బెంజమిను ఫ్రాంక్లిను జీవితచరిత్రము/ఏడవ ప్రకరణము
ఏడవప్రకరణము
"జంటో" సమాజము
ఈ కాలములోఁ దనతోఁ బనిచేయువాండ్రను, పట్టణములో నితరస్నేహితులను సమావేశముచేసి, 'జంటో' అను సమాజము నొకటి బెంజమిను స్థాపించెను. సం|| 40_రములు వఱకు శ్రేయోదాయకముగ, సుఖావహముగ నీ సమాజము వర్ధిల్లుచుండెను. మనుజుల, జ్ఞానము విజ్ఞానధర్మముల యభివృద్ధి కొఱ కీ సమాజము స్థాపింపఁ బడినది. ఎవడైన నీ సమాజ.ములోఁ బ్రవేశింపవలెననిన, నిలుచుండి తనగుండెమీఁద చేయిని వేసికొని, దిగువ వ్రాసిన సూత్రముల కొప్పుదలకావలెను.. ఆ సూత్రములను పొందుపఱచుచున్నారము:-
(1) "సమాజములోనివారి నెవరిని నేను అమర్యాద చేయను.
(2) "ఏ మతస్థుఁడైనను ఏవృత్త్యనుచరణీయుఁడైనను, ప్రతి మనుజుని బ్రేమించెదను.
(3) "పిచ్చియాలోచనలు కలవాఁడైనను తనకుఁ దోఁచిన విధమున ప్రార్ధనచేయువాఁడైనను, సరి వానిదేహమునకు, పేరునకు వస్తువుల కెటువంటి నష్టమును గలుగఁజేయను. (4) "సత్యమును సత్యమునకే బ్రేమించెదను. నిష్పక్షపాతముగ సత్యమును తెలిసికొని, దాని నితరులకు తెలియజేయుదును." ప్రతి శుక్రవారము సాయంత్రము సమాజమువారు సభచేయుచుండిరి.
సమస్త శాస్త్రవిషయముల నీ సభలో వీరు తర్కించు చుండిరి. ఇందులో వాదముచేయుట కలదు.
"సత్యమును తెలియుటకు వివాద మాడవలయునుగాని, జగడ గొండితనము గూడదు" అని బెంజమిను వ్రాసెను. ఈ సమాజాభి వృద్ధికొఱకు బెంజమును కష్టపడుచుండెను. ఈ సమాజములో ముచ్చటించిన విషయముల నిందు పొందుపఱచుచున్నారము.
"స్వలాభమునకా, మనుజులు పనిచేయుచున్నారు?" "ఉద్దేశము మంచిది, చేసినపని చెడుపని, దురుద్దేశము, చేసినపని మంచిది - వీనిలో నేది శ్రేష్ఠము?" "వేదాంతము యొక్క లక్ష్యము, కోరికలను భేధించుటయా?" "సౌఖ్యమన నేమి?" "మనుజుడు జీవిత కాలములో బూర్ణత్వమునుబొందగలడా?" "బుద్ధి, మంచినడవడియు గల బీదవాడు, బుద్ధి మంచినడవడియు లేని భాగ్యవంతుడు - వీరిలో నెవరి స్నేహము మంచిది?" "వీరు మృతినొందిన, వీరిలో నెవరి మరణము వలన దేశము నష్టమును బొందును?" "వీరిలో నెవరు సుఖజీవులు?" వీనిని సమాజములో బూర్వోత్తరముగ సమన్వయించుచుండిరి.
దీనిని స్థాపించిన కొన్ని రోజులకు, బెంజమిను దీనిని విడిచివేయవలసి వచ్చుననుభయము కలిగెను. కీమరు ముద్రాక్షరశాలలో బనిచేయుచు, 6 మాసములు సుఖముగ బెంజమిను గడిపెను. పూర్వమువలె, బెంజమిను దగ్గరకు జేరనీయక, కీమరు వానిని దూరముగ నుంచుచు వచ్చెను. ఇంతలో కీమరు యొక్క వ్యవహారము తగ్గినది. అతని ఋణములు లావయ్యెను. అయినను, నతని పనివాండ్రందఱు, బెంజమినుచే శిక్షింపబడి, పనిలో దేరి పారిరి. అందుచే, హెచ్చు వేతనమిచ్చి బెంజమినును పనిలోనుంచుటకు కీమరు కిష్టము లేక పోయెను. ఏదో చిన్న జగడము తెచ్చి, కీమరితనిని కోపగించెను. అందుకు రోషముకలిగి, బెంజమిను పనిమాని లేచిపోయెను.
గృహమునకుబోయి, శాంతుడై తానుచేసిన పనిని బెంజమిను వితర్కించెను. బోస్టనుపట్టణమునకు బోవలెనని యితడాలోచించెను. నాలుగు సంవత్సరములనుండి స్వగృహమునకు వెళ్లలేదు. ఈ లోపున తానుచేసిన పనులేమియు మంచివి కావని బెంజమి నను కొనెను. ధనమైనను గూడ బెట్టలేదు. వెర్నను కియ్యవలసిన సొమ్ము నియ్య లేదు. శాస్త్రవేత్తయైన 'ఎమర్సను' చెప్పిన విధమున, బెంజమినును బోలిన వారిని రాతిమీఁదనుంచినను వారు వేఱుదన్నెదరు. ఒకనాఁటి సాయంకాలమున, హ్యూమెరిడిత్తు, అను వాఁడితని యొద్దకువచ్చి, ముచ్చటించుచు, కీమరు ఋణముల పాలయిన సంగతిని జెప్పెను. ఇంతకును, కీమరు పని నేర్పు లేనివాఁడు. ఇంతలో నంతలోనో, వానిపని ముగియుననియు, వారు స్వంత ముగ ముద్రాక్షరశాలను స్థాపించుట కవకాశ ముండు ననియు, వారు పలుకుకొనిరి. మెరిడిత్తు మదుపుపెట్టి, కావలయు సామానులను దెప్పించుటకు, నిరువురుకలిసి పనిచేసి, లాభములను సమముగ పుచ్చుకొనుటకు సమ్మతించిరి.
గవర్నమెంటు నోటుకాగితములను ముద్రించుటకు కీమరుని నియోగించిరి. వానిచేతిక్రిందివా రెవరీపనిని బాగుగజేయ లేరు. అందుచే, బెంజమినును గోపముమాని పనిలో జేరమని , వాఁడు వేఁడెను. బెంజమిను పనిలోఁదిరిగి ప్రవేశించెను. అందుచేత, రెండుమూఁడుసంవత్సరములవఱకు కీమరుయొక్క వ్యాపారము సాగెను. కావలసిన అచ్చులు సిద్ధముకాఁగానే, న్యాయశాస్త్రాధికారుల యెదుట ముద్రించుటకు, వీరిరువురు కలిసి 'బర్లింగుటను' పట్టణమునకుఁ బోయిరి. ఈ సమయముననే, వారిపరిచయము వీనికి గలిగెను. "నామనస్సు పఠనమువలన పరిపక్వము నొందినందున, నాసంభాషణయందు వారిచ్ఛకలిగి యుండిరి. వారిగృహములకు నన్ను పిలుచుకొనివెళ్లి, వారి స్నేహితుల దర్శనము నాకు జేయించుచుండిరి. కీమరు నేను పొందిన మర్యాదను బొంద లేదు. నిజముగ, కీమరు వెర్రిబాగులవాడు. ప్రపంచరీతిని దెలియనివాడు. జనసమ్మతాభి ప్రాయములను కాదనువాడు. రోతను పుట్టించునం తవలక్షణముకల వాడను" అని గర్వముగ బెంజమిను వ్రాసెను.
ఇదివఱలో వ్రాసినప్రకార మింగ్లాండునుండి, 1728 సంవత్సరము ప్రారంభమున, నచ్చుయంత్రము, కూర్పులువచ్చినందున, కీమరుతో వ్యవహారమును చక్క జేసికొని, మెరిడిత్తు బెంజమినులు కలిసి, ముద్రాక్షరశాలను స్థాపించుటకు సమకట్టిరి.
ఈకాలములో నే బెంజమిను, తనగోరీమీద వ్రాయవలసినదిగా నీ దిగువ చరణమును వ్రాసెను. "ముద్రకుడైన బెంజమినుయొక్క దేహము (అక్షరములు మాసిపోయి, ప్రాతగిలిన గ్రంథముయొక్క యట్టవలె), క్రిమికీటకముల కాహారమై, యిక్కడనున్నది. ఈ గ్రంధము నాశముపొందక, సృష్టికర్తచే దిద్దబడిసవరణచేయబడి, దీనికంటె రమ్యమైనకూర్పులో వేయబడి, తిరిగి ప్రచురింపబడు నని వాని నమ్మకము."