బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/ఎనిమిదవ ప్రకరణము

ఎనిమిదవ ప్రకరణము

బెంజమిను - మెరిడిత్తు:- ముద్రకులు


జాగరూకతతో వీరు పని నారంభించిరి. సంవత్సరమున కిరువదినాలుగుకాసు లద్దె కొప్పందముచేసికొని, బసను మాటలాడిరి. కొంతభాగమును తమ స్వంతమున కుంచుకొని, శేషించినదాని నితరుల కద్దెకిచ్చివేసిరి, అక్షరకూర్పులనువిప్పి, యంత్రమును స్థాపించి, కావలసిన వస్తువులనుగొని, పనినారంభము చేయుసరికి, దగ్గిఱనున్న రొక్కము వ్యయమయి పోయినందున, చేతిలో నొక కాసులేకయే, వీరు పనినిసాగించిరి.

దినచర్యకు దగినసొమ్ము, వీరికీపనిలో వచ్చుట లేదు. అప్పుడప్పుడు 'జంటో' సమాజమువారును, వారు శిఫారసుచేయుటచే వచ్చినవారు మాత్రము వీరికి బని నిచ్చుచుండిరి. ఇంతమాత్రమున, పని నడచునా ! అయినను, సమాజమువారి ప్రాపకము కలదు. అందుచే, వారు దీనిని నిలబెట్టుటకు తగిన ప్రయత్నములు, వ్రాత, మాటల మూలమున జేయుచుండిరి. బెంజమినుయొక్క శ్రద్ధాభక్తులను, పని నేర్పును, బుద్ధికుశలతను, సవిస్తరముగ వీరు పొగడుచు వచ్చిరి. చేయవలసినపనిని జాగ రూకతతో రాత్రింబగళ్లు కష్టపడి, పేరు నిల బెట్టుటకు బెంజమిను ప్రయత్నించుచుండెను.

ఇతను మొదటినుండి, వార్తాపత్రికను ముద్రించి ప్రచురము చేయవలె ననికోరుచుండెను. చేయబూనినపని నాచరణలోనికి తెచ్చువఱకు దానిని గోప్యముగ నుంచు స్వభావముకల వాడైనను, పొరబాటున నొకనితో నీ సంగతిని చెప్పినందున, నతడు దానిని కీమరు చెవినివేసెను. ఏపనియు లేనందున, నతడు వార్తాపత్రికను ముద్రించుటకు సన్నద్ధు డయ్యెను. 'సర్వ శాస్త్ర - కార్యబోధిని' యనుపేరుతో నొక పత్రిక నతడు ప్రచురము చేసెను. దీని నందఱు శ్లాఘించిరి.

దీనినిచూచి రోషాయత్తచిత్తుడై, బెంజమిను వ్యాకులము పొందెను. ధైర్యము తెచ్చుకొని, జంటోసమాజము వారి సహాయమున, నిత డొక పత్రికను ప్రచురించుట కారంభించెను. 'అధికప్రసంగి' యను పేరుతో నీపత్రిక వెడలెను. ఇది యన్నిటిని పరిహసించి, యెగతాళిచేయుచుండెను. "మేము సత్యమును చెప్పుటచే, మీకందఱికి కష్టముగ నుండును. మీ తప్పులను దెలిసికొనుటకు కదా, మీరు సంవత్సరమున కెనిమిది రూప్యములను మా కిచ్చుచున్నారు. అవును ఇప్పుడు మీతప్పులను జూచి నవ్వువారి సమయముకూడ వచ్చునుగాన, మీరిప్పుడు వారినిజూచి నవ్వవచ్చును" అని 'అధిక ప్రసం గిలో' వ్రాయబడెను. ఇందులో కీమరును యెత్తిపొడిచి బెంజమిను వ్రాయుటయు - 'బోధిని' లో నితనిని యెత్తి పొడిచి కీమరు వ్రాయుటయు, జరిగెను.

ఋణగ్రస్తు డైనందున, కీమరు పత్రికను సాగించలేక పోయెను. తుదకు దానిని బెంజమిను కతడమ్మివేసెను. పూర్వపు పేరు తీసివేసి, 'పెన్సిలు వానియాగెజెటు' అను పేరుతో 'బోధిని'ని బెంజమిను ప్రచురించెను. ఇదివఱలో దన చిన్నతనములో, దనయన్న గారికి 'కోరాంటు' పత్రికను ప్రచురించినందుకు జరిగిన పరాభవమును జ్ఞప్తికి దెచ్చుకొని, బెంజమి నీ పత్రికను జాగరూకతతోను వివేకముతోను బ్రచురము జేసెను. సత్యమును రూడిగవ్రాయుచు, యప్రియమైన సత్యమును మృదువుగ జెప్పుచు, ఇతరుల మనస్సును నొప్పింపక, యందఱికి మేలుకలుగునట్లు, బెంజమి నీ పత్రికను నడిపించుచుండెను.

ఇప్పటికిని, వీరి ముద్రక వ్యాపారము బహుళముగ నుండ లేదు. వీరు బీదవారుగ నుండిరి. సహాయముచేయుట కొకడైనను లేడయ్యెను. ఇంచుమించుగ పనినంతయు బెంజమిను చేయుచుండెను. మెరిడిత్తు పని తెలియనివాడు, త్రాగుబోతు. ఎల్లప్పుడు, వాడు మై మఱచియుండును.

ఋణమును చేయ నేకూడదు. చేసిన వెంటనే దానిని తీరుమానము చేయవలెను. లేనియెడల, నొకానొకప్పుడు, మన కసాధ్యముగ నున్న కాలములో నది తీరుమానముకు తటస్థమగును. అన్ని వాయిద్యములు వాయించి, నాలుగు వైపుల నుండి ధనమువచ్చు నేమోయని చూచుచు, మునుగుచున్న వ్యాపారమును లేవనెత్తుటకు సమర్ధుడుగనున్న బెంజమినుకు ఋణము సంగతిని జ్ఞాపకము తెచ్చుటకు, వెర్నను మృదువుగ నొక లేఖను వ్రాసిపంపెను. తన తప్పు నొప్పుకొని, కొంచెము కాలము గడువుచేయ మని బెంజమిను ప్రత్యుత్తర మతనికి వ్రాసెను. అటుల గడువుచూపినందున, నేడు సంవత్సరముల నుండి బాధించుచున్న ఋణము నసలువృద్ధులతో దీర్చుటకు కొద్దికాలములో నితని కవకాశము జిక్కెను.

ఇదివఱకు, సర్కారుకు కావలసిన కాగితములను 'బ్రాడుపర్డు' ముద్రించుచుండెను. ఇతడు కొన్ని లోపములు చేసినందున, వీని మానిపించి, వా రాపనిని బెంజమినును చూడమనిరి. ఇందు మూలమున, 'బెంజమిను మెరిడిత్తు' ల కంతగ లాభము లేకపోయినను, కొంతవఱకు వీరికి పేరువచ్చి, వీరు నిలబడుట కవకాశమయ్యెను.

రెండు సంవత్సరములనుండి కష్టపడుచున్నను, జీవనాధార మస్థిరమై, బెంజమినుకు పని నిలకడతో నుండగల దనునమ్మకము లేక పోయెను. వెచ్చము పెట్టిన 200 కాసులలోను సగము సొమ్మును 'తండ్రిమెరిడిత్తు' జాగ్రత్తచేయకలిగెను. ఇంగ్లాండునుండి వస్తుసామగ్రినంతయు పరపతికి తెచ్చినందున, పరపతినిచ్చినవాడు వీరుచేసిన విలంబమునకు భయపడి, న్యాయసభలో వీరి సామానులమీద తీరుమానమును బొందెను. జామీనుపైని వీరిరువురిని వదిలిరి. ఇట్టి స్థితిలో, నాప్రియస్నేహితు లిరువురు వెవ్వేరుగ నాయొద్దకువచ్చి, నేను కోరినసొమ్ము నిచ్చెదమని నాతో జెప్పిరి. మెరిడిత్తుతో వంతును బోగొట్టుకొని, స్వతంత్రముగ నన్నుండ మనిరి. వారుచేసిన మేలు నాకు మరపునకు రాదు" అని కృతజ్ఞతాపూర్వకముగ బెంజమిను వ్రాసెను.

ఈ స్నేహితులు, "విల్లియంకొల్మాను", "రాబర్టుగ్రేసు" అనువారు. వీరు "జంటో" సమాజములోనివారు. జీవితకాలమంతయు వీరు బెంజమిను కాప్తులుగనుండిరి. తండ్రి, కుమార మెరిడిత్తులవలన మేలుపొంది నందున, వారిని విడుచుటకు కష్టమనియు, పత్రముప్రకారము వారు నడుచుకొనిన పక్షమున, వంతువారితో వదులుకొనుటకు తన కిష్టములేదని స్నేహితులతో నితడు జెప్పెను. అంతలో, వంతుదారుడైన కుమార మెరిడిత్తును కలిసి, "నీవుచేసిన వ్యవహారము నీతండ్రి కిష్టములేనట్టు కనబడుచున్నది. ఇచ్చెద ననిన సొమ్ము నతడు నీ కిచ్చునేమోగాని, మనకిచ్చునటుల నాకు దోచదు. ఏమాటయు, నీవునాతో రూడిగ జెప్పిన, సర్వము నీకువదిలి, నాపనిని జూచు కొనెదను" అని బెంజమిను చెప్పెను.అప్పుడు, "నాతండ్రిమోసపోయెను. అతని యొద్ద సొమ్ములేదు. మరి నే నతనిని తొందరచేయ లేను. ఈ పని నాకు తగినదికాదు. నేను మొదట వ్యవసాయదారుడను. పట్టణమువచ్చి ముప్పదియేండ్లు వచ్చినపైని, క్రొత్తవ్యాపారములో దిగుట నాబుద్ది తక్కువ ......... నేను తిరుగ దున్ను కొనుటకు బోయెదను. నీ స్నేహితులు నీకు సహాయముచేసిన, వారిని జూచుకొనుము. మనము మునిగిచేసిన ఋణములను తీర్చుటకు శక్తి నీ కున్నయెడల, నాతండ్రిమరుఫ నిమిత్తమిచ్చి, నూరుకాసుల నిచ్చివేయుము, నేను స్వయముగ చేసిన ఋణములను తీర్చివేయుము, నాకు ముప్పదికాసుల నిచ్చిన, నావంతును నీకు విడిచిపెట్టుదును. నీవే సర్వస్వమును బొందవచ్చును" అని కుమార మెరిడిత్తు చెప్పెను.

వెంటనే, దీనికి బెంజమిను సమ్మతించి, నూరు కాసులు చొప్పున ప్రతిస్నేహితునియొద్ద బదులుచేసి, మెరిడిత్తుల కిచ్చివేసి, స్వంతముగ వ్యాపారమును పెట్టెను. నేడు మొదలు విశేషముగ నొడుదుడుకులులేక స్థిరముగ నితని వ్యాపారము నడచుచుండెను. నానాఁటికి పరపతి కలిగెను. యుక్తాహారవిహార చేష్ఠావసిష్ఠుడై, బెంజమిను తన వ్యవహారముతో మెలగుచుండెను.