భక్తిరసశతకసంపుటము/మూఁడవసంపుటము/సర్వలోకేశ్వరశతకము



పీఠిక

రసికులారా!

ఈశతకమును పదునేనుసంవత్సరముల క్రిందట నారంభించి కొలఁదిదినములకు ఎనుబది పద్యముల వఱకుఁ బూర్తిచేసితిమి. పిదప నాలుగేండ్లకు మిగిలినపద్యములు పూర్తి చేసితిమి. అనంతపురములో నున్న ఎ. పి. కవిగారు తమబాలభారతిలోఁ బ్రచురించుకొనుట కీశతకమును దీసికొని యేబదిపద్యములు దాదాపుగఁ బత్రికలోఁ బ్రచురించి పిమ్మట పత్రిక నాపివేసిరి. ఎన్నిమాఱులు కోరినను మిగిలినపద్యములను బంపరైరి. ముద్రితమైన యేబది పద్యములు మాత్రము పత్రికనుండి తీసి జాగ్రత్త చేసితిమి. ప్రత్యంతరము లేకపోవుటచే మిగిలినపద్యములు క్రొత్తగాఁ బూర్తి చేయవలసివచ్చినది. పనిలోఁబనిగఁ బూర్వపద్యములు చాలవఱకు మార్చితిమి.

మొత్తముమీఁద నీశతకమున నీతివిషయికపద్వము లెక్కువగను భక్తివిషయికపద్యములు కొలఁదిగ నున్నవి. ఇందలిభావములు చాలవఱకు మా జీవితమునకు సంబంధించినవి యైనను బ్రపంచమునకు సంబంధించినవిగా స్ఫురించునటుల వ్రాసియున్నారము. అక్రమవర్తనలు కపటాచారులదుశ్చేష్టలు పరోపకారుల మనువారిదుండగములు సంస్కర్తలసాహసకార్యములు కొన్నియెడలఁ బేర్కొంటిమి. ఏపద్యము గాని ప్రత్యేకవ్యక్తుల దృక్పథమునం దుంచికొని వ్రాసియుండము. దాదాపుగా నీశతకము కామేశ్వరీశతకము కాళహస్తీశ్వరశతకము (గొంతవఱకు) వేణుగోపాలశతకము తెగలో జేరఁదగినది. భక్తికి నీతి కీశతకమునఁ గలయిక గలదు. శతకసంపుటములో నీశతకమును చేర్చి మమ్ము ప్రోత్సహించిన బ్రహశ్రీ వావిళ్ల. వేంకటేశ్వరశాస్త్రిగారియెడఁ గృతజ్ఞులము.

ఇట్లు,

నందిగామ

శేషాద్రిరమణకవులు

1-1-28

శతావధానులు



శ్రీరస్తు

సర్వలోకేశ్వరశతకము

శా.

శ్రీరమ్యాత్మక! నిర్వికల్పమయమూర్తీ సచ్చిదానందశృం
గారాకార ప్రసన్నదృగ్రుచిలసత్కారుణ్యభావాకర
స్మేరాంకూరముఖాంబుజాత! భువనక్షేమంకరప్రక్రియా
పారీణాత్మక నీకు మ్రొక్కెదను దేవా! సర్వలోకేశ్వరా.

1


శా.

ఓనిర్వ్యాజదయాభిరామసుకృతీ యోదీనసంరక్షణా
దీనస్వాంతపయోజ! యోత్రిభువనస్థేమప్రసన్నాత్మ! ఓ
హో నీరేజభవాండభాండభరణా! యుగ్రారిషట్కావృతున్
దీనున్ నన్ను సముద్ధరింప నగుఁగాదే సర్వ...

2


మ.

ధనధాన్యంబులఁ గోర్కి లేదు, పరవిత్తద్రోహదుష్కర్మసం
జనితానందము నొల్ల నెల్లపుడు నీసారళ్యకారుణ్య మొం
ద నపేక్షించితి నయ్య మత్కలుషసంతానంబుఁ బోకార్చి న
న్ననురాగంబున నేలుకోనగుఁ గదయ్యా సర్వ...

3

మ.

దురహంకారజనావృతం బయిన యీదుష్టప్రపంచంబులో
నరజన్మంబున నన్ను నెక్కొలిపి యానందించుచున్నాఁడవా?
పరసేవాజనితవ్యథాభరపరిభ్రష్టాత్మునిన్ నన్ను నీ
కరుణాసాగరమగ్నుఁ జేయు మతిలోకా సర్వ...

4


శా.

సూరిస్తుత్యగుణాలవాల! సుయశశ్శోభాయమానాత్మ; నీ
కారుణ్యంబున సర్వలోకములు సౌఖ్యంబందు నీయాదర
స్నేరాంకూరరసంబుచేత జగముల్ చెన్నొందు నీప్రాభవం
బేరైనం గొనియాడనేరుతురె తండ్రీ సర్వ...

5


శా.

దీనత్రాణపరాయణత్మ! భవద్దివ్యప్రభావంబు చి
త్తానందప్రదమంచు నైహికగతవ్యామోహవిధ్వంసనా
ధీనప్రాభవభాసురం బనుచు నర్థిం గోరి సేవించుచు
న్నానీభక్తుఁ దరింపఁజేయవె యనన్యా సర్వ...

6


శా.

మౌనంబూని యరణ్యసీమలను దుంపల్ పండ్లు భక్షించి యా
శానీకంబు జయించి దివ్యపరమాస్థాపేక్ష వర్తించుస
న్మౌనుల్ నిన్గనకే తపింతు రన దుర్మానవ్యథాభిన్నక
ర్మానుష్టానుఁడ నెట్లు నిన్ గనెద దేవా! సర్వ...

7


శా.

కల్ల ల్బల్కుచుఁ బొట్టకూటికయి దుర్గర్వానృతస్వాంతులన్
సల్లాలిత్యమనోహరాంధ్రకవితాసర్వంకషవ్యాప్తిచే

నుల్లాసంబునఁ దన్పినన్ బ్రతిఫలం బొందంగ లేనైతి ని
న్నుల్లంబందుఁ దలంతుఁ బ్రోవవె దయాళూ! సర్వ...

8


మ.

వివృతస్వర్గపురీకవాట మగుచుం బెంపొందుత్యాగంబు నా
కవలంబింపఁగఁ జేతఁగాదు పరిణామానందసంధాయకం
బవు శాంతవ్రతధర్మనిష్ఠయొ యసాధ్యం బిట్టిదీనాత్ము న
న్నవలోకించి కృతార్థుఁ జేయు ముచితజ్ఞా సర్వ...

9


మ.

సిరినిం గూర్పక కార్యనిర్వహణసుశ్రీదక్షుఁ గావింపఁ బో
క రసాభాసదరిద్రముద్రితునిగాఁ గష్టాత్ముఁగాఁ జేసి న
న్నరయన్ మానితి వేల తండ్రి పరమార్థాపేక్షయో నీపద
స్మరణంబో దయచేసి నన్ మనుప రమ్మా సర్వ...

10


మ.

తనయుల్ బందుగు లన్న సమ్మదము, గాంతావ్రాత మన్నన్ బ్రియం
బును ద్రవ్యంబన నాస స్వైరమన సమ్మోదంబుఁ, జేకూర్చి క
ష్టనిదానంబుగ నాదుజీవితము రాజద్వారసంవాససం
జనితక్షోభల కేల లోఁబరుతు వీశా సర్వ...

11


మ.

పొగరా పోదు; ధనాశయో చనదు; పూవుంబోండ్లకౌఁగిండ్లపై
వగపా తగ్గదు; మానసంబొ స్థిరభావం బొంద దేమందు నీ

జగదుద్బంధము నెట్లు త్రెంతు నెటు లీర్ష్యామోహసంబంధముల్
పగులంగొట్టుదు తోఁచ దేవెఱవు దేవా సర్వ...

12


మ.

తనగర్భస్థితరక్తమాంసములచేతన్ బిడ్డలం గాంచి తీ
రనిమోహంబునఁ బెంచి పెద్దల నొనర్పన్ మాతృసేవావ్రతం
బన నేమో తనయుల్ గ్రహింపక పశుప్రాయంబుగా నున్నచో
జననీ దుఃఖము మాన్పశక్యమె మహేశా సర్వ...

13


మ.

నవమాసంబుల మోసి తల్లి కడువంతల్ బొందుచుం బెంచి మా
నవధర్మంబులు దెల్పి యోగ్యయగు కన్యన్ బెండ్లి గావింపఁగా
దివురన్ జూచును సర్వరీతులను మాతృద్రోహముం జేయఁగా
నవురా పుత్రుఁడు వాని శత్రుఁ డనరాదా సర్వ...

14


మ.

తన కామంబున కాస్పదంబయి నికాంతారత్నముం గొల్వ సి
గ్గు నెదం జెందఁడు నిత్య మాపె కడునెగ్గుల్ పల్కినన్ లెక్కఁగాఁ
గొనఁ డంతఃకరణాతిరేకమున లగ్గుం గూర్చు ధన్యాత్మ యౌ
జననిం జూచిన పాపి కోపి యగు నీశా సర్వ...

15


మ.

తనకంఠంబునఁ దాళిగట్టినధవున్ దైవంబుగా నెంచుటే
వనితాధర్మము తా వరించినసతిన్ వామాంగ మంచున్ మనం

బున భావించుట మర్త్యధర్మ మీది యేపో భారతీయప్రశ
స్తినితాంతంబున కాదిసూత్రము దయాబ్ధీ సర్వ...

16


శా.

కారుణ్యంబునఁ బెంచి యన్నమిడి లోకజ్ఞానవిద్యాదులం
దారూఢాత్ము నొనర్చినట్టి జనకుం డత్యంతదూష్యుండుగా
మాఱున్ నేఁటివివేకిసత్తముల కీమాన్యాత్ము లెట్లుందురో
తా రింపారఁగఁ గన్నబిడ్డలకు నిత్యా సర్వ...

17


మ.

లలితానూనఫలాభిరామములు లీలాలోలశైవాలినీ
విలసద్దేశము లైనఁ గానసములన్ విశ్రాంతి నొందంగఁ దా
వులు పెక్కుండ ధనావలిప్తవిచరద్భూపాలకాస్థానభూ
ములలోఁ బండితు లుండ నౌనొకొ స్వయంభూ సర్వ...

18


శా.

చంచద్రత్నసువర్ణకంకణములున్ సర్వంకషంబైన పీ
నాంచద్రూపము గల్గుమానవుఁడు విద్యావైభవోదగ్రుఁడై
వంచించుం జగమెల్ల సంతతము; విద్వద్గేయ విద్యానటీ
కాంచీభూషణు లెట్టు లోర్తురొ రసజ్ఞా సర్వ...

19


మ.

ధన మున్నప్పుడు వందిమాగధులు కాంతారత్నముల్ పండితుల్
తనయుల్ బంధులు వెంటసుందురు దరిద్రక్షోభ మెండైనచో
తననీడైనను తన్ను వీడి తొలఁగున్ ద్రవ్యంబునం దున్నశ
క్తిని గుర్తింప వశంబె జీవికి గుణాబ్ధీ సర్వ...

20

శా.

బాలక్రీడలు కొన్నినాళ్లు సుకళావ్యాసంగముల్ కొన్నినా
ళ్లాలోలేక్షణు లైన కామినులభోగాపేక్ష గొన్నాళ్లు కొ
న్నాళుల్ దుస్తరరోగసంజనితచింతాదంతురక్షోభలం
గాలం బెట్టులొ పుచ్చు జీవి సుగుణాంకా సర్వ...

21


మ.

చలదంభోరుహపత్త్రవాఃకణగతిన్ స్థైర్యంబు లేకున్న మే
నులు నిక్కంబు లటంచు మత్తులయి మాన్యుల్ గూఢసర్వజ్ఞతా
ఫలముం బూడిదలోనఁ గల్పి విఫలప్రాయంపుఁ బ్రాయంపుఁగాం
తలకౌఁగిండ్ల మెలంగు టేల గుణగణ్యా సర్వ...

22


శా.

సారోక్తిప్రథమానకావ్యగతయోగాజాలశృంగారగా
థారంగంబులలోనఁ దృప్తుఁ డగుచో దారుణ్యపుంబొంగు చ
ల్లారుం జీవికి స్వైరసంచరణలీలాలోలకాంతారతే
చ్ఛారూఢాత్మున కిందునందుఁ గతి కద్దా!సర్వ...

23


మ.

పగులం గేలధరింప వీల్పడని మృత్పాత్రంబు చేబట్టి జీ
ర్ణగుణప్రావృతపూతిగంధమయవస్త్రం బెట్లొ మైదాల్చి య
ధ్వగరంగస్థలు లైనసత్రములచెంతం జేరుమర్త్యుల్ నినున్
నిగమజ్ఞేయుఁ దలంప రేమనెదఁ దండ్రీ సర్వ...

24


శా.

క్రూరుల్ గొందఱు సత్యమూర్తులకుఁ జిక్కుల్ గూర్చి యాత్మీయదు

శ్చారిత్రంబును వెల్లడింతురు; క్షమాసర్వస్వవిభ్రాజిత
స్మేరాస్యంబున వారు సైచినను గాసింగూర్చి కాలుండు త
ద్ఘోరాఘంబున కొంపఁడే విబుధబంధూ సర్వ...

25


శా.

గంగాస్నాన మొనర్పవచ్చు జనలోకంబెల్ల గొండాడఁగా
సంగీతంబు లొనర్పవచ్చు పరభాషావేషసాంగత్యముల్
సాంగంబుం దొలఁగింపవచ్చు భవదీయాంఘ్రిద్వయీసేలువచే
తం గాలుష్య మడంప శక్యమె యనింద్యా సర్వ...

26


మ.

శ్రమయంచున్ సుఖముంచు సంసరణకష్టంబే భరింపంగఁజా
ల మటంచుం దమి నిచ్చకాల్బలుకుకూళల్ వీడఁగా నేర్తురే
రమణిచారుతరోన్నమత్కుచయుగప్రాదుద్భవన్మోహవి
క్రమముల్ చండగభస్తితేజ! కృతలోకా సర్వ...

27


మ.

కలుషస్థావర మన్యకామినులసంగంబంచు బాజారుమి
ట్టలపైఁ జేరి ప్రసంగముల్ సలుపు దుష్టస్వాంతులే తత్పథం
బులు వర్తింతురు రేఁబవళ్లు బళిరే బోధాక్రమప్రాప్తి యీ
కలికాలంబున నుండె నిట్టు లకలంకా సర్వ...

28


శా.

బారల్ సాచుచు దేహిదేహి యనుచుం బ్రార్థించుపేదన్ క్షమా
కారుణ్యోజ్జ్వలదృష్టితోడుత కనంగాఁ బోవఁ డెవ్వాఁడు దు

ర్వారక్రోధమయాంతరంగుఁ డగుభూపాలుండొ చోరుండొ చే
జారన్ లోభి యొసంగు సర్వ మఖిలేశా సర్వలోకేశ్వరా.

29


మ.

ధనమార్జించుటె గాని కాసయిన స్వార్థంబందు వెచ్చింపఁ డె
వ్వనినైనన్ జెడఁగొట్టుగాని విహితవ్యాపారముల్ నేరఁ డే
మన నేమున్నది లోభిమానవుల పాపాచారదుశ్చర్య; వా
రిని నీ వేటికి సృష్టి చేసితివి తండ్రీ సర్వ...

30


మ.

కలుముల్ మిక్కుట మైనచోఁ గలుషముల్ గావింపఁ బ్రాల్మాలఁ డా
శలు మెండైనకొలంది దుష్క్రియల కుత్సాహంబు గోల్పోవఁ డీ
చలచిత్తుం డగులోభి వీనిని దయాసౌజన్యసౌశీల్యని
శ్చలు గావించు దరిద్ర మొక్కటె మహేశా సర్వలోకేశ్వరా.

31


మ.

ధనగర్వంబునఁ బుట్టురోగములు సాంతం బొందు దారిద్ర్యమం
దున దారిరిద్ర్యమునందు రోగభయ మెందుం బుట్ట దొక్కప్డు పు
ట్టినచోఁ గాంచుఁ దనంత నాశనము పాటింపంగఁ బోర్వానిరో
గినిగా సర్వజనుల్ ప్రశస్తు లనురక్తిన్ సర్వ...

32


మ.

జనులన్ మోస మొనర్చి యైనఁ గలుషాచారంబుచే నైన దు
ర్జనసంపర్కముచేత నైన ధన మేజాల్ముండు చేకూర్చునో

ఘనుఁ డాతండు హితుం డతండు జనలోకస్తుత్యవిజ్ఞానధీ
ఖని యాతం డని పేర్వడున్ విగతపంకా సర్వ...

33


మ.

ధనమే ప్రాణమె ప్రాణమే ధనముగాఁ దర్కించులోభుల్ పరా
కును దూషించినఁ గోపమందరు జనుల్ క్షోభాతిరేకాత్ము లై
తను బ్రార్థించిన జాలినొందఁ డతిలుబ్ధస్వాంతులన్ ధర్మభా
జనులం జేయఁగ నీకశక్యము పరేశా సర్వ...

34


మ.

చనుచోఁ గొండొకగ్రుడ్డిగవ్వఁ గొనిపో శక్తుండు కానట్టి దు
ర్జనుఁ డీయైహికసౌఖ్యమున్ మఱగి సంసారాబ్ధినిర్మగ్నుఁ డై
ధనసంపాదనకై చరించును దురంతక్రూరసంతాపసా
ధనమౌ తద్ధన మేల కాల్పనె ప్రశస్తా సర్వ...

35


శా.

కాలాసన్నమునందు శాంతము దయాకళ్యాణభావంబు స
చ్ఛీలోజృంభణ వాగ్విడంబనములున్ జేకూరు మర్త్యాళి కీ
లీలల్ జవ్వనమందు నేమయినవో లీలావతీమోహపం
కాలీనం బఘ మెట్లడంగు గుణశూన్యా సర్వ...

36


మ.

పనియున్నప్పుడు జూపు శాంతము కృపాభావంబు మర్యాద పా
వనవాచావిభవంబు గార్యపుఁదుదిన్ బాటింప రెవ్వారు దు
ర్జనలోకంబు వరప్రతారణవిచారంబందు ధర్మావలం
బనపాత్రంబు ధరించుఁ గాదె గుణధామా సర్వ...

37

మ.

పలుకుల్ తేనెలసోన లీనఁ గరుణాభావంబు లేనవ్వు మో
మలరింపన్ గనుదోయి శాంతి(?)రంగంబై ప్రకాశింపఁగాఁ
దులువల్ వేసెడి బాహ్యవేషముల నర్థుల్ నమ్మి యాశామహా
జలధిన్ మగ్నము నొందుచుందు రఖిలేశా సర్వ...

38


శా.

తానే సర్వకళావిదుండ నను విద్యాశూన్యుఁ డొక్కండు వి
జ్ఞానప్రాభవశాలి నే నను దురాచారాత్ముఁ డొక్కండు ధ
ర్మానుష్ఠానపరాయణుండ నను మిథ్యాలాపి యొక్కండు సు
శ్రీనిత్యాత్మకుఁ డీకలిన్ గుణవిహారీ సర్వ...

39


మ.

తగవుల్ దిద్ది కళావిదగ్ధతల నుద్యద్రీతి సాటింపవ
చ్చుఁ గడున్ నీతులు ధర్మశాస్త్రములు నెచ్చో వల్లెఁ బెట్టంగ వ
చ్చు గుణాలంకరణాభిరాముఁడ నటంచున్ జెప్పుకో వచ్చు వా
క్కుగొనం బొక్కగతిన్ వెలార్ప వశ మొక్కో సర్వ...

40


మ.

పరులన్ సైపక దుష్టమార్గచరులై వర్తించు నిర్వేలదు
శ్చరితుల్ సంతతభోగభాగ్యవివిధైశ్వర్యాఢ్యులై మించుచుం
డిరి సత్యాత్ములు లేమిచే మిగులఁ గుంఠీభూతులై నొచ్చుచుం
డిరి పాపాత్ములె లోకపూజితులు తండ్రీ సర్వ...

41


మ.

చదువుల్ నేర్పఁగవచ్చు దుర్విషయసంసర్గంబు బోనాడవ
చ్చు దయాసత్యశుచిప్రచారముల నెచ్చో గూర్చుకోవచ్చు నె

మ్మది నిన్ దావకసాదపద్మయుగళీమగ్నంబు గావించు నే
ర్పది దుస్సాధము మానవాళికి సుభావా సర్వ...

42


మ.

సిరిపై రాజ్యముపై సతీజనముపైఁ జిత్తంబు పోనాడి ని
ష్ఠురసత్యవ్రతధర్మకర్మరతితో శుద్ధాంతరంగంబుతోఁ
గురువంశం బలరించె భీష్ముఁడు తదంఘ్రుల్ మోచి పుణ్యైకవి
స్ఫురితంబై మనమాతృభూమి తగె నెచ్చో సర్వ...

43


మ.

అవనీమండలమండనాయితయశోవ్యాసంగు లౌధారుణీ
ధవులే పోయిరి కాలగర్భమున కీద్రవ్యంబు కాయంబు వై
భవమున్ శాశ్వతమా యటంచు నెదలో భావింపఁ డెవ్వాఁడు దు
ష్టవరిష్ఠంబగు కాలసత్వమున నీశా సర్వ...

44


శా.

తారుణ్యాతిశయావలేపమున విస్తారాఘ మార్జించి దు
శ్చారిత్రుం డనిపించుకొన్న కలుషాచారుండు ప్రాయంపుఁబొం
గారన్ సంతతధర్మకర్మవిహితవ్యాసంగుఁ డైయుండు ని
స్సారాంగుం డయి దాన నేమిఫల మీశా సర్వ...

45


శా.

సూనుల్ తుంగతరంగమాలికలుగాఁ జూపట్ట బ్రోయాండ్రు స
త్వానీకంబులఠేవఁ గన్పడ ననంతానన్యవాంఛాలతల్

పానీయంబుల రీతి భాసిలెడి యాపాపంపుసంసారమున్
జ్ఞానుల్ నెమ్మది నెంత్రు వారిధిగ నీశా సర్వ...

46


మ.

స్థిర మొక్కించుక లేక, రోగములకుం జిత్తవ్యథాపాళి కా
కరమై సంతతకష్టదుష్ట మగుచుం గన్పట్టు మాంసాసృగు
ద్ధురశల్యాకరమైన దేహమునకై దోషంబు లెన్నేనియున్
నరు లేలా యొనరింపఁ బూనుట లనన్యా సర్వ...

47


మ.

పరహింసావిముఖుండు భీరువు కృపాభావుండు నిస్సారతా
భరితాత్ముండు పరాంగనావిముఖపుంసవ్యశూన్యుండు స
త్వరతాత్ముం డసమర్థకీటకము ధర్మాధర్మసంఘట్టనం
బు రసాభాసము నేఁటికాలమున స్వర్భూ సర్వ...

48


మ.

తనయైశ్వర్యసమృద్ధిఁ జూచికొని మాంద్యస్వాంతు లై ఱేండ్రు స
జనసాంగత్యము నిచ్చగింపక ప్రపంచద్రోహు లైయుండి రీ
పని శ్రేయఃప్రద మౌనె శ్రీదుఁడును గర్వంబేది భిక్షాశనున్
జనుమానంబున గౌరవింపఁడె సురేశా సర్వ...

49


మ.

మనమే గొప్పయటంచు నెంచఁజనునే మాంఛాతృముఖ్యుల్ గడిం
చినవిఖ్యాతి గడింతుమే విజయుఁ డెంతే సంగరక్షోణియం
దునఁ జూపించిన ఛాటిఁ జూపఁగలమే ద్రోణుండు చేకొన్నకీ

ర్తినిఁ జేకొందుమె? యేల స్వాతిశయముల్ శ్రీసర్వ...

50


మ.

తమసౌఖ్యంబులు తామె చూచుకొని స్వార్థత్యాగమున్ జేసినా
ర మటంచున్ వచియించువారు పరకార్యద్రోహముం జేసి యు
త్తమధర్మాత్ములమంచు వాకొనుజనుల్ దంభవ్రతారంభు లై
స్వమతద్రోహ మొనర్పఁ బూని రఖిలేశా సర్వ...

51


మ.

తొలుతన్ బెండిలిచింత పిమ్మట సుతాదుల్ కల్గరైరన్న నెం
జెలి యాపైని కుటుంబసంభరణ దుశ్చిత్తభ్రమంబున్ జనున్
కలకాలంబు గలంచుచుండుఁ గలదే కాసంత సౌఖ్యంబు పం
కిలసంసారనిమగ్నబుద్ధికి విరాగీ సర్వ...

52


మ.

నిరవద్యప్రతిభావిలాసములు పాండిత్యప్రభావంబు భా
సురసాహిత్యకలాకలాపకములున్ శుద్ధాంతరంగమ్ము దు
స్తరసంసారపయోధిభంగనిచయాంచద్ఘోరసంఘట్టన
స్థిరచింతాజడు వీడనాడును గుణాబ్ధీ సర్వ...

53


మ.

నిరతంబున్ శిశుపోషణాదరమునం జింతించుచుం బ్రాయపున్
గరితల్ గన్పడినంతఁ గెంబెదవి పంటన్ నొక్కుచున్ భాగ్యసం
భరితుం డౌజనునిం గనుంగొనిన భావంబందు బెగ్గిల్లుచున్

దురవస్థల్ పడుదుష్టుఁ డెట్లు పర మొందున్ సర్వ...

54


మ.

సమవేగంబునఁ బాఱుశైవలినులన్ స్నానాద్యనుష్ఠానకా
ల్యములం దీర్చుచుఁ గందరాంతరములం దావాసముం జేయుచుం
బ్రమదాతీతహృదంబుజాతుఁ డగుచున్ వర్తించుధన్యాత్ము జ
న్మమె జన్మంబని యెంచఁగాఁదగు పరాత్మా సర్వ...

55


మ.

తరుపార్శ్వంబుల విశ్రమించుచు శకుంతస్వానముల్ సమ్మదా
కరులై వీనులఁ జేర్చుచున్ విమలరాకాచంద్రదీవ్యన్నిశాం
తరవేళ జలబిందుతుందశశికాంతస్నిగ్ధపాషాణసుం
దరశైలంబుల నుంద్రు ధన్యులు వదాన్యా సర్వ...

56


మ.

తతశల్యాకరమాంసరూప మగుకాంతాగాత్రముం దోర్యుగ
స్థితముం జేసి నితాంతసౌఖ్యములతో జీవించుచున్నాఁడనన్
గతలం దెల్పు గృహస్థుకంటెను బతంగస్వాదుకీతామృతో
ద్గతసాలావృతగేహి; మౌని సుఖి కాదా సర్వ...

57


మ.

తరుణీవల్గుదృగంచలంబులకు మిథ్యాసౌఖ్యసంపత్తికిన్
పరమార్థోచితనూత్నయౌవనము సర్వస్వంబు నర్పించి దు

స్తరసంసారపయోధిమగ్నులగు చింతాదంతురక్షుణ్ణు లౌ
నరు లేరీతి తరింతు రైహిక మనన్యా సర్వ...

58


మ.

కఱకుంజూపుల పేరితూపులఁ బయం గాడించి లీలాలస
ద్దరహాసాంరకుసూచికాగ్రములచేతన్ మేను తూటాడుసుం
దరు లెందాఁకఁ గనంగవచ్చెదరొ హృన్నాళీక మందాఁక సు
స్థిరభావంబు గడింపఁబోదు పరవేదీ సర్వ...

59


శా.

(?)నీరంధ్రద్రుమసంకులంబు గహనానీకంబొ? నానాజనో
త్కరసంచారవినోదరంగ మగునాస్థానంబొ? కాంతామణీ
విరళస్వేదతనూపగూహనసుఖావిర్భూతశయ్యాతలం
బొ రుచించున్ నరుజన్మ కేది సుఖదంబో సర్వ...

60


శా.

ఆలోలాబ్ధితరంగవేష్టితసమీరాంకూరసంచారసు
శ్రీలీలావనముల్ నిరంతరపరశ్రేయోనుకూలంబుగాఁ
గ్రాలన్ సంతతగర్వపర్వతశిఖాగ్రస్థాయి భూమీశ్వరో
పాలంభంబులకేల పాల్పడుట దేవా? సర్వ...

61


మ.

పరహింసారతభూమిపాలకకుటుంబం బందు జన్మించి ని
ష్ఠురకార్యంబుల నుజ్జగించి భువనక్షోభంబు పోకార్ప బం
ధురదీక్షావిభవంబు గైకొనిన ముక్తున్ బుద్ధదేవున్ దయా
కరు భావించెద సత్వసిద్ధి కతిలోకా సర్వ...

62

మ.

సదయాంతఃకరణాతిరేకమతి మించన్ విశ్వకళ్యాణసం
పదఁ గాంక్షించి యహింసయే మనుజధర్మం బంచు చాటించి య
భ్యుదయశ్రీసముపేతుఁడైన జినదేవోదారసత్యవ్రతా
స్పదవిజ్ఞానము నెంతు నెంతయు సుభావా సర్వ...

63


శా.

సారాచారులఁ బండితోత్తముల నాస్థానంబునం జేర్చి తత్
స్వారస్యార్థనిబద్ధనవ్యకవితాసంపత్తి నాలింపఁగా
నేరాజైనను బూనఁ డాంధ్రకవితాహేలాపతీవైభవ
శ్రీరమ్యంబు లదృశ్య మౌ టరుదె హారీ సర్వ...

64


శా.

పేరుం గైకొన నెంచి మేటికవులం బిల్పించి యాస్థానమం
దారూఢంబుగఁ జేర్చి కబ్బముల వ్రాయం బంచి పోనాడుభూ
దారుల్ పండితపక్షపాతు లొకొ నిత్యస్వైరసంచారభూ
దారప్రాయులుగాఁ దలంప నగుగాదా సర్వ...

65


శా.

పారావారపరీతభూవలయముం బాలించి సత్కీర్తివి
స్తారుల్ తొల్లిటిధారుణీశ్వరులు వీసం బేని గొంపోయిరే
తారుణ్యంబును రాజ్యవిస్తృతియు నిత్యంబంచు దుర్వారగ
ర్వారూఢాత్మకు లెంతు రిద్ది తగవౌనే? సర్వ...

66


మ.

ఘనదుర్దాంతవయోవిజృంభణమునన్ గర్వించి కన్నట్టు కాం
తను బోనాడక యెట్టులో గలిసి తత్తద్వ్యాధిపీడాదిసం

జనితక్షోభలఁ గుందుజాల్ముఁడు ప్రపంచద్రోహి యై యేన యౌ
వననించాకవినంచు నుబ్బునెద దేవా! సర్వ...

67


మ.

పరకాంతావిముఖుండనంచు సభలన్ వాక్రుచ్చి కబ్బంబులన్
బరుకన్ వచ్చును గాని శక్యమొకొ గ్రామక్రోడదుర్మాంససం
కరనానావిధభక్ష్యభోజ్యనిచయగ్రాసావలేపాత్ముఁ డౌ
నరుఁ డన్నట్టుల నిర్వహింప గుణధన్యా సర్వ...

68


మ.

అటవీమధ్యములం జరించుచుఁ బ్రపంచాతీతు లై మోక్షలం
పటు లై యున్న మహామునీశ్వరులె భామాదర్శనభ్రాంతు లై
విటచూడామణులై చరించి రన మాధ్వీమాంసమద్యాశనో
త్కటమత్తాత్ములు కామ మాపుటలు కద్దా సర్వ...

69


మ.

కవియైనంత ఫలంబె యన్యకవిరాట్కావ్యార్థచౌర్యక్రియా
కవితాదూరుఁడు కావలెం గద మహీకాంతుండు నైనంతనే
యవునే పౌరజనశ్రమాహరణనిత్యాచార్యకార్యక్రియా
స్తవనీయాత్ముఁడు కావలెం గద రమేశా సర్వ...

70


శా.

ఎన్నండో యొనరించినట్టి సుకృతంబే ఱేని గావించె; ని
ప్డెన్నోపాపము లాచరించునెడ ముందేపాట్లు కానున్నవో

యెన్నా ళ్లాయమలోకవాస మగునో యేజన్మ రానున్నదో
అన్నా! యేనృపుఁడైన నెంచఁ డిది మేలా సర్వ...

71


మ.

తరుణీపీనకుచద్వయీనిహితహస్తద్వంద్వుఁ డై కామినీ
స్మరణానందసుఖాభిరాముఁడయి సంసారేచ్ఛ వర్తించు కా
తరుఁడైనన్ దృటిసేపు నిన్ను మదిలో ధ్యానించుచో మోక్షసు
స్థిరభాగ్యంబుల నొందఁగాఁ గలుగుఁ గాదే సర్వ...

72


మ.

వితతక్రూరనృపాలసేవనము గావింపంగనేలా? దురా
గతదుర్వృత్తులయందు లోఁబడి మెలంగన్ బోవనేలా! జగ
త్పతినిం గొల్చినచో తరించెదవు లేదా "ఆయురన్నం ప్రయ
చ్ఛతి" యంచున్ బుధు లాడి రిద్ది నిజ మీశా సర్వ...

73


మ.

తను దూషించినఁ గ్రమ్మఱన్ దెగడు కాతర్యంబు త న్నెవ్వరై
నను భూషించిన నుబ్బు దుర్నయము తన్ గాదన్న రోసంబు గై
కొను దుష్టత్వము లేని మానవుఁడె యోగ్యుం డట్టియోగత్వ మె
వ్వనియందుం గల దాతఁ డీవొకటె దేవా సర్వ...

74


శా.

తారుణ్యంబు గలంతకాలము సమస్తప్రాణిసంతానవి
స్తారంబై తగునీజగంబు నొగి నిత్యంబంచు భావించితిం

జేరన్ వచ్చెను వార్ధకం బిపుడు నాచిత్తంబు సర్వంబు మి
థ్యారంగంబని యెంచె భ్రాంతి విడె దేవా సర్వ...

75


శా.

ఏవో కొన్నికొఱంత లున్నయెడ నే నెట్లవ్వి సంపూర్ణముం
గావింపంగలవాఁడనంచు వగచున్ గర్మంబు బాగుండి సు
శ్రీవిశ్రాంతి లభించెనేని సుఖముల్ చేకూఱెనంచుబ్బు నీ
సేవల్ చేయుట లెప్పు డీనరునకున్ శ్రీ సర్వ...

76


మ.

మతముల్ సర్వము నీమహత్త్వమును సంభావించి బోధించు స
ద్గతి నీవొక్కఁడవే ప్రదాత పని లోకం బెల్ల వాక్రుచ్చు శా
స్త్రతతుల్ ని న్దెలుపన్ బరస్పరవిభేదం బూని వర్తించు నే
వితముం గైకొనఁజాలుదున్ విగతగర్వీ సర్వ...

77


శా.

దీనత్రాణపరాయణుండవు జగద్గేయప్రభావైభవ
శ్రీనీరంధ్రదిగంతరుండ వగునిన్ జింతించి ధ్యానింపఁగాఁ
బోనుంబోను నశక్తి పెచ్చరిలునో పోరామి చేకూరునో
గానన్ నేఁడె స్మరింతుఁ గావు మకలంకా సర్వ...

78


శా.

క్రీడారంగము నీకు లోకము మహాకీలాలవారాశి నీ
రాడంగూర్చుసరోవరంబు పటుత్వాకీర్ణ ఘోరాటవుల్
వీడంజాలని నిష్కుటంబులు నభోవీథిస్పృశచ్ఫైలముల్
మేడల్ నీకగు నెట్లు గందు నిను స్వామీ సర్వ...

79

శా.

కుక్షింబోషణ సల్పఁగాఁ దలఁచి పెక్కుల్ దౌష్ట్యముల్ సల్పి యే
రాక్షేపించిన సిగ్గునొందక ధనంబన్నంత నాశించుపా
పక్షుణ్ణాత్ములు చూచువారలకుఁ దత్త్వజ్ఞానుల ట్లుందు రీ
శిక్షాపాత్రుల కేది నీతి పరవాసీ సర్వ...

80


శా.

సహ్యాసహ్యవిచారశూన్యు లయి నీచద్రవ్యలాభార్థ మై
బాహ్యడంబరు లైనదుర్జనులు పాపం బన్న లజ్జింప రీ
యేహ్యస్వాంతుల నేల భూతములపై సృష్టించితో! నీతలం
బూహ్యం బెట్లగు నస్మదాదులకు వేల్పూ! సర్వ...

81


మ.

పరిచర్యాభరమున్ సహించి, పరభూపశ్రేణినిం గొల్చి సం
సరణంబుం గడుపంగనేరని దురాచారుండు నిన్నుం బరా
త్పరు నర్థించి దురంతబంధముల నుత్పాటింప యత్నింపఁ డీ
నరజన్మంబు తరించు టెట్లిఁక ననన్యా సర్వ...

82


మ.

హరియే దైవమటంచు నొక్కరుఁడు పుణ్యస్థానసందర్శన
స్మరణంబే యపవర్గమంచు నొకఁ డీసంసారమే మోక్షసు
స్థిరకళ్యాణమయం బటంచు వచియించెన్ వేఱొకం డీపర
స్పరవైరుధ్యము దిద్దు టెట్టులగు దేవా సర్వ...

83


శా.

కాలక్రూరదురంతకాసరమహాఘంటారవంబుల్ శ్రవః
పాళిన్ భిన్నము చేయుచో నిను స్మరింపన్ నేర్తునో నేరనో

కాలాసన్నము గాకముందు మదిలోఁ గాంక్షించువిజ్ఞానల
క్ష్మీలాభం బొనగూర్పుమయ్య గుణరాశీ సర్వ...

84


శా.

సేవాధర్మము లే నెఱుంగ నిను బూజింపంగ లేకుంటి స
ద్భావావేశము లేదు సుంతయు దరిద్రక్షోభచేతన్ మనీ
షావిశ్రాంతి నశించె వ్యర్థముగ నాజన్మంబు చేటయ్య నన్
గావం జూతువొ! వీడెదో సుగుణగణ్యా సర్వ...

85


శా.

తారుణ్యంబు గతించె, వార్ధకము చెంతన్ జేరె నెమ్మేన దు
ర్వారవ్యాధులు కాచియుండెను పటుత్వం బెల్ల వమ్మయ్యె నీ
కారుణ్యంబును గోరు కాలమిది గాపాడెదో వీడెదో
లే రెవ్వారలు దిక్కు సర్వసురమౌళీ సర్వ...

86


మ.

పరసేవాకరణశ్లధంబయిన భావం బెట్లు నీనామసం
స్మరణానందము నొంద నేర్చు; కలుషాచారప్రచారంబులన్
బరుగుల్ పెట్టుచు నున్నజీవితము నీపాదాంబుజాతద్వయీ
పరిచర్యావిధి నెట్లు ధన్యమగు దేవా సర్వ...

87


మ.

తినుబండారము తెమ్మటంచు నిసువుల్ దివ్యాంబరశ్రేణికై
వనితారత్నము గ్రంథసంతతి కభిప్రాయార్థమై స్నేహితుల్

ధనసంపాదనకై దురాశయును సంతాపజ్వరజ్వాలలం
దనిశంబున్ దహియించు సత్కవుల నీశా సర్వ...

88


మ.

కవితాకాంతకు బుద్ధి భాషకు సమగ్రంబైన యూహాదివై
భవముల్ కావ్యరసప్రపంచమునకుం బ్రాణంబు సంసారసం
భవకష్టార్థము మేనొసంగిన కళాపారంగతుం డెట్లు నీ
స్తవమున్ జేయఁగలాఁడు తీరికెగ శ్రీశా సర్వ...

89


మ.

శ్రుతపాండిత్యముతో నినుం దెలియ నెచ్చో శక్యమౌనే? సమం
చితవిజ్ఞానముచేత నీప్రతిభ చర్చింపంగ సాధ్యంబె? శా
స్త్రతతుల్ తెల్పెడిత్రోవలం జనక నీశాంతస్వరూపంబు హృ
ద్గతముం జేయ ననుగ్రహింపవె యనింద్యా సర్వ...

90


మ.

గతకాలంబు సుఖంబుగా జరిగె; నింకన్ మీఁదికాలంబునన్
బ్రతు కేరీతి శ్రమాకులం బగునొ; నిర్బంధాకరంబైన సం
సృతి నన్నెట్లు దురంతదుస్సహతరార్తిన్ గూల్చునో యంచు నా
మతి చాంచల్యము నొందె దిద్దుటకు రమ్మా సర్వ...

91


మ.

కలలోఁ గాంచినవెల్ల సత్యసరణుల్ కానట్లు సంసారసం
కుల మౌ నైహిక మెల్లల కల్లయని యొక్కొం డైన విజ్ఞాని లో
దలపోయండు వివేకులే కలుషసంతానంబు నార్జించుచో

తులువల్ మోక్షము నొందఁగాఁ గలరె యెందున్ సర్వ...

92


మ.

పరకాంతం గనినంతఁ గాముకుఁడు దుర్వ్యాపారచింతాపరం
పరలం దేలుచునుండు గాని యెద సౌభ్రాతృస్వభావైకవి
స్ఫురితుండై నిజసోదరీమణిగ నెచ్చోఁ జూడఁ డీపాపి సో
దరులుం దల్లియు స్త్రీలు గారొ తెలివొందన్ సర్వ...

93


మ.

తరుణీరూపము మాతృభావ మలరన్ ధ్యానించుటన్ ఘోరసం
సరణాంభోనిధి కంటియంటనిగతిన్ సర్వత్ర వర్తించుటల్
నరుఁ డెవ్వం డొనరించుచుండు నతఁడే నారాయణుం డాతఁడే
పరమాత్ముం డని చెప్పఁగాఁ దగును దేవా సర్వ...

94


శా.

తారుణ్యంబును బూర్తిగా నితరకాంతాదూరుఁ జై పుచ్చి ని
స్సారంబై తగునైహికావళి యెడన్ సంసర్గముల్ మాని యా
శారోషాదిపరాఙ్ముఖుం డయిన సౌజన్యాత్మ కన్ సన్నలం
జేరుంగాదె ప్రపంచమెల్ల గుణరాశీ సర్వ...

95


మ.

మహనీయుల్ కవిసార్వభౌములు సుధామాధుర్యవాక్పూగధూ
ర్వహనానార్థకవిత్వమాలికలచే రంజిల్లఁగాఁ జేయు నీ
మహితోరస్స్థలి దోషదూషితవచోమాలాదికం బుంచు నా

యహమున్ సైచి కృతార్థుఁ జేయఁ గదవయ్యా సర్వ...

96


మ.

గళసంస్తంభితమై కఫంబు హృదయోత్కంపంబు గావించుచో
తలభారంబయి కంపమొందునెడలన్ ధాతువ్రజం బెల్ల సం
కులముం బొందుతఱిన్ భవత్ప్రతిభఁ బేర్కో నేర్తునో నేర్వనో
తలఁతున్ వేఱొకమారు నేఁడు దయరాదా సర్వ...

97


శా.

ఏరూపంబున నున్నవాఁడవని యూహింపంగ నేర్తున్ మఱే
పేరం బిల్చెద నెందు నుందువనుచుం బేర్కొందు నెం దేఁగుదున్
దారాపుత్రదురీషణావృతదురంతక్రూరసంసారచిం
తారంగస్థలి దాఁటు టెట్లు పరమాత్మా సర్వ...

98


మ.

నిగమార్థంబు లెఱుంగ, వ్యాసముఖులౌ నిర్వాణవేత్తల్ పురా
ణగణంబందు లిఖించినట్టి విషయాంతర్భావముల్ చూడలే
దగచాట్లం బడు జ్ఞానశూన్యుఁడను నే నాత్మార్పణం బెట్లు చే
యఁగ నేర్తున్ దరియించు బెట్లు పరమేశా సర్వ...

99


శా.

ప్రాచీనంబగు నార్షభావమది దుర్వ్యాఖ్యానసంపత్తిచే
నీచస్థానము నొందె; సాంస్కృతికవాణీవైభవశ్రీల న

ర్వాచీనుల్ గ్రహియింపకుండి రెటు తత్త్వజ్ఞానసంపాదన
వ్యాచిక్రింసకుఁ బూనుకోఁగలను దేవా సర్వ...

100


మ.

కలికాలం బిదిగాన మానవులకుం గాలంబు స్వల్పంబు నీ
చులపొందే లభియించు సజ్జనులగోష్ఠుల్ కల్గ వెట్లీవ్యథా
కులసంసారపయోధి దాఁటనగునో క్రూరారిషట్కంబు నే
లలి వంచింపఁగ నౌనొ తోఁచదె యనల్పా సర్వ...

101


మ.

మునుముందెప్పుడొ భక్తియోగకలనంబుం బూన నేనంచు నా
మనమం దెంచితిగాని యెప్పటికి నేమార్పౌనొ, యీనాఁడె నీ
యనుగుంబిడ్డను నన్నుఁ గావుమనుచుం బ్రార్థింపఁ బ్రాల్మాలితిన్
చనె సజ్ఞానము బ్రోవరావె పరమేశా సర్వ...

102


మ.

గ్రహతారాదులు దిక్కు లాకసము వక్కాణించు నీతేజ మ
న్వహమున్ సర్వము నీయధీనమని శాస్త్రార్థంబు బోధించు నీ
మహనీయత్త్వ మెఱింగి విస్మృతమహామాయాప్రపంచంబులో
విహరించం దొరకొంటి న న్నరయలేవే సర్వ...

103


మ.

తనువో చంచలమం చెఱుంగుదును, గాంతావ్రాతసంపర్కమున్
ఘనవిజ్ఞానహరంబుగాఁ దెలియుదున్ గర్మానుబంధంబులే
జననప్రాప్తికి మూలకారణముగాఁ జర్చింతునే గాని నా
మనమున్ నీపయి నిల్పనేరఁ గనుఁగొమ్మా సర్వ...

104

మ.

కవితాకల్పనముల్ రసప్రచురశృంగారప్రబంధంబులున్
నవభావాకరనాటకాదికములున్ నాదృక్పథంబందు ను
త్సవముంగూర్చును గాని మోక్షమహితార్ధగ్రంథసంబంధముల్
చవిగా వెట్లు తరింపఁగాఁ గలనొ యీశా సర్వ...

105


శా.

ఈ దేహం బొగి పంచభూతమయ మెందేవేళనో తూలుమ
ర్యాదాలేశమె నిల్చు శాశ్వతముగా నర్థంబులుం జుట్టముల్
పాదుంజీవము బాసినట్టియెడఁ దోడ్పా టెందుఁగాఁ బోరు తృ
ష్ణాదైన్యం బదియేల జీవికి ననన్యా సర్వ...

106


శా.

ఆండ్రంబిడ్డల నెంత దన్నినను మేలా? లేదు సుంతేనిఁ బ్రో
యాండ్రన్ నిత్యము గూడినన్ వలపు నిప్పావంతయే నార దె
వ్వాండ్రం గొల్చినఁగాని సంసరణదుర్భారంబు పోకార దో
తండ్రీ! నీ వొకరుండె దిక్కు దయలేదా సర్వ...

107


మ.

పరితఃపుష్పితకేళికావనులు భావవ్యక్తకావ్యంబులున్
సరసాలాపవినోదవర్తనములున్ సహాభాగసం
చరణంబున్ విడనాడఁజాలని మనుష్యశ్రేణి వైరాగ్యని
ష్ఠురదీక్షావిధ మెవ్విధిం బడయనేర్చున్ సర్వ...

108


మ.

బ్రతుకా యన్యజనావలంబము శరీరంబా రుజాభూమి, స్వా
ర్జితమా నాస్తి సహాయబంధుహితులా సర్వత్ర పూజ్యంబు నా

గతి ముం దెట్టులమాఱునో యనుచు శోకం బందునే కాని పం
డితుఁ డైనన్ విడలేఁడు సంస్కృతిని తండ్రీ! సర్వ...

109


మ.

గతిలేకుండిన బిచ్చమెత్తుఁ దనకుం గర్జంబు లేకున్నచో
మతిశూన్యుండయి యన్యగేహములలో మాపుల్ పవళ్లుండు నే
చతురుండైనను మిథ్య సర్వమనుచుం జర్చించి నిష్టాగరి
ష్ఠత నార్జింపఁ దలంపఁ డేమనెద నీశా సర్వ...

110


మ.

వినవచ్చెన్ యమధర్మరాజతురగద్విట్కంఠఘంటాఘణం
ఘనరావంబులు కంఠసంకలితమై కాసప్రసారంబు నె
క్కొనె నీవే శరణంబు నాకనిన నీకుం గూర్మి కాఁబోవ దీ
తను వున్నప్పుడె నిన్ స్మరింపవలె గాదా సర్వ...

111


మ.

కలుషాచారులు దంభవర్తనులు లోకం బెల్ల వంచించుచే
ష్టలు దర్శించి దదీయవర్తనములన్ ఛద్మంబులం గేరి నే
నెలమిన్ వ్రాసితిఁ గొన్నిపద్యములు నీకీనూత్నపద్యంబు లు
జ్జ్వలసమ్మోదకరంబులంచు జగదీశా సర్వ...

112


మ.

పరసేవాజనితవ్యథాభరము సైపన్ లేక యస్మద్ధృదం
తరసంతాపము వెళ్లఁబుచ్చుటకుఁ బద్యవ్రాతముం గూర్చి నీ

చరణాబ్దంబులచెంత నుంచితిని దాస్యక్షోభవిచ్ఛేదనం
బు రహిం గూర్చవె పాఠకాళికి స్వయంభూ సర్వ...

113


మ.

పదిరెండేడులక్రింద నీకృతి సమాప్తం బయ్యె; సిద్దాన డె
బ్బదిపద్యంబులు పత్రికాంతరమునన్ బ్రవ్యక్తమై రాజిలెన్
దుదిపద్యంబులు కొన్ని మిత్రుఁ డొకఁ డెందో పాఱవేయంగ న
ల్వదిపద్యంబుల వ్రాసితిన్ మరల దేవా సర్వ...

114


శా.

మారీస్ఫోటకరోగదూర మగుచున్ మాతృక్షమాభాగముల్
పేరుం బెంపును గాంచుఁగాఁత కవితాబింబోష్ఠి లీలాగతుల్
శ్రీరమ్యంబుగ రాట్సభాంతరములన్ జెన్నొందుతన్ సత్కవి
స్వైరవ్యాప్తికి హేతుభూత మగు ఠేవన్ సర్వలోకేశ్వరా.

115