతుదిలో “వైదేహ్యాశ్చ విసర్జనం" అని ఉత్తరకాండ సూచితము శ్లో. 37 లోను అటులే సూచితము. ఉత్తర కాండ వాల్మీకి రచితముకాదని వ్యాఖ్యాత లొప్పుకొన్నారు. ఈ సంగ్రహ ములో దాని సూచన వచ్చుటచే ఇదియు తర్వాతివారిచే వ్రాయబడెనేమో? బాలకాండ నాల్గవ సర్గలో 4,5 శ్లోకాలలో కుశలవ అను శబ్దమున్నది. దానికి కథ చెప్పువారని అర్థమగును.


“వాచో విధేయం తత్సర్వం కృత్వా కావ్య మనిందితౌ”
                                                          (శ్లో. 12)


అనుటచే వారు రామకథను (వాచోవిధేయం) కంఠపాఠము చేసిరి. 24,000 శ్లోకాలను కంఠపాఠము చేయగలిగిరా? రామాయణము పురాణముకాదు. "కావ్యము" అని పై శ్లోకమే తెలుపుచున్నది. దానిని వారు “పాడిరి” (జగతుః. బాల. 4-13) ఆ రామాయణమును ఎవరు ప్రదర్శింపగలరు? (ప్రయుంజీయాత్. బా. 4-3) అని వాల్మీకి తలపోసె ననుటచే తందాన కథవలె అభినయముతో గానముతో కథ చెప్పబడె ననుట స్పష్టము. శ్రీ. ఓ. మెకటరంగయ్యగారు ఇట్లు తెలుపుచున్నారు: "వాల్మీకి 500 సర్గలు రచింతుననెను. కాని ఇప్పటి షట్కాండములందు 537 సర్గ లున్నవి. ప్రక్షిప్తములు కొన్ని చోట్ల స్పష్టముగ తెలియును. పూర్వవ్యాఖ్యా తలే బాలకాండలోని మహామైథున సంకల్పము, యుద్ధకాండలోని ఆదిత్య హృదయమును ప్రక్షిప్తములుగ గణించిరి సుందరకాండలో సీత హను మంతునితో చెప్పిన కాకాసురవృత్తాంతమునకు కొన్ని ప్రతులలో అయోధ్యకాండలో నొక సర్గమంతయు కల్పింపబడినది. యుద్ధకాండ సర్గలు 120,121,122 ప్రక్షిప్తములుగ నగపడుచున్నవి అందు “కృష్ణః ప్రజాపతిః”అని రాముడు స్తుతింపబడినాడు. అది భవిష్యత్కృష్ణావతార సూచనయని గోవిందరాజ వ్యాఖ్య. ప్రక్షిప్తముల విడదీసి వాల్మీకి ప్రోక్తమగు భాగమును మాత్ర మెవ్వరైన నిర్ణయింప గలుగుదురేని గొప్ప భాషా సేవగ నుండును.[2]

4


"కృత్స్నం రామాయణం కావ్య మీదృశైః
 కరవా ణ్యహం" (బాల. 2-41)


అని రామాయణమంతయు అనుష్టుప్పు శ్లోకాలతో రచించుతున్నా నని వాల్మీకి ప్రవచించెను కదా! తక్కిన శ్లోకాలన్నియు ప్రక్షిప్తా లన వలెనా లేదా? బాలకాండ మొదటి నాలుగు సర్గలలో వాల్మీకి అను మహర్షి రామాయణమును రచించెను అని పలుమారు లితరులు చెప్పినట్లుగా

వర్ణించుటచేత ఆ నాలుగు సర్గములును ప్రక్షి ప్తములే యనిపించును.


బాలకాండలోని నాల్గవ సర్గలో -
"చతుర్వింశ త్సహస్రాణి శ్లోకానా ముక్తవాన్ ఋషిః,
 శతాని పంచ సర్గాణాం షట్కాండాని తథోత్తరం.”


500 సర్గలు, 6 కాండలు, పైగా ఒక ఉత్తరకాండ వ్రాయబడే ననియు, 500 సర్గలలో 24,000 శ్లోకా లుండెననియు పై శ్లోకములో చెప్పినారు. కాని యిప్పుడు ముద్రితమైన రామాయణములో 6 కాండలలో 537 సర్గలున్నవి. ఉత్తర కాండలో 111 సర్గలున్నవి. అవికూడా కలిపితే 688 సర్గలగును ఇక శ్లోకాలసంఖ్య యెట్టిదనగా యుద్ధకాండ ములో 112 వ సర్గాంతములోని—


"మరణాన్తాని వైరాణి నిర్వృత్తం నః ప్రయోజనమ్"


అను పంక్తిలో "నః" గాయత్రియొక్క 19 వ అక్షరము. అందుచేత అక్కడికి 19,000 శ్లోకాలు పరిపూర్తి అయినవి. అటుతర్వాత యుద్ధకాండములోని శ్లోకాలు 830 కావున యుద్ధకాండాంతముతో 19,830 శ్లోకాలగును 24,000 శ్లోకాల సంఖ్య పూర్తిచేసుకొనుటకుగాను ఉత్తరకాండనుగూడ చేర్చుకోవలెను. ఉత్తర కాండలో 3456 శ్లోకా లున్నవి. ఈ విధముగా 7 కాండలలో 23,288 శ్లోకాలున్నవి. అనగా అప్పటికిన్నీ 24,000 సంఖ్య పూర్తికాలేదు. కొన్ని ప్రక్షిప్త భాగాలని వ్యాఖ్యాతలే వ్యాఖ్యానించినవారు కారు. ఉత్తరకాండను గోవిందరాజు, మహేశ్వరతీర్థాదులు వ్యాఖ్యానించనేలేదు. ఎటుచూచినను సర్గభేదాలు శ్లోకభేదాలు కనబడుచునే యున్నవి. రామాయణములో కొన్ని ఘట్టాలను తర్వాతివారు చేర్చినారు. రాముని విష్ణ్వవతారముగా వర్ణించు భాగా లన్నియు తర్వాత చేర్చబడినవే.

ఇంద్రుని ప్రాబల్యము తక్కువై శ్రీకృష్ణుని కాలములో విష్ణు దేవునిపూజ ప్రాధాన్యము వహించెను. కృష్ణుని యనంతరము దశావతార సిద్ధాంతము కల్పితమయ్యెను. ఇంకను ఏవేవి దశావతారాలో స్పష్టపడ లేదు. అందుచేత వివిధ పురాణాలలో వివిధ పద్ధతులపై వ్రాయుచు వచ్చిరి.


“మత్స్యః కూర్మో వరాహశ్చ నృసింహో వామనస్తథా
 భార్గవో రాఘవః కృష్ణః బుద్ధః కలికిరేవచ .”


ఈ శ్లోకము మహాభారతము 12-348-2 అనుచోట ఉన్నదని జ. మో. చటర్జీగారు పృశ్నిగాథా పీఠికలో వ్రాసిరి. ఆది యందు కాన రాలేదు. పైగా ఈ క్రింది శ్లోకము మాత్రము మహాభారతమందు కనబడు చున్నది:


హంసః కూర్మశ్చ మత్స్యశ్చ ప్రాదుర్భావా ద్ద్విజోత్తమ
వారాహో నరసింహశ్చ వామనో రామ ఏవచ
రామో దాశరథిశ్చైవ సాత్వతః కల్కి రేవచ .”
                               మహాభారతం - శాంతి. 339 - 100


ఇందు బుద్దునిపేరు లేదు. రాబోవు కల్కి పేరున్నది. సాత్వతు డనగా బలరాముడా కృష్ణుడా అను సంశయానికి తావులేకుండా పైభాగ మందు శిశుపాల కంసాదులవధ చేయుదునన్నందున కృష్ణుడే యని స్పష్టమగుచున్నది. ఈ యవతార పట్టిక లో హంసావతార మెక్కుడుగా నున్నది. వామనపూజలో ఈ క్రింది శ్లోకము కనబడుచున్నది:


మత్స్యం కూర్మంచ వారాహం నారసింహంచ వామనం
రామం రామం రామకృష్ణం బౌద్ధం కల్కిం నమామ్యహమ్.


ఇచ్చట ముగ్గురు రాములు- పరశురాముడు, రఘురాముడు, బలరాముడు చేరినారు. కృష్ణుడును చేరినాడు. ఈ విధముగా అవతారాల నిర్ణయము ఇంకను ఏకరూపము దాల్చియుండ లేదు.

5

గుప్తరాజుల కాలమువరకు ( క్రీ. శ. 500 ) శ్రీరామపూజకు స్థానము లేకుండెననియు, రామ దేవాలయములు లేకుండెననియు రామ భక్తులమని యేరాజులును తెలుపుకొన్న జాడలు లేవనియు క్రీ. శ. 500 అనంతరమే రామపూజా ప్రాముఖ్యము వ్యాపించెననియు (New history of the Indian People-Vol. VI) తెలియవచ్చినది. దశావతార ములు క్రీస్తుశకము నాల్గవ శతాబ్దము తర్వాతనే ఒక రూపానికివచ్చి స్థిర పడెను. బుద్ధుని మతవ్యాపకమును గమనించి హిందూమత పునఃస్థాపకులు బుద్ధుని తొమ్మిదవ అవతారముగా అంగీకరించిరి. అమరసింహుడు క్రీస్తు శకము 300 ప్రాంతకాలములో నుండినట్లూహింపబడుచున్నది. అతని కాలము వరకు దశావతార స్వరూప మేర్పడలేదు. ఏర్పడియుండిన ఎన్నియో యల్పవిషయాలను తెలిపి యతడీ మహద్విషయము నెగుర గొట్టెననుటకు వీలులేదు. అతడు బౌద్ధుడైయుండును. అతని మొదటి శ్లోకము “దయాసింధువును" గూర్చినది. దేవతల పేర్ల పట్టికలో మొదట బుద్ధుని పేళ్ళుచెప్పి తర్వాత విష్ణువుపేళ్ళు తెలిపినాడు. జైనుడై యుండిన మహావీరుని కాని తీర్థంకరులను గాని జైనమత ప్రతిపాదకుల నెవ్వరినిగాని పేర్కొనకుండా యుండునా? అతడు విష్ణువు పర్యాయపదములలో కృష్ణుని "దేవకీనందనుని” బలి ధ్వంసి" యగు "త్రివిక్రముని" మాత్రమే పేర్కొన్నాడు. దశరథ రాముని పేరెత్తుకొననేలేదు! బలరాముని విష్ణు నామములలో చేర్చక వేరుగాతెలిపెను. అంతమాత్రమైనను శ్రీరామచంద్రునిగూర్చి తెలుపలేదు. ఆదేవిధముగా ఋషులలో “నారదాదులు” అన్నాడు. కాని అచ్చటగాని ధీవర్గమందుకాని, వాగ్వర్గమందుకాని, యెచ్చటకాని ఆదికవియగు వాల్మీకిని పేర్కొనలేదు. దీనినిబట్టి అమరసింహుని కాలమువరకు శ్రీరామ ప్రాముఖ్యముకాని అవతారత్వముకాని స్థిరపడలేదని. తలప వచ్చును. కాని కాళిదాసు మాత్రము శ్రీరాముని స్పష్టముగా అవతార పురుషునిగా వర్ణించినాడు. రఘు వంశ దశమసర్గలో విష్ణువు ఋషులతో తాను దుర్మార్గవధార్థమై దశరథుని కుమారుడుగా పుట్టుదునని చెప్పెనని తెలిపెను. పదమూడవ సర్గములోని మొదటి శ్లోకమందే “రామాభిధానో హరిః" రామునిపేరుతో వర్తిస్తున్న హరి (విష్ణువు) అని వర్ణించెను. కాళిదాసు రామాయణకథలో నంతటను శ్రీరాముని అవతారపురుషుని గానే వర్ణించెను. అయితే కాళిదాసెప్పటివాడు? భాససౌమిల్లకుల తర్వాతి వాడనని తానే తన మాళవికాగ్నిమిత్రములో తెలుపుకొనెను. ఈ నాటకములోని ఆగ్నిమిత్రుడు మగధరాజగునేని (అవునని పలువు రన్నారు) కాళిదాసు క్రీస్తునకు పూర్వము 150 ప్రాంతము వాడగును. మరికొందరు గుప్తరాజులలో చంద్రగుప్తుడనువాడు విక్రమార్క బిరుద మును వహించెననియు కావున కాళిదాసప్పటివాడనియు అనగా ఇంచు మించు క్రీ. శ. 450 ప్రాంతమువాడనియు నందురు. కావున రాముని అవతార తత్వము క్రీ. పూ. 150 ముందు లేకుండెననియు క్రీస్తుశకము 350 లోపల నేర్పడెననియు అనవచ్చును

6

శ్రీమద్రామాయణములో రాముడు తాను విష్ణ్వవతారమను మాటను మరిచిపోయి యుండెను. రావణునితో యుద్ధముచేయు సందర్భ ములో అతనికి దేవతలు ఈ విషయాన్ని జ్ఞాపకముచేసిపోయిరి. రామ లక్ష్మణులు నాగపాశ బద్ధులైనప్పుడు గరుత్మంతుడు దివ్యజ్ఞానముతో నీ సంగతిని గ్రహించి వెంటనే రణభూమికి వెళ్ళి నాగపాశములనుండి రామ లక్ష్మణసోదరులను విడిపించగా రాముడు తెలివినొంది "ఓయీ, నీ వెవ్వరు?" అని ప్రశ్నింపగా “నేను మీకు స్నేహితుడను" అని గరుత్మంతుడు చెప్పెను. రాముడు తన స్నేహితు నెట్లు మరిచిపోయెను?

అప్పుడప్పుడు రాముడు మనిషివలెనే ఆచరించుటను వ్యాఖ్యాతలు సమన్వయించినారు. ఆవిధముగా అతడు నటన చేసెనట! అక్కడక్కడ రామాయణములో కొన్ని శ్లోకాలు అవతార నిరూపణకైచేర్చినారు. ఆదిలోనే బాలకాండలో విష్ణువు దేవతలతో నిట్లన్నాడు: "నేను రావణుని జంపి భూలో కములో 11,000 ఏండ్లుందును.” రావణుని వధకై వచ్చిన యవతారము ఆ పని పూర్తియైన తర్వాత 11,000 ఏండ్లుండి ఏమి సాధించెను? దానికి కారణమేమియు తెలుపలేదు. శ్రీకృష్ణుడు 116 ఏండ్లే జీవించెనని భారతమునుండియు ఛాందోగ్యోపనిషత్తు నుండియు తెలియవచ్చు చున్నది. కాని రాముడు 11,000 ఏండ్లు కారణము లేకుండా ఎందుకు జీవించెను? ఇట్టి యంశాలన్నియు తర్వాత చేర్చబడినవే.

రామాయణమందు అందందు చైత్యములను గురించి వ్రాసినారు. అవి బౌద్ధాలయములే యని చెప్పజాలము. కాని సందేహానికి తావు లేనట్లుగా జాబాలి అనువాడు రామునితో శ్రాద్ధము పెట్టవలసిన అవసరము లేదని వాదింపగా శ్రీరాము డాగ్రహించి యిట్లు పరుషోక్తులనాడెను:


యథా హి చోర స్సతథాహి బుద్ధః, తథాగతం నాస్తిక మత్ర విద్ధి
తస్మాద్ధి యశ్శంక్యతమః ప్రజానాం, న నాస్తికేనాభిముఖోబుధ
                                                 స్స్యాత్- అయోధ్య. 110-34.


బుద్ధుడు (లేక తథాగతుడు) చోరుడు. అతని మతము గర్హ్యము అని రాముడు తొమ్మిదవ అవతారాన్ని నిందించెను. బుద్ధుడు క్రీ.పూ. 550 ప్రాంతమందలివాడు. అతని వేదవిరుద్ధమైన బౌద్ధమతము వ్యాప్తి నొందిన తర్వాత దాని సిద్ధాంతములలోని శ్రాద్ధప్రాతికూల్యమును రాముని ద్వారా పౌరాణికులు ఖండింపజేసినారు. మరొకచోట,


శ్రూయతే మనునా గీతా కిష్కింధ 18-31 నుండి 33 వరకు.


అను రెండు మనుస్మృతి శ్లోకాల నుదాహరించినారు. రాముని వంశమం దాదిపురుషుడు మనువను వాడుండెను. ఈ యుదాహృతు డతడు కాడు. రాజాభిర్ధృతదండాస్తు - అను శ్లోకము, మనుస్మృతి VIII, 38 లోనున్నది. శాసనాద్వా విమోక్షాద్వా - అను శ్లోకము మనుస్మృతి VIII, 316 లోనున్నది. మనుస్మృతిలో ఈ యుదాహృత శ్లోకాలలో నొకటి కానవచ్చుచున్నది. కాన ఈ మనువు స్మృతికర్తయై యున్నాడు.


మరొకచోట -

పంచపంచనఖా భక్ష్యా బ్రహ్మక్షత్రేణ రాఘవ-కిష్కింధ. 17-37.

అను వాక్యము క లదు.


గౌతమ ధర్మసూత్రములలో “పంచ పంచ నఖా భక్ష్యాః" అను సూత్రము కలదు. ఎవరు ముందు వ్రాసిరో తెలియదు. అభక్ష్యపంచ నఖులను గూర్చి మహాభాష్యమందును పశ్పశమందు చర్చించినారు. యుద్ధకాండమలో రావణుని అమాత్యాదులు చనిపోగా కుంభకర్ణుని లేపుటకుముందు రావణుడు తన సభ్యులతో ఇట్లనెను:


“ఇక్ష్వాకుకులనాథేన అనరణ్యేన యత్పురా”. యుద్ధ. 60-8.


రావణుడు ఇక్ష్వాకువంశమందు పూర్వికుడైన అన రణ్యుడను రాజును జంపెను. అతడు చనిపోవుచు "ఓరీ నా వంశమందు నిన్ను జంపువాడు పుట్టగలడు" అని శపించి పోయెనని అందు చెప్పబడినది. ఇది క్రొత్త విషయము. ಇಂత వరకు ఈ ముచ్చట ఎందును రాలేదు. ఈ అనరణ్యు డెవ్వడు? రామాయణ బాలకాండలో 70 వ సర్గలో ఇక్ష్వాకు వంశవృక్ష మియ్య బడినది. అందు త్రిశంకుని తాత అనరణ్యుడని పేర్కొనబడినాడు. అట్టి అనరణ్యుడు రాముని కన్న 29 తరాలకు ముందుండినవాడు. తరమునకు 25 ఏండ్ల లెక్క ప్రకారము చూచిన అనరణ్యుడు రామునికంటె 725 ఏండ్లకు ముందుండినవాడు. అయితే యీ లెక్క కలికాలపులెక్క. కృత యుగములో దశరథుడే 60,000 ఏండ్లు జీవించెను. మరి అతని పూర్వికులు ఒక్కరొక్క రెన్నివేలయేండ్లు జీవించిరోయేమో? ఆ లెక్క ప్రకారము చూచిన మనకేమియు అర్థము కానేరదు. రామునికన్న 29 తరములకు ముందుండిన అనరణ్యుని రావణుడు చంపినాడన్న రావణుని వయస్సెంత యుండవలయునో గణితశాస్త్రజ్ఞులును, జ్యోతిష్కులును, పౌరాణికులును కలిసి లెక్కలు వేయుచుండవలసినదే !

జైన రామాయణములో ఇట్లు వ్రాసినారు: “విజయుడు అయోధ్య నేలుచుండెను. అతని తర్వాత 27 గురు రాజ్యముచేసిరి. కడపటివాడగు అనరణ్యుడు రఘుమహారాజు కుమారుడు. అతనికి దశరథుడు పుట్టెను. దశరథునికి రామాదులు పుట్టిరి.” దీనినిబట్టి అనరణ్యుడే అజమహారాజని తేలును. ఇది రామాయణకథకన్న ఎక్కువగా విశ్వసనీయమై యున్నది.

రాముడు చిన్నవాడుగా ఉండినప్పుడు రావణుడు రాముని తాతకాలమువాడుగా నుండెనని దీనివలన అర్థమగును. అయినను వృద్ధ రావణునికి పరకాంతాకాంక్ష యెట్లు కలుగును? మొత్తాని కీ విషయము ప్రక్షిప్తమని తోచుచున్నది.

దశరథుడు అశ్వమేధమును చేయించుటకు ఋశ్యశృంగుని పిలిపించెను. అతడెవరైనది దశరథునికి తెలియదు. అందుచేత తన మంత్రి అతనికథను తానుగూడా ఎవరో పూర్వములో చెప్పగా విని దశరథుని కరిగించెను. ఋశ్యశృంగుడు తుదకు దశరథుని అల్లుడే! అల్లునిసంగతి మామకే తెలియకపోయెను పాపము! శాంత అను కూతురు దశరథునికి ఉండెనట. ఆమె ఏ దేవేరికి పుట్టెనో యేమో జాడయే కానరాదు. దశరథుని కంతవరకు కుమారులు జనింపలేదు. అట్టిస్థితిలో ఉన్న యొక్క కూతురును ఎవడో అంగరాజట, అతనికి దత్తుగా ఇచ్చి వేసెను. ఈ కథయంతయు కల్పితమే యని స్పష్టము

7

రాముడు వనవాసమునకు వెళ్ళుచు కైకతో ఇట్లు శపథము చేసెను:


చతుర్దశహి వర్షాణి వత్స్యామి విజనే వనే, మధుమూల ఫలైర్జీవన్
హిత్వా మునివ దామిషం.
                                                           - అయోధ్య. 20-29


నేను ఈ 14 ఏండ్లు మాంసము తినకుండ మునివలె అరణ్యంలో ఉంటాను అని మాటయిచ్చి నాలుగైదు దినాలకే అరణ్యానికి పోయిన ఆది లోనే ఆ శపథాన్ని మరచిపోయెనా? గంగనుదాటి మొదటిదినమే అరణ్యావాసము చేసిననాడు నాలుగు పెద్దమృగాలను చంపి తానును సీతయు లక్ష్మణుడును తినినారు.


“తౌ తత్ర హత్వా చతురో మహామృగాన్, వరాహ మృశ్యం పృషతం మహారురుం
 అదాయ మేధ్యం త్వరితం బుభుక్షితౌ, వాసాయ కాలే యయతు ర్వనస్పతిమ్. - అయోధ్య. 50-102.


ఇంతేకాక ఇంచుమించు పది యిరువదితావులందు రామాదులు మాంసమును తిన్నట్లు వర్ణించినారు. హనుమంతుడు సీతతో ఇట్లన్నాడు: “రాముడు మీ వియోగదుఃఖముచే మద్యమాంసములను వదలివేసినాడు.” (సుం.36-41)

దీనినిబట్టి రామాదుల మాంసభక్షణమో లేక తద్వర్జనమో ఏదో

యొక భాగము ప్రక్షిప్తమైనదనుట స్పష్టము.

8

లక్ష్మణుని పెండ్లి అయ్యెనా ?

లక్ష్మణునికి పెండ్లి అయినట్లు అతని భార్యపేరు ఊర్మిళ అయి నట్లు బాలకాండలో ఇట్లు కలదు:


అబ్రవీత్ జనకో రాజా హర్షే ణాభిపరిప్లుతః
లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా.
                                       బాల. 73 స. శ్లో. 70 నుండి.


ఈ శ్లోకాలు ప్రక్షిప్తములనియు లక్ష్మణునికి వివాహము కాలే దనియు అనుమానము కలుగుచున్నది. ఈ అనుమానమును వాల్మీకి రామాయణములోని ఇతర భాగాలు బలపరచుచున్నవి. ఎట్లనగా-

లక్ష్మణుడు 14 ఏండ్లు రామునితో వనవాసమునకై వెళ్ళినప్పుడు ఊర్మిళతో ఒక్కమాట ఆయినా చెప్పిపోయినట్టి జాడలేదు. రామాయణ ములో ఊర్మిళజాడ మరెందును స్పష్టముగా కానరాదు.

అరణ్యావాస కాలమందు శూర్పణఖ రాముని కామించి తనమనోరథ మును ప్రకటించుకొనగా రామభద్రు డిట్లనెను:


అనుజస్త్వేష మే భ్రాతా శీలవాన్ ప్రియదర్శనః,
శ్రీమాన కృతదారశ్చ లక్ష్మణోనామా వీర్యవాన్.
                                         ఆరణ్య. స. 18 శ్లో. 3.


ఓ శూర్పణఖా, ఈ నా తమ్ముడగు లక్ష్మణుని లక్షణవంతుని శ్రీమంతుని చక్కని వాని వరింపుము. ఇతడు పెండ్లికానివాడు. వీర్య వంతుడు అని రాముడనెను. రాముడు శూర్పణఖతో సరసాలాడుచు తమాషాగా అన్న ముచ్చట అని యెవ్వరైనా అందురేమో? శ్రీరాముడు ఛలోక్తులలో సహితము అబద్ధమాడని వాడని వర్ణించినారు కదా! అప్పుడు రామునికి ఆనృతదోషము అంటగట్టిన వారగుదురు.

సీతను ఎత్తుకొనిపోవుటకై బ్రాహ్మణవేషముతో వెళ్లిన రావణునితో సీత ఇట్లనెను :


సభ్రాతా లక్ష్మణోనామ
ధర్మచారీ దృఢవ్రత”.
                         అరణ్య. స. 24 శ్లో. 29


ఇచ్చట ధర్మచారీ అను పదానికి మారుగా “బ్రహ్మచారీ” అని కొన్ని రామాయణప్రతులలో నున్నదని పలువురు వ్రాసినారు. “బ్రహ్మచారీ" అను పదము సరియగుచో ఊర్మిళయొక్క అస్తిత్వమే యెగిరిపోవును.

మొత్తముపై ఊర్మిళాలక్ష్మణ వివాహము సంశయాస్పదము. “ఆకృతదారుడు” అనగా ఇప్పుడు వెంటభార్యలేనివాడని వ్యాఖ్యాతలు సరిపెట్టజూచినారు. కాని యది తృప్తిపరుపజాలని డొంకతిరుగుడు ద్రావిడ ప్రాణాయామముగా నున్నది.

9

హిందూస్థానములో లభ్యమైన వివిధప్రాంతాలలోని రామాయణ ప్రతులనుబట్టికూడా మధ్యమధ్య యెవరికి తోచినట్లు వారు తమతమ హస్తలాఘవమును చూపినారు. “పశ్చిమ హిందూస్థానములోను, బెంగాలు లోను, బొంబాయిలోను, లభ్యమైన రామాయణ ప్రతులలో సరాసరి మూడవభాగమువరకు ఒకదానిలో నున్నట్లుగా ఇంకొకదానిలో లేదు" అని మెక్డానెల్‌గారు వ్రాసినారు. రామాయణమును ఒక మహాకావ్యము క్రింద లెక్కపెట్టి దానిలో కావ్యరీతులను, వర్ణనలను సరిగా ఉండునట్లు

  1. సంస్కృత వాఙ్మయ చరిత్ర - భాగము 1. పుటలు 65-66.
  2. శ్రీ ఒంగోలు వెంకట రంగయ్య, బి. ఏ., బి ఎల్. గారు (నెల్లూరు) ఈ రామాయణ విశేషముల మొదటి ముద్రణమును చదివి నాకు విపులముగా 3 జాబులు వ్రాసిరి. వారి పరిశోధక విజ్ఞానము అతి విపులము. వారు నా భావములతో చాలావరకేకీభవించి నాకు మంచి ప్రోత్సాహము కలిగించినారు.