పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/ప్రహ్లాదుని హింసించుట

ప్రహ్లాదుని హింసించుట


తెభా-7-186-వ.
అని రాక్షసవీరుల నీక్షించి యిట్లనియె.
టీక:- అని = అని; రాక్షసవీరులన్ = వీరులైన రాక్షసులను; ఈక్షించి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా పలికి హిరణ్యకశిపుడు వీరులైన తన రాక్షస భటులను ఇలా ఆదేశించాడు.

తెభా-7-187-శా.
"పంచాబ్దంబులవాఁడు తండ్రి నగు నా క్షంబు నిందించి య
త్కించిద్భీతియు లేక విష్ణు నహితుం గీర్తించుచున్నాఁడు వ
ల్దంచుం జెప్పిన మానఁ డంగమునఁ బుత్రాకారతన్ వ్యాధి జ
న్మించెన్ వీని వధించి రండు దనుజుల్ మీమీ పటుత్వంబులన్.

టీక:- పంచ = ఐదు (5); అబ్దంబుల = సంవత్సరముల వయసు; వాడు = వాడు; తండ్రి = తండ్రి; అగు = అయిన; నా = నా; పక్షంబున్ = మతమును; నిందించి = నిందించి; యత్ = ఏ; కించిత్ = కొంచెము యైన; భీతిన్ = భయము; లేక = లేకుండగ; విష్ణున్ = నారాయణుని; అహితున్ = విరోధిని; కీర్తించుచున్నాడు = స్తుతించుచున్నాడు; వల్దు = వద్దు; అంచున్ = అనుచు; చెప్పినన్ = చెప్పినప్పటికి; మానండు = మానివేయడు; అంగమునన్ = దేహములో; పుత్ర = కుమారుని; ఆకారతన = రూపుతో; వ్యాధి = రోగము; జన్మించెన్ = పుట్టెను; వీని = ఇతని; వధించి = చంపి; రండు = రండి; దనుజుల్ = రాక్షసులారా; మీమీ = మీ యొక్క; పటుత్వంబులన్ = బలముకొలది.
భావము:- “రాక్షసులారా! వీడేమో ఇంతా చేసి అయిదేండ్ల వాడు. చూడండి, కన్న తండ్రిని నన్నే ఎదిరిస్తున్నాడు. నన్ను లెక్క చేయకుండా, నదురు బెదురు లేకుండా, నా ఎదుటే శత్రువైన హరిని పొగడుతున్నాడు. “వద్దురా కన్నా!” అని నచ్చజెప్పినా వినటం లేదు. నా శరీరంలో పుట్టిన వ్యాధిలా పుత్రరూపంలో పుట్టుకొని వచ్చాడు. అందుచేత, మీరు ఈ ప్రహ్లాదుడిని తీసుకువెళ్ళి వధించి రండి. మీమీ పరాక్రమాలు ప్రదర్శించండి,” అని ఆదేశించి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-7-188-శా.
అంవ్రాతములోఁ జికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శే
షాంశ్రేణికి రక్ష చేయు క్రియ నీ జ్ఞుం గులద్రోహి దు
స్సంగుం గేశవపక్షపాతి నధముం జంపించి వీరవ్రతో
త్తుంఖ్యాతిఁ జరించెదం గులము నిర్దోషంబు గావించెదన్.

టీక:- అంగ = అవయవముల; వ్రాతము = సముదాయము; లోన్ = అందు; చికిత్సకుడు = వైద్యుడు; దుష్ట = పాడైన; అంగంబున్ = అవయమును; ఖండించి = కత్తిరించివేసి; శేష = మిగిలిన; అంగ = అవయవముల; శ్రేణి = సముదాయమున; కిన్ = కు; రక్ష = శుభమును; చేయు = చేసెడి; క్రియన్ = విధముగ; ఈ = ఈ; అజ్ఞున్ = తెలివితక్కువ వానిని; కుల = వంశమునకు; ద్రోహిన్ = ద్రోహము చేయు వానిని; దుస్సంగున్ = చెడుసావాసము చేయువానిని; కేశవ = నారాయణుని {కేశవుడు - కేశి యను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; పక్షపాతిన్ = పక్షము వహించు వాని; అధమున్ = నీచుని; చంపించి = సంహరింపజేసి; వీర = శౌర్యవంతమైన; వ్రత = కార్యములను చేసెడి నిష్ఠచే; ఉత్తుంగ = అత్యధికమైన; ఖ్యాతిన్ = కీర్తితో; చరించెదన్ = తిరిగెదను; కులము = వంశము; నిర్దోషము = కళంకము లేనిదిగా; కావించెదన్ = చేసెదను.
భావము:- “ఈ చెడు త్రోవ పట్టిన కుల ద్రోహీ, శత్రు పక్షపాతీ, మూర్ఖుడూ అయిన ప్రహ్లాదుడు మన దానవ వంశంలో పుట్టిన దుష్టాంగం. వ్యాధి బారిన పడిన దుష్ట అవయవాన్ని ఖండించి, శస్త్రవైద్యుడు దేహంలోని మిగిలిన అవయవాలకు ఆరోగ్యం కలిగించి రక్షిస్తాడు. అలాగే, ఇతనిని చంపించి కులానికి మచ్చ లేకుండా చేస్తాను. ఒక మంచి పని చేసిన గొప్ప మహా వీరుడు అనే కీర్తిని పొందుతాను.

తెభా-7-189-క.
హంవ్యుఁడు రక్షింపను
మంవ్యుఁడు గాడు యముని మందిరమునకున్
గంవ్యుఁడు వధమున కుప
రంవ్యుం డనక చంపి రం డీ పడుచున్."

టీక:- హంతవ్యుడు = చంపదగినవాడు; రక్షింపను = కాపాడుటకు; మంతవ్యుడు = యోచింప దగినవాడు; కాడు = కాడు; యముని = యముడి యొక్క; మందిరమున్ = ఇంటి; కున్ = కి; గంతవ్యుడు = పోదగినవాడు; వధమున్ = చంపుట; కున్ = కు; ఉపరంతవ్యుడు = మానదగినవాడు; అనక = అనకుండగ; చంపి = సంహరించి; రండి = రండి; ఈ = ఈ; పడుచున్ = పిల్లవానిని.
భావము:- ఇతడు చంపదగినవాడు. ఏ మాత్రం క్షమించదగినవాడు కాడు. ప్రహ్లాదుడు తక్షణం యమపురికి పంపదగినవాడు. తప్పులు మన్నించకండి. జాలి పడి విడిచిపెట్టకుండా వధించి రండి.”

తెభా-7-190-వ.
అని దానవేంద్రుం డానతిచ్చిన వాఁడి కోఱలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై వక్త్రంబులు తెఱచికొని యుబ్బి బొబ్బలిడుచు ధూమసహిత దావదహనంబునుం బోలెఁ దామ్ర సంకాశంబు లయిన కేశంబులు మెఱయ ఖేదన చ్ఛేదన వాదంబులుఁ జేయుచు.
టీక:- అని = అని; దానవేంద్రుండు = రాక్షసరాజు; ఆనతిచ్చినన్ = ఆజ్ఞాపించగా; వాడి = పదునైన; కోఱలు = కోరలు; కల = కలిగిన; రక్కసులు = రాక్షసులు; పెక్కండ్రు = అనేకులు; శూల = శూలమును; హస్తులు = చేతులో ధరించినవారు; ఐ = అయ్యి; వక్త్రంబులు = నోళ్ళు; తెఱచికొని = తెరుచుకొని; ఉబ్బి = పొంగిపోతూ; బొబ్బలు = అరుపులు; ఇడుచున్ = పెడుతూ; ధూమ = పొగతో; సహిత = కూడిన; దావదహనంబునన్ = కారుచిచ్చును; పోలెన్ = వలె; తామ్ర = రాగితో; సంకాశంబులు = పొల్చదగినట్టి; కేశంబులున్ = శిరోజములు; మెఱయన్ = మెరుస్తుండగా; ఖేదన = కొట్టండి అనెడి; ఛేదన = నరకండి అనెడి; వాదంబులున్ = అరుపులు; చేయుచున్ = పెడుతూ.
భావము:- ఇలా ప్రహ్లాదుడిని చంపమని దానవేంద్రుడు ఆజ్ఞాపించాడు. పదునైన కోరలు కలిగిన చాలామంది రాక్షసులు చేతులలో శూలాలు పట్టుకుని, భయంకరంగా నోళ్లు తెరచి అరుస్తూ ఉద్రేకంగా గంతులు వేయసాగారు. విరబోసుకున్న ఎఱ్ఱటి జుట్టుతో వాళ్ళు పొగతో వికృతంగా ఉన్న కార్చిచ్చు మంటలు లాగా ఉన్నారు. అలాంటి భీకర ఆకారాలు గల ఆ రాక్షసులు వచ్చి ఆ బాలుడిని తిట్టండి, కొట్టండి అని కేకలు పెడుతూ. . . ..

తెభా-7-191-ఉ.
"బాలుఁడు రాచబిడ్డఁడు కృపాళుఁడు సాధుఁడు లోకమాన్య సం
శీలుఁడు వీఁ డవధ్యుఁ"డని చిక్కక స్రుక్కక క్రూరచిత్తులై
శూములం దదంగముల సుస్థిరులై ప్రహరించి రుగ్ర వా
చాత నందఱున్ దివిజత్రుఁడు వల్దనఁ డయ్యె భూవరా!

టీక:- బాలుడు = చిన్నపిల్లవాడు; రాచబిడ్డడు = రాకుమారుడు; కృపాళుడు = దయ గలవాడు; సాధుడు = మెత్తని స్వభావము గలవాడు; లోక = లోకులచే; మాన్య = మన్నింపదగిన; శీలుడు = వర్తన గలవాడు; వీడు = ఇతడు; అవధ్యుడు = చందగినవాడు కాడు; అని = అని; చిక్కక = వెరవక; స్రుక్కక = భయపడక; క్రూర = భయంకరమైన; చిత్తులు = మనసు గలవారు; ఐ = అయ్యి; శూలములన్ = శూలములతో; తత్ = అతని; అంగములన్ = అవయవములను; సుస్థిరులు = బాగా నిలకడ గలవారు; ఐ = అయ్యి; ప్రహరించిరి = కొట్టిరి; ఉగ్ర = భీకరమైన; వాచాలతన్ = వాగుడుతో; అందఱున్ = అందరును; దివిజశత్రుడు = రాక్షసుడు; వల్దు = వద్దు; అనడు = అనకుండెడివాడు; అయ్యెన్ = అయ్యెను; భూవరా = రాజా.
భావము:- ఓ ధర్మరాజా! అంతట ఆ దానవులు “అయ్యో! ఇతగాడు బాగా చిన్న పిల్లాడు, బహు సుకుమారుడు, మీదుమిక్కిలి తమ రాకుమారుడు” అని కాని; “దయ గల వాడు, మంచి వాడు, అందరూ మెచ్చుకునే గుణం శీలం కలవాడు” అని కాని ఏమాత్రం జాలికూడా లేకుండా ప్రహ్లాదుడిని బాగా కొట్టారు. శూలాలతో క్రూరంగా పొడిచారు. గట్టిగా నానా మాటలు అన్నారు, తిట్టారు. నానా బాధలూ పెట్టారు ఇంత ఎదురుగా జరుగుతుంటే కన్నతండ్రి, కొడుకును కొట్టవద్దు అనటం లేదు, పైగా వినోదంగా చూస్తున్నాడు. సొంత కొడుకుమీద మరీ అంత పగ ఏమిటో.

తెభా-7-192-చ.
లువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేశమాత్రము
న్నొలియదు లోపలన్ రుధిర ముబ్బదు కందదు శల్య సంఘమున్
లియదు దృష్టివైభవము ష్టము గాదు ముఖేందు కాంతియుం
బొలియదు నూతనశ్రమము పుట్టదు పట్టదు దీనభావమున్.

టీక:- పలువురు = అనేకులు; దానవుల్ = రాక్షసులు; పొడువన్ = పొడవగా; బాలుని = పిల్లవాని; దేహము = శరీరము; లేశ = కొంచపు; మాత్రమున్ = మాత్రము అయినను; ఒలియదు = ఒరసికొనిపోదు, చిట్లదు; లోపలన్ = లోపలనుంచి; రుధిరము = రక్తము; ఉబ్బదు = పొంగదు; కందదు = కందిపోదు; శల్య = ఎముకల; సంఘమున్ = గూడు; నలియదు = నలిగిపోదు; దృష్టి = చూపులలోని; వైభవము = మెరుపు; నష్టముగాదు = తగ్గిపోదు; ముఖ = మోము యనెడి; ఇందు = చంద్రుని; కాంతియున్ = ప్రకాశము; పొలియదు = నశింపదు; నూతన = కొత్తగ; శ్రమము = అలసట; పుట్టదు = కలగదు; పట్టదు = చెందదు; దీనభావమున్ = భీరుత్వమును.
భావము:- అదేం విచిత్రమూ కాని, అంతమంది పెద్ద పెద్ద రాక్షసులు ఇలా ఆ ఒక్క బాలుడిమీద పడి శక్తి మీర పొడుస్తుంటే, ప్రహ్లాదుడి శరీరం అసలు ఏమాత్రం కందనే కంద లేదు. రక్తం చిందలేదు, లోపలి ఎముకలు విరగలేదు, కళ్ళ లోని కళ మాయ లేదు, ముఖం వాడలేదు, కనీసం అతనిలో ఎక్కడా అలసట కూడా కనిపించ లేదు.

తెభా-7-193-ఉ.
న్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుఁడు మాటిమాటి "కో!
న్నగశాయి! యో! దనుజభంజన! యో! జగదీశ! యో! మహా
న్నశరణ్య! యో! నిఖిలపావన!"యంచు నుతించుఁ గాని తాఁ
న్నుల నీరు దేఁడు భయకంపసమేతుఁడు గాఁడు భూవరా!

టీక:- తన్నున్ = తనను; నిశాచరుల్ = రాక్షసులు {నిశాచరులు - నిశ (రాత్రి) యందు చరులు (తిరుగువారు), రాక్షసులు}; పొడువన్ = పొడవగా; దైత్య = రాక్షస; కుమారుడు = బాలుడు; మాటిమాటికిన్ = అస్తమాను {మాటిమాటికి - ప్రతిమాటకు, అస్తమాను}; ఓ = ఓ; పన్నగశాయి = హరి {పన్నగ శాయి - పన్నగ (శేషసర్పము) పైన శాయి(శయనించువాడు), విష్ణువు}; ఓ = ఓ ; దనుజభంజన = హరి {దనుజ భంజనుడు - దనుజ (రాక్షసులను) భంజనుండు (సంహరించువాడు), విష్ణువు}; ఓ = ఓ ; జగదీశ = హరి {జగదీశుడు - జగత్ (విశ్వమంతటకు) ఈశుడు (ప్రభువు), విష్ణువు}; ఓ = ఓ ; మహాపన్నశరణ్య = హరి {మహాపన్న శరణ్యుడు - మహా (గొప్ప) ఆపన్న (ఆపదలను పొందినవారికి) శరణ్యుడు (శరణము నిచ్చువాడు), విష్ణువు}; ఓ = ఓ ; నిఖిలపావన = హరి {నిఖిల పావనుడు - నిఖిల (సమస్తమును) పావనుడు (పవిత్రము జేయువాడు), విష్ణువు}; అంచున్ = అనుచు; నుతించున్ = కీర్తించును; కాని = అంతే కాని; తాన్ = తను; కన్నులన్ = కళ్ళమ్మట; నీరు = కన్నీరు; తేడు = తీసుకురాడు; భయ = భయముచే; కంప = వణుకు; సమేతుడు = తోకూడినవాడు; కాడు = కాడు; భూవరా = రాజా {భూవర - భూమికి వరుడు(భర్త), రాజు}.
భావము:- ఓ ధర్మరాజా! ఇలా రాక్షసులు తనను ఎంత క్రుమ్మినా, ప్రహ్లాదుడు మాటిమాటికీ “ఓ శేషశయనా! ఓ రాక్షసాంతకా! ఓ లోకనాయకా! ఓ దీనరక్షాకరా! ఓ సర్వపవిత్రా!” అని రకరకాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు తప్పించి; కన్నీళ్ళు పెట్టటం లేదు; ఏ మాత్రం భయపడటం లేదు; కనీసం జంకటం లేదు.

తెభా-7-194-ఉ.
పాఱఁడు లేచి దిక్కులకు; బాహువు లొడ్డఁడు; బంధురాజిలోఁ
దూఱఁడు;"ఘోరకృత్య"మని దూఱఁడు; తండ్రిని మిత్రవర్గముం
జీరఁడు; మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం
దాఱఁడు;"కావరే"యనఁడు; తాపము నొందఁడు; కంటగింపఁడున్.

టీక:- పాఱడు = పారిపోడు; లేచి = లేచిపోయి; దిక్కుల్ = దూరప్రదేశముల; కున్ = కు; బాహువులు = చేతులు; ఒడ్డడు = అడ్డము పెట్టడు; బంధు = చుట్టముల; రాజి = సంఘము; లోన్ = లోకి; దూఱడు = ప్రవేశింపడు; ఘోర = ఘోరమైన; కృత్యము = కార్యము, పని; అని = అనుచు; దూఱడు = తిట్టడు; తండ్రిని = తండ్రిని; మిత్ర = స్నేహితుల; వర్గమున్ = సమూహమును; చీరడు = పిలువడు; మాతృ = తల్లుల; సంఘము = సమూహము; వసించు = ఉండెడి; సువర్ణ = బంగారు; గృహంబు = ఇంటి; లోని = లోపలి; కిన్ = కి; తాఱడు = దాగుకొనడు; కావరే = కాపాడండి; అనడు = అనడు; తాపమున్ = సంతాపమును; ఒందడు = పొందడు; కంటగింపడున్ = ద్వేషము చూపడు.
భావము:- ఆ రాక్షసులు ఎంత హింసిస్తున్నా ప్రహ్లాదుడు దూరంగా పారిపోడు; కొడుతుంటే చేతులు అయినా అడ్డం పెట్టుకోడు; చుట్టాల గుంపులోకి దూరి దాక్కోడు; ఇది “ఘోరం, అన్యాయం” అని తండ్రిని నిందించడు; స్నేహితులను సాయం రమ్మనడు; తన తల్లి, సవితి తల్లి మున్నగు తల్లులు నివాసం ఉండే బంగారు మేడల లోనికి పరుగెట్టి, “కాపాడండి” అని గోలపెట్టడు; అసలు బాధపడనే పడడు; వేదన చెందడు. తండ్రిని గానీ, బాధిస్తున్న రాక్షసులను కాని అసహాయంగా చూస్తున్న వారిని కానీ ఎవరినీ ద్వేషించడు; ఎంతటి విచిత్రం, ఇలాంటి పిల్లవాడు ఎక్కడైనా ఉంటాడా?

తెభా-7-195-వ.
ఇట్లు సర్వాత్మకంబై యిట్టిదట్టి దని నిర్దేశింప రాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణుని యందుఁ జిత్తంబుజేర్చి తన్మయుం డయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుండు దన కింకరులచేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబు లైన సత్కారంబులుం బోలె విఫలంబు లగుటం జూచి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సర్వాత్మకంబు = అఖిలము తానే యైనది; ఐ = అయ్యి; ఇట్టిదట్టిది = ఇలాంటిది అలాంటిది; అని = అని; నిర్దేశింపరాని = చెప్పలేనట్టి; పరబ్రహ్మంబు = పరబ్రహ్మము; తాన = తానే; ఐ = అయ్యి; ఆ = ఆ; మహా = గొప్ప; విష్ణుని = నారాయణుని {విష్ణువు - (విశ్వమంతట) వ్యాపించినవాడు, హరి}; అందున్ = అందు; చిత్తంబు = మనస్సును; చేర్చి = లగ్నముచేసి; తన్మయుండు = మైమరచినవాడు; అయి = అయ్యి; పరమ = అత్యధికమైన, సర్వాతీతమైన; ఆనందంబునన్ = ఆనందమును; పొంది = పొంది; ఉన్న = ఉన్నట్టి; ప్రహ్లాదుని = ప్రహ్లాదుని; అందున్ = ఎడల; రాక్షసేంద్రుండు = రాక్షసరాజు; తన = తన; కింకరుల = సేవకుల; చేతన్ = చేత; చేయించుచున్న = చేయిస్తున్నట్టి; మారణ = చంపెడి; కర్మంబులు = కార్యములు, పనులు; పాప = పాపపు; కర్ముని = పనులు చేయువారి; అందున్ = ఎడల; ప్రయుక్తంబులు = ప్రయోగింపబడినవి; ఐన = అయిన; సత్కారంబులున్ = సన్మానములు; పోలెన్ = వలె; విఫలంబులు = వ్యర్థములు; అగుటన్ = అగుట; చూచి = చూసి.
భావము:- ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణించలేని ఆ సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మము తానే అయ్యాడు. తన మనస్సును మహావిష్ణువు మీద నిలిపి తనను తానే మరచి తాదాత్మ్యం చెంది ఆనందంతో పరవశించి పోతున్నాడు. పాపాత్ముడి పట్ల చేసిన సన్మానాలు ఎలా వ్యర్థం అవుతాయో, అలా హిరణ్యకశిపుడు తన భటులచేత పెట్టిస్తున్న బాధలు అన్నీ విఫలం అయిపోతున్నాయి. ఇది చూసి హిరణ్యకశిపుడు ఇలా అనుకున్నాడు.

తెభా-7-196-ఉ.
"శూములన్ నిశాచరులు స్రుక్కక దేహము నిగ్రహింపఁగా
బాలుఁడు నేలపైఁ బడఁడు పాఱఁడు చావఁడు తండ్రినైన నా
పాలికి వచ్చి చక్రధరు క్షము మానితి నంచుఁ బాదముల్
ఫాము సోఁక మ్రొక్కఁ డనపాయత నొందుట కేమి హేతువో?"

టీక:- శూలములన్ = శూలములతో; నిశాచరులు = రాక్షసులు; స్రుక్కక = వెనుదీయక; దేహమున్ = శరీరమును; నిగ్రహింపగాన్ = దండింపగా, పొడవగా; బాలుడు = పిల్లవాడు; నేల = భూమి; పైన్ = మీద; పడడు = పడిపోడు; పాఱడు = పరిగెట్టడు; చావడు = మరణించడు; తండ్రిన్ = తండ్రిని; ఐన = అయిన; నా = నా; పాలి = వద్ద; కిన్ = కు; వచ్చి = వచ్చి; చక్రధరు = నారాయణుని; పక్షమున్ = పక్షమును; మానితిన్ = విడిచితిని; అంచున్ = అనుచు; పాదముల్ = కాళ్ళను; ఫాలము = నుదురు; సోకన్ = తగులునట్లు; మ్రొక్కడు = నమస్కరింపడు; అనపాయతన్ = ఆపదలు లేకపోవుట; ఒందుట = పొందుట; కున్ = కు; ఏమి = ఏమిటి; హేతువో = కారణమో.
భావము:- “ఇంత వీడు ఇంతమంది రాక్షసులు పగతో, పట్టుదలతో బరిసెలతో పొడుస్తుంటే, బాధలు భరించలేక క్రింద పడి దొర్లడు, పోనీ పారిపోడు, “చచ్చిపోతున్నా బాబోయ్” అనడు. కనీసం స్వంత తండ్రిని ఇక్కడే ఉన్నా కదా నా దగ్గరకి వచ్చి నేను ఇంక విష్ణువును ఆరాధించను, నన్ను క్షమించు అని కాళ్ళ మీద సాగిలపడడు. ఇలా ఏమాత్రం బాధ పొందకుండా, ప్రమాదం కలగకుండా ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటో తెలియటం లేదు.”

తెభా-7-197-వ.
అని శంకించుచు.
టీక:- అని = అని; శంకించుచు = సందేహిస్తూ.
భావము:- ఇలా ఆలోచిస్తూ హిరణ్యకశిపుడు సందేహంలో పడ్డాడు.

తెభా-7-198-సీ.
కమాటు దిక్కుంభియూధంబుఁ దెప్పించి-
కెరలి డింభకునిఁ ద్రొక్కింపఁ బంపు;
నొకమాటు విషభీకరోరగ శ్రేణుల-
డువడి నర్భకుఁ ఱవఁ బంపు;
నొకమాటు హేతిసంఘోగ్రానలములోన-
విసరి కుమారుని వ్రేయఁ బంపు;
నొకమాటు కూలంకషోల్లోల జలధిలో-
మొత్తించి శాబకు ముంపఁ బంపు;

తెభా-7-198.1-ఆ.
విషముఁ బెట్టఁ బంపు; విదళింపఁగాఁ బంపు;
దొడ్డ కొండచఱులఁ ద్రోయఁ బంపుఁ;
ట్టి కట్టఁ బంపు; బాధింపఁగాఁ బంపు;
బాలుఁ గినిసి దనుజపాలుఁ డధిప!

టీక:- ఒకమాటు = ఒకమారు; దిక్కుంభి = దిగ్గజముల {అష్టదిగ్గజములు - 1ఐరావతము 2పుండరీకము 3వామనము 4కుముదము 5అంజనము 6పుష్పదంతము 7సార్వభౌమము 8సుప్రతీకము అనెడి అష్టదిక్కు లందలి దివ్యమైన ఏనుగులు}; యూధంబున్ = గుంపును; తెప్పించి = తెప్పించి; కెరలి = చెలరేగి; డింభకుని = బాలుని; త్రొక్కింపన్ = తొక్కించుటకు; పంపున్ = పంపించును; ఒకమాటు = ఒకమారు; విష = విషము గలిగిన; భీకర = భయప్రదమైన; ఉరగ = పాముల; శ్రేణులన్ = వరుసలను; కడు = మిక్కిలి; వడిన్ = తీవ్రముగా; అర్భకున్ = బాలుని; కఱవన్ = కాటువేయుటకు; పంపున్ = పంపించును; ఒకమాటు = ఒకమారు; హేతి = మంటల; సంఘ = సమూహముతో; ఉగ్ర = భయంకరమైన; అనలము = అగ్ని; లోనన్ = లోనికి; విసిరి = విసిరేసి; కుమారునిన్ = పుత్రుని; వ్రేయన్ = పడవేయుటకు; పంపున్ = పంపించును; ఒకమాటు = ఒకమారు; కూలన్ = గట్టులను, చెలియలికట్టలను; కష = ఒరుసుకొనెడి; ఉల్లోల = పెద్ద అలలు గల; జలధి = సముద్రము; లోన్ = అందు; మొత్తించి = కొట్టించి; శాబకున్ = బాలుని; ముంపన్ = ముంచివేయుటకు; పంపున్ = పంపించును.
విషమున్ = విషమును; పెట్టన్ = పెట్టుటకు; పంపున్ = పంపించును; విదళింపగాన్ = చీల్చివేయుటకు; పంపున్ = పంపించును; దొడ్డ = పెద్ద; కొండచఱులన్ = కొండచరియలనుండి; త్రోయన్ = తోసివేయుటకు; పంపున్ = పంపించును; పట్టి = పట్టుకొని; కట్టన్ = కట్టివేయుటకు; పంపున్ = పంపించును; బాధింపగాన్ = పీడించుటకు; పంపున్ = పంపించును; బాలున్ = పిల్లవానిని; కినిసి = కినుక వహించి; దనుజపాలుడు = రాక్షసరాజు; అధిప = రాజా.
భావము:- ధర్మరాజా! ఆ రాక్షసరాజుకి అనుమానంతో పాటు మరింత కోపం పెరిగిపోయింది. ఒకసారి, దిగ్గజాల లాంటి మదించిన ఏనుగులను తెప్పించి తన కొడుకును క్రింద పడేసి తొక్కించమని పంపాడు; ఇంకోసారి, అతి భీకరమైన అనేక పెద్ద విషసర్పాల చేత గట్టిగా కరిపించమని పంపించాడు; మరోసారి, ఆ పిల్లవాడిని భగభగ ఉగ్రంగా మంటలతో మండుతున్న అగ్నిగుండాలలో పడేయండి అన్నాడు; ఇంకోమాటు, ఆ చిన్న పిల్లవాడిని పట్టుకొని బాగా చితగ్గొట్టి, నడిసముద్రంలో ముంచేసి రండని చెప్పాడు; విషం పెట్టి చంపేయమన్నాడు; కత్తితో నరికేయమన్నాడు; ఎత్తైన కొండ శిఖరాల మీద నుంచి క్రింద లోయలలోకి తోసేయమన్నాడు; కదలకుండా కట్టిపడేయమన్నాడు;. అలా ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి రకరకాల చిత్రహింసలు పెట్టించాడు

తెభా-7-199-సీ.
కవేళ నభిచార హోమంబు చేయించు-
నొకవేళ నెండల నుండఁ బంచు;
నొకవేళ వానల నుపహతి నొందించు-
నొకవేళ రంధ్రంబు లుక్కఁ బట్టు;
నొకవేళఁ దన మాయ నొదవించి బెగడించు-
నొకవేళ మంచున నొంటి నిలుపు;
నొకవేళఁ బెనుగాలి కున్ముఖుఁ గావించు-
నొకవేళఁ బాఁతించు నుర్వి యందు;

తెభా-7-199.1-తే.
నీరు నన్నంబు నిడనీక నిగ్రహించు;
శల నడిపించు; ఱువ్వించు గండశిలల;
దల వ్రేయించు; వేయించు నశరములఁ;
గొడుకు నొకవేళ నమరారి క్రోధి యగుచు.

టీక:- ఒకవేళ = ఒక సమయమున; అభిచార = మారణ, చిల్లంగి, శ్యేనయాగాది, హింసార్థమైన; హోమంబు = హోమములను; చేయించున్ = చేయించును; ఒకవేళ = ఒక సమయమున; ఎండలన్ = ఎండలలో; ఉండన్ = ఉండుటకు; పంచున్ = పంపించును; ఒకవేళ = ఒక సమయమున; వానలన్ = వానలలో; ఉపహతిన్ = ఉంచబడుటను; ఒందించున్ = పొందించును; ఒకవేళ = ఒక సమయమున; రంధ్రంబుల్ = నవరంధ్రములు; ఉక్కన్ = ఊపిరిసలపకుండగ; పట్టున్ = పట్టుకొనును; ఒకవేళ = ఒక సమయమున; తన = తన యొక్క; మాయన్ = మాయను; ఒదవించి = కలిగించి; బెగడించున్ = భయపెట్టును; ఒకవేళ = ఒక సమయమున; మంచునన్ = మంచునందు; ఒంటిన్ = ఒంటరిగా; నిలుపున్ = నిలబెట్టును; ఒకవేళ = ఒక సమయమున; పెనుగాలి = పెనుగాలి; కిన్ = కి; ఉన్ముఖున్ = ఎదురుగానుండువాని; కావించున్ = చేయును; ఒకవేళ = ఒక సమయమున; పాతించున్ = పాతిపెట్టించును; ఉర్విన్ = మట్టి; అందున్ = లో.
నీరున్ = నీళ్ళు; అన్నంబున్ = ఆహారము; ఇడనీక = ఇవ్వనీయకుండగ; నిగ్రహించున్ = ఆపించును; కశలన్ = కొరడాలతో; అడిపించున్ = కొట్టించును; ఱువ్వించున్ = మీదకు విసిరించును; గండశిలలన్ = గండరాళ్ళతో; గదలన్ = గదలతో; వ్రేయించున్ = బాదించును; వేయించున్ = వేయించును; ఘన = పెద్ద; శరములన్ = బాణములతో; కొడుకున్ = కొడుకును; ఒకవేళ = ఒక సమయమున; అమరారి = రాక్షసుడు {అమరారి - అమరుల (దేవతల యొక్క) అరి (శత్రువు), రాక్షసుడు}; క్రోధి = కోపము గలవాడు; అగుచు = అగుచు.
భావము:- దేవతల పాలిటి శత్రువు అయిన ఆ హిరణ్యకశిపుడు అంతులేని కోపంతో కొడుకును సంహరించడం కోసం చేయరానివి అన్నీ చేసాడు. ఒకరోజు, మారణహోమం చేయించాడు, ఇంకో నాడు, మండుటెండలలో నిలువునా నిలబెట్టాడు, మరొక రోజు ఉపద్రవంగా కురుస్తున్న జడివానలోకి గెంటాడు. కుఱ్ఱ వాడి నవ రంధ్రాలు మూసి ఉక్కిరిబిక్కిరి చేయించాడు. మరొక నాడు, అంత చిన్న పసివాడికి తన మాయలు అన్నీ చూపించి భయపెట్టాడు. ఇంకోసారి, గడ్డ కట్టించే చలిగా ఉండే మంచులో ఒంటరిగా ఉంచేసాడు. మరొక రోజు, గాలిదుమారంలో ఎదురుగా నిలబెట్టేశాడు. మరొక సారి భూమిలో పాతి పెట్టేశాడు. ఆఖరుకి అన్నం నీళ్ళు ఇవ్వకుండా కడుపు మాడిపించాడు. కొరడాలతో కొట్టించాడు. గదలతో మోదించాడు. చివరికి చిన్న పిల్లాడు అని చూడకుండా అతని మీదికి రాళ్లు రువ్వించాడు. బాణాలు వేయించాడు. అలా ఒళ్లు తెలియని క్రోధంతో కన్న కొడుకును ఆ క్రూర దానవుడు చేయరాని ఘోరాతి ఘోరాలు అన్నీ చేయించాడు.

తెభా-7-200-వ.
మఱియు ననేక మారణోపాయంబులఁ బాపరహితుం డైన పాపని రూపుమాపలేక యేకాంతంబున దురంత చింతా పరిశ్రాంతుండయి రాక్షసేంద్రుండు దన మనంబున.
టీక:- మఱియున్ = ఇంకను; అనేక = అనేకమైన; మారణ = చంపెడి; ఉపాయంబులన్ = ఉపాయములతో; పాప = పాపము; రహితుండు = లేనివాడు; ఐన = అయిన; పాపని = బాలుని; రూపుమాపన్ = చంపివేయ; లేకన్ = అలవికాక; ఏకాంతంబునన్ = ఒంటరిగా; దురంత = దాటరాని; చింతా = వగపుచేత; పరిశ్రాంతుండు = అలసినవాడు; అయి = అయ్యి; రాక్షసేంద్రుండు = రాక్షసరాజు; తన = తన యొక్క; మనంబునన్ = మనసులో.
భావము:- అంతేకాక, ఏ పాపం ఎరుగని ఆ పసివాడైన ఆ ప్రహ్లాదుడిని, ఎలాగైనా చంపాలని ఎన్నో విధాల ప్రయత్నించాడు. కాని సాధ్యంకాలేదు. ఆ దానవ చక్రవర్తి హిరణ్యకశిపుడు మనసంతా నిండిన అంతులేని దిగులుతో ఇలా ఆలోచించసాగాడు.

తెభా-7-201-ఉ.
ముంచితి వార్ధులన్, గదల మొత్తితి, శైలతటంబులందు ద్రొ
బ్బించితి, శస్త్రరాజిఁ బొడిపించితి, మీఁద నిభేంద్రపంక్తి ఱొ
ప్పించితి; ధిక్కరించితి; శపించితి; ఘోరదవాగ్నులందుఁ ద్రో
యించితిఁ; బెక్కుపాట్ల నలయించితిఁ; జావఁ డి దేమి చిత్రమో

టీక:- ముంచితిని = ముంచివేసితిని; వార్ధులన్ = సముద్రములలో; గదలన్ = గదలతో; మొత్తితిన్ = మొత్తాను; శైల = పర్వత; తటంబుల్ = చరియల; అందున్ = అందునుండి; ద్రొబ్బించితిన్ = తోయింపించేను; శస్త్ర = కత్తుల; రాజిన్ = అనేకముచే; పొడిపించితిన్ = పొడిపించేను; మీదన్ = శరీరము పైకి; ఇభ = ఏనుగులలో; ఇంద్ర = గొప్పవాని; పంక్తిన్ = గుంపుచేత; ఱొప్పించితిన్ = తొక్కించితిని; ధిక్కరించితిన్ = బెదిరించితిని; శపించితిని = తిట్టితిని; ఘోర = భయంకరమైన; దవాగ్నులు = కార్చిచ్చులు; అందున్ = లో; త్రోయించితిన్ = తోయించితిని; పెక్కు = అనేకమైన; పాట్లన్ = బాధలచే; అలయించితిన్ = కష్టపెట్టితిని; చావడు = చనిపోడు; ఇది = ఇది; ఏమి = ఏమి; చిత్రమో = వింతయోకదా.
భావము:- “సముద్రాలలో ముంచింపించాను; గదలతో చావ మోదించాను; కొండలమీద నుంచి తోయించాను; కత్తులతో పొడిపించాను; క్రింద పడేసి ఏనుగులతో తొక్కింపించాను; కొట్టించాను; తిట్టించాను; ఎన్నో రకాలుగా బాధింపించాను; నిప్పుల్లోకి పడేయించాను; అయినా ఈ కుఱ్ఱాడు ప్రహ్లాదుడు చచ్చిపోడు. ఇదెంతో వింతగా ఉందే.

తెభా-7-202-చ.
ఱుఁగఁడు జీవనౌషధము; లెవ్వరు భర్తలు లేరు; బాధలం
లఁడు నైజ తేజమునఁ; థ్యము జాడ్యము లేదు; మిక్కిలిన్
మెయుచు నున్నవాఁ; డొక నిమేషము దైన్యము నొందఁ డింక నే
తెఱఁగునఁ ద్రుంతు? వేసరితి; దివ్యము వీని ప్రభావ మెట్టిదో?

టీక:- ఎఱుగడు = తెలిసినవాడుకాడు; జీవన = మరణించకుండెడి; ఔషధములు = మందులను; ఎవ్వరున్ = ఎవరుకూడ; భర్తలు = రక్షించువారు; లేరు = లేరు; బాధలన్ = కష్టములకు; తఱలడు = చలించడు; నైజ = స్వాభావిక; తేజమునన్ = తేజస్సుతో; తథ్యము = నిశ్చయముగా; జాడ్యము = జడ్డుదనము; లేదు = లేదు; మిక్కిలిన్ = పెద్దగ; మెఱయుచున్ = ప్రకాశించుచు; ఉన్నవాడు = ఉన్నాడు; ఒక = ఒక; నిమేషమున్ = కొద్ది సమయ మైనా; దైన్యమున్ = దీనతను; ఒందడు = పొందడు; ఇంకన్ = ఇంకా; ఏ = ఎలాంటి; తెఱగునన్ = విధానములను; త్రుంతున్ = చంపగలను; వేసరితిన్ = విసిగిపోతిని; దివ్యము = చాలా గొప్పది; వీని = ఇతని; ప్రభావము = మహిమ; ఎట్టిదో = ఎలాంటిదో కదా.
భావము:- మరణంలేని మందులు (అమృతం) ఏమైనా తాగాడు అనుకుందా మంటే, అలాంటివి వీడికి తెలియదు కదా. పోనీ ఎవరైనా కాపాడుతున్నారా, అంటే అలాంటి వారు ఎవరూ లేరు. నిశ్చయంగా స్వభావసిద్ధంగానే వీనికి జాడ్యాలు అంటవేమో? బాధలు ఎన్ని పెట్టినా దేహ కాంతి తగ్గటం లేదు. ఏ నిమిషం దీనత్వం పొందడు. ఇంక ఈ ప్రహ్లాదుడిని ఎలా చంపాలి. ఎలాగో తెలియక విసుగొస్తోంది. ఇంతటి వీడి శక్తి చూస్తే, ఇదేదో దివ్యమైన ప్రభావంలా అనిపిస్తోంది.

తెభా-7-203-వ.
అదియునుం గాక తొల్లి శునశ్శేఫుం డను మునికుమారుండు దండ్రి చేత యాగపశుత్వంబునకు దత్తుం డయి తండ్రి తనకు నపకారి యని తలంపక బ్రదికిన చందంబున.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండగ; తొల్లి = పూర్వము; శునశ్శేపుండు = శునశ్శేపుడు; అను = అనెడి; ముని = మునుల; కుమారుండు = పుత్రుడు; తండ్రి = తండ్రి; చేతన్ = వలన; యాగ = యజ్ఞమునకైన; పశుత్వంబున్ = బలిపశువు అగుట; కున్ = కు; దత్తుండు = ఇయ్యబడినవాడు; అయి = అయ్యి; తండ్రిన్ = తండ్రిని; తన = తన; కున్ = కు; అపకారి = హాని చేసినవాడు; అని = అని; తలపకన్ = భావించకుండగ; బ్రదికిన = ఆపదనుండి బయటపడిన; చందంబునన్ = విధముగ.
భావము:- పూర్వకాలంలో అజీగర్తుడు అని ఒక ముని ఉండేవాడు. శునశ్శేపుడు అతని నడిమి కొడుకు. ఆ తండ్రి ధనం కోసం తన నడిమి కొడుకును యాగ పశువుగా ఇచ్చేసేడట. అయినా కూడ ఆ బాలుడు తండ్రిని అపకారిగా భావించకుండా ఉపకారిగానే భావించి జీవించి ఉన్నాడట. అలాగే నా కొడుకు ప్రహ్లాదుడు కూడ ఉన్నాడే!

తెభా-7-204-క.
గ్రహమునఁ నేఁ జేసిన
నిగ్రహములు పరులతోడ నెఱి నొకనాఁడున్
విగ్రహము లనుచుఁ బలుకఁ డ
నుగ్రహములుగా స్మరించు నొవ్వఁడు మదిలోన్.

టీక:- ఆగ్రహమునన్ = కోపముతో; నేన్ = నేను; చేసిన = చేసినట్టి; నిగ్రహములు = దండనములు; పరుల = ఇతరుల; తోడన్ = తోటి; నెఱిన్ = వక్రతతో; ఒక = ఒక; నాడున్ = రోజున కూడ; విగ్రహములు = విరోధములుగా; పలుకడు = చెప్పడు; అనుగ్రహములు = సత్కారములు; కాన్ = అయినట్లు; స్మరించున్ = తలచును; నొవ్వడు = బాధపడడు; మది = మనసు; లోన = లోపల.
భావము:- అంతే కాకుండా, నేను కోపంతో వీడిని ఎన్ని రకాల బాధలు పెట్టినా, ఎక్కడా ఎవరి దగ్గర మా నాన్న ఇలా బాధిస్తున్నాడు అంటూ చెప్పుకోడు. పైపెచ్చు అవన్నీ హితములుగానే తలుస్తున్నాడు. మనసులో కూడా బాధ పడడు. వీడి తత్వం ఏమిటో అర్థం కావటంలేదు.

తెభా-7-205-వ.
కావున వీఁడు మహాప్రభావసంపన్నుండు వీనికెందును భయంబు లేదు; వీనితోడి విరోధంబునం దనకు మృత్యువు సిద్ధించు"నని నిర్ణయించి చిన్నఁబోయి ఖిన్నుండై ప్రసన్నుండు గాక క్రిందు జూచుచు విషణ్ణుండై చింతనంబు జేయుచున్న రాజునకు మంతనంబునఁ జండామార్కు లిట్లనిరి.
టీక:- కావున = అందుచేత; వీడు = ఇతడు; మహా = గొప్ప; ప్రభావ = మహిమ; సంపన్నుడు = సమృద్ధిగా గలవాడు; వీని = ఇతని; కిన్ = కి; ఎందున్ = ఎక్కడను; భయంబు = భయము; లేదు = లేదు; వీని = ఇతని; తోడి = తోటి; విరోధంబునన్ = శత్రుత్వముతో; తన = తన; కున్ = కు; మృత్యవు = మరణము; సిద్ధించును = కలుగును; అని = అని; నిర్ణయించి = నిశ్చయించుకొని; చిన్నబోయి = చిన్నతనముపడి; ఖిన్నుండు = దుఃఖించువాడు; ఐ = అయ్యి; ప్రసన్నుండు = సంతోషము గలవాడు; కాక = కాకుండగ; క్రిందు = కిందకు, నేలచూపులు; చూచుచున్ = చూచుచు; విషణ్ణుండు = విచారపడువాడు; ఐ = అయ్యి; చింతనంబు జేయుచున్న = ఆలోచించుతున్న; రాజున్ = రాజున; కున్ = కు; మంతనంబునన్ = ఏకాంతముగా, సంప్రదింపులలో; చండామార్కులు = చండామార్కులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి;
భావము:- ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాదు, గొప్ప శక్తిమంతుడు. దేనికి భయపడడు.” అని ఆలోచించుకుని, “కనుక ఈ పిల్లాడితో విరోధం పెట్టుకుంటే తనకు మృత్యువు తప్ప” దని నిశ్చయించుకున్నాడు. అనవసరంగా ఈ పసివాడిని పెట్టిన బాధలు తలచుకుని చిన్నబుచ్చుకుంటూ, నేల చూపులు చూస్తూ బాధపడుతున్నాడు దానవేంద్రుడు. అప్పుడు హిరణ్యకశిపుడితో చండామార్కులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు.

తెభా-7-206-శా.
"శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర! రో
భ్రూయుగ్మ విజృంభణంబున దిగీవ్రాతముం బోరులన్
విభ్రాంతంబుగఁ జేసి యేలితి గదా విశ్వంబు వీఁ డెంత? యీ
భ్రోక్తుల్ గుణదోషహేతువులు చింతం బొంద నీ కేటికిన్?

టీక:- శుభ్ర = పరిశుద్ధమైన; ఖ్యాతివి = కీర్తి కలవాడవు; నీ = నీ యొక్క; ప్రతాపము = పరాక్రమము; మహా = గొప్ప; చోద్యము = చిత్రము; దైత్యేంద్ర = రాక్షసరాజ; రోష = క్రోధముతో కూడిన; భ్రూ = కనుబొమల; యుగ్మ = జంట యొక్క; విజృంభణంబునన్ = విప్పారుటవలన; దిగీశ = దిక్పాలకుల {దిక్పాలురు - 1ఇంద్రుడు 2అగ్ని 3యముడు 4నిరృతి 5వరుణుడు 6వాయువు 7కుబేరుడు 8ఈశానుడు}; వ్రాతము = సమూహమునుకూడ; పోరులన్ = యుద్ధములలో; విభ్రాజితంబుగన్ = కలతపడినదిగ; చేసి = చేసి; ఏలితి = పాలించితివి; కదా = కదా; విశ్వంబున్ = జగత్తును; వీడు = ఇతడు; ఎంత = ఏపాటివాడు; ఈ = ఇట్టి; దభ్ర = అల్పపు; ఉక్తులు = పలుకులు; గుణ = మంచి; దోష = చెడులు కలుగుటకు; హేతువులు = కారణములు; చింతన్ = విచారమున; పొందన్ = పడుట; నీ = నీ; కున్ = కు; ఏటికిన్ = ఎందుకు.
భావము:- “ఓ రాక్షసేంద్రా! నీవు నిర్మలమైన కీర్తిశాలివి. నీ ప్రతాపం అత్యద్భుతమైనది. నీవు యుద్ధంలో ఒక మాటు కనుబొమ్మలు కోపంతో చిట్లిస్తే చాలు దిక్పాలకులు సైతం భయపడిపోతారు. ఇలా ప్రపంచం అంతా ఏకఛత్రాధిపత్యంగా ఏలావు. అంతటి నీకు పసివాడు అనగా ఎంత? ఈ మాత్రానికే ఎందుకు విచారపడతావు? ఇంతకు ఇతడు పలికే తెలిసీ తెలియని మాటలకు నువ్వు దిగులు పడటం దేనికి?”

తెభా-7-207-శా.
క్రుండైన జనుండు వృద్ధ గురు సేవంజేసి మేధానయో
క్రాంతిన్ విలసిల్లు మీఁదట వయఃపాకంబుతో బాలకున్
క్రద్వేషణబుద్ధుఁ జేయుము మదిం జాలింపు మీ రోషమున్
శుక్రాచార్యులు వచ్చునంత కితఁడున్ సుశ్రీయుతుం డయ్యెడున్."

టీక:- వక్రుండు = వంకరబుద్ధి గలవాడు; ఐన = అయిన; జనుండు = వాడు; వృద్ధ = పెద్దలను; గురు = గురువులను; సేవన్ = సేవించుట; చేసి = చేసి; మేధః = బుద్ధి; నయః = నీతి; ఉపక్రాంతిన్ = ప్రారంభ మగుటచేత; విలసిల్లు = ప్రకాశించును; మీదటన్ = ఆ పైన; వయః = వయస్సు; పాకంబు = పరిపక్వమగుట; తోన్ = తో; బాలకున్ = పిల్లవానిని; శక్ర = ఇంద్రుని; ద్వేషణ = ద్వేషించెడి; బుద్ధున్ = బుద్ధి గలవానిని; చేయుము = చేయుము; మదిన్ = మనసున; చాలింపుము = ఆపుము; ఈ = ఈ; రోషమున్ = క్రోధమును; శుక్రాచార్యులు = శుక్రాచార్యులు; వచ్చున్ = వచ్చెడి; అంత = సమయమున; కున్ = కు; ఇతడున్ = ఇతడు కూడ; సు = మంచితనము యనెడి; శ్రీ = సంపద; యుతుండు = కలవాడు; అయ్యెడున్ = కాగలడు.
భావము:- “రాక్షసరాజా! ఎంతటి వంకర బుద్ధితో అల్లరిచిల్లరగా తిరిగేవాడు అయినా, పెద్దలు గురువులు దగ్గర కొన్నాళ్ళు సేవ చేసి జ్ఞానం సంపాదించి బుద్ధిమంతుడు అవుతాడు కదా. ఆ తరువాత మన ప్రహ్లాదుడికి వయసు వస్తుంది. వయసుతో పాటు ఇంద్రుడి మీద విరోధం పెరిగేలా బోధించవచ్చు. ఇప్పుడు కోప్పడ వద్దు. గురుదేవులు శుక్రాచార్యులు వారు వచ్చే లోపల మంచి గుణవంతుడు అవుతాడు. ఆ పైన ఆయన పూర్తిగా దారిలో పెడతారు.”

తెభా-7-208-వ.
అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు "గృహస్థులైన రాజులకు నుపదేశింపఁ దగిన ధర్మార్థకామంబులు ప్రహ్లాదునకు నుపదేశింపుఁ"డని యనుజ్ఞ జేసిన, వారు నతనికిఁ ద్రివర్గంబు నుపదేశించిన నతండు రాగద్వేషంబులచేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబు లైన ధర్మార్థకామంబులుఁ దనకు నగ్రాహ్యంబు లనియును వ్యవహార ప్రసిద్ధికొఱకైన భేదంబు గాని యాత్మభేదంబు లేదనియును ననర్థంబుల యందర్థకల్పన చేయుట దిగ్భ్రమం బనియు నిశ్చయించి, గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు దమ గృహస్థ కర్మానుష్ఠానంబులకుం బోయిన సమయంబున.
టీక:- అని = అని; గురుపుత్రులు = చండామార్కులు {గురుపుత్రులు - శుక్రాచార్యుని కుమారులు, చండామార్కులు}; పలికినన్ = చెప్పగా; రాక్షసేశ్వరుండు = రాక్షసరాజ; గృహస్థులు = వివాహమైనవారు; ఐన = అయినట్టి; రాజుల్ = రాజుల; కున్ = కు; ఉపదేశింపన్ = తెలుపుటకు; తగిన = అర్హమైన; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములను; ప్రహ్లాదున్ = ప్రహ్లాదున; కున్ = కు; ఉపదేశింపుడు = తెలియజెప్పండి; అని = అని; అనుజ్ఞ = ఆనుమతి; చేసినన్ = ఇవ్వగా; వారున్ = వారు కూడ; అతని = అతని; కిన్ = కి; త్రివర్గంబున్ = ధర్మార్థకామములను; ఉపదేశించిన = చెప్పగా; అతండు = అతడు; రాగ = అనురాగము; ద్వేషంబుల = విరోధముల; చేతన్ = వలన; విషయ = ఇంద్రియార్థము లందు; ఆసక్తులు = ఆసక్తి గలవారు; ఐన = అయిన; వారల = వారి; కున్ = కి; గ్రాహ్యంబులు = గ్రహింపదగినవి; ఐన = అయిన; ధర్మార్థకామంబులు = ధర్మార్థకామములు; తన = తన; కున్ = కు; అగ్రాహ్యంబులు = గ్రహింపదగినవి కాదు; అనియున్ = అని; వ్యవహార = వ్యవహారముల; ప్రసిద్ధి = మిక్కిలి సిధ్ధించుట; కొఱకు = కోసము; ఐన = అయిన; భేదంబు = భేదములే; కాని = తప్పించి; ఆత్మన్ = వానిలో; భేదంబు = భేదము; లేదు = లేదు; అనియున్ = అని; అనర్థంబులు = ప్రయోజనములు కానివాని; అందున్ = లో; అర్థ = ప్రయోజనములను; కల్పన = ఊహించుకొనుట; చేయుట = చేయుట; దిగ్భ్రమంబు = భ్రాంతి; అనియున్ = అని; నిశ్చయించి = నిశ్చయించుకొని; గురు = గురువులచే; ఉపదిష్ట = ఉపదేశింపబడిన; శాస్త్రంబులు = చదువులు; మంచివి = మంచివి; అని = అని; తలంపక = భావింపక; గురువులు = గురువులు; తమ = తమ యొక్క; గృహస్థ = ఇంటి యందున్న; కర్మ = కార్యములను; అనుష్ఠానంబుల్ = చేయుట; కున్ = కు; పోయిన = వెళ్ళిన; సమయంబున = సమయము నందు.
భావము:- ఇలా శుక్రుని కొడుకులు బోధించి చెప్పటంతో, ఆ దానవ చక్రవర్తి శాంతించాడు. “వివాహమైన క్షత్రియులు నేర్వదగిన ధర్మ అర్థ కామములను ప్రహ్లాదుడికి నేర్పండి” అని ఆదేశించాడు. గురువులు చండామార్కులు ఆవిధంగానే చెప్పసాగారు. కాని “నానా విధాలైన కోరికలు కలవారికి ఈ ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం కావాలి. కనుక ఈ గురువులు చెప్పే పాఠాలు మంచివి కావు. లోక వ్యవహారం కోసమే ఈ తేడాలు తప్ప, ఆత్మకు మాత్రం ఏ మార్పులు లేవు. ప్రయోజనం లేని వీటి గురించి ఏదో ప్రయోజనం ఉంది అనుకోవడం భ్రాంతి మాత్రమే.” అని ప్రహ్లాదుడు నిశ్చయం చేసుకున్నాడు. గురువులు తమ గృహకృత్యాలు, జపాలు, తపాలు మున్నగు నిత్యకృత్యాలు కోసం వెళ్ళే సమయం గమనించాడు.

తెభా-7-209-క.
లకుఁ దన్ను రమ్మని
పాటించి నిశాటసుతులు భాషించిన దో
షాకులేంద్రకుమారుఁడు
పావమున వారిఁ జీరి ప్రజ్ఞాన్వితుఁడై.

టీక:- ఆటల = క్రీడల; కున్ = కు; తన్ను = తనను; రమ్ము = రావలసినది; అని = అని; పాటించి = పట్టుబట్టి, బతిమాలి; నిశాట = రాక్షస; సుతులు = బాలురు; భాషించినన్ = అడుగగా; దోషాట = (దోషవర్తన గల) రాక్షస; కుల = వంశ; ఇంద్ర = రాజు యొక్క; కుమారుడు = పుత్రుడు; పాటవమున = నేర్పుతో; వారిన్ = వారిని; చీరి = పిలిచి; ప్రజ్ఞ = తెలివి; ఆన్వితుడు = కలవాడు; ఐ = అయ్యి.
భావము:- అతనితో చదువుకుంటున్న రాక్షసుల పిల్లలు తమతో ఆడుకోడానికి రమ్మని పిలిచారు. అప్పుడు దోషాచారులు దానవుల చక్రవర్తి కుమారుడు, మంచి ప్రజ్ఞానిధి అయిన ప్రహ్లాదుడు వారితో చేరి నేర్పుగా ఇలా చెప్పసాగాడు.

తెభా-7-210-క.
"చెప్పఁ డొక చదువు మంచిది
చెప్పెడిఁ దగులములు చెవులు చిందఱ గొనఁగాఁ
జెప్పెడు మన యెడ నొజ్జలు
చెప్పెద నొక చదువు వినుఁడు చిత్తము లలరన్."

టీక:- చెప్పడు = తెలుపడు; ఒక = ఒక; చదువు = శాస్త్రము; మంచిది = మంచిది; చెప్పెడిన్ = చెప్పును; తగులములు = సాంసారిక బంధనములను; చెవులు = చెవులు; చిందఱగొనగాన్ = చెదిరిపోవునట్లు; చెప్పెడు = చెప్పును; మన = మన; ఎడన్ = అందు; ఒజ్జలు = గురువులు; చెప్పెదన్ = తెలిపెదను; ఒక = ఒకటి; చదువు = విద్యని; వినుడు = వినండి; చిత్తముల్ = మనసులు; అలరన్ = సంతోషించునట్లుగ.
భావము:- “ఓ స్నేహితులారా! మన గురువులు మన కెప్పుడు ఒక్క మంచి చదువు కూడ చెప్పటం లేదు కదా! ఎప్పుడు చూసినా చెవులు చిల్లులు పడేలా సంసార భోగ విషయాలైన కర్మబంధాలను గూర్చి చెప్తున్నారు. మీ మనసుకు నచ్చే మంచి చదువు నేను చెప్తాను. వినండి.”

తెభా-7-211-వ.
అని రాజకుమారుండు గావునఁ గరుణించి సంగడికాండ్రతోడ నగియెడి చందంబునఁ గ్రీడలాడుచు సమానవయస్కులైన దైత్యకుమారుల కెల్ల నేకాంతంబున నిట్లనియె.
టీక:- అని = అని; రాజ = రాజు యొక్క; కుమారుండు = పుత్రుడు; కావునన్ = కనుక; కరుణించి = దయచూపి; సంగటికాండ్ర = తోటివారి; తోడన్ = తోటి; నగియెడి = పరిహాసముల; చందంబునన్ = వలె; క్రీడలు = ఆటలు; ఆడుచున్ = ఆడుతూ; సమానవయస్కులు = ఒకే వయసు వారు; ఐన = అయిన; దైత్య = రాక్షస; కుమారుల్ = బాలకుల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; ఏకాంతమున = రహస్యముగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- రాజకుమారుడు కాబట్టి ప్రహ్లాదుడు తన దానవ సహాధ్యాయులతో చనువుగా, ఇలా వారికి నచ్చచెప్పాడు. ఆడుతూ పాడుతూ వారితో కలిసిమెలిసి మెలగుతూ, వారందరికీ రహస్యంగా ఇలా బోధించాడు.

తెభా-7-212-ఉ.
"బాకులార రండు మన ప్రాయపు బాలురు కొంద ఱుర్విపైఁ
గూలుట గంటిరే? గురుఁడు క్రూరుఁ డనర్థచయంబునందు దు
శ్శీత నర్థకల్పనముఁ జేసెడి గ్రాహ్యము గాదు శాస్త్రమున్
మే లెఱిఁగించెదన్ వినిన మీకు నిరంతర భద్ర మయ్యెడిన్.

టీక:- బాలకులారా = పిల్లలూ; రండు = రండి; మన = మన; ప్రాయపు = వయసు కలిగిన, ఈడు; బాలురు = పిల్లలు; కొందఱు = కొంతమంది; ఉర్వి = భూమి; పైన్ = మీద; కూలుటన్ = మరణించుటను; కంటిరే = చూసితిరా; గురుడు = గురువు; క్రూరుడు = క్రూరమైనవాడు; అనర్థ = నివృత్తిశూన్యముల; చయంబున్ = సముదాయము; అందు = లో; దుశ్శీలతన్ = దుర్బుద్ధితో; అర్థ = ప్రయోజనముల; కల్పనమున్ = భ్రాంతిని; చేసెడిన్ = కలిగించుచున్నాడు; గ్రాహ్యములు = గ్రహింపదగినవి; కాదు = కాదు; శాస్త్రమున్ = విద్యను; మేలు = క్షేమమైనదానిని; ఎఱింగించెదన్ = తెలిపెదను; వినిన = విన్నచో; మీ = మీ; కున్ = కు; నిరంతర = ఎడతెగని; భద్రము = శ్రేయము; అయ్యెడిన్ = కలుగును.
భావము:- “ఓ పిల్లలూ! ఇలా రండి. పనికిమాలిన విషయాలన్నీ దుర్భుద్ధితో దయమాలిన మన గురువులు వాటికి ప్రయోజనాలు ఉన్నట్లు కల్పించి శాస్త్రాలు అంటూ గొప్పగా మనకు బోధిస్తున్నారు. అవి మనం నేర్చుకోదగ్గవి కావు. లోకంలో మన కళ్ళ ఎదుట మన ఈడు పిల్లలు కొందరు మరణించటం చూస్తూనే ఉన్నాం కదా. నేను చెప్పే విద్య వినండి మీకు ఎడతెగని క్షేమ స్థైర్యాలు కలుగుతాయి.

తెభా-7-213-వ.
వినుండు సకల జన్మంబు లందును ధర్మార్థాచరణ కారణం బయిన మానుషజన్మంబు దుర్లభం; బందుఁ బురుషత్వంబు దుర్గమం; బదియు శతవర్షపరిమితం బైన జీవితకాలంబున నియతంబై యుండు; నందు సగ మంధకారబంధురం బయి రాత్రి రూపంబున నిద్రాది వ్యవహారంబుల నిరర్థకంబయి చను; చిక్కిన పంచాశద్వత్సరంబు లందును బాల కైశోర కౌమారాది వయోవిశేషంబుల వింశతి హాయనంబులు గడచు; కడమ ముప్పది యబ్దంబులు నింద్రియంబుల చేతఁ బట్టుపడి దురవగాహంబు లయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంబులను పాశంబులం గట్టుపడి విడివడ సమర్థుండు గాక ప్రాణంబులకంటె మధురాయమాన యైన తృష్ణకు లోనై భృత్య తస్కర వణిక్కర్మంబులఁ బ్రాణహాని యైన నంగీకరించి పరార్థంబుల నర్థించుచు, రహస్యసంభోగచాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికా లవిత్రంబు లయిన కళత్రంబులను, మహనీయ మంజుల మధురాలాపంబులు గలిగి వశులయిన శిశువులను, శీలవయోరూపధన్య లగు కన్యలను, వినయ వివేక విద్యాలంకారు లయిన కుమారులను, గామిత ఫలప్రదాతలగు భ్రాతలను, మమత్వ ప్రేమ దైన్య జనకు లయిన జననీజనకులను, సకల సౌజన్య సింధువు లయిన బంధువులను, ధన కనక వస్తు వాహన సుందరంబు లయిన మందిరంబులను, సుకరంబు లైన పశు భృత్య నికరంబులను, వంశపరంపరాయత్తంబు లయిన విత్తంబులను వర్జింపలేక, సంసారంబు నిర్జించు నుపాయంబుఁ గానక, తంతువర్గంబున నిర్గమద్వారశూన్యం బయిన మందిరంబుఁ జేరి చుట్టుపడి వెడలెడి పాటవంబు చాలక తగులుపడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృతకర్మ బద్ధుండై శిశ్నోదరాది సుఖంబుల బ్రమత్తుండయి నిజకుటుంబపోషణ పారవశ్యంబున విరక్తిమార్గంబు దెలియనేరక, స్వకీయ పరకీయ భిన్నభావంబున నంధకారంబునం బ్రవేశించుం; గావునఁ గౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవతధర్మంబు లనుష్ఠింప వలయు; దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకుఱుభంగి సుఖంబులును గాలానుసారంబులై లబ్ధంబు లగుం; గావున వృథాప్రయాసంబున నాయుర్వ్యయంబు జేయం జనదు; హరిభజనంబున మోక్షంబు సిద్ధించు; విష్ణుండు సర్వభూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు; ముముక్షువైన దేహికి దేహావసానపర్యంతంబు నారాయణచరణారవింద సేవనంబు కర్తవ్యంబు.
టీక:- వినుండు = వినండి; సకల = సమస్తమైన; జన్మంబులు = పుట్టువులు; అందును = లోను; ధర్మ = ధర్మము; అర్థ = సంపదల కైనవానిని; ఆచరణ = చేయుటకు; కారణంబు = వీలగునది; మానుష = మానవ; జన్మంబు = పుట్టుక; దుర్లభంబు = పొందరానిది; అందున్ = వానిలో; పురుషత్వంబు = మగవా డౌట; దుర్గమంబు = అందుకొనరానిది; అదియున్ = అది కూడ; శత = వంద (100); వర్ష = సంవత్సరములకు; పరిమితంబు = మించనిది; ఐన = అయిన; జీవిత = జీవించెడి; కాలంబునన్ = సమయములో; నియతంబు = కేటాయింపబడినది; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; అందున్ = దానిలో; సగము = సగము (1/2 వంతు); అంధకార = చీకటిచే; బంధురంబు = నిండినది; అయి = అయ్యి; రాత్రి = రాత్రి; రూపంబునన్ = రూపములో; నిద్ర = నిద్ర; ఆది = మొదలగు; వ్యవహారంబులన్ = పనులలో; నిరర్థకంబు = పనికిమాలినది; అయి = అయ్యి; చనున్ = జరిగిపోవును; చిక్కిన = మిగిలిన; పంచాశత్ = ఏభై (50); వత్సరంబులు = ఏళ్ళ; అందును = లోను; బాల = బాల్యము; కైశోర = కైశోరము; కౌమార = కౌమారము; ఆది = మొదలగు; వయః = వయస్సు యొక్క {అవస్థాష్టకము - 1కౌమారము (5సం.) 2పౌగండము(10సం.) 3కైశోరము(15సం.) 4బాల్యము (16సం), 5కారుణ్యము (25సం.) 6యౌవనము (50) 7వృద్ధము (70) 8వర్షీయస్త్వము (90), పాఠ్యంతరములు కలవు}; విశేషంబుల = భేదములచేత; వింశతి = ఇరవై (20); హాయనంబులు = సంవత్సరములు; గడచున్ = జరిగిపోవును; కడమన్ = చివరగా; ముప్పది = ముప్పై; అబ్దంబులు = సంవత్సరములు; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; చేతన్ = చేత; పట్టుబడు = నష్టపోవును; దురవగాహంబులు = తెలియరానిది; అయిన = ఐన; కామ = కామము; క్రోధ = క్రోధము; లోభ = లోభము; మోహ = మోహము; మద = మదము; మాత్సర్యంబులు = మాత్సర్యములు; అను = అనెడి; పాశంబులన్ = బంధనములచే; కట్టుపడి = కట్టుపడి; విడివడన్ = బయటబడుటకు; సమర్థుండుగాక = చేతనైనవాడు; కాక = కాకుండి; ప్రాణంబుల్ = ప్రాణముల; కంటెన్ = కంటెను; మధురాయమాన = తీయనిదాని వలె నుండునది; ఐన = అయిన; తృష్ణ = అలవికాని ఆశ; కున్ = కు; లోను = వశము; ఐ = అయ్యి; భృత్య = సేవించుట; తస్కర = దొంగతనము చేయుట; వణిక్ = వర్తకపు; కర్మంబులన్ = పనులందు; ప్రాణహానిన్ = చావుని {ప్రాణహాని - ప్రాణములు హాని (నష్టమగుట), చావు}; ఐనన్ = అయినను; అంగీకరించి = ఒప్పుకొని; పర = ఇతరుల; అర్థంబులన్ = సొమ్మును, ధనములను; అర్థించుచు = కోరుతూ; రహస్య = రహస్యముగా చేసెడి; సంభోగ = సురత; చాతుర్య = నేరుపు; సౌందర్య = అందము యొక్క; విశేషంబుల = అతిశయములతో; ధైర్య = ధైర్యము యనెడి; వల్లికా = తీగలకు; లవిత్రంబులు = కొడవళ్ళు; అయిన = ఐన; కళత్రంబులను = భార్యలను; మహనీయ = గొప్పగా; మంజుల = సొగసైన; మధుర = తీయనైన; ఆలాపంబులున్ = పలుకులు; కలిగి = ఉండి; వశులు = స్వాధీనమున నుండువారు; అయిన = ఐన; శిశువులను = పిల్లలను; శీల = మంచి నడవడిక; వయః = ప్రాయము; రూప = అందమైన రూపములచే; ధన్యలు = కృతార్థులు; అగు = అయిన; కన్యలను = కూతుర్లను; వినయ = అణకువ; వివేక = తెలివి; విద్యా = చదువులతో; అలంకారులు = అలంకరింపబడినవారు; అయిన = ఐన; కుమారులనున్ = పుత్రులను; కామిత = కోరబడిన; ఫల = ప్రయోజనములను; ప్రదాతలు = ఒనగూర్చెడివారు; అగు = ఐన; భ్రాతలను = సోదరులను; మమత్వ = మమకారము; ప్రేమ = ప్రీతి; దైన్య = దీనత్వములను; జనకులు = కలిగించువారు; అయిన = ఐన; జననీజనకులను = తల్లిదండ్రులను; సకల = అఖిలమైన; సౌజన్య = మంచితనములకు; సింధువు = సముద్రము వంటివారు; అయిన = ఐన; బంధువులను = చుట్టములను; ధన = సంపదలు; కనక = బంగారము; వస్తు = వస్తువులు; సుందరంబులు = అందమైనవి; అయిన = ఐన; మందిరంబులను = ఇండ్లను; సుకరంబులు = సుఖములను కలిగించెడివి; ఐన = అయిన; పశు = పశువులు; భృత్య = సేవక; నికరంబులను = సమూహములను; వంశపరంపరాయత్త = వంశానుక్రమముగ; ఆయత్తంబులు = సంక్రమించినవి; అయిన = ఐన; విత్తంబులను = ధనములను; వర్జింపలేక = విడువజాలక; సంసారంబు = సంసారమును; నిర్జించు = జయించెడి, దాటు; ఉపాయంబున్ = ఉపాయమును; కానక = కనుగొనలేక; తంతు = దారముల; వర్గంబునన్ = గుంపులో; నిర్గమ = బయటపడెడి; ద్వార = ద్వారము; శూన్యంబు = లేనిది; అయిన = ఐన; మందిరంబున్ = నివాసమును; చేరి = ప్రవేశించి; చుట్టుపడి = చుట్టబెట్టుకొని; వెడలెడి = బయల్పడెడి; పాటవంబు = నేర్పు; చాలక = లేక; తగులుపడు = చిక్కుకొనిన; కీటకంబు = పురుగు; చందంబునన్ = వలె; గృహస్థుండు = గృహస్థుడు; స్వయం = తాను; కృత = చేసిన; కర్మ = కర్మములచే; బద్ధుండు = బంధనముల జిక్కినవాడు; ఐ = అయ్యి; శిశ్న = మైథున; ఉదర = భోజన; సుఖంబులన్ = సుఖము లందు; ప్రమత్తుండు = మిక్కిలి మత్తుగొన్నవాడు; అయి = అయ్యి; నిజ = తన; కుటుంబ = కుటుంబమును; పోషణ = పోషించుటయందు; పారవశ్యంబునన్ = ఒడలు మరచిపోవుటచే; విరక్తి = వైరాగ్య; మార్గంబున్ = మార్గమును; తెలియనేరక = తెలిసికొనలేక; స్వకీయ = తనది; పరకీయ = ఇతరులది యను; భిన్న = భేద; భావంబునన్ = బుద్ధితో; అంధకారంబునన్ = చీకటిలో; ప్రవేశించున్ = చేరును; కావున = కనుక; కౌమార = చిన్నతనపు; సమయంబునన్ = వయసులోనే; మనీషా = బుద్ధిబలమున; గరిష్ఠుండు = శ్రేష్ఠుండు; ఐ = అయ్యి; పరమ = అత్యుత్తమమైన; భాగవత = భాగవత; ధర్మంబులన్ = ధర్మములను; అనుష్ఠింపవలయును = ఆచరించవలెను; దుఃఖంబులు = దుఃఖములు; వాంఛితంబులు = కోరినవి; కాక = కాకుండగనే; చేకుఱ = కలిగెడి; భంగిన్ = విధముగనే; సుఖంబులును = సుఖములు కూడ; కాల = కాలమునకు; అనుసారంబులు = అనుసరించునవి; ఐ = అయ్యి; లబ్ధంబులు = దొరకునవి; అగున్ = అగును; కావున = కనుక; వృథా = వ్యర్థమైన; ప్రయాసంబునన్ = శ్రమతో; ఆయుః = జీవితకాలమును; వ్యయంబున్ = ఖర్చుపెట్టుట; చేయన్ = చేయుట; జనదు = తగదు; హరి = నారాయణుని; భజనంబునన్ = భక్తివలన; మోక్షంబు = ముక్తిపదము; సిద్ధించున్ = లభించును; విష్ణుండు = నారాయణుడు; సర్వ = సమస్తమైన; భూతంబుల్ = జీవుల; కున్ = కు; ఆత్మ = తమలో నుండెడి; ఈశ్వరుండు = భగవంతుండు; ప్రియుండు = ఇష్ఠుడు; ముముక్షువు = మోక్షమును కోరెడివాడు; ఐన = అయిన; దేహికి = శరీరధారికి; దేహ = దేహము; అవసాన = తీరెడికాలము, మరణకాల; పర్యంతంబున్ = వరకు; నారాయణ = విష్ణుమూర్తి; చరణ = పాదము లనెడి; అరవింద = పద్మముల; సేవనంబు = కైంకర్యము, సేవించుట; కర్తవ్యంబు = చేయవలసినది.
భావము:- ఇంకా వినండి. అన్ని జన్మలలోనూ ధర్మాలు ఆచరించగల మానవ జన్మ పొందడం చాలా కష్టం. అందులో పురుషుడుగా పుట్టడం ఇంకా కష్టం. మానవులకు ఆయుర్దాయం వంద సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దానిలో సగం అంటే ఏభై సంవత్సరాలు చీకటి నిండిన రాత్రి కావటం వలన నిద్ర మున్నగు వాటితో గడచిపోతుంది. పసివాడిగా, బాలుడుగా ఇరవై సంవత్సరాలు వ్యయమౌతాయి. మిగిలిన ముప్పై సంవత్సరాలు ఇంద్రియసుఖాలకు మానవుడు వశమై పోయి ఉంటాడు. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం అనే, జీవుల పాలిటి భయంకర శత్రువులు ఆరింటిని అరిషడ్వర్గాలు అంటారు. ఈ అరిషడ్వర్గాల బంధాలలో చిక్కుకొని బయటకు రాలేక మానవుడు గింజుకుంటూ ఉంటాడు; జీవుడు తన ప్రాణం కంటె తియ్యగా అనిపించే ఆశ అనే పాశానికి దాసుడు అవుతాడు; ఈ కోరికల కారణంగా ఇతరుల ధనం ఆశిస్తూ ఉంటాడు; ఆ ధనం కోసం ఉద్యోగం, దొంగతనం, వ్యాపారం మున్నగు వృత్తులలో పడి ప్రాణం పోగొట్టుకోడానికి అయినా సిద్ధపడతాడు; అక్రమ సంబంధం, సౌఖ్యం పొందే చాతుర్యం, విశేషమైన అందాలు కోరుకుంటాడు; కాళ్లకు బంధాలు వేసే కట్టుకున్న భార్యలూ, జిలిబిలి పలుకులతో ఆనందింపజేస్తూ చెప్పిన మాట వినే తన శిశువులూ, మంచి నడతలు యౌవనం అందచందాలు కల కుమార్తెలూ, వినయ వివేకాలు కల విద్యావంతులు అయిన కొడుకులూ, కోరిన సహకారాలు అన్నీ అందించే సోదరులూ, ప్రేమానురాగలతో జాలిగోలిపే తల్లిదండ్రులూ, అన్నివిధాలా మంచిగా మెలిగే బంధువులూ, ఈ విధమైన రకరకాల బంధాలలో చిక్కుకుంటాడు. ఈ బంధాలను; డబ్బు, బంగారం, ఉపకరణాలు, వాహనాలు మొదలైన సౌకర్యాలను; పశువులు, సేవకులు మున్నగు సంపదలను; ఇంకా తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న ఆస్తులను వదలిపెట్టలేక మానవుడు పూర్తిగా సంసారంలో పడిపోతాడు. సాలీడు గూటిలో చిక్కుకున్న చిన్న పురుగు ఎంత తన్నుకున్నా బయట పడలేదు. అలాగే ఈ సంసార పాశాలలో చిక్కుకున్న మానవుడు విడివడలేడు. తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాడు; కామం సౌఖ్యాదుల మత్తులో పడి, తన కుటుంబాన్ని పోషించడంలో నిమగ్నుడై ముక్తి మార్గాన్ని మరచిపోతాడు; తాను వేరు, మిగతా వారు వేరు అనే ద్వైత భావంతో చీకట్లో పడతాడు; అందుకనే, చిన్నప్పుడే కౌమార వయసునుండే బుద్ధిబలంతో పూర్తి భగవద్భక్తి, ధర్మాలను ఆచరించాలి. దుఃఖాలు కోరకుండానే వస్తాయి. అలాగే సుఖాలు కూడ ఆ సమయం వచ్చినప్పుడు అవే వస్తాయి. కనుక, మానవుడు వాటికోసం ఎంతో విలువైన తన జీవితకాలాన్ని వృథా చేసుకోకూడదు. విష్ణు భక్తి వలన మోక్షం లభిస్తుంది. సకల ప్రాణికోటికి శ్రీహరే ఆత్మీయుడు, పరమాత్మ, పరమేశ్వరుడు. ముక్తి కోరుకునే వాడికి జీవితాతం వరకు, ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించడం మాత్రమే చేయదగిన పని.

తెభా-7-214-సీ.
కంటిరే మనవారు నులు గృహస్థులై-
విఫలులై కైకొన్న వెఱ్ఱితనము;
ద్రార్థులై యుండి పాయరు సంసార-
ద్ధతి నూరక ట్టుబడిరి;
లయోనులం దెల్ల ర్భాద్యవస్థలఁ-
బురుషుండు దేహి యై పుట్టుచుండుఁ
న్నెఱుంగఁడు కర్మతంత్రుఁడై కడపట-
ముట్టఁడు భవశతములకు నయిన

తెభా-7-214.1-ఆ.
దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు
గతిఁ బుట్టి పుట్టి చ్చి చచ్చి
పొరల నేల మనకుఁ? బుట్టని చావని
త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి.

టీక:- కంటిరే = చూసారా; మన = మన; వారు = వాళ్ళు; ఘనులు = గొప్పవారు; గృహస్థులు = కాపురస్థులు; ఐ = అయ్యి; విఫలులు = నిరర్థకులు; ఐ = అయ్యి; కైకొన్న = చేపట్టిన; వెఱ్ఱితనము = పూనిన మూఢత్వము; భద్రార్థులు = క్షేమము(ముక్తి) గోరినవారు; ఐ = అయ్యి; ఉండి = ఉన్నప్పటికిని; పాయరు = విడువరు; సంసార = సాంసారిక; పద్ధతిన్ = మార్గమును; ఊరక = అనవసరముగ; పట్టుబడిరి = చిక్కుకొనిరి; కలయోనులు = లోకమున ఉన్న గర్భములు; అందున్ = లోని; ఎల్ల = అన్నిటను; గర్భా = గర్భవాసము {గర్భాది - 1పుట్టుట 2ఉండుట 3పెరుగుట 4మారుట 5క్షీణించుట 6నశించుట}; ఆది = మొదలగు; అవస్థలన్ = అవస్థలను; పురుషుండు = మానవుడు; దేహి = శరీరధారి; ఐ = అయ్యి; పుట్టుచుండున్ = జన్మించుచుండును; తన్ను = తననుతాను, ఆత్మను; ఎఱుంగడు = తెలిసికొనలేడు; కర్మ = కర్మములకు; తంత్రుడు = వశమైనవాడు; ఐ = అయ్యి; కడపటన్ = అంతు; ముట్టడు = చేరలేడు; భవ = జన్మములు; శతముల = వందలకొలది; కున్ = గా; అయిన = జరిగినను.
దీనన్ = దీనివలన; శుభము = శ్రేయస్సు; లేదు = లేదు; దివ్య = దివ్యమైన; కీర్తియున్ = కీర్తికూడ; లేదు = లేదు; జగతిన్ = ప్రంపంచమునందు; పుట్టిపుట్టి = మరలమరల పుట్టి; చచ్చిచచ్చి = మరలమరల మరణించి; పొరలన్ = పొర్లుట; ఏల = ఎందులకు; చావని = నశించని; త్రోవన్ = మార్గమును; వెదకికొనుట = వెతుకుకొనుట; దొడ్డబుద్ధి = ఉత్తమమైన ఆలోచన.
భావము:- మీరు చూస్తూనే ఉన్నారు కదా! మన వారు అందరు బలదర్పసంపన్నులు అయిన గొప్ప వారే. కాని పెళ్ళిళ్ళు చేసుకుని గృహస్థులై వెఱ్ఱితనం విడిచిపెట్టరు. ఆనందం కోరుకుంటారు కాని సంసారం అనే ఊబిలో ఊరకే కూరుకుపోతారు. పునర్జన్మలు అనేకం పొందుతూ రకరకాల స్త్రీల గర్భాలలో పడి నానా అవస్థలు పడుతూ, చస్తుంటారు. వందల కొద్దీ జన్మలెత్తినా ఈ కర్మబంధాలలో నుండి విముక్తి పొందలేడు. ఈ బాధలు అన్నీ మనకెందుకు? అసలు పుట్టుక అనేదీ, చావు అనేదీ లేని మంచి దారి వెతుక్కోవటం తెలివైన పని కదా!

తెభా-7-215-శా.
హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లస
ద్బాలాలోకన శృంఖలానిచయ సంద్ధాత్ముఁడై లేశమున్
వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడుం గామినీ
హేలాకృష్ట కురంగశాబక మగున్ హీనస్థితిన్ వింటిరే.

టీక:- హాలా = కల్లు, సారాయి; పాన = తాగుటచే; విజృంభమాణ = చెలరేగిన; మద = మదము; గర్వ = గర్వము; అతీత = మితిమీరిన; దేహ = శరీర మందు; ఉల్లసత్ = ఎగసిన; బాలా = జవ్వనుల; ఆలోకన = చూపు లనెడి; శృంఖలా = సంకెలల; నిచయ = సమూహములచే; సంబద్ధాత్ముడు = బాగా బంధింపబడినవాడు; ఐ = అయ్యి; లేశమున్ = కొంచెము కూడ; వేలా = గట్టునకు; నిస్సరణంబు = తరించుటను; కానక = కనుగొనలేక; మహా = గొప్ప; విద్వాంసుండున్ = పండితుడు కూడ; కామినీ = స్త్రీ యొక్క; హేలా = విలాసముచే; ఆకృష్ట = ఆకర్షించబడిన; కురంగ = లేడి; శాబకము = పిల్ల; అగున్ = అయిపోవును; హీన = నీచమైన; స్థితిన్ = గతిని; వింటిరే = విన్నారా.
భావము:- ఈ విషయం వినే ఉంటారు. ఎంత గొప్పపండితుడు అయినా మధువు త్రాగి, ఆ మత్తులో ఒళ్ళు మరచి కన్నులు తెరవ లేకుండా అయిపోతాడు; ఆడువారి వాలుచూపులు అనే సంకెళ్ళలో చిక్కి పోతాడు; ఆడుకొనే పెంపుడు లేడిపిల్లల లాగ ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాడు; అతి విలువైన తన జీవితకాలం వృథా అయిపోతున్నది కూడ గమనించలేడు. అలా ఉచ్ఛస్థితి నుండి హీనస్థితి లోకి దిగజారిపోతాడు. వ్యసనముల వలన ఎంత దుర్గతి కలుగుతుందో చూసారు కదా.

తెభా-7-216-ఆ.
విషయసక్తులైన విబుధాహితుల తోడి
నికి వలదు ముక్తిమార్గవాంఛ
నాదిదేవు విష్ణు నాశ్రయింపుఁడు ముక్త
సంగజనులఁ గూడి శైశవమున.

టీక:- విషయ = ఇంద్రియార్థము లందు; సక్తులు = తగులములు గలవారు; ఐన = అయిన; విబుధాహితుల = రాక్షసుల {విబుధాహితులు - విబుధ (దేవతలకు) అహితులు (శత్రువులు), రాక్షసులు}; తోడి = తోటి; మనికి = జీవితము; వలదు = వద్దు; ముక్తి = మోక్షమును చేరెడి; మార్గ = పద్ధతి; వాంఛన్ = కోరికతో; ఆదిదేవున్ = మూలకారణమైన దేవుని; విష్ణున్ = నారాయణుని; ఆశ్రయింపుడు = ఆశ్రయించండి; ముక్త = వదలబడిన; సంగ = తగులములు కలిగిన; జనులన్ = వారని; కూడి = చేరి; శైశవమునన్ = చిన్నతనముననే.
భావము:- కోరికలలో కూరుకు పోయే వారూ జ్ఞానులకు నచ్చని వారూ అయిన ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరే వారు కాదు. వారితో స్నేహం మనకి వద్దు. ఈ చిన్న వయసులోనే మోక్షమార్గం కోరుకోండి. దానికోసం ముక్తి మార్గంలో పయనించే మంచి వారితో స్నేహం చేస్తూ, ఆది దేవుడు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించండి.

తెభా-7-217-వ.
కావున విషయంబులఁ జిక్కుపడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబుగాదు; రమ్యమయ్యును బహుతరప్రయాసగమ్య మని తలంచితిరేనిఁ జెప్పెద; సర్వభూతాత్మకుండై సర్వదిక్కాలసిద్ధుండై బ్రహ్మ కడపలగాఁగల చరాచరస్థూల సూక్ష్మజీవసంఘంబు లందును నభోవాయు కుంభినీ సలిలతేజంబు లనియెడు మహాభూతంబుల యందును భూతవికారంబు లయిన ఘటపటాదుల యందును గుణసామ్యం బయిన ప్రధానమందును గుణవ్యతికరంబైన మహత్తత్త్వాది యందును రజస్సత్త్వతమోగుణంబుల యందును భగవంతుం డవ్యయుం డీశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మ మనియెడు వాచకశబ్దంబులు గల్గి కేవలానుభవానంద స్వరూపకుండు నవికల్పితుండు ననిర్దేశ్యుండు నయిన పరమేశ్వరుండు త్రిగుణాత్మకంబైన తన దివ్యమాయచేత నంతర్హితైశ్వరుండై వ్యాప్యవ్యాపకరూపంబులం జేసి దృశ్యుండును ద్రష్టయు, భోగ్యుండును భోక్తయు నయి నిర్దేశింపందగి వికల్పితుండై యుండు; తత్కారణంబున నాసురభావంబు విడిచి సర్వభూతంబు లందును దయాసుహృద్భావంబులు గర్తవ్యంబులు; దయాసుహృద్భావంబులు గల్గిన నధోక్షజుండు సంతసించు; అనంతుం డాద్యుండు హరి సంతసించిన నలభ్యం బెయ్యదియు లేదు; జనార్దన చరణసరసీరుహయుగళ స్మరణ సుధారస పానపరవశుల మైతిమేని మనకు దైవవశంబున నకాంక్షితంబులై సిద్ధించు ధర్మార్థ కామంబులుఁ గాంక్షితంబై సిద్ధించు మోక్షంబు నేల? త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్క దండనీతి జీవికాదు లన్నియుఁ ద్రైగుణ్య విషయంబులైన వేదంబువలనం బ్రతిపాద్యంబులు; నిస్త్రైగుణ్యలక్షణంబునం బరమపురుషుండైన హరికి నాత్మసమర్పణంబు జేయుట మేలు; పరమాత్మతత్త్వ జ్ఞానోదయంబునం జేసి స్వపరభ్రాంతి జేయక పురుషుండు యోగావధూతత్త్వంబున నాత్మవికల్పభేదంబునం గలలోఁ గన్న విశేషంబులభంగిం దథ్యం బనక మిథ్య యని తలంచు"నని మఱియు ప్రహ్లాదుం డిట్లనియె.
టీక:- కావునన్ = కనుక; విషయంబులన్ = ఇంద్రియార్థము లందు; చిక్కుపడిన = తగులకొన్న; రక్కసుల = రాక్షసుల; కున్ = కు; హరి = నారాయణుని; భజనంబున్ = సేవించుట; శక్యంబు = అలవియైనది; కాదు = కాదు; రమ్యము = చక్కటిది; అయ్యును = అయినప్పటికిని; బహుతర = చాలా ఎక్కువ {బహు - బహుతరము - బహుతమము}; ప్రయాస = కష్టముపడుటచే; గమ్యము = చేరగలది; అని = అని; తలంచితిరి = భావించితిరి; ఏనిన్ = అయినచో; చెప్పెదన్ = తెలిపెదను; సర్వ = సమస్తమైన; భూత = జీవులు; ఆత్మకుండు = తానే; ఐ = అయ్యి; సర్వ = ఎల్ల; దిక్ = ప్రదేశములందు; కాల = కాలములందు; సిద్ధుండు = ఉండువాడు; ఐ = అయ్యి; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; కడపలన్ = వరకు; కల = ఉన్నట్టి; చర = చరములు; అచర = స్థిరములు; స్థూల = పెద్దవి; సూక్ష్మ = చిన్నవి యైన; జీవ = ప్రాణుల; సంఘంబుల్ = సమూహముల; అందును = లోను; నభః = ఆకాశము; వాయుః = గాలి; కుంభినీ = పృథివి; సలిల = నీరు; తేజంబులు = అగ్నులు; అనియెడు = అనెడి; మహాభూతంబులన్ = పంచమహాభూతముల {పంచమహాభూతములు - 1నభస్ (ఆకాశము) 2వాయు (గాలి) 3కుంభిని (భూమి) 4సలిల (నీరు) 5తేజస్ (అగ్ని)}; అందును = లోను; భూత = పంచభూతముల; వికారంబులు = వికారములచే నేర్పడినవి; అయిన = ఐనట్టి; ఘటపటాదులు = కుండ గుడ్డ మొదలైనవాని; అందును = లోను; గుణ = గుణములకు; సామ్యంబు = తుల్యమైనది; అయిన = ఐన; ప్రధానము = ప్రకృతి; అందును = లోను; గుణ = గుణముల; వ్యతికరంబు = మేళనములుగలవి; ఐన = అయిన; మహతత్త్వాది = మహతత్త్వము మున్నగు వాని; అందును = లోను; రజస్ = రజోగుణము; సత్త్వ = సత్త్వగుణము; తమోగుణంబుల = తమోగుణముల; అందును = లోను; భగవంతుండు = నారాయణుడు {భగవంతుడు - 1ఐశ్వర్యము 2వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము అనెడి గుణషట్కములచే పూజ్యుడు, విష్ణువు}; అవ్యయుండు = నారాయణుడు {అవ్యయుడు - నాశములేనివాడు, విష్ణువు}; ఈశ్వరుండు = నారాయణుడు {ఈశ్వరుడు - స్వభావముచేతనే ఐశ్వర్యముగలవాడు, విష్ణువు}; పరమాత్మ = పరమాత్మ; పరబ్రహ్మము = పరబ్రహ్మము; అనియెడు = అని; వాచక = పలకబడెడి; శబ్దంబులు = పేర్లు; కల్గి = ఉండి; కేవల = కేవలమైన; అనుభవ = అనుభవగోచరమైన; ఆనంద = ఆనందమే; స్వరూపకుండున్ = రూపముగాగలవాడు; అవికల్పితుండు = హరి {అవికల్పితుడు - వికల్పము (భ్రాంతి, మారుదల) లేనివాడు, విష్ణువు}; అనిర్దేశ్యుండున్ = హరి {అనిర్దేశ్యుడు - ఇట్టివాడు యని నిశ్చయించ చెప్పనలవిగానివాడు, విష్ణువు}; అయిన = అయిన; పరమేశ్వరుండు = హరి {పరమేశ్వరుడు - పరమ (అత్యధికమైన) ఈశ్వరుడు, విష్ణువు}; త్రిగుణ = త్రిగుణములే {త్రిగుణములు - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; ఆత్మకంబు = స్వరూపము; ఐన = అయిన; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; మాయ = మాయ; చేతన్ = వలన; అంతర్హిత = మరుగుపడిన; ఐశ్వర్యుండు = వైభవముగలవాడు; ఐ = అయ్యి; వ్యాప్య = వ్యాపించదగినది; వ్యాపక = వ్యాపంచెడిది; రూపంబులన్ = స్వరూపముల; చేసి = వలన; దృశ్యుండు = చూడదగినవాడు; ద్రష్ట = చూచువాడు; భోగ్యుండు = అనుభవింప దగినవాడు; భోక్త = అనుభవించువాడు; అయి = అయి; నిర్దేశింపన్ = నిర్ణయించుటకు; తగి = యుక్తమై; వికల్పితుండు = రూపకల్పన చేయబడినవాడు; ఐ = అయ్యి; ఉండు = ఉండును; తత్ = ఆ; కారణంబునన్ = కారణముచేత; అసుర = రాక్షస; భావంబున్ = స్వభావమును; విడిచి = వదలివేసి; సర్వ = ఎల్ల; భూతంబుల = జీవుల; అందును = ఎడల; దయా = కరుణ; సుహృత్ = స్నేహ; భావంబులు = దృష్టి; కర్తవ్యంబులు = చేయదగినవి; దయా = కరుణ; సుహృత్ = స్నేహ; భావంబులు = దృష్టి; కల్గినన్ = కలిగినట్లైన; అధోక్షజుండు = నారాయణుడు {అధోక్షజుడు - వ్యు.అధోక్షజం – ఇంద్రియ జ్ఞానమ్, అధి – అధరమ్, అధి + అక్షజం యస్య – అధోక్షజం. బ.వ్రీ., వేనిని తెలియుటకు ఇంద్రియ జ్ఞనము అసమర్థమైనదో అతడు. (వాచస్పతము), ఇంద్రియజన్య జ్ఞానమును క్రిందుపరచువాడు, సమస్త ఇంద్రియాలకు ఆగోచరుడు, విష్ణువు}; సంతసించున్ = సంతోషించును; అనంతుండు = నారాయణుడు {అనంతుడు - అంతము (తుది) లేనివాడు, విష్ణువు}; ఆద్యుండు = నారాయణుడు {ఆద్యుడు - (సృష్టికి) ఆది (మొదటినుండి) ఉన్నవాడు, విష్ణువు}; హరి = నారాయణుడు {హరి - పాపములను హరించు వాడు, విష్ణువు}; సంతసించినన్ = సంతోషించినచో; అలభ్యంబు = పొందరానిది; ఎయ్యదియున్ = ఏదికూడ; లేదు = లేదు; జనార్దన = నారాయణుని {జనార్దనుడు - వ్యు. జనన మరణాద్యర్థియతీ - నాశయతీతి, జనన మరణములను పోగొట్టు వాడు, (వాచస్పతము), జనులను రక్షించువాడు, విష్ణువు}; చరణ = పాదములనెడి; సరసీరుహ = పద్మముల; యుగళ = జంటను; స్మరణ = ధ్యానము యనెడి; సుధారస = అమృతపు; పాన = తాగుటచే; పరవశులము = మైమరచినవారము; ఐతిమేని = అయినచో; మన = మన; కున్ = కు; దైవ = దైవ; వశంబునన్ = నిర్ణయము ప్రకారము; అకాంక్షితంబులు = కోరబడనివి, అయాచితములు; ఐ = అయ్యి; సిద్ధించున్ = లభించును; ధర్మార్థకామంబులున్ = ధర్మార్థకామములు; కాంక్షితంబు = కోరబడినది; ఐ = అయ్యి; సిద్ధించున్ = లభించును; మోక్షంబున్ = ముక్తిపదము; అనన్ = అనగా; ఏల = ఎందులకు; త్రివర్గంబును = ధర్మార్థకామములు; ఆత్మవిద్యయున్ = బ్రహ్మజ్ఞానము; తర్క = తర్కశాస్త్రము; దండనీతి = శిక్షాస్మృతి; జీవిక = బ్రతుకుతెరువులు; ఆదులు = మొదలైనవి; అన్నియున్ = సర్వమును; త్రైగుణ్య = త్రిగుణముల యొక్క {త్రిగుణములు - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; విషయంబులు = స్వరూపములను చెప్పెడివి; ఐన = అయిన; వేదంబు = వేదముల; వలనన్ = వలన; ప్రతిపాద్యంబులు = చెప్పబడినవి; నిస్త్రైగుణ్య = త్రిగుణాతీతమైన; లక్షణంబునన్ = నైజములచే; పరమపురుషుండు = నారాయణుడు {పరమపురుషుడు - పరమ (అత్యుత్తమమైన) పురుషుడు, విష్ణువు}; ఐన = అయిన; హరి = నారాయణుని; కిన్ = కి; ఆత్మ = తననుతాను; సమర్పణంబు = పూర్తిగా అర్పించుకొనుట; చేయుట = చేయుట; మేలు = ఉత్తమము; పరమాత్మ = పరమాత్మ యొక్క; తత్త్వజ్ఞానము = తత్త్వజ్ఞానము; ఉదయంబునన్ = కలుగుట; చేసి = వలన; స్వ = నేను; పర = ఇతరుడు; భ్రాంతి = అను పొరపాటుభావము; చేయక = పడక; పురుషుండు = మానవుడు; యోగవధూ = యోగముతోకూడిన; అవధూత = అవధూత యొక్క {అవధూత - కదిలింపబడినవాడు, కేవల బ్రహ్మజ్ఞానపరుడై వర్ణాశ్ర మాదులను పరిహరించిన సన్యాసి}; తత్త్వంబునన్ = జ్ఞానముచేత; ఆత్మ = ఆత్మ యందలి; వికల్ప = ఉపాధికముల; భేదంబునన్ = భేదముచేత; కల = స్వప్నము; లోన్ = లోను; కన్న = చూసిన; విశేషంబుల్ = సంగతుల; భంగిన్ = వలె; తథ్యంబు = నిజమైనవి; అనక = అనకుండ; మిథ్య = బూటకము; అని = అని; తలంచున్ = భావించును; అని = అని; మఱియున్ = ఇంకను; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- స్నేహితులారా! అందుకే ఇంద్రియాలకు చెందిన విషయాలు అయిన కోరికలలో కామంలో చిక్కుకున్న రాక్షసులకు విష్ణుభక్తి అలవడదు. ఈ భక్తిమార్గం చాలా బావుంది కాని, చాలా ప్రయాస పడాలి అనుకోకండి. అలా కాదు, చెప్తాను వినండి ప్రాణులు అందరిలోనూ, దిక్కులు అన్నిటిలోనూ భగవంతుడు ఉన్నాడు. పరబ్రహ్మ పరాకాష్ఠగా ఉన్న ఈ లోకంలో చరాచర జీవాలు, కంటికి కనిపించ నంత చిన్న వాటి నుండి పెద్ద జంతువులు వరకు సమస్తం; ఆకాశం, భూమి, నీరు, గాలి, అగ్ని అనే పంచభూతాలు; వీటిలో నుంచి పుట్టిన కుండ, గుడ్డ వంటి సమస్తమైన వస్తువులు అన్నిటిలోనూ ఆ భగవంతుడు ఉన్నాడు. గుణాలతో నిండి ఉన్న మూల ప్రకృతిలోనూ: త్రిగుణాలకు అతీతమైన మహత్తత్వం లోనూ; రజోగుణం, సత్వగుణం, తమోగుణం అనే త్రిగుణాలు లోనూ దేవుడు ఉన్నాడు. ఆయననే భగవంతుడు అనీ, అవ్యయుడు అనీ, ఈశ్వరుడు అనీ, పరమాత్మ అనీ, పరబ్రహ్మ అనీ రకరకాలుగా చెప్తారు. ఆనంద స్వరూపుడు అయిన ఆ ప్రభువు కేవలం అనుభవంచేత మాత్రమే తెలుసుకోగలం. ఆయనకు ఎట్టి మార్పు ఉండదు; ఇలాంటిది అని నిరూపించ గల రూపం ఉండదు; పరమ పురుషుడు సత్త్వ రజస్తమో గుణాలు నిండిన తన దివ్యమైన మాయ చేత అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి, వ్యాపింప జేసేటువంటి రూపాలతో చూడబడేవాడు, చూసేవాడూ, అనుభవించబడు వాడు, అనుభవించే వాడు తానే అయి స్పష్టాస్పష్టమైన రూపంతో ఉంటాడు. అందుకే జీవుడు రాక్షస భావం విడిచిపెట్టి అన్ని ప్రాణుల మీద దయా దాక్షిణ్యాలు కలిగి ఉండాలి. అలా అయితే భగవంతుడు మెచ్చుకుంటాడు. అధోక్షజుడు, శాశ్వతమైన వాడు, పురాణ పురుషుడు శ్రీహరి అయిన ఆ విష్ణుమూర్తి తృప్తి చెందితే లభించనది ఏదీ ఉండదు. జనార్దనుడు అయిన హరి పాదకమల స్మరణ అనే అమృతం త్రాగి పరవశులం అయితే మనకు ఆ జనార్దనుని దయ వలన కోరకుండానే ధర్మం, అర్థం, కామం సమస్తం లభిస్తాయి. కాంక్షిస్తే మోక్షం కూడ లభిస్తుంది అని వేరే చెప్పనక్కరలేదు. ధర్మం, అర్థం, కామం, తర్కం, దండనీతి లాంటి జీవితావసర విషయాలు అన్నీ వేదాలలో చెప్పబడ్డాయి. నిస్వార్థంతో, ఎలాంటి కోరికలు లేకుండా త్రిగుణాతీతుడైన విష్ణువునకు హృదయమును సమర్పించటం మంచిది. పరమాత్మ తత్వం తెలుసుకున్న పురుషుడు తను వేరని, మరొకరు వేరని భ్రాంతి చెందడు. భేద భావం పాటించడు. అటువంటి వ్యక్తి మహా యోగి ఆత్మతత్త్వం గ్రహిస్తాడు. కలలో విషయాలు ఎలా నిజం కావో, అలాగే ఈ లోకం కూడ నిజం కాదని తెలుసుకుంటాడు.” అని చెప్పి ప్రహ్లాదుడు ఇంకా ఇలా అన్నాడు.

తెభా-7-218-మ.
"రుఁడుం దానును మైత్రితో మెలఁగుచున్ నారాయణుం డింతయున్
రుసన్ నారదసంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముం జేసె మున్;
రిభక్తాంఘ్రిపరాగ శుద్ధతను లేకాంతుల్ మహాకించనుల్
తత్త్వజ్ఞులు గాని నేరరు మదిన్ భావింప నీ జ్ఞానమున్.

టీక:- నరుడు = నరుడుయనెడి ఋషి; తానునున్ = తను; మైత్రి = స్నేహము; తోన్ = తోటి; మెలగుచున్ = తిరుగుచు; నారాయణుండు = నారాయణుడనెడి ఋషి; ఇంతయున్ = ఇదంతా; వరుసన్ = క్రమముగా; నారద = నారదుడు యనెడి; సంయమి = మునులలో; ఈశ్వరున్ = గొప్పవాని; కున్ = కి; వ్యాఖ్యానమున్ = వివరించి చెప్పుట; చేసెన్ = చేసెను; మున్ = ఇంతకు పూర్వము; హరి = నారాయణ; భక్త = భక్తులయొక్క; అంఘ్రి = పాదముల; పరాగ = ధూళిచేత; శుద్ధ = పరిశుద్ధమైన; తనులు = దేహములు గలవారు; ఏకాంతుల్ = గహనమైన భక్తి గలవారు; మహాకించనుల్ = సర్వసంగవర్జితులు; పరతత్త్వజ్ఞులు = పరతత్త్వము తెలిసినవారు; కాని = తప్పించి ఇతరులు; నేరరు = సమర్థులు కారు; మదిన్ = మనసున; భావింపన్ = ఊహించుటకైనను; ఈ = ఈ; జ్ఞానమున్ = జ్ఞానమును.
భావము:- “పురాతన కాలంలో నరనారాయణులు అవతరించి మైత్రితో భూలోకంలో మెలగుతూ ఉన్నప్పుడు, నారాయణ మహర్షి ఈ జ్ఞానాన్ని నారద మహర్షికి బోధించాడు. హరి భక్తుల పాదధూళితో పవిత్రులు అయిన మహాత్ములూ, ఏకాగ్రచిత్తులూ, నిరాడంబరులూ, పరతత్వం తెలిసిన వాళ్లూ తప్పించి ఈ విషయాన్ని ఇతరులు ఎవరూ అర్థం చేసుకోలేరు.

తెభా-7-219-వ.
తొల్లి నేను దివ్యదృష్టి గల నారదమహామునివలన సవిశేషం బయిన యీ జ్ఞానంబును బరమభాగవతధర్మంబును వింటి"ననిన వెఱఁగు పడి దైత్యబాలకు ల ద్దనుజ రాజకుమారున కిట్లనిరి.
టీక:- తొల్లి = పూర్వము; నేను = నేను; దివ్యదృష్టి = దివ్యదృష్టి {దివ్యదృష్టి - భూతభవిష్యద్వర్తమానములు చూడగల దృష్టి, అతీంద్రియ విషయములను తెలుసుకొనగల జ్ఞానము}; కల = కలిగిన; నారద = నారదుడు యనెడి; మహా = గొప్ప; ముని = మహర్షి; వలనన్ = వలన; సవిశేషంబు = ఎల్లరహస్యములతోకూడినట్టిది; అయిన = ఐన; ఈ = ఈ; జ్ఞానంబున్ = విద్యను; పరమ = అత్యుత్తమమైన; భాగవత = భాగవత; ధర్మంబును = ధర్మమును; వింటిని = విన్నాను; అనిన = అనగా; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; దైత్య = రాక్షసుల; బాలకుల్ = పిల్లలు; ఆ = ఆ; దనుజరాజకుమారుని = ప్రహ్లాదుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.
భావము:- ఇంతకు పూర్వం నేను దివ్యదృష్టి సంపన్నుడైన నారద మహర్షి వలన ఈ విశిష్టమైన జ్ఞానమునూ, పరమ భాగవతుల ధర్మములనూ తెలుసుకున్నాను.” అని అనగానే, వింటున్న తోటి రాక్షస బాలకులు ఆ దానవ రాకుమారుడు అయిన ప్రహ్లాదుడిని ఇలా అడిగారు.

తెభా-7-220-ఉ.
"మంటిమి కూడి, భార్గవకుమారకు లొద్ద ననేక శాస్త్రముల్
వింటిమి. లేఁడు సద్గురుఁడు వేఱొకఁ డెన్నఁడు, రాజశాల ము
క్కంటికి నైన రాదు చొరఁగా, వెలికిం జన రాదు, నీకు ని
ష్కంకవృత్తి నెవ్వఁడు ప్రల్భుఁడు చెప్పె? గుణాఢ్య! చెప్పుమా.

టీక:- మంటిమి = బ్రతికితిమి; కూడి = కలిసి; భార్గవకుమారకుల = చండామార్కుల {భార్గవకుమారకులు - భార్గవ (శుక్రుని) కుమారకులు (పుత్రులు), చండామార్కులు}; ఒద్దన్ = దగ్గర; అనేక = అనేకమైన; శాస్త్రముల్ = శాస్త్రములను; వింటిమి = తెలుసుకొంటిమి; లేడు = లేడు; సత్ = మంచి; గురుడు = గురువు; వేఱొకడున్ = ఇంకొకడు; ఎన్నడున్ = ఎప్పుడును కూడ; రాజశాల = అంతఃపురము; ముక్కంటి = మూడుకన్నులుగల శివుని; కిన్ = కి; ఐనన్ = అయినను; రాదు = సాధ్యముకాదు; చొరగాన్ = ప్రవేశించుటకు; వెలి = వెలుపలి; కిన్ = కి; చనన్ = వెళ్ళుటకు; రాదు = వీలులేదు; నీ = నీ; కున్ = కును; నిష్కంటక = అడ్డులేని {నిష్కంటకము - కంటకము (ముల్లు)లు లేనిది, అడ్డులేనిదారి}; వృత్తిన్ = విధముగ; ఎవ్వడు = ఎవడు; ప్రగల్భుడు = ప్రతిభగలవాడు, ధీరుడు; చెప్పెన్ = చెప్పెను; గుణాఢ్య = సుగుణములుచే శ్రేష్ఠుడా; చెప్పుమా = చెప్పుము.
భావము:- “ఓ సుగుణశీలా! ప్రహ్లాదా! మనం అందరం ఇక్కడే పుట్టి ఇక్కడే కలిసి పెరిగాం. భర్గుని వంశస్థులు శుక్రాచార్యుని కుమారులు చండామార్కులు వద్ద కలిసి అనేక శాస్త్రాలు చదువుకున్నాం. మరొక గొప్ప గురువు ఎవరిని మనం ఎరగం. పైగా నువ్వు రాకుమారుడువు, చండశాసనుడు అయిన మన మహారాజ అనుమతి లేకుండా రాజాంతఃపురము లోనికి ఫాలాక్షుడు కూడా ప్రవేశించలేడు. బయటకు పోనూ పోలేడు. అలాంటప్పుడు ఏ అడ్డూ ఆపూ లేకుండా, నీకు ఈ విషయాలు అన్నీ ఏ మహానుభావుడు చెప్పాడు. అన్నీ వివరంగా చెప్పు.

తెభా-7-221-క.
సేవింతుము నిన్నెప్పుడు
భావింతుము రాజ వనుచు హుమానములం
గావింతుము తెలియము నీ
కీ వింతమతిప్రకాశ మే క్రియఁ గలిగెన్."

టీక:- సేవింతుము = సేవించెదము; నిన్నున్ = నిన్నే; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; భావింతుము = అనుకొనెదము; రాజవు = (నీవే) రాజువు; అనుచున్ = అనుచు; బహు = అనేకమైన; మానములన్ = గౌరవములను; కావింతుము = చేసెదము; తెలియుము = తెలియచెప్పుము; నీ = నీ; కున్ = కును; ఈ = ఈ; వింత = అద్భుతమైన; మతిన్ = జ్ఞానము; ప్రకాశము = తెలియుట; ఏ = ఏ; క్రియన్ = విధముగ; కలిగెన్ = కలిగెను.
భావము:- ప్రహ్లాదా! మేము ఎప్పుడు నీతోటే ఉంటాము. నువ్వే మా రాజు వని రకరకాలుగా గౌరవిస్తూనే ఉంటాము. కానీ నీ వింతటి మహనీయుడవు అని ఇప్పటిదాకా మాకు తెలియదు. ఈ విచిత్రమైన జ్ఞానం నీకు ఎలా లభించింది. వివరంగా చెప్పు.”

తెభా-7-222-వ.
అని యిట్లు దైత్యనందనులు దన్నడిగినఁ బరమభాగవత కులాలంకారుం డైన ప్రహ్లాదుండు నగి తనకుఁ బూర్వంబునందు వినంబడిన నారదు మాటలు దలంచి యిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; దైత్య = రాక్షస; నందనులు = బాలురు; తన్నున్ = తనను; అడిగిన = అడుగుగా; పరమ = అత్యుత్తమమైన; భాగవత = భాగవతుల; కుల = సమూహమునకు; అలంకారుండు = అలంకారము వంటివాడు; ఐన = అయిన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; నగి = నవ్వి; తన = తన; కున్ = కును; పూర్వమున్ = ఇంతకు పూర్వము; అందు = అందు; వినంబడిన = చెప్పబడిన; నారదు = నారదుని యొక్క; మాటలు = ఉపదేశములను; తలంచి = గుర్తుచేసుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా తన సహాధ్యాయులైన దానవ బాలకులు అడుగగా, పరమ భాగవతుడు, మహా భక్తుడు అయిన ప్రహ్లాదుడు నవ్వి, ఇంతకు పూర్వం నారదుని ద్వారా తాను విన్న తత్వం గుర్తుకు తెచ్చుకుని ఇలా చెప్పాడు.