తృతీయాశ్వాసము
క. |
శ్రీలలనాకౌస్తుభవన
మాలాశ్రీవత్ససురభిమన్మలయజగం
ధాలంకృతబాహాంతర
నీలాక్షిచకోరచంద్రనీలగిరీంద్రా!
| 1
|
రాజనీతి
వ. |
దేవా! రాజనీత్యాదివర్ణనంబులు విన్నవించెద నవధరింపుము.
| 2
|
పెద్దిరాజు – అలంకారము [3-131]
క. |
అగవాక్షము నస్తంభము
నగూఢభిత్త్యంతరమ్ము నహర్మ్యాగ్రమహా
నగశృంగంబులమంత్రము
దగు నొనరింపంగ ననుచుఁ దగ వర్ణింపన్.
| 3
|
మ. |
అలుకం బోరికి నెమ్మికిం గొఱలుచోఁ బ్రారంభప్రాణూప్యమున్
బలసంపత్తికి దేశకాలగతులున్ భంగప్రతీకారమున్
ఫలసంసిద్ధియు నిర్ణయించుటను నీ పంచాంగమంత్రక్రమం
బులు దర్కించు చళుక్యనాథు వెఱవొప్పున్ బూజ్యరాజ్యక్రియన్.
| 4
|
తిక్కన సోమయాజి – విజయసేనము
శా. |
ఉత్సాహప్రభుమంత్రశక్తుల నజేయుండై పరీక్షించి [1]సం
ధిత్సమగ్రుఁడు గాక వ్రిగహముచే దేశంబు కాలంబు సం
వత్సామగ్ర్యముఁ జూపి శక్యముదెసం బ్రారంభియై భూప్రజా
[2]వాత్సల్యార్ద్రమనస్కుఁడైన (పతి) శశ్వచ్ఛ్రీసమేతుం డగున్.
| 5
|
క. |
పరధన పరాంగనాజన
పరిహారము పరమధర్మపథ మందురు స
త్పురుషులు మఱవక ఱేనిన్
బరికింపుము వినకు మెపుడు పైశున్యంబుల్.
| 6
|
ఆ. |
మహిమ చెడదు స్వామ్యమాత్యసుహృత్కోశ
రాష్ట్రదుర్గబలపరాయణులకు
|
|
|
నీవు నిదియు నెఱిఁగి కావింపు సప్తాంగ
సంగ్రహంబు నీతిశాస్త్రనిపుణ!
| 7
|
[3]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [2-6]
తే. |
ధన్యతయుఁ బూర్ణతయుఁ గొల్పు దానమునకుఁ
బ్రోదియును రక్షయును జేయు భేదమునకు
దండియును వన్నెయును దెచ్చు దండమునకు
సామమున కే యుపాయంబు సమము గాదు.
| 8
|
క. |
హితు లగుదు రహితవర్గము
హితవర్గము ప్రాణమైన నీఁ జూచు హితా
హి[4]తతతిగతరూపజగ
త్త్రితయసువశ్యౌ[ష]ధములు ప్రియభాషణముల్.
| 9
|
క. |
కాకేమి తన్నుఁ దిట్టెనె
కోకిల దన కేమి ధనము కోకొమ్మనెనే
లోకము పగ యగుఁ బరుసని
వాకునఁ జుట్టమగు మధురవాక్యమువలనన్.
| 10
|
క. |
శత్రుల మిత్రులఁ జేయున్
మిత్రుల భృత్యులుగఁ జేయు [నిజగుణవృత్తిం
బాత్రులుగఁ జేయు] నందఱ
ధాత్రీపతి కన్నియెడల దానము దగదే.
| 11
|
క. |
పౌరుషము గలుగఁగానే
సారములగు భేదదానసామములు సమి
ద్భీరువున కవి ఫలింపఁగ
నేరవు షండాభిరూపనేపథ్యంబుల్.
| 12
|
క. |
ప్రోదికొనఁదగిన పుష్పఫ
లాదులు గొడ్డంట వ్రచ్చి యవనిజమునెడన్
|
|
|
రాదుగొననట్లు [?] భూప్రజ
బాధించిన నేల గలుగు పతి కరిగోరుల్.
| 13
|
తే. |
కిరణములు లేని పగలింటిసరణిఁ దరణి
వెలుఁగ నేర్చునె యుదయాస్తవేళలందుఁ
గాన విను ముగ్రతేజులకైన మూల
బలము లేకున్నఁ గడుపెంపుఁ బడయరాదు.
| 14
|
క. |
గాలపుటెర యిచ్చిగదా
వాలుగలం దిగిచికొనుట వక్రరిపుఁడు దా
నై లోఁబడునంతకు బల
శాలియు దానంబు సూపఁ జను నొక్కయెడన్.
| 15
|
క. |
[5]చొరవ తనకీని వెదురుల
నొరయించి దహించు గాడ్పు నోజన్ బొదియై
పెరిగెడు నృపులకు [6]నంత
ర్విరసము గలిగించు వెఱవు వెదకవలయున్.
| 16
|
మాదయగారి మల్లయ్య - రాజశేఖరచరిత్ర [2-20]
సీ. |
పరమండలోద్భేదపదము లాలోకించి
మంత్రరక్షణకళామహిమఁ దాల్చి
ద్వీపాంతరంబుల తెఱఁగు లాకర్ణించి
గడినున్న మన్నీల క్రమ మెఱింగి
దుర్గాధిపతుల బుద్ధులు విచారము చేసి
బలముల నప్పటప్పటికిఁ జూచి
నిజరాజధానిలోని విశేషములు గని
మంత్రిసామంతుల మతము లరసి
|
|
తే. |
పేదసాదల విన్నపం బాదరించి
వ్రతులమైనట్టి మముఁబోటి వారి నరసి
రాజ్యమేలినఁ దగుఁగాక రాజ్యవైభ
వంబు గలదని సుఖియించువాఁడు నృపుఁడె.
| 17
|
క. |
పతియు నమాత్యుఁడు దుర్గము
క్షితియును మిత్రుండు ధనము సేనయు ననఁగా
నుతి కెక్కిన సప్తాంగము
లతులితగతి రక్ష సేయనగు నరపతికిన్.
| 18
|
క. |
పొదుగొత్తి [7]పిదికి క్రేపుల
మొద లార్చుట ప్రజల నధికముగ నరిఁ గొనుటల్
కదుపులఁ బెనుచుట [8]తగునది
యదనం గొని ప్రజలఁ బ్రోచు టవనీపతికిన్.
| 19
|
సీ. |
వేఁటఁ బాండుక్షమావిభుఁడు శాపముఁ బొందె
ద్యూతసంగతి నైషధుండు నలఁగె
పానంబుచే యాదవానీక మిలఁ గూలెఁ
బరుషోక్తిఁ గౌరవప్రతతి సమసెఁ
గఠినదండమున మాగధుఁడు మేను దొఱంగె
భామినీరతి సింహబలుఁడు గెడసెఁ
దగని యీఁగిఁ ద్రిశంకుధరణిపాలసుతుండు
తలపోయరాని దుర్దశఁ జరించెఁ
|
|
తే. |
గాన వ్యసనంబు లేడును గాని వనుట
యెఱిఁగి మనమున నందుపై నించుకైనఁ
దగు లొనర్పక నిలిచెనే ధరణియెల్ల
నేలు నిష్కంటకముగ భూమీశ్వరుండు.
| 20
|
బద్దెనీతి [నీతిశాస్త్రముక్తావళి] [51]
క. |
నాయకవిరహితమును బహు
నాయకముఖ్యంబు బాలనాయకమును స్త్రీ
నాయకమునైనఁ జెడు నర
నాయకునకు నండ్రు కీర్తినారాయణుఁడా.
| 21
|
క. |
అనుజులుఁ దనుజులు గురుజను
లనుఁగులు బంధులుఁ బ్రధానులని [సిరిఁ బొ]త్తీఁ
|
|
|
జనుఁగాని యాజ్ఞఁ బొత్తీఁ
జన దధిపతికిన్ వివేకచతురాననుఁడా.
| 22
|
క. |
సకలవ్యసనికిఁ జుట్టము
నకు మంత్రికి నిష్టభృత్యునకు నజ్జకు నొ
జ్జకుఁ బోటుగాని కర్థా
ధికార మీఁ జనదు నయ[9]గతిని బద్దెనృపా!
| 23
|
చ. |
నయమునఁగాని భూమి ప్రజ నమ్మదు నమ్మినఁగాని యర్థసం
చయమును దంత్రవృద్ధియును జాలదు చాలినఁగాని శత్రులన్
బయిచని యోర్వరాదు పరపక్ష మణంగినగాని భూమి య
క్షయముగ నేలరా దనిరి [10]కావ్యచతుర్ముఖ బద్దెభూపతీ!
| 24
|
నన్నయభట్టు – సభాపర్వము [1-35]
క. |
[11]ఉపధాశుద్ధులఁ బాప
వ్యపగతబుద్ధుల వినీతి[12]వర్తుల[13]సములన్
సుపరీక్ష నియోగించితె
నిపుణుల నర్థార్జనాదినృపకార్యములన్.
| 25
|
తిక్కనసోమయాజి – ఉద్యోగపర్వము [2-37]
తే. |
ఒకటి గొని రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
[14]యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించువాఁడు వివేకధనుఁడు.
| 26
|
సీ. |
బలుగాపు వాకిళ్ళఁ బగలు రేయును నిడి
కోటఁ బాళెముఁ దగు[15]చోటఁ బెట్టి
[16]కనుపట్ల [17]నెల్లె[డ] గావలి నియమించి
నడిమిచావఁడి దగు నరుల నునిచి
నగరిచుట్టును జాలె నడిపించి క్రంతలఁ
|
|
|
దిరుగుచుఁ దగఁ దలవరుల నునిచి
[18]దినచర్యఁ బాళెముల్ దృష్టిఁబెట్టుచు [19]కేలు
దివియలు విడువక తిరుగఁజేసి
|
|
ఆ. |
దొరలు రాజులందు నరయుచు భటులందు
భేద మొదవకుండ నాదరించి
యుచిత[20]వృత్తి గావకుండిన దుర్గంబు
నేలగలఁడె భూమి నింద్రుఁడైన.
| 27
|
శా. |
నానాశాస్త్రవిశారదుండు నయనానందాంగుఁడున్ సత్కుల
స్థానశ్రేష్ఠుఁడు నిస్పృహుండు పరచిత్తజ్ఞుండు వాక్శుద్ధుఁడున్
శ్రీనిత్యుండును లోకమాన్యుఁడును నిశ్చింతుండునై యుండినన్
వానిన్ మానుగ రాజదూత యని చెప్పన్వచ్చు నుర్వీస్థలిన్.
| 28
|
సీ. |
[21]ఒనరఁగ పాలంబు నుపహారసంధియు
సంతానసంధియు [22]సంగతంబుఁ
జాల నుపన్యాససంధియుఁ [23][బ్రతికార
సంధియు సం]యోగ సంధికమును
[24]పురుషాంతరాదృష్టపురుషనామకములు
నాదిష్టకంబును నాత్మమిషము
[25]బంధురోపగ్రహసంధి పరిక్రియ
సంధియును నుచ్ఛిన్నసంధికంబు
|
|
ఆ. |
ననుపమపరదూషణాంచితస్కంధోప
నేయసంధు లనఁగ నిశ్చితముగ
షోడశప్రకారసునిశితసంధివి
ధాన మెఱుఁగవలయు [26]ధరణిపునకు.
| 29
|
క. |
అరుణుడు కిరణంబుల సం
చరణంబుల [27]వాయు వెపుడు చరియించుగతిన్
జర జనులచేత నృపతియు
నురుగతి జగమెల్ల నెఱిగియుండఁగ వలయున్.
| 30
|
బొడ్డపాటి పేరయ్య – శంకరవిజయము
ఆ. |
తనకు బలముఁ గలిగి తన[28]మంత్రిమిత్రాప్త
బలము దలకుఁ దోడుపడుట కలిగి
వైరిబలము దఱిగి వారిచుట్టము లెల్లఁ
గ్రిందువడినవేళ గెలువవచ్చు.
| 31
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [4-172]
సీ. |
శక్తిత్రయంబునఁ జతురుఁడై చతురుపా
యంబులకును సమయం బెఱింగి
పంచేంద్రియముల నిర్జించి స్వాయత్తుఁడై
షాడ్గుణ్యగరిమ ప్రశస్తిఁ గాంచి
వ్యసనంబు లేడును వర్జించి [రాజ]దో
షములు పద్నాల్గు [29]జిత్తమున నెఱిఁగి
సాక్షిమాత్రంబుగా సచివుఁ బ్రతిష్ఠించి
యాత్మ [30]యెంతయు [31]నిసుమంతయైన
|
|
తే. |
నింగితాకారచేష్టల నెఱుఁగనీక
పరుల నెవ్వరి [విశ్వసింప]క మనమున
[32]సంతతంబు శరీరరక్షాక్రమంబు
నేమరక యుండవలయు మహీవిభుండు.
| 32
|
సీ. |
పతిహితుం డతిధర్మపరుఁడు నీతిధురీణుఁ
డింగితజ్ఞుఁడు జితేంద్రియుండు
[మంత్రరక్ష]కుఁ డన్యమర్మభేది ప్రజాను
రాగి సుశ్రోత విరాగి భోగి
యుచితయత్నపరుండు [ను]త్కోచ[33]విముఖుండు
శాంతుఁ డతిప్రౌఢసత్యవాది
పరధనపరదారపరపరివారవ
ర్జితుఁడు ప్రఖ్యాతుండు శ్రీకరుండు
|
|
తే. |
బ్రాహ్మణుఁడు మంత్రి గాఁదగుఁ బరిగణింప
గుణము లిట్టివిగా సమకూఱెనేని
|
|
|
క్షత్రియుని శూద్రునిం [34]దప్ప సచివపదవి
వైశ్యు నిలుపంగఁదగదు భూవరుని కెపుడు.
| 33
|
శా. |
సారాచారవిచారు నుత్తమకులున్ సౌజన్యధన్యున్ గృపా
పారున్ శూరు వికారదూరు ననఘున్ గంభీరు ధీరు న్మహో
దారున్ భవ్యు సమస్తకార్యవిదు నాప్తప్రాప్తు సర్వేంగితా
కారజ్ఞున్ హిమ మంత్రిఁ జేసి పతి సౌఖ్యం బొందుచుండన్ దగున్.
| 34
|
క. |
కులమున బలమునఁ జలమున
నలవునఁ గార్యమున సదృశులగు వారలతో
బలిమి యుడిగి సామముగాఁ
దలకొని చేయునది నీతితత్త్వజ్ఞునకున్.
| 35
|
చ. |
అలసత బొంకు నాస్తికత యాయతచింతయు యుక్తికారితా
కలనము దీర్ఘసూత్రత వికాసము బొందమి దుర్వ్యయంబు పె
ల్లలుక నిరర్థకార్యరుచి యర్థమతచ్యుతి మంత్రహాని ప్రా
జ్ఞుల వెలి శాంతసౌమ్యకృతిశూన్యత నా నివి రాజదోషముల్.
| 36
|
శివదేవయ్య - పురుషార్థసారము
చ. |
సకలజనానురంజనము సత్యము శౌచము మంత్రగోపనం
బకృపణవృత్తి దక్షత ధనార్జనశీలము భోగ మీఁగి నా
స్తికఖలసంగవర్జనము శిష్టవిధేయత దుష్టదూషణం
బకుటిలభావ మింద్రియగుణంబులు చూడఁగ భూమిభర్తకున్.
| 37
|
సేవకనీతి
బద్దెన నీతి [నీతిశాస్త్రముక్తావళి] [54]
క. |
పతి కలిగి తానె పొలియును
[35]పతి నలిగించినను దనకె భంగము వచ్చున్
పతిమతమె కాని భటునకుఁ
బతితో నాగ్రహము చనదు బద్దెనరేంద్రా!
| 38
|
తిక్కనసోమయాజి – విరాటపర్వము [1-121]
క. |
తగఁ జొచ్చి తనకు నర్హం
బగునెడఁ గూర్చుండి రూప మవికృతవేషం
బుగ సమయ మెఱిఁగి కొలిచిన
జగతీవల్లభున కతఁడు సమ్మాన్యుఁ డగున్.
| 39
|
క. |
నగళులలోపలి మాటలు
దగునే వెలి నుగ్గడింపఁ దన కేర్పడ నొం
డుగడన్ బుట్టినఁ బతి విన
నగు పని సెప్పెడిదిగాక యాతనితోడన్.
| 40
|
ఆ. |
ఉత్తమాసనములు నుత్కృష్టవాహనం
బులును దమకుఁ గరుణ భూమిపాలుఁ
డీక తారె యెక్కు [36]టెంతటి మన్నన
గలుగు వారికైనఁ గార్యమగునె.
| 41
|
ఆ. |
ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవ
నంబు గుప్తవర్తనంబు గాఁగఁ
జలుపవలయు నృపతి గొలువున్నయెడల బా
హిరములైనఁ గెలని కెగ్గు లగుట.
| 42
|
ఆ. |
వసుమతీశు పాల వర్తించు నేనుఁగు
తోడనైన దోమతోడనైన
వైరమగు తెఱంగు వలవదు [37]తారెంత
పూజ్యులైన జనుల పొందు లెస్స.
| 43
|
క. |
పతి చీర లట్టి చీరలు
పతి [38]తొడవుంబోలు తొడవు పతిగతి వేష
స్థితియును సేవకులకుఁ దగ
దతిధనయుతులైన ననుఁగులైనను సభలోన్.
| 44
|
చ. |
చెలువుగ దుష్కరంపుఁబని సేసియుఁ జేసితి నాక క్రూరతం
బలుమఱు వ్రేసినం గడవఁబల్కిన నుల్లములోన నొండుగాఁ
దలఁపక పల్కుచొప్పిదము తథ్యముగాఁ దగఁ బల్కి మోసలన్
బిలువక వేచియున్నతఁడు భృత్యుఁడు రాజున కెన్నిభంగులన్.
| 45
|
ఆ. |
అన్యదేశమెల్ల నాత్మదేశంబకాఁ
దలఁచువాఁడు నెపుడు తలఁకు లేక
రమణ [39]సేఁత యెల్ల రాజ్యంబు [40]సేఁతగా
దలఁచువాఁడు ప్రియుఁడు ధరణిపునకు.
| 46
|
క. |
మానుగఁ బతి పనిచినఁ దన
చే నిది గాదనక వేగఁ జేకొని యనలం
బైనఁ జొరవలయు నంబుధి
యైనను నీఁదంగవలయు నర్థిని భృత్యుల్.
| 47
|
క. |
బలుకొఱడు వోలె నెండకుఁ
జలికిని వానకును నోర్చి జనపతి నెవ్వం
డలవడఁ గొలుచును వానికి
వలనొప్పఁగ సిరులు దాన వచ్చి వసించున్.
| 48
|
లోకనీతి
తిక్కనసోమయాజి ఉద్యోగపర్వము [2-46]
క. |
చెలిమియు సంభాషణమును
బలిమి వివాదంబుఁ ద్రోపుఁ బాడియుఁ దమ యం
తలవారితోన తగు నధి
కుల హీనులతోడనైనఁ గొఱ గా దధిపా!
| 49
|
క. |
వగ బలము దఱుఁగు రూపఱు
వగచినమతి దప్పుఁ దెవులు వచ్చును దూఱన్
వగచి నలంగినఁ బ్రియమగుఁ
బగతుఱకును వగచు టుడుగు పార్థివముఖ్యా!
| 50
|
చ. |
కరితురగాదిఘట్టనయు గాలియు నొంపదె యొంటియున్న య
త్తరువు ననేకభూరుహవితానము గుంపయి పేర్చి బాధలం
బొరయునె యన్నదమ్ములును బొందిన నేరి కసాధ్యు లట్లు గా
కెరవయి నిల్చినన్ గెలని కెల్లిదమై [41]పఱిపోదు రెంతయున్.
| 51
|
సుజనులు
[భారతము-] ఉద్యోగపర్వము [2-41]
క. |
పురుషుండు రెండుదెఱఁగుల
ధర నుత్తముఁ డనఁగఁబరఁగుఁ దా నెయ్యడలన్
బరుషములు పలుకకునికియు
దురితంబులు దొరయు పనులు దొఱఁగుటవలనన్.
| 52
|
తే. |
చెల్లియుండియు సైరణ సేయునతఁడుఁ
బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ
దనకుఁ గల భంగి నిచ్చు నతండుఁ బుణ్య
పురుషుఁ డని చెప్పి రార్యులు [42]గురువరేణ్య!
| 53
|
క. |
విదిరికి నిజమును హితమును
మది కింపులు గాఁగఁ బల్కు మాటలు పెక్కై
యొదవినను లెస్స యటుగా
కిది యది యనకూరకునికి యెంతయు నొప్పున్.
| 54
|
కుజనులు
భారతము – ఉద్యోగపర్వము [2-58]
క. |
ఒరుల ధనమునకు విద్యా
పరిణతికిం దేజమునకు బలమునకు మనం
బెరియ[గ] నసహ్య[పడు న]
న్నరుఁడు దెవులు లేని వేదనం బడు నధిపా!
| 55
|
అవధానభారతి – మంచన – కేయూరబాహుచరిత్ర [3-31]
మ. |
అరయం దుష్టజనుల్ స్వదుశ్చరణజాత్యంధుల్ నిజాచారధీ
గరిమాదిస్తుతివాద్యు లాత్మధ[న]రక్షాజాగరూ[కే]క్షణుల్
పరదోషేక్షణదివ్యచక్షు లితరప్రజ్ఞాభిశంసానిరం
తరమౌనవ్రతు లన్యవిత్తహరణధ్యానక్రియానైష్ఠికుల్.
| 56
|
క. |
కెలనికి మేలును దనకుం
గలిగెడి నింద్రత్వమైనఁ గాదనుఁ దుది దాఁ
బొలిసిన మెలసి తలంచును
ఖలుఁ డొరులకుఁ గీడు సేయఁ గలిగినఁ జాలున్.
| 57
|
అన్యాపదేశములు
మ. |
అతిమాధుర్యమనోజ్ఞచూతఫల మాహారంబుగాఁ గల్గియున్
మతి గర్వింపక కోకిలంబు పలుకున్ మంజూక్తి జంబాలదూ
షితనీహారముఁ గ్రోలి భేక మఱచున్ జృంభించి యాకర్ణ[న]
స్థితిఁ గాఠిన్యము దోఁపఁగా బెకబెక [43]న్ఛీకాకులారావముల్.
| 58
|
ఉ. |
పీనసరోగి నిన్నుఁ దిలపిష్టసమానము [44]గాఁగఁ జూచినన్
వాని వివేకశూన్యతకు వందురనేల కురంగనాభమా!
మానవతీకపోలకుచ[45]మండలచిత్రితపత్రవల్లికా
నూన[46]విశేషసంపదల నొందుట లోకము ని న్నెఱుంగదే.
| 59
|
ఉ. |
ఏచి [47]తలిర్చి గొప్పలగు నెఱ్ఱనిపువ్వులతోడి బూరుగున్
రాచిలు కర్థిఁ జేరి మధురంపుఫలంబుల కాస సేసినన్
[48]గాచిన కాయలుం బగిలి గాలివశంబున దూదియై చనన్
జూచి నిరాశయై చనినఁజొ ప్పగు నీచుల నాశ్రయించినన్.
| 60
|
ఉ. |
ఈఁకలు నల్లనైనవని యెంచి విశాలరసాలశాఖ యు
త్సేకముతోడ నెక్కి వికసించి ఫలంబులు నీవు మేయుచున్
|
|
|
గోకిలరీతి నుందుననుకున్నను నంటివి కాక పాపపుం
గాకమ! నీకు నమ్మధురగానము గల్గునె యెన్ని పల్కినన్.
| 61
|
సూర్యాస్తమానము
తులసి బసవయ్య - సావిత్రికథ
సీ. |
పటుచండతాండవోత్పతితధూర్జటిజటా
మకుటాగ్రఫణిఫణామణి యనంగ
నికటవాతాఘాతనిర్భగ్నమగు పశ్చి
మాచలధాతుశృంగాగ్ర మనఁగ
[49]సంధ్యాప్రభిన్నరక్షఃకోటిపై [50]వియ
చ్చరణుఁ డేసిన సుదర్శన మనంగ
ఘననిశాంబుధిజగంబను కలం బెడలక
యుండంగఁ ద్రోచిన గుం డనంగఁ
|
|
తే. |
దేజమంతయు శిఖియందుఁ దిరము గొల్పి
కణఁకఁ దలలెత్తి పటుమాంస[51]కబళశంకఁ
బదరి జలచరపంక్తిపై పైఁబడంగఁ
బడియె నపరాంబురాశిలోఁ బద్మహితుఁడు.
| 62
|
సీ. |
పశ్చిమాంభోనిధిప్రాంతదేశంబున
రంజిల్లు విద్రుమకుంజ మనఁగఁ
జరమాద్రిశిఖరదేశంబునఁ గనుపట్టు
కమనీయఘనరత్నకలశ మనఁగ
నపరదిక్కామిని యర్థితోఁ గనుగొను
[52]పద్మరాగంపుదర్పణ మనంగఁ
బ్రత్యగ్దిశాకుంభిఫాలభాగమ్మునఁ
బొలుపాఱు జేగురుబొ ట్టనంగ
|
|
తే. |
భూరికాంతి నభోవనభూమిఁ బండి
కాలశుకతుండహతి [53]బిట్టు గదలి యపర
జలధిలోఁ బడు దాడిమఫల మనంగ
[54]నబ్జినీవరబాంధవుం డస్తమించె.
| 63
|
చ. |
అరయఁగ లోకబాంధవుఁడనై భువనత్రయకర్మసాక్షినై
హరిహరపద్మసంభవమయాకృతినై మను నాకు వారుణీ
పరిచయదోష మబ్బెనని భానుఁడు తద్దురితోపశాంతికై
శరనిధిఁ గ్రుంకెనా నపరశైలతిరోహితుఁ డయ్యె [55]నత్తఱిన్.
| 64
|
[56]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-67]
చ. |
చరమధరాధరాగ్రమునఁ జాఱెఁడువేళఁ బతంగుఁ డంగజి
త్వరితమనస్కమై నిలిచి తన్ను గనుంగొను [57]సౌధశేఖరో
పరితరుణీజనంబుముఖపద్మముల న్వికసింపఁజేసె స
త్పురుషులు తారు దుర్దశలఁ బోవుచునైనను బ్రోతు రాశ్రితున్.
| 65
|
[మద్దికాయల మల్లయ్య] - రేవతీపరిణయము
మ. |
కటకండూయన మంతనంతఁ జలుపంగాఁ దామ్రపర్ణీమదో
త్కటదానంబులు నిండి [58]జిడ్డుకొన కన్తగ్రావకూటద్యష
త్తటముల్ మెట్టఁగఁ [59]జిక్కుఁ బాఱె నవినీతంబుల్ వడిం బాఱె నా
[60]పుటలిన్యాపుండు ? గ్రుంకెఁ బశ్చిమమహాంభోరాశిపూరంబునన్.
| 66
|
తెనాలి రామలింగయ్య – హరిలీలావిలాసము
ఉ. |
ఎంతయు రాజు[61]తోడఁ బగయే [62]కొమరో మధుపప్రసక్తి య
శ్రాంతము గల్గు తమ్ముల ప్రచారము గాదని [+ +] నోడి దే
శాంతర మేఁగె నాఁగ నపరాశఁ బతంగుఁడు దాఁగె నట్టి వృ
త్తాంత మెఱింగి సిగ్గొలసినట్టులు [63]గందె సరోరుహంబులున్.
| 67
|
[నంది తిమ్మన్న] పారిజాతము [4-45]
క. |
ఘనసాంధ్యరాగవినతా
తనయగరుత్సమితి [64]కడిఁది తాఁకున ధర వ్రా
లిన గగనఫణిఫణామణి
యన రవిమండలము పశ్చిమాంబుధిఁ గ్రుంకెన్.
| 68
|
ప్రౌఢకవి మల్లయ్య – రుక్మాంగదచరిత్ర [4-124]
ఉ. |
ఆ యెడఁ గాలకారకుఁ డహర్పతియున్ గనకంపుఁ బూదె వై
హాయసవీథియన్ గొలిమియందుల నెఱ్ఱఁగఁ గాఁచి నీటిలోఁ
|
|
|
బాయక త్రోచున ట్లినుఁడు పశ్చిమవారిధిఁ గ్రుంకె శీకర
ప్రాయ[వి]ధూమరేఖ లనఁ బర్వె నుడుప్రకరాంధకారముల్.
| 69
|
బొడ్డపాటి పేరయ్య – పద్మినీవల్లభము
ఆ. |
ఆ ప్రదోషయ+ములై యున్న సమయంపు
గంట వేటకాని కరము దివ్వె
సొగపు దోచెఁ గ్రుంకనగు ప్రొద్దు పరసంధ్య
వెనుక నిరులు ముందు వెలుగు నగుట.
| 70
|
భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర
తే. |
వారుణీస్పర్శమున నాదు వాఁడి దఱిగె
సకలతీర్థనిదాన మీ జలనిధాన
మే నొనర్చెదఁ బావనస్నాన మనుచు
మునుఁగుగతి పశ్చిమాంబుధి మునిఁగె నినుఁడు.
| 71
|
సూర్యాస్తమానచంద్రోదయములకు
నంది మల్లయ్య – ఘంటసింగయ్య – ప్రబోధచంద్రోదయము [4-48]
శా. |
అంతం గుంకుమపంకపాటలిమతో నస్తాద్రిపైఁ దోఁచె భా
స్వంతుం డిందుఁడు నింద్రగోపరుచిఁ బూర్వక్ష్మాధరం బెక్కె వా
రెం[65]తేఁ జూడఁగనొప్పి రప్పుడు హృషీకేశప్రతాపప్రభా
ప్రాంతం బందలి రెంట పంజు వలె సొంపారెన్ దినాంతంబునన్.
| 72
|
[66]నంది తిమ్మన – పారిజాతాపహరణము [2-42]
ఉ. |
పొందుగఁ బశ్చిమాబ్ధితటభూస్థలి నంశుమదంశుమత్ఫలా
కందము వాసరాంతహలికాప్రవరుం డిడె సాంధ్యరీతి భృ
త్కందళమున్ దమోదళయుతంబునునై గెల పండి వ్రాలెఁ బూ
ర్ణేందుని పేరఁ బ్రాచి నది హేతువు వెన్నెలకల్మి కల్మికిన్.
| 73
|
చ. |
సమయవిలాసి శోణమణిసంగతమౌక్తికరత్నహారమున్
గ్రమమునఁ గ్రుచ్చుచో నరుణరత్నముఁ దామును సాంధ్యరశ్మి సూ
త్రమునఁ బొసంగఁ గ్రుచ్చి యెడ దవ్వగఁ ద్రోచి పిఱుంద చేర్చుము
త్తెముక్రియఁ దోఁచె నయ్యమృతదీధితి లాంఛన[67]రంధ్రసంగతిన్.
| 74
|
సాంధ్యరాగము
భావన పెమ్మన - అనిరుద్ధచరిత్ర
సీ. |
వరుణుని శృంగారవనములో [68]బెగడొందు
పగడంపుఁదీఁగెల ప్రాఁ కనంగ
జరమభూధరముపై సురగాలి నెగయింప
దోతెంచు [జేగురు]ధూళి యనఁగ
నస్తాంబురాశిలో నంతకంతకుఁ గ్రాలు
బాడబానలశిఖాపటల మనఁగ
నినురాక కపరదిగ్వనిత [69]యెత్తించిన
రత్నతోరణవిభారాజి యనఁగ
|
|
తే. |
విరియ నుంకించు [70]చెందొవవిరులయందు
వఱలు ఱేకులకాంతికి వన్నె వెట్టి
రమణ రమణీజనానురాగములతోడ
నిగిడి యెఱసంజ పడమట నివ్వటిల్లె.
| 75
|
[71]శాకల్య అయ్యలార్యుఁడు – యుద్ధకాండము [2637]
చ. |
తరువులయందుఁ బల్లవపదస్థితి నద్రులయందు [72]ధాతుబం
ధురగతి నంగనాజనపృథుస్తనమండలిఁ గుంకుమంబునై
పరఁగుచు [73]సాంధ్యశోణిమవిభాసురమై జలనాథదిక్తట
ద్విరదము కుంభి[74]సంభవనవీనగళ[75]ద్రుధిరంబు నాఁ దగన్.
| 76
|
[76]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-81]
క. |
ఇనుఁ డేగుచుఁ జీఁకటి వెను
కొను శం[కం] గావు వెట్టికొనిపోయిన య
త్యనురక్తికిరణబలమో
యన [77]సంధ్యారాగ మొదవె నపు డపరదిశన్.
| 77
|
తెనాలి రామలింగన్న – హరిలీలావిలాసము
ఉ. |
[78]రాసి సహస్రభానుఫణిరత్నము [79]నెల్లను పోవఁదన్నుచున్
వాసరభోగిఁ గాలఫణివైరి గడున్ వడి నొక్కి [80]నక్కుగాఁ
జేసినఁ గ్రమ్ము తద్రుధిరశీకరపూరవిజృంభణం బనం
గా సముదగ్రతం బొలిచెఁ గ్రమ్మి జపోపమసాంధ్యరాగముల్.
| 78
|
నంది తిమ్మన – పారిజాతము [2-32]
చ. |
తనువున [81]నంధకారపుమదం [82]బల మిన్నను భద్రదంతికి
న్మొనసినఁ జింద రేఁగి తపనుండను మావుతుఁ [83]గ్రుంకుమెట్టలో
య నురలవైచినన్ నొగిలి యచ్చట నెత్తురు గ్రక్కెనో యనన్
గనుఁగవ గోరగింపఁ బొడకట్టె సముజ్జ్వలసాంధ్యరాగముల్.
| 79
|
శ్రీనాథుఁడు – భీమఖండము [2-30]
తే. |
సంజకెంపును దిమిరపుంజంపునలుపు
[84]గమిచి బ్రహ్మాండభాండంబు గరము మెఱసెఁ
బరమపరిపాకదశ [85]వృంతబంధ మెడలి
[86]పతనమగు తాటిపంటితోఁ బ్రతిఘటించి.
| 80
|
శా. |
ఆకాశాంచలవీథుల న్నెగడె సంధ్యారాగ[87]రేఖా[వళుల్]
[88]పాకోన్మిద్రితపారిభద్రకళికాపాండిత్యవైతండికో
త్యేక[89]స్ఫూర్జితచండతాండవరయోద్రేకారభట్యుద్భుట
శ్రీకంఠస్థిరదీర్ఘపాటలజటాశ్రేణిన్ విడంబించుచున్.
| 81
|
చరిగొండ ధర్మయ – చిత్రభారతము [6-107]
క. |
సగపాలు సాంధ్యరాగము
నిగిడినఁ గెంజాయఁ దనరి నెఱ చీఁకటిచే
సగపాలు నలుపు నొందుచు
గగనము గురివెందగింజ కైవడిఁ బొల్చెన్.
| 82
|
పిల్లలమఱ్ఱి వీరయ – శాకుంతలము [3-149]
మ. |
[90]మునిదత్తార్ఘ్యపయః[91]ప్రహారకులిశంబుల్ [92]దాఁకి మందేహదే
హనితాంతస్రుతరక్తధార చెలువంబై పశ్చిమాశాతటిం
గనుపట్టెన్ నెఱసంజ చాయ యనుచున్ గాంక్షించి యచ్చోటికిన్
జను కాకోలకులంబు నా దెసల నోజన్ జీఁకటుల్ గ్రమ్మఁగన్.
| 83
|
తులసి బసవయ్య - సావిత్రికథ
క. |
మందేహదేహదహనా
మందక్షతజప్రవాహమహనీయనదీ
|
|
|
సందేహదాయి యగుచును
గందున నెఱసంజ మింటఁ గానఁగనయ్యెన్.
| 84
|
బొడ్డపాటి పేరయ – శంకరవిజయము
తే. |
రాజురాకకుఁ దారహారములతోడి
యామినీపాత్ర నాడింప నేమి సమయ
నాటకుఁడు దోఁపుదెర వాఱినాఁ డనంగ
సాంధ్యరాగము పశ్చిమాశను దనర్చె.
| 85
|
సాయంసమీరణము
[93]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-81]
సీ. |
ఇనకరాకులజగజ్జనతాలవృంతంబు
నిద్రాణపద్మినీనిశ్శ్వసితము
కైరవిణీ[94]బోధనారంభజృంభంబు
తిమిరమత్తేభఫూత్కృతినిపాత
మాగచ్ఛదతను[95]ధ్వజాం[96]చలచ్చలనంబు
విరహిణీప్రాణా[భి]విగళనంబు
సాంధ్యరాగసువర్ణచలగరుత్కలనంబు
చక్రవియోగాగ్నిచర్మభస్త్రి
|
|
తే. |
రతిసముత్సుకసువదనారభ్యమాణ
ముఖ్యనేపథ్యవాస్తవామోదముదిత
మధుపమధురారవోద్గీయ[మాన] మగుచు
మెలఁగె నయ్యెడ సాయంసమీరణంబు.
| 86
|
దీపకళికలు
మాదయగారి మల్లన - రాజశేఖరచరిత
తే. |
[97]అపుడు చీఁకటి దిశలెల్ల నాక్రమింప
దీపకళికలు గృహమెల్లఁ దేజరిల్లెఁ
దండ్రి రాజ్యంబు కాళింది తాను బడసి
తత్తనూజులఁ బెంచు విధంబు దోప.
| 87
|
తెనాలి రామలింగకవి – హరిలీలావిలాసము
తే. |
భానుశశిమండలంబుల లో నడంచి
యిరులు పెనువానఁ గురియుచు నేపు చూపు
రాత్రి వర్షర్తువునఁ బుట్టె బ్రతి గృహాక
రములఁ బటుదీపవైడూర్యరత్నసమితి.
| 88
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-36]
చ. |
మొనపిన దీపికానికరముల్ గృహకార్యగతాభిసారికా
వనితల యూర్పుగాడ్పుల నెపంబునఁ గంపము నొంద నోడకుం
డని తిమిరంబు తా నభయహస్తము లిచ్చె ననంగ వానిపైఁ
గనుఁగొనఁ బొల్చె నంకురితకజ్జలముల్ నవధూమమాలికల్.
| 89
|
విదియచంద్రుఁడు
మద్దికాయల మల్లయ్య – రేవతీపరిణయము
చ. |
నిలయతమఃప్రతా[న]ము గణింప మఱుంగులు సొచ్చినట్టుగా
నలరు పిఱిందినీడలు రతాంతదుకూలపరిగ్రహత్వరా
కలితవిలాసినీనివహకౌతుకహేతువులై చెలంగ ను
జ్జ్వలరుచి మించె గేహముల సంపెఁగమొగ్గల వంటి దీపముల్.
| 90
|
రావిపాటి త్రపురాంతకుఁడు - తారావళి
మ. |
చరమక్ష్మాధరచారుసింహముఖదంష్ట్రాకోటియో నాఁగ నం
బరశార్దూలనఖంబు నాఁగఁ దిమిరేఖప్రస్ఫురద్గర్వసం
హరణక్రూరతరాంకుశం బనఁగ నుద్యల్లీల మీ రేఖ ని
త్యరుచిన్ బోల్పఁగఁ బెంపగున్ విదియచంద్రా! రోహిణీవల్లభా!
| 91
|
మ. |
అమితధ్వాంతతమాలవల్లిలవనవ్యాపారపారీణదా
త్రమొ సౌగంధికషండకుట్మలకుటీరాజీసముద్ఘాటన
క్రమ[98]నిర్వాహధురీణకుంచికయొ నాగం బెంపున [99]న్నీ కళా
రమణీయత్వము చూడ నొ ప్పెసఁగుఁ జంద్రా! రోహిణీవల్లభా!
| 92
|
తారలు
నందితిమ్మన – పారిజాతము [2-37]
సీ. |
కార్కొన్న కటికచీఁకటిమొగు ల్మొత్తంబు
గురిసిన వడగండ్లగుంపు లనఁగఁ
గవజక్కవలు వాయఁ గరనాళములఁ జందు
రుం డూఁదు పటికంపుటుండ లనఁగ
నెల్లెడఁ జదలేటియిసుమున నచ్చర
కొమ లిడ్డ వెన్నెలకుప్ప లనఁగ[100]
దెలివివెన్నెల వెండితీవెలు నిగిడించు
చదలు కమ్మచ్చుబెజ్జము లనంగ
|
|
తే. |
జగము గెల్వంగ దండెత్తు మగని మీఁద
లీల రతి చల్లు దీవనఁబ్రా లనంగ
వెండివెలుఁ గెండఁ గ్రాఁగిన విన్ను మేన
నెక్కొను చెమటబొట్లు నాఁ జుక్క లమరె.
| 93
|
శ్రీనాథుఁడు - శృంగారనైషధము [8-161]
సీ. |
చుక్కలో యివి? గావు సురలోకవాహినీ
విమలాంబుకణకదంబములు గాని
తారలో యివి? గావు తారాపథాంభోధి
కమనీయపులిన[101]సంఘములు గాని
యుడువులో యివి? గావు మృడునంబరమ్మునఁ
దాపించినట్టి ముత్యాలు గాని
రిక్కలో యివి? గావు రే[102]చామ తుఱుముపైఁ
జెరివిన మల్లెక్రొవ్విరులు గాని
|
|
తే. |
యనుచు లోకంబు సందేహ మందుచుండఁ
బొడిచె బ్రహ్మాండపేటికాపుటకుటీర
చారుకర్పూరఫాలికాసంచయములు
మెండుకొనియుండె నక్షత్రమండలములు.
| 94
|
బొడ్డపాటి పేరయ్య – శంకరవిజయము
సీ. |
సంజప్రొద్దున నాట సలుపు నంబరకేశు
తలయేటి జలకణతతు లనంగ
రజనీవధూద్విజరాజుల పెండ్లి కే
|
|
|
ర్పఱుచు ముత్యపుఁదలఁబ్రా లనంగఁ
గాలవాణిజ్యుండు నీలాంబరస్థలి
[103]నరిఁ బచరించు వజ్రము లనంగ
[104]వేళాఖ్యపుష్పలావిక యిందుఁడను రాజు
నకు నేరిచిన ప్రసూనంబు లనఁగఁ
|
|
తే. |
బాలవెల్లి మథించు తొల్కాలము [నను]
నమృతబిందువులు దరి మిన్నందె ననఁగ
గగనమను కొల నలమిన తొగ లనంగఁ
గలయఁ జుక్కలుఁ దోఁచె నాకాశవీథి.
| 95
|
తెనాలి రామలింగకవి – హరిలీలావిలాసము
ఉ. |
కాలధనంజయుండు తనుఁ గాచి దివాకరమత్స్యయంత్రమున్
గీ లెడలించి సంధ్య యను కృష్ణ నుదంచిత[రూప]విభ్రమ
శ్రీలలితాంగినిం దగ వరించి తమోమయధార్తరాష్ట్రభూ
పాలకసేన నేయు సితభల్లములో యనఁ బర్వెఁ దారకల్.
| 96
|
తే. |
ఉడుపథంబను ములుదోస తొడిమ యూడఁ
దామరసబంధుఁ డను పండు తనకుఁదానె
వికృతి గనుపింపఁ గనుపట్టు విత్తు లనఁగఁ
దనరె నెఱసంజఁ గెంపుగఁ దారకములు.
| 97
|
పిల్లలమఱ్ఱి వీరయ్య – శాకుంతలము [3-152]
ఉ. |
నాలుగుదిక్కులందును ఘనంబుగఁ బర్విన చీఁకటుల్ జగ
ద్గోళము నిండ దృష్టికి నగోచరమై వెసఁ బర్వియుండఁగా
నీలపటంబుమీఁద విపణిం బచరించిన ముత్తియంబులన్
బోలి వెలింగె నంతట నభోనిలయంబునఁ దారకాతతుల్.
| 98
|
[105]పణిదపు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము
చ. |
నవకపుఁదెల్లమ్రగ్గు జతనంబునఁ గూర్చి వియద్గృహంబునన్
దివురుచు రంగవల్లికలు దేవగణంబులు చూచి మెచ్చఁగా
సవరఁగఁ దీర్చి కాలమను జక్కుల ముద్దుఁడు వేడ్కతో దివా
యవనికఁ చాయఁదట్టె నన నంచితలీల వెలింగెఁ [106]దారకల్.
| 99
|
తే. |
శర్వరీచంద్రపరిణయసముచితాంకు
రార్పణక్రియఁ గల[య] వియద్విభాగ
పాలి[క]లఁ దోఁచు క్రొత్త జాజాల మొలక
లనఁగఁ దారక లొండొండ యంకురించె.
| 100
|
చక్రవాకవియోగము
తులసి బసవయ్య - సావిత్రికథ
సీ. |
కమలకోరకనికాయములఁ [107]జిక్కిన తేఁటి
గమిమ్రోఁత ప్రియుకూఁతగాఁ దలంచు
వికసన్మనోజ్ఞహల్లకరాశిలోఁ దూఱి
దావానలం బని తల్లడిల్లు
హంసఖండితమృణాళాంకూరములు శశి
ప్రతిబింబితము లని పరితపించుఁ
గల్లోలఘట్టనోద్గతఫేనపుంజంబు
ఘనమైన వెన్నెల యని కలంగు
|
|
తే. |
వెదకు నలుదిక్కులును జాల వెచ్చ నూర్చుఁ
దలఁకు [108]బిసినీపలాశమధ్యమునఁ బొరలు
జాలిఁ బడి తూలు దివసావసానవేళ
జడిసి ప్రాణేశుఁ బాసిన చక్రవాకి.
| 101
|
[109]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-71]
సీ. |
మొగడల బిగి వీడు తొగల నంకూరించుఁ
గ్రొత్తనెత్తావి మూర్కొనుచు నులుకు
నిష్ప్రభంబై నీట నీడఁ దోచిన భాను
బింబమ్ముఁ గని భీతి బీఱువోవు
బాష్పంబు [110]చూడ్కిఁ గప్పఁగఁ గూడియుండియు
వికలకంఠముగ నొండొకటిఁ బిలుచుఁ
గసి గాటు గఱచిన బిసనాళములఁ జంద్ర
కరశంక సంధిల్లి మరలఁ గ్రాయు
|
|
తే. |
నీడలను [111]బుద్ధి నొండొంటిఁ జూడ కవలి
నీడ లొండొంటిగాఁ జూచి కూడ [112]నరుగు
భావివిరహవ్యథాభయభ్రాంతివలనఁ
గోకపరవశమై చక్రవాకయుగము.
| 102
|
ఉ. |
కుత్తుక లెత్తి బిట్టులికి క్రుంకు రవిం గని దీనవృత్తితో
నొత్తిన [113]భావిదుర్భరవియోగభరంబున నొండొకంటి [మో]
మత్తమిలం గనుంగొను రథాంగయుగంబుల దృష్టిఁ గప్పఁబో
[114]మిత్తుగఁ గన్ను నీ రొదవి మించని చీఁకటికంటె ముందఱన్.
| 103
|
విటవిడంబనము
[115]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-77]
సీ. |
కలపంబు లొనఁ గూర్చు గన్యకాజనముల
రమణీయ[మణి]కంకణముల రవళి
ప్రియులఁ దోతెమ్మన్నఁ బిలిచి తే నరుగు చే
టికల [116]నున్గులుకు మట్టియల యులివు
నడియాస [117]జోకొట్టు [118]నొడికంపుటల్లుండ్ర
దఱిమి పోనాడు నత్తల యదల్పు
కైసేఁతల నొసంగు కమ్మఁదావుల సోలు
నెలదేఁటి నిసుగు[119]ల యించుమ్రోఁత
|
|
తే. |
కలుపుబావల రాక యక్కలకు నెఱుఁగఁ
బలుకు చిలుకల కల్కి పల్కులును గలసి
మరుఁడు విడిసిన దండు సంభ్రమము వోలెఁ
గలకలితమయ్యె గణికానికాయవాటి.
| 104
|
విటలక్షణము[120]
క. |
శ్రీమంతుఁడు గుణవంతుఁడు
ధీమంతుఁడు రూపయుతుఁడు ధీరుండు కళా
ధాముండును గావలయును
[121]దా మహిఁ గాముకుఁడు కామతంత్రవివేకీ.
| 105
|
[122]క. |
కులశీలంబులు వదలక
యిలు మఱువక పనులయందు నేమఱక పయిన్
బలుపులు చల్లిన బ్రమయక
మెలగంగా నేర్చువాఁడె మిండఁడు జగతిన్.
| 106
|
[123]చ. |
కలఁగఁడు దీరబుంగళము గట్టఁడు ముప్పలు చూడఁ డుబ్బునన్
జెలఁగఁడు రిత్తచందములు సేయఁడు పెల్లుగఁ జాల మత్తుఁడై
పలుకఁడు మేనఁ జెన్ను గల పట్టుల చూపెడు నవ్విటుండు మిం
చులనఁగ మంచిసుందరుల చూపులు పైపయిఁ బాఱుతెంచినన్.
| 107
|
[124]సీ. |
డిచ్చంబు పట్టక తుచ్ఛాలు పలుకక
యెమ్మెలఁ బొరలక యెఱుక చెడక
తఱు చుల్క సేయక తబ్బిబ్బులాడక
వెలనాడి తప్పక వేసరిలక
గలిగలి కర్మాక[?] కంటసాలాడక
గ్రొంద్రతి[?] గూడక గుణము చరక[?]
తనవారి మఱువక ధర్మంబుఁ దప్పక
పలుమాఱు గప్పరవాటు పడక
|
|
తే. |
వట్టి దొగడౌలు సేయక వరుస గలిగి
దిట్టతనమున మదిలోన గుట్టుతోడి
జరుపనేర్చినవాఁడు వో చండవిటుఁడు
+ + + + + +.
| 108
|
విటశృంగారము
కూచిరాజు యెఱ్ఱన – కొక్కోకము
సీ. |
పొగ కంపు [125]నలవక మిగులు వెచ్చనగాక
[126]తెలుపైన [127]నీటను జలకమాడి
[128]కమరు వలువకయుఁ గాక [129]పిప్పియుఁ గాక
మృదువైన గంధంబు మేన నలఁది
గడితంబు [130]జిలుగును గాక [131]రవణమైన
పంచెపై వలిపదుప్పటమ్ముఁ గట్టి
చెమ్మ వల్వక వన్నె బెదరక వాసనఁ
[132]గులుకు పువ్వులు దోఁపి కొప్పు ముడిచి
|
|
తే. |
మదనరతికోవిదులు పీఠమర్దకాది
విటులు సల్లాపములు సేసి వేడ్క సేయ
మోహనాకారుఁడై మరుమూర్తి వోలెఁ
బల్లవుడు కేళిమందిరాభ్యంతరమున.
| 109
|
కువిటుఁడు
పెదపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
అడియాస రే కొల్పి యరవీసమును నీక
యాడుచుండును చేతి కందినట్ల
[133]మొనసి [134]బంధుల ప్రోకలను వెంటఁబెట్టుక
[135]క్రుమ్మరించును దన యెమ్మె లెల్ల
గప్పు వెట్టిన పండ్లు గానరాఁ బలుకుచు
[136]నెరవు సొమ్ములు చూపి [137]మురియు నురక
యెన్ని లే వకట తా [138]నీడేర్చినవి యిండ్లు
మాటికిఁ జెప్పుకో నేటి కనుచు
|
|
తే. |
రాగిపైఁ బూఁత పూసిన రవణములును
నెఱయ [139]బచ్చలి పండుల కఱులు చెమరి
నట్టి ప్రాఁతల చుట్టలు పెట్టి పెట్టి
తగిలి వలదన్న మానక దాఁచఁబెట్టుఁ
జెప్ప రోఁతలువో వీని చేఁతలెల్ల.
| 110
|
[140]ఆ. |
[141]పాఱుతెంచు మ్రాఁకు నేఱు నూఁతులు దాఁటి
బండి యెత్తు నాఁడుఁ బాట వాఁడు
రిత్తనగవు నవ్వు మత్తిల్లి కువిటుండు
సుదతు లెదుర నున్నఁ జూచెనేని.
| 111
|
[142]క. |
వన్నెలు మీఁదుగఁ గట్టును
కన్నులు వెసఁ ద్రిప్పుఁ జేతఁ గంభము వ్రేయన్
దన్నెఱుఁగఁడు వనితలఁ బొడ
గన్నను గువిటుఁడు కుప్పిగంతులు వైచున్.
| 112
|
వారికివిటుఁడు
[143]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-98]
[144]ఉ. |
ఒత్తిలి రిత్త పైకొనుచు నొంటన రెంటన నిద్రపుచ్చుచున్
మెత్తన లేచి దీపము శమింపఁగఁజేసి [శ]యింపఁ బ్రక్కలన్
దొత్తులఁ బెట్టి వచ్చి తమ తొల్లిటి మిండలఁ గూడికొంచు నో
ర్మొత్తిరి క్రొత్త రో యిడిన [145]మొప్పెల గద్దఱి లంజ లయ్యెడన్.
| 113
|
[146]చ. |
ముడిఁగి ముసుంగుతో వెనుక ముందును జూడక వచ్చి లోనికిన్
దొడుకునఁ బోయి వ్రేల్మిడిన [147]ద్రొబ్బినఁ బెంపునకున్ బసిండికిన్
జెడితముఁ దార [148]తిట్టుకొని చీయని కేలు [149]విదిర్చి రోయుచున్
గుడిసెల దూరి వెల్వడిరి క్రొత్తగు సిగ్గరి మిండ లయ్యెడన్.
| 114
|
[150]సీ. |
పథికులఁ గని తానుఁ బథికుఁడై యొక కొంత
నడచి ముందఱి వారి నడచి మరులు
వరములు దయసేయ వలరాచ దేవర
వల గొను గతిఁ జుట్టి వచ్చు [151]నిల్లు
లోలతఁ జెవి యొగ్గి లోని చప్పుళ్ళకు
డిల్లమై యొగి నిగిడించు నూర్పు
కడయింట నత్త మేల్కని బిట్టు దగ్గిన
నిలుకాల నిలువక యేఁగు బెగడి
|
|
తే. |
యడిగినంతయు రో యిచ్చినట్టి కొత్త
కోడెఁ జేకొని తను వెళ్లఁగొట్టుటయును
[152]బ్రాతిఁ తను నన్పులంజను బాయ లేక
వ్రీడ యించుక లేని చేబోఁడిఁ జూచు.
| 115
|
వేశ్యలక్షణము
[153]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-121]
సీ. |
ధన మాస వేఱొండు దలఁపదయే నది
జలజలోచనకు నౌషధపుఁ గూర్మి
ఘను నొద్దనుండియెఁ దన కాసబడియె నేఁ
|
|
|
బొలఁతు కదియెనె యూర్పోక కూర్మి
తగిలినచో నెల్లఁ దహతహ నొందె నే
బోటికి నది యలదాఁటి కూర్మి
తన కట్ల కెలనికిఁ దన మేలు చూఁపునే
జేడియ కదియు వైశికపుఁ గూర్మి
|
|
తే. |
తనదు పైత్యభ్రమంబున ధరయుఁ దిరిగి
నట్ల యగు భంగి విటుని మోహమునఁ దోఁచు
గాన నిక్కింపుఁ గూరిమి గణికయందుఁ
బొరయ దిలఁ [154]బొరసిన నది తెరువు [155]పెసర.
|
|
[156]ఉ. |
ఒక్కని విన్నదాఁక మఱియొక్కనిపైఁ దలఁపైనదాఁక వే
ఱొక్కనిఁ గన్నదాఁకఁ దను నొక్కఁడు పైకొని సోకుదాఁక నొం
డొక్కనిఁ దక్కు చూసి తగు లూడ్చెడు నంతటిదాఁక మిండచే
రొక్కము చెల్లుదాఁకనె సరోరుహలోచనలందుఁ గూరుముల్.
| 117
|
ఎఱ్ఱాప్రగడ – మలహణకథ [2-18]
[157]చ. |
బలపము లేఁతనవ్వు నునుఁబయ్యెద సన్నపుఁగావిచీర మిం
చులు గొను జల్లజంపు నునుఁజూడ్కియె కన్నపుఁగత్తి మోవి తీ
పలవడఁ జొక్కుమందగ విటావలి డెందముఁ గన్నపెట్టి యిం
పల ధనమెల్ల దోఁచుకొని పోవలెఁ గామిని గండిదొంగయై.
| 118
|
కుటిలవేశ్య లక్షణము
[158]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-94]
సీ. |
మడమలు [159]మోవంగ మైలచీరలు గట్టి
కర్ణముల్ [160]మోవంగఁ గాటు కిడియు
మోచేతి పట్టులు మోవ గాజులు దొడ్గి
యలికముల్ మోవఁ గొప్పులు ఘటించి
వెడలి గద్దువ మోవ విడియంబులు చేసి
కాంక్షఁ జెంపలు మోవ గంధ మలఁది
చెక్కిళ్ళు మోవంగఁ జెవుల నాకులు వెట్టి
బొమలు మోవఁగఁ జుక్కబొట్టు దీర్చి
|
|
తే. |
భావభవు చేతి విడివాటు బడియ ద్రుడ్లు
సంజ ప్రొద్దునఁ బలు పిశాచములు వోలె
|
|
|
మొదల భయముగ [161]జనుఁబట్టి వదలరైరి
వీథు లరికట్టి పురిఁ[162]గొట్టి వేశ్య లపుడు.
| 119
|
[163]సీ. |
చిటికలు వేయుచుఁ జిఱుపాటఁ బాడుచుఁ
జార్చి పయ్యెద గూడఁ జేర్చుకొనుచుఁ
గన్న రూపములెల్ల గరసంజ్ఞఁ బిలుచుచు
నెటకైనఁ జనువాని కెదురు సనుచు
గడచిపోవచ్చినఁ గౌఁగిఁటఁ బట్టి నీ
వాయంచు వదలి మోహంబు రేఁచి
[164]చూపిన వెలకు నంతే పో యనుచుఁ జిక్క
వ్రేయుచు రోయుచు వెంటఁబడుచు
|
|
తే. |
రూక లడుగుచుఁ దుదిఁ బచ్చనాకు కైన
నొడఁబడుచు హస్తగతమైన నొడియ నడచి
దొడ్డ బండాటమునఁ గోఁకఁ ద్రోసికొనుచు
గుడిసెలంజలు తెరవాటు గొట్టి రపుడు.
| 120
|
వీటినాటకము [క్రీడాభిరామము - 68]
[165]సీ. |
ఎకసక్కెముగ నాడు నేదైన నొకమాట
పాడు నొయ్యన పాట పాటపాట
యలఁతి యద్దపుబిళ్ళ యలవోక వీక్షించుఁ
గొనగోరఁ బదనిచ్చి కురులు దీర్చుఁ
బయ్యెద దిగఁజార్చి పాలిండ్లు పచరించు
దిస్సువాఱఁగ నవ్వుఁ దీఁగెనవ్వు
ధవళతాళపలాశతాటంకములు ద్రిప్పు
కలికిచూపులఁ జూపు గర్వరేఖ
|
|
తే. |
కటకుటీద్వారవేదికాకాష్టపీఠ
[166]మధ్యభాగనిషణ్ణయై మదము మిగిలి
వీటి పామరవిటుల తంగేటిజున్ను
కాము బరిగోల మేదరి కరణవేశ్య.
| 121
|
[167]సీ. |
పదనిల్చి పాపిటపట్టు నున్నఁగ దువ్వి
చెదలఁ ద్రొక్కెడు కొప్పు చెంపఁ దాపి
వడలి కంకటి తొడవులుగాఁగ నొసలిపై
పొసగంగఁ గాటుకబొట్టు పెట్టి
పని లేక తిరుగుచుఁ బాటలు పాడుచుఁ
జదురాడుచును దిగసాగఁ బెట్టి
నవ్వుచు మురిసి సన్నలఁ జేరి పలుచని
మరువునఁ దనుఁబొందు మత్తికాని
|
|
తే. |
దిబ్బ లెల్లను వినువారి కుబ్బు గాఁగ
బదను పదనున నంతలఁ బరయుఁ జింత
గవయకూడల మదనుండు కలయ [168]నెలచి
గుదియఁగొను మోదుపువ్వుల కోల విడిచి.
| 122
|
వేశ్యమాత
[169]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-110]
సీ. |
భావింపఁ దీర్థపురేవు కోరు మొసళ్ళు
చెఱకుపైఁ గ్రొవ్వాడి కఱకుఁ బేళ్ళు
గెంటని తేనియజుంటిపై నీఁగలు
పూచిన మొగలిపైఁ బొరలు ముండ్లు
పంటచేలకు నాఁగఁబడిన యోధంబులు
గంధంపుఁదీవెల కాలఫణులు
కదలక పెన్నిధిఁ గాచు దయ్యంబులు
రచ్చఠావుల బొమ్మరక్కసియలు
|
|
ఆ. |
లంజతల్లు లనఁగ లక్షింపఁగా నిట్టి
కట్టిడులకు నలువ కరుణ లేక
బ్రాఁతిమాలినట్టి బ్రతుకులు నిడుపుగాఁ
జేసి విడుల గోడు వోసికొనియె.
| 123
|
తే. |
గణికవలని దెంత ఘనమైన సుఖమేని
దాని తల్లివలనఁ దప్పిపోవు
మదిఁ దలంప నెట్టి మధురాన్నమేనియు
నీఁగ దొరలెనేని నించుటెట్లు.
| 124
|
సీ. |
భావజు విడిచిన పాడింటిపై [170]బొల్లి
[171]పాదొట్టు గతి మేనఁ బలిత మొదవ
[172]నం టుండకుండఁ బ్రాయము దుల్పుకొను మాడ్కి
పడు చన్ను లేచి చప్పటులు జఱవ
ననుభవేచ్ఛావిలాసాదులఁ దిగిచిన
[173]కొఱ్ఱు నాఁ జేయూఁత కోల యూఁది
యుండుట కష్టమే నొల్లమే నను నట్లు
పలుమాఱు విడువక పడఁతి పడఁక
|
|
ఆ. |
నున్న లంజతల్లిఁ గన్నచో సల్లుర
గుండె భగ్గురనుచు నుండదెట్లు
తేరి చూడ వెఱచి చేరదు మృత్యువు
దానఁ గాదె చావు దప్పి మనుట.
| 125
|
చ. |
చదురులు దేవహేతువులు సాయలు మాయలు కోరదంబు లె
ల్లిదములు గానము ల్కపటలీలలు దాలలు తీపు లోపికల్
పదరులు వేనడు ల్బహువిళంబము లాసలు రచ్చమెచ్చులున్
పొడవుగఁ గూడియున్న పెనుబొల్లలు లంజలతల్లు లెల్లడన్.
| 126
|
భద్రదత్తకూచిమారపాంచాలురు
[174]సంకుసాల సింగయ - కళావిలాసము
[175]ఉ. |
బాలలరూపు చూపుకొని భద్రుఁడు మాటల బెండువెట్టి పాం
చాలుఁడు వశ్యమంత్రజపసాధ్యచయంబులఁ గూచిమారుఁ డా
భీలధనాంబరావళులఁ బ్రీతులుఁ జేయుచు దత్తమండలీ
లాలలితానురాగరతులన్ సుఖియింతు రనంగసౌఖ్యముల్.
| 127
|
[176]ఉ. |
ఇచ్ఛ యెఱుంగఁ డెట్టి ధన మీఁ డదె యూరక కన్నులార్చి మై
బచ్చునఁ జూపి కూర్పుమని పట్టిన నెట్టునఁ గూర్పవచ్చుఁ గ
న్నిచ్చలఁ బాఱి నెమ్మనము లిత్తురె మానినులెల్ల నొల్లనా
మెచ్చలు గావు భద్రు వెలి మిన్నక నవ్వులు కప్పుఁ బ్రెవ్వులున్.
| 128
|
[177]ఆ. |
ఈఁగి మిగుల నిచ్చు టెఱిఁగి యింపెఱుఁగదు
తన సుఖంబె కోరి పెనఁగుఁ గాని
|
|
|
తలిరుబోణి రోయి దత్తకుఁ జేకొను
టంకమునకుఁ బసిఁడి యందుకొనుఁట.
| 129
|
[178]ఉ. |
తక్కులుఁ జొక్కు లొల్లములుఁ దాఁపరముల్ నగముల్ విడంబముల్
మ్రొక్కులు రిత్తవాదములు ముచ్చట లాలము లింద్రజాలముల్
మక్కువ లాన నడ్డములు మందులు మ్రాఁకులు పువ్వుబోండ్లకున్
జిక్కులఁ బెట్టి మిండఁడని చెప్పకు చెప్పకు కూచిమారునిన్.
| 130
|
[179]ఉ. |
బాలల నిండుజవ్వనుల ప్రౌఢుల లోలలఁ జేరి వారికే
కేలి భజించునట్లు తమకింపక యింపులు ముంపనేర్చుఁ బాం
చాలుఁడు చాలుఁ గౌఁగిలికిఁ జల్లనివాఁడగు వాని చందముల్
మేలని పొందిరేనిఁ బెఱమిండలకున్ గొఱకారు కామినుల్.
| 131
|
చిత్తిని
కూచిరాజు యెఱ్ఱన – కొక్కోకము
[180]సీ. |
నడుము సన్నము మంచినడుపు మానపురూపు
చనుదోయి పిఱుదును చాలఘనము
ఎగుబిక్క లోష్ఠ మొక్కించుక యధికంబు
తేనియవలపు రతిద్రవంబు
మూడురేఖలు కంఠమును జకోరపుఁబుట్టు
నృత్తగీతాదుల నేర్పు పెద్ద
పొడవు [181]వట్రువ జలపూర్ణంబు మెత్తన
యల్పరోమములు బంచాస్త్రుగృహము
|
|
తే. |
బాహ్యసంభోగనిరత చాపలపుఁజూపు
పులు[182]పు నిష్టంబు మధ్యంబు భోజనంబు
వన్నెచీరలు గట్టు భావంబు మృదువు
చిత్తినీభామ వరనేత్ర చిత్రధామ.
| 132
|
[183]సీ. |
తిలకించియుండు వన్నెలు గట్టి పువ్వులుఁ
దుఱుము వెండ్రుకలపై నెఱలుఁ దోచుఁ
దియ్యని పల్కులు దేశీయముగ నాడుఁ
బలుమాఱు గ్రుమ్మఱు బహువిధములఁ
బెనగంగ నేర్చు నెవ్వనికైనఁ గన్నార్చు
వలయు మృదువులయి దలము గలిగి
|
|
|
పలుచని రోమముల్ మొలిచి లో వెడలుపు
నయ్యుండు నచ్చటి నెయ్య మొప్పఁ
|
|
ఆ. |
దేనె కంపు వొలుచు మానితకామజ
లంబు గలిగియుండు లలన సుమ్ము
చిరయశోవిలాసచిత్తినియగు నిది
వనితఁ దీర్ప వంత వలపులకును.
| 133
|
నారాయణదేవుఁడు – కళాభిరామము
[184]సీ. |
తగుబాటు పొడవైన తనువల్లి మధురంబు
ఇంపైన కడుపు సొంపెసఁగు నడుము
జంఘంబు క్రొవ్వారుఁ జన్నులు వలుదలు
చారుచకోరికాచతురనయన
వట్రువ పొడవైన వలరాజు సదనంబుఁ
బలుచని కప్పుతోఁ బదను మిగులు
కలికిచూపుల తోడఁ బలువురఁ జూచును
మధుగంధ మొప్పు మన్మథబిలంబు
|
|
తే. |
పొడవు నెమ్మోవి బాహ్యసంభోగమునకుఁ
జెలఁగు నప్పుడు సరిటపాటలకు నెఱఁగు
చిత్రమగు నెవ్వి యవి గోరు చిత్తజాత
శాతతరహేతి చిత్తినీజాతి నాతి.
| 134
|
హస్తిని
కూచిరాజు యెఱ్ఱన – కొక్కోకము
[185]సీ. |
నడవనేరదు వంకపొడవులు గల వ్రేళ్ళు
గలపాదయుగళంబు గళము కుఱుచ
కపిలవర్ణంబైన కబరీభరము క్రూర
చేష్టలు వలమైన చిఱుత యొడలు
కరిదుద కంఠంబు స్మరగేహతనువులు
కటికపాయము లధికంపుఁ గుడుపు
విపులోష్ఠకఠిన దుర్విటులకుఁ గడుఁ గూర్చు
గద్గదస్వరము చిక్కని మనంబు
|
|
తే. |
మీఁది రోమంబు లల్పంబు మిగుల లోతు
వెడది మదనుఁడు చరియించు వీడుపట్టు
గడితములు గట్టి సిగ్గు [186]టక్కరము లేదు
హస్తినీభామ యుగ్రలతాంతధామ.
| 135
|
[187]సీ. |
చన్నులు నధరంబు జఘనచక్రంబును
దొడలు నంగుళములు వడులు వారు
వలుదలు గుజ్జులు వలయంబునగు మెడ
వెడఁదకన్నులు నడవెడఁగు వేదు
సన్నవెండ్రుకలు నొసలు మిట్ట యక్షియు
గ్మముఁ గాంతి చాలదు కడుపు నిడువు
గజమదగంధి చిక్కని మేను గర్కశ
[మాడు] క్రియ భుజించుఁ గూడు మిగులఁ
|
|
తే. |
గుడుచు నొక్కని లోపల వెడఁదియైన
కామమందిర మెంతయు గవులు దెగులు
తొగఁరు జీరకు ప్రేమంబు మిగులఁ గలదు
హస్తినీభామ కామతంత్రాభిరామ!
| 136
|
నారాయణదేవుఁడు – కళాభిరామము
[188]సీ. |
బలిసి చెక్కిలి కూరగిలఁబడ్డ మెడయును
వలుద పదాంగుళవక్త్రములును
కపిలకచంబును గద్గదాలాపముల్
క్రూరచేష్టలు నతికుటిలగతియు
సింధురమదగంధబంధురంబై యుండు
మదనజలంబును మగువ యొడలు
నంగజాతుని సాల యతివిశాలత నొందు
కప్పు నిబ్బరముగాఁ గలిగియుండు
|
|
తే. |
తిండి కేనుఁగుఁ గతిపైనఁ దివిరి దానిఁ
దనుప నొకపాటివానికిఁ దరము గాదు
చెడులు వినగోరు నేర్పడ సిగ్గు లేదు
వెంగబాఱుండు హస్తిని వెక్కసముగ.
| 137
|
శంఖిని
కూచిరాజు యెఱ్ఱన – కొక్కోకము
[189]సీ. |
వలమును పొడవునై బలసిన దేహంబు
నడుగులు నిడువు [190]లత్యంతకుపిత
రక్తపుష్పంబులు రక్తవస్త్రంబులు
|
|
|
నాశించు నధర మందంద యదరు
మదనగృహమున రోమంబులు దట్టంబు
రతిజీవనంబు [191]గారాలు వలపు
సంయోగమునఁ గామజల మల్పబిందువుల్
చిలుకు నఖక్షతంబులు ఘటించు
|
|
తే. |
నధికమును గొంచెమును గానియట్టి కుడుపు
వెచ్చనగు మేను కొండెంబు వినుచునుండు
గార్దభస్వర పైత్యంబు గలదు మిగుల
శంఖినీభామ కుటిలవాచాలసీమ.
| 138
|
[192]సీ. |
జఘనంబు లఘువు భాషలు మార్దవములు కే
శములు దీర్ఘములు దేహమును గృశము
కన్నులు మెఱుఁగులు చన్ను లున్నతములు
బొమలు వాలికలు కర్ణములు చెలువు
లుదరంబు పలుచన పదములు కఠినంబు
లారు సన్నము నాభి యందమొందు
కారంబు గలిగిన నీరు పెల్లై సన్న
మై మీఁద రోమంబు లధికమగుచు
|
|
తే. |
నుండు నుద్యానవనకేలి నుండఁగోరు
నధికమును గొంచమును గానియట్టి కుడుపు
గుడుచు రతివేళఁ జాల నెక్కుడు మదంబు
గలుగు శంఖిని చెలువగు వలుదమేను.
| 139
|
నారాయణదేవుఁడు – మదనకళాభిరామము
[193]సీ. |
అడుగును నడుము దేహంబును దీర్ఘంబు
లంగంబు నరములుఁ బొంగియుండుఁ
గొండె మెప్పుడు వినుఁ గోపించు బలుమాఱు
నొకపాటి వెచ్చనై యుండు మేను
దట్టమై యుండుఁ గందర్పునింటికిఁ గప్పు
బొదుకు ముంగిటఁ జాల నొదిగియుండుఁ
గావి గానికి సరిగాఁబట్టి దూవాడు
నంగజ జలములు నారతావి
|
|
తే. |
యరుణకుసుమాంబరంబుల కాస సేయు
మెసఁగు నొకపాటి ఘనముగాఁ గొసరి కొసరి
|
|
|
తఱచు పదనిచ్చు నఖముల దనివినొంచు
సురతవేళల శంఖిని సొంపు మిగిలి.
| 140
|
పద్మిని
కూచిరాజు యెఱ్ఱన – కొక్కోకము
[194]సీ. |
తామరమొగ్గ చందమున మెత్తని మేను
జలజగంధము రతిజలముఁ దనువు
మాలూరఫలముల మఱపించుఁ బాలిండ్లు
కొలుకుల కింపైన కలికిచూపు
తిలపుష్పముల వన్నె తిలకించు నాసిక
గురువిప్రపూజనాపరతనియమ
చంపకకువలయచ్ఛాయలు గల మేను
నబ్జపత్రముఁ బోలు నతనుగృహము
|
|
తే. |
హంసగమనంబు కడు సన్నమైన నడుము
శుచిలఘుమధుర భుక్తికి సొంపు గలదు
++++++++++++++++++++++++++++
మానవతి పద్మినీభామ మధురసీమ.
| 141
|
[195]సీ. |
రమణీయమృదుమధురాశి బాలకి గుణ
రత్నసాగర మృగరాజమధ్య
రాజన్యవిస్ఫురద్రావిజ[?]శుభగంధి
రాగానురక్త మరాళయాన
రాగసంయుతమృగార్భకనేత్ర శుభ్రవ
స్త్రప్రియ కోపదుర్వ్యసన జార
రాజకీరాలాప రసికనిరంతర
[196]రతిమత్తకేళినిరతి యనంగ
|
|
తే. |
ధరజ నిచ్చునట్టి వరపద్మినియు మధు
రములు గోరు నాశురమునఁ జిత్త
రంబు నంబు లేదు ప్రతిదినంబున శీల
కార్యముల మెలఁగు బుధులు ప్రమద మెసఁగ.
| 142
|
నారాయణదేవుఁడు – మదనకళాభిరామము
[197]సీ. |
క్రొవ్వారు చనుఁగవ నవ్వు మారెడుఁబండ్ల
కడునెఱ్ఱనై యుండు వెడఁద కనులు
తిలపుష్పసౌభాగ్య మలవడు నాసంబు
కలహంస వోలిక గలుగు నడపు
అరవిందకెందమ్మిమర యను మరునిల్లు
కువలయరుచి మించు క్రొత్త మెఱుపు
చెలువంబుఁ గల మేనుఁ జిత్తజజలమును
గమలగంధము గల్గి యమరు సిగ్గు
|
|
తే. |
గలిగి యొప్పెడు గరిగలికలను జెలఁగు
వెల్లఁ జీరలుఁ దెల్లని విరులుఁ గోరు
కుడుపుకొని [198]పేదవిప్రుల గురుల సురల
సరవితోఁ గొల్చుఁ బద్మినీజాతి నాతి.
| 143
|
బాలకు
[199]మ. |
అమితస్వచ్ఛ మచుంబితాధర మపూర్వాసంగవిద్యాసురం
గ మదంతక్షతకంఠ మగ్రహణకక్షాస్థానయుగ్మం బనిం
ద్య మహేయం బవలం బనాంకురితరోమాంచంబు బాలాంగనా
గమసంభోగము నింపు సొంపు విటలోకప్రీతి గాకుండునే.
| 144
|
[200]క. |
వలరాజునకుం గట్టిన
యిలు సంసారంపు సరకు లెక్కించెడి పె
న్గలము సమస్తసుఖంబుల
మొలకసుమీ బాలయైన ముద్దియఁ దలఁపన్.
| 145
|
యౌవన
[201]చ. |
ఎడపక తియ్యవింటి తెగ నెక్కిన బాణము దుఃఖవార్ధికిన్
గడపయి దాఁటరాని సుడిగాలి విరక్తులకెల్ల గుండెత
ల్లడము శరీరలక్ష్మికి విలాసము లోకవికాసమాన పెన్
బొడవుఁ దలంచిచూడఁ బువుబోఁడుల జవ్వన మెవ్విధంబునన్.
| 146
|
[202]ఆ. |
చన్ను లంటిరాలు కన్నులు కలుకులు
మాట లెల్ల మదనమంత్రరతులు
తొడవు లేల పెట్టఁ బణఁతుల కెల్లను
అడరి జవ్వనంబ యొడలి తొడవు.
| 147
|
ప్రౌఢ
[203]సీ. |
నెఱినాఁటి మెఱుఁగులు గిఱిగొన రోషంపుఁ
జూపుల రూపుగఁ జూడ నేర్చుఁ
గూటంబు మీఁదటి కూటంబులకుఁ బ్రోది
గాఁగ నింపుల ముంపి గదియ నేర్చుఁ
దేనియకంటెను దియ్యనౌ పల్కులు
చెవులకుఁ బువులుగాఁ జెప్ప నేర్చు
వేడుకమై వింత వింత చందంబులు
ప్రేమంబు మొలిపించి పెనఁగ నేర్చుఁ
|
|
ఆ. |
దగులుఁ జేయ నేర్చుఁ దగిలి పాయఁగ నేర్చు
దవి యెఱుంగ నేర్చుఁ దగవు నేర్చు
మాయఁ దెలియ నేర్చు మాయ సేయఁగ నేర్చు
ప్రౌఢఁ దెలియ లేఁడు మూఢవిటుఁడు.
| 148
|
[204]చ. |
మలయసమీరణంబునకు మానము దూలదు తేఁటిమ్రోఁతకున్
గలగదు పుష్పదామములు గన్నఁ జలింపదు తీపి పుట్టఁగాఁ
బలికెడు రాజకీరముల పల్కుల కుల్కదు చందమామకున్
దలఁకదు దర్పకుం డనినఁ దల్లడమందదు ప్రౌఢ ప్రౌఢిమన్.
| 149
|
లోల
[205]ఉ. |
వేడుక వీడుకొల్పియును వే గిరియంగ ననంగకేలికిన్
ద్రాడువడంగ నా బలిమిఁ దా విటులం గరగించు లోలపై
యోడక మన్మథుండు తనయుబ్బున నేసిన మర్మకర్మముల్
గాడవు వాడ వల్ల కసుగందిన యా వెడపూవుటమ్ములే.
| 150
|
కూచిరాజు యెఱ్ఱన – కొక్కోకము
[206]చ. |
ముదముఁ దలిర్పఁ జిత్తినికి ముందటి ఝామునఁ గూడఁ జాల సం
మదము వహించు హస్తిని క్రమంబున రెండవ ఝామునందు నిం
పొదవఁ దృతీయఝాము రతియోగము శంఖిని కంత పద్మినీ
ముదితకు నంత్యయామమున మోహము పుట్టు నహర్నిశంబునన్.
| 151
|
నారాయణదేవుఁడు – మదనకళాభిరామము
[207]చ. |
తలకొని యంగుటంబును బదంబును గుత్తియు జానువుల్ విని
ర్మలజఘనంబు నాభియు నురంబుఁ గుచంబును బాహుమూలముల్
గళమును జెక్కుమోవియును గన్నలికంబుఁ దిరంబు నెక్కు కాం
తల వలదిక్కు వెన్నెలను దర్పకుఁ డివ్వల డిగ్గుఁ జీకటిన్.
| 152
|
అలుకలు
ముక్కు తిమ్మన – పారిజాతము [1-99]
[208]ఉ. |
మాసిన చీర గట్టికొని మౌనముతోడ నిరస్తభూషయై
వాసెనకట్టు కట్టి నిడువాలిక కస్తురిబొట్టు వెట్టి లో
గాసిలి చీఁకటింటి కడకంకటిపై జలదాంతచంద్రరే
ఖాసదృశాంగియై పొరలె గాఢమనోజవిషాదవేదనన్.
| 153
|
[209]సంకుసాల సింగన – కవికర్ణరసాయనము [4-150]
[210]ఉ. |
[211]పట్టకు పట్ట కేల ననుఁ బట్టెద వోరి బిగించి కౌఁగిటన్
బట్టెదవే వృధా యెరియఁ బట్టగు నీకయి మత్కుచద్వయీ
ఘట్టనచేత నిప్పు డెఱుఁగం దలపోయవుగాక యెవ్వతెన్
బెట్టినవాఁడవో హృదయపీఠిక దానికి నొత్తుడౌఁజుమీ.
| 154
|
[212]క. |
[213]తలఁపెత్తి యొండు పేరన్
బిలిచినఁ దప్పేమి నీకుఁ బ్రియమగు సతిగాఁ
దలఁచుట చాలదె నాక
ప్పొలతుక నామంబుఁ దాల్చు పుణ్యము గలదే.
| 155
|
కానుకొల్లు అన్నమరాజు - అమరుకము
[214]ఉ. |
ఏమిటి కింతలేసి హృదయేశ్వరి ముద్రుఁడ వోలె నాలుగో
ఝామున వచ్చి పాదజలజాతము లొత్తెద వక్కటా భవ
|
|
|
త్కోమలపాదపద్మములకున్ దగుఁగాక మదీయసేవ యే
యే మదిరాయతేక్షణల యిండ్లకు నింతని డాసినాఁడవో.
| 156
|
కూర్మి
[215]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-144]
[216]ఉ. |
ద్రోహము లేనిచోట [217]విభుఁ ద్రోచిన ద్రోహఫలంబు [218]గాదె ని
న్నీ హరిణాంకుఁ డింత [219]యెరియించుట వెన్నెల కోర్చునంత నే
సాహసి [220]నెట్లు నాయెడఁ బ్రసన్నకృపామతివై లఘుత్వసం
దేహము [221]లేక వల్లభునిఁ దెచ్చు విదగ్ధవు నీవు నెచ్చెలీ!
| 157
|
[222]చ. |
ఎడ[223]వడు మాటలేల చని యేన ముఖాముఖిఁ బిల్తుఁ బిల్వఁగా
నొడఁబడి రాఁడయే నతని కొప్పన సేయుదుఁ బ్రాణమన్న నీ
నడుమన నన్ను [224]జీవముఁ గొనం దలకొన్నది యో [225]వయస్య యీ
విడువని [226]వేలమై కురియు వెన్నెల చిచ్చున కేమి సేయుదున్.
| 158
|
[227]చ. |
తడయుట కోర్వలేక యొకతన్వి మనఃపరికల్పనంబుచే
నెడ[228]పక వల్లభుం డెదుటి కేర్పడ వచ్చినయట్ల తోఁపఁగా
[229]నుడుగని కోర్కులం బొరలుచుండి యతం డ[230]రుదేఱఁ గాంచియున్
[231]దడియకయుండు నెప్పటివిధంబునఁ గౌఁగిటఁ జేర్చు నంతకున్.
| 159
|
చ. |
తొడవులు పెట్టి సంభ్రమముతోఁ దిలకించు మడుంగుఁ గట్టుఁ బై
బడుఁ [232]దడవోర్చుఁ దెం పెఱిఁగి పట్టదు నేర్పులు గట్టి పెట్టుఁ బ
ల్కెడునెడఁ దొట్రుపా టొదవుఁ గింకకు [233]బెగ్గిలమై చెమర్పఁగా
జిడుముడిఁ బొందుఁ గాంత పతిఁ జేరిన కూరిమి గల్గెనేనియున్.
| 160
|
భాస్కరుఁడు – శృంగారరత్నాకరము
[రసాలంకారము?]
చ. |
లలనలుఁ గొంద ఱాత్మవరులన్ దమకూడిన చెయ్వు లన్నియున్
దలఁచి సఖీజనంబులకుఁ దప్పక చెప్పెడువారు [234]పుణ్యజీ
|
|
|
వులు చెలియా మదీశుని కవుంగిలి డాయుడు నాకు [235]వల్పురే
ల్దొలఁగు టెఱుంగబోలు నట తోఁపవు మీఁద రతిప్రయోగముల్.
| 161
|
చీఁకటి
[236]ఉ. |
పాయని వేడ్కలై చెలువ పంకజబాంధవ బింబదీపమున్
పాయఁగఁ దీసి యెంతయు నభంబను మూకిట నించు కజ్జలం
బాయెడ భూమిపాత్రికకు నల్లనఁ జార్చె ననం దమిస్ర మ
త్యాయతనీలిమోన్నతుల నందె మహీగగనాంతరంబునన్.
| 162
|
[237]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-91]
సీ. |
కరచి చిప్పలఁబట్టు కత లెఱుంగము గాక
వ్రాయంగ నిది మషీరసము గాదె
యిది కణంబులు సేయు నిర వెఱుంగము గాక
నీలాల సరులు గావింప రాదె
కరవటంబులఁ బెట్టు వెర వెఱుంగము గాక
వనితల కిది నవాంజనము గాదె
కడవలఁ గొని ముంచు గతి యెఱుంగము గాక
చేలల కిది మంచి నీలి గాదె
|
|
తే. |
పోవఁడే నిది రవినైనఁ బొదువుఁ గాదె
యంకమను పేర నురముపై నచ్చు దాల్చుఁ
గాక శశినైన నిది మ్రింగఁ గాదె యనఁగఁ
బ్రబలమై గాఢతమతమఃపటలి పర్వె.
| 163
|
శ్రీనాథుఁడు - భీమఖండము [2-35]
సీ. |
గిరినికుంజములఁ గుంజరపుంజమను శంకఁ
గంఠీరవంబు లుత్కంఠ నెగయఁ
[238]బల్వలంబులఁ [239]గిరిప్రకరంబులను శంక
నెఱుకురాజులు విండు లెక్కు [240]వెట్టఁ
గడలి మధ్యంబునఁ గాకోలమను శంక
జలదేవతలు భీతి సంభ్రమింప
నదులలోఁ గువలకాననవాటమను శంక
నిందిందిరశ్రేణు లెదురుకొనఁగ
|
|
తే. |
రజతగిరియందుఁ దాండవారంభరభస
భంగిపతిత[241]పరశ్వథపాణివికట
కంధరా[242]రుద్ధగజ[243]కృత్తికంథశంక
ప్రమథులకుఁ దోఁప నంధకారంబు ప్రబలె.
| 164
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-34]
సీ. |
దినవారరాశి మాపను మౌని గ్రోలంగ
నడుగునఁ గనుపట్టు నస లనంగఁ
గ్రుంకు[244]మెట్టడవిఁ [245]గార్కొనిన సంధ్యావహ్నిఁ
[246]బొడమిన దట్టంపుఁబొగ యనంగఁ
దన మణి పడిపోవ ధరణీతలంబున
నెమకంగ వచ్చిన నింగి యనఁగ
నల చుక్కలనియెడి వలరాజు గెలుపువ్రా
[247]ల్దెలియఁ [248]బూసిన మషీలేప మనఁగ
|
|
తే. |
[249]వృద్ధవారవిలాసినీవిసరమునకు
నపలితంకరణౌషధం బనఁగ జార
నలినముఖుల కదృశ్యాంజనం బనంగ
నంధకారంబు [250]జగమెల్ల నాక్రమించె.
| 165
|
ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము [4-124]
[251]సీ. |
గగన[252]పల్వలసముత్కటమహాపంకంబు
నందుఁ ద్రుళ్ళెడు లులాయం బనంగ
రజనీవధూటి తారకహారశోభకై
[253]రమణఁ దాల్చిన నీలిరవికె యనఁగ
బ్రహ్మాండపటుకర్పరమున నర్కానలా
ర్చుల నుద్భవించు కజ్జల మనంగఁ
గాలధాత్రీధరాగ్రమునందు నిబిడమై
కనుపట్టు నీలమేఘం బనంగ
|
|
తే. |
నంధకాసురగర్వాపహరణకంఠ
ఘటితహాలహలప్రభ [254]గగనరేఖ
[255]బలిమి జగమంతయును [256]నింత బలసె ననఁగ
నంధకారంబు [257]జగమెల్ల నాక్రమించె.
| 166
|
ఫణిదవు మాధవుఁడు - ప్రద్యుమ్నవిజయము
[258]క. |
నెఱయఁగ బ్రహ్మాండం బను
కఱటమునం గాటు [259]కడును గలిపిన భంగిన్
గఱిగొని చీఁకటి కన్నులు
దెఱచిన మూసినను నొక్క తెఱగై యుండెన్.
| 167
|
అయ్యలార్యుని సింగయ – పద్మపురాణము – ఉత్తరఖండము
[260]క. |
కనువిచ్చుటయును మోడ్చుట
యును సరి నుయి గొండ యనుచు నొక్కటియైనన్
దనరి పెనుసూదిఁ బొడిచిన
జినుఁగక యతినిబిడమైన చీఁకటి పర్వెన్.
| 168
|
రాత్రి
[261]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-85]
ఉ. |
తారకశంఖహారయు నుదారతమోసితకంచు[262]కావృతి
స్ఫారయు నైన యా రజని భైరవి భైరవిఖేలనంబు పెం
పారఁగ వారుణీకలితమై రుచి మించిన సాంధ్యరాగసం
భారము పేరి భూరినవమాంసతతిన్ [263]గబళించె నంతటన్.
| 169
|
జారలక్షణము
సీ. |
తల విప్పి ముడుచుట తన శరీరము గోళ్ళ
నలముట[264] చేత రొమ్మంటుకొనుట
చేరువఁ గూర్చున్న చెలికత్తెపై [265]నీల్గి
యావులించుట నొయ్య నడిగికొనుట
తనుఁ గనుగొన్నచో దండంబు పెట్టుట
[266]యన్యాపదేశంబు లాడుకొనుట
నా మాట వినుమని నయముగా నొకరితోఁ
బలుకుట యొకరిచే పట్టుకొనుట
|
|
తే. |
వీడియము చేసి శిశువునో [267]ర్విద్రిచి పట్టి
తమ్మిపెట్టుట పసిబాల నెమ్మిఁబట్టి
యందియిచ్చెడిగతి దేహ [268]మంటుకొనుట
జారగుణముల జనుల లక్షణము లయ్యె.
| 170
|
సీ. |
[269]అత్త మామయుఁ దల్లి యన్నలు మఱదులు
గలుగ కింటికిఁ దాన కర్తయైన
పుట్టినింటనె యున్నఁ బొరుగిల్లుఁ ద్రొక్కినఁ
దీర్థోత్సవములకుఁ దిరుగుచున్న
పరదేశమున నున్నఁ బరపురుషుల గోష్ఠిఁ
బ్రియము పుట్టిన నాజ్ఞ వెట్టకున్న
జారకాంతలతోడి సంసర్గ చేసిన
గులధర్మ మెంతయుఁ [270]గుతిలపడిన
|
|
తే. |
మగడు ముసలైన మిక్కిలి మలినుఁడైన
దూర మరిగిన దీనుఁడై చేరకున్న
కఠినరతుఁడైన నేప్రొద్దుఁ గలహియైన
సతి పరద్వారి యగు నెల్లజాతులందు.
| 171
|
[271]సీ. |
మగనివారెవ్వరు మందిరంబున లేక
జవ్వనంబునఁ దన చనవయైన
నెల్లకాలము పుట్టినింటనె నిల్చిన
యాత్రోత్సవములకు నరుగుచున్నఁ
బని లేక పొరుగిల్లు పలుమాఱు ద్రొక్కిన
మగవారితో గోష్ఠి మానకున్న
చెడ్డయింతులతోడి చెలిమి యొనర్చిన
వరుఁడు ప్రవాసైకనిరతుఁడైన
|
|
తే. |
విభుఁడు గొనబైన మిక్కిలి వృద్ధుఁడైన
బచనికాఁడైన నెప్పుడుఁ బరుసనైనఁ
దన్ను మెచ్చక యొకతెను దగిలెనేనిఁ
జెడక తక్కదు ధర నెట్టి పడఁతియైన.
| 172
|
ఉభయకవి లక్కాభట్టు - శతపక్షిసంవాదము
[272]శా. |
నీవీబంధము వీడు మోవి యదరున్ నేత్రంబు లల్లాడుఁ జ
న్గ్రేవ ల్గానఁగ వచ్చుఁ గ్రొవ్వెడ విరుల్ పృథ్వీస్థలిన్ రాలు హృ
ద్భావాగారము లోనఁ జెమ్మగిలుఁ జిత్తం బుత్తలంబొందు నా
నావిభ్రాంతులు పుట్టు నింతులకుఁ బొంతన్ వింతవారుండినన్.
| 173
|
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – జైమిని భారతము [3-28]
[273]చ. |
[274]ఒఱపరిఁ గన్న గూడఁ జను నొయ్యన సన్నలువాఱ నాడుఁ ద
త్తఱపడు బోఁటి [275]బిల్చెడువిధంబున నొత్తిలి పల్కు నవ్వుఁ బ
ల్మఱుఁ బొరుగింటి కేగు నొకమట్టున నిల్వదు చంటిమీఁది [276]ముం
జెఱఁ గెడలించు వైశికపుసిగ్గు నటించును జార ధారుణిన్.
| 174
|
[277]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-107]
[278]సీ. |
శ్రవణయోగ్యంబైన శబ్దమొక్కఁడు లేక
ప్రియము గొల్పెడు [279]నలంక్రియలు లేక
సరసమై మృదులైన శయ్య గల్గుట లేక
యర్థసంగ్రహముపై నర్థి లేక
వరుఁడు వట్టినచోటఁ బ్రత్యుత్తరము లేక
ప్రాణహానికిఁ గొంకుపాటు లేక
వర్ణ[గౌరవ]లాఘవములపై మతి లేక
[280]వృత్తభంగమునకు వెఱపు లేక
|
|
తే. |
తారుదారయ తక్క నెవ్వారు నొరులు
దడవ రొకమూలఁ బడి ప్రసిద్ధములు గాక
యపుడ విద్వత్ప్రబంధంబు ననుకరించె
జారిణీజారనవరహస్సంగమములు.
| 175
|
ఉ. |
కోటలు బొమ్మరిండ్లు మఱి కొండలు తాపలు దివ్యదృష్టికిన్
గాటుక లంధకారముగాఁ జని కందువపట్లఁ బాంసులా
పాటలగంధు లొంది రుపభర్తలతో మణితాదులైన జం
ఝాటము లేని కూటముల సాహస[281]కల్పలతాఫలంబులన్.
| 176
|
చ. |
కులసతి శిష్టమార్గమునకున్ మది నిల్చిన దాఁటరామికిన్
గులము మహాంబురాశి పతి కొండ గృహాంగణ మంధకూప మా
కులసతి దుష్టమార్గమునకున్ మది నిల్చిన యేని దాఁటఁగాఁ
గుల మొకగోష్పదంబు పతి గుండు గృహాంగణ మాటపట్టగున్.
| 177
|
దూతికావాక్యములు
[282]సీ. |
గౌతమమునిరాజు కాంత గాదె యహల్య
దేవేంద్రుతోఁ గోర్కెఁ దీర్చుకొనదె
[283]ఆదిత్యగురుకాంత గాదె తారాదేవి
శిష్యచంద్రుని ప్రియుఁ జేసికొనియె
దాశరాజుతనూజ గాదె యోజనగంధి
సమ్మతింపదె పరాశరునిఁ గవయ
పరమపావని గాదె భాగీరథీగంగ
శంతనుతో రతి సల్పుకొనియె
|
|
తే. |
ద్రౌపదీకాంత కేవురు ధవులు గారె
గొల్లెతలు కృష్ణుతో నొనఁగూడి మనరె
కానఁ దొల్లిటివారును గలసినారు
జారుఁ బొందిన నేమి దోసంబు సతికి.
| 178
|
[284]సీ. |
కాంతబింబాధరక్షతము నాథుఁడు గన్నఁ
జిలుక ముద్దాడె నీ చెలువ యనుచుఁ
గొమ్మ చెక్కిలి యొత్తు కోరు నాథుఁడు గన్నఁ
గేతకిఁ గొట్టె నీ నాతి యనుచు
సుదతి కేశములు జుంజురులు నాథుఁడు గన్నఁ
బూఁబొద దూఱె నీ పొలఁతి యనుచు
రమణి మేనునఁ జెట్టరాఁగ నాథుఁడు గన్న
నీరెండ గ్రాఁగె నీ నారి యనుచు
|
|
తే. |
నబ్జముఖి దప్పి ప్రాణనాయకుఁడు గన్నఁ
గొలుసు గంపెడు దంపె నీ కొమ్మ యనుచు
లలన జారునిఁ బొందిన లక్షణములు
పురుషుఁ డీక్షించ దూతిక పోయి బొంకు.
| 179
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-52]
[285]చ. |
వలిపెము గట్టి హారములు వైచి పటీరము మై నలంది జా
దులు నెఱిగొప్పునం దుఱిమి త్రోవను బోయితిమేనిఁ దాఁకియున్
దలఁచెడివారు లేరని మనంబు కలంకలఁ దేర్చు జారకాం
తల సమయస్థలంబులకుఁ దార్చిరి దూతిక లట్టి వెన్నెలన్.
| 180
|
చోరకులు
అభినవదండి కేతన – దశకుమారము [5-72]
చ. |
[286]పొయితల నీలిదం డొలికి బూడిదె ముండుల [287]బంతి గావిచీ
రయు సెలగోల [288]కత్తి భ్రమరంబుల క్రోలుని మైలమందుకొ
య్యయు [289]నురి[290]గ్రొంకి నారసము లాదిగఁ గల్గిన సాధనంబు లి
న్నియు సమకూరఁజేసికొని నేర్పున నేఁగితి మ్రుచ్చు ప్రొద్దునన్.
| 181
|
[291]చ. |
కలికము నీలికాసెయును గన్నపుఁగత్తియు మేనికాపుముం
దలములు బంతికుంచెయును దాలము చేయును జొక్కుమందు కు
క్కల గుదిగట్టు తుమ్మెదల గ్రమ్మిన క్రోవియుఁ గొంకి నారసం
బలవడఁ బూనెఁ జిక్కన మహాత్ముఁడు చోరకులావతంసుఁడై.
| 182
|
చంద్రకిరణములు
పణిదపు మాధవుడు - ప్రద్యుమ్నవిజయము
చ. |
దలదవదాతకంజదళధాతకనత్కలధౌతమల్లికా
వలులు విలాసలీల శరవర్గమృణాశమనోజ్ఞహారవ
ల్గుల రవణంబునన్ సకలలోకనుతోజ్జ్వలకందబృందకం
దళముల ఛాయఁ జంద్రకిరణంబులకుం దెలుపెక్కె నంతటన్.
| 183
|
చెదలువాడ ఎఱ్ఱాప్రెగడ - నృసింహపురాణము [3-86]
[292]చ. |
దెసలను గొమ్ము లొయ్య నతిదీర్ఘములైన కరంబులం బ్రియం
బెసఁగఁగ నూఁది నిక్కి రజనీశ్వరుఁ డున్నతలీలఁ జేర్చు నా
కస మనుపేరి భూరుహము కాంతనిరంతరతారకాలస
త్కుసుమచయంబు గోయుట కొకోయనఁ బ్రాఁకె సముత్సుకాకృతిన్.
| 184
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-40]
[293]తే. |
అమరు లమృతాంబునిధిలోని యమృతరసము
వెండిచేరులఁ బటికంపుఁగుండ కట్టి
చేఁదుకొనియెదరో [నాఁగ శీతరోచి]
మెఱుఁగు మేనితో మెల్లన మిన్ను వ్రాఁకె.
| 185
|
[294]సీ. |
కెరలి చీఁకటిమ్రాను గెడపంగ నిక్కిన
సమయగజంబు దంతము లనంగఁ
|
|
|
జదలుగేదఁగి తూర్పు తుదకొమ్మ నరవిరి
యై కానిపించు పూరేకు లనఁగఁ
బొడుపుగుబ్బలి [295]నేల పురిటింటి యిడుపునఁ
జఱచిన గందంపుఁజట్ట లనఁగ
మరుని ముందఱ బరాబరిసేయు కంచుకి
కులము చేతుల వెండిగుదియ లనఁగఁ
|
|
తే. |
గైరవములకు [296]వెన్నెల నీరు వఱపఁ
బూని చేర్చిన పటికంపుదోను లనఁగఁ
గ్రమముతో శీత[కర]మయూఖములు గగన
భాగమునఁ గొన్ని యల్లనఁ [297]బ్రాకుఁదెంచె.
| 186
|
చంద్రబింబము
ముక్కు తిమ్మన – పారిజాతము [2-45]
[298]మ. |
కడఁకన్ రేచెలిగట్టుపట్టిఁ దను వేడ్కం గూర్ప నేతెంచి పై
జడిగాఁ జక్కల తూపులేయఁ గినుకన్ జాబిల్లిముక్కంటితాఁ
బొడుపుంగెం పనువేఁడికంట నిరులన్ బూవిల్తు [299]మేనేర్చి చొ
ప్పడఁ దద్భూతి యలందె నా నపుడు బింబం బొప్పెఁ బాండుద్యుతిన్.
| 187
|
చంద్రోదయము
పెద్దిరాజు – అలంకారము [3-111]
క. |
మండలశోభయుఁ గైరవ
షండవికాసంబు జలధిసమజృంభణమున్
గొండొక వెన్నెలఁ గ్రోలెడు
నండజముల విధుని బొడుపునం దగుఁ బొగడన్.
| 188
|
[300]మ. |
అది రౌద్రాకృతిఁ దోఁచెఁ [301]జంద్రుఁడు మయూఖాటోప మేపారె న
ల్లదె మున్నాడెఁ జకోరసంఘ మదె జ్యోత్స్నాపానసంక్రీడకై
యదయుం డంగజుఁ డింక నెట్లగును నీ యాలోకనేందీవరా
పదఁ [302]దూలించెడు చంద్రవంశజుని నొప్పంజూతు రమ్మా సఖీ!
| 189
|
[303]సీ. |
చిత్తజాంతకశిరస్సింహాసనంబుపై
నిండువేడుకఁ గొలువుండు రాజు
ప్రొద్దుప్రొద్దుకుఁ దండ్రిఁ బొడగన్న [304]నివటిల్లు
ప్రేమంబుతోడను బెంచు కొడుకు
భటులకుఁ బగలిచ్చి పని దప్పిపోకుండ
రాత్రులు గొలువిచ్చు రమ్యమూర్తి
నిర్జరావలి నెల్ల నెలనెల దప్పక
పడిపట్టుఁ బ్రోచిన ప్రభువరుండు
|
|
తే. |
ప్రొద్దు వెన్నంటి కలువల ప్రోదికాఁడు
జారచోరులపాలిటి చల్లజంపు
కొలఁది దప్పిన విరహుల గుండెదిగులు
చంద్రుఁ డుదయించెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు.
| 190
|
తులసి బసవయ్య – సావిత్రికథ
[305]సీ. |
జగదేకవైభవాస్పదమైన తనమేను
వేల్పుల కెవ్వాఁడు విందు సేసె
మన్మథాంతకు జటామండలం బెవ్వాఁడు
దిట్టయై తోరణ గట్టుకొనియె
వనజాతవాసిని కనుజుఁడై యెవ్వాఁడు
వేడ్క నంభోధి నావిర్భవించె
గాఢాంధకారసంఘములపై నెవ్వాఁడు
ధవళాంశుపటలంబు దాడి పెట్టె
|
|
తే. |
నట్టి వేల్పు నిశారాధ్యపట్టబద్ధుఁ
డభ్రకాసారరాజహంసార్భకంబు
తారకాలోకసౌఖ్యప్రధావిభూతి
నమరుఁ గళలకుఁ దానకం బనగఁ బఱఁగి.
| 191
|
[306]సీ. |
అంగసంభవుప్రోషితాలంభవిధిఁ బ్రతి
ష్ఠింప మండెడు హేమశిఖి యనంగఁ
దిమిరాఖ్యభూతతృప్తికిఁ బాచి యను వేఁట
నఱకిన మెడపట్టు [307]నఱ కనంగ
నాతపతప్తకల్హారలక్ష్మి నిశాం
గన యిచ్చు మడతచెంగావి యనఁగఁ
|
|
|
గౌముదీసుధ వోయఁగాఁ జకోరములకు
నలువ యెత్తెడు రత్నకలశ మనఁగ
|
|
తే. |
జారతస్కరలోకసంహారమునకు
సమయ మనియెడు నలికలాంఛనుఁడు చాలఁ
గినిసి తెఱచిన యలికలోచన మనంగ
నిండుకెంజాయఁ జంద్రుఁడు నింగి వొడిచె.
| 192
|
ఎఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
[308]సీ. |
మన్మథదివ్యాగమమున కోంకారంబు
భూతేశు నౌదలఁ బువ్వుదండ
యమితశృంగారరేఖార్గళకుంచిక
యధికతమోదంతి కంకుశంబు
విరహిణీజనమర్మవిచ్ఛేదకర్తరి
యంబరక్రోడదంష్ట్రాంకురంబు
తారకామౌక్తిక[309]తతికి నంచితశుక్తి
తగిన భోజునికి ముత్యాలజోఁగు
|
|
తే. |
మారుపట్టాభిషే[310]కాగ్రవారికుంభి
చిత్తజుని కోటలగ్గదంచెనపుగుండు
నాఁగ నానాఁటి కబివృద్ధి నారుకొనిన
చంద్రుఁ డుదయించెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు.
| 193
|
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – శాకుంతలము [3-154]
[311]మ. |
కుముదోజ్జీవనమంత్ర మంగజభుజాకోదండగర్వంబు సం
తమసానేకపకూటపాకలము, జ్యోత్స్నావర్షివర్షాపయో
దము పాంథవ్రజచిత్తశల్యము నిశాధమ్మిల్లబంధూకగు
చ్ఛము, ప్రాచీనగశృంగవీథిఁ బొడిచెం జంద్రుండు సాంద్రద్యుతిన్.
| 194
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-41]
చ. |
అమరుల బోనపుట్టిక సహస్రమయూఖుని జోడుకోడె సం
తమసము వేరువిత్తు కుముదంబుల చక్కిలిగింత [312]పుంశ్చలీ
సమితికిఁ జుక్కవాలు నవసారసలక్ష్మి తొలంగు బావ కో
కములకు గుండెతల్లడము కైరవమిత్రుఁడు దోఁచెఁ దూర్పునన్.
| 195
|
శాకల్య అయ్యలార్యుఁడు[313] – యుద్ధకాండ [2-661]
[314]సీ. |
నెలకొన నమృతంబు నిండారఁబోసినఁ
గొమరారు రాజీవకుంభ మనఁగఁ
జిరకాల[315]సంభృతవిరహపాండురమైన
వరయామినీవధూవదన మనఁగఁ
బాలసముద్రంబుఁ బాసివచ్చిన సుధా
గురుతరసారంపుఁ గుప్ప యనఁగ
వలరాజు శృంగార మలవడ [316]వీక్షింప
నమరింపఁదగు నిల్వుటద్ద మనఁగ
|
|
తే. |
వెలయ రాముని యభిషేకవిధికిఁ ద్రిదశ
కాంత లెత్తిన మౌక్తికకలశ మనఁగ
జీవలోకము మిక్కిలి చెలఁగుచుండ
మిగుల నభమునఁ జంద్రుండు వొగడ నెగడె.
| 196
|
శా. |
గంగాతుంగతరంగపాండురమయూఖశ్రేణి[317]కాహంసికా
భంగిం నింగికి నబ్ధికిన్ నడుమఁ బైపై నొప్పు ప్రాక్ క్షోణి[318]భృ
చ్ఛృంగాగ్రంబు నలంకరించె సితరోచిర్మండలం బభ్రమా
తంగోదంచితకుందకందుకము చందం బొందె రమ్యాకృతిన్.
| 197
|
తెనాలి రామలింగన - కందర్పకేళీవిలాసము
సీ. |
తారామనోరంజనారంభ మే దొడ్డు
శిలలు ద్రవింపంగఁజేయు ననినఁ
జాకోరహర్షయోజనకేళి యేదొడ్డు
పేర్చి యంభోధు లుబ్బించు ననినఁ
గుముదౌఘతాపోపశమకృత్య మేదొడ్డు
సృష్టి యంతయుఁ జల్ల సేయు ననిన
వరనిశాకామినీవాల్లభ్య మే దొడ్డు
వర్ణింప సత్కళాపూర్ణుఁ డనినఁ
|
|
తే. |
దనకు సర్వజ్ఞశేఖరత్వంబు గలుగ
హితసుధాహారవితరణం బేమి దొడ్డు
అనఁగ విలసిల్లె హరిదంతహస్తిదంత
కాంతినిభకాంతిఁ జెలువారి [319]కంజవైరి.
| 198
|
శ్రీనాథుఁడు - వల్లభాభ్యుదయము
సీ. |
రజనీవధూకర్ణరజతతాటంకంబు
వలరాజుధవళోష్ణవారణంబు
ప్రోషితయువతిహృత్పుటభేదదాత్రంబు
బహుచకోరకుటుంబపానపాత్ర
మధుకైటభాసురమథను దాఁపటికన్ను
చక్రవాకంబుల చల్లజంపు
దుగ్ధపాథోరాశి తొలిచూలి సంతతి
రోహిణీదేవితారుణ్యఫలము
|
|
తే. |
చంద్రకాంతశిలా[320]మణిస్థలకృపీట
నిర్థ[321]రాదోవ్యథామోక్షనియమవైద్యుఁ
డంధకారచ్ఛటాహాలహల[322]హరుండు
చంద్రుఁ డొప్పారెఁ గాంతినిస్తంద్రుఁ డగుచు.
| 199
|
చంద్రునిలో మచ్చ
[323]సంకుసాల సింగయ్య – కవికర్ణరసాయనము [4-132]
క. |
[324]ప్రమథపతిమూర్తిచంద్రుఁడు
తిమిరగజాసురు నణంచి తిత్తొలచిన త
త్యమధిక చర్మముఁ దాల్చిన
క్రమమున నంకంబు గడుఁ బ్రకాశితమయ్యెన్.
| 200
|
శ్రీనాథుఁడు – భీమఖండము [2-45]
సీ. |
రోహిణీగాఢోపగూహనంబునఁ గన్న
కస్తూరికాస్థానకం బనంగ
రాహుదంష్ట్రాఘాతరంధ్రమార్గంబున
లలిఁ దోఁచు నాకాశలవ మనంగ
నైర్మల్యమునఁ [325]జేసి నడుమఁ గానఁగ వచ్చు
కమిచి మ్రింగిన యంధకార మనఁగ
జన్మ[326]వేళను మంథశైలాభిఘట్టన
సంభవించిన కిణస్థాన మనఁగ
|
|
తే. |
విరహపరితాపభరమున వేఁగుచున్న
చక్రవాకాంగనల కటాక్షముల యగ్గి
|
|
|
[327]నావహిల్లిన కఱధూప మనఁగ నొప్పె
నడుగణాధీశబింబంబు నడిమి మచ్చ.
| 201
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-46]
చ. |
తొలుమలఱాతితో నొరయు తూరుపుఁదొయ్యలి ముత్తియంపుఁగుం
డలమున మానికంబు పడినం గనుపట్టెడు లక్కగూఁడు నాఁ
జలువలఱేని యప్పొడుపుఁజాయఁ దొఱంగిన కందు దోఁచె రే
చెలువ కనుంగవం గమియఁజెందిన కాటుకకప్పు కైవడిన్.
| 202
|
ఉ. |
ప్రేమముతోఁ జకోర[328]శిశుబృందము ముక్కుల కెక్కకుండ జ్యో
త్స్నామృతధార [329]వంచుటకు నై యుడురాట్కలశీముఖంబులన్
యామవతీవిలాసవతి యడ్డము వెట్టిన హస్తమో యనం
గా మెఱసెన్ బరిస్ఫురితకజ్జలదీధితిచిహ్న మయ్యెడన్.
| 203
|
రావిపాటి త్రిపురారి - తారావళి
మ. |
రతినాథుం డను మాయజోగి చదలం ద్రైలోక్యవైశ్యాజనం
బతియత్నంబునఁ గూర్చి మౌక్తికమయంబై యున్న పాత్రంబునన్
మతకం బేర్పడఁ బెట్టి దాఁచెనన మీ మధ్యంబునన్ మత్ససం
తతమున్ గన్నులపండువై వెలయు చంద్రా! రోహిణీవల్లభా!
| 204
|
చంద్రిక
సీ. |
గంగాప్రవాహంబు గాఁబోలు నని వసి
ష్ఠాదు లనుష్ఠాన మాచరింప
నమృతంపువెల్లువ యని నిలింపాదులు
మునుకొని దోసిళ్ళ ముంచి క్రోల
దుగ్ధాంబునిధి యని తోయజాక్షుఁడు శేష
పర్యంక మిడుకొని పవ్వళింపఁ
బరమేశు విశ్వరూపం బని బ్రహ్మాదు
లమరదండప్రణామములు సేయఁ
|
|
తే. |
దలఁప భూనభోంతరముల కొలఁది దెలిసి
[330]బెరసి యెనిమిది దిక్కులఁ బొరలి పొరలి
|
|
|
దట్టముగ నంతకంతకుఁ దనరి తనరి
[331]యిట్టలంబుగ వెన్నెల నిట్ట వొడిచె.
| 205
|
[332]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-135]
సీ. |
పయి సుధారోచితబింబము తక్రమునయందు
మునిఁగి తేలెడు వెన్నముద్ద గాఁగ
మహి విశ్రమించు దంపతులు పాల్కడలిలో
భాసిల్లు దివ్యదంపతులు గాఁగ
నింగి నాడు చకోరనివహంబు [333]మిన్నేటఁ
గలయ [334]నీదెడు నంచకొలము గాఁగ
దెసలఁ గైరవసముత్థితపరాగము వజ్ర
మయశైలతటులపై మంచు గాఁగ
|
|
ఆ. |
మీఁదఁ దొట్టి క్రింద మిక్కుటంబై యంత
రాళమెల్ల నిబ్బరముగ ముంచి
యెల్లకడలయందు మొల్లమై పండువె
న్నెల జగంబు కుక్షి [335]నిండి వెలిగె.
| 206
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-47]
మ. |
అమృతం బాసవ మంగరాగ ముదయోద్యత్కాంతి చేలంబు చి
హ్నమునుంగా శశిరేవతీరమణుఁ డున్మాదంబు మీఱం దమో
యమున న్భంగమునొంది పాఱఁ గరసీరాలోడితం జేయ వ
చ్చె మరుద్వాహిని దానిఁ దేర్ప నన మించెం జంద్రికాపూరముల్.
| 207
|
సీ. |
తళుకు సుప్పాణి + + + + మించిన
మెఱయు చుక్కల మేని మెఱుఁగు దరమి
కలికి రాయంచ ఱెక్కల ఠేవ గిలుమాడి
విరిమల్లె గుత్తుల మురువుఁ దెగడి
చదువుఁదొయ్యలి మేని చాయ నుల్లసమాడి
తె + + + + తెలివి గెలిచి
జిగిమీఱి తొగరేకు సిరులకు నన విచ్చి
పాపరాయని వన్నె క్రేపు చూపి
|
|
తే. |
పాల మున్నీటి తరఁగల పసల నవ్వి
కొండయల్లుని మైతెల్పు కొంచె పఱిచి
కుప్ప తిలజులు + + + గొనలు సాగి
వెలఁదివెన్నెల లెల్లెడ వెల్లివిరిసె.
| 208
|
[ధూర్జటి – శ్రీ]కాళహస్తిమాహాత్మ్యము [2-136]
చ. |
కుముదవనాళికిన్ బలుపు కోకము లాటకు నిల్పు దిగ్వధూ
సమితికిఁ బూఁత, మేత నవశాబచకోరకరాజి, కిందుకాం
తములకు ద్రావకం బగుచు దర్పకశాస్త్రనిరూపితౌషధ
క్రమములఁ బండువెన్నెలలు గాసె ధరాస్థలి మోహనంబుగన్.
| 209
|
చకోరసంవాదము
[336]జక్కన - సాహసాంకము [6-71]
సీ. |
పసగల వెన్నెల మిసిమి పుక్కిటఁ బట్టి
పొసఁగఁ బిల్లల [337]నోళ్లఁ బోసి పోసి
నున్నని [338]క్రియ్యని వెన్నెల తుంపర
యుహ్వునఁ జెలులపై నుమిసి యుమిసి
కమ్మని వెన్నెల కడుపు నిండఁగఁ గ్రోలి
[339]తెలివెక్కి గఱ్ఱనఁ [340]ద్రేన్చి త్రేన్చి
కన్నిచ్చలకు వచ్చు వెన్నెల క్రొన్నురు
వేఱి వే ప్రియురాండ్ర కిచ్చి యిచ్చి
|
|
తే. |
తఱచు వెన్నెలల గుంపులఁ దాఱి తాఱి
యీఱమగు వెన్నెలలోనఁ దూఱి తూఱి
పలుచనగు వెన్నెలలోనఁ బరువు లిడుచు
[341]మెలగెఁ జెక్కు చకోరంపుఁబులుఁగు గవలు.
| 210
|
[342]సంకుసాల సింగయ – కవికర్ణరసాయనము [4-139]
ఉ. |
పిల్లల కెల్ల మేపి మును పేర్చిన వెన్నెలతీఁగెలోఁ గొనల్
కొల్లగఁ దారునుం బతులు గుత్తుకబంటిగ మేసి గూండ్లలో
వెల్లులు గూడఁ [343]బోసికొను వేడుకఁ బుక్కిటఁ బట్టి చీఁకటుల్
ఝల్లునఁ బాఱగా నుమియఁ జాగిన కోరికలం, జకోరికల్.
| 211
|
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – శాకుంతలము [3-160]
చ. |
ఎఱుకలు దిద్ది కంధరము లెత్తి మొగిం జరలాట మున్నుగాఁ
బఱచుచు లేఁతవెన్నెలలు పారణసేయుచు మించి చంచులన్
నఱకినఁ దోనపుట్టు కిరణంపుఁగొనల్ గొన మోము మోముతో
నిఱియగఁ జేర్చి ప్రేయసుల కిచ్చుచునాడె దివిం జకోరికల్.
| 212
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-49]
సీ. |
విరహుల మైసోఁకి వేఁడియౌ వెన్నెలఁ
బచ్చివెన్నెల నులివెచ్చఁ జేసి
కలువపుప్పొళ్ళచేఁ గసటైన వెన్నెల
వలిపవెన్నెలలోన వడిచి తేర్చి
చంద్రకాంతపునీట జాలైన వెన్నెల
ముదురువెన్నెల జుఱ్ఱఁ బదను సేసి
సతుల మైపూఁతం బిసాళించు వెన్నెలఁ
దనుపువెన్నెల రసాయనము గూర్చి
|
|
తే. |
చిగురువిలుకాని జాతర సేయఁబూని
కులముసాము లందఱఁ గూడఁబెట్టి
వంతు గలయంగఁ బువ్వంపుబంతి విందు
పెట్టి రెలమిఁ జకోరపుఁబేరఁటాండ్రు.
| 213
|
ఎడపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
సీ. |
కొమరువెన్నెల[344]మోసు నమలి ప్రాణేశ్వరు
కొసఁగి యింపొనరించు నొక చకోరి
పరపువెన్నెలగుజ్జు బంతెనగూళ్ళాడు
నోలి నెచ్చెలులతో నొక చకోరి
పాటైన వెన్నెలతేఁట కేళాకూళి
నోలలాడుచునుండు నొక చకోరి
గట్టివెన్నెల చల్దిగాఁ గట్టి వల్లభు
నుడురాజు కడ కంపు నొక చకోరి
|
|
తే. |
[345]చేగవెన్నెలక్రొవ్వు భంజించి విందు
లొనరఁజేయును జుట్టాల కొక చకోరి
పండువెన్నెలపేస మేర్పఱిచి పతికి
నుబ్బుగా నిచ్చు [346]వేడుక నొక చకోరి.
| 214
|
పణిదపు మాధవుని ప్రద్యుమ్నవిజయము
సీ. |
బ్రాఁతియే యిఁకఁ గల్గు లేఁతవెన్నెల నిగ్గు
[347]లగ్గువెట్టెద నీకు నూరకుండు
మునుపుగా నీకిత్తు ముదరవెన్నెల[348]సోగ
సంతసంబున నుండు జాలి మాని
వేగిరింపకు నీకు వెలఁదివెన్నెలక్రొవ్వుఁ
గుడిపింతు జిన్నారి కడుపునిండ
|
|
|
[349]యింతముచ్చట వాయ నీఁదింతుఁ బండువె
న్నెలవెల్లి [350]బలుమాఱు నిన్నుఁ జేరి
|
|
తే. |
కూయకుఁడు మీరు సంతుష్టిఁ గూరినపుడు
శీతలంబగు వెన్నెల చిగురుపాన్పు
నందు నిడి నిద్రపుచ్చెద ననుచు నాద
రించె బిడ్డల నొకచకోరీపురంధ్రి.
| 215
|
వేగుఁజుక్క
తులసి బసవయ్య - సావిత్రికథ
తే. |
గగనలక్ష్మీవధూటికిఁ గలశవార్ధి
యుమ్మితోడ నుపాయనం బిచ్చినట్టి
క్రొత్తకట్టాణి ముంగఱముత్తె మనఁగ
జూడ నొప్పారి వేగురిఁజుక్క వొడిచె.
| 216
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-54]
మ. |
నలినాప్తుండు మదీయబంధువుల నీ నక్షత్రసంఘంబులన్
గలఁప న్వచ్చుచునున్నవాఁ డనుచు మున్గల్గంగ నాత్మీయ[351]శిం
ధులమందేహులఁ బోరొనర్పఁ జనుఁడంచుం బంపి నేతెంచెనాఁ
బొలిచెన్ వేగురుఁజుక్క కాలఫణభృద్భోగోల్లసద్రత్నమై.
| 217
|
పెద్దపాటి యెఱ్ఱాప్రెగడ – కుమారనైషధము
క. |
ఉడురాజు కొలువుదీరిన
నుడుగణపరివారసమితి నొఱవుగ ననుపన్
వడివచ్చు కటికవాఁ డనఁ
బొడజూపెన్ వేగుఁజుక్క పురుహూతు దెసన్.
| 218
|
పణిదపు మాధవుని ప్రద్యుమ్నవిజయము
తే. |
మిక్కుటపుఁగాంతి వేగురుఁజుక్క వొడిచె
బారెఁడెక్కిన యపుడు గన్పట్టి యుండె
నినుఁ డరుగుఁదెంచు [352]నని రాగ మెసఁగఁ బ్రావి
[353]మురువుగాఁ దాల్చు నాసికాభరణ మనఁగ.
| 219
|
తే. |
గాఢతరకాంతికై మ్రింగు కాంక్ష నంత
రిక్షకాపాలికుఁడు సంతరించినట్టి
గొప్ప యగు [354]సిద్ధపారదఘుటిక యనఁగ
జొక్కమగు కాంతి వేగురుఁజుక్క దనరె.
| 220
|
గంగాధరుఁడు – తపతీసంవరణము [3-105]
తే. |
అత్రిమునికంటి పసిబిడ్డఁ డాకసమున
నుడుగణము లాడకాడకు [355]నొడ్డగిలిన
బాలభానుండు నలుగడఁ బర్వ [356]మింట
వెండిగుండన నుదయించె వేగుఁజుక్క.
| 221
|
కుక్కుటధ్వని
తులసి బసవయ్య - సావిత్రికథ
ఉ. |
మాయపుఁదుంటవిల్తు వెడమాయలు మానినులార [357]ప్రాయముల్
వోయెడు నాఁడునాఁటి కిఁకఁబో విడుఁడీ యలుకల్ నిజేశులన్
బాయకుఁడీ యటంచుఁ బరిభాషలఁ జాటెడుభంగి కొక్కురో
కోయని కూఁత వేసెఁ దొలికోడి పురాంతరగేహదేహళిన్.
| 222
|
ఉ. |
రాయిడికత్తెలైన పెనుఁబాయిడి యత్తలయిండ్లఁ [358]గోట్రముల్
సేయు విలాసినుల్ [359]మునుకు సెందఁగ వేశ్యలప్రక్క దాపులన్
బాయని కాముకుల్ వెలుకబాఱి కలంగఁగ మ్రోసెఁ గొక్కురో
కోయని కుక్కుటస్ఫుటదకుంఠితకంఠకఠోరనాదముల్.
| 223
|
పిల్లలమఱ్ఱి వీరన – శాకుంతలము [3-199]
ఉ. |
తోయజపుష్పబాంధవుఁడు తూరుపుఁగొండకు రాదలంచె భూ
నాయకుఁడున్ శకుంతల మనం బలరన్ జనుదెంచుఁ దుమ్మెదల్
మ్రోయకుఁడీ శుకంబులు [360]నెలుంగులు సేయకుఁడీ పికంబులున్
గూయకుఁడీ ప్రమాదమని కూఁతలు చేసినభంగిఁ గొక్కెరో
కోయని బిట్టుమ్రోసెఁ దొలికోడి నికుంజకుటీరవాటికన్.
| 224
|
వీథినాటకము [క్రీడాభిరామము 54]
ఉ. |
మంచన వింటివో వినవొ మన్మథుఁ డేకశిలాపురంబునన్
జంచలనేత్రలన్ మగల శయ్యలపై రతికేళి రాత్రి వో
రించి ప్రభాతకాలము పరిస్ఫుటమైనను ధర్మదార వ
ర్జించుచునున్నవాఁ డదె కుటీ[361]గతకుక్కుటకంఠకాహళిన్.
| 225
|
చంద్రాస్తమానము
ముక్కు తిమ్మన – పారిజాతము [2-59]
సీ. |
చరమాద్రిదావాగ్నిసంప్లుష్టసురసౌర
భేయీకరీషైకపిండ మనఁగఁ
బహుచకోరకదంశపరిపీతచంద్రికా
క్షౌద్రనీరసమధుచ్ఛత్ర మనఁగఁ
బ్రత్యఙ్ముఖోచ్చలద్రాత్రివర్షీయసీ
పలితపాండురకేశబంధ మనఁగ
గగనసౌధాలేపకరకాలశిల్పిని
ర్ముక్తసుధావస్త్రముష్టి యనఁగ
|
|
తే. |
సుహిమహితజ్యోత్స్నికాలతాసుమగుళుచ్ఛ
మనఁగ నతిధూసరచ్ఛాయ నబ్జవైరి
చెలువు వోనాడి బింబావశిష్టుఁ డగుచు
నల్లనల్లన వ్రాలెడు నంబుజాక్ష.
| 226
|
శ్రీనాథుఁడు - శృంగారనైషధము [8-4]
మ. |
వరుణప్రేయసియైన దిక్కుఁ గదియన్ వాంఛించుచున్ జంద్రికా
పరిధానంబుఁ గ్రమక్రమంబునఁ బరిభ్రంశంబు నొందించు చం
దురినిం గన్గొని యింద్రదిగ్వనిత ప్రత్యూషప్రసాదోదయ
స్ఫురణవ్యాజమునన్ నిజాననమునన్ బూనెం బ్రహాసద్యుతిన్.
| 227
|
చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [3-108]
ఉ. |
రాతిరియెల్లఁ జాల ననురాగముతోడఁ గుముద్వతీరతిన్
భీతి భజించి ఖేదమునఁ బ్రేయసియున్ సొగియంగఁ దాను ను
ద్భూతపరిశ్రమార్తుఁడగు పోలికఁ జంద్రుఁడు పశ్చిమాబ్ధిశ
య్యాతలసుప్తికై డిగె ననల్పవిభావిరళాంగరాగుఁడై.
| 228
|
క. |
అంత నిశాసతి [362]ముదిసిన
నెంతయు లోఁగుంది కుంది యిందుఁడు చింతా
క్రాంతుండై కుముదంబులు
సంతాపముఁ బొంద నపరజలధికిఁ జనియెన్.
| 229
|
బొడ్డపాటి పేరయ – శంకరవిజయము
చ. |
తన రుచిగానివేళ బెడిదంబగు [363]దేజుఁ డినుండు దోఁచినన్
గనుమొఱఁగుంట రాజునకుఁ గర్జ మటం చెటయేనిఁ జన్నయ
ట్లనుచరులై వెలింగెడి గ్రహంబులుఁ దారలుఁ దోడ రాఁగ వే
గన చనె [364]వెల్లివెల్లని మొగంబు కళంకమున్ శశాంకుఁడున్.
| 230
|
తారాస్తమానము
చెదలువాడ యెఱ్ఱాప్రగడ - నృసింహపురాణము [3-109]
ఉ. |
చల్లనివాఁడు గావున నిశాచరు ప్రాపున [365]దీప్తి లీలమై
నెల్లజగంబులన్ మిలిగి [366]యిమ్ములనుండితి మింక నెంతయున్
దెల్లము తీవ్రమూర్తి యొరుతేజము సైపడు భానుఁ గూడి న
ర్తిల్లఁగ వచ్చునే యను గతిన్ దివిఁ జుక్క లడంగెఁ దోడుతోన్.
| 231
|
చ. |
వెలయఁ గళాఢ్యుఁడైన శశి వేడుకఁజేయు [367]రతోత్సవంబునన్
లలితరుచిస్ఫురద్గగనలక్ష్మిమనోహరహారమౌక్తికం
బులక్రియ నున్న తారకలు పూర్వసురాధిపు భాగ్యచిహ్నముల్
దొలఁగినమాడ్కి దృష్టిపథదూరము లయ్యెఁ గ్రమక్రమంబునన్.
| 232
|
శ్రీనాథుఁడు - శృంగారనైషధము [8-16]
చ. |
తటికున నస్తిమించెఁ బతి దైన్యముఁ జూడఁగ నోడి తారకా
పటలమునుం ద్రియామయును బాపురె యింతుల వాఁడిపంతముల్
గటకట! తద్వియోగమునఁ గ్రాఁగి నశింపఁడె నిష్ఠురాత్ముఁడై
పటికమొకో విధుండు నడుపట్టుకలంకము నల్లగారయో.
| 233
|
ఉ. |
చుక్కల నెయ్యపుందగవు సూచిన యామిని కూర్మిసూచినన్
జక్కన నాథు దీనతకుఁ జాలక మున్కడు నస్తమించె న
మ్మక్క! శిలావిశేషముగదా శశియశ్మము నీలరోచి గా
దొక్కొ కలంక నొల్లనని యోర్చెఁ దదీయవియోగదుఃఖమున్.
| 234
|
అరుణోదయము
మ. |
అరవిందప్రియవాది ఘోరతిమిరవ్యాళవ్రజస్ఫూర్తికిన్
గరుడుం డంచితదిక్సతీకుచతటీకాశ్మీరపంకంబు పు
ష్కరభాగా[368]టవికాగ్రపల్లవితమాకందంబు మందప్రభల్
బెరయం దూర్పునఁ [369]గుంటివేల్పు వొడసూపెన్ దపదండాకృతిన్.
| 235
|
శ్రీనాథుఁడు - కాశీఖండము [1-121]
సీ. |
చిఱుసానఁ బట్టించి చికిలి సేయించిన
గండ్రగొడ్డలి నిశాగహనలతకుఁ
గార్కొన్న నిబిడాంధకారధారాచ్ఛటా
సత్రవాటికి వీతిహోత్రజిహ్వ
నక్షత్రకుముదకాననము గిల్లెడు [370]బోటి
ప్రాచి యెత్తిన హస్తపల్లవాగ్ర
మరసి మింటికి మంటి కైక్యసందేహంబు
పరిహరింపఁగఁ బాల్పడ్డ యవధి
|
|
తే. |
సృష్టి [371]కందెర దొలుసంజ చెలిమికాఁడు
కుంటి వినతామహాదేవి కొండుకుఁగుఱ్ఱ
సవితృసారథి [372]కట్టెఱ్ఱ చాయఁ దేలు
నరుణుఁ డుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున.
| 236
|
వేఁగుఁదెమ్మెరలు
ముక్కు తిమ్మన – పారిజాతము [2-62]
మ. |
సమయాభీరకుమారుఁ డేపునఁ దమిస్రారూపనక్తంచరిం
గమలద్వేషణమండలీకుచగళత్కాంతిచ్ఛటాదుగ్ధపూ
రముతో రూపఱఁజేయ శోషిలుచుఁ దార ల్సోల నిట్టూర్పు సాం
ద్రముగా నూర్చె ననంగఁ బొల్పమరఁ బ్రాతఃకాల[373]వాతూలికల్.
| 237
|
తెనాలి రామలింగన – హరిలీలావిలాసము
చ. |
తెలతెలవాఱ నొయ్య నరుదెంచు నిశాంతరతాంతతాంతలౌ
చెలువల కింపుగా మెలఁగుఁ జెక్కులఁ గూరిన చూర్ణకుంతలా
వళి సదళంబుగా జడియు వాడిన సెజ్జలమీఁదఁ బ్రావిరుల్
దొలఁగఁగఁజేయు నూడిగపుఁదొయ్యలులం బలె వేఁగుఁదెమ్మెరల్.
| 238
|
సీ. |
కమలాగృహకవాటకలితకుంచిక నాఁగ
జలజకోరికరాజిఁ [374]గలయఁ దెఱచి
మధుకరాకర్షణమంత్రసిద్ధుఁడు నాఁగ
కుసుమరజోభూతి దిశలఁ జల్లి
సుభగలతానటీసూత్రధారుఁడు నాఁగ
నృత్యవిద్యాప్రౌఢి నెఱయ నేర్చి
సకలజీవోన్మేషసంజీవని యనంగఁ
బ్రకటనిద్రాముద్రఁ బాయఁ జేసి
|
|
తే. |
మందిరోద్యానవాటికలందుఁ బొలసి
వేఁగుఁబోఁకలఁ దత్పురి విశ్రమించు
శౌర్యమాంద్య[375]సౌరభ్యసాహిత్యమైన
మలయపర్వతసంజాతమారుతంబు.
| 239
|
తిక్కనసోమయాజి – ఉద్యోగపర్వము [2-112]
సీ. |
పద్మరాగంబులు పరఁగించు నరుణోద
యంబు కాంతికిఁ జెలువంబు మిగులఁ
బరువంబు దప్పిన విరులు రాలుచుఁ దరు
చయము చుక్కలు లేని చదలఁ జెనయ
నరవిరినెత్తావి నడరించు నున్నిద్ర
విటవీటిసౌరభవితతి వొదల
నెలఁత చీఱిన యెఱకల నెఱిఁదీర్చు జ
క్కవలు చందోయి కేఁకట యొనర్ప
|
|
ఆ. |
వెలరువాఱు దీవియల నార్చు నల్లన
సొరణగండ్లయందుఁ జొచ్చి సుడిసి
తిరిగి వేగుఁబోక తెమ్మెర లెలదీఁగ
కొనల వంక లొత్తు ననలఁ బ్రోచు.
| 240
|
చెదలువాడ - యెర్రాప్రగడ - నృసింహపురాణము [3-111]
సీ. |
వెడవెడ మూతులు విచ్చు తామరలపై
సుడిసి నెత్తావులు సూఱ లాడి
యనుఁగుఁదోఁటులు సొచ్చి యలరుదేనియఁ [376]జేసి
యెలదేఁటి పదువులఁ జెలఁగి నడచి
రాయంచకవల నిద్రలు దెల్పి కొలఁకుల
దరఁగ యుయ్యలయూట దగులు పఱిచి
సోర్ణగండుల సొచ్చి సురతఖేదము నొందు
చెలువులఁ జెలువుర సేద దీర్చి
|
|
తే. |
యడరి గృహపతాకికలకు నాట గఱపి
ప్రోది నెమళుల యెఱకల [377]పొదులు విచ్చి
మందసంచారమున సుకుమార మగుచు
మెఱసెఁ బ్రత్యూషసమయసమీరణంబు.
| 241
|
కవిలోకబ్రహ్మ - అరుణాచలపురాణము
సీ. |
గొజ్జంగివిరులపైఁ గుప్పించి కుప్పించి
కన్నెగేదఁగులపై గంతు గొనుచు
వకుళగుచ్ఛములపై వర్తించి వర్తించి
పున్నాగతతులపైఁ బూన్కి నెఱపి
గురువిందపొదలపైఁ గ్రుమ్మరి క్రుమ్మరి
విరవాదిలతలపై విశ్రమించి
మల్లికావళులపై మసలాడి మసలాడి
సురవన్నెతరులపైఁ బొరలుపెట్టు
|
|
తే. |
ననుదినము నిట్లు పుష్పవాసనలఁ దేలి
యంగజాభంగరతులందు ననఁగి పెనఁగి
యలసి పడియున్న జనముల యలఁత మాన్పు
మలఁగి యప్పురి ప్రాభాతమారుతంబు.
| 242
|
బొడ్డపాటి పేరయ – పద్మినీవల్లభము
ఉ. |
సారసరఃప్రతీరవనసౌరభపుష్పరజోవిభూతి నొ
య్యారపుఁజొక్కు చల్లి మలయానిలుఁడన్ గడిదొంగ వేకువన్
సోరణగండ్లఁ గన్నములఁ జొచ్చుచు దివ్వెలుఁ [378]దూర్చి భోగభా
మారతితాంతఘర్మకణమౌక్తికపంక్తులు దార్చు నిచ్చలున్.
| 243
|
ప్రభాతము
భాస్కరుఁడు - అయోధ్యకాండము [25]
చ. |
అళికుల మల్లనల్ల నవహల్లక మొల్లక కేసరోల్లస
ద్ధళదరవిందమందిర[379]వితానము చేర నపారదీర్ఘికా
జలజనవీనగంధములు చల్లుచుఁ జల్లనిగాడ్పు లిమ్ములన్
బొలయ గృహప్రదీపికల పోడిమి దూలఁ బ్రభాత మొప్పినన్.
| 244
|
ప్రౌఢకవి మల్లయ – రుక్మాంగదము [3-187]
చ. |
వెలవెలఁ బాఱెఁ దూర్పు[380]దెస విల్లు మనోభవుఁ డెక్కుడించెఁ దా
రలపొది విప్పఁజొచ్చె ననురక్తిఁ జెలంగె రథాంగదంపతుల్
జలములు నుల్లసిల్లె విలసద్గతి వీచెఁ బ్రభాతవాయువుల్
కలకలఁ బల్కెఁ బక్షులు వికాసము కల్వలఁ బాసె నయ్యెడన్.
| 245
|
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – శాకుంతలము [3-203]
సీ. |
ఒక్కింత వెన్నెల యూర్చి తీసిన భంగి
నుదధీశు దెసకునై యోడిగిలగఁ
గమలి మిం చెడలిన కంచుటద్దము వోలె
నస్తాద్రిపైఁ జంద్రుఁ డస్తమిల్ల
జలము లూటలుగ్రమ్ము శశికాంతపాషాణ
నికరంబు [381]నీరారి నీరు దివియ
భానుమత్పాషాణఫలకమధ్యంబులఁ
గోకయుగ్మము కంతుగోష్ఠి నెఱప
|
|
తే. |
నబ్జగంధంబు తేఁటులు నామతింప
దికమక ల్గొని నాలుగుదిక్కులకును
విచ్చి విచ్చి జకోరముల్ వెళ్ళఁబాఱ
నల్లనల్లన తూరుపు దెల్లవాఱె.
| 246
|
[382]తెనాలి రామలింగయ – హరిలీలావిలాసము
సీ. |
[383]నీ రింకఁదొడఁగె వెన్నెల మానికంబుల
వేఁడిరాతూపుల విడిసె వహ్ని
కలఁగె జీవంజీవముల నిండుమనములు
జక్కవపులుఁగుల జాలి వదలెఁ
గనుమాసెఁ గుముదకాననవిభావిభవంబు
|
|
|
శ్రీలక్ష్మి నిల్చె రాజీవపీఠి
వాజువాఱఁగఁ జొచ్చె వరుణుని దిక్కున
[384]నేర్పడి దీపించెఁ దూర్పువలను
|
|
తే. |
తార లుడివోయె వికసించెఁ దరుల విరులు
చంద్రికలు గందెఁ గొలఁకులు చాలఁ దేరె
దీపరుచి దాఁగెఁ దలసూపె రేపటెండ
చందురుఁడు వ్రాలెఁ [385]బొడిచె కంజాతహితుఁడు.
| 247
|
ఉదయరాగము
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుఁడు – శాకుంతలము [3-202]
సీ. |
కాలిగోణంబు లాకాశసన్యాసికం
బరకపాలికులకు మరులు జడలు
చిగురాకుఁబొరకలు గగనచూతమునకు
వలఁతియూడలు వియద్వటమునకును
సట లంతరిక్షకేసరికంధరమునకు
జమలియీఁకలు నభస్తారునకును
రాగిమీసంబు లభ్రకిరాతు మొగమున
బగడంపులత లుడుపథపయోధి
|
|
తే. |
కనెడు సందేహచింతనం బావహిల్ల
యావకద్రవరేఖల యంద మొంది
పట్టుసూత్రవిలాసంబు పరిభవించి
యాకసముఁ [386]దాకెఁ [387]దూర్పున నరుణరుచులు.
| 248
|
శ్రీనాథుఁడు – కాశీఖండము [1-123]
సీ. |
తఱపివెన్నెలలోని ధావళ్య మొకకొంత
నవసుధాకర్దమద్రవము గాఁగఁ
జిన్నారి పొన్నారి చిఱుతచీఁకటి చాయ
యసలు కొల్పిన ముషీరసము గాఁగ
నిద్ర మేల్కాంచిన నెత్తమ్మిమొగడల
పరువంపుఁబుప్పొళ్ళు హరిదళముగఁ
దొగరు[388]వన్నియ లేఁత తొలుసంజకెంజాయ
కమనీయధాతురాగంబు గాఁగ
|
|
తే. |
వర్ణములు గూడి యామినీవ్యపగమమున
జగము చిత్రింపఁ దూలిక చందమైన
కొమరుఁబ్రాయంపు నూనూఁగుకొదమయెండ
ప్రాచి కభనవమాణిక్యపదక మయ్యె.
| 249
|
శ్రీనాథుఁడు - శృంగారనైషధము [8-11]
సీ. |
ఆమ్నాయశాఖాసహస్రవివర్తంబు
లుడురాజకళ్యాణహోమవహ్ను
లాకాశహర్మ్యాగ్రహస్తదీపంబులు
ప్రాలేయజలరాశిబాడబములు
చక్రవాకమనోవిశల్యౌషధంబులు
దశదిశాకుంకుమస్థాపకములు
రాజమండలకాంతిరాజయక్ష్మము లంధ
కారవేదండకంఠీరవములు
|
|
తే. |
పద్మవననిర్ణిబంధనబాంధవములు
కైరవాకరసమ్మోహకారణములు
సవితృమణిపావకేంధనస్వామిధేను
లెగసె నుదయాద్రి [389]యవుల నీరెండకొనలు.
| 250
|
ముక్కు తిమ్మన – పారిజాతము [2-66]
తే. |
రాజు వీడెత్తి చనినఁ దారకభటాలి
యంబరాభోగనిజశిబిరాంచలమునఁ
గాలుకొలిపిన పావకజ్వాల లనఁగఁ
బ్రాచిఁ గనుపట్టె నవసాంధ్యరాగరుచులు.
| 251
|
అంగర బసవయ - ఇందుమతీకల్యాణము
మ. |
ఉదయస్తంభములోపల న్వెడలి తా నుద్యత్తమోదైత్యునిన్
గుదియంబట్టి గభస్తిమన్నృహరి సక్రోధంబునన్ వాని దు
ర్మదగాత్రంబు కరంబులం [390]దునుమ ధారాళాస్రపూరంబు[391]గా
రి దివిం బర్వినకైవడిం గలయఁబర్వెన్ సాంధ్య[392]రాగచ్ఛవుల్.
| 252
|
ఉ. |
నీలపయోదగాత్ర! కమనీయపయోరుహనేత్ర! [393]సంస్కృతి
వ్యాళపతంగ! సముదంచితభానుసహస్రతేజ! ని
|
|
|
ర్మూలితదైత్యలోక! పటుమోహనసత్యదయావివేక! శో
భాలసదాస్యచంద్ర! యఘపర్వతజాలమహేంద్రధీనిధీ!
| 253
|
క. |
శ్రీమన్నిశాతనఖర
స్తోమవినిర్దళితహేమసురరిపుకఠినో
ద్దామాయతవక్షఃస్థల
చామీకరమయసునేత్ర! జలరుహనేత్రా!
| 254
|
మాలిని. |
వికచకమలనేత్రా! విస్ఫురన్నీలగాత్రా!
వికటదనుజశిక్షా! విశ్వలోకైకరక్షా!
ప్రకటపరమహంసా! బర్హిపింఛావతంసా!
సతలదురితనాశా! చారునీలాచలేశా!
| 255
|
గద్య. |
ఇది శ్రీమజ్జగన్నాథవరప్రసాదలబ్ధకవితాప్రాభవ గంగయా
మాత్యతనూభవ, సకలబుధవిధేయ, పెదపాటిజగ్గననామధేయప్రణీ
తంబైన ప్రబంధసారంబునందు రాజనీతియు, సేవకనీతియు, లోకనీ
తియు, సుజనప్రవర్తనంబును, కుజనవ్యాప్తియు, నన్యాపదేశంబులును,
సూర్యాస్తమానంబును, సాంధ్యరాగంబును, సాయంకాలసమీ
రణంబును, దీపకళికావిధానంబును, విదియచందురు చందంబును,
తారకావర్ణనంబును, జక్రవాకవియోగంబును, విటవిడంబనలక్షణం
బును, శృంగారంబులును, కువిటలక్షణంబులును, వేశ్యాలక్ష
ణంబును, కుటిలవేశ్యాచేష్టలును, వేశ్యమాతాప్రగల్భంబును,
భద్రదత్తకూచిమారపాంచాలలక్షణంబులును, చిత్తినీహస్తినీశంఖినీ
పద్మినీజాతిప్రకారంబులును, బాలయౌవనప్రౌఢలోలలలక్షణంబు
లును, కులటప్రకారంబును, రతివిశేషంబును, రతివర్జంబును,
గళాస్థానవిశేషంబులును, బ్రణయకలహంబును, నందుఁ గూర్మి
కలగుటయు, నంధకారంబును, నిశివిడంబనంబును, జారసంచార
లక్షణంబును, దూతికావాక్యంబులును, చోరలక్షణంబును, జంద్రో
దయంబును, జంద్రకిరణలాంఛనచంద్రికావిభ్రమంబులును, జకోరి
కావిహారంబును, వేగుజుక్క పొడుచుటయు, గుక్కుటరావంబును,
జంద్రతారకాస్తమానంబులును, బ్రత్యూషంబును, బ్రభాతమారు
తంబును, నరుణోదయంబును, బ్రభాతరాగోదయంబును నన్నది
తృతీయాశ్వాసము.
| 256
|