ప్రజ్ఞా ప్రభాకరము/బ్రహ్మచర్యము - గార్హస్థ్యము

౧౦

బ్రహ్మచర్యము - గార్హస్థ్యము

రెండేండ్లు కెలెట్ హైస్కూలులో నేను తెల్గు పండితుఁ డనుగా నుండఁ గా నాకు వివాహనిర్ణయము జరగి మా తలిదండ్రులు నన్నింటికి రమ్మనఁ గా నే నింటికి వెళ్లుచు బందరులో శ్రీ వల్లూరి సూర్యనారాయణరావు గారింట దిగితిని. అవి హైస్కులు వేసవి సెలవురోజులు. సూర్య నారాయణ రావుగారు మద్రాసు చేరునపుడు నన్ను దఱచుగా ఇంటికి వచ్చుచుండవల దనియు, మద్రాసులో ఓరియంటల్ లైబ్రరీలో గ్రంధములను విశ్రాంతి సమయములలో చదువుచు, వైదుష్యమును వృద్ధిపఱచుకొనుచు నుండ వలసిన దనియు, ఇప్పుడే వివాహము చేసికొని సంసారపు బాదర బందీలో పడవల దనియు. యూరపులో అనేకులు ఆజీవితము అవి వాహితులుగా నే ఉండి గొప్ప విజ్ఞానము గడించి, ధనము గడించి, ఆ ధనమును సంఘోపకారమునకై సమర్పింతురనియు, కొందఱేలోక సేవకై యవి వాహితులుగా నెలకొను టావశ్యక మనియు నాకు హెచ్చరికగా జెప్పుచుండుట కలదు.

అప్పుడు నా రాక వారి కతృప్తి గొల్పెను. చల్లని నూతి నీట నిర్వురము హాయిగా స్నానము చేసి భోజనము నకుఁ గూర్చుంటిమి. చెమటలు దిగజారుచున్నవి. సూర్య నారాయణ రావుగారి ధర్మపత్ని శ్రీ పార్వ తమ్మ గారు విసనకఱతో విసరుచు చెమట రోఁత దొలగించుచు హాయి గూర్చు చుండిరి. భోజన సమయమున మరల వారు నాకధ నుపక్రమించిరి.' ఇంటికి రాకుండ మద్రాసులోనే ఉండుమంటిని గాదా! నీ ఉప్పుడేల రావలెను? పెండ్లి ప్రయత్న మేమేని సాగెనా? పలుతూరులు నిన్ను పెండ్లాడ నాత్రపడవలదంటిని కదా? యూరపులో ననేకులు ఫ్రౌఢ వయస్సు వచ్చి విద్యాధనార్జనము చేసి యటు పై పెండ్లాడుట, కొందఱు పెండ్లాడకే తమ విద్యాధనములను లిక సేవ కై వినియోగించుట జరుగుచుండు నంటిని గదా! బీదఱికములో నలగుల పడుచు నొక పడుచును బెండ్లాడి యామెను గూడ దారిద్ర్యక్షోభమున పాల్పఱచుట కా పెండ్లాడుట? విద్యా విశేషములను, ధనము సేకరింప గల్గినచో, సౌకర్య మున్నచో నటు తర్వాత పెండ్లాడిన నాడ దగును గాని యిప్పుడేమి పెండ్లి? విద్యా వివేకములు లేనియాడుపడుచులనుబెండ్లాడిఏడాదికి, రెండేం డ్లకు బిడ్డను పుట్టుచుండుట,ఈదురో దేవుడా అనుచున్నట్టు చాలినంతగా లేక పోగా చాలీచాలని జీవితాయతితో నిరుత్సాహనిహతములై బాధపడుచున్న కుటుంబముల నెన్నింటిని జూచుట లేదు? అందులో నీవును జేరి దిగనాసిల్ల నభిలషింతువా?అని ఇంక నిత్యాదివిధముల తీవ్రభాషతో వారు నన్ను మందలింపసాగిరి.నేను దల వాల్చుకొని తినుచున్న యన్నపు ముద్ద మ్రింగుడు పడక మాటాడ నేరక సిగ్గుతో చిదికి వదవదలాడుచుంటిని.శ్రీ పార్వతమ్మగా రందుకొనిరి.'ఇటు వినండీ!యూరపు దేశము వారి బ్రహ్మచర్యము మాట యెత్తకండి.ఆ బ్రహ్మ చర్యము మన వారి కెందుకు గాని,వీరిని బాగుగా ధనార్జనము చేసిన తర్వాత,ఫ్రౌఢవయస్సు వచ్చిన తర్వాత పెండ్లాడు మను చుంటిరే!మన దేశపు సర్వైసశ్వర్యమును జుఱుకొనుచున్నారు గనుక యూరపు వారు ఏ విద్య చేతనైన నెంత ధనము నైన నార్జింపఁ గల్గుచున్నారు. కట్టుబట్టు, కుట్టుసూది కూడ వారే తయారు చేయుచు మన దేశమువారి కమ్ముచు ధన ప్రవాహము తమ దేశము మిఁ ద పాఱుచుండఁ బట్టి లోకో పకృతి చేయగల్గు చున్నారు. నిజమే! అంత ధన మార్జించుటకు మన దేశమువారికి సౌకర్యము లేవీ? ఫ్రౌఢవయస్సు వచ్చిన తర్వాత పెండ్లాడుట యూరపు వారికి చెల్లవచ్చును గాని మన వారికి చెల్ల నేరదు. ఆ దేశమున యేఁ బదియఱువది యేండ్ల వరుని బ్రహ్మచర్యమును, ముప్పది నలువది యేండ్ల వధువు కన్యాత్వమును మనకు విశ్వసింప రానివి. చల్లని యూరపు దేశములో నవి చెల్లు నేమో నే నెఱుఁగను. మన దేశమువారి కావయస్సు యించుమించుగా వార్ధక కాలము. ధనార్జనము చేయునే కాక! అప్పుడు వివాహా మాడుట మన దేశము వారికి గతజల సేతుబంధనమే!

మొన్న వింటిరి గదా! యధికవిద్యావతిని బెండ్లాడు భర్తల గోడును! హైదరాబాదులో నొక గొప్ప డాక్టరు విద్యావతిని బెండ్లాడి యామె తఱచుగా యూరపు మొదలగు ఖండాంతరములకు వెళ్ళి వచ్చుచు నెలలు, వత్సరములు దేశాంతరాములం దుండుతయు, తన యార్జన మెల్ల నామె యాత్రావ్యయములకై పంపవలసిన వచ్చుచుండుటయు, తన బంగళాలో గోడలు బూజుపట్టి చిత్రరచన లెన్నో సంస్కారము లేక తార్మారై చేడుచుండుటయు, దనకు గార్హస్ధ్యసౌఖ్యము దుర్లభముగా నుండుటయునొక మిత్రునితో జెప్పి వాపోవఁగా నా మిత్రుడు మితో చెప్పుట నీ నడుమ మీరు వినియుంటిరి గదా! ఏ యెండ కా గొడు గన్నట్టుండ వలెనే కాని తనకు మించిన విద్యావతిని బెండ్లాడుటలో చిక్కులే కాని సేమ ముండుట యసాధారణము.

చూడండి! ఆరంభముననే తనకు దగినపచును బెండ్లాడి రోడ్డు రిపేరు చేయుచున్న యుప్పరివాడు పగలెల్ల మట్టిపని చేయుచున్నాడు. సంజకడ ఉడుకు నీరు కాచి, యిల్లాలు వీఁ పు దోమి స్నానము చేయించగా భర్త సుఖస్నాతుఁ డై భార్యతో గంజి యన్నము, ఉప్పు, పచ్చిమిరప కాయ నంజుకొనుచు కడుపార నారగించి, తమకు గలిగిన చిన్న బిడ్డ నక్కడి చెట్టుకొమ్మకు వ్రేల గట్టిన చీరయుయ్యేలలో నూగించి, చల్ల గాలిలో నా బిడ్డ సుఖనిద్ర పడయగాఁ జెట్టు క్రింద సుఖశ యితు లగుట చూచుచుంటిమి గదా! వారి దాంపత్యమున హృద్యత గోచరించుట లేదా?

ఏకైక వ్యక్తిగా మిరుమిగిలిన మికుటుంబమున నన్నుఁ బెండ్లాడుటచే వంశవృద్ది గలిగి మీరు సుఖించుచుండుట గుర్తునకు వచ్చట లేదా? నే నుండుటచే గదా మికిట్టి సుఖభోజ నము దొరకుట? వంట వానిని గుదుర్చుకొని వాణివంటతో భోజనము జరపుకోనుటలోని యిక్కట్టులను గుర్తించుచునే యుంటిమి గదా? మికు ఆరోగ్యకరములు, ప్రియములు నయినకూరగాయలను నేను దెప్పించి మీకు ప్రియ మయిన తీరున వంట చేయించు చుండుటచేతఁ గాదా మి యారోగ్యము ససిగా నుండుట, ప్రియముగా భోజనము సాగుత. ఇంటికి వచ్చిన మీకు కోర్టులోని పరిశ్రమపుఁ బరిహారము మావినోదముతో జరుగుట యగుచున్నది గదా! ఇంతేల? ఈ యెండ యుమ్మదములో చెమటలు దిగజారు చుండఁ గా నే నుండి విసనకఱతో విసరుచుండుట చేఁ గాదా శ్రమ మెఱుఁగకుండ మీరు హాయిగా నారగింపఁగల్గుట? నేఁ టియీ వంటకములు వంటాతఁ డే చేసినను నేను దగ్గర నుండి మీకు ప్రియమయిన కూరలు తెప్పించి తఱిగి యిచ్చి మికు నచ్చినవిధానమున మి కెంత కావలెనో అంతగా ఉప్పుకారములు వేయిచి వండించుట చేతఁ గాదా యవి యాస్వాద్యములుగా మీకుండుట!

మన శాస్త్రులుగా రిక్కడ నున్నప్పుడు గొంత కొంత సంస్కృతాంధ్యముల పరిచితి హెచ్చి తఱచుగా భారతాదులు చదువుచుండుటచే నందలి పద్యము లివి నా నోటికి వచ్చియున్నవి చిత్తగించండి!

అధికదుఃఖరో గార్తున కౌషధంబ
    సురుచిరంబుగ భార్యయ చూవె యెందు
    నొనరు భార్యాసమేతుఁడై యున్నవాని
    కెంత లయ్యును నాపద లెఱుక పడవు
    అలసి నెడ డస్సి నెడ నా
    కలి తృష్ణయు నైన యెడలఁ గడుకొని ధరణీ
    తలనాధ! పురుషునకు ని
    మ్ముల భార్యయ పాచుఁ జిత్తమున దుఃఖంబుల్.
              (నన్నయ నలోపాఖ్యానము.)

పార్వతమ్మగా రింత పలుకగా, నాకు ముద్ద మ్రింగుడు పడసాగగా సూర్యనారాయణ రావుగారు నిరుత్తరు లయిరి. నన్నుఁ జూచి ' శ్రీ ఘ్రముగా నింటికి బోయి వివాహ మాడుదు వులే! నీవాలకము చూడఁగా పెండ్లి ప్రయత్నమున చేయింటికి వెళ్లుటగా నున్నట్టున్నది. శుభమస్తు'అనిరి.

--- ---