బ్రహ్మోత్తరఖండము/తృతీయాశ్వాసము

తృతీయాశ్వాసము

క.

శ్రీదేవదేవ సాంబ మ
హాదేవ గిరీశ భాస్వదంబాపురధా
త్రీదేవార్చిత శంకర
వేదాంతమయాంగ పార్థివేశ్వరలింగా.

1


వ.

దేవా యవధరింపు మఖిలపురాణకథాకథనదక్షుం డయిన
సూతుం డమ్మునుల నవలోకించి యి ట్లనియె.

2


శా.

నిత్యానందము నిర్వికల్పము సదా నిర్వాణసౌఖ్యప్రదం
బత్యంతాఘహరంబు నిర్మల మనాద్యంతంబు నిర్దుష్టమున్
సత్యజ్ఞానమయంబు సారమును సంసారాబ్ధిపోతంబునున్
శ్రుత్యుక్తం బగుశైవతత్త్వ మెవఁ డెంచున్వాఁడె ధీరుండిలన్.

3


ఉ.

ఓమునిచంద్రులార వినుఁ డొప్పుగ మానవులెవ్వరేని ని
ష్కామనచిత్తులైనను నకామనులైన నఖండభక్తిచేఁ
గామవిపక్షు శూలిఁ గరకంధరు నాశ్రితపారిజాతమౌ
హైమవతీమనఃప్రియు నహర్నిశమున్ భజియింపఁగాఁ దగున్.

4


క.

భవచక్రోద్భవు లగుమా
నవులకు శరణంబు శంభునామమె తలఁపన్
భువిలో లేదు తదన్యము
శివభజనము సర్వసౌఖ్యసిద్ధి యొసంగున్.

5


క.

ధనకనకవస్తువాహన
వనితాసుతభోగమోక్షవాంఛాపరు లై

మనసిజహరు సేవించిన
జనులకుఁ దత్కామితార్థసంసిద్ధి యగున్.

6


మ.

అలరన్ సాంబశివుండు కాలమదసంహారుండు సర్వాత్మకుం
డలఘుప్రాభవుఁ డట్లు గావునఁ దదీయారాధనాంకవ్రతం
బులు నశ్రాంత మకాలమృత్యుభయము ల్వోఁ ద్రోయు టాశ్చర్యమే
, తొలఁగుం దారుణకాలమృత్యువు దదత్యుగ్రప్రభావంబునన్.

7

సోమవారవ్రతప్రభావము

క.

వ్రతములలోన మహేశ్వర
వ్రతములు ముఖ్యములు సోమవారవ్రత మా
వ్రతములయందు విశేష
వ్రతమన శోభిల్లుచుండు వసుమతిలోనన్.

8


చ.

విమలమనస్కుఁడై నరుఁడు విశ్రుతభక్తి సెలంగ సోమవా
రములఁ బ్రదోషకాలముల రాజితమంటపమధ్యపీఠికన్
హిమగిరిపుత్రికారమణు నిందుకళాధరు షోడశోపచా
రములను బూజ చేసిన దురంతవిపద్భయ మొందఁ డెన్నఁడున్.

9


చ.

అనిశము సోమవారదినమం దుపవాసము సల్పి శంభుపూ
జన మొనరింపఁగావలె ద్విజన్మనృపాలకవైశ్యశూద్రులం
దును నెవరైన నాశ్రమచతుష్టయవర్తులు నెవ్వరైన స్త్రీ
జనములు నెవ్వరేనియును నీశు భజించుట యుక్త మారయన్.

10


క.

క్షితి నీయర్థంబున కొక
యితిహాసము గలదు దాని నెఱిఁగింతు వినుం
డతిమోదంబున నేత
ద్వ్రతమహిమలు దోఁచినంత వర్ణింతుఁ దగన్.

11

వ.

అని చెప్పి వెండియు ని ట్లనియె.

12

చిత్రవర్మమహారాజుచరిత్రము

మ.

అమలాచారధరామరేంద్రకలితార్యావర్తదేశంబునన్
సమదేభాశ్వశతాంగవీరభటభాస్వవ్రాజసంసేవ్యమై
కమలేందీవరహంసకోకవిలసత్కాసారకేళీవనీ
కమనీయం బగు రాజధాని వెలయుం గాళిందితీరంబునన్.

13


ఉ.

ఆపుర మేలు సంతతనయప్రతిపాలితధర్ముఁ డుల్లస
ద్రూపజితేక్షుధర్ముఁడు విరోధినరేశ్వరకాలధర్ముఁ డ
ష్టాపదచిత్రధర్ముఁడు విశాలసుశర్ముఁడు చిత్రవర్ముఁ డన్
భూపతిశేఖరుండు పరిపూర్ణకృతాధ్వరపుణ్యకర్ముఁడై.

14


సీ.

కారుణ్యసుప్రభాకలితవిద్యావాప్తిఁ
         గమలాక్ష కమలాప్త కమలభవుల
వరభోగసౌందర్యవాగ్విశేషంబుల
         జిష్ణు జిష్ణుకుమార జిష్ణుగురుల
భూతిప్రతాపసంపూర్ణవైభవముల
         భర్గ భర్గాత్మజ భర్గసఖుల
ఘనబుద్ధిసత్కళాగాంభీర్యగుణములఁ
         జంద్రనందన చంద్ర చంద్రగురుల


తే.

నపహసించు నటంచు దిగంతరముల
సకలజనములు వినుతింప సమ్మదమున
రాష్ట్ర మేలుచు నుండె సురక్షితముగఁ
జిత్రవర్ముండు పార్థివశ్రేష్ఠుఁ డగుచు.

15


క.

శరణాగతరక్షణమును
హరిహరభక్తియును భూసురారాధనము

న్నిరతం బరినిగ్రహమును
సరసానుగ్రహముఁ గలిగి జనపతి వెలయున్.

16


తే.

ధర్మరతుఁ డైనయాచిత్రవర్మనృపతి
కాత్మ ముదమందఁ గలిగెఁ బుత్రాష్టకంబు
నంతఁ జిరకాలమునకుఁ గల్యాణధన్య
సకలజనమాన్య యొక్కకన్యక జనించె.

17


ఆ.

చిత్రవర్మ తనదుపుత్త్రిక నీక్షించి
యార్యఁ గనిన యాహిమాద్రికరణి
సంతసిల్లి యపుడు సంపూర్ణకాముండ
నైతి నే నటంచు నాత్మఁ దలఁచె.

18


వ.

అంత.

19


మ.

అలఘుప్రాభవుఁ డానృపాలకుఁడు కన్యారత్నముం గాంచి యు
జ్జ్వలతేజోవిభవంబు మీఱ నమితోత్సాహైకచిత్తంబు రం
జిలఁగా జాతకలక్షణజ్ఞుల మహాసిద్ధాంతులన్ వేదవే
త్తల రావించి బహూకరించి యడిగెన్ దల్లగ్నభావంబులన్.

20


శా.

ఓవిప్రోత్తములార మీరలు మదీయోక్తి న్విచారింపుఁడీ
మావంశంబున రాజకన్యకలు సామ్రాజ్యాభియోగార్హలై
శ్రీ వర్ధిల్లఁగ నుందు రీశిశువు వారిం బోలి యశ్రాంతమున్
దేవబ్రాహ్మణపూజనాభిరత యై దీపించునో చెప్పరే.

21


క.

నావిని యాసైద్ధాంతికు
లావసుధేశ్వరుని జూచి హర్షముతో సం
భావించి పలికి రప్పుడు
ప్రావీణ్యముతోడ శాస్త్రఫణితులు మెఱయన్.

22

క.

ఈమానిని యాగర్భ
శ్రీమతి యై సత్కళావిశేషాత్మక యై
సీమంతవతీమణి యై
సీమంతిని యనగఁ ధరఁ బ్రసిద్ధి వహించున్.

23


సీ.

శరధికన్యకరీతి సౌభాగ్యవతి యగు
        భారతిగతిఁ గళాప్రౌఢి మెఱయు
మదనారిసతిమాడ్కి మాంగల్యవతి యగుఁ
        బౌలోమికరణి సంపదలు చెందుఁ
దమయంతిలీల సౌందర్యంబు వహియించు
        రోహిణివలె మించు రుచిరకాంతి
నయ్యరుంధతిపోల్కి నాచారవతి యగు
        సావిత్రికైవడి సాధ్వి యగును


తే.

విభునితోఁ గూడి తాఁ బదివేలయేండ్లు
నఖిలసామ్రాజ్యభోగంబు లనుభవించి
యష్టపుత్త్రుల నొక్కకన్యకను గాంచు
పుణ్యచారిత్రి నీపుత్రి భూవరేంద్ర.

24


వ.

అని యివ్విధంబున నిజపుత్త్రికాజాతకఫలంబులు చెప్పిన
సైద్ధాంతికజనంబుల సుధారసోపమానంబు లైనభాషణంబు
లాకర్ణించి పరమానందకందళితాంతరంగుండై యాభూ
పాలుండు వారల ననేకమణిమయభూషణాంబరంబులం
బూజించియున్న సమయంబున.

25


తే.

అంత నొకధూర్తభూసురుం డద్భుతముగ
దైవగతిని జతుర్దశాబ్దంబునందు
పతివియోగంబుఁ జెందు నీబాలిక యని
రాజునకుఁ దెల్ప మది విచారంబు దోఁప.

26

క.

అమ్మాట వజ్రపాతని
భమ్ముగ నాలించి నృపతి బహుతరచింతా
సమ్మూర్ఛితేంద్రియత డెం
దమ్మున నొక్కింతప్రొద్దు తల్లడమందెన్.

27


వ.

తదనంతరంబున బ్రాహ్మణవత్సలుం డైనయమ్మహీపాలుండు
గ్రమ్మఱ ధైర్యం బవలంబించి సర్వంబు దైవాధీనం బని
మనంబున నిశ్చయించి నిశ్శంకుండై యాబ్రాహ్మణుల నిజ
నివాసంబులకుఁ బోవంబనిచి తానును నభ్యంతరమందిరంబు
నకుం జని భార్యాసమేతంబుగా నతిప్రేమంబున నక్కన్యకా
రత్నంబు ననుదినంబు నుపలాలనంబు సేయుచు నుండె నంత.

28


శా.

ఆసీమంతిని పౌరజానపదనేత్రానందసంధాత్రియై
శ్రీసౌందర్యవిలాసయై వివిధధాత్రీవర్ధమానాంగియై
హాసోల్లాసముఖాబ్జయై తరుణరాకాధీశరేఖాకృతిన్
భాసిల్లెన్ బితృబాంధవాదులును సంభావింప నానాఁటికిన్.

29


ఉ.

ముద్దుమొగంబు మానికపుమోవియుఁ దేటమెఱుంగుఁగన్నులు
న్నిద్దపుమేల్మిసొమ్ములును నీలకచంబును జెక్కుటద్దము
ల్బెద్దఱికంపుసుద్దులును బిన్నతనంబును మీఱి యుండఁగా
ముద్దియ యొప్పె బాల్యమున మోహనరూపము గానుపింపఁగన్.

30


సీ.

చెలికత్తెలను గూడి సీమంతినీకన్య
         శైశవక్రీడాప్రసక్తిఁ దగిలి
బొమ్మలపెండ్లిండ్లు సమ్మోదమునఁ జేయు
        గురుమైత్రి గుజ్జనగూళ్లు వండుఁ
దులలేనిబంగారుతూఁగుటుయ్యల నూఁగు
        నుద్యానవనముల నొప్పఁ దిరుగుఁ

బుష్పవాటికలలోఁ బొలుపొంద విహరించుఁ
         బంతంబు మెఱసి చేబంతులాడు


తే.

దాయముల నాడు నోమనకాయ లాడుఁ
బాటలను బాడు బెరిగాయ లాట లాడు
మున్ను మున్నుగ డాగురుమూఁత లాడు
నాసుశీల జగన్మోహనాంగి యగుచు.

31


వ.

ఇవ్విధంబున నారాజకన్యక బాల్యక్రీడావినోదంబులం
గొంతకాలంబు గడపి పంచమవర్షంబున గురుజనంబులవలన
నక్షరస్వీకరణాదికృత్యముల బహువిధశాస్త్రగ్రంథపరిశీలనము
గావించి సమస్తవిద్యాప్రవీణయు నత్యంతమేధాధురీణయుఁ
బ్రౌఢభాషావిజృంభమాణయు నై యుండె నంత.

32


ఉ.

భూవరుతోడ బాల్యమున భూసురవర్యుఁడు పల్కినట్టి త
ద్భావిఫలప్రచారము యథాస్థితిగా నొకనాఁటిరేయి ప్ర
స్తాపము గాఁగఁ జెప్పిన నిజప్రియదూత కథానులాపనం
బావసుధేశకన్య వినె నంతయు నాత్మసఖీముఖంబునన్.

33


క.

విని యాభూవరనందన
ఘనతరసంతాపశోకకర్శిత యగుచున్
మనమునఁ దహతహ జెందుచుఁ
జనియెం గురుపత్ని యున్న సదనంబునకున్.

34


ఉ.

ఆయవనీశకన్య చని యాత్మగృహాంతరపీఠమధ్యసం
స్థాయిని శుభ్రకేశసముదాయిని భద్రఫలప్రదాయినిన్
శ్రీయుత యాజ్ఞవల్క్యమునిశేఖరహర్షవిధేయి యైనమై
త్రేయిని గాంచె సువ్రతపరిశ్రమతుష్టవృషాంకపాయినిన్.

35

క.

కని తత్పాదాబ్జములకుఁ
దనఫాలము సోఁక మ్రొక్కి తల్లీ వినుమా
నిను నే శరణము సొచ్చితి
మనమునఁ గరుణించి నన్ను మన్నింపఁదగున్

36


క.

ఏసత్కర్మ మొనర్చిన
భాసురసౌభాగ్యపదము ప్రాపించి శుభో
ల్లాసముగ నుండఁగలిగెను
నాసువ్రత మెఱుఁగఁ బలుకు మనురాగమునన్.

37


వ.

అదియునుంగాక దుష్కర్మభయాకులస్వాంత నై భవదేక
శరణ్యనై యున్ననన్ను గరుణించి దీర్ఘసుమంగలి యగు
నట్లుగా ననుగ్రహింపవలయు నని పాదంబులకుఁ బ్రణమిల్లి
యున్న యక్కన్యకారత్నంబు నత్యంతకారుణ్యదృష్టిం
జూచి తద్గుణశీలంబు లింత యొప్పునే యని యగ్గించి యా
శుభాంగికి మనఃప్రియంబుగా మైత్రేయి యి ట్లనియె.

38


క.

ఓరాజకన్య విను శ్రీ
గౌరిని శాంకరిని నీలకంఠయుతముగా
నారాధింపుము భక్తిని
ఘోరాపద్భయము లడఁచి కుశలము లొసఁగున్.

39


ఆ.

సోమవారమునను సురుచిరభక్తితో
నుపవసించి స్నాన మొనరఁజేసి
ధౌతవస్త్రయుగ్మధారణం బొనరించి
శివు నుమేశుఁ బూజ సేయవలయు.

40


చ.

శమదమయుక్తులై విమలసౌమ్యమనస్కులునై సదాశివా
గమనియమజ్ఞులై విగతకైతవభావముఁ గల్గి సోమవా

రములు బ్రదోషకాలముల రమ్యత మీఱఁగ షోడశోపచా
రములను బార్వతీశ్వరుల రంజిలఁ బూజ లొనర్పఁగాఁ దగున్.

41


క.

పూజానంతరమున ద్విజ
భోజన మొనరించి మఱియు భూసురసతులం
బూజించి హరిద్రాంజన
రాజితసుమకంచుకాంబరము లీయఁదగున్.

42


క.

ఎటువంటియాపదలు సం
కటములు బ్రాపించినను జగన్నుత మగుధూ
ర్జటిపూజ విడువఁగూడదు
పటుమతి గావించినను శుభం బగు నీకున్.

43


వ.

అని చెప్పి యమ్మహామునిపత్ని సీమంతినింజూచి యే నిమ్మహా
వ్రతఫలంబు వివరించెద సావధానంబుగా నాకర్ణింపుమని
యిట్లనియె అభిషేకంబునఁ బాపక్షయంబును బీఠపూజనంబున
సామ్రాజ్యంబును గంధమాల్యాక్షతార్పణంబులవలన ననేక
సౌభాగ్యసౌఖ్యంబులును ధూపదానంబున సౌగంధ్యంబును
దీపప్రదానంబునఁ గాంతివిశేషమును నైవేద్యమున మహా
భాగ్యమును దాంబూలదానమున సంపత్సమృద్ధియు నమస్కా
రంబున ధర్మార్థకామమోక్షప్రాప్తియు మంత్రజపంబున నణి
మాద్యష్టైశ్వర్య సిద్ధులును హోమంబున సర్వకోశాభి
వృద్దియు బ్రాహ్మణ భోజనంబువలన సమస్తదేవతాసంతు
ష్టియు సువాసినీపూజనంబున దీర్ఘసుమంగలిత్వమునుం గలుగు
నట్లు గావున నీ విమ్మహావ్రతంబు గావించి భవానీశంకరుల
నారాధింపుము తత్ప్రసాదంబున నాపత్సముద్రంబు నిస్తరించి
విప్రియత్వంబునుం జెందక సుఖమున నుండుదువు శివపూజా

మహత్వమువలన మహాఘోరసంకటములైనఁ దొలంగు నని
సోమవారవ్రతప్రభావము దెలియం జెప్పిన నారాజకన్యక
సంతుష్టాంతరంగ యై యమ్మైత్రేయికి పునఃపునఃప్రణామంబు
లొనరించి తదనుజ్ఞాత యై క్రమ్మఱ నిజసౌధంబునకు వచ్చి
తదాజ్ఞాప్ర కారమున నమ్మహావ్రతం బాచరించుచుండెనంత.

44


సీ.

చంద్రమండలనిభాస్యంబు గల్గుటఁజేసి
        కమలాక్షి శ్రీలక్ష్మికరణి వెలయుఁ
గాఠిన్యవక్షోజగౌరవంబు సెలంగి
        గిరిరాజపుత్త్రికాకృతి వహించుఁ
బ్రౌఢోక్తిచాతుర్యపాటవంబులు గల్గి
       వాగ్దేవిసాటి యై వన్నె కెక్కు
లలితసౌందర్యకళావిశేషము గాంచి
       యలరువిల్తునిసతి యనఁగఁ బరఁగు


తే.

విశ్వకర్మకృతామూల్యవివిధరత్న
జాలనిర్మితభర్మపాంచాలి యనఁగ
వెలసె సంప్రాప్తతారుణ్యవిభవ యగుచు
నిఖిలగుణపేటి సీమంతినీవధూటి.

45


క.

ఆరాజకన్య యభినవ
తారుణ్యవిలాసరేఖఁ దనరెడు సానల్
దీరినమరుశరమనఁ గ్రొ
క్కారు మెఱుంగనఁగ వెలసెఁ గాంతిస్ఫురణన్.

46

చిత్రవర్మ సీమంతినికి వివాహం బొనర్చుట

ఉ.

లాలితరూపకాంతిశుభలక్షణలక్షితగాత్రి యైనయా
బాలికఁ గాంచి యాప్తజనబాంధవమంత్రిపురోహితప్రధా

నాళిసమేతుఁ డై పరమహర్షము మీఱఁగఁ జిత్రవర్మభూ
పాలకుఁ డాత్మపుత్త్రికి వివాహము సేయఁదలంచె వేడ్కతోన్.

47


క.

ఆరాజనందనమహో
దారప్రాభవగభీరధైర్యాతిశుభా
చారంబులు విని వచ్చిరి
ధారుణిలోఁ గలుగురాజతనయులు వేడ్కన్.

48


సీ.

నరవరోత్తముఁ డైననలచక్రవర్తికి
        దమయంతికిని గూర్మితనయుఁ డగుచుఁ
జెలువు గాంచినయింద్రసేనమాహారాజ
       తనయుఁ డై మదనసౌందర్యుఁ డైన
చంద్రాంగదుని శరశ్చంద్రచంద్రాతప
       చందనామృతపయశ్చంద్రయశుని
బిలిపించి యతనికిఁ బ్రియపూర్వకంబుగా
       సకలబాంధవసమక్షంబునందుఁ


తే.

బరమహీనాథసుతులను బరిహరించి
తనదుప్రియసుత నిచ్చి యుద్వాహ మొప్పఁ
జేసె నత్యంతసంతోషచిత్తుఁ డగుచుఁ
జిత్రవర్మక్షమాపాలశేఖరుండు.

49


ఉ.

ఆనిషధేంద్రసూనుఁడు మహామతిమంతుఁడు చంద్రశేఖర
ధ్యానపరాయణుండు పరతత్త్వవిదుండు గృహీతభార్యుఁ డై
యానలినాక్షిఁ గూడి కుసుమాస్త్రజయంతవసంతసంతత
శ్రీనిధి యొప్పె నప్పుడు శచీవిభుఁ డైనమహేంద్రుకైవడిన్.

50


క.

ఆచిత్రవర్మగృహమున
వాచస్పతిసదృశనీతివర్తనశీలుం

డాచంద్రాంగదుఁ డుండెను
ధీచతురుం డగుచుఁ గొన్నిదినములు నెమ్మిన్.

51


మ.

అమితోత్సాహముతోడ రాసుతుఁడు బాహ్యారామవాటీవిహా
రము గావింపఁగ నోడ యెక్కి చనుదేరం దైవయోగంబునన్
యమునాతోయమునందు నాతఱిఁ దదీయామాత్యసేనాసమూ
హముతోఁగూడ మునింగె భూజనులు హాహాకారము ల్సేయఁగన్.

52


క.

కొందఱు జలముల మునిఁగిరి
కొందఱు గ్రాహోదరములఁ గూలిరి మఱియుం
గొందఱు తీరముఁ జేరిరి
కొందఱు గనుపింపరైరి కుశవేగమునన్.

53


సీ.

యమునాజలనిమగ్నుఁ డయ్యెఁ జంద్రాంగదుం
         డనుఘోరవృత్తాంత మాలకించి
బంధుమిత్రామాత్యపరివారయుతముగా
         శీఘ్రంబ చనుదెంచి చిత్రవర్మ
దత్తీరమున నిల్చి దారుణశోకాభి
         సంతప్తచిత్తుఁ డై వంత నొంది
యానదీసలిలమం దారసి రాసుతుఁ
         గానక బహుదుఃఖకలితుఁ డగుచు


ఆ.

హా మహానుభావ హా రాజనందన
హా యశోనిధాన హా కులీన
యెంతపాపకర్మ మేఁ జేసి యుంటినో
యెడలు వాపె మనల నీశ్వరుండు.

54

క.

ఏరీతిని సీమంతిని
నూరార్తు నహో భవద్వియోగాతురతా
భీరుల మీతలిదండ్రుల
నారయ నే నెట్లు నేర్తు నవనీశసుతా.

55


ఆ.

పూర్ణిమాసుధాంశు బోలునీనెమ్మోముఁ
గనులచూడకున్న ధనము లేల
జీవనంబు లేల శ్రీవైభవము లేల
ననుచు వగచుచుండె నవనివిభుఁడు.

56


వ.

ఇట్లు శోకవ్యాకులమానసుం డై యమ్మహీపాలుండు నితర
వ్యాపారంబులు మాని బహుప్రకారంబుల విలపింపుచుండు
నంత పౌరజానపదజనంబు లాబాలవృద్ధంబుగా వచ్చియన్న దీత
టంబునఁ బడి హాహారవముల శోకింపుచుండి రయ్యవసరంబున.

57


మ.

గృహసమ్మార్జనధేనుదోహనశిశుక్షీరాంబుపానక్రియా
దహనప్రజ్జ్వలనప్రదీపజనసంధ్యాస్నానదేవార్చనా
రహితం బయ్యెను జిత్రవర్మపురవర్యం బాదినంబందు దు
స్సహచంద్రాగదవిప్రయోగభవశుక్సంతాపితద్వంద్వమై.

58


సీ.

పరదేశముననుండి పతి యేఁగుదెంచిన
        సంతోషభావ మొక్కింత లేదు
కడపటి కొకమంచికొడుకు గలిగిన నైన
        సంతోషభావ మొక్కింత లేదు
బహుదినంబుల బ్రాణబంధుండు వచ్చిన
        సంతోషభావ మొక్కింత లేదు
ధనవిహీనునకు నిధానంబు దొరికిన
       సంతోషభావ మొక్కింత లేదు

తే.

ఏమి చెప్పఁగ వచ్చు నయ్యింద్రసేన
నందనువియోగభవమును జెంది కుంది
చిత్రవర్మమహీపాలుసీమఁ గలుగు
సకలజనములు నవగతోత్సాహు లైరి.

59


వ.

అంత నచ్చట నిషధదేశాధ్యక్షుం డగు నాయింద్రసేన
మహీనాథుండును జారులవలనఁ గర్ణశూలాయమానం
బగునిజతనయవృత్తాంతం బాకర్ణించి యనేకప్రకారంబులం
బ్రలాపించుచుండె నంత నన్నగరంబునం గల సమస్తప్రజ
లును దద్వియోగదుఃఖంబు సహింపంజాలక మహాఘోషం
బుగాఁ బరిదేవనంబులు చేయువారును శిరోజబంధంబులు
వీడ శిరస్స్నానంబులు చేసికొనువారును వక్షస్తాడనములు
జేసికొనువారును పరమేశ్వరుం డింత దయ దప్పవలయునే
యనువారును జంద్రప్రియదర్శనుం డగుచంద్రాంగద
కుమారుముఖావలోకము లేని యిచ్చోట నుండవలయునే
యనువారును బ్రాగ్జన్మంబుల నెట్టితపములు చేసితిమో
యనువారును నై నిద్రాహారసుఖంబు లనుభవింపక యున్న
యెడ నప్పురముఁ జిత్రవర్మపురమునుం బోలె నత్యంత
కోలాహలసమన్వితం బై యుండె నంత.

60


తే.

సుతవియోగాభితప్తుఁ డై స్రుక్కి స్రుక్కి
యడలుచున్నఁ దదీయదాయాదు లొకట
నతని బాధించి తద్రాజ్య మపహరించి
తిగిచి యాయింద్రసేను బంధించి రంత.

61


వ.

అంత నిక్కడ.

62

మ.

బలుశోకంబునఁ జిత్రవర్మధరణీపాలుండు వర్తించి ని
శ్చలవైజ్ఞానికు లైనవృద్ధజను లాశ్వాసించి తత్త్వోక్తులం
దెలియం జెప్పఁగ నెట్టకేలకు మహాధీరాత్ముఁ డై లేచి ని
ర్మలభావంబున నాత్మమందిరముఁ జేరన్ వచ్చెఁ దాఁ గ్రమ్మఱన్.

63


తే.

భూతలాధీశ్వరుండు జామాత కప్పు
డౌర్ధ్వదైహికకృత్యంబు లాచరింప
భూసురులఁ బంచి యాత్మీయపుత్రికకును
దత్సమయకార్యము లొనర్చెఁ దథ్యమనుచు.

64


ఉ.

అంతటఁ దండ్రిగేహమున నమ్మునిపత్ని యనుజ్ఞఁ జేసి సీ
మంతిని రాహుదష్టశశిమండలసంయుతపూర్ణిమానిశా
కాంతవిధంబునం దనరి క్రమ్మఱ నావ్రత మాచరింపుచున్
గంతువిరోధిభక్తి మదిఁ గల్గి మెలంగెను ధీరచిత్త యై.

65


క.

ఈరీతి నావధూమణి
గౌరీశంకరులపూజ గావింపుచు వి
ప్రారాధన మొనరింపఁగ
నారయ నటు వత్సరత్రయముఁ గడపె భువిన్.

66


వ.

అని చెప్పి సూతుండు వెండియు నమ్మహామునుల కి ట్లనియె.

67


శా.

కాళిందీసలిలాంతరాళవినిమగ్నస్వాంగుఁ డై విస్ఫుర
చ్ఛైలేంద్రాత్మభవేశభక్తిపరుఁడౌ చంద్రాంగదాఖ్యక్షమా
పాలుం డత్తఱి నాహ్రదంబున జలవ్యాసక్తలన్ యౌవన
శ్రీలాలిత్యల నాగకన్యకలఁ గాంచెం దైవయోగంబునన్.

68


ఉ.

మానితమందహాసు నవమన్మథరూపవిలాసు శ్రీశివ
ధ్యానపరున్‌ శుభోజ్జ్వలగుణాకరు రాజకుమారుఁ గాంచి కుం
భీనసరాజకన్యకలు విస్మయమానమనస్కులై ఫణి
స్థానమనోహరం బగురసాతలలోకముఁ జేర్చి రంతటన్.

69

సీ.

ఆరసాతలమునం దత్యంతరమ్యంబు
         మణిదీపకోటిసమన్వితంబు
భర్గమిత్రమహేంద్రభవనసంకాశంబు
         ఫణిఫణారత్నవిభ్రాజితంబు
వజ్రముక్తాఫలవైడూర్యరాజిత
         ప్రాసాదసాహస్రభాసురంబు
దపనీయతోరణద్వారకవాటంబు
         చంద్రకాంతోపలస్థలయుతంబు


తే.

మంజులం బైననొకదివ్యమందిరమున
నంచితం బైనరత్నసింహాసనమునఁ
బన్నగేంద్రులు కొల్వఁ గూర్చున్నఘనుని
దక్షకుని గాంచెఁ జంద్రాంగదప్రభుండు.

70


వ.

వెండియు నమ్మహానాగేంద్రుండు ఫణాశతసముజ్జ్వలుండును
దివ్యాంబరధరుండును దివ్యరత్నకిరీటకుండలమండితుండును
నానామణిగణప్రభావిభాసురవిగ్రహుండును సౌందర్య
యౌవనవిలాసాతిశోభనుండును దివ్యాభరణభూషితుండును
దివ్యచందనచర్చితుండును కాలాగ్నిసంకాశాతేజుండును
అనేకపన్నగకుమారసేవ్యమానుండును పన్నగేంద్రకన్యకా
సహస్రపరివృతుండును దుర్నిరీక్ష్యుండును నైన తక్షక
మహాఫణీంద్రుం గనుంగొని యారాజనందనుం డమ్మహాత్ము
దుస్సహతేజంబు చూడంజాలక నిమీలితలోచనుం డయి
యుండి క్రమ్మఱ ధైర్యం బవలంబించి సభాస్థలంబున
సాష్టాంగనమస్కారంబుఁ గావించి కృతాంజలి యై యున్న
గంధర్వసుందరుం డగునారాజకుమారుం జూచి తక్షకుండు
తనమనంబునఁ గొంతతడ వాలోచించి.

71

క.

ఈరా జెవ్వఁడు వీనికిఁ
బేరేమియొ యెచట నుండుఁ బెంపుగ వీనిన్
మీ రిచటికిఁ గొనితెచ్చిన
కారణ మే మనుచు నాగకన్యల నడిగెన్.

72


వ.

అని యడిగినఁ దక్షకునితో నాగకన్యక లి ట్లనిరి.

73


తే.

యమునలోన జలక్రీడ లాడుచుండ
నీరముననుండి యచటి కేతేరఁ జూచి
యిచ్చటికి మేము దెచ్చితి మింతెకాని
ఇతనికులగోత్రనామంబు లెఱుఁగ మధిప.

74


క.

అనవుడు నాతక్షకుఁ డి
ట్లనియెన్ రాసుతునితోడ నతిసుందరయౌ
వనశాలివి నీ వెవ్వఁడ
వనవుడు నతఁ డిట్టు లనియె నాతనితోడన్.

75


సీ.

భుజగేంద్ర వినవయ్య భూతలంబునఁ బ్రసి
         ద్ధం బైననిషధదేశంబునందు
దమయంతివల్లభుం డనఁ బేరు గాంచిన
         నలమహారాజున కగ్రతనయుఁ
డింద్రసేనుం డమ్మహీనాథుతనయుండఁ
         జంద్రాంగదాభిఖ్య జగతి వెలసి
వరనవోఢుండ నై శ్వశురాలయంబున
         మక్కువతోనుండి యొక్కనాఁడు


తే.

లీలఁగా నావ యెక్కి వాహ్యాళి వెడలి
యమునలో రాగ దైవయోగమునఁ జేసి
నీట మునిఁగినఁ జూచి మన్నించి యచటి

సతులు దెచ్చిరి నీసభాస్థానమునకు.

76


చ.

పొలుపుగఁ బూర్వజన్మమునఁ బుణ్యము లెన్ని యొనర్చినాఁడనో
సలలితదానధర్మములు సద్గురుసేవలు చేసియుంటినో
వెలయఁగఁ దీర్థయాత్రలును విప్రసపర్యలు సల్పినాఁడనో
తలఁపఁగఁ దావకీనమగుదర్శన మబ్బె భుజంగనాయకా.

77


క.

ధన్యుఁడ గుణగణ్యుఁడ జన
మాన్యుఁడ నైతిని మహాత్మ మామకభాగ్యం
బన్యులకుఁ గలదె ఫణిరా
జన్య కృతార్థుండ నైతి సత్యము గాఁగన్.

78


క.

మాపెద్దలు గైవల్య
ప్రాపితులై రదియుఁ గాక భవదీయకృపా
కూపారము వెల్లువఁగా
నాపైఁ బ్రవహించె నే మనం గలవాఁడన్.

79


వ.

అని పలికి మఱియు నిట్లనియె మహాత్మా నీవు మహానుభావుం
డవు నిఖిలసురాసురగంధర్వచారణప్రస్తూయమానుండవు
శరణాగతరక్షకుండవు గావున భవన్మహామహిమంబులు
దెలిసి వర్ణింప నే నెంతటివాఁడ నన్నుఁ గటాక్షించి
రక్షింపవలయునని బహువిధంబుల సన్నుతింపుచు వినయ
వినమితశిరస్కుఁడయి ముకుళీకృతకరకమలుండై యున్న
యారాజనందనుమృదుమధురగంభీరభాషణంబులవలన సంతో
షితస్వాంతుండయి తక్షకుండు క్రమ్మఱ నక్కుమారున
కి ట్లనియె.

80


ఉ.

ఓవసుధాధినాయకకులోద్వహ నీ కభయం బొసంగుదున్
గేవలభక్తి నాత్మఁ బరికింపుచు ముప్పదిమూఁడుకోట్ల దే

వావళిలోన మానసిక వాచిక కాయిక శుద్ధి గల్గి యే
దేవునిఁ బూజ సేయుదువు ధీరుఁడ వై వచియింపు మేర్పడన్.

81


ఆ.

అనిన నాతఁ డిట్టు లనియెఁ దక్షకునకు
విను భుజంగరాజ విమలతేజ
యీప్రపంచమునకు నెవ్వఁ డీశ్వరుఁడు మా
కతఁడు పూజ్యుఁ డయ్యె మతిఁ దలంప.

82


క.

ఏదేవుఁడు సురలందు మ
హాదేవుం డనఁగఁ బరఁగు నట్టియుమేశు
న్వేదాంతవేద్యు నభవుని
సాదరమున భక్తిఁ బూజ సలుపుదు మెపుడున్.

83


ఉ.

ఎవ్వనిరాజసంబునఁ బ్రజేశ్వరుఁ డీజగముల్ సృజించునో
ఎవ్వనిసాత్వికంబున రమేశుఁడు పోషణ చేయుచుండునో
ఎవ్వనితామసంబును వహించినరుద్రుఁడు సంహరించునో
ఎవ్వఁ డచింత్యుఁ డట్టిపరమేశ్వరునిన్ భజియింతు మెప్పుడున్.

84


తే.

ధాతలకు నెల్ల ధాత యై దనరు నెవఁడు
గారణంబున కెప్పుడు కారణంబు
దేజముల కెల్ల నెవ్వఁడు తేజ మరయ
నట్టియభవుఁడె మాకుఁ ది క్కగుఁ దలంప.

85


క.

తా నంతట నుండియు సు
జ్ఞానవిహీనులకు దూరసంచారుం డై
కానఁబడకుండు నేవిభుఁ
డానిర్మలధాముఁ డయినహరుఁ బూజింతున్.

86


మ.

ధరణీవారికృశానుమారుతవియత్ఖద్యోతచంద్రాగ్ని మ
త్పురుషోపేతము గాఁగ నేవిభునకు న్మూర్త్యష్టకం బయ్యె భా

స్కరచంద్రాగ్నులు నేమహాత్మునయనాకారంబు లై యొప్పి ర
ప్పరమాత్ముం డగుశంకరుండు మునిసంభావ్యుండు పూజ్యుం డగున్.

87


క.

కొందఱు క్షేత్రజ్ఞుం డనఁ
గొందఱు పరమాత్ముఁ డజుఁడు కూటస్థుఁ డనం
గొందఱు సాక్షి యనంగను
గొంద ఱభిన్నుఁ డన వెలయుఁ గుశలుఁ దలంతున్.

88


క.

ఏదేవుననుగ్రహమున
ఖేదంబులు లేక బుధులు గిరిభేదిబ్ర
హ్మాదిపదంబుల నైనను
సాదరమతిఁ గోర రట్టిసామి భజింతున్.

89


సీ.

ఎవ్వనిరూపంబు నేవేళలందైన
         వేదాంతమృగ్యమై వెలయుచుండు
నెవ్వనినామంబు లేప్రొద్దు నుడివినఁ
         దాపత్రయంబులు దలఁగిపోవు
నెవ్వనిశిరమునం దెప్పుడు సురనది
         పుష్పదామాకృతిఁ బొసఁగుచుండు
నెవ్వనిగేహిని యీజగత్త్రయమున
         జగదంబ యనఁగఁ బ్రశస్తిఁగాంచె


తే.

నెవ్వనికిఁ గుండలంబు లై యెసఁగుచుండు
వాసుకియుఁ దక్షకుండును భాసురముగ
నట్టిఖండేందుధరుఁడు మహామహుండు
శివుఁడు పూజ్యుండు మాకుఁ బ్రసిద్ధముగను.

90


సీ.

ఏదేవుపదపద్మ మెలమితో నిగమాంత
        చూడామణిస్ఫూర్తి సొంపు మెఱయు

నేగిరీశునిమూర్తి యోగీంద్రసభలలో
         ననవరతంబు ప్రఖ్యాతిఁ గాంచు
నేమహామహుదివ్యసామర్థ్యమహిమల
         సర్వేశ్వరత్వంబు సంఘటించు
నేపురుషశ్రేష్ఠుఁ డేకరూపంబున
         జగదంతరాత్మ యై సంచరించు


తే.

నట్టిమృత్యుంజయుండు మహానుభావుఁ
డప్రమేయుఁ డచింత్యుఁ డనంతుఁ డభవుఁ
డాదిమధ్యాంతరహితుఁ డనాదిపురుషుఁ
డయినపశుపతి పూజార్హుఁ డహికులేంద్ర.

91


వ.

అని యివ్విధంబునం బలికినఁ జంద్రాంగదుభాషణంబు లాక
ర్ణించి ప్రమోదమానసుం డయి మహాదేవభక్తితత్పరుం
డగుతక్షకుండు గ్రమ్మఱ రాజనందను నవలోకించి యి
ట్లనియె.

92


క.

జలజభవాదుల కైనను
దెలియనియర్థంబు మాకుఁ దెలియంగ నహో
తెలిపితివి శైవతత్త్వము
గలరే నీవంటిఘనులు గాంభీర్యనిధీ.

93


మ.

ఇది పాతాళము దుర్జరామరణరాహిత్యంబు దేవాసుర
ప్రదరాభేద్యము విశ్వకర్మరచితప్రాసాదయుక్తంబు సం
పదుదారంబును బన్నగాలయము భాస్వద్రత్నదీపప్రభా
స్పద మీభోగవతీపురంబున మహోత్సాహంబుతో నుండుమీ.

94


ఉ.

ఇచ్చటిపాదపాళి దగ నెన్నఁగ గల్పతరుప్రభావమౌ
నిచ్చటిదీర్ఘికాజలము లెప్పుడు దివ్యసుధారసంబు లౌ

నిచ్చటినాగకన్యక లహీనవిలాసిను లట్లుగాన నీ
విచ్చట నుండి సౌఖ్యము లనేకము లందుము నిర్భయుండవై.

95


క.

అని పలికిన యాతక్షకుఁ
గనుఁగొని రాజన్యసుతుఁడు గ్రమ్మఱఁ బలికెన్
వనజాతాసనపత్నీ
ఘనమణిమంజీరనాదకలనార్భటులన్.

96


శా.

ఆకర్ణింపుము నాదువిన్నపము సర్వాధ్యక్షభోగాగ్రర
త్నాకల్పాంగ మదేకపుత్త్రకులునై నాతల్లియుం దండ్రియున్
శోకప్రాప్తిని గుందుచుండుదురు సంక్షోభించు మత్పత్నియున్
వీక న్వారలకు న్మనఃప్రియము నేఁ గావించెదన్ గ్రమ్మఱన్.

97


చ.

అదియును గాక నాహితులు నత్తయుమామయు బంధుకోటులున్
హృదయములందుఁ జింతిలుచు నెప్పుడు శోకభరంబుఁ జెంది యుం
డుదు రటుగాన బాలుఁడ జడుండను మి మ్మొక టేను వేఁడెదన్
సదయత నన్ను మీ రిపుడు చయ్యన వారలఁ జేర్పఁగాఁ దగున్.

98


క.

మావారలు న న్నపగత
జీవుం డని తలఁచి చింతఁ జేకురి యీలో
దైవవశంబున బ్రతికిరొ
చావునకుం దెగిరొ యేమిచందము తెలియన్.

99


వ.

అట్లు గాన బహుదినంబు లిచ్చట నుండుట నాకు ధర్మంబు
గాదు మర్త్యలోకంబునకుఁ బోవునట్లుగా ననుగ్రహింప
వలయు నని ప్రార్థింపుచున్న యన్నరదేవనందనువాక్యం
బులకు సంతసిల్లి తక్షకుం డట్ల సేయుదు నని కారుణ్య
కటాక్షవీక్షణంబుల నతని నాదరించి.

100

క.

దివ్యమణిభూషణంబుల
దివ్యాంబరదామగంధతిలకాదులచే
దివ్యసమానుని రాసుతు
భవ్యమతిం బూజ చేసెఁ బన్నగపతియున్.

101


చ.

హరియును దక్షకుండు బహుమానముగా నొకకామయానమౌ
తురగముఁ జంద్రహాసమును దూణయుగంబు నొసంగి క్రమ్మఱన్
నిరుపమరత్నభూషణమణిప్రకరాంబరవాహనార్థ ము
ద్ధురబలు నొక్కరక్కసునిఁ దోడ్పడఁ బంపెఁగృపారసంబునన్.

102


క.

అప్పుడు రాజకుమారుని
దప్పక వీక్షించి పలికెఁ దక్షకుఁ డొగి నీ
వెప్పుడు మదిలోఁ దలఁచెద
వప్పుడ నే వత్తు ననుచు నభయము నొసఁగెన్.

103


ఉ.

వెండియుఁ దక్షకుండు ప్రతివీరమహాబలసామజాధిరా
ణ్మండలకేసరిన్ నిజకుమారుని ధీరునిఁ జూచి పల్కె నా
ఖండలవాజిసన్నిభము కామగ మైనహయంబు నెక్కి భూ
మండలి కేఁగుమా నృపకుమారసహాయుఁడవై రయంబునన్.

104


వ.

అని యిట్లు వీడుకొల్పిన నమ్మువ్వురుఁ దక్షకునకుఁ బ్రదక్షిణ
నమస్కారంబు లాచరించి యమ్మహాత్మునియనుజ్ఞ వడసి
యక్షణంబ.

105


క.

ప్రమదంబున నమ్మువ్వురుఁ
బ్రమథాధిపపాదపద్మభజనోత్సుకు లై
యమునాజలముల వెలువడి
నిమిషంబున వచ్చి రపుడు నిశ్చలమతులై.

106

శా.

కాళిందీతటసీమ వాయుజవకంఖాణాధిరూఢస్థితిన్
లీలోద్యానవిహారముల్‌ సలుపుచున్‌ నిశ్చింతుఁడై యుండఁగా
నాలో వచ్చె సఖీమణు ల్గొలువ స్నానార్థంబుగా సత్క్రియా
శీలం బొప్ప ధరాసురాంగనలతో సీమంతినీసాధ్వియున్.

107


సీ.

ఆనదీతీరంబునందు దర్పకుమాడ్కి
        నతిమోహనాకారుఁ డైనవాని
నరరూపు లైనపన్నగదానవులఁ గూడి
        విహరించువాని భూవిభుకుమారు
దివ్యాభరణదీప్తదేహంబు గలవాని
        మొలకనవ్వులు గలమోమువాని
సుమమాలికాగంధఘుమఘుమామోదంబు
        దశదిగంతంబుల కొసఁగువాని


తే.

లసదపూర్వాకృతివిలాస మొసఁగువానిఁ
గాంచి విస్మితచిత్త యై కంబుకంఠి
సాధ్వి సీమంతినీకాంత సద్వికాస
లోచనంబుల నాతనిఁ జూచుచుండె.

108


శా.

ఆరాజేంద్రుఁడు కంఠసూత్రరహితంద్యక్తాంజనాపాంగి శృం
గారప్రాభవహీనగాత్రి గళితగ్రైవేయహారాదికన్
దూరీభూతశుభాంగరాగతిలకన్ దుర్వారశోకార్దితన్
సారాచారపరాయణం గనియె నాసాధ్విన్ విచిత్రంబుగన్.

109


ఆ.

కాంచి దృష్టపూర్వఁగా నిశ్చయము చేసి
హయము డిగ్గి యాలతాంగిఁ బిలిచి
కువలయేశ్వరుండు కూర్చుండ నియమించి
యింపు మీఱ సతికి నిట్టు లనియె.

110

క.

వనితా నీ వెవ్వరు నీ
జనకునిపే రేమి యెవరిసతి వేమిటి కై
ఘనశోకము బాల్యంబున
జనియించెను దెలియఁబలుకు సత్యముగాఁగన్.

111


క.

అని సస్నేహముగాఁ బలి
కిన యావిభుఁ జూచి యశ్రుకీలితనిజలో
చన యై లజ్జిత యగుచును
వనజేక్షణ యూరకుండె వచనరహిత యై.

112


ఆ.

అంతఁ దద్వయస్య యారాజనందను
గాంచి మధురవచనగారవమున
యావధూటిచరిత మాద్యంతయుతముగాఁ
దెలియఁబల్కె నపుడు దేటపడఁగ.

113


సీ.

ఓమహాత్మక విను మీమానినీమణి
        సీమంతిని యనంగఁ జెలువుగాంచు
నీకాంతజనకుండు లోకప్రసిద్ధిగాఁ
        జిత్రవర్మ యనంగ ధాత్రి వెలయు
నింద్రసేనుఁడు మామ చంద్రాంగదుఁడు భర్త
        నిషధాధినాథుఁడు నిక్కముగను
ఈవధూమణిపతి దైవయోగంబున
        యమునాజలనిమగ్నుఁ డయ్యెఁ గాన


తే.

నతనిరాజ్యంబు దాయాదు లపహరించి
తల్లిదండ్రులఁ బట్టి బంధన మొనర్చి
రట్లు గావున నీయింతి యధికశోక
తప్త యై యుండ వత్సరత్రయము గడచె.

114

తే.

సోమవారంబునందు నీసుదతి యిపుడు
సమ్మతంబుగఁ బార్వతీశ్వరులపూజ
సేయుఁ గావున నిపు డభిషేచనార్థ
మరుగుదెంచె దృఢవ్రత యగుటఁ జేసి

115


వ.

అని చెప్పి సూతుం డి ట్లనియె నట్లు సఖీముఖంబునఁ దన
వృత్తాంతంబు సర్వంబు దెలియంజెప్పి క్రమ్మఱ నారాజ
కుమారునిఁ జూచి సీమంతిని వారి కి ట్లనియె.

116


క.

శ్రీరంజిల నవమదనా
కారుండవు కిన్నరుఁడవో గంధర్వుఁడవో
చారణుఁడవొ మనుజుఁడవో
వారెవ్వరు నీదుపార్శ్వవర్తులు దలఁపన్.

117


క.

ఇత్తెఱఁగునఁ బలుమఱు నా
వృత్తాంతము నడిగె దీవు విశదంబుగ లో
కోత్తర సస్నేహముగా
నిత్తఱి ననుఁ జూచినవొ యెన్నండైనన్.

118


క.

ఈవార్తఁ దెలియఁ బలుకం
గావలయు సవిస్తరముగఁ గారుణ్యముతో
నేవేళనైన బుధులు మృ
షావాక్యము లాడఁ జనరు సకలవిధములన్.

119


వ.

అని యివ్విధంబున నారాజపుత్త్రిక యన్నరేంద్రనంద
నుతో సల్లాపంబు లొనరింపుచు బాష్పపూరితలోచనయు
గద్గదకంఠయు మోహమూర్ఛాపరవశయు నై ధరణీతలము
పయిం బడియున్ననిజకళత్రంబు నీక్షించి చంద్రాంగ
దుండును శోకాకులితమానసుం డై మౌనంబున ముహూ

ర్తం బుండి తదనంతరంబున నమృతోపమానంబు లగుభాష
ణంబుల నయ్యింతి నూరడిల్లం బలికి తత్పాణిగ్రహణంబు
గావించి యిట్లనియె. మేము కామగమనంబునఁ బ్రకా
శించుసిద్ధులము నీభర్త సురక్షితుండై యున్నవాఁడు
నొక్కయెడ మే మిరువురము నైక్యంబుగా నుండుదుము
అతండును రెండుమూఁడుదినంబులకు నిందు రాఁగలండు
నీవును నతండును గలసి సకలసామ్రాజ్యసుఖము లనుభ
వించెదరు శ్రీసదాశివుపాదంబు లాన నామాట నిజమ్ముగా
నమ్మి శోకంబు మాని యుండు మని పలికిన నతనిమధుర
వచనములకు నూరడిల్లి విస్మయంబు దీపింప సంభ్రమో
ద్భ్రాంతనయనంబుల నారాజనందనుం దప్పక చూచుచుఁ
దన మనంబున నిట్లని వితర్కించె.

120


మ.

ఇతనిం జూడ మదీయభర్త యగుఁ గాదేనిన్‌ మహాప్రేమసం
గత మై యుండునె నామనం బదియునుంగాక న్నిజాకారశీ
లత నేతెంతురె యన్యలోకగతు లేలా తోఁచె నాబుద్ధి కా
యతసౌందర్యుఁ డితండు ధూర్తజనుఁడో యక్షుండొ గంధర్వుఁడో.

121


మ.

శమనాగారముఁ జేరియున్న పతి సాక్షాత్కారుఁ డయ్యె న్మతి
భ్రమమో మోహమొ స్వప్నమో యిది యథార్థంబో విచారింప ని
క్కముగా నే నొనరించునట్టివిలసద్గౌరీశపూజావిధా
నము సార్థంబొ నిరర్థకంబొ తలఁపన్ నాభాగ్య మెట్లున్నదో.

122


సీ.

మునిపత్ని వాత్సల్యమున నుపదేశించె
         రంజిల్ల సోమవారవ్రతంబు
నెటువంటియాపద లేతెంచి యున్నను

         శివపూజ దృఢభక్తిఁ జేయు మనుచు
సమ్మతంబుగఁ దదాజ్ఞాప్రకారంబున
        విడువక వ్రతము గావింతుఁ గానఁ
బరఁగ నుమామహేశ్వరులు సన్మాంగల్య
        సిద్ధి గల్గఁగఁ గృపఁ జేసి రొక్కొ


ఆ.

యదియుఁగాక నాకుఁ బదివేలవర్షంబు
లధిపుతోడ సౌఖ్య మబ్బునట్లు
ద్విజులు పల్కుటెల్ల నిజమయ్యెఁ గాఁబోలు
నీశ్వరుండు దక్క నెవ్వఁ డెఱుఁగు.

123


మ.

లలితాకారపయఃప్రమారసుగుణాలాపస్వరవ్యంజనం
బుల నీతండు మదీయభర్తకరణిం బొల్పారె సంభావ్యభా
వ్యలఘుశ్రీఫలనిశ్చయంబులు ఖగవ్యాహారగౌళీవచః
కలనాదంబులు వామలోచనభుజాకంపంబులుం దెల్పెడిన్.

124


ఆ.

ఫాలలోచనుండు పార్వతీనాథుండు
శంకరుండు దగఁ బ్రసన్నుఁ డయినఁ
బ్రాణధారు లయినమానవావళులకు
భూమిలో నసాధ్య మేమి గలదు?

125


వ.

అని వితర్కింపుచు డోలాయమానమానస యై యా
సీమంతినీసతి కరగ్రహణమాత్రపులకీకృతాంగియు గళద
శ్రుసమ్మిశ్రితాపాంగయు లజ్జానమ్రముఖియు నై యున్న
యాశుభాంగి కర్ణదేశంబునఁ గించిద్రహస్యంబుగా నీవు
విషాదంబుఁ జెందవలదు నీవల్లభుంగూడి సుఖంబున నుండఁ
గలవు ఏను దజ్జననీజనకులకు నతనికుశలవార్త యెఱిం
గింపం బోయెద నని పలికి క్రమ్మఱ తురంగాధిరూఢుండై

తనసహాయులం గూడి తక్షణంబున నిజపురోపకంఠవనము
నకు వచ్చి యచ్చట నిలిచి తక్షకపుత్త్రుఁ డయిన యశ్వ
సేనునిం బిలిచి నీవు మదీయజ్ఞాతులకడకుం జని వారలకు
మదాగమనం బెఱింగింపవలయుఁ బోయిరమ్మని పనిచిన
నతండును వల్లెయని యతిత్వరితమ్మునఁ జనుదెంచి తత్సభా
సీనులై యున్నవారలం గని యిట్లనియె.

126


సీ.

యమునాజలనిమగ్నుఁ డైనచంద్రాంగదుం
       డహిలోకముననుండి యరుగుదెంచి
పురసమీపమున భాసురశౌర్యధర్యుఁ డై
       యుపవనంబున నిల్చి యున్న వాఁడు
భానుతేజుని నింద్రసేనమహారాజు
       బంధముక్తునిఁ జేసి పనుపవలయు
శీఘ్రంబుగా రాజసింహాసనము మీరు
       విడువుడు చక్కఁగా విడువరేని


తే.

యానృపాలతనూభవుఁ డరుగుదెంచి
తక్షకాహీంద్రదత్తదుర్దమకృపాణ
ధార భవదీయశిరములు ధరణిఁ గూల్చి
లీల నిజరాజ్యపదము పాలింపఁగలఁడు.

127


ఉ.

అంగజసుందరాంగుఁడు మహాహితసైన్యవిభంగుఁ డైనచం
ద్రాంగదరాజనందనుఁడు తక్షకుచే బహుమాన మంది సా
రంగధరావతంసుకృపఁ గ్రమ్మరవచ్చె ధరిత్రి కాత్మ ను
ప్పొంగుచు నే నహీంద్రవరపుత్త్రుఁడ మిత్రతదత్సహాయుఁడన్.

128


క.

అని చెప్పిన దాయాదులు
విని యంత భయంబుఁ జెంది విస్మయమున వా

రనుకూలవృత్తి మే ల్మే
లని పొగడిరి చలితహృదయు లై విభ్రాంతిన్.

129


శా.

అంతన్ సత్వరితంబుగా నరిగి వా రయ్యింద్రసేనక్షమా
కాంతున్ స్వీయసతీసమేతుఁ గని వేగన్ముక్తునిం జేసి య
త్యంతప్రేమ దదీయపుత్త్రుకథ నాద్యంతంబుగాఁ దెల్పినన్
సంతోషార్ణవమగ్నులైరి మది నాశ్చర్యంబు సంధిల్లఁగన్.

130


క.

ఆక్షణమునఁ బురజనులు సు
రక్షితుఁ డై వచ్చినట్టిరాజతనూజు
న్వీక్షించి సంతసిల్లిరి
నిక్షేపము గన్నభంగి నిర్మలమతు లై.

131


తే.

మదనసన్నిభుఁ డైనకుమారుఁ డపుడు
లీలఁ జనుదెంచె ననువార్త లాలకించి
రాజపత్నియు రాజు హర్షాతిరేక
పరవశతచేఁ బ్రపంచంబు మఱచి రంత.

132


ఉ.

అప్పుడు మంత్రు లాప్తజను లార్యపురోహితభృత్యసంఘముల్
దప్పకవచ్చి రాసుతునిదర్శన మేర్పడఁజేసి కౌతుకం
బుప్పతిలంగఁ దోడ్కొని శుభోజ్జ్వలతూర్యరవంబు మ్రోయ మే
లొప్పఁగ వచ్చి రందఱు మహోన్నతరాజగృహంబుఁ జేరఁగన్.

133


ఉ.

పల్లవపాణు లాడుచును బాడుచు లాజలు నక్షతంబులున్
జల్లుచు రాఁగఁ బౌరజనసంఘము చుట్టును గొల్వ ధారుణీ
వల్లభనందనుండు విభవం బలరం జనుదెంచి తండ్రికిం
దల్లికి సాగిమ్రొక్కఁ గనుదమ్ముల బాష్పజలంబు లొల్కఁగన్.

134


వ.

అంత.

135

క.

చంద్రాంగదు నభినవమణి
చంద్రాంగదుఁ గౌఁగిలించి స్వస్తి యొసఁగి రా
చంద్రార్కము వర్ధిలు మని
చంద్రార్కసమాఖ్యు లతనిజననీజనకుల్.

136


శా.

నష్టం బైనమహాధనంబు హృదయానందంబుగాఁ గ్రమ్మఱం
దృష్టంబైనవిధంబున న్మరల నేతెంచె న్నరేంద్రాత్మజుం
డష్టైశ్వర్యధురంధరుం డగుచు నాహా యెంతపుణ్యాత్ము లీ
శిష్టాచారునితల్లిదండ్రులని హర్షించెం జనం బంతయున్.

137


క.

ఆనిషధపురంబునఁ గల
మానవులు ప్రమోదమానమానసు లగుచున్
శ్రీనిలయుని జంద్రాంగదు
భానుప్రభుఁ గనిరి నేత్రపర్వముగాఁగన్.

138


క.

గరుడుని గన్నమహాహుల
కరణిని గ్రహరాజుపజ్జ గ్రహములరీతిన్
బరనృపతులు చంద్రాంగద
నరపతికడ మెలఁగి రపుడు నమ్రత్వమునన్.

139


వ.

అయ్యవసరమునం బరమేశ్వరుకృపాకటాక్షమునఁ బునః
ప్రాప్తనిజసూనుం డయిన యింద్రసేనుండు పరమాహ్లాదం
బున రుద్రాభిషేకములును సమస్తదేవతామహోత్సవము
లును నఖండదీపారాధనములును భూసురసమారాధనమును
అపరిమితసువర్ణదానములు గావించి నిజకుమారబంధుజనసమే
తముగా మృష్టాన్నపానములం బరితృప్తిం బొంది యిష్టాను
లాపములం బ్రొద్దుగడపుచు సుఖగోష్ఠి నుండె నంత.

140


క.

మరునాఁ డరుణోదయమున

సరసతరాహ్నికము దీర్చి జగతీపతి భూ
సురబంధుమిత్రయుతముగఁ
బరువడిఁ గూర్చుండెఁ దత్సభామధ్యమునన్.

141


శా.

కాళిందీసలిలాంతరాళమున నాగస్థానమున్ జేరి ర
త్నాలంకారచయంబు తక్షకమహానాగేంద్రుచేఁ గొంచు ని
చ్ఛాలీలం జనుదెంచి నేఁడు మరలన్‌ జంద్రాంగదుం డంచు నీ
లీలం బంపెను జిత్రవర్మకడకున్ లేఖార్థసంవాహులన్.

142


సీ.

సప్రాణుఁ డైయున్నచంద్రాంగదునివార్త
        చిత్రంబుగా విని చిత్రవర్మ
సంతతచింతావిచారంబులను మాని
        సకలబాంధవమిత్రసహితముగను
బౌరులు సంతోషపారవశ్యము నొంది
        సొంపు దీపింపఁ జాటింపఁ బనిచె
లేఖార్థవాహకాళికిఁ బ్రీతి మృష్టాన్న
       రాజితాభరణాంబరంబు లొసఁగి


తే.

యపుడు నిజపుత్త్రి రావించి కృప దలిర్పఁ
బూర్వభూషితనవరత్నభూషణములు
మేన శృంగార మొనరించి మేరుధీరుఁ
డతఁడు హర్షాంబునిధి నోలలాడుచుండె.

143


వ.

ఆసమయంబున.

144


మ.

యమునాస్నాన మొనర్పఁబోవునెడ నశ్వారూఢుఁడై వచ్చి నె
య్యముతో మత్కర మంటికొన్నిహితవాక్యంబు ల్ప్రసంగించి చ
న్నమహాత్ముండె మదీయభర్త యని యానందించెఁ జంద్రాంగద
ప్రమదారత్నము శాంకరవ్రతమహత్త్వం బాత్మ భావింపుచున్.

145

ఉ.

నెమ్మిని జిత్రవర్మధరణీపతి శంకరశాంకరీనివా
సమ్ములయందు నుత్సవము సల్పుటకై తగువారిఁ బంచి చి
త్తమ్మునఁ బ్రేమ దోఁపఁగ హితమ్ముగ నల్లునిఁ జూచువాంఛ శీ
ఘ్రమ్మున నేఁగి తోడుకొనిరాఁ బనిచె న్నిజమంత్రివర్గమున్.

146


వ.

ఇట్లు పంపిన వారలు నతిత్వరితంబున నిషధనగరమునకుం జని
చంద్రాంగదసమేతుం డై యున్నయింద్రసేనమహావల్లభుం
గాంచి పరమానందకందళితహృదయారవిందులై యారాజున
కి ట్లనిరి.

147


తే.

ఇంద్రసేనమహీశ దేవేంద్రవిభవ
చిత్రవర్మధరాధిపశేఖరుండు
తనదుజామాతఁ జూడఁ జిత్తమునఁ దలఁచి
నెమ్మి మముఁ బంపె నీదుసాన్నిధ్యమునకు.

148


క.

కైరవహితురాకకును జ
కోరంబులు తరుణిరాకకును గోకంబుల్
గోరుచు నుండువిధంబున
నీరాసుతురాక కలరు నెల్లజనంబున్.

149


క.

కావున నిఁక నాలస్యము
గా వలవదు సత్వరంబు గాఁ బనుపు మనన్
భూవరుఁడు సమ్మతంబుగ
వేవేగమె యాజ్ఞ యొసఁగె వేడ్క చెలంగన్.

150


వ.

ఇట్లు చంద్రాంగదుండు నిజజనకుచేత ననుజ్ఞాతుం డై తల్లి
దండ్రులకుఁ బ్రణామంబులు గావించి భూసురాశీర్వాదం
బులు భేరీభాంకారరవంబులు చెలంగఁ దక్షకాహీంద్రదత్తం
బైనయశ్వరత్నంబు నెక్కి తత్కుమారుండైనయశ్వసేనుండు

దనకు నర్మసఖుండుగా ననేకసేనాసమేతుం డై బహువిధజన
పదఘనారణ్యపర్వతనదీనదంబులు గడచి కతిపయదినములకుఁ
జిత్రవర్మపురమునకుం జేరవచ్చె నంత.

151


సీ.

ఆభేరికారవ మప్పు డాకర్ణించి
        పౌరులు సంతోషభరితు లగుచుఁ
జనుదెంచి యెదురేఁగి సాధువాదంబుల
        నభినుతి గావించి శుభము లెసఁగ
వందనాశ్లేషణస్వస్తిభాషణములు
       గడుమైత్రి మెలఁగిరి ఘనత మెఱయ
నప్పురవీథి పుణ్యాంగనాజనములు
       నవరత్ననీరాజనంబు లొసఁగఁ


తే.

గమలనేత్రలు సౌధభాగములనుండి
సరభసంబుగ సేసలు చల్లుచుండ
భవ్యమైనమహేంద్రవైభవము దనర
వచ్చెఁ జంద్రాంగదుఁడు చిత్రవర్మసభకు.

152


వ.

ఆసమయంబున.

153


శా.

ప్రౌఢోక్తిప్రతిభాష నింద్రుఁ డఖిలప్రత్యర్థిసేనామద
వ్యూఢోగ్రద్విపసింహుఁ డంధకవిపక్షోదగ్రపూజాక్రియా
బాఢప్రజ్ఞుఁడు చిత్రవర్మధరణీపాలుండు చంద్రాంగదున్
గాఢాలింగితుఁగా నొనర్చె నపు డుత్కంఠాయితస్వాంతుఁడై.

154


క.

భానుప్రభుఁ డగునిషధ
క్ష్మానాథుఁడు చిత్రవర్మమహితపదములన్
సానందాశ్రుజలంబులఁ
దా నప్పుడు గడిగె వినమితశిరస్కుండై.

155

తే.

అత్తలకు మ్రొక్కి వెండియు నార్యులైన
బాంధవులకును హితులకు బ్రాహ్మణులకు
వందనము లాచరించిన వార లతనిఁ
గాంచి జయవాక్యములను దీవించి రంత.

156

సీమంతినీపునర్వివాహఘట్టము

మ.

పునరుద్వాహము సేయఁగాఁ దలఁచి యాభూపాలచంద్రుండు భూ
జనసన్మాన్యులు భూసురోత్తములు రాజశ్రేష్ఠులుం దాను శా
స్త్రనిరూఢక్రియ నిశ్వయించి విలసత్సౌధం బలంకారశో
భన మై యుండ నొనర్చె నప్పుడు సుహృద్బంధుప్రజ ల్మెచ్చఁగన్.

157


క.

భూసురభామినులు మహో
ల్లాసంబున భద్రగీతలలితోక్తులతో
సేసలు చల్లఁగ రత్నమ
యాసనమున రాకుమారుఁ డటు కూర్చుండెన్.

158


సీ.

కమనీయతరశరత్సమయరాకాచంద్ర
        బింబంబుక్రియ ముఖాబ్జంబు వెలయఁ
భ్రాభాతవేళావిరాజత్సరోజాత
        సామ్యంబు లైనలోచనము లలర
వర్షావసరవిభాస్వత్తటిద్వల్లికా
        మానితం బగుచు నెమ్మేను దనరఁ
దిమిరబంధురనిశీధినిదారకలమాడ్కి
        వేణీఖచితపుష్పవితతు లమర


తే.

విశ్వకర్మవినిర్మితవివిధరత్న
చిత్రితసజీవసాలభంజిక యనంగ

వచ్చి కూర్చుండె జీవితేశ్వరునిపజ్జ
నిర్మలాపాంగి సీమంతినీలతాంగి.

159


క.

శృంగారశేఖరులకును
మాంగల్యధురీణులకును మానధనులకుం
బంగారుపళ్లెరంబుల
మంగళహారతుల నిడిరి మంజులవాణుల్.

160


క.

ఆభోగయౌవనులకును
భ్రాభవధుర్యులకు సురభిభరతైలమునన్
శోభనములు పాడుచు హే
మాభలు దల లంటి రపుడు మంజులఫణితిన్.

161


క.

కంకణరాజత్కరులకుఁ
బంకజనేత్రులకు పుణ్యభాగులకు నుమా
శంకరభక్తుల కప్పుడు
సుంకులు చల్లిరి శశాంకసుందరవదనల్.

162


క.

పన్నగజాతీరససం
పన్నంబుగఁ దలలుఁ బులిమి మందోష్ణం బౌ
పన్నీట జలకమార్చిరి
కన్నియకును రాసుతునకుఁ గామిను లంతన్.

163


ఆ.

సుందరాంగులకును శుభచరిత్రులకును
రాజదంపతులకుఁ దేజ మలర
ధౌతవస్త్రములను దడియార్చి రప్పుడు
హరినయన లధికహర్షమునను.

164


సీ.

కట్టంగనిచ్చిరి కనకాంబరంబులు
        గమనీయసుందరాకారులకును

లలితార్ధశశిఫాలఫలకంబులను దివ్య
         తిలకము ల్దీర్చిరి ధీరులకును
ఘుమఘుమామోదగంధము లలందిరి మేన
         గుణరత్ననిధులకుఁ గొమరు మిగులఁ
బుష్పదామములు సొంపుగ నలంకారంబు
         గా వ్రేసి రతివలు ఘనయశులకు


తే.

హారకుండలమణికంకణాంగదాది
భూషణంబులఁ దొడిగిరి బుధనుతులకు
దీపితంబుగఁ జెక్కిట దృష్టిచుక్క
లింపుగ నొనర్చి రా రాజదంపతులకు.

165


వ.

ఇవ్విధంబున నవ్వధూవరు లత్యంతశృంగారాభిరాము లై
యాక్షణమున భేరీమృదంగాదితూర్యరవంబులును ననేక
బ్రాహ్మణపుణ్యాహఘోషంబులును పుణ్యాంగనాసహస్ర
మధురగీతనిస్స్వనములును వందిమాగధస్తవనాదములుం
జెలంగఁ గల్యాణవేదికాతలమున నౌదుంబరభద్రపీఠంబునఁ
గూర్చున్న సమయంబున.

166


శా.

అన్యక్షత్రియగర్వపర్వతసుపర్వాధీశ్వరుం డైనరా
జన్యశ్రేష్ఠుఁడు చిత్రవర్మవిహితాచారంబు దీపింపఁగా
ధన్యం బయ్యె మదన్వయం బని పయోధారానుపూర్వంబుగాఁ
గన్యాదాన మొనర్చె నైషధునకున్ గల్యాణలగ్నంబునన్.

167


క.

జాంబూనదాంబరంబులు
గంబళములు భూషణములు గౌశేయకము
ల్దాంబూలము లాదిగ మో
దంబున విప్రుల కొసంగె ధరణీశుఁ డొగిన్.

168

మ.

కలమాన్నంబులు పాయసంబులును శాకానీకము ల్గోఘృతం
బులు పచ్చళ్లు పదంశకాళిమధురావూపంబులుం జారులున్
జలము ల్తేనియ లానవాలు పెరుగు ల్సంతుష్టిగా బంధుమం
డలితో భవ్యముగా భుజించిరి విశిష్టప్రీతి నాదంపతుల్.

169


తే.

భోజనానంతరమునఁ దాంబూలసురభి
గంధమాల్యాద్యలంకారకలితుఁ డగుచు
మిత్రబాంధవభృత్యసమేతముగను
సరససల్లాపముల నుండుసమయమునను.

170


ఉ.

హల్లకగంధు లంతఁ బరిహాసము లొప్ప వరాన్వితోల్లస
త్ఫుల్లకుసుంభకింశుకసుపుష్పరసంబులు మేనులందు రం
జిల్లఁ బరస్పరంబుగను జిమ్మనగ్రోవుల నించి ఱొంపిగాఁ
జల్లుచు బాంధవంబున వసంతము లాడిరి సంభ్రమంబుగన్.

171


శా.

రూపస్తుత్యుఁడు ధర్మరక్షణవిచారుం డైనచంద్రాంగద
క్ష్మాపాలుండు నిజాంగనామణికి మున్జక్షుశ్శ్రవస్వామిచేఁ
దా పాతాళమునందుఁ దెచ్చిన మహోద్యద్దివ్యభూషామణీ
లేపస్రగ్వసనాదికంబు నొసఁగెన్ లేనవ్వు మోమొప్పఁగన్.

172


క.

అంతట మణిభూషణహరి
దంతఘుమంఘుమితగంధదామాన్విత యై
యెంతయుఁ దేజంబున సీ
మంతిని విలసిల్లె సర్వమంగళపగిదిన్.

173


వ.

అంత.

174


మ.

శరజన్మప్రతిమప్రతాపనిధి యాచంద్రాంగదుం డంత భా
స్వరజాంబూనదచంద్రకాంతమణిరాజత్కుడ్యభాగంబుబం
ధురనీలామలవజ్రవేదికము కస్తూరీవిలిప్తంబు భా

స్కరతేజోమణిదీప్త మైనశయనాగారంబుఁ జేరె న్వెసన్.

175


ఉ.

కల్పతరుప్రసూనఫలగంధశుభాక్షతసంయుతంబు సం
కల్పభవప్రతాపజనకం బగులాలితహంసతూలికా
తల్పమునందు రాసుతుఁడు దర్పకరూపధరుం డమోఘసం
కల్పుఁడు విశ్రమించె శితికంఠపదాంబుజభక్తియుక్తుఁడై.

176


క.

అంత భవానీపదయుగ
చింతామృతపానపరవశీకృతవిమల
స్వాంతంబున నచటికి సీ
మంతిని జనుదెంచె రతిసమాకృతి వెలయన్.

177


క.

ఈవీరపతివ్రతయును
దైవవియోగమునఁ జేసి తనపతిఁ బడసెం
గావున నీపుణ్యాంగన
సావిత్రికిఁ బ్రతి యటంచు జనులు నుతింపన్.

178


మత్తకోకిల.

వచ్చియున్నతలోదరిన్ శుకవాణిఁ జూచి కరంబులన్
గ్రుచ్చి కౌఁగిటఁ జేర్చి మిక్కిలి కూర్మిఁ జెక్కిలి నొక్కుచుం
మచ్చిక ల్దనరార దీయనిమాట లాడుచుఁ బ్రేమతోఁ
బచ్చవిల్తునికేళి కప్పుడు పైకొనెం దమి మీఱఁగాన్.

179


ఉ.

రాజకుమారుఁ డంతఁ బరిరంభణచుంబనబంధనంబులన్
రాజితదంతఘాతనఖరక్షతముఖ్యవిమర్శనంబులన్
రాజమరాళయానమధురాధరనీరదనీలవేణి నా
రాజతనూజఁ గూడె రతిరాజవినోదము లుల్లసిల్లఁగన్.

180


వ.

ఇవ్విధంబున నాదంపతు లన్యోన్యప్రేమాతిశయంబులం
గొంతప్రొద్దు సురతానుభోగములఁ దృప్తిఁ బొంది తత్పార

వశ్యమున సుఖనిద్రం జెంది ప్రభాతకాలమున మేల్కాంచి
గౌరీశ్వరధ్యానపరాయణులై మంగళస్నానాదికృత్యంబులు
శివపూజావిధానంబు లాదిగాఁ గల కాల్యకరణీయంబులు
నిర్వర్తించి తదనంతరమున మధురాహారంబుల సంతుష్టిం
జెందియుండి రంత కతిపయదినంబులకుఁ జంద్రాంగదుండు
నిజకళత్రసమేతంబుగాఁ గ్రమ్మఱ నిజరాజధానియగు నిషధ
పురమునకుం బోవ సమకట్టియున్న యన్నరేంద్రనందను నభి
ప్రాయం బెఱింగి.

181


క.

విశదయశుండు తదీయ
శ్వశురుం డగుచిత్రవర్మ జామాతకు ధీ
కుశలునకు నరణ మిచ్చెను
దశసాహస్రశ్వగజరథప్రకరంబుల్.

182


క.

మున్నుగ నాత్మతనూజకు
మన్నించి యమూల్యవస్త్రమణిభూషణముల్
చెన్నలర నిచ్చె నప్పుడు
గన్నుల నానందభాష్పకణములు దొరఁగన్.

183


ఆ.

మఱియు వివిధగంధమాల్యమృగీమద
కుంకుమాంజనార్ద్రసాంకవములు
దగ సహస్రదాసదాసీజనంబులు
గ్రామశతము లొసఁగెఁ గరుణ వెలయ.

184


వ.

ఆసమయంబున.

185


చ.

తనగురునాజ్ఞఁ జేసి నిషధప్రభునందనువెంట వచ్చి త
జ్జనకకళత్రబాంధవుల సన్నిధిఁ జేర్చి యతండు సాదరం
బున మరలింప నాభుజగపుంగవనందనుఁ డాక్షణంబునం

జని దనుజాన్వితంబుగ రసాతలలోకముఁ జేరెఁ గ్రమ్మఱన్.

186


వ.

తదనంతరమునఁ జిత్రవర్మమహీపతిచేత ననుజ్ఞాతుం డై నిజ
కళత్రం బగుసీమంతినిఁ దోడ్కొని చంద్రాంగదుం డనేక
సేనాపరివృతుం డై కతిపయదినములకు నిజనగరమునకు వచ్చి
శుభముహూర్తమునఁ దూర్యరవములు భూసురాశీర్వాద
నాదములు చెలంగ శుద్ధాంతప్రదేశము గావించి జననీజనకు
లకు గురుబంధుజనములకుఁ బ్రణామంబు లాచరించి వారల
యాశీర్వాదములు గైకొని పరమానందమున సుఖంబుండి
రంత.

187


సీ.

అంత శుభాచార యైనసీమంతిని
        యత్తమామలకును హర్ష మొదవ
బంధువర్గములకు బ్రాహ్మణోత్తములకు
        నతిభక్తి వందనం బాచరింప
నాపతివ్రత నంద ఱాశీర్వదించిరి
        సతతంబు సౌభాగ్యవతియు గాఁగ
మఱియును దద్వ్రతమాహాత్మ్యమునకును
        లాలిత్యమునకు సుశీలతకును


తే.

వినయగాంభీర్యధైర్యవివేకములకు
సకలజనములు చూచి విస్మయము నొంది
రట్ల శ్వశురులు కోడలి నభినుతించి
యిది సురాంగన యని మది నెంచి రపుడు.

188


ఉ.

మింటను సిద్ధచారణులు మేదినియందు మనుష్యులు న్విని
ష్కంటకపుణ్యశీల సుభగత్వము గల్గినదీని కల్ల ము
క్కంటివధూటి సాటి యగుఁ గాని తదన్యులు గారటంచు జే

గంటలకైవడిం బొగడఁగా నుతికెక్కి జగత్ప్రసిద్ధిగన్.

189


తే.

లలన యీరీతి యాత్మవల్లభునిఁ గూడి
భయము నయమును బ్రియమును భక్తి గలిగి
స్నానజపపానభోజనశయనములను
సంతతంబును సంతుష్టి సలుపుచుండె.

190


ఉ.

రాజతనూజ మద్వ్రతపరత్వమునం బతిఁ గంటినంచు వి
బ్రాజితసోమవారముల రాజకళాధరుఁ బార్వతిం జగ
త్పూజితులం భజింపుచును భూసురదంపతులన్ ముదంబునన్
బూజలు సేయుచుండె నిజపూర్వభవార్జితపుణ్యవైఖరిన్.

191


వ.

అంత.

192


సీ.

నిషధదేశం బేలునిర్మలాచారుండు
         భానుతేజుం డింద్రసేనవిభుఁడు
ఆరాజనందనుం డయ్యెఁ జంద్రాంగదుం
         డతనిపట్టపుదేవి యనఁగ వెలసి
సీమంతినీమణి సీమంతిని యనంగ
         దీపించు నీధరిత్రీతలమున
సోమవారంబుల సోమశేఖరు సోముఁ
         బూజించి దంపతిపూజ సల్పి


తే.

కామధేనువుకైవడిఁ గామితార్థ
జాలము లొసంగు ననుచును సకలదిశల
యందుఁ బేరయ్యె నపుడు రాకేందువదన
వనజదళనేత్రి యాచిత్రవర్మపుత్త్రి.

193


వ.

అంతఁ గొంతకాలమునకు నయ్యింద్రసేనమహీనాథుండు
నిజరాజ్యభోగసుఖములయందు విరక్తుం డయి తదనంత

రంబున నిజకుమారుఁడైనచంద్రాంగదునకుఁ బట్టముఁగట్టి
సకలసామ్రాజ్యభారధురంధరుంగా నియమించి భార్యాసమే
తుండయి వనమునకుం జని యచ్చట వానప్రస్థాశ్రమమున
మహాఘోరతపం బాచరించి దేహము విడిచి భార్యాసమేత
ముగా దివ్యవిమానారూఢుండయి సిద్ధచారణులు సేవింప
శివలోకమున శివసాయుజ్యము నొందిరని చెప్పిన విని పర
మాశ్చర్యము నొంది శౌనకాదిమహామునులు క్రమ్మఱ
సూతున కి ట్లనిరి.

194


క.

మామనములు రంజిల్లఁగ
హైమవతీశ్వరపదార్చనాసాదితమౌ
సీమంతినీప్రభావం
బేమైనను గలిగెనేని యెఱిఁగింపు మొగిన్.

195


క.

కొననుండి చెఱుకు మొదటికిఁ
దినఁదినఁగా మధుర మైనతెఱఁగున నిటలా
క్షునిదివ్యచరిత్రంబులు
వినవినఁగా మాకు మిగుల వేడ్క జనించెన్.

196


వ.

అని యడిగిన నమ్మహామునులకు సూతుం డి ట్లనియె.

197


ఉ.

వింతలు దన్మహత్వములు విప్రియమై వ్రతనిష్ఠ సల్పుచున్
గంతువిరోధిసత్కరుణఁ గ్రమ్మఱ లబ్ధనిజేశ యయ్యె నా
నెంతపతివ్రతాతిలక మెంతటినిశ్చలచిత్త యౌర సీ
మంతినిసత్ప్రభావగరిమంబు గణింపఁ దరంబె యేరికిన్.

198


తే.

అమ్మహాపుణ్యసాధ్వి మహత్త్వ మొక్క
చిత్రకథఁ జెప్పెద వినుండు మైత్రి వెలయ
నదియుఁ గల్యాణదాయకం బది మనోజ్ఞ

మది సమస్తాఘహరణమై యలరుచుండు.

199


వ.

అది యెట్టిదనినఁ జెప్పెద నాకర్ణింపుఁడని సూతుం డి ట్లనియె.

200


క.

శ్రీరాజరాజవిభవా
ధార మగు విదర్భరాజధానీమణికిన్
జేరువయే భూరమణీ
హారం బన నొక్కయగ్రహారము వెలయున్.

201


క.

అందు వరమిత్రుఁ డన నిం
పొందఁగ సారస్వతుఁ డన భూనుతయశులై
యుందురు భూసురు లిరువురు
సందేహము లేక సకలశాస్త్రజ్ఞులునై.

202

సుమేధసోమవంతులచరిత్రము

క.

వరమిత్రునిఘనతనయుఁడు
పరఁగు సుమేధుం డనంగ భాసురకీర్తి
స్ఫురణుఁడు సారస్వతునకు
వరపుత్త్రుఁ డొకండు సోమవంతుఁ డనంగన్.

203


శా.

ఆవిప్రోత్తమసూను లొండొరులుఁ దుల్యప్రాయులై సూక్ష్మమే
ధావిభ్రాజితులై కృతోపనయనోద్యత్సర్వసంస్కారులై
శైవాచారకళాధురంధరులునై చంద్రార్కసంకాశులై
శ్రీవిద్యాధికులైరి వారలు విపశ్చిన్ముఖ్యులో నాజనుల్.

204


క.

అకుటిలమతు లయ్యిరువురు
సకలపురాణేతిహాసశాస్త్రాగమము
ల్ప్రకటముగ నభ్యసించిరి
యకలంకవచోవిభూతి నార్యులు మెచ్చన్.

205

వ.

ఇవ్విధమునం బెరుగుచు సమస్తవిద్యాప్రవీణులును వివాహ
సమయోచితతారుణ్యధురీణులును నైన కుమారులం గనుం
గొని తజ్జనకు లి ట్లనిరి.

206


ఉ.

పుత్త్రకులార మీరు పరిపూర్ణవయస్కులు గాన నిప్పు డి
ద్ధాత్రిఁ బరిభ్రమించి వసుధాతలనాథుల నాశ్రయించి సు
క్షేత్రపరిగ్రహార్థముగఁ జేయుఁడు యత్నము మీకు నుత్తమ
శ్రోత్రియు లంచు నిత్తురు వసుప్రకరంబుల నమ్మహీపతుల్.

207


క.

పదపడి పరవాదములకు
నెదురెవ్వరు లేకయుండ నింపు దలిర్పన్
జదివితిరి వేదశాస్త్రము
లిది సమయము యాచకమున కేగుఁడు మీరల్.

208


తే.

శైశవం బాదిగా సర్వసంస్కృతులును
వ్రతము లొనరించితిమి బహుశ్రుతుల మైతి
మిపుడు వృద్ధుల మైతి మే మెంచి చూడ
శక్తులము గాము దేశసంచారమునకు.

209


క.

మీరలు పదియేండ్లకు
మారులు విద్యాప్రసంగమహిమ విదర్భ
క్ష్మారమణు నడిగి యర్థం
బారూఢిగఁ దెచ్చి పెండ్లియాడుఁడు వేగన్.

210


వ.

అని పలికిన నిజజనకులవాక్యములకు సమ్మతించి బ్రహ్మచారు
లైన యయ్యిరువురు విదర్భరాజుసముఖమునకుం జనిన
నమ్మహీనాథుండును బ్రత్యుత్థానపూర్వకంబుగా వారలం
బూజించి యథార్హపీఠంబులం గూర్చుండ నియోగించి
యుండునంత.

211

శా.

ఛందోవ్యాకరణప్రతర్కఘనశిక్షాజ్యౌతిషప్రక్రియా
సందర్భంబు లుపన్యసింపుచును రాజశ్రేష్ఠు మెప్పించి సా
నందస్వాంతునిగా నొనర్చి వివిధామ్నాయోక్తమంత్రాళిచే
సింధూరద్రవమిశ్రితాక్షతఫలాశీర్వాదము ల్చేసినన్.

212


క.

మెచ్చి నరపాలుఁ డప్పుడు
మచ్చికతో ననియె నాకుమారవరులతో
నిచ్చటికి మీర లిరువురు
వచ్చుటకును హేతు వెద్ది వచియింపుఁ డనన్.

213


ఆ.

వార లిట్టు లనిరి వసుధేశు గనుఁగొని
విత్తవిరహితులము విప్రవరుల
మట్లుగాన నిచటి కస్మద్వివాహార్థ
మరుగుదెంచితిమి ధనాభికాంక్ష.

214


క.

అని వారు దెలియ నుడివిన
విని యానృపకుంజరుండు విప్రాత్మజులం
గనుఁగొని యిట్లని పలికెను
ఘనహాస్యరసంబు బాహ్యకము కాకుండన్.

215


సీ.

విప్రనందనులార వినుఁడు నావచనంబు
        విపులార్థసంసిద్ధి వెలయు మీకు
సదమలచారిత్రి చంద్రాంగదునిపత్ని
        సీమంతిని యనంగఁ జెలువు గాంచి
సోమవారంబున సోమశేఖరుపూజ
        లాచరింపుచును నిరంతరంబు
దంపతిపూజ లత్యద్భుతంబుగఁ జేసి
        తుష్టిగా నొసఁగు నభీష్టధనము

తే.

గాన మీలోన మీర లొక్కరుఁడు యువతి
యొకఁడు పురుషుండుగా వేష మొనర దాల్చి
పోయి యాసాధ్విమందిరంబున భుజించి
ధనము గొని రండు మత్సన్నిధానమునకు.

216


చ.

అని వచియించిన న్విని మహాభయ మందుచు విప్రసూను లి
ట్లనిరి నరేంద్రచంద్ర తగునా మిముబోంట్లకు నిట్టులాడఁగా
జనకులపట్ల దేవతలసన్నిధి సద్గురులందు రాజులం
దును గపటప్రయత్నుఁ డగుదుర్మతి దాఁ జెడు సాన్వయంబుగన్.

217


ఉ.

ఎన్నఁగ మేము భూసురకులేంద్రులమున్‌ బహువేదశాస్త్రసం
పన్నుల మిట్టికాపటికభాషణ మర్హమె మాకుఁ గైతవ
చ్ఛన్నమనుష్యసంతతికి సాధ్వసమున్ గలుషంబు వైరమున్
బన్నుగ నిందయుం గలుగు బార్థివశేఖర సత్య మారయన్.

218


వ.

నరేంద్రా భవదీయశాసనమున నిషధపురమున కెట్లు పోవ
నేర్తుము కౌటిల్యమార్గమున సంచరింపుచున్న మ మ్మెవ్వరే
నియు నెఱింగిన దండనార్హుల మగుదుము కులశీలవిద్యా
గుణములఁ బ్రయోజనము లగులజ్జాభిమానములు
దొలంగుఁ గావున నే మిట్టి కార్యమునకుం బోవుట
యర్హంబు గా దని పలికిన నవ్విప్రకుమారులవచనంబు
లాకర్ణించి వెండియు నాభూవరుం డి ట్లనియె.

219


క.

దేవ గురు జనక జననీ
భూవరశాసనము గడచు పురుషులు గలరే
యేవిధమున కర్తవ్యము
గావున నాయాజ్ఞ మీఱఁగారాదు సుమీ.

220

క.

శుభమైన నశుభమైనను
ప్రభువులు వచియించినట్టిపలుకులు వినినన్
విభవంబు లబ్బు నిజముగ
నభయము సమకూఱు నమ్మహాత్ముల కెపుడున్.

221


క.

మీరెల్ల మదీయాజ్ఞా
ధారకులై యుండవలయు దథ్యం బనినన్
ధీరమతి సమ్మతించిరి
వా రపుడు విధర్భరాజువచనంబులకున్.

222


వ.

ఇట్లు సమ్మతించిన యావిప్రకుమారుల యభిప్రాయం బెఱింగి
యాభూవరుండు.

223


క.

సారస్వతసుతుఁ డాగమ
పారజ్ఞుం డైనసోమవంతున కెలమి
న్నారీవేష మొనర్చెను
హారిద్రాంజనవిభూషణాంబరమణులన్.

224


సీ.

కటిభాగమున దివ్యకౌశేయము ధరించి
        నుదుటఁ గుంకుమరేఖఁ గుదురుపఱిచి
ప్రచురతాళంబుల గుచమండల మమర్చి
        సొగసుగా మృదులకంచుకముఁ దొడిగి
నీలవస్త్రమునఁ బెన్నెరివేణిఁగ నొనర్చి
        ప్రవిమలం బైనపుష్పములు దురిమి
రాణింప మొలను నొడ్డాణంబు బిగియించి
        చెక్కిళ్ల మకరిక ల్చక్కఁ దీర్చి


తే.

కరములను రత్నకంకణాంగదము లమరఁ
గర్ణములయందుఁ బాజులకమ్మ లొప్పఁ

గంఠసూత్రాదిభూషణకలితుఁ డగుచు
సోమవంతుఁడు కృత్రిమభామ మయ్యె.

225


క.

క్షితిపతియాజ్ఞావిధమున
నతిశయసౌందర్యవంతు లావిప్రులు దం
పతివేషంబులు దనరఁగ
రతికుసుమాయుధులమాడ్కి రంజిల్లి రొగిన్.

226


వ.

ఇట్లు రాజానుశాసనంబున నాబ్రహ్మచారులిరువురు కృత్రిమ
దంపతివేషంబులు ధరియించి కాఁగలయర్థంబు లవశ్యం
బుగా ననుభోక్తవ్యంబులని ధైర్యం బవలంబించి కతిపయ
దినప్రయాణంబులన్ జని చని యభ్రంకషమణికాంచన
సౌధప్రాకారగోపురంబును నిజవైభవపరాభూతగోపురంబును
నగునిషధపురంబుం బ్రవేశించి తత్పట్టణవిలాసంబు లాలో
కింపుచు రాజమార్గంబున నరుగుదెంచి యచ్చట నానాదేశ
సమాగతబ్రాహ్మణవధూవరులం గాంచి వారలుం దామును
రాజమందిరద్వారంబు చేరువ నుండునంత.

227


క.

ఆవేళ సోమవారము
గావున సుస్నాత యగుచుఁ గౌతుకమున నా
భూవరపత్నియును మహా
దేవాగారంబు సొచ్చెఁ దేజం బలరన్.

228


క.

ఆసమయంబున నచటికి
భూసురముఖ్యులును మఱియు భూసురవనితల్
హాసోల్లాసముఖంబుల
నాసాధ్వీమణిని జేర నరిగిరి వరుసన్.

229


తే.

మేదురంబుగ వాదిత్రనాదములును

వేణువీణారవంబులు వేదనాద
ములును ఘంటాఘణత్కారములును శంఖ
నిస్స్వనంబులు దిక్కుల నిండె నపుడు.

230


సీ.

కదిళికాస్తంభసంగతచతుర్ద్వారంబు
        పల్లవతోరణభ్రాజితంబు
హరితరాంకవవితానాలంకృతంబును
        బహురంగవల్లికాభ్రాజితంబు
ఫలపుష్పమంజరీపరిమళోపేతంబు
       దేదీప్యమానప్రదీకంబు
....... ........ ....... ....... ....... ......... .........


తే.

మణిమయం బైనకల్యాణమంటపమున
బృథులసౌవర్ణమయరత్నపీఠమునను
వెలయఁ గూర్చుండి నిషధభూవిభునిసాధ్వి
చిత్తమలరంగఁ బూజలు సేయుచుండె.

231


సీ.

ధ్యానంబు గావించెఁ దరుణేందుమౌళికి
        నావాహన మొనర్చె దైవపతికి
భద్రాసనం బిచ్చెఁ బార్వతీధవునకు
        నర్ఘ్యం బొసంగెఁ గాలాంతకునకు
నభిషేకములు జగత్ప్రభునకు నొనరించె
        వస్త్రయుగ్మము కృత్తివాసునకును
శ్రీగంధతిలకంబు శివునకు నలరించె
        నక్షతంబులు జగద్రక్షకునకుఁ


తే.

గుందమందారబిల్వమాకందవకుళ
చంపకాశోకపున్నాగజలజములను

బూజ లొనరించె రవికోటితేజునకును
సొరిది సీమంతినీభామ సుగుణధామ.

232


క.

సౌరభ్యధూప మొసఁగెను
వారిధితూణీరునకును వైభవ మలరన్
నీరాజన మిచ్చెను క
ర్పూరముతోడను భుజంగభూషణధృతికిన్.

233


క.

ధిషణావతియై మణిమయ
చషకంబున మధురభక్ష్యశాల్యోదనమున్
నిషధేంద్రపత్ని శివునకు
వృషభేంద్రతురంగునకు నివేదన మొసఁగన్.

234


క.

లక్షణవతి యగు నాసతి
నక్షత్రపుహార తిచ్చె నవరత్నములన్
రక్షితలోకత్రయునకు
దక్షసుతాసహితునకు నతత్రాణునకున్.

235


తే.

వంశపావని యాచిత్రవర్మపుత్త్రి
పుష్పములు దోయిట ఘటించి బుధులు దాను
మంత్రపుష్పంబు లొసఁగిరి మహితవృత్తిఁ
జంద్రమౌళికిఁ గారుణ్యసాంద్రమతికి.

236


క.

మేరుశరాసనునకు బృం
దారకవినుతునకు సచ్చిదానందునకున్
గూరిమిఁ బ్రదక్షిణనమ
స్కారంబు లొనర్చె నపుడు గజగామినియున్.

237


చ.

దురితవిపద్దశావ్యసనదుస్సహతాపభయాశుభాళి బం
ధురతరసంసృతిప్రకటదోషముల న్విదళించి ప్రోవుమీ

స్మరహర చంద్రశేఖర భుజంగవిభూషణ యంచు భక్తి న
ప్పరమపతివ్రతామణియు భావములోనఁ దలంచె నీశ్వరున్.

238


చ.

శరణు గిరీంద్రజారమణ చంద్రకళాధర కాలకంధరా
శరణు మహాత్మ హేమగిరిచాప మహేశ్వర భక్తవత్సలా
శరణు విరించివిష్ణుముఖసన్నుత భద్రఫలప్రదాయకా
శరణు వియన్నదీధర భుజంగవిభూషణ దీనపోషణా.

239


చ.

జయజయ రక్తబీజదనుజాధిపశుంభనిశుంభమర్దనీ
జయజయ ఖడ్గఖేటశరచాపగదాంకుశశూలధారిణీ
జయజయ భోగభాగ్య జయ శాశ్వతభద్రఫలప్రదాయినీ
జయజయ యోగిమానసవశంకరి శాంకరి విష్ణుసోదరీ.

240


క.

భువనత్రాణసుధాకర
ధవళాంగకర త్రిశూలధారణ శంభో
శివ శంకర మృత్యుంజయ
భవహర మాం పాహి పాహి భర్గనిధానా.

241


క.

జపమంత్రవ్రతనిష్ఠా
తపములు సలుపంగ నోపఁ దథ్యముగ భవ
త్కృప నమ్మియుండెదను నా
యపరాధంబులు సహింపు మార్తశరణ్యా.

242


వ.

అని బహుప్రకారంబులం బ్రార్థింపుచు శంఖకాహళఘంటా
రవంబులు చెలంగ ననేకఛత్రచామరకుముదాదిరాజోపచారం
బులం గొంతప్రొద్దు సేవ గావించి తదనంతరంబున శివ
మంత్రపారాయణమును శివపురాణశ్రవణమునుం గావింపు
చున్నంత.

243


తే.

ఇవ్విధంబున నాపార్వతీశ్వరులకు

నురుతరంబుగఁ బూజామహోత్సవంబు
లింపుతోఁ జేసి మఱి విప్రదంపతులకు
సొంపు మీఱఁగఁ బూజ కావింపుచుండె.

244


ఉ.

రాజనిభాస్య యానిషధరాజకుటుంబిని భక్తి మీఱ వి
భ్రాజదుమామహేశులుగ భావనఁ జేయుచు నైజమానసాం
భోజమునందు నిశ్చలత భూసురదంపతిపఙ్త్కి కెంతయుం
బూజ లొనర్చె భస్మమయపుష్పసుగంధములం బ్రియంబునన్.

245


క.

ఆసమయంబునఁ గృత్రిమ
భూసురదంపతు లటంచు బుద్ధిఁ దెలిసి సో
త్ప్రాసము మనమునఁ దోఁపఁగ
నాసీమంతినియు వారి నారాధించెన్.

246


క.

ఒకరుని భవానిగను వే
ఱొకరుని శంకరుని గాఁగ నూహింపుచుఁ దా
నకుటిలమతిఁ బూజించెను
శుకవాణి దరస్మితాస్యశోభిత యగుచున్.

247


క.

వనజాక్ష యిట్లు బ్రాహ్మణ
జనములకును షోడశోపచారంబులఁ బూ
జనము లొనరించె మణికాం
చనభాజనభోజనములు సరవి నొనర్చెన్.

248


సీ.

శాల్యోదనంబులు సద్యోఘృతంబులు
         మొలకబేడలపప్పు మోదకములు
గలవంటకంబు లప్పడములు వడియంబు
         లతిరసములు వడ లామవడలు
పరమాన్నములు దేనె ఫలరసప్రకరంబు

       లిడ్డెన ల్పులగంబు లడ్డువములు
నూరుబిండులు నల్ల నూరుగాయలు నావ
         పచ్చళ్లు పెరుగులు పానకంబు


తే.

లాదిగా గలుగుభక్ష్యభోజ్యము లొసంగి
భూసురేంద్రుల కపుడు దాంబూలములును
దక్షిణ లొసంగి యంతఁ బ్రదక్షిణముగ
వందనము లాచరించె నవ్వనరుహాక్షి.

249


శా.

శిష్టాచారము తప్పకుండఁగఁ దదాశీరక్షతౌఘంబులున్
హృష్టస్వాంతముతోడఁ గైకొని శుభశ్రీకామయై యంతటన్
మృష్టాన్నంబులఁ దుష్టింజెందినధరిత్రీదేవతాశ్రేణికిన్
స్వేష్టార్థంబు లొసంగి పంపె మరలన్ హేమాంగి లీలాగతిన్.

250


క.

తదనంతరమున నాసతి
ముదమున మృష్టాన్నపానములఁ బరితుష్టిం
బొదలుచుఁ బతికి హితంబుగ
సదమలమతి నుండె నపుడు సఖులుం దానున్.

251


వ.

అంత దేశాంతరసమాగతబ్రాహ్మణప్రకరంబు లారాత్రి
యచ్చట వసియించి మరునాఁడు నిజనివాసములకుం జనిరంత
నాకృత్రిమదంపతులు పరజనసందర్శనభీతులై యపరరాత్రం
బున మేల్కాంచి గృహములకు సత్వరప్రయాణమునఁ జను
చుండి రాసమయంబున.

252


శా.

శ్రీరంజిల్లఁగఁ బూర్వరాత్రమున నాసీమంతినీదేవి దా
గౌరీశంకరులంచుఁ జిత్తమున సంకల్పించి పూజించుటం
దారుణ్యాకృతి భూసురుండు పురుషత్వంబు న్విసర్జించి కాం
తారూపంబు ధరించి నిల్చె నపు డత్యాశ్చర్యముం దోఁపఁగన్.

253

క.

ఈరీతిని బ్రభవించిన
తారుణ్యవతీలలామ దర్పకవిశిఖా
సారాహతిఁ బరవశయై
మీఱి రతిప్రీతి నల సుమేధుని జీరెన్.

254


ఆ.

నిలువు నిలువు రమణ నీవు పోవఁగనేల
పుష్పఫలావితానపూర్ణమైన
యీవనంబుఁ జూడు మిచ్చోట వసియించి
కామకేళి నన్ను గారవింపు.

255


ఆ.

అని వచింపుచుండ నయ్యింతి వలుకుట
హాస్య మనుచుఁ దలఁచి యాద్విజుండు
పడుచుఁదనము సుద్దు లుడిగి మౌనంబున
రమ్మటంచు సత్వరముగ నరిగె.

256


ఉ.

వల్లభ నిల్వుమంచుఁ జెలువంబుగ నడ్డము వచ్చుఁ ద్రోవకు
న్మెల్లనె మాటలాడు దమి మించెఁ దిరంబుగ నాదువాక్యము
ల్గల్లలు గావటంచు బిగి కౌఁగిటఁ జేర్చును మోవి యాను నా
పల్లవపాణి పంచశరభల్లహతి న్నిలుపోప కెంతయున్.

257


క.

ఈతెఱఁగున నాకామిని
చేతోజాతప్రయుక్తచేష్టలు వెలయన్
భూతము సోఁకినరీతిని
గోఁతికి శివమెత్తినట్లు కొంత నటించెన్.

258


వ.

ఇట్లు కామోన్మాదంబునఁ బ్రవర్తించునయ్యింతిం గనుంగొని
సుమేధుండు నిజకృతం బయినరహస్యకార్యము ప్రకాశం
బగునో యనుతలంపున భయమును జెంది యి ట్లనియె.

259


మ.

తగునే యిట్లు కుచేష్టలం బడఁగ నిత్యబ్రహ్మచర్యుండవై

తగ సారస్వతవిప్రనందనుఁడవై తర్కాగమామ్నాయపా
రగమేధానిధివై జితేంద్రియుఁడవై రంజిల్లునీ విట్లు దు
ర్భగకాంతాకృతి సంచరింప నగరే బంధుద్విజగ్రామణుల్.

260


చ.

పురుషుఁడ వెంచి చూడ ననబోఁడివిగావు విగర్హితోక్తులన్
సరసము లాఁడఁగాఁజనదు చయ్యన బోవుదమన్న నింతి భూ
సురసుతుఁ జూచి పల్కెఁ బురుషుండనుగాను వధూటి గాని న
న్నరయుము నేను సోమవతి నంచును జూపె నిజాంగకంబునన్.

261


వ.

ఇట్లు చూపిన.

262


మ.

తరుణీరూపవతి న్యథార్థవిలసద్ధమ్మిల్లతుంగస్తనిన్
హరిణీలోచనఁ జంద్రబింబవదనన్ హర్యక్షమధ్యాంచితన్
హరినీలాలకవిద్రుమాధరగరీయశ్శ్రోణి నత్యంతసుం
దరి నాసోమవతి న్గనుంగొనియె నద్ధాత్రీసురుం డంతటన్.

263


క.

కని యత్యాశ్చర్యంబును
ఘనతరభీతియును దోఁపఁ గంపితగాత్రుం
డును నతిచంచలచిత్తుం
డును నై యతఁ డూరకుండె దుర్ముఖుఁ డగుచున్.

264


వ.

ఇవ్విధంబున నేమియుం దోఁచక వెఱఁగుపడి యున్న
యాద్విజకుమారునిం గాంచి నిజానురాగంబునఁ గామో
న్మాదంబు దోఁప నవ్వరారోహ వెండియు ని ట్లనియె.

265


సీ.

మదనసుందర నీవు మౌనముద్ర వహించి
        చిత్తంబు వెలయ భాషింపవేమి
దైవకృతం బిది తప్పింప వచ్చునే
        యనుభవింపకతీర దజునకైన
వంచకుఁ డైనభూవరుని జేరఁగనేల

      దంపతివేషము ల్దాల్ప నేల
మనము వల్దనక సమ్మతమంది రానేల
        యమ్మానినిసమక్ష మరుగనేల


తే.

యాపతివ్రత యిది సిద్ధ మగునటంచుఁ
జిత్తమున నెంచి యిట్లు పూజింపనేల
నంతమాత్రన యిటులౌట యద్భుతంబు
లింతయుఁ బురాకృతం బని యెఱుఁగవలయు.

266


క.

భువిలోన ధూర్తమానవు
లెవరైనను గాని పరులయెడలను నతికై
తవ మొనరించినమాత్రన
నవితథముగ ధాత్రి నశ్యు లగుదురు వారల్.

267


క.

మనమందిరమున కిప్పుడు
మన మరిగినఁ బురుషభావ మగపడకున్న
న్మనవారియనుమతంబున
మన మిద్దఱమును వివాహ మౌదము నెమ్మిన్.

268


ఆ.

చింతసేయవలదు శివునిపాదము లాన
సమ్మదముగ నుండు నెమ్మనమునఁ
గాఁగలట్టిపనులు గాకమానవటంచుఁ
బలికి యంత వలపు నిలుపలేక.

269


వ.

వెండియు నమ్మహీసురకుమారునితో నమ్మానిని యి ట్లనియె.

270


చ.

జనరహితంబు పుష్పఫలసంయుతమంజునికుంజపుంజరం
జనము మయూరకీరపికషట్పదముఖ్యసమస్తపక్షిని
స్వనితముఁ గామినీపురుషసంగమయోగ్యనివాస మైనదీ
వన మిటు చూడు మిందు రతివల్లభకేళి చరింత మొప్పఁగన్.

271

వ.

అని పలికి.

272


ఉ.

అంగజుఁ డేయుపుష్పవిశిఖాహతి కోర్వఁగలేక యాత్మ ను
ప్పొంగుచు లజ్జఁ బోవిడిచి మోహభరంబును జెంది యప్పు డ
య్యంగన ప్రాణనాథుమధురాధరము న్మునిపంట నొక్కి యా
లింగన మాచరించెఁ దరళీకృతచిత్తము తత్తరింపఁగన్.

273


వ.

ఇవ్విధమున నతిశయప్రేమాతిరేకంబునం బయిం బడి
యున్న యమ్మానిని నాభుసురసుతుండు సాంత్వవచనమ్ముల
నెట్టకేలకు ననునయించెఁ గ్రమ్మఱ నవ్విప్రమిథునంబు నిజ
గృహములకుం బోవుచు నహో సీమంతినీప్రభావంబు
మహాశ్చర్యకరంబని మనంబునం బొగడుచుఁ జనిరంత.

274


క.

గృహమున కేతెంచిన తన
దుహితను వీక్షించి కినుక దోఁప గురుండు
న్మహిళారూపం బేమని
యహితోక్తుల నడుగఁ జెప్పి రాద్యంతంబుల్.

275


క.

వినినంతమాత్రలో న
జ్జనకులు సక్రోధు లగుచు సరభసముగ నా
జనపతికడ కరుదెంచిరి
తనయాన్వితు లగుచు మదిని దత్తరపడుచున్.

276


వ.

అంత నాభూవరుం జూచి సారస్వతుం డి ట్లనియె.

277


శా.

శుద్ధశ్రోత్రియు మత్కుమారు గతదోషు న్గామినీవేషస
న్నద్ధుం జేసినకారణంబునఁ దగ న్నారీస్వరూపంబు దా
సిద్ధంబయ్యెఁ దదేకపుత్త్రకుఁడనై జీవింప నెట్లోర్తు నీ
యుద్ధారం బిటులయ్యె నీవు కపటోద్యోగుండ వుర్వీశ్వరా.

278


క.

మౌంజీదండకమండలు

రంజితపటుచర్య లుడిగి రమణీమణియై
మంజుతరభూషణహరి
ద్రాంజనసిందూరకాదు లమర ధరించెన్.

279


క.

సుతహీనులైనవారల
పితరులు పరికింప లుప్తపిండోదకులై
సతతము నిరాశు లగుదురు
క్షితివర మద్గతికి నేమి చెప్పెదొ చెపుమా.

280


తే.

స్నానసంధ్యాదివిధులును జపతపములు
వేదపారాయణంబులు నీటఁ గలిపి
నాతిచందంబుఁ దాల్చిన నాదుసుతున
కెట్లు గతిగల్గు రాజ నీ వెఱుఁగఁ బలుకు.

281


వ.

అని బహుప్రకారంబుల నిష్ఠురభాషణంబు లాడుచున్న
సారస్వతునివాక్యంబు లాకర్ణించి యాభూపాలుం డతివిస్మయ
మానమానసుండయి తనమనంబున నిట్లని వితర్కించె.

282


మ.

పరిహాసార్థముగాఁగ నీద్విజసుతున్ భామాకృతిన్‌ బంపినం
బురుషత్వంబుఁ బరిత్యజించి సతియై పొల్పొంద విచ్చేసెఁ గ్ర
మ్మఱ నౌరా గిరిజామహేశ్వరులసామర్థ్యంబుఁ దద్భక్తభా
సురమాహాత్మ్యము లెంచి చూడ భువిలోఁ జోద్యంబులై కన్పడున్.

283


క.

సీమంతినీప్రభావము
లేమని వర్ణింపఁ బురుషుఁ డెంతయుఁ దలఁపన్
సీమంతినియై నిలిచెను
నామగువతపంబు లెన్న నజునకు వశమే.

284


సీ.

అని వితర్కింపుచు నావిదర్భాధీశుఁ
        డాప్తమంత్రులు దాను నాక్షణమున

దాపసోత్తము భరద్వాజుని రప్పించి
        యమ్మహామునినాథుననుమతమున
నావిప్రు లిరువురు నాత్మజయుతముగాఁ
        దనవెంట రా నతిత్వరితగతుల
నంబికాదేవిగృహంబున కేతెంచి
        యారాత్రి గౌరీసమర్చనంబుఁ


తే.

జేయ సమకట్టి యమ్మహీనాయకుండు
విగతభోజనపాననివేశుఁ డగుచు
ధీరమతిఁ నమ్మునీంద్రోపదేశమునను
విహితానిష్ఠాసమాధిఁ గావింపుచుండి.

285


దండకము.

శ్రీమన్మహాదేవురాణీ నతేంద్రాణి రుద్రాణి శర్వాణి
కల్యాణి దాక్షాయణీ శూలపాణీ పృథుశ్రోణి ధూమ్రాక్ష
సంహారిణీ పారిజాతప్రసూనాంచితస్నిగ్ధవేణి లసత్కీరవాణీ
భవానీ శివా శాంకరీ రాజరాజేశ్వరీ గౌరీ శాకంభరీ కాళి
కంకాళి రాజీవనేత్రీ సుచారిత్రి కల్యాణగాత్రీమహాదైత్య
జైత్రీ నగాధీశపుత్త్రీ జగన్మాత లోకైకవిఖ్యాత గంధర్వ
విద్యాధరాదిత్యకోటీరకోటీస్ఫురద్దివ్యమాణిక్యదీప ప్రభా
త్యుల్ల సత్పాదకంజాత కేయూరహారాంగదాది జ్వలద్భూ
షణవ్రాతకౌమారి మహేశ్వరీ నారసింహీరమా వైష్ణవీ
శాంభవీ భారతీ భైరవీ దుర్గ కాత్యాయనీ పార్వతీ నీదు
సామర్థ్య మెన్నంగ బ్రహ్మాదులున్ శేషభాషాదులున్ జాల
రేసెంతవాఁడన్ బ్రశంసింప నేతజ్జగజ్జాలనిర్మాణసంరక్షణా
రంభసంరంభకేళీవినోదంబులున్ గల్గి వర్తింతు వెల్లప్పుడో
యాదిశక్తి పరంజ్యోతి నారాయణీ భద్రకాళీ శుకశ్యా

మలా భ్రామరీ చండికా లక్ష్మివిశ్వేశ్వరీ శాశ్వతైశ్వర్య
సంథాయినీ యంచు నిన్నెంతయున్ సన్నుతు ల్సేయులో
కాళికిన్ సంతతాఖండదీర్ఘాయురారోగ్యసౌభాగ్యసంసిద్ధిఁ
గావింతు వశ్రాంతమున్ రక్తబీజాదిదైతేయులన్ ద్రుంచి
బృందారకశ్రేణి రక్షింతు వీవెప్పుడున్ నారదాగస్త్యశాం
డిల్య మాండవ్యమైత్రేయ జాబాలికణ్వాదిమౌనీంద్రు
లత్యంతనిష్ఠాగరిష్ఠాత్ములై హృత్సరోజంబులన్ ధ్యానము
ల్సేయుచున్ బూజఁగావింతు రంతర్ముఖత్వంబునం జంద్ర
ఖండావతంసా భవద్దివ్యరూపంబు బ్రహ్మాండభాండంబుల
న్నిండి వెల్గొందు నేతత్ప్రపంచంబు సర్వంబు నీవై ప్రవ
ర్తింతు వీసూర్యచంద్రాదులున్ భుజలాకాశవాతాగ్ని
జీవాత్ములు న్నీవ నీకంటె వేఱైన దింతైనయున్ లేదు
యుష్మత్కటాక్షార్హు లైనట్టివార ల్గడున్ ధన్యులై
మాన్యులై పుణ్యులై గణ్యులై యుందు రీథాత్రిలో నేను
మూఢుండ గర్వాధిరూఢుండ దుశ్చిత్తుఁడన్ మత్తుఁడన్
జ్ఞానహీనుండ దీనుండ నేఁజేయు నేరంబులం గాంచి రక్షిం
పఁగా భారమే తల్లి సద్భక్తమందారవల్లీ నమస్తే శరచ్చంద్ర
బింబాననాయై నమస్తే శశాంకారుణప్రజ్వలత్కుండలాయై
నమస్తే పరిత్రాతభూమండలాయై నమస్తే విపద్ధ్వాంతభాను
ప్రభాయై నమస్తే పరిధ్వస్తతాపత్రయాయై నమః కామ
దాయై నమో ముక్తిదాయై నమశ్చండికాయై నమస్తే౽ంబి
కాయై నమస్తే నమస్తే నమః

286


కవిరాజవిరాజితము.

జయజయ పార్వతి శంభుకుటుంబిని చారునితంబిని కంబుగళే

జయజయ విద్రుమబింబఫలాదరి చక్రసహోదరి పీనకుచే
జయజయ శాంకరి సాధువశంకరి శత్రుభయంకరి మౌనినుతే
జయజయ శుంభనిశుంభనిషూదని సత్యవినోదిని శాంతిరతే.

287


తే.

అనుచు వినుతులు చేయుచు నన్నరేంద్రుఁ
డుపవసించెను దద్విప్రయుతము గాఁగ
మూఁడహోరాత్రములు మౌనముద్రఁ దాల్చి
భక్తి వెలయంగ నంజలీబద్ధుఁ డగుచు.

288


వ.

ఇ ట్లున్నసమయంబున.

289


సీ.

రాకేందుబింబవిభ్రాజితాస్యముతోడ
        ధవళాంబుజాతనేత్రములతోడఁ
గటిభాగశోభితకనకాంబరముతోడ
        డమరుత్రిశూలఖడ్గములతోడ
గళవిరాజన్మణిగ్రైవేయములతోడఁ
        జంద్రావతంసమస్తకముతోడ
సౌదామినీపుంజసన్నిభప్రభతోడ
       మహితలావణ్యవిగ్రహముతోడ


తే.

హారమంజీరకటకకేయూరముఖ్య
భూరిభూషణరాజివిస్ఫూర్తిలొలయ
నిర్భరకృపాప్తితోడ విదర్భపతికి
నంబికాదేవి యపుడు ప్రత్యక్షమయ్యె.

290


తె.

ఇట్లు సాక్షాత్కరించినయిందుమౌళి
గేహినికి వందనముచేసి కేలుదోయి
ఫాలభాగంబున ఘటించి ప్రముదితాత్ముఁ
డగుచు నూరకయుండె నయ్యవనివిభుఁడు.

291

వ.

ఇట్లు వినయవినమితశిరస్కుఁడై యున్నయారాజున కంబి
కాదేవి యి ట్లనియె.

292


క.

ఏమిటికై ప్రార్థించితి
వేమి భవత్కామితంబు లెఱిఁగింపుము నీ
కామోదంబున నొసఁగెద
నామాట నిజంబు గాఁగ నమ్ము మధీశా!

293


చ.

అనిన ధరాధినాథుఁ డను నంబికతో జగదేకరక్షణీ
వినుము ద్విజేంద్రనందనులు వేడుకఁ గృతిమదంపతిత్వముం
బనుపడ నైషధేంద్రుసతిపాలికిఁ బోయిన నావధూటి ని
న్మనమలరం భజించుకతనన్ లలనామణి యయ్యె నొక్కఁడున్.

294


క.

దేవీ సారస్వతునకు
నీవిప్రుం డొకఁడె పుత్త్రుఁ డీయెలనాఁగన్
భావింప మరలఁ బురుషుని
గావింపు మటన్న రాజుఁ గనుఁగొని పలికెన్.

295


క.

ఈవరము దక్క మఱియొక
టేవరమైనం దలంప నిత్తు నిజముగా
భూవర వేఁడు మటంచన
నావసుధేశుండు పలికె నయ్యంబికతోన్.

296


ఉ.

నీ కిది యేమిభారము గణింపఁగ నోజగదంబ తొల్లియి
క్ష్వాకుసహోదరిం బురుషసత్తముఁ గాఁగ ననుగ్రహింపవే
లోకులు నన్ను బుద్ధిచపలుం డని నింద యొనర్పకుండఁగా
నీకమలాక్షికి న్మరల నిచ్చలు బుంస్త్వ మొసంగు శాంకరీ.

297


క.

కపటాత్మకుఁ డితఁడని న
న్నపవాదము చెందకుండ నరయుచు మఱి నీ

కృపకుం బాత్రునిఁ జేయుము
కపిలాదిమునిస్తుతాంఘ్రికమల భవానీ!

298


సీ.

అనుచుఁ బ్రార్థించిన నానృపాలుని జూచి
        యంబికాదేవి యిట్లనియె మరల
వినవయ్య నరనాథ వినిపింతు నొకవార్త
        సోమవారవ్రతస్ఫూర్తిఁ జేసి
యాపతివ్రత తనయాత్మలో భావించి
        భజనం బొనర్చె దంపతులటంచు
ముదితసంకల్ప మమోఘంబు కావున
        నది మాన్ప నలవిగా దజునకైన


తే.

నట్లగుటఁ జేసి వీరల కతిముదమున
నెమ్మిఁ గావింపుఁ డిపుడు పాణిగ్రహంబుఁ
భాస్వరఖ్యాతి యైనసారస్వతునకు
నుద్భవించుఁ గులోద్ధారుఁ డొకసుతుండు.

299


క.

అని యానతిచ్చి త్రిభువన
జనని తిరోధాన మొందె సారస్వతుఁడుం
దనమనమున వెఱఁగందుచు
జనితానందుండు నిర్విచారుం డయ్యెన్.

300


ఆ.

గాఢభక్తి నంబికాదేవి మెప్పించి
వాంఛితంబు దీర వరము వడసి
భూసురోత్తములను పూర్ణ కాములఁజేసి
చనియె నృపతి తనదు సదనమునకు.

301


క.

పరివారవిరహితుండై
హరుపత్ని వరంబునకుఁ గృతార్థుం డగుత

న్నరపతిచే నర్చితుఁడై
యరిగె భరద్వాజమౌని యాశ్రమమునకున్.

302


మ.

జనము ల్మేలనఁగా జగజ్జననికిన్ సద్భక్తితో మ్రొక్కి పా
వనశీలుం డగుతాపసేంద్రుని భరద్వాజున్ బ్రశంసింపుచున్
మునిసంకాశుని నావిదర్భనృపతిన్ మన్నించి దీవించుచుం
జని రాభూసురు లాత్మగేహములకున్ సంతుష్టచేతస్కులై.

303


ఆ.

ఆసుమేధునకును నాసోమవతి నిచ్చి
పెండ్లిఁ జేసె గురుఁడు ప్రీతి యలర
నావధూరమణులు నత్యంతసౌఖ్యంబు
లనుభవింపుచుండి రనుదినంబు.

304


వ.

తదనంతరంబున.

305


క.

సారస్వతునకు వంశో
ద్ధారకుఁడును సత్కళానిధానుం డగుచున్
గౌరీప్రభావమహిమను
భూరిగుణోదారుఁ డొకసుపుత్త్రుఁడు పుట్టెన్.

306


క.

ఈసోమవారసువ్రత
భాసురకథ విన్నపుణ్యపరులకు విజయ
శ్రీసౌభాగ్యశుభంబులు
శ్రీసాంబశివుం డొసంగుఁ జిరతరకరుణన్.

307


వ.

అని యివ్విధంబున సీమంతినీప్రభావంబును శంభుమాహాత్మ్యం
బునుం దెలియం బలికిన విని యమ్మహామునులు పరమప్రహృష్ట
హృదయులై సూతుం బ్రశంసించి మఱియును శివభక్తలక్ష
ణంబు లెఱింగింపుమని యడుగుటయును.

308

ఆశ్వాసాంతము

క.

శరణాగతసంరక్షణ
శరణీకృతరజతశైల శంకర కరుణా
వరుణాలయ మహితాంబా
పురమందిర పార్థివేష భువనాధీశా.

309


పంచ:

ధరాధరేంద్రకన్యకానితాంతహర్షవర్ధనా
చరాచరాత్మకప్రపంచజాలరక్షణక్షమా
సురాసురప్రసేవ్యమానశోభితాంఘ్రిపంకజా
పరాపరాత్మవామదేవ భానుకోటిభాస్కరా.

310


మా.

కుజనఫణిమయూరా కుంభిదైత్యప్రహారా
భుజగనికరహారా పోషితాజాండవారా
వృజినఘనసమీరా విశ్వరక్షావిచారా
రజితగిరివిహారా రాజయోగప్రచారా.

311


గద్యము.

ఇది శ్రీరామభద్రకరుణాకటాక్షవీక్షణసమాలబ్ధ
గీర్వాణాంధ్రభాషాకవిత్వకళాధురంధర బడగలనాటి కన్నడ
వంశపయఃపారావారరాకాసుధాకర ఆశ్వలాయన సూత్ర
భారద్వాజసగోత్ర శ్రీధరమల్లె అయ్యనార్యతనయ సూరిజన
విధేయ వేంకటరామనామధేయప్రణీతం బైన బ్రహ్మోత్తర
ఖండం బనుమహాపురాణంబునందు సీమంతినీవివాహంబును
జంద్రాంగదుండు యమునాజలాంతరాళంబున నాగలోక
మునకుం బోవుటయు నందుఁ దక్షకువలన బహుమానప్రాప్తుం
డై క్రమ్మఱ నిషధపురమునకు వచ్చుటయు సీమంతినీప్రభావ
కథనమును ననుకథలం గల తృతీయాశ్వాసము.