బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/తొమ్మిదవ ప్రకరణము

తొమ్మిదవ ప్రకరణము

వివాహము


వ్యవహారమును సాగించుటకు మార్గము తిన్నగనుండుట చేత, స్వస్థ చిత్తుడై, బెంజమిను వివాహోన్ముఖు డయ్యెను. "గృహిణిగాడ్ఫ్రి" యొద్ద నితడు బసచేయుచున్నందున, నామె, బందుగులయొద్దనున్న 'కన్యకగాడ్ఫ్రి" కితను తగిన వరుడని, యోచించెను.

"ఈమె మమ్ములను సమావేశముచేయుచుండెను. ఇంటివారు నన్ను భోజనమునకు బిలుచుచుండిరి. భోజనానంతరమున, మే మిరువురము మాటలాడుట కవకాశ మిచ్చుటకు, వారు సన్న సన్నగ లేచిపోవుచువచ్చిరి. తుదకు, వారితో నా యుద్దేశమును చెప్పగోరి, గృహిణిగాడ్ఫ్రీద్వారా నామాటను బంపితిని. నా ముద్రాక్షరశాలకు నేను చేసిన ఋణములో, శేషించిన నూరుకాసులను వారిని తీర్చివేయమని, వారికి మాటను బంపితిని. వారు సొమ్ము నియ్య లేమని చెప్పినందున, వారి గృహమును, తాకట్టుపెట్టి సొమ్ము నియ్యవలసినదని నేనుగోరితిని. దీనికి వారు సమ్మతించ లేదు. కొద్దిరోజులకు, బ్రాడుఫర్డు - కీమరులవలె, నేనుకూడ నచ్చుపనిలో దిగువాఱుదు నని యెంచి, కన్యకగాడ్ఫ్రీతో నన్ను మాటలాడనీయనందున, నామె నా కగుపడలేదు. నేనుగూడ వెళ్లుట మానివేసితిని. ఈ విధమున నాకామెయం దనురాగమున్నది లేనిది వారు తెలిసికొన గోరి రేమోగాని, నేనుమాత్రము కోపముచేత వెళ్ల లేదు. అందుచేత, వారు కలవరపడి, రమ్మనుమని నాకు వర్తమానము బంపినను, నేను వెళ్లలేదు. ఇల్లంతయు నాకువదిలీ, వారు లేచి పోయిరి. నేను మరియెవరిని బసలో దింపలే" దని బెంజమిను వ్రాసెను.

కన్యకరీడు, యీలోపున నొంటరిగనుండి కుందుచుండెను. వాస్తవముగ, కుమ్మరిరోజర్సు చనిపోయెను. అప్పుడప్పుడు, బెంజమిను గృహిణిరీడును జూచుటకు వెళ్లుచుండెను. ఆమెకు సలహా నిచ్చుటకలదు. కన్యక యొక్క దురవస్థకితడు వగచు చుండెను. అందుచేత, మనస్సును కుదురుచేసికొని, యే కష్టములు వచ్చినను భరించుటకు నిశ్చయించి, 1730 సంవత్సరము సెప్టెంబరు నెలలో బెంజమిను కన్యకరీడును వివాహమాడెను.

గృహిణి బెంజమి నన్ని విధముల ధర్మచారిణియై యుండెను. భర్తకు పనిపాటలలో సహకారియై, గృహకృత్యములను నేర్పుగ నిర్వర్తించుచు, నామె దయాపూర్ణురా లనిపించుకొనెను. "స్వయముగ కుట్టిన, లినెను, రోమపు దుస్తులను, నేను ధరించుట కామె యిచ్చును. ఈ సంగతి జ్ఞాపకము వచ్చిన పుడు, నామనస్సు కరగును. ఎల్లప్పు డామె సంతోషముగ నుండును. ఇతరుల లోపాలోపములను సవరణచేయు స్వభావము కలది. స్వల్పవిషయములనుకూడ పట్టుదలతో జూచుచుండును. స్వల్పవిషయములలోనే మనుజులు సంతుష్టి చెందవలెను. 18 వ శతాబ్దమున జీవించుటచేత నామె చదువరి కాదు. ఉత్తరముల నామె తెలివితేటలతో వ్రాసినను, వాని వర్ణక్రమము సరియైనదికా"దని పరదేశములో నుండినపుడు బెంజమిను వ్రాసెను. ఆమె చక్కనిది, ఆమె ముఖారవిందము వికసించియుండును. ఆమె పిల్లలు, మనుమలు చక్కనివారని నూతనసీమలలో బ్రసిద్ధి కెక్కిరి.

అతడు స్త్రీలోలుడుకాకపోయినను, భార్యను మృదువుగను, దయతోను, యుక్తముగను జూచుచుండెను. ఇట్టి భర్తను బొందినందు కామె గర్వించెను. ఇరువు రన్యోన్యానురాగము కలవారలు."మే మొకరి నొకరు సంతోషింప జేయవలయునని కోరుచుంటిమి" అని బెంజమిను వ్రాసెను. "మాయొద్ద, పనికి మించిన సేవకులు లేరు. మేము సంసారపక్షముగ నుంటిమి. లేనిపోని భేషజములు మాకు లేవు. సుమారు పదు నెనిమిది రూప్యముల కొక వెండిగరిటెను నాభార్యనాకు తెలియకుండకొనెను. నేడు మొదలు వెండిసామాను, పింగాణివస్తువులు మాయింటిలో కనబడుచుండెను. మేము ధనవంతుల మైనకొలది, నీ సామానులు హెచ్చుచుండె" నని కూడ బెంజమిను వ్రాసెను. వివాహమైన కొన్నిరోజుల కీ ముచ్చట జరిగెను. ఇతని వ్యవహారమైనను బాగుగాలేదు, నిండులేదు, వెల్తి లేదు. పనులన్నియు స్వయముగ నతనిచేత జేయబడుచుండెను. ఈ సమయములో, సర్వజనోప యోగ్యమైన పుస్తక భాండాగారమును స్థాపించుటకు దగిన బ్రయత్నముల నితడు జేసెను.

"జంటో" సమాజము స్థాపించినపుడు, స్వంతమందిరమేదియు దానికి లేదు. సమాజములోనివాడు 'రాబర్టుగ్రేసు' కరుణతో నొక గది నిచ్చినందున, దానిలో సమాజమువారు కూడుచుండిరి. వివాదాంశములను విశదీకరించుటకు సభ్యులు కొన్ని పుస్తకములను సభకు తీసికొనివచ్చి, పని ముగిసినపైని, వానిని తమ గృహములకు దీసికొనిపోవుచుండిరి. మందిరములో నొక గదిలో ప్రతిసభ్యుడు తన పుస్తకముల నుంచుటవలన, వానిని జదువుట కందఱికిని వీలగు నని బెంజమిను ముచ్చటించెను. వల్లెయని యందఱంగీకరించిరి. మందిరములో బుస్తకము లుంచబడెను. వానిని వాడుకొను నేర్పు సమానముగ నందఱు కలవారుకారు గనుక, కొన్ని పుస్తకములు మాసిపోయినవి. అందుచేత, వీని యజమానులు విసిగికొని, తమపుస్తకములను స్వగృహములకు దీసికొనిపోయిరి. అటులందఱు చేసిరి. పుస్తకములను గొనుటకు శక్తిలేని సంసారు లిదివఱకు వీనిని చదువుట వలన లాభమును బొంది, ప్రస్తుత మవిలేనందున నిండు వ్యసనమును బొందిరి.

చందాతీసి, పుస్తక భాండాగారము నొకటి లేవనెత్తవలెనని బెంజమిను యోచించెను. ప్రతిచందాదారుడు ప్రధమమున సంచికలను గొనుటకు రెండు కాసుల నిచ్చి, ప్రతి సంవత్సరము సుమారెనిమిది రూప్యముల నిచ్చుకొనవలసిన దని, బెంజమి నేర్పాటుచేసెను. అక్కడ ధనము నిచ్చువారు లేరు. చదువుకొనువారు లేరు. దానియం దాసక్తియున్న వారులేరు. అందుచేత, చందాతీయుట కష్టమయ్యెను. నలుగురినిచూచి, వారితో దాను స్వయముగ చెప్పి, వారి చేత నితరులకు చెప్పించి, యితడు కష్టపడెను. అనుకొనిన 5 నెలలకు, 1731 సంవత్సరము నవంబరు వచ్చుసరికి, 50 చందాదారులు గూడిరి. 1732 సంవత్సరము మార్చి నెలవచ్చుసరికి, చందాసొమ్ము వసూలుకాబడెను. ఇంగ్లాండునుండి పుస్తకములను దెప్పించుట కితడు వ్రాసెను. 'కాలిన్సు' పుస్తక భాండాగారపు కార్యాధ్యక్షుడుగ, ముప్పదిసంవత్సరము లుండెను. స్నేహితులు కృపతో గొన్ని పుస్తకములను బహుమతి చేసిరి. అవి వచ్చినతరువాత, ప్రతిదానిని ప్రతి చందాదారుడు చదివి ముఖ్యాంశముల నెత్తి, వ్రాయవలసిన దని యొక పద్ధతి నందఱి సమ్మతముపైని బెంజమిను వ్రాసెను. అక్టోబరు నెలలో బుస్తకములు వచ్చెను. సమాజము వారొకనిని భాండాగారపు కార్యదర్శిగ నియమించిరి. వారములో నొకరోజున ప్రతివాడు పుస్తకములను తెచ్చుకొనుచుండెను. రెండవ సంవత్సరములో బెంజమిను కార్యదర్శిగ నుండెను. దీని ననుసరించి దేశమం దంతటను మఱికొన్ని భాండాగారములు లేచెను. 1785 సంవత్సరములో 5487, 1807 సంవత్సరములో 14,457, 1861 సంవత్సరములో 70,000, పుస్తకము లుండెను. నూటపాతిక సంవత్సరములవఱ కవిచ్ఛిన్నముగ నిదిశ్రేయస్సు నిచ్చుచుండెను. ఇదిముందుకూడ నిటులనే యుండునని తోచుచున్నది. మంచికట్టు దిట్టము లేర్పఱచి, వ్యవహారమును బాగుగ జరిపించి, బెంజమిను, వీని స్నేహితులు, దీనిని శ్రద్ధతో జూచినందున, నింత యభివృద్ధిలోని కీ భాండాగారము వచ్చెను. "తామస్సు పెన్ను" అను నతడు ఫిలడల్‌ఫియాకు వచ్చినపుడు, వాని దర్శనమునకు వెళ్లి, కార్యవాహకు లొక విన్నపమును జదివిరి. అతడు సంతసించి, బహుమానముగ గొన్నిపుస్తకముల నిచ్చెను. "గ్రంధపఠన, నాగరీకమైనపని యని, యెన్నబడెను. పఠనమునుండి వీరిని విడదీయుటకు తగిన వినోదము లా కాలమున లేనందున, వీరు గ్రంథావలోకనము చేయుచు కాలము వ్యయముచేసిరి. ఆ కాలమం దన్య దేశీయులకంటె, బాగుగ గ్రంధములను జదువువారువీరే" యని బెంజమిను వ్రాసెను. చదువరియై, కీర్తిప్రతిష్ఠలను బొందిన బెంజమిను వ్యవహారస్థుడుగ నెటులవన్నె కెక్కెనో మనమికను చూడవలయును. 1728 సంవత్సరము మొదలు 1748 సంవత్సరము వఱకు మంచి వ్యవహారస్థుడని బెంజమిను పేరొందెను. ముద్రకుడు, గ్రంధసవరణీకుడు, కూర్పువాడు, ప్రకటించువాడుగ, నితడుండెను. సిరా, చీటిగుడ్డలు, సబ్బు, బాతు రెక్కలు, మొదలగువాని నిత డమ్ముచుండెను. దేశ సమాచారములను దెలిసికొనుట కితని దుకాణమున కందఱు వచ్చుచుందురు.

'ఫెన్సిలువానియా గెజెటు' అను వార్తాపత్రిక మునుపటికంటె వెల్లడిగ వ్యాపించెను. ఇది నూతన సీమలలో వన్నెకెక్కెను. అక్కడివారికి సోదరభావమును బుట్టించెను, ప్రజల కుపకార బుద్ధిని బోధించెను. శాస్త్రోక్తప్రకరణములు, వ్యాసములు, సమాచారములు, వర్తక విశేషములును గలిగి. వీనిని ధారాళముగ వ్రాయుచు, మత భేదముల నిది బోగొట్టుచుండెను.

1732 సంవత్సరము డిశంబరులో, 'పూరురిచ్ఛర్డు' అను పేరు పెట్టి, యొక పంచాంగము నితడు ప్రకటించెను. ఇది నాలుగువైపులను వ్యాపించినది. దీనిలో గంభీరమైన నీతివాక్యములు కలవు. ఇది హాస్యరసము ప్రధానముగ కలిగియుండెను. ఇది సరసమైన పంచాంగము. ఇందు ఉపోద్ఘాతములు, ప్రకటనలు ప్రకృతి విశేషములు, గ్రహణములు, వింతగవ్రాయబడు చుండెను. సామెతలు, పద్యములు సరసమైనవి, సరసము లేని నీరసము కాని విశేషములు లేవు.

"ఇందులోని సత్యమేమన, నేను కటిక దరిద్రుడను. నాభార్య మంచిది, గర్విష్ఠి, నారగుడ్డలు కట్టుకొని, రాట్నము నొద్దను గూర్చొనుట కామె యిష్టపడదు. పనిలేక, నేను నక్షత్రములను జూచుచుందు నని నామీద నామెకు గోపము. నా పుస్తకములను తగుల పెట్టుదనని, నన్ను భయ పెట్టును. అందుచేత, నామె కోరినప్రకారము, లాభమగు పని నేదైన నేను చేయవలయునుగదా! తదనుగుణముగ, వీనిని నారంభించితిని" అని పూరురిచ్ఛర్డు పంచాంగములో లిఖింపబడెను. మరియొక పర్యాయము, ఒక జత చెప్పులు, రెండు నారపంచ లామెకు, నాకొక కోటును కొనినాను. ఇదివఱకు కోటు లేనందున, బయటకు పోవుటకు సిగ్గుపడితిని. ఆమె కోపము కొంచెము తగ్గినది. అందుచేత, మునుపటికంటె, నిప్పుడు రాత్రి వేళల స్వస్థగ నిద్రించుచుంటిని" అని 'పూరురిచ్ఛర్డు'లో వ్రాయబడెను. ఇందులో కొన్ని సరసముగ వ్రాయబడిన సంగతులు నిందు పొందుపఱచుచున్నారము:- "కొట్టవలెను, ప్రేమించవలెను". "బంగారమును పరీక్షించునది నిప్పు; స్త్రీని, బంగారము, పురుషుని, స్త్రీ". "నూతనమైన సత్యము, సత్యమే, పురాతనమైన తప్పు, తప్పే", 'ఇరువురు చనిపోయిన, మువ్వురు రహస్యముగ నుంచ గలరు". "నీవు దుకాణము నుంచుము - దుకాణము నిన్నుంచును". "వక్తయొక్కమాటలు పూర్ణ స్వానము, తెలివి పూర్ణానుస్వారము". "నీవు చెప్పిన సంగతులను విని, యామె నవ్వుచున్నది. ఎందు చేతను? ఆమెకు మంచిదంతములు కలవు". "చుట్టము, చూపులకు వచ్చినవారు, చేపలు మూడురోజులలో కంపుగొట్టును". "రోగము కుదుర్చు వాడు దైవము, కట్నము పుచ్చుకొనువాడు వైద్యుడు". "నమ్మకమైన స్నేహితులు మువ్వురు - ముసలిభార్య, ముసలికుక్క, రొక్కము ధనము" "వివాహమునకు ముందు కండ్లు తెఱచియుండుము; తరువాత, సగము వానిని మూయుము".

పది సంవత్సరములకు, స్వగ్రామమునకు బెంజమిను వెళ్లెను. జీవిత కాలములో ప్రతి పదిసంవత్సరముల కొక పర్యాయము అతడు స్వగ్రామమునకు వెళ్లుచుండెను. తిరుగుదలలో న్యూపోర్టుకు వచ్చి, తనయన్న నితడు చూచెను. పూర్వపు మనస్పర్థలు మఱచి, కొంతకాల మన్నదమ్ములు కలసి మెలసి యుండిరి. జేమ్సు ఫ్రాంక్లిను జబ్బుగనున్నందున, నతడు తన కుమారుని తమ్ముని కప్పగించెను. ఆ ప్రకారమే, వానికి చదువు చెప్పించి, ముద్రకుని వ్యాపారమును బెంజమిను నేర్పెను. ఇంతలో జేమ్సు కాలధర్మమునొందినందున, నతని భార్య 'న్యూపోర్టు'లోనే వ్యాపారముచేయుచుండెను. చదువు ముగిసినపైని, కుమారుడు తల్లియొద్దకు వెళ్లెను.

బెంజమిను ఫిలడల్‌ఫియాలో స్వంతపనులను జూచుకొనుచు, స్వగ్రామస్థులచే మన్ననలను బొందెను. 1736 సంవత్సరములో "సామాన్య ప్రజాసభ"కు లేఖకునిగ, బెంజమినును నియోగించిరి. ఫెన్సిలువానియాలో నితడే మతిమంతుడు. ఈ యుద్యోగము వలన ధనము దొరకక పోయినను రాష్ట్రము వారి ముద్రక పనులను జూచుటచేత, నితనికి లాభము గలిగెను. ఈ పనిలో బదునాలుగు సంవత్సరము లత డుండెను. ఫిలడల్‌ఫియాలో 'పోస్టుమాస్టరు'గ నియోగింప బడినందున, దేశములోని సమాచారములను తెలిసికొనుట కితనికి వీలుపడి, తన వార్తాపత్రికను విశేషముగ విస్తరింప జేసెను. నేడు మొదలవిచ్ఛిన్నముగ నితడు శరీరయాత్రను గడిపెను.

ఆత డంతరంగమున జరిపిన జీవిత చరిత్రమతియాహ్లాదకరముగ నుండును!