ప్రపంచ చరిత్ర/ఇంకిలాబ్ జిందబాద్
3
ఇంకిలాబ్ జింపబాద్*[1]
జనవరి 7, 1931
ప్రియదర్శినీ:- దృష్టికి ప్రియముగానుందువు నీవు. దృష్టిసాధ్యము కానప్పుడు ప్రియతమవు. నీకు వ్రాయుటకు నేడు నే నిచ్చట కూర్చుండగా దూరముననుండి వచ్చు మేఘగర్జనములవలె అస్పష్టధ్వనులు నాకు వినిపించెను. అవి యెట్టిధ్వనులో మొట్టమొదట నాకు అవగతము కాలేదు. కాని ఆ ధ్వనులు నాకు పరిచితముగా వినిపించుచున్నవి. నా హృదయమున ప్రతిధ్వనించి ప్రత్యుత్తరము పొందుచున్నవి. క్రమక్రమముగా ఆ ధ్వనులు సమీపించుచున్నట్లున్నవి. పెద్దవగుచున్నవి. త్వరలోనే వాని నిజస్వరూపము తెలియవచ్చినది. “ఇంకిలాబ్ జిందబాచ్” “ఇంకిలాబ్ జిందబాద్" అను వీరహుంకారములకు కారాగారము మారుమ్రోసెను. ఆ కేక విన్న మాహృదయములు సంతసించినవి. చెరసాలవెలుపల, మా కెంతో సమీపమందు మన రణదుందుభి మ్రోయించినవారెవరో నాకు తెలియదు. వారు నగరమునుండి వచ్చిన స్త్రీ పురుషులో ? పల్లెలనుండి వచ్చిన జానపదులో ? నేడు వారట్లు ఎట్టిసందర్భములో చేయుచున్నారో కారణ మూహింపలేను. వారెవరైననేమి? మా కుత్సాహము కల్పించిరి. వారి పరామర్శకు మేము మౌనముగా సమాధాన మిచ్చితిమి. ఆ సమాధానముతో మా యభినందనములును వెళ్ళినవి.
“ఇంకిలాబ్ జిందబాద్" అని మనమేల ఘోషింపవలెను? విప్లవమును, మార్పును మన మేల కోరవలెను ? నేడు ఇండియాలో గొప్ప మార్పు కలుగవలసియున్నమాట వాస్తవమే. కాని మన మందరము కోరు పెద్దమార్పు ఇండియాకు వచ్చినపిమ్మట, ఇండియా స్వాతంత్ర్యమును సాధించిన పిమ్మట మనము చేతులు కట్టుకొని కూర్చుండ వీలులేదు. ఈ లోకమున ప్రాణమున్న ప్రతిజీవియు మారుచునేయుండును. దినమునకు దినము, నిమిషమునకు నిమిషము ప్రకృతి సర్వమును మారును. ప్రాణము పోయిన జీవి మార్పుచెందదు. కదలక మెదలక పడియుండును. నదీ జలము ప్రవహించుచుండును. దాని నడ్డిన మురిగిపోవును. మానవుని జీవితముకూడ అంతే. జాతిజీవితము కూడ అంతే. మన కిష్టమున్నను లేకున్నను ముసలితనము వచ్చును. శిశువులు చిన్నపిల్ల లగుదురు. చిన్న పిల్లలు స్త్రీలగుదురు. స్త్రీలు ముదుసలు లగుదురు. ఈమార్పులను మనము సహించియుండవలసినదే. కాని ప్రపంచము మారునని ఒప్పుకొననివారు పలువురున్నారు. వారు తమమనస్సులను మూసికొని బీగము వేసికొందురు. నూతనాభిప్రాయములను వారు సమీపమునకు రానీయరు. స్వతంత్రముగా ఆలోచించుటకు వారు భయపడుదురు. కాని పర్యవసాన మేమి ? ఇట్టివా రున్నప్పటికిని ప్రపంచము కదలిపోవుచునేయున్నది. మారుచున్న పరిస్థితులలో ఇముడని యట్టివారును, వారివంటివారును ఉన్నారుకాబట్టి అప్పుడప్పుడు ఉత్పాతములు సంభవించుచున్నవి. పెద్ద విప్లవములు పుట్టుచున్నవి. నూటనలుబది సంవత్సరముల క్రితము రేగిన ఫ్రెంచి విప్లవము, పదమూడు సంవత్సరముల క్రితము రేగిన రష్యన్ విప్లవము అట్టివే. ఆ విధముగానే మనదేశమునందును నేడుమనము విప్లవముమధ్యనున్నాము. మనకు కావలసినది స్వాతంత్ర్యమే. కాని మనకు కావలసిన విషయము లింకను ఉన్నవి. మురుగుగుంటలను బాగుచేసి స్వచ్ఛజలము నంతటను ప్రవేశ పెట్టవలసియున్నది. మనము మన దేశమునుండి మాలిన్యమును, దారిద్ర్యమును, దుఃఖమును తుడిచివేయవలెను. మనము చేయబూనిన ఘనకార్యములను గురించి ఆలోచించి సహకారముచేయుటకు పలువురి మనస్సులు సమ్మతించుటలేదు. చేతనైనంతవరకు అట్టివారి మనస్సుల నంటియున్న బూజునుకూడ మనము తుడిచివేయవలెను. మనము చేయ బూనినది గొప్ప పని. వెంటనే జరుగదు. కొంతకాలము పట్టునేమో! అయినా అథమపక్షము, దానిని కొంచెము ముందుకు నెట్టుదము-ఇంకిలాబ్ జిందబాద్!
మన విప్లవగేహాళిపై మన మిప్పుడు నిల్చియున్నాము. భావికాలమున నేమి జరుగనున్నదో చెప్పలేము. మన కష్టములకు మంచి ప్రతిఫలము వర్తమానమునందు సైతము మసకు ముట్టినది. హిందూదేశ స్త్రీలను పరికించుము. ఈ పోరాటమున వారెంత గంభీరముగా ముందంజ వేసికొనిపోవుచున్నారో ! శాంతముతో కూడిన ధైర్యము, స్థైర్యము - వారెట్లు ఇతరులకు మార్గదర్శకులై యున్నారో. ఇక ఘోషామాట-మన ధీరురాండ్రగు సౌందర్యవతులను మరుగుపరచిన ఘోషా, వారికిని, వారి దేశమునకును చేటు తెచ్చిన ఘోషా- అది ఇప్పుడు ఎక్కడ నున్నది ? ప్రాతకాలమునాటి వస్తువులను జాగ్రత్త పెట్టు వస్తుప్రదర్శనశాలల బీరువాలలో తలదాచుకొనుట కది చల్లగా జారుచున్నది కాదా ?
పిల్లలను - బాలబాలికలనుకూడ పరికించుము - ఆ వానర సేనలు, ఆ బాలసభలు, ఆ బాలికాసభలు. ఈ పిల్లల తల్లిదండ్రులు పెక్కురు వెనుక భీరువులవలెను, బానిసలవలెను ప్రవర్తించియుండవచ్చును. కాని మన తరమునందలి బాలబాలికలు బానిసత్వమును, భీరుత్వమును సహింప లేరనుమాట ఎవరు సందేహింప సాహసింతురు ?
ఈవిధముగా పరిపవర్తనచక్రము తిరుగుచుండును. క్రిందకువచ్చిన వారు పైకి పోవుదురు. పైకి వచ్చినవారు క్రిందికి పోపుదురు. మన దేశమున నాచక్రము ఇదివరలోనే తిరుగవలసినది. కాని ఈ మారు మనము దానిని గట్టిగా త్రిప్పి వదలితిమి. ఎవ్వరును దాని నాపలేరు.
ఇంకిలాబ్ జిందబాద్ !
- ↑ "ఇంకిలాబ్ జిందబాద్" అనగా “విప్లవము చిరకాలము జీవించుగాక" యని అర్థము.