మహాపురుషుల జీవితచరిత్రములు (ప్రథమ సంపుటము)/థెసియసు
థెసియసు
థెసియసు, రోమ్యులసు, వీరిరువురు దేవాంశసంభూతులని చెప్పుదురు. వారి పుట్టుపూర్వోత్తరములు బాగుగ దెలియవు. ఇరువురు కానీనులు: మహావీరులు; దేహబలము, మనోబలముగలవారలు. మొదటివాఁడు 'ఆథెన్సు'నగరమును, రెండవవాఁడు 'రోము'నగరమును స్థాపించెను. ఉభయులు స్త్రీలను జెరబట్టుచుండిరి. తుదకు వారికి గృహకలతలు గలిగి బాధపడిరి. మొదట ప్రజలు వారి నెంత గౌరవించిరో, తుద కంత గర్హించిరి.
థెసియసుయొక్క పితృవంశముసంగతి బాగుగ తెలియదు; అతని మాతామహుఁడు 'ట్రాజినీ' పట్టణములోని రాజు. ఇతని కొక కూతురుమాత్రము గలదు.
ఆథెన్సునగరములోఁ గాపురము జేయుచున్న 'ఆజియసు' యను రాజు సంతానము లేక, సోదెవేయించి కనుగొనుటకు 'డెల్పి'గ్రామమునకుఁ బోయెను. నగరమునకుఁ బోవు వఱ కితఁడే స్త్రీముఖమును జూడగూడ దని సోదెచెప్పిరి. ఇతఁ డా మాట విని, తిన్నగా నగరమునకుఁ బోవక, ట్రాజినీపట్టణము వచ్చి, 'పిథియసు'గృహములో బసచేసెను; ప్రసంగ రీతిని సోదెసంగతి నతనితోఁ జెప్పెను. అతఁ డేమి యాలోచించెనో తెలియదు గాని, తన కుమారితె నితనియొద్దకుఁ బంపెను. అప్పుడు 'ఆజియను' ఆమెను జూచి మోహించెను. ఆమె గర్భసంస్కారములు పొందెను. అతఁ డా వృత్తాంతము గ్రహించి, యొక కత్తిని రెండు పాదరక్షల నొక బిలమున పదిలముఁజేసి, దానిమీఁద నొక బండరాతిని బోర్లించి, యా సంగతి భార్యతోఁ జెప్పి, కుమారుఁడు, కలిగిన యుక్తవయస్సున వాడు వానిని ధరించి తనయొద్దకు వచ్చునటుల జేయవలసిన దని యుత్తరువుఁ జేసి, నగరమునకుఁ బోయెను.
నానాఁ డామెకు నెలలు నిండి, యొక రోజున నామె సుఖ ప్రసవమయ్యెను; సుపుత్రుఁడు గలిగెను. శిశువునకు మాతా మహుఁడు 'థీసియసు' యని నామకరణముఁ జేసెను. పురిటిపిల్లఁడు పొత్తిళ్లపిల్లఁడై , మాసము లయనములు సంవత్సరములు నిండి యౌవనసంప్రాప్తుఁడయ్యెను. మాతామహుని జూచి యతఁడు తండ్రియని భావించుచుండెను. స్నేహితు లతనిని కానీనుఁడని పిలుచుటకు దుఃఖించి, తల్లియొద్దకు వచ్చి, తన తండ్రి యెవరో చెప్పవలసిన దని యతఁ డామెను గోరెను.
అప్పటికే, యతఁ డాజానుబాహుండు. సామువిద్యలు నేర్చుకొనినందున, నతని శరీరము కర్కశమయ్యెను. మదించిన వృషభమువలె నతఁడు నడుచుచుండెను. దేహలా వణ్యము జిక్కగఁ గారుచుండెను. అతఁడు కామినీహృదయభేదన నైపుణీకటక్షవీక్షణములతో నొప్పుచుండెను. అతని యందు దేహసంస్కారములకు మనోసంస్కారములు జోడింపఁ బడియుండెను.
అట్టి కుమారుని జూచి తల్లి కొంత మనోవ్యధను బొంది, “నాయనా, నీ తండ్రిగారు నీవు గర్భములోనున్నపుడె, నన్ను విడనాడి, ఆథెన్సునగరమునకుఁ బోయిరి. వా రక్కడిరాజులు. ఆ బండరాతికింద వా రేమో నీ నిమిత్తము కొన్ని వస్తువులు దాచియుంచిరి. నీవు వానిని ధరించి, వారియొద్దకుఁ బొమ్మ"ని యతనితోఁ జెప్పెను. రెండు మూఁడు వందలమంది కదిలించ లేని బండరాతి నతఁ డవలీల గదలించి, పైకిఁ ద్రోసి, లోపల బిలములోనున్న పాదరక్షలను చంద్రాయుధమును బట్టుకొని వచ్చి తల్లికిఁ గసపఱచెను. పాదరక్షలను దొడిగి, చంద్రాయుధమును ధరించి, యతఁడు తండ్రి యొద్దకుఁ బోవుటకు సన్నద్దుఁ డయ్యెను. మాతామహుఁ డందులకు సంతోషించి, నాటున గాక సముద్రముమీఁద బయలుదేరి వెళ్లవలసిన దని, యతనికి సలహాచెప్పెను. తాతగారి మాటలను చెవిని పెట్టక, నాటున బోవుట కే యతఁడు సిద్ధ మయ్యెను.
ఆకాలమున రాధారిమార్గములు, బాటలులేవు. అడవులు దాఁటుకొని మనుజులు ప్రయాణములు చేయుచుండిరి. మార్గములో దొంగలను తప్పించుకొని, దుష్టజంతువుల వాత బడక, ప్రయాణమును సాంతముగ జేసినవారులేరు. ఈ సంగతులు విని, పరాక్రమశాలి గనుక, మార్గములు నిష్కంటకములు చేయవలెనని కోరి, యతఁడు నాటున బయలు దేరెను. "రక్తములో దడిసిన యాయుధమును జూచిన తండ్రి సంతసించును గాని, తెల్లగ థళథళలాడుచున్న దానినిజూచి యతఁ డామోదించునా?" యని తాతగారితోను తల్లితోను జెప్పి యతఁడు బయలు దేరిపోయెను.
మార్గములో 'పెరి ఫేటీసు' అను పేరుగల యొక ముష్కరుఁడుండెను. వీఁడు గదాయుద్ధములోఁ బ్రసిద్ధికెక్కినవాఁడు. వీనితో నతఁడు గదాయుద్దముఁ జేసి, చంపి, వీని గదను బట్టుకొని, యక్కడినుండి బయలుదేరెను. అనంతరము, దేవదారువృక్షమును వంచినవాఁ డని పేరుపొందిన పురుషునిఁ బోరాటములోఁ దునుమాడి, వాని కూఁతురును సంతోష పఱచి, యతఁ డా స్థలమును విడిచిపోయెను. తదుపరి, 'మగారా' పొలిమేరనున్న యొక దొంగను బట్టుకొని, వాని నతఁడు కొండమీఁదినుండి క్రిందికిఁ ద్రోసి చంపెను. 'ఎడ్యాసిసు' అను గ్రామములో నొక మల్లుని నోడించి, వాని నతఁడు యమ మందిరమునకుఁ బంపెను.
'ఆజియసు' 'మీడియా' యను నామెను వివాహమాడి, ఆథెన్సునగరములోనుండెను. 'థెసియసునగరములోఁ బ్రవేశించి, తండ్రిదర్శనమునకు వెంటనే వెళ్లలేదు. థెసి యసు సవతికుమారుఁడని చారులవలన దెలిసికొని, కుమారుఁడని భర్త గ్రహించకమునుపె, యతనికి విందుచేసి, విషము పెట్టి చంపవలె నని 'మీడియా' యత్నించెను. అతఁడు తండ్రి గృహములోఁ బ్రవేశించెను. ఆనాఁ డొక విందు జరుగుచుండెను. ఎవఁడో గొప్పవాఁడు వచ్చినాఁడని తలంచి, థెసియసును రా జాహూయము చేసెను. తనపేరు చెప్పుకొనక, తండ్రి చూచునటుల చంద్రాయుధమును బట్టుకొని, యతఁడు కూర్చుండెను. ఇంతలో 'మీడియా' విషమును గలిపి, మద్యపాత్రను భర్తచేతి కిచ్చి, వచ్చినవాని కియ్యవలసిన దని కోరెను. రాజు దానిని బట్టుకొని, ప్రక్కకు దిరుగుసరికి, చంద్రాయుధ మతని కంటపడెను. వెంటనే, దానిని ధరించినవాఁడు తన కుమారుఁడని యతఁడు గ్రహించి, సంతోషముచేతఁ బరవశుఁడై, పాత్రను జారవిడిచెను. రాజు కుమారుని గొఁగిలించుకొని, శరీరము దువ్వి, శిర మాఘ్రాణించి, యానందబాష్పములతో నతని శరీరమును దడిపెను.
'క్రీటు' ద్వీపములో 'మినోతారుఁ'డను రాక్షసుఁ డొకఁ డుండెను. వాని యూర్ధ్వభాగము వృషభాకారము; అథోభాగము మానవాకారము. తొమ్మిది సంవత్సరముల కొకపర్యాయము 'అథీనియను' లేడుగురు బాలురను, ఏడ్వురు కన్యలను, కానుక దీసికొని వెళ్లు టాచారము గలదు. ఆ రాక్షసుఁడు వీరినిఁ జంపి తినుచుండును. ఈ కానుకను దీసికొని వెళ్లు సంవత్సరము వచ్చెను. నగరమంతట దీనాలాపములు నిండె; ప్రజ లా బాలవృద్ధులు ముకుళితముఖారవిందు లయిరి; వారి ముఖమున కత్తివేటుకు రక్తము లేకుండెను.
అప్పుడు థెసియసు వారి దుఃఖము వాషి, వారితో తాను వెళ్లుటకు తండ్రి యనుమతిఁబొందెను. అతనితోఁ గూడి యేడుగురు బాలురు కన్యకలు పడవనెక్కి, ద్వీపమునకుఁ బోయిరి. ఆ దీవికి రాజైన 'మినాసు' యొక్క సేనాధిపతిని యతఁడు ముందు జంపెను. అటుపైని కొన్ని గరిడీ విద్యలు జరిగెను. వానిలో సతఁడు తన ప్రావీణ్యతను గనఁబఱచెను. అప్పుడు రాజుకూఁతురు 'ఆర్యాదిని', యతని దేహలానణ్యమునకు మెచ్చి యతనిని మోహించెను. -
ఆమె వర్తమానము పంపినందున, నతఁ డామె సమక్షమునకుఁబోయెను. పద్మవ్యూహమువలె, నల్లుకొనియున్న యరణ్యములో నా రాక్షనుఁడు నివసించియుండు నని యామె యతనితోఁ జెప్పెను. ఆమె యొక దార మతని చేతికిచ్చి, దానిని పట్టుకొని యరణ్యములోఁ బ్రవేశించి, వానిని జంపి రావలసిన దని చెప్పిపంపెను. అతఁ డాప్రకారము వ్యూహములోనికిఁ బోయి యా రాక్షసుని రూపుమాపి, దారము నల్లుకొనుచు వచ్చి, 'ఆర్యాదిని' సమక్షముఁ జేరెను. అక్కడివా రందఱు ముదమందిరి.
బాలికాబాలురతో నతఁడు పడవ నెక్కి, స్వనగరము నకు బయలుదేరెను. తొందరలో వారు జయధ్వజమును పడవమీఁద నెత్తలేదు. అందుచేతఁ గుమారుఁడు మృతినొందెనని యెంచి, 'ఆజియసు' కొండమీఁదనుండి సముద్రములోనికి దుమికి చనిపోయెను. అనంతరము థెసియసు రేవులో దిగెను. నగరవాసు లంద ఱతనిని వేనోళ్ల పొగడి వీరజయోత్సవములను జరిపిరి. తదుపరి, పితృవియోగమునకు దుఃఖంచి, ప్రేత కార్యముల నతఁడు యథావిధిగా జరిపెను,
అనంతర మతఁడు రాజ్యమునకు వచ్చెను. ఇంతకుఁ బూర్వము ప్రజలందఱుఁ జెల్లాచెదరుగ గృహములు కట్టుకొని నివసించుచుండిరి. అందుచేత నతఁడు వారిని సమావేశము చేసి, యొక పట్టణము నిర్మించెను. ఆ పట్టణమె 'ఆథెన్సు'. మనో దేహబలములుగలవాఁడు గనుక, థెసియసునె సేనాధిపతిగ ప్రజలు నియమించిరి, ప్రజలందఱు సమావేశమై, వ్యవహారములను బరిశీలించుటకుఁ దగిన 'ప్రజామందిరము” నొకటి నిర్మింపించిరి. సామంతు లని, కృషీవలు లని, వర్తకు లని వ్యావహారిక భేదములు తప్ప, జాతి భేదములు వారిలో లేవు. ప్రజలందఱు సమానులె. అందఱియెడల నొకటే దండనీతి ప్రవర్తించుచుండును. వేషభాషలలోను, మతాచారములలోను వారు సమానులే,ఆటపాటలలోను భేదము లేదు. వారికి కావలసిన సాంఘికసూత్రముల నేర్పాటుచేసి, రాజ్యమును స్థాపించి, థెసియసు స్వర్గస్థుఁడయ్యెను.