పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/నృసింహరూ పావిర్భావము

నృసింహరూపావిర్భావము


తెభా-7-285-వ.
ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాణ వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానలజంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయగాంభీర్యధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును, తామస గుణచంక్రమ్యమాణ స్థైర్యుండును నై విస్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరి నిందుఁ జూపు మని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తం బగు హస్తంబున సభామండప స్తంభంబు వ్రేసిన వ్రేటుతోడన దశదిశలను మిడుంగుఱులు చెదరం జిటిలి పెటిలిపడి బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోరరజోఘుష్యమాణ మహా వలాహకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాతసంఘ నిర్ఘోష నికాశంబు లయిన ఛటచ్ఛట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్య మానంబులై యెగసి యాకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు జేసి నిండినం బట్టుచాలక దోధూయమాన హృదయంబు లయి పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగాఁ బ్రపుల్ల పద్మ యుగళ సంకాశ భాస్వర చక్ర, చాప, హల, కులిశ, అంకుశ, జలచర రేఖాంకిత చారు చరణతలుండును, చరణచంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరుస్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబరశోభిత కటిప్రదేశుండును, నిర్జరనిమ్నగావర్తవర్తుల కమలాకరగంభీర నాభివివరుండును, ముష్టిపరిమేయవినుత తనుతరస్నిగ్ద మధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశవిశాల వక్షుండును, దుర్జన దనుజభట ధైర్య లతికా లవిత్రాయమాణ రక్షోరాజ వక్షోభాగ విశంకటక్షేత్ర విలేఖన చంగలాంగలాయమాన ప్రతాప జ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాణ వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతనఖరతర ముఖనఖరుండును, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమర ప్రముఖ నానాయుధమహిత మహోత్తుంగ మహీధరశృంగసన్నిభ వీరసాగరవేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేకశత భుజార్గళుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార, కేయూర, కంకణ, కిరీట, మకరకుండలాది భూషణ భూషితుండును, ద్రివళీయుత శిఖరిశిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, బ్రకంపనకంపిత పారిజాతపాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును, శరత్కాల మేఘజాలమధ్య ధగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకలభువనగ్రసన విజృంభమాణ సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాణ విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాళవిస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండును, నాసికారంధ్ర నిస్సరన్నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోత మండలసదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాణ విలోలకీలాభీల విస్ఫులింగ వితానరోరుధ్యమాన తారకాగ్రహమండలుండును, శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధ బంధురభయంకర వదనుండును, ఘనతర గండశైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వ కర్ణుండును, మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణవేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును, పర్వాఖర్వ శిశిరకిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును, ధవళధరాధరదీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథి యాతుధాన నికురంబ గర్వాంధకారుండును, బ్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును, మహాప్రభావుండును నయిన శ్రీనృసింహదేవుం డావిర్భవించినం, గనుంగొని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; దానవ = రాక్షసులలో; ఇంద్రుండు = ఇంద్రునివంటివాడు; పరిగృహ్యమాణ = చేపట్టినట్టి; వైరుండును = విరోధముగలవాడును; వైర = విరోధము యొక్క; అనుబంధ = సంబంధముచేత; జాజ్వల్యమాన = మండుచున్న; రోషా = కోపము యనెడి; అనలుండును = అగ్నిగలవాడు; రోషా = కోపము యనెడి; అనల = అగ్నిచే; జంఘన్యమాన = నశింపజేయబడుతున్న; విజ్ఞాన = వివేకము; వినయుండును = అణకువగలవాడును; వినయ = అణకువ; గాంభీర్య = గాంభీర్యము; ధైర్య = ధైర్యములచే; జేగీయమాన = పొగడబడుచున్న; హృదయుండును = హృదయముగలవాడు; హృదయ = హృదయము యొక్క; చాంచల్యమాన = రేగుచున్న; తామసుండును = తమోగుణముగలవాడును; తామసగుణ = తమోగుణములచేత; చంక్రమ్యమాణ = క్రమ్ముకొనబడిన; స్థైర్యుండున్ = దిట్టదనముగలవాడు; ఐ = అయ్యి; విస్రంభంబునన్ = నమ్మకముతో; హుంకరించి = హుమ్మనియరచి; బాలుని = ప్రహ్లాదుని; ధిక్కరించి = తిరస్కరించి; హరిన్ = విష్ణుని; ఇందున్ = దీనిలో; చూపుము = చూపించుము; అని = అని; కనత్ = మెరుస్తున్న; కనక = బంగారపు; మణి = మణుల; మయ = ఖచితమైన; కంకణ = కంకణముల; క్రేంకార = క్రేంయనెడి; శబ్ద = శబ్దముతో; పూర్వకంబుగా = నిండినదిగా; దిగ్దంతి = దిగ్గజముల; దంత = దంతములను; భేదన = బద్దలుచేయ; పాటవ = సమర్థతగల; ప్రశస్తంబు = ప్రసిద్ధికెక్కినది; అగు = అయిన; హస్తంబునన్ = చేతితో; సభామండప = కొలువుకూటము యొక్క; స్తంభంబున్ = స్తంభమును; వ్రేసినన్ = కొట్టగా; వ్రేటు = దెబ్బ; తోడనన్ = తోటే; దశదిశలనున్ = పదిదిక్కులందును {దశదిశలు - (4) దిక్కులు (4) విదిక్కులు (2) ఊర్ధ్వధోదిక్కులు}; మిడుంగురులు = నిప్పుకణములు; చెదరన్ = చెదురుచు; చిటిలి = చిట్లిపోయి; పెటిలిపడి = పగిలిపోయి; బంభజ్యమానంబు = బ్రద్ధలుకొట్టబడినది; అగు = అయిన; ఆ = ఆ; మహా = పెద్ద; స్తంభంబు = స్తంభము; వలన = వలన; ప్రళయ = ప్రళయ; వేళా = కాలమున; సంభూత = సంభవించెడి; సప్త = ఏడు (7) విధములైన {సప్తస్కంధములు - 1ఆవహము 2ప్రవహము 3సంవహము 4ఉద్వహము 5నివహము 6పరివహము 7పరావహము యనెడి సప్తవిధవాయువులు}; స్కంధ = వాయువులు; బంధుర = నిబిడ, దట్టమైన; సమీరణ = వాయువులచే; సంఘటిత = కూర్చబడిన; ఘోర = భయంకరమైన; జోఘుష్యమాణ = గర్జిల్లుతున్న; మహా = గొప్ప; వలాహక = మేఘముల; వర్గ = సమూహములనుండి; నిర్గత = వెలువడెడి; నిబిడ = దట్టమైన; నిష్ఠుర = కఠినములై; దుస్సహ = సహింపరాని; నిర్ఘాత = పిడుగుల; సంఘ = సమూహములనుండి; నిర్ఘోష = మోతలతో; నికాశంబులు = సమానమైనవి; అయిన = ఐన; ఛటఛట = ఛటఛటమనియెడి; స్ఫటస్ఫట = ఫటఫటమనియెడి; ధ్వని = శబ్దములు; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; భయంకర = భయంకరమైన; ఆరావ = శబ్దముల; పుంజంబులు = సమూహములు; జంజన్యమానంబులు = ఒకటి వెంట నొకటి పుట్టెడివి; ఐ = అయ్యి; ఎగసి = చెలరేగి; ఆకాశ = ఆకాశముయొక్క; కుహర = గుహ; అంతరాళంబు = లోపలంతయును; నిరవకాశంబు = ఖాళీలే కుండగ; చేసి = చేసి; నిండినన్ = నిండిపోగా; పట్టు = ఊతము; చాలక = సరిపోక; దోధూయమాన = మిక్కిలి చెదరగొట్టబడిన; హృదయంబులు = హదయములు కలవారు; అయి = అయ్యి; పరవశంబులు = స్వాధీనము తప్పినవారు; ఐన = అయిన; పితామహ = బ్రహ్మదేవుడు; మహేంద్ర = ఇంద్రుడు; వరుణ = వరుణుడు; వాయు = వాయువు; శిఖి = అగ్ని; ముఖర = ముఖ్యులతోమొదలైన; చరాచర = జంగమ స్థావరములైన; జంతు = జంతువుల; జాలంబుల్ = సమూహముల; తోడన్ = తోటి; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; కటాహంబు = డిప్ప; పగిలి = పగిలి; పరిస్పోటితంబు = బద్దలు; కాన్ = అగునట్లు; ప్రఫుల్ల = వికసించిన; పద్మ = పద్మముల; యుగళ = జంటకు; సంకాశ = సమానముగా; భాస్వర = ప్రకాశించుచున్నట్టి; చక్ర = చక్రము; చాప = విల్లు; హల = నాగలి; కులిశ = వజ్రము; కులిశ = వజ్రాయుధము; జలచర = చేప వంటి; రేఖ = రేఖల; అంకిత = గుర్తులుకలిగిన; చారు = అందమైన; చరణతలుండును = అరిపాదములుగలవాడు; చరణ = పాదములను; చంక్రమాణ = కదల్చుటమాత్రముననే; ఘన = మిక్కిలి; వినమిత = వంగెడి; విశంభర = విశ్వముయొక్క; భార = బరువు; ధౌరేయ = మోయుచున్న; దిక్కుంభి = దిగ్గజముల; కుంభీనస = ఆదిశేషుడు {కుంభీనసము - విషజ్వాలలుగ్రక్కెడి పాము, ఆదిశేషుడు}; కుంభినీధర = కులపర్వతములు {కుంభినీధరములు - కుంభిని (భూమిని) ధరములు (మోసెడివి), కులపర్వతములు}; కూర్మ = ఆదికూర్మము; కుల = సమూహముచే; శేఖరుండును = విలసిల్లెడివాడును; దుగ్ధజలధిజాతశుండాల = ఐరావతము యొక్క {దుగ్ధజలధిజాతశుండాలము - దుగ్ధజలధిన్ (పాలసముద్రమునందు) జాత (పుట్టిన) శుండాలము (ఏనుగు), ఐరావతము}; శుండాదండ = తొండమువలె; మండిత = మెరయుచున్న; ప్రకాండ = మధ్యభాగముల; ప్రచండ = ఉగ్రములైన; మహా = గొప్ప; ఊరు = తొడలు యనెడి; స్తంభ = స్తంభముల; యుగళుండును = జంటగలవాడును; ఘణఘణాయమాన = ఘణఘణ యనుచున్న; మణి = రత్నపు; కింకిణీ = గజ్జెల; గణ = సమూహములు; ముఖరిత = మొదలగువానితోను; మేఖలా = మొలతాళ్ళ, వడ్డాణముల; వలయ = చుట్టలతో; వలయిత = కట్టబడిన; పీతాంబర = పట్టుబట్టలతో; శోభిత = శోభిల్లుతున్న; కటిప్రదేశుండును = మొలభాగముగలవాడు; నిర్ఝర = ఆకాశగంగనదియందలి; నిమ్నక = లోతైన; ఆవర్త = సుడిగుండమువలె; వర్తుల = గుండ్రటి; కమలాకర = సరోవరమువలె; గంభీర = గంభీరమైనట్టి; నాభివివరుండును = బొడ్డురంధ్రముగలవాడును; ముష్టి = పిడికిట; పరిమేయ = ఇమడ్చదగినదని; వినుత = పొగడదగిన; తనుతర = మిక్కిలి సన్నని {తను - తనుతర - తనుతమ}; స్నిగ్ద = నున్నని; మధ్యుండును = నడుముగలవాడును; కులాచల = కులగిరుల; సానుభాగ = చరియలప్రదశములతో; సదృశ = సమానమైన; కర్కశ = కఠినమైన; విశాల = వెడల్పుగల; వక్షుండును = వక్షస్థలముగలవాడు; దుర్జన = చెడ్డవారైన; దనుజ = రాక్షస; భట = భటులయొక్క; ధైర్య = ధైర్యములు పాలిటి; లవిత్రాయమాణ = కొడవళ్ళవంటివి; రక్షోరాజ = హిరణ్యకశిపుని; వక్షోభాగ = వక్షస్థలము యనెడి; విశంకట = విస్తారమైన; క్షేత్ర = భూమిని; విలేఖన = పగులదున్నుటయందు; చాంగ = మిక్కిలినేర్పుగల; లాంగలాయమాన = నాగళ్ళవంటివి; ప్రతాప = శౌర్యము యనెడి; జ్వల = అగ్ని; జ్వాలాయమాన = మంటలవలెనున్నవి; శరణు = శరణముకోరి; ఆగత = వచ్చిన; నయన = చూపులనెడి; చకోర = చకోరపక్షులకు; చంద్ర = చంద్రుని; రేఖాయమాణ = వెన్నెలవంటివి; వజ్రాయుధ = వజ్రాయుధమునకు; ప్రతిమాన = ఎదరించగల; భాసమాన = ప్రకాశవంతమైన; నిశాతన = మిక్కిలిపదునైన; ఖరతర = మిక్కిలగట్టివియైన {ఖరము - ఖరతరము - ఖరతమము}; ముఖ = కొనలుగల; నఖరుండును = గోళ్ళుగలవాడును; శంఖ = శంఖము; చక్ర = చక్రము; గదా = గద; ఖడ్గ = కత్తి; కుంత = కుంతము, ఈటె; తోమర = తోమరము, చర్నాకోల; ప్రముఖ = మొదలైన; నానా = పలువిధములై; ఆయుధ = ఆయుధములచేత; మహిత = ఒప్పుచున్న; మహా = గొప్ప; ఉత్తుంగ = ఎత్తైన; మహీధర = కొండ; శృంగ = శిఖరముల; సన్నిభ = సరిపోలెడివి; వీర = వీరరసపు; సాగర = సముద్రము; వేలాయమాన = చెలియలికట్టలవంటివైన; మాలికా = పూదండలతో; విరాజమాన = విలసిల్లుతున్నవి; నిరర్గళ = అడ్డులేని; అనేకశత = వందలకొలది; భుజార్గళుండును = బాహుదండములుగలవాడును; మంజు = సొగసైన; మంజీర = అందెలు; మణి = మణుల; పుంజ = సమూహముచే; రంజిత = అలంకరింపబడిన; మంజుల = చక్కనైన; హార = హారములు; కేయూర = భుజకీర్తులు; కంకణ = కంకణములు; కిరీట = కిరీటములు; మకరకుండలు = చెవికుండలములు {మకరకుండలములు - మొసలినోరు వలె జేయబడిన చెవియాభరణములు}; ఆది = మొదలగు; భూషణ = ఆభరణములచే; భూషితుండును = అలంకరింపబడినవాడు; త్రివళీ = మూడురేఖలతో; యుత = కూడి; శిఖరి = కొండ; శిఖర = శిఖరముల; అభ = వంటి; పరిణద్ధ = కట్టుబడితో; బంధుర = చక్కటి; కంధరుండును = మెడకలవాడు; ప్రకంపన = హోరు గాలికి; కంపిత = కదలెడి; పారిజాత = పారిజాత; పాదప = వృక్షముయొక్క; పల్లవ = చిగురుటాకుల; ప్రతీకాశ = పోలిన; కోప = క్రోధము యొక్క; ఆవేశ = ఆవేశమువలన; సంచలిత = వణకుచున్న; అధరుండును = క్రిందిపెదవిగలవాడును; శరత్కాల = శరదృతువునందలి; మేఘ = మబ్బుల; జాల = గుంపు; మధ్య = నడుమ; ధగధగాయమాన = ధగధగలాడుతున్న; తటిల్లతా = మెరపులతో; సమాన = సమానముగా; దేదీప్యమాన = ప్రకాశించుతున్న; దంష్ట్రా = దంతముల; అంకురుండును = మొలకలుగలవాడును; కల్పాంతకాల = ప్రళయసమయపు; సకల = సమస్తమైన; భువన = లోకములను; గ్రసన = మింగెడు; విజృంభమాణ = వేడుకతోరేగుతున్న; సప్తజిహ్వ = ఏడు (7)నాలుకల కాలాగ్ని {అగ్నియొక్క సప్తజిహ్వలు - 1కాళి 2కరాళి 3విస్ఫులింగిని 4ధూమ్రవర్ణ 5విశ్వరుచి 6లోహిత 7మనోజవ}; జిహ్వా = నాలుకలతో; తులిత = తులతూగెడి; తరళతరాయమాణ = మిక్కిలితెల్లనైన {తరళము - తరళతరము - తరళతమము}; విభ్రాజమాన = మెరయుచున్న; జిహ్వుండును = నాలుకగలవాడు; మేరుమందర = మేరుపర్వతముయొక్క; మహా = గొప్ప; గుహా = గుహల; అంతరాళ = లోనుండెడి; విస్తార = విశాలమైన; విపుల = పెద్ద; వక్త్ర = నోరు; నాసికా = ముక్కు; రంధ్రుండును = రంధ్రములుగలవాడు; నాసికా = ముక్కు; రంధ్ర = రంధ్రములనుండి; నిస్సరన్ = వెడలుచున్న; నిబిడ = దట్టమైన; నిశ్వాస = ప్రాణవాయువుల; నికర = సమూహముల; సంఘట్టన = తాకుడుచే; సంక్షోభిత = కలచబడి; సంతప్యమాన = కాచబడుతున్న; సప్తసాగరుండును = సప్తసాగరములుగలవాడు; పూర్వ = తూరపు; పర్వత = కొండమీద; విద్యోతమాన = వెలుగుచున్న; ఖద్యోత = సూర్య; మండల = మండల; సదృక్ష = సమానమైన; సమంచిత = అందమైన; లోచనుండును = కన్నులుగలవాడును; లోచనా = కన్నుల; అంచల = కొనలనుండి; సముత్కీర్యమాణ = మిక్కిలిరాల్చబడుతున్న; విలోల = చలించుచున్న; కీలా = మంటలచే; ఆభీల = భయంకరమైన; విస్ఫులింగ = అగ్నికణముల; వితాన = సమూహములచేత; రుధ్యమాన = అడ్డుపెట్టబడిన; తారకా = నక్షత్రములు; గ్రహమండలుండును = గ్రహమండలములుగలవాడును; శక్రచాప = ఇంద్రధనుస్సు వలె; రుచిర = ప్రకాశించుచున్న; అదభ్ర = విస్తారమైన; మహా = పెద్ద; భ్రూ = భ్రుకుటి యనెడి; లతా = తీగలు; బంధబంధుర = ముడిపడిన; భయంకర = భయంకరమైన; వదనుండును = మోముగలవాడును; ఘనతర = మిక్కిలిపెద్ద; గండశైల = కొండరాళ్ళ; తుల్య = సమానమైన; కమనీయ = అందమైన; గండభాగుండును = చెక్కిళ్ళుగలవాడును; సంధ్యా = సంధ్యకాలమందలి; రాగ = రంగుగల; రక్త = రక్తపు; ధారా = ధారలను; ధర = కలిగిన; మాలికా = మాలల; ప్రతిమ = సాటియైన; మహా = గొప్ప; అభ్రంకష = మేఘములనొరుయుచున్న; తంతన్యమాన = వెల్లివిరుస్తున్న; పటుతర = స్ఫుటమైన; సటా = జటల, జూలు; జాలుండును = సమూహములుగలవాడు; సటాజాల = జూలు; సంచాల = జాడించుటచే; సంజాత = పుట్టిన; వాత = గాడ్పులచే; డోలాయమాన = ఊగిపోతున్న; వైమానిక = విమానములలోతిరిగెడివారి; విమానుండును = విమానములుగలవాడు; నిష్కంపిత = చలించని; శంఖ = శంఖముల; వర్ణ = వంటి; మహా = పెద్ద; ఊర్ధ్వ = పొడుగుగానున్న; కర్ణుండును = చెవులుగలవాడును; మంథదండాయమాన = కవ్వపుకఱ్ఱగానైన; మందర = మందర యనెడి; వసుంధరాధర = పర్వతము {వసుంధరాదరము - వసుంధర (భూ మిని) ధర (ధరించెడిది),పర్వతము}; పరిభ్రమణ = తిరిగెడి; వేగ = వేగమువలన, వడివలన; సముత్పద్యమాన = ఎక్కువగాపుట్టుచున్న; వియన్మండల = ఆకాశమున; మండిత = అలంకరింపబడిన; సుధారాశి = పాలసముద్రపు; కల్లోల = తరంగములయొక్క; శీకార = తుంపురుల; ఆకార = వలె; భాసుర = ప్రకాశించుచున్న; కేసరుండును = వెంట్రుకలుగలవాడు; పర్వా = పున్నమినాటి; అఖర్వ = విస్తారమైన; శిశిరకిరణ = చంద్రుని {శిశిరకిరణుడు - శిశిర(చల్లని) కిరణుడు (కిరణములుగలవాడు), చంద్రుడు}; మయూఖ = కిరణములవలె; గౌర = తెల్లని; తనూరుహుండును = జూలుగలవాడును; నిజ = తన; గర్జా = గర్జన; నినద = ధ్వనులచే; నిర్దళిత = చీల్చివేయబడిన; కుముద = కుముద; సుప్రతీక = సుప్రతీక; వామన = వామన; ఐరావణ = ఐరావణ; సార్వభౌమ = సార్వభౌమ; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; దిగిభ = దిగ్గజ {దిగ్గజములు - 1ఐరావతము 2పుండరీకము 3వామనము 4కుముదము 5అంజనము 6పుష్పదంతము 7సార్వభౌమము 8సుప్రతీకము}; రాజ = శ్రేష్ఠముల; కర్ణ = చెవి; కోటరుండును = రంధ్రములుగలవాడు; ధవళధరాధర = కైలాసపర్వతమంత {ధవళధరాధరము - ధవళ (తెల్లని) ధరాధరము (పర్వతము), కైలాసపర్వతము}; దీర్ఘ = పొడవైన; దురవలోకనీయ = చూడనలవిగాని; దేహుండును = దేహముగలవాడు; దేహ = శరీరముయొక్క; ప్రభా = కాంతులచేత; నిర్మధ్యమాన = కలచబడిన; పరిపంథి = శత్రువులైన; యాతుధాన = రాక్షసుల; నికురంబ = సమూహముల; గర్వ = గర్వమనెడి; అంధకారుండును = చీకటిగలవాడు; ప్రహ్లాద = ప్రహ్లాదుని; హిరణ్యకశిపు = హిరణ్యకశిపుని; రంజన = సంతోషింపజేయుట; భంజన = సంహరించుట; నిమిత్త = కొరకైన; అంతరంగ = లోపల; బహిరంగ = వెలుపల; జేగీయమాన = మిక్కిలి స్తుతింపబడు; కరుణా = కరుణారసము; వీరరస = వీరరసములతో; సంయుతుండును = కూడినవాడును; మహా = గొప్ప; ప్రభావుండును = మహిమాన్వితుండు; అయిన = ఐన; శ్రీ = శుభకరుడైన; నృసింహ = నరసింహ; దేవుండు = దేవుడు; ఆవిర్భవించినన్ = అవతరించగా, పుట్టగా; కనుంగొని = చూసి;
భావము:- హిరణ్యకశిపుడు అలా శ్రీమహావిష్ణువుతో శత్రుత్వం వహించాడు. శత్రుత్వం వలన అతని మనస్సులో రోషం అగ్నిలా భగభగమండింది. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానము, అణుకువలను కాల్చివేశాయి. ధైర్యగాంభీర్యాల వలన అతని హృదయం ధగ ధగ మెరిసింది. హృదయ చాంచల్యం వలన తామస గుణం విజృంభించింది. ఆ తామస గుణం వల్ల అతని స్థైర్యం చిందులు త్రొక్కసాగింది. అంతట పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిపై హుంకరించాడు. ఆ విష్ణు విరోధి “దీనిలో హరిని చూపించరా” అనంటూ సభామండప స్తంభాన్ని అరచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణ ధ్వనించాయి. ఆ రాక్షసరాజు దిగ్గజాల దంతాలను విరిచేయ గలిగిన తన బలిష్ఠమైన చేతితో కొట్టిన ఆ దెబ్బకి చిటిలి పిటిలి ఆ మహాస్తంభం ఫెళఫెళమని భయంకర ధ్వనులు చేసింది. పది దిక్కులా విస్ఫులింగాలు విరజిమ్మాయి. కల్పాంత కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త విధ మహావాయువుల ఒత్తిడివలన ఉరుములతో ఉరకలువేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల వంటి భీకర ధ్వని వెలువడింది. ఆ ఛటపటారావాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశం అంతా నిండి కర్ణకఠోరంగా వినిపించసాగాయి. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, వరుణదేవుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు మొదలైన దేవతలందరితో, సమస్త జీవజాలంతో సహా బ్రహ్మాండభాండం గుండెలవిసేలా ఒక్కసారి ఫెఠేలున పగులినట్లు అయింది. స్తంభం ఛిన్నాభిన్నమైంది. దానిలో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహదేవుని పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలు కలిగి, వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి దివ్య పాదాలతో అడుగులు వేస్తుంటే, ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలూ, కులపర్వతాలూ, కూర్మరాజూ అణిగి మణిగిపోతున్నారు. ఆ ఉగ్రనరసింహుని ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండాల లాగా బలిష్ఠంగా బలవత్తరంగా ఉన్నాయి. పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టి ఉన్న మణులు పొదిగిన మువ్వల ఒడ్డాణం గణ గణ మని మ్రోగుతోంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న మడుగులాగా గంభీరంగా ఉంది. ఆ నరసింహుడి నడుము పిడికిలిలో ఇమిడేటంత సన్నంగా ఉండి నిగనిగ మెరుస్తోంది. వక్షస్థ్సలం పెద్ద కొండ చరియ లాగా అతి కఠినంగా, విశాలంగా ఉండి ప్రకాశిస్తోంది. ఆ భీకరాకారుని గోళ్ళు వంకరలు తిరిగి వాడి తేలి, రాక్షససేనల ధైర్యలతలను తెగగోసే కొడవళ్ళలాగా ఉన్నాయి. రాక్షసరాజుల బండబారిన గుండె లనే పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అవి గోళ్ళు కావు వజ్రాయుధాలు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. మహోన్నతమైన పర్వత శిఖరాలవంటి ఆ నరసింహ స్వామి మూర్తి బాహువులు శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలు కలిగి ఉన్నాయి. వందలాదిగా ఉన్న ఆ బాహువులు వీరరసం అనే సముద్రానికి చెలియికట్టలలాగా ఉన్నాయి. అనేక పుష్ప మాలికలతో విరాజిల్లుతున్నాయి. కాంతులీనే కడియాలు, మణులు పొదిగిన మనోహరమై విరాజిల్లే హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు వంటి అనేక ఆభరణాలతో స్వామి ధగధగ మెరిసిపోతున్నాడు. ఆ విభుని కంఠం మూడు రేఖలతో పర్వత శిఖరంలా దృఢంగా ప్రకాశిస్తోంది. ఆ దేవదేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై, కోపావేశాలతో అదురుతోంది. శరత్ కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ ఉగ్ర మూర్తి కోరలు తళతళలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలనూ కబళించటానికి పరాక్రమించే అగ్ని జ్వాలలలాగా నాలుక బహు భీకరంగా ఉంది. ఆ వీరనరసింహ స్వామి నోరు, నాసికా రంధ్రాలు మేరు మంథర పర్వతాల గుహలలా బహు విస్తారంగా ఉన్నాయి. ఆ నాసికా రంధ్రాల నుండి వచ్చే వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసల కాగుతున్నాయి. ఆ భీకర మూర్తి కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశించే సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల వలన సర్వ గ్రహమండలాలూ, నక్షత్ర మండలాలూ కకావికలై క్రిందుమీదులు అవుతున్నాయి. ఇంద్రధనుస్సులా వంగి ఉన్న ఆ నరసింహావతారుని కనుబొమలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండశిలలలాగ మిక్కిలి కఠినంగా ఉన్నా, అంత కమనీయంగానూ ఉన్నాయి. దీర్ఘమైన జటలు సంధ్యా సమయంలో ఎఱ్ఱబడిన మేఘమాలికలను పోలిక మెరుస్తున్నాయి. ఆ జటలను అటునిటు విదల్చటం వలన పుట్టిన వాయువుల వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలాగ ఊగుతున్నాయి. ఆ ప్రభువు చెవులు నిశ్చలములై శంఖాల వలె స్వచ్ఛంగా ఉన్నాయి. మందర పర్వతాన్ని కవ్వంలా చేసి చిలికేటప్పుడు గిరిగిర తిరిగే ఆ గిరి వేగానికి పాలసముద్రంలో పుట్టి ఆకాశం అంతా ఆవరించిన తుంపర్లు వలె ఆ భీకరావతారుని కేసరాలు భాసిల్లుతున్నాయి.శరీరం మీది రోమాలు నిండు పున్నమి రాత్రి ప్రకాశంచే వెన్నెల వలె వెలిగిపోతోంది. ఆ నరసింహుని సింహగర్జనకు అష్టదిగ్గజాలైన కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావతము, సార్వభౌమాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ నరసింహ మూర్తి తెల్లని దేహం వెండికొండలా ప్రకాశిస్తూ, చూడటానికి శక్యంకాని విశేష కాంతితో వెలుగిపోతోంది. ఆ శరీరకాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చి వేస్తున్నాయి. ఆ నరకేసరి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగానూ, హిరణ్యకశిపునికి సంతాప కారణంగానూ ఉంది. ఆ నరసింహ రూపుని అంతరంగం కరుణారసంతోనూ, బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్యప్రభావ సంపన్నుడైన శ్రీనరసింహావతారుడు ఈ విధంగా సభా స్తంభం మధ్య నుండి ఆవిర్భవించాడు. పరమాద్భుతమైన శ్రీనరసింహ ఆవిర్భావ దృశ్యం చూసిన హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు.

తెభా-7-286-క.
"నమూర్తిగాదు కేవల
రిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
రియాకారము నున్నది
రిమాయారచిత మగు యథార్థము చూడన్.

టీక:- నర = మానవ; మూర్తి = స్వరూపము; కాదు = కాదు; కేవల = వట్టి; హరి = సింహపు; మూర్తియున్ = స్వరూపము; కాదు = కాదు; మానవ = మనిషి; ఆకారము = స్వరూపము; కేసరి = సింహపు; ఆకారము = స్వరూపము; ఉన్నది = కలిగినది; హరి = విష్ణుని; మాయా = మాయచేత; రచితము = నిర్మింపబడినది; అగు = ఐన; యథార్థము = సత్యమైనది; చూడన్ = తరచిచూసినచో.
భావము:- నర = మానవ; మూర్తి = స్వరూపము; కాదు = కాదు; కేవల = వట్టి; హరి = సింహపు; మూర్తియున్ = స్వరూపము; కాదు = కాదు; మానవ = మనిషి; ఆకారము = స్వరూపము; కేసరి = సింహపు; ఆకారము = స్వరూపము; ఉన్నది = కలిగినది; హరి = విష్ణుని; మాయా = మాయచేత; రచితము = నిర్మింపబడినది; అగు = ఐన; యథార్థము = సత్యమైనది; చూడన్ = తరచిచూసినచో.

తెభా-7-287-ఉ.
తెంపున బాలుఁ డాడిన, సుధీరత సర్వగతత్వముం బ్రతి
ష్ఠింపఁ దలంచి యిందు నరసింహశరీరముఁ దాల్చి చక్రి శి
క్షింపఁగ వచ్చినాఁడు; హరిచే మృతి యంచుఁ దలంతు నైన నా
సొంపును బెంపు నందఱును జూడఁ జరింతు హరింతు శత్రువున్."

టీక:- తెంపున = సాహసముతో; బాలుడు = చిన్నపిల్లవాడు; ఆడిన = పలికిన; సుధీరతన్ = గట్టినమ్మకముతో; సర్వగత = సమస్తమైనభూతాంతర్యామి; తత్వమున్ = అగుటను; ప్రతిష్టింపన్ = స్థాపింపవలెనని; తలంచి = భావించి; ఇందు = దీనిలో; నరసింహ = నరసింహుని; శరీరము = దేహమును; తాల్చి = ధరించి; చక్రి = విష్ణువు {చక్రి - చక్రాయుధముగలవాడు,విష్ణువు}; శిక్షింపగన్ = దండించుటకు; వచ్చినాడు = వచ్చెను; హరి = విష్ణువు; చేన్ = వలన; మృతి = చావు; అంచున్ = అని; తలంతున్ = భావించెదను; ఐనన్ = అయినప్పటికిని; నా = నా యొక్క; సొంపును = అతిశయమును; పెంపును = బలమును; అందఱున్ = అందరును; చూడన్ = చూచునట్లు; చరింతున్ = నడచెదను; హరింతున్ = సంహరించెదను; శత్రువునున్ = శత్రువును.
భావము:- చిన్న పిల్లాడు సాహసంగా పలికిన మాటను నిలబెట్టడానికి, తాను సర్వాత్ముకుడ నని నిరూపించడానికి, విష్ణువు ఇలా నరసింహరూపం ధరించి నన్ను శిక్షించటానికే వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో మరణం తప్పదు. అయినా ఇందరి ముందు నా బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను. శత్రుసంహారం చేస్తాను. విజయం సాధిస్తాను.”

తెభా-7-288-వ.
అని మెత్తంబడని చిత్తంబున గద యెత్తికొని తత్తఱంబున నార్చుచు నకుంఠిత కంఠీరవంబు డగ్గఱు గంధసింధురంబు చందంబున నక్తంచరకుంజరుండు నరసింహదేవున కెదురునడచి తదీయదివ్యతేజోజాలసన్నికర్షంబునం జేసి దవానలంబు డగ్గఱిన ఖద్యోతంబునుం బోలెఁ గర్తవ్యాకర్తవ్యంబులు దెలియక నిర్గతప్రభుండయి యుండె; నప్పుడు.
టీక:- అని = అని; మెత్తంబడని = సడలని; చిత్తంబునన్ = మనసుతో; గద = గదను; ఎత్తికొని = ఎత్తపట్టుకొని; తత్తఱంబునన్ = వేగిరపాటుతో; ఆర్చుచున్ = అరుచుచు; అకుంఠిత = మొక్కవోనిపరాక్రమముగల; కంఠీరవంబున్ = సింహమును; డగ్గఱు = చేరెడి; గంధసింధూరను = మదించినఏనుగు; చందంబునన్ = వలె; నక్తంచర = రాక్షస; కుంజరుండు = శ్రేష్ఠుడు; నరసింహదేవున్ = నరసింహదేవుని; కున్ = కి; ఎదురు = ఎదురు; నడచి = వెళ్ళి; తదీయ = ఆమూర్తి యొక్క; దివ్య = దివ్యమైన; తేజః = తేజస్సు; జాల = పుంజము; సత్ = అధికముగ; నికర్షంబునన్ = తగులుట; చేసి = వలన; దవానలంబు = కార్చిచ్చు; డగ్గఱిన = దగ్గరకుచేరిన; ఖద్యోతంబునున్ = మిణుగురుపురుగు; పోలెన్ = వలె; కర్తవ్య = చేయదగ్గవి; అకర్తవ్య = చేయదగనివి; తెలియక = వివేకముపోయి; నిర్గత = పోయిన, వెలవెలబోయిన; ప్రభుండు = ప్రభావముగలవాడు; అయి = అయ్యి; ఉండెన్ = ఉండెను; అప్పుడు = అప్పుడు.
భావము:- అని భావించిన హిరణ్యకశిపుడు వెనుకంజ వేయకుండా దృఢ స్థైర్యంతో గద ఎత్తి పట్టుకొని, తొట్రుపాటుతో అరుస్తూ ముందుకు నడుస్తున్నాడు. మృగరాజుకు ఎదురువెళ్ళే మదగజం లాగ ఆ రాక్షసేశ్వరుడు నరసింహమూర్తికి ఎదురు నడిచాడు. ఆ దేవాధిదేవుని దివ్యకాంతి సమూహాల ముందు హిరణ్యకశిపుడు దావానలం ముందు మిణుగురు పురుగులాగ ముందుకు పోతున్నాడు. కర్తాకర్తవ్యాలను మరచిపోయాడు. తన తేజస్సును కోల్పోయాడు.

తెభా-7-289-మ.
ప్రటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండభాండావరో
మై యున్న తమిస్రమున్ జగము నుత్పాదించుచోఁ ద్రావి సా
త్త్వి తేజోనిధి యైన విష్ణు నెడ నుద్దీపించునే? నష్టమై
విలంబై చెడుఁగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా!

టీక:- ప్రకటంబు = బయల్పడినది; ఐ = అయ్యి; ప్రళయావసానమునన్ = ప్రళయాంతమునందు; మున్ = పూర్వము; బ్రహ్మాండ = బ్రహ్మాండముల; భాండ = భండాగారమునకు; అవరోధకము = క్రమ్ముకొన్నది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; తమిశ్రమున్ = చీకటిని; జగమున్ = భువనము; ఉత్పాదించు = సృష్టించు; చోన్ = సమయమున; త్రావి = తాగి; సాత్త్విక = సత్త్వగుణసంబంధమైన; తేజః = తేజస్సునకు; నిధి = నిధివంటివాడు; ఐన = అయిన; విష్ణున్ = హరి; ఎడన్ = అందు; ఉద్దీపించునే = ప్రకాశించునా ఏమి; నష్టము = నశించినది; ఐ = అయిపోయి; వికలంబు = చెదిరిపోయినది; ఐ = అయ్యి; చెడుగాక = చెడిపోవును; తామసుల = తామసగుణముగలవారి; ప్రావీణ్యంబు = నేర్పులు; రాజ = రాజుయైన; ఉత్తమా = ఉత్తముడా.
భావము:- ఓ ధర్మరాజా! పూర్వం ప్రళయకాలం అగుచున్నప్పుడు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని క్రమ్మిన గాఢమైన చీకట్లను, పునఃసృష్టి చేయు సమయం రాగా ఆ అంధకారాన్ని ఆపోశన పట్టిన సాత్విక తేజోమూర్తి విష్ణువు. అటువంటి శ్రీమహా విష్ణువు ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచలు అయిపోతుంది తప్ప ఏమాత్రం ప్రకాశించ లేదు.

తెభా-7-290-వ.
అంత నద్దానవేంద్రుండు మహోద్దండంబగు గదాదండంబు గిరగిరం ద్రిప్పి నరమృగేంద్రుని వ్రేసిన; నతండు దర్పంబున సర్పంబు నొడిసిపట్టు సర్పపరిపంథి నేర్పున దితిపట్టిం బట్టికొనిన, మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుక న య్యసురవరుండు దృఢబలంబున నిట్టట్టు జడిసి పట్టు దప్పించుకొని, విడివడి దిటవు దప్పక కుప్పించి యుప్పరం బెగసి విహంగకులరాజ చరణ నిర్గళిత భుజంగంబు తెఱంగునం దలంగ నుఱికి తన భుజాటోపంబున నరకంఠీరవుండు కుంఠితుం; డయ్యెడి నని తలంచి, కలంగక చెలంగుచుఁ దన్ను నిబిడనీరద నికరంబుల మాటున నిలింపులు గుంపులు గొని డాఁగి మూఁగి క్రమ్మఱ నాత్మీయ జీవన శంకా కళంకితు లై మంతనంబులఁ జింతనంబులు చేయుచు నిరీక్షింప నక్షీణ సమరదక్షతా విశేషం బుపలక్షించి ఖడ్గ వర్మంబులు ధరియించి, భూనభోభాగంబుల వివిధ విచిత్ర లంఘన లాఘవంబులం బరిభ్రమణ భేదంబులం గరాళవదనుం డయి, యంతరాళంబునఁ దిరుగు సాళువపు డేగ చందంబున సంచరించిన; సహింపక.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; దానవ = దానవుల; ఇంద్రుడు = ప్రభువు; మహా = గొప్ప; ఉద్దండంబు = పెద్దదైనది; అగు = అయిన; గదాదండంబున్ = గదను; గిరగిరన్ = గిరగిరా; త్రిప్పి = తిప్పి; నరమృగేంద్రుని = నరసింహుని; వ్రేసినన్ = కొట్టగా; అతండు = అతడు; దర్పంబునన్ = గర్వముతో; సర్పంబున్ = పామును; ఒడిసి = ఒడుపుతో; పట్టు = పట్టుకొనెడి; సర్పపరిపంథి = గరుత్మంతుని {సర్పపరిపంథి - సర్ప (పాములకు) పరిపంథి (శత్రువు), గరుత్మంతుడు}; నేర్పునన్ = ప్రావీణ్యముతో; దితిపట్టిన్ = హిరణ్యకశిపుని; పట్టికొనినన్ = పట్టుకొనగా; మిట్టిపడి = ఎగిసిపడి; దట్టించి = అదలించి; బిట్టు = మించిన; కట్టలుకన్ = రోషాతిశయముచేత; ఆ = ఆ; అసుర = రాక్షస; వరుండు = శ్రేష్ఠుడు; దృఢ = గట్టి; బలంబునన్ = బలముతో; ఇట్టట్టు = ఇటు అటు; జడిసి = విదలించుకొని; పట్టు = పట్టునుండి; తప్పించుకొని = తప్పించుకొని; విడివడి = విడిపించుకొని; దిటవున్ = ధైర్యమును; తప్పక = వీడక; కుప్పించి = దుమికి; ఉప్పరంబు = పైకి; ఎగసి = ఎగిరి; విహంగకులరాజ = గరుత్మంతుని {విహంగకులరాజు - విహంగ (పక్షుల) కులమునకు రాజు, గరుత్మంతుడు}; చరణ = కాళ్ళనుండి; నిర్గళిత = తప్పించుకొన్న; భుజంగంబు = పాము; తెఱంగునన్ = వలె; తలంగన్ = తొలగి; ఉఱికి = పారి; తన = తన యొక్క; భుజ = బాహు; ఆటోపంబునన్ = బలముచేత; నరకంఠీరవుండు = నరసింహుడు; కుంఠితుండు = ఓడిపోయినవాడు; అయ్యెడిని = అగును; అని = అని; తలంచి = భావించి; కలంగక = బెదరక; చెలంగుచున్ = చెలరేగుచు; తన్నున్ = తనను; నిబిడ = దట్టములైన; నీరద = మేఘముల; నికరంబులు = సముదాయములు; మాటునన్ = చాటున; నిలింపులు = దేవతలు; గుంపులుకొని = గుంపులుగుంపులుగా; డాగి = దాక్కొనుచు; మూగి = పరచుకొని; క్రమ్మఱ = మరల; ఆత్మీయ = తమ యొక్క; జీవన = జీవితములమీద; శంక = అనుమానముచేత; కళంకితులు = కళంకితమైనవారు; ఐ = అయ్యి; మంతనంబునన్ = రహస్యముగా; చింతనంబులు = సంప్రదింపులు; చేయుచున్ = చేయుచు; నిరీక్షింపన్ = చూచుచుండగా; అక్షీణ = గొప్ప; సమర = యుద్ధ; దక్షతా = ప్రావీణ్యముయొక్క; విశేషంబున్ = అతిశయమును; ఉపలక్షించి = గుర్తుచేసుకొని; ఖడ్గ = కత్తి; వర్మంబులున్ = కవచములు; ధరియించి = ధరించి; భూ = నేల; నభో = ఆకాశ; భాగంబులన్ = ప్రదేశములలో; వివిధ = పలురకముల; విచిత్ర = ఆశ్చర్యకరమైన; లంఘన = మల్లయుద్ధదూకుటలందలి; లాఘవంబులన్ = నేర్పులతో; పరిభ్రమణ = తిరుగుటలోని; భేదంబులన్ = విశేషములతో; కరాళ = భయంకరమైన; వదనుండు = ముఖముగలవాడు; అయి = అయ్యి; అంతరాళంబునన్ = ఆకాశమున; తిరుగు = తిరిగెడి; సాళువపు = కణుజు; డేగ = డేగ; చందంబునన్ = వలె; సంచరించినన్ = తిరుగాడుచుండగా; సహింపక = ఒర్వక.
భావము:- దానవ వీరుడైన హిరణ్యకశిపుడు తన భయంకరమైన గదాదండాన్ని గిరగిరా త్రిప్పి నరసింహుని మీదకి విసిరాడు. ఆయన వెంటనే, గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసి పట్టినట్లుగా రాక్షసరాజును పట్టుకున్నాడు. ఆ దానవుడు ఎగిరి పడి ఇటూనటూ గింజుకుని, రోషంతో, చాకచక్యంతో బలంపుంజుకుని, పట్టు తప్పించుకున్నాడు. అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకున్న సర్పరాజు లాగా ఎగిరి ఎగిరి పడుతూ చిందులు త్రొక్కుతూ పోరాడసాగాడు. “తన భుజబలానికి ఈ నరసింహుడు లొంగిపోతాడులే” అనుకుంటూ, నదురు బెదురు లేకుండా రాక్షసేశ్వరుడు విజృంభిస్తున్నాడు. తన పరాక్రమాన్ని నైపుణ్యంగా ప్రదర్శిస్తున్నాడు. దేవతలు ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాల చాటున నక్కి నక్కి చూస్తూ “మన జీవితాలకు ముప్పు తప్పేలా లేదు, వీడేమో లొంగేలా లేడు” అనే సందేహాలతో దిగులుపడసాగారు. అయినా రహస్యంగా ఆ రాక్షసుడినే చూస్తున్నారు. హిరణ్యకశిపుడు కవచధారి అయి యుద్ధ విద్య తంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో ఖడ్గచాలనం చేస్తూ భూమ్యాకాశా లంతటా తానే పరిభ్రమిస్తున్నాడు. మల్ల యుద్ధ విద్యా విన్యాసాలైన ఉరుకుట, తిరుగుట మున్నగునవి లాఘవంగా చూపుతున్నాడు. రకరకాల పరిభ్రమణాలు చేస్తూ, భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరి పడుతున్న రాక్షసుడి అహంకారాన్ని సహించక నరసింహ ప్రభువు ఆగ్రహించాడు.

తెభా-7-291-సీ.
పంచాననోద్ధూత పావకజ్వాలలు-
భూనభోంతరమెల్లఁ బూరితముగ;
దంష్ట్రాంకురాభీల గధగాయితదీప్తి-
సురేంద్రు నేత్రము లంధములుగఁ;
గంటకసన్నిభోత్కట కేసరాహతి-
భ్రసంఘము భిన్నమై చలింపఁ;
బ్రళయాభ్రచంచలాప్రతిమ భాస్వరములై-
రనఖరోచులు గ్రమ్ముదేర;

తెభా-7-291.1-తే.
టలు జళిపించి గర్జించి సంభ్రమించి
దృష్టి సారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి
ట్టె నరసింహుఁ డా దితిట్టి నధిప!

టీక:- పంచ = విప్పారిన; ఆనన = ముఖమునుండి; ఉద్ధూత = పుట్టిన; పావక = అగ్ని; జ్వాలలు = మంటలు; భూ = భూమి; నభః = ఆకాశము; అంతరము = మధ్యభాగము; ఎల్లన్ = అంతటిని; పూరితంబు = నిండినది; కన్ = కాగా; దంష్ట్రా = కోఱల; అంకుర = మొలకల యొక్క; అభీల = భయంకరమైన; ధగధగాయిత = ధగధగలాడెడి; దీప్తిన్ = ప్రకాశముచేత; అసుర = రాక్షస; ఇంద్రు = ప్రభువు యొక్త; నేత్రములు = కన్నులు; అంధములు = గుడ్డివి; కన్ = కాగా; కంటక = ముండ్ల; సన్నిభ = వంటి; ఉత్కట = వాడియైన, నిక్కిన; కేసర = రోమముల, జూలు; ఆహతిన్ = తాకిడికి; అభ్ర = మేఘముల; సంఘము = సమూహము; భిన్నము = విరిసినది; ఐ = అయ్యి; చలింపన్ = తిరుగగా; ప్రళయ = ప్రళయకాలపు; అభ్ర = మేఘముల యందలి; చంచలా = మెరపులకు; ప్రతిమ = సాటిరాగల; భాస్వరములు = కాంతులుగలవి; ఐ = అయ్యి; ఖర = వాడి; నఖర = గోళ్ళ యొక్క; రోచులు = కాంతులు; కమ్ముదేరన్ = వ్యాపింపగా.
సటలు = జూలు; జళిపించి = జాడించి; గర్జించి = గర్జించి {గర్జన - సింహపు అరుపు}; సంభ్రమించి = చెలరేగి; దృష్టి = చూపు; సారించి = నిగిడించి; బొమలు = కనుబొమలు; బంధించి = ముడివేసి; కెరలి = విజృంభించి; జిహ్వ = నాలుక; ఆడించి = ఆడించి; లంఘించి = పైకురికి, దూకి; చేతన్ = చేతితో; ఒడిసిపట్టెన్ = ఒడుపుగాపట్టుకొనెను; నరసింహుండు = నరసింహుడు; ఆ = ఆ; దితిపట్టిన్ = హిరణ్యకశిపుని; అధిపా = రాజా.
భావము:- ఉగ్ర నరసింహస్వామి యొక్క సింహముఖం నుండి జనించిన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలలో వెలువడిన అగ్నిజ్వాలలతో భూమ్యాకాశాలు నిండిపోయాయి. ఆయన కోరల ధగ ధగ కాంతులు హిరణ్యకశిప రాక్షసుని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అంధుణ్ణి చేశాయి. ముళ్ళల్లా ఉన్న ఆయన కేసరాల విదలింపులకు ఆకాశంలోని మేఘపంక్తులు చెల్లాచెదరైపోయాయి. ఆ నరహరి కాలిగోరుల నుండి వెలువడే తీక్షణములైన కాంతులు, ప్రళయకాలపు మేఘాలలోని మెరుపు తీగలలా మెరుస్తున్నాయి. ఆ నారసింహుడు అదను చూసి జటలు ఝళిపించాడు, ఒక్కసారిగా గర్జించి హుంకరించాడు, కనుబొమలు ముడిచి తీక్షణంగా వీక్షించాడు, ఆ ఉగ్రమూర్తి వికృతంగా తన నాల్కను ఆడించి, ఆ రాక్షసుడిపై విజృంభించి దూకి ఒడిసి పట్టుకున్నాడు.

తెభా-7-292-క.
కుగొనక లీలాగతి
నుగేంద్రుఁడు మూషికంబు నొడసిన పగిదిన్
కేసరి దను నొడిసిన
సువిమతుఁడు ప్రాణభీతి సుడివడియె నృపా!

టీక:- సరకుగొనక = లక్ష్యపెట్టక; లీలా = క్రీడ; గతిన్ = వలె; ఉరగ = సర్ప; ఇంద్రుడు = రాజు; మూషికంబున్ = ఎలుకను; ఒడసిన = ఒడుపుగాపట్టుకొను; పగిదిన్ = విధముగ; నరకేసరి = నరసింహుడు; తను = తనను; ఒడిసినన్ = ఒడిసిపట్టగా; సుర = దేవతలకు; విమతుడు = శత్రువు; ప్రాణ = ప్రాణములమీది; భీతిన్ = భయముచేత; సుడివడియెన్ = కలగిపోయెను; నృపా = రాజా.
భావము:- నాగేంద్రుడు ఎలుకను ఏమాత్రం లెక్కచేయకుండా ఒడిసిపట్టినట్లుగా, ఆ నరసింహ ప్రభువు పట్టుకోడంతో, ఆ దేవతా శత్రువు అయిన హిరణ్యకశిపుడు ప్రాణభీతితో సుళ్ళు తిరిగిపోయాడు.

తెభా-7-293-క.
సురాజవైరి లోఁబడెఁ
రిభావిత సాధుభక్త టలాంహునకున్
సింహునకు నుదంచ
త్ఖతరజిహ్వున కుదగ్ర న రంహునకున్.

టీక:- సుర = దేవతల; రాజ = ప్రభువుల; వైరి = శత్రువు; లోబడెన్ = లొంగిపోయెను; పరిభావిత = తిరస్కరింపబడిన; సాధు = సజ్జనులైన; భక్త = భక్తుల; పటల = సంఘముల యొక్క; అంహున = పాపములుగలవాని; కున్ = కి; నరసింహునకున = నరసింహుని; కును = కి; ఉదంచత్ = మెఱయుచున్న; ఖరతర = మిక్కిలిగరుకైన {ఖర - ఖరతర - ఖరతమ}; జిహ్వున్ = నాలుకగలవాని; కున్ = కి; ఉదగ్ర = ఘనమైన; ఘన = గొప్ప; రంహున్ = వేగముగలవాని; కున్ = కు.
భావము:- సాధుజనుల, భక్తుల అందరి పాపాలను పటాపంచలు చేసేవాడు, కడు భయంకరంగా కదులుచున్న నాలుక గలవాడు, మహోగ్రమైన వేగం గలవాడు అయిన నరసింహ దేవుడికి, ఇంద్రుని శత్రువైన హిరణ్యకశిపుడు లోబడిపోయాడు.

తెభా-7-294-వ.
అంత.
టీక:- అంత = అంతట.
భావము:- అంతట

తెభా-7-295-మ.
విగేంద్రుం డహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తిన్ నృసింహుండు సా
గ్రహుఁడై యూరువులందుఁ జేర్చి నఖసంఘాతంబులన్ వ్రచ్చె దు
స్సహు దంభోళికఠోరదేహు నచలోత్సాహున్ మహాబాహు నిం
ద్ర హుతాశాంతకభీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్.

టీక:- విహగేంద్రుండు = గరుత్మంతుడు; అహి = పామును; వ్రచ్చు = చీల్చెడి; కైవడి = లాగున; మహా = మిక్కిలి; ఉద్వృత్తిన్ = అతిశయముతో; నృసింహుండు = నరసింహుడు; సాగ్రహుడు = క్రోధముతోకూడినవాడు; ఐ = అయ్యి; ఊరువులు = తొడల; అందున్ = మీద; చేర్చి = చేర్చుకొని; నఖ = గోళ్ళ; సంఘాతంబులన్ = పోటులచేత; వ్రచ్చెన్ = చీల్చెను; దుస్సహున్ = (పరాక్రమముచే)ఓర్వరానివాని; దంభోళి = వజ్రాయుధములాంటి; కఠోర = కఠినమైన; దేహున్ = దేహముగలవానిని; అచల = చలించని; ఉత్సాహున్ = పూనికగలవానిని; మహా = గొప్ప; బాహున్ = భుజబలుని; ఇంద్ర = ఇంద్రుడు; హుతాశ = అగ్ని {హుతాశనుడు - హుత (హోమద్రవ్యము) అశనుడు (తినువాడు), అగ్ని}; శాంతక = యములకు {శాంతకుడు - మరణము కలుగ జేయువాడు, యముడు}; భీరున్ = భయముపుట్టించువానిని; ఘన = బలిష్టమైన; కరున్ = చేతులుగలవానిని; దైత్య = రాక్షస; అన్వయ = వంశమునకు; శ్రీకరున్ = వన్నెకలిగించువానిని.
భావము:- అప్పుడు, గరుత్మంతుడు పాములను పట్టుకుని చీల్చే విధంగా, నృసింహావతారుడు ఆగ్రహంతో వజ్రకఠోరకాయుడూ; అచంచల ఉత్సాహవంతుడూ; మహాబాహుడూ; ఇంద్ర అగ్ని యమాదులకు మిక్కిలి భయం పుట్టించేవాడూ; దానవవంశ శుభంకరుడూ; దుస్సహ పరాక్రమం గలవాడూ అయిన హిరణ్యకశిపుడిని పట్టుకుని బలవంతంగా తన తొడలపై అడ్డంగా పడేసుకొన్నాడు. వాడి రొమ్ము తన వాడి గోళ్ళతో చీల్చాడు.

తెభా-7-296-శా.
చించున్ హృత్కమలంబు, శోణితము వర్షించున్ ధరామండలిం,
ద్రెంచుం గర్కశనాడికావళులు, భేదించున్ మహావక్షముం,
ద్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా, దుష్టాసురున్ వ్రచ్చి ద
ర్పించుం, బ్రేవులు కంఠమాలికలు గల్పించున్ నఖోద్భాసియై.

టీక:- చించున్ = చీల్చివేయును; హృత్ = హృదయమనెడి; కమలంబున్ = పద్మమును; శోణితమున్ = రక్తమును; వర్షించున్ = ధారలుకట్టించును; ధరామండలిన్ = భూమండలముపైన; త్రెంచున్ = తెంపివేయును; కర్కశ = కఠినమైన; నాడిక = నరముల; ఆవళులు = సమూహమును; భేదించున్ = బద్దలుచేయును; మహా = పెద్ద; వక్షమున్ = వక్షస్థలమును; త్రుంచున్ = తునకలుచేయును; మాంసమున్ = మాంసమును; సూక్ష్మ = చిన్న; ఖండములు = ముక్కలు; కాన్ = అగునట్లు; దుష్ట = దుర్మార్గపు; అసురున్ = రాక్షసుని; వ్రచ్చి = చీల్చివేసి; దర్పించున్ = గర్వించును; ప్రేవులు = పేగులు; కంఠ = మెడలోని; మాలికలు = దండలువలె; కల్పించున్ = చేయును; నఖ = గోళ్ళచే; ఉత్ = మిక్కిలి; భాసి = మెరయువాడు; ఐ = అయ్యి.
భావము:- దేవదేవుడు నరసింహ రూపుడు, దానవేశ్వరుడి గుండెలు చీల్చి నెత్తురు కురిపించాడు; కఠోరమైన రక్తనాళాలు త్రెంచి తుత్తునియలు చేసాడు; కండరాలు ఖండించి ముక్కలు ముక్కలుగా చేసాడు; రక్తం కారుతున్న ప్రేగులు లాగి తన కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు. ఇలా అమితోత్సాహంతో హిరణ్యకశిపుని చంపి సంహరించి నరసింహమూర్తి గోళ్ళ కాంతులతో ప్రచండంగా ప్రకాశిస్తున్నాడు.

తెభా-7-297-సీ.
క్షకవాటంబు వ్రక్కలు చేయుచో,-
న కుఠారంబుల రణి నొప్పు;
గంభీర హృదయ పంజము భేదించుచోఁ,-
గుద్దాలముల భంగిఁ గొమరుమిగులు;
మనీ వితానంబు విలి ఖండించుచోఁ,-
టు లవిత్రంబుల గిది మెఱయు;
ఠరవిశాలాంత్రజాలంబుఁ ద్రెంచుచోఁ,-
గ్రకచ సంఘంబుల రిమఁ జూపు;

తెభా-7-297.1-తే.
నంకగతుఁడైన దైత్యుని నాగ్రహమున
స్త్ర చయముల నొంపక సంహరించి
మరు నరసింహు నఖరంబు తి విచిత్ర
మర ముఖరంబులై యుండె నవరేణ్య!

టీక:- వక్ష = రొమ్ము యనెడి; కవాటంబున్ = కవాటమును; వ్రక్కలు = ముక్కలు; చేయు = చేసెడి; చోన్ = అప్పుడు; ఘన = పెద్ద; కుఠారంబులన్ = గొడ్ఢళ్ళు; కరణిన్ = వలె; ఒప్పున్ = చక్కగానుండును; గంభీర = లోతైన; హృదయ = హృదయమనెడి; పంకజమున్ = పద్మమును {పంకజము - పంకము (బురద) యందు జము (పుట్టునది), పద్మము}; భేదించు = బద్దలుచేసెడి; చోన్ = అప్పుడు; కుద్దాలముల = గునపముల; భంగిన్ = వలె; కొమరు = చక్కదనము; మిగులు = అతిశయించును; ధమనీ = నరముల; వితానంబున్ = సమూహమునలను; తవిలి = పూని; ఖండించు = కోసివేసెడి; చోన్ = అప్పుడు; లవిత్రంబుల = కొడవళ్ళ; పగిదిన్ = వలె; మెఱయున్ = ప్రకాశించును; జఠర = కడుపులోని; విశాల = పొడవైన; అంత్ర = పేగుల; జాలంబున్ = సమూహమును; త్రెంచు = తెంచివేసెడి; చోన్ = అప్పుడు; క్రకచ = రంపముల; సంఘంబుల = సమూహముల యొక్క; గరిమన్ = గొప్పదనమును; చూపున్ = ప్రదర్శించును; అంక = ఒడిలో.
గతుడు = ఉన్నవాడు; ఐన = అయిన; దైత్యుని = రాక్షసుని; ఆగ్రహమునన్ = కోపముతో; శస్త్ర = ఆయుధముల; చయమున్ = సమూహమును; ఒంపక = ప్రయోగించకుండగ; సంహరించి = చంపి; అమరు = ఒప్పుచున్న; నరసింహు = నరసింహుని; నఖరంబులు = గోళ్ళు; అతి = మిక్కిలి; విచిత్ర = అబ్బురమైన; సమర = యుద్ధ; ముఖరంబులు = సాధనములు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; జనవరేణ్య = రాజా {జనవరేణ్యుడు - జన (మానవులలో) వరేణ్యుడు (శ్రేష్ఠుడు), రాజు}.
భావము:- ఆ ఉగ్ర నరసింహుని గోళ్ళు ఆ రాక్షసుని వక్ష కవాటం పగులగొట్టేటప్పుడు గండ్రగొడ్డళ్ళలా విరాజిల్లాయి. హృదయపద్మం పెకలించేటప్పుడు త్రవ్వుగోలల వలె దీపించాయి. రక్తనాళాలు త్రెపేటప్పుడు బలిష్ఠమైన కొడవళ్ళు వలె ప్రకాశించాయి. ప్రేగులు కోసేటప్పుడు రంపాలలాగా రాణించాయి. తన ఊరువులపై పడి ఉన్న రాక్షసుడిని ఎలాంటి అస్త్రశస్త్రాలతోనూ పనిలేకుండా నరకేసరి తన గోళ్ళతోనే సంహరించాడు. అప్పుడు ఆ గోళ్ళు అతి విచిత్రమైన రణ విజయాన్ని చాటుతూ శోభించాయి.
అజరామరమైన కవిత్వం పండించిన హాలికుడు కదా, గొడ్డలి ఎప్పుడు వాడాలో, గునపం ఎక్కడ వాడాలో, కొడవలి ఎలా వాడాలో ఱంపం ఎక్కడ వాడాలో బాగా తెలిసిన వాడు. పైగా సకల శాస్త్రాల పరిచయం క్షుణ్ణంగా కలవాడు. మరి ఎముకల గూడు, గుండె కండరాలు, నరాలు లక్షణాలకు తగిన పరికరాలను ఎన్నుకున్నాడు. సహజ సిద్దంగా అలరారుతున్నది వీరి కవిత్వం. దానికి ఈ సీసం ఒక ఉదాహరణ.

తెభా-7-298-క.
స్ఫురితవిబుధజన ముఖములు
రివిదళిత దనుజనివహతి తనుముఖముల్
గురురుచి జిత శిఖిశిఖములు
హరిఖరనఖము లమరు తజనసఖముల్.

టీక:- స్ఫురిత = స్పారితమైన, వికసించినవైన; విబుధ = దేవతలైన; జన = వారి; ముఖములున్ = ముఖముగలవి; పరి = మిక్కిలి; విదళిత = చీల్చబడిన; దనుజ = రాక్షస; నివహ = సమూహమునకు; పతి = ప్రభువు యొక్క; తను = దేహము; ముఖముల్ = ముఖములుగలవి; గురు = గొప్ప; రుచి = కాంతిచే; జిత = జయింపబడిన; శిఖి = అగ్ని; శిఖములున్ = జ్వాలలుగలది; నరహరి = నరసింహుని; ఖర = వాడియైన; నఖముల్ = గోళ్ళు; అమరు = చక్కనుండిన; నత = మ్రొక్కెడి; జన = వారియొక్క; సఖములు = హితములైనవి.
భావము:- నరసింహస్వామి గోళ్ళు శరణాగత సాధుజనులకు ఇష్టమైనవి. ఆ దానవేశ్వరుని దేహాన్ని చీల్చివేశాయి. దేవతల ముఖాలను వికసింపజేశాయి. బహు అధికమైన కాంతులతో అగ్నిశిఖలను సైతం ఓడించాయి.

తెభా-7-299-వ.
ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహరూపంబున, రేయునుం బవలునుం గాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబునుం గాని సభాద్వారంబున, గగనంబును భూమియునుం గాని యూరుమధ్యంబునఁ, బ్రాణసహితంబులును బ్రాణరహితంబులునుం గాని నఖంబులం, ద్రైలోక్యజన హృదయ భల్లుం డయిన దైత్యమల్లుని వధియించి, మహాదహన కీలాభీల దర్శనుండును, గరాళవదనుండును, లేలిహానభీషణ జిహ్వుండును, శోణిత పంకాంకిత కేసరుండును నై ప్రేవులు కంఠమాలికలుగ ధరించి కుంభికుంభ విదళనంబు చేసి చనుదెంచు పంచాననంబునుం బోలె, దనుజకుంజర హృదయకమల విదళనంబు చేసి, తదీయ రక్తసిక్తంబు లైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక, లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తఱంబున రణంబునకు నురవడించు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాధిక నిర్వక్రసాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె; ని వ్విధంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కేవల = అచ్చమైన; పురుష = మానవ; రూపంబును = స్వరూపము; మృగ = సింహపు; రూపంబునున్ = స్వరూపము; కాని = కానట్టి; నరసింహ = నరసింహపు; రూపంబునన్ = స్వరూపముతో; రేయునున్ = రాత్రి; పవలునున్ = పగలు; కాని = కానట్టి; సంధ్యా = సంధ్య; సమయంబునన్ = సమయములో; అంతర్ = లోపలి; రంగంబునున్ = ప్రదేశము; బహిర్ = బయటి; రంగంబునున్ = ప్రదేశమును; కాని = కానట్టి; సభా = సభాభవనము యొక్క; ద్వారంబునన్ = ద్వారబంధముపైన; గగనంబునున్ = ఆకాశము; భూమియున్ = నేల; కాని = కానట్టి; ఊరు = తొడల; మధ్యంబునన్ = మధ్యభాగమునందు; ప్రాణ = ప్రాణము; సహితంబులునున్ = కలిగినవి; ప్రాణ = ప్రాణము; రహితంబులును = లేనివి; కాని = కానట్టి; నఖంబులన్ = గోరులతోటి; త్రైలోక్య = ముల్లోకములందలి; జన = ప్రజల; హృదయ = హృదయములను; భల్లుండు = బల్లెములవంటివాడు; అయిన = ఐన; దైత్య = దానవ; మల్లుని = శూరుని; వధియించి = సంహరించి; మహా = పెద్ద; దహన = మండుచున్న; కీలా = మంటలవలె; ఆభీల = భయంకరమైన; దర్శనుండును = కనబడెడివాడు; కరాళ = భయంకరమైన; వదనుండును = మోముగలవాడు; లేలిహాన = పామునాలికవంటి; భీషణ = భీకరమైన; జిహ్వుండును = నాలుకగలవాడు; శోణిత = రక్తపు; పంక = బురద; అంకిత = అంటుకొన్న; కేసరుండును = జూలుగలవాడు; ఐ = అయ్యి; ప్రేవులు = పేగులు; కంఠ = మెడలోని; మాలికలు = దండలు; కన్ = అగునట్లు; ధరించి = తాల్చి; కుంభి = ఏనుగు; కుంభ = కుంభస్థలమును; విదళనంబు = చీల్చుట; చేసి = చేసి; చనుదెంచు = వచ్చెడి; పంచాననంబునున్ = సింహమును; పోలెన్ = వలె; దనుజ = రాక్షసులలో; కుంజర = సింహమువంటివాని; హృదయ = హృదయముయనెడి; కమల = పద్మమును; విదళనంబు = చీల్చుట; చేసి = చేసి; తదీయ = అతని; రక్త = రక్తముచే; సిక్తంబులు = తడసినవి; ఐన = అయిన; నఖంబులున్ = గోళ్ళు; సంధ్యా = సంధ్యాకాలపు; రాగ = రంగుగల; రక్త = ఎఱ్ఱని; చంద్ర = చంద్ర; రేఖలన్ = కళల; చెలువున్ = అందమును; వహింపన్ = సంతరించుకొనగా; సహింపక = ఓర్వక; లేచి = పూని; తన = తనయొక్క; కట్టెదుర = కన్నుల ఎదురుగ; ఆయుధంబులన్ = ఆయుధములను; ఎత్తుకొని = ధరించి; తత్తఱంబునన్ = త్వరితముతో; రణంబున్ = యుద్ధమున; కున్ = కు; ఉరవడించు = ఉరుకుతున్న; రక్కసులన్ = రాక్షసులను; పెక్కు = అనెకమైన; సహస్రంబులన్ = వేలకొలది; చక్రాయుధ = చక్రాయుధములు; అధిక = మొదలగు; నిర్వక్ర = అకుంఠితములైన; సాధనంబులన్ = ఆయుధములతో; ఒక్కనిన్ = ఒకడినికూడ; చిక్కకుండగ = వదిలిపెట్టకుండా; చక్కడిచెన్ = సంహరించెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:- ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు భంగం కలుగకుండా; కేవలం నరరూపం కానీ, మృగరూపం కానీ కానటువంటి నరసింహ రూపంతో; రాత్రి గానీ, పగలు గానీ కానట్టి సంధ్యాసమయంలో; లోపల కానీ, వెలుపల కానీ కానటువంటి సభాభవనపు గడప మీద; ఆకాశం కానీ, భూమీ కానీ కానట్టి తన ఊరు ప్రదేశంలో (ఒళ్ళో); ప్రాణం ఉన్నవీ కానీ, ప్రాణం లేనివి కానీ కాని గోళ్ళతో సంహరించాడు. అలా ఉగ్రనరసింహస్వామి ముల్లోకాలకూ గుండెల్లో గాలంలా తయారైన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడిని చంపాడు. అప్పుడు, ఆయన మిక్కిలి ఉగ్ర స్వరూపంతో దావానల జ్వాలలా దర్శనమిచ్చాడు. అతిభయంకరంగా ఉన్న ముఖంతో; నాగేంద్రుని నాలుక లాగ మాటిమాటికి బయటకు వచ్చి చలిస్తున్న భీకరమైన నాలుకతో; నెత్తురుతో తడసి ఎఱ్ఱబారిన మెడజూలుతో; భయంకరంగా ఆ దానవ రాజు ప్రేగులు కంఠమాలికలులా వేసుకున్న మెడతో ఆ ఉగ్ర నరసింహుడు దర్శనమిచ్చాడు. ఆ దేవుడు ఆ దానవుడి హృదయకమలం చీల్చి వేసి, మదగజేంద్రుడి కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజులాగా విరాజిల్లుతున్నాడు; రక్తంలో తడసిన ఆయన గోర్లు సంధ్యారాగ రంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి; ఆ రూపం చూసిన రాక్షస వీరులు కోపాలు పట్టలేక వివిధ ఆయుధాలతో ఆ రాక్షసాంతకుని మీదకి దండెత్తి వచ్చారు; అలా వచ్చిన పెక్కువేల రక్కసులను వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా వధించాడు ఆ ఉగ్ర నరకేసరి.

తెభా-7-300-శా.
క్షోవీరుల నెల్లఁ ద్రుంచి రణసంరంభంబు చాలించి దృ
ష్టిక్షేపంబు భయంకరంబుగ సభాసింహాసనారూఢుఁడై
క్షీణాగ్రహుఁడై నృసింహుఁడు కరాళాస్యంబుతో నొప్పెఁ దన్
వీక్షింపం బలికింప నోడి యితరుల్ విభ్రాంతులై డాఁగఁగన్.

టీక:- రక్షః = రాక్షస; వీరులన్ = వీరులను; ఎల్లన్ = అందరను; త్రుంచి = సంహరించి; రణ = యుద్ధమందలి; సంరంభంబున్ = ఆటోపమును; చాలించి = ఆపేసి; దృష్టి = చూపుల; క్షేపంబు = నిగుడ్చుట, ప్రసారము; భయంకరంబుగ = బెదురుకలుగునట్లు; సభా = సభయందలి; సింహాసన = సింహాసనమును; ఆరూఢుడు = కూర్చున్నవాడు; ఐ = అయ్యి; అక్షీణ = అధికమైన; ఆగ్రహుడు = కోపముగలవాడు; ఐ = అయ్యి; నృసింహుడు = నరసింహుడు; కరాళ = భయంకరమైన; ఆస్యంబు = ముఖము; తోన్ = తోటి; ఒప్పెన్ = చక్కగనుండెను; తన్ = తనను; వీక్షింపన్ = చూచుటకు; పలికింపన్ = పలకరించుటకు; ఓడి = బెదరి; ఇతరుల్ = ఇతరులు; విభ్రాంతులు = భీతిచెందినవారు; ఐ = అయ్యి; డాగగన్ = దగ్గరచేరుటకు.
భావము:- ఈ విధంగా రాక్షస సంహారం కానిచ్చి, యుద్ధం పరిసమాప్తి చేసాడు. ఇంకా ఆ ఉగ్ర నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు. ఆ చూపులు భయం కలిగిస్తున్నాయి. భీకరమైన ముఖంతో ఊగిపోతున్నాడు. చూడటానికి గానీ, పలకరించడానికి కానీ చాలక అక్కడున్న వాళ్లందరూ భయభ్రాంతులై తత్తర పడుతుండగా, ఆ భీకర నరకేసరి ఆ సభాభవనంలో సింహాసనంపై ఆసీను డయ్యాడు.

తెభా-7-301-క.
సు చారణ విద్యాధర
రుడోరగ యక్ష సిద్ధణములలో నొ
క్కరుఁ డైన డాయ వెఱచును
హరి న య్యవసరమున రలోకేశా!

టీక:- సుర = దేవతల; చారణ = చారణుల; విద్యాధర = విద్యాధరుల; గరుడ = గరుడుల; ఉరగ = సర్పముల; యక్ష = యక్షుల; సిద్ధ = సిద్ధుల; గణముల = సమూహముల; లోన్ = అందు; ఒక్కరుడు = ఒకడు; ఐనన్ = అయినను; డాయన్ = దగ్గరచేరుటకు; వెఱచును = బెదురును; నరహరిన్ = నరసింహుని; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; నరలోకేశ = రాజా {నరలోకేశుడు - నరలోక (నరలోకుల) కు ఈశుడు (ప్రభువు), రాజు}.
భావము:- ధర్మరాజా! దేవతలు, చారణులు, విద్యాధరులు, గరుడులు, నాగులు, యక్షులు, సిద్ధులు మొదలైన వారిలో ఏ ఒక్కరు కూడ ఆ సమయంలో ఆ ఉగ్ర నరకేసరి దరిదాపులకు వెళ్ళటానికి సాహసించలేక భయకంపితు లౌతున్నారు.

తెభా-7-302-క.
ర్షంబుల నరసింహుని
ర్షంబులఁ జూచి నిర్జరాంగనలు మహో
త్కర్షంబులఁ గుసుమంబుల
ర్షంబులు గురిసి రుత్సవంబుల నధిపా!

టీక:- తర్షంబులన్ = ఆదరముతో; నరసింహుని = నరసింహుని; హర్షంబులన్ = ఆనందములతో; చూచి = చూసి; నిర్జర = దేవ {నిర్జరులు - జర (ముదిమి)లేనివారు, దేవతలు}; అంగనలు = స్త్రీలు; మహా = గొప్పగా; ఉత్కర్షంబులన్ = సమృద్ధితో, అతిశయములతో; కుసుమంబుల = పూల; వర్షంబులు = వానలను; కురిసిరి = కురిపించిరి; ఉత్సవంబులన్ = పండుగలుచేయుచు; అధిపా = రాజా.
భావము:- ఓ మహారాజా! నరసింహరూపుని విజయోత్కర్షం చూసిన దేవకాంతలు ఆదరంతో సమృద్దిగా పూలవానలు కురిపించారు. ఆనందంతో ఉత్సవాలు చేసుకున్నారు.

తెభా-7-303-వ.
మఱియు నయ్యవసరంబున మింట ననేక దేవతావిమానంబులును గంధర్వగానంబులును, నప్సరోగణ నర్తన సంవిధానంబులును, దివ్యకాహళ భేరీ పటహ మురజాది ధ్వానంబులును బ్రకాశమానంబు లయ్యె; సునందకుముదాదులయిన హరిపార్శ్వచరులును, విరించి మహేశ్వర మహేంద్ర పురస్సరులగు త్రిదశ కిన్నర కింపురుష పన్నగ సిద్ధ సాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరాదులును, ప్రజాపతులును, నరకంఠీరవ దర్శనోత్కంఠు లయి చనుదెంచి.
టీక:- మఱియున్ = ఇంకను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; మింటన్ = ఆకాశమున; అనేక = పలు; దేవతా = దేవతల; విమానంబులును = విమానములు; గంధర్వ = గంధర్వుల; గానంబులును = పాటలును; అప్సరస్ = అప్సరసల; గణ = సమూహముయొక్క; నర్తన = ఆటల; సంవిధానంబులును = తీరులును; దివ్య = దివ్యమైన; కాహళ = బాకాలు; భేరీ = భేరీలు; పటహ = తప్పెటలు; మురజ = మద్దెలలు; ఆది = మొదలగు; ధ్వానంబులునున్ = శబ్దములు; ప్రకాశమానంబులు = ప్రకాశించునవి; అయ్యెన్ = అయ్యెను; సునంద = సునందుడు; కుముద = కుముదుడు; ఆదులు = మొదలగువారు; అయిన = ఐన; హరి = విష్ణుని; పార్శ్వచరులును = పరిచారకులు; విరించి = బ్రహ్మదేవుడు {విరించి - భూతములను పుట్టించువాడు, బ్రహ్మ}; మహేశ్వర = పరమశివుడు; మహేంద్ర = ఇంద్రుడు; పురస్సరులు = ముందు నడచు వారు; అగు = అయిన; త్రిదశ = దేవతలు; కిన్నర = కిన్నరలు; కింపురుష = కింపురుషులు; పన్నగ = సర్పములు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; గరుడ = గరుడులు; గంధర్వ = గంధర్వులు; చారణ = చారణులు; విద్యాధర = విద్యాధరులు; ఆదులును = మొదలగువారు; ప్రజాపతులును = ప్రజాపతులు; నరకంఠీరవ = నరసింహుని; దర్శన = చూడవలెనని; ఉత్కంఠులు = వేడుకగలవారు; అయి = అయ్యి; చనుదెంచి = వచ్చి.
భావము:- ఆ సమయంలో ఆకాశంలో అనేకమైన దేవతా విమానాలు తిరిగాయి; గంధర్వ గానాలు వీనుల విందు చేశాయి; అప్సరసల నాట్యాలు కన్నుల పండువు చేశాయి; దివ్యమైన కాహళ, భేరీ, మురజ మున్నగు మంగళవాద్యాలు అనేకం వినబడ్డాయి; సునందుడు, కుముదుడు మొదలైన శ్రీహరి పార్శ్వచరులు; పరమేశ్వరుడూ, బ్రహ్మదేవుడూ, మహేంద్రుడూ, మొదలైన దేవతలూ; కిన్నరులూ; కింపురుషులూ; నాగులూ; సిద్ధులూ; సాధ్యులూ; గరుడులూ; గంధర్వులూ; చారణులూ; విద్యాధరులూ; ప్రజాపతులూ అందరూ ఆ ఉగ్ర నరకేసరిని దర్శించాలనే కుతూహలంతో విచ్చేశారు.