మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/సోలను

సోలను

సోలను మంచివంశములోఁ బుట్టినవాడు. . అతని తండ్రి ధర్మాత్ముఁడు; గొప్ప దాత. అతని మాతృవంశమువారు గూడ గొప్పవారనియే తెలియుచున్నది. దేహియని వచ్చిన వానిని లేదనిచెప్పి తండ్రి పొమ్మనలేదు. అందుచేత నతనికి పిత్రార్జితము విశేషముగ లేదు. బ్రతికిచెడినవాఁడు గనుక, పూర్వము తమవలన నుపకారముఁ బొందినవారి సంరక్షణలో నుండుట కష్ట మని యెంచి, యతఁడు పరదేశమునకుఁ బోయి, వర్తకవ్యాపారములలోఁ దిగెను. దేశసంచారముఁ జేసి, మన స్సంస్కారము నతఁడు బొందెను. "వయస్సు ముదిరినకొలఁది నా బుద్ధి వికసించుచుండె”నని యతఁడు చెప్పెను.

ఆ కాలమున నేవ్యాపారమును ప్రజలు క్షూణతగఁ జూచుటలేదు; వానిలో వర్తకవ్యాపారమును విశేషము మన్నించిరి. వర్తకమూలముననేకదా, పరదేశీయులతో సాంగత్యము, వారితో నిచ్చిపుచ్చుకొనుట, రాకపోకలు జరుగుచుండును? దేశీయులకు లావణ్యము, నడవడిలో సరళత - నాగరికము దేనిమూలమున వచ్చును? ఎందఱు వర్తకులు శంకుస్థాపనఁజేసి, వారి పేరున పట్టణములు గట్టించిరి! సోలను మంచిభోగి, దేశాటనము జేసి కష్టపడినందున , నతఁడు మహావైభవముతో సుఖముల ననుభవించెను. అనేక దేశములు చూచినందున, భోగమునకు గావలసిన వస్తువుల నా యా దేశములనుండి యతఁడు దెప్పించుచుండెను. అతఁడు కొంచెము కవిత్వము చెప్పగలఁడు. విరమించుకాలములో నతఁడు సరసముగ నీతిబోధకములైన చరణముల - నల్లుచుండెను; వానిలో రాజనీతులను బొందుపఱుచుచుండెను.

అతఁడు 'అథీనియనుఁడు'. 'ఆథెన్సు' పట్టణములో 'ఆర్కను' యను పెద్దయుద్యోగముఁ జేసెను. అక్కడి ప్రజల క్షేమమున కనేక శాసనములను నియమించినందున, నతఁడు ధర్మశాస్త్రవేత్తయనేగాక, ధర్మశాసనుఁడనికూడఁ బేరొందెను. "ఈ నా శాసనములప్రకార మథీనియనులు నడచుకొనిన వారికి శ్రేయస్సు గలుగు"నని యతఁడు హితోపదేశముఁ జేసెను.

ఒకనాఁడతఁడు స్నేహితుఁడైన 'థాలీసు'తోఁ గలిసి భోజనము జేయుచుండెను. అప్పుడు స్నేహితునిజూచి "నీ వెందుచేత వివాహము చేసికొన లే"దని యతఁ డడిగెను. అందుకు స్నేహితుఁడు జవాబు చెప్పక యూరకుండెను. తరువాత నొక పరిచారకునికి కొన్ని సంగతులు బోధించి, 'థాలీసు' వానిని సోలనువద్దకుఁ బంపెను, స్నేహితు లిరువురు కలిసి సంభాషించుచుండ, బరిచారకుఁడు వచ్చి “నేను ఆథెన్సుపట్టణమునుండి వచ్చి పదిరోజు లయినది” యని యజమానునితోఁ జెప్పెను. "ఆ పట్టణములోని విశేషము లేమి?" యని సోల నడిగెను. "ఒక గొప్పవాని కుమారుఁడు చనిపోయెను." "ఎవని కుమారుఁడు?" "జ్ఞాపకము లేదు.” "సోలనుని కుమారుఁడా యేమి?“ "అవును. అవును.” ఆ మాట విని యతఁడు నెత్తి నోరు గొట్టుకొని యేడ్వసాగెను. “నీవంటి మహాత్ముఁడె మనోధైర్యము లేక బాధపడినపుడు, నావంటి దీనులమాటఁ జెప్పనేల? అందుచేత, నేను వివాహమాడలేదు. పరిచారకుని మాటలు సత్యము కావు. నీ కుమారుఁడు చనిపోలే"దని థాలీసు నమ్రతతో జవాబు చెప్పెను.

“సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం." అనునటుల సుఖదుఃఖములు మారుచుండును. విషయభోగముల ననుభవించుటచేత మనస్సునకు గలుగు తుష్టియే సుఖముకాదు. మనోవ్యాపారముల నరికట్టి నిర్మలముగ నుండుటయే సుఖము. సుఖమునకు తగినంత దుఃఖ మున్నది. యతికి బ్రతి యుండనేయున్నది. అటు లని లౌకికవ్యాపారములను మనము మానివేయఁగలమా? లోకములో నున్నంతవఱకు, పులుసు కారము మొదలగువానిని దినుచున్నంతవఱుకు మన మే వ్యాపారమును మానలేము. ధూమశకటముమీఁది ప్రయాణము ప్రమాదమే. అటులనే, పొగయోడ. వీనిమీఁద ప్రయాణముచేయుట మానివేయఁగలమా? తూచినటుల, ద్వం ద్వము లన్నియు నడచుచుండును. పిచ్చివాఁడు గనుక, అతఁడు వివాహ మాడలేదు.

అథీనియనులు 'మగారాసెనియనుల'తోఁ బోరాడి వారిని జయించలేక విసిగిపోయిరి. వారితో యుద్ధముఁ జేయ వలసిన దని యెవరైనతమతోఁ జెప్పిన, వారు వానిని దండించుచుండిరి. ఆ సంగతి సోలను తెలిసికొని, వారికి బుద్ధిఁజెప్పవలె నని యెంచి, వెఱ్ఱి వానివలె నటించెను. మార్కట్టునకుఁ బోయి, యక్కడ వెఱ్ఱిచేష్టలు చేయుచు, శత్రువులను జయింఛలేక పోయినందున, నతఁడు 'అథీనియను'లను దూషించెను. వారందఱు తెలివిదెచ్చుకొని శత్రువులపైకి దండెత్తిపోయి, వారిని జయించిరి.

అనంతరము నగరములో రాజ్యాంగములు బాగుగ జరుగుట లేదు. ప్రజలు క్షోభపడుచుండిరి. రాజ్యసూత్రములను ధరించినవా రాత్మపోషణకు ధనమును స్వీకరించుటయే గాని, మనుజుల కష్టములను నివారించుటలేదు. వ్యవహారములు మాటుమణిగెను. వానిని ఋజుమార్గములోఁ బెట్టవలసినదని వా రతనిని వేఁడిరి; 'ఆర్కను' యుద్యోగమిచ్చిరి. కొందఱు ప్రజారాజ్యమున కియ్యకొనిరి; కొందఱు సామంతుల ప్రభుత్వము మంచిదనిరి; మఱికొంద ఱీ రెండు ప్రభుత్వములను సమ్మేళనఁ జేసిన బాగుగనుండు నని యెంచిరి. అన్ని సంగతులను నెమ్మదిగ వితర్కించి, యతఁడు రాజ్యాంగములను మార్చి వేసెను. పురాతనముగ వచ్చుచున్నవానిలో మంచివాని నన్నియు నతఁడు నిలవఁ బెట్టెను; కొన్ని యశేషముగ మార్చి వేసెను; మిగిలిన వానిని సవరణఁజేసెను.

ఋణములను గొట్టివేసినందుకు సామంతు లతనిని దూషించిరి; భూములను సమముగ పంచనందుకు బీదవారు నిందించిరి. లైకర్గసు చేసినప్రకార మతఁడు చేయనందున కతనిని ప్రజలు గర్హించిరి. లైకర్గసు ధనవంతుఁడు; పలుకుబడికలవాఁడు; సమర్థుఁడు; అతఁడు చెప్పిన ప్రకారము చేయుటకు ప్రజలు సమ్మతించిరి. సోలను సంసారి; విశేషము పలుకుబడి లేనివాఁడు; అందుచేత నతఁడు వానివలె నేపనిచేయుటకు వీలులేకపోయెను. అందులో దేశకాలములను జూడవలెను. స్పార్టనులకు సరిపడిన రాజ్యాంగములు, అథీనియనులకు సరిపడు నని యెటులఁ జెప్పవచ్చును? కాఁబట్టి వారి శక్తికిఁ దన శక్తికిఁ దగినటుల రాజ్యంగముల నతఁడు సవరణఁ జేసెను; 'ఆర్యులసభ' నొకటి స్థాపించెను. -

అతఁడు వివాహములవిషయమై కొన్ని పద్ధతుల నేర్పఱచెను. స్త్రీలకు సారెచీర లిచ్చుటలేదు. “ధనము గలిగి యున్నదనియా, లేక గుణవంతురాలనియా, యామెను పురుషుఁడు వివాహమాడు.”నని యతఁడు చెప్పుచుండెను. ఎన్నడు నెవరును మృతినొందినవారిని దూషించకూడ దను నిబంధన కలదు. వారిని నిందించిన, వా రేమి వినవచ్చిరా? అందుకుఁ దగిన సమాధానము జెప్పఁగలరా? అటులనె, బ్రతికి యున్నవా రొకరి నొకరు సభలలోను, దేవాలయములలోను, క్రీడలలోను, న్యాయసభలలోను నిందించుకొనరాదు. ఇంతకు పూర్వము వారు మరణశాసనము వ్రాసి వారి యాస్తులను పంచిపెట్టుట కధికారము లేదు; అతఁడు వారి కధికారము కలుగఁజేసెను. స్థిరాస్తిని వారు బంధువుల కియ్యవచ్చును; సంతానము లేనపుడు స్నేహితులకుఁ గొంత యిచ్చుట గలదు. ఇష్టానుసారము వారు మరణ శాసనమును వ్రాయఁగూడదు. ప్రయాణమైపోవునపుడు, కష్టములు వచ్చినపుడు, బలు లిచ్చు నపుడు, స్త్రీ లెటుల ప్రవర్తింపవలయునో-వీనికి గొన్ని నిబంధనల నతఁ డేర్పాటుచేసెను. వారు ప్రయాణమై పోవునపుడు, బండికిముందు దివిటీ లుంచుకొనవలెను.

ఆథెన్సుపట్టణములోఁ బ్రాణధనములకు స్వాస్థ్యముండెను. అందుచేతనే, దేశ దేశములనుండి ప్రజలు వచ్చి, యక్కడ గాపురముండిరి. అయినను, భూములు సాగుబడి అగుటలేదు; మనుజులు దరిద్రులుగ నుండిరి. వీనికిఁ దోడు, వర్తకవ్యాపారములు నిలిచిపోయెను. కనుక, పొట్టపోషించుకొనుటకుఁ దగిన వ్యాపారములోఁ గుమారుని తండ్రి ప్రవేశ పెట్టనిపక్షమున, వృద్దాప్యములోఁ దండ్రిని గుమారుఁడు పోషించ నవసరము లేదని, యతఁ డొక నిబంధనఁ జేసెను. ప్రతి మనుజుఁ డొక వ్యాపారమును నేర్చుకొనియుండవలెను; సోమరిగ నున్నవాఁడు కఠినశిక్షను బొందుచుండెను.

నగరమునకు సమీపమున సరస్సులుగాని జీవనదులుగాని లేవు. నూతులలోని నీరును వారు వాడుకొనుచుండిరి. వారు నూతులు త్రవ్వించుకొనవచ్చును; మొక్కలు పాతించ వచ్చును. పండించిన పంటలనుగాని, భూమిలో దొరికిన వస్తువులనుగాని, వారు పై దేశములకుఁ బంపకూడ దని యతఁడు నిర్ణయముఁ జేసెను. సరుకుల నెగుమతిచేసినవారు కఠినశిక్షను బొందుచుండిరి. ప్రజారాజ్యములోనివారు గనుక దేశమునకు క్షేమము శుభము నిచ్చు కార్యములు జరగినపుడు, సర్కారువారు విందులు చేయించుట గలదు. జరిగినపుడెల్ల విందులకుఁ బోయినవాఁడు తిండిపోతని వానిని శిక్షించుట గలదు; పిలిచినపు డొక పర్యాయమైన వెళ్లనివాఁడు శిక్షకుఁ బాత్రుండు,

సోలను చట్టములు నూఱుసంనత్సరములవఱ కమలులో నుండెను. అతనిని జూచుటకుఁ బ్రతిరోజున గొప్పవారు బోవుచుండిరి; కొంద ఱతనిని శ్లాఘించిరి; కొన్ని చట్టములలో సవరణఁ జేసిన బాగుగ నుండునని కొందఱు సలహా యిచ్చిరి; మంచివికా వని తోఁచిన వానిని రద్దుచేయవలసిన దని మఱి కొందఱు చెప్పిరి, ఎంత గొప్పకార్యమైనను సర్వజనశ్లాఘనీయముగ నుండదుగదా? అందఱను మెప్పించుట గష్టము. "ఒకరికి పులు సుకూర, మఱియొకరికి ఇగురుకూర, యిష్టము”. వచ్చిన ప్రతివానికి సమాధానము చెప్పుట కష్టమని తోఁచి, పది సంవత్సరములవఱకు దేశమును విడుచుటకు వారివద్ద సెలవు పుచ్చుకొని, వర్తకమునిమిత్త మని చెప్పి, యతఁడు పై దేశములకు లేచి పోయెను.

ఈజిప్టు మొదలగు దేశములను జూచుచు " క్రీససు” యను నొక రా జతనిని నాహూయము చేయుటచేత, నితనిని దర్శించుటకు సోలను పోయెను. ఈ రాజు గొప్ప ధనవంతుఁడు; కుబేరుఁ డని చెప్పవచ్చును. కుగ్రామమునుండి వచ్చినవానికిఁ బట్టణములో నివి యన్నియు విచిత్రముగ నగుపడునటుల, రాజధానిలోఁ బ్రతివస్తువు నతనికి గన్నులపండువుగ నుండెను. అలంకరించుకొని మహావైభవముతో రాజు సముఖమునకుఁ బోవుచున్న ప్రతి సామంతప్రభువు నతఁడు రాజని భావించెను: తుద కతనికి రాజదర్శనమయ్యెను. నగరులోఁ జూచినవన్నియు బంగారువస్తువులే; అంతట నవరత్నములే; చీనిచీనాంబరములు తండోపతండములు. వీనిని జూచి, యతఁడు సంతసించ లేదు; అతని మనస్సు చలించలేదు. వీనిని జూచి యతఁ డాశ్చర్యము బొందనందుకు, రా జాశ్చర్యపడి, ఖజానాకొట్ల నతనికిఁ జూపించవలసిన దని, సేవకుల కాజ్ఞ జేసెను. బొక్కసములో నున్న ధనమునకు లెక్క లేదు; ధనరాసులు మూలుగుచుండెను. వీనిని గన్నులారఁ జూచి, యతఁడు రాజువద్దకు వచ్చెను. “నా కంటె హెచ్చు సౌఖ్యము ననుభవించువానిని జూచితివా?" యని రా జతని నడిగెను. "చూచితిని. వాఁడుమా 'ఆథెన్సు'లోఁ గాపురము చేసెను. భాగ్యభోగ్యములు లేకపోయినను, సంతానవంతుఁడై , యన్నవస్త్రాదులకు లోపములేకుండ సుఖముగ వాఁడు జీవించె”నని యతఁడు ప్రతివచన మిచ్చెను. ఆ రాజునకంటె సుఖముగ జీవించువారు పలువురు ప్రపంచములోఁగల రని యతఁడు రాజునకుఁ దెలియఁ జేసెను. "ఓ రాజా, మేము ప్రజారాజ్యములోనివారము. కొఱతలేకుండ మాకు దైవ మన్నోదకము లిచ్చియున్నాఁడు. మేము విషయేచ్ఛలను గోరువారము కాము. 'అంగనాపుత్ర గేహారామవిత్తాది సంసారసుఖముల దగిలి వర్తించము'. ఇవి క్షణభంగురము”లని బోధపఱచి యతఁడు లేచిపోయెను.

చంచలలక్ష్మి యని సార్థక నామమె. మఱి కొన్నిరోజులకు పారసీకచక్రవర్తి 'కైరసు' దండెత్తిపోయి, 'క్రీససును' యుద్ధములోఁ బట్టుకొని, మరణశిక్ష విధించి, యితనిని దగుల పెట్టవలసిన దని సేవకుల కాజ్ఞచేసెను, కాష్టమువద్ద నిలువఁబడి “ఓ సోలనా, ఓ సోలనా” యని రాజు మొఱఁ బెట్టెను. ఈ సంగతి విని, చక్రవర్తి పరుగెత్తుకొని వచ్చి, "ఓరాజా, నీ వెవరి పేరును తలఁపక, సోలనును తలఁచితి వేమి? అతఁ డెవ”రని రాజు నడిగెను. “అతఁడు గ్రీకులలోఁ బ్రాజ్ఞుఁడు. అతఁడు నా సంపత్తును జూచి, దానిని ప్రేమించవల దని హితోపదేశముఁ జేసి, "కాలంబుతఱి యెఱింగి' జీవింపు మని బుద్ధి జెప్పిపోయె”నని రాజు సమాధానముఁ జెప్పెను. ఇతనికంటె బుద్ధిమంతుఁడు గనుక, చక్రవర్తి యతనికి మరణశిక్షను నాపివేసి, యావజ్జీవము రాజును బోషించెను. సోలను యొక్క హితోపదేశ మిటుల నిరవురిని మోక్షాయత్తచిత్తులుగఁ జేసెను.

సోలను దేశములో లేనిసమయమున 'అథీనియనుల' వ్యవహారములు చిందరవందరగ నుండెను. అతఁడు స్వదేశమునకు వచ్చినవెంటనె, ప్రజలు మిగుల సంతసించి, వారి వ్యవహారములను జక్క పెట్టవలసిన దని కోరిరి. అతఁడు వృద్దు; దేహపటిమ తగ్గినవాఁడు. అందుచేత స్వయముగ విషయములను సంస్కరించలేక , సర్కా రుద్యోగస్థులకు మంచిమార్గముఁ జూపుట కతఁ డుపగమించెను. కాని, కొందఱు మొదట నతని మాటలకుఁ బెడచెవి నొగ్గి, యతనిని జంపించుటకు సమకట్టిరి. గడితేరినవాఁడు గాన, వారి బెదరింపులకు లక్ష్యము చేయక, చెడుమార్గమును వారు వదలునటు లతఁడు చేసెను. ఇటుల సర్వజన శ్లాఘనీయంబైన జీవిత కాలమును గడిపి, యతఁడు వరమపదముఁ బొందెను.