భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/శ్రీకృష్ణశతకము



పీఠిక

ఈశతకము వ్రాసినకవి దూపాటి వేంకటరత్నమాచార్యులు. వెంకటరంగాచార్యులకుమారుఁడు. లోహితసగోత్రుడు. ఆంధ్రవైష్ణవబ్రాహ్మణుఁడు. ఈ కవి చిన్నతనముననే సంస్కృతాంధ్రము లభ్యసించి ప్రబంధపఠనముతోఁ గాలము గడిపి యుత్తరవయస్సునఁ బద్యరచనమున కారంభించెను. పూర్వవయస్సున విశ్లేషించి గేయములుమాత్రము రచించెను. కవితయందెగాక చిత్రలేఖనమునందునను, గానమందునను నీకవి కుశలుఁడు. “నాదెండ్లవాస" అను పద్యమువలన నీకవి ఈశతకమును నాదెండ్లలో నున్నపుడు రచింప నారంభించెను. అమరావతిలో నున్నపుడు 1-1-20 తేది శతకము పూర్తిచేసితి నని కవి స్వయముగా వ్రాసికొనెను.

శతకకర్త యీకృష్ణశతకమును దనమాతాపితల కంకిత మొసంగి ధన్యుఁడయ్యెను. ఈయన శౌరీ, రామా యను కందశతకములు రామచంద్ర యను సీసపద్యమకుటశతకము రచించెను. అవి పరిశోధించి శుద్ధప్రతి వ్రాయవలసియున్నది.

భగవద్భక్తివిశేషమునఁ గవి మైమఱచి కేవల ధ్యానరూపముగ నీశతకమును గవి రచించెను. ధార నిర్దుష్టముగా మనోహరముగా నున్నదిగాని కవితలో భావసంపద మిక్కిలి కొఱవడియున్నది. ఈ వేంకటరత్నమాచార్య కవి మాకు జ్యేష్టభ్రాత. పసితనమునుండి తెలుఁగుభాషలో మాకభినివేశము గల్గించి మాపురోవృద్దికి దీవించిన యీస్వర్గస్థకవియెడఁ గృతజ్ఞతాసూచకముగ నీశతకమును బ్రచురించితిమి. ఈకవి నాలుగు సంవత్సరముల క్రిందట పరలోకగతుఁడయ్యెను. తమశతకసంపుటములో నీశతకమును బ్రచురించి కవిప్రతిష్ఠ చిరస్థాయి గావించిన ప్రకాశకు లగుశ్రీవావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారియెడఁ గృతజ్ఞులము.

ఇట్లు

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-6-26

శతావధానులు

శ్రీరస్తు

శ్రీకృష్ణశతకము

క.

శ్రీవత్సాంక భుజాంతర
సేవకమందారరాజశేఖరవినుతా
భావజజనకా సజ్జన
పావన రక్షింపు లోకపాలనకృష్ణా.

1


క.

శ్రీవిష్ణుదాసదాసుఁడ
దేవస్తుత విమలభావ దివ్యచరిత్రా
సేవించెద భావించెద
కావించెద వందనములు గావఁగ కృష్ణా.

2


క.

పలుకష్టంబులఁ బడిపడి
పలుమరు పిలచినను బలుక భార మదేరా
యిల నీవంటివదాన్యుఁడు
కలఁడా ముజ్జగములందుఁ గన శ్రీకృష్ణా.

3


క.

పరదైవంబుల వేఁడను
నిరతము నిను నెమ్మనమున నెఱనమ్మిన నన్
సిరు లిచ్చి మనుపవే నీ
కరుణకుఁ బాత్రుండ నంటి గనరా కృష్ణా.

4

క.

భగవద్భాగవతాదుల
కొగి నపచారంబు సలుపుచుండెడిజడుఁడన్
దగ నెట్టులఁ బ్రోచెదవో
సుగతిన్ గృప నొసఁగి మనుపఁ జూడవె కృష్ణా.

5


క.

దాశరథీ భక్తావన
శ్రీశా ప్రద్యుమ్న రాజశేఖరవినుతా
దాశార్హ శ్రీధరా స
ర్వేశా దోషాపహరణ యేలర కృష్ణా.

6


క.

అగణితమణిగణభూషా
నిగమస్తుత సుప్రభావ నిరుపమవేషా
ఖగరాజగమన నరవర
మృగరూపా విగతపాప మృదుపద కృష్ణా.

7


క.

ఎన్నెన్నోవిధముల నా
పన్నుఁడనై సన్ను తింపఁ బన్నగశయనా
కన్నడసేయక రాగద
వన్నా ఘనసుప్రసన్న హరి శ్రీకృష్ణా.

8


క.

మందస్మితాతిసురుచిర
సుందరవదనంబు మహితశోభితకృపతో
డెందం బానందంబిడ
మందరధర చూపుమా రమాధవ కృష్ణా.

9


క.

వందారుసనందనసుర
మందారా సుందరాంగ మందరధర గో

విందా నందయశోదా
నందా వందనము లోకనాయక కృష్ణా.

10


క.

మాధవ రాధాలోలా
సాధుజనావన యువేంద్ర సదయుఁడవై నా
బాధ లెడఁబాపి బ్రోవర
శోధన జేయకుర నన్ను శుభకర కృష్ణా.

11


క.

పాపాటవీకుఠారా
నీపాలం బడితి దేవ నిగమవినుత నన్
గాపాడ రావదేరా
గోపరిపాలక వినీలకుంతల కృష్ణా.

12


క.

భానుశతకోటితేజా
మానవరూపా ముకుంద మధుమదదమనా
మౌనిసుత సుగుణమహితా
దానవగణనాశ యీశ ధరధర కృష్ణా.

13


క.

ఎందాఁక మొరలు పెట్టుదు
నెందాఁక సహింతు బాధ నెందుకు దయరా
దెందుల కేగితివో గో
విందా దయ మనుపుమయ్య విధినుత కృష్ణా.

14


క.

దీనజనరక్షకా వర
ధీనుత సర్వేశ వరద ధీరశరణ్యా
దీనుని నన్ గావర సుగు
ణా నతసురనాథ సత్కృపాకర కృష్ణా.

15

క.

బుద్ధావతార కృష్ణా
యుద్ధవనుతవిమలచరణ యోయఘహరణా
యిద్ధచరిత శ్రీకర యని
రుద్ధా నిను సంస్మరింతు రూఢిగఁ గృష్ణా.

16


క.

బృందారకవందిత మృదు
కందంబుల కుసుమమాల కానుకగా నే
వందనములతో నిచ్చెద
సుందరముగఁ దాల్పవయ్య సుఖకర కృష్ణా.

17


క.

ముదిమిని మది కుదు రొదవదొ
సుదతీమణి లక్ష్మితోడ సుఖముగ నుంటన్
మది నాటదొ నాప్రార్థన
ముదితా నవమోహనాంగ బ్రోవర కృష్ణా.

18


క.

గోవర్ధన ఖలమర్దన
భావజసంకాశరూప భవబంధహరా
నీవే దిక్కని నమ్మితి
శ్రీవల్లభ పద్మనాభ శ్రీహరి కృష్ణా.

19


క.

సతతము నీపదయుగళము
గతిగా మతి నిల్పుటయును కలకాలము నీ
స్తుతిపై నాసక్తియు స
మ్మతిమై దయచేయవయ్య మాధవ కృష్ణా.

20


క.

సేవకజనసంపత్ప్రద
శ్రీవిలసితదివ్యవేష రిపుసంశోషా

పావనమంజులభాషా
నీవే గతి బ్రోవుమయ్య నీచుఁడ కృష్ణా.

21


క.

శ్రీరుక్మిణీమనోహర
కారుణ్యసుధాంబురాశి కమనీయగుణా
సారాచారనిధానా
భూరమణీమణిళత్ర బ్రోవర కృష్ణా.

22


క.

వంచన సేయుట మేలా
పంచశరాకారధీర పరమౌదార్యా
కాంచనచేలా సరగుర
సంచితములఁ దోలి బ్రోవఁజాలవె కృష్ణా.

23


క.

నీపాదభక్తి యుక్తియు
నీపాదార్చకులయందు నిక్కపుమతియున్
బాపపుఁగార్యవిరక్తియు
గోపరిపాలక యొసంగఁ గోరితి కృష్ణా.

24


క.

చక్రముచే రిపుచక్రము
విక్రమ మెసఁగన్ వధించి విభవాధికతన్
శక్రాదులకుం గూర్చిన
వక్రేతరశీల లోకపాలక కృష్ణా.

25


క.

శ్రీద హృషీకేశ సదా
పాదాంబుజసేవ జేతు భవభయహరణా
సాదరమునఁ బ్రోవర కా
కోదరశయనా ప్రశస్తగుణనిధి కృష్ణా.

26

క.

రంగా భీకరపాపవి
భంగా కరుణాంతరంగ పతగతురంగా
శృంగారరూప యలమే
ల్మంగావర ధృతరథాంగ మాధవ కృష్ణా.

27


క.

శరణాగతజనరక్షణ
సురవందిత వాసుదేవ సుగుణాకర స
ద్వరదాయక నీపదముల
నిరతము నెఱనమ్మినాఁడ నిజముగఁ గృష్ణా.

28


క.

దామోదర సంకర్షణ
నామొఱ వినవేర నందనందన శౌరీ
కామితసురభూరుహ శ్రీ
స్వామి సర్వేశ విబుధసన్నుత కృష్ణా.

29


క.

పురుషోత్తమ కరివరదా
మురహర కరుణాలవాల మునినుతశీలా
వరకాంచనచేలా నిను
నిరతము స్మరియింతునయ్య నెమ్మది కృష్ణా.

30


క.

ఆర్తార్తిహరణ నరసం
కీర్తితగుణధుర్య విబుధగేయ సుకార్యా
ధూర్తజనహరణ నిర్మల
కీర్తిఖనీ నిను స్మరింతు కేశవ కృష్ణా.

31


క.

నాదెండ్లవాస శ్రీశా
భూదయితాప్రాణనాథ భోగిశయన నీ

పాదంబులె శరణంటిని
ఖేదం బుడుపవె మునీంద్రకీర్తిత కృష్ణా.

32


క.

గోవర్ధనగిరిధర సం
సేవితసురయూధనాథ శేషశయానా
కావవె శౌరి జనార్దన
భూవనితాలోల పుణ్యపూరుష కృష్ణా.

33


క.

ధర వేంకటరత్నాఖ్యుఁడ
విరచించితీిపద్యరత్నవిశ్రుతహారం
బురుకరుణాకర దాల్పర
కఱవారఁగఁ గాంతు భువనకల్పక కృష్ణా.

34


క.

గోవింద యనెడినామము
భావం బలరంగఁ దలఁతు భావజజనకా
రావే కరుణింపగ నీ
సేవ లొనర్చెదను దాససేవిత కృష్ణా.

35


క.

నరసింహాకృతి దానవు
సురలు వొగడఁ ద్రుంచి విమలసుగుణుని బాలున్
వరకృపచే రక్షించిన
గరుడధ్వజ విమలతేజ కావవె కృష్ణా.

36


క.

వామనకోమలజలద
శ్యామా కరుణాభిరామ సలలితదామా
భామా మనోజసుగుణ
స్తోమా రణరంగభీమ శుభకర కృష్ణా.

37

క.

వరపరశువుచే నృపతుల
శిరముల దునుమాడలేదె శితికంఠనుతా
ఖరకరవిస్ఫురదాస్యా
కరుణాంతఃకరణ మోక్షకారణ కృష్ణా.

38


క.

జనకజను బెండ్లియై ముని
వనటలఁ బోఁగొట్టి యసురవర్యుల ననిలో
దునిమిన తావకరాఘవ
జననకకథన్ సంస్మరింతు సతతము కృష్ణా.

39


క.

అతిచంచలంబు నామతి
సతతము నీపాదసేవ సలుపఁగ వరముల్
శ్రితపక్షపాతి కోరితి
బ్రతికింపవె యాదరించి పావన కృష్ణా.

40


క.

సృష్టిస్థితిలయకారణ
దుష్టాసురహరణ కలుషతోయధితరణా
స్రష్టృముఖదేవవందిత
కష్టములను బాపుమయ్య కడువడి కృష్ణా.

41


క.

కరుణగలదొరవు నీవని
నిరతము నిను నెమ్మనమున నెరనమ్మితి నో
పరతత్వరూప నిరుపమ
వరరత్నకిరీటహారవక్షా కృష్ణా.

42


క.

పూతనప్రాణాపహ నా
చేతఃకమలంబునంఁ జేరి యనవద్యు

స్ఫీతకరుణామరందం
బాతతముగ నించవే దయాకర కృష్ణా.

43


క.

హృదయాధివాసివై స
త్పదవులు ముద మెసఁగ నొసఁగఁ బావనములు నీ
పదముల నెద నెఱనమ్మితి
కదనజయావహ నృసింహ కావవె కృష్ణా.

44


క.

నను బ్రోవ నీకు భరమా
మును దాసులఁ బ్రోవలేదె ముదమెద గదురన్
దనుజహరా వనజకరా
వినుతహరా విజయ వీర విక్రమ కృష్ణా.

45


క.

ఆపదలం బెట్టకు నను
నీపదములె నమ్మినాఁడ నిరతము భవసం
తాపహరా భువనధరా
గోపవరా తే నమోస్తు గుణఖని కృష్ణా.

46


క.

వరదాయక నిను నిరతము
మఱిమఱి నెఱనమ్మినాఁడ మహనీయగుణా
కర ధరధర పురహరనుత
చరణా కరుణామయాత్మ సదయా కృష్ణా.

47


క.

వినియుంటి నీదుమహిమలు
గనఁగా మది గోరియుంటి కనికరమున నో
మునిమానసాబ్జసంస్థిత
నను ధన్యునిజేయ నిన్ను నమ్మితి కృష్ణా.

48

క.

ధీరోదారా పుణ్యవి
చారా నవనీతచోర సారాచారా
మారాకారా నిగమవి
హారా రమణీయరత్నహారా కృష్ణా.

49


క.

యమళార్జునభంజన భవ
కమలోద్భవవినుత పరమకారుణికవరా
కమలారమణీరమణా
కమలనయన గరుడగమన కావవె కృష్ణా.

50


క.

శరణాగతభయహరణా
కరుణాపారీణ దాసకల్మషహరణా
అరవిందసదృశచరణా
ధరణీధర దైత్యదళన దయగను కృష్ణా.

51


క.

ఎన్నెన్నోవిధముల నా
పన్నుఁడనై భక్తిమీఱ భజియించితి నో
పన్నగశయనా వెన్నుఁడ
తిన్నగ దయచూడుమన్న ధీవర కృష్ణా.

52


క.

రారా వసుదేవాత్మజ
రారా రమణీయగాత్ర రారా శౌరీ
రారా ప్రవిమలసద్యశ
రారా యదువంశవీర రారా కృష్ణా.

53


క.

రాసక్రీడాలోలా
దాసావనపారిజాత తాపసవరదా

భాసురమణిమయహారా
వాసవనుతచరణ భువనవల్లభ కృష్ణా.

54


క.

నవరత్నమయకిరీటా
ప్రవిమలయశసుప్రకాశ ప్రణుతసురేశా
కవినుత శ్రీరమణీశా
భువసస్తుత దివ్యసుగుణభూషణ కృష్ణా.

55


క.

దీనజనరక్షకా వర
ధీనుత సర్వేశ వరద దీపితతేజా
దీనుని నన్ గృపఁ గను మో
దానవసంహరణ లోకతారణ కృష్ణా.

56


క.

అవ్యయరూపవిభంజిత
క్రవ్యాదసమూహ విజయరథచోదక నీ
భవ్యతరం బగురూపము
ప్రవ్యక్తము సేయు మిదియ ప్రార్థన కృష్ణా.

57


క.

ఏమనుజుఁడు నీపదయుగ
మేమఱకయె భక్తిభావ మేర్పడ మదిలోఁ
గామించి కోరు నాతఁడు
ధీమంతుం డతఁడె భూమిదేవుఁడు కృష్ణా.

58


క.

నందయశోదాప్రియద స
నందన సంక్రందనాది నానార్థిజనా
నందంకర బృందావన
మందిరహస్తాగ్రనిహిత మందర కృష్ణా.

59

క.

వ్యథ లుడుపగదే మ్రొక్కెద
మధుమథన సమస్తభక్తమానసపదవీ
పథికావతంస రాధా
మధురాధరపానతృప్తమానస కృష్ణా.

60


క.

వాలగవై జలనిధిలోఁ
దేలుచు సోమకుని జంపి దేవత లలరన్
నాలుగువేదంబుల నొగి
మేలుగ విధి కిచ్చినట్టి మేటివి కృష్ణా.

61


క.

సురనిచయకంజపుంజా
కరభాస్కర దనుజరాజకంఠవినిర్యత్
గురురక్తవాహినీగత
పరిషిక్తసుదర్శనప్రభాసుర కృష్ణా.

62


క.

వల్లవతరుణీపల్లవ
సల్లలితాకార క్షీరసాగరశయనా
పల్లవసమమృదుచరణా
చల్లనికృపఁ జూడు నిఖిలజగముల గృష్ణా.

63


క.

అక్షయకరుణారససం
రక్షితపాండవప్రఫుల్లరాజీవాక్షా
శిక్షితరక్షోధ్యక్షా
రక్షింపుమి సర్వలోకరక్షక కృష్ణా.

64


క.

పరమదరిద్రనిపీడితు
ధరణీసురవరుఁ గుచేలుఁ దాపసుని మహ

త్తరలక్ష్మీయుతుఁ జేసిన
కరణిన్ నను గావరాదె కరుణను కృష్ణా.

65


క.

భృత్యానందంకరకకృత
కృత్యునిగాఁ జేయవయ్య కీర్తించెద ని
న్నత్యంతభక్తితోడుత
సత్యాహృదయాబ్జభృంగ శౌరీ కృష్ణా.

66


క.

కరుణాపూరితనేత్రా
దురితలతాదాత్ర లలితతోయదగాత్రా
పరమాద్భుతచారిత్రా
వరమిత్రపవిత్రగోత్రవర్ధన కృష్ణా.

67


క.

శ్రీవిలసితవక్షస్స్థల
భావాతీతప్రభావ భవభయహరణా
భావజసమసౌందర్యా
సేవకజనపారిజాత శివకర కృష్ణా.

68


క.

దురితవిదూరా శ్రీకర
పరమాద్భుతదివ్యచరిత పాలితలోకా
తరణిసుతాతటలీలా
చరదాభీరార్భకప్రసాదన కృష్ణా.

69


క.

కరసంస్థితపంచాయుధ
సురుచిరధారానికృత్తసురవైరికులా
మురళీమనోజ్ఞగాన
స్మరణానంద ప్రపంచజాలక కృష్ణా.

70

క.

ఆద్యంతరహిత యాగమ
వేద్యా ప్రద్యుమ్నవిజయ విక్రమ విష్ణూ
మాద్యద్దానవహరణా
విద్యానిధి నన్ను గావవే శ్రీకృష్ణా.

71


క.

నీమధురాకృతి గాంచఁగఁ
గామితమతి నైతిఁ గాన కారుణికవరా
ఏమో యని విడనాడక
గోమును జెల్లింపవయ్య కొల్చెద కృష్ణా.

72


క.

యదుకులకలశాంబుధిశశి
సదమలయశ సుప్రకాశ సరసిజనయనా
మదనశతకోటిసుందర
కదనవిజయ నిగమగేయ ఘనగుణ కృష్ణా.

73


క.

నీనామమధురసంబును
నానాలుకపైని నిల్ప నతు లొనరింతున్
దీనావన దీప్తానన
సూనాస్త్రసమానరూపశోభిత కృష్ణా.

74


క.

ఏమనుజుఁడు నీపదయుగ
సామీప్యము జేరు నతని సమధికసుకృత
శ్రీమద్భాగ్యము నెన్నఁగ
సామర్థ్యం బున్నె భువనశాసన కృష్ణా.

75


క.

తొలిజన్మపుఁగలుషంబులు
కలఁతలఁ బడఁదోఁచె నన్నుఁ గరుణాదృష్టిన్

దిలకింపర నాశ్రమలను
దొలఁగింపర నిన్ను వేఁడుదును శ్రీకృష్ణా.

76


క.

పరులను వేఁడను నీమృదు
చరణయుగము శరణ మంచు స్వాంతమునందున్
బరిపరిరీతులఁ దలఁచెద
భర ముడిపి యనుగ్రహింపవా శ్రీకృష్ణా.

77


క.

దీనాతిదీను నను విడె
దేని భవత్ప్రతిభ తగ్గు నితరుల వేఁడన్
కానబడనొక్కొ నీకుం
దీనావన నేను చెందు తిప్పలు కృష్ణా.

78


క.

గోపీగోపకగోర
క్షాపరతం గొండఁ గేల సంధించిన నీ
వ్యాపారము భక్తులయెడఁ
జూపింపక ప్రాలుమాలఁ జూతువె కృష్ణా.

79


క.

కలికాలంబున మనుజులు
ఫలహీనుల రైనయట్లు పరమాత్ముండున్
ఫలహీనుఁ డయ్యె నందురు
లలి భక్తులఁ బ్రోవకున్న లాతులు కృష్ణా.

80


క.

మొఱబెట్టిన ద్రౌపదిపైఁ
బరపిన కరుణార్ద్రదృష్టి భక్తులపైనిన్
నెఱపుట భారమె కరుణా
భరణా నీబిరుదు వీటిపఱచెదె కృష్ణా.

81

క.

సిరి కోరలేదు ధరణీ
శ్వరునిం గావింపు మంచుఁ బ్రార్థింపఁగ లే
దఱమర విడి రక్షింపఁగ
స్మరియించితి నాలకింపఁ జను శ్రీకృష్ణా.

82


క.

నాకంటె దీనుఁ డుండెనె
నీకున్ నీభక్తులందు నీవలె కరుణా
లోకనుఁడు నాకు దొరకునె
సాకపు నన్నేల కామజనకా కృష్ణా.

83


క.

కరిమొఱ విని కంపమునన్
బరుగెత్తిన నీకృపార్ద్రభావము నిలుపన్
దరుణ మిది దీనరక్షక
బిరుదము రక్షించుకొనుట పేరిమి కృష్ణా.

84


క.

వ్రజతరుణీరతికేళీ
భజనానందానుకూలపరవశమతి మై
నిజభక్తుల దిలకింపవె
వృజినము సుమి దాసజనుల విడచుట కృష్ణా.

85


క.

సంగరరంగంబున వెను
కంగ యిడినపార్థునకు సమగ్రముగా జ్ఞా
నాంగ మగుగీత దెల్పిన
మంగళవాక్ఖనివి నీవె మాధవ కృష్ణా.

86


క.

లీలాశుకురసనపయిం
గాళీయఫణిఫణములందుఁ గాళిందితటన్

లీల మెయిన్ విహరించిన
లాలితనాట్యం బెదన్ దలంచెద కృష్ణా.

87


క.

వనజభవాదులు నిను గ
నఁజాలక వసట లొందఁ గొమకునిగా నిన్
గని పెంచిన దేవకి పా
వనతరపుణ్యంబు నెన్న వశమే కృష్ణా.

88


క.

మరణించిన గురుతనయులు
త్వరితగతిం దెచ్చి గురునిపర్యంకమునన్
కరుణమెయి నిల్పు నీదగు
గురుభక్తి స్మరింప వశమొకో శ్రీకృష్ణా.

89


క.

గంగాతనయునిబాణము
లంగంబున నాటఁ గ్రీడి నదలించి మహా
సంగరము గోరు విక్రమ
సంగతు నిను సంస్మరింతు సతతము కృష్ణా.

90


క.

మందరము నెత్తుటయు గో
బృందముతోఁ గలసి సంచరించుటయును నీ
యందు గలదైవమానుష
కందళితప్రతిభ దెల్పు గాదే కృష్ణా.

91


క.

తల్లికి బ్రహ్మాండంబులు
మొల్లముగా నోటఁజూపి మోదంబున్ సం
ధిల్లఁగఁ జేసిన నీ మహి
మోల్లసనము సన్నుతింతు నో శ్రీకృష్ణా.

92

క.

ఘనతకయాగాంధులు గను
గొనఁజాలనినిన్ను వారికొమ్మ లెఱిఁగి భో
జనభాజనాదు లొసఁగియుఁ
దనియించిరిగాదె మున్ను తండ్రీ కృష్ణా.

93


క.

హింసారతుండు పాపపుఁ
గంసుఁడు నిను జంప నెంచి కడ కాతండే
ధ్వంసమయిపోయెఁ గరుణా
మాంసలు నీను దెగడి యెవఁడు మను శ్రీకృష్ణా.

94


క.

పసినాఁడే శకటాసురుఁ
గసిమసఁగితి వంతఁ బోక గాలియసురునిన్
విసరిపడవేసితివి నీ
యసదృశవిక్రమము నెంతు హరి శ్రీకృష్ణా.

95


క.

సర్వజగదంతరాత్ముని
గీర్వాణవతంసు నిన్నుఁ గిల్బిషహృదయుల్
సర్వశరణ్యుఁడ వంచును
గర్వంబునఁ దెలియరైరి గద శ్రీకృష్ణా.

96


క.

ఏనెంత నీప్రభావము
గానం బొనరించు టెంత కరుణాదృష్టిన్
మానక బ్రోవుమి సాహసి
నైనందులకున్ సహింపవయ్యా కృష్ణా.

97


క.

హృదయారవిందమున నీ
పదవిజ్ఞానరూపషట్పదమును స

మ్మదమున బంధించినచో
బ్రదికెద నఘముల తరించి బాగుగ కృష్ణా.

98


క.

ఓరాజీవదళాక్షా
యోరాజితతారహార యోకరివరదా
యోరాజవరకుమారా
యోరామా మదనరూప యోశ్రీకృష్ణా.

99


క.

ఓమందహాససుందర
యోమకుటాదికవిభూషణోజ్జ్వలదాస్యా
యోమధుమథనా శ్రీధర
యోమాధవ దనుజవిదళనోత్సుక కృష్ణా.

100


క.

ఓదేవదేవ నీమృదు
పాదము లెద నమ్మినాఁడ భవసంతతులన్
గాదనక తొలఁగఁ ద్రోచి ప్ర
మోదము చేకూర్పవయ్య మునినుత కృష్ణా.

101


క.

ఓకమనీయగుణాకర
లోకేశ్వర లోకవరద లోకశరణ్యా
నీకంటే నాకు దిక్కెవ
రేకాకిని బ్రోవ రాఁగదే శ్రీకృష్ణా.

102


క.

ఓనారాయణ భవహర
సానందమయస్వరూప సర్వసురేశా
దీనావనబిరుదం బీ
దీనుని రక్షించి నిలువు దృఢముగ కృష్ణా.

103

క.

శ్రీవేంకటరంగార్యు సు
ధీవరు మజ్జనకుగురుని ధీరోదారున్
భావాతీతగుణాకరు
సేవించెద స్వర్గవాసు శ్రీకర కృష్ణా.

104


క.

బలరామానుజవిలస
త్సలిలజసంకాశనయన సద్గుణగేయా
సలలితమృదుతరకాయా
చల మేలర సన్నుఁ బ్రోవ సదయా కృష్ణా.

105


క.

జననీజనకులు నిల స
జ్జనవందితు లగుట యెఱిఁగి జగదభినుతిమై
ఘను లగువారికి నీకృతి
వినతుండై యొసఁగినాఁడ వినరా కృష్ణా.

106


క.

మంగళము హరిహయానుజ
మంగళము ఖగేంద్రగమన మధుదైత్యహరా
మంగళము నందనందన
మంగళకౌస్తుభవిభూష మాధవ కృష్ణా.

107


క.

కమలారమణీరమణా
కమలాసనవినుతపాదకమలా విమలా
కమలదళోపమనయనా
కమలధరా కమలనాభ కావవె కృష్ణా.

108