మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/నూమా



నూమా

'రోము'నగరమును స్థాపించి, సాంఘికసూత్రము లేర్పఱచి రాజ్యతంత్రములను నిర్మించి ప్రజలకు రణశిక్షను నేర్పిన మహాపురుషుఁడు 'రోమ్యులను'. ఆ నగరము మొదట నేక రాజ్యాధిపత్యములోనిది; అచ్చట రాజ్యమేలినవారిలో మొదటివాఁడు 'రోమ్యులను'. ఇతఁడు దేవాంశసంభూతుఁడు; ఇతఁడు గొంతకాలము పరిపాలనజేసి స్వర్గస్థుఁడయ్యెను. అనంతరము 'సెనేటు'సభవారు రోజు కొకరుచొప్పున వంతువేసికొని రాజ్యమును బరిపాలించుచుండిరి. నగరవాసులు 'రోమకు'లని 'సాబీను'లని రెండు తెగలవారు. వారంద ఱేకీభవించి, యొకనిని రాజుగ నేర్పఱచవలసిన దని సభవారిని గోరిరి. అప్పుడు 'సాబీను'లలోనివాఁడైన 'నూమా'ను వారు రాజుగఁజేసిరి. అతఁడు రెండవరాజు,

తండ్రికి గలిగిన కుమాళ్లలో నతఁడు నాలుగవవాఁడు. అతఁడు యేప్రిలు 21 తేదీని పుట్టెను. ఆ దినము రోము నగరమునకు శంకుస్థాపనఁజేసిన దినము. మొదటినుండి, ధర్మమునందె యతని బుద్ది ప్రసరించెను; త్రిగుణాతీతుఁడై, యతఁ డెప్పుడు నిర్లిప్తతతో నుండెను. అంతశ్శత్రువుల నతఁడు జయించెనని వేఱె చెప్పనేల? ఆ కాలములో గుణముల సొబగులేక, యడవి మనుజులవలె మోటరులైన రోమకుల నరికట్టి వారిని సన్మార్గములోనికి దెచ్చి, నయమున భయమున వారికి హితోపదేశ మతఁడు చేసెను. రాజకీయవ్యవహారములను నిర్వర్తింపని కాలములో విషయసుఖములయందు మనస్సును ప్రవర్తింపనీయక, దేవతారాధనలయందు నిశ్చలభక్తితోఁ గాలమును గడుపుచుండెను; కాలమును గుఱ్తెఱిఁగి, యా ముష్మికచింతతో నుండెను. రోమ్యులనుతోఁ గలిసి రాజ్యభారమును వహించిన 'తాతియసు' అనువాఁడు నూమా సుగుణసంపదకు మెచ్చి తన కూఁతురు 'తాతియా' నతని కిచ్చి వివాహము చేసెను. ఏకాంతస్థలములో నొడుదొడుకులు లేక నిశ్చింతతో భర్తతోఁ గలసి కాపురముఁజేయుట కామె సమ్మతించెనుగాని, యైహికభోగముల ననుభవించుచు పితృగృహమున నుండుట కామె యిష్టపడలేదు. పదమూఁడు సంవత్సరములు కావురముఁ జేసి, యామే దివి కేగెను.

అనంతరము నూమా వనముల కేగెను. అచ్చట, 'అగీరియా' యను దేవత యతనికి ప్రసన్నమయ్యెను, ఆమె యతనిని ప్రేమించి, సమస్త విద్యల నతని కొసఁగెను, ఆ దేవియొక్క ప్రసన్నత గలిగియుండ, నితర వ్యాపారములలో నతని మన స్సెటుల గలీనమగు? ఇటు లతఁడు గాలము గడుపుచుండ, నలుబది సంవత్సరముల ప్రాయమువాఁ డయ్యెను. అంతలో రోమ్యులసు చనిపోవుట, సెనేటుసభవారు రాజ్యమేలుటయు జరిగెను, రోమకులంద ఱతనిని రాజుగ యేర్పఱచుకొనుటకు నిశ్చయించి, యతనిని ప్రార్థించి నగరమునకు రప్పించుట కిరువురు రాయబారుల నతనివద్దకు బంపిరి. సింహాసన మెక్కవలసిన దని కోరినపు డెవఁ డొల్లఁడని వారు తలంచి, యతనితో నొక్కి చెప్పలేదు. "విజనస్థలంబున విముక్త కాముఁడనై , కాలము గడుపుచున్న నాకు రాజ్యమేల? దేవాంశసంభూతుఁడైన రోమ్యులసువంటి మహాత్ములు మిమ్ములను బరిపాలించ వలెను. నేను మనుష్యమాత్రుఁడను. నాలో మహత్తులేదు. చతురోపాయము లెఱుంగను. చతురంగ బలముల నడిపించు పోణిమి లేదు; త్రిశక్తులు లేవు: అంగపంచక మెట్టిదో వినలేదు; చతుర్విధ సీమలలోనివారల నెటుల సంరక్షించవలయునో నేర్చియుండలేదు. ఈ నావంటివానితో మీకేమి ప్రయోజనము? 'కామంబులేని నన్ను మీరు వంచింపనేల' యని యతఁడు పితృ, బంధు, మిత్ర, సోదరవర్గంబుల సమక్షమున బలికి వారిని పొమ్మనియెను. ఈ మాటలువిని వారు నగరమునకుఁ బోయిరి. ప్రజలు చేయుట కేమియుఁదోఁచక, తిరుగ నతనియొద్దకు మఱియొక రాయబారమును బంపి వారు వెనుక నుంచి వచ్చుటకు సిద్దముగనుండిరి.

ఇంతలోఁ దండ్రి కుమారుని జేరదీసి "నాయనా, నీవు సింహాసన మెక్కవలెను. దేవాంశయుండినగాని రాజుకాఁడు. దుర్లభమైన యట్టి పదవి సంప్రాప్త మైనపుడు, నీవు దానిని తిరస్కరించఁగూడదు. పురుషార్థములను యథావిధిగ నడపగలవు. శాశ్వతమైన సంతానములు నీకుఁ జేకూరును. 'యథా రాజా తథా ప్రజాః' అనునటుల నీవు సన్మార్గము నవలంబించి నందున, నీ ప్రజలు నిన్ననుసరించి బ్రతుకుత్రోవఁ గనఁగలరు. రాజుకు జనులే కుటుంబము. ప్రజలకు స్వాస్థ్యము గలుగ జేయుటకన్న హెచ్చు పుణ్యముండునా" యని హితవచనములు చెప్పి కుమారుని వంచెను. అంతలో రాయబారులు వచ్చిరి. మారుమాట చెప్పక, 'నూమా' వారితోఁ గలిసి నగరమునకుఁబోయెను. మార్గములోఁ బ్రజ లతనిని తారసిల్లి, పరమానందభరితులైరి, సెనేటుసభవారు మొదలగు సామంతులు వెంటనంటియుండ, నగరములో నతఁడు ప్రవేశించెను. ఊరేగింపు ముగిసిన తరువాత, నతనిని రాజభవనములోనికిఁ దీసికొని వెళ్లి, వా రతనిని రాజచిహ్నములతో నలంకరించఁ జూచిరి. అతఁడు వారి నప్పటికి వారించి, సుముహూర్తంబున దేవియాజ్ఞ గైకొని, దేవతార్చనములు చేసి, బలు లిచ్చి, సింహాసన మధిష్టించి పట్టభద్రుండయ్యెను.

అతఁడు రాజ్యమునకు వచ్చుసరికి, రోమకులు ముష్కరులు, తెల్ల వారి లేచినది మొదలు పోరేగాని మరియొకటి లేదు. పోరాటములోని పాటు పోటులవలన వారి శరీరము పూటుపడి బిరుసెక్కెను. దయాదాక్షిణ్యములు వెతకిచూచినను వారిలోఁ గాన రావు. వారి పొదలిక కత్తిపదును. వీరి నెటుల మచ్చిక చేయుట? ఇనుము కఠినమైనది. అగ్ని స్పర్శ చేత మృదువు. కాదా? వీరి మనోదేహకాఠిన్యములను బోగొట్టుటకు వేరు. మార్గములు దోఁచక, దేవతారాధన లని, బలు లని, దేవోత్సవము లనెడు మొదలగు దేవతాక్రియలలో వారి నతఁడు ప్రవేశ పెట్టెను. తనకు దేవి ప్రత్యక్ష మగునని వారితో నతఁడు చెప్పుచుండెను. దేవాలయముల నతఁడు ప్రతిష్ఠఁజేసెను. నిర్గుణబ్రహ్మమునకు ప్రతిమరూపము నిచ్చి పూజించుట కిష్టము లేక, విగ్రహము లేకయే వారు దేవాలయములలో దేవతారాధనఁ జేయుచుండిరి. కర్మకాండ నతఁడు బహుళము చేసెను. అర్చకులు మెండయిరి. వారిమీఁదఁ బెద్ద యర్చకుఁడొకఁడు నియోగించఁబడెను. శకునజ్ఞులు ప్రబలిరి. బలులిచ్చుటకుఁ దగిన తంత్రములు బలిసెను. ఒకచోట నవిచ్చిన్నాగ్ని హోత్ర ముంచఁబడెను; దానిని సంరక్షించుటకుఁ గొందఱు సతీతరుణు లొప్పుకొనిరి. దేవతార్చన విధానములు పూర్వముకంటె రెండింతలు పొడవయ్యెను. వీనినన్నియు రాజు స్వయముగఁ బరిశీలించి, ప్రతిదినము వానిని జరిపించు చుండెను.

అతఁడు రాజనగ రొకటి కట్టించెను; పధకశుద్ధి జేయించెను. అతని కాలములో యుద్ధములు లేవు. దుర్మరణ మను మాట లేదు. ఈతిబాధలు లేవు. పరమేశ్వరుని కటాక్షము గలదు గనుక, ధర్మమును స్థాపించి, ప్రజల కతఁడు మనోసంస్కారము లిచ్చెను. నలుబదిసంవత్సరము లతఁడు రాజ్యముచేసి జీర్ణించిన శరీరమును విడిచి, లోకాంతరగతుఁ డయ్యెను.