పోతన తెలుగు భాగవతము/సప్తమ స్కంధము/నారదుని పూర్వజన్మంబు

నారదుని పూర్వజన్మంబు


తెభా-7-472-వ.
వినుము; పోయిన మహాకల్పంబునందు గంధర్వులలోన నుపబర్హణుం డను పేర గంధర్వుండ నైన నేను సౌందర్య మాధుర్య గాంభీర్యాది గుణంబుల సుందరులకు బ్రియుండనై క్రీడించుచు నొక్కనాఁడు; విశ్వస్రష్టలైన బ్రహ్మలు దేవసత్రమనియెడి యాగంబులోన నారాయణకథలు గానంబు చేయుకొఱకు నప్సరోజనులను గంధర్వులనుం జీరిన.
టీక:- వినుము = వినుము; పోయిన = కడచిన, గడిచిపోయిన; మహాకల్పంబు = మహాకల్పము; అందున్ = లో; గంధర్వుల = గంధర్వుల, అశ్వముఖుల; లోనన్ = అందు; ఉపబర్హణుండు = ఉపబర్హణుడు; అను = అనెడి; పేరన్ = పేరుతో; గంధర్వుండను = గంధర్వుడను; ఐన = అయిన; నేను = నేను; సౌందర్య = అందమైన స్వరూపము; మాధుర్యము = మధురమైన మాట; గాంభీర్యము = గంభీరమైన వర్తనము; ఆది = మున్నగు; గుణంబులన్ = గుణములతో; సుందరుల్ = స్త్రీల; కున్ = కు; ప్రియుండను = ఇష్టమైనవాడను; ఐ = అయ్యి; క్రీడించుచున్ = విహరించుచు; ఒక్క = ఒక; నాడు = దినమున; విశ్వ = లోకములను; స్రష్టలు = నిర్మించువారు; ఐన = అయిన; బ్రహ్మలు = బ్రహ్మలు, సృష్టికర్తలు; దేవసత్రము = దేవసత్రము {దేవసత్రము - దేవ (దివ్యమైన) సత్రము (యాగము)}; అనియెడి = అనెడి; యాగంబున్ = యజ్ఞము; లోనన్ = అందు; నారాయణ = విష్ణుని; కథలు = గాథలు; గానంబున్ = పాడుట; చేయు = చేసెడి; కొఱకున్ = కోసము; అప్సరస్ = అప్సరసలైన; జనులను = వారిని; గంధర్వులనున్ = గంధర్వులను; చీరిన = పిలువగా;
భావము:- నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను విను. ఇంతకు ముందు జరిగిపోయిన మహాకల్పంలో నేను గంధర్వవంశంలో ఉపబర్హణుడు అనే పేరుతో పుట్టాను. ఆ జన్మలో చాలా అందంగా ఉండేవాడిని. మధురంగా మాట్లాడేవాడిని, గంభీరంగా ప్రవర్తించేవాడిని. అందుచేత సుందరీమణులకు ప్రియుడను అయి ఉండేవాడను. వారితో క్రీడిస్తూ ఉండేవాడిని. ఒకమారు, విశ్వసృష్టికర్తలు అయిన ప్రజాపతులు దేవసత్రం అనే యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో విష్ణు గాథలు గానం చేయటానికి అప్సరసలనూ గంధర్వులను పిలిచారు.

తెభా-7-473-ఆ.
క్రతువులోని కేను గంధర్వగణముతోఁ
లసి పోయి విష్ణుగాథ లచట
గొన్ని పాడి సతులఁ గూడి మోహితుఁడ నై
లఁగి చనితి నంత రణినాథ!

టీక:- క్రతువు = యజ్ఞప్రదేశము; లోని = లోపలి; కిన్ = కి; ఏను = నేను; గంధర్వ = గంధర్వుల; గణము = సమూహము; తోన్ = తోటి; కలిసిపోయి = కలిసిపోయి; విష్ణు = నారయణుని; గాథలు = గాథలు; అచటన్ = అక్కడ; కొన్ని = కొన్ని; పాడి = పాడి; సతులన్ = స్త్రీలను; కూడి = కలిసి; మోహితుడను = మోహమునచిక్కినవాడను; ఐ = అయ్యి; తలగి = తొలగిపోయి; చనినన్ = వెళ్ళగా; అంతన్ = అంతట; ధరణీనాథ = రాజా.
భావము:- రాజా! ధర్మజా! నేను కూడా గంధర్వుల సమూహంతో పాటు ఆ యజ్ఞానికి వెళ్ళాను. విష్ణుగాధలు వీనుల విందుగా గానం చేశాను. మధ్యలో మందగమనులతో కూడి మోహంలో పడిపోయి హరికీర్తనలు మాని, పక్కకి వెళ్ళి పోయాను. అంతలో

తెభా-7-474-క.
వారిజగంధుల పొత్తున
వారిం గైకొనక తలఁగి చ్చిన బుద్ధిన్
వా రెఱిఁగి శాప మిచ్చిరి
వారింపఁగరాని రోషశమున నధిపా!

టీక:- వారిజగంధుల = స్త్రీలతోడి {వారిజగంధి - వారిజ (పద్మముల)యొక్క గంధి (సువాసనగలామె) స్త్రీ}; పొత్తునన్ = సాంగత్యముచేత; వారిన్ = వారిని; కైకొనక = లక్ష్యపెట్టక; తలగి = తొలగిపోయి; వచ్చినన్ = రాగా; బుద్ధిన్ = మనసున; వారు = వారు; ఎఱిగి = తెలిసి; శాపమున్ = శాపమును; ఇచ్చిరి = ఇచ్చిరి; వారింపగరాని = ఆపుకోలేని; రోష = కోపమునకు; వశమునన్ = లోనగుటచేత; అధిపా = రాజా.
భావము:- మహరాజా! ధర్మరాజా! సృష్టికర్తల ఆజ్ఞ అనుసరించకుండా, మోహంలో పడిపోయి, స్త్రీసాంగత్యంలో మునిగితేలుతున్న విషయం వారు గ్రహించారు. దానితో అనివార్యమైన రోషంతో నన్ను ఇలా శపించారు.

తెభా-7-475-ఆ.
పంకజాక్షు నిచటఁ బాడక కామినీ
ణము గూడి చనిన ల్మషమున
గ్ధకాంతి వగుచు రణీ తలంబున
శూద్రజాతి సతికి సుతుఁడ వగుము.

టీక:- పంకజాక్షున్ = శ్రీహరిని; ఇచటన్ = ఇక్కడ; పాడక = సంకీర్తన చేయకుండ; కామినీ = స్త్రీల; గణమున్ = సమూహమును; కూడి = కలిసి; చనిన = పోయినట్టి; కల్మషమునన్ = పాపమువలన; దగ్ధ = చెడిన; కాంతివి = తేజస్సు గలవాడవు; అగుచున్ = అగుచు; ధరణీ = భూ; తలంబునన్ = మండలమున; శూద్రజాతి = శూద్రవర్ణపు; సతి = స్త్రీ; కిన్ = కి; సుతుడవు = పుత్రుడవు; అగుము = పుట్టుము.
భావము:- “స్త్రీ మోహంలో పడి, యజ్ఞం జరుగుతుండగా శ్రీమహావిష్ణువును కీర్తించటం మానివేసిన పాపానికి ఫలంగా తేజస్సు కోల్పోయి, భూలోకంలో శూద్రస్త్రీకి కొడుకుగా పుట్టు.” అని సృష్టికర్తలు గంధర్వుడనైన నన్ను శపించారు

తెభా-7-476-వ.
అని యిట్లు విశ్వస్రష్టలు శపించిన నొక బ్రాహ్మణదాసికిఁ బుత్రుండ నై జన్మించి యందు బ్రహ్మవాదు లైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబున ని మ్మహాకల్పంబు నందు బ్రహ్మపుత్రుండనై జన్మించితి.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; విశ్వస్రష్టలు = లోకకర్తలు; శపించినన్ = శపించగా; ఒక = ఒక; బ్రాహ్మణ = విప్రుల యింటి; దాసి = పనిగత్తె; కిన్ = కు; పుత్రుండను = కుమారుడను; ఐ = అయ్యి; జన్మించి = పుట్టి; అందున్ = దాని(ఆజన్మ)లో; బ్రహ్మవాదులు = బ్రహ్మజ్ఞానులు; ఐన = అయిన; పెద్దల = గొప్పవారి; కున్ = కి; శుశ్రూష = సేవ; చేసిన = చేసినట్టి; భాగ్యంబునన్ = అదృష్టమువలన; ఈ = ఈ; మహాకల్పంబున్ = మహాకల్పము; అందున్ = లో; బ్రహ్మపుత్రుండను = బ్రహ్మదేవుని కుమారుడను {నారదుడు - బ్రహ్మదేవుని మానస పుత్రుడు}; ఐ = అయ్యి; జన్మించితి = పుట్టితిని.
భావము:- అలా విశ్వ సృష్టి కర్తలచేత శపింపబడిన నేను, బ్రాహ్మణుల ఇంటిలో దాసిగా ఉన్న ఒక శూద్రురాలికి కొడుకుగా పుట్టాను. అక్కడ పెద్ద బ్రహ్మవేత్తలు కొందరకు చాలా కాలం శుశ్రూషలు చేశాను. ఆ సేవా ప్రభావం వలన ఈ మహా కల్పంలో బ్రహ్మ మానసపుత్రుడను అయి పుట్టాను.

తెభా-7-477-ఆ.
కౌశలమున మోక్షతికి గృహస్థుఁ డే
ర్మ మాచరించి గిలి పోవు
ట్టి ధర్మ మెల్ల తి విశదంబుగాఁ
లుకఁ బడియె నీకు వ్యచరిత!

టీక:- కౌశలమునన్ = నేరుపుతో; మోక్ష = ముక్తి; గతి = మార్గమున; కిన్ = కు; గృహస్థుడు = గృహస్థాశ్రమందున్నవాడు; ఏ = ఎట్టి; ధర్మమున్ = ధర్మమును; ఆచరించి = చేసి; తగిలి = పూని; పోవున్ = వెళ్ళునో; అట్టి = అటువంటి; ధర్మమున్ = ధర్మమును; ఎల్లన్ = అంతటిని; అతి = మిక్కిలి; విశదంబుగాన్ = విపులముగా; పలుకబడియె = చెప్పబడినది; నీ = నీ; కున్ = కు; భవ్య = మేలైన; చరిత = నడవడికగలవాడ.
భావము:- శుభవర్తన గల ధర్మరాజా! ఏ ధర్మం చక్కగా ఆచరిస్తే గృహస్థుడు అనాయాసంగా మోక్షపదం అందుకుంటాడో. ఆ ధర్మాలు సమస్తం నీకు విశదంగా వివరించాను.

తెభా-7-478-మ.
ఖిలాధారుఁ డజాది దుర్లభుఁడు బ్రహ్మంబైన విష్ణుండు నీ
మం దర్చితుఁడై నివాసగతుఁ డై ర్త్యాకృతిన్ సేవ్యుఁ డై
ఖి యై చారకుఁ డై మనోదయితుఁ డై సంబంధి యై మంత్రి యై
సుదుండయ్యె భవన్మహామహిమ దాఁ జోద్యంబు ధాత్రీశ్వరా!

టీక:- అఖిలాధారుండు = శ్రీహరి {అఖిలాధారుడు - అఖిలమున (సమస్తమున)కు ఆధారమైనవాడు, విష్ణువు}; అజాదిదుర్లభుడు = శ్రీహరి {అజాదిదుర్లభుడు - అజ (బ్రహ్మదేవుడు) ఆది (మున్నగువారికిని) దుర్లభుడు (అందనివాడు), విష్ణువు}; బ్రహ్మంబు = శ్రీహరి {బ్రహ్మము - పరబ్రహ్మస్వరూపి, విష్ణువు}; ఐన = అయిన; విష్ణుండు = శ్రీహరి; నీ = నీ యొక్క; మఖము = (అశ్వమేధ)యాగము; అందున్ = లో; అర్చితుడు = పూజింపబడినవాడు; ఐ = అయ్యి; నివాసగతుడు = ఇంటనుండువాడు; ఐ = అయ్యి; మర్త్య = మానవ; ఆకృతిన్ = రూపముతో; సేవ్యుడు = కొలువబడినవాడు; ఐ = అయ్యి; సఖి = మిత్రుడు; ఐ = అయ్యి; చారకుడు = సేవకుడు; ఐ = అయ్యి; మనోదయితుడు = మనసునకు ప్రియుడు; ఐ = అయ్యి; సంబంధి = చుట్టము; ఐ = అయ్యి; మంత్రి = మంత్రాంగముచెప్పువాడు; ఐ = అయ్యి; సుఖదుడు = సౌఖ్యమును యిచ్చువాడు; అయ్యెన్ = అయ్యెను; భవత్ = నీ యొక్క; మహిమన్ = గొప్పదనము; తాన్ = ఆది; చోద్యంబు = అద్భుతమైనది; ధాత్రీశ్వరా = రాజా {ధాత్రీశ్వరు - ధాత్రి (భూమి)కి ఈశ్వరుడు, రాజు}.
భావము:- ఓ భూపాలోత్తమా! ధర్మరాజా! ఒక విషయం నాకు చాలా సంతోషంగా ఉంది. నిఖిలమైన లోకాలకూ ఆధారభూతుడు, బ్రహ్మదేవుడు మున్నగు వారికి కూడ దుర్లభ్యం అయిన పరబ్రహ్మ స్వరూపుడూ అయిన శ్రీమహావిష్ణువు, నీవు చేసిన యజ్ఞంలో ఆరాధింపబడ్డాడు. నీ ఎదుట ఉండి శ్రీకృష్మునిగా మానరూపంలో పూజింపబడ్డాడు. మీ మిత్రుడుగా, మీ కార్యనిర్వావాహకుడుగా, మనోనాథుడుగా, ఆప్తబాంధవుడుగా, మార్గదర్శకుడుగా ఉండి సర్వతోముఖంగా సర్వసుఖాలూ సమకూర్చాడు. అందంతా నీ పూర్వజన్మలలో నీవు చేసుకున్న పుణ్యాల ఫలం.”

తెభా-7-479-వ.
అని యిట్లు నారదుండు చెప్పిన వృత్తాంతం బంతయు విని ధర్మనందనుండు ప్రేమవిహ్వలుండయి వాసుదేవునిం బూజించె; వాసుదేవ ధర్మనందనులచేతఁ బూజితుండై నారదముని దేవమార్గంబునం జనియె"నని శుకయోగీంద్రుండు పాండవపౌత్రునకుం జెప్పె"నని సూతుండు శౌనకాదులకుం జెప్పిన.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; నారదుండు = నారదుడు; చెప్పిన = చెప్పిన; వృత్తాంతంబు = గాథ; అంతయున్ = సర్వమును; విని = విని; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుడు - యమధర్మరాజు యొక్క పుత్రుడు, ధర్మరాజు}; ప్రేమన్ = అనురాగముచే; విహ్వలుండు = మైమరచినవాడు; అయి = అయ్యి; వాసుదేవునిన్ = శ్రీకృష్ణుని {వాసుదేవుడు - వసుదేవుని కుమారుడు, కృష్ణుడు}; పూజించెన్ = అర్చించెను; వాసుదేవ = శ్రీకృష్ణ; ధర్మనందనుల్ = ధర్మరాజుల; చేతన్ = చేత; పూజితుండు = సత్కరింపబడినవాడు; ఐ = అయ్యి; నారద = నారదుడు యనెడి; ముని = ముని; దేవమార్గంబునన్ = ఆకాశమార్గమున,అదృశ్యమై; చనియెన్ = పోయెను; అని = అని; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; పాండవపౌత్రున్ = పరీక్షిత్తున {పాండవపౌత్రుడు - పాండవుల యొక్క పౌత్రుడు (మనుమడు), పరీక్షిత్తు}; సూతుండు = సూతుడు; శౌనక = శౌనకుడు; ఆదుల్ = మొదలగువారి; కిన్ = కి; చెప్పిన = చెప్పగా.
భావము:- అని ఈ విధంగా నారదమహర్షులవారు ధర్మతత్వం అంతా ధర్మరాజుకు వివరించారు. ఆ మహానుభావుడు పట్టరాని పరమానందం పొందాడు. వినయంగా వాసుదేవుడిని అర్చించాడు. శ్రీకృష్ణుడు సంతోషించాడు. కృష్ణ, ధర్మజులచేత పూజింపబడిన నారదమునీశ్వరుడు ఆకామార్గాన దేవలోకానికి పయనమయి వెళ్ళాడు” అని శుకబ్రహ్మ శ్రీకృష్ణుని మనువడైన పరీక్షిత్తు మహారాజునకు చెప్పాడు” అని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పాడు.