భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/లక్ష్మీశతకము

పీఠిక

ఈలక్ష్మీశతకమును రచించినది పరవస్తు మునినాథకవి. ఈతఁడు సాతానివైష్ణవుఁడు. శతకములోని 7-8 పద్యములలోని ప్రశంసవలన నీకవి శేషమఠపీఠాధీశుఁ డగుజియ్యరుమహేంద్రుని కృపాకటాక్షమున అష్టావధానప్రజ్ఞయుఁ గవితానైపుణ్యమును బొందినటుల దెలియుచున్నది. ఈ కవిపుంగవుఁడు నిజాము రాష్ట్రనివాసి. ఏగ్రామవాస్తవ్యుఁడో యేకాలపువాఁడో నిరూపించుటకు వలయు నాధారము లీశతకమున గాన్పించుటలేదు. శతకవైఖరింబట్టి చూడ నీకవి ప్రబంధరచనాసముఁడనియును మిక్కిలియాధునికకవియనియును దోఁచెడిని. రసజ్ఞుఁ డగు నీరచయిత గ్రంథరత్నము లెన్ని కాలగర్భమున నిమిడియున్నవో కదా! కవిసోదరుల పరిశోధనమువలన దక్కుంగల గ్రంథములు లభించునని యాశించియున్నాఁడ. శతకకవులచరిత్ర గూడ నీకవితల్లజుని బేర్కొనియుండలేదు.

ఇది యొకభక్తిరసస్ఫూరిత మగు నొక చిన్నిశతకరత్నము, దీనియందు నూటరెండుకందపద్యములు గలవు. కవి శతకాంతమునఁ దనను మత్తేభవృత్తమునఁ బ్రశంసించికొనియున్నాఁడు.

ఇందలికవిత్వము నిర్దుష్టముగ ద్రాక్షాపాకముతో నాతికాఠిన్యముగా నున్నది. పద్యములయందు శబ్దాలంకారములగు వృత్త్యనుప్రాసము, అంత్యప్రాసము లోనగునవి యుంటచేఁ జదువుటకును వినుటకును గూడ నింపుగానున్నవి. ఈకవిచే రచియింపఁబడిన మఱియొకశతకము "లలితాశతకము”. దానిని విమర్శించితిమిగాని శతకరచయితం గూర్చి యింతకన్న నెక్కుడుగా దెలిసికొనుట కాధారము లేమియు నందు లభింపలేదు. అనర్గళమగు కవితాధారతో భావములను సైతము మించెడు చక్కనిపదగుంఫనలతో నీశతకరత్నమును రచించి యాంధ్రభాషాసరస్వతికి నూతనశోభను గలిగించిన యీ యష్టావధాని కడుస్తుతిపాత్రుఁడు.

ఈయముద్రితశతకమునకుఁ బ్రత్యంతరము వ్రాసియు నత్యవసరమగు మఱికొన్నిభాషావిషయికకార్యంబుల నుంటచే దయతో నాకు దీనికి బీఠిక వ్రాయు నవకాశ మొసంగిన శ్రీమాన్ శేషాద్రిరమణకవులయెడను శతకసంపుటప్రకటనకర్తలగు బ్రహ్మశ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారియెడను గృతజ్ఞుఁడను.

నందిగామ

భాషాసేవకుఁడు

1-6-26

కొణతాలపల్లి సత్యనారాయణ

శ్రీరస్తు

లక్ష్మీశతకము

క.

శ్రీమద్వేంకటవల్లభ
కామిని చేటీకృతేంధ్రకామిని హంసీ
గామిని పక్షికులాధిప
గామిని సకలామరీశిఖామణి లక్ష్మీ.

1


క.

న్యాయిని విష్ణుమనస్సం
స్థాయిని భుజగాధిరాజశాయిని శుభసం
ధాయిని పీతాంబరపరి
ధాయిని సకలార్థసిద్ధిదాయిని లక్ష్మీ.

2


క.

చారుమునీంద్రమనస్సం
చారిణి భక్తసుమనోనుచారిణి వినమ
చ్చారిణి భువనాభినుతా
చారిణి సంతతశుభదవిచారిణి లక్ష్మీ.

3


క.

వృజినసమాజవిభంజని
నిజభక్తమనోబ్జరంజనీ నేత్రవిభా
విజితమదఖంజనీ స
ర్వజగద్రవ్యాంజనీ నిరంజని లక్ష్మీ.

4


క.

ఘనతరదరిద్రశాసిని
వనజవనీవాసినీ సువాసిని సకలో

పనిషత్సభావిభాసిని
యనఘసుధాకుందమందహాసిని లక్ష్మీ.

5


క.

కమలాక్షదివ్యమహిషీ
కమలా పద్మా రమా జగజ్జననీ మా
కమలవనీనిలయామృత
కమలనిధిప్రియకుమారికా శ్రీలక్ష్మీ.

6


క.

భువి శ్రీమచ్ఛేషమఠ ప
రవస్తు జియ్యరు శిరోగ్రరత్నకృపాపాం
గవిభావితాష్టఘంటా
కవితాద్రవిణాఢ్యుఁడను తగంగా లక్ష్మీ.

7


క.

అనుపమకవితారచనా
ఘనప్రవీణుండ మదకుకవిమూర్ధ్నవిలుం
ఠనకుశలహస్తపల్లవుఁ
డను మునినాథాభిధానుఁడను శ్రీలక్ష్మీ.

8


క.

మందారమంజరీమక
రందఝరీమాధురీధురాభరణవచో
బృందంబులు నీపేరిటఁ
గందంబులు చెప్పువాఁడఁ గైకొను లక్ష్మీ.

9


క.

కందంబులు కవి మధురస
కుందంబులు సకలదీనకోకిలచయమా
కందంబులు భక్తజనా
నందంబులు శతకముగ నొనర్తును లక్ష్మీ.

10

క.

సరసోక్తిసరణి సుందర
తరశతకందప్రసూనదామక మతిభ
క్తి రచించి సమర్పించెదఁ
గరుణం గైకొనుము సిరులు గ్రాలఁగ లక్ష్మీ.

11


క.

ప్రణవాకారిణి విష్ణు
ప్రణయిని ప్రణతప్రజార్తిభంజననిపుణీ
ప్రణుతజన మందిరప్రాం
గణవిలసత్పారిజాతకద్రుమ లక్ష్మీ.

12


క.

వైమానికమానవతీ
స్తోమార్పితకల్పవృక్షసుమమాలామో
దామోదితదివ్యాంగీ
సామాగమగానరసహసన్ముఖి లక్ష్మీ.

13


క.

చారుచరణ సారసలా
క్షారససంలక్షితాంబుజాతేక్షణ వ
క్షోరత్ననికేతన మ
ధ్యారమ్యస్థలిని నతజనావని లక్ష్మీ.

14


క.

మునిరాజరాజవదనా
జనసుమనఃపంకజాతసమదాలిని పా
వనశీలినీ మహాశో
భనశాలిని దీనజాలపాలిని లక్ష్మీ.

15


క.

అమృతసఖీ హిమకరబిం
బముఖీ శరణాగతాతిభరణోరుగుణా

భిముఖి గంధర్వసుధాం
శుముఖీ మృదుమధురగానసుముఖీ లక్ష్మీ.

16


క.

సురకమలముఖీ కోమల
కరపల్లవపీడ్యమానకమనీయపదాం
బురుహయుగళీనిరర్గళ
కరుణారసభరితహృదయకమలా లక్ష్మీ.

17


క.

జలజభవప్రముఖాఖిల
నిలింపలీలావతీమణీకరతలసం
చలితమణిచామరచయా
నిలనవటదలకాళిలలితనిటలా లక్ష్మీ.

18


క.

విరజాతరంగిణీక
ర్బురమయసైకతవితానముద్రితచరణాం
బురుహరథాంకుశహలక
ల్పరథాంగదరాబ్జవజ్రలాంఛని లక్ష్మీ.

19


క.

లలితాబ్ధ్యంతరిలామ
ధ్యలసద్వనకుసుమరసఝరావర్ధితక
ల్పలతావితానకలితో
జ్జ్వలచింతారత్నపీఠవాసిని లక్ష్మీ.

20


క.

స్వారాట్ప్రముఖాఖిలబృం
దారకబృందోరుమౌళితటమాణిక్య
స్ఫారకిరణ దీపావళి
నీరాజనరాజతాంఘ్రినీరజ లక్ష్మీ.

21

క.

ఘనమాన్యవళక్షాంబర
మణినాదసభానిశాంతమకుటాదికమం
డనగోదంతావళవా
హనలీలోద్యానవనవిహారిణి లక్ష్మీ.

22


క.

ఇందీవరమిత్రసుధా
స్యందనకౌస్తుభదిగంతసామజసామ్రా
ణ్మందారపుష్పవాటీ
బృందారకధేనుసోదరీమణి లక్ష్మీ.

23


క.

శతమఖముఖనిఖిలహరి
తృతిశతపత్రాననావితానకరసమ
ర్పితచంద్రశకలపేటీ
ధృతరత్నసువర్ణమయకిరీటీ లక్ష్మీ.

24


క.

మధుకైటభవైరిప్రియ
మధురాధరి విలసమానమానాతీత
ప్రథితాసమానవైభవ
సుధామధురవాక్తరంగశోభిని లక్ష్మీ.

25


క.

పరమపదావాసిని సో
మరసాస్వాదనవిలోలమంజులహేమాం
బరశోభిని భక్తప్రియ
వరదాయిని దాంతిబ్రహ్మవాదిని లక్ష్మీ.

26


క.

భూరమణమకుటతటశో
భారత్నమరీచిజాలబాలాతపసు

స్మేరపదాంబుజ భువనా
థారమణీ శంఖచక్రధారిణి లక్ష్మీ.

27


క.

లలితనిజపీఠపార్శ్వ
స్థలసంస్థితవాగ్గిరీంద్రజారతిహస్తో
జ్జ్వలవీటికాకరండక
కళాచికారత్నపాదుకాయుగ లక్ష్మీ.

28


క.

నిరుపమనిర్మలఖేలిని
పరమేశ్వరి యాదిదేవి భక్తజనాళీ
పరతంత్రదివ్యసుమన
స్సరసీరుహపరమపురుషసహచరి లక్ష్మీ.

29


క.

ఆపత్సఖిశుభకరిస
ర్వోపద్రవవారిణీ శుభోజ్జ్వలభక్తా
ళీపారిజాత త్రిభువన
దీపాంకురమంగళాదిదేవత లక్ష్మీ.

30


క.

నృపదృక్కమలావాసిని
నృపసింహాసననివాసినీ సకలమహా
నృపపాలినీ సుదుర్మద
నృవసంఘాతోగ్రశాసినీ శ్రీలక్ష్మీ.

31


క.

యతిహృత్పంకజమధుకరి
పతగాధిపగమని పతితపావనిపరిర
క్షితనిర్జరి జగదుదయ
స్థితిసంహృతికరి యనంతధీనిధి లక్ష్మీ.

32

క.

దిగిభవితానానీతం
బగుచల్లనినీటతేట నభిషేకం బా
డుగరితతలమానికమా
భగవతి లావణ్యవతి ప్రభావతి లక్ష్మీ.

33


క.

పెనుపడగదారికవణం
బును దినెడివయాళి వార్వముపయిం బలుప్రా
మినుకుంగొనవీదులఁ బెం
పున వాహ్యాళిం జరించు ముద్దియ లక్ష్మీ.

34


క.

నలువ నెలతాల్పుమొదలుం
గలవేలుపుతలిరుబోండ్లగములు ననుంగుం
జెలికత్తియలై కొలువం
జెలువారు త్రిలోకజనని శ్రీకరి లక్ష్మీ.

35


క.

నలినాక్షునురఃపీఠిం
గొలువై కచ్ఛపముకుందకుందాదినిధుల్
గొలువ జగంబుల నెనరుం
దలిర్ప రక్షించు భువననాయకి లక్ష్మీ.

36


క.

వినయము శాంతియు సత్యం
బును క్షమయును ధృతియు దానమును శ్రద్ధతపం
బును నీతియు ధర్మంబును
నను నిక్కల నాట్యమాడు నన్నువ లక్ష్మీ.

37


క.

పలుకుఁజెలి మరుగరిత ప
జ్జలఁ గోడఱికము లొనర్పఁ జక్రధరుఁడు మో

సలఁ గార్యభరము దీర్పఁగ
నెలమి జగంబుల భరించు నీశ్వరి లక్ష్మీ.

38


క.

త్వదనుగ్రహపాత్రుండు జ
గదభినుతుం డధికభోగి ఘనయశుఁడు మణీ
సదనచరుండు ప్రబుద్ధియు
సదయుఁడు నృపమకుటఘటితచరణుఁడు లక్ష్మీ.

39


క.

కమలాలయ త్వద్భ్రూవి
భ్రమభేదం బీశదాసవైషమ్యము లో
కము నిమ్నోన్నతము నొన
ర్చు మహాశ్చర్యము తలంచి చూడఁగ లక్ష్మీ.

40


క.

నీనెనరు గొనం బింతని
జానుగఁ గొనియాడఁ దరమె చతురానన పం
చానన షడానన సహ
స్రాననులకు బహుఘృణాగుణాకరి లక్ష్మీ.

41


క.

వరదాయిని సుఖకరి యిం
దిర శ్రీకరి మంగళాధిదేవత యఖిలే
శ్వరి భక్తావని జలధీ
శ్వరి కన్య యనంగ నీకు సంజ్ఞలు లక్ష్మీ.

42


క.

నీవు గలచోటు సరసము
నీవును లేనట్టిచోటు నీరసము జగ
తావని పరిలసదనుకం
పావని రదవసనజితజపావని లక్ష్మీ.

43

క.

కలుములపైదలి బలులే
ములసిలుగులు బాపుతల్లి ముజ్జగములఁ బెం
పలరన్ బ్రోచు యువతి త
మ్ముల నిమ్ముల నాడు ముద్దుముద్దియ లక్ష్మీ.

44


క.

భవదనుకంపకు విను వెలి
యవువాఁడు జనావమతుఁడు నపయశుఁ డబలుం
డవినీతి కుమతి దారి
ద్ర్యవశుఁం డతిమూర్ఖుఁడును దురాశుఁడు లక్ష్మీ.

45


క.

కొమరార నీవు కలిమి క
లిమి కమలా నీవు లేమి లేమి ధరిత్రిన్
గమనీయకపోలముకుర
సమంచితమురారివదనసారస లక్ష్మీ.

46


క.

అకటకట యరుదు నీకత
యొకని ధనాధీశుఁ జేసి యొకనిఁ జెఱిచి వే
ఱొకని మురిపించి యిట్టులఁ
దకతక లాడింతు జగము తడఁబడ లక్ష్మీ.

47


క.

హారమకుటకుండలకే
యూరాదిసమస్తభూషణోజ్జ్వలదివ్యా
కారిణి దారిద్ర్యప్రవి
దారిణి నిను దలఁచువారు ధన్యులు లక్ష్మీ.

48


క.

గురుభక్తిరతులు పరధన
పరచారపరాఙ్ముఖులు సుభాషణులు ధరా

సురహితులు దానశీలురు
సరసాత్ములు త్వత్కృపార్హజనములు లక్ష్మీ.

49


క.

వెలితమ్మిగద్దెఁ గొలువై
జలజభవాద్యమరవరులు స్వనిటలఘటితాం
జలు లై కడు సేవింపఁగ
నెలమి జగం బేలు త్రిభువనేశ్వరి లక్ష్మీ.

50


క.

బలి బిచ్చ మిడక ధర్మ మె
డలి కామక్రోధముల నడరి పరుషపువా
క్కులఁ గ్రూరు లగుచు గర్వము
గలవారలు మీకు మెప్పుగా రిల లక్ష్మీ.

51


క.

పండితుఁ డతఁ జాతఁడు శా
ఘ్యుం డతఁడు కులీనుఁ డతఁడు గుణి యాతఁడు శూ
రుం డాతఁడు ధన్యుం డె
వ్వండు భవత్కరుణ గల్గువాఁ డిల లక్ష్మీ.

52


క.

రమ! యెవనిమొగముపై నీ
బొమ గదలునొ వాఁడు రత్నముకుటుఁ డయి గజేం
ద్రము నెక్కి ముత్తియపుగొడు
గమర సమ న్నృపులఁ జూడ కరుగును లక్ష్మీ.

53


క.

సుమశరుతల్లీ సుగుణౌ
ఘమతల్లీ ప్రార్థితార్థకల్పకవల్లీ
యమరుజగంబులతల్లీ
విమలకృపారసపుపాలవెల్లీ లక్ష్మీ.

54

క.

సరససుమచందనాది సు
పరిమళవస్తుతతియందు భాసిలి యవియున్
ధరియించు ఘనుల సంప
ద్భరితులఁ గావించు పరమపావని లక్ష్మీ.

55


క.

శనిముఖు లష్టమగతి కె
క్కినవిధి కష్టదశ నొసట గీసిన నీప్రా
పునఁగల నరు నే మొనరుతు
రినపుషితాంబుజము దుహిన మేచునె లక్ష్మీ.

56


క.

శ్రీయును భూమియు లక్ష్మియు
నా యభిదానంబులం దనర్చియు భక్త
శ్రేయోదాయిని వగు నిను
బాయక మదిలోఁ దలంతు భక్తిని లక్ష్మీ.

57


క.

తలతొడవుగా ధరింతును
హలకులిశాంకుశకుశేశయాదిశుభాంకో
జ్జ్వల మగుత్వత్పదమలయు
గళ మస్మద్రక్షకై తగంగా లక్ష్మీ.

58


క.

విను దిగ దచ్చిరువార్వెయి
కనులయొడయ లెట్టికన్నుఁగవ గోరుదు రా
వనజదళరుచిదళిత మై
పొనరెడి నీకన్నుగవకు మ్రొక్కుదు లక్ష్మీ.

59


క.

వినఁ గనఁగ విచిత్రము నీ
నెనరుం గలచూడ్కి యెవ్వనిపయిఁ బొలుచు వాఁ

డు నరేంద్రమకుటవిఘటిత
ఘనమణిఘృణిమండితాంఘ్కికమలుఁడు లక్ష్మీ.

60


క.

సిరి నీకు జొహారు పయ
శ్శరధిసుతా నీకు జోత సకలజగదధీ
శ్వరి నీకు మ్రొక్కు కనకాం
బురుహాసిని నీకు గేలుమోడుపు లక్ష్మీ.

61


క.

నరుఁడు నరపాలకుఁడు నీ
కరుణాపాంగములగములఁ గాఁడే యా నీ
కరుణారసముగదా రా
జ్యరమాకలితాభిషేకసలిలము లక్ష్మీ.

62


క.

నీపాలఁ బడితి భక్తా
ళీపాలిని ఘనకృపాలలితశుభదృష్టిన్
మాపాల గలిగి బ్రోవుము
భూపాలార్పితమణీవిభూషణి లక్ష్మీ.

63


క.

నానూతననిక్షేపమ
నానోఁచిన నోముకంట నాభాగ్యమ నా
యానందజలనిధీ నా
మానితమందారకక్షమాజమ లక్ష్మీ.

64


క.

ననుఁ గన్నతల్లి నన్నే
లిన దైవమ నాతపోలలితఫలమాన
న్మనుచు పదార్వన్నెయమల
నను నెనరునఁ బ్రోచు కలిమి నవలా లక్ష్మీ.

65

క.

నీ వని నమ్మితిఁ ద్రిజగ
త్పావని విను నీవినా యితఃపర మెఱుఁగన్
రావే లోకైకేశ్వరి
కావవె భద్రాత్మికా సుఖప్రద లక్ష్మీ.

66


క.

నినుఁదప్ప వెఱె యన్యులఁ
గొనియాడఁగఁ బోను జనని గొనకొనియుం బ్రో
చిన నీవే బ్రోవక యుం
డిన నీవే విను త్రిలోకనాయిక లక్ష్మీ.

67


క.

ఓకమలపాణి యోభువ
నైకజనని యోనమద్గృహాంగణదివిజా
నోకహ! రావే కృపఁ గన
వే కడు నార్తు నను బ్రోవవే వెస లక్ష్మీ.

68


క.

ఘోరదరిద్రసముద్రవి
హారమహాబాడబానలాలింగనమున్
జారుకటాక్షసుధారస
పూరంబుల నార్చి నన్నుఁ బ్రోవుము లక్ష్మీ.

69


క.

ఇమ్మా మదభీష్టంబులు
కొమ్మా మా మ్రొక్కులన్ ముకుందువనుంగుం
గొమ్మా వినవమ్మా మా
యమ్మా వలరాజు గన్న యమ్మా లక్ష్మీ.

70


క.

నిరతము యుష్మచ్చరణాం
బురుహద్వయచింతనాప్రమోదాత్ముఁడ నై

కర మలరారు ననుం గని
గురుకృప రక్షణము సేయఁగూడదె లక్ష్మీ.

71


క.

విను మెన్నికష్టములు బె
ట్టినఁ బడి యోర్చితి నెదం గడిందిధృతిం బెం
పున రక్షింప మనంబున
నెనరించుక కలుగ దకట నీ కిఁక లక్ష్మీ.

72


క.

విను మెటులఁ దప్పదు సుమీ
ఘనసంపద లిచ్చి నన్నుఁ గావక నీ వెం
దును భక్తజనంబులకుం
గనుఁగొన ముంగొంగుపసిఁడి గావే లక్ష్మీ.

73


క.

పరిభవపరిచితి మిక్కిలి
దురవస్థం బెట్టి తార్తి దొరయించితి వ
చ్చెరు వే నేయపరాధం
బురక యెనర్చితి వచింపు మున్నతి లక్ష్మీ.

74


క.

చేసితి చేయంగలపనిఁ
బోసితి పరిభవపుధారఁ బొలియించితి వా
యాసంబుల నిఁకనైనమ
హాసంపద లిచ్చి కావుమా వెస లక్ష్మీ.

75


క.

కనికరపుఁగడలివై నను
ఘనసంపద లిచ్చి యిపుడు కావుమి యటులై
నను నీలసత్కథావళి
గను విద్వత్సభలలోఁ బ్రకాశము లక్ష్మీ.

76

క.

వింటిఁ ద్వదంచితచరితం
బంటి ననుం గరుణఁ బ్రోవు మని నిను నెడఁదం
గంటి భవత్కారుణ్యముఁ
గంటి నిధానంబుఁ గంట గాదే లక్ష్మీ.

77


క.

నొచ్చితి నవమతి నచ్చితి
పెచ్చు గదిరె నిచ్చఁ గచ్చువిత్చైతి కటా
నచ్చి నిను జొచ్చి వచ్చితిఁ
గ్రచ్చర నిప్పచ్చరంబు వ్రచ్చుము లక్ష్మీ.

78


క.

కడుకష్టపెట్టి తిటు లె
క్కుడు గాసిలఁజేసి తొప్పుఁ గుందించితి వా
రడి యింకనైన దీరిచి
గడలుకొనం బ్రోవరాదె గ్రక్కున లక్ష్మీ.

79


క.

నను గృపఁ జూడుము దుస్స్థితు
లను దొలఁగింపుము శుభోజ్జ్వలశ్రీయుతుగా
నొనరింపుము భవదాశ్రిత
జను లాపద్రహితు లనవె చదువులు లక్ష్మీ.

80


క.

నీచూపు లెచటి కేఁగునొ
యాచోటికి నరుగు గలుము లహమహమని నిన్
యాచించుఁ గాదె నాదెస
నాచూపులఁ గను మొకించుకంతయు లక్ష్మీ.

81

క.

నను గావు నను ధరింపుము
నను సత్కృప రక్షసేయు నను నేలుము వే
నను గలుము లొసఁగి ప్రోవుము
నను మన్నింపుమి యెడంద నమ్మితి లక్ష్మీ.

82


క.

నిను వేఁడుదు నినుఁ బొగడుదు
నిను గొలుతు నినుం దలంతు నిను వర్ణింతున్
నిను సంప్రార్థింతు నినున్
వినుతింతున్ గోర్కు లొసఁగు వేగమె లక్ష్మీ.

83


క.

విను తడవేల యొనర్చెదు
పెనుజిక్కులఁ జక్కఁజేసి పెనుపుము సిరులన్
దనివోవ నెనరుచూడ్కుల
నను గనుఁగొని భక్తజనమనఃప్రియ లక్ష్మీ.

84


క.

మదిఁ దలఁచి యర్చనము లి
చ్చెద మ్రొక్కెదఁ గీర్తనంబుఁ జేసెద నిదె నీ
కొదవించు నన్నివిధులు శు
భదములు గావే త్రిలోకపావని లక్ష్మీ.

85


క.

సరసిరుహనివాసిని శుభ
కరిపంకజహస్తపద్మగంధిని భూతే
శ్వరి పద్మిని త్రిభువనసుం
దరి నిన్నుఁ దలంతు లోకనాయిక లక్ష్మీ.

86

క.

అమృతమయాత్మిక సకలా
గమసన్నుత సుప్రసన్నకాంతప్రసాదా
భిముఖి నతార్తివినాశని
కమలా నిను గొల్తు గరుడగామిని లక్ష్మీ.

87


క.

ధనధాన్యకరి శుభంకరి
వినమజ్జనసురసురభి ప్రవిమలాత్మకచం
దనశీతలత్రిభువనవ
ర్థనిదేవి భజింతు నిన్ను దారిణి లక్ష్మీ.

88


క.

సతతానందమయాత్మిక
శ్రుతిమౌళిమణిప్రభావిశోభితశరణో
చతురాననాదిసేవిత
చతుర్భుజ దలంతు నిను యశస్విని లక్ష్మీ.

89


క.

లలితాత్మిక భాస్కరి ని
ర్మలిని హిరణ్మయి సుపర్వమహిళాకర సం
చలచామరమరుదంకుర
చలితాలక యెంతు నిను రసాసఖి లక్ష్మీ.

90


క.

శివ శివకరి యవిభూతి
ప్రవిమర్దని పద్మనిలయ పద్మిని పద్మో
ద్భవ పద్మప్రియ పద్మ
ధ్రువఁ గొలుతు నినున్ సువర్ణరూపిణి లక్ష్మీ.

91

క.

త్రైలోక్యకుటుంబిని ప
ద్మాలయ పద్మమకరాదికానేకనిధీ
వ్యాలీఢపురస్స్థలి నత
పాలిని వినుతింతు నిమ విభావరి లక్ష్మీ.

92


క.

స్థితి సిద్ధి సరస్వతి రతి
ధృతి బుద్ధిం బ్రకృతి దితి నదితి మంగళదే
వత నమృతసుమతి దివ్యా
కృతి నిను గీర్తింతుఁ జిదచిదీశ్వరి లక్ష్మీ.

93


క.

అనఘ వసుంధర వసుదా
యిని తేజస్విని మహేశ్వరేశ్వరి శుభహ
స్తిని నాథసంప్రబోధిని
ధనవాసిని దలఁతు నిను సుధాసఖి లక్ష్మి.

94


క.

శోకవినాశని సుఖద శు
భాకారిణి పద్మ త్రిజగదవనిహిరణ్య
ప్రాకారవినమదమరా
నోకహ నినుఁ గొల్తు హరిమనోహరి లక్ష్మీ.

95


క.

విశ్వజనయిత్రి శాశ్వత
శశ్వత్సంపత్ప్రదన్ బ్రశాంతి నఖిలలో
కేశ్వరి భక్తజనప్రియ
విశ్వాత్మిక దలఁతు నినుఁ బ్రమలివిని లక్ష్మీ.

96

క.

సత్యాత్మిక వసుధారిణి
నిత్యానందస్వరూపిణిం ధాత్రి శతా
దిత్యప్రభ శుచి నభవా
దిత్యప్రణుతాంఘ్రి నిను నుతింతును లక్ష్మీ.

97


క.

శతకోటిచంద్రశీతల
జతురానన మీనకేతుజనని విభూతిన్
సతి పద్మమాలికాధర
నతపోషణి గొలుతు నిను ధనప్రద లక్ష్మీ.

98


క.

దారిద్య ప్రవిదారిణి
నీరేజవనీనిహారిణిన్ బరమశుభా
కారిణి నతపరిభవసం
హారిణి నీను దలఁతుఁ గృతివిహారిణి లక్ష్మీ.

99


క.

నారాయణి దుష్కృతసం
హారిణి నభయప్రదానహస్తాబ్జపయః
పారావారకుమారి ఘృ
ణారాశి తలంతు నిను సనాతని లక్ష్మీ.

100


క.

జయజయ దరిద్రమర్దని
జయజయ భక్తార్తిశమని జయజయ దేవీ
జయజయ మునికవివరనుత
జయజయ నిజభక్తశుభద జయజయ లక్ష్మీ.

101

క.

అలరుం గైతలనేరుపు
గలుగంగా నిన్నుఁ బొగడఁ గాంచితిఁ దలఁపన్
దొలిబాముల నోఁచిన నో
ములపంట ఫలించె సిరులఁ బొదలితి లక్ష్మీ.

102


మ.

అనఘ శ్రీపరవస్తుశేషమఠపీఠాధీశజియ్య ర్మహేం
ద్రనిరాఘాటకృపాకటాక్షర ససంప్రాప్తాష్టఘంటాకవి
త్వనిధి శ్రీశతపత్రసన్మఠమునిస్వామిప్రణీతంబు ధా
త్రిని లక్ష్మీశతకంబు భానుశశిభూభృత్తారమై శోభిలున్.