రసాభరణము/తృతీయాశ్వాసము

శ్రీరస్తు

రసాభరణము

తృతీయాశ్వాసము

క.

శ్రీశుఁడు శృంగారరసా
ధీశుఁడు ధ్రువపట్టణేశుఁ డింద్రాదిదిశా
ధీశమనోహరుఁడు హృషీ
కేశుఁడు రక్షించు రుక్మిణీశుఁడు మమ్మున్.


క.

మఱి సర్వరసోత్కర్షత
నరయుచు బహుసంపదలకు నత్యాస్పద మై
మెఱసిన శృంగారరసము
తెఱఁ గంతయు విస్తరింతుఁ దేటపడంగన్.


మ.

భువిశృంగారము రెండుచందములు సంభోగంబు నవ్విప్రలం
భవిధంబు న్మఱి విప్రలంభము చతుర్భావంబులైయుండు నె
య్యవి యంటే నభిలాష యీర్ష్య విరహాఖ్యానానువాసంబు లి
ట్లు వివేకింపఁదగు న్విచక్షుణులు త్రైలోక్యకరక్షామణీ.


క.

ఆలోకనభాషణములు
నాలింగనచుంబనములు నాదిగ నెన్నం
జాలిన బహురతితంత్ర
శ్రీ లవి సంభోగనామశృంగారంబుల్.


అభిలాషాదులు—


ఉ.

చూచితి నేత్రపర్వముగ శూరకులాంబుధిచంద్రుని న్సుధా
వీచులకంటెఁ దియ్యనయి వీనుల సోఁకెఁ దదీయవాక్యముల్
నాచనుదోయి కబ్బె జతనంబుగఁ దత్పరిరంభసౌఖ్యము
ల్వాచవి చేసె నవ్విభునివాతెఱ ధన్యత నొందితిం జెలీ.


చ.

కలయకమున్ను రాగ మధికం బగునే నభిలాష యిద్దఱుం
గలసినమీఁదఁ బాయుట తగ న్విరహంబు నిజేశుఁ డొండు తొ
య్యలిఁ గవయంగ నవ్వనిత యల్గుట యీర్ష్య విదేశవాసులై
నిలుచుట దాఁ బ్రవాసము గణింపఁగ నన్నియు విప్రలంభముల్.


వ.

అభిలాషహేతుకం బగు విప్రలంభం బెట్టి దనిన.


ఉ.

వీనుల కింపొనర్చు నరవిందదళేక్షణురూపసంపదల్
గానఁగఁ గోరు లోచనయుగం బిదె యిప్పుడు తృప్తిఁబొందె నా
మేనికి ఘ్రాణజిహ్వలకు మేలగుసౌఖ్యము లెప్పు డబ్బునో
మానిని యింతలోన నవమన్మథుఁ డెంత యలంచునోకదే.


వ.

ఈర్ష్యహేతుకం బగు విప్రలంభం బెట్టి దనిన.

ఉ.

ఏమని యెన్నవచ్చుఁ గమలేక్షణుచేఁతలు నాకు నిచ్చటం
బ్రేమ నటించి పోయి పరభీరుత భీరును నొయ్యఁ జేరి పో
రామి యొనర్పఁ జొచ్చె నుడురాజముఖీ కనుఁగొంటె యింకఁ దా
నామొగ మెట్లు చూచుఁ [1]దగునా తన కీకపటప్రయోగముల్.


వ.

విరహాఖ్యానహేతుకం బగు విప్రలంభం బెట్టి దనిన.


ఉ.

తానును నేను గూడి విరిదమ్మికొలంకులపొంతఁ బుష్పితా
నూనరసాలసాలములయొద్ద లతాసదనంబులందు నిం
పూనఁగ సంచరించుగతు లుల్లమునందుఁ దలంపఁ బాడిగా
దే నలినాక్షుఁ డేల చనుదేఁడు సఖీమణి యేమి చేయుదున్.


వ.

ప్రవాసహేతుకం బగు విప్రలంభం బెట్టి దనిన.


చ.

మధురకు నేగుచుండి మధుమర్దికి న న్గొనిపోవఁ బాపమే
బుధనిధి యిప్పు డేల కొనిపోవు నటంచు మది న్వియోగతో
యధిఁ బడి గోపకాంత భయమందు; ముకుందుఁడు నవ్వధూటియే
విధమునఁ దూలునొక్కొ వ్రజవీధులనంచుఁ దలంచుఁ గూరిమిన్.


క.

ఇమ్ముల మఱియును నొక్కమ
తమ్మునఁ గరుణాత్మకాభిధానం బన ర
మ్య మ్మనుమానాఖ్యవియో
గమ్ము ననం గృతుల రెండుగతులై యుండున్.


క.

వనితపరోక్షంబునఁ బతి
యును బ్రియునిపరోక్షమునఁ బయోజాక్షియు రో
దన మొనరించుచ వర్ణిం
చినఁ గరుణాత్మకవియోగశృంగార మగున్.

ఉదాహరణము

చ.

జగమునఁ బుష్పదామకము చంపెడి దయ్యును నాయురఃస్థలిం
దగిలి యిదేల చంపదు నితంబిని నేటికిఁ జంపెనో విషం
బగు నమృతంబు నొక్కసమయంబున నావిషము న్సుధారసం
బగు విధిచేఁత లిట్టివి గదా యని పొక్కు నజుండు నెవ్వఁగన్.


ఉ.

ఎక్కడి కేగితే మదన యిందుఁడు గందఁడు శూలిచేత నిం
కెక్కడ నింత పుట్టునని యేర్పడ నింత యెఱింగి యక్కటా
మక్కువ లుప్పతిల్లుటలు మాని శిలాప్రతిమావిమానతన్
మిక్కిలి వాసి గాదె తరుణీతరుణావలి నీవులేనిచోన్.


క.

మానిని పతియెడ నేమిట
నేని యతని గవియనొల్ల నే నని మిగులం
బూనినయునికికి వర్ణన
మానాఖ్యవియోగ మనఁగ మహిలోఁ జెల్లున్.

ఉ.

మానమ యూఁది నే నతని మానితిఁ బొమ్మని పాసియున్నచోఁ
దానును మోసపుచ్చి సతతంబును గృష్ణునితోడి గోష్ఠికి
న్మానస మేల పోవు తుది నన్నును బాదుగదల్చునో కదా
వానిచలంబె చెల్లు నని వందుఁ దలోదరి సంశయంబునన్.


వ.

మఱి ద్వాదశావస్థ లెట్టి వనిన:


క.

అరయఁగ శృంగారం బం
కురితము మఱి పల్లవితము కుసుమిత మనఁగాఁ
బరువడి ఫలితంబునునై
పరఁగు నవస్థాంతరములు పండ్రెం డగుచున్.


వ.

కొందఱమతంబున దశావస్థ లనియుం జెల్లు నది యట్లుండెఁ గామశాస్త్రా
నుసారంబు లగుద్వాదశావస్థ లెట్టి వనిన చక్షుఃప్రీతి, మనఃసంగంబు, సం
కల్పంబు, ప్రలాపిత, జాగరంబు, కార్శ్యంబు, అరతి, లజ్జాత్యాగంబు, సం
జ్వరము, ఉన్మాదంబు, మూర్ఛనంబు, చరమంబు నాఁ బరగు వీనిలక్షణం
బున కుదాహరణంబులు.

.........

క.

ప్రియు నాదరమునఁ జూచుట
నయనప్రీతియగు మఱి మనఃసంగ మగుం
బ్రియుదెసఁ జిత్తమిడుట; ని
శ్చయముగఁ బ్రియువలని కోర్కి సంకల్పమగున్.


చక్షుఃప్రీతి కుదాహరణము—


చ.

విమలకపోలభాగముల వెన్నెలనిగ్గులలీల మందహా
సములు నటింపఁ గన్గొనలచాయఁ దటిల్లత లంకురింప దే
హము హరినీలరత్ననివహద్యుతితోఁ దులఁదూఁగ సర్వలో
కము నలరించుశౌరిఁ బొడగంటి సఖీ ధ్రువపట్టణాధిపున్.


మనస్సంగతి కుదాహరణము—


చ.

భ్రమరము కమ్మదేనియలు పాయలు గ్రోలుచుఁ దత్ప్రసూనగు
చ్ఛములఁ బ్రసక్తమై వెలయుచాడ్పున నాహృదయంబు చూచితే
కమలదళాక్షి యాదవశిఖామణిభవ్యగుణామృతప్రవా
హముననె యోలలాడుచు నొకప్పుడు నన్నుఁ దలంప దేమియున్.


సంకల్పమున కుదాహరణము—


ఉ.

త్రిప్పులఁ బెట్టి నన్నిటు రతిప్రియుబారికిఁ ద్రోచి నెమ్మదిం
గొప్పునఁ గమ్మక్రొవ్విరులకు న్మధుపంబులు సందడింపఁగా
నొప్పులకుప్పయై ధ్రువపురోజ్జ్వలవీథులఁ గ్రాలుశౌరి నే
నెప్పుడు చూతునొక్కొ మెఱుఁగెక్కిచూపులు చౌకళింపఁగన్.

...........

క.

వెలయఁగఁ బతిఁ గొనియాడుట
తలఁపఁ బ్రలాపిత; మనోవ్యధం బొరలుచుఁ గో
మలి కనుమూయమి జాగర
మలఁత తనుత్వంబు కార్శ్యమనియెడుపేరన్.


ప్రలాపిత కుదాహరణము—


చ.

రసికుఁడు దానశోభి మధురప్రియభాషణశాలి సంతతో
ల్లసితముఖారవిందుఁడు కళానిధి సౌమ్యుఁడు యౌవనద్యుతిం
బసగలవన్నెకాఁడు ధ్రువపట్టణనాయకుఁ డంచు జాణ లిం
పెసఁగఁగఁ బ్రస్తుతింతురు గదే యతఁ డేటికి రాఁడు నెచ్చెలీ.


జాగరమున కుదాహరణము—


చ.

గెలిచితి నెట్టకేల కరిగెన్ దిన మంచు మదిం దలంపఁగా
నొలసిన యీనిశాసమయ ముత్పలబంధునిఁ దెచ్చె వాఁడు వె
న్నెల వల వైచె మీఁద రమణీ మొరసె న్మరువింటినారి య
న్నలినదళాక్షుఁడుం దడసె నా కిటఁ గంటికి నిద్ర వచ్చునే.


కార్శ్యమున కుదాహరణము—


ఉ.

నీదగులీల యద్భుతము నీరజలోచను నంగుళీయకం
బాదట సందిదండ యగునా మహి నెవ్వరికైనఁ గౌనునుం
బేద యనంగ దేహమును బేదగిలెం దుది నింక నీమనః
ఖేదము మాను మమ్మ యెఱిఁగించెద నింతయుఁ గైటభారికిన్.

................

క.

వరునిదెస వేడ్క యుడుగుట
యరతి; నిజాచార మెడల నందినప్రేమ
త్తఱి లజ్జాత్యాగ; మనా
స్మరతాపంబుపేరు సంజ్వర మయ్యెన్.


అరతి కుదాహరణము—


ఉ.

కైరవబంధుబంధురవికాసవిలాసము లేల మందసం
చారిత నొప్పు నమ్మలయశైలసమీరము లేల యొప్పు నీ
కీరములపల్కు లేన పరికింపఁగ నవ్వనలీల లేల శృం
గారము లేల నాకుఁ జెలి కంజదళాక్షుఁడు రాక తక్కినన్.


లజ్జాత్యాగమున కుదాహరణము—


చ.

అలికులవేణి యేది సమయంబుగఁ జేసిరి మున్ను భూమిలో
లలనలకెల్ల నీవది యలంఘ్యముగాఁగఁ దలంపుమమ్మ పూ
విలుతునిచేఁతలం గలఁగి వేఱొకత్రోవలఁ బోకుమమ్మ నీ
యిలువడి చూడుమమ్మ కమలేక్షణుఁ దెచ్చెద నింతలోపలన్.

సంజ్వరమున కుదాహరణము—


చ.

చెలులు ప్రయత్నపూర్వముగఁ జేయుచునున్న హిమోపచారముల్
తలఁపఁగ వమ్మువోయెఁ బరితాపభరం బుడుపంగఁజాలు నీ
యలఘుచికిత్స యొండెఱుఁగ మచ్యుత నీకరుణామృతంబు పైఁ
జలికి తలాంగికిం దనుపుసేయఁగదే యిదె నీకు మ్రొక్కెదన్.


క.

చేతనము నచేతనము
న్నాతతముగ నేరదేని యది యున్మాదం;
బేతెలివియు లేనిది మూ
ర్ఛాతిశయము; చరమయత్న మది చరమమగున్.


ఉన్మాదమున కుదాహరణము—


చ.

చెలులకు నేటికిం బ్రియము సెప్పఁగ నే నుదకంబు వోసి కో
మలముగఁ బెంచినట్టి యెలమావికిఁ జెప్పినఁ బోయి రాదె పెం
దలకడ నొంటిఁ బో వెఱతుఁ దా నని పల్కినఁ దోడువంపనే
లలితలతావితానము నిలాధరుపాలికి దూతవృత్తికిన్.


మూర్ఛ కుదాహరణము—


చ.

అతులతపఃప్రభావమహితాత్ముల కైనను గానరాని య
చ్యుతుఁడు లతాంగి నెమ్మనము సొచ్చి సుఖస్థితి నున్నవాఁడు నేఁ
డతని భజింత మంచు శ్రవణాదులు దద్గతవృత్తి నుంట నా
యతివ సఖీజనంబు భయమందఁగ నున్నది నిశ్చలాకృతిన్.


చరమ కుదాహరణము—


చ.

పడుచనొ పైదనో యలరుఁబ్రాయము నొంది యశోదనెయ్యపుం
గొడుకు భజింపలేని బ్రతుకున్ బ్రదుకా యది యేల నాకు మా
మిడిచిగు రేమిబాఁతి యటమీఁదట వెన్నెల యెంత నవ్వున
న్నెడపు మనోజుఁ డేపఁగ సహింతునె బోటి యనాథచాడ్పునన్.


క.

చరమదెసకు లక్షణ మి
ట్టరసి యెఱుఁగవలయుఁ గాని యచ్చో సతికిం
బురుషునితోడి సమాగమ
పరితోషము చెప్పవలయము భవ్యార్థముగన్.


ధన్యత కుదాహరణము—


చ.

పవడముమీఁదఁ గస్తురి యిభస్ఫుటకుంభములందు నంకుశ
ప్రవహితరేఖ లాయెగువ భావజనూత్నసితక్షతంబు లీ
యువతికి భూషణస్ఫురణ నొప్పుచునున్నవి చూడరమ్మ మా
ధ్రువపురినాథుమన్ననఁ బ్రరూఢతఁ బొందిన చిహ్న లన్నియున్.

..............

వ.

మఱి సంభోగవిశేషం బగు పంచవిధశృంగారం బెట్టి దనిన—


క.

శృంగారభంగు లైదుతె
ఱంగులు వాగ్విలసనంబు రహినైపధ్యం
బంగక్రియ[2]సంకీర్ణము
సంగతముగ మిశ్రమనఁగఁ జనుఁ గంసారీ.


గీ.

తలఁప వాగ్వృత్తి సంకీర్ణములును గ్రియలుఁ
బరఁగు నొక్కొక్కవిధము నైపధ్య మైదు
తెఱఁగులై యుండు మిశ్రంబు త్రివిధ మి
ట్లుద్దాతశృంగార మేకాదశాంచితముగ.


క.

తనమదిఁ గలసంతోషము
వనజానన తాన చెప్ప వాగ్వృత్తి యగుం
దనచెయ్వులు నెచ్చెలులకు
ననయము గానంగనైన నది క్రియ యయ్యెన్.


వాగ్వృత్తి కుదాహరణము—


క.

కన్నులపండుగ సుమ్మీ
వెన్నుఁడు తద్గుణచయంబు వీనుల కమృతం
బెన్నఁగఁ దత్పరిరంభణ
మన్నిసుఖంబులకు నెక్కు డతివా నాకున్.


అంగక్రియ కుదాహరణము—


క.

తొయ్యలి హరికౌఁగిలిఁ గని
పయ్యెద చనుఁగవకు మాటుపఱచుట తగుఁబో
అయ్యధరముపై నంగుళ
మొయ్యనఁ గదియించెఁ జూపకుండుట తగునే.


క.

ఎందును నైపధ్యమునకుఁ
జందనభూషాంబరప్రసవములు వేర్వే
ఱొందుఁ జతుర్విధ మొక్కటి
యందంబుగఁ బంచవిధములై యటు జరుగున్.


అనులేపనశృంగారమున కుదాహరణము—


క.

వనితకు హరి యొనరించిన
నునుబూఁతలు మకరికామనోహరలిపులం
బనగలియు బాహుయుగళము
దనరును వలిపెంపుఱవికెఁ దాల్చిన భంగిన్.


ఆభరణశృంగారమున కుదాహరణము—


క.

యువతి రత్నాభరణము
లవయవములఁ గీలుకొల్పి హరిపరిరంభో
త్సవవాంఛ నిడదు నిఱిచను
గవనెపమున హారవల్లికలు కంఠమునన్.


వస్త్రశృంగారమున కుదాహరణము—


క.

అలఘుకుచకలశయుగళము
లలితోరుద్వయము నుజ్జ్వలస్థితిఁ దనక
న్నుల కిం పొసఁగవలయునని[3]
పొలఁతికిఁ గృష్ణుండు జిలుగుఁబుట్టముఁ గట్టెన్.

మాల్యశృంగారమున కుదాహరణము—


క.

హరికృతకుసుమసమంచిత
కరపదకటకంబు లమరెఁ గాంతకు నిందిం
దిరబృందనినదఝణఝం
కరణము లవి యప్రయత్నకలితము లయ్యెన్.


చతుర్విధశృంగారమున కుదాహరణము—


క.

హరివేషము దనయంతః
కరణంబున కెంతప్రియమొ కాని సువర్ణాం
బరమును మణికటకముఁ గ
స్తురియును వనమాలికయును సుదతి ధరించెన్.


క.

నైపథ్యము వాగ్వృత్తియు
నేపారఁగఁ గ్రియయుఁ గూడెనే సంకీర్ణం
బై పరఁగు రెండురెండు స
మీపంబుల నిలిచెనేని మిశ్రము గృతులన్.


సంకీర్ణశృంగారమున కుదాహరణము—


క.

దర్పణముఁ జూచి తిలకము
దీర్పఁగ నగవులకు వెనుకదెస నిల్చినఁ దా
నేర్పడఁ గని సరసోక్తు లె
లర్ప నతివ లేచి కుచములం బొదివె హరిన్.


నైపథ్యక్రియాత్మకమిశ్రమున కుదాహరణము—


క.

అభినవశృంగారముతోఁ
బ్రభగల జంబీరఫలము బాలకి చేతన్
రభసమున నందికొనియెద
విభగమనా మరునితండ్రి కెదురేగెదవే.


వాగ్వృత్తిక్రియాత్మకమిశ్రమున కుదాహరణము—


క.

హరిమురళీనాదమునకుఁ
గరతాళధ్వనులు చెలఁగఁగాఁ గలకంఠ
స్వరములఁ బాడుచు నాడిరి
గురుతరమోదమున దివ్యగోపిక లెల్లన్.

.................

వ.

మఱి భావోదయాది చతుష్టయం బెట్టి దనిన—


క.

తనరఁగ భావోదయమును
జను భావశమంబు భావసంధియు బుధరం
జన మగుభావశబలతయు
మునుకొని సంచారిభావములు దీపించున్.


ఉ.

ఏ దఁట యొక్కభావ ముదయించు మనంబున నివ్విధంబు భా
వోదయ, ముద్భవించునది యొప్ప శమించుట భావశాంతి, స
మ్మోద మొగిన్ రసద్వయము ముట్టి జనించుట భావసంధి, (యా)
హ్లాదవిధేయభావశబలత్వ మగు న్బహుభావసూచనన్.


భావోదయమున కుదాహరణము—


క.

తెఱవాలికకన్నులక్రొ
మ్మెఱుఁగులుఁ గుచకఠినతయును మెచ్చులె హరికి
న్నెఱమీనై తాఁబేలై
వఱలె నతం డనిన నింతి వదనము వంచెన్.

భావశాంతి కుదాహరణము—


క.

పొలయలుకఁ జేసి బొమముడి
నొలసినకోపంబు చరణయుగళముపైఁ జూ
డ్కులు నిలుపు ప్రియుని మదనా
కులత్వమున శాంతిఁ బొందె గోపాంగనకున్.


భావసంధి కుదాహరణము—


క.

అసురలపై దండెత్తిన
యసిశార్ఙ్గాయుధుని నిశ్చలాంగములను బెం
పెసఁగ నుదయించెఁ బులకము
లసమపటహనినదములఁ బ్రియావచనములన్.


భావశబలత కుదాహరణము—


క.

నానోముఫలమ్ము సుమ్మీ
శ్రీనిధి ననుఁ జూచి సన్నసేసెఁ గులస్త్రీ
లీనీతి మెచ్చనేర్తురె
మానితిఁబో బ్రదుకుఁ గలదె మదనునిచేతన్.

...................

వ.

మఱి రససంకరంబులు (ఎట్టి వనిన)—


క.

రసములు రెం డొకచోట బె
రసి వచ్చిన నివ్విధంబు రససంకర మై
యెసఁగును శృంగారముతోఁ
బొసఁగ రసము లిందు[4] దెల్లముగ రచింతున్.


శృంగారహాస్యసంకరము—


క.

కదలక తమాలపోలము
తుదిఁ గేగి వసించియుండఁ దొయ్యలి కృష్ణా
బెదిరింపకు మెఱుఁగుదు మని
కదలక హరిపిఱుఁదనుండు కలకల నవ్వెన్.


శృంగారరౌద్రసంకరము—


క.

విహగారూఢుఁడు భామా
సహితముగ గృహీతపారిజాతోజ్జ్వలుఁడై
మహికి నరుదేర వెనుకొను
సహస్రనయనుఁ గని కవిసె సక్రోధుండై.


శృంగారకరుణాసంకరము—


క.

ఇఱిచనుగవలభరంబుల
నఱగౌనులు వడఁకఁ గాళిహ్రదము సతుల్
మొఱ లిడుచు వచ్చి కృష్ణుని
యఱకాళ్ళం దలలు మోపి రశ్రులు దొరఁగన్.


శృంగారవీరసంకరము—


క.

నెఱికయు గనయముఁ బయ్యెద
చెఱఁగున బిగియించి విల్లు చేకొని సురలం
దఱుఁ బొగడ నసురవీరునిఁ
బఱపుదు నని సత్యభామ బాణముఁ దొడిగెన్.


శృంగారభయానకసంకరము—


క.

పడగలసర్పముపై నీ
కొడు కాడెడు నన్న నందగోపిక కడుఁద
ల్లడమునఁ బెదవులు దడుపుచు
వడఁకె బవనచలితకల్పవల్లియ పోలెన్.

శృంగారాద్భుతసంకరము—


క.

నున్ననితమాలలతపై
నున్నది గిరియుగముమీఁద నుడుపతి యటమీఁ
ద న్నిబిడతిమిర మనఁగాఁ
జెన్నగు వ్రజవనిత శౌరిఁ జేరి భజించెన్.


శృంగారశాంతసంకరము—


క.

ధ్రువునకు దివిజయువతు లా
త్వవిలాసముఁ జూపవచ్చి తద్విమలతపః
ప్రవణంబున నందఱు వీ
తవికృతులై చనిరి పేదతరుణులపోలెన్.


రౌద్రబీభత్ససంకరము—


క.

భ్రూలత ముడివడఁ జక్ర
జ్వాలలు నిగుడంగ నండజధ్వజుఁ డార్చెన్
గీలాలమాంసఖండక
పాలమయము చేసె నసురభటసైన్యములన్.


క.

అరయంగ మఱియు రససం
కరము లిటులు విస్తరింపఁ గలుగును మహిస
ర్వరసాంతరములయందును
విరోధరసమొకఁడు దక్క విశ్రుతకృతులన్.


క.

అప్రతిమం బగుశృంగా
రప్రకరణ మిట్లు భాసురం బయ్యె నితాం
తప్రౌఢి నొనర్చెద లో
కప్రీతిగ నింకనాయకప్రకరణమున్.


క.

ధ్రువపురినాథుఁడు దివిజ
ప్రవరకిరీటతటరత్నరంజితనిజపా
దవిమలపీఠుఁడు భూగో
లవిభుఁడు రక్షించు మమ్ము లాలితకరుణన్.

గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ సుకవిజన
విధేయ అనంతనామధేయ ప్రణీతం బైన రసాభరణంబునందు
శృంగారవిశేషంబులగు నవస్థాంతరములవిధంబులును
ద్వాదశావస్థలవిధంబును బంచవిధశృంగారం
బును భావోదయాదిచతుష్టయంబును
రససంకరంబుల తెఱంగును శృం
గారప్రకరణంబు నన్నది
తృతీయాశ్వాసము.

  1. దగు నాతని కీ
  2. వాగ్విలసనంబు నైపధ్యమున్ అంగక్రియ (మూలము)
  3. కన్నుల కిం పొసంగవలయునని తన (మూలం)
  4. రసము రెండు - మూలం