ప్రజ్ఞా ప్రభాకరము/పురోహితత - సదనుష్ఠానము

పురోహితత - సదనుష్ఠానము

పురోహిత వృత్తి నాకు మిక్కిలి రోత గొల్పినది. అది శాస్త్రగర్హిత మాన్నకారణమునఁ గాదు. ప్రాచీనధర్మశాస్త్ర ప్రకారము చూచినచో నేఁడు బ్రాహ్మణు లవంలంబించుచున్న వృత్తు లనేకములు శాస్త్రగర్హితములే! భృతకోపాధ్యాయత్వము, వైద్యము, గాయకత్వము, వడ్డివ్యాపారము మొదలయిన యింక నెన్నో యింతకంటే నీచము అగువృత్తులు ధనలభ్దికి బ్రాహ్మణులు చేయుచున్నారు. అయినను అవి నిందితములు గాకున్నవి. అట్టిచో నిక బ్రాహ్మణులే చేయవలసినవి పూజరితనము. పురోహితత గర్హితము లేలకావలెను? సంఘమున కావశ్యక మైనకులవృత్తి యేది గాని గర్హితము గారాదు. అయినను పూర్వులెల్లరు నవలంబిం చిన దైనను పురోహితత నాకు సమ్మతము కాలేదు. అది నేఁడు వట్టిబూటకముగా సాగుచున్నది. నూటఁ దొంబదిపాళ్ళు పురోహితులను గోరువారు వారియం దాదరము గౌరవము లేని వారు. ఏదో యలవాటున బాటించుచున్నా మన్న తృప్తికై కర్మలాచరించుచున్నారే కాని పరమార్ధబుద్ధితోఁగాదు.

ఆ యాచరించుకర్మలును ప్రయోజనమును, సన్నసన్న గాఁ గోల్పోవుచు వచ్చి యర్ధరహితములైన బాహ్యడంబరములుగాఁ బర్యవసించినవి. నిజముగా వాని యెడ శ్రద్ధ గలవారు స్వయము వాని నభ్యసించి నిర్వర్తించు కోగలరు. అట్టివారు స్వయము పరమార్ధబుద్ధితో నాచరించుచుండువారినే పురోహితులను వరింపఁ గలరు. పురోహితత వంశాచారముగా వచ్చుచుండుట చేనం దెన్నో భ్రంశములు చేరినవి, బ్రాహ్మణులలో వేయింటి కోక్కరయినను సరిగా నగ్నిహోత్రముల నంచుకొనువారు నేఁ డు లేరు. శ్రౌతసంప్రదాయమే యుత్సన్న ప్రాయ మైనది. ఉపనయనమునాఁడు, వివాహమునాఁడు మాత్రము చేయునగ్ని కార్యము, దానిని సరిగాఁ జేయనందుకుఁ బ్రాయశ్చిత్తములు, హోమములు పురోహితును వింత పాటలు నటలు నయిపోయినవి, కాళిదాసు నాటకములందు విదూషకుఁ డెట్టి పూజ్యత బొందినాఁడో నేఁడు వివాహోపనయనాది కర్మలందు పురోహితుఁ డు నట్టి పూజ్యతనే పొందుచున్నాఁడు." అశ్రద్ధపితాళ్ళకు ఆకతాయి తర్పణ' మన్నట్టు ఆశ్రద్ధదానుఁ డయిన గృహస్థుకుఁ దగినట్టే యవాకుల పురోహితు లేర్పడినారు. కనుక నీయవహేళిత వృత్తిలో ప్రవర్తింపరాదని, సంభావనలకు, భిక్షములకు నేనిది నేర్చితి నది నేర్చితి నని యాచనలకుఁ బోరాదని పసినాఁటనే నేను నిర్ణయించు కొంటిని.

నా కుపనయన మయినది. సంధ్యావందనాదికము నిర్దుష్టముగా నేర్చుకొంటిని. సంధ్యాభాష్యము చదివి యర్ధము తెలిసికొంటిని. ఇంటిదగ్గఱనున్నచో నిక వైదిక వృత్తికిఁ జోరపడవలసి వచ్చెడి దేమో కాని ఈశ్వరుఁ డను గ్రహించెను. చల్లపల్లి విద్వాంసులు, మహర్షి కల్పులు శ్రీ అద్దేపల్లి సోమనాధశాస్త్రులు గా రప్పుడప్పుడు మా గ్రామమునకు విచ్చేయు చుండువారు. ఎడ్వర్డు పట్టాభిషేకము జరగినపుడు నే నేవో సంస్కృత శ్లోకములు రచించితిని. వారు విచ్చేసి నా రచన వినినన్నుఁబ్రేమించిరి. వారు విజయనగరమున భీమాచార్యులుగా రను తర్క విద్వాంసు లకడ సంగమేస్వర శాస్త్రిగారితోఁ గలసి పెక్కేండ్లు తర్క శాస్త్రము నభ్యసించి తొలుత మా గ్రామమున నెలకొనఁ గా నేదో తీవ్రానారోగ్యము కలుగఁ గా మా నాయనగారు వారి కౌషధ మిచ్చి వ్యాధి కుదిర్చిరఁట! తరివాత వారు చల్లపల్లి చేరిరి. ఆ యనుబంధమున వారు మా యింటికి విచ్చేయుచుండువారు. వారిదగ్గఱఁ జదువుకొనుటకు నేను చల్లపిల్లి చేరితిని. లఘుకౌముది చదువ నారంభించితిని. కాని వారు పాతంజల యోగసూత్రములను గూడఁ జెప్పిరి. అందుఁ జదివిన విషయములు నాలోఁ జొచ్చుకొని పోయి వింత యోచనలఁ గొల్ప సాగినవి. వారు తెల్లవారుజమున నిద్రలేచి రాత్రి పండ్రెండు గంటల దాకఁ ననుష్టానముతో తపోమయులుగా విరాజిల్లుచుండెడివారు. విద్యార్ధుల మగు మమ్ము గూడ నట్లు చక్కదిద్దఁజూచుచుండెడివారు. కర్మానుష్టానములమీద నా కేటికో శ్రద్ధ కలుగకపోయెను. బందరులో శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రులు గారు హిందూ హైస్కూలులో తెలుఁగు పండితులుగా నప్పు డుండిరి.

ఇంటివాకిటఁ గూర్చుండి నేను పాఠము చదువుకొను చుంటిని. లోపల ఇల్లూడ్చుట జరుగుచుండెను. ఆదుమ్ము వాకిటికి వచ్చుచు నా మీదను సోకుచున్నది.' సమ్మార్జనీ రజ శ్చైవ శక్రస్యాపి శ్రియం హరేత్' అని కలదు. ఇక్కడే కూర్చుంటి వేమి యనిరి. చూడలేదు అంటిని.' అది కాదు. శాస్త్రవిశ్వాసము లేదు' అనిరి. ఊరకుంటిని. వా రవతలికి వెళ్ళిన తర్వాత ' దుమ్ము మిఁదఁ బడుట రోతే! నేను పుస్తకముమీది దృష్టితో ఉండి గుర్తింపఁజాల నయితిని. గురువులవా రన్నట్టు నిజముగా నిట్టి శాస్త్రము మీద విశ్వాసము నాకు లేనట్టే ఉన్నది' అని యేదో ప్రక్కనున్న మిత్రునితో ననుచుంటిని. అది విని శాస్త్రులవారు నన్ను చీవాట్లు పెట్టిరి.


--- ---