మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/గేయసు-గ్రాకసు

గేయసు-గ్రాకసు

అన్నగారు చనిపోయిన పిదప, గేయసు రాజకీయ వ్యవహారములలోఁ దిగుట కిష్టము లేక యుండెను. కొంతకాల మతఁడు గృహములో నుండిపోయెను. ఎంతకాలము సోమరిగ నుండగలఁడు? అందుచేత వక్తృత్వము నభ్యసించి, దాని మూలమునఁ బ్రజల దృష్టిలోనికి రావలెనని యతఁ డెంచెను. ఒక సమయమున నతఁడు సభలో వాదించినపు డతని వాచాలత్వమునకుఁ బ్రజలు సంతసించిరి. సామంతుల గుండెలు ఝల్లుమనెను. అతఁడు ప్రజానాయకుఁడు గాకుండునటుల వారు పన్నాగములు పన్నుచుండిరి.

అతఁడు 'సిసిలీ'ద్వీపమునకు, 'ఆఫ్రికా'దేశమునకు యుద్ధముఁ జేయుటకు బంపబడెను. అతఁడు వీరుఁడు కాఁడని శత్రువు లనుకొనిరిగాని, వారి యూహ లబద్ధమయ్యెను. ఘోరముగ పోట్లాడి, శత్రువుల నతఁడు దునుమాడెను. రోమకసైనికులు దినుటకుఁ దిండి, కట్టుటకు బట్ట లేక బాధపడుచుండిరి. సెనేటుసభవారికి వ్రాసినను, వారు వానిని బంపలేదు. అతఁడు ప్రతి గ్రామమునకుఁ బోయి, తినుబడి సామగ్రులను వస్త్రములను, ధర్మార్థముగఁ గొన్ని, వెలయిచ్చి కొన్నవి కొన్ని దెచ్చి వారికి పంచిపెట్టెను. సైనికు లతనిని శ్లాఘించిరి.

అతఁడు ప్రజానాయకోద్యోగములోఁ బ్రవేశించెను; ప్రవేశించినది మొదలు వారి విషయమై శ్రమపడుచుండెను. వారి క్షేమము నాలోచించి యతఁడు చేసిన కొన్ని చట్టముల నిందు బొందుపఱచుచున్నారము:--

(1) "ఏ న్యాయాధికారి నైన ప్రజలు పనిలోనుండి తొలఁగించినపుడు, వాఁడు తిరి గీ యుద్యోగములోఁ బ్రవేశించుట కర్హుఁడు కాఁడు. (2) ఏ న్యాయాధికారి యైన యే మనుజుని విచారణచేయక దేశోచ్చాటనకుఁ దీర్పు చెప్పినయెడల, వాని నేరము న్యాయసభలో విమర్శింపఁబడునటులఁ జేయు బాధ్యత ప్రజలకు నుండవలెను”. సెనేటుసభవారి ప్రభ తగ్గించి, ప్రజల మాట ప్రబలమగునటుల, నతఁడు మరికొన్ని చట్టములను చేసెను, నూతనసీమల నేవిధమున నాక్రమించు కొనవలయునో, వాని నెటుల పంచుకొనవలయునో, వీనివిషయమైనవి కొన్ని చట్టములు - యుద్ధమునకుఁ బోయినపుడు, కావలసిన దుస్తులు తినుబడి పదార్థములను సైనికులే తెచ్చుకొనుట కలదు. అతని చట్టముప్రకారము సర్కారువారు సైనికుల కా వస్తువులను జతపెట్టవలసివచ్చెను. పదియేడు సంవత్సరములు ప్రాయము వచ్చు వఱ కే మనుజుఁడు సైన్య ములోఁ బ్రవేశించకూడదు; సర్కారువా రేర్పఱచిన ధర ప్రకారము వర్తకులు సామగ్రుల నమ్మవలెనుగాని, హెచ్చు వెల కమ్మ గూడదు; ఈ నిబంధనల నతఁడు కల్పించెను.

ఎప్పుడు ప్రజలయెదుట ప్రసంగించిన, నతఁడు తన పుట్టు పూర్వోత్తరములను జెప్పుచుండెను. ముచ్చటించినపుడెల్ల, తన యన్న దుర్మరణముసంగతి యెత్తుచుండును; అప్పుడు వారు విచారించుచుండిరి. తన వాచాలత్వముచేత వారి నతఁడు పరవశులను జేయుచుండెను. కొందఱి నతఁడు నూతన సీమలకుఁ బంపెను, ప్రయాణములు సుళు వగుట కతఁడు బాటలు వేయింపిం చెను; నదులమీఁద వంతెనలను గట్టించెను; ధాన్యము నిలువఁ జేయుటకు కొట్లు కట్టించెను. అతని వెంట పండితులు, రణవీరులు, పనివాండ్రు, రాయబారులు: పోవుచుండిరి. యథావిధిగ నందఱిని మర్యాదఁజేసి, వారితో నతఁడు మాటలాడుచుండెను. ఎంత పనిచేసినను, శ్రమ లేదు; ఏపనినైన నతివేగముగ గ్రహించును; దానికి తగినటుల ప్రత్యుత్తరములను వ్రాయును. అతఁడు రెండవ పర్యాయము ప్రజానాయకోద్యోగములో నియోగింపఁబడెను.

తదనంతర మతఁడు 'ఆఫ్రికా'దేశమునకుఁ బోయి యక్కడ గొంతకాలముండి యా దేశమునకు స్వాస్థ్యమ దెచ్చెను. అతఁడు నగరములో లేని కాలములో నతని చట్టములను రద్దుపఱుచుటకుఁ గొందఱు సామంతులు బ్రయత్నించిరి కాని, వారి పని సాగలేదు. ఇంతలో నతఁడు రాజధానికి వచ్చి చేరెను. సామంతు లతనిని జూచి కటకట పడుచుండిరి. అందుచేత వారొక కుట్రపన్ని, యతనిని జంపించిరి. ఇటు లన్నదమ్ము లిరువురు ప్రజలవిషయమై పాటుపడి దుర్మరణము నొందిరి.