రసాభరణము/ద్వితీయాశ్వాసము

శ్రీరస్తు

రసాభరణము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీయుతుఁడు భక్తలోకమ
నోయుతుఁ డాధ్రువవిభీషణుల నాకల్ప
స్థాయిగ రక్షించిన కరు
ణాయుతుఁడగు ధ్రువపురీశుఁ డధిపతి మాకున్.


క.

మును సాధారణరూపం
బునఁ బ్రథమస్థాయిభావముగఁ గ్రమగతిఁ జే
ప్పిన రతికిని సాధారణ
వినుతవిశేషంబు లిచట వివరింపనగున్.


మ.

రతి దానాయకనాయికాదిపరతన్ రంజిల్లు శృంగార మై
క్షితిలో దేవగురుద్విజాదిపరతం జెన్నొందు సద్భక్త యై
సుతమిత్రాశ్రితసోదరాదిపరతన్ సొంపారు వాత్సల్య మై
మితి చెప్పంగలదే రసస్థితికి బేర్మిం జూడఁగా నెయ్యెడన్.


వ.

ఇట్టి శృంగారభక్తివాత్సల్యంబుల కుదాహరణము—


శా.

ప్రేమం జూచిరి ప్రాణనాథుఁ డనుచున్ బింబాధరీరత్నముల్
స్వామిత్వప్రణిపత్తి మైఁ గొలిచి రోజం బౌరలోకంబు చే
తోమోదంబునఁ బుత్రభావనఁ గడుం దోతేర నంతన్ ఘన
శ్రీమీఱ న్వసుదేవదేవకు లొగిన్ సేవించి రావెన్నునిన్.


వ.

మఱి తత్సజాతీయ విజాతీయంబు లెట్టి వనిన—


క.

మొదల సజాతీయం బను
నది విభునకు నాయికాంతరాలోకనమై
పొదలు విజాతీయం బను
నది గ్రోధాఢ్యంబు రెండు నహితము రతికిన్.


ఉదాహరణము—


ఉ.

ఎన్నఁడు చూచె నన్ను నతఁ డింపు దలిర్పఁగ నాఁటనుండియు
న్మన్నన వెల్తిగాఁడు, పరమానవతీసతిపొంతఁ బోఁడు, ప్ర
చ్ఛన్నవిరోధి మజ్జనని చాయలువాఱఁగ నేమి పల్కిన
న్మిన్నక పోవుఁగాని తరుణీ మదిఁ గ్రోధము లేదు శౌరికిన్.


వ.

మఱి విభావాదు లెట్టివనిన—


సీ.

పరఁగ శృంగారవిభావంబులందు నాలంబనోద్దీపనలక్షణములు
నాలంబనంబు నాయకనాయికాకృతి రససమవాయుకారణము దాన
ఘటకల్పనకు మృత్తికయుఁబోలె వెండి యుద్దీపనమ్మును నాల్గుతెఱఁగులందు
గురుతరాలంబనగుణము దా రూపయౌవనముఖ్యమై చేష్ట లనుపమాన

యౌవనోత్థభావహావాద్య లయ్యలం
కృతుల నూపురాది వితతభూష
లౌఁ దటస్థములు పికాదులు దండచ
క్రములగతి నిమిత్తకారణములు.


వ.

అం దాలంబన కుదాహరణము—


చ.

మెఱుఁగులపుంజ మీతరుణిమేను సుధాకరుకాంతిచేగ యీ
తెఱవశరీర మీయబలదేహము క్రొవ్విరితావిక్రోవి నా
నొఱపగు రుక్మిణీరమణి యుజ్జ్వలవాసవరత్నరాశియై
మెఱసిన గోపకృష్ణుఁడు సుమీ పొసఁగున్ హృదయేశ్వరుండుగాన్.


వ.

మఱి యుద్దీపనభావకములందు నాలంబనగుణంబున కుదాహరణము—


చ.

ఉదరకృశత్వముం బిఱుఁదునున్నతి[1]యుం జనుదోయిబేర్మియుం
బొదలిన నీలవేణియును బున్నమచందురుని నాదరించు న
వ్వదనముఁ గన్నుదోయిగరువంబును రుక్మిణి కింతయొప్పునే
మదనునితల్లి దా ననుట మానిని యౌవనమందె[2] తెల్పెడిన్.


వ.

ఉద్దీపనంబునందు శృంగారచేష్ట లన్నవి భావ, హావ, హేలా, మాధుర్య,
ధైర్య, లీలా, విలాస, విచ్ఛిత్తి, విభ్రమ, కిలికించిత, భావసూచక, కుట్ట
మిత, బిబ్బోక, లపిత, కుతూహల, చకిత, విహృత, హాసంబు లనం బదు
నెనిమిది యయ్యెం దత్స్వరూపోదాహరణంబు లెట్టి వనిన.


క.

మానితమైనరసాభి
జ్ఞానమునకు యోగ్య మగుట[3] ననుభావంబై
దాన నొకించుక గానఁగ
నైనవికాసంబుపేరు హావం బయ్యెన్.


భావహావములకు రెంటికి నుదాహరణము—


ఉ.

ఆలతి చేసి వల్లకి నఖాగ్రమునన్ శ్రుతిఁగూడ మీటుచున్
బాలకి నిర్విశంకగతి బాడెడు[4] బాల్యమునందు నీకథల్
మే లనవచ్చు నవ్వనిత మిండతయయ్యును బాడుచుండె సి
గ్గేల తనూలతం బులక లించుక యేల వహించెఁ గేశవా.


క.

భావమునందు సువ్యక్తం
బై విక్రియ దోఁప హేలయగు నాభరణా
భావమునందును నంచిత[5]
భావము మాధుర్య మనఁగఁ బ్రస్తుతికెక్కున్.


హేల కుదాహరణము—


చ.

ఇతరు లెఱుంగకుండఁ గమలేక్షణ నీహృదయంబులోన దాఁ
చితి మురవైరి నించుకయుఁ జెప్పవు చెప్పకయున్న మాను నీ

యతులతనూలతం బులక లంతట నిండఁగఁ బర్వి నీమనో
గతమున నున్నగోప్యము ప్రకాశముగా నిదె చాటిచెప్పెడిన్.


మాధుర్యంబున కుదాహరణము—


క.

గెలిచిరి ముజ్జగములు నీ
లలనలు కృష్ణస్వభావలావణ్యత నో
చెలి మఱియును గైసేయుట
పొలుపుగఁ దద్భూషణములు[6] భూషించుఁజుమీ.


క.

శీలము వదలమి[7] ధైర్యం
బాలోకింపంగఁ బ్రియుని యట్లం బ్రియయుం
బోలఁగ నాగతిచేష్టలు
చాలఁగ నొనరించెనేనిఁ జను లీలయనన్.


క.

కులసతులు మాట దప్పుటఁ
దలవంపుల నెల్లచో గదాధరుని గుణం
బుల న న్నెలయింపెడినో
చెలియా నేనింక నేమి సేయుదుఁ జెపుమా.


లీల కుదాహరణము—


క.

హరి యెం దరిగిన నరుగును
హరి యెయ్యెడనున్న నుండు హరి చేయుపనుల్
బరువడిఁ దానుం జేయును
హరికి నతివ తోడునీడ యైనది చెలియా.


క.

ప్రియశుభదర్శన మగుప్ర
క్రియపేరు విలాసమగు ధరిత్రిని విచ్ఛి
త్తియనంగాఁ బొల్పగు నా
రయ సర్వాభరణములకు రమ్యంబైనన్.


విలాసమున కుదాహరణము—


ఉ.

భామ ముకుందుఁ జూచె విలసద్బహులీలలు మేళవింపఁగాఁ
బ్రేమ రసోదస్ఫురణ పెల్లున నొక్కట సాత్వికంబు లు
ద్దామత నంకురించె విదితంబుగ నిట్టివిలాససంపదం
గాముని శిల్పచాతురి జగంబున సన్నుతికెక్కె నెంతయున్.


క.

పలుదొడవులు నాకేటికిఁ
బలుదొడవులు కృష్ణరచితభావజచిహ్నం
బు లనుతెఱంగునఁ గోమలి
పొలుపారెడుఁ గంటె కొంచెపుందొడవులతోన్.


క.

కడురయమునఁ దొడవులు వీ
డ్వడఁ దొడుగుట విభ్రమంబు భయమును బ్రియమున్
వెడగినుకయు మొదలుగఁ జొ
ప్పడునే గిలికించితంబు పతిఁ గవయునెడన్.


విభ్రమమున కుదాహరణము—


క.

తరుణి తను శౌరి రమ్మని
కరుణించుటఁ బ్రియసఖీముఖంబున విని ని
ర్భరసంభ్రమమునఁ దొడిగెం
గరముల నందియలుఁ గాళ్ళఁ గరవలయములున్.

కిలికించితమున కుదాహరణము—


క.

వనజముఖి కమరె బృందా
వనమున నేకతమ వల్లవప్రభుఁడు ప్రియం
బునఁ గొంగువట్టఁ[8] గంపిత
తనువున బొమముడియు గద్గదస్వరము నొగిన్.


క.

పతి దడవఁగ నుదయంబగు
సుతనూరుహసమితి భావసూచక మయ్యెన్
రతిసమ్మర్దమున నపరి
మితసౌఖ్యము కలిమి కుట్టమితఁ మనఁ బరఁగెన్.


భావసూచకమున కుదాహరణము—


క.

శౌరికథాశ్రవణసుధా
సారంబున నలరియును వ్రజశ్రీ యొప్పెన్
శారీరవంచనంబున
వారింపఁగనేర రవయవంబులఁ బులకల్.


కుట్టమితమున కుదాహరణము—


క.

కసమసతో హరి గవయుటఁ
గుసుమశరాంకములు సఖికి గొండించిన సి
గ్గెసగఁగ నమ్రానన యై
వసుధాతల మిందువదన వ్రాయుచు నుండెన్.


క.

వరునిప్రసంగమున ననా
దర మిది బిబ్బోక మనఁగ ధారుణి నెగడున్
భరితసుకుమారగాత్రాం
తరవిన్యాసంబుపేరు దా లలిత మగున్.


బిబ్బోకమున కుదాహరణము—


ఉ.

ఆతతసంపదాఢ్యుఁ డగునంతియకాదు వదాన్యుఁడౌ జగ
జ్జాతసముల్లసద్భరణశాలిభుజాపరిఘుండు నౌ కళా
స్ఫీతుఁడు నౌ మురారి యని చెప్పఁగనేల ప్రియోక్తు లల్పమా
దూతిక చాలుఁ జాలు[9] మరుతూపులు దాఁకినఁ దాఁకనీ తుదిన్.


లలితమున కుదాహరణము—


మ.

మొలనూ లున్నవరత్ననూపురముల్ మ్రోయం బదన్యాసలీ
లలు చేవీచినఁ గంగణక్వణనజాలం బొప్పు నుద్యన్మృదూ
క్తు లొనర్పన్ దరహాసచంద్రికలు నిక్కున్ గోపకృష్ణాంతికో
జ్జ్వలదాభీరవధూలలామల విభాస్వద్రూఢి యిం తొప్పునే.


క.

ఆపోవక ప్రియుఁ జూచెడి
చాపలము కుతూహలంబు శశిముఖి భీతిం
జూపులు పచరింపఁ గడుం[10]
జూపట్టుట చకిత మనఁగ సొంపు సెలంగెన్.


కుతూహలమున కుదాహరణము—


క.

హరి గరుడారూఢుండై
యరుదేరఁగఁ జూచుటకు రయంబున సతు లె
క్కిరి హర్మ్యములు విమాన
స్ఫురితసురాంగనలతోడఁ బురణించుగతిన్.

చకితమున కుదాహరణము—


చ.

ఎఱుఁగకయుండి యొండెఁ జెలి యేమియుఁ జెప్పక యొండె బిట్టు డ
గ్గఱినఁదలంకి చూచు సతికన్నుల విప్పును భ్రూవిలాసమున్
దరము మనోజవిభ్రమవిధంబును నిం పొనరించుశౌరి దా
మఱియును నవ్విలాస మొకమాటు గనుంగొనఁ గోరు వేఁడుకన్.


క.

మును ప్రాణేశ్వరుఁ గూడుట
యొనరఁగ సిగ్గువడి చెప్పకుండుట విహృతం
బనఁ జను నెలప్రాయంబున
ననువగు మధురస్మితంబు హాసం బయ్యెన్.


విహృతమున కుదాహరణము—


క.

గిరితటమునఁ గలవఁట సో
హరినఖమౌక్తికము లనిన నది యేల పయో
ధరతటము మూసికొనుచుం
దరుణీ లజ్జింప నింతదానవె చెపుమా.


హాసమున కుదాహరణము—


క.

అసదృశయౌవనగుణమున
హసించు నెంతెంత మధుర మగునట్లగఁ బ్రే
యసి యంతంతయుఁ బొదలుం
గుసుమశరునిజయము నమ్ముకుందునిప్రియమున్.


క.

అగు నీపదునెనిమిదియును
మొగి నుద్దీపనవిభావములఁబో విదితం
బగు నాలంబనచేష్టలు
జగదేకాలంబనప్రశస్తశరీరా.


మఱియు నుద్దీపనాలంకృతి—


సీ.

మట్టెలమ్రోఁతలు మణినూపురారావములకిశోరంబు లై ముద్దుఁ జూప
నంగుళీయకరోచు లంగదాదికరుచిశ్రేణి నెదుర్కొని చెలిమిసేయ
రత్నచేలాచలప్రభలు మౌక్తికహారలతలతోఁ గలసి మేలంబులాడ
బవిరల తళుకులు పద్మరాగోజ్జ్వలతాటంకరుచులకు సాటికెక్కఁ
దొడఁగి భూషణలక్ష్ములు తోడుసూపు
కరణిఁ జనుదెంచి రధికశృంగార మమరఁ
బౌరకాంతలు కౌస్తుభాభరణలలితు
మణికిరీటకుండలుఁ గంసమర్దిఁ జూడ.


ఉద్దీపనస్థలంబు లెట్టి వనిన—


చ.

పికములుఁ గీరశారికలు భృంగతతుల్ మృదువాయువు ల్వలా
హకనినదంబుఁ జంద్రనుదయంబు వనంబును దీర్ఘికల్ హిమో
దకము సుగంధవస్తువులుఁ దమ్ములము [11]ల్వరగేహమున్ ఋతు
ప్రకరము దూతికోక్తియు విపంచియు నాది యగుం దటస్థముల్.

అందు ఋతువులు—


సీ.

నిసికంటె మేలు మానిసి గానరాదు మంచునఁ గృష్ణుపాలికిఁ జనఁగఁగలరు
చలి విచ్చునందాఁక సైరించు మని శౌరి నిండుఁగౌఁగిటఁ దడ వుండఁగలరు
పువ్వులనెపమున మవ్వంపుఁదోఁటలఁ బలుమాఱు హరిఁ గూడి మెలఁగఁగలరు
వివ్వలి ఘనమంచు వెన్నునితోఁ దీఁగెచప్పరంబులఁ బ్రొద్దు జరపఁగలరు
చదల నుఱిమిన గోవిందుఁ బొదలఁగలరు
జలవిహారంబు చక్రితోఁ జలుపఁగలరు
నాఱుఋతువులయందు సౌఖ్యాంతరముల
గోపికలభాగ్య మెట్టిదొకో తలంప.


క.

ఘనతరముగ నిటు వివరిం
చిన వెల్ల విభావగతుల చేసన్నలు నాఁ
గనుసన్నలు మొదలైనవి
యనుభావము కార్యభాగ మది యె ట్లన్నన్.


ఉ.

సన్నపు[12]నవ్వు బాలశశిచంద్రిక నవ్వఁ గటాక్షదీధితుల్
తిన్ననిక్రొమ్మెఱుంగులకు దీకొన నెయ్యపుబోటిఁ బిల్చు చే
సన్నలు మావికెంజిగురుచందము క్రిందుపడంగఁ జేయు నీ
కన్నియ వెన్నునిం గవయుకాక్షఁ జుమీ వలరాజు నోమెడిన్.


క.

ఊహింపఁగ ననుభావో
దాహరణం బిద్ది; యింకఁ దగ సాత్వికసం
దోహము లక్షణములును ను
దాహరణముఁ జేసి తెలుపఁదగు నెట్లనినన్.


వ.

అపగతం బగు సుఖదుఃఖభావనం జేసి భావింపంబడు నంతఃకరణత్వంబు
సత్వంబు, తత్సంభవంబులై సాత్వికంబు లనంగా స్తంభప్రళయరోమాం
చస్వేదవైవర్ణ్యకంపాశువైస్వర్యంబు లెనిమిది యయ్యె, నందు—


క.

తలకొనిన రాగభీత్యా
దులకతమునఁ జేష్టలెల్లఁ దొలఁగి శిలాదా
రులఁ జేసిన యట్లుండినఁ
గలితస్తంభాఖ్యసాత్వికం బై నెగడున్.


స్తంభమున కుదాహరణము—


క.

ఒడ్డారపుఁబట్టి కడు
న్వెడ్డరి యగుశౌరిఁ జూచి వెఱవడి యిదె శ్రీ
బిడ్డఁడు తనబాణంబుల
కొడ్డినగుఱిపోలెఁ గదనకున్నది కంటే.


క.

రూఢిగ సుఖదుఃఖాదుల
గాఢేంద్రియమూర్ఛనంబు గదిరిన నది దాఁ
బ్రౌఢకవీంద్రులచేతను
గూఢతఁ బ్రళయ మను సత్వగుణమై పరఁగున్.


ప్రళయమున కుదాహరణము—


క.

శ్రీనిధిఘనలావణ్యప
యోనిధిలో మునుఁగఁబోలు నుల్ల మబలకున్
వీనులఁ గన్నుల వినదుం
గాన దనం జెలుల కెల్లఁ గడు నెరవయ్యెన్.

క.

ఖ్యాతసుఖాదులవలనఁ బ్ర
జాతం బగురోమవితతి సరభసముగఁ బ్ర
ద్యోతించిన నది విద్యా
[13]న్వీతులు రోమాంచ మని గణింతురు ప్రీతిన్.


.శ్రమరతిఘర్మాదులచే
విమలశరీరములయందు విస్ఫుట మగు న
చ్చెమటకు నభిదానము స్వే
దముగాఁ బల్కుదురు సమ్మదమున నభిజ్ఞుల్.


రోమాంచస్వేదంబుల కుదాహరణము—


క.

మనసున హరి నాలింగన
మొనరింపఁగఁ బోలుఁ బులక లొదవె నతివకుం
జననీక యతివఁ గైకొని
పెనఁగుటఁ గాఁబోలు ఘర్మబిందువు లెసఁగెన్.


క.

మదరోషవిషాదాదుల
నుదయించిని పాండురత్వ మొగిఁ బ్రస్ఫుట మై
వదనమునఁ దేటపడునే
నది వైవర్ణ్యంబుపేర నలవడి యుండున్.


క.

మోదమున నేని రోషభ
యాదుల నేనియును గంప మధికంబగుఁ దా
నేదేహిదేహమున నది
[14]మేదిని వేపథు వనంగ మెఱయుచునుండున్.


వైవర్ణ్యవేపథులు రెంటికి నుదాహరణము—


క.

శ్యామసమంచితమేఘ
శ్యాముని దలఁపంగ నేమిచందమొకో నె
మ్మోము గడు వెల్లనయ్యెను
గాముఁడు జంకింపకున్నెఁ గంపము గదిరెన్.


క.

సంతోషరోషదుఃఖా
క్రాంతస్వాంతులకుఁ బొడము కన్నుల నీళ్ళుల్
చింతింప నశ్రులని వ
ర్ణింతురు భావవిదు లగుమనీషులు కృతులన్.


క.

ఆనందాదులవలనం
గానంగా నైనయట్టి గద్గదభాషి
త్వానూనత వైస్వర్యా
ఖ్యానంబున నుల్లసిల్లు నాగమసరణిన్.


అశ్రువైస్వర్యంబులు రెంటికి నుదాహరణము—


క.

ఎం దరిగితి కృష్ణుఁడ నా
[15]డెందము గరుపొడిచి తన్ను డీకొనునశ్రుల్
డిందించుకొనుచుఁ బలుకఁగఁ
గందర్పుఁడె తెలు దానిగద్గదభాషల్.


క.

ప్రణుతము లగుసాత్వికల
క్షణముల నిటుచెప్పి యింక సంచారికల
క్షణములు ముప్పదిమూఁడును
గణుతించి సలక్షణముగా నొనరింతున్.


వ.

అవి యెయ్యవి యనిన నిర్వేదగ్లాని శంకాసూయా మదశ్రమాలస్యదైన్య
చింతామోహస్మృతిధృతి వ్రీడాచపలతాహర్షావేగజడతాగర్వవిషా
దౌత్సుఖ్య నిద్రాపస్మారసుప్తిప్రబోధామర్షావహిత్థోగ్రతా మతివ్యాధ్యు
న్మాదచరమత్రాసవితర్కంబులు ముప్పదిమూఁడును సంచారికాభావములు.

క.

శోకాసూయాతత్త్వవి
వేకాదుల నన్యరుచులు విడుచుట నిర్వే
దాకృతి దానఁ గలుగు బా
ష్పాకులతాదైన్యచింత లాదిగఁ దఱితోన్.


నిర్వేదమున కుదాహరణము—


ఉ.

చందనచర్చ లేల విలసద్ఘనసారలవంబు లోలొకో
యెందును లేనిచల్లఁదన మీక్షణరోచులఁ గల్గువాని నా
నంద మెలర్ప సర్వభువనంబులునుం గుణసౌరభంబు పెం
పొందఁగఁ జేయువానిఁ గమలోదరుఁ దోకొని రావె నెచ్చెలీ.


క.

గ్లాని యనఁగ రతికారణ
మైన సొలపుపేరు వెండి యాత్మారిష్టం
బైనపనిఁదలఁచి యది యె
ట్లౌనో యని తలఁకుచుండు నది శంక యగున్.


గ్లాని కుదాహరణము—


క.

లోకత్రయము వహించిన
యాకృష్ణుని మోచితిం గుచాగ్రంబున నా
ళీకముఖి సాహసంబున
నా కీయలయికకుఁ గారణము మఱి గలదే.


క.

ఒరు లెఱుఁగకుండ నంతః
కరణంబును శౌరితోడుగడ చేసితి నేఁ
బరిచయము నిబిడపులకో
త్కరము బయలువఱుపునో కద ననుఁ బ్రజకున్.


క.

ఇతరోత్కర్ష సహింపమి
సతతంబు నసూయ మోదసమ్మోదములం
గృతమదిరాపానాదుల
నతిశయముగ నుద్భవించు నదె మద మయ్యెన్.


అసూయ కుదాహరణము—


క.

సదమల రూపగుణంబున
నది దా నాకంటె నెక్కుడా చూడఁగ నే
మిదపంబుననొకొ వెన్నుఁడు
వదలక చేపట్టె జాంబవంతునికూఁతున్


మదమున కుదాహరణము—


క.

పలుమఱుఁ బ్రస్ఖలితోక్తులు
పలుకుచు నెలుఁగెత్తి నగుచుఁ బటురక్తిమఁ గ
న్నులు దేఱఁగ సోలెడిఁ దొ
య్యలి హరిపరిరంభచింతామృతమదమే.


క.

ఉపరిసురతాదిఖేదం
బపరిమితస్వేదకారి యది శ్రమ మగు న
చ్చపుసోమరి యై కర్త
వ్యపుఁబనులకు నైనఁ జొరమి యాలస్య మగున్.


శ్రమమున కుదాహరణము—


క.

మరుజనకుఁడు నీయింటికి
నరుదేరఁగ నేల చెలఁగి యట్టును నిట్టం
దిరగెదు ఘర్మాంబుకణో
త్కరమున మైపూఁత గరఁగి దస్సితి చెలియా.


ఆలస్యమున కుదాహరణము—


క.

వరగృహభార మటుండెను
శరీరపోషణము చేయఁజాలదు కంటే
తరుణీమణి హరియొద్దను
మఱి బలిమిని జేయు తత్సమాగమలీలన్.

క.

చేవ చెడి తనవిరోధిం
దా వేఁడుట దైన్య మండ్రు తనకు నభీష్టం
బేవంక వచ్చునో యని
యావేదనఁ బొరలుచుండు టది చింత యగున్.


దైన్యమున కుదాహరణము—


క.

మత్పతిఁ గృష్ణుని బిలువఁగ
నుత్పలనయన చని తడసె నోమన్మథ నేఁ
డుత్పలబంధునితీవ్రస
ముత్పతనము మాన్పుమయ్య మ్రొక్కెద నీకున్.


చింత కుదాహరణము—


క.

గురుజనములు చేరినఁ జె
చ్చెరఁ జూడదు పలుక దెంత చీరిన నభ్యం
తరయుతుఁ డగుపురుషోత్తము
కరుణ వడయు పనికి నతివ గతి యూహించున్.


క.

భీతిని దుఃఖావేశత
నాతత మగు చింతనముల నగుమూర్ఛకుఁ బే
రై తనరు మోహ మనునది
భూతవిషయమైన యెఱుకపో స్మృతి యనఁగాన్.


మోహమున కుదాహరణము—


చ.

ప్రకటమనోభవాతపనిరంతరదీర్ఘదివంబు లెట్టకే
లకుఁ గడతేర్చి దూతిఁ దగులాగునఁ బిల్వఁగఁ బంచి యొక్కగో
పిక యభిరామవేషమునఁ బ్రీతి నలంకృతిచేసి కృష్ణుఁ డిం
చుక వడి రాకయున్నయెడ సోమకరావళి దాఁకి మూర్ఛిలున్.


స్మృతి కుదాహరణము—


క.

ఉరమునఁ బాయకయున్నది
సిరి దా మున్నేమి తపము చేసెనొ జలజో
దరుమే నించుక సోఁకినఁ
బరితోషము మేను నిండి పాయదు నాకున్.


క.

ధృతియగు సంజ్ఞానాభీ
ప్సితసిద్ధుల నితరవాంఛ శిధిల మగుట స
న్నుతుల మనోరాగాదుల
మతి సంకోచనము కలిమి మఱి వ్రీడయగున్.


ధృతి కుదాహరణము—


క.

నీవల్లభుఁ డరయఁగ ల
క్ష్మీవల్లభుఁ డమ్మ మేలు మేలు లతాంగీ
నీవు కృతకృత్యురాలవు
పో వీక్షించెద వసారముగ జగ మెల్లన్.


వ్రీడ కుదాహరణము—


క.

వాడల వాడల వనితలు
వేడుకపడి చూడవచ్చి విలసితపింఛా
చూడునిఁ గృష్ణుని జూడఁగఁ
దోడనె నయనములు గప్పెఁ దొంగలిఱెప్పల్.


క.

ఘనమగు రాగద్వేషా
ద్యనవస్థానంబు చపలకాఖ్యము హర్షం
బన నొప్పు నుత్సవాదులఁ
జను ఘర్మజలాదికృత్యసక్తిఁ దలంపన్.

చపలత కుదాహరణము—


క.

నారి హరిఁ జూచె మృదుహా
హారూఢతఁ దరలదృగ్విహారము లెసఁగన్
హారములు ముట్టి చూచుచు
సారెకుఁ గర్ణోత్పలంబు చక్కఁగఁ జేయున్.


హర్షమున కుదాహరణము—


చ.

సరసులఁ బద్మకుట్మలమిషంబునఁ జేసిన తొంటినీతప
శ్చరణఫలంబ యిప్పుడు కుచద్వయమా యివె పూను మన్మనో
హరుఁ డగుకృష్ణుఁ డిచ్చిన నిరంతరకల్పలతాప్రసూనసుం
దరవనమాలికామృగమదద్విగుణీకృతగంధబంధుతన్.

ఆవేగజడతలు

క.

క్రమమున నిష్టానిష్టా
గమచేతస్సంభ్రమమ్ముఁ గనుఁగొన నావే
గము మఱి యిష్టానిష్టా
గమనాప్రణిపత్తినామకము జడత యగున్.


ఆవేగమున కుదాహరణము—


చ.

అడరఁగ గోపకృష్ణుని విహారమహోత్సవభేరి మ్రోయఁగాఁ
బడఁతులు చూడ వేడ్కపడి భాసురరత్నవిభూషణాఢ్యము
ల్వెడవెడ సంతరించుచును వీడ్వడఁ బూనుచు సంభ్రమింపుచు
న్వడిఁ జనుదెంచి యెక్కిరి సువర్ణమయోన్నతసౌధశృంగముల్.


జడత కుదాహరణము—


క.

పటుగతిఁ గృష్ణుఁడు తనముం
గిటికిం జనుదేరఁ గని సఖీజనులకు ముం
దట నుపచార మొనర్పదు
నటు గదలదు గదలకుండ దతివ ముదమునన్.

గర్వవిషాదములు

క.

అవిరళమదమున కన్యుల
కవమానముసేఁతవలన నాత్మోత్కర్ష
వ్యవసాయత గర్వ ముపా
యవిహీనత్వము విషాద మగుఁ జింతింపన్.


గర్వమున కుదాహరణము—


క.

పెరుఁగుచు నఱుగుచు నుండును
హరిణాంకుఁడు కాలిగోర నైనను బోలం
డరయఁగ నావదనమునకు
సరి యె ట్లగు నంచు నొకవ్రజస్త్రీ పలుకున్.


విషాదమున కుదాహరణము—


క.

ఓరమణి నన్ను విడిచి ము
రారిఁ దగిలె మనసు నేనె యనుపఁగఁ జనియెన్
మారుఁడు నన్ను విడిచిపోఁ
డేరూపున నైన నింక నెయ్యది తెఱఁగే.

ఔత్సుక్యనిద్రలు

క.

కడువేడుక పడి మనమునఁ
దడ వోర్వమి యుత్సుకత్వదశ ప్రియుఁ గలలోఁ
బొగడను చింత నిమీలన
మడరఁగ నిద్ర యనుపేర నభినుతి నొందున్.


ఔత్సుక్యమున కుదాహరణము—


క.

ఎలమిఁ గైచేసి గోపిక
లలరన్ హరిఁ జూచువేడ్క లంతంతకు నొ
త్తిల నెట్టకేల కోర్చిరి
నలినాక్షాగమవిలంబనము హృదయములన్.


నిద్ర కుదాహరణము—


క.

ఒడికం బగు హరిఁ గలలోఁ
బొడగని యుపగూహనేచ్ఛఁ బొరయుటఁజుండీ
వెడమొగిచినకన్నులతోఁ
బడఁతి బయల్పొదువఁ దొడఁగెఁ బాణిపుటములన్.

అపస్మారసుప్తులు

క.

భావింప మోహదుఃఖా
ద్యావేశము తాపకారి యగుచు నపస్మా
రావహ మగు నేమిటనుం
బోవని సుఖనిద్రపేరు భువి సుప్తి యగున్.


అపస్మారమున కుదాహరణము—


చ.

అలఘుతరోగ్రవక్త్రుఁ డగు నంగభవుం గలలోనఁ గాంచి తొ
య్యలి తనుఁ గావు కావు మను నస్ఫుటవాక్యము లుగ్గడింపుచుం
బిలుచుఁ బికద్విరేభములఁ బిల్వదు చేరువ నున్న బోటులం
దలరుచి లేచి త్రిమ్మరు గదాధర కైకొనఁ బంత మిత్తఱిన్.


సుప్తి కుదాహరణము—


క.

నలినోదరు మృదులాంకము
తలగడగా నిద్రనొంది తరుణి ప్రభాతం
బొలసిన సుఖపరవశతం
దెలియ దతఁడు మేను సఱచి తెలుపుచునుండున్.

ప్రబోధామర్షములు

క.

తెలిసి కనువిచ్చి గొబ్బున
నలవడఁ జూచుట ప్రబోధ మది మఱి యపరా
ధులయెడఁ జూచుచుఁ బైకొను
నలుక యమర్ష మని తెలియుఁ డది భావజ్ఞుల్.


ప్రబోధమున కుదాహరణము—


క.

నిద్రాసమయంబున బల
భద్రావరజుండు పాణిపంకజముల ను
ద్యద్రాజవదనకుచములు
ముద్రించినఁ దెఱచె నేత్రములు సంప్రీతిన్.


అమర్షమున కుదాహరణము—


క.

భానుఁ డపరగిరి దాఁటిన
మీనాంకుఁడు గోపసతులమీఁద నమర్షా
నూనమతి నిక్షుచాపము
తా నందె ముకుందుఁ డచటఁ దడయుట తగు(నే).

అవహిత్థోగ్రతలు

క.

పొడమి నహర్షాదులయెడ
నడఁకువ దెచ్చికొని యుండు టవహిత్థ మగున్
వడిఁ బ్రతిపక్షుల బొడ గని
యొడఁగూడిన చండభావ ముగ్రత యయ్యెన్.


అవహిత్థ కుదాహరణము—


క.

తరుణులు గోష్ఠివశంబున
హరిగుణములు చెప్ప నవనతానన యై తాఁ
జరణాంగుష్ఠంబును గొని
వరవర్ణిని భూతలంబు వ్రాయుచునుండెన్.


ఉగ్రత కుదాహరణము—


క.

ఆచెలువకటాక్షోల్కా
గోచరమై మిగులఁ గందెఁ గుముదాస్తునిచే
నీచెలువకుఁ దాపప్రశ
మోచితముగఁ గూర్పుమా పయోరుహనాభున్.

మతివ్యాధులు

క.

దీనికి నిది యర్థం బని
కానుపు దత్పరత చేష్ట గలుగుట మతి యెం
దేని నొక రోగమున నవ
మానంబునఁ బొడము దత్క్రమము వ్యాధి యగున్.


మతి కుదాహరణము—


క.

నాతీ సంశయ మేల మ
హీతలమునఁ జంద్రుఁ డగు నుపేంద్రుఁడు వినుమా
యాతనికరములు సోఁకిన
వ్రేతలు శశికాంతమణులవిధమై యునికిన్.


వ్యాధి కుదాహరణము—


క.

తరుణి హరిఁ బాసి[16] డెందం
బెరియఁగ శశికాంతసౌధ మెక్కిన నచటం
దరుణదళవ్యజనముఁ గ
ప్పురమును బూఁబాన్పుఁ గావిపుట్టము వలసెన్.

ఉన్మాదచరమములు

క.

ఇది చేతనం బచేతన
మిది యని వివరింపలేని దిల నున్మాదం
బదయతఁ బరమార్థోచిత
సదుపాయముఁ దలఁచెనేని చరమాఖ్య యగున్.


ఉన్మాదమున కుదాహరణము—


క.

బృందావనమున కొకవని
తం దోకొని కృష్ణుఁ డరుగఁ దక్కినవనితల్
కందర్పవికృతి నడుగుదు
రందలి తరువులను లతల నాతనిత్రోవల్.


చరమమున కుదాహరణము—


క.

మురరిపుఁ డరుదేరని తన
శరీర మేటి కని యొకవ్రజస్త్రీ గోరు
బరిపూర్ణచంద్రుపొడుపును
సురభిసమీరాగమంబుఁ జూతాంకురమున్.

త్రాసవితర్కంబులు

క.

ఏమఱుపాటునఁ జిత్తము
తా మిగులం జెదరెనేని త్రాసం బయ్యెన్
వేమఱు బహుసంశయములఁ
దా మదిఁ దలఁపోయునది వితర్కం బయ్యెన్.


త్రాసమున కుదాహరణము—


క.

ఒకగోపిక లక్ష్మీనా
యకుతోఁ బొలయలుకనుండ నద నెఱిఁగిన య
ట్టొకయుఱు మప్పుడ యుఱిమినఁ
జకితహృదయ యగుచు నతనిఁ జయ్యనఁ బొదివెన్.


వితర్కమున కుదాహరణము—


ఉ.

అక్కట నామనం బతనియందు దృఢంబుగ నిల్పి వెండి యొం
డెక్కడనేనియు న్సొగయ దించుకసేపును నాజనార్దనుం
డెక్కడ నామనోరథము లెక్కడ యెక్కటి కెక్కడంచు నే
దిక్కును జేరలేక సుదతీమణి దాఁ దలపోయు నాత్మలోన్.


క.

పాటించి యొనర్చితి నీ
పాటిఁ ద్రయస్త్రింశదుదితభావార్థంబుల్
తేటపడఁ ద్రయస్త్రింశ
త్కోటిదివిజసేవ్యమానకోమలపాదా.


క.

ప్రకటముగాఁ రత్యాది
ప్రకరణ మది యింక నవులఁ బ్రణుతి పనగున్
సుకవు లలర శృంగార
ప్రకరణమును నాయకోత్కరప్రకరణమున్.


క.

నవనీతరసవిలోలుఁడు
భవనీరధితరణకరణపరిణతుఁడు సుధా
ర్ణవతల్పుఁ డనంతుఁడు మా
ధ్రువపురిమందిరుఁడు వ్రజవధూవరుఁ డుర్విన్.

గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ సుకవిజన
విధేయ అనంతనామధేయ ప్రణీతం బైన రసాభరణంబునందు
రతిగుణర్రకప్షంబును సజాతీయవిజాతీయనిర్దేశంబును
విభావానుభావసాత్వికభావసంచారికభావంబుల
లక్షణంబులును రత్యాదిప్రకరణము
నన్నది ద్వితీయాశ్వాసము.

  1. బిఱిఁదియున్నతి
  2. యౌవనమందుఁ
  3. కయోగ్యమనుట
  4. బాడుడు
  5. నుదంచిత
  6. ననుభూషణములు
  7. వదలిన
  8. గొంగుముట్ట
  9. చాలుఁదోలు
  10. జూపులు చలింపఁగాఁ గడుఁ
  11. ల్వరగేహమం బురుట్ప్రకరము
  12. నవ్వుచాలు శశి
  13. స్ఫీతులు రోమాంచ మని రచింతురు
  14. మేదినిపైఁ గంప మనఁగ
  15. డెందము గురుపొడిచి తన్నెదుర్కొనునశ్రుల్
  16. హరిబాళి