బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము

చతుర్థాశ్వాసము

శ్రీకలితాంబాపురసద
నాకంధినిషంగధరణ నానావిద్వి
డ్భీకరశూలపరశ్వథ
నాకాధిపపూజ్యచరణ నాగాభరణా.

1


వ.

దేవా యవధరింపు మశేషపురాణకథాకథనదక్షుం డయిన
సూతుం డమ్మహామునుల నవలోకించి వెండియు నిట్లనియె.

2


చ.

వినుఁడు మునీంద్రులార పృథివీస్థలి నెన్నఁగ శ్రీమహేశవూ
జనము లొనర్చుమానవుల సచ్చరితంబులు భుక్తిముక్తిసా
ధనములు జన్మదైన్యభయతాపహరంబులు సర్వలోకరం
జనములు నై యశేషకలుషంబు లడంచును విన్నవారికిన్.

3


క.

ఘటనాఘటనసమర్థులు
నిటలాక్షునిభక్తు లతివినిర్మలహృదయుల్
ఘటికాసిద్ధులు వారల
పటుతరమహిమంబు లెన్న బ్రహ్మకు వశమే.

4


క.

వరధేనువులకుఁ దృణమును
జెఱకుల కుదక మిడినట్లు శివభక్తుల కా
దరణ మొనర్చిన జనులకు
నరయఁగ నది కోటిమడుఁగు లై ఫల మొసఁగున్.

5


వ.

అట్లు గావున శివభక్తుల సామర్థ్యంబులు దెలియుటకుం గా
నొక్కయితిహాసము గలదు దానిం జెప్పెద సావధానమతుల
రై వినుండని సూతుం డి ట్లనియె.

6

మందరుండను బ్రాహ్మణునిచరిత్ర

చ.

సురుచిరహేమరత్నగృహశోభితమైనయవంతికాపురాం
తరమున నొక్కవిప్రుఁడు సదా విషయాభిరతుండు సత్యశౌ
చరహితుఁ డంగనారతుఁడు చంచలచిత్తుఁడు దుర్మదుండు మం
దరుఁడను పేరుగల్గి సతతంబును గాఁపుర ముండు నచ్చటన్.

7


ఉ.

అంగదహారకుండలముఖాభరణంబులు దాల్చి గంధసా
రంగమదప్రలిప్తరుచిరాంగము శోభిల నాపురంబునం
బింగళనాఁ బరంగి కడుఁబేర్మి వహించినదాని నొక్కవే
శ్యాంగన గూడియుండు నతఁ డంగజతంత్రముల న్మెలంగుచున్.

8

ఋషభయోగి మందరుం డనుభ్రాహ్మణుగృహంబునకు వచ్చుట

తే.

స్నానసంధ్యాద్యనుష్ఠానహీనుఁ డగుచు
జాతిమాత్రోపవీతియై సంచరింప
నతనిగృహమున కొక్కనాఁ డరుగుదెంచె
విషమనేత్రకృపాభోగి ఋషభయోగి.

9


వ.

అంత.

10


సీ.

సిద్ధసేవ్యుఁడు సదాశివమూర్తి యైనట్టి
        కృతపుణ్యు ఋషభయోగీంద్రుఁ గాంచి
వేశ్యాసమేతుఁ డై విప్రవంశజుఁ డంతఁ
        దగ నెదురేఁగి పాదముల కెఱఁగి
యర్ఘ్యపాద్యాదుల నర్చించి ముద మొప్ప
        విమలహిరణ్యపీఠమున నునిచి
మృష్టాన్నపానసంతుష్టుని గావించి
        తాంబూల మిచ్చుచుఁ దల్పమందుఁ

తే.

బండఁ జేసియుఁ దాను తత్పాదపద్మ
యుగము లొత్తుచు నారాత్రిపగలు భక్తి
సేవ గావింప సంతుష్టచిత్తుఁ డగుచుఁ
జెలఁగె నవ్వేళ నాయోగిశేఖరుండు.

11


క.

ఈవిధమున నాఋషభుం
డావిటదంపతులచేత నర్చితుఁ డగుచున్
దైవగతి నుండి క్రమ్మఱ
నావేకువ నరిగె నమ్మహామహుఁ డంతన్.

12


క.

ఈలీలనుండు నాద్విజు
మూలం బెఱిఁగింతు వినుఁడు పూర్వంబున దు
శ్శీలుండై నిజదాసీ
లోలత గలయాయజామిళుం డితఁ డరయన్.

13


వ.

అని చెప్పి వెండియు సూతుం డిట్లనియె నివ్విధంబున నా
విప్రుండును దదీయవేశ్యయుఁ గొంతకాలంబు వర్తించి
తదనంతరంబున విగతప్రాయులై కాలవశతం బొంది రంత
నవ్విప్రుఁడును నిజకృతకర్మానుభవంబునకై పునర్జనన
మందుటకొఱకు దశార్ణదేశాధీశ్వరుం డగువజ్రబాహుఁ
డనురాజున కగ్రమహిషి యైనసుమతి యనుదానిగర్భంబు
నాశ్రయించి యున్నంత.

14


క.

దుర్భరభారాన్వితయై
గర్భిణియై యున్న సుమతిఁ గని సైఁపక నా
విర్భూతకైతవంబున
నిర్భరగరళాన్న మిడిరి నెలఁతకు సవతుల్.

15

తే.

ఘోరతరమైనతద్విషం బారగించి
సుమతి మృతి దప్పె దైవయోగమునఁ జేసి
యంత సంతాపదుస్సహం బౌనవస్థఁ
జెందియుండె మదేభేంద్రమందగమన.

16


శా.

ఆలో నొక్కదినంబునందుఁ దనయుం డారాజ్ఞికిం బుట్టె ను
ద్వేలాక్రందనఘోషణాన్వితుఁడు దుస్తేజుండునై దుస్సహ
క్ష్వేళప్రాప్తమహాప్రణాళి నతివిచ్ఛిన్నాంగుఁడై యుండె నా
బాలుం డట్లనయుండు తజ్జననియున్ బాధాపరీతాత్మయై.

17


క.

ఆరాజు నిజకళత్రకు
మారులకు విషాపహరణమంత్రౌషధస
త్కారంబు లాచరించిన
నారోగ్యత లేక యుండి రతిదుఃఖితులై.

18


తే.

ఇ ట్లహోరాత్రములు రోదనేచ్ఛఁ దగిలి
యున్నఁ జూచి యసహ్యత యొదవుచుండ
బంధుమిత్రపురోహితప్రముఖజనులఁ
గాంచి నరపతి పల్కె నిష్కరుణుఁ డగుచు.

19


క.

ఈరమణీసుతు లతివి
స్తారాంహోజాతరోగతాపవ్యధితు
ల్వీరలకతమున నిద్రా
హారంబులు దూరమయ్యె ననవరతంబున్.

20


క.

నరకాలయులై యిచ్చటి
కరుదెంచినవారు వీరి నతిదూరముగాఁ
బరపెద దేశము వెడలన్
జిరతరరోగార్తులను విశీర్ణాకృతులన్.

21

వజ్రబాహుండు తనజ్యేష్ఠభార్యయైన సుమతిని పుత్రసహితంబుగా నరణ్యంబున కనుచుట

వ.

అని నిశ్చయించి యాభూనాథుండు కనిష్ఠపత్నీవ్యాస
క్తుండు గావున నిజసారథిం బిలిచి నీ విక్కామినీడింభకుల
నరదంబుపై నిడుకొని మనదేశంబు వెడలునంతకుం గొని
పోయి విజనప్రదేశంబున వారలం డించి రమ్మని పంచిన
వాఁడును "వల్లె" యని రాజశాసనప్రకారంబున బహు
యోజనవిస్తారం బయినదూరంబు గొనిపోయి యచ్చట.

22


శా.

క్రూరవ్యాళభయానకంబు బహురక్షోగుహ్యకాభీలమున్
వీరచ్ఛన్నము నైనకాఱడవి దుర్వృత్తి న్విసర్జించి ని
ష్కారుణ్యుం డగుసూతుఁ డేఁగిన మహోత్కంపంబు దీపింపఁగా
నారాజాంగన యంతటం జనియెఁ గొండారణ్యమార్గంబునన్.

23


క.

ఘోరవ్యాఘ్రమృగాదన
వారణగవయాచ్ఛభల్లవానరఝల్లీ
దారుణ మగుకాననమున
దారకు నెత్తుకొని చనియెఁ దరళేక్షణయున్.

24


వ.

ఇట్లు వాతాతపదుర్గమంబును నిర్మనుష్యంబును వేత్రకీచక
వేణుకంటకపాదపలతాకీర్ణంబును నైనయమ్మహారణ్యమార్గం
బునంబడి యారాజభామిని ఝల్లీరవంబులకు నులుకుచు
కంకకాకగృద్రోలూకఘూత్కారంబులకు భయంబు నొందు
చు వనమదేభంబులం గాంచి పలాయనంబు నొందుచు
వరాహమహిషజంబుకమార్జాలాదిక్రూరమృగసంచా
రంబులకు వెఱచుచుం జనుచున్న సమయంబున గమనా
శక్తయు క్షుత్పిపాసాతురయు శీతవాతాతపక్లాంతయు

క్షురాశ్మకంటకప్రచ్ఛిన్నపాదయు ముక్తకేశియు భయ
భ్రాంతచిత్తయునై ప్రాగ్జన్మదురితకర్మంబుల నిందించుకొనుచు
నిట్టూర్పు లెగయ ధరణీతలంబునం బడుచు లేచుచు మంద
మందగమనంబుల నరుగుచున్నంత.

25


మ.

ఒకచో వ్యాఘ్రమహారవంబు లోకచో నుద్దండభల్లూకగం
డకసారంగవృకస్వనంబు లొకచోటన్ భూతబేతాళగు
హ్యకశబ్దంబులు నొక్కతావున మహోద్యద్బ్రహ్మరక్షఃపిశా
చకహుంకారము లాలకింపుచు నికుంజవ్రాతము ల్దూరుచున్.

26


క.

దుర్గమకాంతారమహీ
మార్గంబులు దప్పి మరల మరలం జనుచు
న్నిర్గళితసకలసుఖయై
దుర్గంబు లతిక్రమించి తొయ్యలి యంతన్.

27


శా.

ఆరాజాంగన బాలు నెత్తుకొని ఘోరారణ్యదేశంబులన్
ధీరప్రజ్ఞ నతిక్రమించి హయదంతిస్యందనాకీర్ణమున్
దూరీభూతభయంబు సర్వజనసందోహాన్వితం బైనకా
శీరామేశ్వరసత్పథం బొకటి గాంచెన్ దైవయోగంబునన్.

28

సుమతి దైవవశంబునఁ బద్మాకరుం డనువైద్యునిపట్టణంబుఁ జేరి యతనిచే మన్ననలఁ బొందుట

క.

నరనాథకుటుంబిని యా
తెరువునఁ జని కొంతవడికి దృఢమతి నానా
వరనారీశోభితమై
మురువగు నొకవైశ్యపురము ముందటఁ గాంచెన్.

29


క.

హాటకరత్నధనంబులఁ
గోటికిఁ బడగెత్తినట్టికోమటు లొప్పం

బాటతలంబున వెలసిన
పేటఁ బ్రవేశించె నపుడు ప్రియము దలిర్పన్.

30


సీ.

ఆవైశ్యపురమున కధినాథుఁడై యుండు
        పద్మాకరుం డనుభద్రయశుఁడు
గురుకృషివాణిజ్యగోరక్షణరతుండు
        ధనవంతుఁ డత్యంతధార్మికుండు
అతనిమందిరదాసి యరుదెంచి యారాజ్ఞి
        నీక్షించి యడిగె నీ వెవ్వరనుచు
నడిగినయింతితో నారాజమహిషియుఁ
       దనదువృత్తాంత మంతయు వచించె


తే.

నంత నావార్త యాలేమ యరసి వచ్చి
సంభ్రమము దోఁపఁగా నిజస్వామితోడ
విన్నవించిన నతఁడు సవిస్మయముగ
నావధూమణి రప్పించి యాదరించి.

31


క.

తనవృత్తాంతం బడిగిన
విని యాసతి దనకు సవతి విష మొసఁగుటయుం
దనబాలకునియవస్థయుఁ
దనదుపరిత్యాగమును యథాస్థితిఁ జెప్పెన్.

32


తే.

అంత నారాజ్ఞివచనంబు లాలకించి
యావణిక్పతి దనమది నహహ యెంత
కష్టమొందె నటంచును గాఢచింత
నొంది తలయూఁచి కారుణ్యయుక్తుడగుచు.

33


ఉ.

అమ్మదిరేక్షణ న్నిజగృహాంతికసీమ రహస్య మైనగే
హమ్మున నుంచి దివ్యశయనాసనభోజనపానవస్త్రమా

ల్యమ్ముల నౌషధక్రియల నాదరణం బొనరించి మాతృసా
మ్యమ్ముగఁ బూజ సేసె బుధమాన్యుఁడు వైశ్యవిభుండు నెమ్మితోన్.

34


ఉ.

ఆనిలయంబునందు వసుధాధిపగేహిని యాత్మసూనుఁడుం
దాను వసించి యుండ నిరతంబును వైద్యులఁ బిల్వఁబంచి స
న్మానమొనర్చి వైశ్యపతి నవ్యవిషాపహరౌషధంబు లె
న్నేని యొసంగె వారలకు నిష్కపటంబుగ ధర్మకాంక్షియై.

35


క.

ఎన్ని చికిత్స లొనర్చిన
నున్నతముగఁ బూదిలోనిహోమం బగుచు
న్నెన్నాళ్లకు రుజమానక
క్రన్నన నాశిశువు చనియె గతజీవుం డై.

36

మృతుం డైనకుమారునిం గూర్చి సుమతి విలపించుట

వ.

ఇట్లు విగతప్రాణుండై పడియున్న నిజకుమారుం గాంచి
యారాజపత్ని హాహాకారంబులు సేయుచు నత్యంతవిషా
దంబునఁ బరిదేవనం బొనరింపుచున్న సమయంబున నయ్యా
క్రందనధ్వని విని పురంబునం గలవైశ్యస్త్రీజనంబు లచ్చ
టికిం జనుదెంచి బహువిధంబు లగుస్వాంతనాలాపంబుల
నూరడింపుచుండ నయ్యింతియుఁ దద్దయు ఖేదంబున నా
బాలకునుద్దేశించి.

37


క.

హా రాజసన్నిభానన
హా రాజకుమార ధీర హా సుకుమారా
హా రవిసన్నిభతేజా
హా రమణీయాంగ యనుచు నాక్రందించెన్.

38


ఉ.

పాపము లెన్ని చేసితినొ బాలక పూర్వభవంబునందు న
త్యాపదఁ జెందె నిప్పు డహహా విషవేదనచే నితాంతసం

తాపముఁ జెందుఁగాని మరణంబు లభింపకయుండ వ్రాసె నే
కాపురుషుండు బ్రహ్మ యెటుగా నిఁక దాఁటెద దుఃఖవారిధిన్.

39


సీ.

తనసపత్నుల కేరికిని లేక నావంటి
         పాపిష్ఠి కేల గర్భంబు గలిగెఁ
గలిగిన నేమాయెఁ గాపట్యమునఁ గాంత
         లీరీతిని విషాన్న మిడఁగఁ దగునె
ఇడినమాత్రన ప్రాణ మెడలకుండఁగ నేల
         బహుతాపవేదనాభార మొదవె
నొదవెనే నిజభర్త యదయుఁడై మనమున
         నడవులపాలుగా విడువనగునె


తే.

విడిచెఁబో భైక్ష్యవృత్తి జీవింపకుండ
దైవ మీచందమున దయఁ దప్పఁదగునె
యిన్నిటికి మత్పురాకృతం బింతచేసెఁ
గాక వేఱొండు గలదె యోరాకుమార.

40


క.

పతిసంత్యక్త ననాథను
గతబాంధవఁగృపణవిపులకలుషాత్మక న
న్నతిదుఃఖాంబుధిఁ ద్రోయుచు
సుత యెక్కడఁ బోతి వనుచు శోకించునెడన్.

41

ఋషభయోగి సుమతికిఁ దత్వోపదేశంబు చేయుట

తే.

ఆవధూటివిషాదంబు నపనయింప
శక్తు లెవ్వరు లేకున్నసమయమునను
వచ్చెఁ దచ్ఛోకదుర్వ్యాధివైద్యుఁ డగుచుఁ
బూర్వవర్ణితశివయోగిపుంగవుండు.

42


ఉ.

అక్షసరంబు పాదుకలు నంచితభూతివిలేపనంబు రు

ద్రాక్షలు యోగదండము విరాజితలింగము నొప్పుచుండుఁ బ్ర
త్యక్షశివావతారుఁ డన దైవగతిం జనుదెంచె యోగిహ
ర్యక్షుఁడు శైవదీక్షుఁడు మహాత్ముఁడు నాఋషభుండు లీలతోన్.

43


ఉ.

వచ్చినయోగివర్యునకు వైశ్యవిభుం డెదురేఁగుదెంచి తో
డ్తెచ్చి మహార్ఘ్యపాద్యము లతిప్రియభక్తి నొసంగె నంత నా
సచ్చరితుండు రాజసతిసన్నిధికిం గరుణార్ద్రచిత్తుఁ డై
వచ్చి సుధాసమంబు లగువాక్కుల నిట్లని పల్కె నెమ్మితోన్.

44


సీ.

భూపాలసతి నీవు భూరిశోకంబునఁ
        బొరల నేటికి మూఢబుద్ధి వగుచు
నెవ్వఁడు జనియించు నెవ్వఁడు మృతిఁ బొందుఁ
       దెలియఁబల్కుము నాకు తేటపడఁగ
నీదేహసంఘంబు లెంచిచూచిన జల
       బుద్బుదంబులక్రియఁ బోవుచుండు
సత్త్వాదిగుణము లచ్చపుమాయతోఁగూడి
       సకలశరీరము ల్సంభవించు


తే.

సాత్త్వికంబున సురలు రాజసమువలన
మనుజులు మహోగ్ర మైనతామసమువలన
మృగచయంబులు పుట్టుఁ దన్మిశ్రములను
దలఁప బహుజంతుకులములై వెలయుచుండు.

45


క.

గురుసంసారభ్రమణుల
కరుదే తమపూర్వజన్మకర్మానుభవం
బిరవొందుసురలకైనను
నరు లనఁగా నెంతవారు నలినదళాక్షీ.

46


క.

కొందఱు కాలం బనుచును

గొందఱు కర్మం బటంచు గుణము లటంచుం
గొందఱు పంచాత్మక మని
యందురు తనుకారణములు హరినిభమధ్యా.

47


ఆ.

జనన మయ్యె ననుచు సంతోషమందరు
మృతినిఁ జెందె ననుచు వెతలఁబడరు
ధీరు లైనవారు దేహంబు వీక్షించి
భ్రాంతి నొంద రెపుడు పద్మనేత్రి.

48


క.

అవ్యక్తమున జనించును
నవ్యక్తమునంద యణఁగు నామధ్యమునన్
సువ్యక్తముగా నెనయును
భవ్యమతీ తనువు నిమిషభంగుర మరయన్.

49


క.

ఎప్పుడు గర్భగతుం డగు
నప్పుడ యాదేహి నాశమందుట సిద్ధం
బొప్పఁగ విధివశగతి నగు
నుప్పతిలుట చచ్చుటయు మహోత్పలగంధీ.

50


ఉ.

కొందఱు గర్భదేశములఁ గొందఱు సంభవమైనమాత్రనే
కొందఱు యౌవనంబునను గొందఱు వార్ధకతాదశన్ లయం
బందుదు రెల్లజంతువులు నాత్మభవాంతరకర్మరీతులం
జెంది సుఖాసుఖంబులు ప్రసిద్ధముగా భుజియింతు రందఱున్.

51


క.

పితృమాతృసురతసమయో
ద్గతతేజోరక్తమిశ్రతాజనితంబై
వితతంబై తను వలరును
సతి యనఁగాఁ బురుషుఁ డనఁగ షండుఁ డనంగన్.

52


ఆ.

సుకృతదుష్కృతములు సుఖదుఃఖములు మహా

విద్య తీర్థములును విభవములును
ఆయువును శుభంబు లజుఁడు వ్రాసినయట్ల
యనుభవింపుచుందు రఖిలజనులు.

53


క.

అనతిక్రమ మగుకర్మము
ఘనతరకాలంబుఁ గడవఁ గారాదు భువిన్
దనువులు శాశ్వతములుగా
వనయము శోకింపఁ దగునె యబలా నీకున్.

54


ఆ.

నిక్క మనరు జనులు నెలఁత స్వప్నంబులు
సత్య మగునె యింద్రజాలవిద్య
యీకళేబరంబు లెన్నిభంగుల నైన
శాశ్వతంబు లౌనె చంచలాక్షి.

55


సీ.

నీకు జన్మంబు లనేకంబు లైయుండ
        నిప్పు డీవ్యామోహ మెట్లు గలిగె
నెక్కడ జనకుండు నెక్కడ జననియు
        నెక్కడ నందనుం డెంచిచూడ
నెక్కడ వల్లభుం డెక్కడ ప్రియురాలు
        దైవమాయాకల్పితములుగాక
నిజదేహజమలంబు నీక్షించి సుతుఁ డంచు
        కించిద్‌జ్ఞ వగుచు శోకింపఁ దగునె


తే.

రక్తమాంసపురీషమూత్రాస్థినిచయ
పూయమేదోవసాశుక్లహేయ మగుచు
నస్వతంత్రం బశాశ్వతం బయినయట్టి
తనువుపైఁ గాంక్షసేయుట ధర్మమగునె?

56


క.

తపముల విద్యల బుద్ధిని

జపముల మంత్రౌషధముల సత్క్రియల మహా
నిపుణతల నెంతవారికి
విపులం బగుమృత్యుభయము విడుచునె చెపుమా.

57


ఆ.

మేనినీడపగిది మృత్యువు వర్తింప
జనుల కెట్లు సుఖము సంభవించు
వ్యాఘ్ర మెదుటనుండ వనమృగంబులకును
హర్ష మగునె మేఁత లారగింప.

58


వ.

అని చెప్పి వెండియు నమ్మహాత్ముం డి ట్లనియె.

59


శా.

ధీరోదాత్తుఁడనై వచింతు విను సాధ్వీసంచితాగామిక
ప్రారబ్ధాఘములెల్లఁ బాయుటకు నశ్రాంతంబు సద్భక్తితో
నారాధింపుము నీమనంబున విరూపాక్షున్ జగద్రక్షకున్
గౌరీవల్లభు నీలకంఠు నభవున్ గంగాధరున్ శంకరున్.

60


క.

అని యానతిచ్చి యిఁక నీ
మనమున శోకోపశమన మయ్యెనొ లేదో
వినుపింపు మనిన యోగీం
ద్రునిఁ గనుఁగొని యింతి పలికె దుఃఖితమతియై.

61


మ.

వరయోగీంద్ర భవత్కటాక్షమున భాస్వన్ముక్తి చేకూఱె నే
నరయ న్బాంధవభర్తృపుత్త్రకులఁ బాయం ద్రోచి యేకాంగినై
గరళక్లిష్టశరీర నైతిఁ నిఁక శోకవ్యాక్కుల న్మాన్పఁగా
మరణోపాయము దక్క నొండు గలవే మంత్రౌషధప్రక్రియల్.

62


వ.

అట్లు గావున నేను నీబాలకసహితంబుగా నరిగెద మరణో
పాయం బెఱిఁగింపవలయు నని దైన్యరసంబు దోఁపం బలికిన
యారాజపత్నివాక్యంబు లాకర్ణించి కారుణ్యసార్ద్రచిత్తుఁ
డై యమ్మహానుభావుండు సకలధర్మజ్ఞుండును గృతజ్ఞుండును

గావునఁ బూర్వోపకారంబుఁ దలంచి మృతుం డయినశిశువు
సమీపంబునకు వచ్చి.

63

ఋషభయోగీశ్వరుండు మృతుం డైనరాజకుమారుని బ్రతికించుట

ఉ.

భూవినుతప్రభావుఁ డగుపుణ్యుఁడు నాఋషభుండు మంత్రసం
భావిత మైనభూతి కరపద్మమునన్ ధరియించి దీర్ఘని
ద్రావశుఁ డైనబాలుఁ గని తన్ముఖమం దిడి క్రమ్మఱంగ సం
జీవితుఁ జేసె నప్పు డతిచిత్రముగాఁ జనులెల్లఁ జూడఁగన్.

64


క.

మెల్లనె కన్నులు విచ్చుచుఁ
బల్లవితేంద్రియుఁడు నగుచు బాలకుఁ డంతం
దల్లిఁ గనుంగొని మది రం
జిల్లఁగ నాక్రందనంబుఁ జేయందొడఁగెన్.

65


క.

చచ్చినబాలుఁడు గ్రమ్మఱ
విచ్చేయుట దలఁప నెంతవింత యనుచుఁ దా
రచ్చటినగరేశాదికు
లచ్చెరువుగఁ జూచి రపుడు హర్షము వెలయన్.

66


ఉ.

క్రొన్నెలవంటినెన్నుదుటఁ గుంతలము ల్వెలయంగనున్న యా
చిన్నికుమారుఁ గాంచి మది చెన్నెసలారఁ దదీయమాతఁ దాఁ
గన్నుల హర్షబాష్పములు గ్రమ్మగ బాలకు నెత్తి ప్రేమతోఁ
జన్నులు సేఁపఁ బాలొసఁగి సాధుజడాకృతి నుండె నయ్యెడన్.

67


చ.

పరమతపోబలాఢ్యుఁడు కృపానిధి యాఋషభాఖ్యయోగి య
య్యిరువుర దేహయుగ్మమున నీశ్వరమంత్రపవిత్రభూతిచేఁ
గర మనురక్తి లేపనముగా నొనరించినయంతమాత్ర ని
ష్ఠురవిషవేదన ల్విడిచి శోభితవజ్రశరీరులై రొగిన్.

68

సీ.

ఆరాజపత్నియు నారాజనందనుం
        డత్యంతరుచిరదేహములు దాల్చి
యింద్రవైభవశతం బినుమడించినభంగి
        నతిశయానందసౌఖ్యంబుఁ గాంచి
పాదపద్మములపైఁ బడియున్న యయ్యింతి
        గనుఁగొని ఋషభుండు కరుణదోఁపఁ
బలికె నోవత్స నీ విల చిరంజీవివై
        యుందువు సామ్రాజ్యయుక్త మగుచు


తే.

నెంతకాలంబు జీవింతు వంతతడవు
నీకు ముదిమియుఁ దెవులును లేకయుండు
నీతనూజుండు విద్యాసమేతుఁ డయిన
దనుక నిచ్చోట నుండుము వనజనేత్రి.

69


క.

భద్రాశ్వకృపాపాత్రుఁడు
భద్రయుతుం డగు నటంచు బాలకునకుఁ దా
భద్రాయు వనఁగఁ బేరిడి
భద్రగతిం జనియె యోగపారగుఁ డంతన్.

70


వ.

ఇ ట్లమ్మహానుభావుం డైనఋషభయోగీంద్రుండు మృతుం
డైనరాజనందనుని మహేశ్వరమంత్రపూతభస్మప్రభావ
మునఁ గ్రమ్మఱ సంజీవితుం జేసి యథేచ్ఛాగతిం జనియెనని
చెప్పి వెండియు నమ్మహామునులకు సూతుం డి ట్లనియె.

71


మ.

మునినాథోత్తములార మీరు వినుఁ డీముక్కంటిమాహాత్మ్యము
న్మును నేఁ జెప్పినవేశ్య పింగళ యనం బొల్పారుపూఁబోడి స
జ్జనసంస్తుత్యమహాప్రభావుఁ డగునాచంద్రాంగదక్ష్మాతలే
శునిసీమంతినికిం జనించె మరలన్ శుంభత్సువర్ణాంగియై.

72

క.

ఆకన్యామణి నిషధ
క్ష్మాకాంతునిపుత్త్రి కీర్తిమాలిని యనఁగా
లోకమున వెలసె సౌంద
ర్యాకారవిలాసములను రంభ యనంగన్.

73


క.

ఆదాశార్ణమహీపతి
గాదిలిపత్నియుఁ దనూభవసమేతముగా
మోదమున వైశ్యపురమున
సాదరమతి నుండె నపుడు సరసులు వొగడన్.

74


క.

ఆబాలుఁడు నానాఁటికి
బ్రాబల్యకళావిశేషపారీణుండై
శ్రీబాలచంద్రుకైవడి
ధీబలయుతుఁ డగుచుఁ బెఱిగెఁ దేజం బెసఁగన్.

75


క.

ఆరాజకుమారునకును
భూరిగుణుం డైనవైశ్యపుత్త్రకుఁడు మహో
దారుఁడు సునయుం డనువాఁ
డారయ సఖుఁ డయ్యె నచట నతిశయమైత్రిన్.

76


తే.

కాంచనాంగదకుండలకంకణాది
భూషణంబులు ధరియించి పొత్తుగూడి
బాలకక్రీడలను జోడువాయకుందు
రనుదినము వైశ్యరాజనందనులు బ్రీతి.

77


శా.

ఆవైశ్యప్రభుఁ డంత బాలకులయోగ్యత్వంబు వీక్షించి భూ
దేవశ్రేష్ఠులచే యథావిధిగ నాదిన్ ప్రాప్తసంస్కారులం
గావింపం గురుసన్నిధానమునఁ దత్కల్పంబు లూహింప నా
నావిద్యాభ్యసనం బొనర్చిరి ప్రయత్నం బొప్ప నయ్యిర్వురున్.

78

క.

జననాథతనయునకుఁ ద
జ్జననికి నప్పురిని నిర్విచారత్వమునన్
ఘనమతి నుండఁగఁ గాలము
చనియెం దగఁ బదియు నాఱుసవత్సరముల్.

79


సీ.

చిరతరకీర్తి పూజితసదాశివమూర్తి
        జయవర్తి శివయోగిచక్రవర్తి
గతజీవుఁ డగుబాలు బ్రదికించి చనినయా
        ఋషభాఖ్యసద్గురుఋషభుఁ డంత
నావైశ్యపురమున కరుదెంచె నొకనాఁడు
        ఘనతరస్వచ్ఛందగమన మొప్ప
నమ్మహామహుఁ గాంచి యమ్మాతృతనయులు
        భయభక్తివినయసంభ్రమము దనర


తే.

నెమ్మనమ్ముల నాత్మదైవమ్ము గాఁగఁ
దలఁపుచుఁ దదీయపాదపద్మముల వ్రాలి
యున్న వారల నతిమైత్రి నూరడించి
యెలమి నారాజతనయున కిట్టు లనియె.

80


శా.

బాలా క్షేమమె నీకు నీజననికిం భద్రంబె నీ వెప్పుడున్
శూలిన్ ధ్యాన మొనర్తువే గురులకున్‌ శుశ్రూష గావింతువే
శీలం బొప్ప వహింతువే చదివితే శిక్షాదికగ్రంథముల్
హాళిన్ మమ్ము దలంతువే సతతమున్ హర్షంబుతో నుందువే.

81


మ.

అని వాత్సల్యము దోఁపఁ బల్కఁ సుమత్యబ్జాక్షి యాత్మీయనం
దను యోగీంద్రునిపాదపద్మములమీఁద న్వైచి యాబాలకుం
డనఘా మీతనయుండు శిష్యుఁడును దథ్యం బారయన్‌ వీని జీ
వనసంయుక్తుఁగఁ జేసినవాఁడవు గురుస్వామీ కృపాంభోనిధీ.

82

క.

పతిబాంధవవిరహిత నే
నితరం బేమియు నెఱుంగ నీబాలకునిన్
మతిమంతుని గావింపుచు
నతిశయకృప వెలయ మమ్ము నారయవలయున్.

83


వ.

అని యివ్విధమునం బలికిన యారాజపత్నివాక్యంబులకు
సంతసిల్లి మహామహుం డైనఋషభయోగీంద్రుఁ డారాజ
నందనునకు సన్మార్గం బుపదేశించి కృతార్థుం జేయవలయు నని
మనంబున నిశ్చయించి యక్కుమారు నుద్దేశించి యి ట్లనియె.

84

ఋషభయోగీశ్వరుఁడు భద్రాయువునకు నష్టాదశపురాణరహస్యంబు లుపదేశించుట

ఉ.

శ్రీగురుదేవహేళనము సేయఁగరాదు పురాణవేదశా
స్త్రాగమధర్మము ల్విడువరాదు మహీసురరాజదేవతా
జ్ఞాగతి మీఱరా దొగి మృష ల్వచియింపఁగరాదు నిత్య మ
భ్యాగతపూజ మాని కుడువంజనరాదు నరేంద్రనందనా.

85


క.

గురుగోబ్రాహ్మణపూజా
పరత న్వర్తింపు మెపుడు పరధనములకున్
బరసతుల కాస జెందకు
నిరతసదాచారధర్మనియతుఁడ వగుమీ.

86


క.

స్నానజపహోమతర్పణ
దానములను విప్రదేవతాగురుపూజా
మానితకార్యములను నీ
మానసమున నలసవృత్తి మానఁగవలయున్.

87


క.

కోపము విద్వేషంబును
దాపము నాక్రోశవృత్తి దంభమును దురా

లాపంబులు పైశున్యము
బాపవిచారములు విడువు భద్రగుణాఢ్యా.

88


క.

నిరతము విషయాసక్త
స్ఫురితమనోవృత్తి సాధ్వసూయయు హింసా
పరతయు నాత్మస్తుతియును
బరనింద యొనర్పవలదు పార్థివతనయా.

89


క.

అత్యాహార మతిశ్రమ
మత్యాలాపములు మఱియు నతిశయకోపం
బత్యుత్కట మగునిద్రయు
నత్యాకాంక్షయును విడువు మనవరతంబున్.

90


క.

జనకశ్వశురసతీగురు
జననీబుధభాషణములు సమ్మద మొప్ప
న్విని విశ్వాసింపుము మది
ననయము నిష్కపటవచన మది నమ్మ దగున్.

91


క.

కృపణు ననాథుల వృద్ధుల
నపరాధవిహీను బాలు నబలను భాస్వ
త్కృప వెలయఁగ రక్షింపుము
తపనీయాదికము లొసఁగి దాక్షిణ్యమునన్.

92


సీ.

బంధుమిత్రులయెడ భావంబు నిలుపుము
        కృప గల్గియుండు దుఃఖితులయందు
సజ్జనులందు హర్షంబు గావింపుము
        కుజనుల వీక్షింపు కోపదృష్టి
శరణాగతుం డైనశత్రువునైనను
        జంపఁగా వలదు నిశ్చయముగాను

యెలమిఁ బాత్రాపాత్ర మెవరైన వేఁడిన
         లేదన కిమ్ము దేహాదులైనఁ


తే.

దల్లి దండ్రియు గురుఁడు నందనుఁడు విప్రుఁ
డాచరించిన యపరాధ మది సహింపు
మాత్మరక్షాపరుండవై యనుదినంబు
నప్రమత్తుండవై యుండు మనఘచరిత.

93


క.

కీర్తి మహాభూషణ మగు
కీర్తియ లక్ష్మీకరంబు కృతకృత్యతయుం
గీర్తి శుభంబగుఁ గావునఁ
గీర్తి యుపార్జింపు మెపుడు కృతపుణ్యుఁడవై.

94


తే.

హయగజాశ్వరత్నహాటకంబులనైన
నపహరింప ధాత్రి నపయశంబు
విడువవలయు దానిఁ గడుసత్వరంబుగఁ
దృణముగాఁ దలంచి ధీరవర్య.

95


క.

గౌరీశ్వరపదభక్తుల
నారాధింపుము ప్రసస్ను లగునట్లుగ సం
సారపయోనిధిమగ్నుల
నారసి వా రుద్ధరింతు రనవరతంబున్.

96


క.

ఆయుర్బలధనవిద్యా
శ్రేయఃకీర్తిప్రతాపశీలంబులు క
ర్మాయత్తత వచ్చినచోఁ
బాయక యవి యనుభవింపు భవ్యవిచారా.

97


క.

కాలము దేశము శక్తియుఁ
దా లెస్సగ దెలిసి చేయఁదగుకార్యము వా

ర్యాలోచనపూర్వకముగ
మేలగు నెచ్చోటనైన మితహితవచనా.

98


క.

జపహోమస్నానంబులఁ
దపములఁ బితృకార్యములను దత్పరమతివై
చపలత్వ ముడిగి యుండుము
కపటం బించుకయులేక కలుషవిదూరా.

99


క.

దాక్షిణ్యసమేతం బ
ల్పాక్షర మధికార్థ మశఠ మతిహృద్యతరం
బక్షీణ మసందిగ్ధము
దక్షం బగుపలుకు వలుకఁదగుఁ దథ్యముగన్.

100


క.

ఆపదలందును శత్రు
వ్యాపారములందు భీతి వలవదు నీకుం
బాపములకు గురువిప్రా
లాపములకు వెఱచి యుండు లాలితబుద్ధిన్.

101


సీ.

పరుల నెవ్వరినైన బాధింపకుండుము
        పరులబాధ లడంపు కరుణ వెలయఁ
జోరదుష్టారినివారణం బొనరింపు
        బాహ్యగేహసుషుప్తిఁ బరఁగవలదు
బంధుమిత్రజ్ఞాతిభార్యాసుతాతిథి
        భోజనంబుల సమబుద్ధి వగుము
విద్యాకథాధర్మవిహితవాక్యోపదే
        శములందు సతతనిశ్చలుఁడ వగుము


తే.

ఏస్థలము సాధువిప్రభూయిష్ఠ మగును
బుణ్యతీర్థంబు లెచ్చోటఁ బొందియుండు

శివనివాసంబు లేభూమిఁ జెలఁగుచుండు
నచట నిలువు మవశ్యంబు హర్ష మొదవ.

102


క.

కులటావేశ్యాకాముక
ఖలసంగతదేశముల నొకానొకవేళ
న్నిలువకుము జగత్ప్రభు వగు
నలినాక్షుని మదిఁ దలంపు మశ్రాంతంబున్.

103


క.

ఎప్పుడు శాంతియు దాంతియు
నెప్పుడును శుచివ్రతంబు నెప్పుడు ధర్మం
బెప్పుడు జితషడ్వర్గిత
దప్పక వర్తింపు మీవు ధరణీశనుతా.

104


క.

యతులకు విప్రులకుఁ బ్రతి
వ్రతలకు వరధేనువృషభరత్నములకుఁ బు
ణ్యతరునదీనిజగృహదే
వతలకు వందన మొనర్పు వాలాయముగన్.

105


ఆ.

భక్ష్యభోజ్యలేహ్యఫలపుష్పతాంబూల
వస్త్రభూషణాదివస్తువితతి
శివసమర్పితంబుఁ జేసి యాపిమ్మట
ననుభవింపవలయు ననుదినంబు.

106


శా.

భద్రాచారపరుండవై నిరతమున్ బ్రాహ్మీముహూర్తంబున
న్నిద్రాసక్తిఁ బరిత్యజించి శుచివై నిష్కల్మషత్వంబునన్
రుద్రాణీరమణున్ గృపాగుణసముద్రున్ శంకరున్ శ్రీమహా
రుద్రున్ జిత్తమునన్ భజింపు మతిధీరోదాత్తభావంబునన్.

107


ఆ.

నిర్వికల్పముగను నీ వాచరించిన
స్నానదానహోమజపతపములు

ననుదినంబుఁ దత్ఫలాపేక్ష లుడిగి త
థ్యముగఁ జేయు మీశ్వరార్పితములు.

108


చ.

విహరణభాషణశ్రవణవీక్షణభోజనపానదానసం
గ్రహశయనస్థలంబులను రాజకళాధరుఁ బార్వతీపతిన్
గుహజనకున్ వృషధ్వజుని గోత్రశరాసను దేవదేవునిన్
మహితవిచారు నీదుమది మానక నిల్పి భజింపు మేర్పడన్.

109


మ.

వరపంచాక్షరమంత్రపాఠకులు శైవాచారపారీణు లీ
శ్వరభక్తు ల్భసితత్రిపుండ్రవిలసత్ఫాలప్రదేశాంచితు
ల్గురురుద్రాక్షమణిప్రదీప్తకరయుగ్ము ల్పూజ్యు లైనట్టియా
పురుషశ్రేష్ఠులు నిల్చియుందు రెపుడున్‌ భూతేశులోకంబునన్.

110


వ.

అని చెప్పి వత్సా యివ్విధంబున ననేకపురాణంబులయందు
విస్తరింపంబడిన ధర్మసంగ్రహంబు లన్నియు సంక్షేపరూ
పంబున నీకుం దెలియ ననుగ్రహించితి నింక సమస్తపురాణ
గుహ్యంబును నశేషదోషహరణంబును బరమపవిత్రంబును
సకలశుభప్రదంబును సర్వాపద్వినివారణంబును నగు శివ
కవచం బుపదేశించెద భక్తిపూర్వకంబుగా విను మని
భద్రాయు నుద్దేశించి ఋషభయోగీంద్రుం డిట్లనియె.

111

ఋషభయోగి భద్రాయువునకు శివకవచం బుపదేశంబు చేయుట

క.

శివదాహ్వయుఁ డైనసదా
శివునకు వందన మొనర్చి సేమము వెలయన్
శివభక్తుఁడ వగునీకును
శివకవచ ముపన్యసింతుఁ జిత్తం బలరన్.

112


శా.

చేతోజాతహరుం బరాత్పరు విభుం జిత్తంబున న్నిల్పి ని

ర్ధూతాఘుండు జితేంద్రియుండును జితక్రోధుండునై లోకవి
ఖ్యాతం బైనషడక్షరంబునఁ గరన్యాసంబుఁ గావించి వాం
ఛాతీతం బగుశైవవర్మమున రక్షాన్వీతుఁడుం గాఁ దగున్.

113


ఉ.

ఘోరవిపత్పరంపరల గుందుచు దైన్యపరీతవృత్తి సం
సారగభీరకూపమున సైరిభలీల జరించునన్ను ను
ద్ధారితుఁ జేయుఁగాతఁ బరతత్వమయుం డగుశంకరుండు త
త్తారకనామమంత్రము సదా దురితంబు లడంచుఁ గావుతన్.

114


తే.

అణువులకు నెల్ల నణు వైనయప్రమేయుఁ
డధికముల కెల్ల నధిక మైనట్టివిభుఁడు
దనరు జ్యోతిర్మయానందఘనుఁ డజుండు
చిన్మయాత్ముఁడు నన్ను రక్షించుఁగాత.

115


సీ.

భూస్వరూపమున నేపురుషుఁడు సకలప్ర
         పంచంబుఁ దాన భరించు నెపుడు
జలరూపుఁ డగుచు నేసర్వజ్ఞుఁ డిలఁ గల్గు
         నరులకు సంజీవనం బొనర్చుఁ
గాలాగ్నిరూపుఁ డేకల్పాంతమునఁ ద్రిలో
         కములెల్ల నెవఁడు దగ్ధములు చేయు
వాయురూపమున సర్వవ్యాపి యై యుండు
         గగనాకృతిని బూర్ణుఁ డగుచు వెలయు


తే.

నట్టిలోకైకనాయకుఁ డష్టమూర్తి
సచ్చిదానందమయుఁడు వృషధ్వజుండు
సలిలవాతాగ్ని బాధలఁ బొలియకుండఁ
జిరకృపాదృష్టి నన్ను రక్షించుఁ గాత.

116

సీ.

తత్పురుషాఖ్యుండు తటిదగ్నివర్ణుండు
         పరశుహస్తుఁడు పూర్వభాగమునను
ఢక్కాక్షమాలాగ్నిధరుఁ డఘోరాకృతి
         దక్షాధ్వరధ్వంసి దక్షిణమున
రాజశేఖరుఁడు సద్యోజాతుఁ డభవుండు
         శ్రీసదాశివుఁడు పశ్చిమమునందు
మునివందితుఁడు చతుర్ముఖుఁడు త్రినేత్రుండు
         వామదేవుండు తత్పార్శ్వమునను


తే.

శుభ్రదేహుఁ డచింత్యుండు శూలపాణి
యుగ్రవిక్రముఁ డీశానుఁ డూర్ధ్వమునను
సకలదిశల విదిక్కుల సంతతంబు
పంచవక్త్రుండు నన్ను రక్షించుఁగాత.

117


మ.

శిరమున్ ఫాలము నేత్రముల్‌ శ్రవణముల్ జిహ్వాననగ్రీవలున్
గరవక్షోధరకంఠపార్శ్వములు వక్షఃకోశకట్యూరులున్
జరణంబు ల్సకలాంగకంబులు మహౌజస్ఫూర్తి రక్షించునీ
శ్వరుఁ డర్ధేందుధరుండు శంకరుఁడు నీశానుండు లీలాగతిన్.

118


క.

శూలాయుధుఁడు గిరీశుఁడు
కాలాంతకుఁ డైననీలకంఠుఁడు పగలున్
రేలును నను రక్షించును
లాలితకరుణాకటాక్షలక్షితముఖుఁడై.

119


క.

చింతితఫలదుఁడు గౌరీ
కాంతుఁడు పరమేశ్వరుం డగణ్యుఁడు బాహ్యా
భ్యంతరదేశంబుల న
న్నంతట రక్షించుఁగాత ననవరతంబున్.

120

తే.

నిలిచి కూర్చుండి శయనించి నిదురఁ జెంది
మేల్కనినవేళలను గాలమృత్యుహరణుఁ
డంబికారమణుండు ద్రియంబకుండు
ఖండపరశుండు నను వేడ్కఁ గాచుఁగాత.

122


వ.

మఱియు నఖిలగిరిదుర్గమమార్గంబులయందు నీలకంఠుండును
మహారణ్యప్రవాసంబువలనఁ ద్రిపురాంతకుఁ డైనమృగ
వ్యాధుండును దుర్మతాభీలశాత్రవవ్యూహంబువలన భీష
ణాట్టహాసపరికంపితబ్రహ్మాండకోశుం డైనవీరభద్రుండును
గరితురగరథపదాతిసమేతబహుతరాక్షౌహిణీశతపరివృతు
లైన యాతతాయిసమూహంబులవలన ఖండపరశుం డైన
మహాదేవుండును చోరాదిగణంబులవలనఁ ద్రిశూలధారుం
డైనయంధకాంతకుండును సింహవ్యాఘ్రభల్లూకవరా
హాదిక్రూరమృగంబులవలనఁ బినాకపాణి యగువామదేవుం
డును దుష్టారిష్టవిషమహోత్పాతవ్యాధులవలన జగదీశ్వరుం
డగుసాంబశివుండును నన్ను రక్షించుఁగాక యని పలికి
మఱియు నప్పరమేశ్వరు నుద్దేశించి శ్రీసాంబ సదాశివ సకల
లోకైకనాయకా సకలజగదుత్పత్తిస్థితిలయకారణా చంద్ర
కోటీరా భానుకోటిప్రతీకాశా మృత్యుంజయా విరూ
పాక్షా వృషభవాహనా నాగేంద్రభూషణా వ్యాఘ్ర
చర్మాంబరధరా డమరుత్రిశూలఖట్వాంగగదాప్రాసభిండి
వాలకరవాలపాశాంకుశాద్యాయుధపరిశోభితదీర్ఘ
భుజార్గళాసార్వకాలంబును మహాబలపరాక్రమతేజఃకీర్తి
సంపన్నుండ నగునట్లుగా ననుగ్రహించి నన్ను రక్షింపుము
సర్పవిషబాధల నుపశమనంబు నొందింపుము మదీయచో

రగణంబుల మారణంబుగా విదళింపుము కూశ్మాండమారీ
గణబ్రహ్మరాక్షసనివహంబులకు సంత్రాసంబు గావింపుము
క్షుత్తృష్ణాతురుండ నగు నన్ను నాప్యాయనంబు నొందం
జేయుము దుఃఖార్తుండ నగునన్ను నానందుండ నగునట్లుగా
బ్రసాదింపుము మరణభయంబువలన సంజీవితుంగా నొన
ర్పుము నరకభయంబులవలన న న్నుద్ధరింపుము శివకవచం
బున నన్ను నాచ్ఛాదింపుము సదాశివుండ నైననీకు బహు
వందనంబులు గావింతు ననుచు ననేకవిధంబులుగాఁ బ్రార్థింప
వలయు నని చెప్పి వెండియు నారాజనందనునకు ఋషభుం
డి ట్లనియె.

122


సీ.

అవనీశనుత విను మతిరహస్యం బైన
        కవచంబు నాచేతఁ గలితమయ్యె
నదియును బాపత్రయధ్వాంతమిహిరంబు
        దారుణాపద్వినివారణంబు
సకలసౌభాగ్యైకసామ్రాజ్యసదనంబు
        పశుపతికారుణ్యభాజనంబు
నీశైవకవచంబు నేకాగ్రచిత్తులై
        హితమతిఁ బఠియింతు రెవ్వరేని


తే.

వారు శ్రీసాంబశివునికృపారసమున
నతిశయవ్యాధిమృత్యుభయంబు లుడిగి
చిరతరాయుష్కు లగుచు లక్ష్మీకటాక్ష
పాత్రులై బహుసౌఖ్యము ల్పడయఁగలరు

123


క.

కావున భక్తిశ్రద్ధా
ప్రావీణ్యము లొప్ప నీవు పఠియింపుము రా

జ్యావహుఁడ వగుదు విప్పుడు
కైవల్యపదంబుఁ జెందఁగాఁ గలవు తుదన్.

124


క.

అని యానతిచ్చి క్రమ్మఱ
మనుజేంద్రతనూజునకు సమంత్రకముగఁ ద
త్తనువున భస్మోల్లేపన
మొనరించెను యోగిచంద్రుఁ డుజ్జ్వలకరుణన్.

125


క.

అగణితవాత్సల్యమునన్
ద్విగుణీకృతషట్సహస్రదివ్యమదేభేం
ద్రగరిష్ఠబల మొసంగెను
జగతీవరనందనునకు సంయమి కరుణన్.

126


ఆ.

నిరుపమానకాంతి నిశితభారం బగు
చంద్రహాస మొకటి శంఖ మొకటి
సౌమతేయునకుఁ బ్రసన్నదృష్టి నొసంగి
హితము వెలయ యోగి యిట్టు లనియె.

127


వ.

నిఖిలనిగమగుహ్యం బైనశైవకవచం బుపదేశించి నీకు
వాత్సల్యంబున ఖడ్గశంఖంబు లొసంగితిం గావున రాజ
నందనా యేతత్ప్రభావముం జెప్పెద సుస్థిరుండవై వినుము
ఈఖడ్గంబు మంత్రతపస్సంభావితమును సునిశితధారమును
సకలాధినిషూదనంబును నై యుండు దీనిం గాంచినశాత్ర
వుండు కృతాంతోపమితుం డయినను విగతప్రాణుం డగు
నేతచ్ఛంఖనినాదంబు వినిన పరిపంథిజనులు సన్న్యస్తశస్త్రు
లును విచేతనులును మూర్ఛాగతులు నై భూతలపతితు
లగుదు రీసాధనంబులు రెండును బరసైన్యవినాశకము
లును స్వపక్షసైన్యతేజశ్శక్తివివర్ధనంబులు నై యుండు నీ

విమ్మహాశైవకవచమువలనను ఖడ్గశంఖప్రభావమువలనను ద్వా
దశసహస్రనాగబలమువలనను భస్మధారణసామర్థ్యమువల
నను శత్రుభూపతుల బరాజితులం గావించి పిత్ర్యంబయిన
భవద్రాజ్యమున కభిషిక్తుండవై యనేకసంవత్సరములు
సామ్రాజ్యభోగముల ననుభవింపఁగలవాఁడ వని యానతిచ్చి
సమాతృకుం డయిన భద్రాయువు నాశ్వాసించి మహాను
భావుం డయిన ఋషభయోగీంద్రుండు నయ్యిరువురచేతఁ
బూజితుండయి యథేచ్ఛావిహారమ్మునం జనియె చెప్పిసూతుం
డమ్మహామునీంద్రుల కి ట్లనియె.

128


సీ.

మునివరోత్తములార వినుఁ డిమ్మహాశైవ
        కవచంబు సర్వరక్షాకరంబు
నిర్మలహృదయులై నిరతంబు సద్వృత్తిఁ
        బఠనంబు చేసిన భక్తులకును
బహుతరైశ్వర్యసంపదలు ప్రాపించినఁ
        గలుషబృందంబులు దొలఁగిపోవు
సకలశుభంబులు సమకూఱు నెప్పుడు
        నిష్టార్థసంసిద్ధి నెసఁగుచుండుఁ


తే.

బుత్త్రమిత్రకళత్రాదిభోగభాగ్య
సౌఖ్యములు చెందుఁ జేకూఱు సమ్ముదంబు
శ్రీసదాశివుకరుణచే సిద్ధముగను
వారలకు సంఘటించుఁ గైవల్యపదము.

129


ఆ.

ఆనృపాలసతియు నాత్మజుండును దాను
రాజకళలు వెలుఁగ రమ్యవృత్తి
నద్రిజాకుమాఱు లట్టులఁ జెలువొంది

విగతశోకు లగుచు వెలసి రపుడు.

130

వజ్రబాహుని మగధదేశపురాజు జయించుట

శా.

ఆదాశార్ణకవజ్రబాహుఁడు స్వరాజ్యం బప్రమాదంబుతో
నాదిక్షత్రచరిత్ర నేలఁగఁ దదీయారాతిరాణ్మాగధేం
ద్రాదేశంబున సైనికాగ్రణులు రాష్ట్రక్షోభకార్యంబు బా
హాదర్పోద్ధతులై యొనర్చిరి జిగీషాయత్తులై యెంతయున్.

131


చ.

పురములు గాల్చి కూపములు పూడిచి పేటలు దోఁచి కోటలున్
ధరఁ బడఁద్రోచి భూరుహవితానముల న్విదళించి గోధనో
త్కరములు సంగ్రహించి వనితామణులం జెరపట్ట సైనికు
ల్దెరువులు గట్టి భూప్రజ నతివ్యధ నొందఁగఁజేసి రయ్యెడన్.

132


ఉ.

ఆమగధాధినాథుఁ డగు హైమరథుండు దశార్ణభూమికిన్
సామజఘోటకాద్యఖిలసైన్యముతో రణకాంక్షఁ జేరినన్
భీమచమూసహస్రపరివేష్టితుఁడై తగ వజ్రబాహుఁ డు
ద్దామబలుం డెదుర్కొనియెఁ దన్మగధాధిపవాహినీతతిన్.

133


వ.

ఇట్లుభయసైన్యంబులుం దలపడి దేవాసురులవిధంబునం
బోరాడుచున్న సమయంబున.

134


మ.

గురుశౌర్యుం డగువజ్రబాహుఁడు లసత్కోదండియై కాండియై
సరథుండై మగధేశుసైన్యముల భాస్వద్బాణవర్షంబులం
గరిగంధర్వరథౌఘమెల్లను విభగ్నంబై ధరం గూలఁగా
బరపెన్ దుస్సహతేజుఁడై సమరభూభాగంబునన్ వ్రేల్మిడిన్.

135


మ.

జవనాజిహ్మగవర్షముల్ గురియు దాశార్ణక్షమాపాలుయు
ద్ధవిధిస్ఫూర్తి సహింపలేక మగధేంద్రవ్యూహ మక్షౌహిణీ
నవకం బుద్ధతిఁ జుట్టుముట్టుకొని సేనానాయకోపేతు న
య్యవనీనాథుని సైన్యముం బొదివె నస్త్రాసారథారాహతిన్.

136

క.

ఘోరారివీరవిశిఖా
సారంబున వజ్రబాహుసైన్యంబున హ
స్త్యారోహకయారోహక
సారధిరథికాదులెల్ల సమసి రనేకుల్.

137


క.

వారును బిఱుతివియక తమ
పౌరుషములు మెఱయ మగధపతిసైన్యమునన్
వారణవాజిస్యందన
వీరభటులఁ గూల్చి రపుడు విస్మయ మొదవన్

138


మత్తకోకిల.

ఈతెఱంగున రెండుసేనలు హెచ్చుతగ్గులు లేక వి
ఖ్యాతిఁ బోరుచు నుండ నందు దశార్ణయోధులు విద్విష
చ్ఛాతబాణపరంపరాహతిజర్జరీకృతదేహులై
భీతులై కకుభాళి కేఁగి రపేతవాహనశస్త్రులై.

139


వ.

తదనంతరంబున.

140


క.

అలఘుప్రాభవయుతులై
చలమున నమ్మగధరాజసైన్యంబులు దో
ర్బల మెసఁగ దశార్ణునితోఁ
దలపడి పోరాడి రపుడు దర్పోద్ధతు లై.

141


ఉ.

కొందఱు చాపదండమును గొందఱు కేతువుఁ గొంద రశ్వము
ల్గొందఱు సారథిన్ రథముఁ గొందఱు ఖడ్గము ఖేటకంబునున్
గొందలమందఁజేసి ధరఁ గూల్చి పదంపడి వజ్రబాహునిన్
సందిటఁ బట్టి కట్టిరి భుజాబలశోభితు నాక్షణంబునన్.

142


తే.

ఇట్లు బంధించి తెచ్చి నిజేశ్వరునకు
నొప్పగించి తదాజ్ఞచే నుత్సహించి

దండనాయకముఖ్యు లుద్దండవృత్తిఁ
బట్టణంబు చరాచూఱ బెట్టి రపుడు.

143


క.

గజవాజిరథోష్ట్రంబుల
నజగోమహిషాదికముల నంబరతతులం
గజగమనల హరియించిరి
రజతస్వర్ణధనధాన్యరత్నావళులన్.

144


వ.

ఇవ్విధమున నమ్మాగధప్రధానులు రాజభవనముఁ జొచ్చి
యందు భాండాగారమునం గల యనేకధనకనక మణిభూష
ణాంబరములును సువర్ణరజతగజదంతమయమ్ములయిన శిబి
కాశయనవాహనమ్ములును మొదలయిన సమస్తరాజద్ర
వ్యము లన్నియుఁ దన్మహిషీసమేతముగా నపహరించి
నిర్భయత్వముగా నిజనగరమున కేఁగుచున్న సమయమున
నద్దేశంబంతయు నరాజకం బయి మగధసైన్య పరిక్షుబ్ధం
బయ్యె నంత బాలవృద్ధవనితాజనంబులు భయాక్రంద
నంబు లొనరింపుచుఁ బ్రణష్టధనధాన్యపశుభూషణాం
బరులయి యథేచ్ఛాగమనములం జనుచుండి రంత.

145


మ.

మగధేశుండు దశార్ణదేశముల శుంభద్విక్రమాభీలుఁడై
తగసప్తాంగములన్ హరించె ననువృత్తాంతంబు దేశాగతా
ధ్వగబృందంబు వచింప రాజసుతుఁడౌ భద్రాయు వాలించి
పన్నగరాజప్రతిమానరోషమున జన్యాకాంక్షితోద్యుక్తుఁడై.

146

భద్రాయువు మాగధుని జయించి తనతండ్రికి మరల రాజ్యము నిచ్చుట

మ.

గురుదత్తోచితఖడ్గశంఖధరుఁ డై కోదండభృత్పాణి యై
శరసంపూర్ణనిషంగుఁ డై కవచియై శౌర్యప్రభావాఢ్యుఁడై

సరథుం డై తగవైశ్యనందనుఁడు దా సారథ్యముం జేయఁగా
ధరణీభాగము కంప మొందఁ జనియెన్‌ దాశార్ణకక్షోణికిన్.

147


చ.

ఖగపతి మున్ సుధాహరణకాంక్ష దివంబున కేఁగుచాడ్పునన్
భృగుపతి కార్తవీర్యపృథివీశు వధింపఁగఁ బోవుపోలికిన్
మృగపతి కుంభికుంభములమీఁదికి వ్రాలువిధంబు దోఁపఁగా
మగధపతి న్జయింపఁగఁ గుమారవరుం డరుదెంచె నుద్ధతిన్.

148


క.

చని చని నిజరాష్ట్రంబునఁ
గనుఁగొనియె నపేతవస్త్రకన్యామణిగో
ధనమున్ విద్రావితమును
జనితాక్రందనము నైనసకలజనంబున్.

149


శా.

చండక్రోధము మీఱ మాగధులసత్సైన్యంబు సొత్తెంచి కో
దండజ్యారవ మాచరించి సకలాస్త్రంబుల్ ప్రయోగించి యు
ద్దండాటోపముఁ జూపి శత్రుపటలిన్‌ ధాత్రీస్థలిన్‌ గూల్చె వే
దండాశ్వధ్వజినీచయంబుల మహోద్యద్విక్రమారంభులన్.

150


క.

వారును గ్రమ్మఱ బహువిధ
దారుణఖడ్గాదిశస్త్రధారాహతిచే
నారాసుతు నొప్పించిరి
సారభుజాశౌర్యదైర్యసంపద వెలయన్.

151


తే.

ఇవ్విధంబునఁ దొడరి వా రేయునట్టి
యస్త్రవర్షంబు సైరించి హస్తిలీల
భవ్యతరశైవకవచప్రభావమునను
సంగరస్థలి ధీరుఁ డై సంచరించె.

152


క.

మఱియును మాగధబలములఁ
గరితురగపదాతిరథనికాయంబుల భీ

కరలీలఁ ద్రుంచి దా నొక
యరదమును గ్రహించె రథికు హతుఁజేసి తగన్.

153


క.

ఆరథమున వైశ్యాత్మజ
సారథికుం డగుచు సమదశాత్రవవిలస
త్సారంగమధ్యమునఁ గం
ఠీరవగతి మెలఁగె నతిదృఢీకృతతనుఁ డై.

154


వ.

ఇట్లు రథారూఢుం డైనయారాజకుమారుం గాంచి మాగ
ధులు సహింపనోపక చతురంగబలంబులతోడఁ దలపడిన
సక్రోధుం డయి యాజగజ్జెట్టి శౌర్యోద్రేకంబున భుజ
గంబులం గాంచిన విహంగవల్లభుండునుంబోలె వారల
వెనువెంట నంటం దాఁకి కమలాకరంబునం గేళిసలుపు కల
భంబుచాడ్పున నమ్మొగ్గరంబులోనఁ జొచ్చి బ్రహ్మాండపరి
స్ఫోటితంబుగా సింహనాదం బొనరించి శరాసనంబు సజ్యంబు
గావించి కఠోరనిర్ఘాతప్రతీకాశంబు లైనవత్సదంతశిలీముఖ
భల్లార్ధచంద్రకూర్మనఖరక్షురప్రముఖఘోరనారాచపరం
పరలఁ బ్రయోగించి నీరసారణ్యంబుల దహించుదవా
నలంబుతెఱంగున నబ్బలంబులన్ జర్జరీభూతశరీరులం
గావించి బడలువడం జేయుచున్నసమయంబునఁ గూలెడు
తురంగంబులును వ్రాలెడుమాతంగంబులును గ్రుంకెడు
శతాంగంబులును నొరలెడుకాల్బలములును ఖండీభూ
తము లైనమస్తకంబులును నికృత్తంబు లయినకటికంఠ
ప్రదేశంబులును భగ్నంబులైనజానుజంఘలును తెగిపడిన
బాహువులును శకలంబు లైనసర్వావయవంబులును దునియ
లైనదివ్యాయుధవిశేషములును విభ్రష్టంబు లైనభూషణ

వ్రాతంబులును విచ్ఛిన్నంబు లయినకేతనఛత్రచామరంబు
లును విశీర్ణంబు లయినతనుత్రాణంబులును విభిన్నంబు
లయినమురజమృదంగపటహకాహళనిస్సాణాదికంబులును
వివర్ధమానంబు లయినశోణితనదీప్రవాహంబులును విజృంభ
మాణంబు లయిన భూతబేతాళకలకలారావంబులును
గలిగి సంగ్రామరంగం బత్యంతభీషణం బై యుండె
నయ్యవసరంబున.

155


క.

జన్యంబు సేయ నొల్లక
దైన్యంబును జెంది మదికిఁ దత్తర మొదవన్
సైన్యేశులు హరిఁ గాంచిన
వన్యేభము లట్ల చని రవారితభీతిన్.

156


ఉ.

హైమరథుండు భీతి జను నాత్మబలంబులఁ గాంచి పల్కె నీ
భీమబలోద్ధతుం డెవఁడొ వీనిమదం బణఁగింతు రండు సం
గ్రామమునందు శూరులు పరాజితు లై చనరా దటంచుఁ దా
సామవచఃప్రసంగముల సైనికుల న్మరలించెఁ గ్రమ్మఱన్.

157


వ.

ఇట్లు మగధరాజప్రయత్నమున నెట్టకేలకు సైనికులు మరలి
చతురంగబలసమేతు లయి చనుదెంచి యొక్కుమ్మడి
నాభద్రాయువుం జుట్టుముట్టి యనేకవిధమ్ము లయినశక్తి
శూలపరశ్వథభిండివాలగదాకుంతతోమరక్షురికా
ముసలాదిసాధనముల నొప్పించిన నతఁ డట్టహాసంబు సేసి
ఋషభయోగీంద్రుం దనమనమ్మునం దలంచి కరాళమృత్యు
జిహ్వాభీలంబును మహోగ్రప్రభాజాలంబును ధగద్ధగాయ
మానమ్మును నైనకరవాలము కేల నమర్చి ఝళిపించిన దద్ద
ర్శనమాత్రమ్మున శిఖిశిఖాజాలమ్ము డగ్గఱినశలభమ్ములవిధ

మ్మునఁ బంచత్వమ్ము నొందువారును వినమ్రభావమ్ముఁ
జెంది పాదాక్రాంతు లగువారును మహాభయబ్రాంతు లై
గంపమ్మునొందువారును నై యున్నసమయమున వెండియు
నమ్మహాబలుండు రోదసీకుహరపరిపూర్ణమ్ముగా శంఖధ్వానంబు
జేసినఁ దదీయభీషణఘోషణం బాలకించి యమ్మాగధులు
మూర్ఛాగతు లై రథికసారథినిషాదిసాదిపదాతిసహితముగాఁ
బరిత్యక్తశస్త్రాస్త్రు లయి భూతలమ్మున బడియున్నవారలం
గని యతండు ధర్మశాస్త్రమర్మజ్ఞుండు గావున మృత
ప్రాయులు నిరాయుధు లయినపురుషులు వధ్యులుగారని
వారల విసర్జించి రణాంగణమ్మున బద్ధుం డై యున్ననిజ
జనకుని బంధముక్తుం గావించినఁ గ్రమ్మఱఁ దత్పత్నీనివహ
మ్మును దత్ప్రధానబంధుజనపురోహితప్రముఖపౌరజానపద
వర్గమ్మును మఱియును గోవృషాదికమ్మును బంధనిర్ముక్తత
నొందించి విషాదవ్యాకులచిత్తు లయియున్నవారలనందఱ
నత్యంతమధురాలాపమ్ముల ననునయించి యనంతరంబ మదీయ
రాష్ట్రభంగంబుఁ గావించి యిద్దురాత్ముల మానభంగంబు
చేయుట యుచితం బని నిశ్చయించి.

158


మ.

మగధాధీశ్వరుఁ డైనహైమరథుదుర్మానంబుఁ దూలించివాఁడై
జిగజస్యందనతత్ప్రధానసఖిదాసీబంధువర్గంబుతో
మగుడన్ బద్ధునిఁ జేసి తోడ్కొనుచు శుంభద్విక్రమోల్లాసుఁ డై
నగరద్వారముఁ జొచ్చె రాజసుతుఁ డానందంబు సంధిల్లఁగన్.

159


తే.

లావు చెడి సంగరమున పలాయమాను
లైనయోధులు గ్రమ్మఱ నరుగుదెంచి
జనకబాంధవసచివాదిసహితుఁ డైన

రాజపుత్త్రునిఁ గనిరి హర్షంబు వెలయ.

160


మ.

కని యీపుణ్యుఁడు సిద్ధుఁడో ఖచరుఁడో గంధర్వుఁడో యక్షుఁడో
వనజాతాసనుఁడో హరుండొ హరియో వజ్రోల్లసత్పాణియో
యనుచున్ సంశయమగ్నచిత్తముల నత్యాశ్చర్యముం బొందుచున్
జనులెల్ల న్వినుతించి రప్పుడు మహోత్సాహంబు సంధిల్లఁగన్.

161


క.

మృతసముల మగుడ సంజీ
వితులం గావించె నితనివిక్రమగుణముల్
మతిఁ దలఁప నమానుషములు
జితకాశి యితండు యోగసిద్ధుఁడొ చూడన్.

162


ఆ.

ఈమహాత్ముతల్లి హిమశైలకన్యక
యితనితండ్రి శంభుఁ డెంచి చూడఁ
గాకయున్న నొంటిగా నవాక్షౌహిణీ
బలము గెలువ నొరుల కలవి యగునె?

163


వ.

అని బహువిధములం బ్రశంసింపుచున్న యాప్తప్రధాన
జనమ్ములతోఁ దనవృత్తాంతము యథార్థమ్ముగాఁ దెలియం
జెప్పి యనంతరంబ విస్మయావిష్టమానసుండును హర్షాశ్రు
బిందుసందోహలోచనుండును నతిశయప్రేమవిహ్వలుండు
నగువజ్రబాహుని సమీపమ్మునకు వచ్చి.

164


క.

తనపాదాంభోజములకు
వినయంబున మ్రొక్కి యున్న విఖ్యాతయశో
ధనుఁ గనుఁగొని గాఢాలిం
గన మొనరించె న్గురుండు కౌతుక మొదవన్.

165


క.

ఆవజ్రబాహుఁ డి ట్లను

నీ వెవఁడవొ తెలియఁ బలుకు నిజముగ మాకున్
దేవుఁడవో మనుజుఁడవో
ధీవర్య మదీయభాగ్యదేవతవొ తగన్.

166


క.

శ్రీమెఱయ భవత్సఖుఁ డయి
భీమాహవరంగమునకు భీతిల్లక స
త్ప్రేమంబుగఁ జనుదెంచిన
యీమందరధైర్యుఁ డెవ్వఁ డేర్పడఁ జెపుమా.

167


సీ.

అలఘువిక్రమ నీకుఁ దలిదండ్రు లెవ్వరు
        నీదేశ మెయ్యది నిశ్చయముగ
నీధైర్య మీశౌర్య మీతేజ మీబలం
        బరయంగ నితరులయందుఁ గలవె
దేవాసురమనుష్యదీప్తంబు లైనము
        జ్జగముల గెలువంగఁ జాలు దీవు
నీపూర్వభవకృతానేకపుణ్యంబుల
        నభినుతిచేయ నా కలవి యగునె


తే.

నాదుపత్నుల హితులను నందనులను
నాదురాజ్యంబు పురము నంతయును విడిచి
నాదుచిత్తంబు నీయంద నాటియున్న
దతిశయప్రేమబంధకం బగుటఁజేసి.

168


క.

అని యడిగిన భద్రాయువు
కనుదమ్ముల హర్షబాష్పకణములు దొరుగన్
గన జలధరగంభీర
స్వనమున దా నిట్టు లనియె జనకునితోడన్.

169


ఉ.

ఓయనఘాత్మ వీఁడును నయుం డనువైశ్యతనూభవుండు భ

ద్రాయువు నాదుపేరును మదంబయు నేనును వీనియింట న
త్యాయతవైభవంబున నహర్నిశము న్వసియింతు మెంతయున్
శ్రేయము మీఱ మత్కథ యశేషముగా వివరింతు మీఁదటన్.

170


ఆ.

ఇపుడు పోయివత్తు నే వచ్చుదనుక నీ
జడుని మగధవిభుని విడువవలవ
దనుచు విన్నవించి యాక్షణంబున నేఁగె
సఖుఁడుఁ దాను నాత్మసదనమునకు.

171


వ.

అ ట్లరుగుదెంచి.

172


మ.

జననీపాదసరోరుహంబులకు శశ్వద్భక్తితో మ్రొక్కి చ
య్యనఁ దాఁజేసినకార్యమంతయును నాద్యంతంబుగాఁ జెప్పిన
న్విని తన్మాతయు హృష్ట యై నిజసుతు న్వేవేడ్క నాశీర్వదిం
చెను బద్మాకరుఁ డంతఁ గౌఁగిటను జేర్చె న్గౌరవం బొప్పఁగన్.

173


క.

ఈతెఱఁగున భద్రాయువు
మాతృసమేతముగ వైశ్యమందిరమున వి
ఖ్యాతసుఖంబున నుండెను
జేతోమోదంబు వెలయ శివతత్పరుఁ డై.

174


తే.

రణములో నొక్కరుండు శాత్రవులఁ గెలిచి
జయము చేకొనివచ్చె నిర్భయత గాఁగ
గురుకటాక్షంబుఁ జెందిన కుశలమతుల
కవని సాధింపరానికార్యములు గలవె?

175


వ.

అంత.

176

సూర్యాస్తమయవర్ణనము

తే.

ఆదశార్ణక్షమాపాలు ననుఁగుసుతుని
చండశౌర్యప్రభావంబు సైఁపలేక

భానుఁడు పలాయమానుఁడై పరచె ననఁగఁ
జరమశైలంబుమాటుకు జరిగె నపుడు.

177


క.

మాగధుల నిజైశ్వర్య
త్యాగాపయశం బనంగఁ దనరుచు రోధో
భాగంబున నల్దిక్కులఁ
బ్రాగల్భ్యముతోడఁ దిమిరపటలము పర్వెన్.

178


క.

దేవజ్యేష్ఠుఁడు రాసుతు
భావికరగ్రహమునకు నభఃపాత్రమునన్
భావించిన ముత్యము లనఁ
గా వెలసె విశుద్ధతారకానికరంబుల్.

179


ఉ.

కంతునిమేనమామ శితికంఠునియౌదలపువ్వు సింధుజా
కాంతయనుంగుఁదమ్ముడు జగజ్జనరంజనదర్శనుండు భా
స్వంతునియుద్ది సత్కలశవారిధిముద్దులపట్టి తారకా
కాంతుఁడు చందమామ కుతుకంబునఁ దోఁచెను దూర్పుదిక్కునన్.

180


ఆ.

సకలభువనజాలసౌధాగ్రతలమున
వెలుఁగుచున్న హేమకలశ మనఁగఁ
గానుపించె నపుడు గగనేందిరాకర్ణ
కుండలంబు చంద్రమండలంబు.

181


క.

భద్రాయువు వరకీర్తిస
ముద్రము దా వెల్లివిరిసి భువనంబుల ని
ర్నిద్రగతి నించెనో యన
భద్రకరజ్యోత్స్న వెలసె బ్రహ్మాండమునన్.

182


వ.

ఆసమయంబున.

183

ఋషభయోగీశ్వరుఁడు చంద్రాంగదునియుద్దికిఁ జని భద్రాయువునకుఁ గూతునిచ్చి వివాహంబు సేయుమని యుపదేశించుట

క.

వృషభధ్వజావతారుఁడు
ఋషభుం డారాత్రియందు ఋషులు నుతింపన్
ధిషణప్రజ్ఞాబలుఁ డై
నిషధేంద్రునిపురికి వచ్చె నెమ్మి దలిర్పన్.

184


వ.

ఇట్లు విచ్చేసిన ఋషభయోగీంద్రునకుఁ జంద్రాంగదమహీ
పాలుం డెదుర్కొని యభివందనంబులు గావించి యర్ఘ్య
పాద్యాదివిధులం బూజించి కనకాసనంబున గూర్చుండ నియ
మించి యున్నసమయంబున నన్నరనాథునితో యోగీంద్రుం
డి ట్లనియె.

185


సీ.

విను నైషధేశ్వర వినుపింతు నొకవార్త
          దాశార్ణపతికి భద్రాయు వనఁగ
జనియించి నిజమాతృసహితంబుగాఁ దమ
          తండ్రిచేతను బరిత్యక్తుఁ డగుచు
నొకవైశ్యపురమున నుండ నంతట గత
          ప్రాణుఁ డై యున్నయాబాలు మఱల
సంజీవితుని జేసి శైవధర్మం బుప
          దేశించి ధీమంతుఁ జేసినాఁడ


తే.

నతఁడు మాగధుఁ గెల్చి జయంబుఁ గాంచి
జనకునకుఁ గ్రమ్మఱంగ రాజ్యంబు నొసఁగె
నట్టిరాజాత్మజునకు నీయనుఁగుపుత్త్రిఁ
గీర్తిమాలిని నిమ్ము సత్కీర్తి వెలయ.

186


క.

అని యానతిచ్చి క్రమ్మఱఁ

జనియెను యోగీశ్వరుండు చంద్రాంగదుఁడున్
దనపత్నియైన సీమం
తిని యనుమతి వడసి యుండె దృఢనిశ్చయుఁ డై.

187


వ.

అంత నమ్మహీనాథుండు సుఖనిద్రం జెంది యుండు నాసమ
యంబున.

188


తే.

వాసరాధీశ్వరుండు దా వచ్చునపుడు
జనుల కెఱిఁగించు వాద్యనిస్వనము లనఁగ
జారచోరులగుండియల్ ఝల్లు మనఁగఁ
గొక్కొరోకో యటంచును గోళ్లు గూసె.

189


సీ.

పద్మాకరంబులఁ బద్మముల్ వికసించెఁ
         గమనీయతరహల్లకములు మోడ్చెఁ
బరిమళాన్వితశీతపవమానములు వీచెఁ
         బక్షులకలకలార్భటులు మించెఁ
జక్రవాకములకు సౌఖ్యంబు సేకూఱె
         వితతకాపోతహుంకృతులు మించె
దధిమథనప్రణాదంబులు వీతెంచె
         వత్సంబు లంభారవముల నెసఁగె


తే.

ముదిత భూపాలగౌళాదివిదితరాగ
గీతములు మ్రోసె దేవతాగేహములను
వేదపాఠరవంబులు వెలయుచుండె
లాలితం బైనప్రత్యూషవేళయందు.

190


సీ.

యజనాభిరతులు ద్రేతాగ్నులు ప్రణయింప
          మునివరేణ్యులు సాఁగి మ్రొక్కుచుండ
అధ్వన్యజనులు దేశాంతరంబుల కేఁగ

       హలికులు కేదారములకుఁ జనఁగ
ఘూకబృందంబులు కోటరంబులు చేరఁ
        జక్రవాకముల కుత్సవము దనరఁ
బుష్పజాతులు పరిస్ఫుటములై వికసింప
        సకలజీవులు సంతసమునఁ బొదల


తే.

హరిహరబ్రహ్మమయుఁడు సామాదినుతుఁడు
హల్లకారాతి పద్మినీవల్లభుండు
దేవవంద్యుండు భువనప్రదీపకుండు
భానుఁ డుదయించెఁ బూర్వదిగ్భాగమునను.

191


వ.

అంత నిషధభూమండలాఖండలుం డైన చంద్రాంగదనృపా
లుండు బ్రాహ్మ్యముహూర్తమ్మున నిద్రమేల్కాంచి మన
మునం బరమేశ్వరధ్యానం బొనర్పుచు ననంతరంబునఁ
గాల్యకరణీయంబులు నిర్వర్తించి విప్రసంఘములకు బహు
విధమ్ము లగుదానము లాచరించి తదీయాశీర్వాదంబులు
గైకొని గురువందనము లాచరించి తదనుమతి వడసి
దివ్యాంబరాభరణాద్యలంకృతశరీరుండును దక్షకదత్త
తురంగాధిరూఢుం డై వందిమాగధస్తవంబు లాకర్ణిం
పుచు నిజసందర్శననిమిత్తసమాగతపౌరజానపదవర్గంబుల నెడ
గలుగం జడియుచు కంచుకీజనంబులు బరాబరులు గావిం
పుచు ముందట నడువం జనుదెంచి మొగసాలహయావ
తరణంబు సేసి సభాస్థలమునకుం జని యచ్చట సింహాసనా
సీనుం డై సమస్తప్రధానసామంతదండనాయకకవిగాయక
విద్వజ్జనహితపురోహితబాంధవప్రకృతిజనములు బరివేష్టించి
కొలువం బేరోలగముననుండి యారాత్రి ఋషభ

యోగీంద్రుం డానతిచ్చిన వృత్తాంతం బంతయు సవిస్త
రంబుగా వారల కెఱింగించి తదనుమతంబున నారాజనం
దనుం దోడ్తేర నుచితజ్ఞు లయిన ప్రధానులం బిలువం
బంచి.

192

చంద్రాంగదమహారాజు భద్రాయువును శుభలేఖ వ్రాసి పిలిపించుట

సీ.

శ్రీమత్సదాశివశ్రీపాదరాజీవ
         మధుపాయమానసన్మానసుండు
తక్షకనాగేంద్రదత్తఖడ్గతురంగ
         భూషణాంబరజాతతోషణుండు
చంద్రాంగదుండు రాజన్యచూడామణి
         శ్రీయుతుం డైనభద్రాయువునకు
నాశీర్వదించి వృత్తాంతంబు వ్రాయించి
         పంపినలిఖిత మేర్పడఁగ వినుము


తే.

నీకుఁ గూర్మి వెలయ నాపేర్మిసుత నిత్తు
వైభవమున నీవు వైశ్యపతియు
బ్రాహ్మణోత్తములును భవదీయజననియు
నరుగుదెంచి పెండ్లి యాడవలయు.

193


చ.

అని లిఖియించి పంపినఁ దదాజ్ఞ శిరంబునఁ దాల్చి సత్వరం
బునఁ జని మంత్రిసత్తములు పొల్పుగ వైశ్యపురంబుఁ జొచ్చి నె
మ్మనములు పల్లవింప నసమానబలోజ్జ్వలు వజ్రబాహునం
దనుఁ గని మ్రొక్కి భద్రలిఖితంబు లొసంగుచుఁ బల్కి రొక్కటన్

194


శా.

ఆలస్యం బిఁకఁ జేయఁగావలదు కల్యాణంబు సంధిల్లె ను
ద్వేలప్రాభవధుర్యుఁ డైననిషధోర్వీనాయకుం డాత్మలో

బాలారత్నము నీకు నిత్తునని సంభావించి మ మ్మంపినన్
హాళి న్వచ్చితి మిత్తఱి న్వెడలు మత్యానందభావంబునన్.

195


క.

ఖ్యాతిగ నీ విపుడు భవ
న్మాతయుఁ బద్మాకరుండు మఱియుఁ దదీయ
భ్రాతృకళత్రసుపుత్త్రస
మేతముగా దర్లిరండు మిత్రయుతముగాన్.

196

భద్రాయువు వివాహార్థమై నిషధపురమునకు వచ్చుట

సీ.

అని విన్నవించిన యాప్రధానులపల్కు
        లాలించి భద్రాయు వపుడు వేడ్కఁ
గనకభూషణవస్త్రగంధానులేపన
        సరసాన్నముల వారి సత్కరించె
నంతఁ బద్మాకరుం డధికహర్షంబున
        నారాజనందను నభినుతించి
మంగళస్నానంబుఁ సంగతిఁ గావించి
        దివ్యభూషణదీప్తదేహుఁజేసి


తే.

రథికుఁగా నొనరించి తూర్యములు మ్రోయ
జననితోఁగూడ నతని దోడ్కొనుచు వచ్చె
నాత్మసతియునుఁ బుత్త్రుతో నరుగుదేర
నిఖిలభూసురయుక్తుఁ డై నిషధపురికి.

197


వ.

ఇవ్విధమున నిషధపురముఁ బ్రవేశించిన దశార్ణరాజ
నందను నెదుర్కొని చంద్రాంగదుండు వారల సకలవస్తు
పరిపూర్ణం బైనయొక్కనివేశనంబున విడియించి తత్పురం
బతిసుందరంబుగా నలంకారంబు గావించిన నదియును
ననేకతోరణమాలికాలంకృతంబును కర్పూరగంధసారమృ

గమదమిశ్రితసలిలసంసిక్తవిపణిమార్గంబును బహువిధరంగ
వల్లీవిచిత్రతప్రతిగృహాంగణప్రదేశంబును భేరీమృదంగ
ఢక్కావేణువీణావాదిత్రఘోషణంబును దేశాంతరాగత
చతుర్విధవర్ణాశ్రమజనసంకులంబు నైయుండె నంత నప్పౌ
రులు ప్రమోదాయత్తచిత్తులై యారాజనందనుం గాంచి.

198


క.

మనకీర్తిమాలినికి నీ
మనుజేంద్రసుతుండు దగును మఱియు నితనికిన్
మనరాజకన్య దగు నని
మనమున హర్షించి రపుడు మమతదలిర్పన్.

199

భద్రాయువునకు వివాహం బొనర్చుట

సీ.

అంతఁ జంద్రాంగదుం డత్యంతరయమునఁ
        దనకూర్మిపట్టి యుద్వాహమునకుఁ
గాశ్మీరకాంభోజకర్ణాటదాశార్ణ
        మగధమాళవమత్స్యమద్రపతులఁ
గేకయగాంధారకేరళనేపాళ
        గౌళచోళాదిభూపాలకులను
భూసురశ్రేష్ఠుల భువిలోనిజనముల
        నతిమైత్రి రప్పించి యాదరించి


తే.

వారియనుమతి వడసి దైవజ్ఞకథిత
శుభముహూర్తంబునందు విస్ఫురణ మెఱయఁ
గన్యకాదాన మొనరించె గౌరవమున
శ్రీయుతుం డై వెలుంగు భద్రాయువునకు.

200


వ.

ఆసమయంబున.

201

క.

సురవరులు పుష్పవర్షముఁ
గురిసిరి దివి మొరసెఁ దూర్యఘోషణములు కి
న్నరు లాడిరి యపుడు వధూ
వరుల కరగ్రహణవేళ వైభవ మెసఁగన్.

202


తే.

సర్వమంగళకరుణచే సంతతంబు
జగతి దీర్ఘసుమంగలి వగుమటంచుఁ
గట్టె మంగళసూత్రంబు గళమునందు
నావధూరత్నమునకు భద్రాయు వపుడు.

203


క.

లలితము లగుముత్తియములు
నలరులు దోయిళ్ల నునిచి యన్యోన్యముగాఁ
దలఁబ్రాలు వోసి రప్పుడు
చెలువయుఁ జెలువుండు హృష్టచిత్తత వెలయన్.

204


క.

శంకరుకారుణ్యంబున
సంకటము లణంగ భూమిచక్రంబు నిరా
తంకమతి నేలు మని సతి
కంకణమును గట్టెఁ బ్రియుని కరపద్మమునన్.

205


తే.

అఖిలసామ్రాజ్యభోగంబు లనుభవించి
యుర్వివంశాభివృద్ధిగా నుండుమనుచు
కీర్తిమాలినికరమునఁ గీర్తి వెలయఁ
గంకణము కట్టె రాజశశాంకుఁ డపుడు.

206


మ.

కనకౌదుంబరభద్రపీఠగతు లై కల్యాణవేదిస్థలిన్
మన ముప్పొంగ హుతాశను న్నిలిపి నేమం బొప్ప నాజ్యాహుతుల్
దనర న్వేల్చి వసిష్ఠమౌనిసతి సందర్శించి రాదంపతుల్
వనిత ల్పాటలు పాడుచుండ విలసద్వాద్యధ్వను ల్మ్రోయఁగన్.

207

క.

మేదురకుశపుష్పాక్షత
వేదస్వనముల వివాహవేదిక యొప్పెన్
సాదరణకృతాహుతులను
నాదట వహ్నియుఁ బ్రదక్షిణార్చుల వెలిఁగెన్.

208


వ.

తదనంతరంబున.

209


క.

నవ్వులు సల్లాపంబులు
నివ్వటిలన్ బంధుమిత్రనివహంబులతో
బువ్వంబులు భుజియించిరి
దివ్వెలు నలుదిక్కులందుఁ దేజము లెసఁగన్.

210


తే.

సౌరబలియును నాందీవిసర్జనంబు
కంకణోద్వాసనంబు పర్యంకవిధియు
నాదిగాఁ గల్గు వరవివాహావశేష
కార్యములు దీర్చి రమ్మహౌదార్యపరులు.

211


తే.

పేర్మి నారాజకన్యకఁ బెండ్లియాడి
శ్రీయుతాకారుఁ డైనభద్రాయు వొప్పె
ధన్యయగు దేవసేనను దగ వరించి
మానితుం డై చెలంగుసేనానికరణి.

212


వ.

ఇవ్విధంబునఁ బరమోత్సాహంబునం దినచతుష్టయంబు గడపి
సకలదేశాధీశ్వరులం బిలిపించి వారల ననేకమణిభూషణాంబ
రాదిసత్కారంబులం బూజింపుచున్న చంద్రాంగదుం గనుం
గొని వజ్రబాహుం డి ట్లనియె.

213


మ.

అనఘా యీనరనాథసూనుఁడు మదీయప్రాణసంరక్షణం
బొనరించె న్మును మద్విపక్షజనపాలోద్రేకము న్మాన్పి యీ
ఘనువంశంబును దల్లిదండ్రులను విఖ్యాతంబుగాఁ దెల్పుమీ

వనఁ జంద్రాంగదభూవిభుండు దరహాసాస్యుండునై యిట్లనెన్.

214

చంద్రాంగదమహారాజు వజ్రబాహునకు భద్రాయుసుమతువృత్తాంతం బెఱింగించి మరల నొప్పగించుట

వ.

నరేంద్రా విను మితండు భవన్నందనుండు శైశవమున విష
వ్రణరోగపీడితుం డయియుండి విషవ్రణబాధాక్రాంత
యగుతల్లియుం దానును దదీయక్లేశము సహింప నోపక
యున్న నీచేతఁ బరిత్యక్తు లగుచు మహారణ్యంబునం బడి
పోవుచుఁ దెరు వెఱుంగక పరిభ్రమింపుచు నొక్కయెడఁ
బూర్వజన్మకృతపుణ్యవిశేషమున నొక్క వైశ్యపురంబుఁ
గని యచ్చట నావైశ్యనాథునిచేత సురక్షితులై యుండు
నంతఁ గతిపయదినములకు నబ్బాలకుండు మృతుం డయిన
నచ్చటికి దైవయోగంబున ఋషభుం డను శివయోగీం
ద్రుండు విచ్చేసి యబ్బాలకుం గాంచి దయార్ద్రభావం
బునఁ గ్రమ్మఱ సంజీవితుం జేసి యమ్మాతృకుమారుల
దేహంబులు దివ్యంబు లగునట్లుగా ననుగ్రహించి చని
కొంతకాలమునకు నయ్యోగీంద్రసార్వభౌముండు మరలం
జనుదెంచి యక్కుమారు బహుశ్రుతుం గావించి యనంతర
మున శైవవర్మం బుపదేశించి సకలశత్రుభీకరమ్ములయిన
ఖడ్గశంఖమ్ము లొసంగి వెండియు భస్మలేపనంబున ద్వాదశ
సహస్రనాగబలమునుం గలుగునట్లు కటాక్షించి చనినఁ
గొన్నిదినములకు భవదీయరాష్ట్రక్షోభవృత్తాంతమ్ము విని
యచ్చటికిఁ జని యమ్మాగధుల నందఱం బరాజితులం
గావించి మిమ్మందఱ నుద్ధరించిన మహానుభావుం డిప్పురుష
శ్రేష్ఠునకు మహాత్ముఁ డయినయాఋషభయోగీంద్రుశాసన

మున మదీయపుత్రిక నొసంగి పాణిగ్రహణము గావించితి
నీ విప్పు డిక్కుమారు మాతృసహితమ్ముగాఁ దోడ్కొని
నిజనగరమునకుం జనుము నీవు శ్రేయోవర్ధనుండవై సుఖమ్ము
లనుభవింపం గలవని తనజామాత్రువాఙ్మూలమున సవిస్తర
ముగాఁ దెలియం జెప్పి యక్షణమ్మున.

215


మ.

కుముదాప్తప్రతిమాస్యఁగుందరదనం గుంభీంద్రకుంభస్తనిన్
సుమనోగంధవిరాజమానచికురన్ సూక్ష్మాలవగ్నన్ శర
త్కమలాక్షి న్మణిభూషణాంబరయుతన్ దాశార్ణభూభృత్సతిన్
సుమతిన్ బ్రేమను బిల్వబంచె నిషధక్షోణీశుఁ డచ్చోటికిన్.

216


తే.

మేఘనిర్గత మైన క్రొమ్మిం చనంగ
శంబరారాతి యాఱవశర మనంగ
దేవలోకాగతాప్సరస్త్రీ యనంగ
వారిరుహగంధి యచటికి వచ్చి నిలిచె.

217


వ.

ఇట్లు చనుదెంచిన.

218


క.

పాత్రులు క్షత్రియగోత్రప
విత్రులు శివభక్తు లైనవీరిరువురు నో
ధాత్రీశ భవత్పుత్త్రక
ళత్రము లని చూపి చెప్పె లలితమృదూక్తిన్.

219


సీ.

ఆవార్త యాలించి యావజ్రబాహుండు
        మహితవిస్మయరసమగ్నుఁ డగుచుఁ
దాను జేసినదుష్కృతము లెల్లఁ దలపోసి
         తనుఁ దాన నిందించుకొనుచు మఱియు
భవ్యతరానందపారవశ్యము నొంది
         పులకీకృతాంగవిస్ఫురితుఁ డగుచు

నయ్యాత్మజునిఁ బ్రేమ మలరఁ గౌఁగిటఁ జేర్చి
       కరుణతొఁ దనపత్ని గారవించె


తే.

నంత నిషధేంద్రపూజితుం డై యతండు
భార్యయును దాను శృంగారభరితు లగుచుఁ
గొడుకుఁ గోడలి నపుడుఁ దోడ్కొనుచు వచ్చి
రగణితవిలాసమున నాత్మనగరమునకు.

220


క.

హృద్రాజీవస్థాపిత
రుద్రుని మహిళాసమేతు రుచిరాకారున్
భద్రాచారుని నృపసుతు
భద్రాయువుఁ గాంచి రపుడు పౌరులు ప్రీతిన్.

221


సీ.

ఈవిక్రమాఢ్యుఁడే యెలనాఁగ మాగధ
        బలవితానంబుల భంగపఱిచె
నీయశస్కాముఁడే హేమాంగి మును తన
        జనకుని బంధముక్తునిగఁ జేసె
నీపుణ్యపురుషుఁడే యింతి యస్మద్ధన
        పశుధాన్యములఁ గృపాపరత నొసఁగె
నీశుభాచారుఁడే యేణాక్షి ఋషభాఖ్య
        గురుకటాక్షముఁ గాంచి కుశలుఁ డయ్యె


తే.

నితనితలిదండ్రులు దలంప నెంతపుణ్యు
లేమి తప మాచరించెనో యితనిసాధ్వి
యనుచు సతు లెల్ల సౌధాగ్రవీథి నుండి
పరఁగ జూచిరి కన్నులపండువుగను.

222


మ.

శివనామస్మరణంబుతో ద్విజకులాశీర్వాదనాదంబుతోఁ
గవివైతాళికమాగధస్తుతులతో గాణిక్యగానంబుతో

బ్రవిభాస్వత్కరదీపికల్‌ వెలుఁగ దూర్యధ్వానముల్‌ మ్రోయఁగా
భవనప్రాంగణసీమయందు నిలిచెన్ భార్యాసమేతంబుగన్.

223


క.

భాసురగీతము లెసఁగఁగ
భూసురకామినులు లాజపుష్పాక్షతముల్
సేసలు చల్లుచు రాఁగా
రాసుతుఁడును రాజమందిరముఁ జొచ్చెఁ దగన్.

224


వ.

ఇట్లు నిజశుద్ధాంతంబుఁ బ్రవేశించి యనంతరంబునఁ గృహ
దేవతాప్రార్ధనంబులును బ్రాహ్మణసమారాధనంబులును
దేవతాగృహమహోత్సవంబులునుం గావించి సుహృద్బాం
ధవజనసమేతముగా మధురాహారములు భుజియించి
యాసమయంబున.

225


మ.

కమలానందనరూపసుందరుఁడు రాకాచంద్రబింబాస్యవి
భ్రముఁడున్‌ భానుసమానతేజుఁ డగునాభద్రాయు వంత న్నిజ
ప్రమదారత్నముఁ గీర్తిమాలిని కరాబ్జాతంబు చేపట్టి తా
సుముహూర్తంబునఁ గేళికాభవనమున్‌ సొత్తెంచె లీలాగతిన్.

226


మ.

కలితాదర్శనతాళవృంతనిశాకాశ్మీరకస్తూరికా
ఫలపుష్పాక్షతగంధయుక్త మగుపూఁబాన్పందు గూర్చుండి ర
త్యలఘుప్రాభవు లవ్వధూవరులు సౌహార్దంబు సంధిల్లఁగాఁ
గలకంఠీమణు లూడిగంబులును శృంగారంబులుం జేయఁగన్.

227


వ.

తదనంతరంబున.

228


క.

శిక్షితశాత్రవుఁడు విరూ
పాక్షున కర్పితము గాఁగ ఫలములతోడన్
దక్షిణలు వీటికాదులు
దక్షుండై యొసఁగె విప్రదంపతు లలరన్.

229

క.

గౌరీసమర్పణంబుగ
హారిద్రపటీరకుంకుమాంజనముల స
త్కారము లొనర్చె సతులకుఁ
గౌరవమున నిషధరాజకన్యక వేడ్కన్.

230


క.

కౌశికవైభవమునఁ బర
మేశునికృప గల్గి ధాత్రి యేలుదు వనుచుం
దాశార్ణధరాధీశుల
కాశీర్వాదము లొనర్చి రాద్విజవర్యుల్.

231


క.

మంగళ మని పలుకుచుఁ బు
ణ్యాంగనలు సఖీమనోహరాలాపములన్
మంగళహారతు లొసఁగిరి
సంగీతరవంబు లెసఁగ సతికిం బతికిన్.

232


ఆ.

అంతఁ గొంతప్రొద్దు హర్షంబుతో నుండి
సకలజనులు వేడ్క సంఘటిల్ల
భద్రముగఁ గవాటముద్రలు ముద్రించి
చనిరి వారివారిసదనములకు.

233


మ.

స్మరసౌందర్యవిలాసుఁ డంత నిషధక్ష్మాపాలకన్యామణిన్
బరమప్రేమభవాప్తిఁ గౌఁగిటను సంభావించ కీలించి ని
ర్భరనీవిన్ సడలించి కంఠకుచనేత్రద్వంద్వవక్త్రాదిభా
సురదేశంబులఁ జుంబనంబు లొసఁగెన్ సూనాస్త్రశాస్త్రజ్ఞతన్.

234


క.

కమలమరందాస్వాద
భ్రమరముగతి నామృగాక్షి భవ్యవయోవి
భ్రమమెల్లఁ గొల్లలాడెను
సమరతుల నృపాలసుతుఁడు చతురత మెఱయన్.

235

తే.

పన్నగం బాడ నక్షత్రపఙ్క్తి వీడఁ
జంద్రమండలమున జలస్రావ మొదవ
గగన మల్లాడ శైలము ల్గదల నప్పు
డుపరతి యొనర్చె మరల నయ్యుత్పలాక్షి.

236


వ.

ఇవ్విధంబున నన్నవోఢదంపతు లనంగసంగరమ్మునకుం
జొచ్చి భుజాబంధననఖక్షతదంతక్షతాదికంబులను గూర్మ
కుక్కుటకుంజరకురంగమార్జాలాదిబంధవిశేషంబులం బ్రవ
ర్తింపుచునుండ నాసురతంబు ప్రభూతపులకోద్గమంబును
బ్రవర్ధితప్రేమానురాగంబును బరిస్రస్తధమ్మిల్లబంధంబును
బ్రభగ్నపత్రభంగంబును బ్రగళితఘర్మబిందుసలిలంబును
బ్రస్రావితకామసలిలంబు నై యున్నసమయంబున నతిశ్రాం
తులై సౌధజాలరంధ్రసమాగతశీతలపవనంబుల నాప్యాయ
నంబు నొంది తత్పారవశ్యంబున సుఖసుప్తిఁ జెందియున్నంతఁ
బ్రభాతసమయంబునందుఁ బ్రబోధనార్థంబుగా వందిమాగధ
వైతాళికాదిజనంబులు చనుదెంచి యనేకవిధంబులం బ్రశం
సింపుచు నిట్లని స్తుతియించిరి.

237


మ.

జయ మార్తాండకులాబ్థిశీతకర దాశార్ణక్షమాపాలకా
జయ హేమాద్రిసమానధైర్య విలసత్సామ్రాజ్యధౌరేయకా
జయ భూనాయక సార్వభౌమవినుతక్ష్మాపాలసంహారాకా
జయ భద్రాయురధీశధీనుత మహాశౌర్యప్రభావోజ్జ్వలా.

238


సీ.

సంక్రందనుఁడు నీకు సామ్రాజ్యము లొసంగు
        వైశ్వానరుండు పావనునిఁ జేయు
దండధారుఁడు నీకు దండనీతి యొసంగు
        నసురుండు శత్రుజయం బొసంగు

వరుణుండు నిర్మలస్వాంతుని గావించుఁ
         బవనుండు నీకు దోర్బల మొసంగు
ధననాయకుఁడు మహాధనవంతుఁగాఁ జేయు
         నీశానదేవుఁ డభీష్ట మొసఁగు


తే.

బ్రహ్మవిష్ణుముఖామరప్రకరములును
సంయమీంద్రులు భాస్కరశశధరులును
సేమ మారసి నిన్ను రక్షింపుచుంద్రు
మిహిరసమతేజ నిద్దుర మేలుకొనుము.

239


క.

భవదీయజనకుననుమతి
నవనీభారము వహింప నభిషిక్తుఁడవై
యువరాజ్య మేలవలయును
బ్రవిమలమతి మేలుకొనుము పార్థివతనయా.

240


తే.

అబ్జబాంధవుఁ డుదయాద్రియందుఁ దోఁచె
నిదుర మేల్కాంచి పశుపతిపదయుగంబు
నాత్మ భావించి యాహ్నికం బాచరింపు
సకలభూపాలజనగేయ సౌమతేయ.

241


వ.

అని మఱియు బహుప్రకారంబులం బ్రశంసింపుచున్న
వైతాళికజనస్తోత్రపఠనారవంబులవలనను మతంగజఘటా
ఘీంకారంబులవలనను భేరీమృదంగాదివాద్యఘోషంబుల
వలనను నన్నరేంద్రనందనుండు మేల్కాంచి మౌనంబున
నొక్కింతదడవు దనమనంబునఁ బరమేశ్వరధ్యానం బొన
రించి తదనంతరంబునఁ గాల్యకరణీయంబు లాచరించి పితృ
మాతృప్రముఖగురుజనంబుల భూసురులకుం బ్రణామంబు
గావించి తదాశీర్వాదంబులు గైకొనుచుఁ బరమాహ్లాదం

బునఁ బరిషన్మధ్యంబునకు వచ్చి యచ్చట సమస్తప్రధాన
మిత్రబాంధవవిద్వజ్జనపరివేష్టితుం డయి యున్నతమతండ్రి
సన్నిధానంబునఁ దేజంబు మెఱయ నర్హాసనంబునఁ గూర్చుండి
తత్సమయోచితంబు లగురాజకార్యంబులు నిర్వర్తింపుచు
సకలప్రకృతిజనంబులకు సంతోషం బొనరింపుచు బాంధవ
జనంబులతో మైత్రి నెఱపుచు దీనానాథజనంబులకు వలసిన
యర్థంబు లొసంగుచు నతిథిసత్కారంబు లాచరింపుచు
యథేష్టభోగంబు లనుభవింపుచు నిజకళత్రసమేతంబుగాఁ
బరమానందంబుల సుఖం బుండె నంత.

242


శా.

ఆలో నొక్కదినంబునందు మగధక్ష్మాధీశుకారాగృహ
వ్యాలీఢత్వము మాన్పి తెచ్చి మధురవ్యాహారపూర్వంబుగా
నీలగ్రీవపదాబ్జసాక్షికముగా నిర్భీతుఁ గావించి భూ
షాలంకారము లిచ్చి పంపె నతిసౌహార్దంబు సంధిల్లఁగన్.

243


తే.

ఇవ్విధంబున యువరాజ్య మేలుచుండి
యొక్కదినమునఁ గారుణ్య ముప్పతిల్ల
వైశ్యనాథుని బిలిపించి వరవిభూష
ణాంబరంబు లొసంగి భద్రాయు వపుడు.

244


క.

పద్మాకరు బహుమణిధన
పద్మాకరు మేరుధీరు బాంధవపటలీ
పద్మాకరహంసోదయుఁ
బద్మాకరభవను గాంచి పలికెను మైత్రిన్.

245


ఉ.

పన్నగరాజహారునికృపాతిశయంబునఁ జేసి మమ్ము నా
పన్నుల నుద్ధరించితివి ప్రత్యుపకారము సేయనోప నా
మన్నన యాదరించి నిజమందిరసీమకుఁ బొమ్మటంచు వి

ద్వన్నుతకీర్తి పంపె నటు వైశ్యపతిన్‌ బహుమాన మొప్పఁగన్

246


వ.

అంత నావైశ్యనాథుం డైనపద్మాకరుండు భద్రాయువుచేతం
గృహీతసత్కారుండై నిజకుటుంబసమేతముగాఁ దదీయ
జననీజనకులచేత ననుజ్ఞాతుండై భద్రాయువుం బ్రశంసిం
పుచు ఋషభయోగీంద్రుమహామహిమంబు లెన్నుచుఁ గతి
పయప్రయాణముల పురంబు బ్రవేశించి యాత్మమందిర
మున సుఖం బుండె నంత.

247


చ.

జనకునియాజ్ఞఁ దప్పక యజస్రము సద్గురుసేవ సేయుచున్
ఘనతరధైర్యశౌర్యములు గల్గి సమస్తవిపక్షమండలిం
దునుముచు ధర్మమార్గమున దోర్బలవిక్రమశాలి రాజనం
దనుఁడు నిజాప్తమంత్రిసహితంబుగ నుండెను నిర్విచారుఁడై.

248


క.

పదియాఱువత్సరములకుఁ
బదపడి నిజపురము జేరి భద్రాయువు దాఁ
బదిరెండుహాయనంబులు
సదమలమతి నుండెఁ దనదుజనకునిపజ్జన్.

249

భద్రాయువునకుఁ బట్టముగట్టుట

ఉ.

శ్రీయుతదివ్యలక్షణుఁడు శిష్టజనావనశీలుఁ డంబికా
నాయకపాదపద్మభజనారతుఁ డుజ్జ్వలతేజుఁ డైనభ
ద్రాయువుఁ గాంచి భూభరధురంధరుఁ జేయఁగ నిశ్చయించె న
త్యాయతకీర్తిశాలి యగుతజ్జనకుండు మహాముదంబునన్.

250


వ.

ఇవ్విధంబున నవ్వజ్రబాహుండు నిజనందనుం డైనభద్రా
యువునకు దాశార్ణమహీమండలసామ్రాజ్యధురంధరత్వంబు
నకు నభిషేకంబు సేయం దలంచి పురం బతిమనోహరంబుగా
నలంకారంబు గావింపఁ దగువారల నియోగించి కోసల

కేకయగాంధారకాశ్మీరవిదర్భశూరసేనమద్రమగధమాలవ
మత్స్యపాంచాలాదిమహీపతులను నిషధాధినాథుం డైన
చంద్రాంగదసమేతంబుగా రావించి క్రమ్మఱ వైశ్యపతియైన
పద్మాకరునిం బిలిపించి వారల యనుమతి వడసి బంధుమిత్రా
మాత్యపురోహితబ్రాహ్మణవిద్వజ్జనకవిగాయకప్రధాన
సామంతదండనాయకప్రముఖనిఖిలజనబృందములు డెందమ్ముల
నానందమ్ము నొందుచుండఁ జతుస్సముద్రోదకములును
గంగాదిమహాపుణ్యనదీతీర్థములును సంగ్రహించి భూసు
రేంద్రులవలన గ్రహశాంతి యగునట్లుగా హోమమ్ము
గావించి దైవజ్ఞనిర్దిష్టశుభముహూర్తమునం గీర్తిమాలినీ
సమేతముగా నౌదుంబరభద్రపీఠమునఁ గూర్చుండ నియో
గించి యాగమోక్తప్రకారమున మహర్షిసత్తములును గన్యకా
ష్టకమును మఱియు బ్రహ్మక్షత్త్రియాదిపౌరజానపదవర్గమును
సమస్తపరివారములును నభిషేకము లొనరింపంజేసినయనంత
రంబ మూర్ధాభిషిక్తుం డైనయారాజనందనుండు జాంబూనద
పట్టబద్ధఫాలభాగుండును దివ్యదుకూలాంబరధారణుండును
మృగీమదసమ్మిశ్రగంధసారవిలేపితదేహుండును బహువిధ
పుష్పమాలికాలంకృతుండును హారకిరీటకుండలకంకణాంగు
ళీయకనూపురాంగదగ్రైవేయాదిసమస్తమణిస్థగితసౌవర్ణ
భూషణభూషితుండును నై త్రిలోకరాజ్యధురంధరుం డగు
మహేంద్రుండునుంబోలె భాసమానుం డగుచు నక్షౌహిణీ
బలసమన్వితుం డగుహైమరథుం బిలిపించి ధరియించిన
గండపెండేరంబు డాకాలం బ్రకాశింప భేరీమృదంగ
పటహనిస్సాణపణవగోముఖవేణువీణాప్రముఖ

చతుర్విధవాద్యరవములు రోదసీకుహరాంతరాళము నిండి
నలుదెసలం బిక్కటిల భద్రగజాధిరూఢుం డై చంద్రమం
డలప్రతీకాశం బైనశ్వేతచ్ఛత్రమ్ము శోభిల్ల నిరుపార్శ్వం
బుల విలాసవతీజనములు వింజామరములు వీవ హయ
గజస్యందనభటసముత్తుంగమ్ము లగుచతురంగములు పరి
వేష్టించి నడువఁ గరదీపికాసహస్రమ్ములు వెలుంగఁ గంచుకి
జనములు వేత్రహస్తులై సందడిజనముల జడియంద్రోయుచు
బరాబరులుం గావింపుచు ముందట నడువ ధనకనకవస్తు
వాహనాద్యుపాయనపాణులై సామంతరాజసంఘము లెదు
ర్కొని ప్రణమిల్లుచుం జనుదేర జగన్మోహనాకారవిలాస
విభ్రమములు మెఱయ వారకామినీబృందము లెడనెడ
నిలిచి మంజీరకింకిణీస్వనమ్ములు చెలంగ మాళవవసంత
సౌరాష్ట్రఘంటారవభైరవపున్నాగముఖారినీలాంబరీప్రముఖ
రాగములు పాడుచుఁ దాళక్రియామానంబులు దప్పకుండ
కపిత్థకటకాముఖసూచీముఖశుకతుండసర్పశీర్షార్ధచంద్రశిఖర
భ్రమరపతాకాదిహస్తముల నభినయింపుచు దండలాస్యాది
నృత్యావధానమ్ములు సలుపుచుండఁ బుణ్యాంగనామణులు
సౌథాగ్రభాగంబులందుండి పుష్పలాజాక్షతంబులు సేసలుఁ
జల్లుచుఁ జూచుచుండ వందిమాగధబృందము లనేకప్రకా
రంబుల దాశార్ణదేశాధీశ్వర భూపాలవంశసార్వభౌమా
సుమతీగర్భపయఃపారావారరాకాశశాంకా వజ్రబాహు
మహారాజనందనా ఋషభయోగీంద్రకారుణ్యకటాక్ష
వీక్షణసమాలబ్ధఖడ్గశంఖాదిదివ్యసాధనప్రకాశమానాద్వా
దశసహస్రవేదండజవసమన్వితదీర్ఘభుజార్గళా నవాక్షౌ

హిణీబలపలాయనకరణదండప్రచండప్రతాపా మగధ
రాజగర్వనిర్వాపణా భూలోకపురందరా కందర్పసుందరా
ధైర్యవిజితమేరుమందరా జయవిజయీభవ యని ప్రశం
సింపుచుఁ గైవారమ్ములు సేయ వాహ్యాళి వెడలి పరమోత్స
వంబునఁ బురవీథులం బ్రదక్షిణముగా విచ్చేయుచుఁ బ్రతి
గృహాంగణప్రదేశనివాళితనీరాజనంబులు గైకొనుచు
సకలజనమనోరంజనముగాఁ గ్రమ్మఱ సభాస్థానమునకుం
జనుదెంచి రత్నసింహాసనాసీనుండై బ్రాహ్మణాశీర్వాదం
బులు గైకొని వారలకు ననేకగోభూహిరణ్యాదిదానంబు
లాచరించి సకలబంధుసమేతంబుగా మృష్టాన్నపానములు
భుజియించి కతిపయదినములకు దేశాంతరసమాగతు లయిన
రాజులమణిభూషణాంబరవాజివారణాదిబహుమానంబుల
సంతుష్టులం గావించి క్రమ్మఱ యథాస్థానమ్ములకుం బోవం
బనిచి తదనంతరమునఁ గొన్నిదినములకుఁ జంద్రాంగదపద్మా
కరులం బ్రియపూర్వకముగా వందనాలింగనాదిసత్కార
ములఁ బూజించి వారివారిపురములకుం బోవునట్లుగాననుజ్ఞ
యొసంగి యంత దేవీసహితముగాఁ బరమానందంబున
రాజ్యపరిపాలనంబుఁ జేయుచున్న నిజకుమారుం డయిన
భద్రాయువుం గాంచి వజ్రబాహుండు పరమాహ్లాదంబున
సుఖంబున నుండెనని చెప్పి సూతుం డి ట్లనియె.

251


సీ.

అంతట మఱికొన్నిహాయనంబులకును
         వార్ధక్యదశఁ జెంది వజ్రబాహుఁ
డాత్మవిజ్ఞానియై హరుపదాబ్జంబులు
         మదిలోన నిల్పి నిర్మలమనీష

నిర్మాణమోహుండు నిర్దుష్టచరితుండు
       షడ్వర్గరహితుండు సర్వసముఁడు
విజితేంద్రియుండును విగతదోషుండును
       శమదమాదికగుణోజ్జ్వలుఁడు నగుచు


తే.

నంతఁ బత్నీసమేతుఁడై యవ్విభుండు
పావనము లైనపుణ్యతపోవనముల
ఘోరతప మాచరించి యోగులు నుతింప
ముక్తిదం బైనశివలోకమున వసించె.

252


ఉ.

న్యాయము దప్పకుండ రఘునందనరంతిదిలీపకార్తవీ
ర్యాయతవిక్రమంబున నరాతుల గెల్చి సమస్తధర్మముల్
చేయుచుఁ జంద్రశేఖరవశీకరణాచ్ఛమనోబ్జ మొప్ప భద్రా
యువు రాజ్య మేలెఁ బ్రమదంబుగ భూమిజను ల్నుతింపఁగన్.

253


క.

ద్విజబాహుజవిట్ఛూద్రులు
నిజవర్ణాచారధర్మనిష్ఠాపరు లై
వృజినరహితు లై యుండఁగఁ
బ్రజలను బాలించె నపుడు భద్రాయు వొగిన్.

254


మ.

పరరాష్ట్రంబుల ధారుణీపతులు కప్పంబుల్ సమర్పించి బం
ధురమైత్రిం దను గొల్వఁగా సుజనసందోహంబు వర్ధిల్లఁగా
నురగేంద్రద్విపకూర్మశైలములభారోద్రేకము ల్వీడఁగా
ధరణీపాలన మాచరించె నతఁ డుద్యత్కీర్తిధౌరేయుఁడై.

255


వ.

మఱియు నారాజపుంగవుండు శరణాగతులకు నభయంబు
లొసంగుచు వాపీకూపతటాకారామనిర్మాణవివాహోపన
యనదేవతాగృహప్రతిష్ఠాగ్రహారాదిసమస్తధర్మంబు
లాచరింపుచు నశ్వమేధాదిమహాధ్వరంబు లొనరింపుచు

స్వరాష్ట్రంబునకు నీతిబాధలు లేకుండునట్లుగా భూపరి
పాలనంబుఁ గావింపుచు నిజభార్య యైనకీర్తిమాలినితోడ
సకలసామ్రాజ్యభోగంబు లనుభవింపుచుఁ బరమానందంబున
నుండునంత.

256

వసంతఋతువర్ణనము

క.

విధుమదనసఖ్యకర మై
మధుకరశుకపికమయూరమధుకరరసవా
గ్బధిరీకృతదిక్తట మై
మధుమాసము దోఁచె ధరణిమండల మలరన్.

257


మ.

చిగిరించె న్సకలద్రుమంబులును బూచె న్మల్లికావ్రాతముల్
సెగలై తోఁచెను మాలతీతతికి రాజీవాకరోద్యానము
ల్మిగులన్‌ హర్షము దోఁపఁ బుష్పరసము ల్మెండయ్యె నిర్మేఘమై
గగనంబెంతయు నొప్పె మాధవుఁ డభంగఖ్యాతిఁ దోతెంచినన్.

258

భద్రాయువు భార్యతోఁగూడి వనవిహారంబు సల్పుట

సీ.

అంత నాభద్రాయు వతిమనోహర మైన
        యామధుమాసంబునందు వేడ్కఁ
బల్లవమంజరీప్రసనాదిహృద్యంబు
        కుంజగుంజద్భృంగరంజితంబు
కుందవాసంతికాకుసుమసౌగంధ్యంబు
        కోరకితాశోకకురవకంబు
నవఫలభారావనమ్రరసాలంబు
        మాధవీమల్లికామంటపంబు


తే.

కీరశారీమయూరకోకిలమరాళ
ముఖరకలకలరావసముజ్జ్వలంబు

నైనరమ్యవనంబున కరిగి యచట
సతియుఁ దానును వనకేళి సంచరించె.

259


వ.

ఇట్లు వనవిహారంబు సేయుచు నన్నరేంద్రనందనుండు నిజ
కళత్రంబున కిట్లనియె.

260


మ.

వనలక్ష్మిం గనుఁగొంటె పంకజముఖీ వర్ణింపఁ దాళీగురు
స్తనముల్ భాసురపల్లవాధరముఁ గుందస్వచ్ఛదంతంబులున్
వనపక్షిస్వనభాషణంబులును శశ్వద్భృంగనేత్రంబులున్
ఘనవల్లీకచముల్ ఫలాభరణముల్ గన్పట్టెఁ గాంతాకృతిన్.

261


ఉ.

ఓతరళాక్షి మాధవుసముద్యమ మేమని చెప్పవచ్చు స
జ్జాతులు వంతనొందఁగ విజాతికుజాతులనెల్ల వైభవో
పేతులఁ జేసె మూగులకుఁ బేర్మివచోగరిమంబు నేర్పె మం
దాతపుఁ డత్యుదగ్రకరుఁ డయ్యెఁ దదీయమహత్త్వసంపదన్.

262


సీ.

చంచరీకనికాయఝంకారరవములు
        ధరణీసురోక్తమంత్రములు గాఁగ
శుకకోకిలమయూరనికరనాదంబులు
        సకలవాదిత్రఘోషములు గాఁగ
మహితపుష్పస్రవన్మకరందబిందుబృం
        దములు హరిద్రోదకములు గాఁగఁ
బల్లవమంజరీవల్లికాప్రతతులు
        భాసిల్లుతోరణపఙ్క్తి గాఁగఁ


తే.

దనరి మాధవవనదేవతావివాహ
భవనములమాడ్కి శృంగారభావ మలరఁ
గన్నులకుఁ బండువై యొప్పెఁ గాననములు
హర్ష మిగురొత్తఁ జూడు మబ్జాయతాక్షి.

263

సీ.

మంజులపల్లవమంజరీపుంజంబుఁ
        గనుఁగొన నేత్రరంజనము గాఁగ
శారికాకలకంఠకీరకోలాహలం
        బేప్రొద్దు వీనుల కింపు గాఁగఁ
జంపకాదికగంధసంపత్తి యశ్రాంత
        మిష్టమై ఘ్రాణసంతుష్టి యొసఁగ
శైత్యమాంద్యానంతసౌరభ్యమిళితమై
        కరువలి తనుసౌఖ్యకారి గాఁగ


తే.

మేదురమరందఫలరసాస్వాదనంబు
మెరసి జిహ్వకు సంప్రీతికరము గాఁగఁ
బరఁగి పంచేంద్రియాహ్లాదపరతఁ దనరె
నీవనంబులఁ జూడు మిందీవరాక్షి.

264


చ.

తరువులు గోగణంబులు నదంబులు సత్పురుషుల్ ధరిత్రలో
నరయ పరోపకారపరులై జనియించినవారు వీరిలోఁ
దరువులు సారపుణ్యఫలదంబులు సర్వజనశ్రమచ్ఛిదా
కరములు నిత్యసౌఖ్యజనకంబులు గన్గొను మంబుజాననా.

265


మ.

ఘనకర్పూరపరాగసైకతములున్ గస్తూరికామోదముల్
వనదంతావళకుంభనిర్గళితభాస్వన్మౌక్తికంబు ల్విట
ప్యనిశస్రస్తమరందవర్షములు నీహారాంబుపూరంబులున్
గనుఁగొంటే మదహంసయాన విలసత్కాంతారమార్గంబులన్.

266


వ.

అని యివ్విధంబునఁ బ్రశంసింపుచు నుపవనలక్ష్మీసందర్శన
కుతూహలుం డయి సపరివారుండై నిజకుటుంబినీసహిత
ముగాఁ జని యమ్మహీనాథుండు కాంతారమ్ములం దిరుగుచు
సహకారపనసకదళిఖర్జూరద్రాక్షాదిఫలంబు లార

గింపుచు వాసంతికాకుందకురంటకకరవీరాదికుసుమగుచ్ఛం
బులు విదళింపుచు మధురఫలరసమ్ములు గ్రోలుచు మరందమ్ము
లాస్వాదింపుచుఁ గృతకశైలమ్ము లెక్కుచు నికుంజగృహ
ములం బ్రవేశింపుచు గిరినిర్ఝరమ్ములఁ దోఁగుచు సరోవర
మ్ములఁ గ్రుంకుచుఁ దాపసాశ్రమములు గనుంగొనుచుఁ
బుండరీకవేదండగండకభల్లూకవరాహాదిభీషణమృగముల
ఖండింపుచు ని ట్లనేకవిధముల వనవిహారములు సలుపుచు
నొక్కయెడ శీతలతరుచ్ఛాయాతలమున విశ్రమించి
యున్న సమయంబున.

267

కృత్రిమదంపతీకథనము

తే.

ఓమహాబల రాజేంద్ర యురుగుణాఢ్య
మమ్ము రక్షింపు రక్షింపు సమ్మతముగ
వాడికోఱలబెబ్బులి వచ్చె వచ్చె
ననుచు నాక్రందన మొనర్చె నాద్విజుండు.

268


చ.

నరవరుఁ డంత నెమ్మనమునందుఁ గృపారస ముప్పతిల్లఁగా
శరము శరాసనంబునను సంధిలఁజేసిన యంతలోన నో
హర పరమాత్మ శూలధర హా శివశంకర యంచు నేడ్చుభూ
సురసతిఁ బట్టె బెబ్బులియు సుస్థిరభీషణరోష మేర్పడన్.

269


క.

అంతట శార్దూలముపై
నెంతయు నిశితాస్త్రతతు లనేకంబులు భూ
కాంతుఁడు పరపిన నది యా
వంతయుఁ జలియింపదయ్యె నద్రివిధమునన్.

270


తే.

ఈవిధంబున నేయ నాభూవరేంద్రు
బాణములు లెక్కగొనక దోర్బలము మెఱయ

విప్రసతి నీడ్చుకొనిపోయె విపినమునకు
నాక్షణంబున శార్దూల మద్భుతముగ.

271


మ.

వికటవ్యాఘ్రనిషూదితాంగయగుసాధ్విం గాంచి హాకామినీ
వికచాబ్జేక్షణ విద్రుమాధర లసద్వేదండకుంభస్తనీ
శుకసంభాషిణి మన్మనఃప్రియకరీ సోమాస్య యంచు న్మహా
నకఘోషంబున భూసురుండు వగచె న్నానాప్రకారంబులన్.

272


సీ.

అని విలాపించుచు నారాజు నీక్షించి
        యెలమి నాబ్రాహ్మణుఁ డిట్టులనియె
నీగురుం డగుశివయోగి యెచ్చటి కేఁగె
        శైవవర్మంబు నేత్రోవఁ జనియె
ద్వాదశసాహస్రవేదండబల మెద్ది
        ఖడ్గశంఖంబు లెక్కడ వసించె
నస్త్రమంత్రాదివిద్యాభ్యాస మేమాయె
        భవదీయశౌర్య మేభంగి నుడిగె


తే.

నిన్నియును గల్గియుండి నీ వెంచిచూడ
వనమృగంబును జంపలే వైతి విపుడు
కాన నీపౌరుషంబెల్లఁ గానవచ్చె
వజ్రబాహుకుమార నిర్వహణదూర.

273


క.

భీతుల నార్తుల దీన
వ్రాతముల ననాథజనుల వాత్సల్యమునన్
బ్రీతిం బోవని మనుజుఁడు
భూతలమున నెంచి చూడఁ బూజ్యుం డగునే.

274


ఆ.

ధనము సంగ్రహించి దానం బొనర్పని
గృహపతికిని భైక్షవృత్తి మేలు

కాకయుండెనేని గరళాశనంబు మే
లగ్నిఁ జొరుట యంతకన్న మేలు.

275


క.

శరణాగతుఁ బ్రోవనిభూ
వరుఁ డధమాధముఁడు వాఁడు వసుధాస్థలిపైఁ
జిరజీవి యౌటకన్నను
మరణం బొందుటయు మేలు మనుజాధీశా.

276


క.

అని నిందింపుచు శోకం
బునఁ బొరలుచు లేచుచున్న భూసురనాథున్
గనుఁగొని యారాజేంద్రుఁడు
దనమనమున నిట్టులని వితర్కించెఁ దగన్.

277


ఉ.

మిత్రసమానతేజులును మేరుధరాధరధీరులున్ సుచా
రిత్రులు నార్తరక్షణు లరిందములున్ కలుషౌఘవల్లి కా
దాత్రులు నైనమత్పితృపితామహు లట్లన యిమ్మహీసుర
క్షేత్రముఁ బ్రోచి పుణ్యమునఁ జెందక యే నపకీర్తి జెందితిన్.

278


మత్తకోకిల.

ఈమహీసురుఁ డెంచిచూడ నహీనదివ్యతపోబలో
ద్దామసాహసుఁ డగ్నికల్పుఁ డుదగ్రతేజుఁడు గావునన్
దామసాకృతి మాని సాత్వికతానిరూఢి వహింపఁగా
నీమహాత్ముని వాంఛితార్థము లెవ్వియైన నొసంగెదన్.

279


వ.

అని నిశ్చయించి.

280


ఆ.

విప్రుఁ జేరి మొగము వెలవెలఁబారఁ ద
చ్చరణపద్మములకు సాఁగి మ్రొక్కి
కేలుదోయి నుదుటఁ గీలించి యత్యంత
వినయ మెసఁగ నిట్టు లనియె విభుఁడు.

281

క.

ఇది రాజ్య మిది కళత్రం
బిది నాదేహము మహాత్మ యిన్నిటిలో నె
య్యది నీ కిష్టము దానిన
పదపడి యే నిత్తుఁ గొనుము బ్రహ్మకులీనా.

282


క.

కరుణింపుము దుర్బలుఁడను
బరతంత్రుఁడఁ దలఁప క్షత్రబంధుండను భా
సురకీర్తివిహీనుండను
మఱి నాయపరాధ మిపుడు మన్నింపు తగన్.

283


క.

అని పలుకుచున్నభూవరుఁ
గనుఁగొని యావిప్రుఁ డనియెఁ గాంతాహీనుం
డనునపవాదము వీడఁగఁ
దనకు భవత్పత్ని నిమ్ము ధర్మస్థితిగన్.

284


చ.

అనిన నరేంద్రుఁ డిట్లనియె నాద్విజసత్తముతోడ మీ రెఱుం
గనివరధర్మము ల్గలవె కల్మషదూర భవాదృశు ల్పరాం
గనల వరింతురే దురితకర్మములన్ భజియించు టర్హ మే
వినుతతపోధురంధరులు విప్రకులోత్తము లెంచి చూడఁగన్.

285


చ.

ధరణితలంబునం గలరు దాత లనేకులు వార లెప్పుడున్
గరిహయరాజ్యవస్త్రమణికాంచనము ల్నిజదేహ మైన ని
త్తురు విహితంబుగా మదికిఁ దోఁచి నిజాంగన నిచ్చునట్టియ
న్నరవరు లెందునుం గలరె నవ్యగుణోదయ భూసురోత్తమా.

286


క.

పరభామాసక్తుల కిల
నరయఁగ నిష్కృతులు గలవె యవనీస్థలిలో
సురపతి మును పరవనితా
పరుఁడై యెట్లయ్యెఁ దెలియఁ బలుకు మహాత్మా.

287

సీ.

అని పల్కుచున్నయయ్యవనీశువాక్యంబు
       లాలించి బ్రాహ్మణుం డనియె మరల
బ్రహ్మహత్యయు సురాపానంబు గురువధూ
       పరతయుం గనకాపహరణ మనెడి
యఖిలాఘములకుఁ బ్రాయశ్చిత్త మొనరించుఁ
       బూని మదీయతపోబలంబు
పారదారికవృత్తి పాపం బనఁగ నెంత
       నిమిషమాత్రంబున సమసిపోదె


తే.

కాన మఱుమాట లాడక ఘనత మీఱ
నీసతీమణి నిపు డిమ్ము నిశ్చయముగ
నట్లు గాకున్న శరణార్థులైనవారిఁ
బ్రోవనేరని కలుషంబు పొందు నిన్ను.

288


వ.

అని యివ్విధంబునఁ బరుషాక్షరంబులుగాఁ బలికిన బ్రాహ్మ
ణుని భాషణంబు లాకర్ణించి పాపభయంబునకు వెఱచి
యన్నరేంద్రుఁడు దనమనంబున ధైర్యం బవలంబించి
యి ట్లని వితర్కించె.

289


ఆ.

పాప మెడలిపోవ బ్రాహ్మణోత్తమునకు
మద్వధూటి కీర్తిమాల నొసఁగి
యపయశంబు దొలఁగ నగ్నిఁ బ్రవేశింతు
ననుచు నిశ్చయించె నాక్షణంబ.

290


క.

స్నానాదికవిహితాను
ష్ఠానంబు లొనర్చి మానసమునందు గురు
ధ్యానముఁ జేయుచు బహువిధ
దానము లొనరించె నపుడు దద్దయుఁ బ్రీతిన్.

291

వ.

అంత.

292


శా.

శౌర్యౌదార్యగుణార్ణవుండు వినుతక్ష్మాపాలనాగవళీ
హర్యక్షుం డగువజ్రబాహుతనయుం డారాజచంద్రుండు ని
ర్ధార్యుండై విబుధు ల్నుతింప జలధారాపూర్వ మౌనట్లుగా
భార్యాదాన మొనర్చె నాద్విజునకున్‌ బద్ధానురాగంబునన్.

293


ఆ.

అటుల దాన మిచ్చి యంత వైశ్వానరుఁ
బ్రజ్వలింపఁజేసి పార్థివుండు
దాను వినతుఁ డై ప్రదక్షిణంబు లొనర్చి
యందుఁ జొరఁగఁబోవు నవసరమున.

294

భద్రాయువునకు శ్రీసాంబమూర్తి ప్రత్యక్షంబగుట

సీ.

శ్రీపార్వతీపరిష్కృతశరీరముతోడ
        నవసుధాధవళవర్ణంబుతోడఁ
గుండలీకృతమహాకుండలీంద్రులతోడ
        డమరుత్రిశూలహస్తములతోడ
మందాకినీవినిర్మలకపర్దముతోడ
        రమ్యమౌవ్యాఘ్రచర్మంబుతోడఁ
జంద్రపాండురవృషభేంద్రయానముతోడఁ
       గరవిరాజన్మృగాంకంబుతోడ


తే.

నారదాదులు సామగానములు చదువఁ
బ్రమథగణములు సేవింప భద్రయశుఁడు
సకలసురచక్రవర్తి శ్రీసాంబమూర్తి
సౌమతేయున కపుడు సాక్షాత్కరించె.

295


వ.

అయ్యవసరంబున.

296


చ.

కురిసిరి పుష్పవృష్టి సురకోటులు మింట ననేక భేరికా

మురజమృదంగవాద్యములు మ్రోసె వియచ్చరవారకామినీ
సురుచిరలాస్యము ల్చెలఁగె సూర్యసహస్రదగద్ధగప్రభ
ల్పరగె దిగంతరంబులఁ గృపాళుఁడు శంభుఁడుఁ దోఁచినంతటన్.

297


క.

కద్రూభవభూషణుఁడు జ
గద్రూపకుఁ డైనహరుఁడు గరకంఠుఁడు ని
ర్నిద్రానలాభిముఖుఁ డగు
భద్రాయువుఁ బాణితలముఁ బట్టి మరల్చెన్.

298


వ.

అయ్యవసరంబున నింద్రాదిలోకపాలకులును నారదాది
దేవర్షులును సనకసనందనాదిపురాణయోగీంద్రులును గపి
లాదిసిద్ధులును చిత్రరథాదిగంధర్వులును బ్రహ్మాదిదేవతలును
మాణిభద్రాదియక్షులును రంభాద్యప్సరోగణంబులును
భృంగీశ్వరచండికేశ్వరనందికేశ్వరాదిప్రమథగణంబులును
విఘ్నేశ్వరకుమారవీరభద్రాదిపుత్త్రవర్గమునుం జనుదెంచిన
యంతటం దత్సభామధ్యంబునం గూర్చున్నజగదీశ్వరుండైన
యంబికారమణునకు నత్యంతహర్షాశ్రుమిళితనేత్రుండును
బులకీకృతగాత్రుండు నై యన్నరనాథుండు ధరణీతలంబున
సాష్టాంగదండప్రణామంబు లాచరించి పాణిపంకజంబులు
ముకుళించి వేదవేదాంతాభిప్రాయకథనంబులుగా ని ట్లని
స్తుతియించె.

299


దండకము.

శ్రీశైలకన్యామనఃపద్మసంచారహంసా సురోత్తంస
దక్షాధ్వరధ్వంస గంగాతరంగాంబురంగజ్జటాభార హాలా
హలాహార కర్పూరగౌరా స్పటీద్ధారనీహారవాణీశరచ్చంద్ర
చంద్రాతపస్వచ్ఛసత్కీర్తివిస్తార సద్భక్తమందార శర్వా మహా
దేవ మృత్యుంజయా నీలకంఠా విరూపాక్ష కోట్యర్క

సంకాశతేజా బిడౌజప్రధానామరస్తూయమానాంఘ్రిపంకేజ
గోరాడ్ధ్వజా వామదేవా శివా శంకరా కామసంహార
కాలాంతకా వ్యాఘ్రచర్మాంబరా భూతిలిప్తాంగరుద్రాక్ష
మాలాధరా శక్తిశూలాసిఖట్వాంగహస్తా సమస్తారి విధ్వస్త
లోకప్రశస్తా వియత్కేసభూతేశ విశ్వేశ్వరా శాశ్వతైశ్వర్య
సంధాయకా దేవదేవా జగద్రక్ష యుష్మత్ప్రాభావంబు
వర్ణింప బ్రహ్మాదులు న్నేర రే నెంతవాఁడ న్నినుం గొల్వ
నోచంద్రకోటీరదేవా జగజ్జాలనిర్మాణసంరక్షణారంభకేళి
న్విజృంభించి వర్తింతు వెల్లప్పుడున్ మాలతీమాధవీమల్లికా
కుందమందారసౌగంధికాంభోజపున్నాగసేవంతికాద్రోణ
పుష్పంబు లర్పించి భక్తిన్ భవత్పూజ గావించి సేవించు
మర్త్యాళికిన్ మందిరద్వారభూమిన్ హయాందోళికావారణ
స్యందనంబుల్ జగన్మోహనాకారలై చంద్రబింబాస్యలై
యున్న కాంతామణు ల్సంతతాఖండలాఖండసామ్రాజ్యముల్
చెందు నంత్యంబున న్ముక్తి సిద్ధించు ధాత్రీజలవ్యోమవాతా
గ్నులున్ సోమసూర్యాది భాస్వద్గ్రహానీకముల్ దారలున్
జంగమస్థావరాత్మప్రపంచంబును న్నీవయై యుందు వోభక్త
మందార పూర్వంబునన్ ధారుణీస్యందనంబున్ జతుర్వేద
ఘోటంబులున్ బద్మజక్షత్తయు న్మేరుకోదండము న్విష్టుకాం
డంబు శోభిల్లగాఁ ద్రైపురావాసదైతేయులం ద్రుంచి సంవర్త
కాలానలాభీల మైనట్టిహాలాహలజ్వాలలన్ మ్రింగి శార్దూలదై
త్యు న్విదారించి లోకంబులం బ్రోచి రక్షించుదేవుండ వీ వెన్నఁ
గా దీనచింతామణీ దైవచూడామణీ వేదవేదాంతవేద్యా

భవవ్యాధివైద్యా శుకవ్యాసకౌండిన్యమాండవ్యశాండిల్య
మైత్రేయకణ్వాదియోగీంద్రు లెల్లప్పుడున్ మిమ్ము హృత్పద్మ
మధ్యంబుల న్నిల్పి యష్టాంగయోగంబులన్ ధ్యానము
ల్చేసి దర్శింపఁగా నొప్పుచున్నట్టి శ్రీదక్షిణామూర్తి శ్రీసచ్చి
దానందమూర్తీ కృపాస్ఫూర్తి నే నెంతవాఁడ న్మిమున్ సన్ను
తుల్ చేయ విజ్ఞానహీనుండ నన్నుం గటాక్షించి నాతప్పు
లున్ సైఁచి మన్నించు మాపన్నరక్షా విచక్షా జగత్త్రాణ
దీక్షా లలాటాక్ష కైలాసవాసా మహోల్లాస తాపత్రయ
ధ్వాంతమిత్రా నతోద్యానచైత్రా జితామిత్ర బ్రహ్మ
స్వరూపా త్రిలోకప్రదీపా నమస్తే నమస్తే నమః.

300


ఉ.

నీనుతి చేయ నాతరమె నిర్మలబుద్ధిహీనుఁడ న్మహా
జ్ఞానుఁడఁ బ్రాకృతుండ నపచారపరుండను దేవ నీవ వా
ఙ్మానసగోచరుండ వసమానుఁడ వాద్యుఁడ వద్వయుండ వా
త్మానుగుణైకరూపుఁడ వనాది వతీంద్రియమూర్తి వెన్నఁగన్.

301


ఆ.

నిర్గుణుండ వీవు నిష్కారణుండవు
నిర్వికల్పమతివి నిర్మలుఁడవు
నిగమగోచరుఁడవు నిస్సంశయుండవు
నిన్నుఁ దెలియఁ దరమె నిటలనేత్ర.

302


వ.

దేవా నీవు ప్రధానపురుషుండవు సచ్చిదానందవిగ్రహుం
డవు స్వయంప్రకాశుండవు జగత్కారణుండవు జగదంత
రాత్మవు ఆదిమధ్యాంతరహితుండవు సత్యజ్ఞానమయుండవు
సర్వజ్ఞుండవు విశ్వస్వరూపకుండవు విధ్వస్తమోహుండవు
క్షేత్రజ్ఞుండవు సర్వసాక్షివి నిర్వికల్పుండవు నిరంజనుండవు

సదాశివుండవు నైన మి మ్మెఱింగి వర్ణింప నతిమూఢహృద
యుండ నగునాకు శక్యం బగునే యట్లుగావున నాకుం
దోఁచిన చందంబునం బ్రార్థించి ప్రణామంబు లాచరించెద
విపన్నుండ నైన నన్ను రక్షింపుమని మఱియు ని ట్లనియె.

303


క.

శాశ్వతరూప పరాత్పర
విశ్వేశ్వర నీలకంఠ విషమేక్షణ వా
గీశ్వరనుతపదయుగళా
పశ్వధిపతి దేవ నీకుఁ బ్రణతి యొనర్తున్.

304


క.

అని నుతియించినరాజుం
గనుఁగొని శంభుండు పలికెఁ గారుణ్యమునం
జనవల్లభ నీసన్నుతి
కిని మెచ్చితి నీవు పుణ్యకీర్తివి ధరణిన్.

305


చ.

తలపఁగ నేను భూసురుఁడఁ దత్సతి పార్వతి వట్టిమాయ బె
బ్బులి భవదీయమానసము పొందిక నేర్పడఁ జూడ నీదుతొ
య్యలి నటు వేఁడితిన్ సవినయత్వము ధైర్యము చిత్రమయ్యె నీ
వలచినకోర్కు లిత్తు ననివార్యబలోజ్జ్వల వేఁడు మిచ్చెదన్.

306


క.

అని యానతిచ్చిన శివుం
గని భూవరుఁ డిట్టులనియె గౌరీశ్వర మ
ద్వనిత యగుకీర్తిమాలిని
కిని నాకును ముక్తి యొసఁగుఁ గృపతో ననినన్.

307


మ.

సదయుం డై పరమేశ్వరుం డనియె రాజ్యశ్రీసముల్లాసి వై
పదివేలేండ్లు ధరిత్రి నుండుము భవద్భార్యాసమేతుండ వై
తుద సాయుజ్యము నిత్తు మీ కనుచు రుద్రుం డన్న హర్షంబున
న్మది నుప్పొంగుచు భూవిభుం డనియె శుంభద్భక్తిపూర్వంబుగన్.

308

క.

వర మడిగెను భద్రాయువు
సరసత మజ్జనకునకును జననికిఁ బద్మా
కరునకుఁ దత్పత్నికిఁ ద
ద్వరసుతునకు ముక్తి యొసఁగవలయు నటంచున్.

309


తే.

కీర్తిమాలిని శ్రీసాంబమూర్తిఁ జూచి
యనియె మాతండ్రి యైనచంద్రాంగదునకు
మఱియు మాతల్లి యైనసీమంతినికిని
నలఘుకైవల్య మొసఁగు మోయభవ యనుచు.

310


వ.

ఇట్లు వేడిన.

311


శా.

అంతన్ శంకరుఁ డావధూవరులవాక్యంబు ల్సమర్థించి య
త్యంతప్రేమఁ దదీయవాంఛితము లుత్సాహంబుతో నిచ్చి సు
స్వాంతం బొప్పఁగ నాక్షణంబున సమస్తాదిత్యవర్గంబుతో
నంతర్ధానముఁ జెందె శీతగిరిజాతాన్వీతుఁడై క్రమ్మఱన్.

312


క.

భద్రాయు వంతటను శ్రీ
రుద్రునిచే వరము లంది రుచిరాననుఁడై
భద్రగతిఁ బురముఁ జేరెను
భద్రేభతురంగముఖ్యబలములు గొలువన్.

313


వ.

ఇ ట్లమ్మహీనాథుండు బ్రహ్మేంద్రాదిదేవతలకుం బడయరాని
సాంబశివప్రసాదంబు వడసి పదివేలసంవత్సరంబులు నిష్కంట
కంబుగా నిజరాజ్యం బేలుచుఁ దురంగమేధాదిమహాక్రతువు
లాచరింపుచుఁ బరమేశ్వరసమారాధన లొనర్చుచు నిజభార్య
యగుకీర్తిమాలినియుం దాను నభీష్టభోగంబు లనుభవింపుచు
వంశకరు లైనపుత్త్రులం బడసి పరమాహ్లాదంబున సుఖంబున
నుండి రంత.

314

సీ.

సమయోచితముగఁ బర్జన్యుండు వర్షించె
        ఫలియించె ముక్కారు పంటపొలఁతి
వర్ణాశ్రమాచారవర్తన ల్దప్పక
        చరియింపుచుండిరి సకలజనులు
ఫలపుష్పకోరకపల్లవాన్వితములై
        యలరుచు నుండె నుద్యానతరువు
లభివృద్ధిగా నుండె నాలమందలఁ బాలు
        ప్రజలు సౌభాగ్యసంపన్ను లైరి


తే.

యీతిబాధలు మానె ధాత్రీతలమున
దేవగృహములు మిక్కిలి తేజరిల్లె
ధర్మపద్ధతి వెలయ భద్రాయు వెలమి
నవని పాలింపుచున్నట్టియవసరమున.

315


వ.

ఇవ్విధమున బహువర్షంబులు ప్రజాపరిపాలనం బొనరించి
యనంతరమున నిజనందనునకుం బట్టము గట్టి సకలమహీ
రాజ్యభారధురంధరుం గావించి కీర్తిమాలిని సమేతంబుగా
వానప్రస్థాశ్రమవిధానంబునకుఁ జని పరమేశ్వరు నుద్దేశించి
మహాఘోరతపం బాచరించి దేహంబులు విసర్జించి దివ్య
విమానారూఢులై సిద్ధగంధర్వవిద్యాధరాదులు జయజయ
శబ్దంబులం బ్రశంసింప శివలోకమునకుం జని సాయుజ్యము
నొందిరని చెప్పి సూతుం డమ్మహామునీంద్రుల కి ట్లనియె.

316


శా.

సౌఖ్యారోగ్యజయప్రదం బఘవినాశం బైనభద్రాయుషో
పాఖ్యానంబుఁ బఠించుమానవులు సౌభాగ్యంబు మీఱన్ జగ
త్ప్రఖ్యాతంబుగఁ బుత్త్రపౌత్త్రధనదీర్ఘాయుర్యశోవంతులై
ముఖ్యం బైనపదంబుఁ జెందెదరు సమ్మోదానుభావంబునన్.

317

వ.

అని చెప్పి.

318

ఆశ్వాసాంతము

క.

లంబోదరగుహజనక చి
దంబరమయ నీలకంఠ హరిణాంకధరా
యంబుజనాభకదంబశు
భాంబాపురవాస దురితహరణోల్లాసా.

319


భుజంగప్రయాతము.

ప్రియాభూషితార్ధాంగ భీమప్రతాపా
జయశ్రీసమాయుక్త సత్యస్వరూపా
వియద్వాహినీసక్తవేణీకలాపా
దయార్ద్రీకృపాపాంగ త్రైలోక్యదీపా.

320


పృథ్వీ.

గిరీంద్రవరనందనీకృతవినోదజాతోత్సుకా
విరించిముఖదేవతావినుతపాదపంకేరుహా
చరాచరజగత్పతే శమనగర్వనిర్వాపణా
పరాత్పర మహేశ్వరా ప్రమథనాథ గంగాధరా.

321


గద్యము.

ఇది శ్రీరామభద్రకరుణాకటాక్షవీక్షణసమాలబ్ధ
గీర్వాణాంధ్రభాషాకవిత్వ కళాధురంధర బడగలనాటి
కన్నడవంశపయఃపారావారరాకాసుధాకర ఆశ్వలాయన
సూత్ర భారద్వాజసగోత్ర శ్రీధరమల్లె అయ్యనార్యతనయ
సూరిజనవిధేయ వేంకటరామనామధేయ ప్రణీతం బైన
బ్రహ్మోత్తరఖండం బనుమహాపురాణమునందు మందరో
పాఖ్యానమును వజ్రబాహుచరిత్రమును భద్రాయువు

నుత్పత్తియు వజ్రబాహుండు నిజపుత్త్రకళత్రంబుల దేశము
వెడలనడుచుటయు మహారణ్యగమనమును వైశ్యనగర
ప్రవేశమును నందు విషవ్రణబాధితుండై విగతజీవుం డైన
బాలకుని ఋషభుం డనుశివయోగీంద్రుండు వచ్చి క్రమ్మఱ
సంజీవితుం జేయుటయుఁ బునరాగతుండై ఋషభుండు
సన్మార్గం బుపదేశించి శైవవర్మంబు మొదలుగా ద్వాదశనాగ
సహస్రబలంబును దివ్యంబులైన ఖడ్గశంఖంబు లొసంగుటయు
మాగధులతోడి యుద్ధంబును బరాజితుం డయిన నిజజనకు
బంధమోక్షణుం గావించి హైమరథు మరల బద్ధునిం జేయు
టయు భద్రాయువివాహంబును మగధపతి బంధవిమోచనం
బును దద్రాజ్యాభిషేకమును వనవిహారమును గృత్రిమ
దంపతీకథనమును బరమేశ్వరుండు ప్రసన్నుండగుటయు నను
కథలంగల చతుర్థాశ్వాసము.