రాజస్థాన కథావళి/రాణా కుంభుడు

రాణా కుంభుఁడు.


రాణాముకుళుని దర్బారులో నున్న దొరలలోఁ గాఁచుడు మేరుఁడు ననునిరువురు సోదరు లుండిరి. వారు ముకుళుని తాతయగు ఖేటసింగునకుఁ గుమారు లగుటచే నతనికి సవతి పినతండ్రులైరి. కాచ మేరులతల్లి భేటసింగునకు నగ్ని సాక్షిగా వివాహమైన ధర్మపత్ని గాక యుంపుడుకతైయై పేద యగువడ్లబత్తునికూఁతు రగుటచే వారు సంస్థానమందుఁ జండుని తరువాత గౌరవనీయు లయ్యుఁ గొంచెము తక్కువగఁ జూడఁబడు చుండిరి. ఆయన్నదమ్ము లిరువురు తమవడ్ల బత్తుల చుట్టరికపుమాట యెవరుఁ దలపెట్టినను మహాకోపోద్దీపితు లగుచు వచ్చిరి. ఈసంగతి రాజుకొలువున నున్నవారి కందఱకు విశదము.

మహారాణా యగు ముకుళుఁ డొకనాడు కొందఱు బందిపోటు దొంగల దఱిమికొట్టుచు విశ్రాంతికై యొక మామిడితోఁపులో దొరలందఱుఁ గొలువఁ గూరుచుండెను. అదివఱ కెన్నఁ డతఁడు చూచి యెఱుఁగని యొక చెట్టక్కడ కనంబడుటచే ముకుళుఁడు దాని పేరేమని దగ్గర నున్న యొక దొర నడిగెను. ఆదోర తనకును గాచమేరులకును మనస్పర్ధ లుండుటచే వారి నవమానము చేయుటకై యామ్రాని పేరుఁ దా నెఱుఁగనట్లు నటించి వారి నడుగుమని రాజుతో మెల్లఁగఁ జెప్పెను. రాణా యందలికిటుకు నెఱుఁగక పినతండ్రుల బిలిచి యావృక్షముపే రడిగెను. ఆయన్న దమ్ము లిద్దరు వెంటనే తాము వడ్లబత్తుని సంతతి యగుటచేఁ జెట్ల యొక్క పేళ్ళు నాణెములుఁ దమకుఁ జక్కఁగఁ దెలియు నను నర్థముతో రాజా ప్రశ్న తమ్మవ మానించుటకయి యడిగె నని మహాకోపోద్దీపితు లై యప్పటి కూరకుండి సాయంకాలము రాణా జపము చేసికొనునప్పుడు కత్తుల దూసి వాని పైఁ బడి తుత్తునియలుగా నఱికి చిత్తూరుకోటం బట్టుకొనుటకు నప్పుడ గుఱ్ఱముల నెక్కి పోయిరి. కోట కావలివాండ్రు జాగరూకత గలవా రగుటచే వారి ననుమానించి తలుపులం దెరువరైరి.

ముకుళుని దుర్మరణవార్త తెలిసినతోడనే ప్రజలు హాహాకారములు చేసిరి, ముకుళుఁడు చిర కాలము రాజ్య మేలకున్న 'నేలినన్ని నాళ్లు న్యాయముగాఁ బ్రజా పాలనము చేయుచుఁ బగతురఁ బారఁ దోలుటలోను స్వరాష్ట్రమును బలపఱుచుకొనుటలోను మిక్కిలి సమర్థుఁ డయ్యెను. అతనికోడుకు కుంభుఁడు తండ్రి మరణమునాఁటికి బాలుఁడయ్యు బుద్ధిమంతుఁ డగుటచే దూరపుటాలోచన చేసి తన తండ్రికిఁ బ్రాఁత పగతుఁడును 'మేనమామయు నగుజోడాను తనసహా యార్థము రమ్మని వర్తమాన మంపెను. జోడాయు వెనుక వైరము మఱచి దయాళుఁ డై కుంభునికి సహాయము నిమిత్తము కొంతసేన నిచ్చి తనకుమారుని బంపెను. అతఁడును చిత్తూరురాణాయుఁ గలిసి రాజద్రోహు లగునన్నదమ్ముల నిరువురను స్థిమితముగ నొక్కచోట నిలుపనీయక యొక తావుననుండి యొక తావునకుఁ దఱిమి కొట్ట నెట్టకేలకు కాచమేరులు వారి బారి కోడి ప్రాణభీతిచే రాటకోట యను నొక కొండకోటం బ్రవేశించిరి. ఈదుర్గము నట్టడవులలోఁ గొండల పై నుండుటచే దుర్గమ మనియు మీవారు ప్రభువును నూర్వారు ప్రభు వును దానిం బట్టుకొనఁజాల రనియు నిశ్చయించి కాచమేరులు దానం బ్రవేశించి మరమ్మతు చేసి బలపఱచిరి.

కాచమేరుల జాడలు దెలియుటకై మీవారు, మార్వారు ప్రభువు లొక నాఁ డడవులలోఁ దిరుగుచుండ నొక మనుష్యుఁడు వచ్చి వారి పాదముల పైఁ బడి న్యాయము దయచేయుఁడు మహా ప్రభూ యని ప్రార్థించెను. నీవృత్తాంత మేమి యని వారడుగ నతఁ డిట్లనియె. “స్వామీ ! నేను రాజపుత్రుఁడను చోహణవంశస్థుఁడను. నా పేరు సుజా; నాకు చక్కని చుక్క యగునొక కూఁతురు గలదు. ఈ కొండలం దిరుగుచు నొకమారు కాచమేరులు నాముద్దుకూఁతును జూచి దాని నెత్తుకొని రాటకోటకుం బారిపోయిరి. నాదుర్గతిని గూర్చి నేను రాణా వారితో మొర పెట్టుకొనుట కిప్పుడే పోవుచుండఁగా నా యదృష్ట వశమున మార్గమధ్యమున మీరే యగ పడిరి, రాటకోట లోకు లను కొనునంత దుర్భేద్యము గాదు. దాని యాయువుపట్టు నే నెఱుఁగుదును. ఈనడుమ కోట మరమ్మతులు జరిగినప్పుడు నేనొకకూలివాని వేషము వేసికొని పని చేసినట్టె చేసి దానిగు ట్టేఱిఁగితిని. తక్కినచోట్ల కోట దుర్భేద్యమే కాని యొక్క మూల వీలుగ నున్నది. ఏకష్టము పడి యైన నొక్కసారి మనము కోటమీఁది కెక్కఁగలిగితిమా యింకకోట మన స్వాధీనమె. ఏలయందు రేని కావలివాండ్రు కోట దుర్భేద్యమను తలంపున నశ్రద్ధతో నున్నారు."

ఈకథ చెప్పునప్పు డతఁడు ప్రజల మొగముఁ జూడలేక తల పై ముసుగు వేసి కోనెను. మీవారు మార్వారు ప్రభువులు గుఱ్ఱముల పైఁ గూరుచుండియే వానిపలుకులు విని “సరే! యాకొండమీదికి దారి జూపగలవా'యని యడిగిరి. చిత్తము స్వామా యని యతఁ డను మతించుటయు మెఱి యలవంటిబంట్లను కొందఱఁ గూర్చుకొని మార్వారు రాజకుమారుఁడు వాని వెంటఁ జనియెను. మొదట సుజాయుఁ బిదప మార్వారు ప్రభువును జీఁకటిచాటునఁ బర్వతశిఖరమున కెగఁ బ్రాఁకిరి. ఆరాత్రి యాకాశమంతయుఁ గారుక్రమ్మిన మబ్బులతో నిండియుండుటచేఁ జిమ్మచీఁకటి యెల్లెడల వ్యాపించె. ఆకసము చిల్లి పడినట్లు వాన ద్రిమ్మరింపఁ జొచ్చే. బ్రహ్మాండములు పటపట పగులునట్లురుములు మెఱయసాగె. కన్నులు మిరుమిట్లు గొలుపునట్లు తళుకు తళుకు మని మెఱపులు 'మెఱయఁ జొచ్చె. సకలఘాతుక జంతువులకు శరణ్యమైన యాకోండ పై నారాత్రియం దాశూరశిఖామణులు కన్నుకన్ను గనఁబడని చీఁకటిలో ముం దేమి యున్నదో యెఱుఁగక వ్రేలు మోపుటకు తావు దొరకిన నందు నిలుచుచుఁ జేతి కేది దొరకిన దాని నూఁతగా బట్టుకొనుచు మెఱపు కనఁబడినపుడెల్ల దారిఁ జూచుకొనుచు నిరుకు సందుల గొందులఁబడి నడువసాగిరి. చీమ చిటిక్కు మన్న నొక బొమ్మ రాయి గదలిన యట్టిచిన్నయలుకు డైనఁ బగతురఁ దమజాడఁ దెలిసికొని కార్యవిఘ్నముచేయుదు రన్న భయమున నొండోరులతో మాట లాడుకోనక ధైర్యమునిమిత్త 'మొండొరులఁ బ్రోత్సాహముఁ జేసికొనక జారిపడినం బరస్పరసహాయ మడుగక యావీరు లాపర్వతశిఖరముల మీఁద నడచు చుండిరి .కొంతద వ్వరిగి సుజా యెత్తగు నొక రాతిపై నడుగు పెట్టఁబోవుచుండఁ జింతనిప్పులవంటి గుడ్లు గలిగి యెరకోఱకై చూచుచున్న యొక యాడు పులి గానఁ బడియె. అచ్చమగు తనకులంబునకు మచ్చ గలిగెనని మనంబున మిక్కిలి పరితపించుటచే యాసుజా పులియైనను సరే భూతమైనను సరే బ్రతికినను సరే చచ్చినను సరే భయము పడక వెనుకంజ యిడక యచ్చటనే నిలువఁబడి మాటలాడ వలను పడమి యపాయమును సూచించుటకై రాజకుమారునిహస్తము స్పృశించెను. 'రాజనందనుఁ డాసన్న యెఱిఁగి యపాయ మాసన్న మయ్యెనని నలు దెసలు పరికించి నెత్తురుముద్దలనంటి కన్నులు గలిగి తమపై నుంకించి దుముకఁబోవుచున్న బెబ్బులిం గాంచి కత్తిదూసి పొడిచి యొక్క యేటున దాని నంత మొందించె. ఆ దెబ్బతో నది కొండ పై నుండి దొర్లి క్రిందపడియె. కాచునికూఁతు రప్పుడే 'మెలఁకువ నొంది యేదో చప్పు డగుచున్న దని తండ్రిని లేపి శత్రువు లేమో చూడు నాయనాయని పలికెను. ఆపలుకులు విని కాచుఁడు భయము లేదు. పండుకొనుము. మనశత్రువులు చాలదూరమున నున్నారు. అది యురుములచప్పుడుగాని మఱియొకటిగాదు. దైవమును దలఁచు కొనుచు నిర్భయముగా నిద్రింపుమని తానును గుఱ్ఱుపట్టి నిద్రించె.

అంతటఁ గొంత సేపటికి శత్రువులు గోటలోఁ బ్రవేశించినారని యందఱకు స్పష్టముగాఁ దెలి సెను. కోటలోని సైనికు లందఱు చప్పుచప్పున నాయుధములకొఱకై పరుగు లెత్తిరి. కాని వారిశ్రమ యంతయు వృథ యయ్యె. మార్వారు రాజకుమారుఁడు మేరుని గడ తేర్చె. సుజా కాచుని దెగటార్చి తనయక్కసు దీర్చుకొనియె. ఇవ్విధంబున నొక్క ముహూర్తమందే రాజద్రోహంబును స్త్రీమానద్రోహంబును జేసినదురాత్ములు తమదోసంబులకు దగినశిక్షలం బొందిరి. ఇట్లు తండ్రిం జంపిన దురాత్ముల నంత మొందించి కుంభుండు సింహా సనమున సుప్రతిష్ఠుఁడై నేలం బాలింస నారంభించెసు, ఆకాలమున ఢిల్లీ రాజ్యము పూర్వవైభవము నంతను బాసినామావశిష్టమై యుండెను, తొల్లి చక్రవర్తులకు లోఁబడిన రాజ్యము లన్నియుఁ గ్రమక్రమంబున ఢిల్లీకిఁ గప్పము చెల్లించుట మాని స్వతంత్రము లయ్యె. ఈ విధముగా స్వాతంత్య్రముఁ బడిసిన రాజ్యము లలో మాళవదేశ మోకటి. అది పూర్వము హిందూ రాజుల పాలనము నుండియు నాసమయంబున మహమ్మ దను పేరు గలయొక మహావీరుని పాలనంబున నుండెను. అతఁడు మహాబలదర్పితుండై ఢిల్లీపైఁ దిరస్కార భావముఁ జూపుటయేగాక యనేక దేశముల జయించి చిట్టచివరకు రాజస్థానముమీఁద దండెత్తుటకు యత్నించెను. కుంభుఁ డాసచాచారము ముందుగానే విని లక్ష గుఱ్ఱముల దళమును పదునాలుగువందల యేనుఁగులను గూర్చుకొని మహా సేనతో మాళవ దేశముపై దండు విడిసె. అప్పుడు కుంభునకును మహమ్మదునకును దారుణ యుద్ధము జరిగెను. దైవానుగ్రహము చే నాకయ్యమునందు మహమ్మదీయులకు సంపూర్ణ పరాజయమును హిందువులకు పరిపూర్ణజయం బును గలుగుటయేగాక మాళవ దేశాధిపతి యగుమహమ్మదు కుంభునిచేఁ జిక్కి చిత్తూరునకు ఖైదీగాఁ దీసికొనిపోఁబడెను. అచ్చట నతఁ డాఱుమాసములు చెరలో నున్న పిదప కుంభుఁడు వానిం గరుణించి వానివద్దనుంచి ధనమునుగాని కానుకలుగాని రాజ్యమునుగాని గ్రహిం పకయే తానే వానికనేక బహుమానము లిచ్చి వానిని విడిచిపుచ్చెను. మహమ్మదు తన కిరీటమునుమాత్రము చిత్తూరుకోటలో విడిచి పోయేను. మహారాణాకుంభుఁడు తన యెడలఁ జూపిన నిర్హేతుక కృపారసమును దలఁచి మహమ్మదు వానియెడజాల కృతజ్ఞుఁ డై వానితో గలసి సాటి తుఱక యగుఢిల్లీ చక్రవ ర్తిమీఁదికి యుద్ధమునకుఁబోయి యిరువురుం గలసి మరల దల యెత్తకుండ వానిని నోడించిరి.

మాళవ దేశాధిపతి గర్వమడంచిన పిదప కుంభుఁడు తన విజయ మా చంద్ర తారార్కముగ భూమిలో నిలుచునట్లు చిత్తూరునం దొక జయ స్తంభమును గట్టించెను, అది చిత్తూరురాజ్యలక్మి యొక్క తొంటి వైభవమును తెలియఁ జేయుచు నిప్పటికీ నిలిచియున్నది. దానిం జూడనివారు దాని గొప్పతన మూహింపఁ జాలరు. చూచిన వారు వర్ణింపఁజాలరు, అది కట్టుటకే పదిసంవత్సరములు పట్టెసు. దాని పొడవు నూట యిరువది రెండడుగులు. అది నలుదెసలకు నాలుగుపలకలు గలిగి యున్నది. దానికి తొమ్మిది యంతస్థులు గలవు. ప్రతి యంతస్థునం దొక్కోక్క నల్ల రాతి పలక మీఁదఁ జిత్తూరు రాజవంశి చరిత్రము వ్రాయఁబడియున్నది. అంతియగాక దేవతలయు రాక్షసు లయు నప్సరస స్త్రీలయు వీర పురుషులయు విగ్రహములు చిత్రచిత్రములుగ విన్నాణ మేర్పడ చెక్కఁబడియున్నవి. దానిసొగ సంతయు నిచట వర్ణించుటకు వీలుగాదు.

ఈజయ స్తంభము నే గాక యమ్మహావీరుఁడు చిత్తూరునగరము సందు శ్రీకృష్ణునకును బ్రహ్మకును వేరు వేరుగ నాలయములును ఆరా వళీ పర్వతములయందలి యాబూశిఖరముమీఁద మఱియొక కోవెలను గట్టించెను.

అతఁడు మిక్కిలి దేవతాభ క్తుఁ డేగాని తన రాజ్య సంరక్షణమునకుఁ గేవలము దేవతలనే నమ్మియుండక మనుష్య ప్రయత్నముగూడ నమ్మి పాతకోటలను బాగు చేయించి క్రోత్తకోటలఁ గొన్ని కట్టించి దేశము శత్రుదుర్ని రీక్ష్యముగఁ జేసెను. ఈకోటలో గుంభల్ మియర్ ' అనునది ముఖ్యమైనది. కుంభల్' మీయర్" అనగా గుంభునికొండ యని యర్ధము, ఈకొండకోటలోఁ గూరుచుండియే కుంభ మహారాజు తన యిష్ట దైవమగు శ్రీకృష్ణునిమీఁద బద్యములు కృతులు చెప్పుచు వచ్చెను. మహారాణా కుంభుఁడును వాని పట్టపుదేవి యగు మీరాభాయియు హిందీ భాషలో మిగుల లలితమగు కవిత్వము జెప్పగల ప్రోడలు, సత్కులప్రసూనత చక్కఁదనము సత్ప్రవత౯నముగల రాజపత్ను లనేకు లుందురు; కాని సాహిత్యము సంగీతము దైవభక్తి గలవా రుండుట యరిది. మీరాభాయి హిందీ భాషలో ననేక పద్యములు కృతులు భగవత్పరముగాఁ జెప్పెను. చెప్పుటతోఁ దనివిసనక చిత్తూరునం దొక కృష్ణాలయమును గట్టించి యచ్చటి కనుదినమును బోయి తాను జెప్పిన కృతులు పద్యములు చదివి స్వామిని స్తుతియించి తాను మహారాజ పట్టపు దేవి ననుమాట మఱచి సామాన్య స్త్రీవలె భగవంతుని యెదుట నాడి పాడివచ్చినవా రందఱి కన్నులను వీనులకు విందు సేయుచుండును. సహజముగఁ గంఠ మాధుర్యముగల స్త్రీ సంగీత శాస్త్రమునందసమాన ప్రజ్ఞ గలదై భక్తిరస ముట్టిపడునట్టు పాడునపుడు విను వారి మనస్సులు కఱగి నీరై పోవా ? అందు చేత మీరాభాయిపాట విన్నవారందఱు గృష్ణునియందుఁ బరమభక్తులైరి. ఆమె జగమంతయు శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపమేయని సంసారపుగొడవలు వదలుకొని స్వామిగుణముల వర్ణించి కవనము చెప్పుటయు పాడుటయు నాడు

టయుఁ దక్క తక్కిన పనులజోలికిఁ బోదయ్యె. పురజను లామె గానమును వినుటకుఁ బ్రతిదినము 'వేనవేలు కృష్ణాలయమునకుఁ బోవుచు వచ్చిరి. ఆమెకీతి౯క్రమక్రమంబుగ నుత్తర హిందూస్థానమంతయు వ్యాపించుటం జేసి దూర దేశమునుండియు ననేక జనులు వచ్చి యామె గానమును విని భక్తికి సంతోషించి పోవుచుపచ్చిరి. ఆనాటి ఢిల్లీ చక్రవతి౯ యామె యసమాన ప్రజ్ఞలను విని తన చెవులు ధన్యము లుగఁ జేసికోనవలయు నని నిశ్చయించుకొని మహారాజు పట్టవు దేవి కరకుతురక యెదుట నిలిచి పొడదనుకొని గోసాయివేషము వేసికొని యొక్క సేవకునితో బయలు దేరి చిత్తూరునకు వచ్చి సాయంకాలమున హిందువులతోఁ గలిసి కృష్ణాలయముఁ బ్రవేశించెను,

ప్రవేశించి జగన్మోహనమగు నామెరూపమును మనసును కరగించు పాటయుఁ గని విని ఢిల్లీశ్వరుఁడు పరవశుడయి యామెయడు గులకు మొక్కి తన జేబులోనున్న యమూల్యమగు రత్న హారముఁ దీసి యామె కిచ్చెను. ఇది యెక్కడిదని యామె యడుగ నతఁడు స్నానము చేయుచుండ నాకిది యమునానదిలో దొరకిన దని చెప్పి యవ్వలకుం బోయెను. ఆ దేవియు నతఁడు చక్రవతి౯యని ,యెఱుఁ గక నిజముగ గోసాయి యనుకొని యాహారము స్వామి కర్పించెను. . రాణాకుంభుఁ డాహారమును జూచి యది చక్రవతి౯ వద్దనేగాని గోసాయీలవద్ద నుండునది గాదని నమ్మి రత్నాలవత౯కులకుఁ జూప వారు దానిం బరీక్షించి యది ఢిల్లీ చక్రవతి౯దని యానవాలుపట్టి చెప్పిరి. కుంభుఁడు భార్యపై ననుమానపడి భార్యం జంపుమని మం త్రుల కౌనతిచ్చె. ఆమె మహాపతివ్రత యని యెఱుఁగుటచే నామె నెవ్వరుఁ జంపరైరి. అనంతరము భత౯ కిష్టము లేనప్పుడు తాను బ్ర తుకఁ గూడ దని నిశ్చయించుకొని యాదేవి యర్ధరాత్రమున నెవ్వరికిఁ దెలియకుండ కోట వదలి యావలకుంబోయి యొక నదిలోఁబడెను. అప్పుడు భగవంతుఁడు కృష్ణుఁ డే వచ్చి యామెను జావకుండఁ గాపాడెనఁట ! పిదప నామె బృందావనమున కరిగి భక్తురాలై తన జీవిత శేషము నచ్చటనే గడపెను. ఉత్తరహిందూస్థానమున మీరాభాయి చేసిన కృతులు నాబాలగోపాలముగ నిప్పటికిని బాడుచు నామె పేరు శిరసావహింతురు.

అనంతరము కుంభుని చుట్టములగు మార్వారు రాజకుమారులలో నొకనికి జాల్వారు దేశపు రాజుకూఁతు నిచ్చి వివాహము చేయుటకుఁ పెద్దలు నిశ్చయించిరి. కుంభుఁ డావాత౯విని |యాకన్యను తానే పెండ్లి చేసికొనఁగోరి ప్రాఁత చుట్టరిక మయినను దలంపక యపకీతి౯కి జంకక యాకన్యను బలాత్కారముగా నెత్తుకొనివచ్చియామె కిష్టము లేకున్నను వివాహము చేసికొనెను. ఈయవివేక కార్యమతని ననేక కష్టములపాలు చేసెను. అదివఱకుఁ గొంతకాలము నుండి గలిసియున్న మీవారు మార్వారు రాజకుటుంబములకు మరల బ్రబల వైరము గలిగెను. కొత్త పెండ్లాము మనసున మగని పై నిష్టము లేదు.

ఆమె మొదట మార్వారు రాజకుమారుని వలచుటచే నెల్లప్పుడు నతనినే ధ్యానించుచు చిత్తూరునకు వచ్చి తనను దీసికొని పొమ్మని వానికి సందేశముల నంపుచు తనహృదయమున మదనానల మిట్లే మండుచున్న దని తెలియఁ జేయుటకుఁ దనమేడ పై నొక పెద్దదీప మును 'రాత్రులు పెట్టించుచు వచ్చెను. మివారు రాజకుమారుఁడు నామెయందే వలవు నిలుపుటచే నామెకొఱకే పరితపించుచు నొక మారు చిత్తూరుసకుఁ బోయి కోటలోఁ బ్రవేశించి యామెను దీసి కొనిపోవుటకు యత్నించెనుగాని యాతనియత్నము కొనసాగదయ్యె.

కుంభుఁడు కొలువునకు వచ్చినపుడెల్ల ముందుగాఁ దనచేతికత్తి ముమ్మారు తన చుట్టు త్రిప్పుకొని యేరికి వినఁబడకుండ కొన్ని మాటలు తనలోఁ దాను గొణుఁగుకొనిపిమ్మట గూర్చుండును. ఇదియంతకుమున్ను చాలకాలమునుండి వానికి యభ్యాసము. కుంభుని జ్యేష్ఠపుత్రుఁడును యువరాజు నగురాయమల్లుఁడు తనతండ్రి చేయునట్టి యాపని కేమియర్ధమో తెలియక తన సందియము తనలోఁ సణఁచుకొనఁజాలక సందేహనివృత్తిఁ జేసికొనఁదలఁచి దాని యర్ధమే మని తండ్రి నడిగెను. తండ్రి దానికి యథ౯మును జెప్ప లేదు సరిగదా మీఁదుమిక్కిలితన దేశము నుండి తత్ప్రణమె వెడలిపొమ్మని కొడుకున కాజ్ఞాపించెను. రా రాయమల్లుఁడు విదేశములం దిరుగుచుండ రాణా చిన్న కొడుకులలో నొకఁ డొక చారునకు లంచమిచ్చి వానిచేఁ దండ్రిని జంపించి తన యన్న గారి కావాత౯ దెలియక మునుపే తానే గద్దెయెక్కెను. ఆపి తృద్రోహి తన పదవి స్థిరముగాఁ జేసికొనుటకు జుట్టుప్రక్కల రాజులకు లంచము లిచ్చి వారిమైతిఁ గావించి యెట్టెటో దేశము నైదేండ్లు పాలించె, అంతలో రాయమల్లుఁడు మహాసేనఁ గూర్చుకొని తమ్మునిపై నెత్తివచ్చి వాని నొడిసిపుచ్చి పారఁదోలి తాను సింహాసన మెక్కెను. తండ్రిం గడ తేర్చిన శూర శిఖామణి స్వరాష్ట్రమున నిలువ నీడగానక యప్పటి ఢిల్లీ చక్రపతి౯ యగు బహలాల్ లోడి వద్దకు బోయి వాని నాశ్రయించి తన యన్న బారినుండి తన్ను రక్షించి రాజ్య ప్రతిష్ఠితుని జేయు మని బ్రతిమాలి యట్లు చేసినచో మీవారు దేశము ఢిల్లీకి లోఁబడునట్లు చేయునట్లును విశేషించి సూర్యవంశ ప్రదీపకుఁడగు తాను తనకూఁతును జక్రవతి౯ కిచ్చి నిశ్శంకముగా వివాహము చేయునట్లును వాగ్దానము చేసెను, చక్రవతి౯ వాని చెలిమి కిచ్చగించి సాయము చేయుదునని యభయహస్తమిచ్చి వానిని సబహుమానముగ నావలకుఁ బంపె. ఆనాఁడు గొప్ప వాన కురియు చుండెను. పితృదోహి యగుటయేగాక కులద్రోహియు దేశద్రోహి యునై గొరవంబునకు బుట్టినయిల్లగు చిత్తూరు రాజవంశమున జన్మించిన కన్యను గోవును గోపికోని తిను పచ్చితుఱక కిచ్చి వివాహము సేయఁదలంచిన యాదురాత్ముఁడు బతుకఁ గూడదని తలంచి భగవంతుఁడు వాని జంపఁ బంపిన యాయుధమో యనునట్లోక 'పెద్దపిడుగు వచ్చి గుమ్మము దిగఁగానే వాని నడఁచె. పడియున్న యజమానుని కడకు సేవకులు వచ్చి చూచునప్పటికీ నంతయు మాడిన మేనుతో బీనుఁగయై యుండే. మహారాణా కుంభుని యనంతరమున రాజ్యమునకు వచ్చిన యాదుష్టునకుఁ బజలు హంత' యను పేరు పెట్టిరి. హంత యనఁగాఁ జంపినవాఁడని యర్థము. అంతియ కాని వాని నిజమయిన నామ మెవ్వరికిఁ దెలియదు. ఈనృశంసుఁడు విరుగడయి పోయినదే మంచిదని సంతోషించి బ్రజలందఱు రాయమల్లుని తమకు రాణాగా నంగీకరించి వానిఁ గొలుచుచు సుఖించిరి.