రాజస్థాన కథావళి/పృథివీరాజు సాహసములు

పృథివీరాజు సాహసములు.


మివారు దేశపు రాణాయగు రాయమల్లునకు సంగుఁడు పృథివిరాజు జయమల్లుఁడు నను మువ్వురు కొడుకు లుండిరి. అందు పృథివిరాజు నిరుపమాన సాహసుఁడు మహా తేజశ్శాలి. అతఁడు పదునాలుగేండ్లు వయసు గలిగినది మొదలు ప్రతికక్షు లెందఱు వచ్చినను లెక్క సేయక యాయుథ సహాయుఁడై యనేక వీరకర్మముల నొనర్చుచుండెను. మీవారు నందెగాక చుట్టుప్రక్కల దేశము లందుఁగూడ పృథివిరాజు ధైర్యసాహసములకు పెట్టినది పేరు. అందుచేత - నతని యకాలమరణమునకుఁ దరువాత కొన్ని వందల యేండ్ల వఱకు జను లాతని వీరవిహారముల నెంతో చిత్రముగఁ జెప్పుకొనుచు వచ్చిరి.

పృథివిరాజు తన బలము తా నెఱిఁగినవాఁ డగుటచే దనకు తరతరములనుండి శత్రువులయిన మహమ్మదీయులతోఁ జిత్తూరులోని శూరులం గూర్చుకొని యుద్ధము సేయుట పండువుగాఁ దలంచుకోనెను. తనయన్న సంగుఁడు తనకన్న శాంతుఁడును వివేకియు నైనను అతఁడు సింహాసన మెక్కడనియుఁ దానె సింహాసన మెక్కి చిత్తూరు నేలునట్లు బ్రహ్మ వ్రాసినాఁ డనియు నతండు పలుమాఱు చెప్పుచుండును. ఒకనాఁడు పృథివిరాజు పినతండ్రియగు సురేశమల్లుఁడును సోదరులు నుండగ పైన జెప్పినట్లు పలికెను. ఆమాటలు విని సంగుఁడు తమ్మునితో నిట్లనియె.

“తమ్ముఁడా! దేవతలయభీష్టమే చెల్లనిమ్ము. విధినిర్మాణ మట్లున్న యెడల నేను జ్యేష్ఠుఁడ నయినను రాజ్యమును నీనిమిత్తమయి విడిచి పెట్టెదను. అయినను మనయూరు బైట వ్యాఘ్రగిరిమీఁదనున్న చారుణీదేవియొక్క యర్చకురాలియొద్దకుఁ బోయి తండ్రియనంతరమున మాలో నెవ్వఁడు రాజగునని మన మడుగుదము.” అందుకు సోదరు లంగీకరించి సురేశ మల్లునితో వ్యాఘ్రగిరికిం బోయిరి. అత్తరి నమ్మవారి యర్చకురా లచ్చట లేనందున నామె వచ్చువఱకు వారందు నిలువ నిశ్చయించిరి. పృథివిరాజును జయమల్లుఁడు నాయర్చకురాలి మంచముమీఁదఁ గూర్చుండిరి. సంగుఁడు 'నేలఁబరచిన యొక సివంగిచర్మము పైఁ గూరుచుండెను. సురేశమల్లుఁడు వానిప్రక్కనే మోకాలు సివంగిచర్మమునకుఁ దగులునట్లు నేలఁ గూర్చుండెను. అంత గొంతసేపటి కర్చకురాలు వచ్చుటయు ముందుగా పృథివిరాజు లేచి తమవచ్చిన పని నామె కెఱింగించెను. ఎఱిఁగించుటయు నామె సంగునివంకఁ దిరిగి యిట్లనియె.

"సివంగి చర్మమే పూర్వము రాజులకు సింహాననము. దానిని నీ విప్పు డధిష్ఠించితివి గనుక ముందు మీవారుసింహాసనమును నీవ యధిష్టింపఁ గలవు " అని పిదప సురేశమల్లునివంకఁ దిరిగి యనేక సంవత్సకములు బహుశ్రమల ననుభవించిన వెనుక నీకును దేశమును బ్రభుత్వముమ లభింపఁగలవు. అవి యెట్లనిన నింకఁ గొంతకాలమునకు పితృవిహీనుండగు నొక రాజకుమారుని బగతుక బారింబడకుండఁ దల్లి సంరక్షించు చుండును. ఆమె కతంబున నీకు రాజరికము లభించునని మోగ మాటము విడిచి పలికెను.

అపలుకులు నిని పృధివిరాజు మండిపడి పట్టరాని బిట్టలుకయు నీర్ఘ్యయుఁ తన్నుంబురికొల్పం గత్తిం దూసి సంగుని జంపుటకై వాని మీఁద దుమికెలు. అంతలో సురేశమల్లుఁ డడ్డువడి సంగుని రక్షింప వారలకు మహాకలహము సంభవించే. ఆయర్చకురాలును మిక్కిలి భయపడి తన నెక్కడ చుంపుదురో యని గుహవిడిచి పారిపోయెను. ఆమె చిన్న గుహ రాజపుత్రుల దూషణ భూషణములతోను ఖద్గసంఘ ట్టనములతోను ప్రతిద్వనుల నిచ్చెను.

అదినమున వ్యాఘ్రగిరికి సమీపమున నొక మఠమువద్ద రహతురు వంశస్థుఁ డగు నొక రాజపుత్రుఁడు గుఱ్ఱముపై జీను వేసికొని యెక్కడికో పయన ముగుటకు సిద్ధముగ నుండెను. అప్పుడు వాని యొద్దకు నొక పురుషుడు తన గుఱ్ఱమును మిక్కిలి వేగముగాఁ బరు గెత్తించుచు వచ్చెను. అతని శరీరమున నైదు కత్తి పోటు లుండెను. వాని గుఱ్ఱము మిక్కిలి యలసట పడి నోట నురుగులు గ్రక్కుచుండెను. రక్తమున స్నానము చేసినట్లు వాని దేహ మంతయు నెఱ్ఱబడి యుండెను. బాణము తగులుట చే నొకకన్ను పోయి యుండెను. రహతూరు వంశస్థుఁడు నీ వెవ్వఁడ వని వాని నడుగ నాతఁడు "నేను రాయమల్లు కుమారుఁడగు సంగుఁడను నన్ను నాసోదరులు చంప నెంచి" రని చెప్ప రహతూరుండు వానికభయమిచ్చి చేయూతయిచ్చి గుఱ్ఱముపై నుండి దింపి సేదం దేర్చు నప్పటికీ వారియెదుట, గుఱ్ఱపుదళము వచ్చుచున్న జాడ దెలుపుదు మ్మగుపడెను. అది చూచి సంగుఁడు "అదె నాతమ్ముఁడు జయమల్లుఁడు నన్నుం దెగటార్చుటకు వచ్చు చున్నాఁడు. పృధివిరాజు సురేశమల్లుఁడు నొండారులం దాఁకి పోరి యలసటఁ జెంది కదలలేక యచ్చటనే యుండి ” రని పలికెను. రహ తూరు వంశస్థుఁ డామాటలు విని భయము లేదు. ఈమఠములోనికి వారు రాకుండ నేను నిలిజెను, ఇంతలో నీవు నిరపాయముగఁ బారి పొమ్మని ధైర్యముఁ జెప్పి వాని నావలకుఁ బంచె. అంతఁ గొంత సేపటికి జయమల్లుఁడు వచ్చి రహతూరు వంశజునిఁజూచి “సంగుని మా కప్పగింపవలసిన " దని యడుగ నతఁను సంగుఁడు నన్ను శరణుఁజొచ్చి గావున నతని నప్పగింపనని నిర్భయముగాఁ బలికెను. అప్పుడు జయమల్లుఁడు "అట్లయిన మేమే వానినిఁ బట్టుకొనెద'"మని మఠముం బ్రవేశింపఁబోవ రహతూరుఁడు కోపాయత్తుఁడై కత్తిదూసి జయమల్లుని వాని సేనను లోనం జోరనీయక నిరోధించే. అంతట కొండొకసేపు వఱకు సందడికయ్యంబు జరుగ శరణాగత బిరుదమును బూనిన రహతూరుఁడు ప్రాణములు విడిచెను. అతఁడు గూలిన వెనుక జయమల్లుఁడు మొదలగు వారు మఠముం జొచ్చి యందు సంగుని గానక యతఁడు మఱల తప్పించుకొని పారిపోయె నని విషాదము నొంది చనిరి, ఈవాతం రాయమల్లునకుఁ దెలిసినతోడనే యతఁడు పృథివి రాజును మందలించి జీవాట్లు పెట్టి యిట్లనియె. “నా గారపు కోడుకగు సంగుని నాకు దక్కనీయక దుండగీడ "వైతివి. పాపము వాఁడు నీకు వెఱచియేగదా నిలువనీడ లేక యడవులఁ గొండలఁ గ్రుమ్మరు చున్నవాఁడు. నీ మొగముఁ జూడ రాదు. నావద్దనుండి లేచిపొమ్ము. పోయి నీ వెప్పుడు పోరాటములె కోరుచుందువు గావున యెందేని. పోరులు సలుపుచు బ్రతుకుము.

అభిమాన ధనుఁ డగు పృథివి రాజు తండ్రి పలుకులు విని రోషముఁ జెంది తన గాయములు కుదిరిన వెనుక తండ్రి వద్ద సెలవు గైకొని యొక గుఱ్ఱము నెక్కి యైదుగురు సేవకులను వెంటఁ గొని తన యాయుధముల సంగ్రహించుకొని తాను గొప్ప కార్యములఁ జేసి ప్రసిద్ధుఁ డైనప్పుడు గాని మరలఁ దండ్రియింటికి రాఁగూడ దని నిశ్చయించుకొని యిల్లు విడిచి విదేశములపాలై పోయెను.

రాజస్థానమున గద్వారను చిన్న దేశము కలదు. దానినిఁ బూర్వము మీనవంశజులగు రాజు లేలుచుండిరి. చిత్తూరు రాజు లా దేశమును మీనకులజులవద్ద నుండి జయించి పుచ్చుకొని తమపాలనలో నుంచిరి, రాయమల్లుని సోదరుఁడు మీవారు పాలించిన కాలముల గద్వారుసంస్థానము మీవారునకు లోఁబడక స్వాతంత్యము నొందెను. రాయమల్లు మఱల దానిని లోబఱచుకొన లేక పోయెను. పృథివి రాజిల్లు విడిచి క్రమక్రమముగా నా దేశమును జేరెను. అతఁడు పోవునప్పటి కాదేశమునం దంతట బందిపోటు దొంగలు నిరంకుశవత౯ నులయి పట్టపగలు దోఁపుడులు చేయుచు చెల రేఁగి యుండిరి, 'మీనవంశజుఁ డొకఁ డా దేశమునకుఁ దానుఁ బ్రభువునని చెప్పుకొనుచుండును; కాని యతని యధికారము పేరునకు మాత్రమే. రాయమల్లుఁడా దేశమున నతని యధికారము స్థాపింపలేక పోవుటయే గాక దొంగల దౌర్జన్యమయిన నడప లేక పోయెను. పృథివిరాజా దేశమును జయించి మఱలఁ దనతండ్రి కర్పింపవలయు నని నిశ్చయించుకోని యేదేని యుపాయము దొరకకపోవునా యని ముఖ్య పట్టణమునకుఁ బోయెను. ఇంతలో నతనివద్దనున్న దవ్యమంతయు వ్యయ మయ్యెను, అతని యనుచరు లతనికన్న నిరుపేదలై యుండిరి. తన యనుచరులకుం దనకు నొకపూట బసయు నన్నమును సమకూర్చుకోనుటకుఁ దన వ్రేలనున్న వజ్రపు టుంగరము గొదువ బెట్టుటఁ దప్ప గత్యంతరము కానఁ బడదయ్యె. అతఁ డాయుంగరమును దీసికోని.బోయి ఓజుఁ డనునొక వత౯ కునికిఁ జూపి దానిమీఁది కోంతసోమ్మడి గెను. దైవవశమున నావత౯కుఁడు మును పాయుంగరమును పృధివి రాజున కమ్మిన యతఁడే యయ్యెను. ఆవణీజుఁ డాయుంగరమును, 'రాజకుమారుని గుర్తు పట్టి తవ్వత్తాంతము వినఁగోర పృధివి రాజు తనసంకల్పమును మర్మము విడిచి యతనితో జెప్పెను. అది విని వతకాకుండు సంత సించి యుపాయము చే గద్వారు దేశము ననాయాసముగ గెలువవచ్చునని యతనికి ధైర్యము చెప్పి వానికిం దోడ్పడ నెంచెను.

అనంతరము పృథివి రాజు నేర్పరియగు నోజును యాలోచనము విని మారువేసము వేసికొని యూరుపేరు దెలియనీయక తన యను చరులతో గూడి యచ్చట మీనవంశపు రాజు నోద్ద కొలుపునకుఁ గుదిరి వానికి మిక్కిలి విధేయుఁడై 'భక్తి శ్రద్దలతో బరిచర్య సేయు చుండె. ఇట్లుండ నొకనాడు పండుగ రాఁగా మీన రాజు నమ్మిక గల తనబంట్ల కందఱకు సెలవి చ్చెను. పృధివి రాజును వానికడ సెలవుఁ గైకోని తన యనుచరులను మాత్రము కోటలో రాజువద్ద నిలిపి తాను పండుగ సౌఖ్య మనుభవింపక యూరు బైట చెట్లచాటున దాఁగు కొనెను. అంతలో, గోటలోఁ పృధివిరాజుచే విడువఁబడిన 'సేవకు లైదుగురు పరివారశూన్యుఁడై యొంటిగ నున్న మీనరాజుపయింబడి వానిం దుదముట్టింపఁ దలంప నతఁడు ప్రాణభీతుఁడై గుఱ్ఱము పై నెక్కి కోట వెలువడి యూరుబైట కొండలలో దలఁదాఁచుకోనుటకుఁ బారిపోవుచుండెను. అతఁడు వచ్చు దారిలోనే చెట్ల చాటున దాఁగి యున్న పృథివిరాజు తన పన్నినకుట్ర నిర్విఘ్నముగ నెఱువేఱినందుకు సంతసించి పఱుగెత్తుచున్న మీనరాజును బట్టుకొని బల్లెముతోఁ బొడిచి వాని కష్టము నంతము నొందించెను. పిన్ముట మీన రాజు పరిజనులు కొంత యాగడము సేయ పృధివిరాజును వానియనుచరులును వారినోడించి పట్టణము పరశురామప్రీతిఁ గావించి 'దేశమును స్వాధీనముఁ జేసికోనిరి. పృధివి రాజు తా నప్పుడు సర్వస్వతంత్రు డయ్యు నా దేశమునకు రాజగుట కిష్టము లేక యోజుని దానికిఁ బాల కునిగాఁ నియమించి తనతండ్రి పేరనే పాలింపు మని వానికిఁ జెప్పి తన కక్కడ కాలు నిలువకపోవుటచే ననేక సాహస కార్యముల, నింక నొనర్చి ప్రఖ్యాతిం గాంచవలయు నని గద్వారు విడిచి యనుచర సమేతుఁడై యన్య దేశములకుఁ బోవ నిశ్చయించుకొనెను.

ఆకాలమున మీవారు రాజ్యమునందనలి బదనూరు పట్టణములలో రాజ్యబ్రష్టుఁ డైన యొక రాజపుత్ర ప్రభు వుండెను.అతని రాజధాని తోడా యను పట్టణము. అతఁ డోక తురకరాజువలన జయింపఁబడి యూరువిడిచి తల దాఁచుకోనుటకు బదనూరునకువచ్చి మరలఁ దన రాజ్యమును దాను సంపాదించుకోనుట కనేక పర్యాయములు సేవకులఁ బంపి విఫలప్రయత్నుండై యూరకుండెను. ఆరాజునకు తారాభాయి యనునొక చక్కని కూఁతురు గలదు. ఆ బాలిక సూర్యరశ్మి రాని యంతఃపురములఁ గూపస్థ మండూకమువలెఁ బడియుండుట కిష్టము లేక ఘోషావిడిచి విల్లువంచుటయుఁ గత్తిదూయుటయు గుఱ్ఱపు నవారు చేయుటయు ఫాజులం గూర్చుకుని కయ్యములు నడపుటయు నేర్చి తండ్రిని మరల రాజ్య, ప్రతిష్ఠితునిఁ జేయ నిచ్చగించె, ఆవన్నెలాడి చక్కఁదనమును సాహసమును విని జయమల్లుఁడు తనకా కన్నియ నిమ్మని తండ్రికి సందేశ మంపెను. ఆమెతండ్రి యామాట కుత్తరమును దా నియ్యక యాపని కూతురు మీఁదనే పెట్టఁగా నామె నాతండ్రి కెవడు మరల రాజ్యము సంపాదించి యిచ్చునో యతఁడే నాపాణిగ్రహణము సేయుగాక" యని యుత్తగ మిచ్చెను.జయమల్లుఁ డట్లు చేయుదు నని ప్రమాణము చేసి నమ్మిక వొడమునట్లు సంచరించి 'తారా దేవినిం జూడగోర నామెతండ్రి దాని కంగీకరించె. వా రుభయులు పరస్పరసందర్శనము చేయువేళ జయమల్లుఁ డామె చక్కఁదనమును జూచి పరవశత్వముఁ జెంది మతిభ్రష్టుఁ డౌటచేతనో లేక రాజవుత్రు లందఱు మైకము నిమిత్తము ద్రాపు నల్లమందు మద్దతు మితిమీరఁ ద్రావుట చేతనో యామె గౌరవమునకుఁ దనగౌరవము నకుఁ దగనట్లు వతి౯౦చి యా బాలిక నవమానించే వెంటనే యభిమాననిధియగు నామెతండ్రి ఖడ్గపాణియై వచ్చి జయమల్లుని నిలుచున్న వానిని నిలుచున్న యల్లే ఖండించి వైచె.

జయమల్లుని మరణవాత౯లు రాయమల్లుమహా రాజునకుఁ దెలిసినప్పుడు వాని కొలువునందున్న రాజపుత్రు లనేకులు కోపోద్దీ పితులై తారాదేవితండ్రినిం దెగటార్చి పగ దీర్చుకొనక తప్పదని రాణాతో విన్నవించిరి. రాణా వారిని వారించి యిట్లనియె. రాజ్యమును గోల్పోయి నిలువ నీడ లేక మనయండనుండి యెట్టెటో కాలక్షేపము సేయుచున్న యారాజున కంత యవమానము చేసిన వాఁడు నాకొడుకై నను జావవలసిన వాఁడే, మాన రక్షణమునకై యీసాహస మొనర్చిన యారాజు శౌర్యమునకు మెచ్చి బదనూరుభూముల నతనికి బహుమానములుగ నిచ్చుచున్నాను.

అంతం కొన్ని నాళ్ళకు పృథవిరాజు తనసోదరుని మరణమును తారా దేవి యొనర్చిన ప్రతిజ్ఞయు విని సత్వరంబుగ బదనూరునకువచ్చి తన్ను వివాహమాడుమని యామెనడిగేను. తనతండ్రిని రాజ్యప్రతిఫ్లితునిఁ జేయువానినేగాని వివాహమాడ నని యామె యెప్పటియట్లఁ బలుకుటయఁ బృథివిరా జట్లుచేయుదునని శపథము చేయ వాని సాహసములయందు నమ్మిక గలిగి తారాదేవినిచ్చి యామెతండ్రి యతనికి వివాహము చేసెను. వధూవరు లిరువురును తోడా పట్టణమును బట్టు కొనుటకు సమయము వెదకుచుండిరి. అంతలో తురకల మొహరము పండుగ వచ్చేను.

తుఱక రాజు వాని సైనికులు చుట్టములు నానందపరవశులై యుత్సవములం జూచుచుండిరి. పండుగ కడపటిదినము నీళ్ళంబడిన వెనుక పీరులను శవాకారముగఁగట్టి తుగకలు నాలుగు వీధుల మొగ లో బెట్టి వారియాచారప్రకారము దుఃఖించు చుండిరి. జను లనేకులు గుంపులుగూడి యావినోదమును జూచుచుండిరి. అప్పుడు గంభీరాకారములును చిత్ర వేషములుం గలిగిన మువ్వురు మనుష్యు లాగుంపులో గానఁబడిరి. తురకరాజు తన మేడ మీఁద నుండి యాయుత్సవమును జూచుచు క్రొత్త మనుష్యుల పై దృష్టి నిలిపి వారెవ్వరని ప్రక్కవారి నడిగెను. ఆమాటలు వానినోటనుండి కడదేర రాకమునుపే రివ్వురివ్వున యొక బాణ మాగుంపులో నుండి వెడలి నిలుచున్న యారాజును గుభాలున నేలంబడ వైచి శవముగఁ జేసెను. అంతట నగరమంతయుఁ గళవళము పుట్టెను, ఉత్సవముఁ జూడవచ్చిన వారు నిర్విణ్ణులై పరుగెత్తిరి. మ్లేచ్చ సైనికులు యదాయద లైరి. ఆకోత్త మనుష్యులు మువ్వురు పృథివి రాజు తారా దేవి వారి సేవకుఁడు దక్క మరొకరు గారు. వారు వచ్చిన పని నిర్వతి౯ంపఁబడినది గదాయని యూరుబైటకుం బోవుచుండిరి. అప్పుడు కొందఱు మ్లేచ్ఛ సైనికులు 'ధైర్యము దెచ్చుకొని వారిని దఱుమ నారంభించిరి. ఆమువ్వురు వారిని లెక్క సేయక చనుచుండ' నగర ద్వారమువద్ద కొండవంటి యొక యేనుఁగు వారికడ్డము వచ్చె తోడనే తారా దేవి యొరలోనుండి ఖడ్గము నూడ బెరికి ఝళిపించి తోండమును నఱికి యేనుఁగును పీనుఁగును గావించె.

అనంతర మామువ్వురు నూరుబైట సిద్ధముగానున్న తమ సైన్యముం గలసికొని యనాయకమై యరాజకమైన మేచ్ఛ సైన్యము పయింబడి దానిం జెల్లా చెదరుగా జేసిరి. కాలి కొలఁది పరుగెత్తిన వారు తక్కఁ దక్కిన మ్లేచ్ఛులు హతులైరి. తారాదేవియొక్క మనోరథము సంపూర్ణముగ సఫలమయ్యే. తోడానగర మామెతండ్రి స్వాధీనమాయె. సాటి తురక రాజునకు జరిగిన పరాభవమును విని యజమీరును బాలించుచున్న మ్లేచ్ఛప్రభువు పృధివిరాజును దండింప వలయునని నిశ్చయించుకొనెను. ఆవాత౯ విని పృథివిరాజు వాఁడు తనమీఁదికివచ్చువఱకుఁ గని పెట్టుకొని యుఁడక తానే వానిమీఁదికి ముందుగ యుద్దమునకు సిద్ధమయి సైన్యముం గూర్చుకొని తనజాడ వారెఱుంగకుండ నడిరేయి పయనముఁ జేసి యుదయ మగునప్పటి కాయూరుఁ జేరి వారిదళంబుల నోడించి కోట నొక్క పూఁటలోఁ బట్టుకొనియె.

రాయమల్లుఁడు తనకుమారుని మహాసాహసములు విని యానందభరితుఁడై వానిం దనసన్నిధికి రమ్మని వర్తమాన మంపె. జయమల్లుఁడు కులమునకు పరాభవము దెచ్చి దుర్మరణము నొందుటయు సంగునిజాడ యొక్కింతయుఁ దెలియ రాకుండటయుఁ దలంచి రాయమల్లుఁడు పృథివిరా జోక్కఁడే తనకుం గొడు కని యెంచి చిత్తూరునకు రావించి వానిని సబహుమానముగా నాదరించె. పృథివి రాజును తండ్రికి విధేయుఁడై యుఁడఁదలంచెను, కాని వానికిఁ జిత్తూరునగరమున శూరకర్మలుమానీ సోమరియై భోగపరాయనణుఁడై యుండుట కిష్టము లేకపోవుటచే తనయిచ్చవచ్చిన తెఱంగున వీర విహారము సలుపుటకు మీవారు దేశమున పడమ భాగమున నున్న కమల్ మియర్ గోటలోఁ గాఁవురము చేయఁదలంచి యచ్చటికిఁ బోయెను. ఆకోట యిప్పుడు మిక్కిలి పాడుపడియున్నను మిగిలిన భాగములం జూచువారికి దాని తొంటి గొప్పతనము తెలియక పోదు. దృఢమయిన రాతిగోడలు మహోన్నతము లయినగోపురములు గురుజులు మంచిమంచి మేడలు గలిగి యాకాలమున నది నకల సౌఖ్యనిధానమై శత్రుదుర్భేద్య మయి యుండెను. పృథివిరా జందు భార్యాసమేతుండై వసియించి దుష్టుల దండించుచు దొంగల నడఁచుచు హాయిగ నుండె. రాజపుత్రులనేకు లామహావీరునిఁ గొలుచుటకు వచ్చి యాతఁడు చిచ్చురుకు నున్న నురుకుటకు సిద్ధముగ నుండిరి. ఇట్లుండి పృథివిరా జోకనాడు తండ్రిని దర్శించుటకు చిత్తూరునకు వచ్చెను. అప్పుడు రాయమల్లుఁడు మాళవ రాజుయొక్క సేవకునితో మిక్కిలి చనువిచ్చి తనగౌరవమునకు దగనట్లు వానితో మాటలాడఁజొచ్చె. ఆసంభాషణము విని పృథివిరాజు సేవకుఁడు చనినవెనుక తండ్రినిఁ బిలిచి యట్టినీచుల కంత చను విచ్చి మాటలాడుట రాణావంటివాని కనుచిత మనియు నాఁడు జరిగిన సంభాషణము తనకే కాక రాజ బంధువుల కందఱకు నలుక పుట్టించిన దనియు నట్టిచనువు లింక నియ్యగూడ దనియు జెప్పెను. రాయమల్లు, డామాటలు విని కుమారునితో "నాయనా! నీవు మహాసాహసుఁడవు రాజులంబట్టి బంధిపఁగలవు. నా కంత ప్రయోజకత్వము లేదు. నేను చుట్టుపక్క రాజులతో మంచిమాట చేసికొని యెట్టెటో నారాజ్యము గాపాడుకొను చున్నాడ” నని ప్రత్యుత్తర మిచ్చెను.

పృథివిరా జది విని తండ్రికి మాటలతో నుత్తర మియ్యక వెంటనే యచ్చోటు వాసి తన నెలవునకుం బోయి యొకసేనం గూర్చుగొని మాళవ దేశముపై దంచువిడిసె. మాళవరాజు వానిదౌర్జన్యము నకు సైపక మహాసేనాసమేతుఁడై వేశ్యాంగనల యాటపాటలు, హెగ్గడల హెచ్చరికలు, వందిమాగధుల కైవారములు సెలంగ మహేంద్ర వైభవముతోఁ గయ్యమునకు బయలుదేరెను. ఈమహాసేన యొకనాటిఱేయి యొకచో విడిసియుండి సంగీత సాహిత్యములతో మహాకోలాహలము చేయుచుండ రాజు గుడారమునకు సమీపమున పెద్దకలకలము పుట్టెను. అది యేమగు నని కొందఱు చూచునప్పటికి శూరశిఖామణులు కొంద ఱాయుధ పాణులై గుఱ్ఱముల నెక్కి శిబిరముం జొచ్చి నిర్భయముగా రాజున్న కడ కరుగుచుండిరి. ఆకస్మికముగా శత్రువులు పయింబగుటచే మాళవ సైనికులు నిశ్చేష్టులై పగతురను నిలువరింప నేరరైరి. అప్పుడు పృథివిరాజు సింగపుంగొదమవోలే మాళవరాజున్న గుడారములోనికి దుమికియామహారాజుం జెరబట్ట వాని సైనికులు రిచ్చవడి చూచుచుండ వానిం గొనిపోయెను. అంతఁ గొంత వడికి మాళవ సైనికులు ఱిచ్చవాటునుండి మేలు కాంచి యాయుధముల సంగ్రహించి తమరాజును విడిపించుటకు పృధివి రాజు వెన్నంటి తఱుమఁ జొచ్చిరి. ఆ సైనికులు తనకుఁ గూతవేటు దూరంబునకు వచ్చినప్పుడు పృథివిరాజు వారిని వారించి సవిూపమునకు రావల దనియు సాహసించి రాజును విడిపించుటకు వచ్చి రేని రాజు నప్పుడ పొడిచి చంపెదననియు రాక నిలిచినపక్షమున రాజున కేయపాయమును సేయ ననియు మాళవ రాజును తనజనకుని పాదములపయిం బడవైచి మఱల వానిని విడిచిపుత్తుననియు వారికి సందేశ మంపెను. ఆమాటలు విని మాళవ సైనికులు వెనుకకుం జనిరి.

పృథివిరాజు మాళవేంద్రుని దీసికొని చిత్తూరునకుఁ బోవునప్పటికి రాయమల్లుఁడు కొలువుఁ దీర్చి యుండె. వీరరసావతారుఁ డగు కొడుకును బిక్క మొగముతో నున్నమాళవపతినిఁ జూచి రాయమల్లుఁడు మాళవపతి నదివర కెన్నఁడు జూచియుండమి నతఁ డెవ్వ రని కొడుకుం దఱచితఱచి యడిగెను. కొడుకు తండ్రితో "నీతఁ డెవ్వఁడో నేను చెప్పను. తొల్లి మిక్కిలి చనువుతో మీతో మాటలాడిన యా సేవకునిం బిలపింపుఁడు, అతఁడే చెప్పగలఁ" డని పలికెను. రాణా యా సేవకునిం బిలిపించి యతఁ డెవ్వఁ డని యడుగ నాతఁచు మహేంద్ర వైభవుఁ డగు తన యేలిక యంత నీచదశలో నుండుట గనుంగోని ఱిచ్చవడి నోట మాటరాక యెట్టకేల కతఁడు మాళవేంద్రుఁ డని రాణాతో విన్నవించెను. రాణాయును వాని సొమాన్యునట్లాదరింపక రాజునకు దగు గౌరవముతో నాదరించి చిత్తూరులోఁ గొన్ని దినము లుంచి వాని వద్దనుండి కప్పము గ్రహించి లోబఱచుకొని సబహు మానముగ విడిచిపుచ్చె. పృథివిరాజు తండ్రికి తన ప్రతాపముఁ జూప గలిగేగదా యని సంతసించి మఱల కమలమియరుకోటకుం జనియె ఇట్టిశూరకర్మల పృథివిరా జవలీలగా ననాయాసముగఁ జేయు చుండును గాని వానికై పెద్ద ప్రయత్నముఁ జేయ నక్కర లేదు.

పృథివిరాజు కమలమీయరుకోటకుఁ బోయి కొన్ని దినము లుండునప్పటికి వాని పినతండ్రి యగు సురేశమల్లుఁడు రాణా పై తిరుగబాటు చేసి యుద్దమునకు సిద్ధమయ్యెను. పూర్వము చారుణీ దేవి యర్చకురాలు తనకు ప్రభుత్వము రాజ్యము వచ్చునని చెప్పినమాట మనసులో నుంచుకొని సురేశమల్లుఁ డది యెత కాలమునకు సఫలము కాదయ్యెనని వగచి సాహసేలక్ష్మీ! యనుమాట నమ్మి భుజబలము చేత రాజ్యము సంపాదింపఁదలఁచి తనసోదరుఁడును మహారాణాయు నగురాయమల్లు నిమీఁద గత్తి కట్టెను. రాణాకు మున్ను మిక్కిలి నమ్మకము గలవాఁడును దగ్గరచుట్టము నగు సారంగ దేవుఁ డనురాజపుత్రుఁడు రాజద్రోహియై సురేశ మల్లునితోఁ జేరెను. వారిఱువురుం గలిసి మీవారు దేశముం జొచ్చి గ్రామంబుల దోఁచుకొని గృహంబుల పరశురామప్రీతి గావించి కొంత దేశము నాక్రమించిరి. రాయమల్లుఁడు తన సైన్యములం గూర్చుకొని వారిపై నడచి యెదుక్కొని సంకుల సమరము గావించి తాను నొక్క సామాన్యపుజోదువలె పోరి యిరువది రెండుగాయములఁ దిని యేమియుం జేయలేక యుండెను. అప్పుడు రాయమల్లుని సైన్యము పగతురచేత నిర్మూలింపఁబడుటకు సిద్ధముగ నుండెను. అంతలో పృథివిరాజు వచ్చి తండ్రి సేన నిర్మూలింపఁబడ కుండఁ గాపాడెను; కాని శత్రువులను పరాజయము నొందింప లేదు.

ఉభయుల సేనలు నొండొంటికి తీసిపోక వెనుకంజ యిడక చావునకు వెరువక రాత్రులా యుధములమీదనే బవ్వళించుచు నెప్పుడు తెల్లవారు నెప్పుడు పోరు సేయఁ గలుగునని యువ్విళులూరుచు దినములం బుచ్చుచుండిరి. అట్లుండ నొకనాఁడు రాత్రి సురేశ మల్లుఁడు మంచము పై బండుకోని ప్రణవైద్యుఁ డగునోకమంగలివానిచే గాయముల గుట్టించుకొను చుండెను. అప్పుడు పృథివిరాజు మెల్లమెల్లగ శిబిరముం జొచ్చి సైనికులచేఁ జిక్క కుండ పినతండ్రి గుడా రమునకు వచ్చి వానిక ట్టెదుట నిలిచెను. 'వానిం జూచి సురేశమల్లుఁడు భయవిస్మయములతో బలిమిని లేచెను. లేచునప్పటి కదివఱకు కుట్టిన గాయములన్నియుఁ బటాలున బగిలి నెత్తురులం గ్రక్కఁజొచ్చె. పృథీవీరాజు వానిసంబ్రమము వారించి భయము లేదని సేమ మడి గెను. సురేశమల్లుఁడును "నాయనా! సుఖముగానున్నాను. నీరాకచే మఱింత సుఖము గలిగినది సుమీ" యని కుమారునకుఁ బ్రత్యుత్తర మిచ్చెను. పిదప పృథివిరాజు నేను మిక్కిలి యాఁకలిగొనియున్నాను నిన్నెప్పుడు చూతునో యెట్లుచూతునో యని బెంగగొని మాతండ్రి నైనం దర్శింపక యన్నమైనం దినక నీతావునకు వచ్చితిని, నాకించుక యన్నము బెట్టింపు' మని పినతండ్రిని బ్రార్థించె. సురేశమల్లుఁడు నన్నము తెప్పింప పగలెల్ల నొకరిప్రాణముల నొకరు దీసికొనుటకై ప్రయత్నము చేసిన యారాచకొడుకు లిరువురు నారాత్రి జుట్టరికము నెయ్యము మెరయ కలసి మెలసి భుజించిరి. అనంతరము పృథివిరాజు పినతండ్రితో , "రేపు మనకయ్యమును ముగింపవలయు" నని పలుక “నాయనా! పెందలకడ రమ్ము పొ” మ్మని సురేశమల్లుఁడు బదులు చెప్పి వానిం బుచ్చె.

మరునాఁ డుదయమున యుద్ధ మారంభ మయ్యెను. ఆకయ్యమున నెప్పటిఁయట్లు పృధివిరాజే జయమునందె. సారంగ దేవుఁడును సురేశ మల్లుఁడును యుద్ధభూమి విడిచి పలాయతులైరి. పృథివిరాజు వారిం దరుముకొనిపోవ నెడనెడ చిన్నచిన్ని పోరాటంబులు జరుగు చుండె, వానిలో సయిత మెప్పుడు పృథవిరాజే విజయమునందుచు వచ్చె. ప్రళయాంతకునిఁబోలు రాచకుమారుని దాడి కోడి సురేశమ ల్లెట్టకేల కొకయడవిం జొచ్చి యందు నట్టనడుమ దుర్భేద్య మగు నొకప్రదేశము నెలవుగాఁ జేసికొని పగతురకు తమజాడలు తెలియ వనుకొని యచ్చట నుండిరి. అట్లుండ నొకనాఁడు రేయి నిశ్శబ్దమైన యడవిలో కత్తుల రాపిడి చప్పుడు వినంబడియె. అది విని సురేశమల్లుఁడు మా యన్న కొడుకు వచ్చినట్లుతోఁచుచున్న దని యింక నేమో చెప్పఁ బోవుచుండఁగ నే పృథివిరాజు సపరివారముగ వానిముందరకు దుమికి ఖడ్గముతోఁ బినతండ్రి నొక్క యేటు యేయుటయు సారంగ దేవుఁడు వాని కడ్డమువచ్చి "సురేశమల్లుఁడు గాయములచేఁ బీడితుఁడై కదల లేక యున్నవాఁడు, తొల్లి యిరువది దెబ్బలకైనను సరకు సేయని యీ శూరుఁ డిప్పు డొక గుద్దున కైన నోప లేఁడు గావున నవధ్యుం" డని పలికె. అప్పుడు సురేశమల్లుఁడు నేను పోయెనని నాయన్న కొడుకు చేతిలోనేగదా' యని పృథివి రాజు వంక దిరిగి కుమారా! కయ్యము మానుము. నీవు నన్ను జంపినది యొక లెక్కలోనిది గాదు. నాకుఁ గుమారులు కలరు వారు రాజపుత్రు లగుటచే వారికి సాయసంపత్తులు గలుగును; కాని మేము నిన్నే చంపుట సంభవించిన యెడల చిత్తూరుగతి యేమగునో? నిన్నుఁజంపి నేనెల్ల కాలము లోకనింద పాలు గావలసివచ్చు నని వీరపురుపోచితముగఁ బలికెను. దయనీయములగు పినతండ్రిపలుకులు విని పృథివిరాజు హృదయము గరుగఁ గత్తు లొరలో నుంచుఁడని తన సైనికుల కానతి చ్చెను. పిమ్మట పినతండ్రి యుం గొడుకును నొండొరుల బిగ్గగౌఁగిలించుకొనిరి. తోడనే' నిరుబలములు తమతమ ప్రాంత పగలు కోండొకతడవు మరచి మరల కలసి మెలసి కూరుచుండి యిష్టగోష్ఠిం బ్రవర్తిల్లిరి.

అనంతరము వృథివిరాజు పినతండ్రిని జూచి "అయ్యా! నేను వచ్చునప్పటికి మీ రేమి చేయుచుండి" రని యడిగెను. చేయుట కేమి యున్నది. ఉన్న మట్టుకు దిని యుబుసుపోక పిచ్చపాడి చెప్పుకొనుచుంటిమని సురేశ మల్లుఁ డుత్తర మిచ్చెను. "కాని నీజాడ లరయుటకయి నేను విశ్వప్రయత్నము చేయుచుండుట నీ వెఱిఁగియు నింత యజాగ్రత్తతో నేలయుంటి" వని మరల గుమారుఁ డడుగఁ బినతండ్రి యిట్లనియె. నాయనా ! నేనేమి చేయఁగలను? నీవు నన్నెక్కడ కాలూది నిలువకుండఁ దఱుముచుంటివి. నే నెచ్చట నైనతల దాఁచుకో వలయునుగదా ! అందుచే నిచ్చట నుంటి" నని సురేశమల్లుఁడు ప్రత్యుత్తర మిచ్చే, ఆ రాత్రి యట్లుగడపి మఱునాఁడుదయమున పృథివీ రాజు పినతండ్రిని జూచి యచ్చటకు సమీపమున నున్న భవానీ దేవాలయమునకుఁ దనతో వచ్చి యా దేవికి బలి సమర్పింపుమని యడిగెను. సురేశమల్లుఁడు లోకానుభవ మెఱింగినవాఁ డగుటచే పృథివి రాజు దన కీనెపమున నేదేని యపాయము సేయునని యనుమాపించియో యంతకుమున్ను కొన్ని నెలలనుండి తెరపి లేక పోరులు సలుపుచు గాయములచేఁ బీడితుఁ డై కదలజాలకయో పృథివిరాజును జూచి క్రిందటి రాతిరి తగిలినగట్టి దెబ్బకే తాను కదలఁజాల కున్న వాఁడ నని వంక పెట్టి తనబదులు సారంగ దేవునిం గొంపొమ్మని యోత్తి పలికెను.

ఎవరు వచ్చినను మంచి దేయని, పృథివిరాజు సారంగ దేవుని దన వెంట నాలయంబునకుం గొంపోయి యచ్చట వానిం జంప నుంకించుటయు నావీరుఁడును పృథివిరాజునకు లొంగక కొంతసేపు పో రొనర్చి తుదకు వానిచేత హతుఁడయ్యె. తొల్లి మీవారు రాజు లలో మొట్ట మొదటి వానికి నప్రతిహతమగు ఖడ్గముఁ బ్రసాదించిన యామహా దేవికిఁ బృథివిరాజు భక్తి మెఱయ సారంగదేవునితల బలిగా సమర్పించి తండ్రికిఁగల ప్రాఁతపగ దీర్చికొని సంతుష్టాంతరంగుఁడయ్యె.

సారంగదేవుని దుర్మరణవాత౯లు విని సురేశమల్లుఁ డేదియో నెపము పెట్టి యన్న కొడుకుతో జనకపోవుట చాల మేలయ్యె నని సంతసించి గుఱ్ఱము నెక్కి ప్రాణభయంబున నచ్చోటు విడిచి సపరివారముగ నొండొక యెడకుఁ బోవఁదలంచి మున్ను తాను జయించి యాక్రమించిన భూములకుం జనియే. ఆభూములలో నిరపాయముగఁ దాను నన్ని నాళ్ళనుండి పగతుర బారి కోడి తానందు నిలువ లేనప్పుడు తన భూములు రాణాకు దక్కనిచ్చుట కిట్టము లేక సురేశ మల్లుఁడు రాజుకన్న బలవంతులు బాహ్మణులేకదా యని నమ్మి వారికి దాన మిచ్చిన మాన్యములు రాజు మరల గ్రహించుటకు భయపడు నని యాభూములను వారికి దాన మిచ్చి తానెం దేనిం జనియె. రాణా సురేశ మల్లుఁడు చేసిన యాపనికిఁ గోపోద్దీపితుఁడయ్యు బ్రాహ్మణ క్షేత్రములను మరల గ్రహించినచో దానును దన వంశస్థులును నఱువదివేల యేండ్లు నరకకూపముల బాధపడవలయు నని నమ్మి యాబాధలు పడుట కిష్టము లేక బ్రాహ్మణుల జోలికి పోవక యొక దండము పెట్టి యూరకుండెను.

అనంతరము సురేశమల్లుఁడు మీవారు శాశ్వతముగ విడిచి దక్షిణాభిముఖుఁడై చని యడవుల కొండల, గ్రుమ్మరుచుండ నొక్కనాఁ డొక యాఁడుమేక తనపిల్లను తోడేలు కబళింపకుండ సంరక్షించు చుండఁగాఁ జూచి తొల్లిచారుణీ దేవి యర్చకురాలు తనకు జెప్పిన భవిష్యద్వృత్తాంతంబు జ్ఞప్తికిం దెచ్చుకొని యాసమయ మిప్పుడు వచ్చిన దని యా మేఁకను బిల్లను తోడేలు బారినుండి కాపాడి యాప్రాంతములందే చరియించుచు మెల్ల మెల్లగ సచ్చటి యాటవికుల లోబరచుకొని చుట్టు ప్రక్కల దేశ మాక్రమించుకొని దేవలయను గ్రామముఁ దనకు నివాసముగఁ జేసికొని యందొక కోట గట్టి రాజై తన జీవిత శేష మచ్చటనే గడపెను. దైవయోగమున సురేశమల్లుఁడు తాను చిత్తూరునకు దొంగ యైనను యచ్చటం బుట్టి బెరిగిన వాఁడగుటచే నాపట్టణమందును మీవారుదేశమునందును ప్రేమము విడువఁ జాలక తానాపురమం దభిమానము గలవాఁ డగుటయేగాక యెల్ల యపుడు చిత్తూరునే మాతృస్థానముగ నెంచుకొనవలసిన దని తన కోడుకుల కవసాన కాలమున జెప్పిపోయె. ఆమాటలయందు వాని కొడుకులు విశ్వాసముంచుట చేతనే చిత్తూరున కగ్బరు చక్రవతి౯ వలన మహాపాయము వాటిల్ల రాణా యప్రయోజకుఁ డై చావునకు వెఱచి యిల్లు దూరినప్పుడు సురేశమల్లుని తనయులలో నొకండు చిత్తూరు నిమిత్తము తన ప్రాణములు ధారవూసె.

ఇట్లు పినతండ్రిని స్వదేశమునుండి పారదోలి యనంతరము పృథివిరాజు తనయన్న యగు సంగుఁడప్పటికిని జీవించియున్న వాఁడనియు వానికి వివాహ ప్రయత్నములు జరుగుచున్న వనియు విని తొల్లి చారుణీదేవీ యర్చకురాలు చెప్పినమాట తలంచి సంగుఁడు జీవించి యుండిన చోఁ దనకు రాజయోగముఁ బట్టదని వానిని వెదకి వెదకి జంపుటకు బయనమైపోవ నిశ్చయించుకొనియె. అంతలో వానిసోదరి వచ్చి దీనమగు తనవృత్తాంతముఁ జెప్పి సోదరుని పయన మాపెను.

రాయమల్లుఁడు తనకూఁతును సిరోహి దేశపు రాజున కిచ్చి వివాహము చేసెను. ఆకన్యక చక్కదనంబునకును సౌజన్యతకును బాతివ్రత్యమునకును బేరువడసిన యోగ్యురా లైనను మగఁ డామెను నిరంతరమును దగినయాదరణము సేయక నీచముగా జూచుచుండెను. ఆ రాజు నల్లమందు మద్దత్తు మితిమీరునట్లు ద్రావి యొడ లేఱుంగక భార్యను కొప్పుపట్టి పాన్పుమీఁదనుండి లాగి రాత్రి యంతయు గటికి నేలం బండుకొన జేయు చుండెను. ఆభిజాత్యముగల రాజకన్యక కంత కంటే నెక్కుడవమానము లేదు. కావుక యా బాలిక తన దైన్యమును బాపు మని సోదరునకు విజ్ఞాపనము నంపుకొనియె, పృథివిరాజు సోదరీ వత్సలుండై సంగునిమీఁదికి బోవలసిన పయనము మాని సిరోహి పట్టణమునకు బయనమైపోయి యానగరముఁ జేరి యథ౯ రాత్రమున నెవ్వ రెఱుంగకుండ కోటగోడలం దాఁటి యంతఃపురము బ్రవేశించి పండుకొన్న గదిలో నిలిచె. అప్పుడు సిరోహి రాజు నల్లమందుమత్తుచే మేను మఱచి మంచము పైఁ బవ్వళించి యుండె. వాని భార్యయు భత౯ చేత నవమానింపఁబడి వట్టినేలం బండుకొని యుండె.

పృథివిరాజు తన గారాపుఁ జెలియలి దురవస్థ గన్ను లారఁ గనుంగొని కోపావేశంబున పరవశత్వంబు జెంది పరాభవానలముం జల్లార్పగోరి నిద్రించుచున్న మరఁది మీఁదికి ఖడ్గము నెత్తెను. తన యన్న మగనిం దెగటార్చుటకు నుంకించుట జూచి యాబాలిక మహా పతివ్రత యగుటచే నట్టి క్రూర కార్యమున కిష్టపడక సోదరుని వారించి భత౯ ప్రాణముల రక్షించెను. ఈకళవళములో సిరోహిరాజు మేలు కాంచి యమదూతవలె నెదుట నిలిచిన బావంజూచి భయముచే వడఁకుచుండ పృథివి రాజు వాని నుద్దేశించి యిట్లనియె. 'నీవు మా చెలియలికిఁ గావించిన పరాభపమునకుఁ దగిన ప్రాయశ్చిత్తంబు జెప్పెదవినుము. నీ వామె పాదములంబడి వేఁడుకోని యామె చెప్పుల నీ తలం దాల్చితివా నిన్ను రక్షించెద. లేనిదో నొక్క యేటుననిన్నుఁ గడతేర్చెద, నని గంభీర నాదముతోఁ బలుక నానల్ల మందు పిఱికి చేయున దేమియు లేక ప్రాణభయంబున నాపని కొడంబడి యట్లు చేసె.

తన చెప్పించొప్పున నతఁడు కావించినతోడనే పృథివి రాజు మరదిం గౌఁగిలించుకొని వారిపై నెవరు కలిగి యాదరింప వారిరువురు కలసిమెలసి సౌహాద౯మున నుండిరి; కాని రాచకొమరునకు భార్య చెప్పులు నెత్తిని దాల్చుటకన్న నెక్కుడవమానము లేదు. కనుక సిరోహి రాజుహృదయమున నీ పరాభవాగ్ని రవులుచుండె. పందయగుటచే నప్పుడేమియుఁ జేయలేక యతఁడు సమయమునకయి నిరీక్షించుచుండె. పృథివి రాజు రాచనగరు దొంగతనముగాఁ బ్రవేశించినను రాజుగారికి స్నేహపాత్రుఁడై విందూల నారగించుచు మహానందమున కొన్ని దినము లచ్చటపుచ్చి తన కమల్మియగు కోటకు బోవ బయనమై మరఁదిని వీడుకొనియె, సిరోహి మంచి మంచి మిఠాయిలకు ప్రసిద్ధి కెక్కిన దగుటచే రాజు మాగ౯ మధ్యమున దినుమని పృథివిరాజునకు గొన్ని భక్ష్యముల నొసంగె.

పృథివి రాజు తనపై తనతండ్రి పైఁ గత్తి కట్టిన పినతండ్రి శిబిరమునకు బోయి నిర్భయముగ నిశ్శంకముగ నన్నముతిన సాహసికుఁ డగుటచేఁ దన బావయిచ్చిన భక్ష్యములనుగూడ మనంబున నేయను మానంబు నిలువక పుచ్చుకొని మాగ౯మధ్యమున వానిని భక్షించెను. 'భక్షించి కొంత దవ్వరుగునప్పటికి వానిగుండెలు బరువెక్కెను. నోట మాట రాదయ్యెను గుఱ్ఱము పైఁ గూరుచుండ లేక పోయెను. అతఁ డప్పటికి దనతోటకు కొంతదూరములోనున్న మామాదేవి యాలయమువద్దకు వచ్చె, అక్కడనుండి యొకయడుగైన గదల లేక యతఁడు కడసారి తనప్రియురాలిని గనుంగొనఁగోరి తారాదేవి నచ్చటికి రమ్మని వత౯మాన మంపెను; కాని యాదేవి వచ్చు లోపలనే తనకు బ్రియనిదానంబైనయాకోటపై దృష్టి నిలిపి చూచుచు సిరోహి రాజు చేసిన విషప్రయోగముకతంబున ప్రాణంబుల విడిచె.

అనంతరము తారాదేవి యచ్చటకు వచ్చి భతక౯కళేబరమును గాంచి విలపించి వీరపుత్రికయు వీరపత్నియు నగుటం జేసి పతివ్రతల మాగ౯ మనుసరింపనిశ్చయించి భత౯కు జితిపజఱిపించి నిర్విచారముగ స్వయంవరమునకరుగు కన్యక వోలె చిచ్చురికి తన భతక౯తో గూడ పరమపద మొందెను. ఇప్పటి కాదంపతులు గతించి రమారమి నాలుగువందల సంవత్సరము లైనను మామాదేవిగుకి వద్ద 'నేటికిని తద్దంపతులు తమ దేహములు నగ్నిహోత్రున కాహుతి చేసిన స్థలము గనఁబడుచుండునఁట. పృథివిరాజు తన చేసిన యుద్ధము లన్నిఁటియందు జయము కపటోపాయములచే నోందినను మొత్తముమీద నతఁడధిక సాహసుం డనియు రణమున వెనుకంజ యిడని వాఁడనియు పిఱికి కండ లేనివాఁ డనియు జెప్పవచ్చును.

అన్నను జంపి తాను చిత్తూరు సింహాసన మెక్కఁ దలంచుట యీతనియం దొక గొప్పలోపమే యనవచ్చును. ఈతఁడు గాక రాజవుత్రులలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కిన పృధివిరా జింకొకఁడు కలఁడు. అతఁడు చోహణవంశస్థుఁడు. ఢిల్లీ చక్రవర్తి. అతఁడే మహమ్మదుగోరీ యను మ్లేచ్ఛరాజును మొట్టమొదట జయించి మరల నా మ్లేచ్ఛుఁడు కన్యాకుబ్జభూపాలుఁ డగుజయచంద్రుని గలిసి యెత్తివచ్చినప్పుడు వారిరువురచే నోడింపఁబడి రణముఖంబున ప్రాణములు విడిచిన శూరశిఖామణి. చిత్తూరు రాజకుమారుఁడగు నీ పృథివి రాజును ఢిల్లీచక్రవతి౯ యగు నాపృథివిరాజని చదువరులు భ్రమ చెందఁదగదు. కాలాంతరమందా పృథివిరాజు చరిత్రముగూడ ప్రకటింపఁబడును.