ప్రభావతీప్రద్యుమ్నము
ప్రథమాశ్వాసము
|
రమణీరమణీయమ
హోరస్స్థలుఁ డచ్యుతుఁడు సముజ్జ్వలమహిమన్
ద్వారక నుండఁగ నొకనాఁ
డారూఢాదరత నింద్రుఁ డవ్విభుకడకున్.
| 52
|
వ. |
లోకహితకార్యపర్యాలోచనంబునకై చనుదెంచువాఁడు
నాకంబు వెడలి యాకసంబున నడతెంచుచున్న సమయంబున.
| 53
|
సీ. |
ధాత్రీమహాదేవి తాల్చినమున్నీటి
మొలనూలిరత్నంపుమొగ పనంగ
జలధిపేరిటిపాఁపతలచుట్టు గలధరి
త్రీమూర్తిశివుచిత్రతిలక మనఁగ
నపరదిక్సతి కట్టినట్టిసాగర మను
పుట్టంబుతుదివ్రాఁతమొగడ యనఁగ
వరుణగోపురబద్ధవార్ధితోరణమధ్య
గుంభితనవపుష్పగుచ్ఛ మనఁగ
|
|
తే. |
వివిధమణిమయగృహదీప్తివిసరవిసర
ణోపశోభిత మగుద్వారకాపురంబు
|
|
|
దవులఁ గాన్పించెఁ దనుఁజూడ దైవవిభుఁడు
వేయికన్నులుఁ జాలక వెఱఁగుపడఁగ.
| 54
|
వ. |
ఇట్లు గనుపట్టు నాపట్టణంపుసొంపునకు శిరఃకంపంబు సేయు.
నిలింపవల్లభునింపు పెంపు పరికించి కించిదుల్లసితవిలోచనం
బుల నాసహస్రవిలోచను విలోకించి తదీయరథసూతుం
డగుమాతలి యిట్లనియె.
| 55
|
క. |
ఏమీ యిది దేవరకను
దామరలకు నింతవెఱుఁగు దలకొలిపెడు నే
మే మనఁగ నహహ నాక
స్వామికి నబ్ర మగుప్రోలు వసుమతిఁ గలిగెన్.
| 56
|
క. |
జడనిధి యను తెరమఱుఁ గటు
వెడలి నిలిచినట్టియాట వెలఁదియపోలెం
గడు నింపులు గులుకుచుఁ దన
రెడు నీపురలక్ష్మి యవధరించితే యధిపా.
| 57
|
క. |
పడమట నంభోరాశియుఁ
గడమదిశల వనచయంబుఁ గప్పారఁగఁ దా
నడుమఁ బురలక్ష్మి గనుప
ట్టెడు హరియురమున సుఖించుఠీవి దలిర్పన్.
| 58
|
ఉ. |
దోహదధూపధూమములతోఁ గనుపట్టెడుతత్పురీవన
వ్యూహము నోసమస్తవిబుధోత్తమ చూచితె యంబుపానకౌ
తూహలలంబమాననవతోయదరాజివిరాజితాబ్ధిసం
దేహనితాంతకందళనదీపితనైపుణి నేపుఁ జూపెడున్.
| 59
|
ఉ. |
భోగపుఁజుట్లు కోటలుగ భూరికిరీటసముజ్జ్వలత్ఫణా
పూగము సౌధబృందముగ భోగికులేంద్రుఁ డుపేంద్రుఁ బాయలే
|
|
|
కీగతిఁ దాను వచ్చి భజియించెనొకో యవతార మంచుఁ జే
తోగతి నాకు నెంతయును దోఁచుచునున్నది నిర్జరేశ్వరా.
| 60
|
మ. |
అవచూడోపలదీప్తిచిత్రితములై హర్మ్యాగ్రవిన్యస్తకే
తువులం దేర్పడ కొప్పె నప్పురము పైత్రోవన్ మొగు ళ్లేఁగి యిం
ద్ర విలోకించితె యెంతనేల చని యేర్పాటయ్యె హానమ్మరా
దవి కాలాగరుధూపధూమతతులో యభ్రంబులో యిప్పుడున్.
| 61
|
చ. |
హరిహయ చూడుమా తెలియు టబ్రము డగ్గఱి చూచికాని యాం
గిరసుని కైన నల్లయది కెంపులమేడలతోడి విస్ఫుర
న్మరకతకుట్టిమస్థలియొ మవ్వపులేఁజిగురాకుకెంపు ము
మ్మరమునఁ దేజరిల్లు నెఱమామిడిమ్రాఁకులతోడితోఁటయో.
| 62
|
సీ. |
కలధౌతకేళినగంబు గాఁబోలును
దనరుచున్నది శంభుతనువులీల
ఘనపుష్పచాంపేయవనరాజి గాఁబోలు
నేలుచున్నది పులితోలుసిరుల
హరినీలసోపానసరణి గాఁబోలును
బగటుచున్నది నల్లపాఁపపేరుఁ
బవడంపుటలువసౌభాగ్యంబు గాఁబోలుఁ
జాటుచున్నది జటాజూటరుచిని
|
|
తే. |
సరసి గాఁబోలుఁ గ్రాలెడు సురనదిగతి
నోడ గాఁబోలుఁ బోలెడి నుడుపతికళ
ననిమిషాధిప చూచితే యల్లపసిఁడి
కోటనడిమిశృంగారపుఁదోఁటలోన.
| 63
|
సీ. |
ఆలోలశైవాలజాలలాలిత్యంబు
జంగమోద్యానవేషము వహింప
|
|
|
రంగదుత్తుంగతరంగసంఘాతంబు
నడగోటలతెఱంగు నడుపుచుండ
డిండీరమండలాఖండసౌభాగ్యంబు
చరసౌధచయవిలాసము భజింప
శ్రీకరశీకరాస్తోకప్రవర్షంబు
కానుకముత్యాలకరణిఁ బరఁగ
|
|
తే. |
నగడితలు తత్తదాశోపయాతవాత
వశతచేత నేతత్పురవర్యపర్యు
పాసనాశాసనానీతపరపురీప
రంపరాలీల నెఱపెడు నింపు మీఱి.
| 64
|
క. |
పడమటియది సాగర మని
యెడు తజ్జ్ఞులమాటఁ దక్క నేతత్పురి న
నల్గడలందుఁ బరిఖ లెవ్వియొ
జడనిధి యెయ్యదియె తెలియ శక్యమె ప్రజకున్.
| 65
|
చ. |
తను ధరణీతటిద్విహృతిధన్యవనావళి యింత మీఱుటల్
కనియును మేఘ మిచ్చటి కలజ్జతఁ జేరెడుఁగాక చేర కేఁ
గినను గొఱంత యేమి పురికిం బువుఁదేనియసోనకాలువల్
జనములపైరుపంటలకుఁ జాలవె యెన్నటికైన నెన్నఁగన్.
| 66
|
వ. |
అని యివ్విధంబున రథికసారథులు తత్తద్వస్తుసందర్శనసమయ
సముచితవచోరచనల వినోదించుచుం గొంతదవ్వున నయ్యు
ర్వికి డిగ్గి యన్నగరంబు చేరం జనునంత నతనిరాక విని
వనజోదరుండు ప్రియసహోదరుం డగుసాత్యకిం బిలిపించి
యద్ధివిజవల్లభు నెదుర్కొని తోడి తెచ్చుటకు నియోగించిన
నతండు సముచితపరివారసమన్వితుండై యెదుర్కొని
|
|
|
తోడ్కొని చన వేడ్క లిగురొత్తుచిత్తంబున నద్దేవోత్త
ముండు నూత్నగారుత్మతస్తంభసంభృతభేదావలంబిరంభాతరు
విభూషితగోపురపార్శ్వభాగం బగుతత్పురంబు ప్రవేశించి
యుభయపార్శ్వసౌధవీథికాధిరూఢప్రౌఢవిలాసినీకటాక్షనివ
హబహుగుణీకృతమార్గతోరణుం డగుచు వారిజనాభుమం
దిరద్వారంబు చేర నరిగె నతండును నుగ్రసేనవసుదేవ
సంకర్షణగదాక్రూరప్రముఖులతోఁ గక్ష్యాంతరంబులు గడచి
యెదురు వచ్చి తత్ప్రవేశవిధానంబు యథోచితంబుగా నడపి
పరస్పరార్హసంభావనంబు లస్తంభసంభ్రమసంభృతంబు లై
జరగునంతఁ గుశలప్రశ్నంబుఁ గావించిన నద్దివిజనాయకుండు
జనార్దనున కిట్లనియె.
| 67
|
తే. |
ఇపుడు నీదర్శనం బనియెడుకుశలము
కలిమి ప్రత్యక్షమే చెప్ప వలదు కృష్ణ
యటమటముగాక యట మునుపటికుశలము
నఖిలవిదుఁడ వీ వెఱుఁగనియదియుఁ గలదె.
| 68
|
క. |
ఐనను నాచేతను వినఁ
గా నభిమత మయ్యెనేని కమలోదర నీ
కే నెఱిఁగించెద విను మవ
ధానముతో మన్మనోవ్యధాభర మెల్లన్.
| 69
|
చ. |
తపమున వజ్రనాభుఁ డనుదైత్యుఁడు బ్రహ్మఁ బ్రసన్నుఁ జేసి వ
జ్రపురి యనంగ నొక్కనగరంబును మేరువుపొంత మారుతా
తపములకు న్నిజానుమతిఁ దక్కఁ బ్రవేశ మొనర్పరానియ
ట్టిపసఁ దనర్చుదానిని ఘటించి యతం డొసఁగన్ బ్రదీప్తుఁడై.
| 70
|
వ. |
యథేష్టవైభవోపభోగంబులం బ్రవర్తించుచు.
| 71
|
పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/40 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/41 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/42 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/43 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/44 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/45 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/46 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/47 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/48 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/49 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/50 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/51 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/52 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/53 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/54 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/55 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/56 పుట:ప్రభావతీప్రద్యుమ్నము (పింగళి సూరన).pdf/57