రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)
రాజశేఖర
చరిత్రము
కందుకూరి
వీరేశలింగము
By
K. VEERESALINGAM PANTULU
Publishers :
M. Seshachalam & Co.,
THIRD EDITION:
AUG 1987
Printing:
M/s Jyothi Press, 1-4-1000, Golconda Cross
Musheerabad, Hyderabad-500 380,
Distributors :
ANDHRA PRADESH BOOK DISTRIBUTORS;:
RASHTRAPATHI ROAD, SECUNDERABAD
This Telugu novel
is
by permission
most respectfully dedicated
by the author
to
Col Robert Mackenzie Macdonald,
Director of Public Instruction,
Madras Presidency,
as a small token of esteem for the good
he has done to the Telugu Country.
పీఠిక
మొుదటి కూర్పు
ఈవఱకు మనయాంధ్రభాషలో జనుల యాచార వ్యవహారములను దెలుపుచు నీతిబోధకములుగానుండు వచన ప్రబంధము లేవియు లేకపోవుట యెల్ల వారికిని విశద మయియే యున్నదిగదా! అయినను దేశభాషలలో నెల్లను మధురమైనదని పేర్కొనఁబడిన మన తెనుఁగుభాష కటువంటి లోపమును తొలగింపవలయునని కొంత కాలము క్రిందట నే నీ గ్రంథమును వ్రాసి శ్రీవివేకవర్ధనీ పత్రికా ముఖమునఁ బ్రకటించితిని, ఇట్టు గ్రంథములను వ్రాయుట కిదియే ప్రథమ ప్రయత్నమగుటచేత దీనియందుఁ బెక్కులోపము లుండి యుండవచ్చును. ఆయినను దీనిం జదివినవా రందఱును నైక కంఠ్యముగా మంచియభిప్రాయమునే యిచ్చుచు వచ్చినందునను పలువురు పుస్తకముల నిమిత్తమయి వ్రాయుచు వచ్చుచున్నందునను నేను పడిన ప్రయాసము నిష్ఫలము కాలేదుగదాయని సంతోషించు చున్నాను.
***
ఈ గ్రంథముయొక్క కథను గల్పించుటలో గోల్డుస్మిత్తను నింగ్లీషు కవీశ్వరుని గ్రంథ సాహాయ్యమును గొంత బొందినను దాని కిని దీనికిని విశేష సంబంధమేమియు నుండదనియు దీనియందు వ్రాయబడిన విషయములన్నియు నూతనములే యనియుఁ గూడ విన్నవించుచున్నాడను. గుణగ్రహణ పారీణులగు పెద్దలు దీనియందు దోషముల నుపేక్షచేసి గుణముల నే గ్రహింతురనియు ఆంధ్రదేశీయులును విద్యాశాఖవారును దీని నాదరించి మఱియు నిట్టి గ్రంథములను చేయుటకయి నాకుఁ దగినంత ప్రోత్సాహమును గలిగింతురనియుఁ గోరుచున్నాఁడను.
రాజమహేంద్రవరము | కందుకూరి వీరేశలింగము | |
ది 20 వ జూలై 1880 సం॥రం |
రెండవ కూర్పు
ఈ పుస్తక మింగ్లీషులోనికి భాషాంతరీకరింపఁబడి పుస్తక రూపముగాఁ బ్రకటింపఁబడియున్నందున, మార్పులను చేసినచో భాషాంతర గ్రంథముయొక్క సహాయ్యము చేత దీనిం జదివెడి యన్యదేశీయులకు కష్టముగా నుండునని యెంచి చేయదలచుకొన్న మార్పులను జేయక మొదటి కూర్పులో నున్నట్లే దీనిని మరల ముద్రింపించినాఁడను,
రాజమహేంద్రవరము | కందుకూరి వీరేశలింగము | |
2 జనవరి, 1894 సం॥రం |
నవలారచనకు శ్రీకారం:
వచన రచనకు ఒజ్జబంతి
రాజశేఖర చరిత్ర మనే వివేక చంద్రిక తొలుదొలుత వివేక వర్ధని పత్రికలో 'సీరియల్' గా వెలువడింది, 1874 వ సంవత్సరంలో వీరేశలింగం పంతులుగారు వివేక వర్ధని అనే మాసపత్రికను స్థాపించి, దురాచార నిరసనకూ, సంఘ సంస్కారానికీ, దుర్మత భంజనానికీ పాటుపడ్డ విషయం లోక ప్రసిద్ధమే. ఆ పత్రికలో 1875 వ సంవత్సరంలో ఆరంభమై, సీరియల్ గా వెలువడి 1878 వ సంవత్సరంలో ఫుస్తక రూపాన్ని పొందింది, ఆ రోజుల్లోనూ అటుపిమ్మటా కూడా, విశేషమైన ఆదరాన్ని పొందింది. తొలి తెలుగు నవలగా కూడా పేరు ప్రఖ్యాతులను పొందింది ఇప్పటికి తొమ్మిది ముద్రణలు పొందటం యీ రాజశేఖర చరిత్ర ప్రసిద్ధి కొక తార్కాణ కదా! ఇప్పుడీ పాకెట్ బుక్స్‌లో పదవసారి వెలువడుతున్నదన్నమాట. ఇంతేకాక వేర్వేరుగా ఇరువురు దీన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఒక అనువాదం మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మ్యాగజైనులో కొంతభాగం వెలువడింది. వేరొక అనువాదం అదృష్ట చక్రం (Fortune's wheel) పేరుతో లండన్‌లో పుస్తక రూపాన అచ్చుకావటమే కాకుండా, 'లండన్ టైమ్స్' పత్రిక యొక్క బహుళ ప్రశంస లను కూడా అందుకుంది. ఆనాటి 'లండన్ టైమ్స్' వీరేశలింగం పంతులు గారిని కూడా చాలా శ్లాఘించింది. ఇక దేశీయ భాషలపై రాజశేఖర చరిత్రం ప్రభావం గమనిస్తే, ఆ రోజుల్లోనే యీ నవల తమిళ, కన్నడ భాషల్లోకి ఆనువదింప బడటం, దీని గొప్పను నిరూపిస్తుంది, ఇది ఆలివర్ గోల్డ్ స్మిత్ విరచిత 'ది వికార్ ఆఫ్ వేక్‌ఫీల్డు’ నవలకు స్వేచ్ఛానుసరణ మని పంతులుగారే చెప్పారు. కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగా రనేవారు వివేకచంద్రికా విమర్శన మన్న గ్రంథాన్ని పంతులు గారినీ, రాజశేఖర చరిత్రనూ విమర్శిస్తూ ప్రకటించారు, కాని యీ విమర్శ ఆంతా కూడా పంతులుగారిపై వారికి గల స్పర్థనే ప్రకటించింది కాని, ప్రతిభను చూపలేక పోయింది.
వీరేశలింగం పంతులుగారి రాజశేఖర చరిత్రం వెలువడక పూర్వమే నరహరి గోపాలకృష్ణమ్మసెట్టిగారు తమ 'హిందువుల యాచారములను తెలుపు:నవీన ప్రబంధమైన' శ్రీ రంగ రాజ చరిత్రను వెలువరచారు, ఇది 1872లో ఫుస్తక రూపాన వచ్చింది. ప్రచురణకు నోచుకోకపోయినా, గోపాలకృష్ణమ్మసెట్టిగారికన్నా కూడా పూర్వమే కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు “మహాశ్వేత” ఆన్న వచన ప్రబంధాన్ని రచించి వున్నారన్న వాదన కూడా వున్నది. ఈ రెండు విషయాలూ నిజమే ఆయినప్పటికీ కూడా, రాజశేఖర చరిత్రం యొక్కప్రాముఖ్యానికీ, ప్రశస్తికీ, ప్రాథమ్యానికీ ఏమీ భంగం రాదు, ఎందువల్ల నంటే ఎవరు ఆర్వాచీనులకు ఆరాధ్యులు, ఆనుసరణీయులు, మార్గదర్శకులూ అవుతారో, వాళ్ళే ఆద్యులూ, ఉపదేష్టలూ ఆన్న కీర్తిని పొందుతారు, తరువాత వ్రాసిన నవల లన్నిటికీ, నవలా రచయిత లందరకూ చాలా కాలం వరకూ, రాజశేఖర చరిత్రమే మార్గదర్శకంగా వున్నది,
కనుకనే రాజశేఖర చరిత్రం తొలి తెలుగు నవల ఆయింది. వీరేశలింగం పంతులుగారు తెలుగు నవలకు శ్రీకారం చుట్టిన వారూ అయినారు.
సుప్రసిద్ద నవలా రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తమ స్వీయ చరిత్రలో తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రం చదివి, గ్రహించి, నేర్చుకున్నామని వ్రాసుకున్నారు. చిలకమర్తి ఆ రోజుల్లో బహుళ ప్రచారం పొందిన నవలల నెన్నో వ్రాశారు, ఆ రోజుల్లో చింతామణి ఆన్న సాహిత్య మాసపత్రిక నవలల పోటీలను నిర్వహిస్తుం డేది. ఆ పోటీల్లో ఎన్నో మార్లు లక్మీనరసింహం గారు బహుమతి పొందారు. లక్మీనరసింహంగారు నవలల పోటీలో పాల్గొంటే మరొకరికి బహుమతి రాదన్న ప్రసిద్ధి కూడా ఆ రోజుల్లో వుండేదని, తామే స్వీయచరిత్రలో చెప్పుకున్నారు, ఆటువంటి చిలకమర్తి తాము నవలలు వ్రాయటం రాజశేఖర చరిత్రాన్ని చూసే గ్రహించామని చెప్పకున్నారు, బాగా పరిశీలించి చూస్తే చిలకమర్తి తొలి నవల రామచంద్ర విజయానికీ, తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రానికీ చాలా పోలికలు కన్పిస్తాయి. వర్ణనలూ, సంఘ సంస్కార విషయాలూ, పాత్ర చిత్రణం, ఇంకా అనేక సందర్భాలలో యీ రెండు నవలలకూ దగ్గరి పోలిక లున్నాయి.
దీనినిబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే వీరేశలింగం పంతులుగారికి తరువాత నవలలు వ్రాసిన వాళ్ళందరూ ఆయనను ఆనసరించారు__ఆని, అందువలన వీరేశ లింగం పంతులుకి పూర్వమే నవలు వ్రాయటానికి గారికి కొందరు ప్రయత్నించినా, కొంత కృషి జరిగినా, వీరికి తరువాత వ్రాసిన వాళ్ళందరూ వీరినే ఆదర్శంగా పెట్టుకున్నారు. కాబట్టి, తెలుగులో యీ ప్రక్రియకు ఆయనే ఆద్యుడైనాడు. నవల ఆనబడే ప్రక్రియ కొక స్థితినీ, ప్రాచుర్యాన్నీ కలిగించినవాడూ ఆయినాడు. నన్నయ్య గారికి ముందే తెలుగు భాషా, ఆందునా పద్యరచనా వున్నా, నన్నయ్యే ఆదికవీ, వాగనుశాసనుడూ ఆయినట్లు వీరేశలింగమే నవలా రచనకు ఆద్యుడూ, ఆదర్శమూ ఆయినాడు, ఇంగ్లీషు భాషా ప్రభావంవల్ల, తెలుగులో కొత్త ప్రక్రియగా నవల రూపొందింది ఆనుకుంటే రాజశేఖర చరిత్రమే తొలి తెనుగు నవల ఆవుతుంది, రాజశేఖర చరిత్రం పూర్వం నవలలుగా వ్రాయబడిన వని చెప్పబడుతున్న వానిపై ఇంగ్లీషు ప్రభావం స్పష్టంగా లేదు, ముందుముందు ఇప్పడు మనం నవల ఆంటున్న పక్రియను, వచన ప్రబంధమనీ, ఆఖ్యానమనీ అనేవారు. తరవాత 'నవల' అన్నారు. నవల ఆనటంలో ఇంగ్లీషు ప్రభావం వుంది. ఆ ప్రభావం రాజశేఖర చరిత్రంపైన వున్నది. ఆందువలన ఇదే తొలి తెలుగు నవల ఆవుతున్నది.
రాజశేఖర చరిత్రం ఆంగ్లమూలానికి యధేచ్ఛానువాదం ఆయినా స్వకపోల కల్పితంగా రచింపబడ్డదా అన్నంత ప్రతిభా సమున్మిషితంగా వున్నది. సాంఘిక దురాచారాలను రూపుమాపటమే ప్రధాన లక్ష్యంగా రచింపబడినా, కావ్య సౌందర్యం ఇందులో గౌణం కాదు. ఆ రోజుల్లో వచన రచన వొజ్జబంతిలాగా సరళ సుందరమైన శైలీవిన్యాసంతో పంతులుగా రీ నవలను రచించారు.
సమకాలీన సారస్వతేయులలో, పాఠకులలో గొప్ప ఆదరాభిమానాలను పొందింది యీ నవల. ఎన్నోమార్లు యూనివర్శిటీ పాఠ్యపుస్తకంగా కూడా ఎన్నిక చేయబడ్డది. సాంఘిక రంగంలోనూ, సారస్వత విషయం గానూ వీరేశలింగం పంతులు గారితో ప్రబలమైన స్పర్థ వహించివున్న కొక్కొండ వేంకట రత్నం పంతులుగారు, తమ 'బిల్వేశ్వరీయ' మన్న మహా గ్రంథాన్ని పంతులుగారికి పంపుతూ, తమ సుహృద్భావాన్ని యీ విధంగా వెల్లడి చేశారు.
ఆ రోజుల్లో గొప్పగొప్ప పండితులూ, కవులూ, తమ గ్రంథాలను పంతులుగారి ఆభిప్రాయం కోరుతూనూ, ఆభినందనలతోనూ పంపుతూ వుండేవారు, 'బిల్వేశ్వరీయం' పంపుతూ- కొక్కొండ యీ విధంగా లోపలి మొదటి పేజీపై వ్రాశారు:
'ముందుగ దెనుగున బలు గబ్బంబుల
ముద మందం జేయుట చేతన్
సుందరముగ రాజశేఖర చరిత
జొప్పడగం జెప్పుట చేతన్
కందుకూరి వీరేశలింగ మను కవి కిది
కవిమణి నామకృతిన్
పొందుగ బిల్వేశ్వరీయము న్మే
ల్వొందగ వేంకటరత్న మిడెన్
౧౮౯౩ సం|| ఆగస్టు ౩౦ తేది.
ప్రత్యేకించి కొక్కొండ రాజశేఖర చరిత్రాన్ని పేర్కొన్నారంటే, దాని ప్రశస్తి ఆనాటికే ఎంత వ్యాపించిందో తెలుస్తున్నది.
గురజాడ ఆప్పారావుగారు తమ డైరీలో వొకచోట, రాజశేఖర చరిత్రను గూర్చి ప్రస్తావిస్తూ, గోల్డ్ స్మిత్ రచన కనుసరణ మనీ, ఇది బహుళ ప్రచారం పొందిన గ్రంథమనీ వ్రాసుకున్నారు.
పంతులు గారు వ్రాసిన నవలలలోనే కాక, వారి సర్వ సాహిత్య సృష్టిలోనూ ఆధుని కాంధ్ర వాఙ్మయంలోనూ, రాజశేఖర చరిత్రానికి విశిష్టమైన స్థానమున్నది. రాజశేఖర చరిత్రం వెలువడటంతో, ఆంధ్ర వాజ్మయంలోనే వొక ఉజ్జ్వలాధ్యాయం ప్రారంభమైనదని చెప్పాలి. ఈ నవల రచించే కాలానికి పంతులుగారి వయస్సు ఇరవై ఏడు ఏండ్లు, పుస్తకంగా వచ్చేటప్పటికి ముప్ఫై ఏళ్ళు. పంతులుగారి జీవితంలో రాజశేఖర చరిత్రం సరైన పరిష్కారాన్ని చూపటమే కాక, వారు సాధించిన పరమ ప్రయోజనానికి లక్ష్యప్రాయంగా కూడా వెలసింది. రాజశేఖర చరిత్రం రచించడానికి పూర్వం వీరేశలింగం గారు శృంగార నిరోష్ఠ్యనిర్వచన నైషధం, రసిక జనరంజనం, శుద్ధాంధ్రోత్తర రామాయణము, శుద్ధాంధ్ర భారత సంగ్రహము మొదలైన పద్య కావ్యాలూ, విగ్రహం మొదలైన వచన కావ్యాలు వ్రాశారు. ఈ నవల వ్రాసిన తరువాత మళ్ళా వెనుకటి గ్రంథాల వంటివి ఎప్పుడూ వ్రాయలేదు. రాజశేఖర చరిత్రకు మూలం ఆని చెప్పవలసిన 'ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్' ప్రపంచంలోని నాగరిక భాషల్లోకి ఆన్నింటి లోకి ఆనువదింపబడింది. ఆయితే తెలుగులోకి కాక, ఆనుసరణగా వచ్చింది. తెలుగు నవలలో సాంఘిక విమర్శ ప్రధానస్థానం ఆక్రమించింది.
రాజశేఖర చరిత్రంలో రాజశేఖరుడు గారి ఆమాయకత్వము, అవివేకము ఆ కుటుంబం పడిన ఆష్టకష్టాలన్నింటికీ మూలం, సంఘంలోని కపటులు కల్లరులు, కుక్షింబరులు, స్తుతి పాఠకులు, దాంభికులు ఏ విధంగా ఆమాయకులను బాధించి, తాము బాగుపడుతున్నారో, అంధ విశ్వాసాలవల్ల, ఆవివేకఫు టాచారాల వల్ల కొన్ని కుటుంబా లెట్లా నాశనమై పోతున్నాయో రాజశేఖర చరిత్రంలోని సంఘటనల వలన తెలుసుకోవచ్చును. ప్రతి సంఘటనా - వొక సాంఘిక దురా చారాన్నీ, వొక మూఢ విశ్వాసాన్నీ హేళన చేసి, వికృత పరచి, విమర్శించే ఉద్దేశంతో పంతులుగారు యీ నవలలో కల్పించారు. రుక్మిణి కాసులపేరు రథోత్సవంలో దొంగిలించ బడటం - ప్రశ్న చెప్పేవారి దాంభిక వర్తనను బట్టబయలు చేయటానికీ, నృసింహస్వామి మరణవార్త ఎఱుక చెప్పువాళ్ళ కాపట్యాన్ని, ఎరుక నమ్మేవాళ్ళ మూర్ఖత్వాన్నీ హేళన చేయటానికీ, నృసింహ స్వామి రుక్మిణి కలలో కల్పించటం- భూత, ప్రేత , పిశాచాదులను వేళాకోళం చేయటానికీ పంతులు గారు కల్పించారు. హరిశాస్త్రుల భూతవైద్యం, పిఠాపురంలో ఆంజనంవేసి దొంగను పట్టటం, స్వర్ణయోగం తెలుసు నన్న బైరాగి- ఇచ్చిన స్వర్ణాన్ని దొంగిలించి పలాయనం చిత్తగించటం, సిద్ధాంతి కూతురు గ్రహ బాధ, బొమ్మకంటి సుబ్బారాయుడి ఆతుర సన్యాసం, హరి పాపయ్య శాస్త్రుల వారి భోజన పాండిత్యం, పీఠాధిపతుల ఆర్భాటాలూ; మఠాధిపతుల కుక్షింభరత్వం, ఇళ్ళు కాలిపోతే గ్రామదేవతకు శాంతి చేయడం - ఇంకా వీధి బడుల్లోని అక్రమాలూ, వంట బ్రాహ్మలూ-శవవాహకుల మూర్ఖవర్తనలు పంతులుగారు యీ నవలలో విమర్శించారు.
ఆనాడు సంఘంలో ప్రచురంగా కొనసాగుతున్న సర్వ దురాచారాలనూ, పంతులు గారు యీ నవలలో వజ్రాభమైన తమ నిశిత బుద్ధిని చూపి, ఆవేశంతో చెండాడారు. జోస్యుల కామావధాని, ముష్టి సర్వశాస్త్రి, నంబి రాఘవాచార్యుడు, వామరాజు భైరవమూర్తి, బులుసు పేరయ్య సోమయాజి, మంచి రాజు పాపయ్య, నీళ్ళ కావిడి వెంకయ్య - వీళ్ళంతా నాటి సంఘానికి ప్రతీకలే.
పంతులు గారి మహా యశస్సుకు శరత్కౌముది రాజశేఖర చరిత్రము.[1]
జనవరి 10, 1969 హైదరాబాదు, |
డా॥ అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) |
విషయ సూచిక
13 |
24 |
38 |
55 |
64 |
72 |
88 |
103 |
119 |
134 |
150 |
164 |
179 |
192 |
207 |
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.
- ↑ రాజశేఖర చరిత్రము గూర్చి ఇంకా వివరాలు తెలుసుకో దలిస్తే పీఠికాకారుని పరిశోధన గ్రంథం "వీరేశలింగం పంతులు-ఒక సవిమర్శ పరిశీలనము" చూడవచ్చును.