రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/తొమ్మిదవ ప్రకరణము

తొమ్మిదవ ప్రకరణము

రాజశేఖరుcడు__గారు పెద్దాపురము చేరుట__రుక్మిణి దేహమును వెదకవచ్చి కానక దుఃఖించుట__పెద్దాపురములోని వార్తలు__భీమవరమునకుఁ బోవుట__ఆక్కడి విశేషములు__సుబ్రహ్మణ్య మును పీఠాపురము పంపుట.

రామరాజు నాఁటిరాత్రి మెల్లగా రాజశేఖరుడుగారిని కుటుంబ సహితముగాఁ గొనిపోయి పెద్దాపురము చేర్చి, తిరుపతిరాజు చెఱువు నకు సమీపముగనున్న సత్రములో దింపి, కాశీప్రయాణము మాని భీమవరములో నుండఁడని బహువిధములఁజెప్పి యొప్పించి తన దారిని బోయెను. ఒక్కనాఁటి ప్రయాణములోనే కూఁతురుపోవుటయు తక్కినవారు బ్రాణములు దప్పించుకొని బయలఁబడినను కాళ్ళన్నియు వాచి యడుగుతీపి యడుగుపెట్టలేనంత దుస్థితిలో నుండుటయుఁ దలఁచుకొని యాత్ర పేరన్న భయపడి రాజశేఖరుఁడుగారు కొన్ని దిన ములలో; భీమవరముచేరి యందుండి సమయమయినవ్పడు రాజుగారిని చూచుటకు నిశ్చయించుకొనిరి. రుక్మిణిపోయినదన్నవిచారము చేతను మార్గాయానమున బడలియుండుటచేతను వా రారాత్రి వంటలు చేసికొని భోజనముచేసినవారు కారు.వారికెవ్వరికిని కంటికి నిద్రయును పట్టలేదు. ఆ రాత్రి నొక యుగముగా వేగించి రాజశేఖరుడుగారు కోడి కూసిన తోడనే లేచి తామొక్కరును బయలుదేఱి రుక్మిణిని వెదకుటకయి వేడిమంగలపు మార్గమున నడచిరి.

అట్లు కొంతదూరము నడచి రాజశేఖరుఁడుగారు పసులకాపరి బాలుర నడిగి మార్గమును గనుఁగొనుచు అడవిలోఁ బ్రవేశించి, నాలుగు గడియల ప్రొద్దెక్కు వఱకు దొంగలు కొట్టిన స్థలముచేరి యక్కడ రుక్మిణిదేహమును గానక యిసుకలో నెత్తురు చుక్కలను మాత్రము చూచి దుఃఖముతో నలుప్రక్కలను రుక్మిణిని వెదకి కొనుచుఁ దిరిగి యెందునేమియుఁగానక మరల నెప్పటిచోటునకువచ్చి, అచ్చట గొంతసేపు పచ్చిక బయలను గూరుచుండి యాపచ్చికను తన కన్నీటితోఁ దడిపి రుక్మిణిదేహము నేమృగములో యీడ్చుకొని పోయి యుండునని నిశ్చయము చేసికొని యీ దుర్వార్తను గొని పోయి యెట్లు భార్యతోను బిడ్డలతోను జెప్పుదునా యని కొంతసేపు దుఃఖించి మెల్లగాఁలేచి కాళ్ళు తడఁబడ నడచుచు త్రోవపొడుగునను రుక్మిణి యొక్క సౌందర్యమును సుగుణసంపదలను దలఁచుకొని కన్నులనీరు నించుచు మధ్యాహ్నము రెండు జాముల కేలాగుననో యింటికి దేహమును చేర్చి నడవలో చాపమీఁద చతికిలఁబడి యేమో చెప్పఁబోయి మాటరాక పెదవులు నాలుకతో తడుపుకొనుచు నూర కుండిరి. అప్పుడు మాణిక్యాంబ తొందరపడి లోపలికి పరుగెత్తుకొని పోయి కంచు చెంబుతో మంచితీర్థము తెచ్చి నోటి కందిచ్చి పయిట చెఱగుతో మొగముమీఁది జెమ్మట తుడిచి విసనకఱ్ఱతో విసరుచు మగని మార్గాయాసమును కొంతవఱకు పోఁగొట్టెను. అంత నతఁడును కొంత ధైర్యము నవలంబించి, కన్నుకొలకులనుండి నీరు కాలువలు కట్ట గడియకొక మాట చొప్పున దుఃఖమును మ్రింగుకొనుచు రుక్మిణి వార్తను జెప్పెను. అప్పుడందఱును పెద్ద పెట్టున గొల్లుమని రోదనముచేయ నారంభించిరి. అది విని సత్రపు బ్రాహ్మణుఁడును చుట్టుపట్ల వారును వచ్చి, వారికి వచ్చిన యాపదను దెలిసి కొని బహువిధముల వారి నూరార్చి భోజనమునకు లేవఁదీసిరి. వారును విస్తళ్ళ యొద్ద కూరుచుండి తినఁబోయిన మెతుకులు లోపలికిపోక కొంతసేపు కూరుచుండి విచారముతో విస్తళ్ళను వదలిపెట్టి లేచిరి. అప్పుడు నూతి పెరటిలోనికిఁ బోయి వారు చేతులు కడుగుకొనుచుండఁగా కేకలు వేయుచు వీధిలోనుండి పరుగులెత్తు చున్న మనుష్యులయొక్క కలకలములు వినవచ్చెను. ఆ సందడి యేమో చూతమని వీధిలోనికి వచ్చునప్పటికి తూర్పువయిపున దూరముగా మంటయును మిన్నుముట్టు పొగయును గనఁబడెను. ఇంతలో సత్రపు బ్రాహ్మణుఁడు వచ్చి కుమ్మరవీధి తగులఁబడుచున్నది, చూచి వత్తము రమ్మని రాజశేఖరుఁడుగారిని పిలిచెను; కాని యాతఁ డెంత దయార్ద్ర హృదయుఁ డయినను కొండంత దుఃఖములో మునిఁగి యున్నవాఁడు గనుక, నిల్లు కదులుటకు మనసు గొలుపక యూర కుండెను. సుబ్రహ్మణ్య మావఱ కెన్నఁడు నాపదల ననుభవించి యొఱుఁగని పసివాఁ డగుటచేత బరుల కాపద వచ్చినదన్న మాట వినినతోడనే తన యాపద మఱచిపోయి చేతనయిన యెడల వారికి సహాయ్యము చేయవలెనను నుద్దేశముతో తా నా బ్రాహ్మణునితోఁ గూడ బయలుదేఱిపోయెను. వారక్కడకుఁ బోయి చేరునప్పటికి వేలకొలఁది జనులు వచ్చి వేడుక చూచుచుండిరికాని, వారిలో నొక్క రయినను ఆర్పుటకు ప్రయత్నపడుచుండలేదు. ఇండ్లకు వేసిన వెదురుబొంగులు కణుపులయెద్ద పగిలి పెటపెటధ్వనులతో తుపాకులు మ్రోగినట్టు మ్రోగుచుండెను, ప్రాతతాటాకులు పయికిలేచి గాలిలో తారాచువ్వలను తలఁపించుచుండెను. ఎండల వేడిమిచేత సమీపమున నున్న చెఱు వెండిపోయినందునను ఇంకిపోఁగా మిగిలిన నూతల లోని నీళ్ళు చేద మునుగుటకయిన వీలులేక పాతాళ లోకమునకు సమీపముగా నున్నందునను, నీళ్ళను తెచ్చుకోలేక అంటుకొన్న యిండ్లవాండ్రు పెణకలను లాగుటకు ప్రయత్నపడుచుండిరి; ఆ చేరువ యిండ్ల వారు తమ యింటిమీఁద తాటాకుల నయినఁ దీసిన మరల వేసికొనుటకయి శ్రమపడవలసి వచ్చునని వానిని ముట్టుకోక, కాలుచున్న యిండ్ల వారు వేడుకొన్నను యియ్యక దాచిపెట్టుకొన్న కడివెడు నీళ్ళను బట్టుకొని నడికప్పులమీఁది కెక్కి తమ యిల్లంటు కొనువఱకును నుండి నీళ్ళకుండ నక్కడనే దిగవిడిచి రోదనములు చేయుచు దిగుచుండిరి. మఱికొందరు తమ యిండ్లలోని సామానులు కాలిపోవునను భయముచేత వెలుపలికిఁ దెచ్చి వీధిలోఁ బెట్టుచుండిరి. వారొక వస్తువును దెచ్చి రెండవ వస్తువుకొరకు వెళ్ళునప్పటికి పరో పకారపారీణులయిన మహాత్ములు కొందఱు చూచువారు లేక వీధిలో పడియున్న వస్తువులను దీసి తమయింట జాగ్రత్త చేసికొనుచుండిరి. ఇట్లు కుమ్మరపేట పరశురామ ప్రీతి యగుచుండఁగా సత్రపు బ్రాహ్మణుఁడు సుబ్రహ్మణ్యమును దూరముగా నున్న యొక చెట్టు నీడకుఁ దీసికొని వచ్చి యిండ్లు కాలుటనుగుఱించి ప్రసంగింప నారం భించెను.

సత్ర__ఈప్రకారముగా రెండుజాములవేళ ఇండ్లెందుకు కాలి నవో కారణము మీకుఁ దెలిసినదా?

సుబ్ర__కుమ్మరావములు కాల్చునప్పుడు ప్రమాదవశమున నిప్పంటుకొని తాటాకులయిండ్లుగనుక కాలియుండవచ్చును. లేదా యెవ్వరయినను పోట్లాడి యిండ్లకు నిప్పు పెట్టియందురు.

సత్ర__మీరు చెప్పిన రెండు కారణములును సరియయినవి కావు. ఈ గ్రామమున కేదో క్రొత్తగా నొకగ్రహమువచ్చి యీ ప్రకారముగా తగులబెట్టినదికాని వేఱుకాదు.

సుబ్ర__నీవు నాతోనే యిప్పు డిక్కడకు వచ్చితివిగదా? ఎవ్వరిని అడిగి తెలిసికోకుండ గ్రహమే యిండ్లు తగులబెట్టిన దని నీవెట్లు రూఢిగా జెప్పఁగలవు?

సత్ర__మా గ్రామముసంగతి నాకుఁ దెలియదా? ఈ గ్రామ మేటేట వేసవికాలములో నాలుగుసారులు తగులబడును. ప్రతిపర్యా యమును గ్రహమునకు జాతరచేసి యూరివారు దానిని సాగనంపు చుందురు. ఇది గ్రహముచేతనే కాకపోయినపక్షమున, వర్ఘకాల ములో నేల తగులబడకూడదు?

సుబ్ర__ఇండ్లుకాలుట గ్రహముచేతనే యయిన యెడల, ఒక సారి జాతరచేసి బంపిన గ్రహము మరలవచ్చుటకుఁ గారణమేమి? వర్షకాలములో ఇండ్లకప్పులు వానతో నానియుండును కనుక__

సత్ర__కారణములు గీరణములను నాకుఁ దెలియవు. నా కెప్పుడును యుపయుక్తలన్నఁ దలనొప్పి; కాబట్టి నేను జెప్పిన మాటల కడ్డమాడక సత్యమని నమ్ము, ఇప్పుడు నమ్మకపోయినను రేపు జాతరగుచుండఁగా కన్నులార చూచినప్పడయినను నమ్మెదవు.

ఈ ప్రకారముగా సంబాషణ జరుగుచుండఁగా అగ్ని హోత్రుడు తన చెలికాఁడగు వాయుదేవుని సాయముచే కుమ్మర పేటను సంపూర్ణముగా దహనము చేసి తృప్తిపొంది ప్రశాంతి నొందెను. ఇండ్లు కాలినవారును సొత్తుపోయిన వారును విచారించు చుండఁగాఁ గొందఱు చుట్ట కాల్చుకొనుటకు కావలసినంత నిప్పు దొరకినదనియు రేపు బొగ్గులు చవకగా దొరకగలవనియు సంతోషిం చుచుఁ బోయిరి. వారి వెనుకనే సుబ్రహ్మణ్యమును సత్రపు బ్రాహ్మ ణునితోఁ గూడ బయలుదేఱి సత్రమును జేరెను. ఈలోపల నెవ్వరో రుక్మిణి యత్తవారియూరికిఁ బోవుచున్న బ్రాహ్మణుడొకడు సత్రము లోనికి భోజనమునకురాగా ఆమె దుర్మరణకథను జాబు వ్రాసి యు త్తరక్రియలను వేగిరము జరిగించుటకయి యాజాబు నతని చేతి కిచ్చి రాజశేఖరుఁడుగారు వియ్యంకునకుఁబంపిరి.

ఆ మఱునాఁడు పగలు రెండుజాములవేళ రాజశేఖరుడుగారు భోజనము చేసి వీధియరుగుమీఁద గూరుచుండియుండఁగా, ఆ దారిని తుడుములు డప్పులు మ్రోగుచుండఁగా కొందఱు దిండిమీఁద కుంభ మును బెట్టుకొని త్రాగి కేకలు వేయుచు నడచుచుండిరి; వారి వెను కను జనసంఘము మూఁకలకట్టి తమ చేతులలోని కఱ్ఱలతో త్రోవ పొడుగునను ఇండ్ల మీద కొట్టుచు బోవుచుండిరి. ఆ మూఁకలలో నుండి సత్రపుఁ బ్రాహ్మణుఁడు నడుమునకు బట్ట బిగించుకొని చేతిలో పెద్దకఱ్ఱ పెట్టుకొని దేహ మంతటను జెమ్మట కాలువలు గట్ట వచ్చి సుబ్రహ్మణ్యము చేయి పట్టుకొని, "నిన్న నేను జెప్పినప్పు డబద్ధమంటివే, ఇప్పుడయినా నా మాట నమ్మెదవా?" యని క్రిందకు లాగెను.

సుబ్ర__ఉండు; నేను వచ్చెదను. ఈ యుత్సవ మెవ్వరిది?

సత్ర__నిన్న చెప్పలేదా? ఇండ్లు కాల్చు గ్రహము గ్రామము నకు వచ్చినప్పుడు ఈ ప్రకారముగా చేయుదురు. ఒక చేతితో వేప మండయు రెండవ చేతితో పేవబె త్తమును పట్టుకొని ముందు నడుచు చున్న యతనిని జూచినావా !

సుబ్ర__పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొన్నతఁడుకాఁడా? చూచి నాను. ఆతఁ డెవరు? సత్ర__అతఁడే యీ తంతు నడిపించుచున్న మంత్రజ్ఞుడు; క్రొత్తగా వచ్చి యిండ్లు కాల్చుచున్న దేవతను కొంచెముసేపటికి వెళ్ళగొట్టును. అతని పేరు వీరదాసు.

సుబ్ర__ఈవఱ కేమి తంతు చేసినారు?

సత్ర__ఇంటికొకటికి రెండేసిచేరల బియ్యము చొప్పున ఏడిండ్లలో అడిగి పుచ్చుకొని,క్రొత్తకుండ తెప్పించి గ్రామము నడుమ వీధిలో పొయ్యిపెట్టి ఆ కుండలో అడిగి పుచ్చుకొన్న బియ్యము, మునగకూర, తెలగపిండి కలిపి జామువఱకు వంట చేసి, ఆ కుండను దిగువ దించియుంచి నడివీధి నలికి యెఱ్ఱమ్రుగ్గు, తెల్ల మ్రుగ్గు, నల్లమ్రుగ్గు, పచ్చమ్రుగ్గు, ఆకుపసరుమ్రుగ్గు తెచ్చి వానితో భేతాళుని స్వరూపము వ్రాసి, భేతాళయంత్రము వేసే పూజచేసి ధూప దీప ఫలనైవేద్యములు సమర్పించి ఏడేసి రావియాకులతో కుట్టిన యేడు విస్తళ్ళలో వండిన కుంభమును వడ్డించి, నడివీధిలో నొక కొయ్యను పాతి దానికి భేతాళ యంత్రమునకు గ్రహమును వ్రాసిన యాజ్ఞనుగట్టి, ఈయన జరిగించవలసిన పని యంతయు జరపినాఁడు. తరువాత మేము కుంభమును బండిలో నెత్తించుకొని యీ కట్టలతో గృహములమీఁద కొట్టుచు ఊరేగుచున్నాము. ఇక గ్రామదేవత గుడివద్దకు వెళ్ళినతరువాత చిత్రము జరుగును.

సుబ్ర__అలాగయిన నేనును వచ్చెదను.

అని సుబ్రహ్మణ్యము వారివెంటఁ బయలుదేఱెను. అందఱును గ్రామదేవతగుడి చేరినతరువాత యంత్రజ్ఞుఁడు బిగ్గరగా గ్రామదేవత పేర వ్రాసిన యాజ్ఞను ఈ ప్రకారముగాఁ జదివెను:

"యంత్రజ్ఞుఁడైన వీరదాసుగారు పెద్దాపురము గ్రామదేవత అయిన మరిడీమహలక్ష్మికి చేసిన యాజ్ఞ-ఈ గ్రామములో ఏదో గ్రహముచేరి యిండ్ల కాల్చుచుండఁగా ఈ గ్రామమునకు దేవతవయి యండియు నీ వూరకే చూచుచుండుటకు నిమిత్తము లేదు. ఆ గ్రహ మునకు నీ తరపున కుంభము కట్టుబడి చేయించినాము. ఆ కుంభము ఆ గ్రహమున కిచ్చి మాఱుమన్యమైన కొండలమీఁదికి దానిని పంపి వేయవలసినది. ఆలాగున పంపించని పక్షమున, శ్రీభేతాళుని చేతఁ గాని శ్రీహనుమానుల చేతగాని కఠినమయిన తాఖీదును పొందఁ గలవు.

    శ్లో॥యక్షరాక్షస దుష్టానాం మూషగా శ్శలభాశ్శుకా;
       క్రిమికీట పతంగానా మాజ్ఞాసిద్ది ర్విభీషణ॥"

అని చదివినతరువాత, యంత్రజ్ఞుడు ఏడు వి_స్తళ్ళను ఏడు చోట్ల వేయించి ఆ యేడింటిలోను కుంభము పోయించి, బండి తోలు కొని వచ్చిన వానిచేత నల్లకోడి నొకదానిని కోయించి దాని రక్తమును కుంభముమీఁద పోయించి, "ఓ గ్రహమా! నీ వీ కుంభము పుచ్చుకొని కొండలమీఁదికి పో" అని యాజ్ఞాపించెను. అక్కడకు వెళ్ళినవారందఱును చెఱువులో స్నానముచేసి యిండ్లకు వెళ్ళిరి. సుబ్రహ్మణ్యమును బ్రాహ్మణునితో సత్రమునకు వచ్చెను.

ఇంటికి వచ్చి సుబ్రహ్మణ్య మాసంగతియంతయఁ జెప్పిన తరువాత రాజశేఖరుఁడుగారు కొంతసేపు జనుల మూఢత్వమును గుఱించి యాలోచించి, ఇంతలో రుక్మిణి తలపున బాఱిన దుఃఖము వచ్చి దైర్యము తెచ్చుకోవలెనని యెంతసేపు ప్రయత్నము చేసినను చేతఁగాక ఎక్కడకయిన వెళ్ళిన దుఃఖము మఱచి పోవచ్చునని తలంచి పట్టణమును జూచుటకు బయలుదేఱిరి అతఁడు సత్రమునుదాఁటి నాలు గడుగులు నడచినతోడనే యొక యింటివద్ద దంపతులిద్దఱు వాక్కహల మున కారంభించిరి; అంతకంత కాకలహము ముదిరి యెుకరీతి యుద్ధము క్రింద మాఱినది. భార్య తిట్లెక్కువ చేసిన కొలదిని భర్త దెబ్బ లెక్కువ చేయుచుండెను. మగని కేకలను భార్య యేడుపును విని వీధివారందఱును గుంపులుగుంపులుగా చూడవచ్చిరి. అంత మంది వచ్చినను వారిలో నొకరును వారిని వారింపవలెనని తలఁచు కొని వచ్చినవారు లేరు గనుక, అందఱును వేడుకచూచుచు మాత్రము నిలుచుండిరి. అంత రాజశేఖరుఁడుగా రాస్థలమును విడిచిపెట్టి ముందుకుసాగిరి. ఆవల మఱి నూరుబారలదూరము వెళ్ళఁగా ఒకచోట వీధి యరుగుమీఁద పదిమంది పెద్దమనుష్యులు చేరి సభతీఱి కూరు చుండిరి. వారు నాగరికులు గనుక వారి ప్రసంగ మెంత మనో హరముగా నుండునో విని యానందింపవలెనని తలచి రాజశేఖరుఁడు గారు వీధిలోనే నిలువఁబడి వినుచుండిరి. ఆ సభికులందఱును తామై నను పొగడుకొనుచుండిరీ; లేదా స్నేహితులు పొగడుటకు సంతోష మైనను బొందుచుండిరి; వారందఱు నట్లానందించుచుండఁగా రాజ శేఖరుఁడుగారు తన్నెవరును పొగడువారును పొగడుకొన్న విను వారును గూడ లేనందునఁ జిన్నఁబోయి యిఁకనిందు నిలువఁగూడ దనుకొని యక్కడనుండి బయలుదేఱిరి. అటుపిమ్మట నాతఁడు త్రోవపొడుగునను నాలుగైదు రమణీయ సౌధములను జూచి లోప లికిఁబోయి వానిని చూడవలెనని బుద్దిపుట్టి గుమ్మమెక్కి తాను పండి తుఁడననియు మేడనుచూచి వేడుకపడి వచ్చితిననియుఁ జెప్పి చూచెను గాని ఆ పట్టణస్థులందఱును ధనికులమీఁద మాత్రమే ప్రేమ గలవారు గనుక ఆయన పాండిత్యమేమియు పనికిరాక మేడల యొక్క వెలు పటిభాగములను మాత్రము చూచి సూర్యాస్తమయ సమయము కావచ్చి నందున వెనుక మరలి తిన్నగా సత్రమువద్దకు వచ్చి చేరవలసివచ్చెను.

అప్పుడు సత్రపు బ్రాహ్మణుఁడు రాత్రి వంటలేదు గనుక తీఱు బడిగా వచ్చి కూరుచుండి రాజశేఖరుఁడుగారితో ముచ్చటలకు మొదలు పెప్టెను.

రాజ__మీ పట్టణములో గొప్ప పండితు లున్నారా?

సత్ర__ఉన్నారు. ఆస్థాన పండితుఁడయిన హరి పాపయ్య శాస్త్రులుగారు లేరా? ఆయన యెప్పడు నెవ్వరితోను బ్రసంగింపఁడు గనుక అందఱికంటెను గొప్ప పండితుఁడని వాడుక. ఆయన యొక సారి యాసత్రములో జరిగిన సంతర్పణమునకు భోజనమునకు వచ్చి నప్పుడు విశేషముగా మాటాడకపోయినను విశేషముగా భుజించి నందున, ఆయన గొప్ప పండితుఁడనియే నేనును నమ్మినాను.

రాజ__ఆయనగాక మఱియెవ్వరయిన నున్నారా?

సత్ర__మా గురువులు భానుమూర్తిగారు వేదాంత శాస్త్ర మందు నిరుపమాన మయిన ప్రజ్ఞ గలవాఁడు. నాకు మొన్న రోగము వచ్చినపుడు పుణ్యలోకము వచ్చుటకు తగిన సదుపాయమును చేసి పదిరూపాయలను పట్టుకొని పోయినారు ఆ మఱునాఁడే దొంగవస్తు వొకటి ఆయన యధీనములో కనబడిన యన దుర్మార్గులయిన రాజ భటు లాయనను నిష్కారణముగా తీసుకొనిపోయి ఠాణాలో పెట్టినారు.

రాజ__గురువు లెప్పుడును శిష్యులకుఁ దమవ్రేలితో స్వర్గము నకు త్రోవ చూపుచుందురు. కాని తాముమాత్రము స్వర్గమార్గము మాట యటుండఁగా దామున్న యీ లోకమునే త్రోవఁగానక గోతిలో పడుచుందురు. తార్కికుఁడును వైయాకరణుఁడును నగుట సులభము కాని యోగ్యుఁ డగుట యంతసులభము కాదు. ఆ మాట యటుండ నిచ్చి మీ పట్టణములోని వారి స్థితిగతులను కొంచెము చెప్పుము.

సత్ర__కష్టపడి పనిచేయువారు తాము తెచ్చుకొన్నది అన్న వస్త్రాదులకు చాలక బాధపడుచుందురు! పాటుపడని సోమరిపోతుల పూర్వులార్జించిన మాన్యముల ననుభవించుచు విలువబట్టలను పంచ భక్ష్యపరమాన్నములను గలిగి సుఖింపుచుందురు. తాతముత్తాతల నాటినుండియు పరువుతో బ్రతికినవారు కొందఱు జీవనము జరగక రాజుగారిని చిరకాలము నుండియు యాశ్రయించుచున్నారు; కాని యెంత యనుసరించినను రాజు నిర్ణయుఁడై చదువురాదని చెప్పి వారికి కాలువ లియ్యకున్నాఁడు.

రాజ__ఆదృష్టవంతులము కావలెనని చేయు ప్రయత్న మొకటి తప్ప వేఱుప్రయత్నము లేనివా రెప్పడును భాగ్యవంతులు కారు. భాగ్యదేవత మాఱుపని లేక తనకొఱకే కాచుకొనియున్న వారియొద్ద నుండి పాఱిపోయి యింట గూరుచుండి యొడలు వంచి పనిచేయువారినే చేరును. దాని కేమిగాని మిగిలిన వృత్తాంతమును చెప్పము.

సత్ర__మా పట్టణమున ననేకులు రాత్రులు పురాణ కాలక్షేప మును జేయుదురు. ఇక్కడకు దగ్గఱనే యొక పెద్ద మనుష్యుఁ డున్నాఁడు. ఆయన యెప్పుడును చదువక పోయినను తాటాకుల పుస్తకము నొకదానిని విప్పి సర్వదా ముందు పెట్టుకొని కూరు చుండును. మన పొరుగింట కాపురమున్న సముతుదారుగారి తల్లికి పురాణ మన్న నెంతో యపేక్ష; ఆమెకు నిద్రరానపు డెల్లను పురా ణము చదువమనును; పురాణ మారంభించినతరువాత మంచి కథ పట్టు రాఁగానే గోడను చేరగిలబడి హాయిగా నిద్రపోవును.

రాజ__ఇక్కడి వర్తకు లెటువంటివారు ?

సత్ర__వర్తకులు తమ సరుకులను మాత్రమే కాదు, మాట లను సహితము విశేషలాభమునకు విక్రయింతురు. అయినను వారి కెంతలాభము వచ్చినను, ఆ లాభము మాత్రము వారి యాశకుఁ దగి యుండదు. ఈ సంగతి నెఱిగి యిక్కడి పెద్దమనుష్యులు కొందఱు మొదట వారి వర్తకశాలకుఁ బోయి యొక వస్తువును గొని, వారడిగిన వెల నిచ్చివేయుదురు; ఆ పయిన చిన్నవస్తువు నొక దానిని ఆరవు తెప్పించి, దాని సొమ్మును మఱునాఁడే పంపివేయుదురు; అటు పిమ్మట క్రమక్రమముగా పెద్ద వస్తువులను దెప్పించి వాని వెలలను గూడ యు క్తసమయముననే యిచ్చివేయుదురు; ఈ ప్రకారముగా నమ్మకము కుదిరినతరువాత పెండ్లి పేరో మఱియొక శుభకార్యము పేరో చెప్పి విలువ వస్తువులను విస్తారముగాఁ దెప్పించి కడపట సొమ్మీయక యపహరింతురు.

రాజ__ధనము నిమిత్తము యీ ప్రకారముగా నక్రమమున కొడిగట్టిన కీర్తిపోదా?

సత్ర__కీర్తి కేమి? దానిని కొనుటకయి ముందుగా ధనము సంపాదించిన యెడల తరువాత నిమిషములో కావలసినంత కీర్తిని కొనవచ్చును.

రాజ__మీ రాజుగా రెంతో ధర్మాత్ములనియు ప్రజలను న్యాయ మార్గమున నడిపించువా రనియు ఎప్పుడును వినుచుందును. వారి రాజధానియైన యీ పట్టణమునందె యిట్టి ఘోరకృత్యములు జరుపు చుండఁగా రాజుగారు సహించి యూరకున్నారా?

సత్ర__ఈ పట్టణములో నిప్పుడేమి యక్రమములు జరుగు చున్నవి? మా మహారాజుగారి తండ్రిగారి కాలములో పూర్వము జరుగుచుండెడి ఘోరకృత్యములలో నిప్పుడు గుమ్మడికాయలో నావ గింజంత పాలయినను లేవు. ఆ కాలములోనే మీ రీపట్టణమునకు వచ్చి యుండినయెడల మంచిబట్టలు కట్టుకొని పట్టపగలీ ప్రకారముగా వీధిలో నిర్భయముగా నడవఁ గలిగి యందురా? మా రాజుగారు సహస్ర ముఖముల కనుగొని నిత్యము దుర్మార్గుల ననేకులను శిక్షించుచుండుట చేతనే యిప్పుడు నరహత్యలు మొదలయిన ఘోరపాతకము లేవియు జర గకున్నవి.

రాజ__ఈ పట్టణములో వేదవిహిత కర్మానుష్టానములు చక్కగా జరుగుచుండునా?

సత్ర__త్రికాలములయందు యధావిధిగా జరుగుచుండును.

రాజ__ఆట్లయిన, నీ విప్పుడు సంధ్యావందనము చేసినావా?

సత్ర__ఎన్నడో వడుగునాఁడు నేర్చుకొన్న సంధ్యావందనము మఱచి పోక యిప్పటిదాఁక జ్ఞాపక ముంచుకొన్నా ననుకొన్నారా?

రాజ__పోనీ, అర్ఘ్యమునయిన విడిచినావా?

సత్ర__ఒక్క అర్ఘ్యమును మాత్రమేకాదు, సంధ్యావందన మంతయు విడిచినాను.

ఈ సంభాషణము ముగిసినతరువాత ప్రొద్దుపోయినందున రాజశేఖరుఁడుగారు లేచి వెళ్ళి భోజనముచేసి, తరువాత నొక్క రును పరుండి యాలోచించుకొని మోసములకెల్లను పుట్టినిల్ల యిన యీ పట్టణమును సాధ్యమయినంత శీఘ్రముగా విడిచి పెట్టవలయునని నియమించుకొనిరి; కాబట్టి మఱునాఁడు ప్రాతః కాలముననే యెుక బండిని కుదుర్చుకొనివచ్చి, కుటుంబ సహిత ముగా దాని మీదనెక్కి జాము ప్రొద్దెక్కువఱకు భీమవరము చేరిరి. బండిమీద నెవ్వరో క్రొత్తవారు వచ్చినారని యూరిలో నెల్లవారును జూడవచ్చి, వారి నివాస స్థలమును గుఱించియు ఆగమన కారణమును గుణించియు ప్రశ్నలు వేయఁజొచ్చిరి; చెప్పిన దానినే మరలమరల నడిగిన వారికెల్లను జెప్పలేక రాజశేఖరుఁడు గారును మాణిక్యాంబయు విసిగిపోయిరి. వారందఱు నట్లు పనికట్టు కొని వచ్చి ప్రశ్నలు వేయుటకయి ముందడుగిడుచువచ్చినను, రాజ శేఖరుఁడుగారు తమకు బస కావలెనని యడుగఁబోగానే తిన్నగా వినుపించుకోక, లేదని వెనుకంజ వేయ నారంభించిరి.అంతట రాజశేఖరుఁడు గారు బండిని వీధిలో నిలిపించి, తాము బయలుదేఱి బస నిమి_త్త మయి యెల్లవారింటికిని బోయి రెండు జాములవఱకు నడుగుచుండిరి గాని, వారిలో నొక్కరును ఆ పూఁట వండుకొని తినుటకయినను స్థలము నిచ్చినవారుకారు. క్రొత్తగా వచ్చినవారు గనుక రాజశేఖరుఁడు గారు బస నిమిత్తమయి తిరుగునప్పుడు వీథులలో నిలువచేయబడియున్న పెంటకుప్పలను జూచి యసహ్యపడుచు వచ్చిరిగాని ఎరు వున కుపయోగించుటకయి పొరుగూళ్ళకు సహితము గొనిపోయి యమ్ముకొనెడి యా యూరివారి కవియే కనకమన్న సంగతిని తెలిసికో లేకపోయిరి. అట్లా దుర్గంధమునకు ముక్కు మూసికొని నడచి గ్రామ కరణముయొక్క యింటికిఁబోయి వారి యింటిపేరడిగి యేదో యొక ప్రాతబంధుత్వమును తెలుపుకొని మొగమోటపెట్టఁగా ఆతఁడాపూటకు తమ యింట వంట చేసికొనుట కంగీకరించి, పొరుగుననున్న యొక వైదిక బ్రాహ్మణుని పిలిపించి రాజశేఖరుఁడుగారు కాపర ముండుట కయి వారి ప్రాత యిల్లిమ్మని చెప్పెను. అతఁడాయిల్లు బాగు చేయిం చినఁగాని కాపురమున కక్కరకు రాఁదనియు, తన భార్య సమ్మతిలేక యియ్య వలనుపడదనియు, పెక్కుప్రతిబంధములను జెప్పెను; కాని రాజశేఖరుడుగా రాతనిని కూరుచుండఁబెట్టుకొని పరోపకారమును గూర్చి రెండు గడియలసేపు ఉపన్యాసము చేసి యిల్లు బాగుచేయించుట పేరుచెప్పి రెండు రూపాయలు చేతిలోఁబెట్టిన సొమ్మాతనిని నిమిష ములో సమాధానపఱచినది. కాఁబట్టి రాజశేఖరుఁడుగారు వెంటనే పోయి బండిని తోలించుకొనివచ్చి యా పూట కరణము లోపల వంట చేసికొని భోజనముచేసి దీపముల వేళ సకుటుంబముగా ఆ గ్రామ పురోహితులయింట బ్రవేశించిరి. ఆ యిల్లు పల్లపునేలయందుఁ గట్టఁబడి యున్నది; గవాక్షములు బొత్తిగా లేనేలేవు; వాస్తుశాస్త్రప్రకారముగా దూలములు యజమానుని చేతికందులాగునఁ గట్టబడిన యా యింటి గోడలే పొట్టివి గనుక గుమ్మము లంతకన్నను పొట్టివిగా నుండెను. కాఁబట్టి ఎక్కడను వంగి నడవనివారు సహితమక్కడ వంగి నడచు చుందురు; లోపలిగోడ లెత్తుగా నుండకపోయినను దొంగలభయము చేతఁగాబోలును గాలి వచ్చుటకు వలనపడకుండ దొడ్డిచుట్టును నున్న గోడలు మాత్రము మిక్కిలి యెత్తుగాఁ బెట్టబడినవి. కాని యింటివా రాయిల్లు విడిచిపెట్టి వెళ్ళినతరువాత చూచువారు లేక కూలి యిప్పుడు మొండిగోడలుగా నున్నందున లోపలికి గాలి వచ్చుట కవకాశము కలిగినది. పూర్వ మిల్లుగలవా రందున్నప్పు డెవ్వరో యొకరు సదా రోగబాధితులైయుండుచు వచ్చినందునను గృహాధిపతియెుక్క కూఁతు రందులోనే పోయినందునను ఆ యిల్లచ్చిరాలేదనియు దానిలో నేదో గ్రహమున్నదనియు నెంచి దానిని విడిచి మఱియొకచోటికిఁ బోవ యత్నించుచుండిరి. కూతురుఁపోయిన నక్షత్రము ధనిష్టా పంచక ములో నొకటైనందున బ్రాహ్మణుఁ డాఱునెలల వఱకు ఆ యింటిని పాడుపఱిచి తరువాత సహితము పిల్లలతో నందుండుటకు మన సొప్పక వేఱొక యిల్లు కట్టుకొని యందు కాపురముండెను. రాజశేఖ రుఁడుగా రాయింటిలోఁ బ్రవేశించినతరువాత కొన్ని గవాక్షముల నెత్తించి గాలివీలు కలిగించుకొనుటయేగాక, తేమ పోవునట్టుగా యిల్లెత్తు చేయించి, వంటకు ప్రత్యేకముగా దూరమున దొడ్డిలో నొక పాక వేయించిరి. ఈ కర్చులక్రిందను భోజనాదికముక్రిందను తెచ్చు కొన్న రూపాయలు వ్యయపడుచుండెను. కాఁబట్టి రెండు మూడు మాసములలోనే జీవనమున కిబ్బంది కలుగునట్టు కనఁబడుచుండెను.

అదియొక పల్లె గనుక భీమవరములో కొనుటకు పాలు, మజ్జిగలుకాని, కట్టెలుకాని దొరకవు; పాడిగలవారికి చిట్టును పొట్టును యిచ్చిన యెడల వారింత పలచని మజ్జిగ పోయుచుందురు. రాజశేఖ రుఁడుగారు ప్రతి భానువారమునాడును పెద్దాపురమునకుఁ బోయి సంతలో వారమునకుఁ సరిపడిన వస్తువుల నన్నిటిని కొని తెప్పించు కొనుచుందురు. నెలదినములు గ్రామములో కాపురముండునప్పటికి రాజశేఖరుఁడుగారికి పలువురు పరిచితులుగా నేర్పడిరి. వారాయన స్థితి గతులను దెలిపికొని విచారపడి,రాజబంధుఁడును కారాగృహాధికారియు నైన శోభనాద్రిరాజుగారిని చూడుడని బోధించిరి. భీమవరమును చేరియే శ్యామలకోట యని యొక దుర్గముండెను. దానిలో శ్యామ లాంబ గుడి యుండెను కాఁబట్టి దాని కాపేరు కలిగియుండెను. అది యా కాలములో పెద్దాపుర రాజుగారియొక్క రాజ్యములలో నేరము చేసినవారి నుంచు చెఱసాలగా నుపయోగపడుచుండెను. ఇప్పుడా కోట పడిపోయినందున, అదియుండు స్థానమున నొక్క- గ్రామము కట్ట బడియున్నది; దానికి చామర్లకోట యని పేరు. ఆ కోట కధికారిగా నున్న శోభనాద్రిరాజుగారి కొక గ్రామముకూడ నుండెను.

రాజశేఖరుఁడుగా రాగ్రామములో కాపురమున్న కాలమందు రామరాజప్పుడప్పుడు రాత్రులు వచ్చి చూచిపోవుచుండెను.ధనము క్రమ క్రమముగా తఱిగిపోవుటను చింతించి, మాణిక్యాంబ ప్రతిదినము శోభ నాద్రిరాజుగారిని జూచి యుద్యోగము నిమిత్తమయి ప్రయత్నము చేయవలసినదని బలవంత పెట్టుచుండెను. అతఁడు రెండు మూడు సారులు పోయి సమయమయినది కాదని మరల వచ్చుచుండెను. కడ పటిసారి రాజశేఖరుఁడుగారు శోభనాద్రిరాజుగారి దర్శనార్థము వెళ్ళి వచ్చినప్పడు దంపతుల కిరువురకును యీ ప్రకారముగా సంభాషణ జరిగెను:

మాణి__మీకు రాజుగారి దర్శనమయినదా?

రాజ__ఆయినది. నేను వీధి గుమ్మములో నిలుచుండి యక్కడనున్న యొక పరిచారకుని జూచి లోపలికి వెళ్ళవచ్చునా యని యడిగితిని. భాగ్యవంతుఁడయిన పక్షమునఁ దిన్నగా లోపలికి వెళ్ళవచ్చుననియు, బీదవాఁడవైన యెడల నిక్కడనే నిలుచుండవలసిన దనియు వాఁడు చెప్పెను. నేను గొంచెముసే పాలోచించి చొరవ చేసి రాజుగారున్నచోటికిఁ బోయి నిలువఁబడితిని.

మాణి__రాజుగారితో మాటాడి మీ సంగతు లన్నియు చక్కగా మనివి చేసినారా?

రాజ__నేను గదిలోనికి వెళ్ళి నా స్థితిగతులను జెప్పు కొన్నాను, ఎవరితోనందు వేమో, రాజుగారితోఁగాదు__ఎందుచేతనన్న నేనెంతసేపు చెప్పకొన్నను రాజు నోటినుండి యొక మాటయు బదులు రాలేదు. నేను మాటాడుట మొదలుపెట్టినతోడనే మంచము దగ్గరనున్న కుక్క యొకటి మొఱగనారంభించినది. కాబట్టి దానితోనే మాటాడినా ననుకొన్నాను. కాని యది యేమి చెప్పినదో దాని భాష నాకు రానందున గ్రహింపలేక పోయినాను. ఇట్లు దాని యభిప్రాయము తెలియక యనుమానించుచు నిలుచుండ,రాజు తన సేవకుని నొక్కనిఁ బిలిచి నాకుఁ దెలిసిన భాషతో ఈ బ్రాహ్మణు నావలికిఁ బంపివేయుమని యాజ్ఞాపించెను. జరుగఁబోవు సంగతిని గ్రహించి వాడు రాకముందు మృదువుగా నేనే వెనుకకు మరలి తిన్నగా యింటికి వచ్చితిని.

ఆంతటి సన్మానము జరిపించిన రాజుగారిని మరల వెళ్ళి యాశ్రయింప బుద్ధిపట్టక రాజశేఖరుఁడుగారు ముందు జీవనోపాధి యెట్లు కలుగునాయని యాలోచించి సుబ్రహ్మణ్యము నెక్కడ కైనను బంపవలెనని తలఁచి మాణిక్యాంబతోఁ జెప్పి యామె యనుమతిని కొమారునితో నా సంగతిని జెప్పిరి. అతఁడును పరమసంతోషముతో నొప్పుకొన్నందున, ఆందఱును నాలోచించుకొని చివర కతనిని పిఠాపురమునకుఁ బంప నిశ్చయించుకొనిరి. ప్రయాణము నిశ్చయించిన దినమున రాజశేఖరుడుగారు కుమారుని బిలిచి యనేక విధముల నీతులు బోధించి బుద్ధులు చెప్పి, న్యాయమార్గమునఁ బ్రవర్తింపవల సినదని పలుమారులు జెప్పి, నమస్కరించిన కుమారుని నాశీర్వదించి యయిదు రూపాయలను కర్చునిమిత్తమిచ్చిరి:మాణిక్యాంబయు దగ్గర నున్న దానిలో నేమియు లోపము చేయక కావలసినన్ని దీవన లిచ్చెను. సుబ్రహ్మణ్యమును వారి నెడబాయవలసి వచ్చినదిగదా యని దడిపెట్టుకొని చెల్లెలిని ముద్దాడి తనకిచ్చిన రూపాయ యలలో నొకదానిని చేతిలోఁ బెట్టి వారివద్ద సెలవు పుచ్చుకొని వెనుక తిరిగి చూచుచు దారిసాగి నడిచెను.