భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/ముకుందరాఘవశతకము



పీఠిక

ఈశతకమును జూలూరి లక్ష్మణకవి రచించెను. ఈయన మధ్వబ్రాహ్మణుఁడు. సుబ్బనార్యుఁడు శేషమ్మలకుమారుఁడు. ఆంధ్రభాషకు నన్నయభట్టారకునివలెఁ బ్రమాణుఁడగు అప్పయార్యుని మనుమఁడు. కవిని గూర్చిన చరిత్రాంశ మీశతకములోనిపద్యములవలన నింతవఱకు మాత్రమె తెలియును. పూర్వముద్రితప్రతిపై గ్రంథకర్త జూలూరి లక్ష్మీనరసు గ్రంథకర్త యని కలదు. వీనినాధారపఱచుకొని కవిజీవితమును గ్రహింపవలసియున్నది.

శతకకర్తయగు లక్ష్మణకవికి లక్ష్మీనరసు అనునామాంతరము గలదు. ఈకవి బ్రౌనుదొరవారియాదరణమున క్రీ.శ. 1800 ప్రాంతమున ననేకగ్రంథములకు వ్యాఖ్యలు వ్రాసియు నిఘంటురచనమునఁ గేలూఁత నొసంగియు మాతృభాషాసేవ గావించి సుప్రసిద్ధుఁడైన జూలూరిఅప్పయశాస్త్రిగారికి మనుమఁడు. అప్పయ్యశాస్త్రిగారు కొన్ని శతకములను రచించిరి. ముకుందరాఘవశతకకర్తయగు లక్ష్మణకవి శాస్త్రిగారికి మనుమఁడు. లక్ష్మణకవిజీవితము శతక కవులచరిత్రమునందు వివరింపఁబడలేదు. ఈ కవిజీవితకాలము నెఱుంగుట కాధారములు తెలియకున్నను బూర్వముద్రణప్రతి నాధారపఱచికొని నిరూపింతము. ఈకవి పితామహుఁడు 1620 ప్రాంతములలో నుండెను. మనుమఁడగు లక్ష్మణకవి ప్రాంతములలో సుప్రసిద్ధుఁడై యుండును. పూర్వముద్రితశతకము దుర్మతిసంవత్సర ఆశ్వయుజ 30 న ముద్రిత మైనట్లు ముఖపత్రమునందుఁ గలదు. ఇది మొన్నటిదుర్మతిగాక యంతకు వెనుకదిగాన పూర్వముద్రణము జరిగి యిప్పటికి అఱువదినాలుగుసంవత్సరములునిండినవి. కావున కవియు ముద్రణకాలమునాఁటివాఁడె యనియు నలువదిసంవత్సరములక్రింద కీర్తిశేషుడైయుండుననియుఁ దోఁచెడిని. కవినివాసాదికము ఇతర గ్రంథములనుగూర్చిన వివరము లేరేని పత్రికాముఖమునఁ బ్రచురించినఁ జరిత్రములలోఁ జేర్ప వీలు కలుగును.

ముకుందరాఘవశతకము నిర్దుష్టముగాఁ బ్రౌఢముగా మనోహరముగా నుండి పఠనయోగ్యముగా నలరారుచున్నది. ఇందు రామాయణకథయంతయు ముఖ్యాంశము లేమాత్రము విడువక రసవత్తరముగా నిముడ్పఁబడియున్నవి. ఆయాఘట్టములలో నంత్యనియమము వృత్త్యనుప్రాసాదిసముచితాలం కారములతో వ్రాయఁబడినపద్యములుగూడఁ గలవు. ఆధునికశతకసంచయమునం దింతటి ప్రౌఢశతకములు లభించుట యరిది. శైలి సులలితముగా ద్రాక్షాపాకమునం దున్నది. భావములు మనోహరముగా నున్నవి. శతకమంతయుఁ జంపకోత్పలమాలికలతో నొప్పియున్నది. ఇతరశతకములవలెఁ గాక యీశతకము వాల్మీకిరామాయణకథానుసారముగా వ్రాయఁబడియుండుటచే బాలరామాయణమువలె సకృత్పఠనయోగ్యమునై యైహికాముష్మికప్రదమై యెప్పుచున్నది.

ఈశతకము తొలిముద్రణము అంటిన విరిగిపోవు సన్నని పెళుసు కాగితములపై మద్రాను ఆదివిద్యానిలయముద్రణాలయమున దుర్మతిసంవత్సరమున ముద్రింపబడెను. పూర్వముద్రణమునఁ గవి యభిప్రాయమునకు భిన్నము లగుదోషము లెన్నియో పడినవి. వ్యాకరణదోషములగు పరుషసరళద్రుతాద్యాదేశములు చాలవఱకు దుష్టములై వికారముగ నుంటచే యథామతి పూర్వగ్రంథానుసారముగా శుద్ధప్రతి వ్రాయించి సంస్కరించి యిప్పటికిఁ బరిశుద్ధముగా ముద్రింప నవకాశము గలిగినది. శ్రీరామభక్తులకు నాంధ్రసారస్వతరసవిదులగు రసికు లకు నీశతకము సంతోషపాత్ర మనుటకు సంశయము లేదు.

ఆంధ్రవాఙ్మయసేవాధురంధరులగు శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రి గారి సత్ప్రయత్నములలో శతకసంపుట ప్రచురణ మొకటి. ఈనూత్నశతకసంపుటహారమున కీముకుందరాఘవశతకము నాయకమణి యనఁదగి యున్నదని మాయభిప్రాయము.

ఇట్లు

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-5-26

శతావధానులు

శ్రీముకుందరాఘవశతకము

బాలకాండము

ఉ.

శ్రీవసుధాత్మజామృదులచిత్తసరోజమిళిందనిత్యసం
భావితవిశ్వతుంద పరిభావితచంద్రముఖారవింద భా
షావర శంకరేంద్రనుత సద్గుణబృంద సుకీర్తికంద సం
సేవకచాతకప్రకరమేచకకంద ముకుందరాఘవా.

1


ఉ.

శ్రీమణికాంచనాంచితవిచిత్రవిభూషణధామ ఘోరసం
గ్రామనిశాటభీమ దశకంఠవిరామ దినేంద్రకోటిరు
గ్ధామగుణాభిరామ భవతారకనామ తమాలవారిద
శ్యామ దినేశవంశకలశార్ణవసోమ ము...

2


ఉ.

శ్రీరఘువంశవీర ఘనచిన్మయదివ్యశరీర దీనమం
దార దురాత్మరాక్షసవిచార మునీంద్రహృదంతరాళసం
చారలసద్విహార ఘనసంసరణాంబుధిమగ్నమానవో
ద్ధార యశేషకల్మషవితానవిదూర ము...

3

ఉ.

అంగజకోటి విభ్రమపదాంగ నికృత్తవిచిత్రకూటసా
రంగ పతంగపుంగవతురంగ మతంగజపోషణాదరో
త్తుంగకృపాంతరంగ పరితోషితభక్తజనాంతరంగ జ
న్యాంగణ శత్రుభీషణకరాత్తరథాంగ ము...

4


చ.

స్థిరమతి వాణి నెంచి కవిశేఖరుల న్వినుతించి యాంధ్రవా
గ్గరిమకు నన్నపార్యుఁ డనఁగాఁ జను జూలురియప్పయార్యు మ
ద్గురుని బితామహుం గొలిచి కూర్చెద రామ భవత్కథావళి
న్వరుసగఁ జిత్తగింపుము కృపామతితోడ ము...

5


ఉ.

హాయిగ సజ్జను ల్వొగడ పార్ధశతద్వయవృత్తసంఖ్య రా
మాయణసత్కథ న్వరుస నందముగా విరచించి జానకీ
నాయక భక్తి నిచ్చెద ఘృణామతిఁ గైకొను చంపకోత్పల
శ్రీయుతమాలికాతతిగఁ బ్రీతి వహించి ము...

6


చ.

సకలగుణాకరుండు నృపసత్తమవీరుఁడు యాచకాళిక
ల్పకుఁడు భవద్గురుత్వపరిలబ్ధికిఁ బాత్రుఁ డగణ్యపుణ్యజా
తకలితగాత్రుఁడౌ దశరథక్షితినేత జెలంగఁడే యయో
ధ్యకు విభుఁడై యశోజితసుధాకరుఁ డౌచు ము...

7


చ.

తనయులు లేమి నద్దశరథక్షితినాథుఁ డెదం దలంచి యిం
పెనయ సుమంత్రమంత్రి వచియించినపద్ధతి ఋశ్యశృంగమౌ

నిని దగదోడి తెచ్చి యవనిన్ హయమేధ మొనర్పఁడే మహా
మునుల యనుజ్ఞ మంత్రవిధి పూతము గాఁగ ము...

8


చ.

బలిమి దశాస్యుచే నొదవుబాధలఁ దెల్పుచు వేల్పులెల్ల యో
జలరుహనాభ దేవరిపు జంపుటకై భువి మానుషాకృతి
న్వెలయ జనింపవే యనుచు వేఁడిన నట్లనె యంచు భక్తవ
త్సలత వహించి తౌ సురలు సంతసమంద ము...

9


చ.

క్రతువు సమాప్తినొందినఁ గరస్థసపాయసరుక్మపాత్రుఁ డా
తతఘనవర్ణుఁ డొక్కరుఁడు తత్క్రతువహ్ని జనించి పుత్రసం
తతిభవకారణంబగు నుదారపుఁ బాయసభక్త మియ్యఁడే
క్షితిపతి కాత్మసమ్మతము చేకురునట్లు ము...

10


చ.

సగమది కోసలేంద్రతనుజాతకు నిచ్చి సుమిత్ర కందులో
సగ మొనగూర్చి యందుఁదగ సామును గైక కొసంగి వెండి యా
సగము సుమిత్ర కిచ్చి నృపచంద్రుఁడు తత్పరమాన్నకల్పితం
బగు సుతలాభ మొందెఁగద యాసతులందు ము...

11


ఉ.

క్రన్నన యాగభాగములు గైకొని దేవత లబ్జగర్భవా
క్యోన్నతి నుర్వి కాననచరోత్తములై జనియింపరే జగ

త్సన్నుత రావణాద్యసురసంతతిపై భుజవిక్రమంబుఁ దా
రెన్ని విధంబులన్ సలుప నిచ్చ దలంచి ము...

12


చ.

దురమున దుష్టదానవులఁ ద్రుంచి జగన్ముద మాచరింప బం
ధురతరనీలమేఘరుచితోఁ దనువొప్పఁగఁ గోపలక్షమా
వరతనయోదరోల్లసితవార్ధిసుధానిధి వై జనించి తౌ
సురవరలెల్ల సంతసిల శోభనశీల ము...

13


చ.

హరినిజరూప మీవురగపాంశము అక్ష్మణుఁడున్ రథాంగ మా
భరతుఁడు కంజ లక్ష్మణునిభ్రాతయుగా పరిచారిసాధన
స్ఫురితుఁడవై సురప్రతతిఁ బ్రోవ జనించితిగాక భూమియం
దరయ మనుష్యమాత్రుఁడవె యర్యమతేజ ము...

14


చ.

సతతము జాతినామములసంగతి నొందని సుప్రసిద్ధిచే
నతులగతిం జెలంగెడు మహాత్ముఁడ వీవు వసిష్ఠముఖ్యు లు
న్నతిఁదగ జాతనామకరణక్రియ లొప్పుగఁ దీర్పఁ బౌరు ల
ద్భుతగతి దీవన ల్పలుకఁ బొల్చితిగాదె ము...

15


ఉ.

అంచితపుణ్యుఁ డాదశరథాధిపుఁ డెట్టితపం బొనర్చెనో
యించుకమాత్రలో జగములెల్ల సృజించు విరించిఁ గన్నయ
భ్యంచితకీర్తి నిన్ను సుతుఁడంచు ముదంబున గారవింపఁగా
మించి నటించితౌ కృప నమేయచరిత్ర ము...

16

చ.

గురువులకెల్ల నొజ్జవయి కోరినవిద్య లొసంగుచుండు నీ
వరుదుగ శిష్యభావమున నంచితభక్తి వసిష్ఠుఁ గొల్చి వే
సరసకళావిచిత్రములజాడ లెఱింగితివౌ భవద్విలా
సరుచిరభావ మేరికి వశంబు గణింప ము...

17


చ.

అరయ భవత్పరాక్రమవిహార మదెట్టిదొ తండ్రియాజ్ఞ సో
దరసహితుండవై సముచితంబుగఁ గౌశికు వెంటనంటి దు
స్తరతరఘోరరాక్షసవితానము నుక్కడగింతునంచు ని
బ్బరముగ నేఁగితౌ చిఱుతప్రాయమునందు ము...

18


చ.

అలఘుకళాప్రపంచనిధి వయ్యును నాసరయూనదీతటిం
జెలఁగుచు గాధినందనునిచేత బలాతిబలాఖ్యలైన వి
ద్యల నుపదేశమై కడుముదంబున నాఁకలి నీరువట్టులన్
సొలయక నేఁగితౌ రిపునిషూదనవాంఛ ము...

19


ఉ.

సంగతిమీరు కౌశిక లసన్ముఖనిర్గతవాక్ప్రపంచమున్
రంగుగవించు వాయుహతి రంగదభంగతరంగసంగతో
త్తుంగవిహంగపుంగవరుతుల్ శ్రుతి కింపొదవింప గంగ ను
ప్పొంగుచు దాటితౌర మునిపుంగవుతోడ ము...

20


చ.

అటవులజాడఁ జేరి పథికావలి నొంచుచు ఘోరమూర్తియై
కుటిలగతిం దనర్చు మదకుంభిసహస్రబలాఢ్య తాటకా

పటుకుధరంబు నేకసితబాణపని న్విదళించి తౌ భవ
త్స్ఫుటరణకృత్యముల్ దలఁపఁ జోద్యముగాదె ము...

21


ఉ.

సమ్మతి నంత వాసవుఁ డొసంగిన పూజ లనుగ్రహించి సా
రమ్మగుబాణసంతతి తిరంబుగఁ గౌశికునొద్ద మంత్రయు
క్తమ్ముగ సంగ్రహించి యుచితస్థితిఁ గాంచితి వంచితాఖిలా
స్త్రమ్ముల కిమ్మవై యొకధరావరులీల ము...

22


చ.

మునిపతి దెల్పు వామనుని పూర్వనివాసకథ ల్కుతూహలం
బెనయఁగ వించు మంజుతరవృక్షచయంబగు తద్వనంబునం
దనరుచునుండు సంయమికదంబము నెయ్యముతో నెదుర్కొనం
జని యట నిల్చితౌ కుశికసంభవుతోడ ము...

23


ఉ.

సంతతనిష్ఠ మౌని విలసన్మఘదీక్ష వహింపఁజూచి దు
ర్దాంతగతి న్నిశాచరులు దంభవిజృంభణలీల నల్ల వే
ద్యంతము నించినం గని శరావళి మాయనడంచితౌ మహా
ధ్వాంతము సంశుల న్వనజబంధుఁడువోలె ము...

24


ఉ.

ఏచి కడంగి యస్త్రయుగ మేయఁగ నందు మరుఛ్ఛరంబు మా
రీచునిఁ బట్టి త్రిప్పి వడిద్రెళ్లఁగ నంబుధి వైచె నంతలో

నీచు సుబాహు పాపకము నీ కొనరించె నిటుల్ విరోధులం
ద్రోచి చెలంగితౌ తబిసి తోషమునొంద ము...

25


చ.

ఉరుతరమైన యజ్ఞఫల మొయ్యన మౌని కొసంగి తన్మునీ
శ్వరుఁడు హితోక్తి నివ్వటిలఁ బల్కినపల్కుల నాలకించుచున్
సరసపదాబ్జలీల మునిసంయుతు సంయమిఁ గొల్చి యేఁగితౌ
కర మనురక్తితోడ జనకక్రతుఁ జూడ ము...

26


చ.

హలకులిశాంకుశధ్వజదరాంబుజరేఖల నొప్పుపాదముల్
దలకొన భూతధాత్రి శుభలక్షణ మొంద నలంకరించుచున్
బొలుపుగ నేఁగి శోణనదిపొంత మునీంద్రులతో వసించితౌ
జలరుహబాంధవుం డపరసాగరమంద ము...

27


చ.

సదమలచిత్తవృత్తి మునిసంతతి గొల్వఁగఁ దారకాళితోఁ
జదలనెసంగు కల్వచెలిచాయ వసించి మునీంద్రచంద్రుఁ డిం
పొదవగఁ దెల్పు తత్కులభవోన్నతి వించును బ్రొద్దు బుచ్చితౌ
ముదము దలిర్ప శోణతటిపొంత వసించి ము...

28


చ.

చతురవచఃప్రవీణతను సంయమివర్యుఁడు దెల్పులోకవి
శ్రుతమగు జాహ్నవీతటినిరూఢసముద్భవమున్ భగీరథ
క్షితిపతివంశవర్తనవిశేషకథల్ దగవించు నేఁగితౌ
పతగతురంగ మాహృదయపంకజభృంగ ము...

29

చ.

సతతవిమోహవిభ్రమత శక్రునిఁ గూడి నిజాధినాథుఁ డు
ద్ధతి శపియింప గ్రావగతిఁ దాల్చి వసించు నహల్యఁ గాంచి యం
చితకృప నాత్మపాదసరకీరుహరేణు వొసంగి శాపసం
గతి నిరసించి తపసికాంత సుతింప ము...

30


చ.

కరము భవత్కటాక్షమును గైకొని చెంగట మంగళాంగవి
స్ఫురణము గల్గి నిల్చిన సముజ్జ్వలకాంతి నహల్యఁ జూచి సా
దరమతి గౌతమవ్రతికిఁ దత్సతిఁ గూర్చి నమస్కరించి స
త్వరముగ నేఁగవే పరమతాపసుఁ గొల్చి ము....

31


చ.

అనుపమలీల నొప్పు మణిహాటకనిర్మితహర్మ్యపఙ్క్తులం
దనరి మఖోచితక్రమసమన్వితయూపవనాళితోడ సొం
పెనసి తసర్పు నమిథిల నింపు దలిర్పఁ బ్రవేశ మందితౌ
జనకుఁ డెదుర్కొనన్ గుశికసంతతితోడ ము...

32


చ.

అడరుచుఁ దాఁకి గాధిసుతుఁ డాత్మబలంబు వసిష్ఠమౌనిచే
సుడివడ రాజధర్మము నసూయమతి న్నిరసించి బ్రాహ్మ్యమున్
బడయఁ దపంబు సేయుట క్రమంబుగ గౌతమసూతి దెల్పినం
గడుమది నాలకింపవె తగన్ గరుణించి ము...

33


చ.

పటుభుజశక్తి మై నృపులు బల్విడి పట్టి కదల్పలేక ప్ర
స్ఫుటమగుసిగ్గుచేఁ జనఁగఁ బొల్చిన రుద్రశరాసనంబు ను

త్కటకలభంబు తమ్మిక్రియ గ్రక్కున లీలఁ దెమల్చి త్రుంచితౌ
చటులరవంబుచే జగము సారె జలింప ము...

34


ఉ.

అంబురుహాక్ష దండ్రికిఁ బ్రియంబగునట్లు సరాలునన్ మహీ
జాంబుజగంధి సిగ్గుపొలయంగ ముదంబున సర్వసౌఖ్యమూ
లంబగు హేమమాలిక గళంబున నుంచి వరించినన్ గటా
క్షంబున నవ్వుజూపొలయఁ గాంచితి గాదె ము...

35


ఉ.

సంతసమొప్ప బంధుజనసంతతితోడ వివాహకృత్య మ
త్యంతము వేడ్కఁ దీర్ప మిథిలాధిపుపంపున సద్గృహంబునం
దెంతయుఁ బొల్చుతండ్రికి మునీశ్వరునాజ్ఞను మ్రొక్కితౌ మహీ
కాంతుఁడు సంభ్రమం బెనసి కౌఁగిలిఁ జేర్ప ము...

36


చ.

తతభవదన్వయక్రమముఁ దా విని యామిథిలేంద్రుఁ డార్యస
న్నుతమతి నాత్మసోదరతనూభవల న్నిజపుత్రి నూర్మిళం
జతగొనఁగూర్చి నీయనుజసంతతి కీదలఁపన్ భవద్గురుం
డతిముదమందఁ గూర్పవె దయామతినట్లు ము...

37


ఉ.

క్రంతలు గొంచు పౌరజనకాంతలు రా మురజాదిరావముల్
చెంతల మ్రోయ వారసరసీరుహనేత్రలు నాట్యమాడఁ జౌ

దంతి వసించి నింద్రుగతి దంత్యధిరూఢత బంధుకోటితో
సంతసమొప్ప నేఁగవె రసాసుత నేల ము...

38


ఉ.

పొంగుచుఁ జంచలాక్షు లతిముగ్ధకటాక్షనిరీక్షలన్ భవ
న్మంగళవిగ్రహద్యుతి సమాజసుధారసమాని మత్తలై
మంగళలీల నారతులు మాటికొసంగఁగ నేగితే మదిం
బొంగు విదేహనాథగృహముం దరియంగ ము...

39


చ.

ఘనమణి విస్ఫురచ్ఛుభదకాంచనతోరణమై తనర్చుస
జ్జనకగృహంబు సొచ్చి విలసన్మణిదీపితపీఠపఙ్క్తిశో
భననినదమ్ము గ్రందుకొని పాటిలఁ దమ్ములతో వసించి తౌ
యనుపమవైభవోన్నతి బుధావలియాజ్ఞ ము...

40


ఉ.

అమ్మిథిలేంద్రుఁ డయ్యవనిజాదికకన్యకలన్ సహేమభూ
షమ్ముగఁ దానొసంగ బలశాసనుఁ డాశచీలీల ధర్మయు
క్తమ్ముగ జానకిం గొనియుఁ దమ్ములకున్ సరసీరుహాక్షులన్
సమ్మతిఁ గాంచు వైభవ మొసంగితి గాదె ము...

41


చ.

సలలితధర్మయుక్తి ననుజన్ములతోడ రసాసుతాదిక
న్యల వరుసన్ వరించి శుచి కంత ప్రదక్షిణ మాచరించి య
ర్థుల నొగి నెల్ల వస్తువులతోఁ దనియించి నివాళి గొంచు స
భ్యులొసఁగు దీవనల్ జెలఁగఁ బొల్చితిగాదె ము...

42

ఉ.

మంగళకృత్యమెల్ల నసమానమహావిభవంబుతోడ నొ
ప్పంగను పండువై మది కభంగమనోరథపూరణంబు సే
యం గడువేడ్కతో నలరి యక్కుశికాత్మజుఁ డేఁగెఁ గాదె రా
ట్పుంగవ సత్కృతుల్ గని తపోవని కంత ము...

43


చ.

అనుపమదివ్యవస్త్రమణిహాటకభూష లొసంగి యంపినం
జనకునియాజ్ఞ గొంచు ననుజత్రితయంబును బంధుకోటియుం
జనువున రాఁగ నేగవె రసాసుతతోడ నయోధ్య కిందిరాం
గన మును బెండ్లియై చనుజగత్పతిలీల ము...

44


చ.

హితముగ నాదునామము వహింపఁగఁ జెల్లునె యంచు రాముఁ డు
ద్ధతి ప్రళయానిలంబుగతిఁ దాఁకినఁ గాంచి భయంబునొంది సం
స్తుతు లొనరించు తండ్రి నటు ద్రోచి పదంపడి రోషభీషణో
ద్ధతి నెదురించితౌ జగము తల్లడమంద ము...

45


చ.

పురహరుజీర్ణచాపము సముద్ధతి ద్రుంచినబంట వౌదువే
ధరధరుదివ్యచాప మిది తక్కక నెక్కిడుమన్న దాని స
త్వరగతి నాత్మశక్తిసహితంబుగఁ జేకొని యెక్కుపెట్టితౌ
సరసత జామదగ్ని నిజసత్యము నెన్న ము...

46


చ.

శరమును వింటఁ గూర్చి పదసంధులు ద్రుంపఁదలంప భీతిఁ జె

చ్చెరఁ దనస్వర్గమార్గములచెంత నిగుడ్పఁగ వేఁడు భార్గవుం
గరుణను గాచి యట్లనె తగంగ నొనర్చి మునీంద్రుఁ బంపి భా
సురముగ నేఁగవే సుగుణశోభితచిత్త ము...

47


ఉ.

అంచితరత్నసౌధవిపులాంగణమంగళతోరణంబునై
మించు నయోధ్య సొచ్చి యెలమిన్ బురకాంతలు లాజలోలి సౌ
ధాంచలవృత్తిఁ జల్ల మురజాదిరవంబు ఘటిల్ల నారతుల్
గొంచు ముదంబునం జనవె కోమలిఁ గూడి ము...

48


ఉ.

చెంతలనుండు నంగనలు చివ్వున నారతులియ్యఁ గొంచు న
భ్యంతరమందిరం బనుగతాత్పత సొచ్చి బుధాళికిన్ సము
త్స్వాంతముతో వధూజనయుతమ్ముగ దమ్ములతోడ మ్రొక్క వే
సంతసమంది దీవన లొసంగుచునుండ ము...

49


చ.

ఖరమతి తాటకం దునిమి కౌశికుజన్నము గాచి వైరిదు
స్తరభుజశక్తి మారరిపుచాపము ద్రుంచి రసాతనూభవం
బరిణయమంది యంత నిజపట్టణ మొంది మనోజసౌఖ్యసా
గరమున దేలి తౌ జనకకన్యకఁ గూడి ము...

50

అయోధ్యాకాండము

ఉ.

ఎల్ల జగంబు లోలి సృజియింపఁగఁ గానఁగ నైన నిన్నుఁ దా
నుల్లసదిచ్ఛ పఙ్క్తిరథుఁ డుర్విభరంబు వహింపుమన్న నీ
వల్లన మానవేంద్రుగతి నౌనని నేమముఁ జెంది తౌ జగ
ద్వల్లభ శాంబరీమనుజతంత్రివి గావె ము...

51


చ.

సరిగనలేని మీవిభుత సైఁపక కైక వరచ్ఛలంబునన్
భరతుని రాజుఁ జేసి వనవాటికి రామునిఁ బంపుమన్న భూ
వరుఁడు కలంగి దత్తవరభంగము నోర్వక ఖేద మందఁడే
కరినుత స్త్రీలదంభములు గాన వశంబె ము...

52


చ.

అలికులవేణితో జలకమాడి విభూషలు మేనఁ దాల్చి యిం
పలరఁడె మిమ్ముఁ బిల్వఁ దగనంపిన సొంపుగ కైక యింటి కీ
వలరుచు నేఁగి తౌ వరశతాంగము నెక్కి శుభాస్పదధ్వనుల్
జెలఁగఁగ భూసుతానుజులుఁ జేరి భజింప ము...

53


ఉ.

రంగుగ నేఁగి కైకగృహరాజము సొచ్చి విపత్తిఁ దూలు దం
డ్రిం గని భీతి తద్వ్యసనరీతి వచింపుమనా యఘాత్మయౌ
చుం గృపమాలి కైక పతిసుద్ది వచించి మిము న్వనాళి కే
గంగను బల్కదే జనులు కంపము నొంద ము...

54

చ.

పరమగుణాఢ్య నీదుపితృవాక్యము దీర్పఁ జతుర్దశాబ్దముల్
కరము వనాళి కేఁగుమని కైక యనం జెలువంది మోము భా
స్కరరుచి సోకుపంకజముచందము నొందఁగ నేఁగఁ బూని తౌ
ధరణిసుతాముఖేందురుచి దైన్యము నొంద ము...


చ.

ఇనకులనాథ నీవు వని కేఁగఁ దలంచుతలం పెఱింగి భూ
తనయయు నార్తి మై యిచట దవ్వుగ నొంటి వసింపఁజాల నో
వనజదళాక్ష నీవెనుక వచ్చెద నాఁ గరుణించి తౌ జగ
జ్జననుత విప్రలంభము వశంబె భరింప ము...

56


ఉ.

చండతరోగ్రకోపమున సయ్యన లక్ష్మణుఁ డేచి యీనరేం
ద్రుం డవివేకియై వనిత రోయక నిన్నిటఁ జేసెనంచు ను
ద్దండతఁ జూప నవ్వి యుచితప్రశక్తులఁ దేర్పఁ గూర్మి నా
తం డెడబాయలేక వెనుదౌలఁడె నిన్ను ము...

57


చ.

చలపరియైన కైక కనుసన్న నొకన్నువ దెచ్చు వల్కలం
బులు ధరియించి ఖేదమున మూర్ఛ వహించిన తండ్రి నూరడం
బలుకుచు మ్రొక్కి కైకకు నమస్కృతి జేసి నిజాంబమందిరం
బొలయఁగ నేఁగి తౌ యనుజు నుర్విజఁ గూడి ము...

58


ఉ.

ఉల్లము ఝల్లనం గని వనోర్వికిఁ బోవు టెఱింగి మూర్ఛలన్
మల్లడిగొంచు హా! ప్రియకుమారక నీకిటు కైకచేతఁ గీ

డెల్ల ఘటించెనే యనుచు నేడ్చెడుతల్లిని నూరడించు చీ
వల్లన మ్రొక్కవే రఘులాభరణంబ ము...

59


ఉ.

అంత సుమిత్రఁ గాంచి వినయంబున మ్రొక్కి నిజాధివాససౌ
ధాంతరమంది రత్నకనకాదుల భూసురకోటి కిచ్చి యే
చింతయు లేక కాననముచెంతఁ జరింపఁదలంచి తౌ నిజ
స్వాంతమునం గురూక్తి పరిపాలన సేయ ము...

60


చ.

అనుపమధన్వి వై జనకుఁ డంపుశతాంగము నెక్కి పౌరు లొ
య్యన గురుబాయుచందమున హా సుగుణాకర మమ్ము డించి డి
గ్గన వని కేఁగెదే యనుచు కైకను దూరుచు వెంటనంట న
వ్వెనయుచు నేఁగవే సుజనభృద్వరశీల ము...

61


ఉ.

శాంతగుణాఢ్య నీ వటుల సాగినఁ దత్పురలక్ష్మియు న్నిశా
కాంతునిఁ బాయురాత్రిగతి కాంతివిహీనత నొందెఁ బ్రాణు ల
త్యంతము చింతలం బొగుల నార్తరవంబు ఘటిల్లె నెందు సు
స్వాంతుఁడ వైన ని న్విడువఁజాలుదురయ్య ము...

62


ఉ.

పూనిక నాజనంబు మదిబుట్టినయార్తి భవత్పదాంబుజ
ధ్యానవశంబునన్ మఱచి తద్దయు రా సరయూనదీతటిన్

యానము నిల్పి యందు జలమాని నిశీథిని బర్ణశయ్య స న్మానము సేయవే మృదులతల్పము నోజ ము...

63


ఉ.

పౌరులు వాయ నీదగునుపాయపుజాడ సుమంత్రుఁ డానిశన్
దేరటఁ దా నయోధ్యదెసఁ దెచ్చియు వే తమసాతరంగిణీ
తీరముకై మరల్పఁ జని తేకువతో నదులెల్ల దాఁటి గం
గారమణీయకూలమును గాంచితి గాదె ము...

64


ఉ.

పాపవినాశ దాశపతి భక్తి నొసంగినకాన్క లంది వే
తాపసవృత్తిమై జటలు దాల్చి సుమంత్రుని బంపి యంత దే
వాపగ నుత్తరించి శ్రమమాననిత్రోవ గుహుండు జూప నా
రోపితచాపతం జనవె రూఢి దలిర్ప ము...

65


చ.

ఘనకుచభారయై యసదుగౌ నసియాడఁగఁ గోమలాంఘ్రు ల
ల్లనఁ దడబాటునొంద నడలన్ గడుదూలి కలంగు జానకి
న్మనమెరియంగఁ జూచి పలుమారును నిల్పులదేర్చు చేఁగవే
యనుపమధైర్య దుర్గమవనాంతరమందు ము...

66


చ.

అగణిత మైన సర్వదురితౌఘము దూలఁగఁజేయఁజాలు స
ద్గగనధునీప్రవాహయుత కాండ కళిందకుమారిచెంత నిం
పుగఁ జనుచోఁ బ్రయాగవటముం గని యందుఁ దపస్విసత్కృతుల్
దగఁ గరుణించి యేఁగవె సధర్మవిచార ము...

67

చ.

అట యమునానదిం గడచి యంతట మాల్యవతీనదీలస
త్తటతరువాటముం బహుళతాపసకూటము విస్ఫురన్మణీ
కటకచరత్సురాధిగతకాంచనకూటము చిత్రకూట మా
దటఁ గని యందు నిల్వ మతి దాల్చితిగాదె ము...

68


చ.

అకలుషనిర్జరప్రకర మల్లనఁ జూచుచు మౌనికోటిచెం
తకుఁ జని మ్రొక్కి సత్కృతి విధానముఁ జెంది నగాగ్రభూమి కొం
కక తప మాచరించుచుఁ దగంగ వసింపవె పర్ణశాలఁ ద
త్సకలసుఖంబులన్ మఱచి సన్మునిగోష్ఠి ము...

69


చ.

కనుఁగొని సీతనేచు నల కాకముపై తృణ మేయ నస్త్రమై
కనలుచు వెంటనంటఁ జగంబులఁ గ్రుమ్మరి దిక్కు లేక భీ
తిని నది యొకృపావననిధీ కరుణించుము నాఁగఁ బ్రోచి తౌ
జనకసుతేశ నీ కెవరు సాటి గణింప ము...

70


ఉ.

ఇమ్ముగ గంగ దాఁటి వని కేఁగెను రాముఁడు నాసుమంత్రువా
క్యమ్మును వించు హా సుగుణ హా కులదీపక హా కుమార యం
చమ్మనుజేంద్రుఁడుం దగనియార్తి మనోవ్యథఁ జెందె నయ్యయో
యెమ్మెయి నీవియోగము సహింపఁగ నేర్చు ము...

71


చ.

ఉరుగతి వేటలాడుతఱి నొందిన శాపము నగ్రభార్యతో

నరుదుగఁ బల్కి పఙ్క్తిరథుఁ డంత భవద్విరహార్తి మీఱఁ ద
త్పరతను రామరామ యని పల్కుచు మేనుఁ దొఱంగె నోమహీ
వరభువి మౌనిశాప మది వమ్మగునయ్య ము...

72


చ.

పతి మృతి యంతటం తెలిసి పంకజనేత్రలు హా నృపాల సూ
నృతపరిపాల యంచలత నేడ్వఁగ నంత వసిష్ఠుఁ డప్పు డా
తతమతి తత్కళేబరము తైలసుపక్వము జేసి పీఠసం
గత మొనరింపఁ జేసెఁగద గౌరవ మొప్ప ము...

73


ఉ.

దూతను బంప వచ్చి భరతుండు భవద్వనయానవార్తయు
న్మాత వచింప మూర్ఛిలుచు మాకెడ జేసితె రామచంద్రు నో
ఘాతుకురాల నీకతనఁ గల్గెగదా యిటులంచు దూరఁడే
భూతనయేశ రాజ్యసుఖము న్నిరసించి ము...

74


చ.

భరతుఁడు తండ్రిఁ జూచి బహుభంగుల ఖేదముఁ జెంది పిమ్మటన్
గురువచనంబుఁ గైకొని యకుంఠితవైదికరీతి తత్కళే
బరము వహించి యంతక్రమభంగి తిలోదకదాన మిచ్చి యు
త్తరకృతులెల్ల సల్పెఁగద తమ్మునితోడ ము...

75


ఉ.

పొందిన రాజ్యసంపదలఁ బూనుట నొల్లక రామచంద్ర యే
చందమునైనఁ దెచ్చి మిము సర్వధరిత్రి భరింపఁజేయువాం

ఛం దగుసైన్యముం గోని వెసన్ భరతుం డరుదెంచఁడే జగ
ద్వందిత నీపదాబ్జములు భక్తిని గొల్వ ము...

76


ఉ.

ఓజను రామచంద్రు నిట నూరికిఁ దేరఁగఁబోదు నా సము
త్భ్రాజితచిత్తుఁ డై గుహుఁ డుదారత మార్గముఁ జూప నాభర
ద్వాజమునీందునాజ్ఞ గొని తమ్మునితో భరతుండు నీపదాం
భోజయుగంబు గొల్తు ననుపూనికె రాఁడె ము...

77


చ.

నినుఁ గనఁ జిత్రకూటము ననిందితుఁడౌ భరతుండు చేరఁగాఁ
గని త్వరతోఁ దదాశయము గానక లక్ష్మణుఁ డాడునిష్ఠురో
క్తిని విని సైఁప కాతని నతిక్రుధతో నదలించి కైకయీ
తనయునిభక్తి దెల్పవె యుదార మటంచు ము...

78


ఉ.

సైనికకోటి నిల్పుచు వెసన్ భరతుం డరుదెంచి మేడల
న్మానుగఁ గ్రీడసల్పు సుకుమారుఁడు నేఁ డిఁటఁ బర్ణశాల సన్
మౌనిగతి న్వసించె నని మాటికిఁ గుందుచు సాగి మ్రొక్కఁడే
సానుజుఁడై శిరంబు భవదంఘ్రులు సోఁక ము...

79


ఉ.

తమ్ముల గారవించి మఱి తండ్రివినాశ మెఱింగి మూర్ఛపైఁ
గ్రమ్మిన వ్రాలి లేచి మది ప్రాకృతుభంగి కలంగి బంధులో
క మ్మొగి వెంటరా ద్రిపథగామిని కేఁగవె రామచంద్ర లో
కమ్మునవారువోలె పితృకార్యముఁ దీర్ప ము...

80

ఉ.

ఆనదిచెంతఁ దండ్రికిఁ దిలాంబువు లిచ్చి యథోచితక్రియల్
జానుఁగ జేసి నిన్నెడయ సైఁపక నెమ్మదిఁ గుందు మాతల
న్మానుగ గారవించి యసమానపువైఖరి కొల్వుఁ దీర్చవే
మౌనిజనంబు కిన్నరసమాజము గొల్వ ము...

81


ఉ.

ఆసభలోపల న్భరతుఁ డంజలి మోడ్చి సమస్తవైభవో
ద్భాసితమైన రాజ్యరమఁ దాల్ప నయోధ్యకు నేఁగుదెంచు మో
భాసురకీర్తి యొండనినఁ బట్టణ మేఁ జొరనొల్ల నంచుఁ ద
ర్భాసనమందు నిల్చెఁ గద ప్రాణము వాయ ము...

82


ఉ.

అక్కట యింత తెంపు తగునయ్య తగన్ పితృవాక్య మేనె పెం
పెక్కఁగ దీర్పకున్న నగరే జగతిన్ కులధర్మమే మదిం
జక్కఁగఁ జూడు మోభరత సత్యము దీరిచి వత్తునంచుఁ బె
న్మక్కుఁవ బల్కి తౌ మునిగణం బలరంగ ము...

83


చ.

గురువచనంబుఁ గైకొనుచుఁ గూరిమి మీ రొసఁగంగఁ బాదుకల్
శిరమునఁ దాల్చి భద్రగజశీర్షమునం దిడి చామరద్వయం
బిరుదెస నేయు చేఁగి భరింయిపఁడె రాజ్యరమాభరం బొగిన్
భరతుఁడు పాదుకాముఖమునం బురినుండి ము...

84


చ.

వరనిజరాజ్యవైభవవిపర్యయ మంది పితృప్రయుక్తి మై
నరుగుచుఁ జిత్రకూటనగమం దనుజన్ముని కంఘ్రిపాదుకల్

కరుణ నొసంగి సీతఁ గొని కానకు నేఁగవె రామచంద్ర యా
భరతుఁడు భక్తిమై మఱల వచ్చునటంచు ము...

85

ఆరణ్యకాండము

ఉ.

పుణ్యచరిత్ర యత్రిమునిపుంగవు వీడ్కొని ఘోరదానవా
గణ్యము సుప్రసిద్ధమునికాండశరణ్యము నైన దండకా
రణ్యము సొచ్చి యందు మునిరాజవిరోధు విరాధు వీతదా
క్షిణ్యునిఁ గాంచవే నగము చెల్వునఁ గ్రాల ము...

86


ఉ.

చండకఠోరశూలమును సయ్యన పైనడరింప దాని కో
దండకళాఢ్యతన్ దునిమి దార్కొని వజ్రనిభాసిచే సురేం
ద్రుండు నగంబు వోలె యవరోధనిరోధు విరాధుఁ ద్రుంచి తా
తండలఖేచరత్వమును దాల్చి నుతింప ము...

87


చ.

ఇరుదెస దేవత ల్గొలువ నింద్రుఁడు వచ్చి తపంబు మెచ్చి చె
చ్చెర దివి కేఁగుదెంచు మని చీరినఁ బోవక జన్మవార్ధి సం
తరణము గోరినం గనిన తచ్ఛరభంగుఁ డొసంగు నర్ఘ్యముల్
గరుణ గ్రహింపవే భువనగణ్యచరిత్ర ము...

88


ఉ.

పూని సుతీక్ష్ణముఖ్యమునిముఖ్యులఁ గొల్చి తదాజ్ఞతోడుతన్

దానవుల న్వధించుచు సదా సుఖకేళిని గల్పవృక్షసం
తానసమంజసమ్ముల వనమ్ముల గ్రుమ్మరుచుం బదేఁడు ల
క్కాన వసింపవే జనకకన్యకఁ గూడి ము...

89


ఉ.

తాపసవృత్తి నిల్వలుఁడు దా మునికోటికి మేషమైనవా
తాపిని వండిపెట్టఁగ నతండు నజీర్ణత వారిఁ జంప ని
ట్లేపుననున్న తద్భటుల నిద్దఱఁ ద్రుంచిన యాయగస్త్యు ని
ష్పాపునిఁ జేరి మ్రొక్కవె కృపాపరిపూర్ణ ము...

90


ఉ.

సమ్మతి నాయగస్త్యమునిచంద్రుఁ డొసంగిన దివ్యఖడ్గయు
గ్మమ్ము నమోఘసాయకసమాజము నక్షయతూణముల్ సుభ
వ్యమ్మగు హేమవైష్ణవశరాసనమున్ గొని పొల్చితౌర రే
ద్రిమ్మరిమూఁకపాలిటిపరేతపులీల ము...

91


చ.

కలశజునాజ్ఞఁ గొంచు ఘనకాయు జటాయుని గారవించి మం
జులతటకుంజపుంజపరిశోభితగౌతమివాహినీలస
జ్జలజసుగంధభారమిళితంబగు పంచవటీస్థలి న్విరా
జిలుచు వసింపవే మునులు జేరి భజింప ము...

92


చ.

స్ఫురితతమాలనీలరుచిశోభితమంగళగాత్ర విస్ఫుర
త్సరసిజపత్రనేత్ర విలసద్భవదాకృతి చుప్పనాతి య

ట్లఱచుచు వచ్చి చూచి వలపందుచుఁ గోరిన నవ్వి లక్ష్మణుం
బరమహితోక్తిఁ జేరుమని బంపవె రామ ము...

93


చ.

అట చని వేఁడఁగా నతఁడు నయ్యయొ నేర్పరి రాముఁ బాసి యి
చ్చటి కరుదెంతురే యబల సాగుమన న్నగుచుండుసీత నా
దటఁ గని చుప్పనాతి బెడిదంబుగఁ బైఁజన నీదుతమ్ముఁ డు
త్కటత విరూపఁ జేయఁడె తగన్ భవదాజ్ఞ ము...

94


ఉ.

ముక్కును గర్ణము లైగిన మ్రోఁగుచు వేఁ జని చుప్పనాతి దా
వెక్కుచు దెల్పినన్ ఖరుఁడు వే పదునల్వురఁ బంపఁ దెంపుమై
స్రుక్కక తాఁకినన్ రూక్షశరాలి నిగుడ్పఁ గూలరే
గ్రక్కున వజ్రభిన్నకుధరంబు లనంగ ము...

95


ఉ.

అంతట నాఖరుండు చతురంగబలంబులతో రణక్రియా
త్యంతనిరూఢిఁ దాఁక వెసఁ దమ్ముని సీతకుఁ గావుఁబెట్టి నీ
వెంతయు మించి నారి మొరయించుచుఁ గ్రోధధురీణశోణనే
త్రాంతుఁడ వౌచుఁ దాఁకవె లయాంతకుభంగి ము...

96


చ.

మసలక నొక్కవ్రేలిడిని మార్కొని యాపదునాల్గువేలర
క్కసులను మంటమీఁది మశకంబులపోల్కి నడంచినట్టి నీ
యసదృశశౌర్య మెన్నఁ దరమా విధికైన బలారికైన రా
క్షసవనవీతిహోత్ర నవసారసనేత్ర ము...

97

చ.

పరువున నేఁగి శూర్పణఖ బన్నము నన్నకుఁ జెప్పుచున్ మనో
హరరుచిరాంగి నీలకుటిలాలక చంద్రనిభాస్య సీతయం
చరుదుగఁ దెల్పఁ బొంగుచు దశాస్యుఁడు గైకొనఁ జూచె మత్తుఁడై
గరళము మ్రింగఁగోరుటయ గాదె తలంప ము...

98


ఉ.

వే చని రావణుండు పృథివీసుతఁ దేఁ జనుదెమ్ము నాభయం
బై చలనంబు నొందుచు దశాస్యునియు క్తిఁ దొలంగలేమి మా
రీచుఁడు వంచనామతిఁ జరింపఁగ బంగరులేడి యై వెసన్
మీచరియించుచోటికిని మెల్కువ రాఁడె ము...

99


ఉ.

వింతగ మేనికాంతి వినువీథి వెలుంగ మనోహరాకృతిన్
గంతులు వైచుచుం జనకకన్యకచక్కటి కేఁగ వేఁడి వి
భ్రాంతిగఁ జూచి నాథ మురిపం బొనరించెడు తేఁగదే కృపా
స్వాంత యటన్న నౌ ననవె వాంఛదలిర్ప ము...

100


చ.

కనకపులేడి యిజ్జగతి గల్గునె చూడ నిశాటుమాయగాఁ
దనరెడుఁ బట్టఁబోలదని తమ్ముఁడు దెల్పిన సీత సమ్మదం
బెననెడిఁ గాన సంశయ మదేలను కృత్రిమమైనఁ ద్రుంచెదం
గనుమని లేడికై చనవె కార్ముక మూని ము...

101


ఉ.

గోచరమౌచు చిక్కకను గ్రుంకులు పెట్టు చరణ్యసీమకున్

వే చన మాయలేడి యని వెన్కొని కిన్కను బాణమేయ మా
రీచుఁడు “లక్ష్మణా” యనుచు రివ్వున గూలఁడె కొండభంగి సీ
తాచపలాక్షిమానసము తాలిమి దూల ము...

102


ఉ.

ఆనినదంబు వించు జనకాత్మజ కుందుచు లక్ష్మణా మహీ
జానికిఁ గీడు దోఁచె నటు సయ్యనఁ బొమ్మన నామహాత్ము నిం
తైనభయంబు జెందఁ డసహాయపరాక్రమశాలి ఖేదము
న్మానుమటంచుఁ బల్కెఁ గద మానినిఁ జూచి ము...

103


చ.

అటు జనకున్నఁ గిన్క వడి “యగ్రజుచేటుఁ దలంచి కాచితే
కుటిలుఁడ నాకునై" యనుచుఁ గోమలి పల్కిన నొచ్చి తల్లి నే
నటు జన నీకు కీడు దొరయంగఁ దలంచు సుమిత్రపుత్రుఁ డ
చ్చొటు వెసఁ బాసి నీదెసకు స్రుక్కుచు రాఁడె ము...

104


ఉ.

కోరిక నంత వృద్ధమునికుంజరుఁడై దశకంఠుఁ డుర్విజం
జేరి నిజస్వరూప మెదఁ జేడ్పడఁ జూపి భయంబునొందు సీ
తారమణీమణిం గొని రథంబున నుంచుక యేఁగఁడే వెసన్
హా రఘునాథ కావుమని యాసతి యేడ్వ ము...

105


ఉ.

ఆనన మెత్తి "యే దశరథాధిపుకోడల రాముభార్యజుం
డోనరులార కావఁ జనుఁ డోసురలార” యటంచు సీత బ

దీనత నేడ్వఁగా విని యెదిర్చి జటాయువు దాఁకఁడే కృపా
హీనుఁడ పోకు పోకు మని యేచి దశాస్యు ము...

106


ఉ.

బిట్టుగఁ దాఁకు గృధ్రపతి బీరముదూల రణం బొనర్చి యా
దిట్టను గూలనేసి యతితీవ్రత రావణుఁ డేఁగ నొక్కపె
న్గట్టున సీత వానరులఁ గన్గొని సొమ్ములు వుచ్చివైవదే
నెట్టన మీకుఁ దెల్పనగు నేర్పు దలిర్ప ము...

107


చ.

చెలఁగుచు రావణుండు పురిఁ జేరి యశోకవని న్నిశాటకాం
తలఁ బరిరక్షతో నునుప ధారుణికన్యక “హా నృపేంద్ర యు
జ్జ్వలగుణసాంద్ర రామ” యని పల్మరుఁ బల్కుచు నీదురాకడం
దలఁచుచు నుండదే భయదదానవువీట ము...

108


చ.

అటు లరుదెంచి లక్ష్మణుఁ డిలాత్మజపల్కులు దెల్ప నుల్కి య
క్కట సతి నొక్కతె న్విడిచి గ్రక్కున వత్తురె మోసపోతి మిం
కెటు లగునో యటంచు మనుజేశ్వరమాత్రుఁడవోలె కుంది య
చ్చటి కరుదెంచవే జనకజ న్వెదుకంగ ము...

109


చ.

వెసఁ జని పర్ణశాల బృథివీసుత గానక భీతిమై మనో
వ్యసనముఁ జెంది కొండల గుహానివహంబుల సర్వదిక్కుల

న్విసువక చూచి కానకయ వేసట నొందవె రామచంద్ర ని
ర్వ్యసనుఁడవయ్యు నమ్మనుజభావము బట్టి ము...

110


ఉ.

సారసగంధి పెంచు మృగశాబకముల్ జనుత్రోవ నేఁగి శృం
గారపుసొమ్ము లొక్కెడను గాంచి కలంగుచు నట్టిజాడ న
ద్ధారుణిఁ బోయి పోయి వసుధంబడియున్న జటాయుఁ జూచి బల్
క్రూరతఁ జూపవే ఖగవరుండు తలంక ము...

111


ఉ.

ఓరఘునాథ సీతఁ గొని యుగ్రత రావణుఁ డేఁగఁ దాఁకి త
ద్ఘోరరణంబునం బడితి ద్రోహిని గానని సీతజాడ నీ
వూరటఁ జెందఁ జెప్పి మృతినొందినఁ గుందుచుఁ బక్షి కగ్నిసం
స్కార మొనర్పవే జనకుచాడ్పున నెంచి ము...

112


చ.

చని చని యొక్కెడన్ ఘననిశాచరబంధు కబంధుఁ డుగ్రుఁడై
తనయిరుచేతులం బొదువ దక్షత బాహులు ద్రుంచి ఘోరమై
తనరెడు తత్కబంధమును దగ్ధ మొనర్చి తదీయశాపమో
చన మొనరించి తీవెగద సద్గుణసాంద్ర ము...

113


ఉ.

ఆమనుజాశి దివ్యుఁడయి యంబరవీథిని నిల్చి యోఘన
శ్యామ భవత్సమవ్యసనుఁడౌ నినపుత్రుఁడు ఋష్యమూకమన్

భూమిధరంబునం గలఁడు పొమ్మట మంగళ మౌనటంచు నెం
తేముదమంద బల్కుచుఁ జనెంగద ము...

114


చ.

విమలు దినేశసూనుఁ గనువేడుకఁ బోయి మతంగమౌనియా
శ్రమమునఁ బ్రీతిమై శబరి సత్కృతిఁ గాంచి ఫలంబు లంది మో
దమునఁ బ్రఫుల్లకంజములతావుల నింపగు పంపచెంత సొం
పమర వసింపవే యనుజుఁ డర్మిలిఁ గొల్వ ము...

115


ఉ.

చెంగట దండకాటవినిఁ జేరి చరించు సువర్ణదంభసా
రంగము కిన్క ద్రుంచి నిజరామను గోల్పడి పక్షి జాడఁ దె
ల్పంగను చేఁగి పంపయను భవ్యసరోవరమందు ధన్వి వై
రంగుగ నిల్చి తౌర మృగరాజి కలంగ ము...

116

కిష్కింధాకాండము

ఉ.

మారుతపుత్రుఁ డర్కసుతమంత్రి కరంబులు మోడ్చి యోజగ
ద్వీరనృపేంద్రులార మునివేషముతో నిట సంచరింపఁగాఁ
గారణ మేమి యెవ్వరొ తగ న్వినఁగోరెదఁ దెల్పుఁడంచు నా
ధీరుఁడు వేఁడఁడే రఘుపతీ మిముఁ గూర్చి ము...

117

చ.

ఇనజుఁడు వాలిచే యువతిహీనత నొంది గృశించుచున్ భవ
ద్ఘనతరమైత్రి గల్గిన సదా ముద మౌననె పంచె వాయునం
దనుఁడను కామరూపి ననిన న్మది విస్మయమంది తమ్మునిం
గనుఁగొని తెల్పుమంచనవె కార్యమురీతి ము...

118


చ.

దశరథరాజనందనుఁ డుదారుఁడు రాముఁడు తండ్రిపల్కుచే
భృశగతి కాన కేఁగి తనయింతినిఁ గోల్పడి తత్కబంధువా
గ్వశమున నివ్వనంబునకు వచ్చెను భానుజుఁ జూడ నిమ్మహా
యశుఁ డని పల్కఁడే యనుజుఁ డాకపితోడ ము...

119


ఉ.

ఈరఘురాముసోదరుఁడ నేను తదంఘ్రులఁ గొల్చి వచ్చితిం
దారకనాముఁ డాశ్రితనిధానము జానకికై కపీంద్రు నిం
పారఁగ వేఁడఁగావలసె హాయని బాష్పము లొల్కనున్న నో
దారిచెఁ గాదె లక్ష్మణు సదాగతిసూతి ము...

120


చ.

ఇనవరనందనుం డతఁడు నే మినవంశ్యుల మట్లు గాన మా
కనయము సఖ్య మై యెసఁగ నర్హముగాదె కపీంద్ర యంచు నా
ననిలసుతుండు నాత్మ ముదమందుచుఁ బొంగఁడె యోమహాత్మ నీ
యనుగతిఁ జూడ నేరికిని హర్షముగాదె ము...

121


ఉ.

ఆవల ఋశ్యమూకగిరి కాకపితోఁ జని యగ్గిచెంత సు
గ్రీవునితోడ సఖ్య మొనరించి యతం డట కేఁగి తెచ్చు సీ

తావిమలాంగి భూషణవితానము జూచి కలంగి యాదశ
గ్రీవు వధింతునం చనవె కిన్క దలిర్ప ము...

122


చ.

అతిబలుఁ డైనవాలి తనయాలిని గైకొని బ్రోచుటెల్ల వి
శ్రుతముగఁ జెప్పి చెప్పి రవిపుత్రుఁడు కుందినఁ దేర్చుచు న్మదో
ద్ధతుఁడగు వాలి ద్రుంప శపథం బొనరించితి వౌ బలాఢ్య యా
శ్రితజనపోషణప్రవణశీలివి గావె ము...

123


చ.

అవనిధరోపమానమగు నచ్చటి దుందుభికాయ మంఘ్రిచే
భువిఁబడఁ జిమ్మి లీలగతి భోరునఁ దాళము లేడుఁ ద్రుంప నా
రవిజుఁడు వింతచే బొదలి ప్రాంజలి యై వినుతింపఁడే మహా
హవజయ నీదుశక్తిఁ దెలియంగఁ దరంబె ము...

124


ఉ.

శ్రీవర నీయనుజ్ఞఁ గొని చివ్వునఁ దాఁకిన వాలి యుగ్రుఁడై
చేవ యడంగ మోది పడఁజిమ్మఁగ స్రుక్కుచు వచ్చి “యోత్రిలో
కావనశీల నీకు దగునయ్య యువేక్ష" యటంచు వేఁడ సు
గ్రీవుని నాదరింపవె సఖిత్వము మీఱ ము...

125


ఉ.

మెండగు పూలదండ నిడి మిత్రసుతుండు ధరించి మించి బ్ర
హ్మాండము నిండ నర్చుచు రయంబున బిల్చిన వచ్చి వాలి యు

ద్దండతఁ దాఁక నొండొరు లుదగ్రత కొండలభంగిఁ బోరరే
భండనభీము లౌచు రుచిభాస్కరు లౌచు ము...

126


ఉ.

అత్తఱి వేఁటకానిగతి నాదట పొంచి కఠోరబాణ మా
యత్తముఁ జేసి వజ్రమున నద్రి సురేంద్రుఁడు గూల్చుమాడ్కి ను
ద్వృత్తిఁ జరించు వాలిఁ బృథివిం బడఁ గూల్చితి వౌ రమేశ దు
శ్చిత్తవధంబు నీసహజశీలమె గాదె ము...

127


చ.

పటుశరవేదనంబునను వాలి కడు న్మిము దూరి దూరి పి
మ్మట భవదీయధర్మయుతమార్గవచోవృతసేవనంబునన్
గుటిలతఁ బాసి నిన్ దలఁచి గొబ్బున స్వర్గము జెందఁడే మదో
త్కటరిపునాశ భ క్తభవతాపవినాశ ము...

128


చ.

ఇలఁ బడియున్న వాలియెద నేడ్చెడు తారఁ దొలంగఁ బుచ్చి ని
ర్మలమగుతచ్ఛరీరము సుమంత్రముగా దహనం బొనర్చి య
వ్వలఁ దగుకృత్యముల్ సలిపి వాలితనూజుఁడు భానుజుండు ని
న్నెలమి భజింప రారె విబుధేశ్వరవంద్య ము...

129


చ.

ఇనజుఁడు నీదుపంపునఁ గపీశ్వరరాజ్యముఁ గాంచి వాలినం
దను యువరాజుఁ జేసి వనితారతుఁడై సుఖియై మహావిభూ
తిని సురరాజు మించె నరుదే తలఁపన్ రఘునాథ నీదుప్రా
పున దృణమైన మేరువయి పొల్చదె రామ ము...

130

ఉ.

ఆగిరిగహ్వరంబున రసాత్మజఁ బేర్కొని మోహమంది వ
ర్షాగమవేళ మానవు క్రియ న్విలపించి తదీయకాల మ
ట్లేఁగఁగ నంత లక్ష్మణు దినేశుసుతున్ బిలువంగఁబంప వే
వేగ నతండు రాకునికి వేసటనొంది ము...

131


ఉ.

చండత లక్ష్మణుండు గురుచాపభుజార్గళుఁడై లయాంతకో
ద్దండత వాఁకిట న్నిలువఁ దారలతో రతికేళి సల్పు మా
ర్తాండసుతుండు భీతిఁగొని తా నెదురేఁగఁడె నమ్రుఁడై లస
త్కాండజనేత్ర నీవిజయధాటికి నోడి ము...

132


చ.

కొరకొర జూచి "రాముఁ డెదఁ గుందుచునుంటఁ దలంప కిట్లు మం
దిరమునఁ గేలిమై మఱచితే యకృతజ్ఞుఁడ! వాలికైన నా
శర మది మొక్కపోదు నినుఁ జంపఁగఁ జాలు" నటంచు లక్ష్మణుం
దురుగతిఁ బల్కఁడే రవిజుఁ డుల్కిపడంగ ము...

133


ఉ.

ఈరవిజుండు మాన్యుఁడు మహిం గృతకృత్యుఁడు వానరావలిన్
దేరఁగఁ బంచినాఁడు నలుదిక్కుల కిట్టిసుహృద్వతంసు ని
ష్కారణ మిట్లనంజనునె సైఁపక యంచు సుమిత్రపుత్రుతోఁ
దార వచింపదే సరసతం దగురీతి ము...

134


చ.

తరణిసుతుండు శాంతలపితంబుల లక్ష్మణు కోప మార్చి వే

తరుచరకోటిఁ గూర్చుకొని ధైర్యముతోఁ బవనాత్మజాదివా
నరనివహంబుఁ గొల్వఁ గరుణారసపూర్ణపయోధివైన మీ
చరణముఁ గొల్వ రాఁడె కపిజాతి నుతింప ము...

135


చ.

రవిజుఁడు నీదుమన్ననల రంజిలుచున్ భవదాజ్ఞ మిత్రసైం
ధవనిభవేగు లౌకపులు నల్గడలం జని సీతఁ జూచియున్
జవమున రాఁగఁ బంపఁడె లసద్రవిదీప్తి జరించుదాఁక శై
లవనసరిత్వయోధ్యవధులం దగఁ దెల్పి ము...

136


ఉ.

సాహసవృత్తి నిశ్చలత సద్గుణజాలము సర్వకార్యని
ర్వాహకశక్తి భక్తియుఁ దిరంబుగఁ జూచి యొసంగవే నృపేం
ద్రా! హనుమంతుచేతికి ధరాసుతకై నిజనామముద్ర యు
త్సాహముతో నతండు తలదాల్చి చెలంగ ము...

137


చ.

తరుచరవీరు లట్లరిగి దర్పముతోడుతఁ బూర్వపశ్చిమో
త్తరదిశలందుఁ బర్వతవితానములం బురదావపంకజా
కరముల నెల్లచోటులను గన్గొని జానకి జాడ గాన కే
మర లిటు రారె నీదెసను మాసములోన ము...

138


చ.

అనిలతనూజముఖ్యులు రయంబున దక్షిణదిక్కుఁ జెంది యో
పినగతి నెల్లెడ న్వెదకి వింధ్యబిలంబునఁ జూచి జానకిన్

గనుఁగొనలేక ఖిన్నులయి కాయముఁ బాయఁగ దర్భలందు స
య్యన బవళింపరే రవిజు నాజ్ఞకు నోడి ము...

139


ఉ.

వాతసుతాంగదాదికపివర్యులు తమ్ము గ్రసింపజూచుసం
పాతికి నెల్లవార్త వినఁబల్కఁగ నాఖగ మాత్మదృష్టిమై
సీతను లంకఁ గంటి నని చెప్పిన వెంటనె పోవరే మహీ
జాతను గాంచ నాకపులు సంద్రముచాయ ము...

140


చ.

జలకణచుంబితాభ్రమగు సాగరముం గని భీతి నంగదా
దులు నిజశక్తు లెన్నుచును దోయము దాఁటఁగలేమిఁ జూచి కౌ
శలమున జాంబవంతుఁ డతిసాధువచస్థితి నాంజనేయు దో
ర్బలమతి నుతింపసాగెఁ గద వార్ధి తరింప ము...

141


చ.

బలజవశాలి వయ్యుఁ జనఁ బాల్పడ కిట్లు తొలంగియుంటివా
జలధి తరింప మా కిఁక వశంబె మరుత్సుత సీతఁ జూచి యు
జ్జ్వలగతి రమ్ము పొ మ్మనుచు భల్లుకనాథుఁడు వేఁడఁ బొంగు చా
యలఘుఁడు బోఁదలంపఁడె ఘనాంబుధి దాఁటి ము...

142


ఉ.

ఖ్యాతిగ వాలిఁ జంపి సఖుఁడౌ రవిసూతికి గీశరాజ్యస
ద్భూతి నొసంగి యంత నిజముద్రిక మారుతి కిచ్చి పంప సం
పాతి వచించుజాడఁ జనవాంఛ నతండును బోఁదలంపఁడే
సీతను గాంచ సాగరము చివ్వున దాటి ము...

143

సుందరకాండము

చ.

పదయుగళంబు చక్క నిడి వార్ధికి మ్రొక్కి భవత్పదాబ్జముల్
హృదయమునందు నిల్పుచు మహేంద్రనగేంద్రము గ్రుంగ దాఁటఁడే
చదలికి మారుతాత్మజుఁడు శైలకుజంబులు పెళ్లగిల్ల నం
బుదములు దూల దోర్జవసముజ్జ్వలుఁ డౌచు ము...

144


చ.

చలిమలపట్టికిం బ్రియము సల్పి వెసన్ సురసన్ మరల్చి పే
రలుకను సింహికం దునిమి యబ్ధి తరించి భవత్ప్రయుక్తమై
పొలసిన చిచ్చు రమ్మనఁగఁ బోయి మరుత్సుతుఁ డాసువేలమన్
బలుగిరి నిల్వఁడే తరణి బాసెడుదాఁక ము...

145


చ.

అనుపమసౌధగోపురసమంచిత మై వెలుగొందు లంక నొ
య్యనఁ గని తద్విచిత్రతకు నచ్చెరువందుచు సూక్ష్మగాత్రుఁడై
చనునెడ లంక నాఁజను నిశాచరి దాఁకిన గెల్చి యంత నే
ర్పునఁ జనఁడే మరుత్సుతుఁడు భూసుతఁ జూడ ము...

146


ఉ.

ఆరజనీచరేంద్రపురి నాలయమంటపసౌధవీథులన్
భూరివిమానరాజమునఁ బోలఁగఁ గన్గొని సీతఁ గాన క

మ్మారుతి చింతనొంది మఱి మంజులతాంతలసద్వనాళి కి
చ్చారతి నేఁగఁడే యచట జానకిఁ జూడ ము...

147


ఉ.

చెక్కిటఁ జెయ్యి జేర్చి బలుచింతలఁ దూలుచు దీనవక్త్రయై
దిక్కట నొండు లేక ఘనతీక్ష్ణమృగాళిఁ గురంగివోలె నా
రక్కసిమూఁకలో భయభరంబునఁ గుందెడుసీతఁ జూడఁడే
యొక్కెడ వాయుజుండు మది కుబ్బు జనింప ము...

148


ఉ.

క్రమ్మరఁ జూచి యావనిత కాంచనగాత్రకళావిభూతి భా
వమ్మున నెంచి నీపలుకువైఖరి నుండుటఁ గాంచి సీతగా
నెమ్మది నిశ్చయించుచు వనేచరుఁ డంత నశోకవృక్షప
ర్ణమ్ముల నుండఁడే తమము గ్రమ్మెడుదాఁక ము...

149


ఉ.

రావణుఁ డానిశీథిని ధరాసుతపైఁ గడుమోహ మంది భూ
షావలి దాల్చి స్త్రీలు గుములై గొలువ న్సఖికేలు బట్టుచున్
ఠీవిగ రాఁడె మత్తకరిణీయుతదిక్కరిభంగి భీతి మై
యావసుధాకుమారి హృదయంబు చలింప ము...

150


చ.

కని వసుధాతనూజ చనుగట్టులు చేతులమాటి పెన్నెరుల్
దనువునఁ గప్పికొంచుఁ గనుదమ్ముల నశ్రులు రాల నున్న స
య్యన ననుఁ జూచి మానిని నిజాంగము డాపఁగ నేల నన్నుఁ జే
కొను మని బల్కఁడే దశముఖుండు మదించి ము...

151

చ.

అలరెడుజవ్వనం బిటుల నారడివోవఁగఁ గుందనేల నేఁ
గలుగఁగ నెల్లసంపదలఁ గైకొని సమ్మతి నాదుసుందరుల్
గొలువ ముదంబుమీఱ ననుఁ గూడి సుఖించుము సుందరాంగి నీ
వలసినరీతియం చనఁడె పఙ్క్తిముఖుండు ము...

152


చ.

అటవుల నాకలంబు దినునల్పుని రామునిఁ గోరె దీవు వాఁ
డిట కెటు వచ్చు వచ్చినను నేగతి గెల్చు వృథాశ లేల ను
త్కటపటువిక్రముండ నను దార్కొన నేరికి శక్య మంచు వా
క్పటుగతిఁ బ్రేలఁడే చెలఁగి పఙ్క్తిశిరుండు ము...

153


చ.

అన విని సీత కుంది తన కడ్డముగాఁ దృణఖండ మూని యే
జనకతనూజ సూర్యకులసత్తముకోడల రామచంద్రు భా
ర్యను నను గూడుకాంక్ష విడు మందనిపండ్లకుఁ జేయిఁ జాతురే
చెనటి యటంచు వానికి వచింపదె రామ ము...

154


ఉ.

వంచన నన్నుఁ దెచ్చి చెడుపల్కుల నాడెదు బంటనంచు న
క్తంచర దుర్మతీ పతిశితప్రదరంబులు నీదుకంఠముల్
ద్రెంచి కులంబుతో నిను వధింపక మానునె ప్రేలెదేల పొ
మ్మంచును సీత బల్కదె దశాననుఁ గిన్క ము...

155


చ.

ఇనకులమౌళి కీవు నను నిచ్చి వినమ్రుఁడ వైన నాథుఁ డొం
డనకను గాచిపుచ్చు శరణాగతరక్షణుఁ డాకృపాళు మ

న్ననఁగను మొండుగాఁ దలఁచిన న్నిను నీకులమున్ వధించుఁ జు
మ్మనుచును సీత పల్కదె దశాస్యునితోడ ము...

156


చ.

సుదతులఁ జంపఁగూడదని చూచిన నీ విపు డోటలేక యా
డెద విటులంచు సీత నదలించి దశాననుఁ డీధరాసుతన్
గొదగొని రెండు మాసములకు న్ననుఁ గైకొనకున్నఁ జంపుఁ డీ
యదయత నంచుఁ బల్కఁడె నిశాటలతోడ ము...

157


చ.

కనలుచు దుష్టదైత్య నిను గ్రద్దన జావ శపింపజాలు దై
నను విభునాజ్ఞ లేమికతన న్శపియింపఁగ నోప నిప్పు డా
జని నిశితోగ్రభల్లములచే నృపచంద్రుఁడె నిన్ను ద్రుంచని
మ్మని మఱి సీత పల్కదె దశాస్యునిఁ గూర్చి ము...

158


చ.

ఉడుకుచు రావణుండు భయదోగ్రత ఖడ్గము దాల్చి సీతపై
కడరఁగ ధాన్యమాలిని యహా సతిఁ జంపుట పాడియే భళా
యుడుగుము నన్నుఁ గూడి సుఖ మొందెదు రమ్మన నవ్వి రాక్షసేం
ద్రుఁడు రతిలోలతం జనఁడె తొయ్యలితోడ ము...

159


చ.

వెస నసురాంగనల్ దివిరి వీఁక ధరాసుత చుట్టుముట్టి రా
క్షసపతి నేల యొల్లవని గర్జన సేయుచు ఖడ్గపాణులై

కసరుచుఁ ద్రుంతుమంచుఁ గినుకన్ ఝళిపింపరె యాలతాంగిహృ
ద్వ్యసనముఁ జెంది కుందుచు మహాభయ మంద ము...

160


ఉ.

చేరువఁ గూర్కు నాత్రిజట చెచ్చెర మేల్కని రామమూర్తికిన్
జారుశుభంబు రాక్షసవిషాదము నౌ కలగంటినంచు ద
న్నారుల కాకలం దెలుప నమ్రత వారలు గొల్చి యుండరే
ధారుణి కన్యకామణిని దర్పము వీడి ము...

161


చ.

సమయముఁ జూచి పావని వెసన్ మిముఁ బేర్కొని సీతఁ గాంచి నే
మము లడుగంగ రావణునిమాయగ నాసతి భ్రాంతి జెంది త
ద్విమలచరిత్ర లెల్ల వినుపించిన నమ్మెద రాముదూతగా
నమలత నంచుఁ బల్కదె వనాటునితోడ ము...

162


ఉ.

రాముఁడు దుష్టదానవవిరాముఁడు ధీరుఁడు మేచకాంబుద
శ్యాముఁడు శుభ్రకీర్తిజితచంద్రుఁడు సద్గుణుఁ డాశ్రితైకచిం
తామణి శోభనుండు కరుణారససాగరుఁ డమ్మయంచు నా
రామచరుండు పల్కఁడె ధరాసుతతోడ ము...


చ.

ధరణిని సత్యసంధుఁడును దర్పకరూపుఁడు బ్రహ్మచర్యత
త్పరుఁడు త్రిలోకపూజ్యుఁడు కృపాళుఁడు విష్ణుఁడు సీత నీమనో
హరునకు సాటి లేదు భువనాళిని నమ్ముము రాముదూత నే
నరమర లేదు లేదనఁడె యావనచారి ము...

164

చ.

కమలదళాక్షి లక్ష్మణుఁడు కాంచనవర్ణుఁడు గాని రామభూ
రమణసమానసద్గుణవిరాజితుఁ డంచు మరుత్సుతుండు శీ
ఘ్రమె మణిముద్ర నిచ్చిన ధరాసుత యక్కునఁ జక్కఁ జేర్చి మో
దము మది నించెఁగాదె మిముఁ దార్కొనుమాడ్కి ము...

165


ఉ.

ఆమహిపుత్రి మీకుశల మారసి వెండి యనర్ఘరత్నచూ
డామణి యానవాలిడి బలంబులతో హనుమంత వేగ శ్రీ
రాములఁ దోడి తెమ్మన సరాలున మ్రొక్కి యతండు మించి యా
రామము డుల్చి పుచ్చఁడె పరాక్రమలీల ము...

166


ఉ.

చండత నక్షముఖ్యదనుజచ్ఛట రావణునాజ్ఞఁ దాఁకి యు
ద్దండబలంబుఁ జూప బెడిదంబుగ వాలముఁ ద్రిప్పికొట్టి దో
ర్దండపదంబులం బొడిచి తన్ని నఖంబులఁ జీరి త్రుంచఁడే
మెండగుతద్బలంబును సమీరసుతుండు ము...

167


ఉ.

మండుచు మేఘనాదుఁ డసమానబలంబునఁ దాఁకి విశ్వసృ
ట్కాండము వింటఁ గూర్చి గినుకం బరగించినఁ జిక్కె వాయుపు
త్రుండు చలించి యబ్బిరుసుతూపునకౌ ఖగరాజకాండ య
క్కాండజగర్భుమాట వృథ గాఁదగునయ్య ము...

168


ఉ.

గ్రక్కునఁ గట్టి తేరఁ గని రావణుఁ డిందుల కేమి వచ్చెనో
యెక్కడివాఁడొ వీఁ డనఁగ నే హనుమంతుఁడ రాముదూత రా

నిక్కము సీతఁ జూడఁగను నే నిట వచ్చితి వచ్చితి న్నిను
న్మక్కువ జూడ నిట్లనఁడె మారుతసూతి ము...

169


ఉ.

వంచన భూమిపుత్రిఁ గొనివచ్చిన తుచ్ఛుఁడ రాము నల్పుగా
నెంచితివో పయోధుల రహి న్నినుముంచిన వాలిఁ ద్రుంచె ఖం
డించె ఖరాదిదైత్యులను లీలగ నాఘనుతోడి వైరము
న్మంచిది గాదటం చనఁడె మారుతి మీఱి ము...

170


ఉ.

ఆవిధి నీకు ము న్నొసఁగినట్టివరంబు మనుష్యకోటిచేఁ
జావకయుండఁ గాదు నరజన్ముఁడు రాముఁడు గాన యోదశ
గ్రీవుఁడ భూతనూజకయి కిన్క రణంబున సంహరించు ని
న్నావసుధేశుఁ డంచనఁడె యావనచారి ము...

171


ఉ.

ప్రాణముఁ గోరితేని జనకాత్మజ రామున కిచ్చి యాజగ
త్ప్రాణుని ప్రాపుఁ గైకొనుము రావణ తక్కినఁ జత్తువన్న న
క్షీణతరోగ్రకోపమును జెంది వధింపఁ దలంచఁడే జగ
త్ప్రాణకుమారు నాదనుజపాలకుఁ డేచి ము...

172


ఉ.

దూత యవధ్యుఁ డంచుఁ దనతో ననుజన్ముఁడు జెప్ప వించు నా
వాతతనూజుదీర్ఘ తరవాలము మానియనాను వస్త్రసం

ఘాతముతోడఁ గూర్చి తగఁ గాలిచి తత్పురి ద్రిప్పఁ బంపఁడే
క్రోతిని రావణుం డసురకోటులతోడ ము...

173


ఈ.

కట్టినకట్లు దెంచి దశకంఠబలంబుల నుక్కడంచి తా
నెట్టన యింటియింటిపయి నిద్దపుమంటఁ దగిల్చి దాఁటుచుం
గట్టలుకం బురంబు వెసఁ గాల్వఁడె మారుతి రాక్షసుల్ మదిం
దొట్టినభీతి నెవ్వగలఁ దూలి కలంగ ము...

174


ఉ.

అంతట వాల మంబునిధి నార్పి మహీసుత గాంచి తల్లి నీ
కాంతుని వేగఁ దెత్తు దశకంఠు వధింపఁగ సంశయంబు లే
దింతయు నుండు నెమ్మదిగ నే నటఁ బోయెదనంచు వాయుజుం
డెంతయు రాఁ దలఁచఁడే మిముఁ జూడ ము...

175


ఉ.

అంబుధి లీల దాఁటి వెస నంగదముఖ్యులఁ గూడి యన్యదూ
రంబగుశౌరి కాననమరందఫలంబులఁ దృప్తుఁ డౌచు మో
దంబున వచ్చి మ్రొక్కి గుణధాముఁడ చూచితినయ్య సీత సే
మంబున నున్నదంచనఁడె మారుతసూతి ము...

176


చ.

అవనిజ లంకనుండువిధ మంతయుఁ దద్వచనంబు పొందుగాఁ
బవనసుతుండు దెల్పి సురపాలకవైరి వధించి భూమిసం

భవ వెసఁ దేరఁబోవలె నృపా యని రత్న మొసంగ లోచనో
త్సవము వహింపవే జనకజం గనురీతి ము...

177


చ.

వననిధి లీలమై గడచి వాయుతనూజుఁడు లంక జొచ్చి సీ
తను గని తద్విధం బెఱిఁగి దైత్యులు దాఁకినఁ ద్రుంచి మించి గ్ర
క్కున పురిఁ గాల్చి వెండి యల కోమలిఁ గన్గొని వచ్చి తెల్ప స
య్యన నటు వోఁదలంపవె దశాస్యు వధింప ము...

178

యుద్ధకాండము

ఉ.

నిండుమనంబుతోఁ గపు లనేకులు గొల్వఁగ శార్ఙ్గతుల్యకో
దండము దాల్చి పూర్వవసుధాధరదీపితరుక్ప్రచండమా
ర్తాండునిభంగి మారుతసుతస్థితిఁ బొల్చుచు లంక కేఁగవే
చండనిశాచరాంధతమసంబు హరింప ము...

179


ఉ.

ధారుణి గ్రుంగ దిక్కరులు దల్లడమందఁగ మార్గఘోరకాం
తారము నుగ్గుగా నడచుఁ దత్కపిసైన్యముతోడఁ బోయి దు
ర్వారతరంగభీషణరవంబగు సంద్రముచెంత నిల్పవే
వారధికుద్దియై నెగడు వానరసేన ము...

180


ఉ.

ఇంతయు రావణుం డెఱిఁగి యింతకుము న్నొకక్రోతి వచ్చి యెం
తెంతలొ జేసి పోయె నిపు డేపున రాముఁడు వానరాళితో

నెంతయు మీఱి వచ్చెను నిఁకెట్లు జయింతమొ మంత్రులార సు
స్వాంతముతో వచింపుఁ డని బల్కఁడె వాఁడు ము...

181


చ.

కనలి కుబేరపుష్పకముఁ గైకొని దిక్పతులన్ జయించి కుం
భిని నరనాథులం గెలిచి పెంపు వహించిన నీకు సాటియే
మనుజకపీంద్రు లెంత యని మంత్రులు పంతము లాడరే దశా
ననుని మనంబు సంతసమున న్వికసింప ము...

182


చ.

కుటిలత నింద్రజిన్ముఖులు గొల్వునఁ గ్రోధవిలోకనప్రభా
పటలము గ్రమ్మఁ గన్గొనుచుఁ బంతము లాడుచు ఖడ్గపాణులై
పటుగతి వారిఁ ద్రుంచెదము బంపు సురారి విచార మేల నీ
కిటు లని పల్కరే రణవిజృంభణలీల ము...

183


చ.

భళి భళి చాలు పంతములు వానరుఁ డొక్కఁడు వచ్చి యిప్పురం
బలుక దహించునప్డు మనమందఱ మియ్యెడ లేమె యింతటం
దలఁకిరె వైరు లేటికి వృథాశపథంబులు దైత్యులార యం
చలిగి విభీషణుండు తెగనాడెను గాదె ము...

184


ఉ.

ఆ రఘురాముబాహుబల మల్పమె చూడ ఖరాదుల న్మహో
దారతఁ ద్రుంపఁడే ప్రబల తాటకఁ జంపఁడె వైర మేల దే

వారిమహేంద్ర రామున కిలాత్మజ నిచ్చి కులంబు గావు నే
ర్పార నటంచుఁ బల్కెఁ గద యాతఱిఁ బ్రోల ము...

185


ఉ.

రాముఁ డనంగ నెవ్వఁ డమరప్రభుఁడో వరుణుండొ కాలుఁడో
యేమని చెప్పె దీవు వెఱవేమి మహీజ నొసంగ నేను సం
గ్రామ మొనర్తు నంచనఁడె రావణుఁ డౌ మృతికాల మయ్యె నిం
కేమనబోలు నాపలుకు లిష్టము లౌనె ము...

186


చ.

వలదు మహద్విరోధ మనివార్యబలాఢ్యుఁ డతండు నీబలం
బలుక దహించుఁ దప్పదు దశాస్య మహీసుత నిచ్చి కావు మీ
కులమని తెల్ప నుగ్రతరకోపమునం బడ దన్ని లంకకున్
వెలిగ వసింపఁ బల్కఁడె విభీషణు నల్గి ము...

187


చ.

జననియనుజ్ఞ వచ్చి మిము సర్వశరణ్యు నుతించి వేఁడ మై
త్రిని దగ నాదరించి కడుప్రేమ విభీషణు ప్రాభవోక్తి మై
నొనర ననుగ్రహింపవె రఘూద్వహ నీకృప యెట్టిదో పరుం
డను విచికిత్స దోఁచ దిసుమంతయుఁ జూడ ము...

189


చ.

ఉదధినిమిత్తమై నియతినుండి నినుం గనకున్న నల్గి దు
ర్మదమణగింతు నం చజశరంబు జగంబు జలింప భూతలం
బదృవఁగ వింటఁ గూర్పవె మహాత్మ పయోధి వడంకుచున్ భవ
త్పదయుగ మాశ్రయింపఁ దగవచ్చి నుతింప ము...

189

చ.

నలు నియమింపు సేతువు నొనర్ప రఘూద్వహ నిల్చునంచుఁ ద
జ్జలధి వచించి యుత్తరదిశన్ బరగించు మజాస్త్రమన్న ను
జ్జ్వలగతి నేసి తౌ యసురసంఘము మ్రందఁగ దృశ్మగుల్భమన్
సలిలపుఁగుండ మింక నలసాయక మప్డు ము...

190


చ.

కపులు కడంక మై కుధరకాండము వృక్షచయంబు చేర్చి తో
రపుగతి బాహుసంధుల శిరంబులఁ బల్మరుఁ దేర నంది నే
రుపున నలుండు వారధినిరోధము గాఁదగు కట్ట వైవఁడే
నృపవర నీయనుజ్ఞ నమరేంద్రుఁడు మెచ్చ ము...

191


ఉ.

వీచులపెల్లుచేఁ బుడమి వెల్లువలం బచరించు వార్ధిగాఁ
దోఁచుచు మేఘముల్ చెదర తోఁకలు ద్రిప్పుచు లీల వచ్చు శా
ఖాచరసేనతో నుదధిఁ గ్రక్కున నొక్కట దాఁటి యాసువే
లాచలమందు నిల్పవె వనాటబలంబు ము...

192


ఉ.

చారులచే నెఱింగి సురశత్రుఁడు భీతిలి రత్నకాంతివి
స్ఫారితసౌధ మెక్కి శుకసారణు లక్కపికోటి బాహువి
స్తారబలంబులు న్భవదుదారపరాక్రమము న్వచించి నే
ర్పారఁగఁ జూపఁ జూడఁడె వనాటబలంబు ము...

193


ఉ.

సంగరదోహలు ల్కపు లసాధ్యులు రాముఁడు దుర్జయుండు
తత్సంగరకేళి నిల్వ విధి జాలఁడు జూడ దశాస్య వేగ సీ

తాంగన నిచ్చు టర్హమని యాభటు లన్నఁ దలంకి మంత్రికో
టిం గని యొప్పజెప్పు మనఁడే దివిజారి ము...

194


చ.

ఖరఖరవంశసంభవుఁ డఖండపరాక్రముఁడున్ బ్రతాపభా
స్కరుఁడును ధర్మవర్ధనుఁడు గాన జయంబు ఘటించు నాజి ని
ర్జరులు నుతింప రావణ! రసాసుత నిచ్చుట మేలటంచు సు
స్థిరమతి మాల్యవంతుఁడు వచించెను గాదె ము...

195


ఉ.

నాకును జూడ చక్రి భువనంబులు బ్రోవఁగ రామమూర్తియై
లోకమునం జనించె బుధలోలత సందియ మేని సంద్ర మీ
లోకులు గట్టువారె మదిలోఁ గనుమంచును మాల్యవంతుఁ డ
స్తోకతఁ బల్కఁడే విభునితోఁ దగురీతి ము...

196


చ.

కనుఁగవ నిప్పు లుప్పతిలఁ గన్గొని కిన్క నరాధముల్ నరా
శనుల జయించువారె యిఁకఁజాలును భూసుత నిత్తునే బలే
యని యని నిశ్చయించి నిఖిలాశలఁ గాపులు వెట్టఁ దా దశా
ననుఁడును లంకఁ గావఁడె ధనప్రభుదిక్కు ము...

197


ఉ.

మీరును దద్విధం బెఱిఁగి మేలని యుద్ధమె నిశ్చయించి దు
ర్వారబలాఢ్యు లౌకపుల వారికి దీటు నమర్చి తత్పుర

ద్వారములందుఁ జుట్టు వనవాసులు నిల్పుచు మీరు నుత్తర
ద్వారమున న్వసించితి గదా రఘునాథ ము...

198


ఉ.

రావణునాజ్ఞచే నిశిచరప్రకరంబు శరాసతూణబా
ణావలి దాల్చి కుంజరరథాశ్వభటోత్థితరౌద్రభీకరా
రావము మిన్ను ముట్టఁగఁ గరంబు రణోత్సవలీల వచ్చి యు
ద్ధావని నిల్వదే సురచయంబు చలింప ము...

199


చ.

తలపడి యామినీచరు లుదగ్రశరాసవిముక్తసాయకా
వళుల గదాప్రహారముల వానరులం దెరలించి బాహుసం
ధులు విదళించి ముష్టిహతిఁ దూలఁగఁ జేసి జయాశ పైఁబయిం
దలకొనఁ బోరరే ప్రళయదారుణభంగి ము...

200


ఉ.

వానరు లుగ్రులై కడఁగి వాలములం బడమోఁది శైలసం
తానముచేఁ దెరల్చి కఠినంబగు ముష్టిని నుక్కడంచి య
ద్దానవసైన్య మీగతి హతం బొనరించుచు మాఱులేని పెన్
బూనికెపో రొనర్పరె కపుల్ జయకాంక్ష ము...

201


చ.

నిళను కడంకఁ దాఁకి రజనీచరు లుగ్రత వానరాలి దు
ర్దశలను బొందఁజేసి మిముఁ దాఁకిన వారిధనుఃప్రసారితో
ద్విశిఖపరంపరాహతిని భీతులఁ జేసి మరల్చి తద్బలం
బశనిశ రాలిఁ గూల్చవె లయాంతకుభంగి ము...

202

చ.

చటులమఖాగ్నిజాతరథసాయకము ల్గొని మేఘనాదుఁ డా
దట దివినుండి తోఁచక యుదగ్రశరాలి నిగుడ్చి వానర
చ్ఛటఁ దెరలించి కూల్చుచును సర్పశరంబునఁ గట్టిన న్విశం
కటబలు కట్టులూనవె జగన్నరుమాడ్కి ము...

203


చ.

త్రిజట దశాస్యునాజ్ఞఁ దను దెచ్చినఁ జూచి మహీజ హాజగ
ద్విజయబలాఢ్య కన్మొఱఁగితే రణశయ్యనటంచు నేడ్వ నా
త్రిజట భయంబు లేదు గురుతేజులు వీ రని వంతమాన్చి యం
బుజదళనేత్రఁ దోకొనుచుఁ బోవదె రామ ము...

204


ఉ.

నారదసూక్తిచేఁ దలఁచినం బరతెంచు ఖగేంద్రపక్షదు
ర్వారమహానిలప్రహతి బంధము లూడినఁ దొంటికంటె సొం
పారి చెలంగి తౌ ఖగకులాధిపుసోఁకున దేవవానరుల్
సారెకు నార్చుచు న్మదిని సంతసమంద ము...

205


చ.

సతిహితవాక్యము ల్వినక సైన్యవధంబుఁ దలంచి పేర్చి యు
గ్రత నిజసేనతో నడరి రావణుఁ డేచి నిశాతసాయక
ప్రతతి నిగుడ్చి తన్నెదురు భానుసుతాదుల మూర్ఛముంచి మా
రుతి తను దాఁక ముష్టిహతి గ్రుమ్మఁడె వాఁడు ము...

206


ఉ.

దండధరాలయంబున కుదగ్రత బంచెను నా నతండు దో
ర్దండపటిష్ఠముష్టి హతి దాచిన మూర్ఛిలి లేచి పఙ్క్తివ

క్త్రుండును నమ్మరుత్సుతునిఁ దూలిచి నీలుని నొంచి మత్తవే
దండము వోలె లక్ష్మణునిఁ దార్కొనెఁ గాదె ము...

207


ఉ.

తాఁకి శరంబు లేసిన శితప్రదరంబుల వానిఁ ద్రుంచి బ
ల్వీకను జేతివిల్ దునిమి బిట్టు నురంబును గాడనేయ మూ
ర్ఛాకులుఁడై దశాస్యుఁడు రయంబున లేచి కడంక నేయఁడే
భీకరశక్తి లక్ష్మణుఁడు బిమ్మటులోవ ము...

208


చ.

తలఁకక పట్టి లక్ష్మణుఁ గదల్పఁగ లేక శివాద్రి నెత్తుచే
తులగమి మెండు బెండువడఁ దూఁగి పెనంగడుపఙ్క్తికంఠు బి
ట్టలయఁగ మొత్తి మారుతి మహారిపుదుర్ధరశక్తియుక్తు నా
యలఘునిఁ దేడె నీదెస కహస్కరతేజ ము...

209


ఉ.

క్రూరత మిమ్ముఁ దాఁకిన మరుత్సుతు నెక్కి గుణంబు మీటుచుం
ఘోరశరాళి సారథినిఁ గూల్చి హయంబులఁ జంపి వెంటనే
తేరును జగ్గుఁ జేసి శరతీవ్రతఁ జూపిన పఙ్క్తివక్త్రుఁ డ
ద్ధారుణి నిల్వఁడే తనువు దాఁ జలియింప ము...

210


చ.

అలయిక పుచ్చి రమ్మనిన నంతియమేలని పఙ్క్తివక్త్రుఁ డే
కలముగ నొండుయానమును గైకొని వేల్పులు నవ్వ లంకకుం
దలఁకుచుఁ బోయి చింతిలుచు దైత్యులు లేపుడు కుంభకర్ణునిన్

గలనికటంచుఁ బల్కెఁ గద కార్పడి వారు ము...

211


ఉ.

దండనిశాటు లెల్ల బెడిదంబుగ మొత్తియుఁ గర్ణవీథుల
న్మెండుగ వేఁడితైల మది మెట్టియు బల్ రొద జేసి మత్తవే
దండతతి బయింబఱపి యార్చిన లేచి భుజించి కుంభక
ర్ణుండట కేఁగఁడే తరుచరుల్ బెదరంగ ము...

212


ఉ.

అన్నకు మ్రొక్కి దా హితవులాడి యతండును గోపగింపఁ ద
త్సన్నిధిఁ బాసి వానరులఁ దాఁకి కలంచుచు మ్రింగుచు న్మహా
పన్నులఁ జేసి మూర్ఛిలిన భానుజుఁ గైకొని కుంభకర్ణుఁ డ
త్యున్నతి లంక కేఁగఁడె జయోత్సవలీల ము...

213


చ.

ఇనజుఁ డెఱింగి ముక్కు పొలియించి చెవు ల్విదళింప కైకసీ
తనయుఁడు సిగ్గుచే మఱలి దాఁకి బలంబుల నేచి మ్రింగుచుం
జను నెడఁ దన్నుఁ దాఁకుననుజన్ముఁ దొలంగుము నిల్చె దీవురా
మునికృప నంచుఁ దాఁకఁడె మిము న్వడి మీఱ ము...

214


ఉ.

జృంభణ మొప్ప నారి మొరయించి మహాస్త్రచయంబు నించి దో
స్స్తంభపదంబు లూడ్చి మఱి దార్కొనఁ ద్రుంపవే వేగ కైకసీ
సంభవు మూర్ధ్న మబ్ధిఁ బడ సైన్యము లుబ్బఁగఁ దత్కబంధముం

గుంభిని ద్రెళ్లఁ జూచి సురకోటి నుతింప ము...

215


చ.

వడి నతికాయుఁ డేచి శరపఙ్క్తిని వృక్షశరాలిఁ దోలి పై
కడరి శితాస్త్రము ల్గురియ నల్కను మారొనరించి మించి వెం
బడి తల ద్రుంపఁడే కినిసి బ్రహ్మశరంబున లక్ష్మణుండు సం
దడిగ సురు ల్నుతింప వెస దైత్యులు బార ము...

216


ఉ.

హోమగతాబ్జజాతశర మూనుచు రావణి మింటనంటి సం
గ్రామమున న్వనేచరనికాయము గూలిచి తచ్చరంబు ను
ద్దామగతిన్ బయింబఱప దానికి లోఁబడి యుండవే మహా
త్మా! మహనీయమౌట నది మన్ననఁ జేసి ము...

217


చ.

విధితనయుండు దెల్పుగతి వేగ మరుత్తనయుండు మిట్టి తా
నధికతరత్వరం జని మహౌషధులన్ మును గాంచి కానక
క్కుధరము బెల్లగించి తను క్రూరతఁ దాఁకు సురాలిఁ దోలి య
వ్యధగతిఁ దెచ్చి తేర్పఁడె వనాటబలంబు ము...

218


ఉ.

శైలచరుల్ త్వదాజ్ఞను నిశాచరువీటికిఁ బోయి చిచ్చు లా
భీలగతిం దగిల్చి పురిపెంపును సొంపుఁ దొలంగఁ గాల్చి దై
త్యాలిని మ్రందఁజేసి ఘనులై యెదిరించినవారలన్ ధరం
గూలిచి మించరే దశముఖుం డెదఁగుంద ము...

219

చ.

హరిహయజిత్తు దంభవసుధాత్మజ మారుతి జూడఁ ద్రుంచి చె
చ్చెర నిజమంచు నందఱును జింతిలఁ దా దివి కేఁగి నిష్ఠ న
ధ్వర మొనరింపఁగా నెఱిఁగి వచ్చి విభీషణుఁ డంతఁ దెల్ప నా
పరుని వధింప లక్ష్మణునిఁ బంపవె రామ ము...

220


చ.

వెసఁ జని దాశకంఠి మఘవిఘ్న మొనర్చి మెయి న్మెఱుంగునా
రసముల గ్రుచ్చి దీపితశరంబున మాయలప్రోడయైన ర
క్కసుతల ద్రుంపఁడే ప్రతినఁ గైకొని లక్ష్మణుఁ డప్సరస్సతుల్
కుసుమసువృష్టి నింప సురకోటి నుతింప ము...

221


చ.

అపరపయోధిఁ గ్రుంకు జలజాప్తుబలెన్ రణభూమి వ్రాలె ను
గ్రపుఁగరదీప్తిఁ జూపి తుది రావణ నీసుతుఁ డన్నవార్తకుం
గుపితమనస్కుఁ డై యసురకోటులఁ బంపిన వారు దాఁకరే
ద్విపి నెదురించు లేళ్లగతి తెంపున మిమ్ము ము...

222


చ.

గనగనమండు నగ్నినిభకాండపరంపర లేసి కాలరు
ద్రునిగతిఁ దాఁకి గాడ్పఱచి త్రుంచుచు నొంచుచు నెందు నీవ యై
యనికి నెదిర్చి సేన నిమిషార్ధములోఁ బొలియించి తౌ మహా
వని నెరియించు చిచ్చుగతి బంధురతేజ ము...

223


చ.

పురజనులాడునాడికను బూని దశాస్యుఁడు విక్రమించి వా
నరతతి నొంచి ద్రుంచెడుమనంబున దమ్ముని శక్తివైవ సా

దరమున లక్ష్మణుం డెదిరి దానను మూర్ఛిలఁ జూచి పఙ్క్తికం
ధరు నదలించి తాఁకితి గదా వధియింప ము...

224


ఉ.

సంశయ మింత లేదు నిలు చక్కఁగఁ ద్రుంతు నటంచుఁ గిన్క నా
వింశతిబాహుఁ దాఁకి శరవేగముఁ జూపిన నిల్వలేక పై
యంశుకమూడఁ గేశతతి యంసములం బడఁబాఱి వాఁడు శు
భ్రాంశుధరున్ భజింపఁడె జయాప్తిని గోరి ము...

225


ఉ.

భూవర నీయనుజ్ఞ మదిఁ బొందుచుఁ జెంగున మింట దాఁటి య
ప్పావని పోయి త్రోవ సురభామకు శాపవిముక్తిఁ జేసి మా
యావిని కాలనేమిఁ దునుమాడి పదంపడి లీల నోషధి
గ్రావముఁ జేరఁబోఁడె కుతుకంబు దలిర్ప ము...

226


ఉ.

మందులకొండఁ గొంచుఁ బవమానరయంబున రానెఱింగి త్రో
వం దలపడ్డరక్కసులఁ బాపి విభాకరతుల్యరత్నభా
స్పందిధరంబుఁ దెచ్చి యసుజన్మునిఁ దేర్చి తెలంగఁడే మరు
న్నందనుఁ డుబ్బి వానరు లుదారత నెంచ ము...

227


చ.

వనచరకోటిచేఁ గ్రతువు వమ్మయినం దశకంఠుఁ డుగ్రుఁడై
యనికి కడంగఁ దా నెఱిఁగి యారఘురాముఁడు విష్ణుదేవుఁ డా

తనిఁ జెనకంగరాదు వసుధాసుత నిచ్చి మనంగనోపునం
చు నతనిభార్య పల్కదె వచో౽మృతలీల ము...

228


చ.

ఎఱుఁగుదు రామమూర్తి జలజేక్షణుఁ డౌట నెఱుంగు దిందిరా
తరుణి మహీజ యౌట సఖి తద్రణభూమిని వ్రాలి ముక్తి కే
నరుగఁగ నింత జేసితి శుభాహతి నుండు మటంచు పఙ్క్తికం
ధరుఁడు గడంగఁడే యనికి దైత్యులతోడ ము...

229


చ.

తలఁపఁడు నగ్నిరోమముఖదైత్యుల దారుణకాండపఙ్క్తిచేఁ
గలన వధింపఁ గాంచి దశకంఠుఁడు క్రోధధురీణుఁ డౌచు బే
రలుకను దాఁకఁడే మిము మృగాధిపుఁ దాఁకెడు హస్తివోలె ని
శ్చలమతి యై జయాశ మది సంధిలుచుండ ము...

230


చ.

సురపతి పంపుతేరుపయి శోభిలి సింహమువోలె రావణ
ద్విరదముఁ దాఁకి శస్త్రనిహతిన్ సొలయించుచుఁ దచ్ఛరావళి
న్నరుకుచు వస్త్రనైపుణమున న్విహరింపవె లీలమై సురో
త్కరము నుతింప శాత్రవులు తల్లడమంద ము...

231


చ.

అలయక నిద్ర నొందక మహాశనిఘోరశిలీముఖప్రభా
జ్వలితదిగంతరుండ వయి సప్తదినంబులు పఙ్క్తికంఠుతోఁ
గలన యొనర్పవే త్రిదశకాండము బేర్కొన యాతుధానులుం
గలఁగఁ గపీంద్రు లద్భుతముగాఁ గనుచుండ ము...

232

చ.

కడకను పఙ్క్తికంఠుకరకంఠము లొక్కటఁ ద్రుంచి తొంటికై
వడి మొలవంగ వింతపడి వానిని ద్రుంచిన తోజనింప వెం
బడినవి ద్రుంచు టిట్లు రవిమండలమంటెడు రాశిఁ జేసి తౌ
తడయక నుంట వెల్లి బెడిదంబుగనించి ము...

233


ఉ.

చేతులు మస్తకంబు వెడఁజెందమి కుల్కుటఁ గాంచి పద్మసం
భూతవరంబుచే నమృతపూరము నాభిని నుంటఁజేసి యి
ట్లీతఁడు జిక్కఁడయ్యె మనుజేంద్ర హరింపు మటంచు రావణ
భ్రాత వచింపఁడే విమలభావముతోడ ము...

234


ఉ.

గ్రక్కున పావకాస్త్రమున రావణు నాభిసుధన్ హరించి పెం
పెక్క మహాశరాళి నసురేంద్రుతల ల్విదళించి పుచ్చి తౌ
నొక్కటిదక్క వజ్రనిహతోజ్వలధాతుఝరీధరాకృతి
న్నెక్కొన మేన రక్తములు నిండి స్రవింప ము...

235


ఉ.

పావకకోటి తిఙ్మరుచి భాస్వదజాస్త్రముచేత లోకవి
ద్రావణు రావణున్ బ్రథనధారుణిఁ గూల్చితి వౌ జగంబులం
దావకకీర్తి యుల్లసిల దైవతకోటి జెలంగ సర్వభూ
తావలి సంతసింపఁ గపు లార్చి నుతింప ము...

236


చ.

సురల నదల్చి దిక్పతుల స్రుక్కఁగఁ జేసియుఁ బుష్పమత్తులం
గెరలఁగఁ జేసి గుహ్యకుల గెల్చి జగద్విజయైకవీరుఁ డై

పరిగిన రావణుండు నొకభల్లముచేఁ బడె నట్టివారికిన్
ధరణిని దైవనిర్ణయము తప్పునె రామ ము...

237


చ.

శిరములు మోఁదుకొంచుఁ గనుచిప్పల నశ్రులు రాల నేడ్చు సుం
దరులను బుజ్జగించుచును దద్దశకంఠున కప్పు డగ్నిసం
స్కరణముఖాదికృత్యములు సర్వము దీర్పఁడె నీయనుజ్ఞచే
నరిగి విభీషణుండు దనుజావలితోడ ము...

238


ఉ.

ప్రేమ దలిర్ప లంకకు విభీషణు నాథుగఁ జేసి బ్రహ్మము
ఖ్యామరసన్నుతుండ వయి యగ్నిముఖంబున సచ్చరిత్ర సీ
తామహిళం గ్రహించి యట దండ్రిని గన్గొని దేర్పవే మృతా
రామచరాలి నింద్రునివరంబు గ్రహించి ము...

239


ఉ.

బంగరుతళ్కు నల్గడల బారుకుబేరకపుష్పకంబు వే
రంగుగ నెక్కి దైత్యకపిరాజి చెలంగఁ బ్రవాసభూమి సీ
తాంగన కర్థిఁ జూపుచు రసాధిపచంద్ర యయోధ్యఁ జేరవే
పొంగి ప్రజాముదంబు లొగి పొల్పెసఁగంగ ము...

240


చ.

అలుకులు రంగవల్లికలు హర్మ్యపుఁజిత్తరువుల్ సుదోరణం
బులు మణికేతనప్రభలు పొల్పెసఁగన్ శుభసూచకధ్వనుల్

గలిగి బుధప్రకీర్ణమయి కాంతత నొప్పదె త్వత్పురంబు హే
లల నభిషేకవైభవములు దివిబోలి ము..

241


ఉ.

చారుమణీరుచిస్ఫురితసౌధవిరాజతసింహపీఠి గ్రొ
క్కారుమెఱుంగుతళ్కుగల కార్మొగులో యన సీతతోడ శో
భారమచేఁ బ్రకాశిలి శుభస్థిరలగ్నమునందు రాజ్యభూ
భారముఁ దాల్చి తౌ ప్రజ శుభస్థితి నొంద ము...

242


ఉ.

చారుశుభాంగి యై సురభిచందనచర్చిత యై విశేషశృం
గారిణి యై రమామహిమఁ గాంచి మెలంగెడు సీతతోడ సం
సారిబలెన్ భువి న్మదనసౌఖ్యముఁ గాంచుచు నేలవే జగ
త్కారణరూపధారుణి సుధర్మ మెసంగ ము...

243


చ.

స్థిరయు సమస్తసస్యములచేఁ బొలుపొందఁగ మానవుల్ శుభం
కరు లయి పుణ్యవర్తనలు గల్గి జరింపఁగ ఖేచరుల్ క్రతూ
త్కరములఁ దృప్తు లై చెలఁగ ధర్మముగాఁ బదకొండువేలవ
త్సరములు గాచితౌ జగతి శాసన మొప్ప ము...

244


ఉ.

రామకథామృతంబు రుచి ద్రావి భవంబు దొరంగి మానవ
స్తోమము ముక్తిజెందఁ గృపతో నిటు జేసితి గాక వార్ధి ని
చ్ఛామతి దాఁటు టెంత దనుజచ్ఛటఁ ద్రుంచుట యెంత నీదులీ
లామహిమంబు చిత్రము దలంప? ము...

245

ఉ.

మంగళ ముర్విజాపతికి మంగళ మర్కకులేంద్రమౌళికి
న్మంగళ ముర్విభద్రనగమండనవర్తికి రామమూర్తికి
న్మంగళ మర్థిలక్షణమనఃకమలైకవిలాసవర్తికి
న్మంగళ మెప్డుఁ గావలయు మాధవ మీకు ము...

246


ఉ.

వందన మాచరించెదఁ గృపాజలరాశికి బ్రహ్మరుద్రసం
క్రందనపూజితాంఘ్రికి నఖండపరాక్రమశాలికిన్ దశ
స్యందననందనాగ్రణికి నబ్జసుధాధరకీర్తికిన్ జగ
త్సుందరమూర్తి వైనరఘుసూనుఁడ మీకు ము...

247


ఉ.

శ్రీరమ భూమినందనయు శేషుఁడు లక్ష్మణుఁ డావికుంఠ మి
ద్ధారుణి భద్రశైలమన దాసులఁ బ్రోవ వసించినట్టి సు
శ్రీరఘురామ చక్రి మిము జేరితి ధన్యుఁడనైతి నోశుభా
కార తనూవిలాసజితకంధరబృంద ము...

248


ఉ.

రామకథాప్రపంచమును వ్రాసినఁ జెప్పిన సంస్మరించినన్
భూమసుఖాప్తు లై జనులు మోదముఁ జెందుదు రంతమందు శ్రీ
రామయటంచు నొక్కపరి రక్తిఁ దలంచిన ముక్తి గల్గుఁగా
నేమిట గల్లబోదు రుచి నెప్డు బఠింప ము...

249

చ.

 అనఘచరిత్ర జూలురికులాబ్ధిసుధానిధి యైనసుబ్బనా
ర్యునికి సుసాధ్వి శేషమకు నుద్భవమందితి లక్ష్మణాఖ్యుఁడన్
ఘనమతి మీకు నంకితముగా రఘునాథచరిత్ర సూక్ష్మమై
తనరుగృతిన్ రచించితిని దాసుఁడ నీకు ము...

250