శ్రీరస్తు

ప్రభావతీప్రద్యుమ్నము

పీఠిక



మదుమామహేశు లతిచిత్రవిలాసులు దారు మున్ వియో
గామితచింత నొండొరులకై సగమౌటలు నిచ్చఁ దెల్పుకాం
క్షామహిమంబుచేఁ జెఱుసగంబుగ నొక్కయెడ ల్ధరించుస
త్ప్రేమపుదంపతు ల్కృతిపతిం దనరింతురు గాతఁ గీర్తులన్.

1


ఉ.

[1]అంగజహేతుకంబు లరయ న్మిథునంబుల ప్రేమ లిట్టిచో
నంగజుతల్లిదండ్రు లగునట్టియనన్యసమానహార్ధసం

సంగు లనాదిదంపతులు సత్కృప నిత్తురుగాక సౌఖ్యముల్
పింగళిసూరధీరవరుబిడ్డకు మాయమరేశమంత్రికిన్.

2


చ.

అమలనవీనహైమనిజయానగరుద్ద్యుతిఁ బ్రోచుసద్విపు
ర్విమలరుచిన్ స్వభక్తులకు వెండియుఁ బైఁడియుఁ గీర్తియు న్సుతే
జము నెపుడప్పుడే యొసఁగు సర్గనిధానముఁ దాల్చియున్నయ
ట్లమరెడువాగ్విధాత లమరార్యున కిత్తురు నిత్యసౌఖ్యముల్.

3


వ.

అని సకలభువనప్రవర్తనహేతువు లైనపురాతనమిథునం
బులం గొనియాడి.

4


తే.

ఆదికవులఁ బ్రాచేతసవ్యాసమునులఁ
దలఁపులోన భజించి యత్యంతసరస
మగు ప్రభావతీప్రద్యుమ్న మనుప్రబంధ
మాచరింపుచు నొక్కనాఁ డాత్మలోన.

5


మ.

జనము ల్మెచ్చఁగ ము న్రచించితి నుదంచద్వైఖరిం గారుడం
బును శ్రీరాఘవపాండవీయముఁ గళాపూర్ణోదయంబు న్మఱి
న్దెనుఁగుంగబ్బము లెన్నియేనియును మత్పిత్రాదివంశాభివ
ర్ణనలేమిం బరితుష్టి నా కవి యొనర్పంజాల వత్యంతమున్.

6


క.

తండ్రియు సుతులకు దైవం
బండ్రు గదా వేదవాదు లది వినియును నే
వీండ్రును వాండ్రును బలె మా
తండ్రిఁ బరమపూజ్యుఁ గాఁగఁ దలఁపమి తగునే.

7


మ.

గయలోఁ గాశిఁ బ్రయాగ శ్రీగిరిని గంగాద్వారనీలాచలో
జ్జయనీద్వారకలం దయోధ్యమథురన్ సంస్తుత్యపుణ్యస్థలా
గ్రియత న్వెండియు మించునైమిశకురుక్షేత్రాదులం దర్పణ
క్రియచే నాపినతమ్ముఁ డెఱ్ఱన యొనర్చెం దండ్రి కాహ్లాదమున్.

8

క.

ఏనుం బితృపూజన నా
చే నైన ట్లెద్దియైనఁ జేయఁగ వలయున్
గానఁ గృతి యిచ్చి మేదిని
పై నిలుపుదు నతనికీర్తిఁ బరమేశుకృపన్.

9


వ.

అని నిశ్చయించి ప్రభావతీప్రద్యుమ్నంబు మద్గురుం డైన
యమరామాత్యునిపేర నంకితంబుగ రచియింపం గడంగి
తత్కావ్యలక్ష్మీముఖంబునకుం దిలకాయమానంబుగ నా
వంశావతారం బభివర్ణించెద.

10


ఆ.

గంగఁ దనదుపేర గౌతమీనామవి
ఖ్యాతిఁ బరఁగఁ దెచ్చె భూతలమున
కేమహానుభావుఁ డామునిసింహుఁడు
గౌతముఁడు తపోధికతఁ దలిర్చు.

11


ఉ.

వాదున గెల్వ లేక పురవైరి లలాటముకన్నుఁ జూపఁ దా
బాదమునందుఁ గన్ను ప్రతిపక్షఁతఁ జూపెను శాస్త్రమున్ బ్రమా
ణాదిపదార్థతత్వకథనాత్మకమున్ రచియించె నాత్మ సం
వేదముకై మును ల్కులపవిత్రుని గౌతముఁ బోల నేర్తురే.

12


క.

ఆగౌతమగోత్రంబున
నాగమనిధి పుట్టె గోకనామాత్యుఁడు స
ద్భోగక్షేత్రస్వామ్యస
మాగతిఁ బింగలిపురాంకుఁడై యతఁ డొప్పెన్.

13


ఉ.

పేర్వెలయంగ నాఘనుఁడు పింగలిగోకబుధోత్తముండు గం
ధర్వి నొకర్తుఁ బేకి యనుదానిని దాసిఁగ నేలె యోగితా
గుర్వనుభావుఁడై నెరపె గోపకుమారునిఖడ్గవర్ణనం
బర్వపునిండువెన్నెలలపై నెఱిఁ జూపెడుకీర్తిసంపదన్.

14


ఉ.

సంతతి లేక ము న్నతనిజాయ సభక్తిని సూర్యసేవ య

శ్రాంతముఁ జేయఁగా నతఁడు సద్ద్విజుఁడై కల వచ్చి దొండచె
ట్టింతికి నిచ్చి బాల ఫలియించును నీ కిది ప్రోది చేసికొ
మ్మెంతయునంచుఁ బల్కె నఁట యింతియు నాకల గాంచి ధన్యయై.

15


తే.

సకలదిశలకు శాఖోపశాఖ లిడుచుఁ
బోదలి ఫలియించుదొండయుఁ బోలి ప్రబలి
యాత్మసంతతి పుత్రపౌత్రాదిబహుప
రంపరల నొప్ప వెలసె భర్తయును దాను.

16


మ.

తరము ల్నాల్లయి దెందు నెందు నగుఁ దత్తద్గ్రామనామంబులన్
బరఁగున్ వంశము లెల్లఁ బూర్వపునిజప్రఖ్యాతి మాయంగ నే
మరుదో పింగళినామమందుఁ జిరకాలావాసులై యున్న సు
స్థిరత న్గోకనమంత్రివంశజులకు జెన్నొందు మి న్నందుచున్.

17


ఉ.

రంగుగ గౌతమీపరిసరంబులఁ గృష్ణకెలంకులన్ ఘనుల్
పింగళిరామయాదులు లలిం బలనాటను బాకనాటనుం
బింగళిగాదయాదు లిటఁ బెంపు వహించిన యస్మదాదు లా
పింగళిగోకమంత్రియిలుపేరనె చాలఁ బ్రసిద్ధు లెల్లచోన్.

18


వ.

అది య ట్లుండె నమ్మహావంశంబునందు నస్మజ్జనకజనిజీవంతి
కాత్యంతకమనీయంబైన శాఖావిశేషం బెట్టిదనిన.

19


క.

గంగయ నా వెలయుచు శుచి
తం గడు శోభిల్లె నొకడు తద్వంశములో
గంగ యనా వెలయుచు శుచి
తం గడు శోభిస్లెఁ దదూర్జితయశశ్శ్రీయున్.

20


క.

మాంగల్యశోభి యగునా
గంగయకును ముగురు వంశకరు లైరి సుతుల్
రంగత్కీర్తులు మహి నె
న్నంగ న్సూరనయుఁ గుప్పనయు రామనయున్.

21

క.

కనియెన్ గుప్పన సూరన
యనుపుత్త్రుని నతనిపుత్త్రు లగు బాపయ భ
ద్రన కుప్పార్యుల కాత్మజు
లనేకు లెఱ్ఱయ్య పాపయాదులు ప్రాజ్ఞుల్.

22


క.

జనియించెను రామనకుం
దనయుఁడు గంగన్న గంగనకు గాదన గా
దనకుం బెద్దయ మొదలుగ
ననేకు లీగతిఁ దదన్వయము శోభిల్లున్.

23


తే.

ఇట్లు పుత్త్రపౌత్త్రాదుల నెసఁగునట్టి
సోదరులు దన్ను మిక్కిలి నాదరింప
నలఘుసాద్గుణ్యసౌభాగ్యకలితుఁ డగుచు
గంగనామాత్యు సూరయ కరము వెలసె.

24


ఉ.

పింగలి గంగమంత్రివరుబిడ్డకు సూరనకుం బదాబ్జరే
ఖం గలకాంతికే వలచి కైవస మయ్యెను రాజ్యలక్ష్మి దా
బంగరుకామకుంచెలును బల్లకియు న్మొదలైనయాత్మస
ర్వాంగసమృద్ధితోడ సిరి కంబుజరేఖలప్రేమ వింతయే.

25


తే.

సూరనిభుఁ డైనపింగలిసూరవిభుని
దొరయఁ బోఁ డొరుఁ డలవేల్పుదొరయ కాని
యతనిదానము సిరికి నియతనిదాన
మర్థు లప్పుడు దానసమర్థు లైరి.

26


క.

సూరయమంత్రికిఁ గలిగెను
సూరయమంత్రియ యనంగ సుతరత్నము కం
ఠీరవమున కెందును గం
ఠీరవము జనించునట్టినియమము దోఁపన్.

27

ఉ.

సూరయసూరమంత్రి కతిశుద్ధిఁ దలిర్చినయక్కమాంబయం
దౌరసు లుద్భవించిరి మహాత్ములు నల్వురు సజ్జనస్తుతో
దారగుణాభిరాము లయి యన్నయభవ్యుఁడు సూరసూరయు
న్ధీరుఁడు వల్లశౌరియును నీతయశస్కుఁడు లింగనార్యుఁడున్.

28


వ.

వారిలోన.

29


క.

వల్లయమంత్రికిఁ బుత్త్రుఁడు
పుల్లయమంత్రి యనఁ బుట్టె భువి లింగన కు
త్ఫుల్లయశుఁడు సూరయయును
సల్లాలితనీతి యక్కసచివుఁడు దనయుల్.

30


క.

వారలకు నగ్రజుం డగు
సూరయసూరప్రభుండు సుకవిత్వసదా
చారశివభక్తివినయో
దారత్వాదులఁ బ్రసిద్ధతముఁడై మించెన్.

31


క.

వేడుక నాయన పెండిలి
యాడె వెలగలేటియమరనామాత్యసుతన్
వ్రీడావతులందును గొని
యాడం దగినయమలాంబ నఖిలగుణాఢ్యన్.

32


క.

అమలమహాగుణనిధి యా
యమలను హారిప్రకారయశమునఁ దనరెన్
గమలాలయాసరస్వ
త్యుమ లాలలితాంగిఁ బోల్ప నొనరెడుగరితల్.

33


ఉ.

ఆయమలమయందును గృహస్థశిరోమణి సూరశౌరి య
త్యాయతశీలురం గనియె నాత్మజుల న్ముగురన్ సుధీజన
ధ్యేయగుణప్రశంసు నమరేశ్వరమంత్రిని ధర్మనిర్మలో
పాయుని మల్లనార్యు నతిభవ్యత మించినయక్కధీరునిన్.

34

వ.

అందు.

35


క.

ఇమ్ముగ నుదయించిరి జన
సమ్మతుఁ డగుమల్లనకును జగ్గన యనఁగాఁ
దమ్మయ సూరయ చిన్నయ
తిమ్మయ లనఁ బరఁగుసుతులు ధృతిబలసహితుల్.

36


క.

ఆమల్లనకును జన్నను
చే మంత్రుల కెల్ల గుణవిశేషంబులచే
భూమిన్ జ్యేష్ఠుఁ డనంగ మ
హామహిమౌదార్యుఁ డమరనార్యుఁడు వెలసెన్.

37


సీ.

[2]చిఱువన దేచిరా జెఱుక మించిన బుధో
             త్తముఁ డేవధూమణితాతతండ్రి
యనవరత మునికి నాయూరిపేరఁ దా
             వెలయు కేసయ్య యేవెలఁదితాత
యన్నయ బాపయ్య లగ్రజానుజులుగాఁ
             బరఁగుభావయ్య యేగరితతండ్రి
జయనయోన్నతులు కొండయరాఘవార్యు లే
             సతి కన్నదమ్ములై నుతులు గనిరి


ఆ.

పృథివి నేపురంధ్రి పెదతండ్రికొడుకు స
త్కీర్తిశోభితుండు కేసవిభుఁడు
తనరు నేగుణాఢ్యపినతండ్రిసుతుఁడు గం
గయ్య బహుసహోదరాంచితుండు.

38


తే.

రమ్యగుణనిధి యన్నమ్మ రాచపూడి
గణపతిసుపుత్త్రి యేసాధ్వికన్నతల్లి

యట్టియంబమ్మఁ బింగలియమరమంత్రి
పెంపు నింపును మెఱయంగఁ బెండ్లియాడె.

39


తే.

అనఘసౌభాగ్యవర్తనార్ధాంగలక్ష్మి
పింగళియమరామాత్యు నర్ధాంగలక్ష్మి
యంబమాంబిక భోగభాగ్యముల మరుని
యంబకును నంబికకు సాటి యనఁగ వెలసె.

40


క.

ఆదంపతులకుఁ బుత్త్రుల
మై జనియించితిమి సూరనాఖ్యుఁడ నేనున్
భ్రాజితమతి యమలార్యుఁడు
రాజితబోధార్థనాభిరతుఁ డెఱ్ఱనయున్.

41


క.

స్తోత్రముల కయ్యె సమ్య
క్పాత్రము శ్రీరాచపూడిగంగనయును దౌ
హిత్రులు గలుగఁగ వంశప
విత్రం బామిథున ముభయవిధసంతతులన్.

42


క.

అక్షయగుణవిభవై తా
దృక్షకులోత్తంసునకు సదృక్షవిదూర
ప్రేక్షాసిలలితధర్మసు
రక్షాంసునకు నురురుచిధురాహంసునకున్.

43


క.

గౌతమగోత్రునకును బ్ర
ఖ్యాతాపస్తంబసూత్రయాజుషశాఖా
ధీతిపవిత్రునకును లో
కాతిగవశితాజితాంతరామిత్రునకున్.

44


క.

పృథులాకాశీసేతు
ప్రథ నిడుమానూరికృష్ణరాయసముద్ర

ప్రథితాగ్రహారభోగా
తిథేయనిజసంతతిప్రతీతాత్మునకున్.

45


క.

గంగాశుచివృత్తికి నభి
షంగానాఘ్రాతనీతిసంపత్తికి స
న్మంగళగుణపాత్రునకును
బింగళిసూరప్రధానుప్రియపుత్రునకున్.

46


క.

శ్రీమద్రాజేంద్రగురు
స్వామిస్థిరవంశకలశజలనిధిసోమ
త్సోమారాధ్యకృపాల
బ్ధామలశివభక్తిశోభితాచార్యునకున్.

47


క.

అమలాంబానందనునకుఁ
గమలాంబాగురుసమానఘనధైర్యునకున్
గమనీయమనీషివ్యుప
గమనీయున కంబమాంబికారమణునకున్.

48


క.

మజ్జనకున కర్చితధీ
మజ్జనకునకు నభినుతిసమార్జితమాయో
న్మజ్జనకున కమలచిదవ
మజ్జనకున కమృతరసనిమజ్జనకునకున్.

49


క.

అమరామాత్యున కురుమ
త్యమరామాత్యున కజోపయమనకృతార్థో
ద్యమరామాత్యుపమేయా
యమరామాత్యురుగుణోదయయశశ్శ్రీకిన్.

50


వ.

అక్షయకీర్తివైభవాభివృద్ధి యగునట్లుగా నేను సమర్పింపఁ
బూనిన ప్రభావతీప్రద్యుమ్నంబునకుఁ గథాక్రమం బే మనిన.

51
  1. అంగజహేతుకంబులు = మన్మథుఁడు హేతువుగాఁ గలవి. అనఁగా దంపతుల ప్రేమమునకుఁ గారకుఁ డగు మన్మథునకుఁ దలిదండ్రులయి యనన్యసామాన్య మైనప్రేమముతోఁ జెలువారు ననాదిదంపుతు లనుట లోకమున దంపతులప్రేమమునకు హేతుభూతుఁ డగు మన్మథునిఁ గన్నవా రగుటచే వారిప్రేమ స్వతోరూఢమైన దనియు నా దాంపత్య మాది యెఱుఁగరాని దనియు భావము.
  2. వ్రాఁతప్రతులందుఁ బైయట్లు కలదు. ముద్రితప్రతిలో "చిఱుమనఁ దెచ్చి రాచఱిక మిచ్చిన" అని కలదు.