ప్రజ్ఞా ప్రభాకరము/అనుభూతి - తద్వికాసము

అనుభూతి - తద్వికాసము


ఏదో సందర్భములో నా పసి (అయిదు ఎనిమిది సంవత్సరముల నడిమి) వయస్సుననే ఆంజనేయుని దేవళమున బ్రాహ్మణ సంతర్పణము జరుగుచున్నది. నేను నున్నాను. బీటలు వాసి శిధిలముగా నున్న గుడి తలుపుసందున నుండి యెవరో తొంగిచూచిరి. ఆరగించుచున్న లోనివా రది గుర్తించి గద్దించిరి. బైటి మనిషి వైదొలగెను.మె మందఱము భుజించి వెలికి వచ్చితిమి. సాధు వొకఁ డాకొని యక్కడుండెను. ' నేవే కదా తొంగిచూచిన' దని భుక్తానులి ప్తులగు మావా రడిగిరి.' అగునండి! లోని సందడి విని గుడి కదా! లోని కళకళ మేమో అని చూచితిని. భుజించుట చూచితిని. మీరు గద్దించితిరి. మి భోజనానంతర మాకొన్న వానికి నా కింత యన్నము పెట్టుదు రేమో అని కూర్చుంటిని' అనెను.' బ్రాహ్మణ సంతర్పణము చెడగొట్టితివిరా దుర్మార్గుఁడా' యని మావారు చెడదిట్టిరి.' అయ్యా! మి రింత యన్నము పెట్టిన నా కడుపు నిండును గాని మి భోజనము చూచినంత మాత్రమున నాకేమి యొలుకు నండీ! లోన భుజింప వలసిన బ్రాహ్మణు లున్నారు. అంతా ముగిసేదాకా నీకు పెట్ట వీలు లేదు. పొ! తొలగిపొ' మ్మని ఒక మొనగాడు బ్రాహ్మణుఁ డుదరము నులుముకొనుచుఁ దిట్టెను. మిట్టమధ్యాహ్నము పన్నెండు గంటల వేళ! ఆ సాధువు కన్నీరు కార్చుచు ఆకసముకేసిచూచి తలవాల్చి కేలుదోయి సుర్యభాగవనునికి మోడ్చి 'తండ్రీ!నేనేపాపమునెఱుఁగను. నన్ను వీరు తిట్టుచున్నారు. సర్వసాక్షివి! చూచుచున్నావు! కనికరించు మో దేవా! అని చేతి కుండిలోని నీటితో బిక్కమొగము కడుగుకొని యక్కడ నుండి వెడలిపోయెను. ఆ సాధు వట్లు సూర్యునికి మ్రొక్కుచు మండుటెండులో మాడుచు నాడినపలుకుకు నా గుండెలలో వేడిగా నాఁటుకొనెను. ఒడలు జలదరించెను. ఇంటికి వెళ్లునప్పటికీ తివ్రజ్వరమువచ్చెను. మూఁడు నాళ్ళు చాల బాధపడితిని. ఆ బ్రాహ్మణుని ధౌర్త్యము, ఆ సాధువు జాలిమాటలు నాలో నా మూఁడు నాళ్లు నెంతో గందర గోళము గల్గించినవి. మా తల్లిదండ్రుల కీ గొడవనేనుతెలుపలేదు. క్రమక్రమముగా నా జ్వరము తగ్గినది. ఆ మూఁడునాళ్ళ శరీరకంపములో నాలో నెంతో లోతున నేదో భావము పాతుకొని పోయినది. ఈ సంభవము మాత్రము నాకు పలుతూరులు స్మృతిపదమున మెలగుచునే యుండి నది. కానీ అది లోఁ బాదుకొనిపోయి నాలో నుండి వెడలించిన వివేకజ్వాలలను మాత్రము నే నిటీవలనే _ ఈ విషయము వ్రాయుచున్నప్పుడే- స్పష్టముగా నిరూఢముగా నెఱుఁగ గల్గితిని.

పండ్రెండేండ్లకు ముందు మా మాతృ శ్రీ దివ్యధామ మందగా ఔర్ధ్యదైహిక కర్మకలాపము మాయన్నగారుచేసిరి. నేనుతద్దినముపెట్టువానితమ్ముఁడనుగా దగ్గఱనుంటిని." జ్యేష్ఠనైవతుకర్తవ్యం" అను శాస్త్ర నిర్ణయము చొప్పునే నేను పాటించి తిని. వచ్చిన వైదిక బృందము నేను కర్మ కలాపములు చేయ కూరకుంటి నని గర్హింప సాగిరి. శాస్త్ర నిర్ణయమును మా యింటి ప్రక్కనే ఉన్న సాంబ శివ శాస్త్రిగా రను విద్వాంసులు నిరూపించి యా వైదిక గోష్టిని నో రేత్తకుండఁ జేసిరి. అప్పుడు కర్మకలాప మంతయు ముగిసిన తర్వాత అన్నాతురులగు ప్రజలకు వర్ణవిభేదము లేకుండ ఒక నాఁ డెల్ల నేడెనిమివందలమందికి సంతర్పణము గావించితిమి. సంకల్పము నాది గాని నిర్వాహ మెల్ల మా తమ్ములు చేసిరి. వీధి యెల్ల శుభ్రపఱచి విస్తళ్లు వేసి భోజనములు పెట్టితిమి. కొందఱు వీధి యెల్ల చండాల భోజనముతో నంటైనదని గర్హించిరి. చుట్టుపట్టుల యూళ్ళ నలజడి రేగను. మా నిర్ణయము నిర్వక్రముగా సాగెను. ఇట్టి సంకల్పము నాలో పొడముట నా బాల్యమున నాలోఁ గుదుర్కొన్న యవయక్తభావ కారణమున నుండి వెడలిన కార్యవికాసమే యగుట నిటీవల గుర్తించితిని.

మరియు ముక్త్యాలలో జరిగిన నా కుమారుని వివాహామున గూడ నక్కడి సర్వ జాతుల వారికిని, పాకీ వారికి గూడ ఒక్కొక్క నాఁ డొక్కొక్క జాతివారికిఁగామృష్టాన్నసంతర్ప్ము జరుపుటయ్యెను. ఈ సందర్భమునఁగూడ మా తమ్ములే నిర్వహకులు. ఆ వివాహ సందర్భములో మా కాప్త మిత్రులు, శ్రీ ముక్త్యాల ప్రభువులు తమ యింటి వివాహముగా వివాహసర్వవ్యయము ఎన్ని వే లయ్యెనో తామే భరించిరి. ఇట్లు జరగుటకు గూడ బాల్యమున నాలోఁ గుదుర్కొన్న యవ్యక్తభావమే కారణము.

భూమిలోఁ బడవేసినవిత్తనము కొంతదాఁక ఏమయినదియుఁ దెలియరాక యుండి యుచితకాలమున నంకురరూపముగా బహిర్వికాసము చెందినట్లు మానవహృదయములలోఁ జొచ్చు కొని పోయినయనుభూతులు కూడ నుచితకాలమున వానికిఁ దగినట్లు పాకముతో వెల్వడి విరివిసెందును. కాని యివి బీజరూపముగా నెన్నడో లోనికిఁ జొచ్చుకొని పోయిన యాయనుభూతులవల్ల నేర్పడినవేయని గుర్తించుట మాత్రము సర్వత్ర జరుగదు. లోతయినసంస్కారములు కొన్ని కాల మెంతో గడచి యనుకూలసందర్భము సమకూడి నప్పుడు గాని కార్యపరిణామము సెందఁజాలవు. ఆ చెందిన కార్యపరిణామమునాఁటికి కారణజ్ఞప్తి మఱుగుపడి పోవుట సంభవింపవచ్చును. ఈ బీజరూప సంస్కారములు లోసొచ్చుటయుఁ దర్వాత నవి బహిర్వికాసము సెందుటయు నొక్క జన్మములోనే జరగు ననఁ గాదు. పూర్వక్షణపు బీజరూపసంస్కార ముత్తరక్షణముననే బహిర్వికాసము చెందునది గాఁ గొన్ని సందర్భములం దుండవచ్చును. కొన్ని సందర్భములం దేడుజన్మముల దాఁకఁ గూడఁ దేలనిది గావచ్చును. భగవత్ర్పాప్త్యర్దమైన సంకల్పబీజములు భగవత్తత్త్వమును గూర్చి స్పష్టపరిజ్ఞానము కుదురుదాఁక విరివి సెందుచుఁ బెరిగి పెరిగి పరమ్యము పొందినపిదప నక్కడనుండి బహిర్వికాసము వచ్చుచుఁ బరిపూర్ణతన జెందుటకుఁ గూడ నట్లే యేడు జన్మముల దాఁక సాగవచ్చును.

పరిపూర్ణత చెందు టనఁ గా మానవసామాన్యము కంటె నెంతో ఉన్నతోన్నతముగా ఎంతో లోతులోతుగా గోచరించిన తత్త్వమును మానవుఁడు తన ప్రేమ ప్రసరించిన చోట్ల నెల్ల వ్యాప్తపఱుపఁ గల్గుట. ఉన్నతోన్నతము, లోతులోతు నయినభావ మదాటుగా ఆకారణముగా అసాధనముగా గోచరింపదు. తన హృదయ మెంతెంత ప్రేమమయమగునో, ఆ ప్రేమ మానవత మీద నెంతెంత యధికాధికముగాఁ బ్రసరించునో మానవుఁ డంతంత ఉన్నతముగా అంతంత లోతుగా పారమ్యమునకుఁ జేరిక చేరికగాఁ బోగల్గును. చెట్లవ్రేళ్ళు విరివి సెంది దూరదూరము వ్యాపింపను వ్యాపింపను చెట్లు మీదికి పెరుగగల్గును. కూకటి వేరు నెలలోఁ తుకును జొరగల్గును గాదా!