భక్తిరసశతకసంపుటము/రెండవసంపుటము/మహిషాసురమర్దనిశతకము

పీఠిక

ఈశతకగ్రంథకర్త దిట్టకవిరామచంద్రకవి. ఇతఁడు వాసిరెడ్డి వేంకటాద్రినాయఁడువారి యాస్థానకవిగఁ జిరకాల మమరావతిలో నివసించెను. అమరావతిలోని యమరేశ్వరాలయమునందలి మహిషాసురమర్దనినిగూర్చి యీశతకమును గవి రచించెనని వంశీయులు చెప్పుచున్నారు. ఈకవి శకుంతలాపరిణయము, సేతుమాహాత్మ్యము, రామకథాసారము రచించిన దిట్టకవిపాపరాజుగారి మనుమఁడు. రంగారాయచరిత్రము వ్రాసిన నారాయణకవిపుత్రుఁడు. ఈరామచంద్రకవి నిగ్రహానుగ్రహసమర్థుఁడు, ధూర్తుఁడు. ఇతనికవిత నిరర్గళధారాశోభితమై మనోజ్ఞముగా నుండును. ఇంతవఱ కీకవి గ్రంథములలో నిక్రిందివి మాత్రము లభించినవి:

1. ఉద్దండరాయశతకము
2. రఘుతిలకశతకము
8. రాజగోపాలశతకము
4. మహిషాసురమర్దనిశతకము
5. హేలావతిదండకము

6. ప్రబంధములోని కృత్యాది వాసిరెడ్డివారి వంశచరిత్రము.
హేలావతిదండకము రెండవభోగినీదండకమువలె మన్నది. రచనయుఁ గవితయు ధారయు హృదయంగమముగానున్నది. కృత్యాదియే ప్రబంధమునకు ముందుభాగమో నిరూపింప వీలు కాదయ్యెను.

రామచంద్రకవి సత్కారము జరుగనిచోటులఁ దిట్టుకవిత నుపయోగించి బెదిరించి బహూకృతు లందిన గడుసరి. ఈయనను గూర్చి యనేకవిచిత్రకథలు వాడుకలో నున్నవి. కవి తనప్రగల్భము నొకమా ఱిటులఁ జెప్పుకొనియున్నాఁడు.—

క. దిట్టకవి రామచంద్రుఁడు
     దిట్టిన ఱాయైనఁ బగులు దీవించిన యా
    బెట్టైనఁ జిగురుఁ బెట్టును
    గట్టిగఁ దొల్లింటిభీమకవి కాఁబోలున్

ఈకవిచాటుపద్యములు సమకాలికులను గూర్చిన ప్రశంసాపద్యములుగూడ మాకుఁ గొన్ని లభించియున్నవానిని వరుసగాఁ బ్రదురించెదము. రామచంద్రకవి నివాసము కృష్ణామండలము నంది గామ తాలూకాలోని గొట్టుముక్కల. కాశ్యపగోత్రము. కవిశాలము గ్రహించుటకు గ్రంథాధారము లంతగా లభింపలేదు. కవివంశీయులవద్దనుండి వ్రాయించి తెప్పించినసనదు కొంతవఱ కాధారము కాఁగలదని యిట నుదాహరింతుము.

"శ్రీమత్సకలగుణసంపన్నులయ్ని శ్రీమహమేరుసమానధీరులయిన దేవళ్రాజు వెంకటాచలంకు నారయ్యగారు దండం స్న 1179 ఫసలి॥ మ॥ పెదమద్దాలి॥ వ॥ వుయ్యూరు తాలూకు దిట్టకవి రామచంద్రుఁడిగారి మాన్యము హ॥ సా॥ పంట్లకు సాలాబాదుచొప్పున సర్వదుంబాలాశెలవు యిచ్చినాము. మహస్సులు కమామిషు చేయించ్కొని కొంచ్చపోనియ్యవలెను. వికృతినా॥ సం॥ జ్యేష్ఠ శు 2 నారయ్య వ్రాలు”

ఇది నూజవీటిసంస్థానోద్యోగి కవిమాన్యము ఫలసాయము విషయములో ఠాణేదారునకు వ్రాసిన యాజ్ఞాపత్రము. ఇట్టివె ఫసలి 1168, 1169, 1170 లోనివిగూడ కవివంశీయులవద్ద మేము చూచి యున్నారము. ఇపుడు 1334-వ ఫసలీ కావున మనకు లభించినవానిలో మొదటి యాజ్ఞాపత్రమగు ఫసలి 1168 సం. సనదు ఇప్పటి 166 సంవత్సరములక్రిందఁ బుట్టియుండును. కవి యప్పటికి 20 సంవత్సరములవాఁడైనచో కవిజన్మకాలము క్రీ. శ. 1731 ప్రాంతములయం దైయుండును.

కవి గ్రంథరచనకాలము సమకాలికులను జీవితమునుగూర్చి ప్రత్యేకించి వ్రాయనున్నారము గావున నిందు విరమించితిమి.

ఈశతకమునందలి భావములు సరళముగ హృదయంగమముగ నున్నవి. ధారయు నిరర్గళముగ నున్నది. ఇట్టి యుత్తమశతకము కవివంశీయులగు విజయరామశాస్త్రులవారు తాళపత్రగ్రంథములనుండి చిరకాలము క్రిందట నెత్తివ్రాసిరి. అందుఁ గొన్నిస్ఖాలిత్యము లుంటచేఁ గవ్యభిప్రాయానుగుణముగ సవరించి శుద్ధప్రతి నేర్పఱచితిమి.

ఈకవికృత గ్రంథములన్నియు ముద్రణమునకు నొసంగి శుద్ధప్రతి పీఠికవ్రాయుటకు మాకవకాశము కల్పించిన కవి వంశీయులగు దిట్టకవి సుందరరామయ్యశర్మ పాకయాజిగారును, శతకసంపుటములలో నీయమూల్యగ్రంథములఁ జేర్చిన శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారును ఆంధ్రులకృతజ్ఞతకుఁ బాత్రులు.

నందిగామ

ఇట్లు భాషాసేవకులు

20-4-25

శేషాద్రిరమణకవులు, శతావధానులు

శ్రీరస్తు

దిట్టకవి రామచంద్రకవిప్రణీత

మహిషాసురమర్దనిశతకము

ఉ.

శ్రీవనితాసరస్వతులు చిత్తమెలర్పఁగఁ గ్రేవలన్ భవ
ద్భావమెఱింగి సేవనెఱపన్ సురపంక్తి భజింప లోకముల్
వావిరి నేలు నీకు ననువారము మ్రొక్కుదు హృద్యపద్యగ
ద్యావళి నామతించి మహిషాసురమర్దని పుణ్యవర్ధనీ.

1


ఉ.

ఔనని యాజగజ్జనకుఁడైన మహేశునకంటె లెస్సగాఁ
బూని సమస్తలోకములు పోషణ జేసెడి తల్లివౌకదా
జానుగ నన్ను షణ్ముఖునిచాడ్పున మన్నన సేయవమ్మ నీ
కానతి సేతునమ్మ మహిషా...

2


ఉ.

తారకపర్వతాగ్రపరితఃపరిపుష్పితసత్కదంబకాం
తారసభాంతరస్థలసుధాకర రత్నమృగేంద్రపీఠిపైఁ
జేరి జగంబు లేలుశశిశేఖరగేహిని వైననిన్నుఁ జె
న్నార భజింతునమ్మ మహిషా...

3


చ.

అమరులు నీకు సైన్యతతు లాగమముల్ స్తుతివందిపాఠకుల్
రమ చెలికత్తె శారదచిరంటి సురాలయముఖ్య సర్వలో

కములకు నీవ యీశ్వరివి కావున మ్రొక్కెద నీపదాబ్జదా
స్యము దయ సేయవమ్మ మహిషా...

4


చ.

శుభము లొసంగ సత్కరుణఁ జూడ నిఁకెవ్వరు నీకెచెల్లు వి
శ్వభరిత యోకదంబ వనవాసిని యోసువికాసినీ నిజం
బభినుతి జేతు నీపదము లాత్మదలంచి యహర్నిశంబు నా
కభయ మొసంగుమమ్మ మహిషా...

5


చ.

అకలుషవృత్తి నిన్ గొలుచునంతనె యెంతటివానికైన న
మ్మిక జనియించి కష్టము శమించి ఫలింపకయున్నె మేలుమేల్
ప్రకటసుఖంబు కంబుసుగళాబగళా యఖిలాండకోటినా
యకివిగదమ్మ మహిషా...

6


చ.

నిమిషముమాత్ర మింతె మది నిన్ను దలంచినవాని కెన్నఁడున్
శ్రమ జనియంప దెన్నఁడు సుఖంబుగ సన్మణిపీఠి నిల్పి తా
నమితసువర్ణపుష్పముల నర్చనఁజేసెడు పుణ్యమూర్తిభా
గ్యము తరమా నుతింప మహిషా...

7


ఉ.

నీసరి వేల్పు వీవె మఱి ని న్మది నమ్మినవాని కెన్నఁడున్
వీసరపోవ దెన్నఁడును విశ్రుతసంపద యోకదంబసం
వాసిని యోమదంబ ననువారము నీకరుణారసంబుఁ బే
రాస యొనర్చినాఁడ మహిషా...

8

చ.

దమికులమర్చకావళి కదంబవనంబు నివాస మిందుఖం
డము తలపువ్వు భూషణ మనంతుఁడు చేతులకుం ద్రిశూలచ
క్రములును బ్రహ్మదండభిదురంబులు సాధనముల్ మహోగ్రసిం
హముగద వాహనంబు మహిషా...

9


ఉ.

ఆసరసీజనేత్ర హరహాటకగర్భుల కెన్నరానినీ
వాసి దలంచిచూడఁగ నవాఙ్మతి మానసగోచరం బగున్
నీసరి మేటి నీవెకద నీ కొకలక్ష్యమె చండముండభం
డాసురఖండనాప్తి మహిషా...

10


చ.

శరణని వేఁడినాఁడ ననుసాదు మటంచుఁ దలంచినాఁడ నీ
వరతనయుండనౌట ననువారము నెమ్మది నమ్మినాఁడ సుం
దరకరుణాకటాక్షకలితాలలితాలలితారిగర్భసం
హరవికటాట్టహాసమహిషా...

11


ఉ.

ఎక్కడవాఁడ వీ వనక యించుక నీకరుణారసంబు నా
దిక్కునఁ బాదుకొల్పి ప్రణిధిస్థితి గైకొని రిక్కలోవిడం
ద్రొక్కవె యిక్కుదోయములు? మ్రొక్కెద మ్రొక్కెదఁ బెక్కుమాఱు లో
యక్క భరింపవమ్మ మహిషా...

12


ఉ.

జన్యత నాయెడంగలదు సత్యముగా జననీప్రభావసౌ
జన్యము నీవు దాల్పు మిఁక సంశయమేటికి నీకృపాప్తిచే

ధన్యుఁడనైతి నీమృదుపదంబులు నమ్మినవాఁడ నైతి నీ
కన్యుఁడఁగాను సుమ్ము మహిషా...

13


ఉ.

ఎల్లిదమేల యమ్మ కృపయేర్పడ మార్పడఁ జూడనట్టినా
తల్లివి నీవెగాన బహుథా భవదంఘ్రుల నాశ్రయించె నా
యుల్లము నెల్లవేలుపుల నొల్లక వేల్లితపుల్లమల్లికా
హల్లకనీలవేణి మహిషా...

14


ఉ.

ఎవ్వనిపట్ల నీకరుణ యించుక గల్గునొ వానికి న్నెఱా
నివ్వటిలున్ సిరుల్ యశము నిండు కృతార్థత గల్గు శాత్రవుల్
దవ్వగుచుండ్రు సత్యముగదా యిది కావున నిన్నె గొల్తు నో
యవ్వ నిరంతరంబు మహిషా...

15


ఉ.

పొందుగ స్తన్యపానపరిపూరితుఁడై గుహుఁ డుబ్బి ముందఱన్
జిందులు ద్రొక్కఁ దన్ముఖశశిం గని ముద్దొనరించి మానసా
నందముతోడఁ గన్గొనెడినాఁటిదయాదృతి నాపయిన్ విని
ష్పంద మొనర్పవమ్మ మహిషా...

16


ఉ.

అమ్మలయమ్మ నీ వలరుటమ్ములవాఁ డగువాని బ్రేల్చురో
స మ్మలరారువెండిమలసామికి నేలికసానివమ్మ నా
యమ్మగునీకు భక్తజనతావనమోమలరాచపట్టి నా
యమ్మవు నీవె సుమ్ము మహిషా...

17

ఉ.

నీమహనీయసత్కరుణ నిర్మలమౌగద నీప్రభావముల్
స్థేమమెలర్ప సేవకవిధేయములౌగద ప్రోవు మింక న
న్నోమిక చేసి యోలలిత యోభ్రమరాంబిక యోభవాని యో
హైమవతీమదంబ మహిషా...

18


ఉ.

మానుగ నీవు నీశ్వరుఁడు మత్పితృదేవతలైనఁ జాలు మీ
కేను తనూభవుండనయి యింపుగ మీ కరుణామృతంబు నే
బూనెడిసొమ్ము తెమ్మనుచుఁ బోరొనరించి గ్రహింతునమ్మ మీ
కానతి సేతునమ్మ మహిషా...

19


ఉ.

దక్షత నన్నపూర్ణయును ధన్యయశంబు వహించి కాశిలో
భక్షణ సేయుఁ దం చమృతపాయస మాకొనువారి కెల్లఁ బ్ర
త్యక్షముగా నొసంగుదుఁ బ్రియంబున లోకము లేలు శ్రీ విశా
లాక్షివి నీవె సుమ్ము మహిషా...

20


ఉ.

పోలఁ గపాలమాలికలు బూని విభూతి ధరించి మించి
శ్రీశైలమునందు శంకరునిసన్నిధిఁ బెన్నిధివోలె లోకముల్
పాలనసేతు వీవు ప్రతిభన్ భ్రమరాంబ యనం దనర్చి యో
యైలబిలార్చితాంఘ్రి మహిషా...

21


ఉ.

తోరపుహేలచేఁ గనకదుర్గయనన్ బెజవాడలోపలన్

జారుసువర్ణమూర్తివయి శైలతలంబున నిల్చి కార్యని
ర్ధారణధర్మమర్మకు వరంబు లొసంగినతల్లి నిన్నుఁ జె
న్నార భజింతునమ్మ మహిషా...

22


చ.

చలమున లంకలోపలను శాంకరినా విలసిల్లి రక్కసుల్
గొలువ సమస్తలోకములఁ గూరిమి నేలుదువమ్మ చిన్నివె
న్నెలదొరపూవుపెన్నెఱుల నెక్కొనుతల్లి తనూలతాజితా
త్యలఘుసువర్ణవల్లి మహిషా...

23


ఉ.

తాళదళైకకర్ణికలు దాలిచి వేనలి చందమామయున్
వ్యాళకలాపముల్ చిఱుతవన్నియచీరెలు భూతిరేఖలున్
జాల నలంకరించుకొని చక్కనిబొబ్బమెకంబు నెక్కి వా
హ్యాళి యొనర్చుతల్లి మహిషా...

24


చ.

అమృతపయోధితీరమున నంచితకాంచనరత్నపీఠిపై
నమరులు గొల్వ బిల్వవనమందు సురద్రుమమూలసీమ సం
భ్రమమెసఁగన్ వసించి గరిమన్ జగమేలుచునున్న నిన్ను ని
త్యము భజియింతునమ్మ మహిషా...

25


ఉ.

కోమలనీలవర్ణపటగుప్తనితంబిని వై సువర్ణరే
ఖామహనీయతాళదళకర్ణిక నింపు దలిర్పఁ బూని సో

ద్దామధృతిన్ జగత్త్రయము ధన్యత నేలెడుతల్లి వీవెకా
శ్యామలనాఁ దలిర్చి మహిషా...

26


ఉ.

సంకుమదాభిచర్చితకుచద్వయ యోరమణీయరత్నతా
టంకని యోనిశాకరవిడంబనకృన్ముఖబింబ యోమహే
శాంకవిభూషణాంగి భవదర్భకు నం గరుణించుపట్ల ని
ట్లంకిలి సేయు టేల మహిషా....

27


ఉ.

లాలితరత్నవీణ నుపలాలనఁ జేయుచు మందహాసయు
క్తాలపనైకగీతముల నర్మిలిఁ బాడుచు శంభుసన్నిధిన్
జాలవిలాస మొప్ప సురసంజల రంజిల నాట్యకేళిచే
హాళి దనర్చుతల్లి మహిషా...

28


ఉ.

స్వాదురసాప్తిగీతములు సల్పెడువేళ విలాసవైఖరిన్
మేదుర నీపపుష్పపరిమిశ్రితచందనపుష్పమాలికల్
మోదముచే ధరించి నయముం బ్రియముం బ్రకటించి శంభుచే
నాదృతిఁ గాంచుతల్లి మహిషా...

29


ఉ.

ఆతతసత్కృపాప్తి నను నాదృతి సేయఁ గదమ్మ శేఖరీ
భూతసుధాంశుబింబపరిభూషితచూళిక వైనశ్రీజగ
న్మాతవు నీవు శంభుఁడె సుమా పిత వేదము లట్ల పల్కు నా
హా తల్లిదండ్రులంచు మహిషా...

30


ఉ.

కామమహీపతిస్ఫురితకార్ముకరూపవిరాజమాన
భ్రూమహనీయవల్లికకుఁ బుష్పమనగాఁ గమనీయరోచనో

ద్దామలలామ మాస్యమునఁ దాల్చిననీమహనీయమూర్తి నే
నామతి సేతునమ్మ మహిషా...

31


ఉ.

మంజులఫాలికాకలితమౌక్తికకాంతులసంతతుల్ నెఱా
రంజిలుగండభాగముల వ్రాసినకస్తురిగ్రాలుతేంట్లమో
తం జిగియైనతంత్రినినదంబున గీతము లుగ్గడించునీ
కంజలి సేతునమ్మ మహిషా...

32


ఉ.

తావల మొప్ప వల్లకిని దంత్రుల గోటను మీటునప్పు డెం
తో వెస గర్ణభూషణము లుయ్యలలూఁగఁ గ్రమక్రమంబునన్
గేవలమాధురీమహితగీతులఁ బ్రీతుని జేతు వీశ్వరున
హావవిశుద్ధి గూర్చి మహిషా...

33


ఉ.

దివ్యసురామదోచ్చలితదీర్ఘదృగంచలమైనమోమునన్
నవ్యములైన మోదకరణంబులు దోఁచె ననం దనర్చి సం
భావ్యము లైనముత్తెముల భాసిలు ముంగర గల్గుతల్లి నీ
వవ్యయమూర్తి వమ్మ మహిషా...

34


చ.

నలువున మందమందమగునవ్వున ముమ్మరమైన మోమునన్
సలలితమౌక్తికాప్తిఁదగు సద్రదపాళికిఁ బాటలచ్ఛద
చ్ఛలనతఁ దాల్చి వీడియపుఁజాయల వాతెఱసొంపు బెంపునిం
పలరెడుతల్లి వీవ మహిషా...

35

ఉ.

ఆకమనీయదివ్యనవయౌవనచంద్రకళోదయంబుచేఁ
బ్రాకటలీలయన్ జలధిపైకొనఁ దత్పరిదృశ్యకంబు బి
బ్బోకవదాత్మకంధరము బొల్పెసలారఁ దనర్చుతల్లి నీ
యాకృతి సంస్మరింతు మహిషా...

36


చ.

విలసితరత్నముద్రికలు వ్రేళ్ల ధరింపఁ దదీయదీధితుల్
దలకొని సాంధ్యరాగముల ధర్మముఁ దాలిచి కెంజిగుళ్లు లీ
లల నఖపంక్తికిం జిలుగులత్తుకగాఁ గళలుబ్బుతల్లి న
న్నలరఁగఁ జేయవమ్మ మహిషా...

37


ఉ.

మేదురరూపయౌవనసమృద్ధియనం దనరారువార్ధికిన్
క్షోదపుఁబూఁతగల్గు చనుగుత్తులవ్రేగునఁ దూఁగుకౌనుపై
భేదములౌ తరుల్ తరళవీచులుగా విలసిల్లుతల్లి న
న్నాదుకొనంగదమ్మ మహిషా...

38


చ.

పరగ గభీరనాభి యనుబావికిఁ గ్రేవఁ దనర్చు నాచుక్రొం
బొరయన నొప్పు నాయుదరభూషణమై విలసిల్లు సత్కటీ
నిరుపమసూత్రనిక్వణననిర్జితమారగుణార్భటీమనో
హరనిధి వైనతల్లి మహిషా...

39


చ.

చెలువుగఁ బద్మరాగములు చెక్కిన చక్కని మేఖలల్ సము
జ్జ్వలమగుశ్రోణిచేఁ గనకశైలనితంబము ధిక్కరించి పి

క్కల చెలువంబుచే మరునికాహళకాండధులన్ హసించుదో
హలతఁగలట్టితల్లి మహిషా...

40


చ.

వికసితకింశుకప్రసవవిశ్రుతతామ్రపటాభిగుప్తస
క్థికమృదుభావలక్ష్మి పరికీర్తితకుంకుమపంకలిప్తహా
స్తికకరలక్ష్మిఁ గేర శివదేవునిగేహిని వైనలోకనా
యకివిగదమ్మ యమ్మ మహిషా...

41


చ.

జయజయ దేవతామణివిశాలసమంచితపీఠవాసినీ
జయజయ గంధసారఘనసారసుధారసమంజుభాషిణీ
జయజయ శంకరార్ధతనుసంగవిలాసిని భాస్వరాప్సరో
హయముఖసన్నుతాంగి మహిషా...

42


చ.

జయ జనయిత్రి శోభనవిశాలసుగాత్రి తుషారనచ్ఛిలో
చ్ఛ్రయవరపుత్రి నిత్యజలజప్రసవాంచితనేత్రి సత్కృపా
నయరసపాత్రి నిన్నిఁక ననారతముం భజియింతు నన్ను న
వ్యయదయఁ జూడవమ్మ మహిషా...

43


ఉ.

ఆదర మొప్ప శంకరుని యర్ధశరీరము నాశ్రయించి భా
గ్యోదయలీల మాధవునిసోదరివన్న ప్రసిద్ధి గాంచి య
ష్టాదశపీఠముల్ భువి ప్రసన్నత కెక్కి జగంబు లేలు న
య్యాదిమశక్తి వీవ మహిషా...

44

ఉ.

సోదరి వంబుజాక్షునకు శూలికి నేలికసాని వమ్మ హా
వేదికి ముద్దుకోడలవు విఘ్నపతి ప్రియమాత వెన్నఁగా
నీదయచేఁగదా నిఖిలనిర్జరకోటులకుం జయంబు న
న్నాదృతి సేయవమ్మ మహిషా...

45


ఉ.

తోర మెలర్పఁగాఁ గనకదుర్గయనన్ బురుహూతికాంబనా
నారయ జోగులాంబ భ్రమరాంబ యనన్ మొదలైనలీల లిం
పార వహించి కాంచి మొదలైనపురంబులనిల్చి విన్నపం
బారసి ప్రోతువమ్మ మహిషా...

46


చ.

ఘనముగఁ గాశికావురిని గాంచిన నుజ్జయినిం బురాపురం
బున బెజవాడలోనఁ బరిపూర్ణకృపారసపుణ్యమూర్తివై
జననుతకీర్తిచే నిలుచుచాడ్పున నాహృదయంబునందు నీ
వనయము నిల్వవమ్మ మహిషా...

47


ఉ.

హరిబలప్రభావమున హైమవతీ బగళాముఖీ ప్రచం
డారణభైరవీ ప్రముఖనామములన్ నవకోటిరూపముల్
ధీరతఁ దాల్చి ముఖ్యముగ దీకొని లోకము లేలునట్టి కా
మారివధూటి వీవు మహిషా...

48


చ.

అకలుషపారిజాతనగ మల్లిన మొల్లపున్నాగవల్లి నా
సుకరము గాఁగ శంభుని విశుద్ధశరీరము గౌఁగలించి వ

జ్రకళను శక్రనీలమణి ప్రబ్బినరీతిఁ దనర్చునిన్ను బ్ర
హ్మకుఁ దరమా నుతింప మహిషా...

49


ఉ.

చేకొని నీసతీత్వము ప్రసిద్ధిగ సార్థత దాల్పఁ బ్రాణనా
థాకృతి నాశ్రయించుతఱి నర్మిలిలోఁగుదు వంతకంత న
ల్పాకృతిఁ బూని దీనికి మహాంబునిధిన్ జలజాప్తజాప్రవా
హాకృతి సాక్షిగాదె మహిషా...

50


చ.

ముకురము కేలఁ బూని నిజమూ ర్తిసమాశ్రితసత్స్వరూపభా
వకము పరీక్షఁ జూపి మగవారలనన్నిధి నాడువారియో
మిక యది యెంతమాత్రమని మేలపుమాటలచేతఁ బ్రాణనా
యకు నలరింతువమ్మ మహిషా...

51


ఉ.

శోభితమౌ జవస్ఫటికసూత్రము ద్రిప్పుచు పుస్తకంబు లీ
లాభృతయోగదండము విలక్షణ మొప్పఁ గదంబవల్లి కో
ల్లాభముక్రింద నాత్మకమలంబునఁ దారకనామమంత్ర మా
హా భజియింతు వమ్మ మహిషా...

52


ఉ.

ప్రేమ దలిర్ప నందియును భృంగిమొదల్ గవసాటసిద్ధు లు
ద్ధామత నాడజూచుచుఁ బృథగ్విధిఁ జూతువు మూఁడులోకముల్

నీమది లోకరక్షణవినిద్రము భక్తజనావనక్రియా
యామదయాభిరామ మహిషా...

53


చ.

ఇభముఖకార్తికేయులను నిద్దఱు పుత్త్రుల పిమ్మటన్ భవ
త్ప్రభవుఁడ లాఁతిగాఁ దలఁపఁ బాడియె తల్లివి గావునన్ సదా
విభవము వేఁడినాఁడఁ గనువిచ్చి కనుంగొనికొ మ్మటంచు నా
యభిమత మీయరమ్మ మహిషా...

54


ఉ.

వేదపురాణశాస్త్రములు వేయుముఖంబుల నిన్ భజించు న
వ్వేది యెఱుంగఁజాలఁ డతివిశ్రుతమైనభవత్ప్రసాద మా
పాదన మాచరింతువు కృపారసదృష్టిని గారవించి యిం
ద్రాదులకున్ శుభంబు మహిషా...

55


ఉ.

లోక మనేకలీలల విలోభములేక భరింతు వాశ్రితో
త్సేకశుభంబు నీకరుణచేత ఫలించుచునుండు దేవతా
నీకము నీకుటుంబ మిది నిక్కము నిన్ను భజించుపట్ల న
వ్యాకులబుద్ధి నిమ్ము మహిషా...

56


చ.

సురలకు జీవకఱ్ఱవు త్రిశుద్ధిగ మౌనిజనాళికిన్ సుధా
సరసివి దీనపోషణవిచారము నీకు స్వభావసిద్ధమై
పరగినచిహ్నమౌఁగద ప్రసన్నవు నీవని నమ్మినాఁడ న
న్నరసి భరింపవమ్మ మహిషా...

57


ఉ.

ముప్పదిమూఁడుకోట్లసురముఖ్యులు మౌనులు చేరి కొల్వ కన్

ఱెప్పల సత్కృపారసము నింపుచు సంపదలిచ్చుతల్లి ని
న్నెప్పుడు సంస్మరింతు ప్రియ మేర్పడ మన్నన సేయవమ్మ మా
యప్పవు నీవ సుమ్మ మహిషా...

58


ఉ.

ఈధరణీతలంబున నిఁకెవ్వరు సత్కరుణానుభూతిచే
సాధుల బ్రోచు సాధకులు సత్యము మజ్జనయిత్రివైతి వో
భూధరరాజపుత్రి మణిభూషణభూషితతసన్నుతాంగి వి
ద్యాధరపూజితాంఘ్రి మహిషా...

59


ఉ.

నీమహనీయతేజ మది నీరజబాంధవు నిగ్రహించు నీ
తామరసప్రసూనముఖధన్యత జాబిలి మేలమాడు నీ
భూమదయారసం బమృతపూరము నేరము లెంచుచుండు నో
శ్యామలకోమలాంగి మహిషా...

60


ఉ.

మిక్కిలిసత్కృపన్ దృణము మేరువు చేసెడితల్లి వౌటచే
నక్కట పెక్కుసంపదల కాస యొనర్చితినమ్మ మ్రొక్కుటల్
నిక్కముసుమ్మ నీచరణనీరజముల్ శిరసావహింప నా
కక్కఱసొమ్ము లమ్మ మహిషా...

61


ఉ.

కారణమూర్తి వీవు మురఘస్మరసోదరి నీకృపారస
స్ఫారనిరీక్షణస్థితి నభశ్చరకోటులు వృద్ధిగాంతు రిం

పారఁగ నీవ యేడ్గడ మహర్షులకెల్ల నిరంతరంబు నీ
హారకుభృత్కుమారి మహిషా...

62


ఉ.

బంధురతారహారచయభాసితకంధర యోమదంబ యో
సింధురయాన యోమణివిశేషకలాపలసద్భుజాగ్ర యో
గంధిలపుష్పదామపరికల్పితకైశిక యస్మదీయభా
వాంధత మాన్పవమ్మ మహిషా...

63


ఉ.

దేవకుటుంబినీమణులు దిక్పతికాంతలు మ్రొక్కి చెక్కులన్
వావిరివ్రాయుపత్త్రిక లవశ్యము సస్యమటన్న శంకచే
భావన సేయు నిర్లుగలపాదనఖేందువులొప్పుతల్లి ర
మ్మా వనటల్ నశింప మహిషా...

64


చ.

హరిహయముఖ్యదిక్పతు లహర్నిశ మానతి సేయఁ దన్మనో
హరమకుటాగ్రవజ్రఘృణు లర్ఘ్యము పాద్యము గంధ మక్షతల్
నెరివిరు లంచుఁ జాలఁ గరుణింతువు నమ్మినవారిపట్ల నీ
కరమర లేదు సుమ్ము మహిషా...

65


చ.

మహతి వహించి నారదుఁడు మంధరమధ్యమతారకంబులన్
బహుళములైన గీతములు బాడఁగ నచ్చర లాడఁగా శుభా
వహముగ నోలగం బమరి వత్సలతం జగమేలుతల్లి ని
న్నహరహముం భజింతు మహిషా...

66

చ.

వినుతముకుందకుందముఖవేష్టిత వై యమరీభుజంగకో
పన లిరువంకలం గొలువ భైరవసేవితవై తనర్చి హె
చ్చినకృప సింహపీఠిక వసించి జగత్త్రయమేలుతల్లి ని
న్ననుదినమున్ భజింతు మహిషా...

67


చ.

వరుస దలిర్ప తారకులు వామమొదల్ గలశక్తులున్ సము
ద్ధురగతి సప్తమాతృకలు తుంబురునారదముఖ్యులున్ భవ
చ్ఛరణము లాశ్రయింప ననిశంబుఁ గుతూహలలీలచే మనో
హరత వహించుతల్లి మహిషా...

68


చ.

సకలవచోవిశారదము చందుకళాజితబంధుజీవకిం
శుకము శుకంబు పాణిపయి శోభిలి చాటువు లుగ్గడింపఁ ద
త్ప్రటితవాక్యమాధురికి భావమునన్ ముదమందుతల్లి ని
న్నకలుషభక్తి గొల్తు మహిషా...

69


ఉ.

కారణ మీవ మాకు మము గావు మటంచుఁ దలంచినంతనే
ఘోరరణస్థలిన్ దనుజకోటులగీ టణఁగించి మించునీ
శూరత యేమి చెప్ప బలసూదనముఖ్యుల నిర్వహించి చె
న్నారఁగఁ చేసినావు మహిషా...

70


ఉ.

ఊర్జితసంపదల్ ప్రియము నొంద నొసంగి దయారసైకస
మ్మార్జన మాచరించి నను మన్నన సేయగదమ్మ సర్వథా

వర్జితకల్మషుండనయి వర్ధిలఁజేయఁగదమ్మ సాత్వికో
పార్జితకీర్తు లిమ్మ మహిషా...

71


చ.

అమర భవత్పదాబ్జముల కానతులై నుతిసేయువారికిన్
సముచితధర్మసంగ్రహణసత్వవిచారపరోపకారకా
ర్యముల యెడాట మందు ననయంబు జయంబులెగాని యంతరా
యము లివి లేవు సుమ్ము మహిషా...

72


ఉ.

ఎంతని సన్నుతింతు నిఁక నేగతి నీపదపల్లవంబు ల
ర్చింతు భవత్కృపారసవిశేషము లేగతిఁ గాంతు జడ్య మిం
తింతనరాదు నామది కహాసహనంబు వహించుభారకం
బంతయు నీదె సుమ్ము మహిషా...

73


ఉ.

మందుఁడ భావిదర్శనసమర్థుఁడఁ గాను భవత్ప్రభావముల్
పొందుగ సంస్మరించుటకు బుద్ధి దలిర్పదు జ్ఞానహీనుఁడన్
నందనుపట్ల తల్లి కొకనాఁడును నేరము లగ్గమౌనె నా
యందును నట్ల నీవు మహిషా...

74


చ.

ఖలులకు వేయుసంఖ్యలముఖంబులు వేయుభుజాయుతం బసం
ఖ్యలు కరవాలముల్ గలుగఁ గన్పడుచుందువు శిష్టకోటిచూ
డ్కుల కమృతస్వరూపము కడుం బ్రకటింతువు సత్కృపన్ ద్విధా
యలరెడుతల్లి వీవు మహిషా...

75

ఉ.

ఈత్రిజగంబు లేలుటకు నీశ్వరి వీవు విమర్శనీయదా
మాతృక వీవు నంతటికి మౌనులు వేల్పులు నీప్రభావముల్
నేతురె సన్నుతించుటకు నీవిభుం డాదిమదైవమూర్తి నీ
ఖ్యాతి మహాఘనంబు మహిషా...

76


ఉ.

అప్రతిమాభిమాననిధివర్ధుల కర్థ మొసంగుపట్ల నీ
సుప్రధితప్రభావగుణశుద్ధికృపారసమిశ్రితంబు వి
శ్వప్రభువామభాగమున శాశ్వతరీతిఁ జరించునిత్యస
త్యప్రసవాంబ వీవు మహిషా...

77


చ.

అనిమిషకోటికై రణసహాయము గైకొని నిల్చి జిహ్వచే
దనరఁగ రక్తమూర్పుఁగొని తత్పునరుద్భవరీతి మాన్పుచున్
సునిశితదంతకోణముల శుంభనిశుంభుల వ్రచ్చినట్టి ని
న్ననిశము సంస్మరింతు మహిషా...

78


ఉ.

భానుఫలంబుగాఁ దలంచి పావని మ్రింగి తదుష్మఁ గ్రాగుచున్
గ్లాని వహించి వ్రాలు వెడఁ గంధి నెదుర్కొని పట్టి ఱొమ్మునన్
బూని తనూజుఁ డంచుఁ జలమున్ బలమిచ్చి కృపం బయో రసం
బానఁగ నిచ్చినట్టి మహిషా...

79


చ.

భృశకలితైకభక్తి నినుఁ బేర్కొని పూజ లొనర్ప దన్మనో
వశత వహించి పుత్త్రుఁ డనుసత్సంభావము నించి మించి ప్ర్రా

యశముగఁ గాళిదాసుని మహాకవిగా నొనరించినట్టినీ
యశము నుతింతునమ్మ మహిషా...

80


ఉ.

నీరధులేడు నొక్కటిగ నిండినయంతటికన్న మిన్నయై
పారములేని నీకరుణఁ బ్రస్తుతిఁ జేయఁదరంబె యేరికిన్
సౌరగణాహిజాలమనుజవ్రజసంచితసంపదాగమ
ద్వారమునీసమర్చమహిషా...

81


ఉ.

చిత్రవిచిత్రవైఖరులఁ జేకొని భక్తుల నావరించి స
ర్వత్ర మహత్సుధీత్వఫలవైభవకార్యవిశుద్ధు లిచ్చుసా
విత్రియు నాసరస్వతియుఁ బృథ్వియు వైష్ణవియున్ భవాని గా
యత్రియునాఁగ నీవె మహిషా...

82


ఉ.

అంబుధిసప్తకంబు బలమై జలముబ్బి జగద్వినాశమై
నం బరికించి కంధరమునన్ బ్రియుం గైకొని వారణాసి శూ
లంబున నుద్ధరించి ప్రబలస్థితి శాశ్వతవైన శ్రీప్రసూ
నాంబవు నీవు కావొ మహిషా...

83


ఉ.

ఏయెడఁ జూచినం గలదె యింకొకప్రాపక మర్థికోటికిన్
బాయక తల్లివై సకలభాగ్యము లిచ్చిన నీవె యీవలెన్
శ్రేయములైన నీవె కులశీలవిశేషములైన నీవె దీ
ర్ఘాయువులైన నీవె మహిషా...

84


ఉ.

కొండలపిండుదండిదొరకూఁతురి వై కరివేల్పుతోడువై

తిండికి మెండుచేదుగల తెల్లనిసామికి గేస్తురాలవై
దండిగ నాలుగైదుమెయిదాలుపుకోటులనీటు బూని బ్ర
హ్మాండము లేలుతల్లి మహిషా...

85


ఉ.

ఎంచి తలన్ మెలంగుచెదలేటిని గొంచక మంచుకొండపై
డించి తపంబుసల్పెడికడిందివి గావున నీకు సాముమేన్
బంచెడు వేల్పు డెందమనుపాలకుళంబున నోలలాడురా
యంచవు సుమ్ము నీవు మహిషా...

86


ఉ.

గంగయెడన్ విరాళి యధికంబగునీతని కంచు నెంచి స
ర్వాంగములన్ సువర్ణనలినౌచితి జూపి సురల్ తరంగలీ
లం గనుపట్ట శూలికిఁ జలం బొనరింతువు నీ వగణ్యపు
ణ్యాంగనవౌగదమ్మ మహిషా...

87


ఉ.

ఉల్ల మెలర్ప ని న్గొలుచుచుండెడిపుణ్యులపట్ల నెవ్వరే
ప్రల్లదులై శఠత్వమునఁ బాపపుఁబల్కులు పల్కుచుంద్రొ యా
కల్లరులన్ వధించుటకుఁ గన్నెఱ సేయకమాన విజ్జగం
బల్లలనాడు నట్ల మహిషా...

88


ఉ.

సన్నుతి సేయఁగాఁ దరమె చక్కనికాటుకకంటిచూడ్కి య
త్యున్నతమై కురంగము సముజ్జ్వలతం బ్రకటింపుచుండఁగాఁ

బున్నమచందమామవలెఁ బొల్చి పయోజములన్ హసించునీ
యన్నువనెమ్మొగంబు మహిషా...

89


చ.

ఘనమగుమీనరూపమునఁ గన్నులు కూర్మతచేఁ బ్రపాదముల్
తనరుమృగేంద్రవృత్తి నవలగ్నమునెన్నిన నెన్ను నేమొ య
వ్వనజదళాక్షుఁ డొక్కరుఁడు వారల కన్యుల కెన్ననౌనె నీ
యనుపమసౌష్ఠవంబు మహిషా...

90


చ.

ప్రకటితవజ్రరేఖగల పాదతలంబునఁ గాసరాసురం
గకవికశృంగముల్ నురుముగాఁ దునుమాడుచుఁ ద్రొక్కిపట్టి పా
యక మృగరాజు నెక్కి కొలువై యలరారెడినిన్నుఁ బూజసే
యక యిఁకమాన సుమ్ము మహిషా...

91


చ.

హలకులిశాంకచిహ్నితము లంచితవర్తుల శుద్ధపార్ష్ణికం
బులు ఘనవిద్రుమోపమసముజ్జ్వలగుల్బము లభ్రతారకా
కలితనఖాంకురంబు లభిగణ్యములైన భవత్పదంబు లిం
పలర భజింతునమ్మ మహిషా...

92


ఉ.

దభ్రత యింతలేక సతతంబు భజింతు భవత్పదాబ్జముల్
శుభ్రకళాకలాపపరిశోభితహాస్యముఖారవింద యో
విభ్రమహావభావరసవేల్లితసంభ్రమశాంభవాత్మ యో

యభ్రసమావలగ్న మహీషా...

93


ఉ.

ఆతతవేదశాస్త్రమహిమాన్వితులై విలసిల్లుకుంభభూ
గౌతమముఖ్యు లేర్పఱుపఁగానరు నీవిలసత్ప్రభావ మ
జ్ఞాతను నేను గాంచఁగలనా దయచేసి కృతార్థుఁజేయు వి
ఖ్యాతికి నీవ సుమ్ము మహిషా...

94


ఉ.

నీమహిమంబు లెన్నుటకు నీరజసంభవుఁడైనఁ బూనలేఁ
డే మనుజుండ సత్యగుణహీనుఁడ దీనుఁడఁ బూననేర్తునే
మామకసాపరాధవిధి మాన్పుటకెల్లను నీదె భార మో
హైమవతీ మదంబ మహిషా...

95


ఉ.

అక్కమలాసనాదులకు నైనఁ బరీక్ష యొనర్పరాని నీ
వెక్కడ నీయశోజలధి యెక్కడఁ దత్తదగాధశోధనం
బెక్కడ నాకు నెంచఁబడుటెక్కడ యిట్లు నశక్యసాహసం
బక్కజమౌఁ గదమ్మ మహిషా...

96


చ.

హరిహయశాఖిలేఖిని మహాంబుధి కజ్జలపాత్ర భూతలాం
బరములు సంపుటస్థలులు పంకజసంభవమూర్తివక్తలే
ఖరిహరిదశ్వుఁ డట్లయినఁగాని లిఖింపఁదరంబె నీమనో
హరగుణజాలసంఖ్య మహిషా...

97

చ.

నిరతము నీకథామృతము నిశ్చలతన్ భజియింపఁగంటి నీ
చరణసరోరుహంబులకు సాగిలి మ్రొక్కులిడంగఁగంటి నీ
పరమదయారసప్లుతికిఁ బాత్రుఁడనైతి నిఁ కేమిశంక నా
కరయ ఫలించెఁ గోర్కి మహిషా...

98


చ.

నిను వినుతింతు నంచు నొకనిక్కపుమిక్కిలిసత్కవిక్రమం
బునఁ బనిపూనినాఁడఁ జలమూని పిపీలిక కొండఁ దాల్పఁబూ
నినగతి గాదె యింతటికి నీకృప భక్తులపై సుధారసా
యనము నిజంబుసుమ్మ మహిషా...

99


ఉ.

వారిజసంభవాద్యమరవర్గ మనర్గళలీల నీకథల్
ధీరత నాగమార్థఫణితిన్ నిరతంబు గృతుల్ రచింపఁగా
నే రచియించునల్పకృతి నీకిది గణ్యమె యైనఁగాని నీ
కారయ తుల్యబుద్ధి మహిషా...

100


ఉ.

శ్రీరమణీవిశేషగుణచిహ్నిత వీవు భవత్కృపాప్తిచే
ధీరుఁడ కశ్యపాన్వయుఁడ దిట్టకవీంద్రుడ రామచంద్రుఁడన్
గారవ మొప్ప వృత్తశతకంబురచించితి దీని సన్మణీ
హారముగా గ్రహింపు మహిషాసురమర్దని పుణ్యవర్ధనీ.

101


మహిషాసురమర్దనిశతకము సంపూర్ణము.