బ్రహ్మోత్తరఖండము/ద్వితీయాశ్వాసము

ద్వితీయాశ్వాసము

క.

శ్రీపార్వతీమనోహర
శాపాయుధహృదయకమలషట్పద భూభృ
చ్చాప మహేశ్వర లసదం
బాపురవరపార్థివేశ ప్రమథగణేశా!

1


వ.

దేవా యవధరింపు మశేషపురాణకథాకథనదక్షుం డైన
సూతుం డమ్మహామునుల నవలోకించి వెండియు నిట్లనియె.

2


చ.

మునివరులార మీ రిపుడు ముక్తినిదానము దివ్యభోగసా
ధనము జయప్రదంబు దురితప్రకరాపహరంబు పుణ్యవ
ర్ధనము విపద్విమోచనము రమ్యతరంబును నైనఫాలలో
చనునిమహత్వ మెన్నెదను సంతసమందును నాలకింపుఁడీ.

3


శా.

ఆయుర్వర్ధన మై రుజాపహర మై యారోగ్యసంధాయి యై
శ్రేయస్సాధక మై తపఃఫలద యై క్షేమంకరం బై సదా
ప్రాయశ్చిత్తము లేనిపాపములఁ బాపంజాలు పుణ్యైకగా
థాయుక్తంబగు తన్మహత్త్వము ప్రమోదం బొప్పఁగాఁ దెల్పెదన్.

4


ఉ.

భాసురశాంతిదాంతి భయభక్తులతో నెవరైన మాఖమా
సాసితపక్షసమ్మిత మహాశివరాత్రి చతుర్దశీలస
ద్వాసరవేళలందు నుపవాసము జాగరణం బొనర్చినన్
మోసములేక వారలు ప్రమోదతఁ గాంతురు శంభులోకమున్.

5

ఆ.

కేవలముగ మాఖకృష్ణచతుర్దశి
శివున కాగమాభిషేకములును
బిల్వపూజనములు ప్రియమున నొనరించి
జాగరూకవృత్తి సలుపవలయు.

6


క.

కమలభవాదిసుపర్వులు
శమదమసంపన్ను లైనసంయమివరులున్
విమలాభిషేకపూజా
క్రమముల శివరాత్రివ్రతము గడుపుదు రెలమిన్.

7


వ.

ఈయర్థంబునకు నొక్కపుణ్యం బయినయితిహాసంబు గలదు
దానంజేసి మీమనంబులకు నిశ్చలజ్ఞానం బుదయించు నది
యును బ్రకృష్టకలుషభంగంబులు బ్రహృష్టసుజనాంతరం
గంబును నై యుండు దానిం జెప్పెద నాకర్ణింపుం డని
సూతుం డమ్మునీంద్రులకు నిట్లని చెప్పందొడంగె.

8

మిత్రసహోపాఖ్యానము.

శా.

శ్రీకల్యాణపరంపరాలయము రాజీవాప్తవంశోద్భవా
నేకక్షత్రియపాలితంబు నృపభూయిష్ఠంబు విద్విడ్వరా
నీకాభేద్యము విశ్వకర్మకృతమౌనీంద్రప్రజాపూర్ణ మై
సాకేతం బనురాజధాని వెలయున్ సర్వంసహామండలిన్.

9


క.

ఆపురమున కధిపతియై
దీపించు కకుత్థ్సవంశతిలకుఁడు విగళ
త్పాపుఁడు మిత్రసహుం డను
భూపశ్రేష్ఠుఁడు మహేంద్రభోగము వెలయన్.

10


శా.

వాపీకూపతటాకసేతువనదేవాగారనిర్మాణదీ
క్షాపారీణుఁ డనేకయాగకరణశ్లాఘ్యుండు వీరాహితా

టోపచ్ఛేదకుఁ డానృపాలుఁడు వనాటు ల్గొల్వ నానామృగ
వ్యాపాదస్పృహ నేఁగుఁ గానలకు దివ్యాస్త్రోజ్జ్వలత్పాణియై.

11


ఉత్సాహ.

భూరిశౌర్యుఁ డానృపాలపుంగవుండు ఘోరకాం
తారవీథులందుఁ గల్గు దారుణంబు లైన కం
ఠీరవాచ్ఛభల్లవృకకిటి ద్విపాదిసంచర
త్క్రూరదుష్టసత్వములను గూల్చె సాయకంబులన్.

12


వ.

ఇట్లు వనంబులోనం గల్గు దుష్టమృగంబుల సమయించు
చున్న సమయంబున నొక్కరక్కసుం గని వాని నొక్క
నిశితశరంబున విగతప్రాణునిం గావించినఁ దత్సహోదరుం
డగు దానవుండు కైతవంబున సూపకారవేషంబు దాల్చి
వచ్చి యారాజుం గాంచి బద్ధాంజలిపుటుం డై రాజేంద్రా
యేను నానావిధవిచిత్రపాకక్రియానిపుణుండ నిన్ను
సేవింపఁగోరి యిటకుం జనుదెంచితి నని విన్నవించిన
భూవిభుం డది యథార్థంబుగాఁ దలంచి వానిం దోడ్కొని
వచ్చి నిజమందిరంబునందుఁ బాకాధ్యక్షునింగా నియమించి
యుండె నంత.

13


సీ.

ఒకనాఁడు ధరణీశుఁ డకలంకమతితోడ
         మృగమాంసమునను బైతృకముఁ జేయ
సంకల్ప మొనరించి శ్రద్ధాసమేతుఁడై
         నిజపురోహితు నిమంత్రితుని జేసి
భోజనం బిడువేళఁ బొలసుదిండి కుబుద్ధి
         నవ్వసిష్ఠునకు నరామిషంబు
వడ్డించిన నెఱింగి వసుధేశుపై నల్గి
         తన కయోగ్యం బైనమనుజపిశిత

తే.

మిడిన దుర్మతి వీవు దైత్యుఁడవు గమ్ము
పొమ్మని శపింప నారాజపుంగవుండు
నిరపరాధుండు గావున గురున కలిగి
యపుడు ప్రతిశాప మిచ్చెదనని తలంచి.

14


క.

కోపంబున జలములు గొని
శాపం బీదలఁచి యున్నసమయంబున నా
భూపాలుని వారించెను
శాపింపక యుండ నతనిసతి శాంతమతిన్.

15


వ.

అప్పు డమ్మిత్రసహుండు నిజభార్యానుకూలుండు గావున
దద్వాక్యంబునకు సమ్మతించి కులగురుం డగువసిష్ఠమహా
మునీంద్రునకుఁ బ్రతిశాపం బిచ్చుట మాని తన ధర్మ
పత్నితో ని ట్లనియె.

16


క.

ఈపగిది నేధరించిన
శాపోదక మిప్పు డెచటఁ జల్లుదు ననినన్
నీపదముల నిడుకొమ్మని
యాపడఁతి వచింప నాతఁ డట్ల యొనర్చెన్.

17


తే.

అటుల గావింప నమ్మానవాధిపతికిఁ
దజ్జలస్పర్శనమునఁ బాదములు గమలెఁ
గాన నది యాదిగాఁగ లోకంబునందుఁ
బరఁగె నాతఁడు గల్మాషపాదుఁ డనఁగ.

18


ఉ.

అంతట నవ్వసిష్ఠుఁడు మహామతి నాత్మసమాధిఁ జూచి గో
రంతయు రాజునందు నపరాధము లేమి యెఱింగి యమ్మహీ
కాంతుఁడు రాక్షసత్వ మెసఁగ న్భువిలోపల ద్వాదశాబ్దప
ర్యంతము సంచరించి మనుజాధిపుఁ డౌనని పల్కెఁ గ్రమ్మరన్.

19

వ.

అంత.

20


సీ.

గురుశాపమునఁ జేసి ఘోరరూపముఁ దాల్చి
          క్రూరుఁడై నిజరాజ్యదూరుఁ డగుచుఁ
గలుషభావముఁ జెంది కల్మాషపాదుండు
          గహనంబుఁ జేరి నిష్కరుణుఁ డగుచు
మృగపక్షిపశువులాదిగ జంతువులఁ బట్టి
          సమయించి వానిమాంసమును దినుచుఁ
గాలంబుఁ గడుపుచుఁ గఠినత్వమున నుండి
          యొకనాఁడు క్షుత్తుచే నోర్వలేక


తే.

యశన మొక్కింత నేమియు నమరకున్న
నొక్కచో విప్రమిథునంబు నొప్పఁ గాంచి
యడ్డముగ వచ్చి తత్సతి యఱచుచుండఁ
గినుక నాద్విజుఁ బట్టి భక్షించె నపుడు.

21


క.

తదనంతరమునఁ దత్సతి
మదయంతీరమణు దనుజమానవనాథున్
మదమత్తుని గనుఁగొని తా
నదయత శోకాభితప్తయై యిట్లనియెన్.

22


పంచచామరము.

తపస్సమాధిఁ జెందియున్న తాపసేంద్రు మత్పతిం
గృపావిహీనబుద్ధిఁ బట్టి మ్రింగి తీవు గావునన్
నృపాధమా భవత్సతిం బరిగ్రహించునంతటన్
వ్య పేతజీవితుండ వౌదు వంచు నిచ్చె శాపమున్.

23


వ.

ఇట్లు కల్మాషపాదునకు భూసురాంగన శాపం బిచ్చి పతి
శల్యంబులతోడన హుతాశనదగ్ధయై దివంబునకుఁ జనియె

నంత నాభూకాంతుండు ద్వాదశాబ్దంబులు నిండిన రాక్షస
భావంబుఁ బరిత్యజించి క్రమ్మర మానుషత్వంబు వహించి
నిజపురంబునకు వచ్చి గురుజనానుజ్ఞాతుండై రాజ్యంబు
సేయుచుండె నాసమయంబున.

24


క.

సురతేచ్ఛ నవ్విభుఁడు నిజ
తరుణిన్ రాఁబనుప నది యుదగ్రం బగు భూ
సురవనితాశాపస్థితి
నెఱిఁగి నివారింప నుండె నింతులగోష్ఠిన్.

25


ఆ.

అట్టు లగుటఁజేసి యారాజుననుమతి
శిష్టుఁ డైన యవ్వసిష్ఠమౌని
యతనిధర్మపత్నియం దశ్మకుండను
సుతుని గలుగఁ జేసె శుభము లలర.

26


శా.

ఆభీలద్విజభామినీప్రకటశాపాప్తి న్సతి న్బాసి తా
"కో భోగో రమణీం వినా" యనెడుప ల్కూహించి నిస్సంగుఁడై
యాభూమీశుఁ డనన్యభుక్తమగురాజ్యంబు న్విసర్జించి పౌ
ర్యాభ్యాసత్వము జెంది భూమి దిరుగన్ యాదృచ్ఛకుండై చనెన్.

27


మ.

సకలోర్వీతలనాయకుండు ధరణీసంచారముం జేయుచోఁ
బ్రకటాభీలకరాళదంష్ట్రలును దుర్గంధాంగదుష్కేశముల్
వికటభ్రూకుటిఫాలముం దనరఁగా వెన్వెంట నేతెంచు కౌ
శికదుస్తారక నొక్కభీకరపిశాచిం గాంచె మార్గంబునన్.

28


ఆ.

అట్టి దుష్పిశాచ మారాజు చేసిన
బ్రహ్మహత్య యనెడు పాతకంబు

వానివెంట నంటె వసుధ నెవ్వరికైనఁ
బూర్వజన్మకృతము పొందకున్నె?

29


చ.

కుటిలపిశాచి గన్పడిన గుండెలు జల్లుమనంగ భూవరుం
డటునిటు చూచి బోరన వనాంతరసీమ లతిక్రమించి యు
త్కటతరభీతి నేఁగుచును దైవవశంబునఁ గాంచె నొక్కచోఁ
జటులతపోధురంధరుని సంయమివంద్యు మహాత్ముఁ గౌతమున్.

30


వ.

ఇట్లు కని సవినయంబుగా దండప్రణామంబు లాచరించి ముకు
ళితకరకమలుం డై యున్న యన్నరపతితో నగ్గౌతమమహా
మునీంద్రుం డి ట్లనియె.

31


మ.

నరనాథోత్తమ నీవొకండ విటు కాంతారప్రదేశంబులం
దరుగం గారణమేమి రాజ్యభరణత్యాగంబుఁ గావించి నీ
పురమున్ రాష్ట్రము భద్రమా నిజవధూపుత్త్రాళికిన్ క్షేమమా
పరిణామంబె భవత్ప్రధానతతికిన్ బంధుప్రియశ్రేణికిన్.

32


క.

మానవనాయక మృదుస
న్మానవచఃప్రియత నిఖిలమానవపతి యౌ
మానవుఁడవు సామాన్యపు
మానవుఁడవె తలఁప నీవు మహితవిచారా.

33


చ.

అనిన నరేంద్రుఁ డిట్లనియె నాదిమునీంద్ర భవత్కృపారసం
బున సతతంబు రాజ్యబలపుత్త్రకళత్రసుహృజ్జనాళి క
త్యనుపమసౌఖ్యము ల్గలుగు నైనను మత్కృతకల్మషంబు దాఁ
గనలి పిశాచరూపమునఁ గన్పడుచున్నది భీషణంబుగన్.

34

క.

గోమేధము లొనరించితి
గ్రామంబులతో రథాశ్వకరివరముక్తా
దామాదికదానంబులు
భూమిసురోత్తముల కొసఁగి పుణ్యుఁడ నైతిన్.

35


ఉ.

చేసితి దానధర్మములు చేసితిఁ దీర్థజలావగాహముల్
చేసితి సువ్రతంబులును జేసితి భూరితరాశ్వమేధముల్
చేసితి దేవపూజలును జేసితి నైన మునీంద్ర తొల్లి నేఁ
జేసిన ఘోరపాపము నశింపకయున్నది యేమి చెప్పుదున్.

36


వ.

అదియునుం గాక యఘాపహరంబులైన ప్రాయశ్చిత్తంబు
లనేకంబు లొనరించితి నైన నిమ్మహాదుష్కృతంబునకు
నిష్కృతి గలుగనేరకున్న యది మహాత్మా కారుణ్యసము
ద్రుండవగు నీప్రసాదంబునం జేసి కృతార్థుండ నగుదు. నీ
బ్రహ్మహత్యాపిశాచంబు పరులకు నగోచరం బై మదీయ
దృష్టిపథంబునం బడి భర్జింపుచు వెనువెంట నంటియున్న
యది విపత్సముద్రంబున మునింగియున్న నన్నుం గడతేర్ప
నావయుంబోలె భవత్సందర్శనంబు సిద్ధించె. నిప్పిశాచంబు
దొలంగునట్లుగా ననుగ్రహింపవలయు నని ప్రార్థించిన
యారాజుం గటాక్షవీక్షణంబుల నిరీక్షించి యగ్గౌతమ
మహామునీంద్రుం డిట్లనియె.

37


క.

ఓకాకుత్స్థకులేశ్వర
సాకేతపురాదినాథ చయ్యన నీ వీ
శోకంబు మాని యిప్పుడు
గోకర్ణస్థలికిఁ జనుము కుశలము గలుగున్.

38


వ.

అది యెట్టిదంటేని.

39

గోకర్ణస్థలమహత్వము.

ఉ.

శ్రీకంఠప్రియమందిరంబు సుకృతక్షేత్రంబు నానాసుప
ర్వాకీర్ణంబు శుభప్రదంబు బహుపాపారణ్యదావాగ్ని యౌ
గోకర్ణస్థలమందుఁ జేరుము భవద్ఘోరాఘము ల్వాయు నెం
తే కైవల్య మొగిం గరామలక మై దీపించు ధాత్రీశ్వరా.

40


క.

గోకర్ణరాజహరుఁడున్
గోకర్ణశయానసఖుఁడు గోపతిసుతుఁడున్
గోకర్ణస్థలవాసుఁడు
గోకర్ణాశనతురంగగురుఁ డొసఁగు సిరుల్.

41


శా.

స్వర్ణస్తేయము బ్రహ్మఘాతము సురాపానంబు గోహత్యయున్
వర్ణాచారవిసర్జనంబు గురువధ్వాసక్తి పైశున్యముం
బూర్ణాహంకృతియుం గృతఘ్నతయునా బొల్పారు పాపాళి గో
కర్ణక్షేత్రముఁ జేరినంతనె విదగ్ధం బై చను న్భూవరా.

42


ఉ.

రావణకుంభకర్ణముఖరాక్షసకోటి భగీరథాదిరా
జావళియున్ మఱిం గలుగుయక్షపతంగమహోరగాదులుం
దేవతలు న్మునీశ్వరులు దిక్పతులుం దప మాచరించి య
ద్దేవునిసన్నిధిస్థలుల ధీరత నిల్పి రనేకలింగముల్.

43


క.

విలసితమగు గోకర్ణ
స్థలమాహాత్మ్యంబు లెన్నఁ దర మేరికిఁ ద
చ్ఛిలలెల్ల లింగములు త
జ్జలములు తీర్థములు సకలజనులు నుతింపన్.

44


క.

అళికాక్షుఁడు శివుఁడు మహా
బలుఁ డన్యాక్రాంతసప్తపాతాళుండై

వలసిన నాగోకర్ణ
స్థలమున బ్రహ్మాండభాండతనువు వెలుంగున్.

45


మ.

అవనీపీఠము వారివాహకలశం బాకాశలింగంబు కై
రవబంధుప్రసవం బినేందుశిఖినేత్రంబుల్ త్రయీవక్త్ర మ
ర్ణవతుందంబు కుభృద్భుజాయుగ మజాండస్వచ్ఛదేహం బధో
భువనాంఘ్రు ల్దనరన్ మహాబలుఁడు దాఁ బొల్పొందు విశ్వాకృతిన్.

46


వ.

మఱియు నమ్మహాబలదేవుమందిరంబునకు బ్రహ్మేంద్రో
పేంద్రులును, వసురుద్రాదిత్యవిశ్వదేవమరుద్గణంబులును,
జంద్రసూర్యాదిగ్రహంబులును, విమానారూఢులయి పూర్వ
ద్వారంబున వసియించియుందురు. మృత్యుచిత్రగుప్తపావ
కశమనసవితృప్రముఖులు దక్షిణద్వారంబున సేవింపుచుందురు.
వరుణుండు గంగాదిమహానదులు వాసును బశ్చిమద్వారం
బున భజనంబు సేయుచుందురు. భద్రకర్ణియును సప్తమాతృ
కలును జండికాదిదేవతలును నుత్తరద్వారంబునఁ గొలిచి
యుందురు. విశ్వావసుచిత్రరథాదిగంధర్వులు గానంబుసేయు
చుందురు. రంభోర్వశీమేనకాతిలోత్తమాద్యప్సరసలు
నమ్మహాదేవునిసాన్నిధ్యంబున నర్తనంబులు సలుపుచుందురు.
వసిష్ఠకశ్యపకణ్వవిశ్వామిత్రదక్షాత్రిభరద్వాజజైమినీజాబాలి
మరీచ్యంగీరసనారదసనకసనందనాదిమహామునీంద్రులు తదు
పరిభాగంబున ధ్యానంబు గావింపుచుందురు. యతిబ్రహ్మ
చారిస్నాతకవ్రతిజటావల్కలాంబరధారులును యోగు
లును ద్వగస్థిమాత్రశరీరులైన తాపసులును నాచంద్రశేఖరు
నారాధింపుచుందురు. దేవగంధర్వకిన్నరకింపురుషచారణ

సిద్ధవిద్యాధరగరుడోరగభూతభేతాళయక్షరాక్షసులును
జంద్రసూర్యవిద్యుత్ప్రతీకాశంబు లైనవిమానంబు లెక్కి
యావృషభధ్వజుముందట నాడుచుఁ బాడుచు జయజయ
శబ్దంబులతో స్తోత్రంబు లాచరింపుచు యథేష్టభోగంబు లను
భవింపుచు నిత్యానందంబున సుఖంబుందు రని చెప్పి యగ్గౌ
తమమహామునీంద్రుండు వెండియు నారాజున కిట్లనియె.

47


ఉ.

అంబుజగర్భుఁ గూర్చి తపమందినవేళ మహాబలాఖ్యలిం
గం బతిభక్తి నిల్పి దశకంఠుండు పూజ యొనర్చె నట్ల హే
రంబకుమారకేశవపురందరమన్మథభద్రకాళికా
బ్జాంబుజసంభవాదులు నిజాహ్వయలింగము లుంచి రచ్చటన్.

48


క.

ఫణిపద్మేలాపుత్త్రక
మణినాగానంతశింశుమారాది మహా
ఫణిరాజులు ఫణివైరియు
ఫణిభూషణు నిలిపి రచట బహులింగములన్.

49


క.

తొల్లి యగస్త్యమహాముని
సల్లలితం బయినతపము సలుపుచు గౌరీ
వల్లభుని భక్తివలనను
ముల్లోకంబులు నుతింప ముదమందె నృపా.

50


క.

కాకుత్స్థ యేమిచెప్పుదు
గోకర్ణమునందుఁ గోటికోటులు లింగా
నీకంబులు గల వన్నియు
శ్రీకంఠమయంబు లగుట సిద్ధము సుమ్మీ.

51

క.

అలవేల్పులలోన మహా
బలదేవుఁడె తలఁప సార్వభౌముఁడు సర్వ
స్థలములలో గోకర్ణ
స్థలమే ముఖ్యంబు మూఁడుజగములయందున్.

52


క.

నీలగ్రీవుఁడు శంభుఁడు
హాలాహలభక్షణుండు హాబలుఁడు ధర
న్నాలుగు యుగములయందును
నాలుగు వర్ణముల వెలయు నరనుతచరితా.

53


వ.

అది యెట్టులనిన కృతయుగంబున శ్వేతవర్ణంబును, త్రేతా
యుగంబున రక్తవర్ణంబును, ద్వాపరంబున బీతవర్ణంబును,
గలియుగంబున గృష్ణవర్ణంబును గలిగియుండు.

54


తే.

మాఖకృష్ణచతుర్దశి మహితబిల్వ
పత్రశివలింగములు దుర్లభములు నాల్గు
నొక్కచోటను సమకూడి యుండెనేని
మనుజులకు ముక్తి గరతలామలక మరయ.

55


తే.

భానుశీతభానుభౌమసౌమ్యసురేజ్య
వారయుక్తదర్శవాసరములఁ
బశ్చిమాబ్ధిఁ దోఁగి పరమేశు భజియించు
నరుల దుష్కృతములు బొరయ వెందు.

56


క.

అతిశయభక్తిశ్రద్ధా
యుతులై యెవరైన నచట నొనరించు జప
వ్రతదానతర్పణక్రియ
యతిసూక్ష్మం బైనమేలు నై ఫలియించున్.

57

ఉ.

సంగరభీమ నీమదిని సంశయమందక యాశ్రయింపు స
త్సంగము భూషణీకృతభుజంగము దేహకళాజితాభ్రమా
తంగము భక్తపుష్కరపతంగము హుంకృతిమాత్రనిర్జితా
సంగము పాపభంగము మహాబలనామకదివ్యలింగమున్.

58


వ.

అని చెప్పి మఱియు నమ్మునీంద్రుండు రాజున కి ట్లనియె.

59


సీ.

కోసలేశ్వర విను గోకర్ణముననుండి
          యరుగుదెంచితి నిప్పు డతిముదమున
నాస్థలంబున నొక యాశ్చర్య మైనట్టి
          చరితంబుఁ గంటి నీశ్వరకృతంబు
తథ్యంబుగాఁగ నంతయు నీకుఁ జెప్పెద
          నాలకింపుము చిత్త మలరుచుండి
మాఖమాసమున నిర్మల కృష్ణపక్షచ
         తుర్దశియందు సంతోషమొదవ


తే.

నమ్మహాబలదేవోత్సవమును జూడ
సకలదేశంబులందుండి జతలుగూడి
సద్విజక్షత్రియాదికసర్వజనులు
చేరఁ జనుదెంచి రచటికి శీఘ్రమతిని.

60


శా.

సౌరాష్ట్రాంగకళింగవంగశకపాంచాలాంధ్రకర్ణాటకా
శ్మీరద్రావిడచోళపాండ్యకురుకాశీదేశభూపాలకుల్
భేరీధంధణధంధణార్భటులు శోభిల్లంగ నచ్చోటికిం
జేరన్వచ్చిరి డోలికాద్విరదవాజిస్యందనారూఢు లై.

61


శా.

శాండిల్యాత్రిమరీచిగౌతమవసిష్ఠవ్యాసకాత్యాయను
ల్మాండవ్యాసితకణ్వకుత్సశుకరామాగస్త్యదూర్వాసులున్

చండాంశుప్రతిమానతేజు లగువిశ్వామిత్రమైత్రేయమా
ర్కండేయాదులు నేముఁ జేరితిమి గోకర్ణేశు వీక్షింపఁగన్.

62


చ.

యతులును బ్రహ్మచారులు గృహస్థవనస్థులు వీతభర్తృకా
సతులును వారకామినులు జారవధూటులు దూతికాజన
ప్రతతులు పంగులంధులును బౌద్ధులు సిద్ధులు యోగులాదిగా
శతనియుతాయుతప్రయుతసంఖ్యలుగాఁ జనుదెంచి రొక్కటన్.

63


తే.

అంత మధ్యాహ్నసమయకృత్యములు దీర్చి
వేడ్క నొక్కతరుచ్ఛాయ విశ్రమించి
వైభవంబులు మెఱయ నీవచ్చునట్టి
ప్రజలఁ గనుఁగొంటి మీక్షణపర్వముగను.

64


క.

ఆలోన వృద్ధమనుజుం
డాలియు నంధయును గటివటచ్చరయుతయున్
లాలామూత్రపురీషక
రాళాంగియు నైనయొకవరాకిన్ గంటిన్.

65


చ.

క్రిమికులసంకులవ్రణయు ఖిన్నమనస్కయుఁ గుష్టురోగజ
శ్రమయును పూయశోణితరసప్రవిదూషితవిస్రగంధియ
క్షమయు బహుక్షుధార్తయు జగత్ప్రతిమానవయాచమానయుం
గుమతియు లోష్టపాణియును గుత్సితరూపియు నై చరింపుచున్.

66


క.

ఆకట మలమల మాడుచుఁ
దేకువ చెడి చేతులొగ్గి దీనత్వమునం
గాకముగతి వాపోవుచు
గోకర్ణక్షేత్రజనులఁ గుయ్యిడఁ దొడఁగెన్.

67

సీ.

బంధుమిత్రజ్ఞాతిపతివివర్జితురాల
         ననుఁ బ్రోవరయ్య యోమనుజులార
కూడునన్నము లేని కులహీనురాలను
         ననుఁ బ్రోవరయ్య యోమనుజులార
కట్టవస్త్రము లేని కష్టజీవనురాల
         ననుఁ బ్రోవరయ్య యో మనుజులార
దుర్గంధదూషితదుష్టవిగ్రహురాల
         ననుఁ బ్రోవరయ్య యో మనుజులార


ఆ.

భోగశూన్యురాల రోగపీడితురాల
నన్నుఁ బ్రోవరయ్య నాథులార
దిక్కుమాలినట్టి బక్కమానవురాలఁ
గరుణ చేయరయ్య సరసులార.

68


చ.

పురహరుపాదపద్మములఁ బూజ యొనర్చినదానఁ గా నుమే
శ్వరుని దినంబులందు నుపవాసము సల్పినదానఁ గాను శం
కరుమహనీయలింగములఁ గన్నులఁజూచినదానఁ గా నయో
నరవరులార నన్ను విడనాడక యన్నముఁ బెట్టి కావరే.

69


సీ.

శ్రీపార్వతీనాథుఁ జింతింపనేరని
         దౌర్భాగ్యురాల నోధన్యులార
పంచాక్షరీమంత్రపఠనం బొనర్పని
         పాపాత్మురాల నోభవ్యులార
చంద్రశేఖరకథాశ్రవణవర్జిత నైన
         దారిద్ర్యురాల నోధీరులార
రజితాద్రినిలయుని భజనంబు సేయని
         భిక్షుకురాల నోదక్షులార

ఆ.

కాసువీసములను కల నైననియ్యని
కష్టురాల నన్నుఁ గావరయ్య
మేలు చేయరయ్య మీకు మ్రొక్కెదనయ్య
ధర్మ మియ్యరయ్య ధనికులార.

70


ఆ.

అనుచుఁ దల్లడించు నంజలి యొనరించు
సకలదిక్కులందు సంచరించు
పేదదీనురాలు పేరాఁకటను జిక్కి
వేఁడఁదగనివారి వేఁడుచుండు.

71


క.

ఈవిధముల వర్తింపఁగ
నావేళ మహేశ్వరవ్రతారాధకు లై
యేవంకఁ దిరిగినను సం
భావింపక నన్న మిడరు ప్రజ లెవ్వారల్.

72


ఆ.

ఆప్రదోషకాలమందు ధూర్తుఁ డొకండు
భిక్ష మనుచుఁ బెట్టె బిల్వదళము
లవి పరిగ్రహించి యశనంబు గాకున్న
ఱాలమీఁదఁ బడఁగ నేలవైచె.

73


ఆ.

అంత నాస మాలి యచ్చోట నుండక
యొనరఁ గాళిగుడికి నుత్తరమున
సొరిదిఁ బవ్వళించి శోషించి శోషించి
చెడుగురండ విగతజీవి యయ్యె.

74


ఉ.

అంతట పార్వతీరమణునాజ్ఞ శిరంబునఁ దాల్చి నిర్మల
స్వాంతులు శాంతులు న్సకలసద్గుణవంతులు నుల్లసద్యశో
వంతులు నైన నల్గురు శివప్రియకింకరు లాక్షణంబ ధీ
మంతులు వచ్చి రంచితవిమానముఁ గొంచు దిశల్‌ వెలుంగఁగన్.

75

వ.

వారలు విభూతిరుద్రాక్షమాలికాధారులును మణిమండల
బ్రాజితగండభాగులును ద్రిశూలఖట్వాంగధారణులును
దివ్యతేజోవిరాజమానులు నై చనుదెంచుచున్నసమ
యంబున.

76


క.

పొంకంబుగ నే నచట ని
రంకుశగతి వచ్చువారి నమలాత్మకులన్
బంకజబాంధవతేజుల
శంకరకింకరులఁ గంటి జగతీనాథా.

77


క.

కని భయభక్తులు వినయం
బును దోపఁగ వారిఁ జూచి పుష్పకధరు లై
చనుదెంచిన మీ రెవ్వరు
చనియెద రెచ్చటికి ననిన సమ్మతి దనరన్.

78


క.

గగనమున నుండి తమనె
మ్మొగమునఁ జిరునవ్వు లొప్ప మోదముతోడన్
నగజారమణునికింకరు
లొగి నిట్లని పలికి రతిమృదూక్తులు వెలయన్.

79


ఉ.

ఇంతకు మున్ను మీరు తగ నిచ్చట నుండఁగ నేఁగినట్టియా
యంత్యజురాలిఁ దెమ్మనుచు నాజ్ఞయిడెం బరమేశ్వరుండును
స్వాంతుఁడు భక్తరక్షకుఁడు సారకృపాబలరాశి గావునన్
సంతస మొప్ప దానిఁ గొని సన్నిధి కేఁగెదమయ్య క్రమ్మఱన్.

80


క.

అని యీవిధమునఁ జెప్పిన
ఘనతరరుద్రాక్షమాలికాధారకులన్
మనసిజహరకింకరులం
గని నే నిట్లంటి వెరపుగలిగినమదితోన్.

81

క.

క్రతుశాల కెక్కఁదగునే
కుతలంబున నీచమైన కుర్కురమునకుం
బతితకు చండాలాంగన
కతిదివ్యవిమాన మెక్క నర్హత గలదే.

82


చ.

వ్రతములు చేసెనో సదుపవాసము సల్పెనొ శంభునామముల్
మతి జపియించి తీరముల మజ్జనమాడెనొ దానధర్మము
ల్గ్రతువు లొనర్చెనో యిపుడ కారణమెట్లు విమానమెక్క స
మ్మతముగ నర్హతయ్యెఁ గసుమాలపు మాలకు దుష్టశీలకున్.

83


మ.

చలిపంది ళ్లొనరించెనో తెరువులన్ సత్రాన్నము ల్పెట్టెనో
కొలఁకు ల్ద్రవ్వెనొ శంకరాచ్యుతులకున్ గుళ్లేమి నిర్మించెనో
స్థలరాజంబుల కేఁగి షోడశమహాదానంబులున్ జేసెనో
భళిరా యిట్టివిమాన మెక్కనగునే పాపిష్ఠచండాళికిన్.

84


శా.

నిత్యానిత్యవివేకము ల్గలిగెనో నిష్ఠారతిం జెందెనో
సత్యోక్తు ల్పచరించెనో శివకథాసల్లాపము ల్చేసెనో
శ్రుత్వాచార్యుల విశ్వసించెనొ ముముక్షుత్వంబు సాధించెనో
యత్యంతాఘవిదూషితాంగికి విమానారోహణం బర్హమే.

85


క.

ఈవార్త తెలియఁ బలుకం
గావలయు మహాత్ములార కారుణ్యమునన్
శ్రీవిశ్వేశ్వరుమహిమలు
భావింపఁగ జగములందుఁ బరమాద్భుతముల్.

86


వ.

అని యడిగిన వారలు దద్వృత్తాంతంబంతయు నీకుం దెలియం
జెప్పెదము వినుమని యాశివకింకరు లిట్లని చెప్పం దొడం
గిరి.

87

సీ.

గౌతమమునిచంద్ర కల దొక్కచరితంబు
         వినుపింతు మది నీవు వినుము తొల్లి
కలఁ డొక్కరుఁడు యజ్వకులసంభవుం డైన
         బ్రాహ్మణుం డాగమపారవేది
యావిప్రున కపత్యమై పుట్టె నొకకన్య
        యది రూపవతి యన నతిశయిల్లు
నట పూటపూటకు నవయవస్ఫురణచేఁ
        బెరుగుచునుండ నత్తరుణిఁ జూచి


ఆ.

తగినవరున కిచ్చి తజ్జనకుండు వే
దోక్తవిధి వివాహ మొనరఁజేసి
నంతఁ గొన్నిదినము లరిగినపిమ్మట
దైవనిహతిఁ జెందె దానిమగఁడు.

88


వ.

అంత.

89


మత్తకోకిల.

వాలుఁగన్నులు వల్దచన్నులు వట్రువైనపిఱుందు నీ లాలకంబులు కెంపుమోవియు నబ్జరాగకరాంఘ్రులుం
బాలచంద్రునిఁబోలు చక్కనిఫాలదేశముఁ గల్గి యా
బాలికామణి యొప్పె నప్పుడు భావజాన్త్రము కైవడిన్.

90


క.

కామాస్త్రంబుల కోర్వక
కామిని నిర్లజ్జ యగుచు గతశేముషి యై
కాముకులఁ గూడి నిరతముఁ
గామక్రీడలఁ జరించెఁ గామాతుర యై.

91


శా.

ఆవిశ్వస్త యనంగ సంగరవినోదాంచద్భుజంగాలితో
గ్రీవాశ్లేషణచుంబనాదిసురతక్రీడావిశేషంబులం

దావర్తింపఁగఁ గాలకర్మగతి నంతర్వత్నియై యున్నచో
నావామాక్షిఁ బరిత్యజించిరి తదీయజ్ఞాతిబంధుప్రియుల్.

92


క.

అంతట నక్కులటయు దే
శాంతరముల నుండ ధనికుఁ డగు నొకవృషలుం
డెంతయు నయ్యింతిం గని
బ్రాంతిం గొని చనియెఁ దనదుభవనంబునకున్.

93


ఆ.

శూద్రనాథుఁ గూడి సురతభోగాసక్తి
నహరహంబు బంధనాదిగతుల
మద్యపానములను మాంసభక్షణములఁ
గాల మొక్కరీతిఁ గడపుచుండె.

94


క.

తరుణి యొకరేయి మధుమద
పరవశ యై మేషమాంసభక్షణపరతం
గరవాలముఁ గొని చనియెను
గొఱియలు వత్సంబు లున్నగోష్ఠంబునకున్.

95


క.

చని తామసమున నాదు
ర్వనితయు మేషం బటంచు వత్సము ఖండిం
చిన నది యాక్రోశింపఁగ
విని శివశివ యనుచు నుడివె విహ్వలమతి యై.

96


మ.

కులటాగ్రేసరి యీగతిన్ మదమునం గోవత్సముం జంపి దో
హలభావం బెసఁగన్ దదర్ధతనుమాంసాహారముం జేసి చం
చలతం జిక్కినభాగ మ ట్లునిచి హా శార్దూల మేతెంచి యి
క్కొలఁదిన్ వత్సముఁ జంపెఁ జంపె నని యాక్రోశించి చాటెన్ బురిన్.

97

క.

దాని విని పౌరులందఱు
నానిశి యేతెంచి వత్స మారసి తథ్యం
బౌ నని తలఁచుచు విస్మిత
మానసులై మరలఁ జనిరి మందిరములకున్.

98


వ.

ఇవ్విధంబున నాకాంత గొంతకాలం బాశూద్రనాయకుం
గూడి యథేచ్ఛావిహారంబుల వర్తించి కాలవశంబునఁ
గృతాంతుపురంబునకుం జనిన సమవర్తియు దానిదుష్కృతం
బులు చిత్రగుప్తువలన నెఱింగి దుర్గతిఁ ద్రోయించిన నదియును
కాలసూత్రాసిపత్రదారుయంత్రతప్తపాషాణశూలారోహణ
వైతరణీకుంభీపాకమహారౌరవాదిఘోరనరకంబు లనుభవించి
దండధరుశాసనంబునఁ గ్రమ్మర మర్త్యలోకంబునందుఁ జం
డాలయోనిం బుట్టి జాత్యంధయుఁ గుష్ఠరుజాక్రాంతయుఁ
గ్రిమిసంకులవ్రణయును బంధువిహీనయు క్షుత్పిపాసాతు
రయు నుచ్ఛిష్టాన్నభోక్త్రియునై భిక్షాటనంబు సేయుచు
సంచరింపుచుండె నని యా చండాలి పూర్వజన్మవృత్తాం
తంబుఁ జెప్పిన విని యాశ్చర్యంబు నొంది యాశివకింకరులం
జూచి యే నిట్లంటి.

99


క.

ఏయేకర్మంబులచే
నీయింతికి సంభవించె నీదురవస్థల్
యేయనువున నిమ్మాలకు
శ్రీయుత మగుశివపదంబుఁ జేరం గలిగెన్?

100


వ.

అని యడిగిన నమ్మహాత్ము లిట్లనిరి.

101


సీ.

అన్నదానవిహీన యైనదోషంబున
          క్షుత్పిపాసార్తయై స్రుక్కుచుండె

కామాంధ యై కన్ను గాననికతమున
          జాత్యంధ యై ధాత్రి సంభవించె
గోవత్సమాంసనిషేవణంబునఁ జేసి
          దా నుద్భవించెఁ జండాలయోని
స్వైరిణి యై యథేచ్ఛావిహారము సల్పు
         ఫలమున నయ్యె దౌర్భాగ్యురాలు


తే.

విధవ యై జారవిద్యల వెలసెఁ గానఁ
గుష్ఠరోగాదిపీడలఁ గుందుచుండె
వృషలసంపర్కమునఁ జేసి విషమవృత్తిఁ
దద్రణక్రిమిబాధలఁ దగిలియుండె.

102


శా.

హాలాపానము మాంసభక్షణము నత్యాసక్తిఁ గావింప హృ
చ్ఛూలాదిప్రరుజావ్యధ ల్గలిగి విక్షోభింపుచున్ ధాత్రిఁ జం
డాలత్వంబు భజించె సువ్రతము లిష్టాపూర్తముల్ లేమి యా
నీలాంగారకవర్ణ యిట్లు తిరిగెన్ నిర్భాగ్యురాలై ధరన్.

103


సీ.

శ్రీకరం బగుమాఖకృష్ణచతుర్దశీ
         దిన మిది శివరాత్రి యనఁగఁ బరఁగు
నీపుణ్యదినమున నీహీనకులజకు
         నశనదూరతయు బిల్వార్చనంబు
సంఘటించెను గాన జన్మాంతరార్జిత
         దోషసంఘంబు నిశ్శేషమయ్యె
నది యటులుండఁ బుణ్యక్షేత్ర మగునీస్థ
         లంబున విడిచెఁ బ్రాణంబు గాన


తే.

బహుతరామేయపుణ్యవైభవముఁ జెంది
భద్రకరమైన కైవల్యపదము నొందె

దేవదేవునికరుణచే నీవిమాన
మెక్కఁగా నర్హురా లయ్యె నివ్వధూటి.

104


మ.

అలగోవత్సముఁ ద్రుంచుచో శివశివా యంచు న్మహాభీతిచేఁ
బలికెం గావునఁ దన్మహామహిమచేఁ బాపాత్మురాలైన ని
ర్మలకైవల్యము నొందె నీశ్వరుకృప న్మౌనీంద్ర యద్దేవు ని
శ్చలభక్తిన్ భజియించుమర్త్యులకు మోక్షప్రాప్తి గాకుండునే?

105


వ.

అని యాచండాలిపూర్వవృత్తాంతం బంతయు నెఱింగించి
యాశివకింకరు లాక్షణంబున నయ్యింతి నద్దివ్యవిమానంబున
నెక్కించుకొని శివలోకంబునకుం గొనిపోవుచుండ నది
యును ననేకదివ్యాంబరాభరణభూషితయు హరిద్రాసు
గంధవిలేపితాంగియు ఘుమంఘుమితామోదపుష్పదామయు
దివ్యతేజోవిరాజమానయు నై భూతంబు లైన జన్మంబులు
దలంచి తలంచి చండాలసంబంధం బైనదుష్కళేబరం బెందుఁ
బోయె నీదివ్యశరీరం బేరీతిఁ బ్రాప్తం బయ్యె నోహో పర
మేశ్వరుమహిమంబుఁ దెలియ నశక్యం బమ్మహానుభావుండు
పత్రమాత్రసంతుష్టుం డై మత్పూర్వకృతంబులైన దురి
తంబులం బరిహరించి నిజసాయుజ్యం బొసంగె నని యాశ్చ
ర్యంబు నొందుచు గంధర్వగానంబు లాకర్ణింపుచు విద్యాధర
కీర్తనంబు లాలోకింపుచుఁ బరమానందంబున విమానా
రూఢ యై శివలోకంబునకుం జని యీశ్వరసాన్నిధ్యంబున
సుఖంబుండె నని చెప్పిన విని గౌతమమహామునీంద్రునకుఁ
గల్మాషపాదుం డి ట్లనియె.

106


క.

నిటలాక్షుఁడు శంభుఁడు ప్ర
స్ఫుటముగ నత్యంతభక్తసులభుఁడు దలఁపన్

జటివర యిక శివలోకం
బెటువంటిది తెలియఁబలుకు మిద్ధచరిత్రా.

107

శివలోకప్రభావము

చ.

అనిన మునీంద్రుఁ డిట్లనియె నజ్జనవల్లభుఁ జూచి భూవరా
వినుము విపజ్జరామరణవేదన లాఁకలి దప్పు లాశలున్
ఘనతరశోకమోహములుఁ గష్టము లెవ్వియు లేక సమ్మదం
బున వసియింపఁగల్గుఁ గృతపుణ్యులకున్ శివలోక మెన్నఁగన్.

108


మ.

ఇనచంద్రాగ్నితటిత్ప్రభాపటల మెందేనిం బ్రకాశింపదో
మునులున్ సిద్ధులు యోగు లెచ్చటను సమ్మోదంబుతో నుందురో
జనసందోహము లెందుఁ జేరినఁ బునర్జన్మంబు లేకుండునో
యనపాయస్థితి నుండు నెద్ది యదియే యాశంభులోకం బగున్.

109


క.

గురుభక్తులు విమలాంతః
కరణులు సాధులు పరోపకారులు కరుణా
పరులును బరతత్త్వజ్ఞులు
చిరకాలం బుందు రదియె శివలోక మగున్.

110


వ.

అని తెలియఁబలికి యారాజుం జూచి నీ వింక నాలస్యంబు చేయ
వలవదు సత్వరంబుగా గోకర్ణక్షేత్రంబునకుం జనుము నీ
దుష్కృతంబు లడంగు నైహికాముష్మికఫలంబులం బొందె
దవు భవిష్యత్కాలంబున భవదన్వయంబున భగవంతుం డైన
నారాయణదేవుండు శ్రీరామనామంబున నవతరింపగలఁడు
దానం జేసి భవదీయవంశంబునకుఁ బునరావృత్తిరహితం బయిన

బ్రహ్మలోకవాసంబు సిద్ధించు నని యానతిచ్చి తాపసోత్తముండు
నిజాశ్రమంబునకుం జనియె నంత.

111


శా.

ఆకల్మాషపదుండు గౌతమమునీంద్రాజ్ఞాప్రకారంబునన్
గోకర్ణంబునఁ కేఁగి యందు విగళద్ఘోరాఘసంవాహుఁడై
శ్రీకంఠున్ శివు నద్రిజారమణునిన్ సేవించి తాఁ గ్రమ్మరన్
సాకేతంబున కేఁగుదెంచి నిజరాజ్యం బేలె ధర్మస్థితిన్.

112


క.

కువలయనాథుం డీగతి
ప్రవిమలమతి రాజ్య మేలి భక్తిపరుం డై
శివుఁ దలఁచుచు నంతంబున
శివలోకంబున వసించె సిద్ధనుతుండై.

113


క.

గోకర్ణమహిమయుత మగు
నీకథ నెవరైన విన్న నెవరు జదివినన్
బ్రాకటవిభవాన్వితులయి
శ్రీకంఠునిపదమునను వసింతురు వారల్.

114


వ.

అని యిట్లు సూతుండు శౌనకాదిమహామునులకుం జెప్పిన
విని సంతోషభరితాంతఃకరణులయి క్రమ్మర సూతున కి ట్లనిరి.

115


క.

సుజ్ఞానివి నిఖిలపురా
ణజ్ఞుండవు రోమహర్షణతనూభవ నీ
ప్రజ్ఞాబల మతివిస్మయ
మజ్ఞులు దెలియరు భవన్మహత్వము తలఁపన్.

116


క.

స్ఫురితంబులు బహుసంప
ద్భరితంబులు శుభకరములు భర్జితనానా

దురితంబులు పరమేశ్వరు
చరితంబులు వినిన జన్మసాఫల్య మగున్.

117


వ.

అని యడిగిన యమ్మునులకు సూతుం డి ట్లనియె.

118

దీపకళికాప్రదానప్రభావము

తే.

అసితసితపక్షములఁ జతుర్దశులయందు
దీపమాలిక లర్పించు ధీరమతులు
మహితసుజ్ఞాను లగుచు సామ్రాజ్యపదముఁ
జెందియుందురు శ్రీసాంబశివునికృపను.

119


వ.

ఇందులకు వక్తృశ్రోతృమనోరంజనం బయినయొక్కయితి
హాసంబు గలదు దానిం జెప్పెద నాకర్ణింపుం డని సూతుం
డమ్మునుల కి ట్లనియె.

120

దాశరాజుచరిత్రము

తే.

జనమనోహర మగుచు నిషాద మనఁగ
నొక్కదేశంబు మహితమై యొప్పుచుండుఁ
దద్విషయ మేలుచుండును దాశరాజ
నామధేయంబు గల్గిన నరవరుండు.

121


తే.

ఆనిషాదాధినాథుండు హర్ష మెసఁగ
హరిణనయన కుముద్వతి యనఁగఁ బరఁగు
రాజకన్యక వరియించి తేజ మలర
లీల నిజదేశ మెలమిఁ బాలింపుచుండె.

122


శా.

ఆదాశక్షితిపాలుఁ డెంతయును భక్ష్యాభక్ష్యలోలుండు మ
ర్యాదాతీతపథప్రవర్తనుఁడు శిష్టాచారహీనుండు స

ద్వేదప్రోక్తబహుక్రియారహితుఁడున్ స్వేచ్ఛావిహారుండు నా
నాదుర్జాతికులాంగనారతుల నానందించు నెల్లప్పుడున్.

123


చ.

మఱియును భూవరుండు శివమందిరగోపురమండపంబులున్
స్థిరమతితో రచించి హితచేష్ట సహస్రఘటాభిషేకముల్
సురుచిరదీపమాలికలు సొంపుగ బిల్వదళార్చనంబులున్
సరసమహోత్సవంబులును సల్పు మహేశ్వరభక్తియుక్తుఁడై.

124


క.

ఈరీతిని వర్తింపఁగ
నారాజుం జూచి సంశయాత్మక యగుచున్
ధీరమతిఁ దత్కళత్రం
బీరసమున నిట్టు లనియె నేకాంతమునన్.

125


క.

భూపాల దురాచార
వ్యాపారము గల్గి నీవు వర్తింపుచు గౌ
రీపతి చంద్రకళాధరు
శ్రీపరమేశ్వరుని భక్తి సేవింతు వొగిన్.

126


సీ.

జననాథ వినుము భూజననింద్య మగుదురా
         చారంబు నీ కెట్లు సంభవించె
నటమీఁద మూఢుల కతిదుర్లభం బైన
         యీశ్వరభక్తి నీ కెట్లు కలిగె
నేవేళలందైన నిల నైకమత్యంబు
         గలుగునే దీపాంధకారములకు
నటుగాన సువివేక మవివేకమును రెండు
         నొకచోట నీయంద యునికిఁజేసి

తే.

యిది విచిత్రం బటంచు నా మదికిఁ దోఁచె
దీనికలరూపు జెప్పి సందేహ ముడుపు
మనుచుఁ బ్రార్థించి యడిగిన నాత్మమహిషి
యగుకుముద్వతితో నిట్టు లనియె విభుఁడు.

127


క.

విను నే పూర్వభవంబున
మును పంపానగరమందు ముదము దలిర్పన్
శునకము నై చరియింపుదు
ననిశంబును క్షున్నివారణాసక్తమతిన్.

128


క.

ప్రతిగృహము నెపుడు దిరుగుచు
నతిశయజనభుక్తశేష మాతురమతినై
గతుకుచు వీథుల నుండుచుఁ
గతిపయసంవత్సరములు గడపితి నచటన్.

129


తే.

అంత నొకమాసశివరాత్రియందుఁ బౌరు
లాశ్రితావసుఁ డగు విరూపాక్షుగుడికి
నరిగి యమృతాభిషేకంబు లాచరించి
దీపమాలిక లొసఁగిరి తేజ మెసఁగ

130


క.

దిక్కులఁ గల సకలజనుల్
మక్కువతో నరిగి దీపమాలిక లొసఁగన్
ముక్కంటిభవన మప్పుడు
చుక్కలమండలమురీతి శోభిల్లెఁ గడున్.

131


వ.

ఇ ట్లున్నసమయంబున.

132


మ.

బలిపీఠస్థిత మైనతత్కబళమున్ భక్షింపఁగాఁ బోయి ని
శ్చలతేజంబున నుండుదీపవితతుల్ సంప్రీతి నీక్షింపుచున్.

విలసన్నామసహస్రపాఠరవముల్ వేదధ్వనుల్ వించు నే
నిలువన్ గాంచి మహీసురుల్ కుపితులై నిందించి దండిపఁగన్.

133


క.

అచ్చోటు వాసి చనిచని
యచ్చుగ బలికబళభక్షణాతురమతి నై
వచ్చుచుఁ బోవుచు నుండఁగ
నచ్చటి బాలకులు గొంద ఱత్యుద్ధతు లై.

134


మ.

కరుణాహీనత ఱాలఱువ్వఁగను గైకైశబ్దముల్ సేయుచున్
మరలన్ బాఱుచుఁ గ్రమ్మఱం జనఁగ దుర్మార్గప్రచారుల్ ధను
ర్ధరవీరుల్ ననుఁ గాంచి శాతశరసంధానంబుఁ గావించి భీ
కరలీలన్ బడనేసి రప్పుడు శివాగారప్రదేశంబునన్.

135


వ.

మహేశ్వరనివాసం బైనయప్పుణ్యక్షేత్రంబునఁ గృష్ణచతుర్దశీ
ప్రదోషపుణ్యకాలంబున నిరశనత్వంబు నొంది విరూపాక్షు
సాన్నిధ్యంబున దీపమాలికాలోకనం బాచరింపుచు మృతిఁ
బొందుటంజేసి నికృష్టం బైనశ్వానకళేబరంబు విడిచి దివ్య
దేహంబుఁ దాల్చి విమానరూఢుండ నై కొంతకాలంబు
స్వర్గభోగంబు లనుభవించి క్రమ్మఱ నిషాదదేశంబునకు
రాజనై జన్మించితి యిది నాపూర్వవృత్తాంతంబు నాకుఁ బ్రియ
పత్నివి గావున నీరహస్యంబు నీకుఁ దెలియ ననుగ్రహించితి.
కుముద్వతీ! నీవును నప్పరమేశ్వరు భజియింపు మద్దేవుండు
మహానుభావుండు భక్తవత్సలుండు పరమపురుషుండు భోగ
మోక్షప్రదుండు మృత్యుంజయుండు సర్వభూతదయా
పరుండు నీకు నిహపరసౌఖ్యంబు లొసంగునని చెప్పిన నాశ్చ

ర్యంబు నొంది క్రమ్మర ప్రాణవల్లభుం గనుంగొని యక్కా
మిని యిట్లనియె.

136


ఆ.

భూవరేంద్ర నీకుఁ బూర్వజన్మజ్ఞాన
మెట్లు కలిగె ననిన నింతి కనియె
నభవదీపమాలికాలోకనంబున
జ్ఞానసిద్ధి నాకు సంభవించె.

137


చ.

పరకృతదీపమాలికలు బాగుగఁ జూచుటఁ జేసి చయ్యనన్
నిరుపమదివ్యబోధమహనీయుఁడ నైతి నికృష్టమైన కు
ర్కురతనువుం ద్యజించి నృపకుంజరదేహముఁ గంటి గాన శం
కరునకు భక్తిపూర్వకముగా నొనరించితి దీపమాలికల్.

138


క.

అని నుడివిన నిజవల్లభుఁ
గనుఁగొని యిట్లనియె నతనికాంతామణి యో
జననాథ త్రికాలజ్ఞుఁడ
వనుపమసుజ్ఞాని వగుట యంతయుఁ దెలిసెన్.

139


క.

భూపాలక! నీపూర్వ
వ్యాపారముఁ దెలియఁ బలికినట్లుగఁ గృపతో
నాపూర్వజన్మవృత్తం
బీపట్లను దెలియఁ బలుకు మేకాంతముగన్.

140


వ.

అని యడిగిన కుముద్వతికిఁ దత్ప్రాణవల్లభుం డిట్లనియె.

141


ఉ.

ఓగజగామినీ! వినవె యొప్పుగఁ బూర్వభవంబునందు మున్
శ్రీగిరికూటమందు విహరింతువు నీవు కపోతివై యదృ
చ్ఛాగతమాంసఖండము రయంబునఁ గొంచుఁ జనంగ నంతలో
డేగయు వచ్చె నొక్కటి కడిందిబలంబున నామిషార్థియై.

142

శా.

రౌద్రాస్యం బగుదానిఁ జూచి నిధనత్రాసంబు సంధిల్లఁగా
రుద్రాగారము చుట్టునుం దిరుగుచున్ గ్రోధంబుతో శ్యేన మ
క్షుద్రంబై వెనువెంటనంటి తఱుమన్ శోషించి పోలేక శీ
తాద్రిస్వామిసుతామనోహరుధ్వజస్తంభంబుపై వ్రాలినన్.

143


క.

శ్యేనం బత్యంతకృపా
హీనత గలబుద్ధితోడ నేతెంచుచుఁ ద
త్ప్రాణము హరించి మగుడం
గా నరిగె నిజేచ్ఛ మాంసఖండముఁ గొనుచున్.

144


క.

పురహరమందిరనరగో
పురములకుఁ బ్రదక్షిణముగఁ బోవుటకతనన్
ధరణీశకన్య వగుచును
దరుణీ! జనియించి తీవు తత్సుకృతమునన్.

145


క.

పంకజముఖి! నీ విఁక నహి
కంకణు జగదీశు నీలకంఠు నుమేశున్
శంకరు నారాధింపుము
సంకటము లణంచి సకలసంపద లొసఁగున్.

146


వ.

అని యివ్విధంబునఁ దనపూర్వజన్మవృత్తాంతం బెఱింగించిన
విని యాశ్చర్యంబు నొంది యాకుముద్వతి పరమానందం
బున నిజమనోహరుం డైన దాశరాజున కి ట్లనియె.

147


శా.

నీలగ్రీవమహోత్సవార్చనముల న్నిత్యంబుఁ గావింపుచున్
గాలజ్ఞానముఁ గల్గియుండుదువు నీకంటెన్ ఘనుం డెవ్వ డీ
భూలోకంబున నట్లు కావున మనస్ఫూర్తిన్ దగన్‌ వేఁడెదన్
హాళిన్ నా కెఱిఁగింపఁగాఁదగు భవిష్యజ్జన్మవృత్తాంతముల్.

148


వ.

అనిన నమ్మానవతికి యారాజేంద్రుం డి ట్లనియె.

149

క.

దేవీ! నీమృదుభాషలు
భావింప సుధారసములు పరు లెవ్వారున్
నీవలె నడుగ న్నేరరు
భావిభవంబులను దెలియఁ బలికెద వినుమీ.

150


తే.

పద్మదళనేత్రి యాగామిభవమునందు
సింధురా జన ధాత్రిఁ బ్రసిద్ధిఁ గాంతు
సృంజయేశ్వరపుత్రివై చెలఁగి నీవు
నన్నుఁ బతిగాఁ గ్రహించెదు సన్నుతముగ.

151


క.

ఆరయఁ దృతీయభవమున
సౌరాష్ట్రాధీశుఁ డనఁగ జనియింతు భువిం
గూరిమి గళింగరాజకు
మారిక వై నను వరించి మనియెదు తరుణీ!

152


క.

బంధురచతుర్థభవమున
గాంధారప్రభుని నన్ను ఘనమాగధివై
గంధగజయాన ప్రేమము
సంధిల్లఁగఁ గూడె దీవు సరసత మీఱన్.

153


చ.

వనజదళాక్షి పంచమభవంబున నేను నవంతిరాజ నై
జననము నొంది బాహుబలసంపదఁ బెంపు వహించియుండ నీ
వనుపమలీల భూనుతదశార్ణమహీపతికూర్మిపుత్త్రివై
నను వరియింపఁగాఁ గల వనారతమోహపరీతచిత్తవై.

154


మ.

మరలన్ షష్ఠభవంబునందుఁ దగ బ్రహ్మావర్తదేశంబునన్
ధరణీనాథుఁడ నై జనించి చెలువందం ధాత్రిఁ బాలింపుదున్
దరుణీ నీవు యయాతివంశమునఁ గన్యారత్న మై పుట్టి మ
త్కరపద్మగ్రహణం బొనర్పఁగల వత్యాంతానురాగంబునన్.

155

సీ.

పద్మాక్షి వినుము సప్తమజన్మమున నేను
         బాండ్యరాజని ధాత్రిఁ బ్రబలుచుందుఁ
బద్మవర్ణాభిఖ్యఁ బరఁగి దానక్షాత్ర
         సాహసదైర్యాదిసద్గుణములఁ
బద్మమిత్రప్రభ భాసిల్లుచుండుదు
         వైదర్భివై నీవు వన్నె కెక్కి
వసుమతి యనుపేర వర్ధిల్లి భోగసౌం
         దర్యాతిశయములఁ దనరుచుందు


తే.

వంత సకలార్థవిదులు దేశాధిపతులు
వచ్చియుందురు నీస్వయంవరమునకును
జెలువుమీఱంగ దమయంతి నలునిమాడ్కి
నను వరింతువు రాజనందనుల విడిచి.

156


మహాస్రగ్ధర.

అంతన్ గాంధారసాళ్వాద్యఖిలనృపతులున్ హైహయుల్ మాగధాంధ్రుల్
కుంతప్రాసాంకుశోద్యద్గురుతరకరులై ఘోరసంగ్రామకాంక్షం
బంతంబు ల్మీఱ భేరీపటుపటహలసద్భాంకృతుల్ మిన్ను ముట్టన్
దంతిప్రాముఖ్యసేనాతతి గొలువ మహోద్దాములై వత్తు రల్కన్.

157


శా.

చండాటోపతఁ జుట్టుముట్టిన పరక్ష్మాపాలురన్ దీప్తకో
దండజ్యాప్రవిముక్తతీవ్రశరసంధానార్తులం జేసి వే
దండస్యందనఘోటకాదుల మహోద్యద్దోర్బలస్ఫూర్తిచే
ఖండీభూతులఁ జేసి తెత్తు నిను ఢక్కారావముల్ మ్రోయఁగన్.

158


తే.

అంత నగరంబునకు వచ్చి హర్ష మెసఁగఁ
బ్రేమ శుభలగ్నమున నిన్నుఁ బెండ్లియాడి

యశ్వమేధాదియాగంబు లాచరించి
బ్రాహ్మణుల కిత్తు విత్త మపారముగను.

159


వ.

ఇవ్విధంబున సకలప్రజానురంజనంబుగా బహువర్షంబులు
రాజ్యంబుఁ బాలించి యనంతరంబున నిజనందనునకుఁ
బట్టంబు గట్టి తపోవనంబునకుం జని యచ్చట నగస్త్యమహా
మునిం గాంచి వినయంబునం బ్రణమిల్లి యమ్మహాత్మునివలన
నాత్మవిజ్ఞానంబు వడసి కొంతకాలంబునకు దేహంబులు
విడిచి పునరావృత్తిరహితంబైన శివలోకంబున శివసాయు
జ్యంబు నొంది యుండుదుము అటుమీదట జన్మంబు లేదని
భవిష్యత్కాలవృత్తాంతంబులు చెప్పిన విని యాకుముద్వతి
మహాశ్చర్యంబు నొంది పరమేశ్వరప్రభావం బింత యొప్పునే
యని యగ్గించి నిజవల్లభుం డైనదాశరాజుం బూజించి
యితండు సర్వజ్ఞుం డని తలంచి వెండియు నమ్మానవతి
యి ట్లనియె.

160


క.

శ్వానం బెక్కడ విమల
జ్ఞానంబు వహించి సకలసామ్రాజ్యంబుల్
దానొంది శివపదంబున
నానందముతో వసించు టద్భుత మరయన్.

161


వ.

అని పలికి తదనంతరంబున నాదంపతులు మహాదేవుం డైన
శ్రీవిరూపాక్షు నారాధింపుచు ననేకసంవత్సరంబులు
సౌఖ్యంబు లనుభవించి మఱియు సప్తజన్మంబులు రాజ్యంబు
పాలించి యంత్యంబున శివసాయుజ్యంబు నొంది రని చెప్పి
సూతుం డి ట్లనియె.

162

క.

సదమల మగునీచరితముఁ
జదివిన వ్రాసినను వినిన జనములు బహుసం
పద లనుభవించి శాంకర
పదమున వసియింతు రెపుడు భద్రాత్మకులై.

163


క.

శివుఁడే దేవుఁడు జీవుఁడు
శివుఁడే బంధుఁడు గురుండు శివుఁడే పరుఁడున్
శివుఁడే రక్షకుఁ డరయఁగ
శివుఁడే తారకుఁడు సకలజీవులకెల్లన్.

164


ఆ.

శివున కర్పితముగఁ జేసినధర్మంబు
స్నానదానయుగము జపము తపము
గొంచె మైన నదియు కోటిశతాధిక
గుణిత మగుచు మిగులఁ గోర్కు లొసఁగు.

165


ఆ.

సిద్ధభక్తితోడ శివున కర్పించిన
పత్రపుష్పమూలఫలజలాదు
లల్పమైన నది యనల్పఫలం బిచ్చు
సంశయంబు వలదు సత్య మరయ.

166


క.

తనసుతునందు సుపార్జిత
ధనమందును గలుగుప్రీతిఁ దనరఁగ శివపూ
జన మాచరించువారల
కనిశము నిష్టార్థసిద్ధి యగు టబ్బురమే?

167


సీ.

శంభుఁ బూజించుహస్తంబు హస్తంబులు
          శితికంఠుకథ విన్నశ్రుతులు శ్రుతులు
శివవందనము చేయుశీర్షంబు శీర్షంబు
          ప్రమథేశుఁ గీర్తించురసన రసన

చిత్తజారి భజించు చిత్తంబు చిత్తంబు
        దేవదేవు నెఱుంగు తెలివి తెలివి
భవునకు వలగొన్నపదములు పదములు
        ద్రిపురాంతకుని చూచుదృష్టి దృష్టి


తే.

భూతనాథునిపైఁ గలబుద్ధి బుద్ధి
భర్గుమహిమల నుడివినపలుకు పలుకు
విశ్వనాథుని దెలిపెడువిద్య విద్య
హరునియెడ భక్తి గలిగిననరుఁడు నరుఁడు.

168


చ.

పురుషులు షండు లంగనలు పుల్కసహూణకరూశకాదిసం
కరజనశీలవృత్తు లడుగన్ బనిలే దెవరైన పార్వతీ
శ్వరుభజనం బొనర్చిన నవారితసంసృతిబంధముక్తులై
దురితవిదూరులైముదముతోవసియింతురు శంభుసన్నిధిన్.

169


క.

అని మునులకు సూతుం డి
ట్లను నీయర్థంబునకు మహాద్భుతము సనా
తన మగునొకయితిహాసము
వినుపించెద వినుఁడు మీరు వీనులు దనియన్.

170

చంద్రసేనమహారాజుచరిత్రము

ఉ.

సజ్జనసంశ్రితంబు బలశాసనపట్టణసన్నిభంబు సం
పజ్జలజేక్షణామణినివాసము శాత్రవరాడభేద్యమై
ముజ్జగమందుఁ బేరుగ సమున్నతగోపురభర్మహర్మ్యమై
యుజ్జయినీపురంబు దగ నొప్పుచు నుండు వసుంధరాస్థలిన్.

171


ఉ.

ఆనగరంబునందు గుసుమాస్త్రసమానుఁడు లబ్ధసప్తసం
తానుఁడు మార్గణాలయనిధానుఁడు శాత్రవవాహినీతమో

భానుఁడు భవ్యకాంతిహిమభానుఁడు దుష్కలుషాటవీబృహ
ద్భానుఁడు చంద్రసేనుఁ డనుపార్థివుఁ డేలుచునుండు నెప్పుడున్.

172


క.

ఆభూపతి నిజరాష్ట్రము
వైభవమున నేలుచుండ వసుమతి గ్రహపీ
డాభీలమహోత్పాత
క్షోభంబులు లేకయుండె సుస్థిరలీలన్.

173


ఉ.

బంగరుకొండ ధైర్యమున భవ్యపయోధి గభీరమందు సా
రంగధరుండు రూపమున రాముఁడు బాహుబలంబునందుఁ జం
ద్రాంగదుఁ డంబికాధవపదాంబుజనిశ్చలభక్తి నౌర రా
సింగము చంద్రసేననృపశేఖరుఁ బోల్పఁగ లేరు ధారుణిన్.

174


తే.

ఆనృపాలుండు సతత మభ్యాగతులకు
యోగులకు సిద్ధులకును వైరాగులకును
నర్థికులకును గోరినయర్థవితతి
నిండువేడుక నొసఁగుచు నుండు నంత.

175


ఉ.

సారవిభూతిలేపనము శారమృగాజినశాటిదండముం
గారుడలింగము న్మెఱయఁగా శివయోగికులావతంసుఁ డౌ
ధీరుఁడు మాణిభద్రుఁ డరుదెంచె మహేశ్వరపాదభక్తి యొ
ప్పారఁగఁ జంద్రసేనజనపాలుని జూడ దయార్ద్రచిత్తుఁడై.

176

మాణిభద్రుండు చంద్రసేనమహారాజునకు జింతామణి నిచ్చుట

ఉ.

వచ్చినయోగివర్యునకు వందనకృత్యము లాచరింపుచున్
మచ్చిక మాటలాడుచును మజ్జనభోజనపానశయ్యలన్
హెచ్చుగ బ్రీతిసేయుచు నభీష్టగతిం దనరార నాత్మలో
మెచ్చి యొసంగె రాజున కమేయము నూత్నము దివ్యరత్నమున్.

177

తే.

ఇట్లు శివపారిషదముఖ్యుఁ డిద్ధయశుఁడు
మాణిభద్రుండు దీప్తమౌ మణి యొసంగి
చంద్రసేననృపాలు హస్తంబు పట్టి
యిష్టసల్లాపములతోడ నిట్టు లనియె.

178


క.

సంతతము దాల్పు మిది య
త్యంతశుభంబులు నమేయధనము లొసఁగు శ్రీ
మంతం బని యానృపునకు
జింతామణిమహిమ జెప్పి శివయోగి చనెన్.

179


క.

ఆరాజు దివ్యమగుచిం
తారత్నము గళమునందు ధరియించి మహో
దారుఁడు కౌస్తుభధరుఁ డగు
నారాయణు నట్లు వెలిఁగె నరసుతుఁ డగుచున్.

180


చ.

రవినిభ మైనయమ్మహితరత్నము సోఁకినయంతమాత్రనే
ప్రవిమలకాంచనంబు లగుఁ బన్నుగ సీసకతామ్రలోహలౌ
ష్టవము లటుండనిమ్ము మునిసత్తములార తదీయసుప్రభా
లవపరిమిశ్రవస్తువులు లాలితహేమమయంబులౌఁ దగన్.

181


ఆ.

ఆనృపాలచంద్రు నంతఃపురంబునఁ
గలుగునట్టివేదికాకవాట
సౌధకుడ్యభాండశయనాసనద్వార
చయములెల్ల హేమమయము లయ్యె.

182


క.

క్ష్వేళాహారుం డభవుఁడు
వ్యాళవిభూషణుఁడు నైనవరదునకు మహా
కాళేశ్వరునకును మహా
కాళికి నారాజు సేవఁ గావించు దగన్.

183

ఉత్సాహ.

చంద్రశేఖరోల్లసత్ప్రసాదలబ్ధరాజ్యుఁడై
చంద్రసోదరీకటాక్షజాతభోగబాగ్యుఁడై
చంద్రచంద్రికాపటీరసౌమ్యకీర్తిసాంద్రుఁడై
చంద్రసేనుఁ డుర్వి యేలె సమ్మదంబు వర్ధిలన్.

184


ఉ.

సాంద్రయశోవిశాలుఁడును సత్యవిరాజితభారతీహరి
శ్చంద్రుండు కార్తికేయనిభశౌర్యుఁడు మందరతుల్యధైర్యని
స్తంద్రుఁడు నైనయానృపతిసత్తమువైభవ మేమి చెప్ప య
క్షేంద్రమహేంద్రసంపదల కెక్కుడునై విలసిల్లు నెంతయున్.

185


తే.

ఇవ్విధంబున సామ్రాజ్య మేలుచుండ
దేవలబ్ధానుభవ మని తెలియలేక
నతనివిభవంబు సర్వంబు నపహరింత
మని తలంచిరి యన్యదేశాధిపతులు.

186


శా.

సౌరాష్ట్రాంగకళింగవంగకురుపాంచాలాంధ్రగాంధారసౌ
వీరావంతికరూశకేకయశకాభీరాదిభూపాలకు
ల్వీరాగ్రేసరు లొక్కమొత్తమున పృథ్వీభాగ మల్లాడఁగాఁ
దా రేతెంచిరి చంద్రసేనవిజయార్థం బుద్ధతాటోపులై.

187


చ.

ధరణితలంబు గ్రక్కదలఁ దారలు డుల్లఁ జమూపరాగ మం
బరమణి గప్ప భూమిధరపఙ్క్తి చలింప దిశామతంగ
జోత్కరములు మ్రొగ్గ నప్పుడు గదాముసలక్షురికాసికాధను
శ్శరధరులై తదీయు లగుసైన్యపతు ల్చనుదెంచి రుద్ధతిన్.

188


వ.

ఇట్లు వచ్చి.

189


క.

కట్టల్క నమ్మహీశులు
ముట్టడి గావింత మొక్కమొగి నుజ్జయినీ

పట్టణమున కని సేనల
దిట్టముగాఁ బనిచి రపుడు ధీరోద్ధతులై.

190


క.

అత్తఱి నాజనపతి యీ
వృత్తాంతము విని పురంబువెలుపల బరభూ
భృత్తులు చేరుట కెంతయు
జిత్తంబున భయము దోఁపఁ జింతిలుచుండెన్.

191


ఉ.

ఈనరనాథయాధపు లనేకులు వీరలతోడ సంగరం
బే నొనరింపఁజాలఁ బరమేశ్వరుఁడే యిఁక నాకు ది క్కటం
చానగరంబువాఁకిట మహారథుల న్నియమించి యంతటన్
సూనశరారికిన్ శరణుజొచ్చె దృఢీకృతచిత్తవృత్తియై.

192


చ.

కమలభవుండు సారథిగఁ గర్బురశైలము కార్ముకంబుగా
క్షమ యరదంబుగాఁ ధరణిచంద్రులు చక్రయుగంబుఁ గాఁగ వే
దములు తురంగమంబులుగ దానవవైరి శరంబుఁగా భుజం
గమపతి మౌర్విగాఁ దగుమృగాంకధరుం ద్రిపురారి గొల్చెదన్.

193


వ.

అని నిశ్చయించి.

194


క.

శూలాయుధుఁ డైనమహా
కాళేశ్వరుగుడికిఁ జేరి ఘనమతి నభిషే
కాలంకారక్రియలను
మాలూరదళార్చనము లమర్చను భక్తిన్.

195


చ.

మఱియు సుగంధధూపములు మానితగోఘృతదీపమాలికల్
సురుచిరభక్ష్యభోజ్యములు చోష్యఫలాద్యమృతోపహారము
ల్నిరుపమమంత్రపుష్పము లనేకములైనప్రదక్షిణంబులున్
గురుతరవందనంబులును గోరి యొనర్చెను జంద్రమౌళికిన్.

196

వ.

మఱియు నమ్మహీనాథుండు నిజమంత్రిపురోహితసామంత
విద్వజ్జనభూసురపరివృతుండై మహోత్సవంబుగా [1]శివపూజ
నంబులు సేయింపుచుండ నద్దేవతాలయంబు నిరంతరబ్రహ్మ

ఘోషంబులును, భేరీభాంకరణంబులును, శంఖకాహళ
ఘంటాఘణఘణాత్కారంబులును, బహువిధమృదంగడమరు
డిండిమనాగస్వరపటహవేణువీణాదిహృద్యవాద్యంబులును,
నర్తకధిమిధిమిధ్వానంబులును, గాయకగానరవంబులును,
స్తోత్రపాఠకవిరావంబులును గలిగి పౌరజనసంకులంబై
కృష్ణాగురుగుగ్గులుదశాంగాదివాసితంబును, గర్పూరనీరా
జనాలంకృతంబును నై భాసురం బై యుండె నవ్విధంబున
నమ్మహాదేవునకు మహోత్సవంబుఁ గావింపుచు మహీ
నాథుండు నిరశనవ్రతుండును, నిశ్చలభక్తియుక్తుండును,
దృఢమనస్కుండును, గించిదున్మీలితలోచనుండును, దదేక
నిష్ఠాగరిష్ఠుండును నై యద్దేవదేవు నిట్లని స్తుతియించె.

197


చ.

జయజయ పార్వతీరమణ! చంద్రకళాధర! నీలకంధరా!
జయజయ ఫాలలోచన! గజాసురభంజన! మౌనిరంజనా!
జయజయ భద్రకేతన! భుజంగవిభూషణ! భక్తపోషణా!
జయజయ వామదేవ! దనుజాంతకసాయక! లోకనాయకా!

198


సీ.

భువనంబులకు నుపద్రవముఁ గావించిన
        హాలాహలంబెల్ల నాహరించి
లోకభయంకరాలోకనంబులు గల్గు
        త్రిపురదానవుల నిర్జించి మించి
యమరకంటకు లైనయంధకాసురగజా
        సురులను ఖండించి సురలఁ బ్రోచి
తాపసానీకసంత్రాణనార్థంబుగా
        వ్యాఘ్రాసురధ్వంస మాచరించి

తే.

యఖిలజగములఁ బ్రోచు నయ్యష్టమూర్తి
చారుతరమూర్తి గీర్వాణచక్రవర్తి
దుర్మదాహితకోటులఁ దొలఁగఁ ద్రోచి
చిరకృపాదృష్టి మమ్ము రక్షించుఁగాత.

199


క.

పురహర భవహర గిరిశ
స్మరహర మృత్యుహర శైలజావర శంభో
హరహర యనుచును బలుమఱు
నరనాథుఁడు సన్నుతించె నరవాహసఖున్.

200


క.

అని మఱియును బహువిధముల
వినుతులు గావింపుచును బవిత్రచరిత్రుం
డనఘుఁడు ధరణీకాంతుం
డనయముఁ జింతింపుచుండె హరుపాదములన్.

201


క.

అచ్చటివేడుకఁ జూడఁగ
విచ్చలవిడిగాఁగ వీథివీథులవెంటన్
వచ్చుచుఁ బోవుచు నుండిరి
యచ్చుగ నాబాలవృద్ధ మప్పురిజనముల్.

202


ఉ.

అంతటఁ బంచహాయనవయస్కుని బాలకు నెత్తికొంచు న
క్కంతువిరోధిఁ జూడఁగ నొకానొకవిప్రియ గోపకాంత యా
చెంత వసించి యచ్చటివిశేషములన్ బరికించి ధారుణీ
కాంతుఁడు చేయుపూజఁ గని క్రమ్మఱ నేఁగెఁ గుటీరవాటికిన్.

203


వ.

అని చెప్పి సూతుం డి ట్లనియె.

204

గోపబాలునిచరిత్రము

సీ.

వినుఁడు సంయములార విస్మయావహ మైన
         యొకవార్త వినిపింతుఁ బ్రకటలీల

నావల్లవాంగన కాత్మసంభవుఁ డైన
          బాలకుం డారాజు భవునిపూజ
సేయ యథాక్రమస్థితులు దప్పక యుండ
          భావించి చూచి యేర్పడ గ్రహించి
తనకుటీరంబుముందట నుండు నొకశూన్య
          దేశంబునందు శుద్ధిగ నొనర్చి


తే.

యచటిశిలఁ దెచ్చి శివలింగ మనుచు భక్తి
యమర గృత్రిమగంథాక్షతములు పత్ర
పుష్పఫలములు నైవేద్యములు నొసంగి
చిత్త మలరంగ శివపూజ సేయుచుండె.

205


తోటకము.

నగపతిముందట నాట్యముఁ ద్రొక్కున్
గగనశిరోజుని గానము సేయున్
భగవంతునిపదభజన మొనర్చున్
జగదీశ్వరుసంస్తవముఁ బఠించున్.

206


వ.

ఇవ్విధంబున నాగోపబాలకుండు బాలక్రీడావినోదంబున
నానృపాలుం డాచరించువిధంబున దానును శివార్చనంబు
సేయుదు నని సంకల్పించి యాకృతలింగంబునకు షోడశో
పచారవిధులును నమస్కారంబులుం జేయుచు గొంతప్రొద్దు
గడపి భోజనవాంఛానిరతుండయి నిశ్చలభావంబునఁ బర
మేశ్వరథ్యానంబు సేయుచు నిమీలితలోచనుండును
బద్ధాంజలిపుటుండును ననన్యమనస్కుండు నగుచు సమాధి
నిష్ఠాతిశయంబున స్థాణురూపంబున నుండునంత.

207

సీ.

ఆబాలకునితల్లి యరుదెంచి మమతచే
        భుజియింప రమ్మని పుత్త్రుఁ బిలువ
మునిపోల్కి నున్నయాముద్దులపాపని
        పలుమాఱుఁ జీరినఁ బలుకకున్న
డగ్గర నేతెంచి తాడనంబులుసేయ
        స్థాణువుపగిది నిశ్చలతనుండ
నతినిష్ఠురోక్తుల నదలించి బెదరించి
        కోపంబు దీపింప గోపికయును


తే.

మారుమాటాడకున్న కుమారు దిట్టి
కొట్టి చాలించి యచ్చోటఁ దిట్టమైన
పూజయంతయు జెరిచి దుర్బుద్ధి యగుచు
దూరముగ నశ్మలింగంబుఁ బాఱవైచె.

208


క.

కొంతవడికి నాబాలకుఁ
డెంతయుఁ గనుదెఱచి చూచి యిది యేమియొకో
వింత యటంచును మదిలోఁ
జింతింపుచు రోదనంబు సేయఁ దొడంగెన్.

209


వ.

ఇవ్విధంబున నాగోపబాలకుండు కొంతప్రొద్దునకు విగత
శోకుం డై యిక్కార్యంబు మదీయజననీకృతంబు గావ
లయు నని మనంబున నిశ్చయించి తద్దోషపరిహారార్థంబుగా
నప్పరమేశ్వరుని ధ్యానం బొనరింపుచు నిట్లని స్తుతియించె.

210


క.

పరమేశ్వర శివశంకర
కరుణాకర నీలకంఠ గజచర్మధరా
గిరిపుత్త్రికామనోహర
పురహర ననుఁ బ్రోవు మఖిలభూతశరణ్యా.

211

మత్తకోకిల.

తాను జేసినశంభుపూజ యుదగ్రమై తమతల్లి య
జ్ఞానియై పడఁద్రోచిపోయెను శంకరా ననుఁ గావు మో
దీనరక్షక భక్తవత్సల దేవదేవ దయానిధీ
మౌనిసన్నుత యంచు నేడ్చుచు మైయెఱుంగక మూర్ఛిలెన్.

212


ఆ.

అంత బాలకుండు నవనిపైఁ బడియుండి
బుద్ధి దెలిసి కొంతప్రొద్దునకును
మూర్ఛఁదేరి లేచి ముందట నొక్కదే
వాలయంబు గాంచె నద్భుతముగ.

213


ఉ.

శ్రీరమణీయ ముజ్జ్వలవిచిత్రమణీవిలసద్ధిరణ్మయ
ద్వారకవాటతోరణము వజ్రవిడూరజమౌక్తికప్రభా
పూరితవేదికాస్థలము భూరితరస్ఫటికాభిరామసౌ
ధోరునవీనహేమకలశోన్నత మైనశివాలయంబునన్.

214


తే.

దివ్యచింతామణిప్రభాదీవ్యమాన
భద్రపీఠంబునందుఁ బ్రభాతకాల
భానుకోటిప్రకాశమై పరఁగునట్టి
భవ్యలింగంబుఁ గాంచె నాబాలకుండు.

215


వ.

కనుంగొని తదీయమహాప్రభావంబునకు వెఱఁగుపడి విస్మిత
స్వాంతుండును బులకాంకురితగాత్రుండును హర్షాశ్రుమిళిత
నేత్రుండును నై గద్గదస్వరంబున నిట్లని స్తుతియించె.

216


సీ.

జయ భక్తసముదాయ సంరక్షణోపాయ
        జయ కాలకూటభక్షణవినోద
జయ విష్ణుకాండకాంచనశైలకోదండ
        జయ పద్మజాండభాస్వత్ప్రచండ

జయ శైలజాచిత్తజలజాతరోలంబ
         జయ రక్షితాపన్నజనకదంబ
జయ జహ్నుకన్యకాజలసిక్తవరజూట
         జయజయ హల్లకసఖకిరీట


తే.

జయ రజితభూధరాంచితస్థలనివాస
జయ వృషతురంగ రాజీవశరవిభంగ
జయ కృతాంతకమృత్యుభంజనవిలాస
జయ కృపాపాంగ ధవళాంగ శంభులింగ.

217


శా.

స్వామీ నీదుమహత్వము ల్దెలియఁగా శక్తుండ నేఁగాను వి
ద్యామూఢుండను గోపబాలకుఁడ వీతప్రజ్ఞుఁడన్ దేవ నీ
సామర్థ్యంబు విరించి ముఖ్యవిబుధు ల్చర్చింపఁగా లేరు లీ
లామూర్తిం బ్రభవించు టద్భుతము నీలగ్రీవవిశ్వేశ్వరా.

218


క.

మాతల్లి నినుఁ ద్రిలోక
ఖ్యాతునిఁగాఁ దెలియలేక కఠినాత్మకయై
వీతప్రజ్ఞతఁ జేసిన
పాతకములు పరిహరించు పరమాత్మ శివా.

219


వ.

అని యివ్విధంబున బహుప్రకారంబుల వినుతులు సేయు
చున్నసమయంబున.

220


తే.

సరసతరపద్మినీదివాసంగమంబు
సేసి తద్దోషపరిహారసిద్ధికొఱకు
స్నాన మొనరింపఁగాఁ బోవుచందమునను
పశ్చిమాంబుధిలోఁ గ్రుంకె భానుఁ డపుడు.

221


వ.

ఆసమయంబున గోపబాలకుండు భోజనేచ్ఛావిరహి
తుండై యమ్మహాప్రదోషకాలంబున మహాదేవుపూజనంబు

గావించి యత్యద్భుతకరం బయినయీవృత్తాంతంబు తమ
తల్లికిం దెలియ బలుకవలయు నని మనంబున నిశ్చయించి
యతిత్వరితంబుగా నిజగృహంబునకు జనుదెంచె నంత.

222


క.

నవరత్నహేమమయమై
యవిరళధనధాన్యయుక్త మై సాంబసదా
శివుకృపచే నాగోపీ
భవనము వెలసెను గుభేరభవనము మాడ్కిన్.

223


క.

రయమునఁ జని నిజమందిర
శయనస్థలముననుఁ జేరి జననీ లెమ్మా
జయము శుభంబులు వెలయఁగ
దయతో నీశ్వరుఁ డొసంగె దగువిభవంబుల్.

224


క.

అని నిదుర లేపి చెప్పిన
జననియు నిజమందిరంబు శయ్యాతలముం
గనుఁగొనఁగ రత్నకీలిత
కనకమయం బగుటఁ జేసి కడువెఱఁగందెన్.

225


తే.

మణివిభూషిత మగునిజతనువుఁ జూచి
మహితధనరాశిచే నొప్పు గృహముఁ జూచి
స్వర్ణమణిదీప్త మైన ఖట్వంబుఁ జూచి
యిది యపూర్వం బటంచు నెమ్మది దలంచె.

226


వ.

అప్పుడు.

227


శా.

మాతం దోడ్కొనివచ్చి తత్సుతుఁడు శుంభద్రత్నసౌధంబుపైఁ
జేతస్తోషదమై సువర్ణకలశశ్రీమంతమై కాంతమై
శీతాహార్యసమున్నతం బగుచు లక్ష్మీమందిరం బైనయా
భూతేశాలయ మొప్పఁ జూచె నచటన్‌ బూర్ణప్రమోదంబునన్.

228

క.

గోపికయు వెఱఁగు నొందుచు
భూపాలునికడకుఁ జేరి పురహరభవన
వ్యాపారము నిజతనయా
లాపంబులు విన్నవించె లాలితఫణితిన్.

229


సీ.

ఆవార్త విన్నంత యాశ్చర్యమును జెంది
         శంభుపూజామహోత్సవము విడిచి
శీఘ్రంబుగాఁ జంద్రసేనమహారాజు
         పరివారసహితుఁడై యరుగుదెంచి
దివ్యమాణిక్యదేదీప్యమానంబైన
        యంబికారమణుదేవాలయంబు
నందుఁ గాంచనమయం బగురత్నవేదికా
       స్థలమునఁ బీఠమధ్యమున వెలసి


తే.

బాలభానుస్ఫురత్కాంతి పరిఢవిల్ల
నఖిలజనచిత్తలోచనాహ్లాద మగుచుఁ
బూర్ణవిభవాభిరామ మపూర్వమైన
కనకమణిమయదివ్యలింగంబుఁ గాంచె.

230


క.

దాని విని పౌరులందఱు
మానుగఁ జనుదెంచి హర్షమగ్నాత్మకులై
యానూతనశివలింగము
నానిశి వీక్షించి రద్భుతాదృతమతులై.

231


తే.

ఇట్లు వీక్షించి సాష్టాంగ మెరఁగి భక్తి
పూర్వకంబుగ నభిషేకములను బిల్వ
పూజనంబులు కీర్తనంబులును జేయు
చుండి రారేయి భూపాలయుక్తముగను.

232

వ.

ఇవ్విధంబున నితరవ్యాపారంబులు మాని పౌరజనపరి
వారసమేతంబుగా నమ్మహీవల్లభుండు ప్రహృష్టాంతరం
గుఁడై భుజంగాభరణం బైన యమ్మహాలింగంబునకుఁ
బూజామహోత్సవంబు సలుపుచుండె నంత.

233


క.

ఆనరపతికినిఁ దత్పర
భూనాయకులకును సంధిఁ బొసఁగించుటకై
తా నరుగుదెంచెనో యన
భానుఁడు దోతెంచె నపుడు బ్రాగ్భాగమునన్.

234


ఉ.

కూరిమి చంద్రసేననృపకుంజరుపట్టణమందు నొక్కయా
భీరకుమారుఁ డాటలకు భీమసమర్చనఁ జేయుచుండ ని
ష్కారణలీలఁ గన్పడియె శంకరుమందిర మంచు నానృపుల్
జారులు దెల్పఁగా విని భృశంబుగ విస్మయ మంది రందఱున్.

235


ఉ.

ఈవిభు సంగరంబున జయింపఁగరాదు మహానుభావుఁడున్
దైవబలాభిరాముఁడును దారయశుం డని నిశ్చితాత్ములై
యావసుధేశులందఱు రహస్యమునన్ గుమిగూడి వీనితో
నేవిధినైన నిష్టమతి నేర్పడ నుండద మంచు నెంచుచున్.

236


క.

ధీరుల నతిగంభీరుల
సారనయనాయవచోవిచారులను మహా
దారులఁ జారులఁ గనుఁగొని
యారాజకుమారు లిట్టు లని రతిమైత్రిన్.

237


క.

శ్రీహరుఁడు సాక్షిగను మా
వాహనములు నాయుధములు వర్జించి మహా
స్నేహమున భవత్పురికిన్
సాహసకృత్యములు మాని చనుదెంతు మొగిన్.

238

క.

ఈవృత్తాంతము మీ రా
భూవిభునకుఁ జెప్పి రండు పొం డని పనుపం
గా వచ్చి రపుడు చారులు
వేవేగమె చంద్రసేనవిభుసన్నిధికిన్.

239


ఉ.

వచ్చి నృపాలచంద్రునకు వందనకృత్యము లాచరింపుచున్
మచ్చికఁ జారు లిట్లనిరి మానవనాయక యుద్ధకాంక్షులై
వచ్చినరాజవర్యులు శివాలయగోపకదర్శనార్థమై
వచ్చినవారు వాఁకిటికి వారలవాక్యము లాదరింపుఁడీ.

240


క.

శ్రీహరుఁడు సాక్షిగను మా
వాహనములు నాయుధములు వర్జించి మహా
స్నేహమున భవత్పురికిన్
సాహసకృత్యములు మాని చనుదెంతు మొగిన్.

241


క.

అని చారముఖంబున నుడి
విననృపవచనముల కలరి విభుఁ డతిమైత్రిన్
జనపతుల వేగ రమ్మని
తనభృత్యులఁ బంపె నతిముదంబు సెలంగన్.

242


క.

ఆదూతవరులు చని యపు
డాదేశాధీశ్వరులకు ననుమతి యొసఁగన్
మోదంబునఁ జనుదెంచిరి
నాదరతను చంద్రసేనుసన్నిధి కరయన్.

243


వ.

ఇట్లు పురంబులోనికిఁ జనుదెంచిన యారాజసత్తములకు
నత్యంతవినయంబునం జంద్రసేనమహీనాథుం డెదుర్కొని
వందనాలింగనాదిసత్కారంబుల వారల నాదరించి
తోడ్కొని తెచ్చి వారలుం దానును నత్యంతమిత్రభా

వంబు మెఱయ హేమరత్నమయం బైన నూతనశివాల
యంబునకు వచ్చి యమ్మహాదేవుదర్శనంబు గావించి
సాష్టాంగదండప్రణామంబు లాచరించి యందఱు సభాస్తర
ణంబుల సుఖాసీనులై మృదుమధురసల్లాపంబు లొనర్చుచుఁ
బరమానందంబున సుఖవృత్తి నుండి రంత.

244


క.

ఆభూమీశ్వరు లపు డా
యాభీరకుమారు గుణగుణాలంకారుం
బ్రాభవరేఖాకారున్
శోభితశంకరవిచారుఁ జూచిరి ప్రీతిన్.

245


శా.

వాత్సల్యంబున బాలకుం బిలిచి సంభావించి యాభూపతుల్
స్వోత్సంగంబుల నుంచి తద్గుణగణోద్యోగ ప్రచారంబులం
దత్సామర్థ్యముఁ దన్మనోదృఢతయున్ దర్శించి యూహించి య
త్యుత్సాహంబున నిచ్చి రప్పుడు ప్రభాయుక్తార్హభూషావళుల్.

246


ఉ.

కొందఱు ఘోటకంబులను గొందఱు భద్రగజోత్కరంబులన్
గొందఱు చామరంబులను గొందఱు భవ్యసితాతపత్రముల్
గొందఱు భేరికాదులను గొందఱు రత్నకిరీటకేతువుల్
గొందఱు రాంకవంబులను గోపకుమారున కిచ్చి రానృపుల్.

247


వ.

మఱియును.

248


క.

గోపతి విభవము మెఱయఁగ
గోపకులంబునకు నెల్ల గురుఁ డగు నంచున్
గోపాధ్యక్షుని జేసిరి
గోపార్భకు నచటఁ గలుగుగోత్రాధిపతుల్.

249

హనుమంతుఁడు రాజులకుఁ బ్రత్యక్షంబై గోపబాలునికథఁ జెప్పుట.

శా.

అంతన్ సర్వధరాధినాథులు ప్రమోదాయత్తులై చూడ శ్రీ
మంతుం డుజ్జ్వలకీర్తిమంతుఁ డతిధీమంతుండు దైతేయదు
ర్దాంతుం డంచితరామనామజపమంత్రధ్యానసంతోషిత
స్వాంతుం డాహనుమంతుఁ డయ్యెడను సాక్షాత్కారుఁ డయ్యెన్ గృపన్.

250


క.

క్షిత్యధినాయకు లందఱు
నత్యుజ్జ్వలతేజుఁ డైనహనుమంతునకున్
బ్రత్యుత్థానముమొదలుగ
శ్రుత్యుపచారము లొనర్చి శోభిల్లి రొగిన్.

251


క.

ఆక్షితిపులమధ్యంబున
నక్షాసురదమనుఁ డైనయనిలజుఁ డొప్పెన్
నక్షత్రమండలంబున
నక్షత్రేశ్వరునికరణి నభినుతుఁ డగుచున్.

252


వ.

ఇట్లు రాజసభామధ్యంబున గూర్చుండి యమ్మరున్నందనుండు
గోపకుమారు నుద్దేశించి యమ్మహీనాథులతో ని ట్లనియె.

253


క.

ఈవల్లవబాలుఁడు ధర
జైవాతృకుఁడై యశోవిశాలుం డగుచున్
బావనచరితుం డగుచును
శ్రీవెలయఁగ బేరు గాంచు శ్రీకరుఁ డనఁగన్.

254


ఆ.

అరయ నితనికులజుఁ డష్టమపురుషుండు
నందుఁ డన జనించునందనుండు

నతఁడు గోపకులకు నధినాథుఁ డగుచును
ధారుణీతలమున బేరు వెలయు.

255


శా.

ఆనందుం డతిధార్మికాగ్రణి సమస్తాభీరనాథుండు నా
దానక్షాత్రపరుండునా దగి యశోదాభర్తయై యుండఁ ద
త్సూనుత్వంబున బాలకేళి విహరించుం దన్నివాసంబునన్
శ్రీనారాయణుఁ డార్తరక్షకుఁడు శ్రీకృష్ణావతారంబునన్.

256


క.

ఉభయత్రయోదశులయం
దిభచర్మాంబరునిపూజ లెడపడకుండన్
శుభమతి జేసిననరులకు
విభవంబులు చెందు లోకవిఖ్యాతముగన్

257


చ.

ప్రవిమలకృష్ణపక్షమున భద్రకరంబు శనిత్రయోదశీ
దివసముగాన నందు సుమతిన్ శివపూజన మాచరించుమా
నవులు మహేశుసత్కరుణ నాగతురంగరథాధిరాజ్యవై
భవములు చెందియుందురు నృపాలకులార భజింపుఁ డీశ్వరున్.

258


క.

ఈగోపకుమారుని కీ
యోగము చేకూరు శనిత్రయోదశి యగుటన్
శ్రీగౌరీశార్చనమున
వేగమె సమకూరె భవ్యవిభవస్ఫూర్తుల్.

259


క.

అని పలికి గోపబాలున
కనుపమశివమంత్రములు శివాచారవిధుల్
పనుపడ నుపదేశించియు
హనుమంతుఁడు చనియె నప్పు డంతర్హితుఁడై.

260


ఆ.

చంద్రకీర్తి యైనచంద్రసేననృపాలుఁ
డఖిలభూపతులకు హర్ష మొదవ

భూషణాదికములఁ బూజించి పనిచెను
మగుడ వారివారినగరములకు.

261


వ.

తదనంతరంబున నాచంద్రసేనమహీపాలుండును శ్రీకరుం
డును మహేశారాధనతత్పరులై యనేకవర్షంబులు భూలోక
మున నపరిమితసామ్రాజ్యభోగము లనుభవించి యంత్యమున
సిద్ధగంధర్వవిద్యాధరజేగీయమానులై శివలోకమునకుం జని
తత్సాయుజ్యము నొంది రని చెప్పి సూతుం డి ట్లనియె.

262


ఉ.

మౌనివరేణ్యులార మతిమంతులు శాంతులు దాంతు లైనస
న్మానవు లెవ్వరేని నియమంబున శైవకథాసుధాపయః
ఫేనము శ్రీనిధానమును వేదసమానము నైనయీయుపా
ఖ్యానము విన్న వారలకుఁ గల్గుఁ జిరాయువు భోగమోక్షముల్.

263


క.

అని చెప్పిన యాసూతుం
గనుఁగొని యిట్లనిరి శౌనకప్రముఖమునుల్
ఘనమతి వగునీవలనను
వినఁగంటిమి శైవకథలు విస్మయపదముల్.

264


ఆ.

అమృత మారగింప నరుచి లేనట్లు శ్రీ
సాంబశివునికథలు సంతతమును
వినఁగవినఁగ మాకుఁ దనివి లే దెంతయుఁ
దెలియఁ బలుకుమయ్య తేటపడఁగ.

265


వ.

అనిన సూతుం డి ట్లనియె.

266


ఉ.

తాపసులార మీరు కడుధన్యులు విశ్రుతు లెవ్వరేనియున్
మీపగిదిన్ సదాశివసమృద్ధకథల్ పలుమారు వేఁడఁగా
నోపరు ఫాలనేత్రుఁడు మహోక్షతురంగుఁడు భక్తలోకసం

తాపహరుండు శంకరుఁడు దారుఁడు పూజ్యుఁడు ముజ్జగంబులన్.

267


క.

తరమే ప్రదోషమహిమల
నెఱిఁగింపఁగ నెవ్వఁ డోపు నింద్రాదిసురుల్
పరమేశ్వరు సేవింతురు
నిరతము దత్సమయమునను నిశ్చలమతులై.

268


చ.

భవభయరోగతాపబహుపాపనితాంతవిపజ్జరామహా
ర్ణవవినిమగ్నమర్త్యులకు నావ గదా పరమేశ్వరుండు నా
శివుభజనంబు నిశ్చలత చేయుమహాత్ములు ఘోరశాత్రవా
హవఫణిశైలమధ్యగతు లయ్యును బాధలఁ జెంద రెన్నఁడున్.

269


క.

ఈయర్థమునకు నొకకథ
పాయక వినుపింతు నదియుఁ బాపవినాశం
బాయుష్కర మారోగ్యము
శ్రేయస్కర మగుచు నుండు సిద్ధం బరయన్.

270

సత్యమహారాజుకథ

చ.

సరసవిదర్భదేశమున సత్యరథుం డనుభూవరుండు భా
సురతరధర్మశీలుఁడు యశోధనుఁ డాశ్రితరంజనుండు నై
నిరతము ధారుణీతలము నీతిపథంబున నేలుచుండఁగా
నరిగె ననేకవత్సరము లానరపాలునకున్ సుఖంబుగన్.

271


ఉ.

అంత కృతాంతతుల్యులు మహాబలవంతులు దుర్మదాంధు ల
శ్రాంతజయాభిలాషులు ససైన్యులునై చనుదెంచి శత్రుభూ
కాంతవరు ల్విదర్భకటకంబునఁ దన్నగరంబుచుట్టు న
త్యంతపరాక్రమంబు వెలయ న్విడియించిరి సర్వసేనలన్.

272


క.

ఆసత్యరథుఁడు నిజసే
నాసహితము గాఁగ నరిగి నానారిపువి

త్రాసనుఁ డగుదుర్మర్షణు
తో సంగర మపు డొనర్చె దోర్బల మెసఁగన్.

273


క.

సింధురవాజిస్యందన
బంధురసైన్యద్వయంబు పాతాళమునన్
గంధర్వపన్నగులక్రియ
సంధిల నని సేసి రపుడు శౌర్యం బెసఁగన్.

274


క.

ఆసంకులసమరంబున
నాసత్యరథుండు నిహతుఁ డయియుండ మహా
త్రాసమున గదనరంగముఁ
బాసి పరాభవము నొంది పరచెం బలమున్.

275


వ.

ఆసమయమున దుర్మర్షణప్రధానప్రముఖు లావిదర్భనగరం
బాక్రమించి చొచ్చిన యవసరమున యప్పురము ప్రణష్ట
రాజకమును ప్రక్షోభితబాలవృద్ధజనమును ప్రథావితపౌర
లోకమును ప్రభూతకోలాహలంబునై యుండె నంత.

276


మ.

అరివీరుల్ పురిలోనఁ జొచ్చినఁ దదీయారావ మాలించి యా
ధరణీపాలునిపత్ని పూర్వమున నంతర్వత్నియై యుండి త
న్నొరులెవ్వార లెఱుంగకుండ నతిమాత్రోద్భీతయై యంత స
త్వరయానంబున నేఁగె బశ్చిమహరిత్కాంతారమార్గంబునన్.

277


తే.

ఇట్లు కాంతారపథమున నేఁగి యేఁగి
యచట నొక్కసరోవరం బమరఁ గాంచి
తత్తటంబున నుండుశీతలవటంబు
క్రింద నిలిచె శ్రమంబులు డిందుపడఁగ.

278


తే.

తరుణి యవ్వేళ శుభముహూర్తంబునందు
లలితసామ్రాజ్యలక్షణలక్షితాంగు

నొక్కసుతుఁ గాంచి యచ్చోట నునిచి చనియె
సలిలపానాభికాంక్షఁ గాసారమునకు.

279


క.

అమ్ముదిత పిపాసాతిశ
యమ్మునఁ జని నీరు ద్రావ నపు డొకకుంభీ
ర మ్మేగుదెంచి పట్టి హ్ర
దమ్మున దిగమ్రింగె నపుడు ధరణీశసతిన్.

280


సీ.

అంత నాబాలకుం డభ్యుదితుం డైన
        భాస్కరుం డన మహాప్రభ వెలుంగ
క్షుత్పిపాసార్తుఁ డై స్రుక్కి భూతలమున
        వసియించి రోదనధ్వని చెలంగ
నేడ్చుచు బితృమాతృహీనుఁడై యున్నచో
        నాస్థలంబునకు భిక్షార్థి యగుచు
నుమ యనఁబరగిన యొకవిప్రభామిని
        యేకహాయనసుతు నెత్తుకొనుచు


తే.

నిరత మూరూరు దిరుగుచు నరిగి యరిగి
విమలమతి వచ్చె దైవయోగమునఁ జేసి
యంత నాడింభకునిఁ గాంచి యావధూటి
మదిని జింతించి చాలవిస్మయము నొందె.

281


ఉ.

లాలితరూపకాంతిశుభలక్షణలక్షితదివ్యదేహుఁడై
నేల వసించినాఁడు జననీజనకు ల్దలపోయ నెవ్వ రీ
బాలుఁడు విఁప్రుడో నృపుఁడొ వైశ్యుఁడొ శూద్రుఁడొ కాక యున్న చం
డాలుఁడొ వీని నంటుట కొడంబడ దెంతయు నామనం బొగిన్.

282


క.

వీఁ డెవ్వఁడొకో వీనిం
జూడఁగ నచ్ఛిన్ననాభిమాత్రుం డహహా

నేఁ డెంతవింత గనుపడె
నీడింభకుఁ గన్నతల్లి యెం దఱిగినదో.

283


క.

ఈయర్భకుచే నంటక
పోయెద ననియెడుతలంపు పుట్టదు మదికిన్
వేయేల వీనిఁ గొని చని
నాయింటను బెంచుచుందు ననవరతంబున్.

284


ఆ.

అనుచు నిశ్చయించు నాత్మలోఁ జింతించు
సమ్మతించు మగుడ సంశయించు
నట్టు లిట్టు చనక యావీతభర్తృక
శిశువుమీఁదిభ్రాంతి జెందియుండు.

285


వ.

ఇట్లు డోలాయమానమానసయై విచారించుచున్నసమ
యంబున.

286


క.

విచ్చలవిడి నాక్షణమున
వచ్చె నొకానొకఁడు భిక్షువర్యుఁ డచటికిన్
మచ్చిక నాబాలకునిం
జెచ్చెర కరుణింప వచ్చుశివుఁడో యనఁగన్.

287


చ.

లలితమృదూక్తి భూసురకులాంగనఁ గన్గొని భిక్షుఁ డి ట్లనెన్
వలవదు సంశయింపఁగ నవశ్యము నీశిశువున్ భరింపు ని
శ్చలమతితోడ నీ వధికసమ్మదలీల శుభంబు లందఁగాఁ
గలవని చెప్పియాఘనుఁడు క్రమ్మర దాఁ జనియెన్‌ రయంబునన్.

288


తే.

అప్పు డాభిక్షువర్యునియాజ్ఞ శిశువు
నెత్తుకొని వేగ నాలేమ యేకచక్ర
పురమునకు వచ్చి తనయింటఁ గరుణ నునిచి
చిత్త మలరంగ వానిఁ బోషింపుచుండె.

289

సీ.

తనపుత్త్రుతో పాటు చనుబా లొసంగుచుఁ
           గూరిమితోఁ బెంచెఁ గొన్నినాళ్లు
బాగుగా నింటింట భైక్షాన్నములు తెచ్చి
           కుడువఁబెట్టుచు సాఁకెఁ గొన్నినాళ్లు
సతతంబు దేవతాసంతర్పణంబులఁ
          గొమరొప్పఁ బోషించెఁ గొన్నినాళ్లు
అవనీసురులయిండ్ల హవ్యకవ్యము లైనఁ
         గోర్కులు సమకూర్చెఁ గొన్ని నాళ్లు


తే.

ఆత్మసుతుఁ డంచు బరసుతుఁ డంచు మదిని
భేద మింతయులేక సమ్మోదమునను
బ్రేమ నిరువుర నొకరీతిఁ బెంపుచుండె
నౌర యాయమసాటి యెందైనఁ గలరె.

290


క.

ఇమ్ముగ భూసురజనముల
సమ్మతిఁ జౌలోపనయనసంస్కారంబుల్
సమ్మదమునఁ గావించె శు
భమ్ముగ నమ్మానవులకుఁ బ్రాభవ మెసఁగన్.

291


ఉ.

జోలెలు చంకలం దిడి కిశోరకభావము లుప్పతిల్లఁగా
ఫాలమునందు భూతికలపంబులు పూయుచు బ్రహ్మచారులై
బాలకు లిర్వు రెప్పు డిరుపార్శ్వములన్ జనుదేర నేఁగి గ్రా
మాలయసీమలం దిరిగి యాయమ భైక్షముఁ దెచ్చు నిత్యమున్.

292


క.

ఈరీతి సబాలకయై
యూరూరును దిరుగుచుండి యొకనాఁడు విధి
ప్రేరణమున నొక్కశివా
గారమునకుఁ జనియె నుమయుఁ గౌతుక మొదవన్.

293

ఆ.

అచట వృద్ధు లగుమహర్షిసంఘంబులు
పౌరజనులు జానపదులుఁ గూడి
శివమహోత్సవంబు సేయుచు నుండ న
య్యుత్సవంబుఁ జూచుచుండె నంత.

294


శా.

మాండవ్యాదిమహామునీశ్వరసభామధ్యస్థుఁడై చండమా
ర్తాండప్రోజ్జ్వలతేజుఁ డంచితశివధ్యానైకపారీణుఁడున్
ఖండీభూతసమస్తకల్మషుఁడు లోకఖ్యాతచారిత్రుఁ డౌ
శాండిల్యుండనుమౌని యిట్లనియె నాశ్చర్యంబు సంధిల్లఁగన్.

295


చ.

స్థిరతరమైనదైవగతి చిత్రమగున్ నిజకర్మపాక మె
వ్వరికి దురత్యయంబు జనపాలకనందనుఁ డివ్విధంబునన్
బరసతి నాత్మమాత యని భావనచేయుచు మానహీనతం
దిరిగెడు భైక్షవృత్తి నిరతిం బ్రతిగేహముఁ దప్పకుండఁగన్.

296


క.

అని పలుకుచున్నమౌనిం
గనుఁగొని యావిప్రవనిత కౌతుకమతియై
వినయమ్మున నమ్మునిపద
వనజంబుల కెరఁగి కలరవంబున ననియెన్.

297


ఆ.

ఓమహానుభావ యీమాణవకుఁ డెవ్వఁ
డెవరు తల్లిదండ్రి యెద్దికులము
పుత్త్రుపగిది నితనిఁ బోషించి పెంచితిఁ
దెలియఁబలుకు వీనికలతెఱంగు.

298


క.

భిక్షార్థ మరుగుచో నొక
వృక్షసమీపమునఁ బోరు వెట్టుచు నుండన్
వీక్షించి సంశయింపక
భిక్షునియోగమునఁ దెచ్చి పెనిచితిఁ గరుణన్.

299

వ.

మునీంద్రా యీబాలకుజన్మంబు సవిస్తరంబుగాఁ దెలియ
ననుగ్రహింపవలయు నని ప్రార్థించిన నావిప్రభామినిం
గటాక్షదృష్టిం జూచి యమ్మహాత్ముండు.

300


క.

తజ్జనకునిరణమృతియున్
దజ్జన్మప్రకరణంబు నక్రమువలనం
దజ్జనని మరణ మొందుట
తజ్జాతియుఁ దెలియఁజెప్పె దథ్యము గాఁగన్.

301


సీ.

అని యానతిచ్చిన యమ్మహామునిఁ గాంచి
         వెండియు ద్విజకాంత విన్నవించె
నేమికారణమున నీయర్భకునితండ్రి
         సమరరంగమున బంచత్వ మొందె
నేదుష్కృతంబున నీసొబగునితల్లి
         కర్కశగ్రాహసంగ్రస్త యయ్యె
నేకర్మమునఁ జేసి యారాజసుతునకుఁ
        జేకూఱె భిక్షాన్నజీవనంబు


తే.

ఇది మహాద్భుత మనుచు నామదికిఁ దోఁచె
తాపసోత్తమ కరుణామృతాంబురాశి
వరయ సర్వజ్ఞమూర్తి వట్లగుటఁ జేసి
యన్నియునుఁ దెలియఁగా బల్కు మిద్ధచరిత.

302


వ.

అని యడిగిన యాతాపసనర్యుం డాభూసురాంగన
కి ట్లనియె.

303


చ.

విను మిల పాండ్యరా జనఁగ వీనిగురుండు భవాంతరంబునన్
దనరి ప్రదోషపూజనము దప్పక చేయుచునుండె నంతయున్
ఘనమతి నొక్కనాఁడు శితికంఠుసమర్చన సేయునట్టివే

ళనుదుములంబుగాఁ గలకలార్భటు లుప్పతిలెన్‌ బురంబునన్.

304


శా.

ఆకోలాహల మాలకించి శివపూజాసక్తి వర్జించి భీ
మాకారంబున రాజు వచ్చి విశిఖామధ్యంబున న్నిల్వఁగా
నాకాలంబున దత్ప్రధానుఁడు గృహీతారాతియై వచ్చితా
సాకల్యంబుగ దెల్పె దద్రచితచంచద్దుష్క్రియారంభముల్.

305


శా.

చండక్రోధము మీఱఁ బాండ్యవిభుఁ డాశత్రుక్షమావల్లభున్
ఖండీభూతశిరస్కుఁ జేసి దురహంకారంబు దీపింప ను
ద్దండప్రాభవ మొప్ప వచ్చి నిజసౌధంబందు మృష్టాన్నతృ
ప్తుండై కోమలపుష్పతల్పమున సుప్తుం డయ్యె మూఢాత్మతన్.

306


తే.

పంచవక్త్రునిపూజ వర్జించినట్టి
దోషమునఁ జేసి సామ్రాజ్యదూరుఁ డయ్యె
బద్ధుఁ డగువైరిఁ జంపినపాపమున ని
కృత్తమస్తకుఁ డయ్యె నానృపవరుండు.

307


ఉ.

ఆనరపాలనందనుఁ డహంకృతి మున్నుఁ బ్రదోషకాలమం
దానగజాకళత్రుని సమర్చన మాని భుజించి యంతటన్
దా నటు నిద్రఁ జెందినకతంబున నీజననంబునందు భి
క్షానియతాత్మకుం డగుచు శైశవభావమున న్మెలంగెడున్.

308


క.

ఆరాజుపత్ని సవతికి
ఘోరవిషాన్న మిడి చంపెఁ గుత్సితమతిఁ ద
త్కారణమున నిప్పుడు కుం
భీరముఖగ్రస్త మయ్యె భీతాత్మకయై.

309


క.

పరమేశ్వరుఁ బూజింపని
నరులకుఁ బేదఱిక మొదవు నగజారమణున్
ధరఁ బూజించినజనులకు

జిరతరసంపదలు చెందు సిద్ధం బరయన్.

310


వ.

అని యావిదర్భరాజకుమారు పూర్వవృత్తాంతంబు సవిస్త
రంబుగాఁ దెలియఁజెప్పి యాభూసురాంగనతో వెండియు
శాండిల్యమహామునీంద్రుం డి ట్లనియె.

311


ఉ.

సారము వేదసమ్మతము సత్యము భద్రకరంబు నాపదు
ద్ధారక మైనవాక్యము హితంబుగ నే వచియింతు ఘోరసం
సారపయోధిమగ్ను లగుజంతుకణంబుల కీశ్వరాంఘ్రిపూ
జారతిదప్ప వేఱొకటి సాధన మేమియు లేదు చూడఁగన్.

312


చ.

ఎవరు మహాప్రదోషమున నీశ్వరపూజ యొనర్పకుందురో
యెవరు విశిష్టభక్తి గిరిజేశనమస్కృతు లాచరింపరో
యెవరు నిరంతరంబుఁ బరమేశ్వరుసత్కథ లాలకింపరో
భువి నతిమూఢభావమునఁ బుట్టుదు రామనుజు ల్దరిద్రులై.

313


ఉ.

ఏనరు లైనగాని నిటలేక్షణుఁగూర్చి యనన్యచిత్తు లై
పూని ప్రదోషకాలమున పూజ లొనర్చిన వార లెప్పుడున్
భూసుతభోగభాగ్యజయపుత్రకళత్రసుహృత్సమేతులై
దీనతలేక యుందురు సుధీజనమానితులై ముదంబునన్.

314


సీ.

కైలాసగిరిమీఁదఁ గాలకంఠుఁడు దివ్య
        హాటకరత్నసింహాసనమున
నద్రిజ నుంచి మహాప్రదోషంబున
        సకలదేవర్షులు సన్నుతింప
వాణీమహాదేవి వీణ మీటుచునుండ
       గమలసంభవుఁడు దాళములు వైవ
దానవాంతకుఁడు మృదంగవాద్యము సల్ప
       శ్రీలక్ష్మి గానంబు సేయుచుండ

తే.

వాసవుఁడు వైణవోన్నతస్వరముఁ గూర్ప
గరుడగంధర్వయక్షకిన్నరపతంగ
సిద్ధవిధ్యాధరాధిపు ల్చేరి కొలువ
హర్ష మిగురొత్త దాండవం బాడుచుండు.

315


ఆ.

ఆప్రదోషమునను హరుఁ డొక్కరుఁడు దక్కఁ
బూజ్యు లెవరు లేరు భూతలమున
ఆమహానుభావుఁ డర్చితుం డైనఁ బ్ర
సన్ను లగుదు రెపుడు సకలసురులు.

316


మ.

వనితా నీతనయుండు పూర్వమున విప్రశ్రేష్ఠుఁడై యాత్మజీ
వనరక్షార్థము దుష్ప్రతిగ్రహత యావజ్జీవపర్యంతమున్
దనరం గాలముఁ బుచ్చి దానరహితత్వం బొందుటంజేసి భై
క్షనితాంతస్థితి నుండె నీభవమునన్ సంపత్కళాహీనుఁ డై.

317


క.

కావున నీతనయుని నీ
భూవరసుతు నీప్రదోషపూజాపరులం
గావింపుము సంచితదో
షావళి నశియించు భాగ్య మబ్బెడు నెలమిన్.

318


చ.

అన విని యాధరామరవరాంగన యమ్మునిసార్వభౌమునిం
గనుఁగొని తత్పదంబులకుఁ గ్రమ్మర వందన మాచరించి యి
ట్లనియె ముదంబు మీఱఁగ మహాత్మ సదాశివపూజనక్రమం
బును వివరింపఁగావలయుఁ బూర్ణకృపారసభావ మేర్పడన్.

319


వ.

అని యడిగిన నాభూసురభామినికి శాండిల్యమహాము
నీంద్రుం డి ట్లనియె.

320

శివపూజావిధానము

తే.

ఉభయపక్షంబులందుఁ ద్రయోదశులను

దినమునందు నిరాహారదీక్షుఁ డగుచు
నస్తమయపూర్వఘటికాత్రయంబునందు
స్నానసంధ్యాదికృత్యము ల్సలుపవలయు.

321


సీ.

తదనంతరంబున దరుణేందుశేఖరుఁ
          జిరతరభక్తిఁ బూజింపవలయు
నిర్మలస్థలమున నిబిడగోమయమిశ్ర
          జలముల నచ్చోట నలుకవలయుఁ
బంచవర్ణములుగాఁ బద్మకాదివిచిత్ర
          రంగవల్లుల నొనర్పంగవలయు
ఆమీఁద నవపల్లవామేయఫలపుష్ప
          వృతమంటపమ్ము నిర్మింపవలయు


తే.

నచట నవరత్నఖచితభద్రాసనమున
నంచితంబుగ శివమూర్తి నుంచవలయు
గంధపుష్పాదిపూజోపకరణవస్తు
సంగ్రహము చేసి మునివృత్తి సలుపవలయు.

322


తే.

ఆగమోక్తప్రకారమంత్రాభియుక్తి
నమరపీఠంబు నావాహనము నొనర్చి
నాత్మసంశుద్ధి భూతశుద్ధ్యాదివిధుల
నొప్పఁ గూర్చుండవలయు ధీరోత్తముండు.

323


క.

ధీమంతుఁ డైనశ్రేయ
స్కాముఁడు ముమ్మారు నుడువఁగాఁ దగుఁ బ్రాణా
యామంబులు నిశ్చలుఁ డై
కామాద్యంతర్విపక్షఖండనమతి యై.

324

మ.

కలుషాభీలదురంతరోగభవదుఃఖంబు న్నివారించి యు
జ్జ్వలకల్యాణపరంపరాన్వితునిగా సౌభాగ్యవర్ధిష్ణుఁగాఁ
గలితశ్రీనిధిగా నొనర్పు మని సంకల్పంబుఁ గావించి యిం
పలరారన్ శివపూజ చేయఁదగు నిష్టార్థంబు లీడేరఁగన్.

325


వ.

ఇట్లు సంకల్పంబు గావించినబిందుకంబు లయిన బీజవర్ణంబు
లతో నంతర్మాతృకాధ్యానముద్రాధారణంబు లొనర్చి నిజ
హృదయకమలకర్ణికామధ్యంబున దక్షిణోత్తర్రప్రదేశంబుల
గణపతిగురుసమేతంబుగా సాంబసదాశివునిం బ్రతిష్ఠించి
యమ్మహాదేవుండు చంద్రకోటిప్రతీకాశుండును జంద్రార్క
వహ్నిలోచనుండును జంద్రశేఖరుండును బిశంగజటా
జూటుండును నీలకంధరుండును నాగేంద్రకుండలుండును
నాగకేయూరహారకంకణముద్రికావలయవిరాజితుండును
వ్యాఘ్రచర్మాంబరుండును బ్రహ్మేంద్రాదిసమర్చితపాద
పద్ముండును రత్నసింహాసనాసీనుండును మృత్యుంజయుం
డును వృషభద్వజుండును నీలలోహితుండును అష్ట
మూర్తియు శూలపినాకహస్తుండును జగదీశ్వరుండును
భగవంతుండునుగా మనంబునం దలంపుచు దద్వామ
భాగంబున జపాపుష్పసంకాశవర్ణయు నుదయార్కప్రభాభాస
మానయు విద్యుత్సమానాంబరయు బాలేందుశేఖరయు
సుస్నిగ్ధనీలకుంచితకుంతలయు రోలంబనీలాలకయు మాణిక్య
ఖచితకుండలభ్రాజితముఖాంభోజయు సింధూరతిల
కాంచితఫాలభాగయు హరిద్రాగంధవిలేపితకపోలదర్ప
ణయు మందహాసవిరాజితశోణాధరబింబయుఁ ద్రిరేఖా
యుతకంబుకంఠియుఁ బద్మకోశనీకాశకుచయుగ్మయుఁ జతు

ర్భుజయుఁ బాశాంకుశధనుర్బాణధారిణియు సువర్ణమణి
మయమేఖలాపరిశోభితనితంబబింబయు రంభాస్తంభప్రతి
మానమృదూరుయుగ్మయుఁ గందర్పతూణీరసమానజంఘి
కయు దేవగంధర్వకామినీసమర్చితపాదకమలయు నిందీవ
రేక్షణయు మందారపుష్పదామవిరాజద్వేణియు మహా
త్రిపురసుందరియు జగదంబయు నైనగిరికన్యక నాత్మలోఁ
దలంచి తదనంతరంబున బాహ్యపూజాపరుండయి సవ్యాప
సవ్యంబుల గురుగణేశులఁ బూజించి యీశాన్యాద్యష్టదిగ్భా
గంబుల క్షేత్రపాలక వాస్తోష్పతి సరస్వతీ పార్వతీ ధర్మజ్ఞాన
వైరాగ్యైశ్వర్యంబుల నమోంతంబులుగాఁ బూజనంబులు
గావించి ఇంద్రాద్యష్టదిక్పాలకులను సప్తమాతృకలను నణి
మాద్యష్టసిద్ధులను ధర్మాధర్మంబులను దత్తద్దేవతాకంబు
లయినమంత్రంబుల సమర్చితులం గావించి నందీశ్వర
చండీశ్వర భృంగీశ్వర కుమారవీరభద్రసమేతుండును
దేజోమయుండును నైనసాంబసదాశివస్వామిని న్యాస
పూర్వకంబుగా రుద్రసూక్తంబుల షోడశోపచారవిధులం
బూజింపవలయు.

326


సీ.

ధ్యానంబు త్రిజగదాధారచిన్మూర్తికి
        నావాహనము శైలజాధిపతికి
నవరత్నసింహాసనము దేవదేవున
       కర్ఘ్యంబు త్రిపురసంహారునకును
బాద్యంబు త్రైలోక్యపాలనశీలున
       కాచమనంబు ఫాలాక్షునకును

అభిషేకములు నిర్జరాపగాధరునకు
         వస్త్రయుగ్మంబు దిగ్వసనునకును


తే.

యజ్ఞసూత్రంబు బహువిధయజ్ఞపతికి
గంధపుష్పాక్షతములు శ్రీకంఠునకును
పరిమళోపేతధూపంబు పశుపతికిని
దీప మిడఁ దగు బ్రహ్మాండదీపకునకు.

327


చ.

సలలితగోఘృతాక్తగుడశార్కరమిశ్రితభక్ష్యభోజ్యముల్
ఫలములు కందమూలములు పాయసము ల్కలమాన్నసూపశీ
తలజలదుగ్ధ మస్తు దధితక్రముఖప్రధితోపహారము
ల్వెలయ నొసంగి కప్పురపువీటిక లీఁదగుఁ జంద్రమౌళికిన్.

328


వ.

తదనంతరంబున.

329


క.

కైరవహితశేఖరునకు
గౌరీహృదయారవిందకమలాప్తునకున్
శ్రీరంజిల్లఁగ నుత్తర
నీరాజన మొసఁగవలయు నిర్మలభక్తిన్.

330


క.

గీష్పతికమలావరవా
స్తోష్పతిముఖదేవవినుతశుభపాదునకున్
బుష్పాయుధసంహరునకుఁ
బుష్పాంజలి యొసఁగవలయు బుధులు నుతింపన్.

331


ఆ.

ఉక్షవాహునకుఁ బ్రదక్షిణత్రయనమ
స్కారపంచకంబు సలుపవలయు
సిద్ధసేవ్యుఁ డైన శ్రీసదాశివుమ్రోల
నృత్యగీతవిధులు నెరపవలయు.

332

సీ.

జయ చంద్రకోటీర జయ భక్తమందార
        జయ గరళాహార సర్పహార
జయ పోషితాజాండ జయ జనార్దనకాండ
        జయ మేరుకోదండ సవనఖండ
జయ నిర్జితానంగ జయ సత్కృపాపాంగ
        జయ సుధాధవళాంగ జయకురంగ
జయ దేవతాధ్యక్ష జయ మదాసురశిక్ష
        జయ శ్రీవిరూపాక్ష సాధురక్ష


తే.

జయ గగనకేశ సంసారభయవినాశ
జయ భుజగనాయకోష్ణీష సత్యభాష
జయ కరాంచితశూల దుర్జనవిఫాల
జయ శుభప్రదనామ భాస్కరసుధామ.

333


శా.

ఆధివ్యాధిసమావృతుండ భవభరాదీనుఁడన్ దీసుఁడన్
బాధాయుక్తుఁడ నే నకించనుఁడ దుష్పాపాకులస్వాంతుఁడన్
గ్రోధాద్యావృతుఁడన్ జడుండ శఠుఁడన్ గ్రూరుండఁ గష్టుండ నో
వేధస్సన్నుత దేవదేవ కరుణ న్వీక్షించి రక్షింపవే.

334


క.

శరభావతార శంకర
శరభా హేరంభజనక చంద్రవతంసా
శరభార్కచంద్రపాండుర
శరభంగాదికమహర్షిసన్నుతచరితా.

335


తే.

శరణు శ్రీపార్వతీనాథ శరణుశరణు
శరణు కైలాసగిరివాస శరణుశరణు
శరణు వృషభేంద్రవాహన శరణుశరణు
శరణు సర్వమహాదేవ శరణుశరణు.

336

క.

రక్షింపుము పరమేశ్వర
రక్షింపుము ఫాలనేత్ర రమ్యచరిత్రా
రక్షింపు భక్తవత్సల
రక్షింపు విపన్నజనశరణ్య మహాత్మా.

337


తే.

నిఖిలలోకైకనాథ మౌనీంద్రవంద్య
మించి నేఁ జేయుతప్పు సహించి ప్రోవు
మనుచుఁ బ్రార్థన మొనరించి హర్ష మొదవ
శివకథాకర్ణనంబుఁ దాఁ జేయవలయు.

338


క.

అనయంబు సాధకుఁడు ని
ర్ధనుఁడైన మహాఢ్యుఁడైనఁ దద్దయుఁ బ్రీతిన్
వినయమున శంకరుని బ్రా
ర్థన చేయఁగవలయు భక్తితాత్పర్యమునన్.

339


మ.

జపహోమంబు లొనర్చి సాధకుఁడు సచ్ఛాల్యన్నదానక్రియా
ద్యుపచారంబుల భూసురేంద్రులకు సంతోషంబు గావించి మా
న్యపరీతుం డగుచుం దదీయవిఘసాన్నప్రాశసుండై యుమా
ధిపు సేవించినఁ జెందు సంపదలు భక్తిజ్ఞానవైరాగ్యముల్.

340


చ.

ప్రమథగణేశు శంకరుని బన్నగహారు మహాప్రదోషకా
లమున నితాంతభక్తి విమలాత్ములు పూజ లొనర్చి భోగభా
గ్యముల సుఖంబుఁ గాంతురు జగద్విదితంబుగ నట్టివారిదే
హములను లేము లంటవు సహస్రభవంబులకైన మానినీ.

341


మ.

ధరణీభాగమునందు మర్త్యులు శివద్రవ్యాపహారక్రియా
దురితం బొక్కటిఁ దక్క దక్కినమహాదుష్పాపముల్ ద్రోచి బం
ధురభాగ్యోన్నతిఁ జెంది మిత్రజనబంధుశ్రేణులుం దాము సు
స్థిరులై యుండ్రు ప్రదోషకాలమున భక్తిన్ శంభు బూజించినన్.

342

శా.

ఆయుష్యంబు సుపుత్త్రపౌత్త్రసముదాయప్రాపణం బంచిత
శ్రేయోవర్ధన ముత్తమవ్రతము దారిద్ర్యక్షయం బుజ్జ్వల
శ్రీయోగంబు నభీష్టభోగవిభవక్షేమంకరం బైన యీ
సాయంకాలశివార్చనామహిమ యెంచన్ శక్యమే యేరికిన్.

343


వ.

అట్లు గావున నీ వింక నీబాలకులచేత మహాప్రదోషవ్రతంబు
సేయింపుము అట్లు గావించిన వీరలకు దారిద్ర్యంబులు
దొలంగి మహదైశ్వర్యములు సిద్ధించునని యానతిచ్చిన
యమ్మహామునివచనమ్ము లాకర్షించి యావిప్రభామిని బాల
కులుం దానును నమ్మహాత్మునిపాదములకు సాష్టాంగదండ
ప్రణామంబు లాచరించి ముకుళితహస్తయై యి ట్లనియె.

344


క.

మునినాథ నీప్రసాదం
బునఁ జేసి కృతార్థ నైతి బుధసన్నుత మ
త్తనయులుగా నీయిరువుర
ననయము నొకరీతిఁ బెంచి యరసితి వీరిన్.

345


తే.

వసుధ మత్పుత్త్రకుఁడు శుచివ్రతుఁ డనంగఁ
బేరువడినట్టివాఁడు నీధారుణీశ
నందనుఁడు ధర్మగుప్తుఁ డనంగ వెలసె
నింక నీమువ్వురము భవత్కింకరులము.

346


వ.

మునీంద్రా! యీమహాఘోరదారిద్ర్యపారావారంబున
మునింగియున్న మ మ్ముద్ధరింప నీవ యర్హుండవు అనన్యశరణ్యు
లమై యున్నమమ్ముం గడతేర్పు మని దైన్యరసంబుఁ దోఁపం
బలికిన యాభూసురభామినిం గటాక్షించి యమృతోప
మానంబు లగువాక్యముల నూరడించి యాబాలకులకు

మహేశ్వరారాధనపరం బయిన మంత్రవిద్య నుపదేశించిన
వారును ప్రహృష్టాంతరంగులై యమ్మహర్షిసత్తమునకుఁ
బ్రణమిల్లి తదనుజ్ఞాతులై యమ్మువ్వురు నిజమందిరమునకుఁ
గ్రమ్మఱఁ జనుదెంచిరి శాండిల్యమహామునీంద్రుండును నిజ
తపోవనమునకుం జనియె నంత.

347


క.

మునివరునుపదేశక్రమ
మున నయ్యిరువురుఁ బ్రదోషపూజాపరు లై
యనుదినమును వర్తింపఁగఁ
జనియె న్మాసములు నాల్గు సమ్మదలీలన్.

348


సీ.

అంతట నొక్కనాఁ డాబాలు రిరువురు
        మాధ్యాహ్నికస్నాన మాచరింప
బోయి నదీతటంబున విహారము సల్పు
       చుండ నం దొకచోట నుత్కటముగ
నిర్ఘాతపాతవినిర్గతం బగుధన
       నిక్షేపమొక్కటి నేత్రములకు
నగుపడఁ జూచి యత్యాశ్చర్యమును బొంది
      మనము రంజిల దానిఁ గొనుచు వచ్చి


తే.

అంబ! వీక్షింపవమ్మ శ్రీసాంబశివుని
మానితానుగ్రహం బీనిధానకుంభ
రూపమునఁ గానఁబడియె నిర్దుష్టముగను
సత్వరంబుగ మనయదృష్టము ఫలించె.

349


క.

అని చెప్పిన బాలకులం
గనుఁగొని యాయమయు హర్షకలితాత్మకయై
తనయుల కిట్లనె మీ రీ

ధనము విభాగించికొనుఁడు ధర్మస్థితిగన్.

350


వ.

అని పలికిన రాజకుమారుం డి ట్లనియె.

351


తే.

తల్లి! నీతనయుండె యీధనముఁ గొనుట
కర్హుఁ డగుఁగాని యేను గా నట్టులగుట
నీశ్వరుం డింక నేమైన నిచ్చెనేని
దాని నే భక్తిఁ గొందుఁ దథ్యంబుగాఁగ.

352


క.

అని పలికి ధర్మగుప్తుఁడు
మునుపటిచందమున నభవుఁ బూజించుచుఁ బా
వనమతి నుండఁగ గాలము
చనియెన్ సంవత్సరంబు సంపూర్ణముగన్.

353


తే.

ఇట్లు వైదర్భనందనుం డింపుమీఱ
ద్వాదశాబ్దవయస్కుఁడై మోద మలర
విమలభక్తి గురూపదేశమునఁ జేసి
సంతతంబును శివపూజ సలుపుచుండె.

354


ఉ.

అంత నతిప్రకాశితదిగంతము వర్ధితశాతకామరా
ట్కుంతము తోషితాఖిలశకుంతము కైటభజిత్కుమారసా
మంతము భృంగమార్గణశమంతము సర్వవసుంధరాస్థలా
క్రాంతము పాంథజీవనదురంతము దోఁచె వసంత మయ్యెడన్.

355

వసంతఋతువర్ణనము

క.

కలకంఠశుకపికావళి
కలకలరవముల నెసంగెఁ గాననభూముల్
జలజేందీవరహల్లక
కలితములై యొప్పుచుండెఁ గాసారంబుల్.

356

వ.

ఇ ట్లఖిలజనచిత్తానందకరంబును సమస్తమంగళాయతనంబును
సశేషవృక్షవాటికాజీవనౌషధమును రతిరాజవిజయకార
ణంబు నైన యవ్వసంతసమయమున నాబ్రహ్మక్షత్రియ
నందను లిరువురు వినోదార్థముగా వనమునకుం జని
యథేచ్ఛావిహారముల వర్తింపుచున్నంత నతిదూరంబునఁ
గ్రీడించుచున్న గంధర్వకన్యలం జూచి తద్విలాసాతిశయ
ములకుఁ దనమనంబున విస్మయము దీపింప శుచివ్రతుం
జూచి ధర్మగుప్తుం డి ట్లనియె.

357


శా.

అన్నా కన్గొను మివ్వనాంతరమునం దత్యంతసౌందర్యసం
పన్నాకారము లొప్ప దివ్యవనితల్ భాసిల్లుచున్నారు ద
త్సాన్నిధ్యంబున కేఁగి చూతము విలాసార్థంబుగా నీవు ర
మ్మన్నన్ భూసురనందనుం డనియె సాంత్వాలాపపూర్వంబుగన్.

358


చ.

బుధులము బ్రహ్మచారులము పూర్ణవయస్కులమై నితాంతవా
ఙ్మధురిమముం జలత్కపటమానసికంబులు గల్గుస్త్రీలస
న్నిధిఁ జరియింపఁ బోవఁ దగునే మన కిప్పుడు గ్రమ్మరంగ న
త్యధికరయంబున న్నిజగృహంబున కేఁగుట యుక్త మారయన్.

359


క.

నావిని రాజతనూభవుఁ
డావిప్రకుమారుతోడ నటులైనఁ దగన్
నీ విచట నుండు మిప్పుడు
వే వచ్చెద ననుచుఁ బలికి వేడుకఁ జనియెన్.

360


శా.

ఆరాజన్యకుమారుఁ డొక్కరుఁడ యుద్యానప్రదేశంబునం
దారమామణులం గనుంగొనఁగ నత్యానందభావంబునన్
జేరన్వచ్చినచో నొకానొకవరస్త్రీరత్న మారాసుతున్
శ్రీరంజిల్లఁగఁ జూచి యద్భుతముగాఁ జింతించెఁ జిత్తంబునన్.

361

శా.

మారుండో నలకూబరుండో విధుడో మానుష్యదేహంబునం
జేరన్ వచ్చె నిజేచ్ఛతో నిపు డహో చిత్రంబు చర్చింప నీ
తారుణ్యస్థితి యీదరస్మితము నీదైర్యంబు శౌర్యంబు ము
న్నేరాజన్యకుమారరత్నములయం దీక్షింపలే దెన్నఁడున్.

362


చ.

కమలదళాయతేక్షణుఁడు కంబుగళుం డతిదీర్ఘబాహుఁడున్
సమదగజేంద్రయానుఁడు విశాలసువక్షుఁడు సుందరాననుం
డమలసువర్ణవర్ణుఁ డగు నట్టిగుణోన్నతు నంబుజాసనుం
డమర సృజించె నౌర యహహా యనుచుం దల యూఁచు మాటికిన్.

363


ఉ.

ఈనరనాథచంద్రుఁడు మహేంద్రకుమారనిభుండు గావునన్
వీని వరింప నామదికి వేడ్క జనించె నటంచు నుండ నా
లోన నతండు వచ్చి విమలోత్పలనేత్రి మరాళగామినిం
భూసుతుఁ డైనచిత్రరథుపుత్త్రికయై తగుదానిఁ గన్గొనెన్.

364


మ.

కని యిక్కోమలి దేవతాయువతియో గంధర్వరాట్కన్యయో
దనుజేట్పుత్త్రియొ నాగకామినియొ సిద్ధాపత్యమో లోకమో
హినియై తోఁచె నటంచు రాసుతుఁడు దా నీక్షించె నీలాలకన్
కనకాంగిం గరిరాజగామిని శరత్కంజాతపత్రేక్షణన్.

365


ఆ.

అదియు నృపకుమారుహావభావవిలాస
విభ్రమములఁ జూచి వేడ్కతోడ
నచటఁ జెలుల నునిచి యారాజసుతునకు
నెదురువచ్చి ప్రీతి నిట్టు లనియె.

366


క.

ఓరాజతనయ భవదా
గారంబున కేఁగు మిపుడు గార్యార్థముగా
నీరేయి గడపి క్రమ్మఱ
వేరమ్ము ప్రభాతమునను వెలయు శుభంబుల్.

367

వ.

అని పల్కి యాగంధర్వరాజకన్యక సఖీజనసమీపంబునకు
మరలం జనియె నంత నారాజకుమారుండును భూసుర
నందనుం డున్నయెడకు వచ్చి గృహంబునకుం జని తమతల్లికి
మనఃప్రియంబు గావింపుచు నారేయి గడపి మరునాఁడు
ప్రభాతకాలంబున ద్విజపుత్రకసహితంబుగా వనంబుఁ
బ్రవేశించి పూర్వనిర్దిష్టం బైనప్రదేశంబునకుం జని.

368


క.

కనుఁగొనె నాబాలకయుగ
మనుపమతేజోభిరాము డఁగుచిత్రరథుం
దనయాయుతుఁడై యతఁడును
గనె నంతఁ గుమారకుల వికాసితముఖులన్.

369

చిత్రరథుం డను గంధర్వరాజు ధర్మగుప్తునకుఁ దనకూఁతు నిచ్చి వివాహం బొనర్చుట.

ఆ.

కాంచి మోద మలర గంధర్వనాథుండు
సాదరముగ వారి సన్నుతించి
లలితవృక్షమూలతలమునఁ గూర్చుండి
నృపకుమారుతోడ నిట్టు లనియె.

370


సీ.

భూపాలసుత విను పూర్వదినంబున
        జనియుంటి కైలాసశైలమునకు
నాస్థలంబున గంటి నార్యాసమేతుఁడై
       వెలయుమహాదేవు విశ్వనాథు
నంత నద్దేవేశుఁ డఖిలసుపర్వులు
       వినఁగ నాతో నిట్టు లనుచుఁ బలికె
ధర్మగుప్తుం డనుధరణీశనందనుఁ
       డొకఁడు వర్తించు నీయుర్వియందు

ఆ.

నతఁ డకించనుండు హతబాంధవుండును
భ్రష్టరాజ్యుఁ డగుచుఁ బరఁగుచుండు
సరసభావ మలర గురువాక్యమునఁ జేసి
చెలఁగి నన్నుఁ బూజ సేయుచుండు.

371


క.

హతబంధుం డగునాతని
పితరులు నాలోకమునను బ్రియముగ సౌఖ్య
స్థితినున్నవారు తగఁ ద
త్కృతపూజామహిమఁ జేసి కీర్తి చెలంగెన్.

372


ఉ.

నీవు వివేకశాలి వతినిశ్చలచిత్తుఁడ వట్లు గావున
న్నే వచియించెదన్ వినుము నిర్మలసద్గుణగణ్యుఁ డైనయా
భూవరనందనుండు పరభూపతుల న్వధియించి రాజ్యసం
భావితవృత్తి నుండ ననపాయసహాయత చేయు మేర్పడన్.

373


క.

అని యానతిచ్చిన సుమే
శునియాజ్ఞ మదీయ మైనశుభగృహమునకుం
జనుదేరఁగ నంతట మ
త్తనయాప్రార్థితుఁడ నైతిఁ దద్దయుఁ బ్రీతిన్.

374


సీ.

అటుగాన నీశ్వరునాదేశమంతయుఁ
        దెలిసి మదీయపుత్త్రికను గొనుచుఁ
జనుదెంచినాఁడ నివ్వనమున కే నిప్పు
        డతిమైత్రితోడ మత్సుత గ్రహింపు
మటుమీఁద భవదీయకుటిలశాత్రవరాజ
        సముదయంబుల నెల్ల సంహరించి
నీదుసామ్రాజ్యంబు నీ కిత్తు శివునాన
        ప్రేమ నీకనకాంగిఁ బెండ్లియాడి

తే.

వైభవము మీఱఁ బదివేలవత్సరంబు
లధికకల్యాణసౌఖ్యంబు లనుభవించి
యంత కిన్నరయక్షవిద్యాధరాది
సేవ్య మగుశివపదమును జేరఁగలవు.

375


క.

అని పలుకుచు గంధర్వుఁడు
తనపుత్త్రిక నొసఁగి రాజతనయునకును ద
ద్వనమధ్యమున వివాహం
బొనరించె యథోక్తవిధి మహోత్సవ మెసఁగన్.

376


వ.

ఇవ్విధంబున గంధర్వనాయకుం డారాజనందనునకుఁ బర
మోత్సవంబుగా నిజతనూజం బాణిగ్రహణంబు సేయించి
పారిబర్హంబుగాఁ గనకరత్నమయంబు లైన యమేయ
దివ్యాంబరాభరణంబులును భాసమానంబులగు ముక్తాహారం
బులును చంద్రసన్నిభం బైనశిరోరత్నంబును దశసహస్ర
భద్రగజంబులును నీలవర్ణంబు లైనతురంగనియుతంబులును
అనేకసహస్రసంఖ్యాతంబు లైనకాంచనస్యందనంబులును
మఱియు నొక్కదివ్యరథంబును దివ్యకార్ముకంబును దివ్యాస్త్ర
మంత్రప్రయోగోపసంహారంబులును అక్షయసాయకంబు
లును దూణీరయుగళములును అభ్యేదం బయినధర్మ
వర్మంబును శత్రుమర్దనం బైనఖడ్గంబును అమోఘం
బయిన శక్తియును దుహితృపరిచర్యార్థంబుగా దాసీజన
సహస్రంబు నొసంగిన నారాజకుమారుండు మహదైశ్వర్య
సంపన్నుండై నిజభార్యాసమేతంబుగాఁ బరమానందంబునుం
జెందియుండె నంత నాగంధర్వుండు నాదంపతుల వీడ్కొని
విమానారూఢుం డై క్రమ్మఱ నిజలోకంబునకుం జనియె

నంత నారాజనందనుం డయ్యుమాపుత్త్రుం డయిన శుచి
వ్రతున కి ట్లనియె.

377


తే.

సమరమున వైరివీరుల సంహరించి
యస్మదీయమహీరాజ్య మాక్రమించి
మిమ్ము రావింతు నని పల్క సమ్మతించి
చనియె ద్విజనందనుం డాత్మసదనమునకు.

378


వ.

తదనంతరంబ.

379

ధర్మగుప్తమహారాజు తనశత్రు వైనదుర్మర్షణుని వధించి తనరాజ్యంబు మరలఁ గైకొనుట.

మ.

కృతకృత్యుండగు ధర్మగుప్తవిభుఁ డీరీతిన్‌ గృతోద్వాహుఁడై
చతురంగంబులు గొల్వఁగాఁ జని ద్విషత్సైన్యంబులం ద్రుంచి యు
ద్ధతి దుర్మర్షణుఁ బోరిలో శ్వశురదత్తం బైనయాశక్తిచే
హతునిన్ జేసి పురంబుఁ జొచ్చె నిజమిత్రామాత్యయుక్తంబుగన్.

380


శా.

భేరీవాద్యము లుల్లసిల్లఁ బరమప్రీతాత్ముఁడై వైభవ
శ్రీ రంజిల్లఁ బురంబుఁ జొచ్చి విలసత్సింహాసనాసీనుఁ డై
గౌరీనాథుకృపాకటాక్షమున దోర్గర్వంబు దీపింపఁగా
దా రాజ్యం బొనరింపుచుండెను సమస్తారాతిసంహారుఁడై.

381


సీ.

ఏవిప్రసతి మాతృహీనునిఁ దనుఁ దెచ్చి
        మచ్చిక చేసి చన్నిచ్చి పెంచె
జాతకర్మాదిసంస్కారంబు లొనరించి
        శ్రీగురుకారుణ్యసిద్ధుఁ జేసె
సతతప్రదోషసువ్రతశీలు గావించి
        పరమేశుపూజనాపరుని జేసె

ఘోరదారిద్ర్యాంధకారంబు లెడఁబాపి
        భాసురైశ్వర్యసంపన్నుఁ జేసె


తే.

నట్టియాభూసురాంగన నపుడు తనయ
సంయుతంబుగ రప్పించి జననిమాడ్కిఁ
దనదు శుద్ధాంతమున నుంచి దయ దలిర్ప
నిజవధూయుక్తుఁ డగుచు మన్నింపుచుండె.

382


క.

ఆరాజదంపతుల తన
కూరిమి రంజిల్లఁగాను గోడలుఁ గొడుకుం
గా రహి భావింపుచు నతి
గారాబము చేయుచుండె గాంభీర్యమతిన్.

383


వ.

ఇవ్విధంబున.

384


మ.

జనకుం జంపినవైరము న్మరలఁగా సాధించి దుర్మర్షణుం
జనితామర్షణుఁ బోరిలోఁ దునిమి రాజ్యం బేలెఁ దాఁ గ్రమ్మరన్
జనసంస్తుత్యుఁడు ధర్మగుప్తుఁడు శివాచారంబు దీపింప న
జ్జననాథాగ్రణిసాటిగాఁ గలరె భూచక్రంబులోఁ బార్థివుల్.

385


క.

దశవర్షసహస్రంబులు
పశుపతిపూజావినోదపారీణుం డై
భృశతరసామ్రాజ్యశ్రీ
వశుఁ డయి నిష్కంటకముగ వసుమతి నేలెన్.

386


వ.

ఇట్లు ధర్మగుప్తుండు జన్మాంతరకృతం బయినప్రదోషశివ
పూజావమానదోషంబున బాల్యకాలమునఁ దాదృశం
బగుదైన్యం బనుభవించి క్రమ్మఱ మహేశ్వరారాధనతత్ప
రుండయి తత్సుకృతమున నిజభార్య యైనగంధర్వకన్యక
తోడం గూడి పితృపైతామహం బయినరాజ్యమున నఖండ

సామ్రాజ్యభోగము లనుభవించి యంత్యమున ననంతతేజో
విరాజమానం బయినశివలోకమ్మున సుఖం బుండె నని చెప్పి
సూతుం డి ట్లనియె.

387


సీ.

వినుఁడు తాపసులార విఖ్యాతిగఁ బ్రదోష
        కాలంబునందు శంకరునిపూజ
గావింప ధర్మార్థకామమోక్షములకు
        సాధకంబై యుండు సత్యముగను
నేకాలమం దయిన నీయుపాఖ్యానంబు
        వినియెడి సజ్జనవితతికెల్ల
భవబంధములు వాయు భవశతములనైన
        దారిద్ర్యమనుమాట దలఁచరాదు


తే.

అట్లు గావున పుణ్యాత్ము లైనవారు
శివసమారాధనముఁ జేసి చిరతరముగ
భుక్తిముక్తులు గాంతు రప్పురుషవరుల
పాదరజములు జగముఁ బావనము సేయు.

388


పంచవర్గరహితము.

హరిశర శివ సర్వేశ్వర
సురసేవ్య హలాహలాశ శూలవరశయా
సురవైరివీరసంహర
శరహంసయశోవిలాస శైలావాసా.

389


ఉ.

గోపతిముఖ్యదేవమునికోటిసమర్చితపాదపీఠతా
రాపథవాహినీజలవిరాజితమస్తకభానునందనా
టోపవిభేదకారణపటుస్ఫుటకాంచనశైలకార్ముకాం
బాపురపార్థివేశ్వర విపన్నజనావన లోకపావనా.

390

కవిరాజవిరాజితము.

భవహర శంకర భర్గ శివంకర భక్తవశంకర పాపహరా
భువనసుజీవన పోషితరావణ భూతవిలేపన సౌఖ్యకరా
సవనవిదారణ సన్నుతచారణ శాత్రవమారణ శూలధరా
సువసితభూధర సోమకళాధర శోషితసింధుర దైత్యవరా.


గద్యము.

ఇది శ్రీమద్రామభద్రకరుణాకటాక్షవీక్షణసమాలబ్ధ
గీర్వాణాంధ్రభాషాకవిత్వకళాధురంధర బడగలనాటి
కన్నడవంశపయఃపారావారారాకాసుధాకర ఆశ్వలాయన
సూత్ర భారద్వాజసగోత్ర శ్రీధరమల్లె అయ్యనార్యతనయ
సూరిజనవిధేయ వేంకటరామనామధేయప్రణీతం బైన
బ్రహ్మోత్తరఖండం బనుమహాపురాణమునందు కల్మాషపాదు
చరితమును గోకర్ణమహత్త్వమును జండాలీకథనమును
దీపమాలికాప్రదానఫలమును శివయోగి యైనమాణి
భద్రుండు చంద్రసేనమహారాజునకుఁ జింతామణి యొసం
గుటయుఁ దత్కారణమున సకలదేశాధిపతులు దద్విభవము
సహింపఁజాలక యుజ్జయినీనగరముచుట్టు విడియుటయు
శంకరసమర్చనమును శ్రీకంఠోపాఖ్యానమును హనుమ
ద్దర్శనమును దేవాధిపతులు చంద్రసేనమహారాజుతో
మైత్రిఁ గావించి క్రమ్మఱం దమతమ నగరములకుఁ జను
టయు ధర్మగుప్తజననమును శాండిల్యమహాముని యను
గ్రహము వడసి ప్రదోషపూజనము సేయుటయును దత్ప్ర
భావమున గంధర్వపతి యైనచిత్రరథుపుత్రిం బాణిగ్రహ
ణము గావించి చతురంగబలసమేతుం డయి దుర్మర్షణుం
జయించి పిత్ర్యం బయినరాజ్యంబు వడయుటయు నను
కథలుఁగల ద్వితీయాశ్వాసము

  1. నహోరాత్రంబు లనన్యమానసుండయి శివారాధనానందభరితుండయి
        యుండు నట్టి సమయంబున.

    క. ఆపురిఁ గాఁపురముండిన, గోపవధూవిధవ యొకతె గొడుకును మేధా
        టోపునిఁ బంచాబ్దంబుల, పాపని దయ నెత్తికొనుచుఁ బ్రముదితమతియై.

    వ. అమ్మహాదేవుదేవాలయంబులోపలికిం జని యం దొక్కచోట.

    తే. నిలిచి యాదేవదేవుని నీలకంఠు, భక్తవత్సలుఁ బార్వతీప్రాణనాథు
        శ్రీమహాకాళదేవునిఁ జేరి భక్తిఁ, బూజ కావించుధాత్రీశుఁ బొంచి చూచి.

    వ. అప్పు డవ్వల్లవపల్లవాధరి మఱియు నారాజమూర్ధన్యుండు ధన్యుండయి
       యద్దరాధరధనుర్ధరు నీశ్వరు వివిధోపాయంబుఁల ధ్యానంబున నారాధనంబు
       సేయు తద్విధానంబు సర్వంబునుం గనుంగొని మనంబున బెనంగొను
       సంతసంబున నచ్చటిముక్కంటికి మ్రొక్కి యక్కొడుకుం దానును
       నిజశిబిరంబునకుం జనుదెంచి యుండునంత.

    క. ఆగోపస్త్రీసుతుఁ డను, రాగంబున భక్తితోడ రాజేంద్రుఁడు త
        ద్భోగివిభూషణుపూజలు, బాగుగఁ జేయుటలు చూచి భావములోనన్.

    క. పలుమఱుఁ దద్విధమంతయుఁ, దలఁచుచు నబ్బాలకుండు దాత్పర్యమునం
        బలుపుగఁ బువ్వులు బత్రియుఁ, జెలువుగ నవియెల్లఁ దెచ్చి శివుఁ బూజింపన్.

    వ. ఇట్లు తనకు మనోహరంబు లయినపత్రపుష్పంబులు దెచ్చుకొని భుక్తి
        ముక్తిప్రదాయకం బగుశివపూజ సేయ నుద్యోగించి.

    ఆ. తడయ కపుడు వాఁడు దనయింటిచేరువ, నున్నపాడుగుడిసె నూడ్చి యలికి
        యందులోన హృద్య మగునొకశిలఁ, దెచ్చి దివ్యలింగముగఁ బ్రతిష్ఠచేసి.

    ఆ. అపుడు వేడ్కతోడ నభిషేక మొనరించి, వస్త్రభూషణములు వరుస గంధ
        మక్షతలు నొసంగినట్టివాఁడై పత్ర, పుష్పములను బొసఁగఁ బూజసేసి.

    వ. ధూపధీపనైవేద్యతాంబూలాదు లాత్మఁ గల్పించి సమర్పించినవాఁడయి
        యప్పుడు.