రాజశేఖర చరిత్రము (ఎమెస్కో)/రెండవ ప్రకరణము

రెండవ ప్రకరణము


రాజశేఖరుఁడు గారి కూఁతురు రుక్మిణి స్నానమునకు వచ్చుట__నదీతీరవర్ణనము__రుక్మిణికిని సిద్ధాంతిగారి భార్యకు జరిగిన సంభాషణ__నీళ్ళకు వచ్చిన యమ్మలక్కల ప్రసంగములు__పంచాంగపు బ్రాహ్మణుఁడు వచ్చి సంకల్పము చెప్పుట__రుక్మిణి స్నానము చేసి బయలుదేరుట.

రాజశేఖరుఁడుగారు పౌరబృందముతో నాలు గడుగులు ముందుకు సాగినతోడనే యొకసుందరి సుందరగమనముతో బాదములయందలి యందియలమ్రోత మట్టియల మ్రోతతోఁ జెలిమిసేయ, మొలనున్న వెండి యొడ్డాణము యొక్కయు, ముంజేతుల పసిడికంకణముల యొక్కయు. గాజుల యొక్కయు కాంతులు ప్రతి ఫలించి కుడిచేతిలోని తళతళ లాడుచున్న రాగిచెంబునకుఁ జిత్రవర్ణ మొసంగ, మోమున లజ్జాభయములు నటియింప, పయ్యెద చక్కఁజేర్చుకొనుచు తిన్నగాఁ దలవంచుకొని మెట్లు దిగి వచ్చి చెంబును నీటి యొడ్డున నుంచి చెంబు మూతి కంటించియున్న పసుపుముద్దను దీసి కొంత రాచుకొని మోదుగాకులోఁ జుట్టి తెచ్చుకొన్నకుంకుమ పొట్లము నొక బట్టయుతుకుఁ రాతిపయిఁబెట్టి, మోకాలిబంటి నీటిలో నిలుచుండెను. ఆమె రాజశేఖరుడుగారి పెద్దకూతురగు, రుక్మిణి. ఆహా! ఆమె సౌందర్యమును బ్రత్యక్షమునఁ జూడ నోచిన వారి కన్నులే కన్నులు. ఆకాలమున హిందూదేశమునందలి సుందరులతో నెల్లఁ దెనుఁగు దేశములోని వారే రూప రేఖా విలాసములచేత నసమానలుగా నుండిరి; వారిలోను బ్రాహ్మణజాతి నాతులు మిక్కిలి చక్కనివారు. కాని రుక్మిణి రూపమును దలఁచి నప్పుడు మాత్రము, ఆ సుందరు లొకసౌందర్యవతు లని చెప్పుట కెల్లవారును సంకోచ పడుచుందురు. జనులందఱును మిక్కిలి సౌందర్యవతులని యొప్పు కొన్నవారిలో చక్కనివారి నేఱి యామె చెంత నిలిపినచో గురూపురాం డ్రనిపించెడి యామె మనోజ్ఞత నేమని పిలువవలెనో తెలియకున్నది. ఆపూర్వ వర్ణనాసామర్థ్యము గల కాళిదాసాది కవులలో నొకరినైనను బోలఁ జాలని నేను, ఉన్నంత సౌందర్యమును బోధించుపదములు లేనిభాషతోను, పదములు బోధించునంత వఱకైనఁ బూర్ణముగాఁ దెలుపలేని బుద్ధితోను, వర్ణింపఁ బూనుట యామె చక్కదనము యొక్క గౌరవమునకుఁ గొఱంత కలుగఁజేయుటయేగదా? అయినను యోగ్యవస్తువు దొరికినపుడు వర్ణింపక మానుట యుచితము కాదు కాఁబట్టి, యీ సృష్టిలోని వస్తువులతో వేనితోనైనను పోల్చి ఈ పుస్తకముఁ జదువువారి కామె యవయవములయొక్క రూపము వించుక మనస్సునఁ బుట్టింతునన్నను ఆమె యంగముల నెంచి యా వస్తువుల పేరు చెప్పుటకె సిగ్గు వొడముచున్నది. వేయేల? చతుర్ముఖుఁడును ఘణాక్షరన్యాయమునఁ బడిన యామె రూపమునకుఁ దలయూఁచి,తన యపూర్వవస్తు నిర్మాణ చాతురిని మెచ్చుకోకపోఁడని యామెం జూచినవా రెల్లరు నెంచుచుందురు. ఆమె శరీరచ్చాయం జూచిన, ఇఁక నీభూమి మీఁద బంగారమున కేమి చాయ యొక్కువ గలదని తోఁచును: నల్లగానుండు నేని, విండ్లామె కనుబొమలం గొంచెము పోలియున్నవని చెప్పవచ్చును; నేత్రములను జూచిన భాగ్యదేవత వానియందే కాపురము కుదిరినట్టు కనిపించును; కాని, నిపుణముగాఁ బరిశీలించినచో నేదో స్థిరవిచార మొకటి యామె హృదయపీఠమున నెలవుకొని యున్నట్టు ముఖలక్షణములు కొంచెము సూచించుచున్నవి. ఆ విచారమునకుఁ గారణము లేకపోలేదు. ఆమె పెనిమిటి సహవాసదోషముచేత నాఱు నెలల క్రిందటఁ దలిదండ్రు లతోఁ జెప్పక దేశాంతరము లేచిపోయినాఁడు.

ఇప్పుడామెకుఁ బదునాలుగు సంవత్సరముల వయస్సు గలదు. బంగారమునకుఁ బరిమళ మబ్బినట్లు,ఇప్పడిప్పడే యౌవనము తలచూపి యాపె మేనిసోయగమునకు మెఱుఁగు దెచ్చుచున్నది. పచ్చని దేహము మీఁద అప్పడు కట్టుకొన్న తెల్లనిబట్టయు బంగార మునకు పటిక పూసినట్టు లొకవిధమయిన యందమునే కలిగించు చుండెను. సుందరాంగుల యంగముం జేరినప్పు డేది యందముగా నుండదు? ముక్కున నడ్డబాసయు, చెవుల నీలాలబావిలీలును,చేతుల కంకణములను, మెడలో పట్టెడయును, మొలను వెండి యొడ్డాణమును, కాళ్ళ నందెలను, మట్టెలును, ఆమె యప్పుడు ధరించు కొన్నది. కంకణములకు సాహాయ్యముగా రంగురంగుల గాజులును లక్కపట్టెలును ముంజేతుల నలంకరించుచుండెను. ఈ నగలచే నామె యవయవముల కేమైన శోభ కలిగినదో లేదో కాని యవయవములచే నగలు కొంత శోభగాంచుట మాత్రము కరతలామలకముగాఁ గనఁ బడుచున్నది.

సృష్టిలోని యే పదార్ధమునకును బరిపూర్ణత్వమును దయ చేయనిరీతినే, సర్వసముఁడగు భగవంతుఁడు రుక్మిణి సౌందర్య మందును గొంతకొఱంతను గలిగించినాఁడు కాని బొత్తిగాఁ గలిగిం పక మానినవాఁడు కాఁడు. నిజముగా అది యొక కొఱంతయే యయ్యె నేని యా మెకుం గల లోపమెల్లను మెడ మిక్కిలి పొడుగుగా నుండుట. అయినను ముష్టిసర్వశాస్త్రి యాయవారమునకు వచ్చినప్ప డెల్ల నామె మెడను జూచి సంతోషించి, "మిక్కిలి విడుదగు మెడ శామివి. కులవర్ధని దాని నెఱిగికొడనిరి మిధుల్" అను సాముద్రిక గంథములోని వద్యమును జదివి పోవుచుండును.

అప్పుడొక్క విధవ మొలలోఁతునీళ్ళలో దూరముగా నిలుచుండి నోటిలో నేమేమో జపించుకొనుచు నడుమనడుమ దలయెత్తి సూర్యుని వంకఁ జూచి దండములు పెట్టుచు, దోసిటీలో నీళ్ళుపట్టి సూర్యున కర్ఘ్యము విడుచుచు, అప్పుడప్పుడు ప్రదక్షిణములు చేయు చుండెను. ఆవఱకే వచ్చియున్న కొందఱు స్త్రీలు తమ యిత్తడి బిందెలను నీళ్ళలోఁబెట్టి రేవునకు సమీపముగా నున్న రాళ్ళపయినిలుచుండి నొక్కొక్క మాట చెప్పుకొనుచు బట్టల నుతుకు కొనుచుండిరి; ఒక వృద్దాంగన సగముబట్ట కట్టుకొని తక్కిన సగము నుతుకుకొన్న తరువాత, ఉతికిన భాగమును మార్చికట్టుకొని మిగిలియున్న భాగము నుదుకుకొనుచుండెను; కొందఱు వయసులోనున్న స్త్రీలను గోప్యముగా నుంచఁ దగిన తమ యవయవములు స్నానము చేయుచున్నట్టియు గట్టున నున్నట్టియు పురుషులకుఁ గనబడునట్లు సిగ్గు విడిచి తొడుగుకొన్న రవికలను దీసి యుదుకుటయి తాము కట్టుకొన్న వస్త్రముల నక్కడనే విప్పి యావఱకుదికిన వేఱు తడిబట్టలను చుట్టబెట్టుకొనుచుండిరి. ఆవల పది బారల దూరమున దాసీ జనములు క్రిందఁపడిన మెతుకులకై కావు కావని మూఁగిన కాకులను చేయెత్తి యదలించుచు అంటుతప్పెలలను ఒడ్డునఁ బెట్టుకొని తోము కొనుచుండిరి. ఆ పయిని బెస్తలు పుట్టగోచులతో మొలబంటి నీటిలో నిలుచుండి వలత్రాడు మొలత్రాడునం దోపుకొని రెండు చేతుల తోను వలను త్రిప్పి లోతు నీళ్ళలో విసరిపైచి మెల్లమెల్లగా లాగు చుండిరి. మణికొందఱు లాగిన వలలను నీళ్ళలోఁ బలుమాలు జాడించి యంటుకొనియున్న బురద పోయిన తరువాత గట్టునకుఁ దీసికొనివచ్చి చివరఁ దగిలించియున్న యినుపగుండ్లు గలగలలాడ వలలను విప్పి రాయి రప్ప క్రిందఁ బాఱవైచుచు నగుమనడుమ వల కన్నుల సందున నుండి మిట్టిమిట్టిపడు చిఱుచేపలను చేతులతో నదిమిపట్టి మీలపుట్టికలను చేతఁ బట్టుకొని నిలుచున్న పిన్నవాండ్ర చేతి కందించుచుండిరి. ఆ పయిని నాలుగడుగులు నడిచిన తరువాత దినమున కాఱణాలపాటు పడఁగలిగిన యొక సోమరిపోతు నీళ్ళలో నున్న నడదోనెమీఁది కెక్కి నల్ల యనబడు పేరిన నెత్తురుముద్దను త్రాటి చివరనున్న గాలమునకు గ్రుచ్చి, లేచి నిలువఁ బడి కుడిచేతితో సత్తువకొలఁదిని త్రాడు గిరగిర త్రిప్పి లోతునీట న్విసరిపైచి మరల గూర్చుండి చేప యెప్పుడు చిక్కు నాయని తదేక ధ్యానముతో త్రాడు వంకనే చూచుచు త్రాడు కదిలినెప్పడెల్ల నులికులికి పడుచు దైవవశమున చేప గాలమును మ్రింగి కొట్టుకొనుచుండ మెల్లమెల్లగా లాగుచు, త్రాడు తెంపుకొని పాఱిపోవునో యను భయమునఁ గుడి చేతిలోని త్రాడు వదలుచు మరల లాగి ఉండగా జుట్టుచు, చేప కల నట వచ్చిన తరువాత నొడ్డునకు లాఁగి పెన్నిధిగన్న పేదవలెఁ బరమానందము నొందుచు, ఒడ్డుదాఁక వచ్చిన తరువాత గ్రహచారము చాలక మత్స్యము త్రాడు తెంపుకొని పఱచిన చేతిలోఁ బడ్డ సొమ్ము పోగొట్టుకున్న వానివలె నిర్వేదించు చేప రాకపోగా రెండణాల గాలము కూడఁ బోయెనని విచారించుచు వట్టిచేతులతో వింటికిఁ బోయెను. ఆ సమీపముననే యొడ్డునఁ జేరి కుఱ్ఱవాండ్రు వెదురుచువ్వ కొక్క దారమును గట్టి దానికొననున్న చిన్న గాలమునకు ఎఱ్ఱలను గ్రుచ్చి నీళ్ళలో వైచుచుఁ దటాలునఁ దీయుచు జిన్నచేపలను బట్టు కొని మరియొక దారమునకు గుదిగ్రుచ్చి 'నాకు బదిజెల్లలు దొరికినవి' 'నాకు నాలుగు పరిగెలు దొరికిన'వని, యెండొరులతోఁ జెప్పుకొనుచు సంతోషించుచుండిరి. అక్కడి జువ్విచెట్టుమీఁదఁ గూర్చుండి చూచు చున్న చెడు గ్రద్దయొకటి యకస్మాత్తుగా వచ్చి యొకటి రెండు పర్యాయములు పిల్లవాండ్రు త్రాడునకు గ్రుచ్చుటకయు చేతం బట్టు కొన్న చేపఁ నెగరఁదన్నుకొని పోయెను.

ఆప్పుడొక్క పెద్దముత్తయిదువ మొగమంతయు నొక్కటే బొట్టుపెట్టుకొని, బట్టలతోనున్న బుజముమీఁది బిందెను తీసి చేతఁ బట్టుకొని రుక్మిణియున్న తావునకు వచ్చి గౌరవముతోఁ ప"అమ్మాయి గారూ! ఏమి, మీరీ వేళ స్నానమునకు దయచేసినారు?"

రుక్మిణి__కార్తిక సోమవారము కాదా? కడపటి సోమ వారము గనుక ప్రదోష వేళ మా ఆమ్మతోకూడ శివాలయమునకు వెళ్ళ వలెనని గోదావరిస్నానము చేయ వచ్చినాను.

పెద్దముత్తైదువ__మీరు రాత్రిదాక భోజనము లేకుండ నుండఁగలరా!

రు__ఒక్కదినమున కేమి? ఏలాగునై న నుందును. మొన్న మీ రెండవ చిన్నదానికి శరీరములో నిమ్మళముగా లేదని చెప్పినావు. ఇప్పడు కొంచెము నిమ్మళముగా నున్నదా?

పె__ఏమి నిమ్మళమో నాకు తెలియదు. మావారు రెణ్ణాళ్ళఁ బట్టి కామావధానులచేత విభూతి పెట్టించుచున్నారు. రాత్రి తెల్లవారిన దాఁక నిద్రలేక బాధపడినాము.

రు__గ్రహబాధా యేమి?

పె__అవునమ్మాయి! ఏమి చెప్పకోను? మగడు__ఆని "యిక్కడ నెవరును లేరుగదా" యని నాలుగు ప్రక్కలను జూచి మఱింత దగ్గఱగా జరిగి చెవిలో మెల్లగా "మగఁడు పట్టుకొని వేపుకొని తించున్నాఁడు. మీ రెఱుఁగుదురుగదా దానికి పెండ్లియయి మూడేండ్లు కాలేదు. అప్పడే దాని మగఁడు పోయి యాఱు నెల లయినది. అప్పటినుండియు దానికి కొన్నాళ్ళు కలలోను, కొన్నాళ్ళు రాత్రి వేళ ఒంటరిగా నున్నప్పడును కనబడుచునే యున్నాడు. పిల్లది సిగ్గు చేత ఎవ్వరితోను చెప్పక దాఁచినది. నెలదినములనుండి బొత్తిగా ఎప్పుడును విడువక రేయింబగళ్ళు వెంటవెంటనే యెక్కడికి వెళ్ళిన నక్కడికెల్లఁ దిరుగుచున్నాఁడు. ఏమి పాపమో కాని మూడు దిన ములనుండి మఱింత పీకుకొని తించున్నాడు. ఈ మూణ్ణాళ్ళలోను పిల్లది సగమయిపోయినది. ఇంతేగదా? మగనితో_"

అని కడుపులోనుండి దుఃఖము బయలుదేఱcగాఁ గొంచె మాపుకొనుచుఁ గన్నీరు పైట చెఱఁగుతో తుడుచుకొనుచుఁ గొంచెము తాళి గద్గద స్వరముతో-"మగనితో సౌఖ్య మనుభవింపనా? కాపురము చేయనా?" అని కొంచెము బిగ్గరగా నేడ్వఁజొచ్చెను.

రు__(ఆ మాటలు మనసుకు నాఁటి యొడలు పులకరింపఁ గొంత తాళి ధైర్యము తెచ్చుకొని) పెద్దముత్తై దువవు. ఆలాగున గంట తడి పెట్టరాదు. ఊరుకో ఊరుకో. రోగము మనుష్యులకు రాక మ్రాకులకు వచ్చునా?

పె__(ఏడుపు చాలించి) ఆమ్మాయీ! దాని కే సౌఖ్యము నక్క ఱలేదు. ఈలాగుననైన నుండి బ్రతికి బట్ట కట్టినఁజాలును. మా ముసలిప్రాణములు రెండును బ్రతికి బాగున్నంతవఱకు దాని యన్న వస్త్రముల కేమియు లోపము రాదు.

రు__(కొంచెముసేపేమో యాలోచించి) సోమిదేవమ్మా! మీ వారు గ్రామములో పెద్దసిద్ధాంతులుగదా? తెలిసికూడ చిన్నదానిని యర్ధాయుష్మంతున ____

పె__(మాట కడ్డము వచ్చి) ఔనౌను; నీ వడుగఁ బోవునది నేను గ్రహించినాను. ఎవరి యదృష్టమున కెవరు కర్తలు? దానికి ముండమోయవలసిన వ్రాఁతయుండఁగా నెవరు తప్పింపఁగలరు? ఎవ రైనా జాతకము మంచిదిగాఁ జూచి వివాహము జేయుదురుగాని పెండ్లికుమారునకు లేని యాయువును తెచ్చి పోయఁగలరా?

రు__అవును. జాతకములో మీ యల్లునకు పూర్ణాయుస్సే యున్నది కాఁబోలు?

పె__(కొంచె మనుమానించి) పూర్ణాయుస్సా-అవును పూర్ణాయుస్సే యున్నది. జాతక ప్రకారము జరగదా ఆందునేమో, వేళ తిన్నగా కట్టి జాతకము వ్రాసిన యెడల, ఆందులో నెన్ని యక్ష రము లున్నవో ఆన్నియక్షరములను జరుగును. శాస్త్రము చక్కగా తెలియనివారు తిన్నగా వేళ కట్టలేక పాడుచేయుదురు. మావారు ఇన్ని ముహూర్తములు పెట్టినారు కదా? నీ వెఱిగినంత వఱకు మఱియొక విధముగా నెక్కడనై న జరిగినదేమో చెప్పు,

రు__కన్నమ్మగారి బుచ్చమ్మ వివాహ ముహూర్తము మా చావడిలో మన సిద్ధాంతిగారే పెట్టినారుగాని దాని మగని జాతకము కూడ సిద్ధాంతిగారే వ్రాసి__

పె-అవును, ఒకానొకటి తప్పిపోవుటయు గలదు. జ్యౌతిషమునకుఁ బార్వతిశాప మున్నదఁట మావా రెప్పడును ఈసంగతినే చెప్పచుందురు. గట్టుమీఁద మట్టెల చప్పుడగుచున్నది. ఎవ్వరో వచ్చుచున్నట్లున్నారు. ఈపాటి మన మీసంగతి చాలింతము.అని వెనుక తిరిగి చూచి బిందె యొడ్డుననుంచి స్నానమునకు నీళ్ళలో దిగుచున్నది.

ఇంతలోఁ గొందఱు పుణ్యస్త్రీలను విధవలును మెట్టు దిగుచు ముందున్నవారు వంగి కాళ్ళ వెండిపావడములను కొంచెము పయికి దీసికొనుచు వెనుక దిరిగి దూరముననున్నవారు వచ్చువఱకు దగ్గఱ వారితో మాటలాడుచు మెల్లమెల్లగా వీటి సమీపమునకు వచ్చి గృహ కృత్యములను గుఱించి మాటాడుకొనుచు బిందెల నొడ్డునఁ బెట్టిరి. అందఱును నొక్కచోట సమావేశమయి సావకాశముగా మాటాడు కొనుటకు నీళ్ళకు వచ్చినప్పటికన్న మంచి సమయము స్త్రీల కెప్పుడును దొరకదు గదా అందుచేతనే వారు సాధారణముగా కొంచెం తీఱుబడిచేసుకుని మాటాడవలసిన నాలుగు మాటలను నీళ్ళకు వచ్చి నప్పడే మాటాడుకొనిపోవుదురు. అప్పుడు ముప్పదియేండ్ల యూడు గల పొట్టి దొకతె ముందుకువచ్చి ముక్కుమీఁద వ్రేలు వైచికొని "ఓసీ వెంకమ్మా! రాత్రి శేషమ్మను మగఁడు కొట్టినాఁడట! విన్నావా?"

వెంకమ్మ__దానిని మగఁ డెప్పుడును అలాగుననే కొట్టుచుండును. నెలదినముల క్రింద కఱ్ఱపుచ్చుకొని కొట్టినప్పుడు చేతి గాజులన్నియు పగిలిపోయినవి.

పొట్టి__దానిని మగఁడు తిన్నగా ఒల్లడcట- అని బుగ్గను చేయిపెట్టుకొని "ఓసీ ఓసీ! అతఁడు ముండ నుంచుకొన్నాఁడఁట సుమీ."

బట్టతల ముతైదువ యొకతె చేతులు త్రిప్పకొనుచు ముందుకు వచ్చి "సరి సరి! దాని గుణము మాత్రము తిన్ననిదా? మొన్న సుబ్బావుధానుల కొడుకుతో మాటాడుచుండగా మగనికంటనే పడ్డ దఁట మగవాఁ డేలాగున నున్నను దోషములేదు. ఆఁడుదాని గుణము తిన్నగా నుండనక్క ఱలేదా?"

పొట్టి__దానికేమిగాని, పాపము: చిన్నమ్మను అత్తగారు లోకములో లేని కోడంట్రికము పెట్టుచున్నది. అంతేకాకుండ మగ డింటికి వచ్చునప్పటి కేవో నాలుగు లేనిపోని నేరములు కల్పించి చెప్పును దానిమీఁద అతఁడు ప్రతిదినమును దానిని చావగొట్టు చుండును.

పదియాఱు సంవత్సరముల వయస్సుగల యొక చామన చాయది కన్నుల నీరు పెట్టుకొనుచు-"అత్తగారు బ్రతికియున్న చోట్లనెల్ల నిదేకర్మము. లోకములో ఆత్తలెల్ల ఒకసారి చచ్చిరా__"

పొట్టిది__శేషమ్మా! నీ అత్తగారుకూడ నిన్ను చాలా బాధ పెట్టునని విన్నాను. నిజమా?

శేష__బాధ గీధ నాకు తెలియదు. కోత పడలేక చచ్చి పోవుచున్నాను. జాము తెల్లవాఱ లేచి యింటి ప్రాచియాంతయుఁజేసి, అంట్లు తోమి, యింటికి కావలసిన నీళ్ళన్నియు తోడి, మడిబట్టలుదికి, ఆమె లేచువఱకు పనులన్నియు జేయుదును. అప్పడు నాలుగు గడియల ప్రొద్దెక్కి లేచి కన్నులు నలుపుకొనుచు వచ్చి గరిటెనంటు వదలలేదని, వాకిటిలోఁ బెంట యట్టేదీయున్నదని తిట్ట మొదలు పెట్టును. తరువాత పేడచేసి గోడమీఁద పిడకలు చఱిచి ఱెక్కలు విఱుచుకొని జాము ప్రొద్దిక్కి చలిది భోజనమునకు వచ్చువఱకు, 'ఒక మూల తెల్లవాఱకమునుపే తిండికి సిద్ధపడుదుపు, పనిమాత్రము ముట్టుకోవని వంట చేసికొనుచు సాధించుచుండును, పగలు మగనితో మాటాడితే దప్పుగదా? రాత్రి యందఱి భోజనములు అయిన తరువాత అత్తగారికి కాళ్ళుపిసికి యామె నిద్రపోయిన తరువాత వెళ్ళి పడుకోఁబోవు నప్పటికి రాత్రి రెండు యామములగును. పడుకొన్నది మొదలుకొని యెప్పడు తెల్లవాఱిపోవునో, వేళకుఁ బనిగాకున్న అత్తగా రెక్కడ కోపపడునో అని నిద్రలో సహిత ములికి పడు చుందును; ఎట్లు చేసినను నాకు తిట్లును దెబ్బలను తప్పవు గదా? అని మొగమునకు కొంగడ్డము పెట్టుకొని నేత్రముల నీరు కార్పఁ జొచ్చెను.

రుక్మి__అత్తగారికి కోపము తెప్పించకుండ జేసెడు పనిని నీవు తిన్నగానే చేయరాదా?

శేష__అయ్యో! రుక్మిణమ్మా! నీక త్తగారు లేదు గనుక నీ కీసంగతు లేమియుఁ దెలియవు. ఎంతపని చేసినను అత్తగారి కెప్పుడును మెప్పు లేదు. కలయంపి చల్లునప్పుడు చిక్కగాఁ జల్లిన. 'ఇల్లంతయు సముద్రము చేసినావు, జాఱిపడి చచ్చిపోనా" యని తిట్టును. పలచగాఁ జల్లిన, "నీళ్ళకు కఱవువచ్చినట్లు పేణ్నీళ్ళే చల్లి నావుకా'వని తిట్టును. అడిగిన మాటకు మాఱు చెప్పిన "నా మాట కెదురు చెప్పచున్నావా' యని కోసి పెట్టును. బదులు చెప్పక యూర కున్న "మొద్దులాగున మాటాడ వే" మని తిట్టును. ఆమె ముందఱ ఏమి చేసినను తప్పిదమే. 'ఆఁ' అన్న అపరాధము. 'నారాయణా' యన్న బూతుమాట. నేను కాపురమునకువచ్చిన నాలుగు సంవత్సరముల నుండియు వాడుకొనుచున్న ఓటికుండ నాలుగు దినముల క్రింద పగిలి పోయినప్పడు రాయి వంటి క్రొత్తకుండ పగులఁ గొట్టినావని నేటి వరకు తిట్టుచున్నది.

పొట్టి__అత్త పోఁగొట్టినది అడుగోటికుండ, కోడలు పోఁగొట్టినది క్రొత్తకుండ యన్న సామెత వినలేదా?

శేష__నేను పడుబాధ యిప్పు డేమిచూచినారు! నా విధవ వదినెగారు బ్రతికియున్నప్పడు చూడవలెను. నిరుడు అమ్మవారి జాడ్యములో-దైవము కడుపు చల్లగా-ఆవిడ పోయినప్పటినుండి మూఁడు పూఁటలను కడుపున కింత తిన్నగా అన్నము నైన దిను చున్నాను. ఆఁడబిడ్డ జీవించియున్నప్పు డదియునులేదు. ఉన్న మాట చెప్పవలెను. ఎన్ని యన్నను ఇప్పుడు నా అ త్తగారు అన్నము తిన్నగా తినవైతివని తిట్టునుగాని తిని పోతినని తిట్టదు.

పొట్టిది__లోకములో నెటువంటివారును లేకున్న_ పిండి బొమ్మను చేసి పీఁటమీఁదఁబెట్టిన, ఆడుబిడ్డతనమున కదిరదరిపడ్డది -అన్న సామెత యూరకే పుట్టినదా?

ఇంతలో జపము చేసికొనుచున్న ముసలామె కొంతదూరము వచ్చి చెంబులోని లీళ్ళు పాఱబోసి "మీకు మాటల సందడిలో కన్నులు కనఁబడునా? ఈవల స్నానముచేసిన వారున్నారని యయిన లేదు. ఊరకే నీళ్ళు విదలుపుకొందురు. మీఁద మయిలనీళ్ళ పడి స్నానము చేసినముండను చచ్చినట్టు చలిలో మరల మునుఁగు చున్నాను" అని గొణుగుకొనుచు లోతు నీళ్ళలోనికి నడిచి బుడుగు బుడుగున నాలుగు ముణకలు వేసి బయలుదేఱి, మాటాడుకొనుచున్న వారివంక కన్ను లెఱ్ఱచేసి చూచుచు "అమ్మలక్కలు క్రిందును మీఁదను దెలియక పొంగిపడుదురు. మా కాలములో నున్న కోడం ట్రికములో ఇప్పుడు సహస్రాంశము లేదు. అత్తమంచియు, వేము తీపును లేదు. ఎక్కడను అత్తలేని కోడలుత్తమురాలు, కోడలులేని యత్త గుణవంతురాలు" అని సణుగుకొనుచు, దోసిలితో నదిలోని నీళ్ళు మూడుసారులు గట్టునపోసి, కొంచెము దూరము పోయిన తరు వాత మరల మూఁడుమాఱులాత్మ ప్రదక్షిణములుచేసి మెట్లెక్కి యదృశ్యురా లయ్యెను,


శేషమ్మ__ (నాలుగువంకలుఁ జూచి వడవడ వడఁకుచు) అమ్మలారా! నేనీలాగున అన్నానని మీ రెవ్వరితోనై ననెదరు సుండీ! మా ఆత్తగారు విన్న నన్ను చంపివేసిపోవును, ఈవరకే నాకు గతులు లేకుండ నున్నవి. ఇది విన్న బొత్తిగానే యుండవు. వెంకమ్మ తల్లీ! ఈ బ్రతుకు బ్రతుకుటకంటె గోదావరిలో పడితే బాగుండునని తోఁచుచున్నది__అని వలవల నేడ్వఁజొచ్చెను,

వెంకమ్మ__ఊరుకో!ఊరుకో! అటువంటి అవాచ్యము లెప్పుడును పలుకరాదు. పడ్డవాండ్రెప్పుడును చెడ్డవాండ్రుకారు-అని యూరడించుచున్నది.

శేషమ్మ__(ఆ మాటలతో దుఃఖము మాని) గోదావరికి వచ్చి చాలాసే పయినదమ్మా! ఇంతసే పేమిచేయుచున్నావని అత్తగారు చంపివేయును. వేగిరము పోవలెను__అని వేగముగా నీళ్ళు ముంచు కొని బిందె బుజముమీఁద నెత్తుకొని గట్టునకు నడుచుచున్నది.

అప్పడే నీళ్ళకు వచ్చిన వారిలో ఇరువదియేండ్ల ప్రాయము గల యొకతె చేరువనున్న మఱియొకతె మెడదగ్గఱకు చేయి పోనిచ్చి, "కాంతమ్మా! ఈ పట్టెడ క్రొత్తగా చేయించుకొన్నావా? నీకేమి? నీవు అదృష్టవంతురాలవు. కనుక తల మొదలుకొని పాదముల వఱకు నీ మగఁడు నీకు నగలు దిగవేయుచున్నాడు."

కాంత__నిన్ననే కంసాలి సుబ్బయ్యచేసి తెచ్చినాఁడు. నాలుగు పేటల పలక సరులు కూడ చేయుచున్నాడు. పేరమ్మా! నీ మగ వికీ నీమీఁద బహుదయ అని విన్నాను. నిజమేకదా! పేర__ఎందుకు వచ్చిన దయ సంవత్సరమున కొక్కపర్యాయమయినను పట్టుమని పదివరహాల నగచేయించి పెట్టుట లేదు గదా? పూర్వజన్మమునందు చేసికొన్న పాపముచేత నా కీజన్మ మందు ఇటువంటి __

అప్పడు ప్రక్కనునిలుచున్న మఱియొకతె-పేరమ్మా! నీవు వృధాగా లేనిపోని వ్యసనము తెచ్చిపెట్టుకొనుచున్నావు. నీ కేమ యిన అన్నమునకు తక్కువయినదా? బట్టకు తక్కువయినదా? మహారాజు వలె మగఁడు తిన్నగా చూచునప్పడు నగలు లేకపోయిన నేమి? మగనికి ప్రేమ లేకపోయిన తరువాత దిక్కుమాలిన నగ లెందుకు, వట్టి మోతచేటు. చూడు మన గ్రామములో బంగా రమ్మకు శరీరమునిండ నెన్నినగ లున్నవో ఆ నగలపేర్లే కొన్ని నేను వినలేదు. దీపములు పెట్టఁగానే వెళ్ళి దాని మగఁడు బోగము దాని యింటిలోఁ గూరుచుండును. దాని కేమిసుఖ మున్నది? నీ మగండెప్పడును చీఁకటి పడ్డ తరువాత వీధి గుమ్మము దాఁటఁడు.

పేర__నీవు చదువుకొన్న దానవు గనుక, కావలసినన్ని శ్రీరంగనీతులు చెప్పఁగలవు. నీకువలె మాకెవ్వరికిని ఇటువంటి వేదాంతము తెలియదు. నలుగురును నగలు పెట్టుకొని వచ్చినప్పడు, వట్టి మోడులాగున ఎక్కడ కయినను పేరంటమునకు వెళ్ళుటకు నాకు సిగ్గగు చున్నది. జానకమ్మా! నీకు నా మగనివంటి బీదవాడు____

జాన__పేరమ్మతల్లీ నే నేమో తెలియక అన్నాను. కోప పడకు __ అని బిందె ముంచుకుని వెళ్ళిపోవుచున్నది.

తక్కినవా రందఱును నీళ్ళు ముంచుకొని వెనుకనే బయలు దేఱి, "ఓసీ పూజారి పాపమ్మ చెంపకొప్పు పెట్టుచున్నది". "కరణము పెండ్లా మెంత యొయ్యారముగా నడుచునో చూచినావా". "అయ్యగారి రామమ్మ కేమిగర్వమో కాని మనుష్యులతో మాటాడనే మాటాడదే","పుల్లమ్మ పట్టపగలే మగనితో మాటాడునఁట". "కన్నమ్మది కొంచెము మెల్ల కన్ను సుమీ"_ "కరణముగారి సీత మ్మకు నగలే లేవే" అని పరులమీఁది దోషముల నెన్నుకొనుచు మెట్లెక్కి యిండ్లకు నడచిరి. విద్యాగంధమే యెఱుఁగని మూఢ వనితలకు మాటాడుకొనుట కంతకన్న మంచి విషయము లేమి దొర కును? అక్కడకు వచ్చెడి స్త్రీలు సాధారణముగా సంభాషించెడి యితర విషయములు సవతుల పోట్లాటలను, మాఱుతల్లుల దుర్మా ర్గములను, మగల యనాదరణమును మొదలైనవి తప్ప మఱి యేమియు నుండవు.

అప్పడు కుడిచేతిలో తాటాకులమీఁద వ్రాసిన పంచాంగమును బట్టుకొని, నీర్కావి ధోవతి కట్టుకొని, మడతపెట్టిన చిన్నయంగ వస్త్ర మొకటి బుజముమీఁద వేపికొని, మొగమునను దేహమునను విభూతి పెండెకట్లు స్పష్టముగా గానుపింప, నిమ్మకాయ లంతలేపి రుద్రాక్షలు గల కంఠమాల ప్రకాశింప, రొండినిబెట్టుకొన్న పొడుము కాయ చిన్నకంతివలెఁ గనఁబడ, గట్టుమీఁదినుండి పోవుచు గోదా వరిలో స్నానము చేయువారెవ్వరో యని కనులకు చేయి యడ్డము పెట్టుకొని నిదానించి చూచి, గిరుక్కున మళ్లి యొక బ్రాహ్మ ణుఁడు మెట్లు దిగి వచ్చెను.

బ్రాహ్మణుఁడు:__రుక్మిణమ్మగారూ! సంకల్పము చెప్పెదను స్నానము చేయండి.

రుక్మి:__నేను డబ్బు తీసికొని రాలేదే.

బ్రా:__ డబ్బుకేమి? మధ్యాహ్న మింటివద్ద నిత్తురుగాని లెండి (అని వంగి నిలుచుండి) ఆచమనము చేయండి. కేశవా.నారాయణా. మాధవా.గోవిందా.తూర్పు మొగముగా తిరుగండి, సూర్యునికేసి.

రుక్మి:__స్నానము చేయవలెనా?

బ్రా__సంకల్పము చెప్పనిండి. అని పొడుము బుఱ్ఱను రొండి నుండి తీసి మూతతీసి రెండుమాఱులు నేలమీద మెల్లగా గొట్టి యెడమచేతిలో కొంత పొడుము వేసికొని మరల నెప్పటియట్ల మూఁత వేసి కాయను రొండిని ధోవతిలో దోపుకొని యెడమ చేతిలో నున్న పొడుమును బొటనవేలితోను, చూపుడు వేలితోను పట్ట గలిగినంత పెద్దపట్టును పట్టి బుఱ్ఱున పీల్చి రెండుముక్కులలోను ఎక్కించి, మిగిలిన దానిని రెండవపట్టు పట్టి చేతిలో నుంచుకొని, ఎడమచేతిని కట్టుకున్న బట్టకు రాచి ముక్కు నలుపుకొని, "శుభే శోభన ముహూర్తే -శ్రీ మహావిష్ణురాజ్ఞేయ - ప్రవర్తమానస్య-ఆద్య బ్రహ్మణ- ద్వితీయ ప్రహరార్ధె. శ్వేతవరాహ కల్పే - వైవస్వతమన్వం తరే. కలియుగే. ప్రథమపాదే. జంబూద్వీపే భరతవర్ష . భరతఖండే. అస్మిన్ - వర్తమానే - వ్యావహారిక చాంద్ర మానేన - కాళయు క్తి నామసంవత్సరే - దక్షిణాయనే. శరదృతౌ. కార్తీకమాసే. కృష్ణపక్షేద్వాదశ్యాం. ఇందువాసరే. శుభనక్షత్ర - శుభయోగ. శుభకరణాద్యనేక గుణ విశిష్టాయా - మాస్యాం - శుభతిధౌ - క్షేమస్థైర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం - అఖండ గౌతమీస్నాన మహం కరిష్యే-మూడు మాఱులు స్నానము చేయండి.

రుక్మిణి తఱుచుగా స్నానము చేయునది కాదుగాన లోతునీళ్ళ లోనికి వెళ్ళటకు భయపడి, మునుఁగుటకు చేతఁగాక మోకాలిలోఁతు నీళ్ళలోఁ గూర్చుండి కొప్పువిప్పుకొని దోసిలితో తలమీఁద నీళ్ళుపోసి కొనుచుండెను. అప్పడు సంకల్పము చెప్పిన బ్రాహ్మణుఁడు డబ్బు నిమి త్తము తరువాత వచ్చెదనని చెప్పి వెడలిపోయెను. అంతట రుక్మిణి బట్టకొంగుతో తలతుడుచుకొని,శిరోజములు చివర ముడివైచి కొని గట్టువంకఁ జూచి దూరమునుండి వచ్చుచున్న తండ్రిగారిని జూచి వేగిరము వేగిరము బయలుదేరి, రాతిమీఁద బెట్టిన కుంకుమ పొట్లమును దీసి నొసట బొట్టుపెట్టుకొని, రెండుమాఱులు చేతితో నీళ్ళ చెంబుమీఁద పోసి తీసికొని, రెండడుగులు నదిలోనికిఁ బోయి నీళ్ళు ముంచుకొని, బట్ట తిన్నగా సవరించుకొని, ఉతికిన బట్టలు బుజము మీఁదను వానిపయిని నీళ్ళతో నున్న బిందెయును పెట్టుకొని తనకొఱకయి కనిపెట్టుకొని యున్న సిద్ధాంతిగారి భార్యతోఁ గూడ గృహమునకుఁ బోవ బయలుదేఱెను.