రాజస్థాన కథావళి/చండుని కథ
చండుని కథ.
పదునాల్గవశతాబ్దము యొక్క యంతమునందు మీవారు దేశమునకు లఘుఁడను నతఁడు రాజయ్యెను. అతఁడు దనకుఁ బూర్వులైన హమీరు హమారునికుమారుఁడు నడచిన దారిని నడచి తొల్లి మీవారు రాజులు దుర్బలులైన కాలమున వారి వద్ద నుంచి ఢిల్లీ చక్రవర్తియుఁ దక్కిన రాజపుత్రులు నన్యాయముగఁ దీసికొనిన దేశములను మరల గ్రహించి దిట్టరి యయ్యెను. అంతియఁగాక యతఁడు పెద నూ రను పట్టణమును గట్టించెను. పూర్వు లెఱుఁగనితగరపు గనులకు వెండిగనులను గనుఁగొని త్రవ్వించెను.అతని కిద్దఱు కుమారులుండిరి.
అందు 'జ్యేష్ఠుఁడగు చండుఁడు శూరుఁడు, గౌరవనీయుఁడునై ప్రతిజ్ఞలు నిలుపుకోసుటలో నతినిష్ణురుఁడై విద్యావంతుఁడై బుద్ధిశాలియై యుండెను. కనిష్ఠుఁ డగు రఘుదేవుఁడు చక్కఁదనమునకు శాంతస్వభావమునకును 'బేరుపొంది ప్రజానురాగమును బడసి యుండెను. ఒకనాఁడు రాణాయగు లఘుమహారాజు కొలువై యుండగా నొక రాయబారి వచ్చి వానిపాదములపై నొక కొబ్బరి కాయను బడవైచెను. రాజస్థానమునందుఁ దమకూఁతు నెవనికైన వివాహార్ధ మయి యర్పింపఁ దలఁచిన వారు పెండ్లికొడుకు వారియొద్ద కొక టెంకాయనుబంపు టాకాలమునం దాచారము, మార్వారు దేశపురాజగు రణమల్లు తనకూఁతురగు హంసయను నామెను చండునకు వివాహము సేయదలంచినాఁ డని చెప్పవచ్చి యారాయబారి ముందుగ దేశాచారము నడవెను. కాయ తన కాళ్ళపైఁ బడ వేయుటచే నా రాజు తనకే కూఁతురు నీయఁ దలంచు కొన్నాఁ డనుకొని యారాణా పక్కున నవ్వి మీసము వడి వేయుచు రాయబారితో నిట్లనియె.
"ఆకాయ తీసికొని నాకుమారుఁ డగు చండున కిమ్ము తల యంతయు నరసిన 'నేనేమి! పడుచుకన్యను వివాహమాడుట యేమి? ఎవ్వరైన నవ్వరా?"
అనంతర మారాయబారి చండున కావాత౯ విన్నవించి నప్పుడు తండ్రి మోటతనంబు చేసినాఁ డనుకొని కోపలజ్జా భరితుఁడై "ఏమీ తండ్రికి ధర్మపత్నిగా నుద్దేశింపఁ బడినకన్యను నేను వివాహమాడుదునా? వారు నానిమిత్తమే కన్యనుద్దేశించిరేని టెంకాయ నాకాళ్ళమీఁదనే 'మొదట పడవేయరా? కావునఁ దత్ప్రశంస నావద్దఁ దల పెట్టక కాయ మరల మార్వారు దేశమునకుఁ బంపఁదగునని స్వభావసిద్ధ మగు ధైర్యము తోఁ బలికెను.అప్పడు రాణా కొడుకునుం బిలిపించి "నాయనా నామాట వినుము. మనము మిత్రుఁడైన మార్వారు రాజును మన మవమానింపవచ్చునా? రాజపుత్రులు పరాభవమును సహింతురా? ఈయక్కసు మనసునం బెట్టుకొని వారు మన పైఁ బగదీర్చుకొనఁ జూడరా? బాహుబల సంపన్నులగు నతని కొడుకు లూరకుందురా?" యని మందలింపు చండుఁడామాటలు విని "నా కదంతయుఁ దెలియదు. జగము తలకిం దయినను సరే ! ఆమె నాకు తల్లిగాని వేరుగాదు. ఆమాటలు తలఁచుకొనుట మహా పాపము నన్ను కదప వద్దని తండ్రికి చెప్పెను. అప్పుడు రాణా మండి పడి తనయునితో నిట్లనియెను. నీవిత మూర్ఖుఁడవేని నేనే యాకన్యను వివాహ మాడెదనులే కాని యీసంగతి జ్ఞాపకముంచు కొనుము, ఆమెవలన నాకుఁ గలిగిన కుమారుఁడే రాజ్యప్రతిష్ఠు డగును
తండ్రి కోపోద్దీపితుఁ డై నను బంకక చండుఁడు "సరే! మీ యిచ్చవచ్చిన తెఱఁగున జేసికొన వచ్చును. హంసాదేవి కుదయించిన నందనులలో నెవనికి 'రాజ్య మిచ్చినను నాకు సమ్మతమే ఆమెను వివాహమాడి యధర్మకార్యము చేయుటకంటె .రాజ్యము వదలు కొనుట యే యుచిత" మని ప్రత్యుత్తర మిచ్చెను. అనంతరము రాణా హంసా దేవిని వివాహమాడుట కంగీకరించి మార్వారునుండి యామెను చిత్తూరునకు రప్పించి యచ్చటనే యధావిధిగఁ బెండ్లియాడెను. కొన్ని దినముల కాదంపతులకు ముకుళుఁడను కుమారుడు కలిగెను. ముకుళుఁడు పసితనమున నున్నపుడే లఘు మహారాజు వానిని విడిచిపోవలసి వచ్చెను. హిందువుల పుణ్య క్షేత్రమగు గయను మహమ్మదీయులు పట్టుకొని నాశనము చేయఁబోవుదు రని యారాణా విని తాను కత్తిగట్టి వారితోఁ బోరవలయు నని నిశ్చయించుకొని తురకల బారికిం దప్పి మరల తాము యాలుబిడ్డలను బ్రజలను దేశమును జూడ వీలగునో లేదో యని సందేహించి చండునిం బిలిపించి తన పయన మేఱిఁగించి బాలుఁ డగు ముకుళునకు రాజ్యములో నెంత భాగ మిచ్చిన బాగుంచు నని యడిగెను. చేసిన ప్రతిజ్ఞల నశి ధారావ్రతముగ నడపునట్టి చండుఁడు తండ్రి కిట్లనియె. ముకుళుఁడు మీవారు దేశమునకు రాజగు గాక ! అతఁడు గద్దె యెక్కినతోడనే నేను వానికివి ధేయుఁడనై ప్రియభృత్యులలో మొదటి వాఁడ నై యుందును. తండ్రి చేసిన ప్రతిన నిలిపి తా నాడినమాటఁ దప్పక నడచు కుమారుని జూచీ రాణా మహానంద భరితుఁడై నిర్విచారముగ గయకుఁ బోయి రణరంగమున నిలిచి మహమ్మదీయులతో బోరి లెక్కకు మీరిన వారి సేనలం గెలువలేక తుదకు మతము నిమిత్తమై ప్రాణములు విసజి౯ంచి వీర స్వర్గ మలంకరిం చెను.
రాణా పరలోకగతుఁ డైనవాత౯ మివారులోఁ దెలిసిన తోడనే చండుఁడు ముకుళుని రాజుగా నభిషేకించి వానికిం బదులుగ దానురాజ్యము సేయఁబూని తమ్మునిసింహాసనమున కీవల తనపీఠము వేయించుకొని సకల వ్యవహారములయందు రాజునకుం దోడ్పడుచు విధేయుఁ డై యుడి జనానురాగము గలుగునట్లు చక్కగఁ బ్రజా పాలనము చేయుచుండెను. చండునియం దందఱ కిష్టము నుండెను; కాని యే కారణము చేతనో హంసా దేవికిమాత్ర మిష్టము లేకపోయెను, అతనియెడ గ్రమక్రమముగఁ బ్రజాను రాగ మతిశయించుటచే హంస యోర్వలేనిదై భయమంది తనలో నీవేళ చంకుఁ డల్పుఁడైనా కుమారునకు భృత్యుఁ డైనను ముందుముందు నాకుమారునే యితఁడు. భృత్యునిఁ జేయఁ గలఁడు. ఈ యొదిగియుండుట యెల్ల రాజ్యసంపాదనమునకై చేసెడు నటనగాని, నిజము కాదు. ఇప్పుడు పేరునకు రాజైన యితఁడు ముందు ముందు నిజముగా రాజే యగు" నని తలపోయఁ జొచ్చెను. ఈతలంపు లామె లో నడగి యుండక క్రమక్రమంబున వెలికి వచ్చుటం జేసి చండునకుఁ దెలిసెను. దైవముఖముఁ జూచి తాను సత్యముగా నడచుకొను చున్నను దనయం దామెకట్టి యనుమానము గలిగినందుకు విచారించి యింక నెన్ని చెప్పిన నామె తన్ను నమ్మదని నిశ్చయించి తన యధికార మంతయు వదలుకొని సవతితల్లి యొద్ద సెలవు పుచ్చుకొని చండుఁడు చిత్తూరునగరముఁ బాసి తనకు నమ్మిన బంటులై తన్నెడ బాయంజాలని రెండువందలమందిని వేఁటగాండ్రను వెంటబెట్టుకొని దూర దేశములకుం బోయెను.
చండుఁడు పోయిన తోడనే హంసా దేవి హృదయశల్యమును బాసినట్లు సంతసించి మారువారునుండి తన చుట్టములం బక్కములం బిలిపించి, వాండ్రును గొడ్డు నేలలుగల నూరు వారును విడిచి రత్నగర్భయగు చిత్తూరునకుఁ బోవుటకు మహానందభరితు లయిరి. ఆమెతండ్రి యగు రణమల్లు చిత్తూరునకు వచ్చి యాపట్టణము సర్వసంపన్నముగా నుండుటచే దానిం బాగుఁడలఁపఁడయ్యె. రాణీ సోదరులు దమ కుటుంబములతో వచ్చి చిత్తూరున గాఁపుర ముండి కాలక్రమమున నధికార మంతయు వహించిరి. వారి మాటయే యా దేశమున శాసన మయ్యెను. వారి యాజ్ఞ నిరంకుశ మయ్యెను. వేయేల? వారే రాజులై రి. తరములనుండి మీవారు సంస్థానము గని పెట్టుకొనియున్న యుద్యోగస్థు లందఱు మెల్ల మెల్లఁ దప్పుకోనవలసిన వచ్చె. ప్రజలు సేవకులు జరుగుచున్న దుణ౯యములజూచీ తమలో తారు సణుగుకొను చుఁ గోరచూపులఁ జూచుటయే కాని నోరెత్తి పలుకరైరి. ముక్కు పచ్చలారని యొక రాచకుఱ్ఱని నిమిత్తము చండశాసనులగు రాణిబందుగుల నెదిర్చి యెవ్వఁడు ధనమును బ్రాణమును బోఁగొట్టుకొనఁ గలఁడు ? పౌరుష శాలులగు ప్రజలీ తెఱంగున నసహాయులై యుండగాఁ నంతిపురమందలి యొక యాఁడుది యీ దౌర్జన్యముల సహింపక తెగువఁ జేసెను. అది ముకుళునకుఁ బాలిచ్చి పెంచిన దాది.రాజస్థానమునందు దాదులు తమ ప్రాణముల నేని ధార వూసి రాజకుమారుల రక్షించినకథ లనేకములు గలవు ముకుళుని దాదియు నట్టిదియె.
ఒకనాఁడు రణమల్లుఁడు కొలువుకూటములో రాణాకూరుచుండాడి సింహాసనము పైఁ గూర్చుండి తనమనుమనిఁదన కాళ్ళవద్దఁ గూర్చుండఁ బెట్టుకొనియాడించుచుండె. అంతలో బాలుఁడు మెల్లమెల్లగ దిగజారి నేల గంతులు వేయసాగెను. అప్పుడేనియు రణమల్లు గద్దె దిగక ఠీవితో గూర్చునియుండుటం జేసి సభవారికిని సభ వారికంటే నెక్కుడు దాదికిని మనసు మండెను. తోడనే దాది పట్టరాని బిట్టలుకతో నంతిపురిఁ బ్రవేశించి రాణి యొద్దకుఁబోయి నిలిచి జరుగుచున్న దౌర్జన్యమును విన్నవించి యెక్కడనుండియో పొట్టకూఁటికి జేరిన లాతివారు రాజకుమారునిఁ దృణీకరించి గద్దెయెక్కి కూర్చుండియుండగా సహించియూరకోనుట యుచితముగాదని నొక్కి చెప్పారు. రాణి తనతప్పుఁ దెలిసికొని యా రాత్రియే తనతండ్రిని జీవాట్లు పెట్టెను. వృద్ధుఁడగు రణ మల్లుఁడుపనికిమాలిన యాడుఁదానిపలుకులకు జంక గూడదని నిశ్చయించుకొని యెదు రామెపై గోపపడి , నేనును నాకొడుకులు చేసెడు పసుల కొప్పుకొని నీవు నోరుమూసికొని పడియుండుము. లేనిచో నీకుమారుని సింహాసనమున కేగాక ప్రాణములకుఁ గూడ నపాయము 'రాగల దని ప్రత్యుత్తర మిచ్చెను. ఆపలుకులు విని రాణి తనకును దనకుమారునకును నేమి కీడుమూడునో యని భయపడఁజొచ్చెను.
ఆమె భయము మఱింత యధికమగునట్టులు రాణా యొక్క రెండవ కుమారుఁ డగురఘు దేవుఁడు తనతండ్రి సేవకుల చేతనే వధింపబడెనని యొక్క ఘోరవాత౯ యామెకుం దెలిసెను. అతఁడు మిక్కిలి యోగ్యుఁడగుటచే 'రాణియె గాక రాజస్థానమునందలి జను లంద ఱాబాలగోపాలము వాని యకాలదుర్మరణమునకు విచారించిరి. అతని యందలి భక్తిశ్రద్ధలను సూచించుటకై మివారు దేశ స్త్రీలు వాని ప్రతిమను దమయిండ్ల నిలుపుకొని దానికి మొక్కి పూజించుచు నేటేట నుత్సవములఁ జేయుచువచ్చిరి. సజ్జనుఁడగు రఘుదేవుని గడతేర్చిన రణమల్లుని బంటులే తన కుమారునిఁ గూడ దెగటార్తు రని రాణి మిక్కిలి భయమునందుచు వచ్చెను. అట్టులుండ మీవారు రాజ కుటుంబములో బుట్టి రాణికిం జెలికత్తె యగునొక జవరాలును జూచి రణమల్లుఁడు తన కామెనిచ్చి పెండ్లి చేయు మని కూఁతురును బలవంత పెట్టి దాసినో వెలయాలినో తీసికొనిపోయినట్లు దానిం జేకొనెను. దినదినము నధిక మగుచున్న తండ్రిదుండగముల సహింపలేక రాణి యెట్టకేలకు దిటము తెచ్చుకోని యాసమయమునఁ దనయక్కర గడప గఅశూరుఁడు చండుఁడే యని నిశ్చయించి సత్వరము వచ్చి తనను దనకుమారుని రాజ్యమును రక్షింపుమని వానికి వత౯మాన మంపెను.
ఇది జరిగిన కొన్ని దినములకు వెనుక చండుని వెంటఁ బోయిన వేఁటకాండ్రు కొందఱు మఱలఁ జిత్తూరునకువచ్చిరి. ఏలవచ్చిరని వారిని కొందరడుగఁగా దాము చండునితో నొంటిగఁ జిరకాల ముండలేక విసికి యాలుబిడ్డలఁ జూడవచ్చితి మని వారు చెప్పిరి. వారి నెవ్వరు ననుమానింపక కోటఁ జోరనిచ్చి యెప్పటియట్ల పనులఁ జేయనిచ్చిరి.ఆ సేవకులు వచ్చినది మోదలు రాణి మిక్కిలి దైవభ క్తి గలదై దేవత లకు నుత్సరములు జాతరలు చేయించుచు చుట్టుప్రక్కలనున్న పల్లెలజనంబులకు నిరతాన్నదాన ప్రదానము చేయంపసాగెను. ఆయుత్సవములు జూచుటకు బాలుఁ డగు రాణా తనదాదియుఁ బురోహితుఁడును వెంటరా గుఱ్ఱము నెక్కి తఱుచుగఁ బోవసాగెను. ఈ కార్యము గర్వితు లగువాని మేనమామల కనుమానము గలిగింపదయ్యె. నల్లమందు ముద్దలు మింగుటచే మతిలేకయో పడుచుపెండ్లాము వలపులఁ దగులుటచే నొడ లెఱుఁగకయో వానితాత యావిషయము దలపెట్టడయ్యె. ఇట్లు దినములు జరుగుచుండఁ జిత్తూరున కేడుమైళ్ళ దూరమున దక్షిణముగానున్న గోసుంద యను గ్రామమున దీపావళివండుగ నాఁడు రాణి హంసాదేవి లక్ష్మీ పూజ చేయించి గొప్పయుత్సవము గావించి దానింజూచుట కెప్పటియట్ల తనకుమారుని బంపెను. రాచనగరును నిరుపేదవాని గుడిసెయు దీపములతో వెలుఁగుచున్న యామహానందసమయమున చిన్న రాణా యొక్క సేవకులు కొందఱు మిక్కిలి హృదయసంతాప మొంది యేమియుం దోఁచక చిత్తూరుపుర ప్రాంతమున మొగములు వ్రేలవైచి నిట్టటు తిరుగుచుండిరి.
“ఏమి చెపుమా యతఁడు రాఁకపోవుటకుఁ గారణము! అతఁడు చెప్పినట్లు రాణాను గ్రామముల వెంటఁ ద్రిప్పితిమి. దీపావళి పండుగ నాఁడు గోసుందగ్రామమున నతఁడు సెలవిచ్చిన ట్లుత్సవముఁ జేసితిమి. ఈరాత్రి వత్తు నని యతఁడు ప్రమాణము చేసెనే ! ఏలరాకపోవలె? ఆమాట మఱచియుండినా? లేక శత్రువులచే నిరోధింప బడెనా? చండుఁడు రానిపక్షమున మీవారుగతి యింతే.”
అని తలపోయుచు నాబంటులు చిన్న రాణాను వెంటఁబెట్టుకొని తూర్పు ద్వారమువద్ద పూర్వ మలాయుద్దీను వేయించిన దిబ్బఁ జేరునప్పటికీ వారి చెవులకు గుఱ్ఱపుదౌడు చప్పుడు వినఁబడెను. అది యే మగునని నిలిచి చూడ నలువదిమంది యాయుధపాణు లగుజోదులు వచ్చుచుండిరి. అందు మొనగాఁడు మాసినగుడ్డలు నసమానమైన యాయుధములు ధరించి వచ్చి యొక సంజ్ఞఁ జేసి తనరాఁక రాణా కేఱిఁగించెను. ఎవ రావచ్చుచున్న దని కోట కావలివాండ్రు వానిం బలుకరించిరి. మే ముత్సవముఁ జూచుటకు గోసుందకు రాఁగా రాణావారిం, గొలిచి వెఁటఁబోవలసిన దని రాణి సెలవగుటచే వచ్చితిమని వారుత్తర మిచ్చిరి. ఆకావలివాండ్రకు దృప్తిపఱచి యతఁ డనేక ద్వారములు గడచి తుట్టతుదకు రామద్వారము పేరుగల లోపలిగుమ్మమువద్దకు బోఁగా నక్కడివాండ్రు వాని నడ్డగించి వాని వెనుక నింక నొక పెద్దసేన వచ్చుటం జేసియు లోపలకుఁ జొరనీయరైరి. అప్పుడుపాయములతో బనులు సాగవని యోరలోనుండి కత్తి నూడఁబెఱికి ద్వారరక్షకుల శిరంబుల కొబ్బరిపుచ్చెల ట్లెగరనఱకె. వెంటనే తొల్లిఁటి 'వేఁటకాండ్రందఱు వానికి సాయమై నిలిచిరి. చండుడు వచ్చెవచ్చె నని కోట యంతయుఁ బ్రతిధ్వను లెగయునట్లు కేకలు వెడలెను. రాణిసోదరులు నిశ్చేష్టులై యూరకుండిరి. చండుఁడు నిరపాయముగ సై న్యసమేతుఁడై కోటలో బ్రవేశించె.
చండున కందఱు గనఁబడిరి; కాని ముసలి రాజు గనఁబడఁ డయ్యె. అతఁడు నల్ల మందు మింగి యామత్తు చే స్పృహఁ దప్ప నొక మూలగదిలో గడ్డిపరుపు వేసిన మంచము పైఁ బండుకొనెను. ఆభత౯ చెంత రాణి చెలికత్తెయగు రాజపుత్రాంగన నిలువంబడియుండె. ఆమె కెవ్వరైన సన్న చేసిరో లేక యావలజరుగు కోలాహలము చేతనో యామె వాని తలపాగ నూడదీసి వాని మేనిచుట్టుం ద్రిప్పి గట్టిగా మంచమునకు బిగించికట్టి తానవ్వలకు దాఁటెను. చండునిబంట్ల సింహనాదములు చచ్చేడు వారి యాత౯ ధ్వనులు కత్తుల రాపిడిచప్పు డులు నగరమంతయు వినఁబడుచున్నను నల్లమందు తాతకు మెలఁకువ గలిగింపఁ జాలవయ్యె. ఎట్టకేల కతఁడు 'మెలఁకువఁ దెచ్చుకొని యమకింకరులవలే నెదుట నిలిచిన శత్రువుల మొగములఁ జూచె. అప్పుడు వచ్చియు రాని తెలివితో నాతఁడు కట్టువడిన సంగతి యెఱుఁగక లేవ నుంకించి లేవఁజాలక క్రోత్త పెండ్లాము చేసిన మోస మెఱిఁగి చింతించి హంమ్మని మంచముపాళమున లేచి యాయుధముకోఱకు వెదకుకొను చుండఁగా చండుని సేవకులు వానిం దుదముట్టించిరి.
ఇట్లు చిత్తూరు క్రొత్త ప్రభువుల బారినుండి విముక్తిఁ జెందెను రణమల్లు యొక్క పెద్దకుమారుఁడు జోడా' యను నతఁడు తక్క తక్కిన మార్వారు దేశస్థు లందఱు హతులైరి. జోడా 120 మంది బంట్లతో చండుని బారింబడక తప్పించుకొని ప్రాణములు దక్కించుకొని తన స్వస్థానమును మార్వారు దేశమునకు రాజధానియునగు మండూరుపట్ట ణమునకు పయనమై పోయెను.చండశాసనుఁ డగు చండుడు వెన్నంటి తరుముటచే నచ్చట నిలువలేక యతఁడు హర్బశంకరుఁ డను నొక మిత్రునియింటికి పారిపోయెను. విజయుఁ డగు చండుఁడు మీవారు దేశమును, గొత్తగా నాక్రమించిన మార్వారు దేశమును తమ్ముని పేర బాలించు చుండెను.
ఈహర్బశంకరుఁడు మీవారు నూర్వారు సరిహద్దులో నున్న యొక యడవిలోఁ గాపురమున్న క్షత్రియుఁడు. అతఁడు పరమభక్తుఁడు, మహాశూరుఁడు, ఆపద్బాంధవుఁడు, శరణాగతరక్షకుడు. అడిగిన వారికి లేదనకుండ నిచ్చునటుల దానకంకణము గట్టుకొన్నవాఁడు. కాకులను గొట్టి గద్దలకు వేయున ట్లతఁ డప్పుడప్పుడు చుట్టుప్రక్కల గ్రామములు దోఁచుకొనివచ్చి బీదలకు బాహ్మణులకు సంతర్పణలు చేయుచుండును. తన చిన్న సేనతో జోడా హర్భశంకరుని యింటికిఁ బోయిన దినము పండుగ యగుటచే నచ్చట విశేషముగా నన్న ప్రదానము జరుగుచుండెను గనుక తమ కేవెలితియుఁ గలుగదని యతఁడనుకొనెను. కాని శంకరుఁడు వారు వచ్చునప్పటి కోక్క మెదుకైన మిగులకుండున ట్లన్నప్రదానము చేసెను. ఆకలి దప్పికలచేతను మాగా౯ యాసము చేతను బడిలి యాక్రోత్తగా వచ్చిన నూట యిరువది మంది యతిథులకు నేమి పెట్టుదును నాకీదిన మెట్లు పరువు దక్కునని శంకరుఁడు విచారించి యొక యుపాయము గని పెట్టెను. అప్పుడప్పుడు రంగులు వేయుటకును గఱువు కాలమున బీదలుదినుటకు నుపయోగించు నొక మోక్క యతని కప్పుడు జ్ఞప్తికి వచ్చెను. ఆ చెట్లు తెప్పించి మెత్తగా నలగదంపించి పిండియు బెల్లమునుగలిపించి వండించి వారికిఁ బెట్టించేను. వారందఱు మిక్కిలియాఁకలిగొని యుండుటచే నది యేదో కొత్త పిండివంట యనుకొని తమకముతో భక్షించిరి. ఆ మొక్కలు రంగు వేయుటకుఁ దరుచుగ నుపయోగింపబడుటచే భోజనాంతరమున నతిథుల గడ్డములు మీసములు కొంచె మెఱ్ఱఁబడియుండుటచే వా రొండొరులు మొగంబులు జూచుకొన నారంభించిరి. అప్పుడు శంకరుఁడు వారియొద్దకుఁ బోయి తనపై వారికనుమానము కలుగకుండు నట్లు వారితో నిట్లనియె. "చూచితిరా యీశ్వరమాయ? మీకష్టకాల మిట్లే మారిపోయి సుఖకాల మగునని తెలియఁ జేయుటకు భగవంతుఁడు మీమీసముల కీమార్పు కలుగఁ జేసెను” అని యతండు చెప్ప వానియందలి భక్తిచే వారామాటలు నమ్మి యటనుండిపోయి సమయము వచ్చువఱకు మండూరు చుట్టుపట్ల నడవులలోఁ దిరుగుచుండిరి. అంతట ముకుళుఁడు యుక్తవయస్కుడై రాజ్యభారము వహించెను. చండుఁడును వానికొడుకులును మండూరు రాణాకు బదులుగ నేలుచుండిరి. రాణీ హంసాదేవి తనకుమారుఁడు రాజ్యభారముఁ బూని నిరపాయస్థితి నున్నందున దిక్కుమాలిన యడవులం దిరుగుచున్న తనసోదరున కేదేని యుపకారముఁ జేయ నిశ్చయించుకోని వాని రాజ్యము వానికిమ్మని కొడుకును బ్రతిమాలుకొనెను. ముకుళుఁడు సరే యని చండునితో నాలోచించుటకు వానిం దనవద్దకు రమ్మని వత౯మాన, మంపె. ఇరువురుకొడుకులను సపరివారముగ మండూరినం దుంచి చండుఁడు పెద్దకుమారుఁడగు ముంజునితో గలిసి రాణావద్దకుఁ బయనమై పోయెను.
వాని పయనముమాట చారులవల్ల నెఱిఁగి జోడా హర్బశంకరుఁడు మొదలగుకొందఱుజోదులం గూర్చుకొని మండూరునకుఁ బోయి చండుని కొడుకుల వధించి పట్టణ మాక్రమించెను. చండుఁడు మార్గ మధ్యమున నామాట విని కోటఁ గాపాడుమని ముంజుని వెనుకకంపె; కాని సపరివారముగ సోదరు లదివఱకె మృతినొందుటం జేసి తా నొంటిగ నేమియుఁ జేయలేక ముఁజుఁడు మరలివచ్చుచుండ జోడా వానిని వెన్నంటి తరిమి త్రోవలోఁ దెగటార్చి ప్రాఁతపగఁ దీర్చుకోనియె. చండుఁడు తనకుమారుల మరణవార్తవిని తాను మండూరు పట్టుకొని జోడాను సంహరించుటకు సమర్థుఁ డయ్యుఁ గయ్యమునకుఁ గాలుదువ్వక తనకొడుకులు రణరంగమున వీరపురుషోచితమైన మరణము నందినా రని సంతసించి జోడా తండ్రిని సోదరులను తాను మున్ను జంపినందుకుఁ దనకుమారుల నిప్పు డతఁడు వధించి యుండు నని సరిపెట్టుకొని రాజపుత్రు లొకరితో నొకరు పోరాడుట తగనిపనియని హితోపదేశము చేసి ముకుళునితో చెప్పి వానిరాజ్యము వానికిప్పించి మారువారు రాజ్యములోని యొక్క తాలూకామాత్రము చిత్తూరు రాజ్యమునఁ గలిపించి యెల్లల నేర్పఱచి తా నెప్పటియట్ల తమ్మునిం గొలిచి బ్రతుకుచుండెను.
నాఁడు మొదలు మేవారు రాజకుటుంబమును మారువారు రాజకుటుంబమును తమతమ ప్రాఁతపగలు మరచిపోయి వియ్యము నెయ్యము హెచ్చ సుఖమున జీవించు చుండిరి. తరువాతఁ జిత్తూరు నగరముపై నొకసారి శత్రువు లెవరో దండెత్తిరా జోడా తన సేనలం గూర్చుకొని మేనల్లునకు సాయమయ్యెను. చండునివంటి నీతిమంతులు దేశాభిమానులు ననేకులు మన దేశమునఁ బుట్టి మార్గప్రదర్శకు లయ్యెదరుగాక!