ప్రభావతీప్రద్యుమ్నము/గ్రంథవిమర్శనము

శ్రీరస్తు

ప్రభావతీప్రద్యుమ్న

గ్రంథవిమర్శనము

చ.

“కవిత యనంగఁ బద్యములు గద్యములున్ రచియించుటౌనె భా
వవిలసనంబు, లోకహితవర్తనముం బచరింపఁజేసి, క
న్గవకును నద్దమె ట్లటుల గ్రంథచమత్కృతి నేర్పుపెంపునన్
బ్రవిమలవస్తుతత్వమును భాసిలఁజేయుట గాక యారయన్."

(చాటుధార)

సూరనార్యునికాలమునాఁటికి మనతెలుఁగుభాషయందు దృశ్యకావ్యములు లేవు. అన్నియును శ్రవ్యకావ్యములే. ఈతఁడు రాఘవపాండవీయము వ్రాసి తనపాండిత్యప్రకర్షం గనుపఱచినాఁడు. కళాపూర్ణోదయము వ్రాసి కల్పనాచాతుర్యమును కథారచనాచమత్కారమును వెలయఁజేసినాఁడు. రెండింటియందుననుఁగూడ దృశ్యప్రబంధమునం దుండఁదగిన లక్షణములు విశేషముగ లేవు. అట్టికొఱంతఁ బాపం దలంచి యీశ్రవ్యప్రబంధంముననె దృశ్యప్రబంధలక్షణము లన్నియుం బుట్టించి నాటకపాత్రములన్నియు నెదుటకువచ్చి నటించినట్టు లీగ్రంథమును రచియించినాఁడు. ఈప్రభావతీప్రద్యుమ్నమున విశేషభాగము సంభాషణవైచిత్ర్యమే. ఆపట్టుల మనము శ్రద్ధతోఁ బరిశీలించి చదివితిమేని, దృశ్యప్రబంధలక్షణము లెంతవఱ కిం దిమిడియున్నవో తేటతెల్లము గాఁగలదు. ఇం దీతఁడు నెలకొల్పిన రంగస్థలముల జాగరూకతతో విడఁదీసి మధ్యమధ్య సందర్భ ములను విష్కంభరూపమున నమర్చుకొని కొలఁదిమార్పులు గావించుకొనినచో, నిది యొకచక్కనినాటక మగును.

ఈగ్రంథమునందలి ఇతివృత్తము కేవలము కల్పితమువలెనే గన్పట్టును. కాని గ్రంథావసానమునం దీతఁడు చొప్పించిన

తే.

"అఘహరణ హరివంశకథాశ్రయంబు
నాత్మపుత్రగుణస్తవనాంకితంబు
నైన యీకావ్యమునకు మహాప్రసిద్ధి
యిచ్చుఁగావుతఁ గరుణ లక్ష్మీశ్వరుండు.”

అనుపద్యమునుబట్టి ఇయ్యది హరివంశమునందలి కథను బట్టి వ్రాసినట్టు లూహింపఁదగియున్నది, కాని హరివంశమునం దీకథ గనుపట్టుట లేదు. ఈకథయందలి ముఖ్యమగుపట్టులన్నియును బరికించిచూచినచో అనిరుద్ధచరిత్రయందలి కథపట్టులే పెక్కులు గానంబడియెడును. ఆయనిరుద్ధచరిత్ర హరివంశములోనిది. ఆకథయందలి శోణపురమే యిందలివజ్రపురము. అచ్చటి పార్వతీవరమాహాత్మ్యమే యిచ్చటి పార్వతీవరమాహాత్మ్యము. అందున్నస్వప్నమే యిందలిస్వప్నము. అచ్చటి బాణాసురవధయె యిచ్చటివజ్రనాభవధ. ముఖ్యాంశము లిందుండి గ్రహించి షేక్స్పియరు మూలగ్రంథములలోని కథను దనయిచ్చ వచ్చినట్టు మార్పుఁ జేసి తననాటకమును రచించి, మూలగ్రంథమునందు లేనిప్రాశస్త్యమును తనగ్రంథమునం దసదృశముగ నెలకొల్పి సర్వోత్కృష్టముగ గ్రంథమును రచియించినట్టు లీతఁ డీగ్రంథమును రచియించినాఁడు. ఈగ్రంథమునం దీతఁడు మార్చుకొనిన మార్పులను బరికించిచూచినచో ఆహా! ఈతని ప్రతిభావిశేషము, సందర్భశుద్ధి, పాత్రౌచిత్యము, గుణపోషణము యెంత శుద్ధముగను, అప్రతిమానముగను గానంబడును?

ఈగ్రంథమునందలి కథాపర్యవసానము వజ్రనాభుఁడు అసమానబలపరాక్రమసంపన్నుఁడు పోటుమగలకడ నెక్కడనో గాని సాత్వికభావ ముండు టరుదు. పూర్వపురాక్షసులందఱును బలపరాక్రమసంపన్నులై తామసగుణప్రధానులై వఱలినవారె. అట్టివారందఱివలెనే యీతఁడును దయావిహీనుం డగుక్రూరకర్ముఁడు. చండశాసనుండు. ఎండయును గాలియును గూడ నీతనిపట్టణమున నితనియాజ్ఞ లేక ప్రవేశింపరాదు. బల మున్నది. పరాక్రమ మున్నది. చండశాసనత యున్నది. దయ లేదు. ఇంక నీతని విజయయాత్ర లెంతదారుణముగ నుండునో చెప్పవలసిన దేమి? రావణుఁడు మున్నగు నిట్టికూరాత్ములందఱికిని భగవంతుఁ డొక్కటిమాత్రము లేకుండఁ బ్రసాదించినాఁడు. ఏమందురా? లౌక్యపరిజ్ఞానము, దూరదృష్టి, దూరశ్రవణము, ఇవిగూడ వీరికడ నుండెనా, లోకమంతయును నశించియేయుండును. ఈవజ్రనాభుఁడు యెదుటివాని మాయమర్మముల నెఱుఁగనివాఁడయినట్టు ఇంద్రునిపై నితఁడు దాడి వెడలినపట్టున నింద్రునివంచనావచనములకు లోనయి గొఁతవఱకు నాతనియింట విం దయియుండి పిమ్మటఁ గొంతకాలమున కెవ్వరివలననో యది మోసకృత్యముగా గ్రహించి ఇంద్రునిఁ దూలనాడి, రాజ్యము నాక్రమించుకొనఁ దలంచినాఁడు. దాని కింద్రుఁడు మఱియొకయుక్తినిఁ బన్నఁగా మఱల నావలలోఁ బడిపోయినాడు. రాజ్యసంస్థాపన బలపరాక్రమములు గలవారికందఱకును, సుకరమే గాని రాజ్యతంత్రజ్ఞత నెఱుంగనివాని కారాజ్యమును నిలువఁబెట్టుకొనుట సాధ్యముగాదు. అందుచేతనేగదా, అంతటి మేటిమగలైన రాజపుత్రవీరులందఱును రాజ్యపరిచ్యుతింగాంచినది. మహమ్మదీయరాజ్యము లన్నియు నస్తమించుటకుఁ గారణ మేమి? ఎవ్వరో యక్బరువంటి మహానీతిసంపన్ను లొకరిద్దఱు వినా తక్కిన మహమ్మదీయులందఱును కేవల లోకజ్ఞానశూన్యులే. ఇట్టివారిని జయింప బుద్ధిబలమే పనిచేయవలయుం గాని, బాహుబలము కార్యకారిగాదు.

బృహస్పతియోచనాసామర్థ్యము ప్రస్తుతకార్యసాధనోపాయ మైనది. కాని సంపూర్ణవిజయమునకుఁ జాలినదిగాదు. సర్వతంత్రస్వతంత్రుండైన శ్రీకృష్ణుండు గూడ వజ్రపురప్రవేశమునకు మాత్రము మార్గమును గనిపెట్టగలిగినాఁడు. విజయకార్యమున కెన్నియేని సాధనములు గావలయును. అన్నియు నొక్కరికి స్ఫురించునా? ఒక్కొకబుద్ధి కొక్కొకటి బొడకట్టును. అందువలననే యిట్టి కార్యముల కనేకులు గలసి యోచనఁ జేయవలసివచ్చుచుండును.

ఇంద్రుం డింకొక్కయుపాయమును గనిపెట్టెను. ఇంద్రుని వేగరులు తక్కినయుపాయములను గనిపెట్టినారు. అన్నియును గలిసినంగాని విజయకార్యసన్నాహము సంపూర్ణమైనది కాదు. ఈవిజయమునకుఁ బ్రధానోపకరణములు ప్రభావతీప్రద్యుమ్నులు. వారి కొండొరులపై ఁగలిగిన యనురాగమునకు దైవనియుక్తియె కారణము. అయ్యది శుచిముఖి పరిముఖమున నభివృద్ధిం గాంచినది. రావణుని వినాశమునకు విభీషణుఁడును, శత్రువీరునియం దాతని కుదయమైనభక్తియును గార ణములైనటుల యిందలి వజ్రనాభవినాశమునకు రాక్షసకులమున కంతకును వైరియైన శ్రీకృష్ణునికుమారునియందుఁ బ్రభావతికి అనురాగ ముదయించుటయే కారణమైనది. వీరిద్దఱును జెఱియొకపక్షమున నున్నవారు. వారియనురాగ మభివృద్ధి సేయుట కెంతనేర్పరి యనుసంధానకర్తయై యుండవలెనో యోచింపుఁడు. ఒకవైపున నూయి, ఒకవైపున గోయి, ఒకమూల రాజకార్యనిర్వహణము, ఒకమూల నాత్మరక్షణోపాయము, రహస్యపరిరక్షణము, ఇన్నియు జరుగుచుఁ గార్యానుసంధానము కావలయు. భారతయుద్ధమున రాయబారము నడపుటకు శ్రీకృష్ణుఁ డెంతసమర్థుఁడో, యీగూఢతంత్రనిర్వహణమునకు మనశుచిముఖి యంతనిర్వాహకురాలు. అట్టిపాత్రనిర్మాణము గావించుటలో స్వభావమున కించుకయైన వెలిగాకుండ తనయాశయమును తుదముట్టించిన మనగ్రంథకర్త మేధావిశేష మెంతయును ప్రశంసనీయము. ఈహంససందేశము ఈతనికి నలదమయంతు లిద్దఱకు ననుసంధానమును గలిగించిన హంసను బట్టి స్ఫురించియుండును; కాని ఆసందేశమునకును దీనికిని ఎంత వ్యత్యాస మున్నది? ఎంతటి రాజ్యతంత్రజ్ఞులకును నిట్టిసందేశము నడపుట దుర్ఘటము. ఒకచోట రాజకీయవ్యవహారములు చక్కఁబడవలయు. ఇంకొకచోట శృంగారవిషయము లనుసంధానము నొందవలయు. ఒకచోట భీష్మించి మాట్లాడవలయు. మఱియొక్కచోఁ దనయెత్తు తగ్గి ముచ్చటింపవలయు.

ఈకార్యమున కీయొక్కరాయబారము చాలినది కాదు. ప్రస్తుతకాలమునఁ బిట్టలను వేగు నడపుటకుఁ దయారుచేయుచున్నట్టును ఆపిట్టలు ఎక్కడకుఁబోయి ఎట్టు లాకార్యము నడుపుకొనవలయునో యట్లు రహస్యభంగము గాకుండ నిర్వ హించుచున్నట్టును సమరవ్యూహతంత్రములపట్టున మనము గ్రంథములం జదువుచున్నాము. ఇందలి చిలుకరాయబారము గనుంగొనిన నీతంత్రములు ద్యోతకములు గాకమానవు. ఈగ్రంథకర్త తా నొకస్థలమునఁ జెప్పినమాదిరిని మఱియొకచోటఁ జెప్పుటకుఁగాని, ఒకరు జెప్పినమాదిరి ననుకరించి చెప్పుటకుఁ గాని ఇష్టపడువాఁడు గాఁడు. ఈతనియపారప్రతిభ యవ్యాహతముగా నవసరమువెంబడిని నూతనసృష్టి యొనర్చుచుండును.

అంతఃపురసమాచారము లాస్థానమున కెక్కరాదు. ఒకరిక దూతికలుగ నుండువా రింకొకరికడ దూతికలుగ నుండరు. ప్రద్యుమ్నుఁ డొక్కఁడును కార్యనిర్వహణమునకుఁ జాలఁడు. అతనికి వెనుక సాహాయ్య ముండవలయును. ఈసహాయమునకై తక్కుoగల గుణవతీచంద్రమతులఁ గల్పించి వారికి గదసాంబులయం దనురాగ ముదయింపఁజేసినాఁడు. వారికడ వార్తాహారిణిగఁ జిలుక నొకదానిని సృష్టించినాఁడు. ఈచిలుకబుద్ధికిని హంసబుద్ధికిని వ్యత్యాస మెంతయుండునో యారెండుపాత్రములను బరిశీలించి చూచువారల కది విదితము గాకపోదు. చివరకు కార్యము సమగ్రముగ నిర్వహించుటకు శుచిముఖిసాహాయ్యమే యవసరమయినది.

ఈవ్యాపారమున కంతకును శుచిముఖియే సూత్రధారి. శుచిముఖికిఁ దెలియనివ్యాపారమేదియు నీవ్యూహమునందు లేదు. శుచిముఖి కథారంగమునఁ బ్రవేశింపఁగనే ఇంద్రోపేంద్రు లిరువురును వెనుక కొత్తిగిలిరి. ఈశుచిముఖి సర్వరహస్యములను బుక్కిటం బట్టి యెప్పటి కేది యెంత యవసరమో యంతియేగాని యెక్కుడుగ బయలుగాంచనీయక తనకార్యమును జక్కగ నిర్వహించుకొనినది. ఈరహస్యమునం దేది యించుక యసమయమున బయలుపడినను బ్రధానకార్యమంతకును విఘ్న మొదవుటయేగాక ప్రద్యుమ్నుఁడును దదనుచరులునుగూడ శత్రునిచేతిలోఁ బడిపోయియుందురు. ఈపట్టున గ్రంథకర్త యాపాత్రములఁ గత్తివాయిమీఁద నడిపించెను. ఆనడిపించుటలో అతినిగూఢము లగువిషయములను బహిరంగము చేయుచు బహిర్గతములై నట్టు పాఠకులకును ఆయాసందర్భము నెఱింగినవారికిని దక్కఁ దక్కినవారి కెవ్వరికిని గూడ గోచరముగాకుండ సఫలీకృతప్రయత్నుఁ డయ్యెను. సందర్భము లెఱింగిన ప్రభావతి గూడఁ బ్రద్యుమ్నుఁడు వజ్రనాభుని సంబోధించు సందిగ్ధవాక్యముల యితరార్థమును గైకొని డోలాందోళితహృదయయై ప్రాణము లఱచేతిలోఁ బెట్టుకొని శుచిముఖి యభయవాక్యమునఁ గాని తెప్పిఱిల్లలేకపోయెను. ఎంతటి సాహసకార్యము?

ఈతనిగ్రంథముల ముందువచ్చెడియూహ లెవ్వియో యాతఁడు చెప్పినఁ దెలియవలయునేగాని యిది యిట్టిదని యూహింప మఱియెవ్వరికిని శక్యముగాదు. ఎంత ప్రగల్బులైన కవులైనను దక్కినవారియూహ లింతనిగూఢములు కావు. వారు ముందు వేయఁబోవు ఎత్తులు కొంచెము దరిదాపుగఁ జదువకుండ నూహించి చెప్పవచ్చును. ఈతని వట్లు కావు.

వంచకవేషములు వసుచరిత్ర, మనుచరిత్ర, ప్రభావతీప్రద్యుమ్నము ఈమూఁడిటను గూడ నున్నవి. మొదటిదానియందలి మోసము ఎంత కప్పిపెట్టినను దాగినదియె కాదు. రెండవగ్రంథమునం దొక్కసందర్భమున గ్రంథకర్త యెదుటివారికన్నులు చేతితో మూయవలసివచ్చినది.

ఈకావ్యమునం దన్ననో? అందఱును గన్నులు తెఱచికొనియే యున్నవారు. బహిరంగముగ మాటాడుచున్నవారు. హృదయభావములు వెల్లడియగుచున్నవి. అన్యులెవ్వరికిని దెలియుట లేదు. గోచరమయిన నగుటలేదు. పట్టువడుటకు మార్గమును లేదు. ప్రతిసృష్టి యన నిట్లుండవలదా? షేక్స్పియరు (Twelfth Night) ద్వాదశయామినియం దిట్లే ఆడుదానికి మగవేషము వేసి భ్రాంతిఁ గొల్పినాఁడు. అదియు నిట్లే యెంతకొట్టుకొనిన నెవ్వరికిని బట్టుపడినది కాదు, కాని దానికిని దీనికిని గూడఁ గొంతవ్యత్యాస మున్నది. ఇది కేవలనటవేషము. అందలి దట్టిది కాదు. మోహసందేశమునకై విశ్వాసపాత్రుఁ డొక్కఁడు వార్తాహారిగఁ బనుపఁబడినవాఁడు. అచ్చట ననుమానించుటకైన నవకాశము లేదు. ఈగ్రంథమునం దట్టియవకాశము లేకపోలేదు. ఆయవకాశము చిక్కకుండుటకు వ్యూహతంత్రములందు బుద్ధి పోకుండుటయే కారణము. దీనికిఁ గలుగునడ్డంకు లన్నియును మొదటనే తొలఁగించి తా నేర్పఱచినమఱుఁగు విడిపోకుండఁ జేసినాఁడు. భ్రాంతియుతులం జేయుటయం దిట్టినే ర్పుండవలదా?

కార్యము సమకూర్చినాఁడు. ఎట్లు? దొంగను కన్నమునఁ బంపి గుమ్మమున రప్పించినాఁడు. ప్రద్యుమ్నుని పోయిన మార్గముననే రప్పింపక వేఱొండుత్రోవ నేల రప్పించె? కార్యసాధన మామార్గమునఁ గాని కాదు గనుక నట్లు చేసె నందురా? కార్యసాధనమున కది యుపాయమె కావచ్చుంగాని, ప్రద్యుమ్ను డట్లు చేయకున్న అతని యుదారభావములకును, అతని సాహసగాంభీర్యములకును, ఎంతటిలోటు వచ్చునో యది పరికించి చూచి నారా? రాకపోకలకుఁ ద్రవ్వించుకొనినసొరంగము లట్లె యుండిన నుండనిండు. యుద్ధము తటస్థమైనప్పుడు పరాఙ్ముఖుఁడై పెడదారిం బోవుట వీరునకు లక్షణమా? ఈతఁ డెట్టివీరుఁడు? పిఱికికండ లేని బిరుదుమగఁడు. అట్టివాఁ డెంతటిప్రతివీరుఁ డడ్డము వచ్చినను జావనైనఁ జచ్చుం గాని వెన్నిచ్చి పఱచునా?

కవి యీతనివిక్రమము నిట్లు వర్ణించినాఁడు.—

చ.

భిదురధరుండు చక్రియును బెట్టుగ దీర్ఘవిచార మింత చే
యుదురఁట దైత్యుఁ డెంత బలియుండొ కదాయను కోచదారికి
ట్లుదుటున వానిఁ ద్రుంతు ననునొక్కని బంపిన నంటి చాలదే
యిది నెఱవైనబంటుతన మిట్టిది నీకె దగుం గుమారకా.


ఉ.

కయ్యపువేడ్క నేచుకొని క్రమ్మెడు త మ్మెదిరించి యేమియున్
డయ్యక కొంతసేపు పెనుఢాకను జేతులకాఁటినిల్చువాఁ
డెయ్యెడఁ బోటుబంటునకు నెంతయుఁ గౌతుకకారి గాఁడె నీ
నయ్య సురేంద్రుతోడి యని కాస యొనర్చుట యుక్త మెన్నఁగన్.


ఆ.

తమకుఁదామె పల్లడంబునఁ బనిలేని, కయ్యమునకుఁ జనరు గాని తగిన
దురములైన దివురుదురు తమయంతన, పిరికికండలేని బిరుదుమగలు.

అట్టిప్రద్యుమ్నుడు కన్నమున పోయినాఁడని చెప్పుటకన్న విరసమగువాక్య మొక్కటియుండునా? ప్రభావతి పతి-భక్తికిని, పితృభక్తికిని నిదానమయిన సచ్చరిత్ర. అట్టియాపె ఉభయులకును గయ్యము లేకుండఁ బోయెడు తెన్నునకయి యెంతయో యత్నించి కానక, మూలనున్న ఖడ్గమును దానె కొనితెచ్చి యిచ్చినది. ఈక్రిందిపద్యముం జూడుఁడు.

చ.

అని తనుఁ గూర్చి దానవకులాగ్రణిపైఁ దెగ లేని చింత సే
యు నధిపుఁ గోటలగ్గలకు నుగ్రత డగ్గఱు భూరిసైన్యుఁ దం
డ్రినిఁ బరికించి యింతి విభునిం దము గాచికొనంగ నేఱత్రో
వ నెమకి కాన కంతఁ బితృవత్సలభాపముఁ బాఱనూకుచున్.

ఈపైమార్గముగాక ఆవీరున కనురూపంబయిన మార్గము మఱియొక్కటి యెవ్వరైనఁ జూపుదురా?

ప్రద్యుమ్నునియంతఃపురప్రవేశము కేవలమును స్వభావవిరుద్ధముగ నున్న దేమి? ఇంక గత్యంతరము లేక సూరనార్యుఁ డట్లు వ్రాసినందురా? గత్యంతరము లేకపోలేదని చెప్పుటకు గదసాంబుల ప్రవేశము నిదర్శనము లేదా? అచ్చటఁ గలిగినమార్గ మిచ్చట యేల లేకపోయినది? “గదసాంబులప్రవేశము ప్రద్యుమ్నప్రవేశానంతరము. ప్రద్యుమ్ను నంతటి సమర్థుఁడు అంతఃపురమునం దున్నాడు గనుక నట్టిమార్గము పొసంగెను. లేకున్న రహస్యభంగ మయిపోవు” నని చెప్పుదురు కాఁబోలు? రహస్యభంగ మగుటకుఁ బూర్వమునకును బరమునకును భేదము లేదు. అట్టిరహస్యములు నిగూఢములుగా నుంచుటకు అంతఃపురపరిచారికల సహకారము లేకుండ నిట్టికార్యము లెప్పుడును బొసంగనే పొసంగవు.

చ.

అరయఁగఁ దల్లి కక్క చెలియండ్రకుఁ దక్కును గల్గినట్టిచు
ట్టరికమువారికి న్నెరయ డాచురహస్యము లీనిజాంతర
స్మరవికృతిప్రవర్తనల మాటలు వీని వినంగ నాప్తలై
పరగెడు నెచ్చెలుల్ చెలికిఁ బ్రాణము లిచ్చిన నప్పు దీరునే.

అనుపద్యమునుబట్టి, రాగవల్లరి మున్నుగాఁగల యంతఃపురపరిచారికల కందఱకును ఈసమాచారము మొదటినుండి యును దెలిసినవిషయమె యనునది పాఠకులకందఱకును గ్రాహ్యమే. అందువలన రహస్యపరిరక్షణ కేలోటును గలుగలేదు. ఇంక స్వభావవిరుద్ధప్రవేశ మేల యందురా? ఆకాలపుఁగవులకును బాఠకులకును స్వభావవిరుద్ధకార్యములయినను అద్భుతరసాపూర్ణము లయినంగాని సంతోషదాయకంబులు గాకుండెడివి. షేక్స్పియరువంటి మహాకవిగూడ నీస్వభావవిరుద్ధకార్యములఁ దననాటకపాత్ర కలవరించి యున్నాఁడు. ప్రద్యుమ్నుఁడు మాయావి. 'నహి మాయాయా మసంభావ్య మస్తి' యను నుక్తి నొసంగి అతనికి మాయానటనలయందుఁ గలసామర్థ్యమును గనఁబఱిచినాఁడు. అట్టియద్భుతము లాకాలపువారలకు వింతగాఁ గనఁబడునవిగావు. అంతియెగాని యిట్టియద్భుతకల్పనల నలవరించిన సూరనార్యున కీమాత్రపుమార్గాంతరము దొరకినది గాదనుట కేవల మసంగతము.

ప్రభావతీ ప్రద్యుమ్నుల విరహావస్థలు వర్ణించుపట్టున మఱియొకవైచిత్ర్యము గనందగు. ప్రభావతీవిరహవేదనకుఁ గారణము కనుకలి. ప్రద్యుమ్నునకు వినుకలి. ప్రభావతికిఁ జిత్రపటమును జూచుటతోడనే కుతూహలము ప్రారంభమయి అయ్యది క్రమక్రమముగ విరహవేదనగ మాఱి ప్రాణాపాయమునుగూడ దెచ్చునంతటిది యైనది. ప్రద్యుమ్నునకుఁ గూడ నంతిమావస్థ యిట్టిదియెగాని ప్రథమావస్థయం దిరువురస్థితికి నెంతయో వ్యత్యాసమున్నది. ఈవ్యత్యాసమునకుఁ గారణ మేమియో యూహింపవలసియున్నది. ప్రభావతికి ప్రథమావస్థయందే ధైర్యసంచలనము. ప్రద్యుమ్నునకు శుచిముఖివర్ణన పూర్ణమయి యాసందేశహారి పోయినవెనుకఁగాని అట్టిది సం ప్రాప్తమైనది గాదు. దీనికిఁ గారణములు రెండు. శ్రవణసాహాయ్యమునకన్న, ఈక్షణసాహాయ్యమున, వస్తుగుణాగుణములు శీఘ్రతరద్యోతకములు. అందువలనఁ బ్రభావతికి శీఘ్రముగ మనస్సు చలించుటకును, ప్రద్యుమ్నున కట్టిది కలుగకుండుటకునుఁ గారణమైనది. అదిగాక ప్రద్యుమ్నుడు ధృతిమంతుఁడు. ధృతిమంతునకును వీరునకును ధైర్య మొకపట్టునఁ జదరరాదు. వీరుల మనస్థైర్యము లొకపట్టునఁ జెడక నిలుచునట్టివి గనుకనె వా రేకార్యమునందును నిశ్చలులై నిల్చుటయును, అయ్యది పూర్ణము గావించుకొనినంగాని అందుండి మనస్సును గదలి రానీయకుండుటయును, గాంచుచున్నారము. ఏవీరునైననుం జూడుఁడు. ఇట్టి ధృతిరాహిత్య మెచ్చటనైన నున్న దేమో? ఇది రెండవకారణము. ఒకసారి యీతఁడు వినినసంగతులన్నియును మనస్సున కెక్కినవి. మననము ప్రారంభమైనది. ప్రస్ఫుటమైన యనురాగ మంకురించినది. అప్పటినుండి ప్రభావతికివలెనే అతనికి సివమెత్తినది. ఉభయులకును దృఢమోహము మనస్సున నిలిచి యింక మృత్యువే శరణ్యముగా నుభయులు నెన్నుకొనినపిమ్మట వారి యుభయులకును మైత్రి సంఘటిల్లినది. స్త్రీలధైర్యము పురుషులధైర్యమునకన్న నధికమయినది. సఖీజనస్వభావం బెంతటిమన్మథబాధాసమాధీనం బైనను గర్తృపక్షావలంబి గాదు. అట్టిపక్షం బెల్లవేళల పురుషస్వభావంబు ననుసరించియుండు. అట్టిచో నియ్యెడ విరుద్ధధర్మాచరణము గానంబడినది. దాని కేమి కారణము? 'భావన చేసి చూడ క్షణభంగుర మింతులతాల్మికల్మి వా, తావిలపల్లవాంచలహిమాంబుకణంబును నంతకంటె మేలు' అని కవియే దానిని వ్యక్తీకరించి యున్నాడు. ఒకసారి స్త్రీలమనంబు నందలిధృతి తగ్గzనా, అందువలన నెంతటి విపరీతములైన నుత్పన్నము లగు. వారియెడ సాహసము హెచ్చు.

ఇంకొక్కటిఁ గూడఁ బరిశీలించి చూడవలయు. ప్రద్యుమ్నునిఁగూర్చి ప్రభావతికిఁ జెప్పెడుపట్టున, నామె నూరించి యూరించి చెప్పుటకును, ప్రశ్న వేయుటయేతడవుగఁ బ్రద్యుమ్నునికడ కథయంతయును నేకరువు పెట్టుటకును, కారణమును తెలిసికొనవలయును. స్త్రీలకు స్వభావముచేతఁ జాపల్యము హెచ్చు. చాపల్యమువలనఁ గలిగిన యేభావముగాని స్థిరముగ నిల్చియుండదు. అందువలన మనస్సును గట్టిగఁ బట్టిచూచిననే గాని, అది యెంతవఱకు స్థైర్యముగనుండునో యెఱుకపడదు.

ఎవనికిఁగాని, విశ్వప్రయత్నముమీఁద లభ్యమైన పదార్థమునం దున్నంతప్రీతి, అప్రయత్నలబ్ధపదార్థముమీఁద నుండదు. ఏపదార్ధముగాని మనకు దూరమునం దున్నది యని యనుకొనినంతవఱకు దానియందు మన కభిరుచి హెచ్చుగా నుండును. మననము హెచ్చయి దానియందె తదేకధ్యానము కలిగినచో అయ్యది హృదయస్థమయి యూడఁబెఱుకనలయునన్నను నూడిరానంతటి మనోనిశ్చలత యేర్పడును. అట్టిపరీక్ష చపలచిత్తలగు స్త్రీలయం దెక్కుడుగ నావశ్యకము.

ఇది మోహపరీక్షకే యుద్దేశింపఁబడినట్టు కవియే యీక్రిందిపద్యముల వ్రాసినాఁడు—

చ.

అది తలపోసి కుందఁదగు నా యదునందనునందు నున్న నా
మదితెఱఁగున్ జగజ్జననిమాటలు జెప్పఁగ వించు శంక చే
సెదు పురుషాంతరానుమతి చేకుఱునో యని నీకు నింక నా
హృదయములోఁతుఁ గానఁబడదే నెఱిఁగింతుఁ బ్రతిజ్ఞ యొం డిఁకన్.

చ.

మదితమిఁ జూడఁ గొన్ని వెడమాటలు పల్కితి.....

ప్రద్యుమ్నుఁడు రాజకుమారుఁడు పురుషుఁడు వ్యవహారజ్ఞుఁడు. అట్టియాతఁడు చప్పున తనమనస్సు బైటఁబెట్టువాఁడు కాఁడు. కార్య మనుసంధానము గావలయు. తాను వార్తాహరణకృత్యము పూనియున్నది. ఆకృత్యము నెఱవేఱుట 'కెప్పటి కెయ్యది ప్రస్తుతమో అప్పటి కామాట' లాడవలయు. శుచిముఖికడనున్న కార్యసంధానవిధానతత్పరతయు, నెదుటిహృదయమర్మము లెఱుంగునేర్పును, మఱియొకరికడ లేవు. అందువలన శుచిముఖి తనకార్యము నిర్వహించుకొనుటకై తానే అప్రస్తుతప్రసంగము గాకుండఁ జక్కగ సమయము గనిపెట్టి ఆమె రూపలావణ్యాదుల నభివర్ణించి యాతనిమనస్సున కెక్కించినది. అతనిమనంబు బయటఁ బెట్టుకొనకుండుటకుఁ గారణములు రెండు. మొదటిది శుచిముఖిపేరఁ బనిచినయుత్తరంబున నిట్లు వచియింపంబడియున్నది.

సీ.

ప్రప్రభాభావతిఁ బలుదెఱంగుల నీవు, వచియింప నపుడు నిర్వచనవృత్తి
నేనున్కి కల్లగుట్టి౦తియెకాని..........

రెండవది యాతనిస్వగతవాక్యంబున నిట్లు జెప్పుకొని దలపోసినాఁడు.

చ.

ఇది పదిలంబుగా నడుగ కే నపు డక్కట! కోర్కి దాఁచి వ
ట్టిదొరతనంపునీటు ప్రకటించితిఁ బాపపులజ్జ నన్ను నో
రదిమె ననాదరంబుతెఱగై యది హంసికిఁ దోఁచెనేమొ ని
ల్వద మఱి యించుకైన గఱువ ల్చవిగానికథ ల్వచింతురే.

ప్రద్యుమ్నునకు ఆతనిమాయానటసలమూలమునఁగాని వజ్రనగరప్రవేశముఁ గలుగదు. ఆతఁడు వృత్తిచేత వేషధారి గాఁడు. పుట్టుకచే రాజకుమారుఁడు. అట్టియతఁడు లోటు పాటు లేవియు లేకుండఁ బ్రేక్షకులకుఁ దనయాంతర్యోద్దేశము లేవియును నెఱుకపడనీయకుండ, కేవల మదియే వృత్తిగాఁగలనటుఁడు ప్రవర్తించినటుల ప్రవర్తించి విజయము నందినాఁడు. ఇయ్యది కేవలమును గథాకార్యనిర్వహణమునకే కల్పింపఁబడియెనో సూరనార్యుని ప్రద్యుమ్నుఁడే ఇట్టివాఁడో మన మారసి చూడవలయు. ప్రద్యుమ్నపాత్రప్రవేశము మన కెట్లు జరిగినది? అశ్వము నెక్కి కందుకక్రీడ సేయుతఱి ఆతఁడు మనకు రంగమునఁ బ్రప్రథమమున నగపడినాఁడు. ఆక్రీడావిశేషసమయమునఁ గవి యాతని వర్ణించినవర్ణనను బట్టి యాతని కెట్టిశరీరలాఘవ మున్నదో ఆయావిద్యలయం దతని కెంత నేర్పు గలదో యెఱుకపడుట లేదా? ఆతనియుత్తరప్రవర్తన కీపూర్వరంగప్రవర్తన మంతయును సమంజసముగ లేదా? అదియునుంగాక శ్రీకృష్ణుఁడు ప్రద్యుమ్నుని వర్ణించుపట్టున

చ.

బలవిభవాభిశోభితుఁ డభంగురశౌర్యధురంధరుండు కా
వలసిన మాయలు న్దివిజవైరులకంటెఁ గరంబు నేర్చు.......

అని చెప్పియున్నాడు. ముందు తనపాత్రమున కెట్టిప్రవర్తన మలవరింప నెంచెనో యందునకుఁ దగిన యుపపత్తి ముందుగనే గల్పించి మొదటినుండి చివరవఱకు నాతనిప్రవర్తన మంతయును సరసముగ నిలిపికొని వచ్చినాఁడు. మొదట శుచిముఖి యాతని సందర్శించినతఱి నెంతయో గుట్టుగ నుండి తనమనం బేమియు నెఱుకపడనీయక అందునుగూర్చి యొక్కమాటయయిన నాడుటగాని యేదయిన నడుమ నొకపృచ్ఛ సేయుటగాని లేకుండనుండి యెంతయో బెట్టుగనున్న యాతఁడు, రెండవసారి శుచిముఖి యాతని సందర్శించినపట్టున మొదటిదృతియంతయును సడలవిడిచినాఁడు. ముఖవైఖరినిఁ బట్టియు మాటలధోరణినిఁ బట్టియు మనుజులహృదయమును గనిపెట్టఁగలిగిన శుచిముఖి యాతనియాంతర్యమును గ్రహించి యింక ముందటివ్యాపారమున మునుపటివలె నాతనికి ఆనుపానులఁ జెప్పక యావిషయమున ముభావముగ నుండెను. అంతఁ బ్రద్యుమ్నుఁడు వజ్రపురప్రవేశమునకు మార్గ మరయఁ దొట్రుపడుచు అది నీవే చెప్పి పుణ్యముఁ గట్టుకొనుమని శుచిముఖిని బ్రతిమాలుకొనియెను. ఈరెండుపట్టులను వినియోగపడిన కవియొక్క మేధావిశేషమును గాంచితిమేని, ఆతఁడు పాత్రములస్వభావగుణపోషణమునం దెంత సమర్థుఁడో యెఱుకపడక మానదు. ఆంతరంగికమర్మముల వర్ణించుపట్టున తనకున్న నే ర్పనుపమానము, ఈతఁ డెంతసేపు వర్ణించినను హృదయభావములును అందు నిమిషనిమిషమునకును గలుగుచుండుమార్పులును తత్సంకీర్ణభావములును దారతమ్యభేదములతో నీషత్తైనను వెలిపోకుండ నిలుపుకొనివచ్చుచు నం దత్యంతకుతూహలుండై మెలంగు.

ప్రద్యుమ్నుఁడు శుచిముఖికి వ్రాసిన యుత్తరములోని యీక్రిందిభాగమును బట్టి అతఁడు ప్రభావతీరూపము నెట్లు మనంబున నిలుపఁగలిగెనో అయ్యది యేగతి నాతనిమనంబున కెక్కెనో తెలియఁగలదు.

"అయింతియంగము లెవ్వి యెట్లు చెప్పి, తవియెల్ల నట్లు నాయాత్మఁ దద్దయుఁబడి యచ్చున సద్దిన ట్లమర నంటి, మలిచినగతిని మిక్కిలి దృఢత్వముఁ జెంది స్వగుణసంపద్గౌరవమున నేమొ, యూఁది బడలించుచున్నవి యో మరాళి."

అను నీపైవాక్యమును నీక్రిందిపద్యములను
శా.

ప్రద్యుమ్నుండు ప్రభావతీరుచిరురూపబ్రహ్మమున్ హంసయో
షిద్యాథార్థ్యధురీణవాగుపనిషత్సిద్ధాంతమార్గానుసా
రోద్యతజ్ఞను బల్మఱున్ మనససంయుక్తంబు గావించుచున్
హృద్యంబై యది యంతకంత కలరన్ నిల్పెం గడుం జిత్తమున్.

  • * * *
ఉ.

ఉద్యదపేక్షపక్షివనితోక్తులవెంబడిఁ జంచరీకచం
ద్రోద్యుపమానశోభకు సహస్రగుణంబుగ హెచ్చఁ గేశప
ద్యభిలాంగలక్ష్మి మది కందినయంతయునున్ నయించి యా
హృద్యతరాంగిమూర్తిసొబ గెల్ల నొకింతగఁ జూచు నాత్మలోన్.


చ.

మది గొనినంతమేరయును మాన కతం డుపమానకోటియొ
ప్పిద మఖిలంబు నిట్లు గడుఁ బెక్కుమడుంగులుగాఁ దలంచి త
త్తదవయవత్వసుస్థితికిఁ దార్పఁగ నమ్మదిరాక్షిరూప మె
య్యది యదియే కనంబడియె నచ్చపుబుద్ధికి లే వగమ్యముల్.

తత్పూర్వగాథయును సమన్వయించి చూచితిమేని మన మెన్నఁడును కని యెఱుంగనివస్తువు నెట్లు శ్రవణమూలమున మనస్సునకుఁ దెచ్చుకొని తద్రూపమును జూడ సమర్థుల మగుదుమో అయ్యది దృష్టాంతపూర్వకముగ నీకథపట్టున మనకుఁ జూపినాఁడు. ఇందు శ్రవణ మనన నిదిధ్యాస ధ్యాన ధారణ సమాధుల నన్నిటిని వివరించియున్నాడు.

ఈకవి ప్రపంచమునందలి మనఃప్రకృతులను అందలివ్యత్యాసములను ఎంత చక్కగాఁ గనిపెట్టెనో యిం దీతఁడు వర్ణించినప్రభావతీరాగవల్లరులహృదయవర్ణనమును బట్టియును, హంసశుకములప్రవర్తననుబట్టియును గనందగు.

రాగవల్లరి మంచిప్రౌఢ. ప్రభావతిమనంబు తనరహస్యంబులను దాఁచఁగలిగినది గాదు. శుచిముఖితోడ ప్రథమప్రసంగమున వారిరువురును ముచ్చటించిన ముచ్చటలనుబట్టి వారిరువురి ప్రౌఢతాప్రౌఢత లెట్టివో తెలిసికొనవచ్చును. వారి కదియె ప్రథమపరిచయము. శుచిముఖకిఁ జెప్పిన దెల్ల వారిద్దఱకును గలగిన వివాదాంశమునుగూర్చి యొక్కింత యీగడ. ఆయీగడ చెప్పినంతమాత్రమున నుబ్బిపోయి—
శా.

ఏమేమి యిఁక నొక్కమాటు చెపుమా యీ వున్నరూ పిట్లయో
యేమైనం గలదో విభేద మిటర మ్మీక్షింపు మింకన్ వచ
స్సామర్థ్యం బరయన్ మహాత్మ వని యస్మదుృద్ధికిం దోఁచె దా
హా మాభావముఁ గానలేవె మదిలో హంసీ భయం బేటికిన్.

అని దాని యానుపాను లరయకుండఁ దనహృదయమును జాఱవిడచెను. శుచిముఖనటనలఁ జూచి యామెను మహాత్మగాఁ దలఁచెను. రాగవల్లరి రాజపుత్రిక బేలవడుచున్నది యని కనిపెట్టి యది మఱుఁగుపడఁజేయఁ బ్రసంగమునకు దింపి, అయ్యది పన్నిదంబునకై యడిగిన ప్రశ్న మని మాటువఱుపఁ బ్రయత్నించెను.

వనవిహారము సేయుచు సహజముగ మృదుమధురంబులుగఁ బలుకుకోయిలపలుకులు తనప్రాణసఖికి విరహవేదనఁ గలిగించుచున్నవని యెంచి, కేవలనిర్దాక్షిణ్యచిత్తంబున నురు లొడ్డి పక్షుల బాధింపఁ జూచిన రాగవల్లరిహృదయమునకును, జిలుక యీయురులలోఁ జిక్కుటయె తడవుగ సంభ్రమంబున దిగ్గున లేచి దయాకులంబగు మనోవృత్తిని ఆపిట్ట కేమియు నపాయము రాకుండ నదల్చిన ప్రభావతీహృదయమునకును, దయాళుత్వమున నెంతయంతర మున్నదో వ్యక్త మగుచునె యున్నది; కాని యయ్యది వారివారియంతరభేదముల కనురూపం బగుచునేయున్నది. ప్రభావతి నాయిక. కరుణార్ద్రహృదయ. చెలులకృత్యము తమప్రభుకుమారికల మనస్సునకు వచ్చునటుల భక్తిపూర్వకంబుగఁ బరిచర్య చేయుటయె. అదియె వారివిధ్యుక్తధర్మము. ఏలినవారు నియోగించినపనులు వారి కుపకారకములుగఁ జేయుటయెగాని అందలిమంచిచెడ్డలను విచారించుటకు భృత్యుల కవకాశము లేదు.

చిలుక మొదటినుండియును జంద్రవతీగుణవతులయొద్ద నుండు వినోదపు నెచ్చెలి. వారిమన్మథవేదనఁ జూచి సహింపలేక ద్వారకాపట్టణమునకు వారిప్రియుల నరసి రాయబారము నడపుటకై బయలుదేఱినది. దారినే పోయి దారినే వచ్చు స్వభాసము గలది. కంటిలోనుండి ముక్కులోనికిని, ముక్కులోనుండి కంటిలోనికిని వచ్చెడు త్రాణ దానియొద్ద లేదు. కారుణ్యపరవశత్వమున వజ్రనాభునివార్తాహరణకార్యంబుఁ గైకొని యెన్నియోపాట్లకు లోనయి తుదకుఁ బ్రాణాపాయంబు రా నేలినవారి రహస్యములన్నియును వెలిపఱుపవలసిన దయ్యెను. దైవనియుక్తిచే శుచిముఖ వారి కనుకూలించుదూతిక యైనది కాని లేకున్న వారిపని యధోగతి పాలు కావలసినదియే గద! చేతకానివారలు తమయాయమునకు మించిన పనులను జేకొనిన నిట్లేయుండును. శుచిముఖికిని దీనికినిఁ గల వ్యత్యాస మిందున జూడందగు. ఈచిలుక తనసామర్థ్యం బింతమాత్రంబ యని తాను పూర్ణముగ నెఱుంగు. ఆనుపాను లరయవలయు ననుకుతూహలముగాని శక్తిగాని దానియొద్ద లేదు. దీని దయార్ద్రహృదయము ప్రద్యుమ్నుని ప్రార్థనావచనంబునకు లోనయి వార్తాహరణకార్యంబున కాతనిపని యెఱుంగకుండనే గడంగుటలో విదితమగు.

గీ.

“నవనిధానములను దవిలి యిచ్చిననైన
మెడలమీఁదఁ గత్తి యిడిననైన
జాల రనఘచరితు లేలినవారిర
హస్యభంగమునకు ననుమతింప.”

అను నీవాక్యమునందు దానిస్వామిభక్తి వెల్లడి యగుచున్నది.

ఇంక నీకథాపా త్రముల కన్నిటికిని నాయకమణి యైన శుచిముఖిపాత్ర మెంతచక్కగ వర్ణింపఁబడియెనో దాని నొక్కింత చవిఁ జూతము. సందర్భానుసారముగ నీపాత్రమును గూర్చి యచ్చటచ్చట నొకింత ముచ్చటింపఁబడియెను. ఈపాత్రముయొక్క గుణాగుణములను విమర్శించితిమేని కవియొక్క అపారశాస్త్రసాంగత్యము, పాండితీవిలసనము, రాజకీయకార్యధౌరంధర్యము, సమయోచితసంభాషణావిశేషము, కార్యసంధానవిధానతత్పరత, స్వామిభక్తి, వినయవిధేయత మున్నగుసల్లక్షణములెల్ల వెల్లడియగును. ఇంద్రోపేంద్రులకడ శత్రువిజయమునకు వ్యూహతంత్రనిర్మాణము, ప్రభావతీరాగవల్లరులకడ విస్రంభసంభాషణము, వజ్రనాభునిచెంగట శాస్త్రప్రశంస, ప్రద్యుమ్నునికడ ఆత్మకార్యసంధానసదుపాయము, చిలుకను బట్టి తెచ్చుసమయమున దేశమున నెక్కడ నేమూల నేది జరుగుచున్నదియో వానియానుపానులు నెఱుఁగవలె ననునిచ్ఛ, ఎల్లపట్టుల ఎక్కడ నెంతయెంత యుచితమో యంతమాత్రమె దానిని బయలుపుచ్చుచుండుట, సర్వము నాకళించి యుండుట, విదితం బగుచుండు. ఈపాత్రమునందు సంస్తుతిపాత్ర మైనవిషయములు కవి యీక్రిందిపద్యమున నొప్పించియున్నవాఁడు.

చ.

శుచిముఖి యండ్రు, దానిని వచోనిపుణత్వమునందు సత్కథా
రచనలయందు నీతివిధురత్వమునందు బహుశ్రవావలో
కచణతయందు నెందు సరిగానము దానికి వేయు నేల దా
నిచతురతావిశేషములు నీవె కన న్వలయు న్మహాత్మకా.

ఇందలి ప్రతివిషయమునకును గ్రంథమునుండి పెక్కుదృష్టాంతములం జూపవచ్చు. ఇంత “కతరాజు” మఱియెక్కడను గనుపడఁబోఁడు. మంత్రి కుండవలసిన లక్షణములన్నియు నీశుచిముఖికడ నున్నవి. ఈపేరు నుడివినచోట మహామంత్రుల మనువారినామము నైన నుచ్చరింప ననువుగాదు. బృహస్పతివంటివానికి స్ఫురింపనివిజయోపాయములు దీనికి స్ఫురించినవి. ఇంద్రోపేంద్రులు విజయసాధనమున కీమార్గ ముపచరించునని మాటమాత్రము చెప్పిరిగాని అవి జరుగునుపాయములన్నియును మనశుచిముఖి తన మేధావిశేషమున నూహించి కార్యము నిర్వహించినది. దీనికిఁ గల సమయస్ఫురణకు మితి లేదు. కొన్నిచోట్ల వచనవక్రత. కొన్నియెడల మర్మరహిత మగుసంభాషణము. కొన్నిపట్టుల గంభీరభావములు. కొన్నిచోట్ల సూచ్యార్థసూచనలు, కొన్నిస్థలముల విరళీకృతవర్ణనావిశేషములు, కొన్నిసందర్భముల మూకీభావము. ఇన్ని చతురతావిశేషములు గల్గి యెక్కడ నెట్లు నటింపవలెనో అట్లు నటించి సకలకార్యములను సాధించి దిట్టతనంబున మెలంగినది. సరసత్వమున ప్రౌఢ “సకలకళలసడిసన్నలచదురులప్రోది బెఱిఁగినది.” ఎంతటివారినైన నిమిషములో వశము చేసికొన నేర్పుఁ గలది. మాటలలో శుచిముఖిని గెలువ నెట్టివారికిని నశక్యము. "చెప్పి వేఁడికొనక నేపనికిని నియ్యకొనునది కాదు” ఎవరెంత తనతోడ మనసిచ్చి మాటాడుదురో తాను వారితో సంతమాత్రమే ప్రతిభాషణ మాడు ప్రౌఢ. దీని కెఱుంగరానిసఖిధర్మంబు లేదు. అఖిలవిద్యలు దీనికిఁ గరతలామలకములు. దీనిమనస్సున కేకార్యమును అసాధ్యమని తట్టనైనఁ దట్టదు. చిలుకను బట్టి తేఁగలవా యని ప్రభావతి యడిగిన "అయ్యది చిక్కువడ కొంతదవ్వు పాఱెడు కూడఁజని పట్టి తెత్తు" నని ప్రతివచనం బిచ్చి నోట నున్నమాట నోట నుండఁగనే దాని వెన్నంటి చనియెను. సమర్థులగువారి కసాధ్యమగు కార్యము లుండవు. వీరాధివీరు లన నట్టివారలే కదా? ఐరోపాఖండమునంతను గడగడలాడించి రావణాసురునివలె దేశమెల్ల నొకకడకుఁ దెచ్చిన "నెపోలియన్ బోనపార్టు" నిఘంటువునుండి అసాధ్య మనుశబ్దమును దీసివేయమనలేదా? మనవేదాంతశాస్త్రజ్ఞులును దీనినే యుద్ఘాటించెదరు. "భావనయె ప్రధానం బెట్టిపట్ల నరయ” నని దానినే కవియు ననువదించియున్నాఁడు.

శుచిముఖి యెదుటివారి రహస్యములన్నియుఁ జేతఁబట్టి తనకార్యము సాధించుకొని తనమర్మము మాత్ర మెదుటివారికిఁ దెలియకుండఁ గాపాడి కడుసౌమ్యభావమునఁ బ్రవర్తించిన దిట్ట. రాజ్యతంత్రజ్ఞులు తమ కెవ్వరితోడ నేమిపని యెంతవఱకున్నదో దానిని మించి మఱియొక్కమాటైన మాటాడఁజాలరు. శుచిముఖ తనదౌత్యవిషయకమగు రహస్యకృత్యమును బ్రభావతి కెన్నఁడును తెలిపియెఱుంగదు. ఎవ్వరితోడ నెప్పు డేవిధమున సంభాషింపవలెనో అయ్యది యీహంస యెఱింగినట్లు మఱియెవ్వరు నెఱుంగరు. ప్రద్యుమ్నునికడ వినయవిధేయతాపూర్వకముగ, ప్రభావతీరాగవల్లరులతో వక్రభాషణముల, చిలుకను బట్టి రహస్యములఁ జెప్పించునపుడు బెదరింపుమాటల, వజ్రనాభునితో సరసగోష్ఠి సలుపునెడ "నిట్టటు గ్రుక్కక పని లేనిపునఃపదము లీడక" శాస్త్రప్రసంగంబున మృదుమధురఫణితిని, ఇంద్రునియొద్ద సంభాషించునపుడు భృత్యధర్మంబున కనురూపంబుగ మఱియు బహుప్రకారంబుల సమయోచితంబుగఁ బ్రవర్తించె. ఈపాత్రము నెంత తఱిచి చూచిన నంత యెక్కువవిశేషములు బయటఁబడుచుండును. పైకిఁ గానఁబడు విశేషము లొకటిరెండుమాత్ర మిందు విశదముగ వ్రాసితిని.

ఈగ్రంథప్రాశస్త్యము తఱచినకొలఁది బుద్ధిచాకచక్యమునుబట్టి 'నీటికొలఁది తామర సుమ్మి' అను నాతని వాక్యానుసారముగ బోధపడుచుండును. ఇందలి రసభావములు పూర్ణముగఁ గ్రోల నిచ్చఁగలవారి కీవిమర్శన మొక్కింతసహకారి కాఁగలదనునమ్మికతో నాతీఱిమికొలఁది నొక్కింత వ్రాసి విడిచితి. రసజ్ఞు లభిప్రాయభేదములఁ బాటింపక యిందు గలగుణమునే గ్రహింతురుగాక.

చ.

కవిత యనంగ నెవ్వనికి గాదిలిపట్టియొ యేనిపోషణన్
బ్రవిమలరూపసంపదలు భాసిలఁగల్గెనొ మేన నామెకున్
సువచనగుంభనల్ నడల సొంపులు భావరసప్రవృత్తులే
నివలనఁ గల్గె వానిని గణించెదఁ బింగళసూరనార్యునిన్.

2-8-1911
కృష్ణామండలము. తణుకు.

తల్లాప్రగడ సూర్యనారాయణరావు