ప్రజ్ఞా ప్రభాకరము/వివాహము
౧౧
వివాహము
ఇర్వదిరెండవయేట నాకు పెండ్లి జరిగినది. మాయూరి కాఱుమైళ్ళ దూరమున నున్న గంటసాల నా యత్తవారి యూరు. ఆ యూరే నా మేనమామగారి యూరును. తొంబది యేండ్లకు పైబడిన వయస్సువారు, మా మేనమామగారు శ్రీ పిసిపాటి వేంకటాద్రిగా రిప్పటికి నారోగ్యముతో నున్నారు. వారికి నేడ్గురుపుత్రులే కలిగిరి కాని పుత్రికాసంతానము లేదయ్యేను. మాతోడి సంబంధము తర్వాత లేకపోవు నన్న కొఱఁతతో వారి జ్ఞాతులగు మా మామగారిని నాకు పిల్ల నిమ్మని వారు కోరిరి. వారికుమారుఁ. డప్పటికి రెండేండ్లకుముందు స్వర్గస్థుఁ డయిన వాఁ డు, శ్రీసోమనాధశాస్త్రులుగారి కడను, శ్రీ వెంకటశాస్త్రిగారి కడను నాతో సహాధ్యాయుఁ డుగా నున్నవాఁ డు, వెంకటరామశాస్త్రి జీవించుచుండుటచేతను, మా మేనమామగారి కోరిక చేతను, భూవసతి లేదన్న కొఱఁతను దలఁ చి సందేహించుచున్నను మా సంబంధమున కెట్ట కేలకు మామామగా రంగీకరించిరి. వారు ప్రశాంత చిత్తులు. సద్వర్తనులు. అమాయకులు. మా తండ్రిగారి లెనే కడిపెడు బిడ్డలు గలవారు.
వివాహ మయినది. మా మాతృశ్రీ గారి మీఁది భక్తిచేతను, వారి పుట్టినయూ రని, వారి యింటి పేరి వారని నేనెంతో తనివితో నీ సంబంధమును ప్రేమించి తిని, వివాహ మయినతోడ్తో మద్రాసు వచ్చి వేసితిని. అప్పుడు నానివాసము మైలాపూరులో. తిరివల్లి క్కేణి హైస్కూలుకు ప్రతిదినము రాకపోకలు. తొమ్మిది గంటలకు హోటలులో భోజనము చేసి తిర్వలిక్కేణికి నడచి వెళ్ళి సాయంకాలము తిరిగి నడచి వచ్చి రాత్రి భిజనము చేయుట. దీనిచే నాహారము చాలక కాఁబోలును నీరసముగానే ఉండెడివాడను. నీరసమే తప్ప వ్యాధి యేదియును లేదు. అప్పుడప్పుడు కృష్ణా మండలమందలి స్వగ్రామమునకు వెళ్ళి అక్కడ కమ్మని నెయ్యి పెరుగులతోడి భోజనము చేసినప్పుడు శరీరమునకు మంచి బలోత్సాహములు లభించుచుండెడివి! సంవత్సరమున కొకతూరి తప్పకుండ నింటికి వెళ్లుచు నట్టిబలోత్సాహముల నార్జించుకొని వచ్చి వానినిమద్రాసులో వ్యయించుచుండినట్టు తోచుచుండెడిది. ఈ ప్రయోజనముకై వివాహానంతరాము వేసంగిలో నేనింటికి వెళ్ళితిని.
--- ---