పోతన తెలుగు భాగవతము/ప్రథమ స్కంధము/విదురాగమనంబు


తెభా-1-300-క.
బంధుఁడు వచ్చె నటంచును
గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం
బంములు నెఱపి ప్రీతిం
బంధురగతిఁ జేసి రపుడు న్నన లనఘా!

టీక:- బంధుండు = బంధువు; వచ్చెన్ = వచ్చెను; అటంచును = అనుచు; గాంధారీ = గాంధారియొక్క; విభుఁడు = భర్త; మొదలుగాన్ = మొదలగువారు; అందఱున్ = అందరు; సంబంధములు = సంబంధములు; నెఱపి = నెరవేర్చుచు; ప్రీతిన్ = ప్రీతితో; బంధుర = తగు; గతిన్ = విధముగ; చేసిరి = చేసిరి; అపుడు = అప్పుడు; మన్ననలు = గౌరవములు; అనఘా = పాపములేనివాడా.
భావము:- ఆత్మ బంధుడైన విదురుడు తీర్థయాత్రలు ముగించి తిరిగి వచ్చాడని విని, ధృతరాష్ట్రుడూ, మొదలైన వారంతా ఎంతో సంతోషంతో ఎదురేగి స్వాగతం పలికారు.

తెభా-1-301-వ.
అంత ధర్మనందనుండు విదురునికి మజ్జనభోజనాది సత్కారంబులు సేయించి సుఖాసీనుండై తనవార లందఱు విన నిట్లనియె.
టీక:- అంత = అంతట; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మనందనుండు - యముని పుత్రుడు, ధర్మరాజు}; విదురు = విదురు; కిన్ = కి; మజ్జన = స్నానము; భోజన = భోజనము; ఆది = మొదలగు; సత్కారంబులు = గౌరవములు; చేయించి = చేయించి; సుఖ = సుఖముగ; ఆసీనుండు = కూర్చున్న వాడు; ఐ = అయి; తనవారలు = తనవారు; అందఱున్ = అందరును; వినన్ = వినుచుండగ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అలా విదురుడు విచ్చేసినప్పుడు, యమధర్మరాజు పుత్రుడు అయిన ధర్మరాజు విదురునకు ఎదుర్కోలు వెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. తగిన గౌరవ సత్కారాలతో స్నానము, భోజనము మున్నగు మర్యాదలు అన్నీ ఏర్పాటు చేసాడు. పిమ్మట సుఖముగా కూర్చుండజేసి, తనవారు అందరూ వింటూ ఉండగా విదురుని ఇలా అడిగాడు.

తెభా-1-302-సీ.
" వర్తనంబున నింత కాలము మీరు-
సంచరించితి రయ్య గతిలోన?
నే తీర్థములు గంటి రెక్కడ నుంటిరి?-
భావింప మీవంటి భాగవతులు
తీర్థసంఘంబుల ధిక్కరింతురు గదా-
మీయందు విష్ణుండు మెఱయు కతన,
మీరు తీర్థంబులు, మీకంటె మిక్కిలి-
తీర్థంబు లున్నవే తెలిసి చూడ?

తెభా-1-302.1-తే.
వేఱు తీర్థంబు లవనిపై వెదక నేల?
మిమ్ముఁ బొడగని భాషించు మేల చాలు,
వార్త లేమండ్రు లోకులు సుధలోన?
మీకు సర్వంబు నెఱిఁగెడి మేధ గలదు.

టీక:- ఏ = ఏ; వర్తనంబునన్ = విధమున; ఇంతకాలము = ఇంతకాలము; మీరు = మీరు; సంచరించితిరి = తిరిగితిరి; అయ్య = ఓయయ్య; జగతి = లోకము; లోనన్ = అందు; ఏ = ఏ; తీర్థములు = పుణ్యస్థలములు; కంటిరి = చూచితిరి; ఎక్కడ = ఎక్కడ; ఉంటిరి = ఉంటిరి; భావింపన్ = ఆలోచించి చూసిన; మీ = మీ; వంటి = లాంటి; భాగవతులు = భాగవతులు, భగవద్భక్తులు; తీర్థ = పుణ్యస్థలముల; సంఘంబులన్ = సమూహములను; ధిక్కరింతురు = అధిగమింతురు; కదా = కదా; మీ = మీ; అందున్ = లోన; విష్ణుండు = విష్ణుమూర్తి, భగవంతుడు; మెఱయు = ప్రకాశించుట; కతనన్ = వలన; మీరు = మీరు; తీర్థంబులు = పుణ్యస్థలములు; మీకు = మీకు; కంటెన్ = మించి; మిక్కిలి = పెద్ద; తీర్థంబులు = పుణ్యస్థలములు; ఉన్నవే = ఉన్నవా, లేవు; తెలిసి = తెలుసుకొని; చూడ = చూడగా;
వేఱు = వేరే; తీర్థంబులున్ = పుణ్యస్థలములు; అవని = భూమి; పైన్ = మీద; వెదకన్ = వెతుకుట; ఏలన్ = ఎందులకు; మిమ్మున్ = మిమ్ములను; పొడగని = దర్శించుకొని; భాషించు = మాట్లాడుట అనే; మేల = మేలు; చాలున్ = చాలును; వార్తలు = వార్తావిశేషములు; ఏమి = ఏమి; అండ్రు = చెప్పుదురు; లోకులు = జనులు; వసుధ = లోకము; లోనన్ = లో; మీకు = మీకు; సర్వంబున = సమస్తమును; ఎఱిఁగెడి = తెలిసికొను; మేధ = తెలివి; కలదు = ఉన్నది.
భావము:- అయ్యా ఇంతకాలమూ మీరు ఏయే ప్రాంతాలు సందర్శించారు ఎలా ఎలా సంచరించారు ఏయే పుణ్యతీర్థాలు సేవించారు ఏయే ప్రదేశాల్లో నివసించారు మీవంటి పరమభాగవతోత్తములు తీర్థాలను లెక్కచేయరుగదా మీలో భగవంతుడు సన్నిధిచేసి ఉన్నాడు. కనుక మీరే పుణ్యతీర్థాలు, ఆలోచించి చూస్తే మీకంటే మించిన పుణ్యతీర్థాలు పుడమిలో ఎక్కడో ఉన్నాయి మీవంటి మహాత్ములను దర్శించి సంభాషించే అదృష్టం అబ్భితే చాలదా వేరే తీర్థాలకోసం వెదకవలసిన పనేమున్నది మీరు సర్వజ్ఞులు, వివేకవంతులు. ఉన్న చోటనే ఉండి లోకంలో ఉన్న విశేషాలన్నీ తెలుసుకోగలరు.

తెభా-1-303-మత్త.
తండ్రి సచ్చినమీఁద మా పెదతండ్రిబిడ్డలు దొల్లి పె
క్కండ్రు సర్పవిషాగ్నిబాధల గాసిఁ బెట్టఁగ మమ్ము ని
ల్లాండ్ర నంతముఁ బొందకుండఁగ లాలనంబున మీరు మా
తండ్రి భంగి సముద్ధరింతురు ద్విధంబు దలంతురే?

టీక:- తండ్రి = తండ్రి; సచ్చిన = మరణించిన; మీఁదన్ = పిదప; మా = మాయొక్క; పెదతండ్రి = తండ్రికి అన్నగారి; బిడ్డలు = కొడుకులు; తొల్లి = పూర్వము; పెక్కండ్రు = అనేకమంది; సర్ప = పాముల; విష = విషమువలన; అగ్ని = అగ్నివలన; బాధలన్ = బాధలతో; కాసిఁబెట్టఁగ = రాపాడించగా, బాధించగ; మమ్మున్ = మమ్ములను; ఇల్లాండ్రన్ = భార్యలను; అంతమున్ = మరణము; పొందకుండఁగన్ = చెందకుండగ; లాలనంబునన్ = సముదాయించుతూ; మీరు = మీరు; మా = మాయొక్క; తండ్రి = తండ్రి; భంగిన్ = వలె; సముద్ధరింతురు = పైకి తీసుకొనివచ్చిరి; తత్ = ఆ; విధంబున్ = విధమును; తలంతురే = జ్ఞప్తి చేసుకొందురా.
భావము:- మా తండ్రిగారు చనిపోయిన అనంతరం, మా పెదతండ్రి కుమారులు మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు. సర్పాలచేత కరిపించారు. విషాన్నం తినిపించారు. ఇంటికి నిప్పు అంటించారు. మా తండ్రివంటి మీరు మమ్మల్నీ, మా భార్యలనూ మృత్యువుబారిని పడకుండా అత్యంత అనురాగంతో లాలించి పాలించారు. కష్టాలలో నుంచి ఉద్ధరించారు. ఆ విషయాలన్నీ ఎన్నడైన తలచుకొంటారా.

తెభా-1-304-క.
క్షులు తమఱెక్కలలోఁ
క్షంబులు రాని పిల్లదువుల మమతన్
క్షించిన క్రియ మీరలు
క్షీకరణంబు సేయ బ్రతికితిమి గదే!

టీక:- పక్షులు = పక్షులు; తమ = తమయొక్క; ఱెక్కల = రెక్కలు; లోన్ = అందు; పక్షంబులు = రెక్కలు; రాని = రాని; పిల్ల = పిల్లల; పదువుల = గుంపును; మమతన్ = మమతతో {మమత - నాది అను భావము}; రక్షించిన = కాపాడు; క్రియన్ = విధముగ; మీరలు = మీరు; పక్షీకరణంబు = పక్షము వహించుట; చేయన్ = చేయుట వలన; బ్రతికితిమి = బ్రతికి బైట పడితిమి; కదే = కదా.
భావము:- రెక్కలురాని తమ పసికందుల్ని రెక్కల్లో దాచుకొని మమకారంతో రక్షించే పక్షుల విధంగా,మీరు ఎంతో దాక్షిణ్యంతో మాపక్షం వహించి మమ్మల్ని రక్షించారు.

తెభా-1-305-క.
న్నారా? ద్వారకలో
నున్నారా? యదువు లంబుజోదరు కరుణం
న్నారా? లోకులచే
విన్నారా? మీరు వారి విధ మెట్టిదియో?"

టీక:- మన్నారా = జీవించి; ద్వారక = ద్వారకాపట్నము; లోన్ = లో; ఉన్నారా = ఉన్నారా; యదువులు = యాదవులు {యదువులు - యదు వంశస్తులు}; అంబుజోదరు = కృష్ణుని {అంబుజోదరు - (నీటిలోపుట్టినది) పద్మము ఉదరమున ఉన్నవాడు}; కరుణన్ = దయను; కన్నారా = పొందుచున్నారా; లోకుల = ప్రజల; చేన్ = వలన; విన్నారా = విన్నారా; మీరు = మీరు; వారి = వారు ఉన్న; విధము = విధము; ఎట్టిదియో = ఎలాంటిదో.
భావము:- మహానుభావా! మీరు తీర్థయాత్రలు చేస్తూ ద్వారకకు వెళ్లారా? యాదవులంతా ఆ స్వామి అనుగ్రహం వల్ల సుఖంగా ఉన్నారా? పోని ఎవరివల్లనైనా వారి వృత్తాంతం విన్నారా?"

తెభా-1-306-చ.
విని ధర్మరాజునకు నా విదురుండు సమస్తలోక వ
ర్తముఁ గ్రమంబుతోడ విశదంబుగఁ జెప్పి యదుక్షయంబు సె
ప్పి నతఁ డుగ్రశోకమున బెగ్గిలుచుండెడి నంచు నేమియున్
విను మని చెప్పఁ డయ్యె; యదువీరుల నాశము భార్గవోత్తమా!

టీక:- అనన్ = అనగా; విని = విని; ధర్మరాజు = ధర్మరాజు; కున్ = కు; ఆ = ఆ; విదురుండు = విదురుడు; సమస్త = సమస్తమైన; లోక = లోకముయొక్క; వర్తనమున్ = నడకను; క్రమంబు = క్రమము; తోడన్ = ప్రకారముగను; విశదంబుగన్ = వివరముగను; చెప్పి = చెప్పి; యదు = యాదవుల; క్షయంబు = నాశనము; చెప్పినన్ = చెప్పినచో; అతఁడు = అతడు; ఉగ్ర = భయంకరమైన; శోకమునన్ = దుఃఖమువలన; బెగ్గిలుచు = బెంగపడుతు, బాధపడుతూ; ఉండెడిన్ = ఉండును; అంచున్ = అనుకొనుచు; ఏమియున్ = ఏమీకూడా; వినుము = వినుము; అని = అని; చెప్పఁడయ్యె = చెప్పుట లేదు; యదు = యాదవ; వీరుల = వీరులయొక్క; నాశమున్ = నాశనమును; భార్గవోత్తమా = శౌనకుడా {భార్గవోత్తముడు - భార్గవుని సంతానములో ఉత్తముడు, శౌనకుడు}.
భావము:- ఓ శౌనక మహర్షీ! ఈ విధంగా ప్రశ్నించిన ధర్మరాజుతో విదురుడు తన తీర్థ యాత్రా విశేషాలన్నీ వివరించి చెప్పాడు. అన్నీ చెప్పాడు. కాని యాదవుల నాశనం మాత్రం చెప్పలేదు. అలా చెప్పితే ధర్మరాజు దుఃఖా వేశంతో క్రుంగి కృశించిపోతాడనే భయంతో ఆ విషయాన్ని చెప్పకుండా దాటవేశాడు.

తెభా-1-307-ఆ.
మేలు సెప్పెనేని మేలండ్రు లోకులు,
చేటు చెప్పెనేని చెట్టయండ్రు,
నంతమీఁద శూద్రుఁ డైన కతంబున
శిష్టమరణ మతడు సెప్పఁడయ్యె.

టీక:- మేలు = మంచి విషయము; సెప్పెనేని = చెప్పినట్లైతే; మేలు = మంచిది; అండ్రు = అందురు; లోకులు = ప్రజలు; చేటు = అశుభం, చెడ్డ విషయము; చెప్పెనేని = చెప్పినట్లైతే; చెట్ట = చెడ్డవాడు; అండ్రు = అందురు; అంత = ఆ; మీఁదన్ = పైన; శూద్రుఁడు = శూద్రుడు; ఐన = అయిన; కతంబునన్ = కారణముచేత; శిష్ట = శిష్టులయొక్క; మరణము = మరణమును; అతడు = అతడు; సెప్పఁడయ్యె = చెప్పుటలేదు.
భావము:- లోకులు మంచి విషయం చెప్పితే మేలు మేలని వింటారు. అశుభం చెబితే చెడ్డవాడంటారు. అందువల్ల సదయహృదయుడైన విదురుడు శూద్ర స్త్రీ యందు జన్మించినవాడు కనుక యదువీరుల మరణవార్తను ధర్మరాజుకు చెప్పలేకపోయాడు.

తెభా-1-308-వ.
అది యెట్లనిన మాండవ్యమహాముని శాపంబునం దొల్లి యముండు శూద్ర యోని యందు విదురుండై జన్మించి యున్న నూఱు వత్సరంబు లర్యముండు యథాక్రమంబునం బాపకర్ముల దండించె; నిట యుధిష్ఠిరుండు రాజ్యంబుఁ గైకొని లోకపాలసంకాశు లయిన తమ్ములుం దానును గులదీపకుం డైన మనుమని ముద్దు సేయుచుఁ బెద్దకాలంబు మహావైభవంబున సుఖియై యుండె నంత.
టీక:- అది = అది; ఎట్లు = ఏవిధముగ; అనిన = అనిన; మాండవ్య = మాండవ్యుడు అను; మహా = గొప్ప; ముని = ముని యొక్క; శాపంబునన్ = శాపమువలన; తొల్లి = పూర్వము; యముండు = యముడు; శూద్ర = శూద్రుల యొక్క; యోనియందు = గర్భము నందు; విదురుండు = విదురుడు; ఐ = అయి; జన్మించి = పుట్టి; ఉన్న = ఉండగ; నూఱు = వంద; వత్సరంబులు = సంవత్సరములు; అర్యముండు = సూర్యుడు; యథాక్రమంబునన్ = యథావిధిగ; పాప = పాపపు; కర్ములన్ = కర్మలు చేయు వారిని; దండించె = దండించెను; ఇట = ఇక్కడ; యుధిష్ఠిరుండు = ధర్మరాజు {యుధిష్ఠిరుండు - ధర్మరాజు అసలు పేరు}; రాజ్యంబున్ = రాజ్యమును; కైకొని = చేపట్టి; లోకపాల = లోకపాలురకు; సంకాశులు = సమానమైనవారు; అయిన = అయినట్టి; తమ్ములున్ = తమ్ములును; తానును = తానును; కుల = కులమును; దీపకుండు = నిలబెట్టువాడు, దీపము వంటివాడు; ఐన = అయినట్టి; మనుమని = మనుమణ్ణి; ముద్దు = గారాబముగ పోషణ; సేయుచున్ = చేయుచు; పెద్ద = చాలా; కాలంబు = కాలము; మహా = గొప్ప; వైభవంబునన్ = వైభవముతో; సుఖి = సుఖము కలవారు; ఐ = అయి; ఉండెన్ = ఉండెను; అంత = అప్పుడు.
భావము:- విదురుడు ధర్మస్వరూపుడు, పూర్వకాలంలో మాండవ్యుడనే మహర్షి శాపంవల్ల, యమధర్మరాజు శూద్రకులంలో విదురుడై జన్మించాడు. ఆ నూరు సంవత్సరాలూ, అర్యముడు యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపాత్ముల పాపాలకు తగిన శిక్షలు విధిస్తూ ఉన్నాడు.
ఇక్కడ ధర్మరాజు రాజ్యాన్ని స్వీకరించి, దిక్పాలకుల వంటి సోదరులతో కూడి, కులదీపనుడైన మనుమడిని అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి ఎంతో వైభవంతో సుఖంగా జీవించాడు

తెభా-1-309-క.
బాలాజన శాలా ధన
లీలావన ముఖ్య విభవ లీన మనీషా
లాసు లగు మానవులనుఁ
గాము వంచించు దురవగాహము సుమతీ!

టీక:- బాల = పిల్లలు; జన = అంతఃపుర స్త్రీలు; శాలా = భవనములు; ధన = ధనములు; లీలావన = ఉద్యానవనములు; ముఖ్య = మొదలగు; విభవ = వైభవము లందు; లీన = మునిగి, లీనమై; మనీషా = ప్రజ్ఞ; లాలసులు = రుచి మరిగిన వారు; అగు = అయినట్టి; మానవులను = మనుష్యులను; కాలము = కాలము; వంచించు = మోసము చేయును; దురవగాహము = తరించుటకు కష్టమైనది, అంతు చిక్కనిది; సుమతీ = మంచి బుద్ధి కల వాడా, శౌనకా.
భావము:- శౌనక మహర్షి! అందమైన బిడ్డలు, అందచందాల అంగనలు, ఆనంద సౌధాలు, అపార సంపదలు, అలరారే ఉద్యానవనాలు మొదలైన భోగభాగ్యాల యందు మునిగితేలుతూ, సుఖలాలసు లైన మానవులను కాలం మోసం చేస్తు ఉంటుంది. కాల ప్రవాహాన్ని తెలిసికొనుట దుస్సాధ్యం సుమా.

తెభా-1-310-వ.
అది నిమిత్తంబుగాఁ గాలగతి యెఱింగి విదురుండు ధృతరాష్ట్రున కిట్లనియె.
టీక:- అది = ఆ; నిమిత్తంబుగాన్ = కారణమువలన; కాల = కాలముయొక్క; గతి = లక్షణము, నడక; ఎఱింగి = తెలిసి; విదురుండు = విదురుడు; ధృతరాష్ట్రున = ధృతరాష్ట్రున; కు = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- అందువల్ల కాలజ్ఞుడైన విదురుడు ధృతరాష్ట్రుని సమీపించి ఇలా ప్రబోధించాడు...

తెభా-1-311-మ.
"కాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్ ముందటం
ని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నే కాలంబు దుర్లంఘ్యమై
నివార్యస్థితిఁ జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ
చ్చె నుపాంతంబున; మాఱు దీనికి మదిం జింతింపు ధాత్రీశ్వరా!

టీక:- కనక = బంగారము; అగార = గృహములు; కళత్ర = భార్యలు; మిత్ర = మిత్రులు; సుత = సంతానముల; సంఘాతంబు లన్ = సమూహములను; ముందటన్ = ఎదురు గుండా; కని = చూసి; ప్రాణ = ప్రాణములమీద; ఇచ్ఛలన్ = మక్కువతో; ఉండు = ఉండు; జంతువులను = జీవులను; ఈ = ఈ; కాలంబు = కాలము; దుర్లంఘ్యము = దాటరానిది; ఐ = అయి; అనివార్య = నివారింపలేని; స్థితిన్ = విధముగ; చంపున్ = చంపును; అట్టి = అటువంటి; నిరుపాయంబు = ఉపాయములేనిది; ఐన = అయినట్టి; కాలంబు = కాలము; వచ్చెన్ = వచ్చెను; ఉపాంతంబున = సమీపమునకు; మాఱు = తిరుగు; దీని = దీని; కిన్ = కి; మదిన్ = మనసులో; చింతింపు = ఆలోచించుము; ధాత్రీశ్వరా = రాజా;
భావము:- "ఓరాజా! ప్రపంచంలోని మానవులు బంగారు భవనాలు, పుత్ర, మిత్ర, కళత్ర పరివారాన్ని ఎల్లప్పుడు ఎదురుగుండ చూచుకొంటు, ప్రాణాలమీద తీపిని పెంచుకొంటు ఉంటారు. అయితే దుర్నివారక మైన కాలం వాళ్లను చంపి తీరుతుంది. కాలాన్ని కాదని ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. అక్కడ ఏ ఉపాయాలు పనిచేయవు. నీకు అలాంటి కాలం దగ్గరపడింది. మహారాజ! దీనికి ప్రతిక్రియ ఏదైన ఆలోచించండి.
(కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్ట్రునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు.)

తెభా-1-312-శా.
పుట్టంధుండవు, పెద్దవాఁడవు, మహాభోగంబులా లేవు, నీ
ట్టెల్లం జెడిపోయె, దుస్సహ జరాభారంబు పైఁగప్పె, నీ
చుట్టా లెల్లనుఁ బోయి; రాలు మగఁడున్ శోకంబునన్ మగ్నులై
ట్టా! దాయలపంచ నుండఁదగవే? కౌరవ్యవంశాగ్రణీ!

టీక:- పుట్టు = పుట్టుకతోనే; అంధుండవు = గ్రుడ్డివాడవు; పెద్దవాఁడవు = వయసులో పెద్దవాడవు; మహా = గొప్ప; భోగంబులా = భోగములు అంటే అవీ; లేవు = లేవు; నీ = నీయొక్క; పట్టు = బలము; ఎల్లన్ = అంతా; చెడి = పాడు; పోయెన్ = అయిపోయినది; దుస్సహ = సహింప కష్టమైనది; జరా = ముసలితనము; భారంబున్ = బరువుగా; పైన్ = మీద; కప్పెన్ = పడెను; నీ = నీయొక్క; చుట్టాలు = బంధువులు; ఎల్లను = అందరును; పోయిరి = చనిపోయిరి; ఆలు = భార్య; మగఁడున్ = భర్తా; శోకంబునన్ = శోకములో; మగ్నులు = మునిగిన వారు; ఐ = అయి; కట్టా = అయ్యో; దాయల = శత్రువులయొక్క, దాయాదులయొక్క; పంచన్ = నీడలో; ఉండన్ = ఉండగా; తగవే = ఉచితమా; కౌరవ్య = కౌరవులయొక్క; వంశ = వంశమునకు; అగ్రణీ = గొప్పవాడా.
భావము:- ఓ కురుకులశిరోమణీ అసలు నీవు పుట్టుకతోనే అంధుడవు. పైగా ఇప్పుడు మూడుకాళ్ల ముసలివైనావు. మహారాజ వైభవాలన్నీ అంతరించాయి. అధికారం అడుగంటింది. భరింపరాని వార్ధక్యం పైన బడింది. నా అన్నవారు అంతా గతించారు. ఇప్పుడు ఈ విధంగా బ్రతికి చెడ్డ మీ భార్యాభర్తలు బండు దుఃఖంతో మునిగి తేలుతూ అయ్యయ్యో దాయాదులైన పాండవుల పంచలో పడి ఉండటం ఏమంత బాగుంది.

తెభా-1-313-క.
పెట్టితిరి చిచ్చు గృహమునఁ
ట్టితిరి దదీయభార్యఁ, బాడడవులకుం
గొట్టితిరి, వారు మనుపఁగ
నెట్టన భరియింపవలెనె? యీ ప్రాణములన్.

టీక:- పెట్టితిరి = పెట్టినారు; చిచ్చు = నిప్పు; గృహమునన్ = ఇంటికి; పట్టితిరి = పట్టుకొన్నారు; తదీయ = వారి; భార్యన్ = భార్యని; పాడు = చెడ్డ; అడవుల = అడవుల; కున్ = కి; కొట్టితిరి = గెంటివేసినారు; వారు = వారు; మనుపఁగ = పోషిస్తుండగ; ఎట్టన = ఏవిధముగ; భరియింపన్ = బలవంతముగ నిలుపుకొన; వలెను = వలెను; ఈ = ఈ; ప్రాణములన్ = ప్రాణములను.
భావము:- మీరు పాండవుల కొంపకు చిచ్చుపెట్టారు. పాండవపత్నిని నిండుసభలో చెరబట్టారు. ఆ అమాయికుల్ని అన్యాయం చేసి అరణ్యాలకు వెళ్లగొట్టారు. ఇప్పుడు ఈ విధంగా వారి అండజేరి, వారు పెట్టిన తిండి తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు.

తెభా-1-314-క.
"బిడ్డలకు బుద్ధి సెప్పని
గ్రుడ్డికిఁ బిండంబు వండికొని పొం; డిదె పైఁ
డ్డాఁ" డని భీముం డొఱ
గొడ్డెము లాడంగఁ గూడు గుడిచెద వధిపా!

టీక:- బిడ్డల = పిల్లల; కున్ = కి; బుద్ధి సెప్పని = మంచి దారిలో పెట్టుటకు శిక్షించని; గ్రుడ్డి = గ్రుడ్డివాని; కిన్ = కి; పిండంబు = పిండము {పిండము - (నిందా పూర్వకముగ) భోజనము, తద్దినము రోజు గుండ్రముగ చేయు ముద్దలు}; వండికొని = వండికొని; పొండు = తీసుకొని వెళ్ళండి; ఇదె = ఇదిగో; పైన్ = మీద; పడ్డాఁడు = పడ్డాడు; అని = అని; భీముండు = భీముడు; ఒఱ = మర్మపు; గొడ్డెములున్ = ఎత్తి పొడుపు మాటలు; ఆడంగన్ = పలుకు చుండగ; కూడు = తిండి; కుడిచెదవు = తింటున్నావు; అధిపా = రాజా;
భావము:- “ఏనాడు బిడ్డలకు బుద్ధిచెప్పనట్టి గ్రుడ్డివాడు, ఈ నాడు సిగ్గు లేకుండా మాయింటి మీద పడ్డాడు; ఈ కళ్లులేని కబోదికి ఇంత పిండం వండి పట్టుకెళ్లి పడెయ్యండి” అంటున్న భీముడు పలికే దెప్పుడు మాటలు వింటు, ఆ దిక్కుమాలిన తిండి ఎలా తినగలుగుతున్నావు మహారాజా!
(కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు పంచను చేరి రోజులు వెళ్ళదీస్తున్న ధృతరాష్ట్రునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తు ఇలా చెప్పసాగాడు. తన కొడుకులు పాండవులను అనేక బాధలు అవమానాలు పెడుతున్నప్పుడు తప్పని వారించ లేదు కదా. అలాంటిది సిగ్గు లేకుండ ఇవాళ ఎలా వాళ్ళ చేతికూడు తింటున్నావు అని అడుగుతున్నాడు. ద్విక్తాక్షరం”డ్డ’ ప్రాసగా వేసి ఆపైన ఏడు డకారాలు వేసి ధ్వని సూచకం సాధించిన తీరు అద్భుతం.)

తెభా-1-315-క.
నియెదవో బిడ్డల నిఁక,
నియెదవో, తొంటికంటె నుమల మాటల్
వినియెదవో, యిచ్చెద ర
మ్మనియెదవో దానములకువనీసురులన్.

టీక:- కనియెదవో = చూడగలవా ఏమిటి; బిడ్డలన్ = (నీ) పిల్లలను; ఇఁకన్ = ఇంకా; మనియెదవో = గొప్పగా జీవించెదవా ఏమిటి; తొంటి = పూర్వము; కంటెన్ = కంటే; మనుమల = మనవల యొక్క; మాటల్ = (ముద్దు) మాటలు; వినియెదవో = వింటావా ఏమిటి; ఇచ్చెదన్ = ఇచ్చెదను; రమ్ము = రండు; అనియెదవో = అంటావా ఏమిటి; దానముల = దానములు తీసుకొనుట; కున్ = కు; అవనీసురులున్ = బ్రాహ్మణులను {అవనీసురులు - భూమికి దేవతలు, విప్రులు};
భావము:- ఇక ఈ జన్మలో కన్నకొడుకుల ముఖాలు కనలేవు గదా; వెనుకటి దర్పంతో మనలేవు గదా; నీ మనుమల ముద్దు పలుకులు వినలేవు గదా; అగ్రహారాలు దానాలు గ్రహించటానికి ధరణీసురులను రమ్మనలేవు గదా; ఎందుకయ్యా ఇంకా ఈ బ్రతుకు.

తెభా-1-316-క.
దేము నిత్యము గా దని
మోముఁ దెగఁ గోసి సిద్ధ మునివర్తనుఁడై
గేము వెలువడు నరుఁడు
త్సాముతోఁ జెందు ముక్తిసంపద ననఘా!"

టీక:- దేహము = శరీరము; నిత్యము = నిత్యమైనది; కాదు = కాదు; అని = అని; మోహమున్ = భ్రాంతిని; తెగన్ = తెగునట్లు; కోసి = నాశనము చేసి; సిద్ధ = సిద్ధులు; ముని = మునులు వలె; వర్తనుఁడు = ప్రవర్తించు వాడు; ఐ = అయి; గేహము = గృహము; వెలువడు = విడుచు; నరుఁడు = మానవుని; ఉత్సాహము = ఉత్సాహము; తోన్ = తో; చెందు = చెందును; ముక్తి = ముక్తి అను; సంపద = భాగ్యము; అనఘా = పాపము లేనివాడా.
భావము:- ఈ దేహం నిత్యం కాదన్న సత్యం తెలుసుకొని దేహం మీద వ్యామోహం తెంచుకొని, యోగ్యమైన వైరాగ్యమార్గంలో ఉత్సాహంగా ముందడుగు వేసేవాడే మోక్షలక్ష్మిని కైవసం చేసుకోగలుగుతాడు.